29, అక్టోబర్ 2015, గురువారం

సాయీశ్వర నీ పదముల సన్నిధి నే చేరినాను



సాయీశ్వర నీ పదముల సన్నిధి నే చేరినాను 
సదానంద వార్నిధిలో సదా డోలలూగినాను

హరే రామ హరే కృష్ణ హరే సాయి హరే హరే 
భజే సాయి శాంతిదాయి సత్యసాయి హరే హరే

మనసులోన భక్తిసుధా మధురిమలే నిలిపినాను 
కనులలోన కాంతి ప్రభా కవిత జ్యోతి నిలిపినాను
ఆరాధన పూర్వకముగ అనవరతము కొలిచినాను
తనివారగ దరిశించి తరియించెద స్వామి నేడు

హృదయ పథములో నిరతము పదయుగమును నిలిపినాను
భావవీథిలో సతతము సేవసేయ తలచినాను
ఆవేదన పొంగగ నను ఆదుకొనగ వేడినాను
పరమాద్భుత మహిమాన్విత కరుణ కోరినాను నేడు

త్రేతాయుగమందు వెలయు సీతాపతి నీవుకదా
ద్వాపరమ్ములోన వెలుగు గోపాలుడు నీవు కదా
ఈ కలికాలమున అవతరించిన సాయీవి కదా
పర్తివాస పరమపురుష పరమాద్భుత నీవె కదా

ఆశ్రిత జన కోటికెల్ల అభయమొసగు దాత నీవు
నామకీర్తన మురియు నారాయణమూర్తి నీవు
లీలా మానుష దేహుడు బోళా శంకరుడు నీవు
త్రిమూర్త్యాత్మ రూపుడవు దీనబాంధవుడవు నీవు



గురువు సనాతన ధర్మంలోని అతిముఖ్యమైన కోణం. అదే దీని విశిష్టత. సాధకుడు అడవిలో దిక్సూచి/పటం లేకుండా వెదికే యాత్రికుడైతే గురువు ఆతనికి దిక్సూచి/పటం చూపించి మార్గనిర్దేశకం చేసేవాడు. చీకటిలో వెలుగును చూపే జ్ఞానజ్యోతి. కారడవిలో తప్పిపోయిన వ్యక్తికి లాంతరుతో వచ్చి దారిచూపేవాడు గురువు. అలా సద్గురువుగా వచ్చిన దత్తావతారుడు షిర్డీ సాయి. ఆయన సమాధి తరువాత 8 ఏళ్లకు తదుపరి అవతారంగా పుట్టపర్తిలో జన్మించారు సత్యసాయిబాబా. ఒకరా ఇద్దరా? ఒక ఊరా ఒక జిల్లానా? దేశదేశాలలో కోట్లాది మందికి ఆరాధ్యదైవమైనారు. ప్రేమ, సేవలకు ప్రతిరూపమై నిలిచారు. సత్యసాయి భక్తులలో ఒక ప్రత్యేకత ఉంది. ఆయన పట్ల అచంచలమైన భక్తి విశ్వాసాలు, సమాజం పట్ల సేవా తత్పరత. ఆ సత్యసాయిబాబా గురించి సాయికృష్ణ యాచేంద్ర గారు ఎంతో ఆరాధనా భావంతో ఈ గీతాన్ని రచించారు.

ఒక మహనీయునితో అనుబంధం వారి పట్ల ఎంతటి ఉత్తమమైన భావవీచికలను కలిగిస్తుందన్నదానికి ఈ గీతం మంచి ఉదాహరణ. సమస్త దేవతలను సాయిలోనే చూశారు రచయిత. భక్తికి ప్రతిస్పందన భావం సౌందర్యం. భావం రచయిత అంతఃకరణాన్ని సూచిస్తుంది. ఈ గీతంలో సాయికృష్ణ గారు తన సాయి భక్తి ఔన్నత్యాన్ని చాటారు.

నమ్మిన దైవం పాదాల వద్దకు చేరితే అది శాశ్వతానందమనే సముద్రమే కదా? సాయి పదముల వద్దకు చేరినపుడు ఆనందసాగరంలో తేలియాడుతున్నట్లు రచయిత అనుభూతి చెందారు. సాయినే రామునిగా కృష్ణునిగా నుతించారు. శాంతి ప్రదాతగా సత్యసాయిని ప్రస్తుతించారు. మనసులో భక్తిని, కనులలో కాంతులను నిలుపుకొని ఎల్లప్పుడూ ఆయనను కొలిచిన భక్తుడు తనివితీరా దర్శించి తరియించే తరుణంలో ఈ గీతం వెల్లువై పొంగింది. హృదయములో స్వామి పాదాలను నిలిపి, నిరంతర సేవా తత్పరతను భావములో నిలిపి, అవేదన పొంగగా, ఆదుకోమని వేడుకొంటూ, పరమాద్భుతమైన మహిమ కల, కరుణామయుడైన సాయిని ప్రస్తుతించే  భావం సుమం ఈ గీతం. రాముడిగా, కృష్ణుడిగా అవతరించ పరమాత్మ ఈ కలికాలంలో పుట్టపర్తిలో సాయిగా వెలసినాడని, ఆ సాయిని పరమాద్భుతమైన పరమపురుషునిగా నుతిస్తుంది ఈ గీతం. తనను ఆశ్రయించిన వారిని ఆదుకునే దాతగా, నామకీర్తనలో నిరంతరం మురిసే నారాయణునిగా, తన లీలగా మనిషి రూపాన్ని ధరించిన శివునిగా, త్రిమూర్తుల రూపంగా, దీనులకు బంధువుగా కీర్తించే గీతం ఇది.

ఒక మహనీయుడిని, అవతార పురుషుడిని ఇంత భావసంపదతో నుతించే గీతాలు చాలా అరుదు. సాయి కృష్ణ యాచేంద్ర గారు ఇటువంటి గీతాలు ఎన్నో రాశారు. సాయి భక్తి పూర్తిగా ఒంటబట్టితే తప్ప ఇలాంటి గీతాలు ప్రకటితం కావు. శరణాగతి, భక్తి, నమ్మకం, ఆనందం అన్నీ కలిస్తేనే గుణవైభవ వర్ణన సరైన పదాలతో ముత్యాల వరుసలా ఆవిష్కరించబడేది. సాయి భక్తులలో ఇటువంటి లోతైన భావనలకు కారణం వారికి స్వామితో గల వ్యక్తిగత అనుభూతులు. స్వామి కొందరికి రోగాలను నయం చేస్తే, కొందరికి సన్మార్గం చూపించారు. కొందరికి ప్రేమతో సాంత్వన కలిగిస్తే కొందరికో వ్యంగ్యంతో అహంకారాన్ని అణచారు. నీరులేని ఎడారి గ్రామాలకు నీటిని అందించి దీనబంధువైనారు. విలువలతో కూడిన విద్యను అందించి బ్రహ్మజ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేశారు. ఉచితవైద్యం అందించి పేదలకు ప్రాణాలు పోశారు. ఇవన్నీ అద్భుతాలే. కేవలం స్వామి సంకల్పంతో, శక్తితో జరిగిన పనులే. గురువుగా, దైవంగా, తల్లిగా, తండ్రిగా వేర్వేరు పాత్రలను పోషించి స్వామి తన భక్తులకు సర్వం అయినారు. అందుకే వారికి స్వామిపై అంత ఆరాధనా భావం. అటువంటి భావంతోనే సాయికృష్ణ గారు ఈ గీతాన్ని రచించారు. అందుకే మహత్తరంగా ప్రచోదనమైంది.

సత్యసాయి అనగానే గుర్తుకు వచ్చేది ఆయన ప్రేమ, కరుణ, వాత్సల్యం, ఆయన స్థాపించిన సంస్థలలో సేవాతత్పరత, భజనలు, క్రమశిక్షణ, వినమ్రత. ఇవన్నీ ఈ గీతంలో మనకు పుష్కలంగా గోచరిస్తాయి. స్వామి యొక్క అత్యద్భుతమైన లీలగా నాకు అనిపించేది ఆయన శిష్యకోటి. ప్రపంచవ్యాప్తంగా సాయి సిద్ధి పొందిన నాలుగేళ్ల తరువాత కూడా కార్యక్రమాలు స్వామి ఉన్నప్పుడు ఎలా జరిగాయో అలాగే జరుగుతున్నాయి. మీడియా ఎంత బురద జల్ల ప్రయత్నించినా, ఎన్ని వ్యతిరేక శక్తులు దాడులు చేసినా, సంఘటితమైన శిష్యగణం స్వామి ఆరంభించిన అద్భుతమైన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తునే ఉన్నారు. కులమతాలకు అతీతంగా లక్షలమంది వాలంటీర్లు ఈ సేవలో తరిస్తునే ఉన్నారు. ఒక వ్యక్తి ప్రపంచాన్ని సైతం మార్చగలడు అన్నదానికి  మనకళ్లముందటి సత్య సాయి అవతారమే ప్రమాణం. సాయికృష్ణ యాచేంద్ర గారి గీతం వీటన్నిటికీ సాక్షి.

ఈ గీతాన్ని షణ్ముఖ ప్రియ, హరిప్రియ గార్ల గానంలో వినండి.

24, అక్టోబర్ 2015, శనివారం

పాయోజి మైనే - మీరా భజన్



ఇక్ష్వాకు వంశార్ణవ జాత రత్నం
సీతాంగనా జీవన భాగ్య రత్నం
వైకుంఠ రత్నం మమ భాగ్య రత్నం
శ్రీరామ రత్నం శిరసా నమామి

- శ్రీరామకర్ణామృతం

పాయోజి మైనే రాం రతన్ ధన్ పాయో

వస్తు అమోలిక్ దీ మేరే సద్గురు కిర్పా కర్ అప్నాయో పాయోజి మైనే

జనం జనం కీ పూంజీ పాయీ జగ్ మే సభీ ఖోవాయో పాయోజి మైనే

ఖర్చై న ఖోటై చోర్ న లూటై దిన్ దిన్ బఢత్ సవాయో పాయోజి మైనే

సత్ కి నావ్ ఖేవటియా సద్గురు భవ్ సాగర్ తర్వాయో పాయోజి మైనే

మీరా కే ప్రభు గిరిధర్ నాగర్ హరఖ్ హరఖ్ జస్ గాయో పాయోజి మైనే

- మీరాబాయి 

భావం:

సజ్జనులారా! నేను నామమనే రత్నాన్ని (రామనామము) ధనంగా పొందాను. ఈ అమూల్యమైన బహుమతిని నాకు సద్గురువులిచ్చారు. నేను కృతజ్ఞతతో స్వీకరించాను. ప్రాపంచిక వస్తువిషయాలన్నీ కోల్పోయినా, ఎన్నెన్నో జన్మల పుణ్యానికి లభించే ఈ రామనామమనే సంపదను ఈ జన్మలోనే పొందాను. ఏ దొంగా దొంగిలించలేనిది ఈ సంపద. ఎంత ఖర్చుపెట్టినా మరింత పెరిగే ఈ రామనామమనే సంపదను పొందాను. సత్యమనే నావలో సద్గురువుల అనుగ్రహంతో భవసాగరాన్ని దాటాను. మీరాకు ప్రభువైన ఆ గిరిధరుని కీర్తిని హర్షముతో గానము చేస్తున్నాను.

వివరణ:

మధురభక్తికి మరో పేరు మీరాబాయి. 16వ శతాబ్దానికి చెందిన ఈ భక్తురాలు ఎన్నో కఠిన పరీక్షలను, సామాజిక వివక్షను ఓర్చి తన కృష్ణభక్తిని చాటింది. ఆమె భక్తి విషాన్ని కూడా భగవతుని రూపంగా మార్చివేసింది. ప్రస్తుతపు రాజస్థాన్‌లో జన్మించి ద్వారకలో స్వామిలో ఐక్యమైన ఈ భక్తురాలు తన భావాలను అద్భుతమైన పదాలుగా అందించింది. భారతదేశపు భక్తి సంగీతంలో మీరా రచనలు ఉత్తమ భజనలుగా శాశ్వతమైనాయి. మధురభక్తిలో తనను తానే స్వామిని సమర్పించుకొని స్వామితో రమించే భావజాలం ఎందరో మహానుభావులు తమ సాహిత్యంలో కనబరచారు. అన్నమాచార్యులు, క్షేత్రయ్య, గోదా, మీరా వీరిలో ప్రముఖులు. భగవంతునికే అంకితం అయిన మీరా భజనల్లో భక్తి సువాసనలు పుష్కలం. అటువంటిదే ఈ పాయోజి మైనే రాం రతన్ ధన్ పాయో. వ్రజ భాషలో మీరా రచనలు చేసింది. అది హిందీ భాషకు చాలా దగ్గరగా ఉంటుంది. వ్రజ, అవధ్ అనేవి రెండు ద్వాపర యుగం నుండి శ్రీకృష్ణుడు తిరిగిన ప్రాంతాలలో ప్రజల భాషలు. వీటినుండే హిందీ జన్మించింది. ఈ వ్రజ భాషకు దేవనాగరి లిపి. ఇప్పటికీ రాజస్థాన్, హర్యాణా, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో వ్రజ భాషా మాట్లాడుతారు.



ఈ భజనలో మీరా రామనామమనే సంపద వలన తనకు కలిగిన అనుభవాలను, అనుభూతులను అద్భుతంగా నుతించారు. అసలు రామనామమెంత అమూల్యమైనదో, అది సద్గురువుల అనుగ్రహం వలన తనకు లభించిన సంపదగా ఆమె అభివర్ణించారు. తనకున్న సంపదలన్నీ పోయినా ఎన్నో జన్మలెత్తినా కూడా లభించని  రామనామమనే సంపదను గురువులు రవిదాసు గారు ఆమెకు అందించారని కొనియాడారు. దొంగలు దోచుకోలేనిది, ఎంత పంచితే అంత విలువ పెరిగేదిట రామనామ సంపద. నిజమే కదా? మనకు తెలిసిన తారక మంత్రము ఎంత మందికి అందితే దాని విలువ మరింత పెరుగుతునే ఉంది. ఎందరో మహానుభావులు ఈ రామనామంతో జనన మరణాల వలన కలిగే కష్టాలను, దుఃఖాన్ని అధిగమించి మోక్షం పొందారు. ఈ ప్రపంచంలో ఒక్కటే సత్యం. అదే భగవంతుడు. సంసారమనే దుర్భరమైన సాగరాన్ని సత్యమనే నావలో గురువులు నన్ను దాటించారు అని ఎంతో భావగర్భితంగా మీరాబాయి స్తుతించారు. రాముని నామం రుచి తెలిసిన వారికి వేరేదీ రుచించదు. దానినే స్మరిస్తూ అందులోనే తరించారు. అదే విధంగా మీరా కూడా తాను నమ్ముకున్న దైవాన్ని స్మరిస్తూ భగవంతునిలో లీనమైంది. నేను అన్న భావన వదిలి, దేహం యొక్క వాసనలను త్యజించి జీవాత్మను శుద్ధి చేస్తే అదే పరమాత్మ రూపం అని తెలిసి ముక్తిని మహానుభావులలో మీరా అగ్రగణ్యురాలు. ఈ కర్మభూమిలో మీరాబాయికి గల స్థానం పవిత్రమైనది, ఉన్నతమైనది.

లతా మంగేష్కర్ గారి గళంలో ఈ భజన వినండి.

22, అక్టోబర్ 2015, గురువారం

జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి


జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి

అమ్మవు నీవే అఖిల జగాలకు
అమ్మల గన్న అమ్మవు నీవే
నీ చరణములే నమ్మితినమ్మ
శరణము కోరితినమ్మా భవాని

నీదరినున్న తొలగు భయాలు
నీ దయలున్న కలుగు జయాలు
నిరతము మాకు నీడగ నిలచి
జయమునీయవే అమ్మాభవాని

చలనచిత్రాలు ఎంత ప్రభావవంతమైన మాధ్యమాలో తెలుగు సినీ చరిత్రలోని స్వర్ణయుగాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. అప్పట్లో ప్రతి చలన చిత్రంలోనూ ఒక భక్తిగీతం ఉండేది. తప్పకుండా సామాజిక స్పృహ ఉండేది. పాత్రలలో పవిత్రత ఉండేది. నర్తనశాల పౌరాణిక చలనచిత్రమైనా అందులో ద్రౌపది పాత్రకు భక్తిగీతాన్ని పొందుపరచాల్సిన అవసరం దర్శకునికి నిజంగా లేదు. కానీ, ఆ గీతం చిత్రానికి వన్నె తెచ్చింది. సావిత్రి గారి సినీయాత్రలో అది ఒక కలికితురాయిలా నిలిచింది.

భక్తి సంగీతం అంటే కేవలం వాగ్గేయకారుల కృతులే కాదూ, తాము కూడా ఏమీ తీసిపోము అన్నరీతిలో అప్పటి సినీ గేయ రచయితలు గీతాలు రాసేవారు. అటువంటిదే నర్తనశాల చిత్రంలోని జననీ శివకామిని అన్న గీతం. ఈ పాటను పరిశీలిద్దాం.

పాండవులు అరణ్యవాసం పూర్తై అజ్ఞాతవాసానికి విరాటరాజు కొలువులో మారువేషాలలో ఉండాలని నిర్ణయించుకొన్న తరువాత సైరంధ్రిగా పాంచాలి విరాటరాజు భార్య సుధేష్ణాదేవి వద్దకు వెళ్లే సందర్భంలో ఈ గీతాన్ని దర్శకులు పొందుపరచారు. దర్శకుల ప్రతిభ ఇలాంటి సందర్భాలలోనే తెలుస్తుంది. అప్పుడు ద్రౌపది మానసిక పరిస్థితి ఏమిటి? తమ అజ్ఞాతవాసం భంగమైతే మళ్లీ వనవాసం మొదలు. తనకు జరిగిన పరాభావానికి బదులు ఉండదు. భర్తలకు గౌరవం, రాజ్యం తిరిగిరాదు. ఇలా పరిపరి విధాల తలపులలో ఉన్న ద్రౌపదికి అమ్మవారి మందిరం కనిపిస్తుంది. ఆ అమ్మను ప్రార్థించే సన్నివేశంలోని గీతం ఇది.

మహాభారతంలోని విరాటపర్వం మొదలులో ధర్మరాజు తమ అజ్ఞాతవాస విజయానికి దుర్గాదేవిని కొలుస్తాడు. ఎంతో మహిమగల స్తోత్రం అంది. అలాగే ద్రౌపది అమ్మవారిని కొలిచినట్లు కూడా ఉంది. ఇక నర్తనశాల చిత్రానికి వస్తే, ఇది విరాటపర్వ నేపథ్యం.

ఈ గీతంలో రచయిత సముద్రాల రాఘవాచార్యులవారు భక్తిని, ఆర్తిని, శరణాగతిని సులభమైన పదాలలో తెలియజేశారు. శివకామిని అన్నపదం చిదంబరంలో శివుని రాణి అయిన శివకామసుందరినుండి వచ్చింది. ఆ అమ్మ ఎటువంటిది? జయమును, శుభమును కలిగించేది, విజయాని రూపం ఆ తల్లి. ఆ అమ్మ సకలలోకాలకు తల్లి. అమ్మలను గన్న అమ్మ. అటువంటి తల్లి పాదాలను నమ్మి శరణు కోరుతున్నాను అని పాంచాలి ప్రార్థిస్తుంది. ఆ అమ్మ దగ్గర ఉంటే భయాలు తొలగిపోతాయి. ఆ అమ్మ దయ ఉంటే జయాలు కలుగుతాయి. మాకు ఎల్లప్పుడూ నీడగా నిలిచి జయాన్ని ప్రసాదించు తల్లీ భావనీ అని వేడుకుంటుంది.

ఎంతటి శక్తిసంపన్నులైనా, ధర్మపరాయణులైనా పాండవులకు కష్టాలు తప్పలేదు. కానీ, వారు ఆ ధర్మాన్ని త్యజించలేదు. తాము నమ్ముకున్న దైవంపై విశ్వాసంతో ముందుకు సాగారు. ఆ ధర్మపరాయణత్వం వలనే వారికి సమస్త అస్త్రశస్త్రాలు, చీకటిలో వెలుగులు లభించాయి. ఆ పాండవుల ధర్మపరాయణతకు ఒక లక్షణం భక్తి. ఆ భక్తికి సూచిక ఈ పాంచాలిపై చిత్రీకరించబడిన గీతం.

పురాణాలలో పాత్రలు ఎంతో దివ్యత్వం కలిగినవైనా వారు కూడా దైవాన్ని ప్రార్థించటంలో ఉద్దేశం అన్నిటినీమించిన శక్తి గురించి మనకు తెలియజేయటం, ఎంతటివారికైన ఆపదలు, కష్టాలు కలుగుతాయి, వాటిని దైవానుగ్రహంతో దాటగలం అని చెప్పటానికి. మా గురువుగారు రమణరావుగారు ఎప్పుడూ చెబుతారు - "మనం చేసే ఉపాసన మనకు ఎండవానల్లో గొడుగులాగా రక్షణనిస్తుంది. పూర్తిగా తడువకుండా కాపాడుతుంది. దీనివలన మనం ఆ వర్షమనే అవరోధాన్ని దాటి ముందుకు వెళ్లగలం". అదే ఈ గీతం యొక్క ఉద్దేశం కూడా.

సముద్రాల రాఘవాచర్యుల వారు రాసిన ఈ గీతానికి సంగీత సరస్వతి సుసర్ల దక్షిణామూర్తిగారు సంగీతం అందించారు. మాధుర్యానికి, భక్తి భావానికి మారు రూపైన సుశీలమ్మ గారు ఈ పాటను పాడారు. అమ్మా అని పాట ఆరంభంలో ఆవిడ పాడిన ఆలాపన శిలలనైనా కరిగించేలా ఉంటుంది. భక్తివిశ్వాసాలకు ఈ గీతం నిలువుటద్దం. ఇక సావిత్రి గారి సంగతి చెప్పేదేముంది. పాటలోని భావానికి, పాత్రకు జీవం పోశారు. అందుకే నర్తనశాల చిత్రం ఇప్పటికీ సజీవంగా నిలిచింది. ఈ గీతం శాశ్వతమైంది.

20, అక్టోబర్ 2015, మంగళవారం

జననీ నిను వినా - తంజావూరు సుబ్బరాయశాస్త్రి గారి రచన



అమ్మ వారి సంకీర్తనలలో ఒక ఆర్తి ఉంటుంది. అమ్మను వేడుకోవటం ఆమె అనుగ్రహించటం మనం నిత్యం చూసేదే. ఆ ఆదిపరాశక్తి కరుణామయి, దయామయి. ఆ భావనతోనే భక్తుడైన వాగ్గేయకారులు అమ్మను శరణాగతితో వేడుకున్నారు. ఆ తల్లి కనులలో కురిసే కరుణ, లాలన, బిడ్డ పట్ల గల వాత్సల్యం ఒక పక్క, మనలను భవసాగరాన్ని దాటించే శక్తిగా మరొక పక్క, మన కోరికలను తీర్చే వరదాయినిగా ఇంకో పక్క..ఇలా ఆ ఆదిపరాశక్తి వైభవాలను ఎంతో మనోజ్ఞంగా నుతించారు మన వాగ్గేయకారులు. అమ్మను నుతించిన ప్రతి వాగ్గేయకారుడూ అమ్మ ఉపాసకుడే. ఉపాసన త్రికరణ శుద్ధితో, భక్తి శ్రద్ధలతో, శరణాగతితో చేయనిదే అమ్మ వైభవం అందంగా సంకీర్తనలలో ఆవిష్కరించటం కుదరదు. సంగీత త్రయంలో ముత్తుస్వామి దీక్షితుల వారు, శ్యామశాస్త్రి వారు పరదేవతను ఉపాసించి సిద్ధి పొందారు. ఆ శ్యామశాస్త్రి వారి కుమారులు సుబ్బరాయ శాస్త్రి గారు. ఆయన ఎక్కువ కృతులను రచించకపోయినా, మనకు అందుబాటులో ఉన్నవన్నీ ఆయన ఆధ్యాత్మిక సౌరభాన్ని తెలియజేస్తున్నాయి.

సుబ్బరాయశాస్త్రిగారు 1803వ సంవత్సరంలో తంజావూరులో శ్యామశాస్త్రి గారికి రెండవ కుమారునిగా జన్మించారు. చిన్నతనంలో తండ్రి వద్ద సంగీతం నేర్చుకున్నారు. శ్యామశాస్త్రి గారు కుమారుడికి సంగీతం నేర్పవలసిందిగా త్యాగరాజు వారిని అభ్యర్థించగా ఆయన అందుకు ఎంతో సంతోషించి శిష్యునిగా అంగీకరించారు. సుబ్బరాయశాస్త్రి గారు త్యాగరాజస్వామి వారి ప్రధాన శిష్యులలలో ఒకరిగా పేరొందారు. అటుతరువాత మళ్లీ తండ్రి వద్ద సంగీతాభ్యాసం చేశారు. ఆ సమయంలోనే తమ ఇంటి వెనుక ప్రాంతంలో ఉండే ముత్తుస్వామి దీక్షితుల వారి వద్ద కూడా సంగీతం నేర్చుకునే అవకాశం లభించింది. ఈ విధంగా సంగీత త్రయం వద్ద విద్యనభ్యసించే అరుదైన భాగ్యం సుబ్బరాయ శాస్త్రి గారికి మాత్రమే దక్కింది. ఆయన కర్ణాటక సంగీతమే కాకుండా హిందూస్థానీ కూడా నేర్చుకున్నారు. వయోలిన్ విద్వాంసులు కూడా. సుబ్బరాయశాస్త్రిగారు రాగభావానికి ప్రసిద్ధి. గురువులు త్యాగరాజస్వామి వారు ఈయన భక్తికి, రాగభావానికి ఎంతో ఆనందపడ్డారట. సుబ్బరాయశాస్త్రి గారి రచనలలో సంగీత త్రయం ఛాయలు కనిపిస్తాయి. ఈయన ముద్ర 'కుమార '. ఆయన చాలా కాలం తీర్థయాత్రలలోనే గడిపారు. చెన్నైలో నివసించారు. ఆయన సంగీత వారసత్వం వీణ ధనమ్మాళ్ మొదలైన వారి ద్వారా కొనసాగుతునే ఉంది. ఆయన రచించిన జననీ నినువినా అనే కృతిని ఈరోజు పరిశీలిద్దాం. ఈ కృతిలో ఆయన తండ్రి శ్యామశాస్త్రిలా భక్తి భావనను, పరదేవతతో అనుసంధానాన్ని, ఉపాసనా సాఫల్యాన్ని ప్రతిబింబింపజేశారు.

సాహిత్యం:

జననీ నిన్ను వినా అంబ జననీ నిను వినా త్రిలోక
జననీ నిను వినా దిక్కెవరమ్మా జగములోన గాన అంబా

మనసిజ మానస సమ్మోదిని
వినవే నా మనవిని విని నన్ను బ్రోవుము

వనజాయత నేత్రి కుమార జనని కామితదాత్రి
ఘన పాప లతాలవిత్రి సనకాది మునిజన సన్నుత పాత్రి

నిరవధిక సుఖ దాయకి యనుచు విని నిను చాల గొలిచితి
నిరతముగ తనయుని మొరలు విని నీవలెనె బ్రోచుటకు ఎవరికి
ధరలో వినుమా ఇది ఘనమా తరుణమిది కృపసలుపు దురుసుగ
సరసీరుహ లోచని సువాసిని తామసము సేయకనే బ్రోవుము

అర్థం:

ఓ మూడు లోకాలకు తల్లీ! అంబా! నీవు కాకుండా నాకు ఈ ప్రపంచములో బ్రోచుటకు దిక్కెవరు?

మన్మథునికి మోదాన్ని కలిగించిన తల్లీ! నా మనవిని విని నన్ను కాపాడు. కలువలవంటి కన్నులు గల అమ్మా! కుమారస్వామికి జననీ!  కోర్కేలను తీర్చే తల్లీ! పెనవేసుకున్న ఊడలవంటి పాపములను నాశనం చేసే తల్లీ! సనకాది మునులచే నుతించబడిన అమ్మా! అనంతమైన సుఖాలను ప్రసాదించే తల్లివని విను నిన్ను చాలా కొలిచితిని.  ఈ తనయుని మొరలు విని వేగముగా బ్రోచుటకు నీవు తప్ప ఈ భూమిపై ఎవ్వరు? నా మొరలు వినుము. ఆలస్యము తగదు తల్లీ! నీ కృపను కలిగించుటకు ఇది తగిన సమయము. బహుళముగా ప్రసాదించుము.  ఓ కలువలవంటి కన్నులు గల తల్లీ! శుభకరీ! నన్ను వెంటనే బ్రోవుము.

వివరణ:

సుబ్బరాయశాస్త్రిగారి ఈ రచనలో తండ్రి శ్యామశాస్త్రిగారి భావ జాలం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. పరదేవతపై గల భక్తి విశ్వాసములు, ఆ తల్లితో ద్వైత భావంతో గల అనుబంధం, విన్నపాలు మొదలైనవి శ్యామశాస్త్రి గారి సాహిత్యంలో కోకొల్లలు. అదే రీతిన సుబ్బరాయశాస్త్రిగారు ఈ కీర్తనను రచించారు. సాహిత్యానికి రాగం ప్రాణం. అందుకే కరుణ, భక్తి రసాలను బాగా పండించే రీతిగౌళ రాగాన్ని ఆయన ఎంచుకున్నారు. శరణాగతి, ఆర్తి కలిగిన ఈ కీర్తన సాహిత్యానికి రీతిగౌళ రాగం ప్రాణప్రతిష్ఠ చేసి శాశ్వతత్వాన్ని ప్రసాదించింది.

ఈ కృతిలో వాగ్గేయకారుని భాషా పటిమ,  భక్తి సువాసన పదప్రయోగంలో విదితం. మనసిజ మానస సమ్మోదిని...ఇదేంటి అమ్మవారు మన్మథునికి మోదం ఎలా కలిగించింది అన్న ప్రశ్న కలుగవచ్చు. మన్మథుని బూడిద చేసింది శివుడైతే దేహంలేని రూపాన్ని ఇచ్చింది పార్వతి. ఆ విధంగా మన్మథునికి ఆనందం కలిగించింది అమ్మ. చరణంలో పదప్రయోగం గమనించండి - వనజాయత నేత్రి కుమారజననీ కామితదాత్రి ఘనపాపలతాలవిత్రీ...ఇందులో శాస్త్రులుగారి సాహిత్యం తెలుగు తెలుగు సంస్కృత భాషా పాండిత్యాన్ని చాటుతుంది. ఘనపాపలతాలవిత్రి అట అమ్మ...మర్రి ఊడలను ఎప్పుడైన చూశారా? పెనవేసుకుని విడదీయలేకుండా, త్రెంచటానికి అలవికాకుండా ఉంటాయి. మన పాపసంచయం కూడ అటువంటిది అని అద్భుతంగా పోల్చారు వాగ్గేయకారులు. అటువంటి పాపాలను కూడా నాశనం చేసే తల్లిగా అమ్మను అభివర్ణించారు. చిట్టస్వర సాహిత్యంలో ఆయన తెలుగుభాషా సౌందర్యాన్ని మనకు అందించారు. ఈ నాలుగు పంక్తులలో అమ్మను ఒక తనయుడు అడిగినట్లే ఆ ఆదిపరాశక్తిని వేడుకునే సాహిత్యాన్ని ఆవిష్కరించారు. అమ్మను తామసము చేయక బ్రోవుము అని అడగటం ఏమిటి అన్న ప్రశ్న వస్తుంది. చిన్నపిల్లవాడు అమ్మతో ఎప్పుడూ ఒకేలా మాట్లాడడు. మధ్యలో నిష్ఠూరము, ఆత్రుత, ఒకింత అలుక...అన్నీ ప్రదర్శిస్తాడు. అదే విధంగా వేర్వేరు భావనలను సుబ్బరాయశాస్త్రిగారు ఈ సాహిత్యంలో మనకు అందించారు. ఇది ఒకింత మధురభక్తికి దగ్గరగా ఉంటుంది. అన్నమాచార్యులు, శ్యామశాస్త్రి ఈ సాహితీ లక్షణాలకు పితామహులు. ఈ ఒక్క కృతి చాలు సుబ్బరాయశాస్త్రి గారి వ్యక్తిత్వాన్ని తెలుపటానికి. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.

ఈ కృతి ఎందరో పాడారు. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి పాడినది బాగుంటుంది. ఇటీవలి చారులత మణి గారు ఆలపించింది ఉచ్ఛారణలో స్పష్టంగా అనిపించింది. మాధుర్యత కొంత లోపించినా, సాహిత్యం యొక్క గొప్పతనం కోసం ఈ వీడియోను ఎంచుకున్నాను. మహారాజపురం సంతానం వారిది రాగాలపనతో కూడినది, ఉచ్ఛారణలో స్పష్టత లేదు.  

19, అక్టోబర్ 2015, సోమవారం

అంబ వాణి నన్ను ఆదరించవే


అంబ వాణి నన్ను ఆదరించవే

శంబరారి వైరి సహోదరి 
కంబు గళే సిత కమలేశు రాణి

పరదేవి నిన్ను భజియించు నిజ భక్తులను బ్రోచే పంకజాసిని
వర వీణా పాణి వాగ్విలాసిని హరికేశపుర అలంకారి రాణి

హరికేశనల్లూర్ ముత్తయ్య భాగవతార్ గారు సంగీత త్రయం తరువాత ప్రసిద్ధులైన వాగ్గేయకారులలో ఒకరు. ఆయన తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో 1877 సంవత్సరంలో జన్మించారు. సంస్కృతం, తెలుగు, తమిళం, కన్నడ భాషలలో ప్రావీణ్యం సాధించి ఎన్నో సంకీర్తనలను రచించారు. సంగీత పోషకులైన ట్రావంకోర్, మదురై, మైసూర్ రాజుల వద్ద తన వైదుష్యాన్ని పెంపొందించుకొని సంగీత ప్రపంచంలో తనకు ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ట్రావంకోర్ లోని మహారాజా స్వాతితిరుణాళ్ సంగీత అకాడెమీలో ఎన్నో ఏళ్లు పనిచేసి ఆ మహారాజావారి ఎన్నో కీర్తనలకు బాణీ కూర్చారు. ఆయన ముద్ర 'హరికేశ '. ఈయన దాదాపు ఇరవైకి పైగా రాగాలను సృష్టించారు. నాలుగు వందలకు పైగా సంకీర్తనలను రచించారు. మైసూరు మహారాజా వారి సన్స్థానంలో ఉన్నప్పుడు అక్కడి చాముండేశ్వరిపై దాదాపు 115 కీర్తనలను రచించారు. ఆయన రచించిన వర్ణాలు ఎంతో పేరు పొందాయి. అందులో ఖమాస్ రాగంలోని మాతే మలయధ్వజ పాండ్యసజాతే అన్నది ఎంతో ప్రాచుర్యం పొందింది. వీణ మరియు మృదంగ విద్వాంసులు ఈయన. ఆయన రచించిన సంకీర్తనలలో ఒకటి అంబవాణి నన్ను ఆదరించవే.

ఈ సంకీర్తనలో ఆయన పరదేవతా స్వరూపమైన సరస్వతిని తనను ఆదరించుమని వేడుకొంటున్నారు. త్రిమూర్తులు, ముగురమ్మల మధ్య ఒక ప్రత్యేకమైన సంబంధాన్ని మన ఆధ్యాత్మికవేత్తలు, సద్గురువులు, వాగ్గేయకారులు ప్రస్తావించారు. విష్ణువు సోదరిగా పార్వతిని, శివుని సోదరిగా సరస్వతిని ప్రస్తుతించారు. ఈ సంకీర్తన అనుపల్లవిలో శంబరారి వైరి సహోదరిగా సరస్వతిని కొలిచారు భాగవతార్ గారు. అంటే మన్మథుని శత్రువైన శివుని సోదరి అని అర్థం. కంబుగళే సిత కమలేశు రాణి అనగా అందమైన కంఠము గల, కమలములో స్థితుడైన బ్రహ్మకు పత్ని అని అర్థం. పరదేవి అనగా రూపగుణాతీతమైన సచ్చిదానంద స్వరూపమని అర్థము. నిత్యము వీణావాద్యములో ఉండే ఈ తల్లి నవరాత్రులలో మూలశక్తిగా కొలువబడుతుంది. చరణంలో తనను భజించే భక్తులను బ్రోచే పంకజములో నివసించే దేవిగా, చేతిలో వీణకలిగి ప్రపంచంలో వాక్కు అనే అద్భుతమైన శక్తిని కలిగిన దేవతగా వాగ్గేయకారులు కొనియాడుతున్నారు.

కీరవాణి రాగంలో కూర్చబడిన ఈ సంకీర్తన సరస్వతీదేవికి ఒక అందమైన స్తుతిగా పేరొందింది. ఎస్పీ రాం గారు ఈ సంకీర్తనను చాల హృద్యంగా ఆలపించారు. వారి అంబవాణి అనే ఆల్బంలో ఈ సంకీర్తనపై క్లిక్ చేసి వినండి.    

14, అక్టోబర్ 2015, బుధవారం

ధైర్య కాత్యాయని - అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ


"వాత్సల్యాది గుణోజ్జ్వలాం భగవతీం వందే జగన్మాతరం..."

అని లక్షీ అష్టోత్తర శతనామావళి శ్రావ్యంగా పూజగది నుండి వినబడుతోంది. పాత చెక్క పూజ మందిరం, దానిలో వంశపారంపర్యంగా వచ్చిన దేవీ పంచాయతనం, మధ్యలో అమ్మ వారు. స్ఫటిక లింగం, మిగిలినవి పంచలోహ విగ్రహాలు, అంగుష్టమాత్రం కన్నా తక్కువ ఎత్తులో ఉన్నాయి. చక్కగా ఎర్రని మందారాలు, తెల్లని నంది వర్ధనాలు ఆ పంచాయతన దేవతామూర్తులకు అలంకరించబడి ఉన్నాయి. చూచిన వారికి పవిత్రమైన భావన. మందిరం ముందు కాత్యాయని ఆకుపచ్చని చీర కట్టి భక్తితో అమ్మను కొలుస్తోంది. భక్తురాలి ప్రార్థనలను ఎదురుగా ఆ అమ్మలగన్న అమ్మ శ్రద్ధగా ఆలకిస్తోందా అన్నట్లు ప్రశాంతంగా దివ్యంగా ఉంది వాతావరణం. కాత్యాయని కంట నీరు. "అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్న అమ్మవు నీవే" అని ఆర్తితో పాడుతోంది.

పరుగు పరుగున ఏడేళ్ల సర్వజ్ఞ దేవుడి మందిరంలోకి వచ్చి తల్లి ఒడిలో వాలింది. అమ్మా అమ్మా అని తల్లి గడ్డం పట్టుకొని లాగింది. తల్లి తలతిప్పి చూసింది. ఆమె కళ్లలో నీటిని చూసి పిల్ల దిగాలుగా చూసింది. ఇంతలో కాత్యాయని తమాయించుకొని పిల్లను దగ్గరకు తీసుకొని ముద్దాడింది..."నా బంగారు తల్లీ! అమ్మా సర్వజ్ఞా! ఆ గౌరి అనుగ్రహంతో నాకు పుట్టావు..." అని హత్తుకొంది. తల్లి ప్రేమకు కరిగి కిల కిల నవ్వింది సర్వజ్ఞ.

"వినబడుతోందా లేదా! కాఫీ అని గంటనుండి గొంతు చించుకుంటున్నాను. నీ పూజలే కానీ మొగుడంటే పట్టదు. అంతే, ఉద్యోగం లేదు కదా అని అలుసు..." పడక గదిలోనుండి తిట్ల దండకం మొదలైంది. చటుక్కున లేచి వెళ్లి అరుస్తున్న భర్త సూర్యం ముందు నిలబడింది కాత్యాయని. కళ్లెర్ర చేసి ఉగ్ర రూపంలో ఊగిపోతున్నాడు. "నేనూ సంపాయిస్తాను, నాకు కుడా మంచి రోజులోస్తాయి చూడు" అని ఛర్రున లేచి బాత్రూంలోకి వెళ్లాడు. బయటకు రాగానే కాఫీ అని అందించబోయింది. విసిరి కొట్టాడు. జుట్టు పట్టుకొని కొట్టబోయాడు. బిక్కపోయి సర్వజ్ఞ తల్లిని తండ్రి బారినుండి తప్పించాలని ప్రయత్నించింది. పసిపిల్ల అన్న జ్ఞానం లేకుండా చెంప ఛెళ్లుమనిపించాడు. గుక్కపెట్టకుండా ఏడ్వటం మొదలు పెట్టింది. భర్తవైపు అసహ్యంగా చూసి పిల్లను తీసుకొని అక్కడినుండి వెళ్లిపోయింది. ఆలోచనలు గతంలోకి వెళ్లాయి.

తల్లిదండ్రుల బీదరికానికి తలవంచి 18 ఏళ్ల వయసులోనే తన అందం చూసి మోజు పడ్డ సూర్యంతో వివాహానికి కాత్యాయని అంగీకరించింది. అప్పటికి డిగ్రీ మొదటి సంవత్సరమే. స్నేహితులందరూ ప్రశ్నించినా తండ్రికి ఆర్థిక వెసులుబాటు లేదు, వెనుక ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు అన్న ఆలోచనతో గృహిణి అయ్యింది. వివాహ సమయంలో మంచి ఉద్యోగం ఉన్న సూర్యం తన అహంకారంతో తోటి  ఉద్యోగులతో, యాజమాన్యంతో చీటికి మాటికి పోట్లాటలు తెచ్చుకునే వాడు. సహనం తక్కువ అతనికి. తెలివి ఉన్నా నలుగురితో పనిచేసే చాకచక్యం లేకపోవడంతో ఉద్యోగం ఊడిపోయింది. ఇలా 2-3 ఉద్యోగాలు అయిన తరువాత ఇక ఎవ్వరూ ఉద్యోగం ఇవ్వలేదు. ఇంతలో సర్వజ్ఞ పుట్టింది. కాత్యాయని భర్త పరిస్థితి గ్రహించి ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేయాలని సంకల్పించింది. పరీక్షలలలో మంచి మార్కులు సంపాయించి ఒక ప్రైవేట్ సంస్థలో రిసెప్షనిష్టుగా పనిచేస్తోంది. భార్య ఉద్యోగం, తన నిరుద్యోగం, కష్టపడలేని మనస్తత్త్వం సూర్యాన్ని మృగంగా మార్చాయి. భార్య నలుగురితో మాట్లాడటం భరించలేకపోయేవాడు. తను ఇంట్లో ఒంటరిగా ఉండలేక బయట తిరుగుళ్లకు అలవాటయ్యాడు. తాగుడు, సిగరెట్లు, వాటికి డబ్బుకోసం భార్యను వేధించటం. అంతంత జీతం, సంసారం గడవటమే కష్టంగా ఉండటంతో కాత్యాయని డబ్బు నిరాకరించేది. అంతే కాదు, ఆ చెడు అలవాట్లంటే ఆమెకు అసహ్యం. అరుపులు కాస్తా కొట్టటం, బూతులు తిట్టటం వరకు వెళ్లాయి.

గతంలోనుండి వర్తమానంలోకి వచ్చింది కాత్యాయని. నవరాత్రులు చిన్నప్పటినుండి చక్కగా భక్తి శ్రద్ధలతో చేసుకోవటం ఆమెకు అలవాటు. ఈ సంవత్సరం కూడా అలాగే ఎన్ని కష్టాలున్నా అమ్మను కొలుస్తోంది. ఎంతో జాగ్రత్తగా కూడబెట్టుకున్న డబ్బుతో పిల్లను చదివిస్తోంది.

"నాకు 1000 రూపాయలు కావాలి.స్నేహితులతో బయటకు వెళ్లాలి"...సూర్యం అరిచాడు. ఆలోచనలనుండి బయట పడింది కాత్యాయని. "నా దగ్గరలేవు. ఇంకో వారంలో పిల్లకు టర్మ్ ఫీజు కట్టాలి" అంది. అంతే. ఉగ్రరాక్షసుడైనాడు సూర్యం. "మొగుడికి డబ్బు లేదు కానీ, దీని చదువుకు ఉన్నాయి. ఇది చదవకపోతే మనకు నష్టమేమీ లేదు...." అని కాత్యాయనిని కొట్టాడు. ఈడ్చుకుంటూ బజారులోకి తీసుకెళ్లాడు. పిల్ల ఏడ్చుకుంటూ ఇరుగుపొరుగు వారిని సాయం కోరింది. అందరూ మౌనంగా చూశారు తప్ప ముందడుగు వేయలేదు. వీధిలో ముడి వీడిన జుట్టుతో, దుఃఖంతో, కోపంతో కాత్యాయని చూస్తోంది. సూర్యం కాలు ఎత్తి తన్నబోయాడు.

"ఒరేయ్ సూర్యం!". అరుపు విని ఉలిక్కిపడ్డాడు. ఎదురుగా కర్రతీసుకొని వడి వడిగా తన వైపు వస్తున్న సుబ్బమ్మ. తల్లిని చూసి ఆశ్చర్యపోయాడు సూర్యం. దగ్గరకు వచ్చి "ఒరేయ్! నువ్వు మనిషివా! రాక్షసుడివా! బంగారంలాంటి పిల్లను తెచ్చి పెళ్లి చేస్తే బాధ్యత లేకుండా ఇలా బజారుకీడుస్తావా? ఇంకొక్క అడుగు ముందుకు వేశావో...నీ ప్రాణాలు నీకు దక్కవు" అని కర్ర ఎత్తింది. అంతే, వెనుకడుగు వేశాడు.

సుబ్బమ్మ వినోదంగా చూస్తున్న అందరినీ ఒక్కసారి అసహ్యంగా చూసి, కాత్యాయని దగ్గరకు వెళ్లి గంభీరంగా పలికింది. "అమ్మా కాత్యాయనీ! నీలో భయాన్ని పారద్రోలు. మనిషికి కావలసిన కనీసపు అవసరాలను తీర్చలేను భర్త నా కొడుకు అని చెప్పుకోవటానికి సిగ్గుగా ఉంది. సంసారం నడుపుతోందన్న ఇంగిత జ్ఞానం లేక మృగంలా ప్రవర్తిస్తున్నాడు వీడు. నీ వ్యక్తిత్వాన్ని చంపుకొని, నీ మానసిక ఆనందాన్ని కోల్పోయి నిస్సహాయగా ఉండవద్దు. ఎదురు తిరుగు. నిర్భయవై ముందడుగు వేయి. పెళ్లి సంసారం కన్నా నీ ప్రాణం ముఖ్యం. నీ ఆత్మ గౌరవం ముఖ్యం" అని సెల్ ఫోన్ తీసి పోలీస్ కమీషనరుకు ఫోన్ చేయించింది. ఐదు నిమిషాల్లో పోలీసులు వచ్చి సూర్యాన్ని అరెస్టు చేసి తీసుకెళ్లారు. గృహహింస చట్టం కింద సూర్యాన్ని విచారించవలసిందిగా స్వయంగా సుబ్బమ్మ అర్జీ రాసి ఇచ్చింది.

ఇంటికి వచ్చి కాత్యాయనిని, పిల్లను దగ్గరకు పిలిచి ఇలా చెప్పింది. "స్త్రీకి సహనం పురుషుడి గుణాన్ని బట్టి ఉండాలి. ఎప్పుడైతే పురుషుడు తన ధర్మాన్ని మరచి, తన బాధ్యతను విడిచి ఇలా ప్రవర్తిస్తాడో స్త్రీ చూపించాల్సింది సహనం కాదు. ధైర్యం, తన కాళ్లపై తాను నిలబడి జీవించాలి అన్న దృక్పథం. నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తున్నావు కదా? దానిలో నీకు అర్థమయ్యింది ఏమిటి? భర్త అంటే అమితమైన ప్రేమానురాగాలు కల మహాలక్ష్మి, తన భర్తలో అర్థ దేహమైన పార్వతి, నిరంతరం భర్తకు ఆనందం కలిగించే సరస్వతి, ముగ్గురూ కలసి ప్రపంచాన్ని పీడుస్తున్న రాక్షసుడిని చంపటానికి ఉగ్ర దుర్గగా అవతరించారు. ప్రేమ, శాంతము, వాత్సల్యము, కరుణ కలిగిన ఆ ముగ్గురు అమ్మలు ఈ విధంగా అవతరించటానికి కారణం ఎదురుగా ఉన్న సమస్య. లోకరక్షణ కోసం వారి తమ శక్తులను ఏకీకృతం చేసి ఆది పరాశక్తిగా అవతరించి మహిషుడిని సంహరించారు. నీలోని ఓర్పు, సహనం, శాంతం వాడి బాధ్యత విస్మరించినప్పుడే వదిలివేయాలి. భర్త ఎన్ని హింసలు పెట్టినా భరించాలి అన్నది కాదు పాతివ్రత్యం అంటే. సమయానుగుణంగా, పరిస్థితులను బట్టి స్త్రీ వేర్వేరు రూపాలను ధరించాలి. ధర్మం తప్పి మతిభ్రంశుడైన సూర్యం నీ శాంతం, ఓర్పుతో మారడు. వాడికి కావలసింది శిక్ష. శిక్ష ద్వారా మార్పు. మార్పు ద్వారా భార్య యొక్క వ్యక్తిత్వం తెలుసుకోవటం. అప్పుడే వాడు మళ్లీ నీకు భర్తగా ఉండటానికి అర్హుడు..."

ఏడేళ్ల సర్వజ్ఞ, ఇరవై ఆరు ఏళ్ల కాత్యాయని డెబ్భై ఏళ్ల సుబ్బమ్మలో జ్ఞానజ్యోతిని దర్శించారు. సాంత్వన పొందారు. స్ఫూర్తితో ధైర్యంగా నిలబడ్డారు.

విజయదశమి సాయంత్రం. ప్రక్కనే కనకదుర్గమ్మ దేవస్థానం. అమ్మ ముంగిట నాట్య ప్రదర్శనలు ఏర్పాటు చేయబడ్డాయి. మొదట బాల త్రిపుర సుందరిగా ఏడేళ్ల పాప అద్భుతమైన నాట్య విన్యాసం చేసింది. అనంతరం "ఓంకార పంజర శుకీం ఉపనిషదుద్యాన కేళి కలకంఠీం ఆగమ విపిన మయురీం ఆర్యాం అంతర్విభావాయేత్ గౌరీం" అన్న శ్లోకం మొదలైంది. ఎదురుగా ఎరుపు రంగ పట్టు చీర కూచిపూడి శైలితో ధరించింది కళాకరిణి. సిగలో ఎర్రని కనకాంబరాల మాల, నుదుట ఎర్రని కుంకుమ బొట్టు, సర్వాభరణాలు ధరించి అమ్మవారిని తలపించింది. ముగురమ్మల లక్షణాలను వివరించే "అఖిలాండేశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరీ పరిపాలయమాం గౌరీ" అని పాట మొదలైంది.

ఎదురుగా ఉన్న పెద్దముత్తైదువకు నమస్కారం చేసి కళాకారిణి నాట్యం ఆరంభించింది. ముందు గౌరిగా, శంకరుని అర్థ భాగంగా, భగవతిగా శాంకరి రూపాన్ని ఆవిష్కరించింది. తరువాత శ్రీహరి ప్రణయరాశిగా, స్వామి పాదములొత్తే ఆదిలక్ష్మిగా, అష్టలక్ష్ముల రూపాలను మనోజ్ఞంగా ప్రదర్శించింది.చంద్రబింబము వంటి ముఖం కలిగి, బంగారు మేని ఛయతో వీణా పుస్తకములు ధరించి చతుర్ముఖ బ్రహ్మను అలరిస్తున్న సాహితీ సంగీత రూపిణి శారదగా అద్భుతమైన నర్తన చేసింది. తరువాత పతాక సన్నివేశంలో ఆది పరాశక్తిగా నడచి వచ్చింది. సమస్త శక్తులకు మూలమై, కేశములు  ముడి వేయకుండా, త్రిశూల ధారియై, అస్త్ర శస్త్రములతో, త్రిమూర్తులు, ముగురమ్మల శక్తి సంహితయై కాళరూపిణియై మహిషుని సంహరించే దుర్గగా రోమాంచకముగా నర్తించింది. ముగింపుగా మహిషాసుర మర్దన స్తోత్రం సామూహిక నృత్యంగా ప్రదర్శించబడింది.

మొత్తం ప్రదర్శనలో ప్రతి కదలికలోనూ కళాకారిణి ఆత్మ స్థైర్యంతో భక్తితో దేవీమహాత్మ్యాన్ని ప్రేక్షకుల మనసుల్లో నిలిపింది. సభ కరతాళ ధ్వనులతో మారుమ్రోగింది. ఉత్సవ నిర్వాహకులు కళాకారిణిని అభినందిస్తూ "శ్రీమతి కాత్యాయని నేడు మనకు దుర్గమ్మ అంటే ఇలా ఉంటుంది అన్న భావనను కలిగించారు. నాట్య ప్రతిభే కాకుండా సాహిత్యంలో లీనమై ఆయా రూపాలను భావ సౌందర్యంతో ప్రదర్శించారు. అలాగే బాలా త్రిపుర సుందరిగా కుమారి సర్వజ్ఞ ఎంతో సుందరమైన ప్రదర్శన ఇచ్చింది. వారికి మన కనకదుర్గమ్మ ఆశీస్సులు ఎప్పుడూ ఉణ్డాలి. దేవస్థానం పక్షాన వారికి శుభాకాంక్షలు మరియు కృతజ్ఞతలు" అని పలికారు. తరువాత కాత్యాయని మాట్లాడింది.

"నేను చిన్నప్పటినుండీ నాట్య సంగీత శాస్త్రాల అభ్యసించేటప్పుడు దేవీ తత్త్వమంతే ఇష్టపడే దాన్ని. కానీ, నిజ జీవితానికి వచ్చేసరి నా వ్యక్తిత్వ వికాసంలో ఆ తత్త్వాన్ని పూర్తిగా అమలుపరచలేకపోయాను. నా జీవితంలో పెళ్లి అనేది ఒక పీడకలగా మిగిల్చింది నాలోని భయం. ఓర్పుగా ఉంటే సమస్య పరిష్కారం అవుతుందని భావించాను. కానీ, ఈ నాటి సమాజంలో ఉన్న మృగాళ్ల పాలిటి కావలసింది ఓర్పు కాదు. ధైర్యం, సాహసం, జీవితం పట్ల సకారాత్మకమైన ధోరణి. ఈ విషయాన్ని నా నిస్సహాయ స్థితిలో మా అత్తగారు నాకు తెలియజేశారు. కన్నబిడ్డ అన్న మమకారాన్ని వదలి ఆవిడ నన్ను స్త్రీగా గౌరవించి, కఠినమైన నిర్ణయం తీసుకొని నన్ను ముందుకు నడిపించారు. ఇది నాకు నిజంగా విజయదశమి. నిర్భయ రూపాన్ని నేను మా అత్తగారిలో చూశాను. నేటి సమాజంలో స్త్రీల పట్ల హింస అత్యాచారాలు స్త్రీ తన శక్తిని గ్రహించకపోవటం వలన పేట్రేగిపోతున్నాయి. ప్రతి స్త్రీ తన కాళ్లమీద తాను నిలబడి సమస్యను ఎదుర్కుంటే మృగంలాంటి మగవాడు వెనుకంజ వేస్తాడు. శారీరికంగా మగవాడు బలవంతుడైన మన మనసు గట్టిగా ఉంటే ఆతని శరీరబలాన్ని తప్పక జయించగలం. మన ఆడపిల్లలకు ఓర్పు, సహనం, శాంతం, ప్రేమలతో పాటు ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలి. నా ఈ విజయదశమి ప్రదర్శనకు స్ఫూర్తి మా అత్తగారు. ఆవిడలోని ఆదిపరాశక్తిక్తి నా నమస్కారాలు. అత్తగారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను." అని చెప్పింది. అందరూ ఉత్సాహంగా చప్పట్లు కొట్టారు. స్త్రీలు ఆనందబాష్పాలు రాల్చారు. వారందరికీ తెలియని ప్రేరణ కలిగింది.

సుబ్బమ్మ వేదికపైకి వచ్చి "స్త్రీని అబల చేసింది స్త్రీయే. సమాజం ఏమనుకుంటుందో, భర్తను వదిలితే సమాజం అవహేళన చేస్తుంది, తోడు లేకుండా ఎలా జీవించటం, ఆడదంటే అన్నీ భరించాలి...ఇవన్నీ మనం తరతరాలుగా వింటున్నవే. శారీరికంగా స్త్రీపురుషుల బలాలలో తేడా ఉండవచ్చు. కానీ, సాటి స్త్రీని ఒక మగవాడు హింసిస్తుంటే చూస్తూ ఊరుకోవటం ఈ సమాజం చేసే పెద్ద తప్పు. ఆ సమస్య రేపు మనింట్లోనే వస్తే అని ఎప్పుడైనా ఆలోచించారా? ఆడపిల్లలకు చిన్నపటినుండీ పరిస్థితులను ఎదుర్కొనగలిగే ఆత్మస్థైర్యం ఇస్తే వారు అపారమైన శక్తివంతులవుతారు. సమాజం వారి మేధో సంపత్తిని, సుగుణాలను మరింత ప్రభావవంతంగా ఉపయోగించుకోగలదు. ఆడపిల్లల రక్షణకు వారిలో ఆత్మస్థైర్యం ఎంతో ముఖ్యం. వీగిపోయే మనస్తత్వాలను పిల్ల్లకు ఇవ్వకూడదు. నా కొడుకు రాక్షసుడు. ఒక స్త్రీని వాడు పెడుతున్న బాధలు చూసి నాలో ఎంతో అంతర్మథనం జరిగింది. రక్తసంబంధం కన్నా నా ధర్మం ముఖ్యం అనుకున్నాను. నేను చేసినదానికి వాడు నన్ను జీవితాంతం అసహ్యించుకోవచ్చు. కానీ, ఒక స్త్రీకి తోడుగా నిలబడ్డాను అన్న తృప్తి నాకు చాలు. ధన్యవాదాలు".

ఆ రోజు గుడిలో అమ్మ వారి విగ్రహంతో పాటు, నలుగురు ఆది పరాశక్తుల రూపాలు కనిపించాయి. వెనుదిరిగి ఇంటికి వెళుతున్నపుడు ప్రతి వ్యక్తిలోనూ అంతర్మథనం మొదలయ్యింది. ఆడపిల్లలను ఎలా పెంచాలి అని కొందరు, కోడలిని ఎలా గౌరవించాలి అని కొందరు, భార్యను ఎలా చూసుకోవలి అని కొందరు...దిద్దుబాటు దారిలో పడ్డారు. అదే కదా ఆధ్యాత్మికత ఉద్దేశం?


5, అక్టోబర్ 2015, సోమవారం

కేయూరాణి న భూషయంతి పురుషం - వాగ్భూషణమే సుభూషణము



నీతి శతకాన్ని మొదట సంస్కృతంలో భర్తృహరి రచించితే దానిని కొందరు కవులు తెలుగులోకి అనువదించే ప్రయత్నం చేశారు. అందులో ఏనుగు లక్ష్మణ కవి ప్రసిద్ధులు. 20వ శతాబ్దం ఆరంభానికి చెందిన ఏనుగు లక్ష్మణ కవి ఈ సుభాషితాలను మూలాన్ని సంపూర్ణంగా ప్రతిబింబించేలా అనువదించారు. భర్తృహరి సుభాషితాలలో నాకిష్టమైనది కేయూరాణి న భూషయంతి అనే శ్లోకం. నేను ఇంటర్మీడియేట్ చదువుతున్నప్పుడు సంస్కృతము రెండవ భాష. దానిలో భాగంగా సుభాషితాని అని ఒక పాఠ్యాంశం ఉండేది. దాదాపు ఇరవైఏళ్ల క్రితం చదివింది. బాగా మనసులో పాతుకు పోయింది.

సంస్కృత మూలం:

కేయూరాణి న భూషయంతి పురుషం  హారాః న చంద్రోజ్జ్వలాః
న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా
వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే
క్షీయంతేऽఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం

దీనిని ఏనుగు లక్ష్మణకవి గారు తెలుగులో ఉత్పలమాలగా ఆవిష్కరించారు:

భూషలు గావు మర్త్యులకు భూరిమయాంగద తార హారముల్
భూషిత కేశ పాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్
భూషలు గావు పురుషుని భూషితు జేయు పవిత్రవాణి వా
గ్భూషణమే సుభూషణము భూషణముల్ నశియించు నన్నియున్

అర్థం:

చేతులకు ఆభరణాలు (భుజకీర్తులు), మెరిసే హారములు, అలంకరించబడిన కేశములు, పుష్పములు, సుగంధ జలములతో స్నానములు మనిషికి నిజమైన ఆభరణములు కావు. అతని పవిత్రమైన మాటలే నిజమైన అలంకారము, అదే అత్యుత్తమైనది. మిగిలినవన్నీ నశించును, కాని మనిషి యొక్క మంచి వాక్కు మాత్రం ఎప్పటికీ నిలుస్తుంది.

వివరణ:

సుభాషితాలు మానవుని జీవన విధానానికి మార్గదర్శకాలు. మనసు దారి తప్పకుండా ఉంచే కాపలాదార్లు. ఈ సుభాషితం నేటి సమాజానికి ఎంత ఉపయోగకరమో ఆలోచించండి. చక్కగా దుస్తులు వేసుకొని అలంకరించుకున్న పిల్లలను, పెద్దలను చూస్తున్నాము, కానీ వారు నోరు విప్పితే? చెప్పనక్కరలేదు. ఎన్నో డిగ్రీలు పొందిన ఉపాధ్యాయులు, ఉపన్యాసకులు ఉన్నారు. కనీ, వారు బోధించేది? చెప్పనలవి కాదు. ఎంతో పేరుపొంది, ఎంతో సంపాదిస్తున్న తల్లిదండ్రులున్నారు. కానీ వారు నోరు విప్పితే? శమదమాది గుణములే కరువు. అరిషడ్వర్గాలే మెండు. రోజుకో స్వామి, ఒక సంస్థ, డబ్బులు, నగలు, వంధిమాగధ గణం, ఆర్భాటాలు మొదలైనవి సనాతన ధర్మానికి ఎంత చెడ్డ పేరు తెస్తున్నాయో. కారణం? అసలు విషయంపై దృష్టిలేకపోవటం. చెప్పే మాట నలుగురినీ ఆలోచింపజేయాలి. అది లేకుండా ఎన్ని హంగులుంటే ఏమి ఉపయోగం? అలాగే రాజకీయ నేతలు, ప్రజలు కూడా.

మంచి మాట మన నోట రావాలంటే దాని గురించి ఎంతో సాధన జరిగి ఉండాలి. మంచికి మూలం అంతర్ముఖం కావటం. దానిలో మన ప్రశ్నలకు సమాధానం దొరకటం. ఒకవేళ ఏదైనా పుస్తకం చూసి నాలుగు మాటలు చెప్పగలిగినా, ఐదో మాటలో స్పష్టత లోపించి అది ఒక తత్త్వంగా ఆవిష్కరించబడదు. అందుకే మన మాటలు మన వ్యక్తిత్వానికి, మన ఆత్మశుద్ధికి ప్రతిబింబాలు. అందుకే త్రికరణములుగా చెప్పబడిన మనస్సు, వాక్కు, కర్మలలో వాక్కు మధ్యది. త్రికరణ శుద్ధి అంటే ముందు మనశ్శుద్ధి ఉండాలి. అది కలిగినప్పుడు వాక్శుద్ధి కలుగుతుంది. ఈ రెండూ ఉన్నప్పుడు కర్మలో నిర్మలత్వం తప్పకుండా ప్రస్ఫుటమవుతుంది. త్రికరణ శుద్ధిగా చేసేది ప్రతిదీ పరమాత్మ స్వీకరిస్తాడు. కాబట్టి మనం త్రికరణ శుద్ధితో చేసేవే మనకు నిజమైన ఆభరణాలు అని ఈ శ్లోకం సూచిస్తుంది.

సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం - ప్రతి విషయంలోనూ మనకు శాశ్వతము అశాశ్వతముల మధ్య తేడాను స్పష్టంగా తెలిపి శాశ్వతమువైపు మనలను నడిపించటం. ఆత్మ-దేహము, అంతఃకరణ శుద్ధి-ఆభరణములు, విద్యా వినయ సద్గుణములు- ధన కనక వస్తు వాహనాది సంపదలు...ఇలా ప్రతి అడుగులోనూ మనకు శాశ్వతమైన వాటి గురించి గుర్తు చేస్తుంది సనాతన ధర్మం. భర్తృహరి నీతి శతకం కూడా సనాతన ధర్మంలో ఈ కోవకు చెందినవే.

సనాతన ధర్మం పాటించినంత కాలమూ సుభాషితాలు,శతకాలు మొదలైనవి మన విద్యాభ్యాసంలో ముఖ్యమైన స్థానం కలిగి ఉండేవి. ఎప్పుడైతే చదువులు ఉద్యోగాల నిమిత్తం సనాతన ధర్మా సాంప్రదాయానికి దూరమయ్యాయో అప్పటినుండీ మన సమాజంలో వ్యక్తిత్వ వికాసంపై దృష్టి లేదు. అందుకే నేటి సమాజంలో మనుషులలో విలువలు తక్కువగా కనిపిస్తాయి. పెద్దబాలశిక్షను చూస్తే అందులో వ్యక్తిత్వవికాసం ఎంత అద్భుతంగా ఒక ప్రణాలికగా పిల్లలకు నేర్పబడేదో అర్థమవుతుంది. ఒకప్పుడు ప్రాథమిక విద్య అంటే పెద్దబాలశిక్ష మాత్రమే. ఇప్పుడు అలాగే ఉండాలని కాదు. ఆ అంశాలు వేర్వేరు సబ్జెక్టులలో పాఠ్యాంశాలుగా తప్పకుండా ఉండాలి. కొంతవరకు ఉన్నాయి, కానీ వాటిని ఐచ్ఛికం చేసి, వాటికి సరైన ప్రాధాన్యత ఇవ్వకుండా చేశాయి నేటి విద్యావ్యవస్థలు. కనీసం తల్లిదండ్రులైనా పిల్లలకు సుభాషితాలు, శతకాలు నేర్పిస్తే పిల్లలకు దృఢమైన, నిశ్చలమైన, నిర్మలమైన వ్యక్తిత్వం అలవరుతుంది.

నీతి, నిజాయితీ, నిర్మలత్వం, క్రమశిక్షణ ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నవే. వీటిని మన ధర్మంలో చెప్పినంత చక్కగా ఎక్కడా చెప్పబడలేదు. మన స్మృతి శ్రుతి పురాణములలో చెప్పినంత వివరంగా ఎక్కడా తెలుపబడలేదు. మన ధర్మంలో వీటిని ఉదహరించినంత మరెక్కడా జరుగలేదు. మన గురువులు దీనిపై చూపినంత ధ్యాస ఇంకే విద్యావ్యవస్థలోనూ చూపలేదు. ఒక నీతివంతుడైన మగవాడు, ఒక క్రమశిక్షణ కలిగిన మగవాడు నేటి సమాజంలో బహు అరుదు. కారణం? జీవనోపాధి పేరిట మన మూలాలు ఇచ్చిన దారిని తప్పి ఇంకో దారి పట్టాము. పూర్తిగా ఆ మూల దారులు కనుమరుగు కాక మునుపే మనం వాటిని కాపాడుకొని పునరుద్ధరించాలి. దానికి ఇంట్లో తల్లిదండ్రులు-పిల్లల మధ్య అంకురార్పణ కావాలి. 

2, అక్టోబర్ 2015, శుక్రవారం

వేణుగానం - సిక్కిల్ నీల కుంజుమణి సోదరీమణులు



ముదితల్ నేర్వగరాని విద్యగలదే ముద్దార నేర్పింపగన్ అని ఒక కవి ఎప్పుడో అన్నాడు. అది ఆనాటి కాలమాన పరిస్థితులను బట్టి చెప్పబడింది. ఈనాడు ఎంతో ఓర్పుతో, శ్రమతో, పట్టుదలతో స్త్రీలు కష్టతరమైన విద్యలలో రాణించి దేశవిదేశాలలో పేరు ప్రఖ్యాతులు పొందుతున్నారు. వారు నేర్వలేని విద్యలేదు, చేయలేని వృత్తి లేదు. అటువంటి కష్టతరమైనదే వేణుగానం. ఈ వేణుగానం ఎవ్వరికైనా నేర్వటానికి కష్టమే ఎందుకంటే ఇది పూర్తిగా ఊపిరికి సంబంధించిన కళ. శ్వాసపై పూర్తి పట్టు ఉంటేనే ఈ విద్య అబ్బుతుంది. అంతేకాదు, వేణువు ఋతువునుబట్టి సంకోచ వ్యాకోచాలు చెంది శబ్దం మారుతూ ఉంటుంది. కళాకారులు నిరంతరం వేణువు ధ్వనితో సమన్వయం అయితేనే దానిలో స్వరాలను పలికించగలరు. అటువంటి కళను నేర్చుకొని దశాబ్దాలపాటు కళాపిపాసకులను రంజించినవారు సిక్కిల్ నీల కుంజుమణి సోదరీమణులు.

తమిళనాడు కళలకు, దేవాలయములకు, సాంప్రదాయానికి ప్రసిద్ధి. అక్కడి ప్రజల జీవితంలో ఇవి అంతర్భాగం. అలాగే సమాజం, ప్రభుత్వాలు కూడా వీటిని నిలబెట్టి అభివృద్ధికి తోడ్పడ్డాయి. అందుకే అక్కడ కళలు ఇంకా అలరారుతున్నాయి. ఈ కళలకు పుట్టిల్లు తంజావూరు. సంగీత త్రయమైన త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి ఇక్కడ జన్మించిన వారే. అక్కడి ప్రకృతిలో, జీవనాడిలో కళలు నిండి ఉన్నాయి. ఆ తంజావూరు జిల్లాలోనే సిక్కిల్ అనే గ్రామంలో అళియూర్ శ్రి నటేశ అయ్యర్ అనే ప్రఖ్యాత మృదంగ విద్వాంసుని ఇంట 1930లో కుంజుమణి, 1940లో నీల జన్మించారు. వీరి పెదనాన్నగారైన శ్రీ అళియూర్ నారాయణస్వామి అయ్యర్ వేణుగాన విద్వాంసుడు. ఆయన స్ఫూర్తితో కుంజుమణి చిన్ననాటినుండే వేణుగానంపై ఆసక్తి పెంచుకున్నారు. ఆయన కూడా కుంజుమణిలో ఉన్న ఆసక్తిని ప్రోత్సహించారు. మృదంగ విద్వాంసుడు కావడంతో లయజ్ఞానాన్ని కుంజుమణికి అందజేశారు. చిన్న వయసులోనే కుంజుమణి రాగాలను గుర్తు పట్టేవారు. తన పదవ ఏట కుంజుమణి తన మొదటి కచేరీని నాగూరులో రాధా కల్యాణం సందర్భంగా తండ్రి కోరికపై చేశారు. అప్పటినుండీ దేవాలయ ఉత్సవాలలో కచేరీలు, తరువాత తంజావురు మొదలైన ప్రాంతాలలో కచేరీలు చేశారు కుంజుమణి.

పదేళ్ల వయస్సు తేడా ఉండటంతో అక్క కుంజుమణిని చూసి, అక్క వద్ద వేణువు నీర్చుకోవటం మొదలు పెట్టింది నీల. అక్షరాలు కూడా వ్రాయటం రాని వయసులోనే రాగాలను ఆలపించేది నీల. నీల తన ఏడవ ఏడున సిక్కిల్ లోని సింగార వేలవర్ మందిరంలో మొట్ట మొదటి కచేరీని చేసింది. నీల ప్రావీణ్యం పొందిన తరువాత తంజావూరు విశ్వనాథస్వామి దేవాలయంలో మొట్టమొదటిసారిగా అక్కాచెల్లెళ్లు కలిసి కచేరీ చేశారు. ఆ సభలో వారిని ప్రేక్షకులు ఎంతో అభినందించారు, ఆదరించారు.

ఆనాటి సమాజంలో స్త్రీలు వేదిక ఎక్కి పాడటం ధనవంతుల కుటుంబాలలో ప్రోత్సహించేవారు కాదు. అయినా నీల కుంజుమణిల తండ్రి నటేశ అయ్యర్ వీరిని ప్రోత్సహించారు. పదహారవ ఏట వివాహం చేసుకున్న కుంజుమణికి అత్తవారింట తన కళను వృత్తిగా పెంపొందించుకోవటానికి ప్రోత్సాహం లభించలేదు. భర్త వాయుదళంలో పనిచేసేవారు. మొదట్లో ఆయన కూడా కుంజుమణిని ప్రోత్సహించలేదు. తరువాత ఆయన ఉద్యోగ రీత్యా ముంబై తదితర ప్రాంతాలకు వెళ్లి అక్కడ నాగరికతను చూసి భార్య కూడా తన వేణుగానాన్ని ముందుకు కొనసాగించాలని నిర్ణయించుకొని ఆమెను ప్రోత్సహించారు. కొన్నేళ్ల విరామం తరువాత నీలకుంజుమణి సోదరీమణులు చెన్నైలో జంటగా తమ సంగీత ప్రస్థానాన్ని మళ్లీ మొదలు పెట్టారు.

ఇక ఈ అక్కాచెల్లెళ్ల జంట సంగీత ప్రపంచంలో ఎంతో పేరుప్రతిష్ఠలు పొందారు. వీరి ప్రతిభకు గుర్తింపుగా 1973లో కలైమామణి బిరుదు, 1989లో సంగీత నాటక అకాడెమీ పురస్కారం, 1997లో సంగీత కలైశిఖామణి, 2002లో సంగీత కళానిధి, 2004లో భారత ప్రభుత్వం ద్వారా పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. ఎన్నో ఏళ్ల సంగీత సేవ అనంతరం కుంజుమణి గారు 2010లో పరమపదించారు. నీల గారి కుమార్తె మాలా చంద్రశేఖర్ గారు కూడా ప్రఖ్యాత వేణువాద్య కళాకారిణి. తల్లి, పెదతల్లి బాటలో నడిచి ఈ సంగీత సేవను కొనసాగిస్తున్నారు. అలాగే కుంజుమణి గారు మనుమడు గురుచరణ్ అమ్మమ్మల సంగీత ప్రతిభను పుణికిపుచ్చుకొని గాత్ర సేవలో తరిస్తున్నారు. సిక్కిల్ సోదరీమణులు, మాలా చంద్రశేఖర్ గారు కలసి వాయించిన ఒక కృతి చూడండి.

ఎందరో మహానుభావులు అందరికీ వందనములు!