26, సెప్టెంబర్ 2026, శనివారం

దాశరథీ శతకం - స్థూల పరిశీలన


దాశరథీ శతకం లాంటి సాహిత్యం ఒక సమగ్రమైన జీవన పాఠ్యాంశమని నా అభిప్రాయం. సరే, వందకు పైగా పద్యాలున్నాయి కాబట్టి శతకం అన్నాము. మరి ఒక సంపుటిగా వాటి సమగ్రత, విశిష్టత ఏమిటి అన్న అంశాన్ని పరిశీలిద్దాము. 

పద్యాలు వల్ల ప్రయోజనాలు బహుళం. ప్రధానంగా భాషాపరిజ్ఞానం కాగా, సంస్కృతి, సాంప్రదాయాలు, దేశకాలమాన పరిస్థితులు, కవిలోని అంతరంగ ఔన్నత్యం, ఇలాంటి శతకాలైతే ఆధ్యాత్మిక సందేశం ఇవి మిగిలిన ప్రయోజనాలు. 

దాశరథీ శతకం ముగింపులో గోపన్న తన వ్యక్తిగత వివరాలు తెలిపారు - ఆత్రేయస గోత్రం, లింగనమంత్రి కుమారుడనని, ఆదిశాఖ అని, కంచెర్ల కులోద్భవుడనని చెప్పారు. అంతే కాదు, రఘునాథ భట్టరార్యులను గురువుగా భావించి శ్రీవైష్ణవ సాంప్రదాయాన్ని స్వీకరించి తిరునామములు ధరించి రామ తారక మంత్రాన్ని పొందానని చెప్పారు. కాబట్టి, అంతటితో కవి పరిచయం సమగ్రంగా జరిగినట్లే.  

ఇక మిగిలిన పద్యాల దశ-దిశ ఎలా ఉన్నాయో చూద్దాము. 

ఏడవ పద్యంలో గోపన్న ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. లౌకికంగా ఉపాధి కొరకు కవిత్వము చెప్పే ఇతర కవులలాగే తాను తొలుత అంధుడనై మానవులకు తన కావ్యమును సమర్పించానని, ఆ తప్పు గ్రహించి రాముని పాదాల వద్ద కవ్యాన్ని ఉంచానని, ఆ కావ్యానికి పవిత్రతను ఇచ్చి తన పలులుకులలో అమృతధారలు ఒలికేలా చేయమని రాముని వేడుకున్నారు. కవి ప్రస్థానంలో ఇది అతి ముఖ్యమైన మైలురాయి. ఫలాపేక్షను వదిలి రాముని శరణు కోరటం అనేది గోపన్నను శాశ్వతం చేయటంలో తొలి అడుగు.   

పండితరక్షకుడు, అన్ని పాపాల నుండి తప్పించేవాడు, బ్రహ్మేంద్రాదులచే పూజించబడేవాడు, రావణుడి తలలు తెగనరికిన విలువిద్యాప్రవీణుడు అని పేరొందిన రామకీర్తికాంతకు తన పద్యసంపుటిని పూమాలగా అంకితం చేస్తున్నాను అని కవిలో ఉండే అహంకారాన్ని వీడనాడారు.  

దీనికి ముందడుగా, తదుపరి అడుగులుగా రాముని శ్రీరాముని గుణగణాలను పొందుపరచారు. ఇవి శతకంలో సింహభాగం. అందులో రాముని రూపలావణ్యమొక పక్క, గుణవిభవములు ఇంకొక పక్క, రామ మంత్ర మహత్తు మరొక పక్క. శ్రీమహావిష్ణువు అవతారంగా రాముడు, లక్ష్మీదేవి సీతగా, శ్రీహరి సేవకులే వైష్ణవాచారులుగా, విరజానది గౌతమిగా, మొత్తం మీద భద్రగిరే వైకుంఠంగా ఆవిష్కరించారు గోపన్న. 

ఇవి కాకుండా తన కావ్యలక్షణాన్ని కూడా 11,12,13 పద్యాలలో ప్రస్తావించారు. మొత్తంగా ఉత్పలమాల, చంపకమాలల రూపంలోనే పద్యాలను రచించాను అని చెప్పారు, దోషాలున్నా అవి రాముని మేరునగధీరత్వము ముందు ఏ మాత్రం ప్రభావం చూపవని చెప్పారు. 

తనకు రామనామమనే నిధి భక్తియనే అంజనముతో లభ్యమైనదని తన ఆనందాన్ని వ్యక్తపరచారు. అనేకాననేక మహిమలు కలిగిన రాముడు తనకు ఆత్మారాముడని, ఆ రాముని పదకమలములను తాను ఆశ్రయించానని నొక్కివక్కాణించారు. రామభక్తి సామ్రాజ్యంలో ఉండే ప్రతి ఒక్క నిజభక్తుని లక్షణమిదే. 

రాముని తాను ఏ విధముగా కొలువదలచుకున్నాడో, రామనామామృతపానము వల్ల ఎటువంటి అనుభూతులు కలిగాయో స్పష్టంగా తన పద్యాలలో చెప్పారు. రామావతారంలో అనేకులకు ఆశ్రయము, మోక్షమిచ్చినట్లు తనను కూడా కాపాడమని వేడుకున్నారు. తల్లివై పెంచి, తండ్రివై రక్షించి, వైద్యుడవై ఇంద్రియరోగముల నుంఛి కాపాడమని విన్నవించుకున్నారు. చెడ్డవారిని కూడా కాచావు, నన్ను కావలేవా అని ప్రశ్నించారు. కలియుగంలో మానవుల కష్టాలను విస్మరిస్తే ఎలా అని నిలదీశారు. అనేక రూపాలలో భయాందోళనలు కలిగినప్పుడు రామలక్ష్మణులు ఇరువురూ నిలిచి కాపాడాలని విజ్ఞప్తి చేశారు. లోకకల్యాణానికి శతకంలో పెద్ద పీటే వేశారు గోపన్న.  

కోతిలాంటి మనసు చేసే దుష్కర్మల వల్ల వచ్చే దోషాలను తొలగించి కాపాడమని భక్తిపూర్వకంగా విన్నవించుకున్నారు. తాను చేసిన పాపాలకు చిత్రగుప్తుడేమి లెక్కలు వేస్తాడో, యమభటులు ఏమి శిక్ష విధిస్తారో, నీవే దిక్కు అని శరణాగతిని ప్రకటించారు. ఆనాడు ద్రౌపది వేడుకుంటే వచ్చి మానము కాపాడావు, నా పట్ల పరాకు ఎందుకు ప్రశ్నించారు.   

రాముని విరాట్స్వరూపాన్ని కొన్ని పద్యాలలో అద్భుతంగా అవిష్కరించారు గోపన్న. రాముని తత్త్వము సాత్వికమని, అమృత సముద్రము ఇల్లని, ఆదిలక్ష్మి యిల్లాలని, సృష్టికర్త బ్రహ్మ కొడుకని, భూమే సింహాసనము, ఆకాశమే గొడుగని, సూర్యచంద్రులే కనులని, ఆదిశేషువు పానుపని, కాన నీవు సర్వమయుడవని చెప్పారు. నిన్ను కొలుస్తున్నాను, నాకు మళ్లీ నరాధమునిగా జన్మవద్దు, ఈ జననమరణాల నుండి మోక్షమివ్వమని కోరారు.  

తదుపరి, మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రామ బలరామకృష్ణ బుద్ధ కల్కి రూపములలో విశేష అవతారములను, వాటి లక్షణాలను, ప్రయోజనాలను పద్యాలలో ఆవిష్కరించారు. మాయావశులై అజ్ఞానంలో కొట్టుకుంటూన్న మనుషులకు రామతత్వమెలా ముక్తిమార్గమో అనేక పద్యాలలో పునరుద్ఘాటించారు. భ్రమరము కీటకాన్ని తీసుకుని ఝుంకారము చేస్తూ పాలించటం వల్ల ఆ కీటకం కూడా భ్రమరమైనట్లు భక్తి ఝుంకారముతో జన్మదుఃఖాదిక బంధురుడైన మానవునికి పరమాత్మ ముక్తి కలిగిస్తాడని అద్భుతమైన ఉపమానాలతో అనేక పద్యాలలో భక్తి, శరణాగత ప్రపత్తుల ప్రాముఖ్యతను చాటారు.   

పైన వివరాలు పరిశీలిస్తే మనిషి జీవితంలోని ప్రతికోణాన్ని వికారాలను, వైరాగ్యాలను, నిష్ఠూరాలను, ఔన్నత్యాలను దాశరథీ శతకం పరమాత్మ అనే మహచ్ఛక్తి ముందు నిలిపి సాత్విక మార్గాల ద్వారా దోషహరుడై మానవుడు ముక్తిని పొందుతాడు అన్న సనాతనధర్మ సారాంశాన్ని మరో మారు అందమైన ఉత్పలమాల-చంపకమాల పద్యాల రూపాలలో మనకు వారసత్వ సంపదగా అందజేశారు.  

కాంచనవస్తుసంకలిత కల్మషమగ్నిపుటంబు వెట్టి వా
రించినరీతినాత్మనిగిడించిన దుష్కరదుర్మలత్రయం
బంచిత భక్తియోగ దహనార్చి దగుల్పకపాయునే కన
త్కాంచన కుండలాభరణ దాశరథీ కరుణాపయోనిధీ! 

కరుణాసముద్రుడవైన దశరథరామా! బంగారమునకంటిన కల్మషములు నిప్పులో పుటము పెట్టుటచే పోయినట్లు, ధనపుత్రదారేషణాదులచే ఆపాదింపబడు పాపములన్నియూ నీయందు భక్తియనే అగ్నివలన తొలగిపోవును కదా! 

చిన్నతనంలోనే పిల్లలకు ఈ శతక పద్యాలు నేర్పి భావాన్ని వారి వ్యక్తిత్వాలలోకి రంగరిస్తే, ఇంక ఎన్నటికీ వారు పరధర్మాల దారి పట్టరు, అజ్ఞానంలో కొట్టుకుపోరు. అందుకే దాశరథీ శతకం సమగ్ర వ్యక్తిత్వవికాస సాధనం. 

శ్రీరామజయం. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

దాశరథీ శతకం - స్థూల పరిశీలన

దాశరథీ శతకం లాంటి సాహిత్యం ఒక సమగ్రమైన జీవన పాఠ్యాంశమని నా అభిప్రాయం. సరే, వందకు పైగా పద్యాలున్నాయి కాబట్టి శతకం అన్నాము. మరి ఒక సంపుటిగా వా...