29, నవంబర్ 2010, సోమవారం

బిలహరి రాగం - కనుగొంటినీ శ్రీరాముని

అన్నగారు తన ఇలవేల్పుయైన సీతారాముల విగ్రహాన్ని ఈర్ష్యతో కావేటిలో పడవేస్తే, మన త్యాగ బ్రహ్మంగారు రాముడు లేని ఇంట నేను ఉండనని ఆయనను వెదుకుతూ బయలు దేరుతాడు. అలా తిరుగుతూ, ఎన్నో క్షేత్రాలు తిరిగి అక్కడి వేల్పులను స్తుతించి అద్భుతమైన కీర్తనలు రచిస్తాడు. అటు పిమ్మట కావేరిలో స్నానం చేస్తుండగా ఆ సీతారాముల ప్రతిమ త్యాగరాజుకి లభ్యమవుతుంది. ఆ ఆనందానుభూతిలో త్యాగరాజు రచించిన కీర్తన బిలహరి రాగంలో కనుగొంటినీ శ్రీరాముని.

బిలహరి రాగంలో ప్రత్యేకము మార్దవము, తన్మయత్వం, తాదాత్మ్యము, నృత్యం చేయాలన్న భావన కలిగించే స్వరాలు ఉండటం. భక్తిని మరొక మెట్టు పైకి తీసుకెళ్ళే స్థాయి ఈ రాగానికి ఉంది. చాలా మార్దవంగా, శాంతముగా ఉంటుంది. మరి తను పోగొట్టుకున్న సర్వస్వం తిరిగి దొరికితే, త్యాగరాజు ఇలాంటి రాగంలో కీర్తన రాయక తప్పదు కదా!. మన తెలుగు బిడ్డలు మల్లాది సోదరులు అద్భుతంగా పాడిన కనుగొంటిని కీర్తన. సాహిత్యం క్రింద. శంకర్ మీనన్ గారి బిలహరి వయోలా/సంతూర్ సమ్మేళన  రాగాలాపన కూడ చాలా బాగుంది.

ఇదే రాగంలో రుద్రవీణ చలన చిత్రంలో నీతోనే ఆగేనా బిలహరి అని ఏసుదాస్ గారు శ్రావ్యమైన శాస్త్రీయ గీతం ఆలాపించారు. బిలహరి రాగానికి ధన్యత చేకూర్చారు ఏసుదాస్ గారు. 


పట్టాభిషిక్త సీతారాములు

కనుగొంటినీ శ్రీరాముని నేడు కనులార నా కామితము తీర

ఇనకులమందు ఇంపుగాను వెలయు ఇలలోన సీతా నాయకుని నేడు |కనుగొంటినీ|

భరత లక్ష్మణ శత్రుఘ్నులు కొలువ పవమాన సుతుడు పాదములు బట్ట
వీరులైన సుగ్రీవ ప్రముఖులచే వినుతి సేయ త్యాగరాజ నుతుని నేడు |కనుగొంటినీ|

శుభోదయం

శరదృతువునకు వీడ్కోలు పలుకుదామా అనే వేళ, పొద్దున్నే పై అంతస్థుకి వెళ్లి చూస్తే - అహో ఏమి సౌందర్యం ప్రకృతి కౌగిట ఒదిగిన భాగ్యనగరానిది. మబ్బుల, దట్టమైన మంచు చాటున దాగిన సూర్యుడు, విశ్వవ్యాప్తమైన ఆ పరమాత్మకు జీవరాశులన్నీ ధూపం వెలిగించాయా అన్నట్లు పొగమంచు, చరిత్రకు ప్రతిబింబమైన కులీకుతుబ్ షా సమాధుల నుండి ఆ యవనకాంతల హృదయాలు నా కౌగిలిని వీడకు ప్రభూ అనే ప్రణయ విలాపాన్ని అంబరపు వీధిల్లో ఆలపిస్తున్నాయా అన్నట్లు ఒకవైపు,

అప్పటికే లేచి గంట అయ్యి, గృహిణులు ఉరుకులు, పరుగులతో వాకిళ్లు చిమ్మి, ముగ్గు పెట్టి, ధన ధనమంటూ అంట్లు కుమ్మరించి, కడిగే మా పేదల బస్తీ, బద్ధకంగా నిద్దుర లేచి ఈ చలిలో ఇంకాసేపు పడుకుందామా అనే భర్తలు, ఉదయమే ఉద్యోగానికి వెళ్లే పురుషోత్తములు, అయిష్టంగా బడికి తయారవుతున్న పిల్లలు, ఎంత కిక్ కొట్టినా ఆరంభం కాని బైకులు, టక టక మని బయలుదేరే ఆటోలు ఇంకొకవైపు,

మాకు ఇంకా తెల్లవారలేదండీ, ఇంకా రెండు గంటలుంది లేచి తయారవటానికి అనే సాఫ్ట్ వేర్ నిపుణులు మళ్లీ దుప్పటితన్ని పడుకుంటే, ఆ హై-టెక్ సిటీ భవంతులు విస్తుపోయి చూస్తునట్టుగా ఉంది. శుభోదయం సోదర సోదరీమణులకు.

25, నవంబర్ 2010, గురువారం

తోటకాష్టకం - తాత్పర్యము


హిందూ మతం బౌద్ధ, జైన మతాల దాడికి గురయ్యి, అంతర్గత శైవ/వైష్ణవ పోరులో నలిగి నాశనము అవుతున్న దశలో దక్షిణామూర్తి అవతారముగా కేరళలోని కాలడిలో ఆర్యాంబ మరియు శివగురు దంపతులకు జన్మించారు శంకరులు. పిన్న వయసులోనే భక్తి, జ్ఞాన, వైరాగ్యములతో  మానసికోత్థానం కోసం, హిందూ మత శాఖల, పీఠాల ఐక్యత కోసం, ఉనికి కోసం అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు.  ఎందరో పండితులు, విమర్శకులను ఒప్పించి దేశ వ్యాప్తంగా పంచాయతన పద్ధతిలో పీఠాలు, మఠాలు, క్షేత్రాలు స్థాపించారు.  పామరులనుండి పండితుల వరకు వారి వారి చేతనావస్థను బట్టి స్తోత్రాలు, ప్రకరణలు, లోతైన ఆధ్యాత్మిక గ్రంథాలు రాసి,  ఈనాటి వరకు ఆ జ్ఞాననిధి, ఆధ్యాత్మిక వారసత్వ సంపద నిలిచేలా చేశారు. ఆయన తర్వాత, శిష్యులు ఈ పరంపరను కొనసాగిస్తూనే ఉన్నారు.

శంకర భగవత్పాదులు

ఆ శంకరుని శిష్యులలో ఒకడైన ఆనందగిరి తన గురువులను స్తుతిస్తూ రచించిన ఈ తోటకాష్టకం ఆ శంకరుల లక్షణాలను, వైభవాన్ని, ఆధ్యాత్మిక శక్తిని ప్రతిబింబిస్తుంది.ఆనందగిరి ఈ స్తోత్రాన్ని తోటక ఛందములో రాయటం వలన దీనికి తోటకాష్టకం అని పేరు వచ్చింది. దీని వెనక ఒక చిన్న కథ ఉంది.

శంకరుల శిష్యులలో ఆనందగిరి కొంత మంద బుద్ధి. కానీ, అమితమైన గురు భక్తి కలవాడు. నిరంతర గురు సుశ్రూషలో ఉండేవాడు గిరి. ఒక రోజు, శంకరులు తన ప్రాతః కాల దినచర్యలో భాగంగా ఉపనిషత్ ప్రవచనం ఆరంభించారు. ఆ సమయంలో శిష్యులంతా శాంతి పాఠం మొదలు పెట్టారు. కానీ, గిరి మాత్రం అక్కడ లేదు.  గురువు గారి వస్త్రములు ఉతకటానికి నది దగ్గరకు వెళ్ళాడు. శంకరులు ఇది గమనించి మిగిలిన శిష్యులను గిరి వచ్చేదాకా వేచి ఉండమని పలుకుతారు. అప్పుడు పద్మపాదుడనే శిష్యుడు గర్వముతో 'వాడు మూర్ఖుడు, వానికి శాస్త్రములు నేర్వవలసిన అర్హత లేదు. వానికోరకు ఎందుకు వేచి ఉండటం' అని అంటాడు. శంకరులు పద్మపాదుని గర్వము అణచుటకు, తన దైవ శక్తితో ఆనందగిరికి సకల శాస్త్ర పరిజ్ఞానమును క్షణకాలములో కలిగేలా చేస్తారు. నది వద్దనుండి తిరిగి వచ్చిన ఆనందగిరి గురువుగారిని నుతిస్తూ తోటకాష్టకాన్ని ఆశువుగా పఠించాడు.

మిగిలిన శిష్యులకు సిగ్గు, విస్మయం కలిగించేలా అతి కష్టమైనా తోటక ఛందములో ఎనిమిది శ్లోకాలతో అద్భుతంగా సాగుతుంది తోటకాష్టకం. అటు తర్వాత, ఆనందగిరి శృతి సార సముద్ధరణ అనే ఇంకొక రచన కూడ తోటక ఛందములో చేస్తాడు. శంకరుల నలుగురు ముఖ్య శిష్యులలో ఒకడై , తోటకాచార్యులుగా పిలవబడి, గురువులచేత బదరీలోని జ్యోతిర్మఠం నడపటానికి నియమించబడతాడు. తోటకాష్టకం, తాత్పర్యము, యూట్యూబ్ శ్రవణం బొంబాయి సోదరీమణులు


విదితాఖిలశాస్త్రసుధాజలధే మహితోపనిషత్ కథితార్థనిధే
హృదయే కలయే విమలం చరణం భవ శంకర దేశిక మే శరణం

కరుణావరుణాలయ పాలయ మాం భవసాగరదుఃఖవిదూనహృదం
రచయాఖిలదర్శనతత్త్వవిదం భవ శంకర దేశిక మే శరణం

భవతా జనతా సుహితా భవితా నిజబోధవిచారణ చారుమతే
కలయేశ్వరజీవవివేకవిదం భవ శంకర దేశిక మే శరణం

భవ ఏవ భవానితి మే నితరాం సమజాయత చేతసి కౌతుకితా
మమ వారయ మోహమహాజలధిం భవ శంకర దేశిక మే శరణం

సుకృతేఽధికృతే బహుధా భవతో భవితా సమదర్శనలాలసతా
అతిదీనమిమం పరిపాలయ మాం భవ శంకర దేశిక మే శరణం

జగతీమవితుం కలితాకృతయో విచరన్తి మహామహసశ్ఛలతః
అహిమాంశురివాత్ర విభాసి గురో భవ శంకర దేశిక మే శరణం

గురుపుంగవ పుంగవకేతన తే సమతామయతాం నహి కోఽపి సుధీః
శరణాగతవత్సల తత్త్వనిధే భవ శంకర దేశిక మే శరణం

విదితా న మయా విశదైకకలా న చ కించన కాంచనమస్తి గురో
ద్రుతమేవ విధేహి కృపాం సహజాం భవ శంకర దేశిక మే శరణం

తాత్పర్యము: 

శాస్త్ర సాగరమనే నిధిని తెలిసిన, ఉపనిషద్ సంపద యొక్క సారాన్ని తెలిసిన, ఓ శంకర దేశికా! నీ చరణ పద్మముల నా హృదయమున ధ్యానిస్తున్నాను. నాకు శరణు నిమ్ము.

భవ సాగరమనే దుఖముచే పీడింప బడుతున్న హృదయము కలిగిన నన్ను రక్షించుము. నీ కృపచే నాకు సకల శాస్త్రముల సారము అవగతము చేయుము. ఓ శంకర దేశికా! నాకు శరణు నిమ్ము.

ఆత్మజ్ఞానము సంప్రాప్తి యందు ఆసక్తి యున్న వారు నీ కృప వలన ఆనందాన్ని పొందుతున్నారు. నాకు జీవాత్మ, పరమాత్మ జ్ఞానము కలిగేలా అనుగ్రహించు. ఓ శంకర దేశికా! నాకు శరణు నిమ్ము.

నీవే శివుడవని తెలుసి నా మనసు అనంతమైన ఆనందముతో నిండినది. నా మోహమనే మహా సాగరమును అంతము చేయుము. ఓ శంకర దేశికా! నాకు శరణు నిమ్ము.

ఎన్నో సుకృతములు (మంచి పనులు) చేయుట వలన నీ ద్వారా ఆత్మ జ్ఞానము పొందే వాంఛ, భాగ్యము కలుగును. నిస్సహాయుడ నైన నన్ను కాపాడుము. ఓ శంకర దేశికా! నాకు శరణు నిమ్ము.

ఈ జగత్తును రక్షించుటకు నీ వంటి మహాత్ములు వేర్వేరు రూపములలో, మారు వేషములలో తిరుగుచుంటారు. వారిలో నీవు సూర్యుని వంటి వాడవు. ఓ శంకర దేశికా! నాకు శరణు నిమ్ము.

గురువులలో శ్రేష్ఠుడా! వృషభము పతాకముపై చిహ్నముగా కలిగిన శివా! నీవు జ్ఞానులలో అసమానుడవు. శరణు కోరే వారిపాలిట దయామయుడవు. తత్వ నిధీ! ఓ శంకర దేశికా! నాకు శరణు నిమ్ము.

ఇంకా జ్ఞానములో ఒక్క ఆకును కూడ అర్థం చేసుకోలేదు నేను. నా వద్ద ఎటువంటి సంపదలు లేవు. ఓ గురు దేవా! నీ కృపను నా పై వెంటనే ప్రసరింపుము. ఓ శంకర దేశికా! నాకు శరణు నిమ్ము.

24, నవంబర్ 2010, బుధవారం

వందే శివం శంకరం స్తోత్రము, తాత్పర్యము

శివుని పరి పరి విధాల స్తుతించే ఈ వందే శివం శంకరం స్తోత్రము శివ వందనముగా కూడా పేరొందింది. దీని రచయిత వివరాలు ఎక్కడ దొరకలేదు. శ్రవణం కూడ దొరకలేదు. మీకు ఎక్కడైనా దొరికితే నాకు తెలియ చేయండి. ఈ స్తోత్రములోని శ్లోకాలు శివోపాసన మరియు నిత్య పూజలో విస్తృతమైన ప్రాచుర్యం పొందాయి. స్తోత్రము, తాత్పర్యము మీకోసం.

జ్ఞాన ప్రసూనా సమేత శ్రీ కాళహస్తీశ్వరుడు


వందే శంభు ముమాపతిం సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం
వందే సూర్యశశాంకవహ్నినయనం వందే ముకుంద ప్రియం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం

వందే సర్వజగద్విహారమతులం వందేఽంధకధ్వంసినం
వందే దేవశిఖామణిం శశినిభం వందే హరేర్వల్లభం
వందే నాగభుజంగభూషణధరం వందే శివం చిన్మయం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం

వందే దివ్యమచింత్యమద్వయమహం వందేఽర్కదర్పాపహం
వందే నిర్మలమాదిమూలమనిశం వందే మఖధ్వంసినం
వందే సత్యమనంతమాద్యమభయం వందేఽతి శాంతాకృతిం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం

వందే భూరథమంబుజాక్షవిశిఖం వందే శ్రుతీఘోటకం
వందే శైలశరాసనం ఫణిగుణం వందేఽబ్ధితూణీరకం
వందే పద్మాజసారథిం పురహరం వందే మహాభైరవం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం

వందే పంచముఖాంబుజం త్రియనం వందే లలాటేక్షణం
వందే వ్యోమగతం జటాసుముకుటం చంద్రార్ధగంగాధరం
వందే భస్మకృతత్రిపుండ నిటలం వందేఽష్ట మూర్త్యాత్మకం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం

వందే కాలహరం హరం విషధరం వందే మృడం ధూర్జటిం
వందే సర్వగతం దయామృతనిధిం వందే నృసింహాపహం
వందే విప్రసురార్చితాంఘ్రికమలం వందే భగాక్షాపహం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం

వందే మంగళరాజతాద్రి నిలయం వందే సురాధీశ్వరం
వందే శంకరమప్రమేయమతులం వందే యమద్వేషిణం
వందే కుండలిరాజకుండలధరం వందే సహస్రాననం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం

వందే హంసమతీంద్రియం స్మరహరం వందే విరూపేక్షణం
వందే భూతగణేశమవ్యయమహం వందేఽర్థ రాజ్యప్రదం
వందే సుందరసౌరభేయ గమనం వందే త్రిశూలాయుధం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం

వందే సూక్ష్మమనంతమాద్యమభయం వందేఽంధకారాపహం
వందే రావణనందిభృంగివినతం వందే సుపర్ణావృతం
వందే శైలసుతార్ధభాగవపుషం వందేఽభయం త్ర్యంబకం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం

వందే పావనమంబరాత్మవిభవం వందే మహేంద్రేశ్వరం
వందే భక్తజనాశ్రయామరతరుం వందే నతాభీష్టదం
వందే జహ్నుసుతాఽంబికేశమనిశం వందే గణాధీశ్వరం
వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం

తాత్పర్యము:  

ఆనందానికి మూలము (శంభు), ఉమాపతి, దేవతలకు అధిపతి, జగత్తుకు కారణమైన వాడు, సర్పములు ఆభరణములుగా కలవాడు, జింకను చేత కలవాడు, జీవ గణములకు అధిపతి (పశుపతి), సూర్య చంద్రులు, అగ్ని మూడు నేత్రములుగా కలవాడు, విష్ణువునకు ప్రియుడు, భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు.

జగత్తు అంతా విహరించే వాడు, సాటి లేని వాడు, అంధకాసురుని నాశనము చేసిన వాడు, దేవతలలో ఉత్తమమైన వాడు, చంద్రుని ధరించిన వాడు, విష్ణువునకు ప్రియుడు, సర్పములు, నాగరాజు ఆభరణములుగా కలవాడు, చిదానందుడు, శుద్ధ ప్రకాశుడు, భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు.

దివ్యమైన వాడు, అచింత్యుడు (మన ఆలోచనకు అందని వాడు), రెండవ సాటి లేని వాడు,   సూర్యుని దర్పమును నాశనము చేసిన వాడు, మచ్చలేని వాడు, ఆరంభమునకు మూలమైన వాడు, నాశనములేని వాడు, దక్షుని యజ్ఞమును నాశనము చేసే వాడు, సత్యమైన వాడు, అనంతమైన వాడు, మూలమైన వాడు, భయము లేని వాడు, శాంత స్వరూపుడు, భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు.

భూమిని రథముగా, విష్ణువును బాణముగా, వేదములను కీటకముగా, మేరు పర్వతమును ధనుస్సుగా, నాగరాజును తీగగా,   బ్రహ్మను సారథిగా కలిగి త్రిపురములను నాశనము చేసిన వాడు, మహా భైరవుడు, భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు.

ఐదు అందమైన ముఖములు, మూడు కన్నులు  కలవాడు,  నుదుట మూడవ కన్ను కలవాడు, అమ్బరమును దాటి వ్యాపించిన వాడు, ముడులు వేసిన జటా ఝూటములలో గంగ, చంద్రుడు కలవాడు, భస్మము నుదుట త్రిపుండ్రములు గా (మూడు విభూతి రేఖలు) కలవాడు, నిటలమైన వాడు, అష్ట మూర్త్యాత్మకమైన వాడు (శర్వ, భవ, రుద్ర, ఉగ్ర, భీమ, పశుపతి, ఈశాన, మహాదేవ రూపములు),  భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు.

యముని హరించే వాడు, హరుడు, విషాన్ని ధరించే వాడు, దయామయుడు, పెద్ద ముళ్ళు వేయబడిన ఝూటములు కలవాడు, అంతటా వెళ్ళినవాడు, దయ అనే అమృతానికి నిధియైన వాడు, నరసింహ స్వామిని వశం చేసుకొన్నవాడు,  బ్రాహ్మణుల, దేవతలచే పూజించబడిన పాదపద్ములు కలవాడు,  భగుని కన్ను నాశనము చేసినవాడు, భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు.

వెండికొండపై వెలసి యున్నవాడు, దేవతలకు అధిపతి, శుభకరుడు, కొలతకు అందని వాడు, సాటిలేని వాడు, యమునిచే ద్వేషించ బడేవాడు, మెలికలు తిరిగిన సర్పములు కర్ణ కుండలములుగా కలవాడు, వేయి తలలు కలవాడు, భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు.


హంస వంటివాడు, ఇంద్రియాలకు అతీతమైనవాడు, మన్మథుని నాశనం చేసిన వాడు, బేసి సంఖ్య కన్నులు కలవాడు (మూడు), భూత గణములకు అధిపతి, మార్పు లేని వాడు, రాజ్యము, సంపద ఇచ్చేవాడు, అందమైన నందీశ్వరుని వాహనముగా కలవాడు, త్రిశూలము ధరించు వాడు, భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు.

సూక్ష్మమైనవాడు, అనంతమైన వాడు, మొదటి వాడు, భయము లేని వాడు, అంధకాసురుని చంపిన వాడు, రావణుడు, నంది, భ్రుంగి చే వందితుడు, స్వర్ణ పుష్పముల రేకులు చుట్టూ కలవాడు, పార్వతిని అర్ధ భాగముగా కలవాడు, త్ర్యంబకుడు, భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు.

శుద్ధమైన, అంబరములను మించిన  ఆత్మ శక్తి కలవాడు, ఇంద్రునికి అధిపతి, భక్తులపాలిటి కలవృక్షము వంటి వాడు, మ్రొక్కే వారి కోరికలు తీర్చే వాడు, జహ్ను మహర్షి కుమార్తె అయిన గంగకు, పార్వతికి పతియైన వాడు, నాశనము లేని వాడు, గణములకు అధిపతి అయిన వాడు, భక్త జనులకు ఆశ్రయుడు, వరములిచ్చే వాడు అయిన శివునకు, శంకరునకు నా పరి పరి వందనములు.


23, నవంబర్ 2010, మంగళవారం

శ్రీ శంకరాచార్య కృత శివ సువర్ణమాలా స్తుతి

యాభై శ్లోకాలలో లయ బద్ధమైన పదాలు,  భక్తి, సర్వస్య శరణాగతి, ఆత్మానుభూతి, లోతైన వివేచనము తో సాగే ఈ సువర్ణమాల స్తోత్రమును ఆ అపర శంకరుడు ఆది శంకరులు తప్ప ఎవరు రచించ గలరు?.  సాంబ = స+ అంబ - నిరంతరం ఆ జగదంబ అయిన పార్వతితో కూడి అర్థనారీశ్వరుడై ఉన్నాడు కాబట్టే ఆ పరమ శివుడు సాంబుడు అయినాడు.  ఈ స్తోత్రము వ్యాకరణ అర్థం తెలుసు కోవటం కన్నా భక్తితో పాడి పరమశివుని కనటం ముఖ్యమని భావించి తాత్పర్యానికి సాహసం చేయలేదు. పార్వతీ సమేతుడవైన  శివా! శంభో! నీ పాదములకు నమస్కారములు. నాకు శరణునిమ్ము అనే అంతరార్థంతో సాగే ఈ స్తోత్రములో శివుని అశేష కీర్తి,  అగణిత గుణ గణములను ఆది శంకరులు నుతించారు. స్తోత్రము ముందుకు సాగుతున్న కొద్దీ ఆ పరమశివుని వర్ణన, కైలాసము ఎదుట ఉందా అన్న భావన ఆదిశంకరులు కలిగిస్తారు.

యాభై శ్లోకాలు అనర్గళంగా ఒకే దేవతపై రాయాలంటే ఆత్మ జ్ఞాన పరిపూర్ణుడై, దైవ సాక్షాత్కారము కలిగి, ఎల్లప్పుడూ ఆ దైవము కన్నుల ఎదుట నిలిచి ఇటువంటి అనుభూతిని కలిగిస్తే, ఆ ఆవేశం స్తోత్ర రూపంలో వెలువడి ఇన్ని వేల ఏళ్ళు నిలబడ గలుగుతుంది. ఎంతో మంది స్వాములు, యతులు తర్వాత భారత దేశంలో జన్మించి, ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రచారం చేశారు, కానీ శంకరులు సుస్థిర పరచిన అద్వైత సారము, ధార్మిక సిద్ధాంతాలు, పద్ధతులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా, ప్రామాణికాలై కాలపు ఒడిదుడుకులను తట్టుకొని హిమాలయముల వలె ఉన్నతముగా నిలిచినది. ఇట్టి ఆధ్యాత్మిక సంపదను ఇచ్చిన ఆ పరమ శివ రూపమైన జగద్గారువులకు శాత సహస్ర పాదాభివందనములు.

శివ సువర్ణమాల స్తోత్రము, తాత్పర్యము, శ్రవణం రంగనాథన్ గారి గాత్రం.  ఈ లంకె ప్రాక్సీ ఉంటే సరిగా పనిచెయ్యదు. కాబట్టి ఇంట్లోనుంచి వినండి. (కుదించబడిన స్తుతికియూట్యూబ్  శ్రవణం (జస్రాజ్),  శ్రవణం  (సేక్రేడ్ చాన్ట్స్ సిరీస్) ).


అపీతకుచలాంబా సమేత అరుణాచలేశ్వరుడు

శివ సువర్ణమాలాస్తుతి

అథ కథమపి మద్రసనాం త్వద్గుణలేశైర్విశోధయామి విభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

అఖండమదఖండన పండిత తండు ప్రియ చండీశ విభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

ఇభచర్మాంబర శంబరరిపువపురపహరణోజ్జ్వలనయన విభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

ఈశ గిరీశ నరేశ పరేశ మహేశ బిలేశయ భూషణ భో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

ఉమయా దివ్య సుమంగళ విగ్రహ యాలింగిత వామాంగ విభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

ఊరీ కురు మామజ్ఞమనాథం దూరీ కురు మే దురితం భో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

ఋషివర మానస హంస చరాచర జనన స్థితి లయ కారణ భో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

ఋక్షాధీశకిరీటమహోక్షారూఢ విధృత రుద్రాక్ష విభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

లువర్ణ ద్వంద్వమవృంతకుసుమమివాంఘ్రౌ తవార్పయామి విభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

ఏకం సదితిశ్రుత్యా త్వమేవ సదసీత్యుపాస్మహే మృడభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

ఐక్యంనిజభక్తేభ్యో వితరసి విశ్వంభరోఽత్ర సాక్షి విభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

ఓమితి తవ నిర్దేష్ట్రీ మాయాస్మాకం మృడోపకర్త్రీ భో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

ఔదాసీన్యం స్ఫుటయతి విషయేషు దిగంబరత్వం తవైవ విభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

అంతఃకరణ విశుద్దిం భక్తిం చ త్వయి సతీం ప్రదేహి విభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

అస్తోపాధి సమస్తవ్యస్తై రూపై జగన్మయోఽసి విభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

కరుణా వరుణాలయ మయిదాస ఉదాసస్తవోచితో న హి భో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

ఖలసహవాసం విఘటయ ఘటయ సతామేవసంగ మనిశం భో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

గరళం జగదుపకృతయే గిళితం భవతాసమోఽస్తికోఽత్ర విభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

ఘనసారగౌరగాత్ర ప్రచుర జటాజూటబద్ధగంగ విభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

జ్ఞప్తి స్సర్వశరీరే ష్వఖండితా యా విభాతి సా త్వం భో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

చపలం మమహృదయకపిం విషయద్రుచరం దృఢంబధాన విభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||
ఛాయా స్థాణోరపి తవతాపం నమతాం హర త్వహో శివభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

జయ కైలాశ నివాస ప్రమథ గణాధీశ భూ సురార్చిత భో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

ఝనుతక జంకిణు ఝనుతత్కిట తక శబ్దైర్నటసి మహానట భో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

జ్ఞానం విక్షేపావృతిరహితం కురు మే గురు స్త్వమేవ విభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

టంకార స్తవధనుషో దళయతి హృది ద్విషామశనిరివభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

ఠాకృతిరివ తవమాయా బహిరంతశ్శూన్యరూపిణీ ఖలు భో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

డంబరమంబురుహామపి దళయ త్యఘానాం త్వదంఘ్రియుగం భో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

ఢక్కాక్షసూత్రశూలద్రుహిణకరోటీసముల్లసత్కరభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

ణాకారగర్భిణీచే చ్ఛుభదాతేశరగతి ర్నృణామిహ భో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

తవ మనుమితిసంజపత స్సద్యస్తరంతిమనుజా భవాబ్ధిం భో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

థూత్కార స్తస్యముఖే భవన్నామ యత్ర నాస్తి విభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

దయనీయశ్చ దయాళుః కోఽస్తిమదన్య స్త్వదన్య ఇహవదభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

ధర్మస్థాపన దక్ష త్ర్యక్ష గురో దక్ష యజ్ఞశిక్షక భో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

ననుతాడితోఽసి ధనుషా లుబ్ధతయాత్వం పురా నరేణా విభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

పరిమాతుం తవమూర్తింనాలమజ స్తత్పరాత్పరోఽసి విభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

ఫలమిహ నృతయా జనుష స్త్వత్పదసేవా సనాతనేశ విభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

బలమారోగ్యం చాయుస్త్వద్గుణ రుచితాం చిరం ప్రదేహి విభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

భగవన్ భర్గ భయాపహ భూత పతే భూతిభూషితాంగ విభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

మహిమా తవ నహి మాతి శ్రుతిషు హిమానీధరాత్మజాధవ భో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

యమనియమాదిరభిరంగై ర్యమినో హృది యం భజంతి స త్వం భో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

రజ్జావహిరివ శుక్తౌ రజతమివ త్వయి జగంతి భాంతి విభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

లబ్ధ్వా భవత్ప్రసాదా చ్చక్రమఖిలం విధురవతి లోకమఖిలం భో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

వసుధా తద్ధరతచ్చయరథమౌర్వీశరపరాకృతాసుర భో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

శర్వ దేవ సర్వోత్తమ సర్వద దుర్వృత్త గర్వహరణ విభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

షడ్రిపు షడూర్మి షడ్వికార హర సన్ముఖ షణ్ముఖ జనక విభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

సత్యం జ్ఞానమనంతం బ్రహ్మే త్యేతల్లక్షణ లక్షిత భో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

హాఽహాఽహూఽహూ ముఖ సురగాయక గీతా పదాన పద్య విభో |
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

ళాదిర్నహిప్రయోగ స్తదంతమిహ మంగళం సదాస్తు విభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

క్షణమివదివసాన్నేష్యతి త్వత్పదసేవాక్షణోత్సుకశ్శివవిభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ||

ఈశాయ వాసుదేవాయ శ్రీపాదైరర్పితా సువర్ణమయీ
మాలేయం కంఠే విధృతా దదాతి పురుషార్థాన్

  || ఇతి శ్రీ శంకరాచార్య కృత సువర్ణమాలాస్తుతిః ||

22, నవంబర్ 2010, సోమవారం

శివనామావళ్యష్టకం - తాత్పర్యము

పాహి, ఆర్తితో సాగే ఆదిశంకరుల రచన ఈ శివ నామావళ్యష్టకం. ఆ త్రినేత్రుని దివ్య నామములతో కూడిన ఈ స్తోత్రము మహిమ, వర్ణన సమపాళ్లలో కలిగి, పాలు తేనెల అభిషేకంలా సరళంగా, మృదువుగా, శాంతంగా సాగుతుంది. ఇటువంటి స్తోత్రము రాయాలంటే ఆ వ్యక్తికి ఎటువంటి మానసిక ఔన్నత్యము ఉండి, ఎట్టి పరమాత్ముని దర్శనాలు కలిగాయో ఊహించ వచ్చు. నామావళ్యష్టకం, తాత్పర్యము, యూట్యూబ్ శ్రవణం. సరళమైన పదాలు ఉన్నాయి కాబట్టి చాలా మటుకు వాటినే తాత్పర్యములో వాడుకున్నాను.

పుత్ర సమేత పార్వతీ పరమేశ్వరులు

హే చంద్రచూడ మదనాంతక శూలపాణే
స్థాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో
భూతేశ భీతభయసూదన మమనాథం
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష 

హే పార్వతీహృదయవల్లభ చంద్రమౌళే
భూతాధిప ప్రమథనాథ గిరీశచాప
హే వామదేవ భవ రుద్ర పినాకపాణే
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష 

హే నీలకంఠ వృషభధ్వజ పంచవక్త్ర
లోకేశ శేషవలయ ప్రమథేశ శర్వ
హే ధూర్జటే పశుపతే గిరిజాపతే మాం
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష 

హే విశ్వనాథ శివ శంకర  దేవదేవ
గంగాధర ప్రమథనాయక నందికేశ
బాణేశ్వరాంధకరిపో హర లోకనాథ
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష  

వారాణసీపురపతే మణికర్ణికేశ
వీరేశ దక్షమఖకాల విభో గణేశ
సర్వజ్ఞ సర్వహృదయైకనివాస నాథ
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష 

శ్రీమన్మహేశ్వర కృపామయ హే దయాళో
హే వ్యోమకేశ శితికంఠ గణాధినాథ
భస్మాంగరాగ నృకపాలకలాపమాల
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష 

కైలాసశైలవినివాస వృషాకపే హే
మృత్యుంజయ త్రినయన త్రిజగన్నివాస
నారాయణప్రియ మదాపహ శక్తినాథ
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష 

విశ్వేశ విశ్వభవనాశక విశ్వరూప
విశ్వాత్మక త్రిభువనైకగుణాధికేశ
హే విశ్వనాథ కరుణామయ దీనబంధో
సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష 

ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య
శ్రీగోవిన్దభగవత్పూజ్యపాదశిష్యస్య
శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ శివనామావళ్యష్టకం సంపూర్ణమ్ 

తాత్పర్యము: 

హే చంద్రుని ధరించిన, మన్మథుని సంహరించిన, శూలము చేతిలో కలిగిన, స్థిరముగా నున్న, పర్వతములకు నాథా! , గిరిజాపతీ! మహేశ్వర! శంభో! భూత నాథా! భీతి, భయము పోగొట్టే నా నాథా! సంసారమనే దుఃఖమును నుండి నన్ను కాపాడు జగదీశ్వరా!

హే పార్వతి వల్లభా! చంద్ర మౌళి! భూత గణములు ప్రమథ గణములకు నాథా! పర్వతమునే ధనుస్సుగా కలవాడా! వామదేవా! భవా!  రుద్రా! పినాకమును ధరించిన వాడా! సంసారమనే దుఃఖమును నుండి నన్ను కాపాడు జగదీశ్వరా!

 హే నీలకంఠా! వృషభము పతాకమందు చిహ్నముగా కలవాడా!  ఐదు ముఖములు కలవాడా! లోకేశా! సర్పము చుట్టుకొని ఉన్నవాడా! ప్రమథ గణములకు నాథా! మట్టికొని ఉన్న జుట్టు కలవాడా! పశుపతీ! గిరిజాపతీ!  సంసారమనే దుఃఖమును నుండి నన్ను కాపాడు జగదీశ్వరా!

హే విశ్వనాథా! శివా! శంకరా! దేవదేవా! గంగాధరా! ప్రమథ గణములకు నాథా! నందికి అధిపతీ! బాణ, అంధకాసురులకు శత్రువైన వాడా! హరా! లోకేశ్వరా! సంసారమనే దుఃఖమును నుండి నన్ను కాపాడు జగదీశ్వరా!

వారణాసీ పురానికి అధిపతీ! మణికర్ణికకు  అధిపతీ (కాశీలోని శ్మశానము పేరు)!  వీరులకు అధిపతీ! దక్షుని యజ్ఞము నాశనము చేసిన వాడా!  వీరా! గణములకు అధిపతీ! అన్నీ తెలిసిన వాడా! అందరి హృదయములలో నివసించే నాథా! సంసారమనే దుఃఖమును నుండి నన్ను కాపాడు జగదీశ్వరా!

హే శ్రిమన్మహేశ్వరా! కృపామయా! దయాళో!  ఆకాశమే కేశములుగా కలవాడా!  నీలకంఠా!  గణాధినాథా!  భస్మము పూసుకొనిన వాడా! కపాలమాలలు ధరించిన వాడా!  సంసారమనే దుఃఖమును నుండి నన్ను కాపాడు జగదీశ్వరా!

హే కైలాస వాసా! వృషభారూఢా! మృత్యుంజయా! త్రినయనా! ముల్లోకములలో నివసించేవాడా! నారాయణునికి ప్రియుడా! మదమును నాశనము చేసే వాడా! శక్తి (గౌరి)కి పతీ!    సంసారమనే దుఃఖమును నుండి నన్ను కాపాడు జగదీశ్వరా!

విశ్వేశా! ముల్లోకములలో పరాజయం లేని వాడా! ముల్లోకములలో నివసించే వాడా! విశ్వరూపా! విశ్వమునకు ఆత్మయైన వాడా! ముల్లోకములు విస్తరించి యున్నవాడా!  విశ్వ బంధూ! కరుణామయా! దీన బంధో!  సంసారమనే దుఃఖమును నుండి నన్ను కాపాడు జగదీశ్వరా! 

ఇది శ్రీమచ్ఛంకరభగవత్పాదులు రచించిన  శివనామావళ్యష్టకం

21, నవంబర్ 2010, ఆదివారం

శివ అక్షరమాలా స్తోత్రము - తాత్పర్యము

సదా శివుని "సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ" అనే అక్షరమాలలో నుతించే అద్బుతమైన స్తోత్రం ఈ శివ అక్షరమాల. ఆ పరమశివుని లీలలు, మహిమలు వేనోళ్ళ కీర్తించే ఈ స్తుతి భజన సాంప్రదాయంలో, నాట్య సాంప్రదాయంలో, గుళ్లలో చాలా ప్రాచుర్యం పొందింది. మంచి లయలో సాగే ఈ స్తోత్రము తన్మయంలో పాడుతూ, ఆడుతూ ఉంటే ఆ సదాశివుడు దిగి వచ్చాడా అన్న ఆవేశం కలుగుతుంది, కనిపిస్తుంది. దీని రచయిత ఎవరో నాకు తెలియలేదు. స్తుతిలో కనిపించే పదాలను బట్టి ఇది దక్షిణాదిన రాయబడిన స్తోత్రముగా అనిపిస్తుంది (చిదంబరము లో నటరాజు, మదురైలో సుందరేశుడు ప్రస్తావన ఉంది కాబట్టి తమిళనాట రాసిందిగా భావించవచ్చు).

శివ కామసుందరీ సమేత చిదంబర నటరాజుడు

ఈ స్తోత్రములో ఇంకొక ప్రత్యేకము. ళు అక్షర ప్రయోగం. ఈ ళ అక్షరము తమిళంలో చాలా ఎక్కువగా వాడుతారు. తెలుగులో కూడ ఈ అక్షరం ఉంది. నవీన తెలుగు భాషలో వాడుకలో లేదు కాని, ఇరవైయ్యవ శతాబ్దపు మధ్య వరకు చాలా సరైన పద్ధతిలో ల, ళ వాడే వారు. ఇప్పుడు తెలుగు వాచకంలో, అక్షరమాలలో, బాలశిక్షలో కూడా ళ కనుమరుగు అయ్యింది. ళు కారము ఈ స్తోత్రంలో వినియోగించ బడింది. బారః మరియు బ్లాగర్ వారికి ఇంక ఈ అక్షరమును ఉంచినందుకు నా ధన్యవాదములు. స్తోత్రము, తాత్పర్యము, శ్రవణం గూగుల్ వీడియో. కొన్ని పదాల అర్థం నాకు తెలియలేదు కాబట్టి వాటిని వదిలి వేసాను. తప్పు అర్థం రాయటం కన్నా రాయకపోవటం మంచిందని నా ఉద్దేశం.


అర్థనారీశ్వర రూపంలో మదురై మీనాక్షీ సుందరేశులు


అథ శ్రీ సాంబ సదాశివ అక్షరమాలాస్తవః

సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ ||
అద్భుతవిగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ |సాంబ|
ఆనందామృత ఆశ్రితరక్షక ఆత్మానంద మహేశ శివ |సాంబ|
ఇందుకళాధర ఇంద్రాదిప్రియ సుందరరూప సురేశ శివ |సాంబ|
ఈశ సురేశ మహేశ జనప్రియ కేశవ సేవిత కీర్తి శివ |సాంబ|
ఉరగాదిప్రియ ఉరగవిభూషణ నరకవినాశ నటేశ శివ |సాంబ|
ఊర్జిత దానవనాశ పరాత్పర ఆర్జితపాపవినాశ శివ |సాంబ|
ఋగ్వేదశ్రుతి మౌళి విభూషణ రవి చంద్రాగ్నిత్రినేత్ర శివ |సాంబ|
ఋపనామాది ప్రపంచవిలక్షణ తాపనివారణ తత్వ శివ |సాంబ|
ళుల్లిస్వరూప సహస్రకరోత్తమ వాగీశ్వర వరదేశ శివ |సాంబ|
ళూతాధీశ్వర రూపప్రియ హర వేదాంతప్రియ వేద్య శివ |సాంబ|
ఏకానేక స్వరూప సదాశివ భోగాదిప్రియ పూర్ణ శివ |సాంబ|
ఐశ్వర్యాశ్రయ చిన్మయ చిద్ఘన సచ్చిదానంద సురేశ శివ |సాంబ|
ఓంకారప్రియ ఉరగవిభూషణ హ్రీంకారప్రియ ఈశ శివ |సాంబ|
ఔరసలాలిత అంతకనాశన గౌరిసమేత గిరీశ శివ |సాంబ|
అంబరవాస చిదంబర నాయక తుంబురు నారద సేవ్య శివ |సాంబ|
ఆహారప్రియ అష్ట దిగీశ్వర యోగిహృది ప్రియవాస శివ |సాంబ|
కమలాపూజిత కైలాసప్రియ కరుణాసాగర కాశి శివ |సాంబ|
ఖడ్గశూల మృగ టంకధనుర్ధర విక్రమరూప విశ్వేశ శివ |సాంబ|
గంగా గిరిసుత వల్లభ శంకర గణహిత సర్వజనేశ శివ |సాంబ|
ఘాతకభంజన పాతకనాశన దీనజనప్రియ దీప్తి శివ |సాంబ|
గాంతస్వరూపానంద జనాశ్రయ వేదస్వరూప వేద్య శివ |సాంబ|
చండవినాశన సకలజనప్రియ మండలాధీశ మహేశ శివ |సాంబ|
ఛత్రకిరీట సుకుండల శోభిత పుత్రప్రియ భువనేశ శివ |సాంబ|
జన్మజరా మృత్య్వాది వినాశన కల్మషరహిత కాశి శివ |సాంబ|
ఝంకారప్రియ భృంగిరిటప్రియ ఓంకారేశ్వర విశ్వేశ శివ |సాంబ|
జ్ఞానాజ్ఞాన వినాశన నిర్మల దీనజనప్రియ దీప్తి శివ |సాంబ|
టంకస్వరూప సహస్రకరోత్తమ వాగీశ్వర వరదేశ శివ |సాంబ|
ఢక్కాద్యాయుధ సేవిత సురగణ లావణ్యామృత లసిత శివ |సాంబ|
డంభవినాశన డిండిమభూషణ అంబరవాస చిదేక శివ |సాంబ|
ఢంఢంఢమరుక ధరణీనిశ్చల ఢుంఢివినాయక సేవ్య శివ |సాంబ|
నానామణిగణ భూషణనిర్గుణ నతజనపూత సనాథ శివ |సాంబ|
తత్వమస్యాది వాక్యార్థ స్వరూప నిత్యస్వరూప నిజేశ శివ |సాంబ|
స్థావరజంగమ భువనవిలక్షణ తాపనివారణ తత్వ శివ |సాంబ|
దంతివినాశన దళితమనోభవ చందన లేపిత చరణ శివ |సాంబ|
ధరణీధరశుభ ధవళవిభాసిత ధనదాదిప్రియ దాన శివ |సాంబ|
నళినవిలోచన నటనమనోహర అలికులభూషణ అమృత శివ |సాంబ|
పార్వతినాయక పన్నగభూషణ పరమానంద పరేశ శివ |సాంబ|
ఫాలవిలోచన భానుకోటిప్రభ హాలాహలధర అమృత శివ |సాంబ|
బంధవిమోచన బృహతీపావన స్కందాదిప్రియ కనక శివ |సాంబ|
భస్మవిలేపన భవభయమోచన విస్మయరూప విశ్వేశ శివ |సాంబ|
మన్మథనాశన మధురానాయక మందరపర్వతవాస శివ |సాంబ|
యతిజన హృదయాధినివాస విధివిష్ణ్వాది సురేశ శివ |సాంబ|
రామేశ్వర పుర రమణ ముఖామ్బుజ సోమేశ్వర సుకృతేశ శివ |సాంబ| 
లంకాధీశ్వర సురగణ సేవిత లావణ్యామృత లసిత శివ |సాంబ|
వరదాభయకర వాసుకిభూషణ వనమాలాది విభూష శివ |సాంబ|
శాంతి స్వరూపాతిప్రియ సుందర వాగీశ్వర వరదేశ శివ |సాంబ|
షణ్ముఖజనక సురేంద్రమునిప్రియ షాడ్గుణ్యాది సమేత శివ |సాంబ|
సంసారార్ణవ నాశన శాశ్వత సాధుజన ప్రియవాస శివ |సాంబ|
హరపురుషోత్తమ అద్వైతామృత మురరిపుసేవ్య మృడేశ శివ |సాంబ|
లాలిత భక్తజనేశ నిజేశ్వర కాళినటేశ్వర కామ శివ |సాంబ|
క్షరరూపాభి ప్రియాన్విత సుందర సాక్షాత్ స్వామిన్నంబా సమేత శివ |సాంబ|
సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ

తాత్పర్యము:

అద్భుతమైన విగ్రహము కలవాడు, దేవతలకు అధిపతి, ఎన్న లేని గుణముల సమూహం కలవాడు, ఆశ్రితులను రక్షించి ఆనందమనే అమృతాన్ని ఇచ్చే వాడు, ఆత్మానంద స్వరూపుడు, మహేశ్వరుడు, చంద్రుని ధరించిన వాడు, ఇంద్రాది దేవతలకు ప్రియుడు, సుందరమైన రూపము కలవాడు, దేవతలకు అధిపతి, ఈశ్వరుడు, జనులకు ప్రియుడు, విష్ణువుచే  పొగడ బడిన వాడు, కీర్తి కలవాడు అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను.

నాగ జాతికి ప్రియుడైన వాడు, సర్పములను ఆభరణములుగా కలవాడు,  నరక బాధ నాశనము చేసే వాడు, నాట్యానికి ఈశ్వరుడు, దుష్టులైన దానవులను నాశనము చేసే వాడు,  మానవులను కూడబెట్టిన పాపములను నాశనము చేసే వాడు, ఋగ్వేదములో నుతించ బడినవాడు, చంద్రుని ధరించిన వాడు, సూర్యచంద్రాగ్నులు మూడు నేత్రములుగా కలవాడు, తాపమును తొలగించే వాడు, విలక్షణమైన ప్రపంచము కలవాడు అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను. 

లింగ స్వరూపుడు, సహస్ర బాహువులతో ఉత్తమమైన వాడు, వాక్కుకు అధిపతి, వరములను ఇచ్చేవాడు, భూతములకు అధిపతి, తన రూపమునందు ప్రియుడు, హరుడు, వేదాంతమనే ఇష్టపడే వాడు, వేదములచే పొగడబడిన వాడు, ఏకము, అనేకము రూపములు కలవాడు, ఎల్లప్పుడూ శుభకరుడు, భోగాములందు ప్రియము కలవాడు, పూర్ణుడు అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను. 

ఐశ్వర్యమునకు నిలయమైన వాడు, అనంతమైన జ్ఞానము, కీర్తి, ఆనందం  కలవాడు, ఓంకార, హ్రీంకార ప్రియుడు, గౌరీ సమేతుడు, యముని నాశనము చేసే వాడు, దిక్కులనే అంబరములుగా కలవాడు, చిదంబర క్షేత్రములో విలసిల్లిన వాడు, తుంబురు నారదాదులచే సేవించ బడే వాడు అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను.

ఆహార ప్రియుడు, అష్ట దిక్కులకు నాయకుడు, యోగుల హృదయాలలో నివసించేవాడు, బ్రహ్మచే పూజించ బడిన వాడు, కైలాస ప్రియుడు, కరుణా సాగరుడు, కాశీ క్షేత్రములో ఉన్నవాడు, ఖడ్గము, శూలము, టంకము, ధనుస్సు మొదలగు ఆయుధములు ధరించిన విక్రముడు, విశ్వేశ్వరుడు, గంగ మరియు పార్వతికి భర్త, శుభములు కలిగించే వాడు అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను. 

భూత గణముల హితము కోరేవాడు, సర్వ జనులకు ఈశ్వరుడు, అపాయమూ కలిగించే వారిని నాశనము చేసే వాడు, పాపములను తొలగించే వాడు, దీనజనులకు ప్రియుడు, ప్రకాశకుడు, జనులకు ఆశ్రయమిచ్చే వాడు, వేద స్వరూపుడు, చండుని నాశనము చేసిన వాడు, అందరికి ప్రియమైన వాడు, భూత గణములకు, దేవతలు అధిపతి, చట్రము, కిరీటము కుండలములు ధరించిన వాడు, పుత్రులైన గణపతి, కుమారస్వామికి ప్రియుడు,  ఈ విశ్వమునకు అధిపతి అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను. 

జన్మము, జరా మరణములను నాశనము చేసే వాడు, కల్మషము లేని వాడు, కాశీ నివాసుడు, ఝుంకారము అంటే ఇష్ట పడే వాడు, భృంగి (నంది) నాట్య మంటే ఇష్టపడే వాడు, ఓంకారేశ్వర క్షేత్రములో వెలసిల్లిన వాడు, జ్ఞానమును కలిగించే వాడు,ఆజ్ఞానమును నాశనము చేసే వాడు, నిర్మలమైన వాడు, టంక స్వరూపుడు,  ఢక్కము మొదలగు ఆయుధములు కలిగి, దేవతా గణము చే పూజించబడి, లావణ్యముతో శోభిల్లే వాడు అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను. 

డంభాసురుని సంహరించిన వాడు, డమరుకము ధరించిన వాడు, దిక్కులన్నిట ఏకమై యున్న వాడు, ఢమరుకము తో ఢంఢం నాదము చేస్తూ ప్రపంచాన్ని నిశ్చలము చేసే వాడు, కుమారస్వామి, వినాయకునిచే పూజించ బడిన వాడు, అనేకరకమైన మణులు ఆభరణములుగా కలిగిన, గుణ విహీనుడు, స్తుతించే వారి పాలిత దయచూపే వాడు, సకల జీవులకు నాథుడు అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను. 

తత్త్వమసి (నేనే బ్రహ్మను) మొదలగు వాక్యములకు అర్థమైన వాడు, నిత్యమైన వాడు, సృష్టిలో చరాచరములకు మూలమై విలక్షణముగా నున్నవాడు, తాపమును నివారించే వాడు, తత్త్వ స్వరూపుడు, గజాసురుని సంహరించిన వాడు, దీనుల మనసు తెలిసిన వాడు, పాదములకు గంధము పూయబడిన వాడు అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను. 

భూమి యందు సకల శుభములు కలిగించే వాడు,  తెల్లని మంచు కొండలపై నివసించువాడు, ధనము, దానము అంటే ఇష్టపడే వాడు, నల్లని కనులు కలవాడు, అందముగా నాట్యము చేసే వాడు, సర్పములు ఆభరణముగా కలవాడు, అమృత స్వరూపుడైన వాడు, పార్వతీ వల్లభుడు, పరమానందముగా నుండే వాడు,  అత్యున్నతమైన దైవము అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను. 

అగ్నిని మూడవ కన్నుగా కలవాడు, సూర్యుని వంటి తేజస్సు కలవాడు, విషమును గళంలో యుంచుకొనిన వాడు, అమృత రూపుడు, బంధములను తొలగించే వాడు, బృహతీవృక్షమున నివసించే వాడు, సుబ్రహ్మణ్య స్వామి మొదలగు వారికి ప్రియుడు, భస్మము శరీరమున కలిగిన వాడు, సంసారమున భయములను తొలగించే వాడు, విస్మయము కలిగించే రూపము కలవాడు, విశ్వేశ్వరుడు అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను. 

మన్మథుని సంహరించిన వాడు, మధురా పట్టణమున వెలసిన వాడు, మందరగిరి పై నివసించే వాడు, యతుల హృదయములో నివసించే వాడు, విష్ణువు, బ్రహ్మ మొదలగు దేవతలచే పూజించబడిన వాడు, రామేశ్వరము, సోమేశ్వరము మొదలగు క్షేత్రములలో వెలసిన వాడు, రావణుడు, దేవతలచే పూజించబడిన వాడు, వరములు, అభయం ఇచ్చే వాడు, వాసుకి, వనమాల ఆభరణములుగా కలవాడు. శాంతి స్వరూపుడు, సుందరమైన రూపము కలవాడు, వాక్కుకు అధిపతి, వరములిచ్చే వాడు అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను. 

షణ్ముఖుడైన సుబ్రహ్మణ్యునికి తండ్రి,  ఇంద్రుడు, మునులకు ప్రియుడు, ఆరు గుణములు కలవాడు, సంసారమనే సాగరమును దాటించే వాడు, శాశ్వతుడు, సాదుజనులకు ప్రియుడు, వారి వద్ద ఉండే వాడు, హరుడు, పురుషోత్తముడు, అద్వైతమనే అమృతము తానైన వాడు, విష్ణువుచే పూజించ బడిన వాడు, భక్తులచే ప్రేమించబడే వాడు, జనులకు ఈశ్వరుడు, సత్యమునకు అధిపతి, పార్వతితో కలిసి నాట్యము చేసే వాడు, మన్మథుని చంపిన వాడు, సుందరేశుడు, అంబా సమేతుడు అయిన శివుని సాంబ సదా శివ అని ప్రార్థిస్తున్నాను.

20, నవంబర్ 2010, శనివారం

వైద్యనాథాష్టకము - తాత్పర్యము

పరమశివుడు వైద్యులకు అధిపతిగా కూడా పేరొందాడు. శ్రీ రుద్రాభిషేచనంలో చాలా భాగం దీన్ని వక్కాణిస్తుంది.  నమకం, చమకంలో పూర్తి ప్రార్థన, ఫలితం కూడా రోగ నివారణ, ఆరోగ్యము, దీర్ఘాయుష్షు గురించి చెపుతాయి. అందుకనే శివుని వైద్యనాథుడిగా కొలుస్తారు. దీనికి జ్యోతిర్లింగ స్వరూపమే మహారాష్ట్ర అంబజోగై సమీపం లోని వైద్యనాథ దేవాలయం. అలాగే, తమిళనాట చిదంబరం దగ్గర వైదీశ్వరన్ కోవిల్ ఈ స్వామి మహాత్మ్యాన్ని తెలిపేదే.

జటాయు అంత్యక్రియలు, కుష్ఠు వ్యాధితో బాధపడుతున్న అంగారకునికి (కుజ గ్రహం) రోగ నివారణ ఇక్కడే జరిగాయని గాథ. సుబ్రహ్మణ్యునికి శూలము కూడా ఇక్కడ శివుని ప్రార్థించిన తర్వాతే లభించిందని ఇక్కడి ప్రజల విశ్వాసం. ఇక్కడి సిద్ధామృత తీర్థం (పుష్కరిణిలో నీరు), అంగసనాతన తీర్థంలో స్నానం చేసి,  వేప చెట్టు క్రింద మట్టి తీసుకుని పవిత్ర భస్మముతో కలిపి దేవునికి సమర్పించి ఆ సిద్ధామృత తీర్థంతో తీసుకుంటే సర్వ రోగ నివారణ అవుతుందని గట్టి విశ్వాసం. అలాగే ఆ వైద్యనాథుని ఈ క్రింది స్తోత్రము రోజుకు మూడు సార్లు చదివితే ఆరోగ్యం కలుగుతుందట. అంతటి మహిమాన్వితమైన వైద్యనాథ అష్టకం, తాత్పర్యము మీకోసం. యూట్యూబ్ శ్రవణం.

పరళీ వైద్యనాథ లింగం 

శ్రీ రామ సౌమిత్రి జటాయు వేద
షడాననాదిత్య కుజార్చితయ
శ్రీ నీలకంఠాయ దయామయాయ
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

గంగా ప్రవాహేందు జటాధరయ
త్రిలోచనాయ స్మర కాల హంత్రే
సమస్త దేవైరపి పూజితాయ
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

భక్త ప్రియాయ త్రిపురాంతకాయ
పినాకినీ దుష్ట హరాయ నిత్యమ్
ప్రత్యక్ష లీలాయ మనుష్య లోకే
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

ప్రభూత వాతాది సమస్త రోగ
ప్రణాశ కర్త్రే ముని వందితాయ
ప్రభాకరేంద్ర్వగ్ని విలోచనాయ
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

వాక్శ్రోత్ర నేత్రాంఘ్రి విహీన జంతోః
వాక్శ్రోత్ర నేత్రాంఘ్రి సుఖ ప్రదాయ
కుష్ఠాది సర్వోన్నత రోగ హంత్రే
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

వేదాంత వేద్యాయ జగన్మయాయ
యోగీశ్వర ధ్యేయ పదాంబుజాయ
త్రిమూర్తి రూపాయ సహస్ర నామ్నే
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

స్వతీర్థ మృడ్భస్మ భృతాంగ భాజాం
పిశాచ దుఃఖార్తి భయాపహాయ
ఆత్మ స్వరూపయ శరీర భాజాం
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ

శ్రీ నీలకంఠాయ వృష ధ్వజాయ
స్రక్గంధ  భస్మాద్యభి శోభితాయ
సుపుత్రదారాది సుభాగ్యదాయ
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ


ఫల శ్రుతిః

బాలాంబికేశ వైద్యేశ భవ రోగ హరేతి చ
జపేన్నామ త్రయం నిత్యం మహారోగ నివారణం

తాత్పర్యము:

శ్రీ రాముడు, లక్ష్మణుడు, జటాయువు, వేదములు, సుబ్రహ్మణ్య స్వామి, సూర్యుడు, అంగారకుడిచే పూజించబడిన, నీలకంఠము కలవాడు, దయామయుడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.

ప్రవహించే గంగను, చంద్రుని జటా ఝూటములో ధరించిన, మూడు కన్నులు కలవాడు, మన్మథుని, యముని సంహరించిన వాడు, దేవతలందరి చేత పూజించ బడినవాడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.

భక్త ప్రియుడు, త్రిపురములను నాశనము చేసిన వాడు, పినాకమును (త్రిశూలమును) చేతిలో ధరించిన వాడు, నిత్యము దుష్టులను సంహరించే వాడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.

వాతము, కీళ్ళనొప్పులు మొదలగు రోగములను నాశనము చేసే వాడు, మునులచే పూజించబడిన వాడు, సూర్యుడు, చంద్రుడు, అగ్ని నేత్రములుగా కలవాడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.


వాక్కు, వినికిడి శక్తి, కాంతి చూపు, నడిచే శక్తి కోల్పోయిన జీవ రాశులకు ఆ శక్తులను తిరిగి కలిపించే వాడు,  కుష్ఠు మొదలగు భయంకరమైన రోగములను నిర్మూలము చేసి ఆరోగ్యాన్ని ప్రసాదించే వాడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.

వేదముల ద్వారా తెలుసుకొనే దైవము, విశ్వమంతా వ్యాపించి యున్నవాడు, యోగులచే ధ్యానింపబడిన పాద పద్మములు కలిగిన వాడు, త్రిమూర్తుల రూపమైన వాడు, సహస్ర నామములు కలవాడు, వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.

ఆయన దేవాలయమున ఉన్న పుణ్య పుష్కరిణీ స్నానము వలన, వేపచెట్టు క్రింద మట్టి మరియు భస్మము వలన - భూత ప్రేతముల బాధ, దుఃఖములు, కష్టములు, భయములు, రోగములు తొలగించే, ఆత్మ స్వరూపుడై దేహము నందు నివసిస్తున్న,  వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.

నీలకంఠుడు, వృషభమును (ఎద్దును) పతాకమందు చిహ్నముగా కలవాడు,  పుష్పములు, గంధము, భస్మముచే అలంకరించబడి శోభిల్లే వాడు, సుపుత్రులు, మంచి ధర్మపత్ని, సత్సంపదలు, అదృష్టములు ఇచ్చే వాడు,  వైద్యనాథుడైన శివునికి నా నమస్కారములు.

ఫల శృతి: 

బాలాంబిక పతి, జరామరణముల భయమును పోగొట్టేవాడు అయిన వైద్యనాథుని ఈ వైద్యనాథాష్టకం ప్రతి దినము మూడు సార్లు పఠించే వారికి సకల రోగ నివారణ కలుగును.

19, నవంబర్ 2010, శుక్రవారం

అర్ధనారీశ్వరాష్టకం - తాత్పర్యము

అర్ధనారీశ్వర రూపమైన శివ పార్వతులను స్తుతిస్తూ ఆదిశంకరులు ఈ స్తోత్రాన్ని రచించారు. ప్రకృతీ పురుష రూపమైన ఈ దేహాకృతిలో సున్నితమైన స్త్రీ తత్త్వానికి, దృఢమైన పురుష తత్త్వానికి ఆయా లక్షణాలను ఆపాదిస్తూ, వర్ణిస్తూ ఈ స్తోత్ర రచన జరిగింది. స్తోత్రము, తాత్పర్యము మీ కోసం. యూట్యూబ్ శ్రవణం బాలు గారి గళంలో.

అర్ధనారీశ్వర తత్త్వము - మనోహర చిత్రము
చాంపేయ గౌరార్ధ శరీరికాయై
కర్పూర గౌరార్ధ శరీరకాయ
ధమ్మిల్లకాయై చ జటాధరాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ

కస్తూరికా కుంకుమ చర్చితాయై
చితారజహ్పుంజ విచర్చితాయ
కృతస్మరాయై వికృతస్మరాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ

ఝణత్ భణత్ కంకణ నూపురాయై
పాదాబ్జ రాజత్ఫణి నూపురాయ
హేమాంగదాయై భుజగాంగదాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ

విశాల నీలోత్పల లోచనాయై
వికాసి పంకేరుహ లోచనాయ
సమేక్షణాయై విసమేక్షణాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ

మందారమాలా కలితా లతాయై
కపాలమాలాంకిత కంధరాయ
దివ్యాంబరాయై చ దిగంబరాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ

అంబోధర శ్యామల కుంతలాయై
తటిప్రభా తామ్ర జటాధరాయ
నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ

ప్రపంచ సృష్ట్యున్ముఖ లాస్యకాయై
సమస్త సంహారక తాండవాయ
జగజ్జనన్యై జగదేక పిత్రే
నమశ్శివాయై చ నమశ్శివాయ

ప్రదీప్త రత్నోజ్వల కుండలాయై
స్ఫురన్మహా పన్నగ భూషణాయ
శివాన్వితాయై చ శివాన్వితాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ

యేతత్పఠేదష్టకమిష్టదం యో
భక్త్యాఽసమాన్యో భువి దీర్ఘజీవి
ప్రాప్నోతి సౌభాగ్యమనంతకాలం
భూయాత్ సదా తస్య సమస్త సిద్ధిః

తాత్పర్యము: 

కరిగించిన బంగారము వంటి మేని ఛాయ, అందమైన జడగా అల్లబడిన జుట్టు కలిగిన దేవికి, వెలుగుతున్న కర్పూరం వంటి మేని ఛాయ, జటా ఝూటములు కలిగిన దేవునకు - అర్థనారీశ్వర రూపములో ఉన్న ఆ పార్వతీ పరమేశ్వరులకు నా నమస్కారములు. 

చందన, కుంకుమ లేపిత శరీరము కలిగిన దేవికి, చితా భస్మలేపితమైన శరీరము కలిగిన దేవునకు, సౌందర్యముతో ప్రేమను వెదజల్లే దేవికి, మన్మథుని జంపిన దేవునకు - అర్థనారీశ్వర రూపములో ఉన్న ఆ పార్వతీ పరమేశ్వరులకు నా నమస్కారములు. 

మృదు మంజీర రావము పలికే కాలి యందెలు, బంగారు ఆభరణములు కలిగిన దేవికి, సర్పములు కాలికి యందెలుగా, దేహాభారణములుగా కలిగిన దేవునికి - అర్థనారీశ్వర రూపములో ఉన్న ఆ పార్వతీ పరమేశ్వరులకు నా నమస్కారములు.

నీలి కలువల వలె విశాలమైన నేత్రములు రెండు కలిగిన దేవికి, పూర్తిగా వికసించిన కలువ వంటి కనులు కలిగి త్రినేత్రుడైన దేవునికి - అర్థనారీశ్వర రూపములో ఉన్న ఆ పార్వతీ పరమేశ్వరులకు నా నమస్కారములు. 

మందారము మొదలగు దేవ పుష్పముల మాల, పట్టు వస్త్రములు ధరించిన దేవికి, కపాలమాల, దిక్కులే అంబరములు గా కలిగిన దేవునికి - అర్థనారీశ్వర రూపములో ఉన్న ఆ పార్వతీ పరమేశ్వరులకు నా నమస్కారములు. 

కారు మేఘముల వంటి కురులు, గిరిరాణి అయిన దేవికి, రాగి రంగులో మెరుపులా వంటి జటా ఝూటములు కలిగిన, అన్నిటికీ ఈశ్వరుడు అయిన దేవునికి - అర్థనారీశ్వర రూపములో ఉన్న ఆ పార్వతీ పరమేశ్వరులకు నా నమస్కారములు. 

తన నాట్యముచే ప్రపంచాన్ని సృష్టించే, జగజ్జనని అయిన దేవికి, తన నాట్యముచే ప్రపంచ నాశనము చేసే, జగత్ పితయైన దేవునికి - అర్థనారీశ్వర రూపములో ఉన్న ఆ పార్వతీ పరమేశ్వరులకు నా నమస్కారములు. 

రత్నములచే పొదగబడిన చెవి ఆభరణములు కలిగిన, శివునిలో ఏకమైన దేవికి, సర్పములే సకల ఆభరణములుగా కలిగిన, శివానిలో ఏకమైన దేవునికి - అర్థనారీశ్వర రూపములో ఉన్న ఆ పార్వతీ పరమేశ్వరులకు నా నమస్కారములు. 

ఫల శృతి:

ఈ అష్టకాన్ని పఠనం చేసిన వారికి అసామాన్యమైన జీవనం, దీర్ఘాయుష్షు, సమస్త సౌభాగ్యాలు, సంపదలు కలుగును.

కాలభైరవాష్టకం


కాశీలోని కాలభైరవ దేవాలయం

సనాతన ధర్మంలో ఒక గొప్ప విశేషం ఆగమ శాస్త్రానుసారంగా మహనీయులచే స్థాపించబడిన ప్రతి దేవాలయానికీ ఒక క్షేత్రపాలకుడిని కూడా గుర్తించి ఆలయం నిర్మించటం. పేరులో ఉన్నట్లు క్షేత్రపాలకుడు ఆ క్షేత్రానికి కాపలాదారు. అంటే ఆ దేవతా స్వరూపానికి నమ్మిన బంటు లేదా ఆ దేవతామూర్తి యొక్క మరొక రూపమే. తన శక్తిని క్షేత్రపాలకునికి ఆ దేవతామూర్తి నిరంతరం అందజేస్తూ ఉంటుంది. మీరు నిశితంగా పరిశీలించండి - కొన్ని వైష్ణవాలయాలలో హనుమంతుడు, శివ, శక్తి సంబంధితమైన ఆలయాలలో కాలభైరవుడు క్షేత్రపాలకులుగా ఉంటారు. కాలభైరవుని వృత్తాంతము శివపురాణంలో చెప్పబడింది. ఈ సారి కాశీ వెళితే తప్పకుండా కాలభైరవుని దర్శించుకోండి. అలాగే, నేపాల్ వెళ్లినప్పుడు కాఠ్మండు లోని దర్బారు స్క్వేరులో గల కాలభైరవుని దర్శించుకోగలరు.

కాఠ్మండులోని కాలభైరవ విగ్రహం

వారణాసి (కాశీ) పుణ్య క్షేత్రానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. పరమశివుని ఉగ్రాంశగా భావించబడే రూపం కాలభైరవుడు. దీనికి ఒక చిన్న గాథ కూడా ఉంది. ఒకసారి బ్రహ్మ శివుని అవమానించి, తన  ముఖముతో శివుని చూసి పక పక నవ్వాడు. అప్పుడు శివుని నుండి కాల భైరవుడు జన్మించి ఆ శిరస్సును నరికేస్తాడు. విష్ణువు విన్నపముతో శివుడు బ్రహ్మను మన్నించి శాంతిస్తాడు.  కాని శిరస్సు ఖండించిన ఆ పాపము  కాలభైరవుడిని వెంటాడింది. ఆ శిరస్సు కూడా కాలభైరవుని వీడక ఉంది. ఈ పాతకము, దాని శిక్షను దూరం చేసుకోటానికి కాలభైరవుడు కాశీ క్షేత్ర ప్రవేశము చేయాలని సంకల్పిస్తాడు. ఆయన ప్రవేశించ గలుగుతాడు, ఆ పాపము ఊరి బయటనే ఉండిపోతుంది. అప్పటినుంచి ఆ కాలభైరవుడు కాశీ క్షేత్రానికి కోత్వాల్ (క్షేత్ర పాలకుడు) గా వ్యవహరించబడ్డాడు. ఈ కాల భైరవునకు వాహనము శునకము. ఈ స్వామి దర్శనము చేయనిదే కాశీ యాత్ర పూర్తి కానట్లే అని ప్రతీతి. జగద్గురువు ఆదిశంకరులు రచించిన మహిమాన్విత, ప్రాశస్త్యము పొందిన కాలభైరావాష్టకం, తాత్పర్యము. యూట్యూబ్ శ్రవణం

కాశీ క్షేత్రపాలకుడు కాల భైరవుడు 

దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం
వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరమ్
నారదాదియోగిబృందవందితం దిగంబరం
కాశికాపురాధినాథకాలభైరవం భజే

భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం
నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్
కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం
కాశికాపురాధినాథకాలభైరవం భజే

శూలటంకపాశదండపాణిమాదికారణం
శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం
కాశికాపురాధినాథకాలభైరవం భజే

భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం
భక్తవత్సలం స్థితం సమస్తలోకవిగ్రహమ్
వినిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం
కాశికాపురాధినాథకాలభైరవం భజే

ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశనం
కర్మపాశమోచకం సుశర్మధాయకం విభుమ్
స్వర్ణవర్ణశేషపాశశోభితాంగమండలం
కాశికాపురాధినాథకాలభైరవం భజే

రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్
మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రమోక్షణం
కాశికాపురాధినాథకాలభైరవం భజే

అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం
దృష్టిపాత్తనష్టపాపజాలముగ్రశాసనమ్
అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం
కాశికాపురాధినాథకాలభైరవం భజే

భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం
కాశివాసలోకపుణ్యపాపశోధకం విభుమ్
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథకాలభైరవం భజే

           ఫల శ్రుతి

కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనమ్
శోకమోహదైన్యలోభకోపతాపనాశనం
ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం నరా ధ్రువమ్

ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం
శ్రీ కాలభైరవాష్టకం సంపూర్ణమ్

తాత్పర్యము:
దేవేంద్రునిచే పూజించబడిన పాదపద్మములు కలిగిన, సర్పమును యజ్ఞోపవీతము గా కలిగిన వాడు, చంద్రుని ధరించిన వాడు, కృపాకరుడు, దిక్కులనే వస్త్రములుగా కలిగిన వాడు, నారదాది మునులచే పూజించ బడిన వాడు, కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను.

కోటి సూర్యుల వలె ప్రకాశించు వాడు, భవ సాగరాన్ని దాటించే వాడు, జగదీశ్వరుడు, నీలకంఠుడు, కామ్యములను తీర్చేవాడు, మూడు నేత్రములు కలిగిన వాడు, యముని సంహరించిన వాడు, పద్మముల వంటి కన్నులు కలవాడు, అజేయమైన త్రిశూలము కలవాడు, నాశనము లేని వాడు, కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను. 

శూలము, టంకము, పాశము, దండము మొదలగునవి ఆయుధములుగా ధరించిన వాడు,  నల్లని మేను కలవాడు, సనాతనుడు, నాశనము లేని వాడు, మొదటి వాడు, రోగాతీతుడు, విక్రముడు, ప్రభువు, విచిత్రమైన నాట్యమంటే ఇష్టపడే వాడు, కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను. 

కోరికలు తీర్చి, మోక్షాన్ని ప్రసాదించే వాడు,  పేరుగాంచిన సౌందర్యమున్న దేహము కలవాడు, శివుని రూపమైన వాడు (స్థిరమైన వాడు), భక్త ప్రియుడు, లోకేశ్వరుడు, వేరు వేరు రూపములలో విలసించే వాడు, చిరు గజ్జెలు కలిగిన బంగారు మొలత్రాడు ధరించిన వాడు, కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను. 

ధర్మమనే సేతువును పాలించేవాడు, అధర్మ మార్గములను నాశనము చేసే వాడు, కర్మ బంధములనుండి తప్పించే వాడు, మనము చేసే తప్పులను తెలియచేసి మనకు సిగ్గును కలిగించే వాడు,  బంగారు రంగులో ఉన్న పాశము, సర్పములు దేహ భాగములకు ఆభరణములుగ కలిగిన వాడు, కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను. 

రత్నములు పొదిగిన పాదుకలచే అలరారు పాదములు కలిగిన వాడు,  అంతటాయున్న వాడు, రెండవసాటి లేని వాడు, ఇష్ట దైవమైన వాడు, కామ్యములు తీర్చేవాడు, మానవులకు మృత్యు భయమును తొలగించే వాడు, తన దంతముల ద్వారా మోక్షమును కలిగించే వాడు, కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను. 

బ్రహ్మచే సృష్టించ బడిన వాటిన తన అట్టహాసముతో నాశనము చేయ గలిగిన వాడు,  సర్వ పాపహారము చేసే వీక్షణములు కలవాడు, తెలివైన వాడు, చండ శాసనుడు, అష్ట సిద్ధులను ప్రసాదించే వాడు (అణిమ, గరిమ మొదలగునవి),  కపాలముల మాల ధరించిన వాడు, కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను. 

భూత నాయకుడు, ఎనలేని కీర్తిని ప్రసాదించే వాడు, కాశీ పుర వాసుల మంచి చెడును విచారించే వాడు, నీతి మార్గములో నిపుణుడు, శాశ్వతుడు, జగత్పతి, కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను. 

ఫల శృతి 

అనంతమైన జ్ఞాన మూలమైన, సత్కార్యముల ఫలమును పెంచే, శోకము, మోహము, దారిద్ర్యము, కోరిక, క్రోధము నశింపచేసే ఈ మనోహరమైన కాలభైరవాష్టకం పఠించే  వారికి ఆ భైరవుని సన్నిధి ప్రాప్తించును. 

ఇది శ్రీమచ్ఛంకరాచార్యులు రచించిన కాలభైరవాష్టకం.

18, నవంబర్ 2010, గురువారం

దక్షిణామూర్తి స్తోత్రము - తాత్పర్యము

పరమాత్మ, గురువు, ఆత్మ రూపంలో విశేషంగా వ్యక్తమయ్యే దక్షిణామూర్తిని స్తుతిస్తూ ఆదిశంకరులు ఈ స్తోత్రం రచించారు. వేదాంతాన్ని అభ్యసించటంలో ముఖ్య ఉద్దేశము అజ్ఞానాన్ని (అవిద్యను) తొలగించుకొనుటకు. ఇది ఎలా?  సంకల్పముతో మాయ మీద ఉన్న మోహమును వదులుకోవటం, ఆత్మానందము పొంది భయమును, భీతిని అధిగమించటం వలన. ఆత్మ సాక్షాత్కారము పొందిన ఒక గురువు సహాయముతో, గురుబోధలను అనుసరించి, ఆయనను దైవముగా భావించి సాధకుడు ఈ స్థితిని చేరుకుంటాడు.  ఇదే అద్వైత సారం - గురువునకు, దైవమునకు గల అభేదమును తెలుసుకొనుట. ఈ స్తోత్రమున దక్షిణామూర్తిని గురువు రూపము యందు ధ్యానిన్చినందు వలన కలిగే ఆత్మ ప్రకాశమును మనకు తేట తెల్లము చేసారు. ఈ స్తోత్రము మనకు జీవము, ఈశ్వరుడు, బ్రహ్మ అన్ని ఒకటే అన్న తత్వాన్ని ఎరుగుటకు సహాయపడుతుంది. గురు రూపంలో ఉన్న ఆ దక్షిణామూర్తి మనలను అజ్ఞానమనే అంధకారము నుండి సత్యమనే ప్రకాశము వైపు నడిపించు గాక.  ఇంత అద్భుతమైన ఆత్మ తత్త్వ వివేచనా స్తోత్రమును మనకు అందించిన ఆదిగురువులకు శత సహస్ర వందనములు. యూట్యూబ్ శ్రవణం మలయాళ నేపథ్య గాయకుడు కే. సుకుమార్ గారి గళంలో



ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైక మూర్తయే
నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణమూర్తయే నమః



దక్షిణామూర్తి స్తోత్రము
విశ్వం దర్పణదృశ్యమాననగరీతుల్యం నిజాంతర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యదా నిద్రయా
యః సాక్షాత్కురుతే ప్రబోధసమయే స్వాత్మానమేవాద్వయం
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే

బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాణ్నిర్వికల్పం పునః
మాయాకల్పితదేశకాలకలనావైచిత్ర్యచిత్రీకృతమ్
మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే

యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే
సాక్షాత్తత్త్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్
యత్సాక్షాత్కరణాద్భవేన్న పునరావృత్తిర్భవాంభోనిధౌ
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే

నానాచ్ఛిద్రఘటోదరస్థిత్మహాదీపప్రభాభాస్వరం
జ్ఞానం యస్య తు చక్షురాదికరణద్వారా బహిం స్పందతే
జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తం జగత్
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే

దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః
స్త్రీబాలాంధజడోపమాస్త్వహమితి భ్రాంతా భృశం వాదినః
మాయాశక్తివిలాసకల్పితమహా వ్యామోహసంహారిణే
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే

రాహుగ్రస్తదివాకరేందుసదృశో మాయాసమాచ్ఛాదనాత్
సన్మాత్రః కరణోపసంహరణతో యోఽభూత్సుషుప్తః పుమాన్
ప్రాగస్వాప్సమితి ప్రబోధసమయే యః ప్రత్యభిజ్ఞాయతే
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే

బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి
వ్యావృత్తాస్వనువర్తమానమహమిత్యంతః స్ఫురంతం సదా
స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే

విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతం
శిష్యాచార్యతయా తయైవ పితృపుత్రాద్యాత్మనా భేదతః
స్వప్నే జాగ్రతి వా య ఏష పురుషో మాయాపరిభ్రామితః
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే

భూరంభాస్యనలోఽనిలోఽంబరమహర్నాథో హిమాంశుః పుమాన్
ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్
నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభోః
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే 

సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే
తేనాస్య శ్రవణాత్తదర్థమననాద్ధ్యానాచ్చ సంకీర్తనాత్
సర్వాత్మత్వమహావిభూతిసహితం స్యాదీశ్వరత్వం స్వతః
సిద్ధ్యేత్తత్పునరష్టధా పరిణతం చైశ్వర్యమవ్యాహతమ్

వటవిటపిసమీపే భూమిభాగే నిషణ్ణం
సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్
త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం
జననమరణదుఃఖచ్ఛేదదక్షం నమామి


తాత్పర్యము:

ఈ విశ్వము అద్దములో కనిపించే ప్రతిబింబము వంటిది.  నిజమే బ్రహ్మము. బ్రహ్మమునకు రెండవది లేదు.  మనస్సు, ఇంద్రియములు, బుద్ధి కేవలం ఆత్మ యొక్క ప్రతిబింబమును మాత్రమే గ్రహించ గలుగుతున్నవి. స్వయం ప్రకాశము (సాక్షాత్కారము)  పొందిన పిమ్మటే ఆత్మ, బ్రహ్మ యొక్క గోచరమగును. ఈ సాక్షాత్కారమునకై  శ్రీ గురు స్వరూపుడైన దక్షిణామూర్తికి  నా నమస్కారములు.

వృక్షము మొలచుటకు ముందు బీజరూపమున నిక్షిప్తమై ఉన్నట్టు, ఈ విశ్వము కూడా  తనయందు అటులనే కలిగిన ఆయనకు, తన మాయచే, యోగుల వంటి సంకల్పముచే విశ్వమును అనేక రూపములలో సృష్టించిన, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి  నా నమస్కారములు.

ఎవరి ప్రకాశముచే ఈ మాయా ప్రపంచము నిజముగా కనిపిస్తున్నదో, ఆయన, ఆత్మ జ్ఞానము పొంద గోరు వారికి వేదముల సారము (తత్త్వమసి) ద్వారా పరబ్రహ్మ తత్త్వమును బోధిస్తున్నాడు. ఈ సంసార సాగరాన్ని అంతము చేసే, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి  నా నమస్కారములు.

ఎవరి ప్రకాశము ఇంద్రియముల ద్వారా కుండలో ఉన్న వెలుగు దాని రంధ్రముల ద్వారా వెలువడినట్లు వెలువడునో, ఎవరి జ్ఞానము వల్లనే నేనే బ్రహ్మ అను జ్ఞానము కలుగునో, ఎవరి ప్రకాశము వలన విశ్వమంతా ప్రకాశించునో, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి  నా నమస్కారములు.

కొంత మంది తత్త్వవేత్తలు శరీరము, ఇంద్రియములు, ప్రాణము, శ్వాస మరియు శూన్యమును ఆత్మగా వాదిస్తున్నారు. అది జ్ఞానము లేని స్త్రీలు, పిల్లలు, గుడ్డివారు, బలహీనుల వాదన కన్నా లోకువైనది.  మాయ వలన కలిగే భ్రాంతిని తొలగించి సత్యమును తెలియచేసే,  శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి  నా నమస్కారములు.

రాహువు వలన గ్రహణ సమయమున కాంతి తగ్గినట్టు కనిపించినా, సూర్య తేజము ఎల్లప్పుడూ అంతే ప్రకాశముగా  యుండును. అటులనే, బుద్ధి యొక్క పూర్ణ శక్తి తన శక్తిని కోల్పోకుండా, కేవలము నిద్రావస్థ యందు నిద్రాణమై యుండును. ఇదే విధముగా, ఆత్మ ప్రకాశము కేవలం మాయచే కప్పబడి యుండును. ఎలాగైతే నిద్రనుండి మేల్కొనిన వ్యక్తి తాను అంతకుముందు నిద్రలోయున్నాను, మరియు ఆ నిద్రలోని స్వప్నములు నిజము కావని గ్రహిస్తాడో,  అలాగే, ఆత్మ ప్రకాశము పొందిన వ్యక్తి తన అంతకు మునుపటి అజ్ఞాన స్థితిని అసత్యముగా గ్రహిస్తాడు. ఎవరి అనుగ్రహము వలన ఈ ఆత్మ ప్రకాశము కలుగునో, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి  నా నమస్కారములు.

ఎవరి ఉనికి అయితే దేహము, బుద్ధి యొక్క వివిధ అవస్థల (దేహమునకు బాల్యం, యౌవనం, వృద్ధాప్యం; బుద్ధికి జాగ్రత్,  చేతన, సుషుప్తా మొదలగునవి)  వచ్చే మార్పులకు అతీతంగా  ఉండునో, జ్ఞాన ముద్ర (అభయ హస్తమున బొటన వేలు, చూపుడు వేలు కలిపిన ముద్రను జ్ఞాన ముద్ర అంటారు) ద్వారా ఆత్మ జ్ఞానమును కలుగ జేసే,  శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి  నా నమస్కారములు.

ఎవరి మాయ వలన ఈ ప్రపంచమున చేతన, స్వప్నావస్థల యందు అనేక రూపముల అనుభూతి కలుగుతున్నదో (గురువు, శిష్యుడు, తండ్రి కొడుకు మొదలగునవి),  శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి  నా నమస్కారములు.

ఎవరి సూక్ష్మ, అష్ట పరిణామములు (రూపాంతరములు) ఈ చరాచారమును సృష్టించుచున్నవో, ఎవరి అనుగ్రహము వలన ఈ సృష్టులు అన్ని అంతర్ధానమై ఆత్మయే బ్రహ్మము అను సత్యమును తెలుపబడుతున్నదో, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి  నా నమస్కారములు.

ఈ స్తోత్రము ఆత్మ యొక్క సర్వ వ్యాపకా తత్త్వమును తెలుపుచున్నది. దీని మననము, పఠనం, ధ్యానము వలన శిష్యుడు ఆత్మ సంయోగం చెంది, ఈ విశ్వము, ఆత్మ యొక్క ఏకత్వమును తెలుసుకొని ఎనిమిది పరిణామముల సారమగును.

సంసార బంధములు, జనన మరణ  ఋణములు తొలగించే, వట వృక్షము కింద ఆసీనుడై యోగులకు, మునులకు జ్ఞానోపదేశము చేసే వానిగా ధ్యానించ బడే, త్రిలోక వంద్యుడైన శ్రీ దక్షిణామూర్తికి నా నమస్కారములు.

15, నవంబర్ 2010, సోమవారం

శివాష్టకం - తాత్పర్యము

శివాష్టకంగా పిలువ బడిన ఈ స్తోత్రము ఆది శంకరుల విరచితమని అంటారు. కాని నేను దాన్ని ధ్రువీకరించ లేకపోయాను. దీని సాహిత్యంలో ఉత్తర దక్షిణ భారత దేశాల్లో కొంత తేడా ఉంది. నాకు తెలిసిన సాహిత్యం, తాత్పర్యము, యూట్యూబ్ శ్రవణం ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి గళంలో

ఉజ్జయిని మహాకాలేశ్వరుడు

ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం
భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే

గళే రుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాధిపాలం
జటాఝూటగంగోత్తరంగైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే

ముదామాకరం మండలం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం
అనాదిహ్యపారం మహామోహహారం శివం శంకరం శంభుమీశానమీడే

వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదాసుప్రకాశం
గిరీశం గణేశం  సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే

గిరీంద్రాత్మజాసంగాహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా సన్నిగేహం
పరబ్రహ్మబ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమీడే

కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజనమ్రాయ కామం దధానం
బలీవర్దయానం సురాణాం ప్రధానం శివం శంకరం శంభుమీశానమీడే

శరచ్చంద్రగాత్రం గణానంద పాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం
అపర్ణాకళత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమీశానమీడే

హరం సర్పహారం చితా భూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం
శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమీశానమీడే

ఫల శృతి

స్తవం యః ప్రభాతే నరః శూలపాణే పఠేత్ సర్వదా భర్గ భావానురక్తః
సుపుత్రం ధనం ధాన్య మిత్రం కళత్రం విచిత్రం సమాసాద్య మోక్షం ప్రయాతి

తాత్పర్యము: 

ప్రభువు, మా ప్రాణ నాథుడు, జగత్పతి, విశ్వనాథుడు, జగన్నాథుడు అయిన విష్ణువునకు నాథుడు, ఎల్లప్పుడూ ఆనందంలో అలరు వాడు, జగమంతటికి ప్రకాశాన్ని కలిగించే వాడు, జీవులకు, భూతములకు, అన్నిటికి నాథుడయిన శివుని, శంకరుని, శంభుని నేను ధ్యానిస్తున్నాను.

మెడలో కపాలములు ధరించిన వాడు, శరీరము అంతా సర్పములు కలిగిన వాడు, యముని సంహరించిన వాడు, గణేశునికి అధిపతి,  గంగానదీ ప్రవాహము ధరించుట వలన విశాలమైన జటా ఝూటములు కలిగిన శివుని, శంకరుని, శంభుని నేను ధ్యానిస్తున్నాను.

ప్రపంచానికి ఆనందం పంచే వాడు, అంతటా ఉన్నవాడు, సర్వము తనే అయిన వాడు, భస్మము శరీరమంతా కలిగిన వాడు, ఆది లేని వాడు, కొలత లేని వాడు,  మహా మోహములను సంహరించే వాడు అయిన శివుని, శంకరుని, శంభుని నేను ధ్యానిస్తున్నాను.

వట వృక్షము (మర్రి చెట్టు) క్రింద నివసించేవాడు, అట్టహాసంగా నవ్వేవాడు, మహా పాపములను నాశనము చేసే వాడు, ఎల్లప్పుడూ ప్రకాశించే వాడు, హిమవత్పర్వతాలకు అధిపతి,  గణ నాయకుడు, దేవతలకు అధిపతి, అందరికి దేవుడు అయిన శివుని, శంకరుని, శంభుని నేను ధ్యానిస్తున్నాను.

అర్థ దేహమున పార్వతిని కలిగిన వాడు, కైలాసమున నివసించువాడు, ఆర్తుల రక్షకుడు, ఆత్మ యైన వాడు, బ్రహ్మచే కొలువబడిన వాడు,  అందరికి దేవుడు అయిన శివుని, శంకరుని, శంభుని నేను ధ్యానిస్తున్నాను.

కపాలము, త్రిశూలం చేతులలో ధరించిన వాడు, పాదపద్మములను ఆశ్రయించిన వారి కోర్కెలు తీర్చే వాడు, నందిని అధిరోహించే వాడు, దేవతలకు, గణములకు అధిపతి, అందరికి దేవుడు అయిన శివుని, శంకరుని, శంభుని నేను ధ్యానిస్తున్నాను.

శరత్కాలములో చంద్రుని వంటి ముఖము కలవాడు, గణములకు సంతోషాన్ని ఇచ్చే వాడు, మూడు నేత్రములు కలవాడు, స్వచ్చమైన వాడు, కుబేరుని స్నేహితుడు, పార్వతికి భర్త, ఎల్లప్పుడూ సచ్చరిత్ర కలిగిన వాడు, అందరికి దేవుడు అయిన శివుని, శంకరుని, శంభుని నేను ధ్యానిస్తున్నాను.


హరుడు, సర్పములు హారములుగా కలవాడు, శ్మశానంలో తిరిగే వాడు, ప్రపంచమైన వాడు, వేదాల సారమైన వాడు, భేద భావము, వికారము లేని వాడు, శ్మశానములో నివసించే వాడు, మనసులో పుట్టిన కోరికను దహించే వాడు (మన్మథుని దహించిన వాడు అని కూడా అర్థం), అందరికి దేవుడు అయిన శివుని, శంకరుని, శంభుని నేను ధ్యానిస్తున్నాను.

ఫల శృతి:

ఆర్తితో, శరణాగతితో, భక్తితో ఈ స్తోత్రముతో శూలపాణిని స్తుతించిన వారికి మంచి భార్య, సంతానము, ధనము, ధాన్యము, విశేషమైన జీవనము కలిగి పిమ్మట శివ సాయుజ్యము కలుగును.

14, నవంబర్ 2010, ఆదివారం

దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రము - తాత్పర్యము

దారిద్ర్యము అనేది మానవ జాతికి అత్యంత భయానకమైన, దుఃఖభరితమైన స్థితి. భుక్తికి, జీవనానికి ధనమనేది ఎంత ముఖ్యమో ఇప్పటి కలికాలంలో ఇంకా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఆ పరమేశ్వరుని ప్రార్థించి ఈ దారిద్ర్యమనే దుఃఖమును దహించమని వేడుకుందాము. మీకోసం దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రము, తాత్పర్యము. శ్రవణం యూట్యూబ్లో ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి గళంలో.

సోమనాథ్ లో నేత్ర పర్వము

విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ
కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ

గౌరీప్రియాయ రజనీశ కళాధరాయ కాలాంతకాయ భుజగాధిపకంకణాయ
గంగాధరాయ గజరాజవిమర్దనాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ

భక్తిప్రియాయ భవరోగభయాపహాయ ఉగ్రాయ దుర్గభవసాగరతారణాయ
జ్యోతిర్మయాయ గుణనామసునృత్యకాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ

చర్మాంబరాయ శవభస్మవిలేపనాయ ఫాలేక్షణాయ మణికుండలమండితాయ
మంజీరపాదయుగళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ

పంచాననాయ ఫణిరాజవిభూషణాయ హేమాంశుకాయ భువనత్రయమండితాయ
ఆనందభూమివరదాయ తమోమయాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ

భానుప్రియాయ భవసాగరతారణాయ కాలాంతకాయ కమలాసనపూజితాయ
నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ

రామప్రియాయ రఘునాథవరప్రదాయ నాగప్రియాయ నరకార్ణవతారణాయ
పుణ్యేషు పుణ్యభరితాయ సురార్చితాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ

ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ గీతప్రియాయ వృషభేశ్వరవాహనాయ
మాతంగచర్మవసనాయ మహేశ్వరాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ

          వశిష్ఠేన కృతం స్తోత్రం సర్వరోగనివారణం 
          సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌత్రాదివర్ధనం 
          త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స హి స్వర్గమవాప్నుయాత్


తాత్పర్యము: 

విశ్వేశ్వరుడు, నరకమనే సాగరమును దాటించేవాడు, శ్రవణానంద మైన వాడు, నెలవంకను ధరించిన వాడు, కర్పూరము యొక్క కాంతి వలె తెల్లగా ఉన్నవాడు, జటా ఝూటములు కలిగిన వాడు, దారిద్ర్యమనే దుఃఖమును దహించేవాడు అయిన పరమ శివునికి నా నమస్కారములు.

పార్వతీ ప్రియ వల్లభుడు, చంద్ర వంకను ధరించిన వాడు, యముని అంతము చేసే వాడు, సర్పములను కంకణములుగా ధరించిన వాడు, గంగను కేశములలో ధరించిన వాడు, గజాసురుని సంహరించిన వాడు, దారిద్ర్యమనే దుఃఖమును దహించేవాడు అయిన పరమ శివునికి నా నమస్కారములు.

భక్తులకు ప్రియుడు, రోగ భయమును పోగొట్టే వాడు, ఉగ్రుడు, సంసారమనే సాగరాన్ని దాటించే వాడు,  జ్యోతిర్మయుడు, గుణ నామ కీర్తనకు నృత్యం చేసే వాడు, దారిద్ర్యమనే దుఃఖమును దహించేవాడు అయిన పరమ శివునికి నా నమస్కారములు.

పులిచర్మమును ధరించే వాడు, శ్మశానములో కాలే శవముల భస్మమును శరీరమునకు పూసుకొనిన వాడు, నుదుట కన్ను కలవాడు, రత్నములు పొదిగిన కుండలములు చెవులకు ధరించిన వాడు, మంచి ధ్వని కలిగించే ఆభరణములు కాళ్ళకు ధరించిన వాడు, జటా ఝూటములు కలిగిన వాడు, దారిద్ర్యమనే దుఃఖమును దహించేవాడు అయిన పరమ శివునికి నా నమస్కారములు.

పంచముఖములు కలిగిన, ఫణి రాజు ఆభరణముగా కలిగిన వాడు, బంగారు వస్త్రములు ధరించిన వాడు, త్రిలోక వంద్యుడు, వర ప్రదాత, ఆనంద సాగరుడు, అంధకారము నిండినవాడు, దారిద్ర్యమనే దుఃఖమును దహించేవాడు అయిన పరమ శివునికి నా నమస్కారములు.

పార్వతీదేవి యొక్క విలాసమునకు ప్రపంచమైన వాడు, మహేశ్వరుడు, ఐదు ముఖములు కలిగిన వాడు, శరణన్న వారి పాలిటి కల్పతరువు, వారికి సర్వం తానైన వాడు, సర్వలోకాలకు అధిపతి, దారిద్ర్యమనే దుఃఖమును దహించేవాడు అయిన పరమ శివునికి నా నమస్కారములు.

 సూర్యునికి ప్రియమైన వాడు, భవ సాగరాన్ని దాటించే వాడు, యముని సంహరించేవాడు, బ్రహ్మచే పూజించబడిన వాడు, మూడు కన్నులు కలిగిన వాడు, అన్ని శుభలక్షణములు కలిగిన వాడు, దారిద్ర్యమనే దుఃఖమును దహించేవాడు అయిన పరమ శివునికి నా నమస్కారములు.

రామునికి ప్రియమైన వాడు, రామునికి వరములు ప్రసాదించిన వాడు, నాగ జాతికి ప్రియమైన వాడు, నరకమనే సాగరాన్ని దాటించేవాడు, పుణ్యాల్లో పుణ్యము కలిగిన వాడు, దేవతలచే కొలువబడిన వాడు, దారిద్ర్యమనే దుఃఖమును దహించేవాడు అయిన పరమ శివునికి నా నమస్కారములు.

వశిష్ఠ మహాముని రచించిన ఈ స్తోత్రము ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము పఠించిన వారికి అన్ని సంపదలు కలిగి చివరకు స్వర్గ ప్రాప్తి కలుగును.

13, నవంబర్ 2010, శనివారం

శివపంచాక్షరీ స్తోత్రం - తాత్పర్యము

ఆది శంకరులు రచించిన అద్భుతమైన స్తోత్రము శివ పంచాక్షరీ. ఇది శివుని పంచాక్షరీ మంత్రమైన నమః శివాయ లోని ప్రతి అక్షరాన్ని శివుని రూపంగా, కొన్ని లక్షణాలతో, ప్రాసలో వర్ణించబడింది. అత్యంత మహిమాన్వితమైనది. ఆ స్తోత్రము, తాత్పర్యం క్రింద.యూట్యూబ్  దృశ్యం, శ్రవణం ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి అమృత గాత్రంలో.

నమః శివాయ
 
నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ

మందాకినీ సలిల చందనచర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ
మందారపుష్ప బహుపుష్పసుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ

శివాయ గౌరీవదనాబ్జవృంద సూర్యాయ దక్షాధ్వరనాశకాయ
శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమః శివాయ

వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య మునీంద్ర దేవార్చిత శేఖరాయ
చంద్రార్క వైశ్వానరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ

యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ
దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ

పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివసన్నిధౌ
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే
ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచిత శివపంచాక్షరీ స్తోత్రం సమాప్తం

తాత్పర్యము: 

నాగేంద్రుని హారము వలె ధరించిన, మూడు నేత్రములు కలిగిన, శరీరమంతా భస్మవిలేపనము కలిగిన, మహేశ్వరుడైన, శాశ్వతుడు, శుద్ధమైన వాడు, దిగంబరుడు, 'న'కార రూపుడయిన ఆ శివునికి నా నమస్కారములు.

మందాకినీ మొదలగు నదుల జలములతో అర్చించబడి,  గంధలేపనము చేయబడి, మందారము మొదలగు బహు సుపుష్పములచే పూజించబడే, నంది మొదలగు ప్రమథ గణములకు అధిపతి అయిన 'మ'కార రూపుడైన శివునికి నా నమస్కారములు.

సకల శుభకరుడు, కమలము వంటి గౌరీ దేవి వదనమును వికసింప చేసే సూర్యుడు, దక్ష యజ్ఞము నాశనము చేసిన వాడు, నీలకంఠుడు, వృషభము (ఎద్దు) పతాకముపై చిహ్నముగా కలవాడు, 'శి'కార రూపుడు అయిన శివునికి నా నమస్కారములు.

వశిష్ఠుడు, అగస్త్యుడు, గౌతముడు మొదలగు మునీంద్రులచే పూజింపబడిన శిరస్సు (లింగం) కలిగిన, చంద్రుడు, సూర్యుడు, అగ్ని త్రినేత్రములుగా కలిగిన, 'వ'కార రూపుడైన శివునికి నా నమస్కారములు.

యక్ష రూపములో ఉన్న, జటా ఝూటములు కలిగిన, పినాకము (అనే ధనుస్సు) చేత కలిగిన, సనాతనుడు (ఆది/అంతము లేని వాడు, అన్నిటికన్నా ముందు వచ్చిన వాడు), దివ్యమైన వాడు, దేవ దేవుడు, దిగంబరుడు, 'య'కార రూపుడు అయిన శివునికి నా నమస్కారములు.

ఫల శృతి:

శివుని సన్నిధిలో ఈ పంచాక్షరి స్తోత్రమును పఠనం చేసిన వారికి శివలోక ప్రాప్తి, శివుని సహవాసం కలుగును. ఇది శ్రీమచ్ఛంకరాచార్యులు రచించిన పంచాక్షరీ స్తోత్రం.

12, నవంబర్ 2010, శుక్రవారం

చమకమ్ - తాత్పర్యము

భక్తుడు తనకు ఏమి కావలెనో ఆ రుద్రుని చమక రూపంలో అడగబడింది. నమకంలో లాగానే దీనిలో కూడా పదకొండు అనువాకములు. నమక చమకాలు కలిపి చదివితేనే అభిషేకం సంపూర్ణం. చమకాన్ని భక్తుని వాక్కులో రుద్రుని ఆశీర్వచనంగా వ్యాఖ్యానించ బడింది. చమకం, తాత్పర్యము, శ్రవణం మీకోసం. యూట్యూబ్ లంకెలు మొదటి భాగం రెండవ భాగం


చమకప్రశ్నః 

అథ ప్రథమోఽనువాకః
 
అగ్నావిష్ణూ సజోషసేమా వర్ధన్తు వాం గిరః
ద్యుమ్నైర్వాజేభిరాగతం
వాజశ్చ మే ప్రసవశ్చ మే
ప్రయతిశ్చ మే ప్రసితిశ్చ మే ధీతిశ్చ మే క్రతుశ్చ మే
స్వరశ్చ మే శ్లోకశ్చ మే శ్రావశ్చ మే శ్రుతిశ్చ మే
జ్యోతిశ్చ మే సువశ్చ మే ప్రాణశ్చ మేఽపానశ్చ మే
వ్యానశ్చ మేఽసుశ్చ మే చిత్తం చ మ ఆధీతం చ మే
వాక్చ మే మనశ్చ మే చక్షుశ్చ మే శ్రోత్రం చ మే దక్షశ్చ మే
బలం చ మ ఓజశ్చ మే సహశ్చ మ ఆయుశ్చ మే
జరా చ మ ఆత్మా చ మే తనూశ్చ మే శర్మ చ మే వర్మ చ మే
ఽంగాని చ మేఽస్థాని చ మే పరూషి చ మే
శరీరాణి చ మే  ౧

ఇతి ప్రథమోఽనువాకః

అథ ద్వితీయోనువాకః

జ్యైష్ఠ్యం చ మ ఆధిపథ్యం చ మే మన్యుశ్చ మే
భామశ్చ మేఽమశ్చ మేఽమ్భశ్చ మే జేమా చ మే మహిమా చ మే
వరిమా చ మే ప్రథిమా చ మే వర్ష్మా చ మే ద్రాఘుయా చ మే
వృద్ధం చ మే వృద్ధిశ్చ మే సత్యం చ మే శ్రద్ధా చ మే
జగచ్చ మే ధనం చ మే వశశ్చ మే త్విషిశ్చ మే క్రీడా చ మే
మోదశ్చ మే జాతం చ మే జనిష్యమాణం చ మే సూక్తం చ మే
సుకృతం చ మే విత్తం చ మే వేద్యం చ మే భూతం చ మే
భవిష్యచ్చ మే సుగం చ మే సుపథం చ మ ఋద్ధం చ మ ఋద్ధిశ్చ మే
క్లుప్తం చ మే క్లుప్తిశ్చ మే మతిశ్చ మే సుమతిశ్చ మే  ౨

ఇతి ద్వితీయోనువాకః

అథ తృతీయోనువాకః

శం చ మే మయశ్చ మే ప్రియం చ మేఽనుకామశ్చ మే
కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రం చ మే శ్రేయశ్చ మే
వస్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే ద్రవిణం చ మే
యన్తా చ మే ధర్తా చ మే క్షేమశ్చ మే ధృతిశ్చ మే
విశ్వం చ మే మహశ్చ మే సంవిచ్చ మే జ్ఞాత్రం చ మే
సూశ్చ మే ప్రసూశ్చ మే సీరం చ మే లయశ్చ మ ఋతం చ మే
ఽమృతం చ మేఽయక్ష్మం చ మేఽనామయచ్చ మే జీవాతుశ్చ మే
దీర్ఘాయుత్వం చ మేఽనమిత్రం చ మేఽభయం చ మే సుగం చ మే
శయనం చ మే సూషా చ మే సుదినం చ మే  ౩

ఇతి తృతీయోనువాకః

అథ చతుర్థోఽనువాకః 

ఊర్క్చ మే సూనృతా చ మే పయశ్చ మే రసశ్చ మే
ఘృతం చ మే మధు చ మే సగ్ధిశ్చ మే సపీతిశ్చ మే
కృషిశ్చ మే వృష్టిశ్చ మే జైత్రం చ మ ఔద్భిద్యం చ మే
రయిశ్చ మే రాయశ్చ మే పుష్టం చ మే పుష్టిశ్చ మే
విభు చ మే ప్రభు చ మే బహు చ మే భూయశ్చ మే
పూర్ణం చ మే పూర్ణతరం చ మేఽక్షితిశ్చ మే కూయవాశ్చ మే
ఽన్నం చ మేఽక్షుచ్చ మే వ్రీహియశ్చ మే యవాశ్చ మే మాషాశ్చ మే
తిలాశ్చ మే ముద్గాశ్చ మే ఖల్వాశ్చ మే గోధూమాశ్చ మే
మసురాశ్చ మే ప్రియంగవశ్చ మేఽణవశ్చ మే
శ్యామాకాశ్చ మే నీవారాశ్చ మే  ౪

ఇతి చతుర్థోఽనువాకః

అథ పంచమోఽనువాకః  

అశ్మా చ మే మృత్తికా చ మే గిరయశ్చ మే పర్వతాశ్చ మే
సికతాశ్చ మే వనస్పతయశ్చ మే హిరణ్యం చ మే
ఽయశ్చ మే సీసం చ మే త్రపుశ్చ మే శ్యామం చ మే
లోహం చ మేఽగ్నిశ్చ మ ఆపశ్చ మే వీరుధశ్చ మ
ఓషధయశ్చ మే కృష్టపచ్యం చ మేఽకృష్టపచ్యం చ మే
గ్రామ్యాశ్చ మే పశవ ఆరణ్యాశ్చ యజ్ఞేన కల్పన్తాం
విత్తం చ మే విత్తిశ్చ మే భూతం చ మే భూతిశ్చ మే
వసు చ మే వసతిశ్చ మే కర్మ చ మే శక్తిశ్చ మే
ఽర్థశ్చ మ ఏమశ్చ మ ఇతిశ్చ మే గతిశ్చ మే  ౫

ఇతి పంచమోఽనువాకః  

అథ షష్ఠోఽనువాకః

అగ్నిశ్చ మ ఇన్ద్రశ్చ మే సోమశ్చ మ ఇన్ద్రశ్చ మే
సవితా చ మ ఇన్ద్రశ్చ మే సరస్వతీ చ మ ఇన్ద్రశ్చ మే
పూషా చ మ ఇన్ద్రశ్చ మే బృహస్పతిశ్చ మ ఇన్ద్రశ్చ మే
మిత్రశ్చ మ ఇన్ద్రశ్చ మే వరుణశ్చ మ ఇన్ద్రశ్చ మే
త్వష్టా చ మ ఇన్ద్రశ్చ మే ధాతా చ మ ఇన్ద్రశ్చ మే
విష్ణుశ్చ మ ఇన్ద్రశ్చ మేఽశ్వినౌ  చ మ ఇన్ద్రశ్చ మే
మరుతశ్చ  మ ఇన్ద్రశ్చ మే విశ్వే చ  మే దేవా ఇన్ద్రశ్చ మే
పృథివీ చ  మ ఇన్ద్రశ్చ మేఽన్తరీక్షం చ  మ ఇన్ద్రశ్చ మే
ద్యౌశ్చ మ ఇన్ద్రశ్చ మే దిశశ్చ మ ఇన్ద్రశ్చ మే
మూర్ధా చ మ ఇన్ద్రశ్చ మే ప్రజాపతిశ్చ మ ఇన్ద్రశ్చ మే  ౬

ఇతి షష్ఠోఽనువాకః

అథ సప్తమోఽనువాకః

అశుశ్చ మే రశ్మిశ్చ మేఽదాభ్యశ్చ మేఽధిపతిశ్చ మ
ఉపాశుశ్చ మేఽన్తర్యామశ్చ మ ఐన్ద్రవాయశ్చ మే
మైత్రావరుణశ్చ మ ఆశ్వినశ్చ మే ప్రతిపస్థానశ్చ మే
శుక్రశ్చ మే మన్థీ చ మ ఆగ్రయణశ్చ మే వైశ్వదేవశ్చ మే
ధ్రువశ్చ మే వైశ్వానరశ్చ మ ఋతుగ్రాహాశ్చ మే
ఽతిగ్రాహ్యాశ్చ మ ఐన్ద్రాగ్నశ్చ మే వైశ్వదేవాశ్చ మే
మరుత్వతీయాశ్చ మే మాహేన్ద్రశ్చ మ ఆదిత్యశ్చ మే
సావిత్రశ్చ మే సారస్వతశ్చ మే పౌష్ణశ్చ మే
పాత్నీవతశ్చ మే హారియోజనశ్చ మే  ౭

ఇతి సప్తమోఽనువాకః

అథ అష్టమోఽనువాకః

ఇధ్మశ్చ మే బర్హిశ్చ మే వేదిశ్చ మే ధిష్ణియాశ్చ మే
స్రుచశ్చ మే చమసాశ్చ మే గ్రావాణశ్చ మే స్వరవశ్చ మ
ఉపరవాశ్చ మే అధిషవణే చ మే ద్రోణకలశశ్చ మే
వాయవ్యాని చ మే పూతభృచ్చ మే ఆధవనీయశ్చ మ
ఆగ్నీధ్రం చ మే హవిర్ధానం చ మే గృహాశ్చ మే సదశ్చ మే
పురోడాశాశ్చ మే పచతాశ్చ మేఽవభృథశ్చ మే
స్వగాకారశ్చ మే  ౮

ఇతి అష్టమోఽనువాకః

అథ నవమోఽనువాకః
 
అగ్నిశ్చ మే ధర్మశ్చ మేఽర్కశ్చ మే సూర్యశ్చ మే
ప్రాణశ్చ మేఽశ్వమేధశ్చ మే పృథివీ చ మేఽ దితిశ్చ మే
దితిశ్చ మే ద్యౌశ్చ మే  శక్క్వరీరంగులయో దిశశ్చ మే
యజ్ఞేన కల్పన్తామృక్చ మే సామ చ మే స్తోమశ్చ మే
యజుశ్చ మే దీక్షా చ మే తపశ్చ మ ఋతుశ్చ మే వ్రతం చ మే
ఽహోరాత్రయోర్వృష్ట్యా బృహద్రథన్తరే చ మే యజ్ఞేన కల్పేతాం  ౯

ఇతి నవమోఽనువాకః

అథ దశమోఽనువాకః

గర్భాశ్చ మే వత్సాశ్చ మే త్రవిశ్చ మే త్రవీ చ మే
దిత్యవాఠ్ చ మే దిత్యౌహీ చ మే పంచావిశ్చ మే
పంచావీ చ మే త్రివత్సశ్చ మే త్రివత్సా చ మే
తుర్యవాట్ చ మే తుర్యౌహీ చ మే పష్ఠవాట్ చ మే పష్ఠౌహీ చ మ
ఉక్షా చ మే వశా చ మ ఋషభశ్చ మే వేహశ్చ మే
ఽనడ్వాంచ మే ధేనుశ్చ మ ఆయుర్యజ్ఞేన కల్పతాం
ప్రాణో యజ్ఞేన కల్పతామపానో యజ్ఞేన కల్పతాం
వ్యానో యజ్ఞేన కల్పతాం చక్షుర్యజ్ఞేన కల్పతా
శ్రోత్రం యజ్ఞేన కల్పతాం మనో యజ్ఞేన కల్పతాం
వాగ్యజ్ఞేన కల్పతామాత్మా యజ్ఞేన కల్పతాం
యజ్ఞో యజ్ఞేన కల్పతాం   ౧౦

ఇతి దశమోఽనువాకః

అథ ఏకాదశోఽనువాకః
 
ఏకా చ మే తిస్రశ్చ మే పంచ చ మే సప్త చ మే
నవ చ మ ఏకదశ చ మే త్రయోదశ చ మే పంచదశ చ మే
సప్తదశ చ మే నవదశ చ మ ఏక విశతిశ్చ మే
త్రయోవిశతిశ్చ మే పంచవిశతిశ్చ మే
సప్తవిశతిశ్చ మే నవవిశతిశ్చ మ
ఏకత్రిశచ్చ మే త్రయస్త్రిశచ్చ మే
చతస్రశ్చ మేఽష్టౌ చ మే ద్వాదశ చ మే షోడశ చ మే
విశతిశ్చ మే చతుర్విశతిశ్చ మేఽష్టావిశతిశ్చ మే
ద్వాత్రిశచ్చ మే షట్త్రిశచ్చ మే చత్వరిశచ్చ మే
చతుశ్చత్వారిశచ్చ మేఽష్టాచత్వారిశచ్చ మే
వాజశ్చ ప్రసవశ్చాపిజశ్చ క్రతుశ్చ సువశ్చ మూర్ధా చ
వ్యశ్నియశ్చాన్త్యాయనశ్చాన్త్యశ్చ భౌవనశ్చ
భువనశ్చాధిపతిశ్చ  ౧౧

ఇతి ఏకాదశోఽనువాకః

ఇడా దేవహూర్మనుర్యజ్ఞనీర్బృహస్పతిరుక్థామదాని
శసిషద్విశ్వేదేవాః సూక్తవాచః పృథివీమాతర్మా
మా హిసీర్మధు మనిష్యే మధు జనిష్యే మధు వక్ష్యామి
మధు వదిష్యామి మధుమతీం దేవేభ్యో వాచముద్యాస
శుశ్రూషేణ్యాం మనుష్యేభ్యస్తం  మా దేవా అవన్తు
శోభాయై పితరోఽనుమదన్తు
ఓం శాంతిః శాంతిః శాంతిః
ఇతి శ్రీ కృష్ణయజుర్వేదీయ తైత్తిరీయ సంహితాయాం
చతుర్థకాండే సప్తమః ప్రపాఠకః

తాత్పర్యము:  

మొదటి అనువాకము:

ఓ దేవా! అగ్ని విష్ణు రూపమైన వాడ!  మీరు నా పట్ల సంతుష్టులై ఉండుటకు నేను నుతించే ఈ పదములు ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతుండు గాక. నాకు ఎల్లపుడు ఆహారము, ధనము సమృద్ధిగా నుండు గాక. 

రెండవ అనువాకము:

నేను రుద్రుని అర్చించుట వలన - ఆహారము, దాన్ని ఇచ్చే మనసు,  ఉత్సాహము, కాపాడుకునే శక్తి, ఆహారాన్ని సంపాదించే శక్తి, దోషములు లేకుండా మంత్రోచ్చారణ చేసే సామర్థ్యం, యశస్సు, ఉచ్చారణ, వివేకము, స్వర్గము, ఆత్మ శక్తి,  అపాన వ్యానాదులు,  ఆత్మ, ఆలోచన, ఆలోచనచే గ్రహించ బడేవి, వాక్కు, మనస్సు, ఇంద్రియములు, జ్ఞానమును పొందుటకు కావలసిన ఇంద్రియ శక్తి, ఆత్మ బలము, శత్రువులను సంహరించే శక్తి, ఆయుష్షు, వృద్ధాప్యం, ఆరోగ్యకరమైన శరీరము, ఆనందము, శరీరాన్ని కాపాడటానికి ఆయుధాలు, బలమైన, స్థిరమైన అవయవములు, ఎముకలు, కీళ్ళు మొదలగు అవయవములు - నాతో, నాలో ఉండు గాక. 

మూడవ అనువాకము:
ఓ రుద్రా! నిన్ను అర్చించుట వలన - కీర్తి, నాయకత్వము, క్రోధము, చలించని మనసు, చల్లని నీరు, గెలిచే మరియు గౌరవము పొందే సామర్థ్యము, స్థిరాస్తులు, పుత్ర పౌత్రాదులు,   అప మృత్యువు లేని సంతానము, ధన ధాన్యములు, పెరిగే జ్ఞానము, సత్యము, వివరము పట్ల ధ్యాస, ఆకట్టుకునే సామర్థ్యము, శరీర సౌందర్యము, క్రీడలు ఇతర విషయముల వలన కలిగే ఆనందము, చేసేది, చేయబడేది, దేవతలా ఆశీర్వాదము, సత్కార్యములు, ఖజానా, నిలిచే సంపాదన, ఎక్కువ సంపాదించే సామర్థ్యము, ఎక్కడికైనా వెళ్ళగలిగే శక్తి, మంచి మార్గములు, మంచి యజ్ఞ ఫలము, పుణ్యము, సత్సంపాదన, పని చేయ గలిగిన మంచి సామర్థ్యము, ముందు చూపు, నిలకడ - నాకు కలిగి, నాతో ఉండు గాక.

నాలుగవ అనువాకము:
ఓ రుద్రా! నిన్ను అర్చించుట వలన - ఇహ లౌక, పారలౌకిక ఆనందాలు, కోరిక, దాని ఫలము, ప్రీతి కలిగించే బంధు జనము, రక్షణ, యశస్సు , కీర్తి, మంచి అలవాట్లు, అదృష్టము, సంపద, తండ్రి వలె నన్ను నడిపించే సద్గురువు,  ఆస్తులను కాపాడుకునే శక్తి, స్థైర్యము, మంచితనము, గుర్తింపు, వేద శాస్త్రాల జ్ఞానము, అధ్యాపకత, పని చేసే, చేయించ గలిగే సామర్థ్యము, ఆజ్ఞాపించే అధికారము, పశు సంపద, అవరోధము లేని మార్గము, మంచి అగ్నిహోత్రము, ద్రవ్యములు, వాటి వలన కలిగే శుభములు, క్షయ వ్యాధి నుంచి రక్షణ, జ్వరములనుండి రక్షణ, ఔషధ సేవ లేని జీవితం, దీర్ఘాయుష్షు, అందరితో స్నేహంగా ఉండే వాతావరణము, నిర్భయము, సత్ప్రవర్తన, మంచి నిద్ర, మంచి ఉదయము, మంచి రోజులు - నాతో ఉండు గాక. 

అయిదవ అనువాకము:
ఓ రుద్రా! నిన్ను అర్చించుట వలన - భుక్తి, మంచి వాక్కు, పాలు, మీగడ, నెయ్యి, తేనె, బంధువులతో భోజనము, పానము, వ్యవసాయము, వర్షములు, విజయ భూమి, వృక్షములు, మొక్కల సేద్యము, స్వర్ణము, రత్నములు, సంపదతో వచ్చే కీర్తి, ఆరోగ్యము, విలువైన పంట, మంచి పంట తెచ్చే ఇతర శుభములు, దినదినాభి వృద్ధి, పూర్ణత్వము, ఉత్కృష్టము కన్నా ఉన్నతమైనది, మరణము లేని స్థితి, బియ్యము, సజ్జలు, గోధుమలు, రాగులు, మినుములు, పెసలు మొదలగు ధాన్యములు, నూనె గింజలు, పప్పు దినుసులు - అన్ని నా వద్ద సమృద్ధిగా ఉండు గాక.

ఆరవ అనువాకము:

ఓ రుద్రా!  నిన్ను అర్చించుట వలన - రాళ్ళు, మట్టి, కొండలు, పర్వతాలు, ఇసుక, భూమి యందు పెరిగే అన్ని వస్తువులు, అన్ని రకముల ఖనిజములు, లవణాలు, అగ్ని, నీరు, తీగ మొక్కలు,  ఔషధపు మొక్కలు, పెంచేవి, పెంచని మొక్కలు, గ్రామాలలో, అరణ్యాలలో ఉండే సంపద, పశుసంపద, అగ్నిహోత్రములో వాడే ద్రవ్యములు,  పిత్రార్జితములు, సంతానము మరియు ఇతరులకు చెందిన ఆస్తులు, స్థిర, చరాస్తులు, నా ధర్మమునకు చెందిన కర్మలు, కర్మలు చేయుటకు కావలసిన శక్తి, వాటి ఫలము, ఆనందము పొందే సాధనములు, వాటి ఫలితములు - నాతో ఉండు గాక. 

ఏడవ అనువాకము:
ఓ రుద్రా! నిన్ను అర్చించుట వలన -  అగ్ని మరియు ఇంద్రుడు, చంద్రుడు మరియు ఇంద్రుడు, సూర్యుడు మరియు ఇంద్రుడు, సరస్వతి మరియు ఇంద్రుడు, పూషా మరియు ఇంద్రుడు, బృహస్పతి మరియు ఇంద్రుడు, మిత్రుడు మరియు ఇంద్రుడు, వరుణుడు మరియు ఇంద్రుడు, త్వష్ట మరియు ఇంద్రుడు, ధాత మరియు ఇంద్రుడు, అశ్వినీ దేవతలు మరియు ఇంద్రుడు, మరుత్ దేవతలు మరియు ఇంద్రుడు, వసువులు మరియు ఇంద్రుడు, భూమి మరియు ఇంద్రుడు, అంతరిక్షము మరియు ఇంద్రుడు, స్వర్గము మరియు ఇంద్రుడు, నాలుగు దిక్కులు మరియు ఇంద్రుడు, మూర్ధ్నము మరియు ఇంద్రుడు, ప్రజాపతి మరియు ఇంద్రుడు - నన్ను ఆశీర్వదించు గాక.

ఎనిమిదవ అనువాకము:


ఓ రుద్రా! నిన్ను అర్చించుట కొరకు  -  సోమయాగమునకు కావలసిన పాత్రలు, ఆజ్య పాత్రలు, ఘ్రుత పాత్రలు,  ఇంద్రాది దేవతలకు సమర్పించ వలసిన సోమరస పాత్రలు,  ఆశ్వినాది ఇతర దేవతలకు సోమరస పాత్రలు, వైశ్వదేవాది దేవతలకు సోమరస పాత్రలు మొదలగునవి నా చేత ఉన్నాయి.

తొమ్మిదవ అనువాకము:

ఓ రుద్ర! నేను నీ భక్తుడనయినందు వలన - మర్రి చెట్టు చిదుగులు, దర్భలు, యాగశాల, సహాయమునకు స్త్రీలు, సోమరస పాత్రలు, సోమ తీగ చిగుళ్ళు నూరుటకు రాళ్ళు, సమిధలు, చెక్కలు, అగ్ని సృష్టించుటకు భూమిలో రంధ్రములు, ద్రోణము, వాయవ్యసము, ఇతర పవిత్రమైన పాత్రలు,యాగ ద్రవ్యములు ఉంచుటకు, స్త్రీలు ఆసీనులు అగుటకు, ఇతరులు వీక్షించుటకు ప్రదేశము, చెరువు (హోమములో హుతమునకు), బలి, అనంతరము స్నానమునకు ప్రదేశము, సమిథలతో పాటు హవానములో వేసే ఇతర ద్రవ్యములు నా చెంత ఉండు గాక.

పదవ అనువాకము:

ఓ రుద్రా! నేను నీ భక్తుడనయినందు వలన యాగామునకు కావాల్సిన అగ్ని, అగ్ని కార్యమునకు కావాల్సిన ఇతర పూర్వ కార్యక్రమములు, దిక్పాలకులకు, పంచాభూతములకు చేయవలసిన సమర్పణ (ఆశ్వాది బలులు), వేద పారాయణ , ప్రాయశ్చిత్తము, శాంతి హోమములు, పూర్ణాహుతి ముహూర్త నిర్ణయం, పూర్ణాహుతి కార్యక్రమము, ఇతర క్రియలు నా చేతుల మీదుగా జరుగు గాక.

(ఇక్కడ గో స్తన్యము నుండి పాలు త్రాగుట, అశ్వాన్ని బలి ఇవ్వటం, వివిధ దేవతలకు బలి సమర్పించటం, శుద్ధి, ప్రాయశ్చిత్తం వివరాలు పై రెండు అనువాకాల్లో పేర్కొన బడ్డాయి)

పదకొండవ అనువాకము:

గర్భిణీలు అయిన గోవులు, గోవులు, దూడలు, ఒకటిన్నర, రెండు, రెండున్నర, మూడు, మూడున్నర, నాలుగు సంవత్సరములున్న గోవులు, ఎద్దులు, వీర్యమున్న ఎద్దులు, బాలింతలైన గోవులు, గొడ్లు అందుబాటులో ఉండుగాక. ఈ అగ్నిహోత్రములోని అగ్ని నాకు పూర్ణాయుష్షు, ఉచ్చ్వాశ నిశ్శ్వాసలు, ఆరోగ్యకరమైన కళ్ళు, చెవులు, మనసు, వాక్కు, ఆత్మను ఇచ్చు గాక. ఇటువంటి కార్యములు ఇంకా చేయుటకు శక్తిని ఇచ్చు గాక. ఒకటి, మూడు, ఐదు, ఏడు, తొమ్మిది, పదకొండు, పదమూడు, పదిహేను, పదిహేడు, పంతొమ్మిది, ఇరవై ఒకటి, ఇరవై మూడు, ఇరవై ఐదు, ఇరవై ఏడు, ఇరవై తొమ్మిది, ముప్ఫై ఒకటి, ముప్ఫై మూడు నాతో ఉండు గాక. నాలుగు, ఎనిమిది, పన్నెండు, పదహారు, ఇరవై, ఇరవై నాలుగు, ఇరవై ఎనిమిది, ముప్ఫై రెండు, ముప్ఫై ఆరు, నలభై, నలభై నలుగు, నలభై ఎనిమిది నాతో ఉండు గాక. ఆహారము, ధాన్యము, ధన్యోత్పత్తి, దాని వృద్ధి, అగ్నిహోత్రము నాతో ఉండు గాక. దీనికొరకు నేను పంచ భూతములను, దిక్పాలకులను నాయందు కరుణ చూపవలసినదిగా ప్రార్థిస్తున్నాను.

(ఇక్కడ చెప్పబడిన సంఖ్యలు సరి సంఖ్యలు భూలోక సంబంధమైనవి గా, బేసి సంఖ్యలు  దేవలోక సంబంధమైనవిగా వ్యాఖ్యానించ బడినది. ఇంకొక వ్యాఖ్యానం -  ఒక ప్రకృతి, మూడు గుణములు, పంచ భూతములు,  ఏడు ఇంద్రియములు, నవ రంధ్రములు...ఇలా ప్రతి ఒక సంఖ్య ఒక విశేషమైన ప్రాధాన్యత సంతరించు కొన్నట్లు. ).

కామధేనువు దేవతలను ఆహ్వానించు గాక; మనువు కార్యము చేయు గాక.  బృహస్పతి మంత్రములు చదువు గాక. విశ్వ దేవుడు పధ్ధతి చెప్పు గాక. ఓ భూమాత! మాకు ఆటంకములు కలిగించకు. నేను ఎల్లప్పుడూ మంచి ఆలోచనలతో, సత్కార్యములు చేస్తూ, దేవతలకు ప్రీతికరమైన వస్తువులు తెచ్చి సమర్పిస్తాను. సజ్జనులారా! నేను ఈ విధంగా చేసినందు వలన ఆ దేవతలు, పితరులు నన్ను రక్షింతురు గాక. 

ఓం శాంతి శాంతి శాంతి ఇది కృష్ణ యజుర్వేదములోని, నాలుగవ కాండ, ఏడవ ప్రపాఠకములోనిది.