శ్రీ దక్షిణాముర్తే విదళిత దాసార్తే చిదానంద పూర్తే సదా మౌన కీర్తే
అక్షయ సువర్ణ వటవృక్ష మూలస్థితే రక్ష మాం సనకాది రాజ యోగి స్తుతే
రక్షిత సద్భక్తే శిక్షిత దుర్యుక్తే అక్షరానురక్తే అవిద్యా విరక్తే
నిఖిల సంశయ హరణ నిపుణతర యుక్తే నిర్వికల్పసమాధి నిద్రా ప్రసక్తే
అఖండైక రస పూర్ణారూఢ శక్తే అపరోక్ష నిత్య బోధానంద ముక్తే
సుఖతర ప్రవృత్తే స్వాజ్ఞాన నివృత్తే స్వగురుగుహోత్పత్తే స్వానుభవ తృప్తే
భావం:
దాసుల ఆర్తిని దూరం చేసే ఓ దక్షిణామూర్తి! నీవు చిదానందంలో యుండేవాడవు, నిరంతరం మౌనంలో ఉండుటచే కీర్తించబడిన వాడవు, నన్ను రక్షింపుము.
అక్షయమైన బంగారు వటవృక్ష మూలములో స్థితుడైయున్నవాడవు, సనకాది రాజయోగులచే స్తుతించబడిన వాడవు, దుష్ట శక్తులను శిక్షించి సద్భక్తులను రక్షించే వాడవు, జ్ఞానానురక్తుడవై అజ్ఞానమందు విరక్తుడవు, నన్ను రక్షింపుము.
సమస్త సంశయములను తొలగించే నేర్పరివి, నిర్వికల్ప సమాధియందు మగ్నుడవై యుండెదవు, చిదానందామృత రసారూఢుడవై అనన్యము మరియు అఖండమైన శక్తిని కలిగిన వాడవు, స్వానుభవముతో జ్ఞానము కలిగే నిత్య బోధలు చేసి ముక్తిని కలిగించే వాడవు, నిత్యానంద ప్రవృత్తి కలవాడవు, నా అజ్ఞానమును తొల్గించేవాడవు, గురుగుహుని సృష్టించినవాడవు, స్వానుభవమున తృప్తిని బోధించే పరమ గురువువు, నన్ను రక్షింపుము.
(నిర్వికల్ప సమాధి యనగా జ్ఞాత-జ్ఞేయం, ద్రష్ట-దృశ్యం, ప్రమాత-ప్రమేయం అనే విభాగాలేవిూ లేకుండా ప్రత్యగభిన్న పరబ్రహ్మం విషయంగా కలిగి అఖండాకారమై, విశేష్య, విశేషణతా సంబంధ రహితమును, అద్వితీయమును అయి ప్రకాశించే జ్ఞాన స్థితి అని పొత్తూరి వేంకటేశ్వరరావు గారి పారమార్థిక పదకోశం నిర్వచించింది. ఆ స్థితిని వర్ణించటానికి అక్షరాలు చాలవు కానీ ఇంత చక్కని భావాన్ని అందజేసిన బ్రహ్మశ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు గారికి పాదాభివందనాలు. వారి జ్ఞానం అపారం, అంతే వినయ సంపన్నులు కూడా)
ధీర శంకరాభరణ రాగంలోని ఈ దీక్షితుల వారి కృతిని సంగీత కళానిధి ఆర్. వేదవల్లి గారు ఆలపించారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి