మైసూరు వాసుదేవాచార్యులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మైసూరు వాసుదేవాచార్యులు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, సెప్టెంబర్ 2026, ఆదివారం

రా రా రాజీవ లోచన - మైసూరు వాసుదేవాచార్యుల కృతి



రా రా రాజీవ లోచన! రామా! నన్ను బ్రోచుటకు!

దీనాశ్రితజన మందార! కరుణాపారవార!

ఏరా నీ కరుణ కల్గని కారణమేమో! కానరా!
మారారి వినుత! శుభద! సుచరిత!
పరాత్పర! ధరణిజా మనోహరా!

నీవే నా విభుడని నిరతము నీ పాదములను నెర నమ్మితి!
నీవాడని నను కరుణించి ఈవేళ నా చేయి విడువకురా!
దేవ దేవా! దశరథ నృప నందన! దశముఖాది సకల రిపుజనహరణ!
నీవనాదరణ సేయకురా! పవనజాప్త! శ్రీ వాసుదేవ!

తామర రేకుల వంటి కన్నులు కలిగిన, దీనులైన ఆశ్రితుల పాలిటి కల్పవృక్షమైన, కరుణాసముద్రుడవైన శ్రీరామా! నన్ను బ్రోచుటకు రారా! నాపై కరుణ ఇంకా కలుగకుండుటకు కారణమేమో! నన్ను కానరా! మన్మథుని శత్రువైన శివునిచే నుతించబడిన, శుభములను కలిగించే, సచ్చరిత్ర కలిగిన పరమాత్మా! సీతాదేవి మనోహరుడవు నీవు. నన్ను బ్రోచుటకు రారా! నీవే నా ప్రభువని ఎల్లప్పుడూ నీ పాదములను నమ్ముకొంటిని. నీవాడని నాపై కరుణ జూపి ఈ వేళ నా చేయి విడువకుము రామా! దేవ దేవా! దశరథ మహారాజుని కుమారా! రావణాది రాక్షసులను సంహరించిన రామా! నాపై నిరాదరణ సేయకుము రా! ఓ వాసుదేవా! వాయుపుత్రుడైన హనుమంతునికి నీవు ఆప్తుడవు! నన్ను బ్రోచుటకు రారా!

మైసూరు మహారాజా జయచామరాజ వడయార్ కొలువులో ఆస్థాన విద్వాంసునిగా ఎంతో పేరొందిన మైసూరు వాసుదేవాచార్యుల వారు ప్రఖ్యాత సంగీత విద్వాంసులు పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ గారి శిష్యులు. తెలుగు సంస్కృత భాషలలో 300కు పైగా వర్ణములు, కృతులను రచించిన వీరు తమ మలి జీవితంలో రుక్మిణీదేవి అరుండేల్ గారి కళాక్షేత్రలో కూడా ప్రధాన సంగీత అధ్యాపకునిగా పనిచేశారు. మైసూరులో మధ్వ బ్రాహ్మణ కుటుంబంలో 1865వ సంవత్సరంలో జన్మించిన వీరు అక్కడి మహారాజా సంస్కృత కళాశాలలో సంస్కృత అధ్యయనం చేశారు. త్యాగరాజస్వామి వారి శిష్య పరంపరకు చెందిన వీరు మనసును కరిగించే కీర్తనలను తెలుగు, సంస్కృత భాషలలో రచించారు. బ్రోచేవారెవరురా అనే ఖమాస్ రాగ కీర్తనతో ఎంతో పేరు పొందారు. వీరి కీర్తనలు, భక్తికి, ఆర్తికి, శరణాగతికి ప్రతీక. 1959వ సంవత్సరంలో వీరికి పద్మ భూషణ్ అవార్డు బహుకరించబడింది. వీరు తమ కృతులలోని భావంతో అభినవ త్యాగరాజు అన్న బిరుదును కూడా పొందారు. సంగీత సాహిత్య సేవలో పరిపూర్ణమైన జీవితం గడిపిన తరువాత వీరు 1961వ సంవత్సరంలో చెన్నైలో పరమపదించారు. వీరి ముద్ర "వాసుదేవ".

మోహన రాగం మనోహరమైనది. జగన్మోహనుడైన శ్రీరాముని వర్ణించటానికి ఇంతకన్నా సముచితమైన రాగం ఏముంటుంది? చెవులకు ఇంపుగా, ఆర్తి, భక్తి, శరణాగతి ఉట్టిపడే రాగ లక్షణాలు కల్గినది మోహనం. భక్తులను రామభక్తి సామ్రాజ్యంలో సమ్మోహితులను చేసే రాగం ఇది. వాసుదేవాచార్యుల వారు ఈ కీర్తనలో విశేషమైన భావనలను గుప్పించి మోహనరాగంలో స్వరపరచారు. పుంసాం మోహన రూపాయ అని వేనోళ్ల రాముని పొగడారు మన ఆర్యులు. ఈ రారా రాజీవలోచన అనే కృతిలో ఆ రామ వైభవాన్ని మరింత పెంపొందించారు కృతికర్త. ఈ కృతి సాహిత్యాన్ని పరిశీలిస్తే త్యాగరాజస్వామి వారి సాహిత్యపు ఆనవాళ్లు ప్రస్ఫుటంగా కనబడతాయి. ఒకరకంగా తన మహా గురువుల సాహితీ వైభవాన్ని వాసుదేవాచార్యుల వారు తెలుగు భాషలోని తన కృతుల ద్వారా కొనసాగించారు. నిరాడంబరమైన, నిర్మలమైన జీవితం గడిపిన ధన్యజీవులు వీరు.

ఈ కృతిని విద్వన్మణి ఎమ్మెల్ వసంతకుమారి గారి శిష్యురాలు, కలైమామణి, పద్మశ్రీ మరియు పద్మభూషణ్ బిరుదాంకితురాలు శ్రీమతి సుధా రఘునాథన్ గారు ఆలపించగా వినండి.

19, సెప్టెంబర్ 2026, శనివారం

ప్రణమామ్యహం శ్రీ గౌరీసుతం - మైసూరు వాసుదేవాచార్యుల కృతి



ప్రణమామ్యహం శ్రీ గౌరీసుతం
ఫణితల్ప వాసుదేవ భక్తం సతతం

గణనాథమమర బృంద సేవితం
ఫణిహార భూషితం ముని వర వందితమ్

ధృత చారు మోదకం గజ ముఖం
సితకరామిత గర్వ భంజకం
నతలోక సంతోష దాయకం
శ్రితభక్త పాలకం సిద్ధి వినాయకం 

గౌరీదేవి కుమారుడు, ఆదిశేషుని శయ్యగా కలిగిన వాసుదేవుడైన శ్రీమన్నారాయణుని ఎల్లప్పుడూ భక్తితో సేవించేవాడు అయిన శ్రీగణపతికి నేను ప్రణమిల్లుతున్నాను. గణములందరికీ నాయకుడు, దేవతాసమూహముచే సేవింపబడేవాడు, సర్పములను హారముగా ఆభరణంగా ధరించినవాడు, శ్రేష్ఠ మునులచే పూజించబడేవాడు, సుందరమైన మోదకాన్ని చేతబూని ఉన్న గజముఖుడు, చంద్రుని అపరిమిత గర్వాన్ని అణచినవాడు, నమస్కరించి శరణు వచ్చిన లోకజనులకు సంతోషాన్ని ప్రసాదించేవాడు, ఆశ్రయించిన భక్తులను కాపాడేవాడు, సకల సిద్ధులను అనుగ్రహించు సిద్ధివినాయకుడు అయిన గణపతిని నేను భక్తిపూర్వకంగా ప్రణమిల్లుతున్నాను.

గౌళ రాగంలో స్వరపరచబడిన ఈ మైసూరు వాసుదేవాచార్యుల కృతిని ఎం ఎల్ వసంతకుమారి గారు ఆలపించారు.  


6, సెప్టెంబర్ 2026, ఆదివారం

మైసూరు వాసుదేవాచార్యుల వారి జీవిత విశేషాలు


మైసూరు వాసుదేవాచార్యులు కర్ణాటక సంగీత చరిత్రలో మైసూరు ఆస్థాన సంప్రదాయం, త్యాగరాజ శిష్యపరంపర, సంస్కృత పాండిత్యం, ఆధునిక సంగీత సంస్థల వికాసం—ఈ నాలుగు ప్రవాహాలను కలిపిన మహావిద్వాంసులు. ఆయన 1865 మే 28న మైసూరులో ఒక సంప్రదాయ మాధ్వ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. బాల్యం నుంచే సంగీతం పట్ల అసాధారణ ఆకర్షణ కలిగిన ఆయన, అదే సమయంలో సంస్కృత సాహిత్యం, వ్యాకరణం, కావ్యం, తర్కం, పురాణేతిహాసాలపై కూడా గాఢమైన పట్టు సంపాదించారు. మైసూరు మహారాజా సంస్కృత కళాశాలలో చేసిన విద్యాభ్యాసం ఆయనకు శబ్దశుద్ధి, సాహిత్యార్థం, శాస్త్రజ్ఞానం అనే దృఢమైన పునాదిని అందించింది. ఆ పాండిత్యమే తరువాత ఆయన కృతులకు అపూర్వమైన గాంభీర్యం, లాలిత్యం ఇచ్చింది.

ఆయన తొలి సంగీతగురువు మైసూరు రాజాస్థానానికి చెందిన వీణ పద్మనాభయ్య. వారి వద్ద సంగీతపు ప్రాథమిక సంస్కారం పొందిన వాసుదేవాచార్యుల ప్రతిభను మైసూరు రాజసభ గుర్తించింది. తదనంతరం ఆయనను తిరువయ్యారులో ప్రసిద్ధ గాయక-వాగ్గేయకారుడు పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ వద్ద ఉన్నత సంగీతాభ్యాసం కోసం పంపించారు. పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ త్యాగరాజ స్వామి శిష్యుడైన మనంబుచావడి వెంకటసుబ్బయ్యర్ పరంపరకు చెందినవారు. అందువల్ల వాసుదేవాచార్యుల శిష్యపరంపర త్యాగరాజు—మనంబుచావడి వెంకటసుబ్బయ్యర్—పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్—మైసూరు వాసుదేవాచార్యులు అనే ప్రత్యక్ష సంగీత వారసత్వంగా నిలిచింది. పట్నం అయ్యర్ వద్ద ఆయనకు రాగలక్షణం, గానం, నిరవల్, స్వరకల్పన, తానం, ముఖ్యంగా మధ్యమకాల తానం వంటి విశేషాలను నేర్చుకునే అవకాశం లభించింది.

తిరువయ్యారు-తంజావూరు సంగీతవాతావరణంలో విద్యను పూర్తిచేసి మైసూరుకు తిరిగి వచ్చిన తరువాత వాసుదేవాచార్యులు రాజాస్థాన విద్వాంసులుగా నిలిచారు. పందొమ్మిదవ శతాబ్దం చివరి దశలో, ఇరవయ్యవ శతాబ్దం తొలి భాగంలో మైసూరు సంస్థానం సంగీతం, నృత్యం, సాహిత్యం, చిత్రకళలకు విశేష ప్రోత్సాహం ఇచ్చింది. ఆ సాంస్కృతిక వాతావరణంలో వాసుదేవాచార్యులు ఆస్థాన గాయకుడిగా మాత్రమే కాక, కొత్త కృతులను సృష్టించిన వాగ్గేయకారునిగా, సంగీతాభిమానులకు మార్గదర్శకునిగా, శిష్యులకు గురువుగా ఎదిగారు. రాజసభలో శాస్త్రీయ సంగీతానికి లభించిన ఆదరణను ఆయన తన ప్రతిభతో మరింత సార్థకం చేశారు. మైసూరు రాజకుటుంబంతో ఆయనకు ఉన్న గురు-శిష్య సంబంధం కూడా విశేషమైనది; మహారాజా జయచామరాజ వడయార్ ఆయన శిష్యులలో ప్రముఖుడిగా గుర్తించబడతారు.

వాసుదేవాచార్యుల కృతుల సంఖ్య రెండువందలకు పైగా ఉంటుందని భావిస్తారు. తెలుగు, సంస్కృత భాషలలో ఆయన ఎక్కువగా రచించారు. ఆయన కృతులలో “పరమపురుష వాసుదేవ” లేదా “వాసుదేవ” అనే ముద్ర కనిపిస్తుంది. వైష్ణవ కుటుంబసంప్రదాయం, త్యాగరాజ ప్రభావం వల్ల శ్రీరామభక్తి ఆయన రచనలలో ప్రధానంగా వ్యక్తమవుతుంది. అయితే ఆయన కృతులు శ్రీరామునికే పరిమితం కావు; సరస్వతీ, చాముండేశ్వరి, శంకరి, శ్రీకృష్ణుడు, నారాయణుడు వంటి అనేక దైవస్వరూపాలను స్తుతించారు. కృతి, కీర్తన, వర్ణం, తిల్లానా, జావళి, శ్లోకం వంటి విభిన్న రూపాల్లో రచించడం ఆయన వైవిధ్యానికి నిదర్శనం.

ఖమాస్ రాగంలోని “బ్రోచేవారెవరురా” ఆయనకు అత్యంత విస్తృతమైన కీర్తిని తెచ్చిన కృతి. భక్తుని ఆర్తి, రాగసౌందర్యం, తెలుగుభాషా మాధుర్యం ఈ కృతిలో సహజంగా మిళితమవుతాయి. హిందోళంలో “మామవతు శ్రీ సరస్వతీ”, సునాదవినోదినిలో “దేవాదిదేవ”, మోహనంలో “రారా రాజీవలోచన రామ”, అభేరిలో “భజరే రే మానస”, పంతువరాళిలో “శంకరి నిన్నే”, బిలహరిలో “శ్రీ చాముండేశ్వరి”, కదనకుతూహలంలో “నీకేల దయరాదు రామచంద్రా” వంటి కృతులు నేటికీ కచేరీ వేదికలపై తరచుగా వినిపిస్తాయి. ఆయన రచనల్లో సాహిత్యం రాగభావానికి లోబడి ఉండటం, రాగస్వరూపాన్ని భంగపరచకుండా సంగతులు సహజంగా వికసించడం ప్రత్యేక లక్షణాలు. సంస్కృత కృతుల్లో శాస్త్రపాండిత్యం, తెలుగు కృతుల్లో భక్తి మాధుర్యం సమంగా దర్శనమిస్తాయి.

త్యాగరాజ స్వామి పట్ల వాసుదేవాచార్యులకు ఉన్న గౌరవం వారి కృతులలోనూ ప్రత్యక్షమవుతుంది. కల్యాణి రాగంలో “శ్రీమదాది త్యాగరాజ గురువరం” అనే కృతిలో ఆయన తన గురుపరంపర పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేశారు. కర్ణాటక సంగీత త్రిమూర్తులైన త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితర్, శ్యామశాస్త్రుల వైభవాన్ని స్మరించే రచనలు కూడా చేశారు. ఇలా ఆయన మైసూరు సంప్రదాయానికి ప్రతినిధిగా ఉన్నప్పటికీ, తంజావూరు సంగీతబాణీని మైసూరులో నిలబెట్టి, రెండు ప్రాంతాల సంగీతసంపదలను కలిపిన వారధిగా నిలిచారు. తన కృతులలోని అనేకాన్ని “వాసుదేవ కీర్తన మంజరి” పేరిట ప్రచురించడం ద్వారా వాటి పరిరక్షణకు కూడా కృషి చేశారు.

1935లో మద్రాసు సంగీత అకాడమీ వార్షిక సమావేశానికి ఆయన అధ్యక్షత వహించడం ఆయనకు లభించిన అఖిలభారత సంగీతగౌరవానికి నిదర్శనం. అప్పటికి సంగీతం రాజాస్థానాల పరిరక్షణ నుండి సభలు, సంస్థలు, ప్రజా కచేరీల వైపు మారుతున్న దశలో ఉంది. మైసూరు ఆస్థానంలో పెరిగిన తన సంగీత సంస్కారాన్ని ఆయన మద్రాసు సంగీతలోకానికి కూడా అందించారు. 1957లో భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఈ గౌరవం ఆయన గానానికి మాత్రమే కాక, వాగ్గేయకారుడిగా, గురువుగా, సంగీతపారంపర్య సంరక్షకుడిగా చేసిన సేవకు లభించిన జాతీయ గుర్తింపు.

వృద్ధాప్య దశలో కూడా ఆయన సంగీతసేవ ఆగలేదు. రుక్మిణీదేవి అరుండేల్ ఆహ్వానం మేరకు 1953లో, ఎనభై ఎనిమిదేళ్ల వయసులో, మద్రాసులోని కళాక్షేత్రకు వెళ్లారు. అక్కడ ప్రధాన సంగీతవేత్తగా పనిచేసి, గానం, వాయిద్యం, నృత్యం అభ్యసించే విద్యార్థులకు బోధించారు. శ్రుతిశుద్ధి, లయ, శరీరవిన్యాసం, తంబూరా పట్ల గౌరవం, సాహిత్యభావం—ఈ అన్ని అంశాలలో ఆయన కఠినమైనా స్నేహపూర్వకమైన గురువు. ఆయన దృష్టిలో సంగీతానికి భావమే ప్రాణం; కేవలం స్వరసాధనతో సరిపోదని, పదార్థం-భావం-రాగం ఏకమవ్వాలని విద్యార్థులకు బోధించేవారు.

కళాక్షేత్ర రామాయణ నృత్యనాటకాలకు వాల్మీకి రామాయణం ఆధారంగా సంగీతాన్ని సమకూర్చడం ఆయన చివరి దశలో చేసిన విశిష్ట సేవ. బాలకాండం నుంచి శబరీమోక్షం వరకూ తొలి నాలుగు భాగాలకు ఆయన సంగీతరచన చేశారు. వయసు, ఆరోగ్యపరిమితుల కారణంగా మిగిలిన భాగాల సంగీతకార్యం పూర్తి చేయలేకపోయారు. ఆయన మనుమడు ఎస్. రాజారాం తరువాత ఆ కృషిని కొనసాగించి పూర్తి చేశారు. రాజారాం కేవలం కుటుంబ వారసుడు మాత్రమే కాదు; వాసుదేవాచార్యుల సంగీతాన్ని కాపాడి, కళాక్షేత్ర సంప్రదాయంలో నిలబెట్టిన ముఖ్య పరిరక్షకుడు. మరో మనుమడు ఎస్. కృష్ణమూర్తి ఆయన జ్ఞాపకాలు, రచనలను తరువాతి తరాలకు చేరువ చేసే పనిలో భాగమయ్యారు.

వాసుదేవాచార్యుల శిష్యపరంపరను కేవలం ఒకటి రెండు పేర్లలో పరిమితం చేయలేం. పట్నం అయ్యర్ ద్వారా వారికి అందిన త్యాగరాజ బాణీ, వారి గానం ద్వారా మైసూరు రాజవంశానికి, వారి బోధన ద్వారా కళాక్షేత్ర విద్యార్థులకు, వారి కృతుల ద్వారా అనంతర గాయకులకు చేరింది. మహారాజా జయచామరాజ వడయార్ వంటి రాజశిష్యులు, కళాక్షేత్రంలోని అనేక మంది విద్యార్థులు, ఆయన వద్ద “బ్రోచేవారెవరురా” వంటి కృతులను అభ్యసించిన ప్రముఖ గాయకులు ఈ వారసత్వానికి సాక్షులు. ఆయన శిష్యబోధనలో ముఖ్యంగా పట్నం అయ్యర్ బాణీలోని తానం, రాగభావం, సాహిత్యస్పష్టత, నియమబద్ధమైన గానపద్ధతి నిలిచాయి.

కన్నడలో ఆయన రాసిన “నేనపుగళు” అనే జ్ఞాపకాల గ్రంథం, “నా కండ కలావిదరు” అనే సంగీతవిద్వాంసుల గురించిన రచన కూడా సంగీత చరిత్రకు విలువైన వారసత్వం. వాటిలో ఆయన చూసిన కళాకారుల విశేషాలు, సంగీతజీవితంలోని అనుభవాలు, ఒక యుగపు సాంస్కృతిక వాతావరణం ప్రతిఫలిస్తాయి. 1961 మే 17న ఆయన పరమపదించారు. తొంభై ఆరు సంవత్సరాల దీర్ఘజీవితంలో మైసూరు రాజాస్థాన వైభవాన్ని, త్యాగరాజ సంప్రదాయ పవిత్రతను, కళాక్షేత్ర సంస్థాగత శిక్షణను కలిపి నిలిపిన మైసూరు వాసుదేవాచార్యులు కర్ణాటక సంగీతానికి ఒక మహత్తర వారధి. వారి కృతులు నేటికీ వేదికలపై పాడబడుతుండటం, వారి బాణీ ద్వారా సంగీతరసికులకు భక్తి-రాగ-సాహిత్య సమన్వయం అందుతుండటం వారి చిరస్థాయి కీర్తికి నిదర్శనం.

2, సెప్టెంబర్ 2020, బుధవారం

నిమిషమైన శ్రీరామ యనరాద - మైసూరు వాసుదేవాచార్యుల వారు


 

నిమిషమైన శ్రీరామ యనరాద నిత్యము గాదీ మానవ జన్మము

అమిత మహిమ గలవాడని రాముని ఆ మహాదేవుడే సన్నుతించుచుండగ

హరిహర మంత్రమునకు జీవ వర్ణాత్మకుడు సురరిపు రావణుని నిగ్రహించినవాడు
పరమ భక్తులనెల్ల పాలించువాడు పరమ పురుషుడతడే వాసుదేవుడని తెలిసి

ఓ మనసా! ఈ మానవ జన్మ శాశ్వతము కాదు కదా, ఒక్క నిమిషమైన శ్రీరామ యని పలుకరాదా? అమితమైన మహిమ గలవాడని ఆ పరమశివుడే రాముని సన్నుతించుచున్నాడు, ఒక్క నిమిషమైనా ఆ రామ నామము పలుకరాదా? హరిహరుల మంత్రములలోని జీవమైన రా, మ అక్షరములకు రూపమైన వాడు, దేవతలకు శత్రువైన రావణుని అణచిన వాడు, పరమ భక్తులనందరినీ బ్రోచేవాడు, పరమపురుషుడు, అతడే వాసుదేవుడని తెలిసి ఒక్క నిమిషమైన శ్రీరామ యని పలుకరాదా?

సామ రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని మణి కృష్ణస్వామి గారు ఆలపించారు

భజరే రే మానస శ్రీ రఘువీరం - మైసూరు వాసుదేవాచార్యులవారు


 

భజరే రే మానస శ్రీ రఘువీరం భుక్తి ముక్తి ప్రదం వాసుదేవం

వృజిన విదూరం విశ్వాధారం సుజన మందారం సుందరాకారం

రావణ మర్దనం రక్షిత భువనం రవి శశి నయనం రవిజాతి మదనం
రవిజాది వానర పరివృతం నరవరం రత్న హార పరిశోభిత కంధరం
రవి శశి కుజ బుధ గురు శుక్ర శనీశ్వర రాహుకేతు నేతారం
రాజ కుమారం రామం పవనజాప్త అవనిజా మనోహరం

ఓ మనసా! రఘువీరుడు, భుక్తిని, ముక్తిని ప్రసాదించేవాడు, వాసుదేవుడు అయిన శ్రీరాముని భజింపుము. పాపములను నాశనము చేసేవాడు, విశ్వానికి ఆధారమైన వాడు, సుజనుల పాలిట కల్పవృక్షమైన వాడు, సుందరమైన రూపము కల శ్రీరాముని భజింపుము. రావణుని సంహరించి ముల్లోకాలను రక్షించిన వాడు, సూర్యచంద్రులు నేత్రములుగా కలవాడు, సూర్యవంశమునకు ఆనందం కలిగించిన వాడు, సుగ్రీవాది వానరుల సమూహము పరివారంగా కలవాడు, పురుషశ్రేష్ఠుడు, రత్న హారములతో ప్రకాశించే కంఠము కలవాడు, నవగ్రహములను నియంత్రించేవాడు, దశరథరాజ కుమారుడు, ఆంజనేయునికి ఆప్తుడు, సీతాదేవి మనోహరుడు అయిన రాముని భజింపుము.

ఆభేరి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని సుధా రఘునాథన్ గారు ఆలపించారు

21, ఆగస్టు 2020, శుక్రవారం

వందేऽనిశమహం - మైసూరు వాసుదేవాచార్యుల వారు

వందేऽనిశమహం వారణ వదనం 
నందీశ వాహన వర నందనం

వందారు మండల విఘ్న వారణం 
బృందారకాద్యపి వందిత చరణం

భాసమాన పాశాంకుశధరం 
భూసురాది పరిపాలనపరం
భాసుర మణి భూషిత కంధరం 
వాసుదేవ చరణార్చనతత్పరం

నమస్కరించే భక్త సమూహముల విఘ్నాలను తొలగించేవాడు, పాశము మరియు అంకుశము ధరించి ప్రకాశించేవాడు, బ్రాహ్మణాదులను రక్షించుటలో నిమగ్నమై యుండేవాడు, ప్రకాశించే మణులు అలంకరించబడిన కంఠము కలిగిన వాడు, శ్రీమహావిష్ణువు చరణముల సేవా తత్పరుడు, నందీశ్వరుడు వాహనంగా కలిగిన పరమశివుని వరపుత్రుడు, గజముఖుడైన గణపతికి నేను ఎల్లప్పుడు నమస్కరించెదను. 

- మైసూరు వాసుదేవాచార్యుల వారు

https://www.youtube.com/watch?v=hRO1jASSbbA

13, సెప్టెంబర్ 2015, ఆదివారం

బ్రోచేవారెవరురా? నిను వినా రఘువరా!


బ్రోచేవారెవరురా? నిను వినా రఘువరా!

ఓ చతురాననాది వందిత నీకు పరాకేలనయ్యా!
నీ చరితము పొగడలేని నా చింత దీర్చి వరములిచ్చి వేగమె నను

సీతాపతే! నాపై నీకభిమానము లేదా?
వాతాత్మజార్చితపాద! నా మొరలను వినరాదా?
ఆతురముగ కరిరాజును బ్రోచిన వాసుదేవుడవు నీవె కదా
పాతకమెల్ల పోగొట్టి గట్టిగ నా చేయి పట్టి విడువక నను 

మైసూర్ వాసుదేవాచార్యుల వారు 20వ శతాబ్దపు వాగ్గేయకారులలో ప్రముఖులు. త్యాగరాజస్వామి వారి శిష్యపరంపరకు చెందిన వీరు మైసూరులో జన్మించినా సింహభాగం కృతులు తెలుగు సంస్కృత భాషలలోనే రచించారు. పట్నం సుబ్రహ్మణ్య అయ్యరు వద్ద సంగీతం నేర్చుకొని మైసూరు మహారాజుల సంస్థానంలో విద్వాంసులుగా ఎంతో పేరొందారు వీరు. వీరి కృతులలో బ్రోచేవారెవరురా ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది. మైసూరు మహారాజా జయచామరాజ వడయార్ రచించిన ఎన్నో కీర్తనలకు ఆయన సంగీతం కూర్చారు. ఆయన సంస్కృతంలో, కర్ణాటక సంగీతంలోఎంతటి విద్వాంసుడో అంతే వినయ సంపన్నుడు. ఆయన తన చివరి సంవత్సరాలను చెన్నై రుక్మిణీదేవి అరుండేల్ కళాక్షేత్రలో గడిపారు. అక్కడ ఒకసారి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు వచ్చి బ్రోచేవారెవరురా కీర్తన అద్భుతంగా గానం చేస్తే "నేను నా కూతురని గుర్తు పట్టలేదు, ఇంత అందంగా ఆభరణాలతో అలంకరించుకొని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గళంలో వస్తే..." అన్నారుట.200కు పైగా కృతులను రచించిన ఆయన అభినవ త్యాగరాజుగా పిలువబడ్డాడు. తన ముద్రగా 'వాసుదేవ' అనే పదాన్ని ఉపయోగించారు.  బ్రోచేవారెవరురా అనే కృతిలో ఆయన రాముని ఇలా వేడుకుంటున్నారు:

"ఓ శ్రీరామా! నువ్వు కాక నన్ను కాపాడేవారు ఎవ్వరు? ఓ బ్రహ్మాది దేవతలచే పూజించబడిన రామా! నీకు పరాకు ఎందుకు? నీ వైభవాన్ని పొగడలేను నేను. నా చింతలను తీర్చి, వరాలిచ్చి త్వరగా నన్ను బ్రోవుము!

ఓ సీతాపతీ! నీకు నాపై అభిమానము లేదా? ఓ హనుమంతునిచే కొలువబడిన పాదాములు కలవాడా! నా ప్రార్థనల్ను వినుము! ఆ గజేంద్రుడు ప్రార్థించగానే ఆత్రముగా వచ్చి బ్రోచిన శ్రెహరివి నీవు కదా! నా పాపాలన్నిటినీ పోగొట్టి నా చేయిని గట్టిగా పట్టుకొని నన్ను విడువకుము!"



మానవుడు శరీరంలో శక్తి, వయసు ఉన్నంత కాలం అహంకారం విర్రవీగి భగవంతుడు గుర్తుకు రాడు. కష్టాలు ఎదుర్కొన్నప్పుడు, శరీరం క్షీణించినప్పుడు, ధైర్యము కోల్పోయినప్పుడు పరమాత్మను తలచుతాడు. దీనికి చక్కని ఉదాహరణ భాగవతంలోని గజేంద్ర మోక్షం. మదగజం ఆడ ఏనుగులతో సరససల్లాపాలాడుతూ సరస్సులో క్రీడిస్తుండగా స్థానబలిమి కలిగిన మొసలి ఆ కరిరాజు కాలిని పట్టిన సన్నివేశంలో ఆ ఏనుగు శరీరంలో శక్తిని నశించి, ప్రాణములు పట్టుకోల్పోయి, మూర్ఛ వచ్చే పరిస్థితులలో పరమాత్మను దీనంగా ప్రార్థిస్తాడు. అపుడా అ హరి పరుగు పరుగున వచ్చే సన్నివేశాన్ని మహాకవి  పోతన ఎంతో అద్భుతంగా వివరించారు:

సిరికింజెప్పడు శంఖచక్రయుగముం జేదోయి సంధింపడే
పరివారంబును జీరడభ్రగపతిం బన్నింపడాకర్ణికాం
తరధమ్మిల్లము జక్కనొత్తడు వివాదప్రోత్థిత శ్రీకుచో
పరిచేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహియై

"గజేంద్రుని ప్రాణములను రక్షింపవలెనను ఉత్సాహము ఉరకలు వేస్తుండగా ఆ శ్రీహరి, శ్రీదేవికైన చెప్పడు, శంఖచక్రములను ధరించడు, అనుచరులనెవ్వరిని పిలువడు, పక్షిరాజైన గరుడుని సిద్ధపడుమని తెలుపడు. చెవుల వరకు జాలువారిన కేశములనైనను సవరించడు. తనవ్రేళ్లకు చుట్టుకొనిన శ్రీదేవి యొక్క పైటచెంగును కూడా విడిచి పెట్టకుండా అట్లే లేచి వడి వడిగా ఆకాశ మార్గమున నడచి పోసాగెను"

ఆ విధంగా హరి వచ్చి మకరిని చక్రంతో సంహరించి కరిని కాపాడుతాడు. ఈ ఘట్టాన్ని కృతికర్త బ్రోచేవారెవరురాలో ప్రస్తావించారు. వాగ్గేయకారులు మన శ్రుతి స్మృతి పురాణాలను తమ సంకీర్తనలలో ప్రస్తావించటం వారి సనాతనధర్మ బద్ధతను, జ్ఞానాన్ని సూచిస్తుంది. వాసుదేవాచార్యుల వారి రచనా శైలి భక్తిమార్గాన్ని ప్రబోధించే భాగవతంలోని భక్తుల శైలికి సారూప్యత కలిగింది. గజేంద్రుని శ్రీహరి కాపాడిన వృత్తాంతము దాదాపుగా ప్రతి వాగ్గేయకారుడూ ప్రస్తావించాడు. త్యాగరాజ స్వామి తన కృతులు 'మరి మరి నిన్నే', 'ఈ మేను కలిగినందుకు ', 'మురిపెము కలిగ గద ', రామదాసు 'ఏమయ్య రామ ', 'పాహిమాం శ్రీ రామా ' అన్న కీర్తనలలో,  అలాగే అన్నమాచార్యుల వారు ఎన్నో సంకీర్తనలలో  దీనిని ప్రస్తావించారు. కారణం - అందులో జీవి ప్రవృత్తి, పరమాత్మ కరుణ చాలా అద్భుతంగా వివరించబడటం వలన. సారాంశం - వాసనలు తొలగి, వికారములు నశించి, భక్తితో కూడిన శరణాగతితో ప్రార్థించినపుడు పరమాత్మ తప్పక అనుగ్రహిస్తాడు. మన సంకల్ప లోపము, ప్రయత్న లోపము తప్ప ఆయన అనుగ్రహానికి లోపమే లేదు. బ్రోచేవారెవరురా అని ఇంత అద్భుతంగా నుతించిన వాసుదేవాచార్యుల వారిని కూడా శ్రీరాముడు అలాగే అనుగ్రహించాడు.

ఎందరో మహానుభావులు అందరికీ వందనములు!

ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి గళంలో బ్రోచేవారెవరురా.

వెడలెను కోదండపాణి - త్యాగరాజస్వామి కృతి

వెడలెను కోదండపాణి అనుజ సౌమిత్రితో గూడి పుడమిలో జనులెల్ల పొగడ పూజితుడౌ మునితో గూడి శిరమన కొండెయు జార  వురమున హారములు మెరయ కరమున శరచాపములును ఘ...