కళావతీ కమలాసన యువతీ!
కళ్యాణం కలయతు సరస్వతీ!!
బలాబల మంత్రార్ణ రూపిణీ! భారతీ! మాతృకా శరీరిణీ!
మలాళి విదారిణీ! వాగ్వాణీ! మధుకర వేణీ! వీణాపాణీ!
శరజ్జ్యోత్స్నా శుభ్రాకార! శశివదనా! కాశ్మీర విహారా! వరా
శారదా! పరా!అంకుశధరా! వరదాభయ పాశ పుస్తకకరా!
సురార్చిత పదాంబుజ శోభనా! శ్వేత పంకజాసన! సురదనా!
పురారి గురు గుహ హృదయ రంజనీ! మురారి స్నుషా! నిరంజనీ!
సమస్త కళలకు దేవత, కమలముపై స్థితమై యున్న సరస్వతీ దేవి మనకు శుభము కలిగించు గాక! బల, అబల మొదలైన మంత్రసాగరములకు రూపము, భారతి, అక్షర రూపిణి, కాటుక కొండల వంటి పాపములను తొలగించే తల్లి, వాక్దేవత రూపమైన వాణియైన, తుమ్మెదల సమూహము వంటి కురులు కలిగి చేతిలో వీణ యున్న సరస్వతీదేవి మనకు శుభము కలిగించు గాక! శరదృతువులోని చంద్రుని వెన్నెల వలె ప్రకాశిస్తూ, చంద్రుని వంటి ముఖము కలిగి, కాశ్మీర దేశంలో విహరించే, వరములనొసగే శారదయైన, పరదేవతయై, అంకుశమును ధరించి, వరమునిచ్చే అభయ హస్తముతో, పాశము, పుస్తకము చేతిలో కలిగిన, దేవతలు కలువల వంటి పాదములతో శోభిల్లే, తెల్లని కమలముపై స్థితమైయున్న, చక్కని పలువరుస కలిగిన, పరమశివుడు, కుమారస్వామి మొదలైన వారి హృదయములను రంజిల్ల జేసే, శ్రీమహావిష్ణువు కోడలైన, నిర్మలయైన సరస్వతీదేవి మనకు శుభము కలిగించు గాక!

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి