వల్లభ నాయకస్య భక్తో భవామి
వాంచితార్థదాయకస్య వరమూషిక వాహనస్య
భావం:
గణముల అధిపతి అయిన గణపతికి నేను భక్తుడనై ఉన్నాను. ఆయన కోరిన కోర్కెలను నెరవేర్చువాడు, శ్రేష్ఠమైన మూషికాన్ని వాహనంగా కలిగినవాడు. ఆయన పాదాలు లేత చిగురులకన్నా మృదువైనవి. పాశము, అంకుశము మొదలైన ఆయుధాలను ధరించినవాడు; మల్లిక, జాజి, సంపెంగ పుష్పహారాలతోను మణిమాలలతోను అలంకరింపబడినవాడు. తన సోదరుడైన సుబ్రహ్మణ్యుడు వల్లితో వివాహం చేసుకొనుటకు కారణమైనవాడు, సుబ్రహ్మణ్యునిచే పూజింపబడినవాడు. కాళీదేవి, కళామాలినియైన సరస్వతీదేవి, కమలాక్షియైన లక్ష్మీదేవి చేత స్తుతింపబడినవాడు అయిన గణపతికి నేను భక్తుడనై ఉన్నాను.
గణపతి వల్లీ-సుబ్రహ్మణ్యుల వివాహానికి కారణమైనాడు అని దీక్షితుల వారు ఈ కృతిలో ప్రస్తావించారు. దీని వెనుక ఉన్న గాథ ఏమిటి?
సుబ్రహ్మణ్యుడు వల్లి ప్రేమను పరీక్షించటానికి వృద్ధుని వేషంలో ఆమె వద్దకు వెళతాడు. వల్లి ఆయనను గుర్తించదు. కొంత సంకోచంతో ఉంటుంది. అప్పుడు సుబ్రహ్మణ్యుని అభ్యర్థనపై గణపతి ఏనుగు రూపం ధరించి వల్లిని భయపెడతాడు. భయపడిన వల్లి, తనను రక్షించమని ఆ వృద్ధుని రూపంలో ఉన్న సుబ్రహ్మణ్యుడిని ఆశ్రయిస్తుంది.
సుబ్రహ్మణ్యుడు, “నన్ను వివాహం చేసుకుంటానని ఒప్పుకుంటే ఈ ఏనుగును వెళ్లగొడతాను” అని అంటాడు. వల్లి అంగీకరించగానే గణపతి ఏనుగు రూపాన్ని విడిచి వెళ్తాడు. తరువాత సుబ్రహ్మణ్యుడు తన దివ్యస్వరూపాన్ని చూపుతాడు. వల్లి ఆయనను వివాహం చేసుకుంటుంది.
అందుకే దీక్షితుల వారు కృతిలో “వల్లీ వివాహ కారణస్య” అన్నారు.
బేగడ రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని మహారాజపురం సంతానం గారు అద్భుతంగా ఆలపించారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి