ఆధ్యాత్మిక అంశాలను ప్రాపంచిక వ్యవహారశైలితో పోల్చి వివరించటం త్యాగరాజస్వామి అనేక కృతులలో చేశారు. మానవుడికి ఉండే అనేక వికారాల వల్ల ఏ విధంగా ఆధ్యాత్మిక పురోగతి కలుగదో ఆయన వివరించిన ఒక కృతి నీకే దయరాక. వివరాలు:
నీకే దయ రాక నే జేయు పనులెల్ల నెరవేరునా రామ
యేకోపించక నేను నీవను జ్ఞానికేలాగు సుఖమిచ్చునే ఓ రాఘవా
మనసు నిలవని వారు మాయాజాలము జేసి మరి ముక్తిగొననౌనే
కను సంజ్ఞకు రాని కాంతను బలిమిడి కరమిడ వశమౌనే ఓ రాఘవా
వాడిక లేని విద్యల చేత సభలోన వాదించబోనౌనే
సాడి విన్న మాట మది నిల్పలేని సరసుని వితమౌనే ఓ రాఘవా
మెప్పులకై బహు ధర్మము చేసితే మిగుల బ్రోవ దగునే
తప్పు మాటలు గాదు తారక నామ శ్రీత్యాగరాజుని పైని ఓ రాఘవా
శ్రీరామచంద్రా! నీ దయ లేకుంటే నేను చేసే పనులు సఫలమయ్యేనా! జీవాత్మను పరమాత్మ అయిన నీతో నిజంగా ఏకం చేయక మాట వరుసకు మాత్రమే నేను నీవే యను జ్ఞానికి సుఖమెలా కలుగుతుంది? అనురాగముతో కనుసైగకు మెచ్చని స్త్రీ బలవంతాన చేయిపట్టుకుంటే వశము కాని రీతి మనసును స్థిరపరచుకోలేని వారు మాయాజాలం చేస్తే ముక్తి కలుగుతుందా? విన్న చాడీలు మనసులోనే ఉంచుకోలేని పండితుని వలె కౌశలం లేని విద్యలతో సభలలో వాదించబోయిన ఉపయోగమేమి? మెప్పుల కోసం దానధర్మాలు చేస్తే అవి అనుగ్రహపాత్రమవుతాయా? నేను చెప్పే ఈ మాటలు తప్పు కావు, తారకనామధేయుడవైన శ్రీరామా! త్యాగరాజునిపై దయలేకున్న నేను చేసే పనులు సఫలమయ్యేనా!
-త్యాగరాజస్వామి
నీలాంబరి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని రంజని-గాయత్రి సోదరీమణులు ఆలపించారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి