26, డిసెంబర్ 2016, సోమవారం

మిసైల్ వుమన్, అగ్నిపుత్రి టెస్సీ థామస్ - అగ్ని క్షిపణి ప్రాజెక్టు అధినేత్రి


అగ్ని-5: భారతదేశపు ప్రతిష్ఠాత్మక అణ్వాయుధాలు ప్రయోగించగల ఖండాంతర క్షిపణి ఈరోజు ఒడిషాలోని కలాం ద్వీపం నుండి విజయవంతంగా ప్రయోగించబడింది. ఈ క్షిపణి దాదాపు 5వేల కిలోమీటర్లు, అనగా, మొత్తం ఆసియా ప్రాంతం, ఐరోపా వరకు ప్రయాణించగల అత్యంత శక్తివంతమైనది. 1000 కేజీల క్షిపణి బరువును మోగయగలదు. 17 మీటర్ల పొడవు, 50 టన్నుల బరువు గల ఈ క్షిపణి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అతి వేగంగా వెళ్లగలదు. గతిశీల క్షిపణి కాబట్టి ఇది శత్రువుల రాడార్లలో అంత తొందరగా కనబడదు. భారతదేశపు రక్షణకు ఈ అగ్ని-5 అప్రతిహతమని చెప్పుకోవచ్చు. దీని తరువాతిది అగ్ని-6. ఇప్పటికే ఇది అభివృద్ధిలో ఉంది. అగ్ని-6 భూమిపైనుండే కాకుండా జలాంతర్గామి ద్వారా కూడా ప్రయోగించే వెసులుబాటు ఉంటుంది. అగ్ని-6 8,000-10,000 కిలోమీటర్ల వరకు వెళ్లగలదని శాస్త్రవేత్తల అంచన. అగ్ని-5ను విజయవంతంగా ప్రయోగించటం ఇది నాలుగవ సారి.

ఇంతటి శక్తివంతమైన అగ్ని-5 ప్రాజెక్టుకు సారథి ఎవరో తెలుసా? కేరళకు చెందిన 53ఏళ్ల మహిళా శాస్త్రవేత్త టెస్సీ థామస్. పురుషాధిక్యపు రక్షణ రంగంలో టెస్సీ థామస్ ఓ ధృవతార. అగ్ని-4 ప్రాజెక్టుకు కూడా ఆమే సారథి. పెరిగే వయసులో క్షిపణులు ప్రయోగించే ప్రదేశానికి దగ్గరలో నివసించటంతో ఆమెకు దాని వెనుక ఉన్న సాంకేతిక పరిజ్ఞానంపై మక్కువ ఏర్పడిందిట. త్రిస్సూరులోని ప్రభుత్వ కళాసాలలో ఇంజనీరింగ్ చదివి పునేలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్మమెంట్ టెక్నాలజీలో ఎంటెక్ పట్టాను పొంది రక్షణ శాఖ శాస్త్ర సాంకేతిక పరిశోధన సంస్థైన డీఆర్డీవోలో చేరారు. అగ్ని4,5 ప్రాజెక్టులకే కాదు, అగ్ని-3 ప్రాజెక్టుకు కూడా ఆమె అసోసియేట్ డైరెక్టరుగా పని చేశారు.


మిసైల్ వుమన్, అగ్నిపుత్రిగా పిలువబడే టెస్సీ థామస్ మన బాలబాలికలకు ఆదర్శప్రాయం. మహిళలు కొన్ని పదవులకు పనికిరారు అనే బూర్జువా సిద్ధాంతాలను తప్పని నిరూపించిన మహిళ టెస్సీ. దేశరక్షణకు అత్యంత శక్తివంతమైన ఆయుధాలను ఉత్పత్తి చేసే అతి ముఖ్యమైన రంగంలో రాణించిన టెస్సీ దేశభక్తి అనుపమానం. అగ్ని-5 మరో మారు విజయవంతంగా ప్రయోగించబడినందుకు టెస్సీ బృందానికి శుభాకాంక్షలు. ఇటువంటి వారికి దేశం అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డులు ఇవ్వకపోవటం దేశానికే సిగ్గుచేటు. జైహింద్. 

బహుముఖ ప్రజ్ఞాశాలి శాంతకుమారి జీవిత విశేషాలు, ముజ్జగాలు మోహించగ గీతం


రాయలసీమ ఎందరో మహనీయులకు, బహుముఖ ప్రజ్ఞాశాలురైన కళాకారులకు జన్మభూమి. అందులో నాటక మరియు సినీ రంగ ప్రముఖులు చాలా ఎక్కువ. చిత్తూరు నాగయ్య గారు, కేవీరెడ్డి గారు, బళ్లారి రాఘవ గారు, పసుపులేటి కన్నాంబ గారు, పద్మనాభం గారు...వీరంతా ఈ రతనాలసీమలో జన్మించినవారే. అటువంటి ప్రజ్ఞాశాలుల కోవకు చెందినవారే శాంతకుమారి గారు. వారి సంగ్రహ చరిత్ర మరియు వారు పాడిన ఓ ఆణిమ్ముత్యం ముజ్జగాలు మోహించగ అనే గీతం వివరాలు.

1920 సంవత్సరం మే 17న కడపజిల్లా పొద్దుటూరు సమీపంలో వెల్లాల శ్రీనివాసరావు, పెదనరసమ్మ దంపతులకు శాంతకుమారి గారు జన్మించారు. ఆవిడకు తల్లిదండ్రులు పెట్టిన పేరు సుబ్బమ్మ. తల్లి శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు, తండ్రి నటులు. ఇద్దరి కళలను పుణికి పుచ్చుకున్న సుబ్బమ్మ చిన్ననాడే సంగీతం అభ్యసించటం మొదలు పెట్టారు. ఆవిడ పీ. సాంబమూర్తిగారి వద్ద సంగీతం నేర్చుకున్నారు. ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసురాలు శ్రీమతి డీకే పట్టమ్మాళ్ గారు సుబ్బమ్మ గారి సహాధ్యాయిని. చిన్నతనంలోనే నాటక సంఘాలలో చేరి 16 ఏళ్లకు ఆకాశవాణి కళాకారిణిగా పేరొందారు. శాస్త్రీయ సంగీత వృత్తిని కొనసాగించటానికి ఆమె చెన్నై వెళ్లారు. అక్కడ విద్యోదయ పాఠశాలలో సంగీత ఉపాధ్యాయినిగా చేరారు. ఆవిడ సంగీత ప్రస్థానంలో సాలూరి రాజేశ్వరరావు గారితో కలసి ఆకాశవాణిలో పాడారు.

1936లో పీవీ దాస్ అనే సినీ ప్రముఖులు అప్పటివరకు శశిరేఖా పరిణయంగా నాటక రంగంలో ప్రసిద్ధి పొందిన కథను మాయాబజార్ అనే చిత్రంగా నిర్మించి దర్శకత్వం వహించాలని పూనుకున్నారు. శశిరేఖ పాత్రకోసం సరైన కళాకారిణి కోసం వెదుకుతుండగా చెన్నై విద్యోదయ పాఠశాలలో సుబ్బమ్మ గాత్రం ఆయన విని ఆయన ఎంతో ముచ్చట పడ్డారు. ఆ అమ్మాయిని సినిమాలో పాత్రకు పంపించవలసిందిగా ఆమె తల్లిదండ్రులను కోరారు. శ్రీనివాసరావు-పెదనరసమ్మ దంపతులకు, సుబ్బమ్మ నాయనమ్మకు ఆమె  సినిమాల్లో చేరటం ఇష్టం లేదు. వారు అమ్మాయి సంగీత కళాకారిణిగానే అభివృద్ధి చెందాలని పట్టుపట్టారు. కానీ, సుబ్బమ్మ తనకు వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని 4 రోజులు నిరాహారదీక్ష చేసింది. తల్లిదండ్రులు ఒప్పుకోక తప్పలేదు. పీవీ దాస్ గారు ఆమె పేరును శాంతకుమారిగా మార్చారు. మాయాబజార్ చిత్రంలో శాంతకుమారి గారు శశిరేఖ పాత్ర వేసి ఎంతో సహజంగా నటించటమే కాదు, పాడారు కూడా. ఈ చిత్రంలో ప్రముఖ నటులు లక్ష్మణ స్వామి గారు అభిమన్యునిగా నటించారు. చిత్రం పెద్ద విజయం సాధించింది.



1937లో పీ.పుల్లయ్య గారు సారంగధర చిత్రాన్ని తీశారు. ఇది ఆయనకు తొలి దర్శకత్వం. అందులో శాంతకుమారిని చిత్రాంగి పాత్రకు ఎంపిక చేశారు. తొలిపాత్ర శశిరేఖ లాలిత్యం కూడినదైతే చిత్రాంగి కపటమైన పాత్ర. ఈ వైవిధ్యాన్ని ఆమె ఎంతో సహజంగా తన నటనలో కనబరచారు. ఆ చిత్రంలో ఆమె త్యాగరాజస్వామి వారి రాగసుధారస అనే కీర్తనను  పాడారు. చిత్రం మంచి విషయం సాధించింది. 28ఏళ్ల పుల్లయ్య గారి మంచితనాన్ని గమనించిన శాంతకుమారి ఆయాన తన నట జీవితాన్ని ప్రోత్సహిస్తారని భావించి ఆయనను వివాహం చేసుకోవాలని కోరారు. అదే సంవత్సరంలో వారిద్దరి వివాహం జరిగింది. ఆ తరువాత శాంతకుమారి నట జీవితం నిరాటంకంగా విజయవంతంగా సాగింది.

శాంతకుమారి గారి చిత్ర ప్రస్థానంలో మరో ముఖ్యమైన మైలురాయి 1943లో విడుదలైన కృష్ణప్రేమ చిత్రం. ఇందులో ఆమె రాధ పాత్ర పోషించారు. మహామహులైన నటీమణులు, గాయనీమణులు పాలువాయి భానుమతి గారు (రాధ సోదరి చంద్రావళిగా), టంగుటూరి సూర్యకుమారి గారు (నారదునిగా, అవును స్త్రీ పురుష పాత్రను ధరించటం ఆరోజుల్లో చాలా అరుదు) ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రం కూడా బాగా విజయం సాధించింది. 1945లో విడుదలైన మాయాలోకం చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారికి కథానాయికగా నటించారు. తరువాత 1949లో కేవీరెడ్డి గారి దర్శకత్వంలో విడుదలైన గుణసుందరి కథలో గుణసుందరి (శ్రీరంజని) సోదరి రూపసుందరిగా నటించారు. ఈ చిత్రాన్ని  కూడా ప్రేక్షకులు బాగా ఆదరించారు. 1950లో విడుదలైన షావుకారు చిత్రంలో శాంతకుమారి గారు శాంతమ్మగా నటించారు. ఈ చిత్రంలో నాయిక పాత్ర షావుకారు జానకి గారిది. ఈ చిత్రం అఖండ విజయాన్ని పొందింది. ఈ చిత్రం నుండి దాదాపు శాంతకుమారి పెద్ద వయసు పాత్రలను పోషించటం మొదలు పెట్టారు.



1950 దశకంలో ధర్మదేవత, అర్థాంగి, సారంగధర (ఈ మారు రాణీ రత్నాంగి పాత్ర), బొమ్మల పెళ్లి, జయభేరి మొదలైన తెలుగు చిత్రాలతో పాటు తమిళ సినిమాలో కూడా నటించారు. శాంతకుమారి నటనా జీవితంలో 1960లో విడుదలైన శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం ఓ ముఖ్యమైన మైలురాయి. ఈ చిత్రంలో ఆమె శ్రీనివాసుని తల్లి వకుళమాతగా అద్భుతంగా నటించారు. నటనతో పాటు "ఎన్నాళ్లని నా కన్నులు కాయగ ఎదురు చూతురా గోపాలా" అన్న ఆర్ద్రతతో కూడిన పాటను అద్భుతంగా పాడారు. "వీనుల విందుగ వేణుగానము విని తరించగా వేచితిరా వేచి వేచి నీ వెన్న ముద్దవలె కరగి పోయెరా నా బ్రతుకు" అని ఆమె గళంలో జాలువారిన ఈ పాట నేటికీ వీక్షకుల కళ్లు  చెమరింపజేస్తుంది. ఈ పాట, ఈ చిత్రం ఆమె బహుముఖప్రజ్ఞకు ప్రతిబింబం.

1960 దశకం మొత్తం శాంతకుమారి వయసుకు మించిన పాత్రలు వేశారు. ఆమెకు బాగా పేరు తెచ్చిన పాత్ర రామానాయుడు గారి రాముడు-భీముడు చిత్రంలో అక్క పాత్ర. ప్రేమ, వాత్సల్యంతో నిండిన ఈ పాత్రలో ఆమె ఎన్‌టీఆర్ సోదరిగా అద్భుతంగా నటించారు. శాంతినివాసం, సిరిసంపదలు, రేచుక్క, మురళీకృష్ణ, ప్రేమించి చూడు, ప్రాణమిత్రులు వంటి మంచి చిత్రాలలో నటించారు. తల్లిగా, సవతి తల్లిగా ఆమె వేసిన పాత్రలు చిరస్మరణీయం. శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం చిత్రాన్ని హిందీలోకి భగవాన్ బాలాజీగా అనువదించారు.



శాంతకుమారి గారు మొత్తం మీద 250పైగా చిత్రలలో నటించారు. అందులో 60 తమిళచిత్రాలు. మిగిలినవి తెలుగు. వీటిలో 25పైగా చిత్రాలు రాగిణి మరియు పద్మశ్రీ అనే సొంత  బ్యానర్లపై తీయబడినవే. పద్మశ్రీ సంస్థ పుల్లయ్య వీరి కుమార్తె  పేరున స్థాపించబడింది. శాంతకుమారి  నాగేశ్వరరావు, జగ్గయ్య, జెమినీ గణేశన్, శివాజీ గణేశన్ మొదలైన వారికి తల్లి పాత్రలను పోషించి తెలుగు తమిళ భాషలలో ఎంతో పేరు పొందారు. తెలుగులో విజయవంతమైన చిత్రాలన్నీ దాదాపుగా పుల్లయ్యగారు తమిళంలో మళ్లీ తెరకెక్కించారు. 1970 దశకంలో శాంతకుమారి అక్కా చెల్లెళ్లు, తల్లా పెళ్లామా, ప్రేం నగర్, కొడుకు కోడలు, సెక్రెటరీ, ముత్తైదువ చిత్రాలలో నటించారు.

ఆ తరువాత ఆమె సినీ రంగం నుండి విరమణ తీసుకొని రచనల వైపు మళ్లారు. భక్తి పాటలను రచించారు. 75 ఏళ్ల వయసులో కూడా ఆమె తను శిష్యురాలైన లలితాకుమారికి పాటలు నేర్పించారు. శాంతకుమారి గారు రచించిన భక్తి గీతాలను బాలమురళీకృష్ణా గారు ఆలపించారు. సుదీర్ఘమైన ఆమె సినీజీవితంలో ఆమె ఎన్నో పాటలను పాడారు. వాటిలో  "మోహనాంగ రారా", "ఎవరోయి ఎవరోయి (మాయాలోకం), "ఊగూమా కృష్ణ", "ఇదే ఆనందము" (కృష్ణ ప్రేమ), "కలకల ఆ కోకిలేమో", "చక్కని దొరలేలే చందమామ" (గుణసుందరి కథ), "ఎన్నాళ్లని కన్నులు కాయగ" (శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం), "మనసు తెలిసిన ఓ నాన్న" (తల్లా పెళ్లామా) మొదలైనవి. సినీ గీతాలే కాదు, శాంతకుమారి గారు ఎన్నో ప్రైవేట్ గీతాలను ఆకాశవాణిలో పాడారు.

నటన, నిర్మాణం, గాత్రం, రచన, సంగీతం మొదలైన కళలలో పట్టు సాధించి తన ప్రతిభను తెలుగు, తమిళ ప్రజలకు అందజేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి శాంతకుమారి గారికి 1998లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రతిష్ఠాత్మకమైన రఘుపతి వెంకయ్య అవార్డును ప్రదానం చేసి గౌరవించారు. 16 జనవరి 2006న శాంతకుమారి చెన్నైలో పరమపదించారు.

శాంతకుమారి గాత్ర మాధుర్యం తెలియాలంటే ఆమె పాడిన ఈ మధుర భక్తి గీతం వినాల్సిందే. రాధ మనసులో కృష్ణునిపై గల వివిధ భావనలను ముజ్జగాలు మోహించగ అనే గీతంలో శాంతకుమారి గారు అద్భుత్గమా పండించారు. ఆమె పాటలో భావుకత, రాధ ప్రేమ, స్వామిపై రాధకు గల అధికారం, ఆ స్వామి మోహన మురళీగానంపై గల మక్కువ ప్రస్ఫుటం. గోకులాన్ని వీడి మధుర, ద్వారకలలో ఉన్న శ్రీకృష్ణుని బృందావనం తిరిగి రమ్మని ఎంతో హృద్యంగా వేదుకునే రాధ మనసును శాంతకుమారి ఆవిష్కరించారు. శంఖ చక్రాలు, సారథ్యాలు, అస్త్ర శస్త్రాలన్నీ యమునలో పారవేసి తన వద్దకు రమ్మని కోరే రాధ మనసు శాంతకుమారి గళంలో పరిపూర్ణంగా ప్రతిబింబిస్తుంది. గోకులాన్ని వదలి వెళ్లిన కృష్ణుని పక్షపాతాన్ని ప్రశ్నిస్తూ ఆయన ఏ పక్షం (యుద్ధాలు, సారథ్యాలు ఒకవైపు ప్రేమ సామ్రాజ్యమైన బృందావని ఒకవైపు) అని అడుగుతుంది. ఆ కురుక్షేత్రం మురళి మరియు రాధ కన్నా ఎక్కువా అని ప్రశ్నిస్తుంది. మధురభక్తిలో ఎన్ని భావనలుంటాయో అన్నీ ఈ గీతంలో కవి ఆవిష్కరించగా అంతే అందంగా శాంతకుమారి గారు పాడి దీనిని అజరామరం చేశారు. ఈ పాట ఎవరు రాశారో, ఎవరు స్వరపరచారో తెలియదు. బహుశ సాలూరి వారి స్వరఝరిలో వచ్చిన లలితగీతమేమో అనిపిస్తుంది. ఈ పాట విని తరించండి.

ముజ్జగాలు మోహించగ మురళిని మ్రోయించరా కృష్ణా కృష్ణా

శంఖమేల? చక్రమేల? సారథ్యములేలరా?
అస్త్ర శస్త్రజాలమెల్ల యమున పారవైచి రారా

ఎందుకురా మధురా నగరి? ఎందుకురా ద్వారకాపురి?
బృందావని వీడి నీవు పొందిన సుఖమేమున్నది?

పక్షపాతమేల? నీ పక్షమేది గోపాలా?
మురళి కన్న రాధ కన్న కురుక్షేత్రమేల?


25, డిసెంబర్ 2016, ఆదివారం

కూచిపూడి నృత్యాంశం - కృష్ణ శబ్దం


నృత్య సాంప్రదాయాలలో శబ్దాలకు ప్రత్యేక స్థానం ఉంది. శబ్దాలలో సరళమైన సాహిత్యంతో అభినయంతో వివరణ ఉంటుంది. శబ్దాలలో రెండు నుండి ఐదు చరణాల వరకు ఉండవచ్చు. ఒక్కొక్క చరణం వేర్వేరు అంశాలను ప్రస్తావించవచ్చు. శబ్దాలలో వేగమైన పద విన్యాసములు ఉండవు. భరత నాట్య శైలిలో శబ్దాలలో తొలుత కూర్చబడినవి ఒకే రాగంలా రాగా తరువాత వీటిని రాగమాలికలుగా, మిశ్రచాపు తాళంలో రూపొందించే సాంప్రదాయం వచ్చింది. శబ్దాలు రాజు గారి కొలువులో ఆ రాజు గుణవైభవాలను నుతించే శైలి కూడా ఉంది. ఇస్లాం రాజులను నుతించే కవులు సలాం అనే పదాన్ని కూడా శబ్దాలలో ఉపయోగించారు. కొన్ని ప్రాచుర్యమైన శబ్దాలు - కృష్ణ శబ్దం, రామాయణ శబ్దం, దశావతార శబ్దం, రాజశ్రీ శబ్దం, మండూక శబ్దం, వినాయక శబ్దం మొదలైనవి.

కృష్ణ శబ్దంలో వాసవసజ్జిక అయిన నాయిక నాథుని రాకకై అలంకరించుకొని వేచియుంటుంది. ఆయన గుణాలను వర్ణిస్తూ  లయబద్ధంగా సాగుతుంది. ఇందులో పల్లవి "రారా స్వామి రారా" అనే పద సంపుటిని ఎక్కడైనా పునరుపయోగించుకొని అభినయాన్ని విశదీకరించే అవకాశం ఉంటుంది. కృష్ణ శబ్దం సాహిత్యం పరిశీలిద్దాం.

మోహన రాగం, ఆది తాళంలో కృష్ణ శబ్దం కూర్చబడింది. నాయిక స్వామిని రారా అని పిలుస్తోంది. యాదవకులానికి చంద్రుడైన, సముద్రుని వంటి గంభీరత కలిగిన, వంద కోట్ల మన్మథుల సుందర రూపము కలిగిన, అమితమైన భుజ బలము కలిగిన శూరుని, స్త్రీల మనసులు దోచుకున్న, మేరు పర్వతమంత ధీరత కలిగిన, కవులను పోషించిన, శత్రువులను సంహరించిన, భరత నాట్య శాస్త్రానికి నిధియైన, సరసత కలిగిన రాజును కరుణతో చూచి ఏలుకోమని పరి పరి విధాల  నుతిస్తుంది.

ఈ కృష్ణ శబ్దం అభినయంలో మొదటి రెండు పంక్తులలో విపులంగా అభినయ కౌశల్యాన్ని కళాకారులు ప్రదర్శిస్తారు. స్వామి రారా యదువంశ సుధాంబుధి చంద్ర అనే పంక్తులను పదే పదే పలుకుతూ నాయకుని రాకకై ఆ నాయిక గంధం సిద్ధం చేయటం, పూలు కోయటం, మాలలల్లటం, తనను తాను అలనకరించుకోవటం, నాయకునికై  మాలలల్లటం మొదలైన వాటిని విశదంగా అభినయంతో ప్రదర్శిస్తారు. అలాగే, మొత్తం సాహిత్యాన్ని వివిధ గతులలో కూడా ప్రదర్శిస్తారు. మొత్తం మీద శబ్దాలు కళాకారులు రాజ సభలలో ప్రదర్శించే ఓ ముఖ్యమైన అంశంగా పరిగణించ వచ్చు. ఈ శబ్దాలను అభినయ ప్రాధాన్యమైన కూచిపూడి సాంప్రదాయాలలో ప్రదర్శిస్తారు. ప్రఖ్యాత కూచిపూడి నృత్య కళాకారిణి మంజుభార్గవి గారి కృష్ణ శబ్ద కూచిపూడి నృత్యాన్ని వీక్షించండి.

రారా! స్వామి రారా!
యదువంశ సుధాంబుధి చంద్రా!
రత్నాకర సమ గంభీరా!
శత కోటి మన్మథాకారా!
భాసుర భుజ బల రణ శూరా!
నారీ జన మానస చోరా!
మహా మేరు సమాన ధీరా!
కవి జన పోషక మందారా!
పర రాజ శత్రు సంహారా!
భరత శాస్త్ర నిధి నీవేరా!
నీవేరా, నీవేరా, నీవేరా!
సరసత గల దొర నీవేరా!
మము కరుణ జూచుటకు వేళరా! ఇది వేళరా!
చలమేలరా, మది పూనరా!
నీదానరా, మమ్మేలుకోరా! 

19, డిసెంబర్ 2016, సోమవారం

దేశభక్తి గీతం - జై జై భారత జాతీయాభ్యుదయానందోత్సవ శుభ సమయం


జై జై భారత జాతీయాభ్యుదయానందోత్సవ శుభ సమయం
ప్రియతమ భారత జనయిత్రి చిరదాస్య విమోచన నవోదయం

ప్రొద్దు పొడిచె లేవండోయి నిద్ర విడిచి రారండోయి 
దిగ్దిగంతములు ఝర్ఝరిల్లగా నిక్వాణము సేయండోయి

హిందూ ముస్లిం క్రైస్తవ పార్శీ ఏకవేదికను నిలవండి
జాతులెన్నైన దేశం ఒకటని లోక సన్నిధిని చాటండి

నా చిన్ననాడు ఆకాశవాణిలో బాగా విని, నేర్చుకున్న గీతం ఇది. పదాలు చూస్తుంటే దేవులపల్లి వారిలా అనిపిస్తోంది.ఎవరికైనా దీని రచయితే ఎవరో తెలిస్తే దయచేసి తెలియజేయండి. పరతంత్రము నుండి స్వేచ్ఛ లభించిన శుభతరుణంలో రచించిన గీతం ఇది. నిద్రాణమై ఉన్న భారతీయులను జాగృతం చేసే మొదటి చరణం, మతభేదాలతో కనుమరుగవుతున్న భారతీయతను పునరుద్ధరించే రెండవ చరణంతో దేశభక్తి సువాసనలను గుబాళిస్తుంది ఈ గీతం. విని ఆనందించండి.

18, డిసెంబర్ 2016, ఆదివారం

ప్రక్కల నిలబడి కొలిచే ముచ్చట - త్యాగరాజ వైభవం


ప్రక్కల నిలబడి కొలిచే ముచ్చట బాగ తెల్ప రాదా!

చుక్కల రాయుని గేరు మోము గల 
సుదతి సీతమ్మ సౌమిత్రి రాముని కిరు

తనువుచే వందనమొనరించుచున్నారా!
చనువున నామ కీర్తన సేయు చున్నారా! 
మనసున దలచి మైమరచి యున్నారా! 
నెనరుంచి త్యాగరాజునితో హరి హరి మీకిరు

త్యాగరాజస్వామి సంకీర్తనలలో సీతారాముల వైభవాన్ని అద్భుతంగా వర్ణించిన వాటిలో "ప్రక్కల నిలబడి" ఒకటి. రామ పరివారం కొలువుతీరి యుండగా అక్కడి స్థితిగతులను మనకు సద్గురువు మనోజ్ఞంగా తెలియజేశారు.

ఆ లోకాభిరామునికి ఇరు ప్రక్కల నిలబడి సీతాలక్ష్మణులు, పరివారము ఆయనను కొలిచే ముచ్చటను వాగ్గేయకారులు అనుభూతి చెందుతూ మన కళ్ల ఎదుట ఆవిష్కరించారు. కాసేపు శరీరముతో నమస్కరిస్తున్నారట. మరి కాసేపు నామ సంకీర్తన చేస్తున్నారట. మరి కాసేపు మనసులోనే తలచుతూ మైమరచియున్నారట. త్యాగరాజునిపై ప్రేమతో ఈవిధంగా ఆ పరివారం ఆ రాముని కొలుస్తున్న రీతిని ఖరహరప్రియ రాగంలో త్యాగరాజస్వామి పలికారు.

త్రికరణములతో పరమాత్మను కొలవటం ఆధ్యాత్మికత పరిపక్వతను సూచిస్తుంది. మనసా వాచా కర్మణా అక్కడ ఉన్నవారు రాముని కొలిచిన పద్ధతిని త్యాగరాజస్వామి కనులారా కంచి తరించి మనకు అందించారు. నామము తారకమై నాలికన కదలాడగా, శరీరము ఆయన రూపమును కాంచి వందనము చేయగా, మనసులోనే ఆయన రూపాన్ని తలచి మిగిలినవన్నీ మరచిపోయియున్నారు అన్న భావనను ఈ కృతిలో నుతించారు.

ఎం.ఎస్. సుబ్బులక్ష్మి గారి గాత్ర ప్రవాహంలో బహుకొద్ది మాత్రమే వీడియోలు ఉన్నాయి. వాటిలో ఒకటి 1984లో తిరువాయూరులో త్యాగరాజ ఆరాధనోత్సవాల సమయంలోని కచేరీ. ఆ నాటి సాయంత్రం ఆమె ఈ కృతిని అద్భుతంగా వివరంగా పాడారు. చూసి తరించండి. రామ పరివారాన్ని మనముందు మరో మారు ఆవిష్కరించిన ఆమెకు, త్యాగరాజస్వామి వారికి వందనాలు.