ఓ రఘువీరా యని నే పిలచిన ఓహో యనరాదా
సారెకు వేసారి నా మది అన్యము చేరదు యేరా ధీరా రామా
నీట జిక్కి కరి మాటికి వేసారి నాటకధర నీ పాటలు పాడగ
మేటి మకరి తల మీటి కాచు దయ యేటికి నాపై నేటికి రాదో
మున్ను సభను ఆపన్నత వేడుచు నిన్ను కృష్ణా యని యెన్నగ ద్రౌపది
కెన్నో వలువలిడి మన్నన బ్రోచిన వెన్నుడ నామొర వింటివో లేదో
బంటునైతినని యుంటే పరాకుననుంటివి ముక్కంటి వినుత నామ
జంట బాయకను వెంటనుండుమని వేడితి భద్రాచల వాసా
రఘువీరా అని నేను పిలిచితే ఓహో అని స్పందించవయ్యా అని ఎంత అందంగా పలికారో రామదాసు. అన్యదైవం యొక్క తలపే లేకుండా స్వామిపై పరిపూర్ణమైన నమ్మకంతో, మకరి బారి నుండి ఆ గజేంద్రుని కాపాడిన దయను తనపై చూపుమని, కురుసభలో ఆపదలో ద్రౌపది కృష్ణా అని వేడుకోగా చీరలిచ్చి మానాన్ని కాపాడిన రీతి తన మొరను వినుమని, నీకు బంటుగా ఉంటానని నిశ్చయించుకుంటే పరాకుగా ఉన్నావు, తోడు వీడకుండా వెంట ఉండమని వేడుకొంటున్నాను అన్నారు రామదాసు గారు. ఈ భద్రాచల రామదాసు కృతిని మల్లాది సోదరులు సామ రాగంలో ఆలపించారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి