నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి
నను బ్రోవమని చెప్పవే
నను బ్రోవమని చెప్పు నారీశిరోమణి
జనకుని కూతుర జనని జానకమ్మ
ప్రక్కన చేరి చెక్కిలి నొక్కుచు
చక్కగ మరు కేళి చొక్కి యుండు వేళ
లోకాంతరంగుడు శ్రీకాంత నిను గూడి
ఏకాంతమున ఏకశయ్యనున్న వేళ
అద్రిజ వినుతుడు భద్రగిరీశుడు
నిద్ర మేల్కొను వేళ నెలతరో బోధించి
ఓ సీతమ్మా! నన్ను కాపాడమని రామయ్యకు చెప్పు తల్లీ! నారీలోకానికి శిరోరతనమైన జనకుని కూతురైన జానకమ్మా! నన్ను కాపాడమని రామయ్యకు చెప్పు తల్లీ! స్వామి పక్కన చేరి చెక్కిలి నొక్కుతూ ఎంతో అందముగా శృంగారము చేయు వేళ నన్ను కాపాడమని రామయ్యకు చెప్పు తల్లీ! లోకము యొక్క అంతరంగములో ఉండే వాడు, లక్ష్మీపతి నీతో కలిసి ఏకాంతమున శయనించు వేళ నన్ను కాపాడమని చెప్పు తల్లీ! పార్వతిచే నుతించబడిన వాడు, భద్రగిరిపై వెలసిన శ్రీరాముడు నిద్ర మేల్కొను వేళ చక్కగా బోధించి నన్ను కాపాడమని చెప్పు తల్లీ!
కల్యాణి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఆలపించారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి