27, జులై 2015, సోమవారం

సీతమ్మ హనుమను ప్రశంసించుట - సుందరకాండ 36వ సర్గ

 సీతమ్మ హనుమను ప్రశంసించుట - సుందరకాండ 36వ సర్గ

విక్రాంతః త్వం సమర్థః త్వం ప్రాజ్ఞః త్వం వానరోత్తమ
యేనైదం రాక్షస పదం త్వయా ఏకేన ప్రధర్షితం

శత యోజన విస్తీర్ణః సాగరో మకరాలయః
విక్రమ శ్లాఘనీయేన క్రమతా గొష్పదీకృతః

న హి త్వాం ప్రాకృతం మన్యే వానరం వానరర్షభ
యస్య తే నాస్తి సంత్రాసో రావణాన్ నాపి సంభ్రమః

అర్హసే చ కపి శ్రేష్ఠ మయా సమభిభాషితుం
యద్యసి ప్రేషితస్తేన రామేణ విదితాత్మనా

ప్రేషయిష్యతి దుర్ధర్షో రామో న హి అపరీక్షితం
పరాక్రమం అవిజ్ఞాయ మత్సకాశం విశేషతః

"వానరోత్తముడవైన హనుమా! నీవు వీరుడవు, సమర్థుడవు, తెలివైన వాడవు. నీవొక్కడివే ఈ రాక్షసులతో నిండిన లంకను గెలిచావు! నీ పొగడదగిన పరాక్రమముతో క్రూరమైన మొసళ్లున్న శతయోజనముల వెడల్పు గల సాగరాన్ని ఒక మడుగును దాటినట్లు దాటావు. ఓ వానర శ్రేష్ఠుడా! నీకు రావణుని చూచిన భయము కానీ, ఆశ్చర్యము కానీ కలుగలేదు. నీవు సామాన్యమైన వానరానివి కావు! ఓ కపిశ్రేష్ఠుడా! ఆత్మజ్ఞానియైన రాముడు నిన్ను పంపినాడు కావున నీవు నాతో ఉచితమైన మాటలు పలుకుటకు అర్హుడవు. అజేయుడైన రాముడు నిన్ను పరీక్షించకుండా, నీ శౌర్యపరాక్రమాలు తెలియకుండా నిన్ను ఇక్కడికి పంపి ఉండడు."

అశోకవనంలో సీతమ్మ హనుమంతుడు రాముడిచ్చిన అంగుళీయకమునిచ్చి, ఆయన సందేశాన్ని తెలిపిన తరువాత సంతోషముతో అన్న మాటలు. అమ్మ మాటలలో అంతరార్థం ఎంతో ఉంది.

1. వచ్చిన హనుమను కార్యసాధన చేసినందుకు అభినందించటం, అతనిలోని గొప్ప లక్షణాలను ప్రస్తావించటం ద్వారా మనకు అతని దివ్యత్వాన్ని, మహత్తును తెలియజేయటం
2. ఆ కార్యసిధ్ధి వెనుక రాముని అనుగ్రహం, రాముని పట్ల హనుమకు గల భక్తిని మనకు గుర్తు చేయటం
3. రాముడు ఈ కార్యానికి హనుమను ఎన్నుకోవటానికి గల కారణాన్ని చెప్పటం
4. తాను హనుమను నమ్మాను అని అతనితో సంభాషణ జరుపుటకు సమ్మతి తెలుపటం
5. రాముని నిర్ణయం, ఆలోచన, పద్ధతిపై సంపూర్ణమైన విశ్వాసాన్ని మనకు చెప్పటం

అందుకే రామాయణం గొప్ప మనస్తత్త్వ శాస్త్ర నిధి. సమయానుకూలంగా ఎలా వ్యవహరించాలో, మాట్లాడాలో తెలియజేసే మహాకావ్యం ఇది. 

25, జులై 2015, శనివారం

నర్తనశాల - సలలిత రాగ సుధారస సారం

నర్తనశాల - సలలిత రాగ సుధారస సారం


సలలిత రాగ సుధారస సారం
సర్వ కళామయ నాట్య విలాసం

మంజుల సౌరభ సుమ కుంజముల
రంజిలు మధుకర మృదు ఝుంకారం

కల్పనలో ఊహించిన హొయలు
శిల్ప మనోహర రూపమునొంది
పదకరణముల మృదుభంగిమల
ముదమార లయమీరు నటనాల సాగే

ఝణణ ఝణణ ఝణ నూపుర నాదం భువిలో దివిలో రవళింపగా
నాట్యము సలిపే నటరాయని ఆనంద లీలా వినోదమే

భావ సంపద, భాషా సౌందర్యం, సంగీత పుష్టి కలిగిన గీతాలు తెలుగు సినీ చరిత్రలోని స్వర్ణయుగం అయిన 1950 మరియు 1960 దశకాలలో వచ్చిన చలనచిత్రాలలో పుష్కలంగా కనిపించేవి. కళారాధకులు, కళాపోషకులు, విరించి ముఖమునుండి వెలువడ్డారా అనిపించే సాహితీకారులు, నాదబ్రహ్మ పుత్రులా అనిపించే సంగీతకారులు, గంధర్వ గాయనీ గాయకులు, సురలోక నృత్యాలను తలపించే నృత్యదర్శకులు, పాత్రలలో జీవించే నటులు, విశ్వకర్మను తలపింపజేసే కళాదర్శకులు...ఇలా చిత్రనిర్మాణంలో అణువణువు పరిపూర్ణమైన ప్రజ్ఞను కనబరచిన రోజులువి. భావదారిద్ర్యానికి తావులేనందున చిత్రాలు కళాఖండాలుగా ఎన్ని దశాబ్దాలైనా ప్రజల హృదయాలలో నిలిచాయి. దీనికి అనుగుణంగా దర్శకులు, నిర్మాతలు కూడా ఎక్కడా రాజీపడలేదు. అందుకే ఆ చిత్రాలు అజరామరమైనాయి.

అటువంటి ఒక మేటి చిత్రం 1963లో విడుదలైన నర్తనశాల చలనచిత్రం. మహాభారతంలోని విరాటపర్వం ఈ చిత్రానికి సందర్భం. అరణ్యవాం ముగిసిన తరువాత అజ్ఞాతవాసం ఎక్కడ గడపాలి అన్న మీమాంసలో ఉన్నప్పుడు విరాటరాజు కొలువు సరైనదని ధర్మరాజు నిర్ణయిస్తాడు. వారి నిజరూపాలు తెలియకుండా వారు విరటుని కొలువులో వేర్వేరు వేషాలలో చేరతారు. పూర్వం దేవకన్య శాపాన్ని సద్వినియోగం చేసుకుంటూ సవ్యసాచి,విజయుడు,కిరీటి, శ్వేతవాహనుడు, భీభత్సుడు మొదలైన దశనామములు కలిగిన అర్జునుడు పేడివాని రూపంలో బృహన్నల నామంతో విరాటుని కుమార్తెకు నాట్యాచార్యునిగా చేరతాడు. ఆ సన్నివేశం ఈ సలిలత సుధారస సారం అనే గీతం యొక్క నేపథ్యం.

సముద్రాల రాఘవాచార్యుల వారి గీతాలు సహిత్యంలో లాలిత్యానికి, పద సంపదకు ఆలవాలం. ఈ గీతం సర్వలక్షణ సంపన్నమై సంగీత నాట్య రసాలను అద్భుతమైన ఉపమానములతో అలంకార విశేషణములతో ప్రకాశిస్తుంది.

నాట్యాభినయం లాలిత్యము కూడిన అమృత రస సారమై, సమస్త కళలకు ఆలవలం. మృదువైన, సువాసనలను విరజిమ్మే పూ పొదరిల్లు  నాట్యము.

కల్పనలో ఊహించబడిన సొగసులు అందమైన శిల్పరూపమును పొంది పదవిన్యాసముతో, మృదువైన భంగిమలతో, ఆనందాన్ని కలిగిస్తూ లయబద్ధంగా సాగే నాట్యాభినయం అమృత రస సారమై, సమస్త కళలకు ఆలవలం.

కాలి అందెల ఝణణ ఝణణ అనే శబ్దము దివిలో భూమిపై రవళించగా నాట్యము చేసే పరమశివుని ఆనందమయమైన లీలా వినోదమే లాలిత్యము కూడిన అమృత రస సారమై, సమస్త కళలకు ఆలవలమైన నాట్యాభినయం.



కళకు పరమావధి రసాస్వాదన. ఆ రసాస్వాదన పరమాత్మకు సమర్పించబడితే ఆ కళ సార్థకమవుతుంది. నాట్య కళకు ఒక ప్రత్యేకత ఉంది. దీనిలో అనేక కళలు ఇంద్రధనుసులో రంగులలా అందంగా ఒదిగి పరమాత్మ అద్భుతమైన సృష్టికి ప్రతీకగా నిలుస్తాయి. ఆంగికం, వాచికం, ఆహార్యము, అభినయం శృతి లయ స్వర సాహితీ యుతమై మైమరపు కలుగజేస్తాయి. పదాలలో తెలియజేయలేని భావనలను అభినయంలో అనుభూతి చెందగలిగే అద్భుతమైన ప్రక్రియ నాట్యం. ఈ భావాన్ని సముద్రాలవారు సలలిత రాగ సుధారస సారం గీతం ద్వారా అందించారు. ఈ చిత్రంలో అన్ని గీతాలూ ఆయన సాహితీ ప్రతిభకు ఉత్తమ ఉదాహరణలు.

సుసర్ల దక్షిణామూర్తి గారు నాదబ్రహ్మ స్వరూపులు. నర్తనశాలతో పాటు ఎన్నో చిత్రాలకు మధురమైన, శ్రావ్యమైన, శాస్త్రీయతను ప్రస్ఫుటించే సంగీతాన్ని అందించారు. కల్యాణి రాగంలో సాగే ఈ గీతంలో మాధుర్యాన్ని, మృదువైన నాట్య భంగిమలకు ప్రాధాన్యత ఉంది కాబట్టి అదే రీతిలో సంగీతం కూర్చారు సుసర్ల వారు. ఝుంకారములు, ఝణత్కారములు కూడిన అందెల రవళిని ఆయన తన సంగీతం ద్వారా మనకు తెలియజేశారు.

సంగీతంలో గంధర్వులను మరపింపజేసే బాలమురళీకృష్ణ గారు ఈ గీతానికి ప్రధాన నేపథ్య గాయకులు. భావాన్ని, సంగీతాన్ని లలిత మధుర స్వర లయాది లక్షణాలతో ఆయన గానం చేశారు. బెంగుళూరు లత గారు ఆయనకు సహకారం అందించారు. ఆలాపనలో బాలమురళి గారు వినిపించిన మాధుర్యం చిక్కని పాలమీగడకు చక్కెరను కలిపినట్లు రుచిస్తుంది.

ఇక పాత్రధారుల గురించి చెప్పేదేముంది? పౌరాణిక పాత్రలకు ప్రతిరూపం నందమూరి తారక రామారావు గారు. పేడి బృహన్నల రూపాన్ని తానే స్వయంగా తీర్చిదిద్ది మూర్తీభవింప జేశారు. గీతం కొరకు నాట్యంలో మెలకువలను నేర్చుకున్నారు. మేటి భరతనాట్య కళాకారిణి అయిన ఎల్ విజయలక్ష్మి ఉత్తర పాత్రలో ఈ గీతానికి మహాద్భుతమైన నాట్యాన్ని అందించగా, ఆమెకు గురువుగా అన్న ఎంటీఆర్ గారు అంతే ప్రతిభను ప్రదర్శించారు.

ఇంత మంది మహానుభావుల కళలు మేళవించాయి కాబట్టే ఈ గీతం ఒక వినూత్నమైన రసావిష్కరణగా ఇప్పటికీ సువాసనలు విరజిమ్ముతూనే ఉంది.

ఎన్ టీ ఆర్ , ఎల్  విజయలక్ష్మి అభినయంలో బాలమురళీకృష్ణ , బెంగుళూరు లత పాడిన గీతాన్ని చూడండి 

12, జులై 2015, ఆదివారం

జోహారు శిఖిపింఛమౌళి

జోహారు శిఖిపింఛమౌళి


జోహారు శిఖిపింఛమౌళి! ఇదె జోహారు రసరమ్య గుణశాలి వనమాలి!

కలికి చూపులతోనే చెలులను కరగించి
కరకు చూపులతోనే పరులను జడిపించి
నయగారమొక కంట జయవీరమొక కంట
చిలకరించి చెలువమెంచి నిలచిన శ్రీకరా నరవరా సిరిదొరా

నీ నాదలహరిలో నిదురించు భువనాలు
నీ నాట్యకేళిలో నినదించు గగనాలు
నిగమాలకే నీవు సిగబంతివైనావు
యుగయుగాల దివ్యలీల నడపిన అవతారమూర్తి ఘనసార కీర్తి

చకిత చకిత హరిణేక్షణావదన చంద్రకాంతులివిగో
చలిత లలిత రమణీకేలాంచల చామరమ్ములివిగో
ఝళంఝళిత సురలలనానూపుర కలరవమ్ములివిగో
మధుకర రవమ్ములివిగో మంగళరవమ్ములివిగో
దిగంతముల అనంతముగ గుబాళించు సుందర నందన సుమమ్ములివిగో

జోహారు శిఖిపింఛమౌళి! ఇదె జోహారు రసరమ్య గుణశాలి వనమాలి!

 డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారు 1970లో విడుదలైన శ్రీకృష్ణ విజయం (ఎన్ టీ ఆర్, జయలలిత నటించిన) చిత్రానికి పెండ్యాల నాగేశ్వరరావుగాఇ సంగీతం, సుశీలమ్మ గళంలో అందించిన రసప్రవాహం. ఈ పాటకు నృత్యం చేసిన అద్భుత కళాకారిణి హేమమాలిని గారు. నవరత్నాలన్నీ కలిస్తే ఇక అది మృదు మంజుల మధురమే.

గీతానికి వస్తే, అప్సరసలు ఇలా శ్రీకృష్ణునికి జోహారు సమర్పిస్తున్నారు:

శిఖములో నెమలిపింఛము ధరించిన, అనేకమైన సుగుణములకు నిలయమైన, వనమాలను ధరించిన నీకు జోహార్లు

అందమైన చూపులతో చెలుల మనసులను కరిగించి, కఠినమైన చూపులతో శత్రువులను జడిపించి, మృదుత్వమొక పక్క, వీరరసమొక పక్క చిలకరిస్తూ అందముగా నిలిచిన, సంపదలను కలిగించే, నరశ్రేష్ఠుడవైన, సిరికి పతివైన శ్రీకృష్ణా నీకు జోహార్లు.

నీ వేణుగానలహరిలో సమస్త లోకాలు నిదురించును. నీ నాట్యలీలలో ఆకాశాలన్నీ నినదించును. సమస్త వేదవేదాంతములకు నీవు తలమానికమైనావు. యుగయుగాలలో వివిధ అవతారములతో దివ్యలీలలను చేసిన గొప్ప కీర్తికి కలిగిన శ్రీకృష్ణా నీకు జోహార్లు!

బింకముతో అందముగా జింకకన్నులు కలిగిన నీకు చంద్రకాంతులతో జోహార్లు ఇవిగో. అందమైన స్త్రీల కురుల వలె చల్లని గాలులు వీచే చామరమ్ములతో జోహార్లు ఇవిగో. తుమ్మెదలా ఝుంకరించే రవములతో, లలితమైన ధ్వనులతో జోహార్లివిగో. అన్నిదిక్కుల అంచుల వరకు అనంతమైన సువాసనలను విరజిమ్మే సుందరమైన నందనవన పుష్పములతో జోహార్లు ఇవిగో!

నారాయణరెడ్డి గారు అనగానే తెలుగుదనం యొక్క గుబాళింపు గుర్తుకు వస్తుంది. కొత్త పదాలకు, అపురూపమైన సాహితీ సంపదకు ఆయన రచనలు నెలవు. ఈ గీతంలో ఆయన చేసిన పదప్రయోగం అమోఘం. సిరిదొర, సిగబంతి మొదలైన పదాలు ఆయన సాహితీ ప్రతిభకు నిలువటద్దం. తెలుగు భాషలో మాధుర్యం సినారె గారి కలంలో రసప్రవాహంలో జాలువారింది. చిత్రంలో శ్రీకృష్ణుడు ఇంద్రుని సభకు వెళ్లినపుడు అప్సరసలు ఆడే నాట్యకేళికి ఈ గీతం సందర్భం. అనుపమానమైన సౌందర్యం కలిగిన హేమమాలినిపై ఈ గీతం చిత్రీకరించబడింది. కూచిపూడి నాట్య రీతిలో సినారె గారి గీతానికి హేమమాలిని గారు అద్భుతమైన నాటవిన్యాసాన్ని అందించారు. కృష్ణుడు అనగానే సుందరమైన బృందావని గుర్తుకు వస్తుంది. అలాగే ఈ గీతం కూడా సాహితీ సౌందర్యంతో ప్రకాశిస్తుంది. 

సుశీలమ్మ గోంతులో ఈ పాట వినండి



7, జులై 2015, మంగళవారం

జయ జయ నృసింహ సర్వేశ - అన్నమాచార్యుల ఆధ్యాత్మిక సంపద

జయ జయ నృసింహ సర్వేశ - అన్నమాచార్యుల ఆధ్యాత్మిక సంపద


జయ జయ నృసింహ సర్వేశ భయహర వీర ప్రహ్లాదవరద

మిహిరశశినయన మృగనరవేష బహిరంతస్థల పరిపూర్ణ
అహినాయక సింహాసన రాజిత బహుళ గుణగణ ప్రహ్లాదవరద

చటుల పరాక్రమ సమఘన విరహిత నిటలనేత్ర మౌని ప్రణుత
కుటిల దైత్య తతి కుక్షి విదారణ పటు వజ్ర నఖ ప్రహ్లాద వరద

శ్రీ వనితా సంశ్రిత వామాంక భావజ కోటి ప్రతిమాన
శ్రీవేంకటగిరి శిఖర నివాస పావన చరిత ప్రహ్లాద వరద

తాత్పర్యము:

సర్వేశ్వరుడు,భయమును తొలగించే వాడు, ప్రహ్లాదునికి వరములొసగిన వాడు అయిన నృసింహునికి జయము జయము.

సూర్యచంద్రులు నేత్రములుగా కలిగి, సగము దేహము నరునిగా, సగము దేహము సింహముగా వేషము గలిగి, బాహ్యము, లోపల పరిపూర్ణుడైన, ఆదిశేషునిపై అధిష్ఠించి శోభించే వాడు, అనేక గుణ గణములు కలిగిన ప్రహ్లాద వరదునికి జయము జయము

అమితమైన, అనుపమానమైన పరాక్రమము కలవాడు, మూడవ నేత్రము కలిగిన శివుడు, మునులచే నుతించబడిన వాడు, హిరణ్యాక్షుని ఉదరమును చీల్చిన వాడు, వజ్రములాంటి పదునైన గోళ్లు కలవాడు అయిన ప్రహ్లాద వరదునికి జయము జయము

ఎడమ తొడపై లక్ష్మీదేవిని కలిగి, కోటిమంది మన్మథుల అందము కలిగిన వాడు, శ్రీవేంకటాద్రిపై వెలసిన వాడు, పావనమైన చరిత్ర కలవాడు అయిన ప్రహ్లాద వరదునికి జయము జయము

విశ్లేషణ:

అన్నమాచార్యులవారు లక్ష్మీ నృసింహునిపై ఎన్నో సంకీర్తనలను రచించారు. వాటిలో ఫాలనేత్రానల, కదిరి నృసింహుడు, జయ జయ నృసింహ, నగుమోము తోడిదో నరకేసరి, ఆనందనిలయా ప్రహ్లాదవరదా, ఆదిమ పురుషుడు అహోబిలమున, నమామ్యహం మానవసింహం, నమితదేవం భజే నారసింహం, కంటిమి నేడిదె గరుడాచలపతి, ఘోరవిదారణ నారసింహ, నగధర నందగోప నరసింహ, మలసీ జూడరో మగసింహము, ఇలయును నభమును ఏకరూపమై...ఇలా ఎన్నో.

అనేక లక్ష్మీనృసింహ క్షేత్రాలను ఈ సంకీర్తనలలో ప్రస్తావించారు. కదిరి, వేదాద్రి, అహోబిలము, పెంచలకోన ఇలాంటి క్షేత్రాలను అన్నమాచార్యుల వారు దర్శించి ఆ నరహరి అనుగ్రహాన్ని పొందారు. అహంకారాతిశయమున బలగర్వితుడైన హిరణ్యకశిపుని జంపుటకు నృహరి రూపంలో వచ్చి వానిని నఖములతో గ్రుచ్చి చంపి లోక కళ్యాణానికి కారకుడైనాడు. తన భక్తుడైన ప్రహ్లాదునికి అభయమొసగి ఆతనిని రాజ్యాభిషిక్తుడిని చేశాడు.

ఈ సంకీర్తనలో అన్నమాచార్యుల వారు తన నరసింహోపాసనలో ఒక ప్రత్యేకమైన శైలిని మన ముందుంచారు. ప్రహ్లాదుడ్ని కాపాడటం అనే మౌలిక విషయాన్ని పల్లవి, చరణాలలో పొందుపరచారు. ప్రహ్లాదుడు దైవాంశ సంభూతుడు. హిరణ్యకశిపుని వినాశనమునకై నారదాదుల ప్రేరణతో లీలావతి గర్భమున జన్మించాడు. ఆతనికి హరిభక్తిని తల్లి కడుపులో ఉండగనే నారదుడు బోధించి నారాయణ మంత్రాన్ని ఉపదేశించాడు. ఇది కేవలం దైవకార్యం కొరకే. శాపగ్రస్తులైన జయవిజయులలో ఒకడైన హిరణ్యాక్షుడై సమస్త జంతుజాలములనుండి ప్రాణికోటినుండి మరణం లేకుండా వరమను తప్పసు చేసి పొందిన పిమ్మట లోకకంటకుడవుతాడు.

హరిద్వేషి అయిన హిరణ్యాక్షుడు హరిభక్తుడైన కుమారుని హరిని స్థంభంలో చూపించగలవా అనిప్రశ్నిస్తాడు. ప్రహ్లాదుడు ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకనినన్ అందందే గలడు దానవాగ్రణి వింటే అని పరిపూర్ణమైన విశ్వాసము, భక్తితో సమాధానం చెబుతాడు. ఉగ్రుడైన హిరణ్యకశిపుడు స్థంభమును గదతో ఛేదించగా ఫెళ ఫెళ ధ్వనులతో ఉగ్ర నరసింహుడు అవతరించి హిరణ్యాక్షుని ప్రేగులను నఖములతో చీల్చి త్రెంచి, ఆతని రక్తమును తాగి ఉగ్రసింహమువలె ఊగిపోతాడు. అప్పుడు దేవతలు, ప్రహ్లాదుడు అతనిని శాంతపరచగా, శ్రీహరి తన నిజస్వరూపమును చూపి ప్రహ్లాదునికి అభయమిస్తాడు.

మొత్తం సంకీర్తనలో ముఖ్యమైన అంశాలు - ప్రహ్లాదుని రక్షించిన ఆ నారసింహుడెలా ఉన్నాడు?  - సూర్య చంద్రులు నేత్రాలుగా కలిగి, విశ్వమంతటా తానేయై యుండి, అనేక గుణ గణ శోభితుడైన వాడు. ఆ నారసింహుని పరాక్రమము అసమానమైనది. వజ్రముల వంటి గోళ్లతో కుటిలుడైన రాక్షసుని ఉదరమును చీల్చిన వాడు. శాంతరూపంలో లక్ష్మీదేవిని ఎడమతొడపై కలిగిన విష్ణుమూర్తి అందములో కోటి మన్మథులకు సమానుడు. ఆతడే శ్రీవేంకటగిరిపై వెలసిన పరమ పావనుడు.

అన్నమాచార్యుల వారు దశావతారములలో నృసింహుని మొదలు కృష్ణుని వరకు వేనోళ్ల నుతించాడు. అన్నిటా పరమార్థము శ్రీవేంకటేశ్వరుడే. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసునిలో అన్ని రూపములను దర్శించి రమ్యంగా వర్ణించారు. ఉగ్ర దేవతా రూపమైన నారసింహుని ఎంతో అద్భుతంగా వర్ణించారు. సంస్కృతంలో రచించబడిన ఈ కీర్తనలో పదప్రయోగం అవతార లక్షణాలను, అవతార లక్ష్యాన్ని ప్రతి పదంలోనూ ప్రతిబింబించారు. అందుకే అన్నమాచార్యుల వారు వాగ్గేయకారులలో శ్రేష్ఠుడైనాడు. సద్గురువుగా శాశ్వతస్థానాన్ని పొంది మనకు మార్గదర్శకులైనారు.

హరియవతారమీతడు అన్నమయ్య! అరయ మా గురువీతడు అన్నమయ్య!

ఎస్పీ శైలజ మరియు బృందం పాడిన ఈ సంకీర్తనను వినండి.

6, జులై 2015, సోమవారం

అఖిలాండేశ్వరి రక్షమాం - దీక్షితుల క్షేత్ర కృతి

అఖిలాండేశ్వరి రక్షమాం ఆగమ సంప్రదాయ నిపుణే శ్రీ



అఖిలాండేశ్వరి రక్షమాం ఆగమ సంప్రదాయ నిపుణే శ్రీ

నిఖిలలోక నిత్యాత్మికే విమలే
నిర్మలే శ్యామలే సకల కళే

లంబోదర గురుగుహ పూజితే
లంబాలకోధ్భాసితే హసితే
వాగ్దేవతారాధితే వరదే
వరశైలరాజసుతే శారదే
జంభారి సంభావితే జనార్దన నుతే
ద్విజావంతి రాగ నుతే జల్లీ మద్దళ
ఝర్ఝర వాద్య నాద ముదితే జ్ఞానప్రదే

ఓ అఖిలాండేశ్వరీ! నన్ను రక్షించుము. వేద సాంప్రదాయాలలో నైపుణ్యము గల తల్లీ నన్ను రక్షించుము!

సమస్త లోకములలో పరబ్రహ్మమై యున్న తల్లివి! మచ్చలేని, నిర్మలమైన తల్లీ! శ్యామలాదేవీ! సకల కళలో ప్రావీణ్యము గల తల్లీ అఖిలాండేశ్వరీ! నన్ను రక్షించుము!

గణపతి, సుబ్రహ్మణ్యులచే పూజించబాడిన తల్లీ! పొడవైన కురులచే శోభిస్తూ చిరునవ్వు కలిగిన తల్లీ! వాగ్దేవత అయిన సరస్వతిచే పూజించబడిన వరములిచ్చే తల్లీ! హిమవంతుని పుత్రికవు శారదవు! ఇంద్రుడునిచే పొగడబడి, విష్ణువుచే నుతించబడిన తల్లీ! ద్విజావంతి రాగంలో నుతించబడిన తల్లీ! గజ్జెలు, ఢక్క, మృదంగము మొదలైన వాద్యముల నాదముతో మోదము పొంది జ్ఞానాన్ని ప్రసాదించే తల్లీ అఖిలాండేశ్వరీ నన్ను రక్షింపుము. 

ముత్తుస్వామి దీక్షితులు రచించిన క్షేత్ర కృతులలో ఇది ఒకటి. శివుని పంచభూత లింగ క్షేత్రములలో జలలింగ క్షేత్రం జంబుకేశ్వరం. ఇక్కడ శివుడు జలలింగ రూపంలో ఉంటాడు. ఆయన నాయికగా అమ్మవారు ఇక్కడ అఖిలాండేశ్వరిగా అలరారుతుంది. ఈ క్షేత్రం తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఉంది. అమ్మవారు జంబుకేశ్వరంలో కావేరీ నది నీటితో లింగాన్ని చేసి స్థాపించి తపస్సు చేసింది. ఆమె తపస్సుకు సంతుష్టుడై శివుడు ప్రత్యక్షమై శివజ్ఞానాన్ని ఆమెకు ఉపదేశిస్తాడు. అప్పటినుండీ జంబుకేశ్వరం ఉపదేశ స్థలంగా ప్రసిద్ధి చెందింది. దీనికి సూచికగా, ఇప్పటికీ మధ్యాహ్న సమయమున అర్చకుడు స్త్రీవేషంలో వచ్చి స్వామిని పూజిస్తారు.

పృథివ్యాపస్తేజోవాయురాకాశములనే పంచ మహాభూతముల రూపంలో దక్షిణాదిన ఐదు శివక్షేత్రాలు ఎంతో పవిత్రమైనవిగా తెలుపబడ్డాయి. వాటిలో పృథివీ లింగం కంచిలో, ఆప (నీటి) లింగం  జంబుకేశ్వరంలో, తేజో లింగము అరుణాచలంలో (తిరువణ్ణామలై), వాయులింగము శ్రీకాళహస్తిలో, ఆకాశలింగం చిదంబరంలో వెలశాయి. ఆయా శివలింగములకు కామాక్షి, అఖిలాండేశ్వరి, ఉణ్ణమలై (అపీతకుచలాంబ) అమ్మ, జ్ఞానప్రసూనాంబ, శివకామి అమ్మలు పార్వతీదేవి రూపాలుగా వెలసాయి. 

దీక్షితులవారి దేవీ ఉపాసనలో వీలైనంత వివిధ పరదేవతా స్వరూపాలను, ఆయా రూపాల విలక్షణమైన లక్షణాలను, గుణాలను, మహిమలను వర్ణించారు. ఈ కృతిలో శివుని వద్ద ఉపదేశం పొందిన అమ్మను ఆగమ సాంప్రదాయములలో, సకల కళలలో నైపుణ్యముగల మహిమాన్విత శక్తి రూపిణిగా నుతించారు. దీక్షితులవారు రాసినట్లుగా జంబుకేశ్వరంలో అమ్మవారిని నిత్యం వివిధ వాయిద్యముల నాదముతో అలరిస్తారు. దీక్షితుల వారి ఇతర కృతులలాగానే ఈ క్షేత్ర కృతి కూడా రాగ భావ సమన్వయం అత్యంత సమగ్రంగా కలిగినది. శరణాగతి, భక్తి భావాలను ఎంతో హృద్యంగా ద్విజావంతి రాగంలో పండుతాయి. 

దీక్షితులవారి ప్రత్యేకత రాగం పేరును కృతిలో సముచితమైన స్థానంలో ప్రస్తావించటం. గురుగుహుని అనుగ్రహం పొందిన ఆయన ఆ కార్తికేయుని తన కృతులలో ముద్రగా ఉపయోగించారు. పరదేవతానుగ్రహం అపారంగా లేనిదే ఇటువంటి కృతులు వాగ్గేయకారుని చిత్కమలం నుండి వెలువడవు. ఎక్కడికి వెళ్లినా ఆ దేవతానుగ్రహం పొందిన మహోన్నత ఆధ్యాత్మిక విద్వాంసుడు దీక్షితుల వారు. 

ఈ కీర్తనను ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు మనసుకు ప్రశాంతత కలిగించేలా అమ్మ రూపాన్ని కళ్లముందు నిలబడేలా ఆలపించారు.  

5, జులై 2015, ఆదివారం

భ్రాతృ ప్రేమ - ధర్మనిష్ఠ, సత్య వాక్పరిపాలన

భ్రాతృ ప్రేమ - ధర్మనిష్ఠ, సత్య వాక్పరిపాలన


భ్రాతృ ప్రేమకు నిర్వచనం రామచంద్రుడైతే అన్నపై భక్తికి నిర్వచనం భరతుడు. పదునాలుగేండ్లు అన్న అరణ్యవాసములో ఉన్నంత వరకూ తానూ రాజ్య త్యాగము చేసి అన్న పాదుకలను నందిగ్రామంలో నిలిపి పూజించిన నిర్మల మూర్తి భరతుడు. అన్నపై గల ప్రేమతో కన్నతల్లిపై కత్తిని దూసిన సత్యపరాయణుడు భరతుడు.  నాన్న మాట కోసం నిస్సంకోచంగా రాముడు అడవికేగితే అన్న కోసం చేతికి వచ్చిన రాజ్యాన్ని తృణప్రాయంగా వదలి యోగియైనాడు భరతుడు. ఈ అన్నదమ్ముల అవ్యాజమైన ప్రేమకు మూలం నిస్వార్థమైన అత్యున్నతమైన మానవ విలువలు మరియు ధర్మపరాయణత్వం. ఇప్పుడూ ఉన్నారు సోదరులు - ఆస్తుల కోసం, తల్లిదండ్రులను పంచుకోవటం కోసం, చెప్పుడు మాటలు విని అహంకారంతో సోదరులను హతమార్చే వారు, సోదరులను మోసం చేసే వారు, సోదరులను దూరం చేసుకునే వారు. కళ్ల ఎదుటబడితే సోదరుని ఆత్మీయంగా పలుకరించలేని దుస్థితిలో ఎంతో మంది సోదరులు. శాశ్వతం కాని ఆస్తుల కోసం శాశ్వతమైన ప్రేమను దూరం చేసుకునే మూర్ఖత్వంలో మరి కొందరు. భార్యల చెప్పుడు మాటలు విని సోదర దూషణ చేసే వారు మరి కొందరు....తోడబుట్టినవారిని నిష్కల్మషంగా ప్రేమించాడు కాబట్టే రాముడు పరిపూర్ణ పురుషుడయ్యాడు. సోదరుల కోసం త్యాగంలోనే భోగమని నిరూపించారు రామ లక్ష్మణ భరతులు. ఒకే మాటతో, ఒకే ఆత్మ అన్నంత గాఢమైన సోదర వాత్సల్యాన్ని ప్రదర్శించారు ఈ సోదరులు. అందుకే వారు లోక పూజ్యులు.

శ్రీమద్రామాయణంలో ఈ భ్రాతృప్రేమకు, తద్వారా ధర్మనిష్ఠకు, సత్య వాక్పరిపాలనకు కొన్ని మచ్చుతునకలు:

1. సీతారామలక్ష్మణులు వనవాసానికి వెళ్లిన తరువాత, దశరథుడు మరణిస్తాడు. మేనమామల వద్దనుండి తిరిగి వచ్చిన భరతుడు తండ్రి మరణవార్త వింటాడు. అప్పుడు ఇలా అంటాడు:

"అద్భుతమైన కార్యములన్నీ అవలీలగా సాధించే ప్రజ్ఞామూర్తి శ్రీరాముడు. నాకు అన్న మాత్రమే కాదు, తండ్రి, బంధువు, సర్వస్వమూ అతడే. నేను ఆయన దాసుడను. జ్యేష్ఠ సోదరుడు తండ్రితో సమానము. ధర్మమును బాగుగా తెలిసిన ఆ శ్రీరాముని పాదములకు నేను మ్రొక్కెదను. ఇప్పుడు ఆ ధర్మాత్ముడే నాకు పరమగతి. "

కైకేయి వెంటనే సీతారామ లక్ష్మణులను అడవికి పంపినానన్న వార్తను కుమారునికి తెలుపి, పట్టాభిషేకానికి సిద్ధముగమ్మని చెప్పగానే, భరతుడు తల్లితో ఇలా అంటాడు:

"ఓ పాపాత్మురాలా! మా అన్న శ్రీరాముడు ధర్మాత్ముడు. పెద్దలకు సేవ చేయటంలో ఉత్తముడు. శ్రీరాముడు అందరిలోనూ మంచినే చూసేవాడు. మహాశూరుడు. సజ్జనులలో పేరుగలిగిన వాడు. అట్టి సత్పురుషుని నారచీరలతో అడవులకు పంపి ఏమి బాపుకోదలచినావు? పురుష శ్రేష్ఠులైన రామలక్ష్మణులే నాకు శక్తిప్రదాతలు. వారులేకుండా రాజ్యపాలనము చేసే శక్తి నాకు లేదు. ఇక్ష్వాకువంశములో ముందునుండి జ్యేష్ఠునకే రాజ్యాధికారమునిచ్చిరి.అదే సాంప్రదాయం. తక్కిన సోదరులందరూ పెద్దవానికి విధేయులై ఆయనను అనుసరించుచుండెడివారు. అటువంటి ధర్మపరాయణ కలిగిన ఇక్ష్వాకు వంశ వైభవం నీవలన భ్రష్టమైనది. నేను ఎట్టి పరిస్థితులలోనూ రాజ్యాధికారాన్ని స్వీకరించను. శ్రీరాముడే కోసల రాజ్యాధీశుడు. నేను రాముని వద్దకు వెళ్లి వేడుకొని, అతనికి రాజ్యాన్ని అప్పగించి అతనికి సేవ చేసెదను. "

అటు తరువాత, కౌసల్య వద్దకు వెళ్లి ఇలా అంటాడు: "అమ్మా! ధర్మాత్ముడైన శ్రీరాముని వనవాస విషయమున నా జోక్యమున్నచో నేను మహాపాపమును పొందెదను గాక. అగ్నిహోత్రాది ధర్మకార్యములకు దూరమై, సంతానహీనునిగా మరణించెదను గాక. స్త్రీలు, పిల్లలను చంపిన పాతకము నాకు కలుగు గాక. అనేక నరకబాధలు కలుగుగాక. గురుద్రోహ పాతకము కలుగు గాక" అని ఎంతో విలపిస్తాడు. కౌసల అతనిని ఓదార్చి "నాయనా! నీవు ధర్మమార్గమును వీడలేదు. నీవు సత్యప్రతిజ్ఞుడవు. కావున నీవు సత్పురుషులలో శ్రేష్ఠుడవు." అని అంటుంది.

2. భరతుడు సపరివార సైన్యముతో చిత్రకూటము చేరుకున్నప్పుడు లక్ష్మణుడు భరతుని అనుమానిస్తాడు. అప్పుడు రాముడు భరతుని గురించి ఇలా అంటాడు.

"లక్ష్మణా! భరతుని సోదరప్రేమ నిరుపమానమైనది. అటడు నాకు ప్రాణములకన్నా మిన్న. అతని రాకకు వేరే కారణము వెదుకవద్దు. అతను మనలను చూచుటకే వచ్చాడు. ఒక సోదరుడు తన ప్రాణతుల్యుడైన సోదరుని ఎట్లు చంపును. మనకు అపకారము చేయవలెనని అతను మనసులో కూడ తలపడు. కాబట్టి శాంతించి అతనికి స్వాగతము పలుకుము" అంటాడు.

3. భరతుడు పర్ణశాలలో ప్రవేశించి ఇలా తలపోసెను:

"ఈ జగత్తులో నరశ్రేష్ఠుడైన, మహాప్రభువగు శ్రీరాముడు నా కారణమున, జన సంచారములేని ఈ వనములకు చేరి, వీరాసనమున కూర్చున్నాడు. అయ్యో నా జన్మ, జీవితమూ వ్యర్థమే. నా తల్లి కుట్ర ఫలితముగా మహాతేజస్వి, జగత్ప్రభువు అయిన శ్రీరామచంద్రుడు కష్టాలపాలైనాడు. అతడు సమస్త సుఖములను త్యజించి ఈ వనమునందు నివసించుచున్నాదు. ఈవిధముగా నేను లోకనిందకు గురైతిని. శ్రీరాముని ప్రసన్నుని జేసుకొనెదకు నేను సీతాదేవి పాదములకు మోకరిల్లెదను."

అన్న వద్దకు వెళ్లి అతనిని చూసి "అయ్యో! నిండు సభలో పురజనుల చేతను, మంత్రుల చేతను సేవాసత్కారములు అందుకోవలసిన మా అన్న నేడు ఇచట వన్యమృగములచే సేవింపబడుచున్నాడు. అమూల్యమైన పీతాంబరములు ధరించవలసిన రాముడు పితృవాక్యపరిపాలనము కొరకు మృగచర్మము ధరించి యున్నాడు. నానావిధములైన ఆభరణములను పుష్పములను ధరించిన రాముడు ఈ జటాభారమునెట్లు మోయుచున్నాడో? అత్యుత్తమమైన చందనాదిలేపములుకు యోగ్యమగు ప్రభువు శరీరము నేడు ధూళిని ఎట్లు భరించుచున్నది? ఈ కష్టములన్నిటికీ కారణమైన నా జీవితం వ్యర్థము" అని విలపిస్తూ రాముని పాదములపై వ్రాలుతాడు.

4. దశరథునికి పిండప్రదానము, తర్పణములు వదిలిన పిమ్మట, రాముడు భరతుని ఆతని రాకకు గల కారణాన్ని అడుగుతాడు. భరతుడు ఇలా అంటాడు:

"అన్నా! నీ దాసుడనై ఇక్కడి వచ్చిన నన్ను అనుగ్రహింపుము. అయోధ్యకు  విచ్చేసి రాజ్యాభిషిక్తుడవు కమ్ము! నేను నీకు తమ్ముడను, శిష్యుడను, దాసుడను. "

అపుడు రాముడు:

"ఓ భరతా! నీవు ఉత్తమ వంశమున పుట్టిన వాడవు. సత్త్వగుణ సంపన్నుడవు. బలశాలివి. సత్ప్రవర్తన కలిగిన వాడవు. అటువంటి నీవు పాపము చేయలేదు. ధర్మశీలురైన తల్లిదండ్రులు నన్ను వనవాసమునకు ఆజ్ఞాపించిరి. వారి ఆజ్ఞను నేను కాదనను. కావున నీవు అయోధ్యలో ఉండి రాజ్యపాలన చేయవలెను. నేను వల్కములు ధరించి వనవాసము చేయవలెను." అని సమాధానం చెబుతాడు.

భరతుడు, వశిష్ఠుడు, జాబాలి మొదలైన వారు ఎంత చెప్పినా రాముడు తండ్రిమాట జవదాటను అని సమాధానం చెప్పి భరతుడే రాజ్యాన్ని పాలించాలి అని మరల మరల చెబుతాడు. అప్పుడు భరతుడు రామునితో ఇలా అంటాడు:

"పూజ్యుడవైన ఓ అన్నా! నీ పాదుకలు బంగారముతో తాపబడినవి. ఆ పాదరక్షలను ఒక్కసారి నీ పాదములకు తొడుగుకొని నాకు అనుగ్రహింపుము. అవియే సమస్త లోకములకు యోగక్షేమమగును."

రాముడు అందుకు సమ్మతించి పాదుకలను తొడిగి విడువగా, భరతుడు ఆ పాదుకలకు ప్రణమిల్లి ఇలా అంటాడు: " నేను ఈ పదునాలుగు సంవత్సరములు జటాధారినై నారచీరలను ధరించెదను. ఫలములను, కందమూలములను ఆహారముగా స్వీకరించుచు మీ రాకకై నిరీక్షించుచు నగరమునకు వెలుపలి భాగమున యుందును. ఈ పదునాలుగు సంవత్సరములు రాజ్యపాలనా భారమును నీ పాదుకల మీదనే ఉంచెదను. పదునాలుగవ సంవత్సరము ముగిసిన మరునాడు మీ దర్శనము కానిచే అగ్నిప్రవేశము చేసెదను."

ఈవిధముగా రాముడు వచ్చేంత వరకు భరతుడు అయోధ్య ప్రవేశించలేదు. తను అన్న మాటకు నిలబడి సత్యప్రతిజ్ఞుడైనాడు.

5. వాలిని చెట్టుచాటునుండి రాముడు నేలకూల్చిన పిమ్మట రాముని ధర్మమును వాలి అధిక్షేపిస్తాడు. అప్పుడు రాముడు వాలితో ఇలా అంటాడు:

" కొండలతో, కోనలతో, అరణ్యములతో కూడిన ఈ భూమి అంతా ఇక్ష్వాకు ప్రభువుల ఆధీనములోనిది. ఇక్కడ మృగములను, పక్షులను, మనుష్యులను నిగ్రహించుటకు, అనుగ్రహించుటకు వారికి అధికారము కలదు. ఈ భూమి ధర్మాత్ముడైన భరతుడు పాలిస్తున్నాడు. అతడు సత్యసంధుడు, ఋజువర్తనుడు, ధర్మార్థకామ్యముల రహస్యము తెలిసిన వాడు, నిగ్రహానుగ్రహ సమరథుడు, రాజనీతిని, శిక్షాశాస్త్రమును, సత్యమును, శాస్త్రవిహిత పద్ధతిని దేశకాల పరిస్థితులను చక్కగా తెలిసిన మహారాజు. మిక్కిలి పరాక్రమశాలి. మేము, ఇతర రాజులు అతని ధర్మబద్ధమైన ఆదేశములను పాటించుచు ధర్మ పరిరక్షణకై ఈ భూమి యంతటా సంచరించుచున్నాము. రాజశ్రేష్ఠుడు, ధర్మనిరతుడు అయిన భరతుడు ఈ భూమిని పాలించుచుండగా అట్టి ధర్మమును ఎవరు అతిక్రమించగలరు? రాజు యొక్క ఆజ్ఞను అనుసరించి మేమందరము పూర్తిగా ధర్మాచరణ యందు నిమగ్నులమై యున్నాము. ధర్మమార్గమును వీడి ప్రవర్తించు వారిని మేము తప్పక దండించెదము. నీవు పూర్తిగా స్వార్థ పరుడవు, భోగలాలసుడవు, రాజధర్మమును  వీడినావు. కావున ధర్మజ్ఞులు నిను తప్పక నిందింతురు. నీవు ధర్మము తప్పిన వాడవు. ఈ దేశమున ధర్మమును అతిక్రమించిన వారిని, కట్టుబాట్లకు లోబడక స్వేచ్ఛగా ప్రవర్తించువారిని శిక్షించుటలో భరతుడు నిరతుడై యున్నాడు. ఆతని  ఆజ్ఞలను మేము అమలుపరచుచున్నాము".

ఈ విధముగా సత్యమైన సోదర ప్రేమ కలిగి రామభరతులు నిరంతరం ధర్మపరాయణులై మాటకు కట్టుబడి తమ జీవితాలే మానవాళికి ఆదర్శప్రాయం చేశారు. రాముని వంటి అన్న, భరతుని వంటి తమ్ముడు న భూతో న భవిష్యతి.

జై శ్రీరాం!

3, జులై 2015, శుక్రవారం

అన్నపూర్ణే విశాలాక్షి అఖిల భువన సాక్షి కటాక్షి - దీక్షితులవారి సంగీతామృతము

అన్నపూర్ణే విశాలాక్షి అఖిల భువన సాక్షి కటాక్షి - దీక్షితులవారి సంగీతామృతము


అన్నపూర్ణే విశాలాక్షి అఖిల భువన సాక్షి కటాక్షి

ఉన్నత గర్త తీర విహారిణి ఓంకారిణి దురితాది నివారిణి
పన్నగాభరణ రాజ్ఞి పురాణి పరమేశ్వరి విశ్వేశ్వర భాస్వరి

పాయసాన్న పూరిత మాణిక్య పాత్ర హేమదర్వీ విధృత కరే
కాయజాది రక్షణ నిపుణతరే కాంచనమయ భూషణాంబరధరే
తోయజాసనాది సేవిత పరే తుంబురు నారదాది నుత వరే
త్రయాతీత మోక్షప్రద చతురే త్రిపద శోభిత గురుగుహ సాదరే

ఓ అన్నపూర్ణ తల్లీ! విశాలమైన కన్నుల గల అమ్మా! సమస్త లోకాలకు సాక్షివి! కటాక్షాన్ని ప్రసాదించే తల్లీ!

ఉన్నతమైన గర్త తీరంలో విహారం చేసే, (తిరువారూర్ వద్ద కుళిక్కుళై అనే క్షేత్రంలో అన్నపూర్ణా విశ్వనాథుల క్షేత్ర కీర్తన ఇది) ఓంకార రూపిణీ! సమస్త పాపములను తొలగించే, నాగాభరణములను ధరించే శివుని రాణీ! పురాణములలో పొగడబడిన పరమేశ్వరీ! శివుని ప్రక్కన ప్రకాశించే అమ్మా!

పాయసాన్నము కలిగిన పాత్ర ఒక చేత, బంగారు గరిటే ఒక చేత కలిగి శోభిల్లే, మన్మథుడు మొదలైన వాని రక్షించుటలో నైపుణ్యము కలిగిన, బంగారు వస్త్రములను, ఆభరణములను ధరించిన తల్లీ! కమలాసనుడైన బ్రహ్మ మొదలగు దేవతలచే పూజించబడిన, నారదుడు, తుంబురుడు మొదలైన వారిచే నుతించబడే తల్లీ! ధర్మార్థ కామ్యములను దాటించి మోక్షమును ప్రసాదించటంలో చాతుర్యము కలిగిన, సత్-చిత్-ఆనందములచే శోభిల్లే, గురుగుహుని ఆదరించే తల్లీ! రక్షించుము! 

ముత్తుస్వామి దీక్షితుల వారి క్షేత్ర కీర్తనలలో ఈ అన్నపూర్ణే విశాలాక్షీ ఎంతో ప్రాచుర్యం పొందింది. శ్రీవిద్యోపాసనలో సిద్ధులైన దీక్షితులవారు అమ్మను నిరంతరం దర్శించి ఎన్నో అద్భుతమైన కీర్తనలను రచించారు. సామరాగంలో ఈ అన్నపూర్నే విశాలాక్షీ అన్న కీర్తన కుళిక్కుళైలో గల కాశీవిశ్వనాథుని దేవేరి అన్నపూర్ణమ్మను నుతిస్తూ రచించారు. 

అన్నపూర్ణ పార్వతీదేవి యొక్క స్వరూపము. సకల కామ్యములతో పాటు మానువుని జీవితానికి అత్యంత ముఖ్యమైన భోజ్యములను అనగా పాడి పంటల ద్వారా వచ్చే ఆహార పదార్థములను పుష్కలముగా అందించె కామితార్థ దాయిని. అన్నం పరబ్రహ్మ స్వరూపం. స్వయంగా సదాశివుడే కాశీ క్షేత్రంలో అమ్మ వద్ద భిక్షను ప్రతిరోజూ తీసుకుంటాడని పురాణలు చెబుతున్నాయి. ఆది శంకరుల వారు తన గురువైన మండన మిశ్రుని వద్దే కాక గురుపత్ని అయిన ఉభయ భారతీదేవి వద్ద కూడా విద్యను నేర్చుకున్నాడు. ఆ తల్లి తన పట్ల చూపిన ఆదరణకు కృతజ్ఞతతో అన్నపూర్ణాష్టకం రచించారు. 

దీక్షితులవారి సాహిత్యంలో అమ్మ వైభవాన్ని ఎన్నో కోణాలలో అద్భుతమైన సాహితీ సంపదతో ఆధ్యాత్మిక సుగంధంతో తెలియజేశారు. ఆయనలోని దైవశక్తి ఆయన కీర్తనలలో స్పష్టంగా కనిపిస్తుంది. ఓంకార రూపిణి, పురాణి, త్రిపద శొభిత అని అన్నప్పుడు ఆయన ఆదిపరాశక్తిని ఏయే అనుభూతులలో ఏయే రూపాలలో దర్శించాడో అర్థమవుతుంది. నిగూఢార్థము కలిగిన పదాలు మనం అనుకుంటే రావు. పూర్తిగా ఆ దేవతా స్వరూపం ఆ కృతికర్తను అనుగ్రహించి పదాలను శక్తిపూరితం చేసి రచనలో వచ్చేలా చేస్తుంది. దీక్షితుల వారి ప్రతి కృతిలోనూ ఈ దైవానుగ్రహము, దైవబలము తేటతెల్లమవుతుంది. అందుకే ఆయన సంగీత త్రయంలో ఒక్కరైనారు. సంగీతం ద్వారా సనాతన ధర్మం పరిఢవిల్లటానికి, భారత దేశపు ఆధ్యాత్మిక శక్తి ప్రకాశించటానికి ఎంతో తోడ్పడ్డారు.

సామ రాగం అద్భుతమైన లాలిత్యము,కరుణ రసము కలిగినది. ఈ రాగంలో శాంతము లేక సౌఖ్యము లేదు, మానస సంచరరే మొదలైన మృదుభావాన్ని, పరిపూర్ణమైన ప్రశాంతతను ఒలికించే కీర్తనలు రచించ బడ్డాయి. దీక్షితులవారు అమ్మకు తనపై గల అపారమైన కరుణకు సూచికగా ఈ అన్నపూర్ణే  విశాలాక్షి కృతికి సామ రాగాన్ని ఎన్నుకొన్నారు. పాలు తేనె కలిసినట్లు భక్తిపూరితమైన సాహిత్యము, కరుణాపూరితమైన రాగలక్షణము కలిసి అమృతాన్ని కురిపించాయి.

ప్రఖ్యాత కర్ణాటక సంగీత విదుషీమణి ఎమ్మెస్ షీలా గారి గాత్రంలో ఈ కీర్తన వినండి


2, జులై 2015, గురువారం

నిరాశ నిస్పృహల నుండి బయటపడే హనుమంతుడు - సుందరకాండ 13వ సర్గ

నిరాశ నిస్పృహల నుండి బయటపడే హనుమంతుడు - సుందరకాండ 13వ సర్గ



జీవితంలో అనుకున్న పని జరుగక, లక్ష్యం నెరవేరనప్పుడు నిరాశ నిస్పృహలు కలిగి మనిషి నకారాత్మకమైన ఆలోచనలలో మునిగి దుఃఖించటం సహజమే. మరి అలాంటప్పుడు ఎలా బయట పడటం? జీవితం యొక్క విలువను, తన లక్ష్య సాధన యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని నమ్మిన దైవాన్ని తలచితే ధైర్యం అదే పుడుతుంది అని మనకు హనుమ సుందరకాండలో తెలియజేస్తాడు. వాల్మీకి మహర్షి రాసిన మహాకావ్యం రామాయణం. ఇది మనస్తత్త్వ శాస్త్రజ్ఞులకు ఒక నిఘంటువు.

సీతను వెదుకుతూ ఉత్సాహంగా సాగర లంఘనం చేసి, లంకిణిని జయించి, లంకా వైభవాన్ని దర్శించిన హనుమ అంతఃపురాలలో ఎంత వెదికినా సీత కనిపించదు. సంపాతి చెప్పినట్లుగా సీత ఆ రావణుని లంకలో లేదేమో అన్న అనుమానం కలిగి నిస్పృహ చెందుతాడు. సీతమ్మ లేదేమో అన్న భయం అతని ఆలోచనలను ఎంతో దూరం పరిగెత్తిస్తుంది. ఈవిధంగా చింతిస్తుంది:

"అయ్యో! సీతమ్మ రావణుడు ఆకాశ మార్గములో తీసుకొని పోవుచున్నప్పుడు క్రింద పడిపోయుండవచ్చు! లేదా సముద్రము దాటుచున్నప్పుడు బెదరి సముద్రమున పడియుండవచ్చు! రావణుడు గట్టిగా పట్టుకొనుట చేత ప్రాణములు విడిచియుండవచ్చు! రావణుడిచే భక్షించబడియుండవచ్చు! లేదా దుష్ట స్వభావము కల రావణుని భార్యలు తినియుండవచ్చు! సీతమ్మ రాముని తలచుచు అయ్యో రామా! లక్ష్మణా! అని దుఃఖించుచు మరణించియుండ వచ్చు! నేను రామునికి, సుగ్రీవునికి, వానరులకు ఏమని చెప్పాలి?

సీత కనుపించలేదని తెలిసి రాముడు బ్రతుకడు. రాముడు మరణించిన లక్ష్మణుడు బ్రతుకడు. రామలక్ష్మణులు మరణించిన భరతుడు శత్రుఘ్నులు బ్రతుకరు. తమ కుమారులు మరణించగా తల్లులు కౌసల్య, సుమిత్ర, కైకేయి జీవించరు. రాముని దురవస్థ చూసి సుగ్రీవుడు ప్రాణములు విడుచును. అప్పుడు అతని భార్య రోమ, తదుపరి తార, అంగదుడు కూడా జీవించరు. ఇది అంతా చూసి వానరులంతా మరణింతురు.

కావున నేను కిష్కింధకు అమ్మ జాడ తెలియక పోవుట వలన ఇక్ష్వాకు వంశము, వానర వంశము నాశనమవుతాయి. నేను ఇక్కడినుండి పోకున్నచో వారంతా సీతమ్మను చూడగలమనే ఆశతో జీవింతురు. సీతాదేవి కనబడనిచో నేనిక్కడే చేతికందినది, నోట పడినది తిని, వృక్షమూలమున వానప్రస్థుడనయ్యెదను. లేదా సముద్ర తీరము చేరి చితిపేర్చి అగ్నిలో పడెదను. లేదా ఒకచోట కూర్చుండి సన్యాసము స్వీకరించిన నా శరీరమును కాకులు, పక్షులు భక్షించును. సీతను చూడకున్నచో నీట మునిగియైనా మరణింతును.

ముందుగా లంకాధిదేవతను జయించుట వలన ఉత్తమ ప్రారంభము కలిగినది. ఏ చెట్టుక్రిందైనను తపస్సు చేసుకొనుచు ఉండెదను. సీతాదేవిని చూడకుండా ఇక్కడినుండి వెనుకకు పోజాలను."

ఈ విధముగా చింతాక్రాంతుడైన హనుమ ఆ ఆలోచనలనుండి బయటపడకుండెను. అప్పుడు హనుమ:

"సీత విషయమట్లుండనీ. మహాబలుడైన రావనుని వధింతును. లేదా రావణునెత్తుకొని సముద్రము మీదుగా వెడలి అగ్నిహోత్రమునకు పశువును సమర్పించినట్లు రావణుని రామునికిత్తును. అని ఈవిధముగా సీతను గానక విచారించుచు హనుమంతుడు మరల ఇట్లాలోచించెను:

కీర్తిశాలియగు సీత కనిపించునంతవరకు నేను మరల మరల లంకాపురిలో వెదకెదను. ఈ అశోకవనము పెద్ద పెద్ద మ్రానులతో కూడియున్నది. సీత ఇందున్నదేమో వెదకెదను.

వసూన్ రుద్రాంస్తథాదిత్యాన్ అశ్వినౌ మరుతోపి చ
నమస్కృత్వా గమిష్యామి రక్షసాం శోక వర్ధనః

జిత్వా తు రాక్షసాన్ సర్వాన్ ఇక్ష్వాకు కుల నందినీం
సంప్రదాస్యామి రామాయా యథా సిద్ధిం తపస్వినే

స ముహూర్తమివ ధ్యాత్వా చింతావగ్రథితేంద్రియః
ఉదతిష్ఠన్ మహాతేజా హనూమాన్ మారుతాత్మజః

నమోస్తు రామాయ సలక్ష్మణాయ
దేవ్యై చ తస్యై జనకాత్మజాయై
నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో
నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః

సతేభ్యస్తు నమస్కృత్య సుగ్రీవాయ చ మారుతిః
దిశస్సర్వాస్సమాలోక్య హ్యశోక వనికాం ప్రతి

వసువులను, రుద్రులను, ఆదిత్యులను, అశ్వినులను, వాయువును నమస్కరించి, రాక్షసుల శోకమును పెంచే అశోకవనమున ప్రవేశించెదను.  సకల రాక్షసులను జయించి, తపస్సిద్ధికి తపస్వి వలె, ఇక్ష్వాకు వంశమును ఆనందింపజేయు సీతాదేవిని రామునకర్పింతును."

మహాతేజశ్శాలి వాయుపుత్రుడగు హనుమంతుడు చింతతో ఇంద్రియములు కలతనొందగా ఒక్క ముహూర్తకాలమిట్లు తలచి లేచి నిలబడెను:

"రామలక్ష్మణులకు నమస్కారము; సీతాదేవికి నమస్కారము; రుద్ర, ఇంద్ర, యమ, వాయువులకు నమస్కారము; చంద్రసూర్యులకు, మరుద్గణములకు నమస్కారము".

అని హనుమ వారికి ప్రణామము చేసి, రాజైన సుగ్రీవునకు నమస్కరించి, అశోకవనమెంత విశాలమైనదో తెలియ కోరి అన్ని దిక్కులను పరిశీలించెను. ఆ విధంగా హనుమంతుడు ముందుగా మనస్సు చేతనే శుభకరమగు అశోకవనమున ప్రవేశించి అనంతరము కర్తవ్యమాలోచించెను.

"ఈ అశోకవనమున తప్పక చాలామంది రాక్షసులుందురు. వృక్షములు, నీరు విస్తారముగా యుండును. ఈ వనమును నేను తప్పక వెదుక వలసినదే. సర్వాత్మకుడగు వాయువు కూడా ఇక్కడ మెల్లగా వీచునే కాని అమితముగా కదల్పడు. రామకార్యమును సాధించుకొనుటకు, రావణునకు కనిపించకుండుటకు నా శరీరమును సూక్ష్మముగా చేసికొంటిని. ఇంక నాకు కార్యసిద్ధిని దేవతలు, ఋషులు చేకూర్చెదరు గాక. బ్రహ్మాది దేవతలు, అగ్ని, వాయువు, దేవేంద్రుడు, వరుణుడు, సూర్యచంద్రులు, అశ్వినీదేవతలు, మరుత్తులు, శివుడు నాకు కార్యసిద్ధి కలిగింతురు గాక. సకల భూతములు, ఆ భూతములకు ప్రభువగు విష్ణువు నాకు సిద్ధిని కలిగించెదరు గాక. నాకు కనిపించని, మార్గదర్శకులగు తక్కిన దేవతలు కార్యసిద్ధిని కలిగింతురు గాక. "

ఈ ఘట్టంలో మనకు హనుమంతుని ఆలోచనా పరంపర మరియు కర్మలనుండి ముఖ్యమైన పాఠాలు:

1. నిరాశ చెందినా కూడా, కార్యసిద్ధికై యజమాని మరియు హితుల మంచి కోసం లోతుగా ఆలోచించి ఏమి చేయాలో నిర్ణయించాలి. తనకు ఎంత కష్టమైనా, స్వామి హితమే పరమావధిగా ఆ కష్టాన్ని, తన మనోవికారాలను పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి.

2. మంచి జరగాలి అన్న సంకల్పాన్ని పునరుద్ఘాటించాలి. ఆ సంకల్ప సాధన కోసం దేవతలను ప్రార్థించాలి. దీనివలన సమస్త భూతములు దేవతలు ఈ సంకల్పానికి జయం కలిగిస్తారు.

3. సమయానుకూలంగా, పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాన్ని మార్చుకోవాలి. కార్యసిద్ధి, స్వరక్షణ వ్యూహానికి పునాదులు కావాలి.

4. ఆలోచనలు ఎంత పరిగెత్తినా లక్ష్యంపైకి దృష్టి మరల్చుకునే మనోబలం, ధ్యాస పెంచుకోవాలి. ఎట్టి పరిస్థితులలోనూ కార్యం సఫలమయ్యేదాక వెనుదిరుగకూడదు.

5. నమ్మిన దైవంపై, కార్యంపై స్థిరమైన శ్రద్ధ, విశ్వాసం కలిగి ఉండాలి.

ఇవన్నీ హనుమకు స్వామి భక్తి, కార్యసిద్ధిపై గల ఏకాగ్ర దృష్టి మరియు తదేకమైన ప్రాధాన్యత, దైవంపై నమ్మకం వలననే కలిగాయి. ఇవన్నీ మనకు చాలా ముఖ్యమైన పాఠాలు. చాలా సార్లు మనం నిరాశలో లక్ష్యాన్ని మరచి తప్పుదారి పడతాము. అలాగే, మధ్యలో వెనుదిరుగుతాము. దైవంపై పూర్తినమ్మకముండదు. వ్యూహంలో సమాజశ్రేయస్సు కన్నా స్వలాభంపైనే దృష్టి ఉంటుంది. అటువంటి అపజయంపాలు జేసే లక్షణాల నుండి బయట పడాలంటే శ్రధ్ధ, భక్తితో కూడిన సాధన ఎంతో అవసరం. దానికి ఆత్మశోధన, శారీరిక మానసిక దృఢత్వం ఎంతో ముఖ్యం. అందుకే రామాయణంలోని ప్రతి పాత్ర మనకు ఒక ఉదాహరణ. క్లిష్టమైన పరిస్థితులలో వారు ఎలా స్పందించారో మనకు నిత్యం ఎంతో ఉపయోగకరమైన వివరాలను అందజేస్తాయి. మానవాళి సోపానానికి, అభ్యుదయానికి రామాయణం అందుకే ఒక దిక్సూచి.

శ్రీరామ రామ! జై వీర హనుమాన్!