19, అక్టోబర్ 2020, సోమవారం

శ్రీరాజరాజేశ్వరీ త్రిపురసుందరీ - ముత్తుస్వామి దీక్షితుల వారు

శ్రీరాజరాజేశ్వరీ త్రిపురసుందరీ శివే పాహిమాం వరదే

నీరజాసనాది పూజితపరే నిఖిల సంశయ హరణ నిపుణతరే

శౌరి విరించాది వినుత సకలే శంకర ప్రాణ వల్లభే కమలే
నిరతిశయ సుఖ ప్రదే నిష్కళే పూర్ణచంద్రికా శీతలే విమలే
పరమాద్వైత బోధితే లలితే ప్రపంచాతీత గురుగుహ మహితే
సురుచిర నవరత్న పీఠస్థే సుఖతర ప్రవృత్తే సుమనస్థే

ఓ రాజరాజేశ్వరీ! త్రిపురసుందరీ! శివానీ! నన్ను రక్షింపుము. నాకు వరములిచ్చే దేవివి నీవే. బ్రహ్మాదులచే పూజించబడే పరదేవతా! సమస్త సంశయములను హరించే నిపుణురాలవు నీవు. నన్ను రక్షింపుము. బ్రహ్మ, విష్ణువులచే నుతించబడిన సర్వాంతర్యామివి, పరమశివునికి ప్రాణనాయకివి, కమలంవలె మనోజ్ఞమైన రూపము కలిగియున్నావు, నిరుపమానమైన ఆనందాన్ని కలిగించేవు, నిష్కళంకవు, పూర్ణచంద్రుని వలె చల్లదనము కల్గించేవు, నిర్మలవు, ఉత్కృష్టమైన అద్వైతాన్ని బోధించే లలితవు, ప్రపంచానికి అతీతమైన ఆదిపరాశక్తివి, సుబ్రహ్మణ్యునిచే నుతించబడేవు, మనోజ్ఞమైన నవరత్న పీఠమున స్థిరమై యున్నావు, సుఖకరమైన అంతఃప్రకృతి కలిగియున్నావు, సహృదయుల మనసులలో స్థిరమై యున్నావు, నన్ను రక్షింపుము. 

పూర్ణచంద్రిక రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని మహారాజపురం సంతానం గారు ఆలపించారు.

17, అక్టోబర్ 2020, శనివారం

కర్మ ఫలం: మహాభారతం: సైంధవుడు


సోదరి సమానయైన ద్రౌపదిని చెరబట్టబోయిన వాడు సైంధవుడు (కౌరవుల సోదరి దుశ్శల భర్త). పాండవులు వానిని నిలువరించి శిక్షిస్తారు. ప్రతీకారంతో తపస్సు చేసి శివుని అనుగ్రహంతో కురుక్షేత్ర సంగ్రామంలో ఒక్కరోజులో అర్జునుని తక్క మిగిలిన పాండవులను జయించే వరమును పొందిన వాడు. పద్మవ్యూహంలోనికి అభిమన్యుడు వెళ్లిన తరువాత అర్జునుడు తక్క మిగిలిన పాండవులు లోనికి రాకుండా వారిని శివుని వరముతో నిలువరించి అభిమన్యుని మరణానికి కారకుడైనాడు. కుమారుని మరణవార్త విని అర్జునుడు సైంధవుని మర్నాడు సూర్యాస్తమయంలోపు చంపుతానని ప్రతిజ్ఞ చేస్తాడు. మరునాడు ద్రోణుడు అర్జునుని బారి నుండి సైంధవుని కాపాడేందుకు అద్భుతమైన ప్రణాలికను రూపొందించాడు. కురుసైన్యాన్ని ఎదుర్కోవటంలోనే అర్జునినికి రోజంతా గడచిపోతుంది. సూర్యాస్తమయం కాబోతోందని గ్రహించి శ్రీకృష్ణుడు మాయతో నల్లని మబ్బులు సృష్టించగా, సూర్యాస్తమయం అయినదని ఏమరపాటు చెందిన సైంధవుని చూచి కృష్ణుడు ఆ మబ్బుని వెంటనే తొలగించగా, సూర్యుడు ఇంకా ఉన్నాడని గ్రహించి అర్జునుడు ఆ సైంధవుని తలను వెంటనే బాణములతో ఛేదిస్తాడు. సైంధవునికి తండ్రి వృద్ధక్షతుడు నుంచి వచ్చిన వరం - సైంధవుని శిరస్సు నేలకూల్చిన వాని శిరస్సు ముక్కలవుతుంది. ఈ విషయం తెలిసిన శ్రీకృష్ణుడు ఆ శిరస్సు ఎక్కడో శమంతపంచకంలో తపస్సు చేసుకుంటున్న వృద్ధక్షత్రుని ఒడిలో పడేలా బాణం వెంట బాణం వేసే పాశుపతాస్త్రాన్ని వేయమని చెబుతాడు. అర్జునుడు అది చేస్తాడు. తన ఒడిలో పడిన శిరస్సును చూసి వృద్ధక్షతుడు దానిని కింద వేయగా ఆయన శిరస్సు కూడ ముక్కలవుతుంది.

ఇక్కడ ఏమిటి దుష్టకర్మలు?

సైంధవుడు:
==========

1. సోదరి సమాన ద్రౌపదిని బలాత్కరించబోవటం

2. తనకు పరమశివుడు అనుగ్రహించినప్పుడు సజ్జనులైన పాండవులపై ప్రతీకార వరం కోరుకోవటం

3. ఆ వరమును బాలుడు, వీరుడు అయిన అభిమన్యుని మరణానికి దుర్వినియోగం చేయటం

వృద్ధక్షతుడు:
===========

1. కుమారుని దుష్టబుద్ధిని సరిచేయకపోవటం

2. కుమారుని మరణానికి కారణమైన వాని శిరస్సు ఛేదం కావాలని దుష్టాలోచనతో వరం పొందటం

దుష్టకర్మల ఫలమేమిటి?
===================

1. ఏమరపాటులో ఉండగా సైంధవుడు వధించబడటం

2. కుమారుని శిరస్సు క్రింద పడవేసి వృద్ధక్షతుడు మరణించటం

తండ్రీకొడుకులు ఒకరి మరణానికి మరొకరు కారకులైనారు. ఇదీ కర్మఫలం యొక్క బలం.

16, అక్టోబర్ 2020, శుక్రవారం

కొనరో కొనరో మీరు కూరిమి మందు - తాళ్లపాక అన్నమాచార్యుల వారు


 

కొనరో కొనరో మీరు కూరిమి మందు ఉనికిమనికికెల్ల ఒక్కటే మందు

ధ్రువుడు కొనిన మందు తొల్లి ప్రహ్లాదుడు చవిగా గొనిన మందు చల్లని మందు
భవ రోగములు వీడి పారగ పెద్దలు మున్ను జవ కట్టుకొనిన నిచ్చలమైన మందు

నిలిచి నారదుడు గొనిన మందు జనకుడు గెలుపుతోగొని బ్రతికిన ఈ మందు
మొలచి నాలుగు యుగముల రాజులు ఘనులు కలకాలముగొని కడగన్న మందు

అజునకు పరమాయువై యొసగిన మందు నిజమై లోకమెల్ల నిండిన మందు
త్రిజగములు నేరుగా తిరువేంకటాద్రిపై ధ్వజమెత్తే కోనేటి దరినున్న మందు

ఓ జనులారా! మన ఉనికికి, జీవనానికి ఏకైక ఔషధమైన పరమాత్ముడనే శ్రేయమును సంపాదించుకొనండి. ధ్రువుడు సంపాదించుకున్నది, ప్రహ్లాదుడు చవి చూసినది ఈ చల్లని ఔషధము. భవరోగములను తొలగించుకొనుటకు ఇంతకు మునుపు శ్రేష్ఠులు మూటగట్టుకున్న నిశ్చమైన మందు ఇది. నారదుడు కొలిచి సంపాదించుకున్నది, శివధనుర్భంగముతో జనకమహారాజు పొంది తనను తాను ఉద్ధరించుకునేలా చేసిన మందు ఇది, నాలుగు యుగములలోనూ అనేకులైన రాజులు, గొప్పవారు ఎంతో కాలము సాధన చేసి ముక్తిని పొందేలా చేసింది ఈ మందు. బ్రహ్మదేవునకు ప్రాణవాయువైనది ఈ మందు, లోకమెల్లా నిండిన సత్యమనెడిది, ముల్లోకాల అభ్యున్నతికై శ్రీవేంకటాద్రిపై కోనేటి సమీపమున వెలసిన శ్రీనివాసుడనే మందు ఇది, దానిని సంపాదించుకొనండి. 

మోహన రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని మల్లాది సోదరులు గానం చేశారు. 

12, అక్టోబర్ 2020, సోమవారం

రమా రమణ రారా - సద్గురువులు త్యాగరాజస్వామి

రమా రమణ రారా! ఓ రమా రమణ రారా!

సమానమెవరు వినుమా నా మనవిని తమాము పొగడ తరమా అహిపతికిని

బుధాద్యవన దశరథార్భక మనోరథంబొసగు సుమరథార్హ సద్గుణ

కలార్ధభూష సకలార్ధ శశధరకళాధరనుత వికలార్తి సంహర

రణాదిశూర శరణాగతాత్మచరణంబు భవతారణంబు చేసిన

ముఖాబ్జమును శత ముఖారి జూపు సముఖాన గొలుతు దుర్ముఖాసుర హరణ

బిరాన బ్రోవగ రాదా శ్రీమదగరాజధర త్యాగరాజ సన్నుత!

ఓ సీతాపతీ! వేగమే నన్ను బ్రోవగా రారా! నీ సమానమెవరు రామా! నా మనవిని వినుము. నిన్ను పరిపూర్ణముగా పొగడుటకు ఆదిశేషునికైనా తరమా! బుధజనులను రక్షించే దశరథ కుమారా! పుష్పకవిమానమును అధిరోహించిన సద్గుణ సంపన్నా! నా మనోభీష్టమును నెరవేర్చుము, వేగమే నన్ను బ్రోవగా రారా!  సకల విద్యా పారంగతుడవు, సమస్త కళలకు అర్థము, ధ్యేయము నీవే. చంద్రకళాధరుడైన శివునిచే నుతించబడినవాడవు, దీనుల ఆర్తిని సంహరించే వాడవు, వేగమే నన్ను బ్రోవగా రారా!. యుద్ధరంగములో శూరుడవు, శరణాగతుల క్లేశములను తొలగించి భవసాగర తారణం చేసిన వాడవు, శతముఖుడైన రావణుని శత్రువువు, దుర్ముఖాసురుని సంహరించినవాడవు నీవు నిన్ను ప్రత్యక్షముగా కొలిచెదను నీ ముఖకమలమును చూపుము, వేగమే నన్ను బ్రోవగా రారా! . శ్రీరామా! మందర పర్వతమును ధరించినవాడవు, పరమశివునిచే నుతించబడిన వాడవు, నన్ను వేగమే బ్రోవగా రారాదా!

సద్గురువులు ఈ కృతిని శంకరాభరణం రాగంలో స్వరపరచారు

10, అక్టోబర్ 2020, శనివారం

కాలహరణమేలరా హరే - సద్గురువులు త్యాగరాజస్వామి

కాలహరణమేలరా హరే! సీతా రామ!

కాలహరణమేల సుగుణజాల కరుణాలవాల

చుట్టి చుట్టి పక్షులెల్ల చెట్టు వెదకు రీతి భువిని
పుట్టగానే నీ పదముల బట్టు కొన్న నన్ను బ్రోవ

పొడవున ఎంతాడు కొన్న భూమిని త్యాగంబు రీతి
కడు వేల్పుల మున్న నీవు గాక యెవరు నన్ను బ్రోవ

దిన దినమును తిరిగి తిరిగి దిక్కు లేక శరణు జొచ్చి
తనువు ధనము నీదే యంటి త్యాగరాజ వినుత రామ 

సుగుణములకు నెలవైన, కరుణానిధివైన ఓ హరీ! సీతారామా! నన్ను బ్రోచుటకు జాప్యమెందుకు? ప్రపంచమంతా తిరిగి తిరిగి పక్షులన్నీ చెట్టును వెదకి చేరిన రీతి, ఈ భూమిపై పుట్టగానే నీ పాదములను పట్టుకొని శరణు కోరాను. నన్ను బ్రోచుటకు జాప్యమెందుకు? ఈ భూమిలో ఎంత నిడివిగా పొగిడినా పొగిడించుకుంటారు, కానీ సహాయం చేసే సమయానికి వట్టి చేతులే చూపిస్తారు. ఆ విధంగానే మిగిలిన దేవతలందరూ నా చేత నుతించబడటం తప్ప నాకు వరములీయరు. కాబట్టి నీవు తప్ప నన్ను బ్రోచుటకు వేరెవ్వరు లేరు, జాప్యము వలదు. ప్రతి రోజు తిరిగి తిరిగి దిక్కులేక నీ శరణు కోరాను. ఈ దేహము, ధనము అన్నీ నీకై అనుకొన్నాను. నన్ను బ్రోచుటకు జాప్యము ఎందుకు? 

శుద్ధ సావేరి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని బాలమురళీకృష్ణ గారు ఆలపించారు.

4, అక్టోబర్ 2020, ఆదివారం

మరలి మరలి జయ మంగళము - తాళ్లపాక అన్నమాచార్యుల వారు

అన్నమాచార్యుల వారి సంకీర్తనలలో ఎన్నో మంగళహారతులు కూడా ఉన్నాయి. వాటిలో మరలి మరలి జయ మంగళము ఒకటి. మధ్యమావతి రాగంలో కూర్చబడిన ఈ కృతిని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు ఆలపించారు

మరలి మరలి జయ మంగళము సొరిది నిచ్చలును శుభ మంగళము 

కమలా రమణికి కమలాక్షునకును మమతల జయ జయ మంగళము
అమర జననికిని అమర వంద్యునకు సుముహూర్తముతో శుభ మంగళము 

జలధి కన్యకును జలధి శాయికిని మలయుచు శుభ మంగళము
కలిమి కాంతకు ఆ కలికి విభునికిని సుళువుల హారతి శుభమంగళము

చిత్తజు తల్లికి శ్రీవేంకటపతికి మత్తిల్లిన జయ మంగళము
ఇత్తలనత్తల ఇరువుర కౌగిటి జొత్తుల రతులకు శుభ మంగళము

మళ్లీ మళ్లీ నిశ్చయమైన వరుసలో శ్రీనివాసునికి, పద్మావతికి శుభ మంగళము. కమలమునందు స్థిరమైన లక్ష్మీదేవికి, కమలముల వంటి కన్నులు కలిగిన స్వామికి మమతలతో కూడిన జయ మంగళము. దేవతలకు మాతయైన లక్ష్మీదేవికి, దేవతలచే నుతించబడే స్వామికి సుముహూర్త సమయమున శుభ మంగళము. సముద్రుని కుమార్తె అయిన లక్ష్మీదేవికి, క్షీరాబ్ధిలో శయనించే శ్రీహరికి తిరుగుచు మంగళము. ఐశ్వర్యములకు దేవతయైన లక్ష్మీదేవికి, ఆమెకు పతియైన స్వామికి సుళువైన హారతులతో శుభ మంగళము. మన్మథునికి తల్లి అయిన లక్ష్మీదేవికి, శ్రీవేంకటేశ్వరునికి మత్తుగొనేలా జయ మంగళము. ఇరుప్రక్కల శ్రీదేవి భూదేవితో కౌగిట అనురాగములొలికించే స్వామికి ఆ దేవులతో కూడి శుభ మంగళము కలుగుగాక.