కథయ కథయ మాధవం హే రాధే కథయ కథయ మాధవం
అథ సఖి కథయ శ్రీ మధుసూదనమశేష విధినా వర్ణిత వీర్యమమిత విభవం
వన భువి రహసి సమారాధితో భగవాననవద్య సుందరాంగి హే రాధే
ఘన జఘనాయా త్వయా ఘననీలకుంతల శ్రీ వనమాలీ పీతవాసా వసతి క్వవా జగతి
మృగ మద కలిత తిలక ఫాల సుందరం అగణిత సుగుణ మణి రత్నాకరం
విగత మోహమఖిల వేదభాగ విదితం భగవంతమాశ్రిత భావిత విధాతారం
సరస హాస రస సరళ తరళ మురళీ మిలిత గోప వధూ జనం
అరవింద లోచనమరివర్గ నిషూదనం నర నారాయణ తీర్థ వాంచిత ఫల నిదానం
ఓ రాధా! మాధవుని గురించి చెప్పవే! అమిత పరాక్రమవంతుడు, అత్యంత వైభవము కలవాడు, బ్రహ్మచే వర్ణించబడిన వాడు అయిన మధుసూదనుని గురించి చెప్పవే! అనుపమానమైన శరీర సౌందర్యం కల ఓ రాధా! నల్లని మేఘముల వంటి కురులు కలిగి, తులసీ వనమాల ధరించి, పీతాంబరములు ధరించిన ఆ మాధవుని ఏ రహస్య ప్రదేశములో నువ్వు పూజించావు? ఆ మాధవుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో చెప్పవే! కస్తూరితో అలంకరిచబడిన అందమైన ఫాలభాగము కలిగినవాడు, ఎన్నలేని సుగుణములకు నిధియైన వాడు, మోహాతీతుడు, సమస్త వేదములచే విదితమైనవాడు, ఆశ్రితుల కామ్యములు తీర్చే భగవంతుడు అయిన మాధవుని గురించి చెప్పవే! మందహాసముతో, మృదువుగా కంపించే మురళీరవముతో గోపికలతో కలిసి ఉన్నవాడు, కలువల వంటి కన్నులు కలవాడు, శత్రు సమూహములను నాశనము చేసేవాడు, నారాయణ తీర్థుని కామ్యములను నెరవేర్చిన మాధవుని గురించి చెప్పవే!నారాయణ తీర్థుల వారి తరంగం కథయ కథయ మాధవం యొక్క భావం ఇది. శ్రీకృష్ణుని పరతర భావాన్ని దర్శించి, అనుభూతి చెందిన రాధ వాటిని బ్రహ్మవిద్యగా గోపికలకు తెలియజేసింది. రాధ తత్త్వం చాలా నిగూఢమైనది అన్నది ఈ తరంగం ద్వారా మనకు తెలియజేయటం నారాయణ తీర్థుల వారి లక్ష్యం. వాగ్గేయకారులు పరమాత్మ తత్త్వాన్ని ఎంత అందంగా మనకు తెలియజేస్తారు అన్న దానికి ఈ తరంగం ఓ అద్భుతమైన ఉదాహరణ. ఆధ్యాత్మిక సాధనలో పండి, త్రికరణ శుద్ధితో సగుణోపాసన చేసే వాగ్గేయకారులు పరమాత్మ విరాట్స్వరూపాన్ని మనకు ఎంత మనోజ్ఞంగా ఆవిష్కరిస్తారో ఈ కృతిలో మనకు తేటతెల్లమవుతుంది. మాధవుని తత్త్వం రాధ కన్నా ఎవరికి బాగా తెలుసు?
కల్యాణి రాగం మంగళకరమైనది. దివ్యమంగళస్వరూపుడైన శ్రీకృష్ణుని తత్త్వాన్ని వర్ణించటానికి ఎంతో ఉపయుక్తమైన రాగం. విదుషీమణులు రంజని గాయత్రి హృద్యంగా ఆలపించిన ఈ కృతిని విని తరించండి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి