3, సెప్టెంబర్ 2021, శుక్రవారం

క్షీరసాగర విహార - త్యాగరాజస్వామి కృతి



ఈ కృతి బాలమురళీకృష్ణ గారి గాత్రంలో వింటుంటే ఎంతటి కఠినమైన హృదయమైనా కరిగి పోవలసిందే. త్యాగరాజాది భక్తులను పోషించిన శ్రీరామచంద్రమూర్తి గుణవైభవాన్ని అద్భుతంగా ఆవిష్కరించే కృతి ఇది. త్యాగరాజస్వామి ఉత్సవ సాంప్రదాయ కృతులలో ఒకటి, బాలమురళీకృష్ణ గారు ఎంతో ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చారు. ఆనందభైరవి రాగంలో స్వరపరచబడింది. త్యాగరాజ శిష్యపరంపరలో ఐదవ తరానికి చెందిన వారు బాలమురళీకృష్ణ గారు. సద్గురువుల సాహిత్యం, స్వరరచన యథాతథంగా కొనసాగించిన వారిలో మంగళంపల్లి వారు అగ్రగణ్యులు. వారి గాత్రంలో ఈ కృతిని విని ఆనందించండి. 

క్షీరసాగర విహార! అపరిమిత ఘోర పాతక విదార!
క్రూర జన గణ విదూర! నిగమ సంచార! సుందర శరీర!

శతమఖాऽహిత విభంగ! శ్రీరామ! శమన రిపు సన్నుతాంగ!
శ్రితమానవాంతరంగ! జనకజా శృంగార జలజ భృంగ!

రాజాధిరాజ వేష! శ్రీరామ! రమణీయ కర సుభూష!
రాజనుత లలిత భాష! శ్రీ త్యాగరాజాది భక్త పోష!

పాలకడలిలో విహరించేవాడు, అనంతమైన ఘోర పాపములను నాశనము చేసేవాడు, రాక్షస సమూహాన్ని సంహరించేవాడు, వేదములలో సంచరించేవాడు, సుందరమైన శరీరము కలవాడు, నూరు యజ్ఞములు చేసిన ఇంద్రుని శత్రువులను నాశనము చేసేవాడు, మన్మథుని శత్రువైన పరమశివునిచే నుతించబడినవాడు, ఆశ్రయించినవారి హృదయములలో నివసించేవాడు, కలువ వంటి సీతమ్మ పాలిట తుమ్మెద వంటివాడు, రాజాధిరాజు అయినవాడు, అందమైన హస్తములు కలిగి, చక్కని ఆభరణములు ధరించినవాడు, రాజులచే నుతించబడినవాడు, మృదువుగా మాట్లాడేవాడు, త్యాగరాజు మొదలైన భక్తులను పోషించేవాడు శ్రీరాముడు. 

- త్యాగరాజస్వామి

25, జనవరి 2021, సోమవారం

ఆనందసాగరమీదని దేహము - త్యాగరాజస్వామి కృతి

త్యాగరాజస్వామి వారి నాదయోగంలో బ్రహ్మానందస్థితిలో రచించిన కృతులెన్నో. ఆ అనందాన్ని అనుభవించలేని దేహం భూమికి భారమే అన్నది కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. బ్రహ్మవిష్ణుమహేశ్వరులు, ఎందరో మహానుభావులు చేసిన నాదోపాసనను మానవుడూ కూడా అనుభూతి చెందాలన్నది సద్గురువుల సందేశం. అటువంటి భావమున్న కృతి ఆనందసాగరమీదని దేహము. వివరాలు:

సాహిత్యం
========

ఆనందసాగరమీదని దేహము భూమిభారమే రామబ్రహ్మా(నందసాగర)

శ్రీనాయకాఖిల నైగమాశ్రిత సంగీత జ్ణానమను బ్రహ్మా(నందసాగర)

శ్రీవిశ్వనాథ శ్రీకాంత విదులు పావనమూర్తులుపాసించలేదా
భావించి రాగలయాదుల భజియించే శ్రీత్యాగరాజనుత 

భావం
=====

ఓ రామా!సీతాపతీ! రామ పరబ్రహ్మమనే ఆనందసాగరములో ఈదని దేహము ఈ భూమికి భారమే. సమస్త వేదములకు ఆశ్రయమైన సంగీత జ్ఞానమనే బ్రహ్మానందమనే సాగరాన్ని అనుభూతి చెందని దేహము భారమైనది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, నిర్మలరూపులు సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఉపాసించినారు కదా! ఆ విధముగా భావించి రాగలయాదులతో భజించే పరమశివునిచే నుతించబడే శ్రీరామా! బ్రహ్మానందమనే సాగరాన్ని అనుభూతి చెందని దేహము భారమైనది. 

శ్రవణం
======

గరుడధ్వని రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని కృత్తికా నటరాజన్ గారు ఆలపించారు.

16, జనవరి 2021, శనివారం

చిదంబర నటరాజమాశ్రయేऽహం - ముత్తుస్వామి దీక్షితుల కృతి


పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటైన చిదంబరంలో నటరాజస్వామి, శివకామసుందరీ అమ్మ వారు, ఈ క్షేత్రంలోనే ఉన్న గోవిందరాజస్వామిపై నాదజ్యోతి ముత్తుస్వామి దీక్షితుల వారు ఎన్నో కృతులను రచించారు. చిదంబర క్షేత్రం విశ్వానికి హృదయస్థానంగా, చిత్సభలో నటరాజస్వామి చేసే నాట్యం యొక్క లయే విశ్వానికి హృదయస్పందంగా చెప్పబడింది. ఎంతో నిగూఢమైన సందేశం కలిగిన కృతులను ఆయన ఈ క్షేత్ర దేవతలపై రచించారు. వాటిలో ముఖ్యమైనవి ఆనందనటనప్రకాశం, చిదంబరేశ్వరం, శివకామీపతిం చింతయేऽహం, శివకామేశ్వరీం చింతయేऽహం, శివకామేశ్వరం చింతయామ్యహం, చింతయేऽహం సదా చిత్సభా నాయకం, గోవిందరాజాయ నమస్తే, సతతం గోవిందరాజం మొదలైనవి. వీటితో పాటు చిదంబర నటరాజమాశ్రయేऽహం అన్న కృతిని కూడా రచించారు. వివరాలు:

సాహిత్యం
=======

చిదంబర నటరాజమాశ్రయేऽహం శివకామీపతిం చిత్సభాపతిం

చిదంబరవిహారం శంకరం చిదానందకరం గురుగుహవరం
కేదారేశ్వరం విశ్వేశ్వరం కమలాపతి నుత పదం శశిధరం

భావం
=====

చిత్సభకు ప్రభువు, శివకామసుందరికి పతియిన చిదంబర నటరాజస్వామిని నేను శరణు కోరుచున్నాను. ఆకాశలింగ రూపములో చిదంబరంలో విహరించేవాడు, శాశ్వతమైన ఆనందమును కలిగించేవాడు, సుబ్రహ్మణ్యునికి వరములొసగినవాడు, కేదారేశ్వరునిగా కేదారనాథ్‌లో వెలసినవాడు, విశ్వమునకు ప్రభువు, లక్ష్మీపతి యైన శ్రీహరిచే నుతించబడిన పదములు కలవాడు, చంద్రుని తలపై ధరించినవాడు అయిన చిదంబర నటరాజస్వామిని నేను శరణు కోరుచున్నాను. 

శ్రవణం
======

కేదారం రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని ఐశ్వర్యా శంకర్ గారు ఆలపించారు

13, జనవరి 2021, బుధవారం

దొరకునా ఇటువంటి సేవ - త్యాగరాజస్వామి కృతి


త్యాగరాజస్వామి కృతులలో కొన్ని చాలా ప్రత్యేకమైనవి. ముఖ్యంగా రాముని సేవా భాగ్యం యొక్క గొప్పతనాన్ని ప్రస్తావించే ఉన్నతస్థాయి కృతులను ఎన్నో రచించారు. రాముని రూప లావణ్యాలను, ముక్కోటి దేవతలు, భాగవతోత్తములు శ్రీరాముని అనేక ఉపచారముల ద్వారా కొలిచే రీతిని కళ్లకు కట్టినట్లు వర్ణించి, మనసులు ఉప్పొంగి రామభక్తి సామ్రాజ్యంలో మనం కూడా అంతర్భాగం కావాలన్న సంకల్పం కలిగేలా చేశారు. ఆయన నిరంతర రామ సేవా భాగ్యంలో తరిస్తూ రచించిన ఈ కృతులు అమృతధారలై నిలిచాయి. అటువంటి ఒక కృతి దొరకునా ఇటువంటి సేవ. వివరాలు:

సాహిత్యం
========

దొరకునా ఇటువంటి సేవ

దొరకునా అల్ప తపమొనరించిన భూసురవరులకైన సురలకైన 

తుంబురు నారదాదులు సుగుణ కీర్తనంబుల నాలాపము సేయగ
అంబరీషముఖ్యులు నామము సేయగ జాజుల పై జల్లగ
బింబాధరలగు సురవార యలివేణులు నాట్యము లాడగ
అంబుజ భవ పాకారులిరుగడలనన్వయ బిరుదావళినిపొగడగ
అంబరవాస సతులు కర కంకణంబులు ఘల్లని విసరగ మణి హా
రంబులు కదలగ నూచే ఫణి తల్పంబున నెలకొన్న హరిని కనుగొన

మరకత మణి సన్నిభ దేహంబున మెరుగు కనక చేలము శోభిల్ల
చరణ యుగ నఖావళి కాంతులు చందురు పిల్లలను గేర
వర నూపురము వెలుగు కర యుగమున వజ్రపు భూషణములు మెరయ
ఉరమున ముక్తాహారములు మరియు ఉచితమైన మకర కుండలంబులు
చిరు నవ్వులు గల వదనంబున ముంగురులద్దంపు కపోలము ముద్దు
గురియు దివ్యఫాలంభున దిలకము మెరసే భువిని లావణ్యనిధిని గన

తామస గుణ రహిత మునులకు బొగడ దరము గాకనే భ్రమసి నిల్వగ
శ్రీమత్కనకపు దొట్ల పైని చెలువందగ కొలువుండగ
కామిత ఫలదాయకియౌ సీత కాంతుని గని యుప్పొంగగ
రామబ్రహ్మ తనయుడౌ త్యాగరాజు తాబాడుచు నూచగ
రాముని జగదోద్ధారుని సురరిపు భీముని త్రిగుణాతీతుని పూర్ణ
కాముని చిన్మయరూపుని సద్గుణధాముని కనులార మదిని కనుగొన

భావం
=====

సూక్ష్మమైన తపము చేసిన బ్రాహ్మణులకైనా, దేవతలకైనా ఇటువంటి రామ సేవాభాగ్యము దొరకునా? తుంబురు నారదులు సుగుణములను పొగడే కీర్తనలను ఆలాపన చేయగా, అంబరీషుడు వంటి భక్తాగ్రగణ్యులు నామమును నుతించగా, జాజులను చల్లుతూ ఎర్రని పెదవులు కలిగిన దేవ కన్యలు నాట్యము చేయగా, బ్రహ్మేంద్రాదులు ఇరుపక్కల అనేక బిరుదులతో పొగడగా, ఆకాశములో నివసించే సతులు చేతుల కంకణములు ఘల్లనిపించగా, మణిహారములు ఊగగా నూచే శేషతల్పశాయియైన హరిని చూచే సేవాభాగ్యము దొరకునా? పచ్చలకాంతి వంటి ప్రకాశము కలిగిన దేహముపై మెరిసే బంగారు వస్త్రము శోభిల్లగా, పాదములగోళ్ల కాంతులు చంద్రకాంతులను పోలగా, మంచి మంజీరములు పాదములపై వెలుగొందగా, చేతులయందు వజ్రాల ఆభరణాలు మెరయగా, కంఠమున ముత్యాల హారములు, చెవులకుచితమైన మకర కుండలములు, చిరునవ్వులు కలిగిన ముఖమున ముంగురులు, అద్దము వంటి చెక్కిళ్లు ముద్దులు కురిపించగా, దివ్యమైన నుదుట మెరిసే తిలకము కలిగిన ఈ భూమిపై సౌందర్యమునకు నిధియైన రాముని చూచే సేవాభాగ్యము దొరకునా? తామస గుణరహితులైన మునులకు పొగడ శక్యము గాక చకితులై నిలువగా, కనకపు ఊయలపై అందముగా కొలువుండిన, కోరిన వరములొసగే సీతమ్మ పతిదేవుని చూచి ఉప్పొంగగా, కాకర్ల రామబ్రహ్మం తనయుడైన త్యాగరాజు తాను పాడుచు ఊపగా, జగదోద్ధారకుడు, రాక్షసుల పాలిట అరివీరభయంకరుడు, త్రిగుణాతీతుడు, పూర్ణకాముడు, సచ్చిదానంద స్వరూపుడు, సద్గుణములకు నెలవైన రాముని కనులార మనసులో కనుగొనే సేవాభాగ్యము దొరకునా? 

శ్రవణం
=======

బిలహరి రాగంలో ఈ కృతిని రంజని-గాయత్రి సోదరీమణులు పాడగా వినండి

10, జనవరి 2021, ఆదివారం

ఎదుటనున్నాడు వీడే - అన్నమాచార్యుల కృతి


పరబ్రహ్మమైన శ్రీహరి దేవకి కడుపున అసాధారణమైన పరిస్థితులలో అవతారం దాల్చి, అటువంటి అసాధారణ పరిస్థితులలోనే దేవకి చెంతకు చేరి ఆ తల్లితో అపురూపమైన బంధాన్ని పంచుకున్నాడు. బ్రహ్మాండమును బాలుని నోట జూచినా, వైష్ణవమాయలో ఆ తల్లి పరమాత్మను బిడ్డగానే భావించి అవ్యాజమైన ప్రేమను పంచింది. ఇక పెరుగుతున్న కొద్దీ ఆ బాలుని లీలలు అన్నా ఇన్నా? వెన్నముద్దలు దొంగిలించాడు, పశువులను గాచాడు, రాక్షసులను సంహరించాడు, శాపగ్రస్తులకు మోక్షాన్ని కలిగించాడు, కాళీయుని పొగరణచాడు, రాసలీలలో పాల్గొన్నాడు.... అడుగడుగునా వైనమంత వల్లించలేని లీలలు, నమ్మశక్యం గాని చేష్టలు. వీటిని అన్నమాచార్యుల వారు తమ సంకీర్తనలెన్నిటో అద్భుతంగా ప్రస్తావించారు. అటువంటి ఒక కృతి ఎదుటనున్నాడు వీడే. వివరాలు:

సాహిత్యం
========

ఎదుటనున్నాడు వీడే! ఈ బాలుడు!
మది తెలియమమ్మ ఏమరులో గాని!!

పరమపురుషుడట పశుల గాచెనట
సరవులెంచిన విన సంగతా యిది
హరియె తానట ముద్దులందరికి జేసెనట
ఇరవాయనమ్మ సుద్దులేటివో గాని

వేదాలకొడయడట వెన్నలు దొంగిలెనట
నాదించి విన్నవారికి నమ్మికా యిది
ఆదిమూలమీతడట ఆడికెల చాతలట
కాదమ్మ ఈ సుద్దులు ఎట్టి కతలో గాని

అల బ్రహ్మ తండ్రియట యశోదకు బిడ్డడట
కొలదొకరికి చెప్ప కూడునా యిది
తెలిపి శ్రీవేంకటాద్రి దేవుడై నిలిచెనట
కలదమ్మ తనకెంతో కరుణో గాని

భావం
=====

ఇతనివి ఏమి మాయలో గానీ, ఎదుటనున్న ఈ బాలుడైన కృష్ణుని మనసు మనం తెలుసుకోలేమమ్మా! ఇతడే పరమపురుషుడట, మరి పశువులను గాస్తున్నాడుట, ఈ తీరులను లెక్కించిన అర్థమయ్యే సంగతులు కావు. ఇతడే శ్రీహరియట, అందరికీ మురిపాలు అందిస్తున్నడట, ఇవేమి మాటలో గానీ స్థిరమై నిలిచాయి. ఇతడు వేదాలకు ప్రభువట, మరి వెన్నలు దొంగిలించిన వాడు కూడా ఇతడేయట, శ్రద్ధగా విన్న వారికైనా ఇది నమ్మదగినదేనా? అన్నిటికీ మూలము ఇతడేనట, ఇతడివి కొంటె చేష్టలట, ఇవి కథలే తప్ప మంచి మాటలు కావు. ఇతడు బ్రహ్మకు తండ్రియట, మరి యశోదకు బిడ్డ కూడా అట, మనపై ఎంత కరుణో ఉందో, అందుకే తన మహిమలను తెలిపేందుకు శ్రీవేంకటాద్రిపై దేవుడై నిలిచినాడట, ఇతనివి ఏమి మాయలో గానీ, ఎదుటనున్న ఈ బాలుడైన కృష్ణుని మనసు మనం తెలుసుకోలేమమ్మా!

శ్రవణం
=======

భుజంగిణి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ గారు ఆలపించారు

2, జనవరి 2021, శనివారం

బ్రహ్మాండ వలయే మాయే - మైసూరు మహారాజా జయచామరాజ వడయార్ కృతి


ఈ భారతదేశంలో సంగీతం కలకాలం నిలిచింది అంటే దానికి ఆనాటి పాలకుల ఇచ్చిన ఆదరణ కూడా ఒక ముఖ్యమైన కారణం. త్యాగరాజస్వామి వంటి వాగ్గేయకారులు రాజాశ్రయాన్ని పూర్తిగా త్యజించారు, అది ఆనాటి పరిస్థితులకు సముచితంగా వారు ఎంచుకున్న మార్గం. రాజాశ్రయంలో ఉన్న లోటుపాట్లను ఎరిగే, నరస్తుతులకు, వారిచ్చే కానుకలకు దూరంగా నిలిచి పూర్తిగా రాముని సేవలోనే గడిపారు. కర్నాటక సంగీతంలో ఉన్న మహత్తును, ఆధ్యాత్మిక సంపదను గ్రహించి ఆ తరువాతి కాలంలో ఎందరో జమీందార్లు, పాలకుకు స్వయంగా సంగీతాన్ని పూర్తిస్థాయిలో అభ్యసించి, దానిని ఉపాసనా మార్గంలో వినియోగించుకుని, అద్భుతమైన అనుభూతులను పొందుతూ, తమ తమ ఆస్థానలలో సంగీత సాహిత్య నాట్య సాంప్రదాయాలకు పెద్ద పీట వేసి కళాకారులను, గురువులను ఆదరించి, ప్రోత్సహించారు. అటువంటి వారిలో మైసూరు సంస్థానం చివరి మహారాజా జయచామరాజ వడయార్ గారు ప్రముఖులు. వారు శ్రీవిద్యోపాసకులే కాకుండా కర్నాటక శాస్త్రెయ సంగీత ప్రావీణ్యం కలవారు, ఎన్నో కృతులను కూడా రచించారు. మైసూరు సామ్రాజ్య దేవత అయిన రాజరాజేశ్వరి అమ్మవారిని నుతిస్తొ ఆయన రచించిన ఒక కృతి. వడయార్ గారి ముద్ర శ్రీవిద్య. అలాగే, ఈ కృతిని ఆయన మాండ్ రాగంలో స్వరపరచారు. తగ్గట్టుగానే పల్లవిలోనే రాగముద్రను పొందు పరచారు. వారి సంస్థానంలో నిత్యం ఈ కృతిని విద్వాంసులు ఉదయం అమ్మవారి సేవలో ఆలపించేవారట. అద్భుతమైన ఆధ్యాత్మిక సంపద కలిగిన ఈ కృతిని పరిశీలిస్తే వడయార్ గారి సంస్కృత భాషా పాండిత్యం, ఉపాసనా బలం గోచరిస్తాయి. శివజాయే, బ్రహ్మరంధ్రనిలయే, అహినిభవేణి, అంతరహిత కైవల్య విహారిణి, గతినిర్జితకరిణి మొదలైన పదసమూహాలు వడయార్ గారి ప్రతిభలోని ఔన్నత్యాన్ని తెలుపుతాయి. వివరాలు:

సాహిత్యం
========

బ్రహ్మాండ వలయే మాయే బ్రహ్మాది వందిత శివజాయే

బ్రహ్మవిద్యానందిత హృదయే బ్రహ్మర్షాద్యుపాసిత శ్రీవిద్యా బ్రహ్మరంధ్రనిలయే

గౌతమార్చిత గాయత్రి గౌరీ గిరిరాజేంద్ర పుత్రి
కాంత రాగిణి నారాయణి కారుణ్య లలితే మంజులవాణి
అంతర్ముఖ జ్యోతిర్మయ కల్యాణి అహినిభవేణి పురాణి
అంతరహిత కైవల్య విహారిణి గతినిర్జితకరిణి గీర్వాణి

భావం
=====

పరమశివుని పత్నివైన ఓ పార్వతీదేవీ! నీవు బ్రహ్మాండమును చుట్టి యున్న మాయవు, బ్రహ్మాదులచే పూజించబడుచున్నావు. నీవు బ్రహ్మవిద్యచే ఆనందము పొందే హృదయము కలిగియున్నావు, బ్రహ్మర్షులచే ఉపాసించే శ్రీవిద్యవు, సహస్రార చక్రమునందు నివసించియున్నావు. నీవు గౌతమ మునిచే అర్చించబడిన గాయత్రివి, పర్వతరాజేంద్రుడైన హిమవంతుని పుత్రివి, పతియైన పరమశివునిపై అనురాగముతో నిండియున్నావు, నారాయణుని సోదరివి, కరుణామూర్తివి, లలితవు, మృదువైన పలుకులు కలిగియున్నావు, ఎల్లప్పుడూ అంతర్ముఖవై ప్రకాశించెదవు, ఎల్లప్పుడూ శుభములు కలిగించెదవు, తుమ్మెదల సమూహము వంటి కురులు కలిగియున్నావు, సనాతనమైనదానవు, అంతములేని మోక్షములో విహరించెదవు, ఏనుగును మించిన నడక కలిగి, వాక్కే అస్త్రముగా గల పరదేవతవు.

శ్రవణం
======

మాండు రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని విదుషీమణి ఎమ్మెస్ షీలా గారు ఆలపించారు


1, జనవరి 2021, శుక్రవారం

ఈ పాదం ఇలలోన నాట్య వేదం - వేటూరి గీతం



శ్రీహరి చరణకమలాల మహత్తును, రహస్యాన్ని ఎందరో ఋషులు, వాగ్గేయకారులు, కవులు వేనోళ్ల పొగిడారు, తమ అంతర్దృష్టితో పొందిన అనుభూతులను మనోజ్ఞంగా అక్షరరూపంలో ఆవిష్కరించారు. అపౌరుషేయమైన వేదములలో కూడా పరమపురుషుని పదాల గురించి అనేక చోట్ల ప్రస్తావన ఉంది. పురుష సూక్తంలో పాదోऽస్య విశ్వా భూతాని త్రిపాదస్యామృతం దివి, త్రిపాదూర్ధ్వ ఉదైత్పురుషః పాదోऽస్యేహాऽऽభవాత్పునః అని చెప్పబడింది, అనగా పరమాత్మ పాదమే విశ్వముగా ఆవిర్భవించింది, ఆ స్వామి మూడు పాదములు అమృతత్వం కలిగిన లోకాలపై నిలిచి ఉంటాయి, అవి అత్యున్నతమైన మోక్షాన్ని సూచించే విధంగా ఊర్ధ్వదిశగా ఉంటాయి, ఆ పరమపురుషుని ఒక పాదమే మరల మరల సృష్టి క్రమమవుతున్నది అని. ఈ సత్యాన్నే అనేక అవతారములలో మనం గమనిస్తాం కూడా. వాటిని వాగ్గేయకారులు తమ సాహిత్యంలో అద్భుతంగా ప్రస్తావించారు. అన్నమాచార్యుల వారు బ్రహ్మ కడిగిన పాదము అన్న కృతిలో దశావతారములలో పరమపురుషుని పదవైశిష్ట్యాన్ని ఆవిష్కరించగా, కృష్ణశాస్త్రి గారు పదములె చాలు రామా నీ పదధూళులె పదివేలు అన్నారు, అలాగే రామచరణం రామచరణం రామచరణం మాకు శరణం అని అటువంటి భావాన్నే తనదైన శైలిలో పలికించారు. ఆ తరువాత ఈ హరిపాద వైభవాన్ని అంతే మనోజ్ఞంగా, లోతుగా పలికించారు వేటూరి వారు. మయూరి చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీతం కూర్చగా వేటూరి చేసిన శ్రీహరి పదార్చన వివరాలు.


సాహిత్యం
=======

ఈ పాదం ఇలలోన నాట్య వేదం
ఈ పాదం నటరాజుకే ప్రమోదం
కాల గమనాల గమకాల గ్రంథం 

ఈ పాదమే మిన్నాగు తలకు అందం
ఈ పాదమే ఆ నాటి బలికి అంతం
తనలోని గంగమ్మ ఉప్పొంగగా
శిలలోని ఆ గౌతమే పొంగగా
పాట పాటలో తను చరణమైన వేళ
కావ్య గీతిలో తను పాదమైన వేళ
గానమే తన ప్రాణమై లయలు హొయలు విరిసే ఈ పాదం

ఈ పాదమే ఆ సప్తగిరికి శిఖరం
ఈ పాదమే శ్రీహస్త కమల మధుపం
వాగ్గేయ సాహిత్య సంగీతమై
త్యాగయ్య చిత్తాన శ్రీగంధమై
ఆ పాదమే ఇల అన్నమయ్య పదమై
ఆ పాదమే వరదయ్య నాట్య పథమై
తుంబుర వర నారద మునులు  జనులు కొలిచే ఈ పాదం


భావం
====

శ్రీహరి పాదమే కదా ఈ భూమిపై నాట్యానికి వేదమైంది, ఈ పాదం పరమశివునికి ఆనందం కలిగించేది, ఈ పాదం కాలగమనంలోని మార్పులకు సాక్ష్యం. ఈ శ్రీహరి పాదమే కాళింగుని తలలపై అందంగా నాట్యం చేసింది, ఈ పాదమే ఆనాడు బలిని పాతాళానికి తొక్కివేసింది, ఈ పాదం నుండే సురగంగ జన్మించింది, ఈ పాదం తాకగానే అహల్య శాపవిముక్తి పొంది తిరిగి చైతన్యవంతమైంది, ప్రతి గీతంలోనూ ఈ పాదం ఒక చరణమైంది, ప్రతి కావ్యగీతికలోనూ ఈ శ్రీహరి చరణమే ఒక పాదమైంది, గానామృతమే తన ప్రాణం చేసుకుని లయబద్ధంగా హొయలు చిందించేది ఈ శ్రీహరి పాదమే. ఈ శ్రీహరి పాదమే ఏడుకొండలకు శిఖరమైంది, ఈ పాదమే లక్ష్మీ దేవి చేతిలో ఉన్న కమలముపై తుమ్మెదలా వ్రాలి ఉంది, ఈ పాదమే వాగ్గేయకారుల సాహిత్య సంగీత రూపమైంది, ఈ పాదమే త్యాగయ్య చిత్తానికి శ్రీచందనమైంది, ఈ పాదమే అన్నమయ్య పదకవితగా జాలువారింది, ఈ పాదమే క్షేత్రయ్యకు నాట్యసోపానమైంది, తుంబురుడు, నారదుడు, మునిశ్రేష్ఠులు, మానవులు కొలిచేది ఈ శ్రీహరి పాదమునే. 

శ్రవణం
======

వేటూరి సుందరరామమూర్తి గారి గీతాన్ని ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం గారి స్వరపరచగా, ఎస్పీ శైలజ గారు ఆలపించారు