2, సెప్టెంబర్ 2026, బుధవారం

కృష్ణా! నీ పేరు తలచినా చాలు (ఏకవీర చిత్రం - 1969)

ఒక్క నారాయణరెడ్డి గారికే చెల్లు ఇటువంటి సాహిత్యం. గోపిక మనసులో కృష్ణుని పట్ల ఉండే మధురభక్తిని అణువణువునా అక్షరాలలో పొందుపరచారు, గోపస్త్రీల మానసిక స్థితికి ప్రాణప్రతిష్ఠ చేశారు. ఏకవీర నవల కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి రచన. ఈ కథ ఆధారంగా 1969లో విడుదలైన ఏకవీర చిత్రంలో కూడా సముచితమైన సందర్భంలో ఈ గీతాన్ని ఆవిష్కరించారు దర్శకులు చిత్తజల్లు శ్రీనివాసరావు గారు. రాజేశ్వరరావు గారి అద్భుత సంగీతం, సుశీలమ్మ భావపూరితమైన మధురగానం, బాలసుబ్రహ్మణ్యం గారి సహగాత్రం ఈ గీతాన్ని శాశ్వతం చేశాయి. నారాయణరెడ్డి గారి సాహితీవైభవానికి ఈ గీతం ఒక గొప్ప ఉదాహరణ. సాహిత్యం, భావం. 

కృష్ణా! నీ పేరు తలచినా చాలు!
నీ పేరు తలచినా చాలు! మదిలో పొంగు శతకోటి యమునా తరంగాలు!
నీ పేరు తలచినా చాలు! మదిలో పొంగు శతకోటి యమునా తరంగాలు!
నీ పేరు తలచినా చాలు!

ఏమి మురళి అది ఏమి రవళిరా!
ఏమి మురళి అది ఏమి రవళిరా!పాట వినగా ప్రాణాలు కదలురా!
ఏమి మురళి అది ఏమి రవళిరా! పాట వినగా ప్రాణాలు కదలురా!
మురళీధరా నీ స్వరలహరులలో మరణమైన మధురమురా!
నీ పేరు తలచినా చాలు!

వెదురు పొదలలో తిరిగి తిరిగి నీ పదపల్లవములు కందిపోయెనో!
వెదురు పొదలలో తిరిగి తిరిగి నీ పదపల్లవములు కందిపోయెనో!
ఎదపానుపుపై పవళించరా నా పొదిగిన కౌగిట పులకించరా!

నీ పేరు తలచినా చాలు! మదిలో పొంగు శతకోటి యమునా తరంగాలు!
నీ పేరు తలచినా చాలు!

గోపాలా! నందబాలా! నవమంజుల మురళీలోలా!
మృదు సమీరకంపిత మనోజ్ఞకుంతల తమాలపల్లవజాల!
కృష్ణా నీ పేరు తలచినా చాలు!

ఏమి పిలుపు అది ఏమి పిలుపు! బృందానికుంజముల పూలు పూచి! శరదిందుచంద్రికల కేలు సాచి!
తరుణాంతరంగముల దాగి దాగి! చెలి అందెలందు చెలరేగి రేగి!
నను తొందరించెరా! తొలకరించెరా! తొందరించెరా! తొలకరించెరా!వలపు ఝల్లుగా పలుకరించెరా!
వల్లవీరమణి చల్లని ఉల్లము అల్లన ఝల్లన పరవశించెరా!

కృష్ణా! నీ పేరు తలచినా చాలు! 

భావం:

కృష్ణా! నీ పేరు తలచితేనే మనసుల్లో వందకోట్ల యమునా నది తరంగాలు పొంగి పొరలుతాయిరా! ఇది ఏమి మురళో దాని ధ్వని ఏమిటో, ఆ పాట వినగానే ప్రాణాలు కదలిపోతాయిరా!, మురళీధరా! నీ స్వరప్రవాహంలో మరణం కూడా మధురమేరా! వెదురు పొదలలో తిరిగి తిరిగి నీ లేత పాదములు కందిపోయాయేమో! నా హృదయమనే పానుపుపై పవళించి ఆ వెచ్చని కౌగిట నిదురించరా! ఓ గోపాలా! నందబాలా! గోపాలా! న! నందుని కుమారుడా! ఎప్పుడూ మధురంగా వేణువు వాయించడంలో మునిగిపోయినవాడా! మృదువైన గాలికి కదులుతున్న అందమైన కురులు, తమాల చెట్టు (మామిడాకులలా ఉండే చీకటిచెట్టు) కొత్త ఆకుల సమూహంలా ఉన్నవాడా! కృష్ణా నీ పేరు తలచినా చాలు! మనసులో వందకోట్ల యమునాతరంగాలు పొంగిపొరలుతాయిరా! నీది ఎంతటి అద్భుతమైన పిలుపు! బృందావనంలోని పొదరిండ్లలో పూలు వికసించి శరదృతువు చంద్రుని వెన్నెలలో క్రీడలకు వేదికను సిద్ధం చేసినట్టుగా ఉంది! యువ హృదయాల్లో దాగి దాగి, ప్రియురాలి పాదాల గజ్జెలలో ఉప్పొంగుతూ మోగుతోంది! ఆ పిలుపు నన్ను ఆతురపరుస్తోందిరా! నాపై తొలకరి జల్లులా కురుస్తోందిరా!  ప్రేమజల్లులా నన్ను పలకరిస్తోందిరా! గోపికలలో రత్నమైన ఆమె చల్లని మనసు ఆనందపు అలలతో పరవశించుతోందిరా!కృష్ణా నీ పేరు తలచినా చాలు! మనసులో వందకోట్ల యమునాతరంగాలు పొంగిపొరలుతాయిరా! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కృష్ణా! నీ పేరు తలచినా చాలు (ఏకవీర చిత్రం - 1969)

ఒక్క నారాయణరెడ్డి గారికే చెల్లు ఇటువంటి సాహిత్యం. గోపిక మనసులో కృష్ణుని పట్ల ఉండే మధురభక్తిని అణువణువునా అక్షరాలలో పొందుపరచారు, గోపస్త్రీల మ...