21, జూన్ 2016, మంగళవారం

జంధ్యాల వివాహభోజనంబు - ఆసనాలు మరియు ఇతర హాస్య సన్నివేశాలు

కవిగా బ్రహ్మానందం, ఆసనాలు వేస్తూ, వేర్వేరు ప్రయోగాలు చేసే ఇంటి యజమాని/బావ/భర్తగా సుత్తి వీరభద్రరావు వివాహభోజనంబు చిత్రంలోని కొన్ని సన్నివేశాలు. యోగా డే సందర్భంగా నవ్వుకోండి. హాస్య బ్రహ్మ జంధ్యాల గారికి ఈ సందర్భంగా మరోమారు జోహార్లు.

***********************************************************************
బావ-బామ్మర్ది, తమ్ముడు-అక్కయ్య,మొగుడు-పెళ్లాల మధ్య సంభాషణ
***********************************************************************

రెండు కాళ్లూ మెడచెట్టు పెట్టుకొని కప్పలా ఆసనంలో వీరభద్రరావు, ఆ అసనాన్ని అనుకరించి వేయటానికి అవస్థ పడుతున్న ఆయన బామ్మర్ది.

బామ్మర్ది: బావగారూ! మీ పెళ్లైన పదిహేనేళ్లకి మా అక్కయ్యను చూసి వెళదామని పొరపాటున భోపాల్ నుంచి ఇక్కడకి వచ్చాను. ఇలా మీ ఇంట్లో భోజనం చెయ్యాలంటే ఆసనం వెయ్యాలని నిజంగా నాకు తెలియదు బావగారు! ఆ భోపాల్ గ్యాస్ ప్రమాదంలో పోయినా బాగుండేది. ఈ బాధ తప్పేది.

బావ: మాట్లాడబాక. మాట్లాడితే ఆసనం పవర్ పోద్ది.

బామ్మర్ది: మీరేమైనా అనుకోండి నా వల్ల కాదు బావగారూ! ఈ ఆసనాలు వేయటం నా వల్ల కాదు. నే పోతా. భోపాల్ పోతా.నే పోతా భోపాల్ పోతా..హా.

బావ: ఇప్పుడెట్లాగెల్తావయ్యా. ఇప్పుడు రైళ్లు లేవు.

బామ్మర్ది: లేకపోయినా సరే. పట్టాలుచ్చుకుని పరిగెడతా. నే పోతా. భోపాల్ పోతా.

అక్క: అదేంట్రా తమ్ముడూ. ఎక్కడికీ?

తమ్ముడు: అక్కయ్యా - నా ఒంట్లో ఉన్న అవయవాలన్నిటినీ చాకలి మూట కట్టినట్లు కట్టిస్తున్నాడే బావ. ఈ ఆసనాలు వేయటం నా వల్ల కాదు. నే పోతా. భోపాల్ పోతా.

అక్క: అదేమిటిరా ఓ నాలుగు రోజులుండెళ్లు.

తమ్ముడు: నాల్రోజులుంటే నలభై ఆసనాలు వేయిస్తాడే బావ. నా వల్ల కాదు. నే పోతా. భోపాల్ పోతా.

భార్య: పదిహేనేళ్లకొచ్చాడు మా తమ్ముడు. అతన్నిలా వెళ్లగొట్టి పంపించేశారు.

భర్త: ష్ష్. నా గొడవొదిలేసి అట్టా ఈధిలోకెళ్లి సూస్తా నిలబడు. మనింట్లో ఖాళీ అయిన వాటాలోకి అద్దెకు ఏ తలకుమాసినోడైనా వస్తాడేమో.


***********************************************************************
కవి-ఇంటి యజమాని మధ్య సంభాషణ

***********************************************************************


కవి ఇంటివైపు తొంగి చూస్తాడు. అక్కడ యజమాని ఆసనాలు వేస్తూ కనబడతాడు. ఆయన బారినుండి తప్పించుకునేలోపు...

ఇంటి యజమాని: కవీ! దా...  దా...  దా..

కవి: మహాప్రభో! ఓ కొత్త కథ చెప్తానండయ్యా! ప్రేమ కథ ఓ అందమైన అబ్బాయికి, ఓ ఆకర్షణీయమైన అమ్మయికి సంబంధించిన కథ.

యజమాని:ఆపు, ఆసనం వేస్తా చెప్పు.

కవి కథ చెబుతాడు.

యజమాని: ఛత్. ఇంకాపు. ఈ లత్తుకోరు కథ సినిమాగా తీస్తే నేనారిపోతా. ఈ కథలో ఇలన్ మన రాజు గారి బామ్మర్ది.

కవి: మన సోషల్ సినిమాలో రాజుగారు...

యజమాని: తిత్తి తీస్తా.

కవి: వద్దు.

యజమాని:అదే వెరైటీ. రాజు గారి బామ్మర్ది కిరీటమెట్టుకొస్తాడు. ఆణ్ణి సూసి ఈరో లగెడతాడు.  ఆడెనకాల రాజు గారి బామ్మర్ది పడతాడు. ముందు ఈరో యెనక ఇలను ముందు ఈరో యెనక ఇలను. ..ఛేజ్

కవి: మహాప్రభో! ఈ ఆసనం వేస్తుంటే నా కూసాలు కదులుతున్నై. ఇప్పుడు నేనిదాపి పారిపోతా. మీరు నా వెంట పడతారు. ముందు నేను వెనక మీరు. ముందు నేను వెనక మీరు. ఛేజ్.

***********************************************************************
కవి-ఇంటి యజమాని మధ్య మడ్ ప్యాక్‌లో సంభాషణ
***********************************************************************


కవి: ఇంకా ఎంత సేపు మహాప్రభో ఈ మట్టి పట్టీ.

యజమాని:  ఇంకొక్క గంటుంటే ఒంటికి మంచిదయ్యా. ఈ చెమ్మంతా ఇగిరి పోవాలా.

కవి: ఈ చెమ్మ ఇగిరేలోపు మన కళ్లు చెమ్మగిల్లుతాయేమో మహాప్రభో! ఇట్లా మనల్ని ఎవరు చూసినా ప్రమాదమే. జూ వాళ్లు చూస్తే వాళ్లు కోతులు తప్పించుకొచ్చాయని పట్టుకెళ్లిపోతారు. జనమెవరైనా చూస్తే ఇతర గ్రహాలనుంచి ఎవరో వచ్చారని రాళ్లుచ్చుకు కొడతారు. ఇంక ఎంచక్కా కడిగేసుకుందామా మహాప్రభూ!

యజమాని:  తిత్తి తీస్తా. ఇట్లాగే కథ చెప్పు. ఇంటాను.

కవి కథ చెబుతాడు.

యజమాని కవి మీద మట్టి చల్లుతూ

ఆపు. ఇది కతా.

కవి: పోనీ స్టొరీ అనుకోండి మహప్రభో!

యజమాని:  తిత్తి తీస్తా. ఈ కత సినిమాగా తీస్తే నేనడుక్కు తినాల. ఓ ఊరు ఊరంతా పస్తుండి నాకు ముష్టెయ్యాల్సొస్తది. అరే. ఇన్నాళ్లనుంచీ సూస్తున్నాను సినిమాకు సంబంధించి ఒక్క కథ కూడా చెప్పలేనోడివి నువ్వేం కవివయ్యా అసలు. నేనొక గొప్ప కథ చెబుతాను ఇనుకో....... మధ్యతరగతి ఎదవ నాయాలా!

కవి: మహాప్రభో! తమరు నన్ను తిట్టారా?

యజమాని:  లేదు. సినిమా పేరు చెప్పా.

కవి: ఆ పేరు తిట్టులా ఉంది మహాప్రభో.

యజమాని:  పేరులో తిట్టుంటేనే సినిమా హిట్టవుద్దయ్యా.

తెర లెగవంగానే ఈరో ఓ కాఫీ హోటలుకెళతాడు. సర్వర్ రాగానే ఈరో ఏమున్నయ్ అని అడిగాడు.

అప్పుడు సర్వరు - ఇడ్లీ, రవ్వ ఇడ్లీ, గారె, మషాలా గారె, ఉప్మా, కిచిడీ, పెసరట్టు, మినపట్టు, రవ్వట్టు, మషాలా అట్టు,  బాతు, టమటా బాతు, బోండా, బజ్జీ, మైసూరు బజ్జీ, మిరపకాయ బజ్జీ, అరటికాయ బజ్జీ, తమలపాకు బజ్జీ, లడ్డూ, బందరు లడ్డూ, రవ్వలడ్డూ, మిఠాయి, పీచు మిఠాయి,బందరు మిఠాయి, బొంబాయి మిఠాయి, కలకత్తా మిఠాయి, జాంగ్రీ, పాలకోవా, హల్వా, మైసూరు పాకు, అమలాపురం కాజా, భీమవరం బాజా, పెద్దాపురం కూజా ఉన్నయంటాడు.

అప్పుడు ఈరో అట్టు తే అన్నాడు

అప్పుడు సర్వరు - ఏ అట్టు? పెసరట్టా, మినపట్టా, రవ్వట్టా, మషాలా అట్టా, సెవెంటీ ఎం.ఎం అట్టా, ఎమ్మెల్యే అట్టా, నూనేసి కాల్చాలా, నెయ్యేసి కాల్చాలా, నీళ్లోసి కాల్చాలా, పెట్రోలు పోసి కాల్చాలా, కిరసనాయిల్ పోసి కాల్చాలా, డీసిలేసి కాల్చాలా అసలు కాల్చాలా వద్దా అనడిగాడు.

అప్పుడు ఈరో పెసరట్టు నెయ్యేసి కాల్పించమన్నాడు. కాపీ కూడా తెమ్మన్నాడు.

ఏ కాపీ? మామూలు కాఫీ ఆ, స్పెషల్ కాపీ ఆ, బుర్రు కాపీ ఆ, నెస్కేప్ ఆ, బ్లాక్ కాపీ ఆ, వైట్ కాపీ ఆ, హాట్ కాపీ ఆ, కోల్డు కాపీ ఆ, నురుగు కావాలా వద్దా, కావాలంటే ఎన్ని చెంచాలు అనడిగాడు.
అప్పుడు ఈరో మామూలు కాపీ తెమ్మన్నాడు. అప్పుడు సర్వరు నీలగిరి కాపీ ఆ, హిమగిరి కాపీ ఆ, విమలా కాపీ ఆ..

కవి:  ఆపండి మహాప్రభో ఆపండి. తమలో ఇంత ఊహా శక్తి ఉందని ఊహించలేకపోయాను....ఈ కథే సినిమా తీసుకోండి. పదివేల రోజులాడుతుంది. జనం వృద్ధులై పండి రాలిపోయేంతవరకు, కలియుగాంతం వచ్చి సర్వప్రాణి నాశనమైపోయేంతవరకూ ఈ సినిమా ఆడుతూనే ఉంటుంది మహాప్రభో. ఆడుతునే ఉంటుంది. నన్నొదిలేయండి. అర్భకుడిని. తమకు కథ వినిపించే శక్తి లేనివాడిని. నన్నొదిలేయండి మహాప్రభో!

ఈ సన్నివేశాల వీడియోలు 1 2 చూడండి. 

18, జూన్ 2016, శనివారం

త్యాగరాజ హృత్కమలము - శాంతము లేక సౌఖ్యము లేదు


యోగులైన వారు ఒక్కరోజులో ఆ స్థితిని పొందరు. అది ఓ ప్రస్థానం. ఈ యానంలో జీవితంలోని సంఘటనలు, చుట్టూ ఉండే వారి ప్రభావం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. గృహస్థాశ్రమంలో భార్యకు ఉన్న పాత్ర మగవాడిని సరిదిద్దటంలో అతి ముఖ్యమైనది. ఇది మనలాంటి వారికే కాదు, త్యాగరాజస్వామి వంటి యోగులకు కూడా వర్తించింది. అటువంటి ఒక సంఘటన, తద్వారా వెలువడిన అద్భుతమైన కృతి వివరాలు తెలుసుకుందాము.

త్యాగయ్యకు ఎందరో శిష్యులు. వారు ఒకసారి పిలవని పెళ్లికి వెళ్లి అక్కడ ఒక నర్తకి ప్రదర్శిస్తున్న జావళి చూసి వినోదించి ఇంటికి వచ్చి మరునాడు ఆ జావళి పాట పాడుతుంటే త్యాగరాజస్వామికి విపరీతమైన కోపం వచ్చింది.

"మూర్ఖులారా! పిలవని పెళ్లికి నా అనుమతి లేకుండా వెళ్లటం మొదటి తప్పు. అక్కడ వినోదం కోసం నాట్యం చేస్తున్న స్త్రీని చూసి మీ సంయమనాన్ని కోల్పోవటం రెండో తప్పు; దాన్ని నా పవిత్రమైన గృహంలో సిగ్గు లేకుండా పాడటం మూడో తప్పు..ఇంక ఏమి చెప్పను? ఈ పూటకు మీకు భోజనం లేదు, బయటకు వెళ్లండి" అని కోపంతో చెప్పాడు. ఆయన భార్య ఆ పూట కరుణ, దయ మరియు ధైర్యం చూపక పోతే ఆ రోజు మొత్తం వారికి భోజనం ఉండేది కాదు.

భార్య: "మృదువుగా మాట్లాడటం ఒక గురువుకు ప్రధాన లక్షణం కదా?"

త్యాగయ్య: "నిజమైన సున్నితత్వం సమయస్ఫూర్తితో జరిగే దిద్దుబాటు కాదా"

భార్య: "దిద్దుబాటు ఆవేశంతో కూడి ఉండాలని ఉందా?"

త్యాగరాజు: "ముల్లు, గులాబీ కలిసే పెరుగుతాయి కదా"

భార్య: "కానీ, మనుషులు గులాబీని కోసి, ముల్లుని త్రెంచివేస్తారు కదా?"

త్యాగయ్య: "నిజమే. నన్ను సరిదిద్దావు. ప్రేమించే వాడే సరిదిద్దుతాడు. మనిషికి ఇంద్రియాలపై నిగ్రహం ఉండవచ్చు, వేదవేదాంతాలు చదివి ఉండవచ్చు, భార్యా బిడ్డలు, సిరి సంపదల అనుగ్రహం పొంది ఉండవచ్చు, జపతపాదుల ఫలం పొంది ఉండవచ్చు, యజ్ఞ యగాదులు చేసి ఉండవచ్చు, ఇతరుల మనస్తత్త్వాన్ని ఎరుక పరచే ప్రజ్ఞ కలిగి ఉండవచ్చు, భాగవతోత్తమునిగా పేరొంది ఉండవచ్చు. కానీ, ఆవేశాన్ని నిగ్రహించుకోలేకపోతే అట్టి వాని కోపము అతనికి ఆనందాన్ని దూరం చేస్తుంది. శాంతం కరువవుతుంది"

ఈ సంఘటన త్యాగయ్య నోట "శాంతము లేక సౌఖ్యం లేదు" అనే అద్భుతమైన కృతిగా సామ రాగంలో వెలువడింది. ఇది ఆయన జీవితంలో పెద్ద మలుపు. తన బలహీనతను అధిగమించే సాధనమై యోగిని చేసింది.

- ఎం.ఎస్ రామస్వామి అయ్యరు గారు "త్యాగరాజ, ఎ గ్రేట్ మ్యూజీషియన్ సెయింట్" అనే పుస్తకంలో - 1927.

శాంతము లేక సౌఖ్యము లేదు సారస దళ నయన
దాంతుని కైన వేదాంతుని కైన
దార సుతులు ధన ధాన్యము లుండిన
సారెకు జప తప సంపద కల్గిన

యాగాది కర్మములన్నియు చేసిన
బాగుగ సకల హృద్భావము తెలిసిన

ఆగమ శాస్త్రములన్నియు చదివిన
భాగవతులనుచు బాగుగ పేరైన

రాజాధిరాజ శ్రీరాఘవ త్యాగ
రాజ వినుత సాధు రక్షక తనకుపశాంతము లేక సౌఖ్యము లేదు

నిత్యశ్రీ మహదేవన్ గారి గళంలో ఈ కృతి వినండి. 

4, జూన్ 2016, శనివారం

కీచక వధ - నర్తనశాల చిత్ర సంభాషణలు


యుగయుగాలుగా పరస్త్రీ వ్యామోహంలో పడి నాశనమైన మహాబల సంపన్నుల గాథలు ఎన్నో మన పురాణేతిహాసాలలో ఉన్నాయి. ఆటువంటి వాడే మత్య్సదేశాధీశుడైన విరాటరాజు బావమరిది కీచకుడు. కామాంధుడై సోదరి అంతఃపురంలో దాస స్త్రీగా మారువేషంలో ఉన్న ద్రౌపదిని మోహించి, ఆమెను బెదిరించి, దౌర్జన్యం చేసి, అత్యాచారం చేయబోయిన కీచకుని ఆ కొలువులోనే మారువేషంలో తలదాచుకున్న పాండవులు ఏవిధంగా ఆ అజ్ఞాతవాసం భంగం కాకుండా వధిస్తారో నర్తనశాల చిత్రంలోని సంభాషణల ద్వారా తెలుసుకుందాం. సముద్రాల రాఘవాచార్య గారు ఈ మాటలు రచించగా పద్యాలు తిక్కన విరచిత మహాభారత విరాటపర్వములోనివి. చదివి ఆస్వాదించండి.

నర్తనశాల చిత్రానికి మూడు పాత్రలు ఆయువుపట్టు - ద్రౌపదిగా సావిత్రి, కీచకునిగా ఎస్వీఆర్, బృహన్నలగా ఎన్‌టీఆర్. ఒకపక్క సావిత్రి-ఎస్వీఆర్ మధ్య జరిగే సన్నివేశాలు రసవత్తరంగా సాగుతుంటే మరోపక్క అన్న నందమూరి విభిన్నమైన బృహన్నల పాత్రలో మనలను అలరించారు. కీచకునిలో ఉండే అహంకారం, మదం, కామము, దర్పము అన్ని అవలక్షణాలనూ అద్భుతంగా పండించారు ఎస్వీఆర్. అందుకే ఆయనకు జకార్తాలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ఈ చిత్ర నటనకు ఉత్తమ నటుని అవార్డు వచ్చింది. ఇక సావిత్రి గురించి ఏమి చెప్పగలం? ద్రౌపది పాత్ర ఆమెకు కొట్టిన పిండి. ఎన్నో రసాలు ఆ ముఖ కవళికలలో వ్యక్తపరచి ఆ పాత్రలో జీవించారు. ఎస్వీఆర్ సంభాషణలు, హావభావాలు ఒక పక్క, సావిత్రిగారి నటనా చాతుర్యం మరో పక్క - సినిమాను న భూతో న భవిష్యతి చేశాయి. అద్భుతమైన విజయం సాధించిన ఈచిత్రం 1963లో విడుదలై జాతీయ స్థాయిలో రెండవ ఉత్తమ చలన చిత్రంగా, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ చలనచిత్రంగా ఎంపికైంది. ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో స్థానం నిలుపుకొంది. ఎస్వీఆర్, సావిత్రి మరియు ఎన్‌టీఆర్ నటనాజెవితంలో ఒక కలికితురాయిగా నిలిచిపోయింది.

*****************************************

సుధేష్ణ అంతఃపురంలో సైరంధ్రి మహారాణిగారిని అలరించే గానం పూర్తి చేసింది. అప్పుడే కీచకుడు ఆమెను చూశాడు.

కీచకుడు: "హ హ హ...ఆహా! ఏమి ఈ సౌందర్యం!! ఏమా ముఖ వర్ఛస్సు!! ఎన్నడూ చూడని లావణ్యం!! ప్రాణం పోసిన బంగారపు బొమ్మ...ఆ..నిలకడ నేర్చిన మెరుపు తీగ. అవనీతలానికి అవతరించిన అప్సర..ఎవరీ మత్స్యగ్రంధి? ఆ.. మనం విరాట మహారాజులుంగారి బావమరుదులం, సుధేష్ణాదేవి గారి సోదరులం. సింహబల బిరుదాంకితులం, కీచక నామధేయులం. నీవెవరు? ఈ మత్స్యదేశం మా నీడన పెరిగి మా కనుసైగలలో మసలుతోంది. నీదేవూరు? ఎవరిదానవు? మారమేల మాలినీ? ఓ! వెరపా? లేక మము గన్న మైమరపా??ఆహ్! కన్నులు మిరిమిట్లుగొలిపే అందం అలవిమాలిన ఆభిజాత్యం. ఆహ్! కానరాలేదెన్నడూ ఇంతటి నెరజాణ..."

సైరంధ్రి అక్కడినుండి భయంతో వెళ్లిఫోతుంది.

సుధేష్ణ: "తమ్ముడూ..."

కీచకుడు: "ఆ! అభివాదనములు. చూదామని వచ్చాను సోదరిని చూశాను అతిలోకసుందరిని. సోదరీ! ఇంతవరకూ మధురగానం చేసిన ఆ మనోహారిణి ఎవరు? "

సుధేష్ణ: "సైరంధ్రి.."

కీచకుడు: "సైరంధ్రి..."

సుధేష్ణ: "మహారాజుగారిని చూశావా? "

కీచకుడు: "లేదు. ఇంతకుముందెన్నడూ ఈ జగదేకసుందరిని చూడలేదు. ఎంతకాలమైంది ఈ అలివేణి అంతఃపురంలో అడుగుపెట్టి?"

సుధేష్ణ: "పోయిన విజయదశమికి. ఆ... నీ ఘనవిజయానికి బావగారు ఏం బహుమానాలు తెచ్చారో? ....తమ్ముడూ"

కీచకుడు: "అనేక అమూల్య రత్నహారాలతో మేమే వారిని బహుకరించాం. ఆ... సోదరీ! ఈ వన్నెలాడి కులగోత్రాలేమిటి?"

సుధేష్ణ: "ఎవరో గంధర్వుల భార్యట. పేరు మాలిని. ఇంతకు ముందు హస్తినాపురంలో పాండవులను సేవించిందట."

కీచకుడు: "ఆ అరాళకుంతల వివరాలు వినాలని మనసు ఉవ్విళ్లూరుతున్నది. ఆమె నాథులేమైనారు?"

సుధేష్ణ: "అదృష్టం తారుమారై ఆమెకు దూరమైనారట. ఏడాదిపాటు ఇక్కడ తలదాచుకుంటానని అడిగింది. ఉండమన్నాను. అంతఃపుర దాసిగా ఉంది"

కీచకుడు: "దాసిగానా?? ఆ శృంగార రసాధిదేవత దాసిగానా?? ఆమె దాస్యానికి అర్హురాలు కాదు సోదరీ. రత్న కిరీట ధారణకే యోగ్యురాలు. వస్తా"

సుధేష్ణ: "తమ్ముడూ.."

********************************

కీచకుడు సైరంధ్రికి ఉద్యానవనంలో అడ్డుపడతాడు.

కీచకుడు: "సైరంధ్రీ! నీ కన్నుల తీరు! తెమ్మెరుల సోలు! ఒంపుల సొంపు! ఆహ్! వజ్రసన్నిభమైన నా హృదయాన్నే వ్రయ్యలు చేస్తున్నది."

సైరంధ్రి: "నన్ను వెళ్లనివ్వండి".

కీచకుడు: "ఆ. .."

సైరంధ్రి: "అంతఃపురంలో మహారాణి సేవలకు వేళయ్యింది"

కీచకుడు: "సేవలందవలసిన చిన్నారి నీవింకొకరిని సేవించటమా!! నా అంతఃపురానికి మహారాణివై దాసదాసీజనాల సేవలందుకొని నా మనోరథం ఈడేర్చు."

సైరంధ్రి: "సేనానీ! రాత్రిళ్లు రమణుల సౌశీల్యాన్ని కాపాడటం మీ ధర్మం. అంతఃపుర అన్యకాంతలతో అధికప్రసంగం మీకు ఉచితం కాదు. ఈ హీనవంశాభిజాతపై ఈ వ్యామోహం మీ క్షత్రియ కులానికే కళంకం"

కీచకుడు: " హ హ హ. నన్ను వంచించలేవు మించుబోడి. నీవు హీనవంశాభిజాతవు కావని నీకు తెలుసు, నాకూ తెలుసు. ఇంకా ఎందుకు ఈ బిగువు సుందరీ."

సైరంధ్రి: "కీచకా! నేను అందని మ్రాని ఫలాన్ని."

కీచకుడు: "అందని ఫలానివి కాబట్టే అర్రులు చాచుచున్నాను. నా అందం చూచి, పొందుకై వేచి కానుకలంపి కైమోడ్చి నా వెంటపడే కాంతామణులెందరినో కాదని కాలదన్నిన నేను నీ అనురాగాన్ని అర్థిస్తున్నాను. నన్ను నిరాకరించకు. నా ముచ్చట తీర్చు "

సైరంధ్రి: "నేను వివాహితను. అయిదుగురు భర్తలకు అర్ధాంగిని."

కీచకుడు: "అయిదుగురు భర్తలకర్ధాంగివైన నీవు ఆరవ వానిగా నన్నంగీకరించలేవా? ఆనంద పరచలేవా? తప్పు లేదులే"

సైరంధ్రి: "సింహబలా! నిజం తెలియక నిప్పుతో చెలగాటమాడుతున్నావ్. నేను పత్రివ్రతను"

కీచకుడు: "హ హ హ..పతివ్రత...పరుల పంచన చేరి పది మందికి ఊడిగం చేసే పరిచారికవు. నీవూ పతివ్రతవేనా? ఏదీ చెప్పు? అనసూయవా? అరుంధతివా? చంద్రమతివా? దమయంతివా? సీతవా? లేక సావిత్రివా?"

సైరంధ్రి: "ఆగు! పరకాంతానురక్తితో ఎందరో ప్రాణాలే పోగొట్టుకున్నారు. కులనాశనానికి తలపెట్టకు. కోరి మృత్యువును కౌగిలించుకోకు."

కీచకుడు: "హు. బెదిరిస్తున్నావా మధిరాక్షీ! నన్నెదిరించి నిలబడగలిగిన వాడు ఈ మత్య్సదేశంలోనే లేడు. ఈ సింహబలుడంటే ఎవరనుకున్నావ్? వైరివీర కుంజరయూధంబులకు సింహస్వప్నం. నారీజన మంజుల హృదయాలకు మధురస్వప్నం. మాలినీ! వీడు పట్టిన పట్టు వీడడు. నిన్ను చేబట్టక మానడు."

సైరంధ్రి: "అది అసంభవం"

అంతలో సైరంధ్రిని వెదుకుతూ ఉత్తర ఆ ఉద్యానవనానికి వచ్చింది.
ఉత్తర: "మాలినీ! మాలినీ! .."

ఉత్తర రాకతో అప్పటికి కీచకుని బెడద తప్పిందని సైరంధ్రి సంతోషిస్తుంది.

***************************

సుధేష్ణాదేవి అంతఃపురంలో కీచకుడు సోదరిని మాలినిని కోరుటకై వెళతాడు

కీచకుడు: "సోదరీ! సోదరీ! నాకో ఉపకారం చేయాలి సోదరీ!

సుధేష్ణ: "అదేమిటి తమ్ముడూ! ఈ మత్య్సరాజ్యానికే క్షేమకరుడవైన నీకు నేనేం చేయగలను?"

కీచకుడు: "నీవే చేయగలవు. వాగ్దానం చేయి"

సుధేష్ణ: "చేయగలిగిందైతే చేస్తాను. అదేమిటి?"

కీచకుడు: "సైరంధ్రి నా మనసు హరించింది. ఆమె అందం మరచిపోదామన్నా మరపు రావట్లేదు. ఆమె లేకుండా నేను జీవించలేను సోదరీ. ఎలాగైనా ఆమెను నాకు దక్కించు."

సుధేష్ణ: "వద్దు తమ్ముడూ! పరకాంతల పొందు ప్రమాదం. జీవితాలను నీతో ముడివేసుకున్న చిన్నారులున్నారు. కోరి నీ కొలువు చేస్తూ నీ కనుసన్నలకు కలవరించే సింగారులున్నారు. వారిని కాదని ఒక పరిచారికను కోరటం పరువు కాదు.

కీచకుడు: "నా కొలువులో కానీ, అమరేంద్రుని కొలువులోని అతివలైనా సరే ఆమె కాలి కొనగోటికి సాటి రారు. నీ హితబోధలతో నా విరహ బాధ శమించదు. ఆమె శృంగార గంగా ప్రవాహంలో నేను మునిగి తేలినప్పుడే నా తాపానికి శాంతి. ఆ విషయం మరచిపోకు."

సుధేష్ణ: "మరొక్కమారు ఆలోచించు తమ్ముడూ! మహా పరాక్రమవంతులైన గంధర్వులు ఆమె భర్తలని, అనుక్షణం ఆమెను కాపాడుతుంటారని విన్నాను. ఆమెను ఆశించిన వారంతా వారిచేత హతులయ్యారట"

కీచకుడు: "ఆహ్..గంధర్వులే కాదు దేవతలంతా ఏకమై వచ్చినా సరే నన్ను నిర్దించలేరు. ఆమెను నా బారినుండి రక్షించనూలేరు. ఏమైనా సరే ఆమెను నీవు నా మందిరానికి పంపించే తీరాలి"

సుధేష్ణ: "అది న్యాయం కాదు. ఆమెకు ఆశ్రయమిచ్చిననాడే అనుచిత కార్యాలకు నియోగించనన్నాను. పరుల ఇళ్లకు పంపించనన్నాను. అన్నమాట తప్పి అభిమానం వ్యక్తబుచ్చలేను."

కీచకుడు: "లేవా? నాకంటే ఆ పరిచారికే ఎక్కువా నీకు? ఆమెకిచ్చిన మాట కోసం  నా జీవితమే వమ్ము చేస్తావా? ఆలోచించుకో! ఈ మత్య్స రాజ్యమే నా బలదర్పాల మీద దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంది. నన్ను నిరాకరించి ఆమె ఒక్క క్షణం కూడా ఆమె ఈ అంతఃపురంలో ఉండలేదు. ఆమెకు ఆశ్రయమిచ్చిన నీవు, నీ మహారాజు, ఈ రాజ్యం కూడా ఉండదు. అంతవరకూ రాకూడదని నిన్ను అర్థించాను. తేల్చుకో నేనో ఆ పరిచారికో!"

సుధేష్ణ: "తమ్ముడూ! ఒక పరిచారికపై వ్యామోహానికి బాంధవ్యాన్ని బలి చేస్తావా? నీ చేతులారా నిర్మించిన ఈ రాజ్యం నిర్మూలం చేస్తావా? మహారాణిగా నిన్ను మందలించటం లేదు. ఆడపడుచుగా అర్థిస్తున్నాను. నీ సోదరి కోసం, మన వంశం కోసం నీ మనసు మార్చుకో తమ్ముడూ!"

కీచకుడు: "అసంభవం! సూర్యుడు అస్తమించేలోగా ఆ సుందరి నా మందిరంలో ఉండాలి. లేదా, ఈ మత్స్యమండలాన్నే మట్టిపాలు జేస్తాను"

*****************************
తమ గృహంలో సైరంధ్రి, బృహన్నల

బృహన్నల: "ఆందోళన పడకు పాంచాలీ!!. అనువుగాని వేళ ఆవేశం పనికిరాదు. ఆ కీచకుని పాపం పండి ఇంత కిరాతకానికి సాహసితున్నాడు. జాగ్రత్తగా మన కార్యం సాధించుకోవాలి. కొంచెం ఓపిక పట్టు"

సైరంధ్రి: "కానీ, ఆ కామాంధుని దురాగతాలు మితిమీరితే?"

బృహన్నల: "మితిమీరితే ఏదో ఉపాయం ఆలోచించి గుట్టుగా మట్టుబెడతాం. అజ్ఞాతవాసం అంతం కాబోతున్న ఈ సమయంలో మనకు తొందరపాటు కూడదు. యధావిధి నీ నిత్య జీవితం కొనసాగించు. వెళ్లు..వెళ్లు..."

*************************************

సుధేష్ణ అంతఃపురంలో

సైరంధ్రి: "మహారాణీ! ఏం మహారాణీ అలా ఉన్నారు?"

సుధేష్ణ: "నా మనసేమీ బాలేదు మాలినీ! "

సైరంధ్రి: "మధిర పుచ్చుకుంటే మనసు కాస్త కుదుట పడుతుందేమో? తీసుకురానా?"

సుధేష్ణ: "ఆ..మధిర...కానీ మన మందిరంలో మంచి మధిర లేదు. మా సోదరుని మందిరం మధిరకు పెట్టింది పేరు. వెళ్లి తీసుకురా మాలినీ!"

సైరంధ్రి: "హా! వారింటికి నన్ను వెళ్లమని ఆనతిస్తున్నారా? "

సుధేష్ణ: "ఆనతివ్వడం లేదు మాలినీ! అర్థిస్తున్నాను."

సైరంధ్రి: "ఆశ్రయమిచ్చిన నాడు అనుచిత కార్యాలకు వినియోగించనని మాటిచ్చారు. పరుల ఇండ్లకు పంపనన్నారు. అన్నమాట వమ్ము చేస్తారా మహారాణీ?"

సుధేష్ణ: "నేను వెళ్లమంది పరుల మందిరానికి కాదు మాలినీ! నా సోదరుని మందిరానికి. "

సైరంధ్రి: "కానీ, తమ మందిరంలొ నన్ను చూచింది మొదలు మీ సోదరుని మాట ఏదో అపాయాన్ని సూచిస్తున్నది. "

సుధేష్ణ: "అపాయం నుంచి తప్పించుకోవాలనే అపేక్షిస్తున్నాను. సూర్యాస్తమయంలోగా నిన్ను తన మందిరానికి పంపించకపోతే మా మత్స్య రాజ్యాన్నే మట్టిచేస్తానన్నాడు. ఆ అవినీతుని మాట వినకపోతే మా రాజవంశమే అంతరిస్తుంది. ఆనాడు నిరాధారవైన నీకు ఆశ్రయమిచ్చాను. నిస్సహాయురాలనై ఈనాడు నీ రక్ష కోరుతున్నాను. మా రాజ్యం, మా రాజవంశం నీవే రక్షించాలి సైరంధ్రీ!"

సైరంధ్రి: "మీ క్షేమానికి నేను ఆహుతి కావాలా మహారాణీ! సాటి మగువ చాటవలసిన మాటలేనా ఇవి?  ప్రతి స్త్రీ పవిత్రంగా భావించుకునే శీలాన్ని బలిపెట్టమంటారా? "


సుధేష్ణ: "అది నా వాంఛ కాదు. అలా జరగబోదు. నీవు మహాబలవంతుల ఇల్లాలివి. నీకే అపరాధం జరుగదు. వెళ్లిరా మాలినీ."

సైరంధ్రి: "సరే. విధి బలీయం మహారాణీ. వెళతాను. "

***********************************

కీచకుని మందిరంలో ఏకపాత్రాభినయం:

"ఆ హ హ సింహబలా!! ఏమి నీ సౌందర్య శోభ! సైరంధ్రీ సమాగమ సంతోషాతిశయమున నీ వదన లావణ్యము వేయిమణుగులధిగమించినది. ఆ హ హ హ...ఈ సోగసు జూచి మాలిని మనసు రంజిల్లకుండునా? నా సందిట వ్రాలకుండునా?

హ...ఏ అందెల సందడి విన్ననూ ఆ సుందరేనని మనసున ఆందోళన అధికమవుతున్నది. సంకేత సమయము మించిపోతున్నది...మాలిని రాదే? అక్క పంపలేదా?...హుం..ఏల పంపదు? తమ్ముని కోరిక మన్నించనిచో తనకే అపాయమని ఎరుగదా? ఒకవేళ సైరంధ్రి మహారాణి ఆదేశమును కాదనెనా? అంత సాహసమా! హుం..వచ్చి వలచి వలపించి మహిలోనే మహేంద్రవైభవమును చవిచూపించు! హ హ హ హ.

ఏమిది దేవీ! నీకై మనోహర హంసతూలికాతల్పమాయత్తపరచి నిరీక్షుంచుచుండ నీవీ మధుపాత్రలో మసలుచుంటివా? నిన్నిట దాగనివ్వను. నాలోనే దాచుకొందును.

ఆ...ఓసి..ఇక్కడ నిలచితివా! నీరాక గమనించలేదని అలిగితివా! ఎందులకీ పెడమోము చెలీ! భ్రమ...వట్టి ప్రతిమ...

ఏల ఆ రమణి ఇంకనూ రాలేదు? "

సైరంధ్రి: "మహారాణి గారు మధిర తీసుకు రమ్మన్నారు"...

కీచకుడు: "హుం హ హ..నీవు పలుకు నేర్చిన ప్రతిమవు. నేను భ్రమింపను. సైరంధ్రి ఇంకనూ రాలేదు...హుం...ఆమెను బలాత్కరించైనను నా దానిగా చేసుకొనెదను. "

సైరంధ్రి: "దేవి గారు త్వరగా రమ్మన్నారు"...

కీచకుడు: "ఎవరదీ! నీవేనా సుందరీ! నా సైరంధ్రివేనా? నా ప్రేమ సామ్రాజ్య పట్టమహిషి మాలినివేనా? స్వాగతం! సుస్వాగతం! "

సైరంధ్రి: "దేవి గారు చాలా దప్పిగొన్నారు"

కీచకుడు: "వారి తమ్ముడు అంత కన్నా దప్పిగొనియున్నాడు. నీ సరస వచనామృతంతో నా తృష్ణ చల్లార్చు. రా.."

సైరంధ్రి:"ఆగు సింహబలా! నీకిది నీతి కాదు. అంతఃపుర దాసిని కామించుట నీకు తగని పని. "

కీచకుడు: "అంతఃపుర దాసివా? కాదు దేవీ! కాదు. నా ప్రేమ రాశివి, నా హృదయ రాణివి. అనుగ్రహించు దేవీ!"

సైరంధ్రి:"ఛీ! నీచుడా! అగ్నిగుండాన్ని అమృత భాండమని భ్రమించకు! పతివ్రతల పొందు గోరి పాపాగ్నిలో నీ బ్రతుకు భస్మం చేసుకోకు.."

కీచకుడు: "హ హ హ భరింపరాని విరహాగ్ని కన్నా ఆ పాపాగ్నే మాకు సమ్మతం. మా అభీష్టం నెరవేర్చకుండా ఉండాలేవు. రా!!"

సైరంధ్రి:"నిలు! పరంకాతల పొందు ప్రాణాంతకమని గుర్తుంచుకో! హుం జానకినాశించి రావణుడు వంశనాశనమైనాడు. శచీదేవినాశించి నహుషుడు.."

కీచకుడు: "ఆ.. ఆపు నీ పురాణ గాథలు. నా మాట ఆలకించి ప్రేమ స్వీకరించు. మణిమయ సువర్ణ భూషణాలతో సుందరంగా అలంకరించు. మనోహర హంసతూలిక మనలను ఆహ్వానిస్తోంది. దా..."

సైరంధ్రి:"పాపీ! కామాంధకారంలో కన్ను తెలియక నీ దుర్మరణాన్ని కోరి తెచ్చుకుంటున్నావ్. కడసారిగా హెచ్చరిస్తున్నాను. ప్రాణాల మీద ఆశ ఉంటే ఇప్పటికైనా నీ దుర్మోహం విడిచి పెట్టు. లేదా...

దుర్వారోద్యమ బాహువిక్రమ రసాస్తోక ప్రతాపస్ఫుర
ద్గర్వాంధ ప్రతివీర నిర్మథన విద్యాపారగుల్ మత్పతు-
ల్గీర్వాణాకృతు లేవురిప్డు నిను డోర్లీలన్ వెసన్ బెట్టి గం-
ధర్వుల్ మానము ప్రాణముంగొనుట తథ్యంబెమ్మెయిం కీచకా!

కీచకుడు:"హహ్ గంధర్వులట గంధర్వులు! ఏ వూరు! సుర గరుడోరగ యక్ష రక్ష కిన్నెర గరుడ గంధర్వ కింపురుషాదులే దిగి వచ్చినను ఈ సింహబలుని అవక్రవిక్రమ పరాక్రమమునకు మోకరిల్ల వలసినదే. ఇక నిన్నెవరూ రక్షించువారు లేరు. నా ముచ్చట తీరనిదే నిను విడువను. రా!!!

ఎక్కడికి పోగలవు? ఈ అఖిలచరాచరములలో ఎక్కడ దాగినా సరే పట్టి నా బాహుపంజరములో బంధించగలను. "

సైరంధ్రి పరిగెత్తుకుంటూ విరాటరాజు కొలువుకు వస్తుంది

సైరంధ్రి:"మహారాజా! మహారాజా! నన్ను రక్షించండి."

కీచకుడు: "రక్షణా! నన్ను నిరోధించి నిన్ను రక్షించే దక్షులెవరున్నారు ఈ సభలో!! ఎవరు!! "

సైరంధ్రి:"మహారాజు మందిరంలో పని చేసే మానవతికి మహారాణి తమ్ముడు చేసే మర్యాద ఇదేనా? కమ్మని రాజాన్నాలతో కండలు పెంచి అధికారం స్వీకరించింది అబలలపై అత్యాచారానికేనా? పతివ్రతలను పరాభవించటానికేనా? "

కీచకుడు: "చాలించు నీ అరణ్య రోదన. ఈ మత్స్య మండలానికే నే మహారాజును. ఈ మహారాజు నే నిలబెట్టిన మట్టిబొమ్మ. నా చేతిలో కీలుబొమ్మ. అతన్ని అర్థించటం దేనికి? నన్నాశ్రయించు."

సైరంధ్రి: "సభాసదులారా! ధర్మవేత్తలారా! మీ సముఖంలో ఇంత సాహసం జరుగుతుంటే చూసి సహిస్తారా?  కాదనలేరా? మౌనం వహిస్తారా? మీకు నావంటి తోబుట్టువులు లేరా? మీలో నీతినియమాలు దయాదాక్షిణ్యాలు అడుగంటిపోయాయా? ప్రాణాల కోసం ధర్మం ధ్వంసం చేస్తారా? పదవుల కోసం కర్తవ్యం మరచిపోతారా? "

కీచకుడు: "హుం హు హు హు. ఈ సభాచారుల వీరము, బాహుసారము చూశావుగా? ఈ భూనాథుడే కాదు, నీ గంధర్వ నాధులే కాదు త్రిలోకనాథులే ఏకమై వచ్చినా నిన్ను రక్షింపలేరు."

విరాటరాజు: "బావా! నీ నిశ్చయం తిరుగులేనిదని నేనెరుగుదును. కానీ, సభాగౌరవం కూడా పాటించుట నీ బాధ్యత కాదా?  నా మాట విని నీవు..."

కీచకుడు: "ఊ... సరే. సైరంధ్రీ! రేపటి వరకు గడువిస్తున్నాను. ఆలోచించుకో! తిరస్కారం చేస్తే బలాత్కారం తప్పదు జాగ్రత్త."

సభలో ఉన్న వలలుడు ఆవేశంతో అక్కడ ఉన్న ఫల వృక్షాన్ని పెకలించబోతాడు.

కంకుభట్టు: "వలలా! ఆశ్రితులకు నీడనిచ్చే ఫల వృక్షాన్ని వంటచెరకులకై నిర్మూలించటం మంచిది కాదు."

సైరంధ్రి: "బాహుబల సంపన్నులు, ప్రతివీర భయంకరులైన గంధర్వులే అసమర్థులై వెనకాడుతున్నారే? వారి కాంతకే పరాభవం తప్పకపోతే ఇక ఏ ఇల్లాలు  పరువుగా బ్రతుకుతుంది? ఈ అన్యాయానికి అంతులేదా? "

కంకుభట్టు: "సైరంధ్రీ. చాలు నీ ప్రలాపాలు. ప్రభువులు నీ దుస్థితిని కళ్లారా చూశారు. ఇక హద్దు మీరకు. గంధర్వుల కాంతనంటావు. వారేమో పౌరుష ప్రతాపవంతులంటావు. వారెందుకు నిన్ను రక్షించలేదో నీకే తెలియాలి. సమర్థులైతే సమయం చూసి పగతీర్చుకుంటారు. పడతి ఎంత ఆపన్నురాలైనా నలుగురిలో నిలబడి పతులను తూలనాడటమా? కులసతుల గౌరవం కూలద్రోసి జంకు బొంకు మాని నాట్య ప్రదర్శన సాగించు. వెళ్లు."

సైరంధ్రి: "అవును. నాది నాట్యమే. నా భర్తలు నటులు, జూదరులు. వారికి లేని గౌరవం నాకెలా ఉంటుంది?"

***********************************
గృహంలో సైరంధ్రి వలలునితో:

సైరంధ్రి: "ఆనాడు కురుసభలో దుశ్శాసనుడు చేసిన పరాభవం భరించాను. అరణ్యసీమలో సైంధవుడు చేసిన అత్యాచారం సహించాను. ఈనాడు విరటుని కొలువులో దాసినై సేవిస్తున్నాను. దేనికి? మీ పరువు ప్రతిష్ఠ నిలపటానికా? లేక ఈ నీచ కీచకుని వలన అవమానం పొందటానికా? నా పరాభవాన్ని కళ్లారా చూసి కూడా మీకింకా ఎలా నిద్రపడుతోంది?"

వలలుడు: "నిద్రించలెదు దేవీ. నిద్రించలేదు. నిమిష నిమిషానికీ ఆవేశంతో దహించుకుపోతున్నాను. అన్నింటికీ అన్నగారి ఆత్మగౌరవమే ఆటంకమవుతోంది. ఆనాడు నిండు కొలువులో నిన్ను చూచి రారాజు తొడ చరిచిననాడే ఆ కౌరవ హతకులను చీల్చి చెండాడి ఉంటే మనకు ఈ ఆపదలు, అవమానాలు కలిగి ఉండేవి కాదు. మన కష్టాలన్నిటికీ ఆ ధర్మనందనుడే కారణం. "

బృహన్నల: "అవేశపడకు అన్నయ్య. అజాతశత్రువును అర్థం చేసుకోలేక అధిక్షేపిస్తున్నావు. ధర్మ నందనుడంటే ఎవరనుకున్నావు?"

ఎవ్వాని వాకిట ఇభమద పంకంబు రాజభూషణ రజోరాజినడగు
ఎవ్వాని చారిత్ర మెల్లలోకములకు నొజ్జయై వినయంబు నొరపు గరపు
ఎవ్వాని కడకంట నివ్వటిల్లెడుచూడ్కి మానిత సంపదలీనుచుండు
ఎవ్వాని గుణలత లేడు వారాసుల కడపటి కొండపై కలయబ్రాకు

అతడు భూరిప్రతాప మహాప్రదీప
దూర విఘటిత గర్వాంధకార వైరి
వీరకోటీర మణి ఘృణి వేష్టితాంఘ్రి
తలుడు కేవల మర్త్యుడై ధర్మసుతుడు

అంతటి మహానుభావుడైనా ధర్మం కోసం పరుల పంచన తలవంచటం తప్పలేదు.

సైరంధ్రి: "ధర్మం...ఏమిటా ధర్మం? జూదం ధర్మమా? భార్యను పందెమొడ్డటం ధర్మమా? ఎన్నాళ్లీ ధర్మం? ఎంతవరకీ సహనం? అన్న గారి గౌరవమే మీకు ప్రధానమా? నాకు జరిగిన పరాభవానికి ప్రతీకారమే లేదా? పరదాస్యంతో మీ బలదర్పాలు నశించిపోయాయా? మళ్లీ ఆ దురాత్ముడెదురైతే నా మాన ప్రాణాలేమౌతాయో యోచించలేదా? "

వలలుడు: "ఇక ఒక్కటే యోచన దేవి. ఆ ధర్మజుడే కాదు ఆ ధర్మదేవత ఎదురైనా సరే ఆ కీచకుణ్ణి ఇప్పుడే చిత్రవధ చేస్తాను. నీ పవిత్ర దేహాన్ని తాకిన ఆ పాపిని ఖండఖండాలు చేస్తాను. ఆ మదోన్మత్తుని దేహాన్ని మెదిపి మాంసపు ముద్ద చేస్తాను. నీ పగ చల్లారుస్తాను."

బృహన్నల: "అన్నయ్యా! సాహసం అన్ని వేళలా జయప్రదం కాదు.సమయాసమయాలు పాటించి ముందంజ వేయాలి. "

సైరంధ్రి: "ఇది కూడా అన్నగారి హితబోధేనా? "

బృహన్నల: "అవును. జరిగిన అవమానానికి వారెంతో బాధపడుతున్నారు. తగిన ప్రతీకారం చెయ్యాలనే అన్నగారి అభిమతం. "

వలలుడు: "ఆ... అన్నగారు అనుమతించారా?"

బృహన్నల: "అవును."

సైరంధ్రి: "అహా!!! ఈ అభాగ్యురాలికి ఎప్పుడా అదృష్టం. "

బృహన్నల: "రేపే... రేపే...అతి రహస్యంగా జరగాలి. "

సైరంధ్రి: "ఆ!!! పాపం కాదా? "

బృహన్నల: "కాదు. పతి ఆజ్ఞ పాలించటం పాపం కాదు. ఆరితేరిన నటివలె లేని వలపు నటించు.  అతన్ని రప్పించు. తరువాతి కథ మా చిన్నన్న గారు పూర్తి చేస్తారు. వెళ్లిరా! ఊ. అన్నగారూ! పదండీ. "

***********************************
కీచకుని ఏకపాత్రాభినయం:

"సింహబలా! ఇటు. ఇటు సింహబలా! హ హ హ. సింహబలుడవని బిరుదు. వైరివీరులకు సింహస్వప్నమని ప్రతీతి. సరస శృంగార కళాకోవిదుడవై జగదేకసుందరీప్రేమ మందారుడవైన నీకు ఒక సామాన్య అంతఃపుర పరిచారిక ప్రేమ తిరస్కారమా! ఎంత అవమానము! ఎంత అవమానము! నీ సర్వసైన్యాధిపత్యము సింహబల బిరుదము వ్యర్థము నిరర్థకము.

ఆహ్! నా సామర్థ్యాన్నే శంకిస్తున్నావా? హరిహరాదులే అడ్డం వచ్చినా సరే అహంభావిని బంధించి తెచ్చెద. హ హ హ హ..."

*************************************

మాలిని అతనిని తోటకు రమ్మని కబురంపుతుంది

కీచకుడు: "మాలినీ! రసిక చక్రవర్తినని మురిసిపోయే నా గర్వం సర్వము ఖర్వము చేశావు. స్త్రీ హృదయము తెలుసుకోలేక పోయినందుకు సిగ్గుపడుతున్నాను మాలినీ! నిజమే! నలుగురిలో నగుబాటు చేస్తే అభిమానవతికి ఆగ్రహం కలగటం సహజమే. ఇప్పటికైనా అనుగ్రహించావు. ధన్యుడిని. ఏదీ! నీ కడగంటి చూపులతో అమృతవర్షం కురిపించు! నీ సరసవచోమాధురితో నాకు శ్రవణానందం కలిగించు. రా సైరంధ్రీ. దేవతలనైనా చేజాచి అర్థించని నేను ఈనాడు దీనుడనై నిన్ను వేడుకుంటున్నాను. నన్ను కటాక్షించు దేవీ!"

సైరంధ్రి:"రాత్రికి నర్తనశాలలో!!"

కీచకుడు: "ఆ. తెలివిగల దానవు. మంచి చోటే ఎన్నుకున్నావు. నిజమే. పగలంతా ఆటపాటలతో ప్రతిధ్వనించే నర్తనశాల అర్ధరాత్రి నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా ఉంటుంది. హా హ హ హ. మాట తప్పవుగా.."

సైరంధ్రి: "ఊహూ... ఆ ఒంటరిగా..."

కీచకుడు: "అవునవును. ఎవరైనా చూస్తే నీ రహస్యం రచ్చకెక్కుతుందని భయం.సరి సరి. ఒంటరిగనే వస్తా. మరువకు సుమా! ఆహ్"

***************************************

నర్తనశాలలో దీపాలన్నీ ఆర్పి సైరంధ్రి ఒక స్థంభం చాటున ఉంటుంది. వలలుడు స్త్రీ వేష ధారియై కీచకునికై వేచియుంటాడు.  చీకటిలో అక్కడ కూర్చున్నది సైరంధ్రి అనుకోని సరస సంభాషణలు మొదలు పెడతాడు.

కీచకుడు: "హ హ హ. ఆహ ఆహ. మాలినీ! ఎంత మనోహరంగా ఉంది ఈ పరిమళం. ఈ సువాసన నీ పువ్వులది కాదు. దివ్యకామినివైన నీ మేని సుగంధం.

వలలుడు: "ఊ.."

కీచకుడు: "ఇదిగో నీ అపూర్వ సౌందర్యానికి అలంకారంగా ఈ అమూల్య రత్నహారం తెచ్చాను. ఇటువంటి రత్నాలీలోకంలో లేవు."

వలలుడూ: "నావంటి నారీరత్నం కూడా లేదు. "

కీచకుడు: "ఆ!! నీ దరితీపి పలుకులకే ఈ శరీరం పరవశం పొందుతోంది."

వలలుడు: "ఊ. పొందుతూ అమరలోకానందం పొందుతారు. మరే సుందరి సాంగత్యాన్నీ ఆశించరు."


కీచకుడు: "కనుకనే నీ రూపానికి ముగ్ధుడనయ్యాను. మాలినీ! ఎంతసేపు ఈ చీకట్లో చిందులాట. ఒక్కసారి ఇటు తిరిగి నన్ను కన్నెత్తి చూడరాదూ! మేలిముసుగు తొలగించి చిరునవ్వుతో వెన్నెలలు చిలికించరాదూ! అబ్బా! ఇదేమిటి మాలిని చిగురుటాకుల వలె సుతిమెత్తగా గాలి సోకితేనే కందిపోయే నీ లేత చేతులకు ఇంతటి కరుకుదనం ఎలా వచ్చింది?"

వలలుడు: "రేయిపగలు దాసీగా ఊడిగం చేసే దాని చేతులు కరుకుగా కాక మృదువుగా ఎలా ఉంటాయ్? "


కీచకుడు: "అబ్బా! ఇంతలోనే అలుకా! అద్వైతానన్నా అర్థం చేసుకోవచ్చు కానీ ఆడదాని మనసును మాత్రం అర్థం చేసుకోవటం చాలా కష్టం మాలినీ. ఏదీ ఒక్కసారి....."

వలలుడు: "అదిగో! తాకవద్దంటే మానరు కదా! చంద్రుడింకా అస్తమించలేదు. జనసంచారం తగ్గలేదు. నవరస రసికులు కదా. అంతలోనే తొందరా? "


కీచకుడు: "మాలినీ! నీ సౌందర్యం నన్ను మత్తెక్కిస్తుంది. నేనేం మాట్లాడుతున్నానో ఏం చేస్తున్నానో నాకే తెలియదు. మాలినీ నేను నీ దాసుడను. దాసుడను మాలినీ! అజ్ఞాపించు శిరసావహిస్తాను. "

వలలుడు: "ఒక్కసారిగా మీరు నా దివ్యరూపం చూశారంతే దిగ్భ్రమ చెందుతారు. మధురస పానంతో మత్తెక్కి ఎర్రబడిన మీ కళ్లను రెండు చేతులతో మూసుకోండీ. "


కీచకుడు: "ఆహ్!! ఏనాడు నీ దేదీప్యమాన దివ్య సుందర విగ్రహాన్ని చూశానో ఆనాడే నా కన్నులు మిరిమిట్లు గొలిపి మూతలు పడ్డాయి. అయినా నీ ఆజ్ఞను కాదనరాదుగా!! సరే కళ్లు మూసుకుంటున్నాను."

వలలుడు: "ఏవండీ! నిజం చెప్పండీ. నన్ను మీరు ప్రేమించారా? కామించారా? "


కీచకుడు: "ఎంతమాటన్నావు మాలినీ! త్రికరణశుద్ధిగా ప్రేమించాను. మా కులదేవతల మీద ఆన."

వలలుడు: "ఎంతటి అమాయకులు మనోహరా నా నిజమైన దివ్యసుందర విగ్రహాన్ని చూడు."

కీచకుడు: "హా! వలలుడవా!"

వలలుడు: "కాదు! నీ పాలిట మృత్యువును. నేటితో నీ పాపాలు పండినై. పరిహారం చెల్లించబోతున్నావు."

కీచకుడు: "హా. వంటవాడవు నీవా నన్నెదిరించేది. ఓహో! మాలిని చెప్పిన గంధర్వాధములలో నీవొక్కడవా! సరే రా! నీ అటకట్టే!"

వలలుడు:నీ ఆటకట్టించి నిన్ను తుదముట్టించటానికి ఇక్కడకు రప్పించాను. కాచుకో!...


కీచకుడు: "నీవు..నీవు..."

కీచకుడు ముష్టి యుద్ధంలో వలలుని చేత హతుడవుతాడు.


2, జూన్ 2016, గురువారం

కర్ణాటక శాస్త్రీయ సంగీత ముని - శ్రీపాద పినాకపాణి


గురు పరంపర ఎంత ముఖ్యమో భారతీయ కర్మభూమిలో పుట్టిన అనేక యోగుల, సిద్ధుల, ఋషుల జీవిత చరిత్ర తెలుసుకుంటే అర్థమవుతుంది. దానికి ఉత్తమ ఉదాహరణలు ఆదిశంకరులు, రామకృష్ణ పరమహంస, చిన్మయానంద, దయానంద వంటి అవతార పురుషులు. వారు ధర్మస్థాపనకై చేసిన ప్రయత్నంలో ఉన్న పవిత్రత దానిని గంగాప్రవాహంలో శాశ్వతం చేస్తుంది. అలాగే సంగీతం ద్వారా సేవ చేసిన యోగులు ఎందరో. ఆ కోవకు చెందిన వారే శ్రీపాద పినాకపాణి గారు. సంగీతంలో యోగం సిద్ధించిన వారు శ్రీపాద పినాకపాణి గారు. ఆయన పరంపర ఎంత వైభవంగా ఉందో ఆయన శిష్యులైన మహామహులు వోలేటి వేంకటేశ్వర్లు, నేదునూరి కృష్ణమూర్తి, నూకల చినసత్యనారాయణ, దోమాడ చిట్టబ్బాయి, శ్రీరంగం గోపాలరత్నం, మల్లాది సూరిబాబు గారు, ఆయన తనయులు మల్లాది సోదరులు మొదలైన వారి ప్రతిభ, కీర్తి ప్రతిష్ఠలు తెలుసుకుంటే అర్థమవుతుంది. ఆ మహామహోపాధ్యాయులు శ్రీపాద పినాకపాణి గారి వివరాలు ఈ బ్లాగు పోస్టులో.

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ప్రియ అగ్రహారంలో ఆగష్టు 3, 1913వ సంవత్సరంలో శ్రీపాద కామేశ్వరరావు, జోగమ్మ దంపతులకు ఆఖరి సంతానంగా పినాకపాణి జన్మించారు. కామేశ్వరావు గారు రాజమండ్రి ప్రభుత్వ శిక్షణ కళాశాలలో ప్రొఫెసరుగా పనిచేస్తూ ఉండటంతో పినాకపాణిగారి ప్రాథమిక విద్యభ్యాసం రాజమండ్రి మరియు కాకినాడలలో జరిగింది. కామేశ్వరరావు గారికి నాటకరంగంతో అనుబంధం ఉండటంతో పినాకపాణిగారికి సంగీతంపై మక్కువ కలిగింది. అప్పట్లో నాటకాలలో పద్యాలు, గీతాలు ఉండేవి. అవి సంగీత ప్రాధాన్యత కలిగి ఉండేవి. బాల్యంలో తన సోదరి బీ.ఎస్ లక్ష్మణ రావు గారి వద్ద సంగీతం నేర్చుకుంటున్నప్పుడు విని తాను కూడా నేర్చుకున్నారు. అక్క పాడుతుంటే తప్పులు సరిదిద్దే వారు కూడా. అతనిలోని సంగీత ప్రతిభను గుర్తించి ఆ గురువు గారు సంగీతం నేర్చుకోవలసిందిగా సలహా ఇచ్చారు. అలా రాజమండ్రిలో లక్ష్మణరావు గారి వద్ద 1924లో పినాకపాణి గారి సంగీత అభ్యాసం మొదలైంది. 1929లో హైస్కూలు పాసయ్యే సరికి ఆ శిక్షణ కూడా పూర్తైంది.

అప్పట్లో కాకినాడలో ఓ జమీందారు గారు రసికుల ఆర్థిక సాయంతో సరస్వతీ గాన సభ అనే సంస్థను నడిపే వారు. ఆ సంస్థ గొప్ప గొప్ప కళాకారులను రప్పించి కచేరీలు ఏర్పాటు చేయిస్తూ ఉండేది. ఆ సంస్థ కార్యక్రమాలకు హాజరైన పినాకపాణిగారు అరైకూడి రామానుజం అయ్యంగారు, కాంచీపురం నైనా  పిళ్లై, పాపా వెంకట్రామయ్య, కుంభకోణం రాజమాణిక్యం పిళ్లై, తిరుచ్చి గోవిందస్వామి పిళ్లై మొదలైన వారి కచేరీల ద్వారా తంజావూరు సాంప్రదాయ కర్ణాటక సంగీతం వైపు ప్రభావితులైనారు. ఆయన అరైకూడి మరియు గోవిందస్వామి పిళ్లైల పద్ధతిని అనుకరించి తంజావూరు గాత్ర శైలిని ఆంధ్రులకు పరిచయం చేశారు. తాను ఇదివరకు నేర్చుకున్న కృతులు వీరు వేరుగా పాడుతూ ఉండటంతో ఆ పద్ధతిలో తాను మరల నేర్చుకుని తన సంగీత ప్రావీణ్యాన్ని మరింత పెంపొందించుకున్నారు. అప్పటికి ఆయన ఇంకా యుక్తవయసులోనే ఉన్నారు. ఒకసారి పినాకపాణి గారి గాత్రం విని అరైకుడి రామానుజం అయ్యంగారిని సంగీత రసికులైన ఎస్వై కృష్ణస్వామి గారు "వీరు మీ శిష్యులా" అని అడిగారుట. అంతగా పినాకపాణి గారు ఆయన పద్ధతిని నేర్చుకున్నారు.  "అరైకూడి నేను విన్న అత్యుత్తమ గాత్ర సంగీత విద్వాంసులు" అని పాణిగారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. పాణి గారి శిష్యులైన నేదునూరి కృష్ణమూర్తి గారు ఒకసారి ఆయనను "ఏమిటి అరైకూడి గొప్పతనం" అని అడిగారుట. "గమకాలలో స్పష్టత ఆయన ప్రత్యేకత. అనుస్వరాలతో కూడిన గమకాలు పలికించటంలో ఆయన దిట్ట" అని చెప్పారుట పాణి గారు. తంజావూరు సాంప్రదాయంలో అరైకూడి వంటి కళాకారులు పాడుతున్నప్పుడు, వారి రికార్డులను విని ఆ స్వరాలను, సంగతులను పినాకపాణి రాసుకొని వెంటనే పలికే వారు.

అప్పట్లో గ్రామఫోన్ రికార్డుల్లో ఎక్కువగా పదాలు మరియు జావళీలు ఉండేవి. వాటిని విని ఇట్టే నేర్చుకునే వారు పినాకపాణి గారు. అలాగే తండ్రిగారితో కలిసి వెళ్లి నాటకరంగానికి సంబంధించిన సంగీతంలో కూడ ప్రావీణ్యం సంపాదించారు. అప్పటి మేటి హిందూస్థానీ కళాకారుల రికార్డులు విని ఆ సాంప్రదాయంలో మెళకువలు కూడా నేర్చుకున్నారు. తల్లిదండ్రులు రామేశ్వరం వెళుతుంటే తనను డిసెంబర్ చెన్నై సంగీతోత్సవాలు వీక్షించేందుకు అక్కడ వదిలి వెళ్లమని కోరారు. చెన్నైలో ఉండి అరైకూడి, ముసిరి సుబ్రహ్మణ్య అయ్యరు, స్వామినాథ పిళ్లై, కారైకూడి సోదరులు మొదలైన మహామహుల సంగీత కచేరీలు హాజరయ్యారు.  గురువులు లక్ష్మణ రావు గారి ప్రోత్సాహంతో ఆయన ద్వారం వేంకటస్వామి నాయుడు గారి వద్ద శిష్యరికానికి చేరారు. 1932లో ఇంటర్మీడియేట్ తరువాత విజయనగరంలో ద్వారం వారి ఇంట్లోనే ఒక గదిలో ఉంటూ ఆయన దగ్గర రాగాలాపన నేర్చుకొని తన సంగీత ప్రావీణ్యాన్ని వృద్ధి చేసుకున్నారు.

ముసిరి సుబ్రహ్మణ్య అయ్యరు గారి గాత్ర ధర్మంలో సాహితీ విన్యాసం పినాకపాణి గారిని ఎంతో ఆకట్టుకుంది. దానిని వెంటనే ఆకళింపు చేసుకొని తన స్నేహితుడైన డొక్కా శ్రీరామమూర్తితో కలసి వెంటనే గానం చేశారు. అలాగే మొదటి రెండవ కాలాలలో ఎలా పాడాలో కూడా ముసిరి గారి గాత్రం విని నేర్చుకున్నారు. చెంబై వైద్యనాథ భాగవతార్ గారిని గమనించి నాలుగు కాలాలున్న పల్లవిని ఆరంభించటంలోని మెళకువలను నేర్చుకున్నారు. చెన్నైలోని ఎగ్మోర్‌లో వీణ ధనమ్మాళ్ గరి కచేరీ ఆయనపై ఎంతో ప్రభావం చూపింది. అరైకూడి గారి వద్ద గమనించిన రాగ భావాన్ని ఆయన ద్వారం వారి వద్ద పాడినప్పుడు "నువ్వు చాల వృద్ధిలోకి వస్తావు" అని ఆశీర్వదించారట.

విశాఖపట్టణంలో ఎంబీబీఎస్‌లో చేరిన తరువాత అక్కడ తన రూంమేట్‌తో కలసి ఉదయం నాలుగు గంటలకు లేచి అక్కడ వరండాలలో, బీచిలో పినాకపాణి తీవ్ర సాధన చేశారు. 1939లో ఆయన ఎంబీబీఎస్ డిగ్రీ పూర్తి చేశారు. తొలి పూర్తి స్థాయి కచేరీని ఒక లెక్చరర్ గారి ప్రోత్సాహంతో విశాఖపట్టణంలో ఏర్పాటు చేయగా ఆ కచేరీకి ప్రఖ్యాత వయోలిన్ విద్వాంసులు మైసూరు చౌడయ్య గారు హాజరై ఎంతో అభినందించారు. ఆయన ఆహ్వానంతో పినాకపాణి గారు మైసూర్ వెళ్లారు. చౌడయ్య గారింట్లోనే పేయింగ్ గెస్టుగా ఉంటూ సంగీత సాధన చేశారు. అంతటి విద్వాంసులైన చౌడయ్య గారు పినాకపాణి గారికి సాధనలో వయోలిన్ సహకారం అందించేవారు. ఆయనకు పినాకపాణి గారి గాత్రశైలి ఎంతో నచ్చేది. చెన్నైలో స్థిరపడిన ఒక తెలుగు కుటుంబానికి చెందిన ఇద్దరు అమ్మాయిలు ఒకసారి చౌడయ్య గారింటికి స్థానిక సభలలో పాడే అవకాశాల కోసం వచ్చారు. వారిలో ఒకరైన బాలాంబను పినాకపాణి గారు 1940లో వివాహం చేసుకున్నారు. 1945వ సంవత్సరంలో ఆయన ఎం.డి డిగ్రీలో పట్టభద్రులై డాక్టర్ పినాకపాణిగా పిలువబడ్డారు. విశాఖపట్టణంలో తనను అసిస్టెంటు సర్జన్‌గా ధృవీకరించకపోవటంతో రాజీనామా  చేసి రాజమండ్రి వెళ్లారు. నూకల చినసత్యనారాయణ గారు ఆయన మొదటి శిష్యులు. తరువాత రాజమండ్రిలో నేదునూరి కృష్ణమూర్తి గారు ఆయన శిష్యునిగా చేరారు. తిరిగి 1951లో వైజాగ్ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ సర్జంగా నియమించబడ్డారు. 1954లో సివిల్ సర్జన్‌గా పదోన్నతి పొందారు. 1957లో కర్నూలుకు బదిలీ చేయబడ్డారు. ఆయన అక్కడే 1968లో పదవీ విరమణ చేశారు. తన మెడికల్ కెరీర్ మొత్తంలో ఆయన కచేరీలు చేస్తునే ఉన్నారు. 1938 నుండి 2001 వరకు ఆకాశవాణిలో ఏ -గ్రేడ్  కళాకారుడిగా కచేరీలు ఇచ్చారు. చెన్నైలో ఉన్నప్పుడు శ్రీపాద వారికి ప్రముఖ వయోలిన్ విద్వాంసులు రంగరామానుజ అయ్యరు గారితో సాన్నిహిత్యం ఏర్పడింది. వారి ప్రభావం పినాకపాణి గారి సంగీతంపై ఎంతో కనబడింది. చెన్నైలోని ఇతర ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసులు పినాకపాణి గారి ప్రతిభను ఎంతో ప్రశంసించారు.

ఆయన సంగీతం స్వచ్ఛతకు, శాస్త్రీయతకు, గమకాలలో సౌందర్యానికి నిలువుటద్దం. సంగీతం త్రయం యొక్క కీర్తనలను ఆయన అత్యంత భక్తి భావంతో ఆలపించేవారు. ఆయన ఆలాపనలలో ఎన్నో అలకారాలు, కొసమెరుగులు ఉండేవి. సాహిత్యంలో ఆయన కనబరచిన విన్యాసం అనుపమానం. రీతిగౌళ, సురటి వంటి కఠినమైన రాగాలలో కూడా ఆయన కనబరచిన మనోధర్మం అమోఘం. ఆయనకు శాస్త్రముపై ఉన్న పట్టు హిమాలయ శిఖరాలంత ఉన్నతమైనది. సంగీతం, వైద్యశాస్త్రంలో నైపుణ్యంతో పాటు అయన మంచి శరీర దారుఢ్యంపై దృష్టి కలిగి ఉందేవారు.

పినాకపాణి గారు ఎన్నో పుస్తకాలను రచించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో తన ఐదేళ్ల పరిశ్రమతో నాలుగు భాగాలలో "సంగీత సౌరభం" అనే పుస్తకాన్ని రచించి ప్రచురించారు. దీనిలో వేయికి పైగా కృతులకు స్వరాలు ఉన్నాయి. ఇది తరువాతి కళాకారులకు కర్ణాటక సంగీత శిక్షణలో నిఘంటువైంది.  మనోధర్మ సంగీతం అనే పుస్తకాన్ని రచించి ఆయన భావి కళాకారులకు స్వంత మనోధర్మాన్ని ఎలా అరచుకోవాలో తెలిపారు. ఈ పుస్తకం తెలుగు విశ్వవిద్యాలయంలో పాఠ్యాంశమయ్యింది. 160కి పైగా పల్లవులకు స్వరస్థానాలు మొదలగు వివరాలతో పల్లవి గాన సుధ అనే పుస్తకాన్ని రచించారు. మేళ రాగమాలిక అనే పుస్తకంలో 72 మేళకర్త రాగాల గురించి అద్భుతమైన వివరాలు పొందుపరచారు. ఆరు వర్ణాలను, 108 అన్నమాచార్య కీర్తనలను స్వరపరచారు. ఆయన సంగీత సేవలకు గుర్తింపుగా సంగీత కళానిధి, కలైశిఖామణి బిరుదులు, 1966లో ఆంద్రప్రదేశ్ సంగీత నాటక అకాడెమీ అవార్డు, 1973లో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆస్థాన విద్వాన్ గుర్తింపు, 1974లో తి.తి.దే వారి సప్తగిరి సంగీత విద్వన్మణి బిరుదు,ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం వారి కళాప్రపూర్ణ బిరుదు, 1977లో జాతీయ సంగీత నాటక అకాడెమీ అవార్డు,  1982లో ఆంధ్ర ప్రదేశ్ సంగీత అకాడెమీ ఫెలోషిప్, 1984లో పద్మభూషణ్ అవార్డు, 2008లో కళాసాగరం అవార్డు, 2012లో చెన్నై త్యాగబ్రహ్మ గాన సభనుండి జీవితసాఫల్య పురస్కారాలు వచ్చాయి. 80 ఏళ్ల వయసుపైబడిన తరువాత కూడా ఆయన రోజుకు నాలుగైదు గంటలు శిష్యులకు నేర్పే వారు. వోలేటి వేంకటేశ్వర్లు గారు "గురువు గారు సంగీతంలో ఆయన దైవం" అన్నారు. ఇంతమంది పేరుపొందిన శిష్యులున్నా ఆయనలో ఉన్న వినయం ఆయన వ్యక్తిత్వానికి ప్రతిబింబం.

దాదాపు వంద ఏళ్ల వయసు వృద్ధాప్యం వలన మంచం పాలైనా కూడా ఆయన పాడి శిష్యుల చేత సాధన చేయించే వారు. 2004లో ఐసీయూలో ఉన్నా కూడా శిష్యులచేత సాధన చేయించారు. అటువంటిది ఆయనకు సంగీతంపై గల ధ్యానం. ఏనాడూ మంచంపై పడుకొని ఉన్నా ఆయన గళంలో శుద్ధి, సంగీతంపై పట్టు ఏమాత్రం తగ్గలేదు. ఇరవై నాలుగు గంటలూ సంగీతమే ఆయనకు ధ్యాస. సుదీర్ఘమైన సంగీత జీవితం తరువాత, తన నూరవ యేట పరిపూర్ణమైన జీవితం గడిపి 11 మార్చి 2013 నాడు ఆయన కర్నూలులో పరమపదించారు. ఆయన శిష్య పరంపర దినదిన ప్రవర్ధమానమై వారు కూడా పద్మభూషణ్, సంగీత కళానిధి వంటి పురస్కారాలు అందుకున్నారు. వారిలో అనుభవజ్ఞులు  తితిదే వారి ఆస్థాన విద్వాన్ వంటి పదవులను అలంకరిస్తున్నారు. ఆ శిష్య పరంపరలో పినాకపాణి గారి సంగీత ఝరి సురగంగలా ప్రవహిస్తూనే ఉంది. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.  

1, జూన్ 2016, బుధవారం

స్వర రాగ గంగాలహరి - ఎం ఎల్ వసంతకుమారి



కర్ణాటక సంగీత త్రయమైన త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి 18వ శతాబ్దంలో ఈ శాస్త్రీయ సంగీతానికి పునాదులు వేస్తే దాన్ని 20వ శతాబ్దంలో ముందుకు తీసుకువెళ్ళిన త్రయం డీకే పట్టమ్మాళ్, ఎమ్మెస్ సుబ్బులక్ష్మి మరియు ఎంఎల్ వసంతకుమారి. వైవిధ్య భరితమైన గాత్రశైలులలో ఈ ముగ్గురు మహిళామణులు నవీన కర్ణాటక పరంపరకు మూలస్థంభాలైనారు. వీరిలో పిన్నవారైన వసంతకుమారి గారు రాగాలాపనలో వైవిధ్యంతో దశాబ్దాలపాటు కర్ణాటక సంగీత సామ్రాజ్యంలో ధృవతారగా ప్రకాశించారు. మద్రాస్ లలితాంగి వసంతకుమారి, అదే, ఎం.ఎల్. వసంతకుమారి గారి పేరు వినగానే మధురమైన స్వరం, శృతిపక్వమైన గానం, పెద్ద బొట్టు, పట్టు చీర, నిండైన రూపం స్ఫురణకు వస్తాయి.  కర్ణాటక మరియు సినీ సంగీత సామ్రాజ్యంలో ఉన్నత స్థానాన్ని సంపాదించి ఎంతో కీర్తిప్రతిష్ఠలు పొందిన ఈ తల్లి వివరాలు తెలుసుకుందాం.

1928 జులై 3వ తేదీన కూతనూర్ అయ్యసామి అయ్యరు, లలితాంగి దంపతులకు చెన్నైలో వసంతకుమారి జన్మించారు. తల్లిదండ్రులిద్దరూ సంగీత కళాకారులే. చిన్ననాడే రాగాలు పలికించినా తల్లిదండ్రులు ఆమె బాగా చదివి డాక్టర్ కావాలని కోరుకున్నారు. కోయంబత్తూర్ తాయి, ఫ్లూట్ సుబ్బారావు, వీణ ధనమ్మాళ్ వద్ద వసంతకుమారి సంగీతం నేర్చుకున్నారు. తల్లితో కచేరీలకు వెళ్లే వసంతకుమారి అమ్మ రాగాలను ఏ విధంగా ఆలపించేదో బాగా నిశితంగా పరిశీలించి నేర్చుకునేవారు. వసంతకుమారి 1940లో సిమ్లాలో తల్లితో కలిసి తొలి కచేరీ ఇచ్చారు. 1941లో తల్లి అనారోగ్యంతో పాడలేకపోవటంతో తాను ఆమె బదులు బెంగుళూరులోని కచేరీలో పాడవలసి వచ్చింది. ఒకసారి కర్ణాటక సంగీతంలో మహావిద్వాంసుడైన జీఎన్ బాలసుబ్రహ్మణ్యం ఆమె గాత్రం విన్నారు. ఆమె గొంతులోని స్వచ్ఛతను గమనించి జీఎన్‌బీ ఆమె తల్లిదండ్రులను అభ్యర్థించి వసంతకుమారిని తన శిష్యురాలిగా చేర్చుకున్నారు. వసంతకుమారి జీఎన్‌బీ తొలి శిష్యురాలు. జీఎన్‌బీ వద్ద మనోధర్మాన్ని చక్కగా నేర్చుకున్న ఎమ్మెల్వీ తరువాతి కాలంలో తన గురువుల వైశిష్ట్యాన్ని ఎంతో పవిత్రంగా పరంపరలో కొనసాగించారు. గురువులాగే తాను కూడా ఉద్వేగాలకు అతీతంగా ప్రశాంతంగా, నిదానంగా రాగాలాపన సశాస్త్రీయంగా చేసేవారు. అందుకే ఎమ్మెల్వీ తదుపరి కాలంలో చాలా ప్రాచుర్యం పొందారు. ఎమ్మెల్వీ కర్ణాటక శాస్త్రీయ సంగీతమే కాకుండా హిందూస్థానీలో కూడా ప్రావీణ్యం సంపాదించుకున్నారు.

గురువుల జీఎన్‌బీ శిక్షణలో ఆమె రాగాలాపన సశాస్త్రీయంగా మనోధర్మం ప్రకారం నేర్చుకున్నారు. మనోధర్మంపై పట్టు మరియు హిందూస్థానీ సంగీతం పరిజ్ఞానంతో ఆమె క్లిష్టమైన రాగాల ఆలాపన మరియు స్వరకల్పనను విభిన్నమైన శృతిభేదంతో రంగరించేవారు. మహనీయుల కృతులను ఆలపించేటప్పుడు ఒక రాగం నుండి ఇంకో రాగంలోకి వెళ్లేటప్పుడు తన గాత్రంలో తారమంద్రాతి భేదాలను అద్భుతంగా పండించేవారు. తన సృజనాత్మకతను షణ్ముఖప్రియ-శంకరాభరణం, భైరవి-ఖమాస్, అభోగి-వలజి రాగాల మధ్య మార్పులో సునాయాసంగా, అద్భుతంగా కనబరచే వారు. ఆమె హంసధ్వని రాగాలాపన ఎందరో హిందూస్థానీ సంగీత విద్వాంసులకు ప్రమాణమైంది.

1951వ సంవత్సరంలో ఎం.ఎల్.వసంతకుమారి వివాహం ఆర్. కృష్ణమూర్తితో జరిగింది. వారికి శ్రీవిద్య మరియు శంకరరామన్ అని ఇద్దరు పిల్లలు పుట్టారు. ఈ అమ్మాయే ప్రఖ్యాత చలనచిత్ర నటి శ్రీవిద్య. ఎంఎల్‌వీ చిన్న వయసునుండే శ్రీవిద్యకు సంగీతం, నాట్యం నేర్పించారు. భర్త వ్యాపారంలో దెబ్బతినటంతో కుటుంబం నడవటానికి రాత్రి కచేరీలు చేశారు. ఆమెకు సంగీతంలో ఉన్న బహుముఖ ప్రజ్ఞ వలన ఆమెకు చలన చిత్రాల్లో పాడే అవకాశం వచ్చింది. సినీరంగంలో అన్ని దక్షిణాది భాషల్లో ఆమె అద్భుతమైన గీతాలు ఆలపించారు. ఆమె సంగీతానికి ముగ్ధులైన ప్రముఖ హిందీ కథానాయకుడు రాజ్ కపూర్ 1956లో విడుదలైన చోరీ చోరీ చిత్రంలో ఆమె పాడిన ఒక తిల్లానాను పొందుపరచారు. తెలుగు చిత్రాల్లో ఆవిడ పాటిన హిట్ పాటలు - నాగుల చవితి చిత్రంలో "ఓం నమో నమో నటరాజ నమో","నటరాజు తలదాల్చు నాగదేవా", మాయాబజార్ చిత్రంలో "శ్రీకరులు దేవతలు", భూకైలాస్ చిత్రంలో "మున్నీట పవళించు నాగశయనా", భలే అమ్మాయిలు చిత్రంలో "గోపాల జాగేలరా", జయభేరి చిత్రంలో "నీవెంత నెరజాణవౌరా", బీదలపాట్లు చిత్రంలో "సరసకు రాడేలనే", కాళహస్తి మహాత్మ్యం చిత్రంలో "చాలు చాలు నవమోహనా", "చూచి చూచి" మొదలైన పాటలను అద్భుతంగా అలపించారు. ఈ చలనచిత్ర గీతాలు చాలామటుకు శాస్త్రీయ సంగీత నేపథ్యం కలవి లేదా శాస్త్రీయ నృత్యాంశాలపైనే. 1946లో ప్రారంభమైన ఆమె సినీ నేపథ్య గాత్ర ప్రస్థానం 1965 వరకు కొనసాగింది. ఈ సమయంలో ఆమె దాదాపుగా 100 చిత్రాల్లో పాడాఅరు. అత్యధికంగా తమిళ్, మలయాళం, తెలుగు భాషలలో దాదాపు ఇరవై ఏళ్లు శాస్త్రీయ సంగీత ప్రధానమైన పాటలను ఎందరో గొప్ప గొప్ప సంగీత దర్శకులు కూర్చగా అద్భుతంగా పాడారు.1948లో విడుదలైన కృష్ణభక్తి అనే తమిళ చలనచిత్రంలో త్యాగరాజ స్వామి వారి "ఎంత వేడుకొందు ఓ రాఘవా" అనే కృతిని పాడే కళాకరిణిగా నటించి నేపథ్య గానం అందించారు.

1965 తరువాత ఎం.ఎల్.వీ పూర్తిగా శాస్త్రీయ సంగీతంపైనే దృష్టి సారించారు. కుమార్తె యుక్తవయసులో ఉన్నప్పుడు ఆమె నృత్య కార్యక్రమాలలో గాత్రసహకారం ఎం.ఎల్ అందించేవారు. అదే పంథాలో ముందుకు వెళ్లి ఎం.ఎల్ భరతనాట్యానికి సంబంధించిన కృతుల ఆల్బం కూడా విడుదల చేశారు. తల్లి లలితాంగి వారసత్వంగా ఎం.ఎల్ పురందరదాసు కృతులపై పరిశోధన చేశారు. ఎన్నో దేవర్‌నామాలను ప్రాచుర్యంలోకి తెచ్చారు. ప్రఖ్యాత హిందూస్థానీ సంగీత విద్వాంసులు బడే గులాం అలీ ఖాన్ గారి వద్ద మెళకువలు నేర్చుకొని హిందూస్థానీ బాణీలో సింధుభైరవి రాగాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చారు. తమ కులదైవమైన కుతనూర్ సరస్వతిని ఆమె కొలిచేవారు. వీలైనప్పుడల్లా తంజావూరులోని ఆ తల్లి దేవాలయాన్ని సందర్శించేవారు.కర్ణాటక సంగీత ప్రస్థానంలో ఎం.ఎల్. వసంతకుమారి నారాయణ తీర్థులవారి కృతులను కూడా ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చారు. ఆమె పాడిన "కళ్యాణ గోపాలం" అనే తీర్థుల వారి రచన సింధుభైరవి రాగంలో ఎంతో పేరుపొందింది. అలాగే ఆమె సింధుభైరవిలో "వేంకటాచల నిలయం" అనే పురందరదాసు కృతి కూడా ఎంతో ప్రచారంలోకి వచ్చింది.

రాగం-తానం-పల్లవి ప్రక్రియ ఎం.ఎల్. వసంతకుమారి గారి మరో ప్రత్యేకత. డీకే పట్టమ్మాళ్ గారు ప్రాచుర్యంలోకి తెచ్చిన ఈ సాంప్రదాయంపై ఎం.ఎల్.వి చేసిన పరిశోధన వలన తరువాతి తరాల కచేరీలలో ఒక ప్రమాణమైంది. వసంతకుమారి గారు అమృతవర్షిణి రాగంలో రాగం తానం పల్లవి పాడి తన ప్రజ్ఞను చాటారు. ఎం.ఎల్.వీ మరో ప్రత్యేకత ఆమె ఏ కచేరీకు ముందు కూడా సాధన చేసే వారు కాదు. ఈ విషయం ఆమె శిష్యురాలైన ప్రఖ్యాత సంగీత విదంవాసురాలు సుధా రఘునాథన్ గారు మరియు ఆమె గాత్రానికి వయోలిన్ సహకారం అందించిన ఏ కన్యాకుమారి గారు చెప్పారు. ఎం.ఎల్.వీ గానంలో విడుదలైన ఆల్బంలలో ప్రణమామ్యహం, పురందరదాస కృతులు, దేవీ కదంబమాల, భరతనాట్యం పాటలు, గోల్డెన్ గ్రేట్స్, గురు శిష్య పరంపర, స్వర సంగమం మరియు వసుధ (సుధా రఘునాథన్‌తో కలిసి పాడినవి), సునాద బృందావనం, వందిసువె గురురాఘవేంద్ర,వాతాపి గణపతిం భజేహం మొదలైనవి బాగా ప్రచారంలోకి వచ్చాయి. తిరుప్పావై పాశురాలను ఆమె పాడిన రీతి అద్భుతం. అందుకే ఆ సంపుటి బహుళ ప్రాచుర్యం పొందింది.

దూరదర్శన్, ఆకాశవాణిలలో ఎం.ఎల్.వీ దాదాపు మూడు దశాబ్దాలకు పైగా ఎమ్మెస్ సుబ్బులక్ష్మికి సాటిగా కచేరీలు చేశారు. సొగసు మరియు శాస్త్రీయత కలబోసి ప్రేక్షకులను, శ్రోతలను మంత్రముగ్ధులను చేసిన అసమాన ప్రతిభామూర్తి ఎం.ఎల్. వసంతకుమారి. సంగీతం శ్రోతల హృదయాలను తాకాలన్నది ఆమె సిద్ధాంతం. ఆమె శిష్య పరంపరలో సరస్వతీ శ్రీనివాసన్, సుధా రఘునాథన్, త్రిసూర్ రామచంద్రన్, ఆయన సతీమణి చారుమతీ రామచంద్రన్, ఏ కన్యాకుమారి, యోగం సంతానం, వనజా నారాయణన్, మీనా సుబ్రహ్మణ్యం, టీ.ఎం.ప్రభావతి, జయంతి శ్రీధరన్, జయంతి మోహన్ మొదలైన ప్రఖ్యాత సంగీత కళాకారులు ఉన్నారు. ప్రేమ, వాత్సల్యం, క్రమశిక్షణ కలబోసి తన శిష్యులకు శిక్షణ ఇచ్చారు. వారి వారి సామర్థ్యాలను బట్టి శిష్యులకు సముచితమైన శిక్షణ ఇచ్చారు. అత్యున్నమైన విలువలతో ఆమె తన జీవనాన్ని, శిష్య సంబంధాలాను సాగించారు.

1967వ సంవత్సరంలో ఆమె ప్రతిభకు గుర్తింపుగా భారత ప్రభుత్వం వారు దేశంలో మూడవ అత్యున్నత పురస్కారం పద్మ భూషణ్ ఇచ్చి గౌరవించారు. 1970వ సంవత్సరంలో ఆమెకు కేంద్ర ప్రభుత్వం వారి సంగీత నాటక అకాడెమీ అవార్డు వచ్చింది. పురందరదాసు కృతుల ప్రచారానికి ఆమె చేసిన పరిశోధనకు, సేవకు గుర్తింపుగా 1976వ సంవత్సరంలో మైసూర్ విశ్వవిద్యాలయం వారు ఆమెకు డాక్టరేట్ పట్టా ఇచ్చి గౌరవించారు. 1977లో 49 ఏళ్ల వయసులోనే సంగీత కళానిధి బిరుదు పొందిన ఘనత ఆమెకు దక్కింది.

దాదాపు నలభై ఐదేళ్ల సుదీర్ఘ సినీ కర్ణాటక సంగీత ప్రస్థానంలో శిఖర స్థాయికి చేరుకొని ఎంతో గౌరవాన్ని, మన్ననలను పొందిన ఎం.ఎల్ వసంతకుమారి గారు 1991లో 63 ఏళ్ల వయసులో కామెర్ల వ్యాధికి గురై మరణించారు. ఆమె శిష్యులు కూడా పద్మభూషణ్, పద్మశ్రీ, సంగీత కళానిధి వంటి పురస్కారాలు, బిరుదులు పొందే స్థాయికి ఎదిగి ఆమె మహోన్నత సంగీత వారసత్వ వైభవాన్ని కొనసాగిస్తున్నారు. ఎందరొ మహానుభావులు అందరికీ వందనాలు.

ఆమె ఆలపించిన కృతులలో సింధుభైరవి రాగంలో పురందరదాసుల వారి వేంకటాచల నిలయం వినండి. చలన చిత్ర గీతాలలో భూకైలాస్ చిత్రంలోని దశావతార గీతం "మున్నీట పవళించు నాగశయనా" కమలా కుమారి నాట్యం చేయగా చూడండి