26, జూన్ 2017, సోమవారం

చెంతనే సదా యుంచుకోవయ్యా - త్యాగరాజ స్వామి రామభక్తి



చెంతనే సదా యుంచుకోవయ్యా 

మంతుకెక్కు శ్రీమంతుడౌ హనుమంతు రీతిగ శ్రీకాంత 

తలచిన పనులను నే తెలిసి తలతో నడచి సంతసిల్లుదురా
పలుమారు బల్క పనిలేదు రామభరతుని వలె త్యాగరాజనుత

ఓ రామా! లక్ష్మీపతీ! ఎంతో భాగ్యవంతుడు, నీ పరమభక్తునిగా ప్రసిద్ధి చెందిన హనుమంతుని వలె మమ్ము నీ చెతనే యుంచుకొనుము. నీవు తలచిన పనులన్ని తెలివితో మెలకువతో శిరసావహించి సంతోషించెదను. మరల మరల చెప్పనవసరం లేకుండా నువ్వు చెప్పిన పని చేసెదను. అలా చేసిన భరతుని వలె నన్ను ఎల్లప్పుడు నీ చెంతనే యుంచుకొనుము.

- సద్గురువులు త్యాగరాజ స్వామి

రాముని బంటుగా హనుమ ఎంత ప్రసిద్ధి చెందాడో లోకవిదితమే. అసాధ్యమనుకున్న కార్యములను రామభక్తితో సాధించిన ధీరుడు ఆ హనుమ. అలాగే, అన్న మనసెరిగి ఆయన మాట శిరసావహించి జాగృత స్థితిలో యున్నవాడు భరతుడు. వారిద్దరిలా తనకు కూడా ఎల్లప్పుడూ ఆయన చెంతనే యుండే భాగ్యాన్ని కలిగించమని త్యాగరాజస్వామి ఈ కీర్తన ద్వారా కోరారు. మంతుకెక్కు అన్న పదానికి ప్రసిద్ధి చెందిన అని అర్థం. కీర్తనలో ఆ పదాన్ని ఉపయోగించి రామభక్తులలో హనుమకున్న అగ్రస్థానాన్ని త్యాగయ్య చాటారు. త్యాగరాజస్వామికి తెలుగు భాషపై ఉన్న పట్టు కొన్ని పదప్రయోగాలు గమనిస్తే అర్థమవుతుంది. నిరంతరము స్వామి ఆజ్ఞకై వేచియుండే హనుమ కార్యసిద్ధి హనుమంతునిగా పేరొందాడు. సీతమ్మ జాడను తెలిపిన హనుమను రాముడు హత్తుకొని ఉత్తమునిగా వర్ణించాడు. లక్ష్మణునికి ప్రాణం పోసి సంజీవని హనుమంతుడయ్యాడు. రాక్షససేనను సంహరించి వీర హనుమంతుడయ్యాడు. అందుకే సీతమ్మ సకల గుణ సంపన్నుడు అని పొగడి ముత్యాల హారాన్ని ఆ హనుమకు బహుమతిగా ఇచ్చింది. నిరంతర రామసేవా భాగ్యంలో తరిస్తూ దాసాంజనేయుడైనాడు. ఆ హనుమ వలె తనను ఎల్లప్పుడూ చెంతనే ఉంచుకోమని త్యాగరాజు కోరారు. అలాగే, అన్నపై అనన్యమైన భక్తి, గౌరవం కలవాడు భరతుడు. రాజ్యాన్ని త్యజించి అన్న పాదుకులను సింహాసనంపై యుంచి ధర్మాన్ని నిర్వర్తించిన వాడు ఆ భరతుడు. ఆ భరతుడంటే రామునికి అమితమైన వాత్సల్యం. అటువంటి వాత్సల్యం కోసం తనను చెంతనే యుంచుకోమని త్యగయ్య రాముని కోరారు. రామభక్తి సామ్రాజ్యంలో ఓలలాడే బంటులకు అలసట ఉండదు, ఎంత సేవ చేస్తే అంత సంతోషం. ఆ భావనలనే త్యాగయ్య ఈ కీర్తన ద్వారా తెలియజేశారు.

కుంతలవరాళి రాగం దాటు స్వరాలతో హనుమంతుని కుప్పిగంతులను గుర్తు చేస్తుందని నూకలవారు విశ్లేషించారు. అందుకే ఈ కీర్తనకు ఆ రాగాన్ని ఉపయోగించారు త్యాగరాజస్వామి. కుంతలవరాళి రాగంలో ఈ కృతిని వినండి.

చెంతనే సదా యుంచుకోవయ్యా!


25, జూన్ 2017, ఆదివారం

దొరకునా ఇటువంటి సేవ - వేటూరి అజరామర గీతం



దొరకునా ఇటువంటి సేవ నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము సేయు త్రోవ

రాగాలనంతాలు నీవేయి రూపాలు భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు
నాదాత్మకుడవై నాలోన చెలగి నా ప్రాణ దీపమై నాలోన వెలిగే
నిను కొల్చు వేళ దేవాది దేవా దేవాది దేవా దొరకునా ఇటువంటి సేవ


ఉచ్చ్వాస నిశ్శ్వాసములు వాయులీనాలు
స్పందించు నవనాడులే వీణాగానాలు
నడలు ఎదలోని సడులే మృదంగాలు
నాలోని జీవమై నాకున్న దైవమై
వెలుగొందు వేళ మహానుభావా మహానుభావా దొరకునా ఇటువంటి సేవ

పరమాత్మా! నీ పదకములములను చేరే ముక్తిపథములోని మెట్లను అధిరోహణము చేసే త్రోవ ఈ సంగీత సేవ. మళ్లీ మళ్లీ దొరకునా ఇటువంటి సేవ?అనంతమైన రాగాలు నీ వేల రూపాలు. అవి ఈ జననమరణాలతో కూడిన సంసారసాగరంలోని రోగాలనే అంధకారాలను తొలగించే దీపాలు. నా ఆత్మకు స్వరూపమై నాలోని నివసించి నా ప్రాణ దీపమి నాలోన వెలిగే నిన్ను కొలిచే వేళ, ఓ దేవాది దేవా!, ఎంత గొప్పది. ఇటువంటి సేవ మళ్లీ మళ్లీ దొరకునా? ఈ సంగీత సేవలో ఉచ్చ్వాస నిశ్వాసలే ఫిడేలు నాదాలు. ఆ సప్తస్వరాలకు స్పందించే నవనాడులు (ఇడ, పింగళ, సుషుమ్న, గాంధార, హస్తిని, పుష, జయస్విని, అలంబస, కుహ) వీణాగానాలు. వివిధ కదలికలు, హృదయ స్పందనలే మృదంగ ధ్వానాలు. నాలోని జీవమై, నాకున్న దైవమై నీవు వెలుగొందు వేళ, ఓ మహానుభావా! ఇటువంటి సేవ మళ్లీ దొరకునా!

- వేటూరి సుందరరామమూర్తి (శంకరాభరణం చిత్రం)

నాదోపాసనలో తరించే సంగీత యోగుల మనోభావనలను అద్భుతంగా ప్రతింబింబించే గీతం ఇది. ఆత్మజ్ఞానులు కావటానికి వేయటానికి సంగీతం ఓ అద్భుతమైన సాధనం. ఈ సేవలో తరించి ముక్తిని పొందిన వారెందరో. శంకరాభరణంలోని శంకరశాస్త్రీ అంతే. భావాన్ని స్వర రాగ యుక్తంగా నవనాడుల్లో నింపుకొని పరమాత్మతో అనుసంధానమై గానం చేసే యోగి. అందుకే కే విశ్వనాథ్ గారు ఆయన కోసం ప్రత్యేకమైన గీతాలను గేయకర్త చేత రచింపజేశారు. ఇటువంటి సేవ మళ్లీ దొరకునా అన్న భావన కలిగించేలా ఈ గీతాన్ని పతాక సన్నివేశంలో పొందుపరచారు. నాదసాధనే పరమాత్మకు పూజగా భావించిన వారు జీవన్ముక్తులైనారు. పవిత్రమైన నాదోపాసనలో ఉన్న శంకరశాస్త్రి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించిన చిత్రం శంకరాభరణం. అనంతమైన రాగాలను ఆయన సహస్ర రూపాలుగా భావించి ఆ నాదసాధనే భవసాగరములోని చీకట్లను తొలగించే జ్ఞానజ్యోతిగా అనుభూతి చెందిన విద్వాంసుడు శంకర శాస్త్రి. ఆ సంగీత సేవ శాశ్వతం కావటానికి శిష్యుడు కావాలి కదా? అత్యాచారానికి గురైన ఓ స్త్రీని తన వెంటబెట్టుకుని ఇంటికి రాగా పండితులు ఆయనను వెలివేయగా ఆ స్త్రీ ఆయనకు దూరంగా వెళుతుంది. ఆమె కడుపున పుట్టిన బిడ్డ శంకరశాస్త్రి గారి నాదోపాసనను కొనసాగించేందుకు అద్భుతమైన సన్నివేశాలను సృష్టించి అందులో చివరగా ఈ గీతాన్ని ఆవిష్కరించారు. ఆత్మకుడైన పరమాత్మను కొలిచే సేవలో తనువులోని వేర్వేరు ప్రక్రియలను సంగీత సాధనలోని పరికరాల నాదాలకు ఉపమానం చేశారు కవి వేటూరి. సంగీత సాధనలో మనలోని మలినములు తొలగి జ్ఞానేంద్రియములు జాగృతమై పరమాత్మతో అనుసంధానమయ్యే అవకాశం ఉంది. పవిత్రమైన ఈ సాధన ముక్తిమార్గానికి సోపానము. ఈ సందేశాన్నే కవి మనకు ఈ గీతం ద్వారా అందజేశారు. అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు వంటి వాగ్గేయకారులు ఇటువంటి భావనలనే అనుభవపూర్వకంగా సంకీర్తనల ద్వారా పలికారు. ఈ గీతం వెనుక ఉన్న కళాతపస్వి విశ్వనాథ్ గారికి, వేటూరి వారికి, సంగీత కారులు మహాదేవన్ గారికి, బాలసుబ్రహ్మణ్యం గారికి, వాణీజయరాం గారికి మనం ఎంతో రుణపడి ఉన్నాము. ఈ  పాట సాహిత్యం మరియు సన్నివేశం యొక్క ప్రాముఖ్యత ఇనుమడింపజేసేలా సోమయాజులు గారు, మంజు భార్గవి గారు, తులసి నటించారు. అందుకే ఈ చిత్రం సార్థక నామధేయమై నిలిచింది.



24, జూన్ 2017, శనివారం

సర్దుకుని కలిసుండటమా? విడిపోవటమా?


సర్దుకుని కలిసుండటమా? విడిపోవటమా? - ఇదీ నేటి భారతీయ యువ జంటలలో ఉన్న ప్రశ్న. చాలామంది విడిపోవటానికే మొగ్గు చూపుతున్నారు. నేను చెప్పేది పేదరికంలో మగ్గుతున్న వారు లేదా ఆర్థిక స్వావలంబన లేని వారు కాదు. ఉద్యోగాలు చేస్తూ చిన్న చిన్న విషయాలలో గొడవపడి నలుగురిని అందులోకి లాగి చివరకు ఏమీ చేయలేక విడాకులకు వెళుతున్న వారి గురించి. ఇటువంటి వారికి కీచులాటల మధ్యే ఒకరో ఇద్దరో బిడ్డలు.. వాళ్ల భవిష్యత్తు సింగిల్ పేరెంటింగ్‌లోనే. ఎవరినీ తప్పు పట్టలేము, తప్పని తెలిసినా చెప్పలేని, చెప్పినా వినలేని, విన్నా అర్థం చేసుకోలేని పరిస్థితులు. ఒకటి మాత్రం నిజం - వివాహానికి సిద్ధంగా లేనప్పుడు పెళ్లి చేయటం అనేది ఈ కాలంలో కూడని పని. సిద్ధం అంటే? - ఇతరుల మనస్తత్వాలను గమనించ గలిగే వ్యక్తిత్వ వికాసం, వైవిధ్యాన్ని, భిన్నత్వాన్ని స్వీకరించ గలగటం. ఇవిలేక అపరిపక్వత కలిగి ఉన్న యువతీ యువకులపై వివాహాన్ని రుద్దకూడదు. చాలా సమస్యలకు మూలం - పిల్లలను గారాబంగా పెంచటం, బాధ్యతలను సరైన వయసులో తెలియజేయలేకపోవటం, అడిగినదల్లా ఇచ్చి డబ్బు, ఆస్తులు ఎంత కష్టపడితే వస్తాయో నేర్చుకోనివ్వకపోవటం. తల్లిదండ్రులున్నది పిల్లలకు అన్నీ అందజేయటానికి కాదు. వారికి కావలసిన వ్యక్తిత్వ వికాసానికి తోడ్పటం వరకే. విద్య వ్యక్తిత్వ వికాసంలో భాగమే. ఆర్థిక స్వావలంబన అందరికీ తప్పనిసరి. కానీ, అది మానవీయ విలువలను, సంబంధాలను త్రుంచేదిగా ఉండకూడదు. పరిణతి, అవగాహన లేని వయసులో వివాహం చేసినందువలన ఊహించని సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంది. 25 ఏళ్లు ఇంకో ఇంట్లో పూర్తిగా భిన్నమైన వాతావరణంలో పెరిగిన జీవిత భాగస్వామి ఇష్టాయిష్టాలను గ్రహించి కొంత కూడా వారి కోసం సర్దుకోలేకపోవటానికి కారణం వ్యక్తిత్వం వికాసం, మనుషులతో వివృతి లేకపోవటం, అవగాహన పెరగకపోవటమే. ఇవి ఒకరోజులో వచ్చేవి కావు. గతంలో ఉమ్మడి కుటుంబంలో వేర్వేరు పాత్రల ద్వారా చాలామటుకు అందేవి. ఇప్పుడు మేమిద్దరం మాకిద్దరు మొత్తం నలుగురమే అనే కుటుంబ వ్యవస్థలో ఈ ముఖ్యమైన పాఠాలు అందే అవకాశం లేదు. కాబట్టి పిల్లలకు అవగాహన పెరిగే వరకు వేచి ఉండాలి. వారి నిర్ణయాల ఫలితాలను వారు భరించి ముందుకు వెళ్లేలా బాధ్యతాయుతంగా పెంచాలి. లేకపోతే ప్రతి మూడు వివాహాల్లోనూ ఒకటి విడాకుల వరకు వేళ్లే అవకాశం ఉంది.

నేటి భారతంలోని ఉరుకులు పరుగుల జీవితాల్లో డబ్బు చాలా పెద్ద పాత్ర పోషిస్తోంది. జీవన ప్రమాణాలతో పాటు డబ్బు అవసరం, డబ్బు యొక్క ప్రాధాన్యత వంద రెట్లు పెరిగాయి. ఎవరూ ఇంకొక మనిషిని పోషించే పరిస్థితులు లేవు. అందుకే మనుషులు ఆర్థిక స్థిరత్వం చిన్న వయసులోనే కోరుకుంటున్నారు. దీని ఫలితంగా ఉద్యోగ ప్రాధాన్యమైన చదువులే తప్ప వ్యక్తిత్వాలను దృఢ పరిచే చదువులు, అనుభవాలకు అసలు ప్రాధాన్యత లేదు. దాని వలన ఎదగని మనస్తత్వాలు, తొందరగా స్పందించే హృదయాలు, విమర్శను తట్టుకోలేని ఆవేశాలు. పురుషాహంకారం చదువుల వల్ల కొంత తగ్గినట్లు అనిపించినా, భార్యపై పైచేయి కావాలన్నదే ఇప్పటికీ భారతీయ పురుషుని మనస్తత్వం. దీనికోసం ఎంతకైనా తెగిస్తున్నాడు. అలాగే, స్త్రీలలో కూడా అర్థం చేసుకునే గుణం, ఓర్పు చాలా తగ్గాయి. వారిలో ఆవేశకావేశాలు పెరిగి ప్రతి చిన్న అభిప్రాయం భేదం కూడా తగవుగా మారుతోంది. అందుకే తల్లిదండ్రులు ఇప్పటికైనా కళ్లు తెరచి పిల్లల వ్యక్తిత్వ వికాసంపై దృష్టి పెట్టాలి. డిగ్రీ కాగానే పెళ్లి అన్నది ఈనాటి పిల్లలకు వర్తించదు. కాస్త సమాజంలో ఢక్కాముక్కీలు తిన్న తరువాతే పెళ్లి చేస్తే మంచిది. ప్రతి దానికీ ఏడ్చే ఆడపిల్లలు భర్తపై కూడా అలాగే వ్యవహరిస్తారు. నలుగురితో మసలుకోలేని మగవాడు, బాధ్యత తెలియని వాడు భార్య పట్ల కూడా అలాగే వ్యవహరిస్తాడు. కాస్త మమకారం తగ్గించుకుని పిల్లలను తల్లిదండ్రులు స్వతంత్రంగా గమనించాలి. వారి వ్యక్తిత్వాలలో అవకతవకలు, పెద్ద అవలక్షణాలు కనిపిస్తున్నప్పుడు వారికి వివాహం తలపెట్టకపోవటమే మంచింది. అలా చేస్తే కొరివితో తల గోక్కున్నట్లే.

మనమేదో సంస్కృతి సాంప్రదాయం అని భారత దేశం గురించి కలలు కంటాము. అవి పుస్తకాలకు, భాషణలకు మాత్రమే పరిమితం. వాస్తవం దారుణంగా ఉంది. మన యువతీ యువకుల వ్యక్తిత్వాలు డొల్లగా ఉన్నాయి. మనం చేస్తున్నది పాశ్చాత్యులను గుడ్డిగా అనుకరించటమే. వారికి 50 ఏళ్ల క్రితం వచ్చిన సమస్యలు మనకు ఇప్పుడు వస్తున్నాయి. అంతే తేడా. చదువు->ఉద్యోగం->వివాహం->పిల్లలు ఇవి ఇదివరకులా ఆటోమేటిక్ కాదు సుమా. ప్రతి అడుగులోనూ ఆత్మావలోకనం అవసరం.