భూరికరుణాకర పూతనాశకటధేనుకాదిహర వేణుగానపర చారుపింఛధర
ఓ లక్ష్మీపతీ! ప్రభూ! శరణు కోరిన వారిని కాపాడుటలో ఆసక్తి గల మాధవా! గరుడుని సర్పభయాన్ని తొలగించినవాడవు, ఆదిశేషునిపై శయనించే వాడవు, అపారమైన కరుణకు నిలయమైనవాడవు. నిన్ను నేను ధ్యానిస్తున్నాను. పూతన, శకటాసురుడు, ధేనుకాసురుడు మొదలైన రాక్షసులను సంహరించినవాడవు, వేణుగానలోలుడవు, అందమైన నెమలిపింఛాన్ని ధరించినవాడవు, నిన్ను నేను ధ్యానిస్తున్నాను. నుదుట కన్నుగల శివుడు, కమలాసనుడైన బ్రహ్మ మొదలైన దేవతలచే సేవించబడే పాదాలు గలవాడవు, సాలపుష్పాల సువాసనతో నిండిన కేశసంపద కలవాడవు, నీలమేఘం వంటి కాంతితో అపూర్వ శోభ కలవాడవు, కాళీయ సర్పపు పడగలపై నర్తించినవాడవు, స్త్రీ సమూహాల మనస్సులను మోహింపజేసేవాడవు, నిన్ను నేను ధ్యానిస్తున్నాను. గజరాజువలె గంభీరమైన నడక కలవాడవు, ఉదారమైన సద్గుణాలకు నిలయమైనవాడవు, గోవర్ధన పర్వతాన్ని ధరించినవాడవు, ధీరుడవు, మధువనంలో మనోహరంగా విహరించినవాడవు, యదుకులానికి ఆభరణమువంటి వాడవు, మురాసురుని సంహరించినవాడవు, నారదుడు మొదలైన శ్రేష్ఠ యోగుల మనస్సులనే నూతన కమలాలలో విహరించే రాజహంసవంటి జనార్దనుడవు, నిన్ను నేను ధ్యానిస్తున్నాను. బలరాముని సోదరుడవు, పాపసమూహాలను తొలగించడంలో అత్యంత సమర్థుడవు, కమలాల వంటి కన్నులు, ఎంతో మృదువైన చిరునవ్వు కలవాడవు, సాటిలేని సౌందర్యమూర్తివి, వనమాలతో శోభించే కంఠం కలవాడవు, గిరిధరుడవు, భూమికి మేఘంవలె జీవనాధారమైనవాడవు, సుందరమైన ముఖం కల పద్మనాభుడవు, శంఖచక్రాది దివ్యాయుధాలను ధరించినవాడవు, అట్టి నిన్ను నేను భక్తితో ధ్యానిస్తున్నాను.
ఆరభి రాగంలో స్వరపరచబడిన ఈ స్వాతి తిరునాళ్ కృతిని అమృత వెంకటేష్ బృందం ఆలపించారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి