13, సెప్టెంబర్ 2026, ఆదివారం

చలమేలరా సాకేత రామా! - త్యాగరాజస్వామి కృతి


చలమేలరా సాకేత రామా!

వలచి భక్తి మార్గముతోను నిన్ను వర్ణించుచున్న నాపై 

ఎందుబోదు నేనేమి సేయుదును ఎచ్చోట నే మొర బెట్టుదును
దందనలతో ప్రొద్దుపోవలెనా తాళజాలరా త్యాగరాజనుత

ఓ సాకేత రామా! నిన్నే ప్రేమించి భక్తిమార్గములో వర్ణించుచున్న నాపై కరుణ చూపుటకు ఆలస్యమెందుకు చేయుచున్నావు? నేనెక్కడికి పోయెదను? ఏమి చేసెదను? ఎక్కడ మొరపెట్టుకొందును? నా జీవితమంతా అనవసరమైన విషయములలోనే వృథాగా గడచిపోవలసిందేనా? నేనింక తాళలేను రామా! ఆలస్యము లేకుండా నన్ను కాపాడుము. 

ఈ కృతిలో త్యాగరాజస్వామి భక్తి కేవలం స్తోత్రమో, సంగీతారాధనో కాదని స్పష్టమవుతుంది. ఆయనది రామునిపై సంపూర్ణ ఆధారపడిన జీవన మానక్సిక స్థితి. “వలచి భక్తి మార్గముతోను వర్ణించుచున్న నాపై” అనే భావంలో, ప్రేమతో రామనామాన్ని గానము చేస్తున్న భక్తుని అంతరంగవేదన ఉంది. అయినా ప్రభువు కరుణ ప్రత్యక్షం కావడంలో ఆలస్యం ఎందుకని ప్రశ్నించడం ద్వారా భక్తుని ఆర్తి మరింత గాఢమవుతుంది. ఇది సందేహం కాదు. తనకు హితుడు, రక్షకుడైన శ్రీరామచంద్రమూర్తికి తన బాధ చెప్పుకొనే హక్కుతో చేసిన వినతి. 

“నేనేమి సేయుదును, ఎచ్చోట నే మొర బెట్టుదును” అన్న ప్రశ్నలు అనన్యశరణాగతికి చిహ్నాలు. రాముడిని తప్ప వేరే ఆశ్రయం లేదని తెలిసిన భక్తుడు, తన రోజులు వ్యర్థవిషయాలలో గడవకముందే కాపాడమని వేడుకుంటున్నాడు. “తాళజాలరా”లోని అసహనము భౌతిక దుఃఖం వల్ల మాత్రమే కాదు. దైవసాన్నిధ్యం లేక గడిచే క్షణం కూడా భక్తునికి భారమనే విరహభావం. అందువల్ల ఈ కృతి కరుణ కోసం చేసే ప్రార్థనగా, భక్తి మార్గంలో నిలకడగా ఉన్న హృదయపు విన్నపంగానే నిలుస్తుంది. 

మార్గహిందోళ రాగంలో కూర్చబడిన ఈ కృతిని ప్రియా సిస్టర్స్ హరిప్రియ-షణ్ముఖప్రియ ఆలపించారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

వినాయక వ్రతకల్పం — ఆధ్యాత్మిక అంతరార్థం

వినాయక వ్రతకల్పం మనసును శుద్ధి చేసి, వివేకంతో జీవించమని నేర్పే ఆధ్యాత్మిక సాధన. ఏ పూజలోనైనా ఆచమనం శరీర–మనస్సుల శుద్ధికి సంకేతం. ప్రాణాయామం చ...