ఆడవారు యమునా కాడ కృష్ణుని కూడి ఆడుచు పాడుచునందురు జూడగ
భావం:
ఓ వనితలారా, ఈ రోజు యమునా నదిలో గోపికలు కృష్ణునితో కలిసి ఆనందంగా ఆటలాడుతూ, పాటలు పాడుతూ నౌకను నడిపిస్తున్న ఆ మనోహర దృశ్యాన్ని చూడండి. వారిలో కొందరు హరి కీర్తనలను గానం చేస్తున్నారు, కొందరు పరమానందంతో కృష్ణునితో ముద్దులాడుతున్నారు, కొందరు తమ నౌకాయానం క్షేమంగా సాగాలని యమునాదేవిని ప్రార్థిస్తున్నారు, మరి కొందరి ముత్యాల హారాలు ఊగుతూ మెరుస్తున్నాయి. ఆ ఉల్లాసక్రీడలో కొందరి అడుగులు తడబడగా, వారి పాలిండ్లు కదులుతున్నాయి, కొందరి బంగారు కట్టువస్త్రాలు సడలుతున్నాయి. కొందరి వంకరైన ముందటి కురులు అల్లలాడుతున్నాయి, ఇంకొందరు కృష్ణుని లీలలను పరస్పరం ముచ్చటించుకుంటున్నారు. కొందరు “ఇతడు శివునికి సఖుడు” అని పలుకుతున్నారు, కొందరి నుదుటి కస్తూరిబొట్టు చెమటతో కరిగిపోతోంది, కొందరి కొప్పులలో అలంకరించిన పూలు జారిపడుతున్నాయి, కొందరి కంకణాలు ఘల్లుఘల్లున మ్రోగుతున్నాయి.
త్యాగరాజస్వామి రచించిన నౌకా చరిత్రములోని మరొక అద్భుతమైన కృతి ఇది. శ్రీకృష్ణుని సహవాస భాగ్యం వల్ల బ్రహ్మానందం పొందుతూ అనేకానేక భావనలతో ఉత్సాహంగా గోపికలు ఓడను నడుపుతున్న మనోహర దృశ్యాన్ని దివ్య శృంగార కీర్తనగా ఆవిష్కరించారు త్యాగరాజస్వామి. సారంగ రాగంలో స్వరపరచబడిన ఈ త్యాగరాజస్వామిని మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఈ కృతిని ఆలపించారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి