30, జులై 2010, శుక్రవారం

భారత రత్న, సంగీత కళానిధి సుబ్బులక్ష్మి

మన వృత్తిలోని విశేషాన్ని మన జీవనంలో అమలు పరచటం చాలా కష్టం. అలాగే మంచి జీవన శైలిని వృత్తిలో అనుకరించటం కూడా కష్టమే. బహు కొద్ది మంది తాము చేసే పనిలోని భావాన్ని తమ జీవితంలోని ప్రతి అడుగులో నిరూపించగలరు. సంగీతం అంటే కేవలం సప్త స్వరాలు, వాటిని అటు ఇటు తిప్పి పాడటం కాదు. ఒక వాగ్గీయకారుడు అనుభూతి పొంది ఆ వాగ్దేవి అనుగ్రహంతో రాసిన సుస్వర రస ప్రవాహాన్ని తన మానసిక, శారీరిక శుద్ధితో, నిర్మలమైన నవ్వుతో ఆ పరమాత్మను తలస్తూ, పొగడుతూ, ఆ అంతర్యామి లక్షణ వర్ణనలో లీనమై, ఒక్కొక్క అక్షరాన్ని మంత్రంలా భావించి తాదాత్మ్యం చెంది, శృతి, లయ బద్ధంగా పాడితే అది శాస్త్రీయ సంగీతం.

అంతర్యామిని దర్శిస్తూ పాడుతున్న సుబ్బులక్ష్మి

అలా పాడాలంటే - ఆలోచన, జీవన శైలి దానికి అనుగుణంగా ఉండాలి. అంటే, నిరాడంబరత, శాంతము, సహనము, ప్రేమ, భక్తి, బాహ్య/అంతః శుద్ధి, శరణాగతి, నిరపేక్షం లాంటి సుగుణాలు చాలా ఉండాలి. వీటికి తోడు గా కఠోర శ్రమతో, సద్గురువు వద్ద నేర్చుకున్న విద్య ఉంటే అది పంచమ శృతిలో ప్రౌఢ కోకిల పాడినట్టుగా శ్రావ్యంగా ఉంటుంది.

ప్రపంచంలో ఉన్న అన్ని మంచి లక్షణాలు ఒకే వ్యక్తిలో చూడాలని ఉందా?. అలా ఉంటే మరి వారికి ఆ సరస్వతి ఏమిటి?. ముల్లోకాలు వశమే. తన గానం, జీవనం, భక్తి, చిరునవ్వు, నిరాడంబరత, అందం, నిశ్చలమైన వ్యక్తిత్వము - ఇంక ఎన్నో ఎనో సుగుణాల రాశి ఆవిడ. మదురై షణ్ముఖవడివు సుబ్బులక్ష్మి (ఎం.ఎస్. సుబ్బులక్ష్మి). ఏమి చెప్పగలం ఆమె గానమాధుర్యం గురించి?. ఆ గానంలో ఉన్న భక్తి, శాస్త్రం గురించి?.

ఎన్ని సంపదలు, విద్యలు ఉన్నా స్వచ్చతను చిందించే సుబ్బులక్ష్మి

తెల్లవారకముందే దక్షిణ భారత దేశంలో లక్షలాది గుళ్లలో 'కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే' అని వినిపిస్తే అది ఆమె గొంతులో వెలువడిందే. 'భజ గోవిందం భజ గోవిందం' అని వినిపించే శ్రావ్యమైన గానం ఆమెదే. 'శుక్లాంబర ధరం విష్ణుం' తో మొదలయ్యి, 'విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభుః' అన్న వేయి నామాలతో అరగంటపాటు మీకు ఆ శ్రీ మహావిష్ణువుని స్తుతించే విష్ణు సహస్ర నామం ఆమె పాడిందే.  రేడియోలో, రికార్డుల్లో, వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఈమె గొంతు దక్షిణాదిన మారుమ్రోగుతూనే ఉంటుంది.

పొద్దునే లేచి ఏ చప్పుడూ లేకుండా, స్నానం చేసి, కుర్చీలో కూర్చొని ఆమె పాడిన 'భావయామి గోపాల బాలం' అన్న యమన్ కళ్యాణి రాగంలో అన్నమాచార్యుల కృతి వింటే భక్తి పారవశ్యం మనలో రాక మానదు. జో అచ్యుతానంద జో జో ముకుంద అని ఆ వెంకటేశ్వరునికి జోల ఆమె అంత లాలిత్యం, ప్రేమతో ఎవ్వరు పాడలేరు, పాడబోరు. 'డోలాయాం చల డోలాయాం' అనే కృతి పాడుతుంటే ఆ తిరుమలేశుడు నిజంగానే ఊయలలో ఊగుతూ మందహాసంతో ఈ సరస్వతిని ఆశేర్వదించిన ఉండవచ్చు. ఎం.ఎస్. 30 ఏళ్ల క్రిందట పాడిన పాట ఇది.  అలాగే, 'ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన'  అనే కీర్తనలోని  ఆధ్యాత్మిక తత్త్వాన్ని అద్భుతంగా వినిపించారు సుబ్బులక్ష్మి. తిరుమల స్వామి వారి ఆస్థాన గాయనిగా ఆవిడ అన్నమాచార్యుని కీర్తనలు చాలా ప్రాచుర్యంలోకి తెచ్చారు. ఒక సంగీతజ్ఞురాలిగా ఆమె అన్ని శిఖరాలను అధిరోహించి అక్కడే నిలిచిపోయింది. ఆవిడను దాటి వెళ్లే వారు ఇంత వరకు పుట్టలేదేమో.

శాస్త్రమంటే సుబ్బులక్ష్మే

సెప్టెంబర్ 16, 1916 న మదురై లో పుట్టింది సుబ్బులక్ష్మి. 13 ఏళ్ల  ప్రాయంలో కచేరీలు మొదలు పెట్టింది సుబ్బులక్ష్మి. అప్పటినుంచి తన భర్త మరణించేంతవరకు ఆరు దశాబ్దాలు భారత శాస్త్రీయ సంగీత సామ్రాజ్యాన్ని ఏలిన మహారాణి సుబ్బులక్ష్మి. నటిగా  హిందీ, తమిళ చితాల్లో తన ప్రతిభను చూపించింది ఆవిడ. మీరాబాయిగా ఆమె నటన, ఆమె పాడిన మీరా భజనలు ఆరు దశాబ్దాల తర్వాత కూడా ఇంకా ప్రజల మనస్సుల్లో ఉంది. పాత్రికేయుడైన సదాశివాన్ని పెళ్ళిచేసుకొని నిజమైన ధర్మపత్నిగా జీవించి, సహకరించింది. ఆ దంపతులు చేసిన సమాజ సేవ, దాన ధర్మాలు వారి నిర్మలత్వానికి ప్రతీక.

భారత దేశంలో అత్యున్నత పురస్కారం - భారత రత్న - పొందిన ఏకైక సంగీత కళాకారిణి ఆవిడ.  మెగసెసే, పద్మ విభూషణ్, పద్మశ్రీ, పద్మభూషణ్, సంగీత కళానిధి, కలైమామణి, తాన్సేన్ లాంటివి చెప్పక్కర్లేదు. ఐక్య రాజ్య సమితి జనరల్ అసెంబ్లీ, లండన్, ఫ్రాన్సు, మాస్కో లలో అంతర్జాతీయ స్థాయిలో చాలా గుర్తింపు పొందిన కచేరీలు ఎన్నో.

చెదరని అరవ కట్టులో దేవతలను గుర్తు చేసే రంగులో కంచి పట్టు చీర, సిగన తెల్లని మల్లెపూలు, నుదుట పెద్ద తిలకపు బొట్టు, ముక్కున మెరిసే రవ్వల పుడకలు, చెవులకు మెరిసే రవ్వల దిద్దులు,  మెడలో మెరిసే ఒక ఆభరణం, పెదవులపై మందాకినీ జలంలాంటి స్వచ్చమైన చిరునవ్వు, కళ్ళలో ఆ భగవంతుని చూస్తున్న చిదానందం, పారవశ్యం  - చేతిలో తంబురా పట్టి శ్రుతిలోఆవిడ పాడుతుంటే ఆ సరస్వతి మన కళ్ళ ఎదుట ఉన్నదా అనిపిస్తుంది. భారతీయ స్త్రీలో ఉండే అందం, అణకువ, సిగ్గు, భక్తి, మానసిక సౌందర్యం - వీటికి తోడు తమిళ సాంప్రదాయాన్ని పాటించే ఉత్తమ ఇల్లాలి లక్షణాలన్నీ ఉన్న మహా కళాకారిణి సుబ్బులక్ష్మి. ఏ భాషలో పాడినా ఆ భాష యొక్క సహజ లక్షణాలు పోకుండా, స్పష్టమైన ఉచ్చారణతో, భక్తితో అబ్బ ఎంత బాగుంది అని అనిపించేలా పాడారు ఆవిడ.

భక్తిలోతాదాత్మ్యం చెంది శ్రోతలను పారవశ్యంలో ముంచుతున్న సుబ్బులక్ష్మి

అప్పటి భారత ప్రధాని ఈవిడ గురించి మాట్లాడుతూ - "నేను ఈ దేశానికి మాత్రమే ప్రధానిని. సుబ్బులక్ష్మి అనంతమైన సంగీత సామ్రాజ్యానికి మహారాణి' అని అన్నారుట. మహాత్మా గాంధి ఈవిడ పాడే మీరా భజనల కోసం ఆవిడను పిలిపించుకునే వారుట.

డెబ్భై ఎనిమిదేళ్ళ వయసులో కంచి పరమాచార్యులు చంద్రశేఖర సరస్వతి మహాస్వామి సమక్షంలో ఆయన రచించిన 'మైత్రీం భజత' అని, ఆది శంకరులు రచించిన 'నాగేంద్ర హారాయ త్రిలోచనాయ' అని పాడి ఆయన ఆశీస్సులు, మన్ననలు పొందారు ఆవిడ. అంతకన్నా గొప్ప గౌరవం ఒక భారతీయ కళాకారుడి జీవితంలో ఉండదేమో.

ఎన్నో స్తోత్రాలకు ఆవిడ జీవం పోశారు - భజగోవిందం, అన్నపూర్ణాష్టకం,  నామ రామాయణం, హనుమాన్ చాలీసా, గోవిందాష్టకం, గణేశ పంచరత్నం, మీనాక్షీ స్తోత్రం, కనకధారా స్తోత్రం, రామనాధ స్తోత్రం, దుర్గా పంచరత్న స్తోత్రం, కాశీ విశ్వనాథ సుప్రభాతం, కామాక్షీ సుప్రభాతం, లక్ష్మీ అష్టోత్తరం - ఇలా దాదాపు ప్రతి మహిమాన్విత స్తోత్రం ఆమె గళంలో అమృతంగా మరి మనకు జాలువారింది. సామాన్యునికి తన గొంతును స్తోత్రాల రూపంలో అందించి శాశ్వతమైయ్యింది సుబ్బులక్ష్మి.  'అధరం మధురం, వదనం మధురం' అని మధురాష్టకం పాడుతుంటే ఆ శ్రీ కృష్ణుని మనోహరమైన రూపము మన కళ్ళ ఎదుట నిలుస్తుంది. న భూతో న భవిష్యతి అన్నట్టుగా పాడారు ఈ స్తోత్రాలన్నీ ఆవిడ.

నాయనమ్మ, అమ్మమ్మ అంటే ఇలా ఉండాలి అని అనిపించే వ్యక్తిత్వము, రూపము ఆమెది. పోటీ ప్రపంచమైన శాస్త్రీయ సంగీత ప్రపంచంలో శత్రువులు, విమర్శకులు లేకుండా అందరి చేత అమ్మ అని పిలిపించుకున్నారు ఆవిడ. ఆవిడ వినయం, నడవడిక, కవళికలు మనకందరికీ ఆదర్శ ప్రాయం. ఆదర్శ పత్ని గా సదాశివం గారిని కంటికి రెప్పల చూసుకుంటూ, అనుగమిస్తూ ధర్మపత్నిఅనే పదానికి ఉత్తమ ఉదాహరణ ఆవిడ అయ్యారు. సవతి బిడ్డలైనా తన బిడ్డలకన్న మిన్నగా సదాశివం మొదటి భార్య కూతుళ్ళని పెంచింది. ఆయన పెద్ద కూతురు రాధా విశ్వనాథన్ ఆవిడతో కొలిసి కొన్ని వందల కచేరిలలో పాడారు. వారి జీవితంలో వీడలేని బంధమై, ప్రేమ మూర్తిగా, సత్సాంప్రదాయాలకు పుట్టిల్లుగా తన గృహాన్ని పెంపొందించింది. ఆ తల్లి మరణించినప్పుడు ఈ బిడ్డలు పొందిన ఆవేదన వర్ణనాతీతం.

కంచు లాంటి కంఠం, శాస్త్రం పై పూర్తి పట్టు, చెదరని చిరునవ్వు, అనన్యమైన భక్తి ఆమె సంగీత సోపానానికి పునాది రాళ్ళు. వయసుతో భక్తి, శాస్త్రంలో పండి, ఎదిగిన కొద్దీ ఒదిగి, జీవితంలో ప్రతి కోణం లోను తన ఉన్నత విలువల్ని చూపించి, ఆచరించి, వాటి ఫలితాలను పొంది, తాను సంపాయించింది పేదలకు, పరమేశ్వరుడి సేవకు ధారా పోసి, 88 ఏళ్ల పండు వయసులో సుబ్బులక్ష్మి చెన్నైలోని స్వగృహంలో డిసెంబర్ 11, 2004 నాడు కన్ను మూశారు. ఆమె ఎప్పటికీ సంగీత రసజ్ఞుల గుండెల్లో ఉన్నతమైన స్థాయిలో నిలిచి పోతుంది.

శివుడు - హాలాహల భక్షణం

దేవతలు, రాక్షసులు పాల కడలిని అమృతం కోసం చిలకటంలో భాగంగా మందర పర్వతం, వాసుకి, కూర్మావతరమైన విష్ణువు - ఇవి చాలా సార్లు చదివే ఉంటాము.

కూర్మావతారము


ఈ క్షీర సాగర మథనంలో అమృతం కన్నా ముందు కాలకూట విషం బయట పడింది. దాన్ని హాలహాలంగా వర్ణించారు. ఈ కథను శ్రీమదాంధ్ర మహాభాగవతంలో పోతన మనోజ్ఞంగా వర్ణించాడు. అష్టమ స్కంధములో వీటి వివరాలు ఉన్నాయి. 

జలధిన్ కడవ సేయ శైలంబు కవ్వంబు
సేయ భోగిన్ త్రాడు సేయన్ తరువ
సిరియుసుధయున్ బడయ శ్రీవల్లభుడు దక్క
నొరుడు శక్తిమంతుడొకడు గలదే

సిరి సంపదలకు, అమృతమును పొందటానికి క్షీర సాగరమును కడవగా చేసి, పర్వత రాజమైన మందరగిరిని కవ్వముగా చేసి, సర్పరాజమైన వాసుకిని తాడుగా చేసి, సముద్రమును చిలుకే కార్యమును ఆ శ్రీ మహావిష్ణువు తప్ప ఇంకొక శక్తిమంతుడు ఎవ్వడైనా చేయ గలడా?.

ఆలోల జలధిలోపలన్
ఆలోనహి విడిచి సురలు నసురులు బరవం
గీలా కోలాహలమై
హాలాహలవిషము పుట్టె నవనీనాథ!

ఆ కల్లోలితమైన సముద్రము లోపల విషజ్వాలలు పుట్టుటచే, కోలాహలముతో ఆ వాసుకిని విడిచి దేవ దానవులు చెల్లాచెదరుగా పారిపోయారు.

అప్పుడు దేవతలు ఆ శివుని హాలహలమునుండి రక్షించమని స్తుతించారు. ఏమని?.

కొందరు కలడందురు నినున్
కొందరు లేదండు రతడు గుణిగాడనుచున్
కొందరు కలడని లేడని
కొందలమందుదురు నిన్నుగూర్చి మహేశా!

మూడుమూర్తులకును మూడులోకములకు
మూడుకాలములకు మూలమగుచు
భేదామగుచు దుదినభేదమై యొప్పారు
బ్రహ్మ మనః నీవ ఫాలనయన! 

సదసత్తత్త్వచరాచర
సదనంబగు నిన్ను బొగడ జలజభవాదుల్
పెదవులు గదలుప వెరతురు
వదలక నిను బొగడ నెంతవారము దేవా! 

నీకంటె నొండెరుగము
నీకంటెం బరులు గావనేరరు జగముల్
నీకంటె నొడయడెవ్వడు
లోకంబులకెల్ల నిఖిలలోకస్తుత్యా!

దేవ దేవా! నీవే మాకు శరణ్యము. కొందరు నీవు ఉన్నావు అంటారు, కొందరు నీవు సాకారుడవై లేవని అంటారు, మరి కొందరు నీవు కలవో లేవో అని తికమక పడతారు. నీయొక్క నిజతత్వము ఎవ్వరికి తెలియదు కదా పరమశివా! . ఓ త్రినేత్రా! త్రిమూర్తులకు, మూడు లోకాలకు, మూడు కాలాలకు మూలమై ఉంటూ బాహ్యమైన భేదాలు కనిపించినను, నిజానికి ఏకైక పరబ్రహ్మ అభేద తత్త్వమై నీవు ఉన్నావు. సత్యము, అసత్యములతో కూడియున్న ఈ చరాచర సృష్టికి ఆశ్రయమై యున్న నిన్ను పొగడుటకు బ్రహ్మాది దేవతలు కూడా పెదవులను కదుపుటకు సాహసింపలేరు. ఇక మేమెంత?. ఓ సర్వలోక పూజ్యా! మేము నిన్ను తప్ప ఇంకెవరినీ ఎరుగము. నీవు తప్ప ఇంకెవ్వరు ఈ లోకములను ఈ హాలాహలాన్నుండి కాపాడలేరు. ఈలోకములన్నిటా నీకన్నా గొప్పవాడు ఇంకెవ్వడూ లేడు.

అప్పుడు శివుడు ప్రసన్నుడై, వారిపై జాలి కలిగి, పార్వతితో ఇలా అన్నాడు.

ప్రాణేచ్ఛ వచ్చి చొచ్చిన
ప్రాణుల రక్షింపవలయు ప్రభువులకెల్లన్
ప్రాణులకిత్తురు సాధులు
ప్రాణంబులు నిమిషభంగురములని మగువా!

పరహితము సేయునెవ్వడు
పరమహితుండగును భూతపంచకమునకున్
పరహితమె పరమధర్మము
పరహితునకు నెదురులేదు సర్వేందుముఖీ!

హరి మది నానందించిన
హరిణాక్షి! జగంబులెల్ల నానందించున్
హరియును జగములు మెచ్చగ
గరళము వారింపుటొప్పు కమలదళాక్షీ!

ఓ పార్వతీ! ప్రాణములను రక్షించుకొను కోరికతో వచ్చి, శరణు జొచ్చిన ప్రాణులను ప్రభువులందరూ రక్షింపవలెను. సాధువులు, మహాత్ములు ఇతరులకు తమ ప్రాణములను, అవి క్షణంలో పోగలవని తెలిసి ఇచ్చెదరు కదా!. ఇతరులకు ఉపకారము చేసే వాడు పంచభూతములకు, సమస్త జీవరాశికి పరమ హితుడగును. పరోపకారమే పరమ ధర్మము. ఇతరుల మంచి కోరేవాడికి ఎందులోనూ ఎదురులేదు కదా. ఇతరులకు మంచి చేస్తే ఆ విష్ణువు కూడా సంతోషించును. విష్ణువు సంతోషిస్తే లోకాలన్నీ ఆనందిస్తాయి. శ్రీహరిని, సర్వ లోకములను ఆనందింప చేయటానికి విషాన్ని నివారించటం మంచిదికదా!.

అప్పుడు ఆ లోకమాత ఐన పార్వతి ఎలా ఆ శంకరుడు హాలాహలాన్ని తన కంఠంలో ఉంచుకోటానికి ఒప్పుకుందో పోతన గారు ఇలా వర్ణించారు.

మ్రింగెడివాడు విభుండని
మ్రింగెడిది గరళమని మేలని ప్రజకున్
మ్రింగుమనె సర్వమంగళ
మంగళసూత్రంబు నెంత మదినమ్మినదో!

మూడు లోకాలను దహించనున్న హాలాహాల జ్వాలలను తానే స్వీకరించదలుచుకున్న శివునకు శివాని లోకకల్యాణార్థమై అనుమతి ఇచ్చింది.  మింగ వలసినది ఘోరమైన విషమని తెలిసి, మింగేవాడు తన పతి దేవుడైనా,  జీవరాసులను రక్షించవలసి ఉన్నందున సర్వమంగళయైన ఆ పార్వతి, గరళమును మింగుమని పతి దేవునికి అనుమతినిచ్చెను. మరి ఆ సర్వలోక జనని తన మాంగల్య బలమును ఎంతగా నమ్మినదో కదా!. అప్పుడు శివుడు,

హాలాహాల భక్షణము

తన చుట్టున్ సురసంఘముల్ జయజయధ్వానంబులన్ బొబ్బిడన్
ఘన గంభీరరవంబుతో శివుడు లోకద్రోహి! హుం! పోకు ర
మ్మని కెంగేల దెమల్చి కూర్చి కడిగా నంకించి జంబూఫలం
బన సర్వంకషమున్ మహావిషము నాహారించె హేలాగతిన్

ఉదరము లోకంబులకును
సదనంబగుటెరిగి శివుడు చటుల విషాగ్నిన్
గుదురుకొన గంఠ బిలమున
బదిలంబుగ నిలిపె సూక్ష్మఫలరసము క్రియన్

హరుడు గళమునందు హాలాహలము వెట్ట
గప్పుగలిగి తొడవుకరణినొప్పె
సాధురక్షణంబు సజ్జనునకు నెన్న
భూషణంబు గాదె భూవరేంద్ర!


తన చుట్టూ దేవతా సమూహములు జయ జయ ధ్వనులతో కేకలు వేస్తుండగా, గంభీర స్వరముతో ఆ విషమేఘమును ఆజ్ఞాపించుచు, 'ఓ లోకద్రోహీ! ఎక్కడికీ పోకుండా నా దగ్గరకు రమ్ము' అని చెప్పి చెయ్యి చాచి ఆ మహావిషాన్ని అంతటా ఒకచోట చేర్చి ఒక్క ముద్దగా నేరేడు పండు లాగ విలాసముగా ఆరగించాడు. తన పొట్ట లోకములన్నిటికి నిలయమని తెలిసియున్న మహేశ్వరుడు చెదిరి ఉన్న విషాగ్నిని ఒకచోట కుదురుకునేలా కంఠంలో పదిలముగా, చిన్న ఫలరసమా అన్నట్లు నిలుపుకొన్నాడు. ఆ కంఠంలో విషము నలుపు పట్టిన ఆభరణంలా అలరారింది. సాధురక్షణ కూడా సజ్జనునకు ఒక ఆభరణమే కదా!.  అప్పుడు,

గరళంబు గంఠబిలమున
హరుడు ధరించుటకు మెచ్చి యౌనౌ ననుచున్
హరియు విరించియు నుమయున్
సురనాథుడు బొగడిరంత సుస్థిరమతితోన్


శివుడు గొంతుకలో గరళము ఉంచుకోవటం చూసి భళిభళి అంటూ శ్రీహరి, బ్రహ్మ, పార్వతి, ఇంద్రుడు మనస్ఫూర్తిగా మెచ్చుకున్నారు.

అలా ఆ పరమశివుడు నీలకంఠుడై ప్రపంచాన్ని ఆ విషాగ్ని నుంచి కాపాడాడు. ఈ క్షీర సాగర మథనం, హాలాహాల భక్షణం, జగన్మోహిని అవతారం (వివరాలు ఇంకొక వ్యాసంలో) అన్నీ మన ఆంధ్ర ప్రదేశ్ తీర ప్రాంతంలో గోదావరి జిల్లాల్లో జరిగింది అని ప్రజల నమ్మకం. పురాణాలు కూడా వీటిని సమర్థిస్తున్నాయి. ఇవి అంతర్వేది, ర్యాలి ప్రాంతంలో జరిగి ఉండవచ్చు. చారిత్రిక ఆధారాలుగా ఇక్కడ పుణ్యక్షేత్రాలు వెలశాయి.  అంతర్వేది వివరాలు.

ఓం నమః శివాయః


మహా మృత్యుంజయ మంత్రం:
 ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్

అత్యాశ, అవకాశవాదం

2009 శాసనసభ ఎన్నికల్లో అనూహ్యంగా ఓడిపోయినా పీ.సి.సి అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ గారు తన గుణపాఠం నేర్చుకోలేదు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ తనవంతు తను తెలంగాణా ఏర్పాటుకు ఇసుమంత కృషి కూడా చెయ్యలేదు. ఏడాది నుంచి ఈ విషయంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం సంక్షోభంలో ఉంటే ఆయన తన పదవిని, ఢిల్లీలో తన పలుకుబడిని ఉపయోగించి తెలంగాణపై స్పష్టతకు ఏమీ చెయ్యలేదు. కానీ, ఎప్పుడైతే చిదంబరంగారు రాత్రికి రాత్రి ప్రకటన చేశారో, అప్పటినుంచి తనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశముందని గ్రహించి, దానికి అధిష్ఠానం ఆశీర్వాదం ఉందని తెలిసి, తన పావులు తను కదిల్పారు. అంటే?. తనకు తన నియోజకవర్గంలోనే గతి లేదు కాని రాష్ట్రాన్ని పాలించాలన్న అత్యాశా?. ఎంత అన్యాయమండీ శ్రీనివాస్ గారు?. పోయిన సారి మీరు మైనార్టీల మీద చేసిన వ్యాఖ్యలు మిమ్మల్ని ఓడిస్తే, ఈ 2010 ఉపఎన్నికల్లో పచ్చి తెలంగాణా వాదం మిమ్మల్ని, మీ ఆశలని ముంచింది. మైనార్టీ వోటర్లు చాలా మంది ఉన్న ఆ వోటు బ్యాంకు మిమ్మల్ని గెలిపించ లేకపోయింది.

అయ్యా. ఎప్పుడూ మీ గురించే కాదు. కొంచెం ప్రజల గురించి, వాళ్లు ఏమి అనుకుంటున్నారో తెలుసుకోండి. ఢిల్లీ చుట్టూ తిరిగి, అమ్మగారికి ముడుపులు, మొక్కులు చెల్లించుకుంటే చాలదు. కాస్త ప్రజల నాడి కూడా గమనించండి. మీరు తెలంగాణలో మంచి ధనికమైన జిల్లాలో ఉన్నారు. దాన్ని మీ ప్రాంతపు ప్రజల అభివృద్ధికి ఉపయోగించండి. ఇచ్చేది మేమే, తెచ్చేది మేమే, మేడం తెలంగాణాకు ఒకే చెప్పారు అని ప్రచారంలో మాట్లాడారు కదా మరి దాన్ని కార్యరూపంలో చూపించండి. ఇప్పటినుంచి ఒక సంవత్సరంలోపు తెలంగాణా రాష్ట్రాన్ని తేవటానికి ముఖ్యమంత్రి, శాసనసభ్యుల ద్వారా చెయ్యాల్సిన పని చేయించి, అలాగే పీ.సి.సి. అధ్యక్షుడిగా ఢిల్లీ వెళ్లి ఒత్తిడి పెట్టి, పార్లమెంటులో తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టించండి. ఇంక చాలు మన నాటకాలు, దోబూచులాటలు, కాలాయాపానలు.

ప్రజలు మూడు సార్ల నుంచి, ముప్ఫై ఏళ్ళ నుంచి తెలంగాణా విషయంలో స్పష్టమైన తీర్పు ఇచ్చారు. వాటిని గౌరవించి, ఢిల్లీకి, వ్యాపారులకు అమ్ముడుపోకుండా తెలంగాణా ఏర్పాటుకు సహకరించండి. ప్రజలు మంచి ఉద్దేశాలను, పనులను ఎప్పటికైనా గౌరవిస్తారు. అలా చేస్తే, మిమ్మలిని, మీ పార్టీని ఆదరిస్తారు కూడా.

జై తెలంగాణ


తెలంగాణా ప్రజలు తీర్పు ఇచ్చారు. కాంగ్రెస్, టీడీపీల అవకాశవాద రాజకీయాలు, గత ఏడాదిగా నడుస్తున్న మోసాలకు తెరపడే సమయం వచ్చింది. మీకు తెలంగాణా కావాలా?. మీరు తెలంగాణా ఇస్తారా? అన్న ప్రశ్నలకు ధైర్యంగా, నిజాయితీగా సమాధానం చెప్పలేక కుప్పిగంతులు, పిల్లిమొగ్గలు వేసిన ఈ రెండు పార్టీలు తెలంగాణా వాదం ముందు తల వంచక తప్పలేదు. రాజీనామాలు చేసిన 12 మంది తెలంగాణా ప్రాంతపు టీ.ఆర్.ఎస్, బీ.జే.పీ ఎమ్మెల్యేలు తిరిగి భారీ మెజారిటీతో గెలుస్తున్నారు. 95 వేల వోట్ల మెజారిటీతో హరీష్ రావు గారు సిద్ధిపేట నుంచి గెలిచారు. ఇది వై.ఎస్.ఆర్ పులివెందుల నుంచి గెలిచిన రికార్డును బద్దలు కొట్టి శాసన సభ చరిత్రలో కనీ వినీ ఎరుగని ఆధిక్యత. ఎవరు ఇచ్చారు దీన్ని?. విసిగి, వేసారి, కోపంతో ఉన్న తెలంగాణ ప్రజలు. 
  1. తెచ్చేది, ఇచ్చేది మేమే అన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా నిజంగా తెలంగాణా తెస్తారా?.  రోజుకో మాట, నోటికో మాట మాట్లేడే మీ పార్టీ నాయకులు ఇప్పటికైనా ప్రజల నాడి గ్రహించి ముందుకు అడుగు నిజాయితీగా వేస్తారా?.
  2. తెలంగాణా, ఆంధ్ర రెండు కళ్ళు అన్న బాబు తెలుగు దేశం పార్టీకి చాలా చోట్ల డిపాజిట్ దక్కే అవకాశం కూడా లేదుట. మరి ఏమంటారు బాబు గారు?. మీ రెండు కళ్ళ భావనని మేము కాదనము కానీ, ఈ ఎన్నికలు తెలంగాణా గురించి. దాని గురించి 10 నెలలుగా మీరు మౌనం పాటించారు. ఇకనైనా నోరు తెరిచి, నిజాన్ని తెలుసుకొని మాట్లాడతారా?. మీ పార్టీకి ధరావతు కూడా దక్కట్లేదు అంటే ఏంటి తెలంగాణా లో టీ.డీ.పీ పరిస్థితి?.
  3. ఇప్పటికైనా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు షెడ్యూలు ప్రకటించి దాన్ని అమలు పరుస్తారా సోనియా, మన్మోహన్?.
ఇక మాకు చాలు ఈ నాటకాలు, ఈ మోసాలు, ఈ అవకాశవాద రాజకీయాలు అని చెప్పుతో కొట్టి చెప్పలేక, వోటు అనే బ్రహ్మాస్త్రం ప్రయోగించారు తెలంగాణా ప్రజలు. వారి మనోభావాల్ని గౌరవించండి. వారి ఆకాంక్షల్ని నెరవేర్చండి.  ఇకనైనా, తమ మనస్సాక్షిని అనుసరించి, ప్రజల తీర్పును గౌరవించి కాంగ్రెస్, టీ.డీ.పీ పార్టీలు తెలంగాణా ఏర్పాటుకు తాము చేయ్యాల్సింది చేస్తే ప్రజలు వారిని మన్నిస్తారు. లేకుంటే వారికి రాజకీయ అధోగతే. మీరు ముందు చూపుతో వ్యవహరించకపోతే, ఈ రాష్ట్రంలో ముందున్నది ప్రత్యక్ష,ప్రచ్ఛన్న పోరాటమే. అందులో గెలుపు తెలంగాణా ప్రాంతపు ప్రజలదే.

జై తెలంగాణా తల్లి
జై తెలంగాణా

29, జులై 2010, గురువారం

ముద్ద బంతి పూలు పెట్టి

ముద్ద బంతి, మొగలి రేకులు, చిట్టెమ్మ, కిట్టయ్య, అరణాలు, కట్నాలు, అభిమానము, అవిటితనంలోని విచారము, పేదరికంలోని స్వాభిమానం - ఇవన్నీ కలిపి ఒక గ్రామీణ నేపథ్యంలో ఇద్దరు మహా నటీ నటులను పెట్టి చిత్రం తీసి, అందులో ఒక అందమైన, సందేశమున్న పాట చిత్రీకరిస్తే?. అదే 'కలసి ఉంటే కలదు సుఖం' చిత్రం లోని 'ముద్ద బంతి పూలు పెట్టి' అనే పాట. చలనచిత్రంలో సందేశముంటే అది కలకాలం నిలుస్తుంది అన్నదానికి మరో చక్కని ఉదాహరణ కలసిఉంటే కలదు సుఖం చిత్రం.






 కలసి ఉంటే కలదు సుఖం (1961)






కొసరాజు రాఘవయ్య చౌదరి గారు తమ కవితా పాటవాన్ని సులభమైన వాడుక తెలుగు పదాలలో ఈ పాటలో చూపించారు. మాస్టర్ వేణు సంగీతం ఈ రచనకు కలికితురాయి. ఒక అవిటి వాడు, అతని అంతః సౌందర్యం చూసి అతనంటే ముచ్చట పడిన ఒక అందమైన పిల్ల - వారిద్దరి మీద కథలో బాగా నప్పే విధంగా ఈ పాట చిత్రీకరించబడింది. వర్ష, శరదృతువులలో పూసే ముద్ద బంతిలో ఉండే స్వచ్ఛత, నిండుతనం, అందము ఇంకే పుష్పంలో ఉండదు. అచ్చం అలానే ఉంటుంది మహానటి సావిత్రి ఈ చిత్ర సన్నివేశాల్లో. ముద్ద బంతి స్త్రీ రూపములో మూర్తీభవించిందేమో అనిపించేంత అందము, నిర్మలత్వము, స్వాభిమానమున్న పాత్రలో మహానటి జీవించారు. వర్ష ఋతువులో వచ్చే మొగలి పూవు గుబాళింపు గుప్పుమని, మత్తు ఎక్కించి మైమరపిస్తుంది. యుక్త వయసులో ఉన్న స్త్రీకి, మొగలి రేకుల అందానికి, సువాసనకు అవినాభావ సంబంధం ఉంది. అందుకనే కొసరాజు వారు ఈ పాటలో మొగలిరేకును వాడి పాటకు, పాత్రకు అందాన్ని తెచ్చారు. ఇది నాయికానాయకుల వయసులోని ముచ్చట గురించి రాసిన భాగం.


ఇక సందేశానికి వస్తే:

అద్దమంటి మనసు, అందమైన వయసు కన్నా ఉండేది ఏంది అన్న వాక్యంలో ఎంత గూఢార్థముందో గమనించండి. మనసు స్వచ్ఛంగా ఉంటే - శరీర సౌందర్యము, ఆత్మ విశ్వాసము అదే ఉంటుంది అని చాల సున్నితంగా చెప్పారు రచయిత. అభిమానము, ఆప్యాయత ముందు కట్నాలు, కానుకలు ఎందుకు పనికి రావని ఈ గీతం మనకు మంచి సందేశాన్ని ఇస్తుంది. 'అభిమానమాభరణం మరియాదే భూషణం' అని భర్తృహరి నీతిని గేయం రూపంలో సులభమైన తెలుగులో చెప్పారు కవి. మంచి గుణమున్న పేదవాడి మనసుకన్న విలువైనది ఏమి లేదని మనసుకు హత్తుకునేలా చెప్పారు గేయకర్త. కాలు, చెయ్యి లేని అవిటివాడిని అయినవారు ఎలా ఎగతాళి చేస్తారో, తనకు పెళ్లి అవుతుందో కాదో అని దిగులు పడుతున్న నాయకుణ్ణి, నాయిక 'ఎవరేమి అన్ననేమి, ఎగతాళి చేయనేమి, , నవ్విన నాప చేనే పండదా' అని అతనిలో ఆత్మ విశ్వాసాన్ని నింపుతుంది. స్త్రీ లో ఉండే ధైర్యం, స్థైర్యం ఈ పాటలో అణువణువునా చూపించారు కొసరాజు వారు. అవే లక్షణాలను అద్భుతంగా నటనలో చూపించారు సావిత్రి. అవిటి వాడి రూపంలో నిర్మలమైన మనసుతో, అమాయకమైన పాత్రలో  ఎన్టీ రామారావు గారు ప్రేక్షకులను మురిపించి కంట తడి పెట్టించారు. 

అంతఃసౌందర్యానికి ఈ పాటలోని చరణాలలో ఎంత అందంగా కవి ప్రాధాన్యమిచ్చారో వారి వ్యక్తిత్వానికి నిలువుటద్దంగా నిలుస్తుంది. స్త్రీపురుషుల మధ్య గల భేదము, వారు ఒకరికొకరు ఏవిధంగా పరిపూర్ణతను కలిగిస్తారో కూడా ఈ గీతంలో మనకు అర్థమవుతుంది. ఆత్మస్థైర్యమున్న పల్లెటూరి పిల్ల-వికలాంగుడైన అమాయకపు పల్లెటూరి అబ్బాయి కలిస్తే, ఆమె ఆత్మసౌందర్యం, విశ్వాసం, పరిపక్వత అతని అవిటితనానికి, అమాయకత్వానికి ఆసరగా నిలిస్తే? అదే ఈ చిత్రం, ఈ గీతం. ఇటువంటి కళాకారులు, రచయితలు, దర్శకులు న భూతో న భవిష్యతి. ఈ భావాన్ని అద్భుతంగా పండించినందుకు కొసరాజు గారికి, ఎన్‌టీఆర్ గారికి, సావిత్రి గారికి శిరసు వంచి నమస్కారములు చేయాలి.

మంచి సామాజిక విలువలతో, ఒక అవిటివాడిని ప్రోత్సహించి, ప్రేమించి అతన్ని ఆత్మవిశ్వాసంతో నింపే ఒక శక్తివంతమైన పేద మహిళగా కథానాయిక, తన మంచి మనస్సుతో కుటుంబాలను కలిపి పేరు తెచ్చుకునే కథానాయకుడు, సున్నితమైన శృంగారము, మంచి సంభాషణలు, సంగీతము, ఆహ్లాదమైన చిత్రీకరణ - ఇదీ 1961 లో విడుదలైన 'కలసి ఉంటే కలదు సుఖం' చిత్రం.

మంచె, చేలు, తాటి చేతులు, గొర్రెలు, మేకలు, కాపరి, బుట్ట తలపై ఉన్న స్త్రీ, అమాయకంగా చిందు వేసే మనిషి, పల్లెటూరి తందానే తానేననే ఆలాపనలు ఈ 'ముద్దబంతి పూలు పెట్టి' పాటకు రంగం.

ఈ పాట మీకోసం. యూట్యూబ్లో పాట చూసి ఆనందించండి.

ముద్ద బంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను చుట్టి హంసలా నడిచి వచ్చే చిట్టెమ్మ మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా
అద్దమంటి మనసు ఉంది అందమైన వయసు ఉంది ఇంతకన్నా ఉండేది ఏంది కిట్టయ్యా  ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా

1. పుట్టింటి అరణాలూ ఘనమైన కట్నాలూ అత్తవారింటి నిండా వేచినా అవి అభిమానమంతా విలువ జేతునా |ముద్ద|
అభిమానమాభరణం మరియాదే భూషణం గుణము మంచిదైతే చాలయా మన గొప్పతనము చెప్పుకోను వీలయ్యా |అద్దమంటి|

2. కాలు చెయ్యి లోపమనీ కొక్కరాయి రూపమనీ వదినలు నన్ను గేలి చేతురా పిల్లను దెచ్చి పెళ్లి జేతురా
ఎవరేమి అన్ననేమి ఎగతాళి చేయ్యనేమి నవ్విన నాప చేనే పండదా నలుగురు మెచ్చు రోజు ఉండదా |అద్దమంటి| |ముద్ద|

27, జులై 2010, మంగళవారం

శిథిలావస్థలో భారతీయ జనతా పార్టీ

Kamalam
Hastam




కమలం వికసించింది - ఈ నానుడి చాలా ఏళ్ళు సాగినట్టే. 1984 సార్వత్రిక ఎన్నికల్లో ఇందిరా గాంధి హత్య సానుభూతి పవనాలు కాంగ్రెస్ ను గెలిపించినప్పుడు  542 లో,  2 సీట్లు మాత్రమే గెలుచుకున్న కమల దళం, తర్వాత రామ మందిర ఉద్యమంతో బాగా లాభ పడి 1989 లో 85, 1991లో 120,  1996 లో 161, 1998 లో  182, 1999లో 182 సీట్లు, 2004 లో 138 సీట్లు గెలుచుకుంది. ఈ దాదాపు దశాబ్దమున్నర కాలము (1989 -2004) భారతీయ జనతా పార్టీకి స్వర్ణ యుగమే.

రాజకీయ అతిరథులు వాజపేయి, అద్వానీల సారథ్యంలో హిందూ, కాంగ్రెస్ వ్యతిరేక నినాదాలతో బాగా లబ్ది పొంది, సంస్థాగతంగా బలపడి, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. దీనికి ప్రధాన కారణం అంతకు ముందు ఇందిరా, రాజీవ్ హయాంలో అవినీతి భాగోతాలు, వారి ఏక పక్ష పరిపాలన, ఆర్ధిక మాంద్యము మరియు ఆర్థిక విధానాల వల్ల దేశం సాంఘికంగా, ఆర్థికంగా బాగా దెబ్బ తిన్నది. ప్రజలు వారి పరిపాలనతో విసిగిపోయారు. ఆ సమయంలో వచ్చిన రామ మందిర నినాదం, వి.ఫై. సింగ్ నేత్రుత్వంలోని అవినీతి, కుంభకోణాలపై పోరాటం ప్రతిపక్షాలను ఏకం చేశాయి. ఇందులో భా.జ.పా చాలా లబ్ది పొందింది. ప్రధాన పతిపక్షంగా ఆ పార్టీ స్థానానికి వచ్చిన ఢోకా ఏమీ లేదు కాని, సంస్థాగతంగా, నినాదాల పరంగా పార్టీ ఒక కనిష్ఠ స్థాయిలో ఉంది అనిపిస్తోంది. కారణాలు ఎంతో చూద్దాము.
  1. జనాకర్షణ నేతలు లేరు - కురు వృద్ధులైన అద్వానీ, వాజపేయి రాజకీయ సన్యాసం చాలా ప్రణాలికా విహీనంగా సాగింది. ఒక ఉద్యమ స్ఫూర్తితో, నినాదంతో, ప్రభుత్వాన్ని ఎండగట్టి ఎన్నికలను గెలిపించే నాయకులు పార్టీలో లేరు. ఉన్న ఒకే ఒక్కడు నరేంద్ర మోడి కరడు గట్టిన హిందుత్వవాది గా ముద్ర పడి పోయాడు. అందుకని ఆయనను పార్టీలో అందరూ ఆమోదించ లేకపొతున్నారు.  మహారాష్ట్రలో ఒక్క రాజకీయ విజయాన్ని కూడా సాధించని గడ్కరీని తీసుకువచ్చి ఏకంగా పార్టీ జాతీయ అధ్యక్షుడిని చేశారు. ఇటీవలి ఆయన వ్యాఖ్యలు, వాటిని వెనక్కి తీసుకోవటం చూస్తుంటే ఆయనకు ఎంత పరిణతి ఉన్నది అనేది అనుమానమే.
  2. పార్టీ అధ్యక్షుడిగా రాజ్ నాథ్ సింగ్ చేసినంత నష్టం ఇంకెవ్వరూ ఆ పార్టీకి కలిగించలేదు. ముందు చూపు లేక, అంతర్గత కుమ్ములాటతో, పాతకాలపు ఆలోచనా పధ్ధతి, విధానాలతో పార్టీని నిర్వీర్యం చేశాడు ఆయన. వయసు మీద పడటంతో చూస్తూ ఊరుకున్నారు వాజపేయి, అద్వానీ. ఈయన గారి పుణ్యమా అని కొందరు పార్టీ వదలాల్సి వచ్చింది. ముఠాలు ఏర్పడి పార్టీ బజారున పడింది.
  3. కులాల, మతాల  మీద వచ్చిన రాజకీయ సమీకరణలు వారికి చాలా చోట్ల కలిసి రాలేదు. లోక్సభలో నాలుగోవంతు సీట్లున్న ఉత్తర ప్రదేశ్, బీహార్ లో పూర్తిగా అగ్ర వర్ణాలకి వ్యతిరేకంగా వచ్చిన సునామీలో వారు, కాంగ్రెస్ కొట్టుకు పొయ్యారు. బీసీలు, ఎస్సీ, ఎస్టీలు అగ్ర వర్ణాల వారికి ఎదురు తిరిగి తమకు రాజకీయంగా గుర్తింపు ఇచ్చే ఎస్పీ, బీ.ఎస్.పీ, ఆర్.జే.డీ లాంటి పార్టీలకు పట్టం కట్టారు. 
  4. కర్నాటక మినహా, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో, దక్షిణాదిన ప్రాంతీయ పార్టీల ధాటికి తట్టుకోలేకపోయారు. వారి స్వార్థ పూరిత, అవకాశవాద రాజకీయాలకు నిలవలేకపోయారు - తృణమూల్, టీ.డీ.పీ, ఏ.ఐ.ఏ.డీ.ఎం.కే లాంటి పార్టీలు బీ.జే.పీ తో ఫుట్బాల్ ఆడుకున్నాయి.  పూర్తిగా హిందుత్వం వైపు కాకుండా, పూర్తిగా మతాతీత రాజకీయానికి దూరం కాలేక, చిన్న చిన్న పార్టీల మధ్య నలిగి పోయి తమల్ని తాము దెబ్బ తీసుకున్నారు భా.జ.పా నాయకులు. మేదావులైన నవీన్ పట్నాయక్, చంద్ర బాబు నాయుడు, మమత బెనర్జీ, జయలలితల రాజకీయ పిల్లిగంతులకు, చతురతకు భా.జ.పా తట్టుకోలేకపోయింది. అలాగే, హిందుత్వ నినాదం గట్టిగా ఉన్న మహారాష్ట్రలో శివసేనకు కట్టు బడి, స్థానిక నాయకత్వం లేక వెనకబడి పోయింది.
  5. రాజీవ్ మరణం తర్వాత సంస్థాగతంగా దెబ్బతిన్న కాంగ్రెస్ మళ్లీ  పీ.వీ. నరసింహారావు, మన్మోహన్ సింగ్ ల ఆర్ధిక విధానాల ఫలాలతో, సోనియా, రాహుల్ రాజకీయ పాఠాలు నేర్చుకుని పరిపక్వత చెంది పార్టీ పుంజుకోవటానికి దోహదం చేశారు. ఒంటెద్దు పోకడల రోజుకోసారి ముఖ్యమంత్రులను మార్చే విధానాలకు దూరంగా, కొంత అధికారానికి దూరంగా ఉంటూ వీరిద్దరూ పార్టీని, తమ స్థానాలను పూర్తిగా బలోపేతం చేశారు. రైతులకు వ్యతిరేకి అని టీ.డీ.పీ ని ఓడించిన వై.ఎస్.ఆర్ అండతో ఆంధ్రలో గెలిచి, రాజకీయ చాణక్యుడైన శరద్ పవార్ తో జత కట్టి మహారాష్ట్రలో, మహా కుల, మత ఓట్ల మేధావి అయిన కరుణానిధితో జత కట్టి తమిళనాట మంచి విజయాలు సాధించారు సోనియా, రాహుల్ గారు.ఈ ఇద్దరికీ సాటిగా, దీటుగా ప్రతిపక్షంలో ఎవ్వరు లేరు.
ఇలా, రాజకీయంగా, కాంగ్రెస్ పార్టీకి ఉన్న అర్థ, అంగ, ఆలోచనా బలాల ధాటికి తట్టుకోలేక, తమ అంతర్గత లోపాలను దిద్దుకోలేక, సతమతమవుతున్న పార్టీ బీ.జే.పీ. ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న పరిస్థితి చూస్తే అక్కడ వచ్చే శాసనసభ ఎన్నికల్లో మళ్లీ గెలవటం గగనమే. యూపిలో నాలుగో స్థానానికి దిగారు. బీహార్లో నితీష్ దయ మీద బతుకుతున్నారు. తమిళనాడు, ఆంధ్ర, పశ్చిమ బెంగాల్ లో ప్రభావం నామమాత్రమే. ఇప్పటికే పదేళ్ళు పాలించిన మధ్య ప్రదేశ్ లో మళ్లీ గెలవటం తేలిక కాదు. ఒక్క గుజరాత్లోనే వారి పట్టు ఇంకా ఉంది.  అది ఎన్నాళ్ళో మరి. మిగిలిన అన్ని చోట్ల సడలుతోంది/సడలిపోయింది.  మొత్తానికి, సంస్థాగతంగా అద్భుతాలు జరిగితే తప్ప ఒక దశాబ్దం పాటు భా.జ.పాకు చాలా గడ్డు కాలమే.

గంగావతరణం - గంగమ్మ మహాత్యం మొదటి భాగం


అంగ భంగిమలు గంగ పొంగులై అన్నారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు. ఈ గంగ పొంగులు ఎలా ఉంటాయో తెలియాలంటే మీరు ఉత్తరాఖండ్ వెళ్లి తీరాలి. ఉత్తరకాశి జిల్లాలో 10వేల అడుగుల ఎత్తున హిమాలయాలలో గోముఖమునుండి వెలువడిన భాగీరథి 13 కిలో మీటర్ల దిగువన ఉన్న గంగోత్రి వద్ద ఉరకలెత్తుతూ ప్రవహిస్తుంది. ఆ భాగీరథి సామన్యమైన నదా? ఇక్ష్వాకు వంశజుడైన భగీరథుని ప్రయత్నంతో విష్ణు పాదం నుండి శివుని జటాఝూటములో చేరి అక్కడినుండి గంగోత్రి దగ్గర ఈ భువిన అడుగిడింది. మన పాపాలను కడిగే పుణ్యనది ఈ పావన భాగీరథి. గంగోత్రి నుండి ప్రయాణం చేస్తూ దేవప్రయాగ వద్ద అలకనందతో కలసి అక్కడినుండి గంగగా పిలువబడుతుంది. గంగోత్రి వద్ద, దేవ ప్రయాగ వద్ద ఈ గంగమ్మ పరవళ్లు చూస్తే వాల్మీకి మహర్షి రామాయణంలో వివరించినది ఎంత అక్షర సత్యమో అర్థామవుతుంది.అలాగే సీతారామశాస్త్రిగారి భావజాలం ఎంత మనోజ్ఞమో అర్థమవుతుంది. శ్రీమద్రామాయణంలోని గంగావతరణం మీకోసం. సగర పుత్రులకు స్వర్గ ప్రాప్తికై భగీరుథుడు గంగను భువికి రప్పించాడు. ఇది మనకు తెలిసిందే. కాని,  అసలు ఏమి జరిగింది అన్న విషయం కొంత తెలుసుకుందాము.

శ్రీమద్వాల్మీకి రామాయణంలో బాలకాండ 38 - 44 సర్గలలో ఈ గంగావతరణాన్ని విశ్వామిత్ర-రామలక్ష్మణ సంవాదంలో  వివరించారు.  కాళిదాసు రఘువంశం కావ్యంలో రమణీయంగా, విపులంగా ఈ విషయాన్ని రచించారు. నేను ఇంటర్ మీడియట్ రెండో సంవత్సరంలో (రెండవ భాష సంస్కృతం) రఘువంశంలోని ఈ అంశాన్ని చదువుకున్నాను. ఇటీవల రామాయణ పారాయణంలో మళ్లీ పఠించాను.

ఇక్ష్వాకు వంశంలో జన్మించిన సగరునికి ఇద్దరు భార్యలు - కేశిని, సుమతి. వీరికి సంతతి కలుగక, హిమాలయాలకు వెళ్లి భృగుప్రవర్శన మనే చోట తపస్సు చేశారు. వీరి తపస్సుకు మెచ్చి భృగు మహర్షి సగరుడి భార్యలలో ఒకరికి వంశాభివృద్ధి కలిగించే ఒక పుత్రుడు, ఇంకొకరికి అరవై వేల మంది పుత్రులు కలుగుతారు అని ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాద ఫలంతో కేశినికి అసమంజుడు, సుమతికి అరవైవేలమంది సగర పుత్రులు జన్మిస్తారు. వీరిలో అసమంజుడు దుష్ట చేష్టలు చేస్తూ ఉంటే సగరుడు అతడిని రాజ్య బహిష్కారం చేస్తాడు.  అసమంజుని కుమారుడు అంశుమానుడు యోగ్యుడు.

ఈ సమయంలో సగరుడు యాగం తలపెడతాడు. యాగాశ్వాన్ని ఇంద్రుడు అపహరించి కపిల మహర్షి ఆశ్రమంలో దాచుతాడు. దీని వలన యాగం అసంపూర్ణంగా ఉంటుంది. అది తనకు అరిష్టమని గ్రహించిన సగరుడు తన అరవైవేలమంది పుత్రులను అశ్వాన్ని వెదకమని పంపిస్తాడు. భూనభోంతరాళములలో ఎక్కడ ఉన్నా వెదికి తీసుకురమ్మని ఆదేశిస్తాడు. సగర పుత్రులు భూమి అంతటా వెదికి, భూమిలో తవ్వి, సర్పలోకాన్ని వెదికి ఎక్కడ అశ్వం కనిపించక రసాతాలానికి వెళ్తారు. అన్ని దిక్కులు వెదికినా అశ్వం కనిపించదు. ఈశాన్య దిక్కులో శివస్థానంలో భూమిని తవ్వి వెదుకుతారు. అక్కడ కపిల మహర్షి ఆశ్రమంలో వారికి అశ్వం కనిపిస్తుంది. 'ఓరీ దుష్టుడా! నీవే మా తండ్రి గారి యాగాశ్వాన్నిఅపహరించావు' అని ఆ మహర్షిని దూషిస్తారు. అప్పుడు ఆ మహర్షి ఆగ్రహంతో వారిని ఒక్క చూపుతో భస్మీపటలం చేస్తాడు. ఆ మహర్షి క్రోధాగ్నికి భస్మపు కుప్పగా మారుతారు సగర పుత్రులు.

ఎన్నాళ్ళైనా పుత్రులు తిరిగి రాకపోయేసరికి సగరుడు మనుమడైన అంశుమానుడిని యాగాశ్వాన్ని, పిన తండ్రులను వెదకమని పంపిస్తాడు. కపిల మహర్షి ఆశ్రమము వద్దకు వచ్చి వారు దగ్ధమై ఉండటం చూసి దుఃఖితుడవుతాడు. వారికి ఉత్తరక్రియలు జరుపుదామని నిశ్చయిస్తాడు. కానీ, ఆ ప్రాంతంలో ఎక్కడ నీరు అనేది కనిపించదు. అప్పుడు సగర పుత్రుల మేనమామ (సుమతి సోదరుడు) అయిన గరుత్మంతుడు ప్రత్యక్షమై అంశుమానుడితో - 'నాయనా, ఇలా దగ్ధమైన నీ పిన తండ్రులకు స్వర్గ ప్రాప్తి జరగాలంటే మామూలు జలం చాలదు. దేవలోకంలో ఉన్న గంగానది వచ్చి వీరి భస్మంపై ప్రవహిస్తే వీరికి స్వర్గ ప్రాప్తి కలుగుతుంది' - అని చెప్తాడు. అంశుమానుడు యాగాశ్వాన్ని తీసుకొని సగరుడి దగ్గరకు తిరిగి వచ్చి జరిగింది వివరిస్తాడు. సగరుడు యాగాన్ని పరిసమాప్తి చేస్తాడు.

సగరుడు గంగను భువికి ఎలా తీసుకురావాలి అన్న దానిమీద నిర్ణయం తీసుకోలేకపోతాడు. తరువాత ముప్ఫై వేల సంవత్సరాలు పాలించి తనువు చాలిస్తాడు. అంశుమానుడు రాజ్యం పాలిస్తాడు. అతనికి దిలీపుడు అని ఒక సుపుత్రుడు జన్మిస్తాడు. అంశుమానుడు కొడుకుకి రాజ్యభారం అప్పగించి తపస్సులకై హిమాలయాలకు వెళతాడు. అంశుమానుడు ముప్ఫై రెండువేల ఏళ్ళు తపస్సు చేసిన తర్వాత స్వర్గ ప్రాప్తి పొందుతాడు కాని గంగను భూమి మీదకు తీసుకు రాలేకపోతాడు.

దిలీపుడు ధర్మబద్ధంగా పాలిస్తాడు. కానీ, ఆయన కూడా గంగను ఎలా తీసుకువచ్చి సగర పుత్రులకు స్వర్గ ప్రాప్తి కలిగించాలి అన్న సంకల్పం,నిశ్చయం చేసుకోలేకపోతాడు. దీని గురించి విచారపడతాడు దిలీపుడు. ఆ విచారంలోనే అతడు ప్రాణం విడుస్తాడు.  దిలీపుడికి సర్వ లక్షణ సంపన్నుడైన కుమారుడు కలుగుతాడు. అతడే భగీరథుడు.

భగీరథుడు పుత్రసంతానం లేక విచారంలో ఉంటాడు. అప్పుడు ఆ మహారాజు రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి, తన పిత్రుదేవతలైన సగర పుత్రుల స్వర్గ ప్రాప్తికి, తనకు పుత్ర సంతాన ప్రాప్తి కోసం ఘోర తపస్సు చేస్తాడు. కొన్ని వేల ఏళ్ళు తపమొనరించిన తర్వాత బ్రహ్మ దేవుడు ప్రత్యక్షమై అతని తపస్సుకి మెచ్చి గంగ ప్రవాహం ద్వారా సాగరపుత్రులకు స్వర్గ ప్రాప్తి, భగీరథుడుకి పుత్రప్రాప్తి వరాలను ఇస్తాడు. కానీ, గంగా ప్రవాహాన్ని తట్టుకొనే శక్తి భూమికి లేదని, ఆ పనికి ఒక్క శంకరుడే సమర్థుడని చెప్పి అంతర్ధానం అవుతాడు బ్రహ్మ.

గంగావతరణం కోసం భగీరథుడు ఏడాది శివుడి గురించి తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమై గంగను తన శిరస్సులో దాల్చటానికి ఒప్పుకుంటాడు. దేవతలా ఆశీర్వాదంతో గంగావతరణం మొదలవుతుంది.

గంగ పొగరుతో శివున్ని ముంచి పాతాళానికి వెళ్లాలని ఉవ్విళ్లూరుతుంది. శివుడి క్రోధంతో ఆమె మదాన్ని అణిచి తన జటా ఝూటాల్లో ఆమెను బంధిస్తాడు. గంగ ఆ బంధనంలోంచి బయట పడటానికి తీవ్ర ప్రయత్నం చేసి విఫలమవుతుంది. అలా బందీ అయిన గంగను భువి మీదికి వదలమని భగీరథుడు మళ్ళీ శివుని మెప్పించ తపస్సు చేస్తాడు. ఆ సదాశివుడు సంతుష్టుడై గంగను భూమి మీదకు విడుస్తాడు.



అలా శివుని జటా ఝూటాల్లోంచి గంగానది హిమాలయాలలోని బిందు సరస్సు ప్రాంతంలో  భూమిని ఏడు పాయలుగా తాకుతుంది - తూర్పు దిక్కుగా హ్లాదిని, పావని, నళిని నదులుగా,  పశ్చిమ దిక్కుగా సుచక్షు, సీత, సింధు నదులుగా పారుతుంది.

గంగా ప్రవాహమున సాగి వచ్చిన చేపలు, తాబేళ్లు, మొసళ్ళు మరియు ఇతర జంతువులతో భూమి మిక్కిలి శోబిల్లెను. దివినుండి భువికి దిగి వచ్చిన గంగను దేవతులు, ఋషులు, గంధర్వులు, సిద్ధులు కన్నుల పండువగా, సంభ్రమాశ్చర్యములతో  చూశారు. గంగా ప్రవాహము కొన్ని చోట్ల అతివేగంగా, కొన్ని చోట్ల వంకరగా, కొన్ని చోట్ల విశాలముగా, కొన్ని చోట్ల దూకుతూ, తుళ్ళి పడుతూ, ఇంకొక చోట ప్రశాంతముగా సాగింది.  దేవతలు, ఋషులు మున్నగు వారు "ఈ జలము శివుని శిరస్సునుంది పడింది, కనుక అతి పవిత్రమైనది" అని తలచుకుంటూ, ఆ నీటిని తమ శిరస్సుపై చల్లుకొని ఆచమనం చేశారు. శాపం వలన దివినుండి భువికి చేరినవారు ఈ గంగలో మునిగి పాపరాహితులై, తిరిగి తమ లోకాలకు వెళ్లారు. పవిత్ర గంగానదీ స్నానముచే జనాలు అలసటలు తొలగి సంతోషించారు.


ఏడవ పాయ భగీరథుడి రథాన్ని దక్షిణ దిక్కుగా అనుసరించి,  జహ్ను మహర్షి ఆశ్రమాన్ని, యజ్ఞ వాటికను ముంచెత్తుతుంది. ఆ మహర్షి ఆగ్రహం చెంది ఆ నదిని మింగేస్తాడు. దేవతలు, ఋషులు, యక్షులు, గంధర్వులు ఆ మహర్షి పాదాలపై పడి గంగను వదలమని ప్రార్థిస్తారు. అప్పుడు శాంతించిన జహ్ను మహర్షి తన చెవి ద్వారా గంగను వదులుతాడు. అలా జహ్ను మహర్షి కుమార్తెయై గంగ జాహ్నవి అనే నామంతో కూడా పిలవబడింది. దక్షిణ దిశగా ప్రవహించి సాగరంలో కలిసి, పాతాళానికి వెళ్లి సగర పుత్రులను పావనం చేస్తుంది గంగ.

అప్పుడు బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమై భగీరథుడిని ప్రశంసించి, సాగరపుత్రులకు స్వర్గాలోకాలను అనుగ్రహిస్తారు. పిత్రుదేవతలకోసం అంతటి కష్టతరమైన కార్యం సాధించిన భగీరథుడికి ఎన్నో వరాలు ఇస్తారు. గంగావతరణానికి కారకుడైన అతడిని భువిలో గంగకు తండ్రిగా శ్లాఘిస్తారు. అప్పటినుంచి గంగ భాగీరథిగా ప్రసిద్ధి చెందింది.

గంగ మూడు లోకాలు (దివి, భువి, పాతాళం), మూడు దిక్కులు (తూర్పు, పడమర, దక్షిణ) పారింది కనుక త్రిపథగ గా పేరొందింది. అలా అవతరించిన గంగా నది ఈ అవనిలో అత్యంత పావనమైన నదిగా విశ్వ విఖ్యాతి పొందింది.

గంగను ఎన్నో విధాలా ఎంతో మంది  నుతించారు . ఆదిశంకరులు గంగాష్టకంలో అద్భుతంగా ఈ తల్లిని నుతించారు.

భగవతి తవ తీరే నీరమత్రసనోహమ్
విగతవిషయతృష్ణ కృష్ణమారధాయమి
సకలకలుషభంగే స్వర్గసోపనసంగే
తరలతరతరంగే దేవి గంగే ప్రసీద

భగవతి భవలీలామాలే తవాంభః
కణమణుపరిమాణం ప్రాణినో యే స్పృశంతి
అమరనగరనారీచామరగ్రాహిణీనాం
విగతకలికలంకాతంకమంకే లుఠంతి

బ్రహ్మాండం ఖండయంతీ హరశిరసి జటావల్లిముల్లాసయంతీ
స్వర్లోకాదాపతంతీ కనకగిరిగుహాగండశైలాత్‍స్ఖలంతీ
క్షోణీపృష్ఠే లుఠంతీ దురితచయచమూనిర్భరం భర్త్సయంతీ
పాథోధిం పూరయంతీ సురనగరసరిత్పావనీ నః పునాతు

మజ్జన్మాతంగకుంభచ్యుతమదమదిరామోదమత్తాలిజాలం
స్నానైః సిద్ధాంగనానాం కుచయుగవిగలత్కుంకుమాసంగపింగమ్
సాయంప్రాతర్మునీనాం కుశకుసుమచయైశ్ఛిన్నతీరస్థనీరం
పాయన్నో గాంగమంభః కరికరమకరాక్రాంతరం హస్తరంగమ్

ఆదావాదిపితామహస్య నియమవ్యాపారపాత్రే జలం
పశ్చాత్పన్నగశాయినో భగవతః పాదోదకం పావనమ్
భూయః శంభుజటావిభూషణమణిర్జహ్నోర్మహర్షేరియం
కన్యా కల్మషనాశినీ భగవతీ భాగీరథీ దృశ్యతే

శైలేంద్రాదవతారిణీ నిజజలే మజ్జజ్జనోత్తారిణీ
పారావారవిహారిణీ భవభయశ్రేణీ సముత్సారిణీ
శేషాంగైరనుకారిణీ హరశిరోవల్లీదలాకారిణీ
కాశీప్రాంతవిహారిణీ విజయతే గంగా మనోహారిణీ

కుతో వీచీర్వీచిస్తవ యది గతా లోచనపథం
త్వమాపీతా పీతాంబరపురవాసం వితరసి
త్వదుత్సంగే గంగే పతతి యది కాయస్తనుభృతాం
తదా మాతః శాంతక్రతవపదలాభోఽప్యతిలఘుః

గంగే త్రైలోక్యసారే సకలసురవధూధౌతవిస్తీర్ణతోయే
పూర్ణబ్రహ్మస్వరూపే హరిచరణరజోహారిణి స్వర్గమార్గే
ప్రాయశ్చితం యది స్యాత్తవ జలకాణికా బ్రహ్మహత్యాదిపాపే
కస్త్వాం స్తోతుం సమర్థః త్రిజగదఘహరే దేవి గంగే ప్రసీద

మాతర్జాహ్నవీ శంభుసంగమిలితే మౌళౌ నిధాయాంజలిం
త్వత్తీరే వపుషోఽవసానసమయే నారాయణాంఘ్రిద్వయమ్
సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణప్రయాణోత్సవే
భూయాద్భక్తిరవిచ్యుతా హరిహరాద్వైతాత్మికా శాశ్వతీ

గంగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ప్రయతో నరః
సర్వపాపవినిర్ముక్తో విష్ణులోకం స గచ్ఛతి

 ఆది శంకరులు గంగమ్మను మూడు లోకాల పాపాలను హరించే దేవతగా అభివర్ణించారు. అదే రీతిలో మరెందరో గంగమ్మను నుతించారు.  ఆ తల్లి మహాత్యం మిగిలిన వివరాలు తరువాయి భాగంలో


శ్రీ రామ జయ రామ జయ జయ రామ

26, జులై 2010, సోమవారం

రాఘవం కరుణాకరం

ఆ రాముని స్తుతిస్తూ రాసిన ఒక అద్భుతమైన రచన. ఎవ్వరు రాసారో తెలియదు. సర్వ సులక్షణ సంపన్నుడైన ఆ నీల మేఘ శ్యాముని వర్ణన చాలా బాగా చేశారు గేయకర్త.  . యూ ట్యూబ్లో బొంబాయి జయశ్రీ  పాడిన ఆడియో విన్నాను. చాలా భక్తితో గొప్పగా పాడారు ఆవిడ. ఎందుకో, ఎన్ని దేవత స్తుతులు విన్నా, రాముని నుతించేవి చాలా తొందరగా హృదయానికి హత్తుకుంటాయి అనిపించింది.



రాఘవం    కరుణాకరం    భయనాశనం    దురితాపహం
మాధవం    మధుసూదనం    పురుషోత్తమం    పరమేశ్వరం    |రాఘవం|

బాలకం    భవతారకం జయభావుకం    రిపుమారకం
త్వాంభజే    జగదీశ్వరం    నరరూపిణం    రఘునందనం    |రాఘవం|
చిత్కళం    చిరంజీవినం    వనమాలినం    వరదున్ముఖం    |రాఘవం|
శాంతితం    శివసంపదం    శరధారిణం    జయశాలినం   
త్వాం భజే జగదీశ్వరం నర రూపిణం రఘునందనం    |రాఘవం|

25, జులై 2010, ఆదివారం

ఆత్మ సాక్షాత్కారమును పొందుటకు యోగ్యత


ఈ రోజు గురు పూర్ణిమ. సమర్థ సద్గురు సాయినాథుని చరితామృతం పారాయణానికి చాలా దివ్యమైన రోజని చరిత్రలోనే రాశారు. పొద్దున్న పారాయణ చేస్తున్నప్పుడు ఈ పేజీలు ఉన్న అధ్యాయం నన్ను ఈ పోస్ట్ రాయటానికి ప్రేరేపించింది.

సాయి సచ్చరిత్ర 16 -17 అధ్యాయములలో నుంచి ఒక ముఖ్యమైన అంశం - ఆత్మ సాక్షాత్కారమును పొందుటకు యోగ్యత. ఈ కింద పది సూత్రాలను అద్భుతంగా వివరించాడు హేమాడ్ పంత్, అంతకన్నా అద్భుతంగా తెలుగులో వివరించారు ప్రత్తి నారాయణ రావు గారు. సాయి చరిత్ర పారాయణ చేస్తే ఈ అంశాల గురించి వివరాలు తెలుస్తాయి.
  1. మోక్షాన్ని పొందుటకు తీవ్రమైన కోరిక
  2. విరక్తి లేదా ఇహ పర సౌఖ్యములందు విసుగు చెందుట 
  3. అంతర్ముఖత (లోనికి చూచుట)
  4. పాప విమోచన పొందుట 
  5.  సరియైన నడవడి
  6. ప్రియమైన వాటికంటే శ్రేయస్కరమైన వాటిని కోరుకొనుట
  7.  మనసును, ఇంద్రియములను స్వాదీనమందు ఉంచుకొనుట
  8. మనసును పావనము చేయుట
  9. గురువు ఆశ్రయము, సహాయం పొందుట
  10. భగవంతుని కటాక్షం

    22, జులై 2010, గురువారం

    ఇంద్రజాలం చేసే మురళీధరన్


    పాశ్చాత్యుల ఆలోచనలో ఒక పెద్ద లోపం ఉంది. తాము సాధించనిది ఇంకెవరైనా పాశ్చాత్యులు కాని వారు సాధిస్తే దాన్ని ఒప్పుకోలేరు, దాన్లో లేని లోపాలు వెతికి, ఆ వ్యక్తీ సాధనని ఒక ప్రమాణంగా స్వీకరించలేరు. ముత్తయ్య మురళీధరన్ విషయంలో  కూడా అంతే.  మురళీ వేసే స్పిన్ బంతులను ఎదుర్కొని ఆడలేక, అది చక్కింగ్ అని, అంతర్జాతీయ బౌలింగ్ రూల్స్ కి వ్యతిరేకమని ఏళ్ల తరబడి విమర్శించారు. ఏమయ్యింది చివరకి?. మురళి ఈరోజు 800 టెస్ట్ వికెట్లు, వన్డేలలో 515 వికెట్లు తీసుకున్నాడు. వచ్చే యాభై ఏళ్లలో ఈ మాంత్రికుడి రికార్డు ఎవరైనా దాట గలరా?. ఆస్ట్రేలియన్ క్రికెటర్ల ఆలోచనలో షేన్ వార్న్ బౌలింగ్ కరెక్ట్, కాని మురళి మాత్రం కాదు. పోనీ, మీరు ఎవరైనా మురళిలా వెయ్యండి ఎందుకంటే ఐ.సి.సి ఏమీ అతని బౌలింగ్ తప్పు అని తీర్పు ఇవ్వలేదే?. మురళికి వికెట్ల వర్షాన్ని కురిపించిన దూస్ర ఎంత మంది వెయ్య గలుగుతున్నారు మీలో?.

    ఇప్పటికైనా అతన్నిఅత్యుత్తమ స్పిన్ బౌలర్ గా ఒప్పుకొని అతన్ని గౌరవించండి. అలాంటి ఆటగాడిని అందించిన శ్రీలంకను అభినందించండి. ఆటగాడు ఎక్కడి వాడైన, రూపం ఎలా ఉన్నా, అతని విద్యను, నైపుణ్యాన్ని గుర్తించి, విలువనిస్తే అది క్రీడాస్ఫూర్తి.  మురళి టెస్ట్, వన్డే గణాంకాలు కింద:

    టెస్ట్ బౌలింగ్:

    132 మ్యాచ్లు - 800 వికెట్లు - 9 /51 ఒక ఇన్నింగ్స్లో బెస్ట్ బౌలింగ్ - 66 సార్లు ఒక ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు - ఒక టెస్టులో పది వికెట్లు 22 సార్లు - ఒక టెస్టులో అత్త్యుత్తమ బౌలింగ్ 16 /220 - బౌలింగ్ సగటు 22 .70

    టెస్టుల్లో వివిధ దేశాల మీద తీసిన వికెట్లు:

    ఇండియా - 105, ఆస్ట్రేలియా - 59, సౌత్ ఆఫ్రికా - 104, ఇంగ్లాండ్ - 112, న్యూజీలాండ్ - 82,  పాకిస్తాన్ - 80, వెస్ట్ ఇండీస్ - 82 , జింబాబ్వే - 87 , బంగ్లాదేశ్ - 89


    వన్డే బౌలింగ్:

    337 మ్యాచ్లు -  515 వికెట్లు - 7/30 ఒక మ్యాచ్లో అత్యుత్తమ బౌలింగ్  - 10 సార్లు ఒక మ్యాచ్లో ఐదు వికెట్లు - బౌలింగ్ సగటు 23.07

    కోనసీమ అందాలు

    కోనసీమ అందాల గురించి ఎంత చెప్పినా చాలదు. ఇదివరకు నాలుగు సార్లు తూర్పు, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణ జిల్లాల్లో క్షేత్రాలు దర్శిస్తూ అక్కడ అందాల్ని ఆస్వాదించాను. ఈ మధ్య నేను నరసాపురం వెళ్లి, అక్కడనుంచి అంతర్వేది కారులో వెళ్లాను. దాదాపు గుడివాడనుండి మొదలయ్యింది మన కోస్తా అందాలు. కాలువలు, కొబ్బరి చెట్లు, పచ్చగా నాట్లు, నారు మళ్ళ నిండా నీరు, అరటి తోటలు..ప్రకృతి అందమంతా అక్కడే ఉంది అనిపించింది. నరసాపూర్ ఎక్ష్ప్రెస్స్ తెల్లవారేసరికి ఈ అందాల్ని చూపించటం మొదలు పెట్టింది. ఇక అక్కడనుంచి 9 గంటలకు నరసాపురంలో దిగేంత వరకు రైల్లోంచి మాకు నేత్ర పర్వమే. కొబ్బరి చెట్లు ఎంత ఎత్తు, పొడవు, మరియు దట్టంగా ఉన్నాయో అక్కడ. మీ కనుచూపు అందినంత మేర పచ్చని వరిపొలాలు, గట్లు, కొబ్బరి తోటలు. కొన్ని వందల ఎకరాలు అలా ఒక దృశ్యంలో కనిపిస్తూనే ఉన్నాయి.

    గోదావరి జిల్లాల్లో ప్రవేశించగానే కనిపించేవి చక్కని కాలువలు, కాలువలు దాటటానికి కట్టిన వంతెనలు - వాటి చుట్టూ అల్లుకున్న జీవితాలు. కొన్ని వందల కిలో మీటర్ల దూరం ఇవి కనిపిస్తాయి. పొలాల మధ్యలో పెంకుటిల్లు, వసారాలు, శుభ్రంగా, హాయిగా జీవితాన్ని సాగిస్తూ, ప్రేమగా పలకరిస్తూ కనిపించే ప్రజలు అక్కడ. ఏ మాత్రం వాళ్ల జీవితాల్లో ఒత్తిడి లేదు అనిపిస్తుంది. కాలువలు దాటటానికి కొబ్బరి బోదెలు, రాళ్ళు, బండలు వేసుకుని, ఆ కాలువల్లో బట్టలు ఉతుక్కొనే జనాలు. కాలువ గట్టు పక్కనే మంచి పెంకుటిల్లు, గుడిసె, దాని చుట్టూ పాదులు, మొక్కలు, వృక్షాలు, మధ్యలో పశువుల కొష్టాలు, ఆరోగ్యంగా, పుష్టిగా ఉన్న పశువులు - ఇదీ ఆ గ్రామీణ జీవితం. గ్రామాల లాగా కనిపించినా అక్కడ ఉన్నంత ఆధునికత మనకు కూడా లేదేమో అనిపిస్తుంది. పచ్చని అరటి పండ్ల గెలలు, కుప్పలుగా పోసిన కొబ్బరి కురిడీలు అక్కడ సర్వ సామాన్యం. బాగా నీరుంటే కలువలు పెరుగుతాయి కదా. ఈ ప్రాంతాల్లో రంగు రంగుల కలువలు కనిపిస్తాయి చెరువుల్లో. ప్రతి ఊరు ఒక దృశ్య కావ్యమే.

    నరసాపురం ఎక్ష్ప్రెస్స్ మందవల్లి, కైకలూరు, ఆకివీడు, భీమవరం, వీరవాసరం, పాలకొల్లు మీదుగా నరసాపురం చేరుతుంది. ఈ ప్రాంతాలన్నీ ప్రకృతి మాట అందాల నివాసాలే. హరిత శోభలు విశ్వరూపమై ఉన్నాయా ఇక్కడ అన్నంత ఆవేశం, ఆనందం కలుగుతుంది. కాలువలు, గట్లు, పిల్ల కాలువలు, వంతెననలు నిర్మించిన వారికి నా జోహార్లు. అవిలేకపోతే కోనసీమ లాంటి భూతల స్వర్గం మనకు ఉండేది కాదు. దేవుని దేశంగా పేరుపొందిన కేరళ రాష్ట్రంలో కన్నా మన కోన సీమ అందాలు మిన్న. ఇది మన భూమి, మన భాష, మన సంస్కృతి, మన ఆప్యాయతలు ఉన్న సువర్ణ భూమి. అన్నపూర్ణ అంటే ఈకోనసీమే. సంపద అనేది పట్టణాల్లో ఉంది అనుకుంటే పొరపాటు. నిజమైన సంపద ఈ ప్రకృతి. కొన్ని వేల సంవత్సరాల పాటు ఒక మంచి జీవన విధానానికి పునాది వేసే ప్రకృతి అసలు లక్ష్మి. మళ్ళా హైదరాబాద్, మన కాంక్రీట్ అడవులు ఈ కోనసీమ పచ్చదనం ముందు వెలవెల పోయి జీవచ్చవాలుగా అనిపించాయి నాకు.

    ప్రకృతి ఎక్కడ ఉంటే అక్కడ పరమాత్మ అన్నది ఎంత సత్యమో ఈ ప్రాంతాలో తిరిగితే మేకు అర్థం అవుతుంది. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్నన్ని అతి పురతాన, మహిమాన్విత పుణ్యక్షేత్రాలు ఆంధ్ర ప్రదేశ్లో ఎక్కడా లేవు . ఆ ప్రకృతి పురుషుల కలయిక, నదీ నాదాలు, చెరువులు, కాలువలు, తీరాలు భగవంతుని ప్రతిరూపాలు. అందుకే అక్కడ పంటలు, ప్రజలు, వృత్తులు బాగా వృద్ధిలో ఉన్నాయి. ప్రకృతి ఒడిలో భగవంతుడు నివసిస్తాడు అనటానికి కర్నాటకలోని పశ్చిమ కనుమలు, సహ్యాద్రి పర్వతాలు ఇంకొక తార్కాణం. వాటి వివరాలు ఇంకొక సంచికలో.

    బాబ్లీ ప్రాజెక్టు - రాజకీయం - రెండో అంకం

    మొత్తానికి మరాఠీ ఖాఖీల చేత లాఠీ దెబ్బలు తిని, నాలుగు రోజులు అక్కడ మగ్గి, నాటకీయంగా చంద్రన్న, బృందం హైదరాబాద్ వచ్చారు. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు చంద్రన్నా మన పెద్దలు. కానీ తమరు ఇంట్లో ఏమి చెయ్యలేక మహారాష్ట్రలోకి వెళ్లి నేను 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాను, నాకు గౌరవం ఇవ్వాలి, మంచి బస్సు ఇవ్వాలి, బస ఇవ్వాలి అంటే ఎలా సార్. ఢిల్లీలో మేడంకి మీ మీద బానే గుర్రు ఉంది సార్. అది గుర్తుపెట్టుకొని, మీరు తొమ్మిదేళ్ళలో బాబ్లీ గురించి ఏమి చేశారో ఒక సారి రివైండ్ చేసుకోండి. కాబట్టి, మీకు మర్యాదలు చేయాల్సినంత సీన్ లేదు.

    ఇకపోతే, ఎమ్మెల్యేలను కొట్టి, మహిళా ఎమ్మెల్యేలను అవమాన పరచి, కనీస వసతులు ఇవ్వకపోవటం అనేది రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పెద్ద తప్పు. అలాగే, బాబుని ఈ సమయంలో విమర్శించి కే.సి.ఆర్ హాయిగా తమ చేతిలో ఉన్న తెలంగాణా ప్రాంతపు జనాల వోటును కొంత పళ్లెంలో పెట్టి చంద్రన్నకి ఇచ్చినట్టే. బాబు రాజకీయ చాణక్యం, కుతంత్రం మనకు బాగా తెలిసి ఆయనకు అవకాశం ఎందుకు ఇవ్వటం?. నిజంగా తెలంగాణా రావాలి అంటే కాంగ్రెస్ పార్టీలో మార్పు వస్తే చాలు. దానికి చంద్రన్న ఆశీర్వాదం అక్కర్లేదు. ఇంతే కాదు, తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే, ఆ ప్రాంతంలో చంద్రన్న పట్టు, ప్రభావం ఉండే ప్రసక్తే లేదు. కాబట్టి, ఆయనకు ఎందుకు మనం అవకాశాలు ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి.

    బాబ్లీ అంశం తెలంగాణలో ఉప ఎన్నికల్ని ఏ మాత్రం ప్రభావితం చెయ్యదు అని కాంగ్రెస్, కే.సి.ఆర్ అనుకుంటే, ఆ విషయం గురించి పట్టించుకోకూడదు, మాట్లాడ కూడదు. కానీ, వారిలో ఈ విషయంలో భయం కనిపిస్తోంది. రాజకీయాల్లో, ప్రత్యర్థి ఎత్తుకు పై ఎత్తు వెయ్యాలి కానీ చేతులు కాలాక ఆకులు రాసుకోవటం ఎందుకు?. బాబు 9 ఏళ్లలో ఏమి చేసాడు అనే నినాదం ఇంక ఎక్కువ రోజులు పని చేయ్యదండి. ఎందుకంటే, మీరు అధికారంలోకి వచ్చి 6 ఏళ్ళు దాటింది. మీరు ఏమి చేస్తున్నారు తెలంగాణా, బాబ్లీ విషయంలో ఈ ఆరేళ్లలో?. అంతమాత్రం వోటు వేసే ప్రజలు ఆలోచించరా?.

    ఏమి చేసినా, చెయ్యకపోయినా - సీమాంధ్ర ప్రజల అభిమానం చూరగొని ముఖ్యమంత్రి కావాలన్న జగన్ యాత్ర బానే సాగుతోంది. నేను ఇటీవలే ఆయన పర్యటిస్తున్న ప్రాంతాలకు వెళ్ళాను. ప్రజలకు అక్కడ వై.ఎస్.ఆర్ దేవుడు. వాళ్లు తప్పకుండా జగన్ వెంటే ఉన్నారు అన్నది స్పష్టంగా కనిపించింది. అభిమానం ఉన్నంత మాత్రాన వోట్లు రావాలని కూడా లేదు. అందుకనే, జగన్ అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాడు రోశయ్యను దింపి తాను రావాలని. ఈ నేపథ్యంలో చంద్రన్న బాబ్లీ విషయంలో ఒక అడుగు ముందు వేసి - రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు నాకన్నా ఎవ్వరికీ తెలీవు, పట్టవు అని బ్రహ్మాస్త్రం వదిలాడు. అది బలహీనంగా ఉన్న తెలంగాణా కాంగ్రెస్ నాయకులకు దెబ్బే. అలానే, జగన్ మీది నుంచి దృష్టిని కొంత మళ్ళించ వచ్చు. ఉప ఎన్నికల్లో ఓట్లు, సీట్లు రాకపోయినా, టీ.డీ.పీ ఆ ప్రాంతంలో పాతుకు పోవాలని ఈ యత్నం అంతా. దానికి మన టీ.ఆర్.ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇతోధికంగా సహాయం చేస్తున్నారు.

    ఇవన్ని చూస్తుంటే, ఆంధ్ర రాజకీయ చిత్ర పఠం ఒక వైకుంఠ పాళీలా ఉంది.  ఎప్పుడు ఎవరు ఎలా పైకి వెళ్తారు, ఎలా అకస్మాత్తుగా కింద పడతారు అనేది చెప్పటం కష్టంగానే ఉంది. వై.ఎస్.ఆర్ కష్టం బూడిదలో పోసిన పన్నీరు అవుతుందా?. లేక కాంగ్రెస్ వాళ్లు జాగ్రత్త పడతారా? బాబు ఈ దూకుడును ఎన్నాళ్ళు చూపిస్తూ, ఎంత రాజకీయ లబ్ది పొంద గలరు?. వేచి చూడాల్సిందే.

    21, జులై 2010, బుధవారం

    అమెరికా-ఇండియా: పిల్లలు, తల్లిదండ్రుల ఆలోచనలు

    "మా పిల్లలిద్దరూ అమెరికాలో ఉన్నారండి. ఈ మధ్య దాక ప్రతి సంవత్సరం పిల్లల పురుళ్ళనో ఇంకోటనో అక్కడికి వెళ్లి వచ్చే వాళ్లము. డెబ్భై కి దగ్గర పడుతున్నాము. ఇంక అంతంత దూరాలు ప్రయాణం చేత కావట్లేదు. మా వారేమో 'నాకు అక్కడ ఏమి తోచట్లేదు, ప్రతిదానికి వల్ల మీద ఆధార పడాలి,  బయటకి పోవటానికి లేదు, రావటానికి లేదు, ఎప్పుడూ ఆ కొంపలో పడి ఉండాలి.  ప్రతిది వీకెండ్ లో జరగాలి. నేను రాను. ఇక్కడే ఉంటాను, నువ్వు కావాలంటే వెళ్ళు' అంటున్నారు వదిన గారు. అమ్మాయేమో పిల్లల్ని చూసుకోవటం ఇబ్బందిగా ఉంది అని రమ్మని ఒకటే ఫోన్లు.  నాకా మోకాళ్ళ నొప్పులు, బీపీ, ఇప్పుడిప్పుడే షుగర్ కనిపిస్తోంది. నీరసం, దడ. ఒకరోజు బాగుంటే ఇంకొక రోజు పడుకోవటమే. మాకు చేసే వాళ్ళు లేరని మేము కనీసం అనుకోడానికి కూడా లేదు. ఆ చలి, ఆ వాతావరణం పడి చావట్లేదు. ఏమి చెయ్యాలో పాలు పోవట్లేదు వదినగారు. అబ్బాయేమో ఈ మధ్యనే పెళ్లి అయ్యింది, సంపాదనలో ఇప్పుడే పడ్డారు, ఇప్పటికిప్పుడు మాకోసం తిరిగి రమ్మనటం ఎలా?. ఇక్కడ మా పనులకు ఎన్నాళ్ళు బయట వాళ్ల మీద ఆధార పడతాం చెప్పండి?. పిల్లలు అక్కడ, మేము ఇక్కడ ఏంటో ఈ బతుకు."

    ఇది ఆంధ్ర ప్రదేశ్ లో వృద్ధాప్యపు అంచున ఉన్న సగటు తల్లిదండ్రుల యొక్క ఆవేదన.  ఇక నాణాన్ని రెండోవైపు తిప్పితే:

    "మా ఆవిడ కడుపుతో ఉందిరా. రెండు నెలల్లో డెలివరీ ఉంది. అమ్మ, నాన్నను సాయంగా ఉంటుంది రమ్మని అంటున్నాను. తను ఉద్యోగం ఈ మధ్యనే చేరింది, కాబట్టి వాళ్లు ఇచ్చే  8 వారాల సెలవు తర్వాత బిడ్డ ఎట్లాగ అని టెన్షన్. ఉద్యోగం మానుకుంటేనేమో మళ్ళీ వస్తుందన్న నమ్మకం లేదు. నా ఉద్యోగం అంతంత మాత్రంగా ఉంది ఎప్పుడు ఊడుతుందో తెలియదు. గ్రీన్ కార్డు లేదు. ఉద్యోగం పొతే హెచ్-1 మీద ఉద్యోగాలు తీసుకోవట్లేదు ఎక్కువ. అమ్మ, నాన్నకు  ఆరోగ్యం అంతంత మాత్రమే..ఇక్కడికి వచ్చి జబ్బున పడి నేను సరిగ్గా చూపించలేక ఎలాగా అని ఇంకో పక్క..ఏంటోరా అర్థం కావట్లేదు పరిస్థితి...ఇవన్ని అమ్మ, నాన్నకు చెప్పలేను. పోనీ అత్త గారి వాళ్ళను రమ్మని అందామంటే అంటే మామ గారు ఉద్యోగం సెలవు లేదు, ఆయనకు ఇబ్బంది. "

    "అమ్మ, నాన్న బాబు పుట్టినప్పడు వచ్చారే.  నేను ఇంట్లో ఉన్నన్ని రోజులు వాళ్లకి అసలు బోర్ కొట్టలేదు. కానీ ఇప్పుడేమో నేను ఆఫీసుకి వస్తున్నాను. వాళ్ళకు బాబు తప్ప వేరే మొహం పగలంతా లేదు. బాబుని వదిలి ఎక్కడికి వెళ్లే పరిస్థితి లేదు. నాకేమో వీడు ఇంక సెలవులు ఇవ్వట్లేదు. పోనీ ఇంట్లోంచి పని చేద్దామా అంటే పిల్లాడితో సరిగ్గా వర్క్ చూసుకోలేకపోతున్న. ఆఫీసు వాళ్లు ఫోన్ చేసినప్పుడు పిల్లాడి చప్పుడు పక్కన వినిపిస్తే విసుక్కుంటున్నారు. ఇల్లు కొనుక్కున్నాము. ఆ లోన్ బోలెడు. ఒక్క జీతంలో కట్టలేము. కాబట్టి నేను ఉద్యోగం చెయ్యాల్సిందే. వాళ్లకు ఇబ్బంది అని తెలిసినా నాకు వేరే గత్యంతరం లేదే. ఏవైనా ప్రదేశాలు చూపిద్దామ అంటే అన్ని ఒకేలా ఉంటాయి అమెరికాలో మాకు బోర్ అంటున్నారు. ఎక్కడికి పోయిన అదే వాల్మార్ట్,  అదే ఇండియన్ స్టోర్స్. వాళ్లకు ఇండియాను ఇక్కడ సృష్టించలేము కదా. ఆలోచిస్తే పిచ్చెక్కుతోంది."

    ఇవి అమెరికాలో ఉన్న పెళ్ళైన సగటు తెలుగు ఆడ, మగల ఆలోచన.  మీరే చెప్పండి ఇందులో ఎవరి తప్పుందో?. ఎవరి బాధల్లో వాళ్ళున్నారు. బాధ్యతలు, సంసారం, డబ్బు, విదేశం, మన సంస్కృతికి దూరం కాకూదన్న తపన, వృద్ధాప్యం, ఒంటరి తనం, పిల్లలతో ఉండాలన్న సహజమైన కోరిక - వీటన్నిట మధ్య కొట్టు మిట్టడుతున్న తల్లిదండ్రులు, పిల్లలు లక్షల మంది.

    దీన్ని కొంత విశ్లేషణ చేద్దాము.
    1. పెరిగే వయసులు ఉన్నప్పుడు తల్లిదండ్రులు పిల్లల మీద చాలా ఆశలు పెంచుకుంటారు. వాళ్ళే లోకమని తమ రక్తం ఓడ్చి చదివించి, మేము పడిన కష్టాలు మా పిల్లలు పడకూడదు అన్న ఆలోచనతో తమ పరిధి దాటిన అమెరికా అనే "స్వర్గానికి" పంపిస్తారు చదువులకు. ఇక్కడ మొదటి రిస్క్ తల్లిదండ్రులు తీసుకున్నారు. తమకు తెలియని, తాము చూడని కొత్త దేశానికి కేవలం 'అక్కడికి వెళితే మనకన్నా పిల్లలు బాగుంటారు' అన్న అపోహతో. ఈ అపోహ తల్లిదండ్రుల్లో  కొంత కలగజేసేది పిల్లలే. డబ్బు సంపాదన అనేది ఎక్కడ ఉండినా చెయ్యొచ్చు అనేది చాలా మంది తల్లిదండ్రులకు, పిల్లలకు  తెలియదు. ఎంత డబ్బు సంపాయిస్తాము అనేది మన సామర్థ్యము, లౌక్యము, ఫ్లెక్సిబిలిటీ మీద ఆధార పడి ఉంటుంది. వేరే దేశంలో ఇది తేలిక అనిపించినా వాటిక సమపాళ్ళలో మనకు అర్థం కాని కొత్త కష్టాలు కూడా దాగుంతాయని ఊహించరు తల్లిదండ్రులు, పిల్లలు.
    2. అమెరికా చదువులు తేలిక కాదు. కొత్త దేశం, అప్పటిదాకా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోని  అమ్మాయి/అబ్బాయి ఒక కొత్త దేశంలో, కొత్త సంస్కృతిలో, కొత్త విద్యా విధానంలో ఒక్క సారి మునుగుతారు. అప్పుడు డబ్బు, దాని విలువ, ఎంత కష్టపడితే ఒక డాలర్ మిగులుతుందో తెలుస్తుంది. డాలర్ విలువెంతో తెలుస్తుంది. దాంతో 'మేము చాలా కష్టపడి చదివాము అమెరికన్ యూనివెర్సిటీలో, కాబట్టి మేము బాగా సంపాయించి ఆ కష్టం యొక్క ఫలితాన్ని పూర్తిగా ఈ దేశంలోనే అనుభవించాలి' అని మనసులో చాలా మందికి నిర్ణయం ఏర్పడుతుంది. అమెరికాలో సుఖాలేంటో మొదటి రుచి చూస్తారు (సాఫీ జీవితం, పనులు వాటంత ఆవే తేలిగ్గా అవ్వటం, రూల్స్ పాటించే ప్రజలు, మంచి రోడ్లు, సార్లు, చెట్లు, పార్కులు, స్వేచ్చ వగైరా వగైరా).   ఈ నిర్ణయంతో పాటే ఇండియా వెళ్ళకూడదు అనే నిర్ణయం కూడా చాలా మంది తీసుకుంటారు, తమకు తెలియ కుండా. 
    3. కానీ, ఇది పూర్తిగా కూలంకషంగా ముందుచూపుతో ఆలోచించి తీసుకునే నిర్ణయం కాదు. ఎందుకంటే, జీవితంలో ప్రతి ఒక్క మెట్టులో వేర్వేరు ఆలోచనా పద్ధతులు, అవసరాలు, ప్రాముఖ్యాలు ఉంటాయి. పెళ్లి కాక ముందు/చదువుకునేటప్పుడు ఉండే ఉత్సాహంలో అమెరికా అంతా పచ్చగా, తీయగా, హాయిగా కనిపిస్తుంది. పెళ్లి అయ్యి, ఇల్లు కొనుక్కుని, ఇండియాలో ఉన్న అయిన వారి జీవితాల్లో ముఖ్యమైన అవసరాలు/ఘట్టాలు  (పెళ్ళిళ్ళు, మరణాలు) మిస్ అయినప్పుడు అసలు నిజాలు బయట పడుతుంటాయి - మనుషులు, బంధుత్వాలు, ఆత్మీయతలు, సంస్కృతి, తెలుగుదనం, ఇరుగు, పొరుగు, పెళ్ళిళ్ళు, గుళ్ళు ఇలా ఎన్నో. ప్రతిది అమెరికాలొ బాఉండదు ఇండియాలో బాగుంటుంది అన్న ఆలోచన తొలవటం మొదలవుతుంది.. అలాగే, అమెరికాలో పని వాళ్లు ఉండరు, ఇండియాలో డబ్బులు పారేస్తే పని వాళ్లు దొరకుతారు, ఇండియాలో పిల్లల్ని పనిమనుషుల దగ్గర ఉంచి ఉద్యోగానికి పోవచ్చు, లేకపొతే అమ్మ, నాన్నదగ్గర ఉంచొచ్చు ఇలా ఎన్నో అభిప్రాయలు. 
    4. ఇవేవి పూర్తిగా సరైన అభిప్రాయలు కాదు. ఆంధ్ర ప్రదేశ్లో ఉన్న జనంలో కూడా బంధుత్వాలు, ఆత్మీయతలు చాలా తగ్గిపోయాయి. పొగరు/అసూయలతో, ప్రేమతో  పిలిచినా రాని దుస్థితి. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు, నిజంగా పాశ్చాత్య దేశాలో కూడా లేని అసభ్య, అనాగరిక వేషాలు ఇక్కడ ఉన్న వాళ్లు వేస్తున్నారు. అలాగే, అమ్మ, నాన్నలను  బయటకు గెంటి, అనాథ ఆశ్రమాల్లో ఉంచిన వాళ్లు చాలా మంది ఉన్నారు. పిల్లలకు మన భాష, సంస్కృతీ నేర్పించని స్కూళ్ళు, తల్లిదండ్రులే ఎక్కువ.  తల్లిదండ్రులు కూడా చాలా మంది స్వాతంత్ర్యాన్ని కోరుకుంటున్నారు. బాధ్యత పిల్లల వైపు నుంచి కనిపిస్తేనే తాము వాళ్లకు సాయంగా ఉండాలని మనసులో అనుకుంటున్నారు. అమెరికాలో లేదు, ఇండియాలో ఉంది అన్న ఆలోచనలో - ఇండియాలో ఉన్న కాలుష్యము, ట్రాఫిక్, జబ్బులు, దోపిడీలు, లంచాలు, రోడ్డు ప్రమాదాలు, కిడ్నాప్లు, హత్యలు, రహస్యంగా జరుగుతున్నా పెళ్లి ముందు శృంగారం, ఏ మాత్రం అడ్డు, అదుపు లేని టీవీ చానల్స్,  చదువుల్లో ఊహించలేని పోటీ, ఒత్తిడి (ఓటమి చూసిన విద్యార్థుల ఆత్మ హత్యలు), ఆకాశంలో ఉన్న ధరలు - వీటన్నిటిని మర్చిపోతారు. ఇక్కడ పనివాళ్ళు మూడు రోజులు వస్తే రెండు రోజులు రారు, చుట్టాలు వచ్చారు అంటే ఎక్కువైనా అడుగుతారు లేదా మానేస్తారు, ఏదైనా రిపైర్ వచ్చిందంటే వాళ్ల చుట్టూ వంద సార్లు తిరగాలి, ఫోన్ చెయ్యాలి - అమెరికాలో ఉంది ఇండియా గురించి కలలు  కనే చాలా మందికి ఈ విషయాలు తెలియవు, తెలిసినా, కళ్ళతో చూస్తే కాని ఇవన్ని ఎంత ఒత్తిడో మనిషి మీద అర్థం కాదు. మంచి స్కూల్లో సీటు రావాలంటే లక్ష రూపాయలు డొనేషన్ కట్టాలి. మీకు వామ్మో అనిపిస్తే మేము ఏమి చెయ్యలేము. కాని అది వాస్తవం. అలాగే ఒక మంచి కాలేజీలో ఎం.బీ.బీ.ఎస్ డొనేషన్ కోటి రూపాయలు దాటే. సంవత్సరానికి ఇంజనీరింగ్ ఫీజు ముప్ఫై వేలు, ఇవి కాక డొనేషన్, నెల ఖర్చులు.  ఇన్సూరెన్స్ లేకుండా హాస్పిటల్ లో వారం ఉంటే ఖర్చు లక్ష రూపాయలకు తక్కువ కాదు. గుండె ఆపరేషన్ కు మూడు-నాలుగు లక్షలు కనీసం ఖర్చు. ఇలా ఎన్నో తెలియని, ఊహించలేని మార్పులు మీ చిన్నతనానికి, ఇప్పటికీ జరిగాయి ఇక్కడ. 
    5. అలాగే, అమెరికాలో ఇండియాలో కన్నా మన సంస్కృతిని, భాషను కాపాడి, అనుసరిస్తున్న వాళ్లు చాలా మంది ఉన్నారు. అక్కడ ఉన్నంత మంచి, నిజాయితీ ఉన్న సంగీతం, నృత్యం నేర్పే అధ్యాపకులు ఇక్కడ లేరు. అక్కడ వీళ్ళు 10-15 ఏళ్ళు నేర్పించి ఆ విద్యార్థిని ఆ శాస్త్రంలో నిష్ణాతులుగా చేస్తున్నారు.  అలాగే, అక్కడ తెలుగు భాష మీద చూప్తున్న శ్రద్ధ, వాగ్గేయ కారులను ప్రచారం చేసే కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యాక్రమాలు ఎన్నో. సిలికానాంధ్ర అనే సంస్థ అమెరికాలో ఆవిర్భావించిందే తెలుసా?. ఎన్ని భారతీయ సంస్థలు లక్ష గళ అర్చన లాంటి కార్యక్రమాలు నిర్వహించి మనల్ని గిన్నీస్ బుక్ లోకి ఎక్కించాయి?.   అక్కడ పెరిగిన పిల్లలందరూ చెడిపోతున్నారు అనేది తప్పు. మీకు తెలియ కుండ ఇక్కడున్న పిల్లలు చాలా పెద్ద తప్పులు చేసి మానసికంగా దెబ్బ తింటున్నారు. కాబట్టి అమెరికా పిల్లలు అంటే వారికి మన విషయాలు తెలియవు అనేది చాలా పెద్ద దురభిప్రాయం. ఇండియాలో మీ పిల్లలు సెల్ ఫోన్లో, బయటికి వెళ్ళినప్పుడు ఏమి చేస్తున్నారో మీకు తెలుసా?...అక్కడ చాలా విషయాల మీద ప్రభుత్వం, సమాజం చాలా స్పృహతో చట్టాలు చేశారు. కాబట్టి విలువలు అక్కడే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కాకపొతే మన హిందూ మతంలో, శృంగారం, పెళ్లి, ఆడ వాళ్లకు ఉన్న కట్టుబాట్లు వాళ్లకు లేవు కాబట్టి అక్కడి వాళ్లు చేసే ప్రతిది మనకు తప్పుగా, నేరంగా, ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. తక్కువగా బట్టలు వేసుకున్నంత మాత్రాన వాళ్ళంతా పతితలు ఎలా అవుతారు?. 
    6. ఇండియాలో పెరిగిన పిల్లలు చదువులు తప్ప మిగత విషయాలలో ఎంత రాణిస్తున్నారు?. ఎంత  స్వయంశక్తులై నలుగురికి ఉపాధి కలిగించగలుగుతున్నారు?. అమెరికాలో 10 +2 తర్వాత మంచి కాలేజీలో (మన ఐ.ఐ.టి లాంటి విద్యా సంస్థలలో)  డిగ్రీ చదవాలి అంటే విద్యార్థి చదువుతో పాటు ఆట, సేవలలో కొంత ప్రతిభ చూపించాలి. అలాగే, అన్ని విషయాలలో - చదవటం, రాయటం, గ్రహించటం, భాషణలు ఇవ్వటం లాంటి ప్రతిభను సమపాళ్ళలో చూపించాలి. కాబట్టే, అక్కడి విద్యార్థులు 17 -18 ఏళ్ళ వయసుకి తమంతట తాము ఉండగలిగే సామర్థ్యం చూపుతారు. ఇండియాలో 18 ఏళ్ళ కుర్రాడిని తనకు ఇష్టమైన సబ్జెక్ట్ మీద ఒక అరగంట మాట్లాడమంటే ఎంత మంది మాట్లాడగలరు?. ఎంత మంది తమ అభిప్రాయాల్ని నిర్దిష్టంగా వెలిబుచ్చగలరు?. ఎంతమంది తమ పని తాము చేసుకొని నాలుగు రూపాయలు సంపాదించగలరు?. ఎంతమంది అమ్మాయిలు వాళ్ల నాన్న లేకుండా వేరే ఊళ్లకు వెళ్లి తమ పనులు తాము చేసుకోగలరు?. (ఇక్కడ పరిస్థితులు కూడా మారుతున్నాయి కానీ క్వాలిటీ, క్వాంటిటీ ఇంకా చాలా తక్కువ).
    నా ఉద్దేశంలో, ఎక్కడి సమస్యలు, సుఖాలు అక్కడ సమానంగా ఉన్నాయి. మనం ఒక సమయంలో ఏది అయితే ముఖ్యం అనుకుంటామో అది ముందు మెట్టులో ముఖ్యం కాక పోవచ్చు. అందుకని అన్ని కావాలి అనుకుంటే అది మాత్రం జరగదు. సుఖమైన జీవితం, వసతులు, ప్రమాణాలు - భారత దేశంలో కూడా ఉన్నాయి. కాని చాలా తక్కువ నిష్పత్తిలో, చాలా ఎక్కువ ధరలో. వెలకట్టలేని తల్లిదండ్రులు, బంధుత్వాలు - ఇవి పూర్తిగా మీరు అనుకున్నట్టు లేవు, ఉండవు కూడా. వీటిలో ఏది/ఏ కొన్ని అతి ముఖ్యమో తెలుసుకొని, దానికోసం ఎంత వెల, వ్యయప్రయాసలైన సరే మనసును సిద్ధంగా ఉంచుకోండి.  ఏ కొన్ని అయితే మీకు ఆత్మ సంతృప్తిని ఇచ్చి, మీలో న్యూనతా భావం లేకుండా చేస్తుందో అవి చెయ్యండి. వాటిని పొందండి. మిగతావి కోల్పోవటానికి మానసికంగా సిద్ధం కండి. ఇవి అమెరికాలో కావచ్చు, ఇండియాలో కావచ్చు. ఇవి పూర్తిగా మన మానసిక పరిస్థితి, ప్రాముఖ్యాలు, ఎటువంటి జీవన శైలిని కోరుకుంటున్నాము అన్న దానిమీద ఆధార పడి ఉంది.

    ఈ సందర్భంలో నాకొక పాట గుర్తుకొస్తున్నది.  'అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న...ఆరాజుకు ఏడుగురు కొడుకులున్నారు వారు చదువు సంధ్యలుండికూడ చవటలయ్యారు ఉత్త చవటలయ్యారు...'. మనిషి చదివి కూడా చవట ఎందుకు అవుతున్నాడు?. తనకు ఏమి కావాలో అది తెలుసుకోలేక, ఉన్న దానితో సంతృప్తి పడక, అన్నీ కావాలని, ఆత్రుతతో ఉన్నది పోగొట్టుకోవటం వలన. చదువు, డబ్బే కాదు జీవితంలో ఆనందాన్నిచ్చే సంతులన, సమాజం, పరిసరాలు కూడా చాలా ముఖ్యమని తెలుసుకోక పోవటం వలన.

    యుక్త వయస్సులో ఉన్నవాళ్ళు: మిమ్మల్ని జీవితాంతం మీరు రెండు పడవల్లో చెరొక కాలు పెట్టిన పరిస్థితిలో ఉంచుకోకండి. మీకు తృప్తి, ఆనందం ఇచ్చే అతి ముఖ్యమైన ఓ మూడు అంశాలను మీరు ఆలోచించి, నిర్ణయించుకొని వాటిని సాధించుకోండి. త్యాగాలకు సిద్ధంగా ఉండండి.

    తల్లిదండ్రులు: మీరు ప్రోత్సహించి పంపించిన పిల్లలు మీరు రమ్మనప్పుడు రావటానికి పరిస్థితులు చాలా మీరు ఊహించలేకుండా ఉంటాయి. మీ పిల్లలకు ఆ సుఖాలు కావాలి అనుకుంటే, కొంత  మీ అంతటా మీరు ఉండటం అలవాటు చేసుకుంటే మంచిదేమో?. ఇంతకన్నా ముఖ్యం: మంచి విలువలు, ప్రేమ, ధర్మం, ధైర్యం, సామర్థ్యం ఇవి ముఖ్యం కాని డబ్బు, కార్లు,స్కూళ్ళు, పార్కులు కాదు. చెట్టులో కాండం లాంటివి - విలువలు, ప్రేమ, ధర్మం, ధైర్యం, సామర్థ్యం. ఆకుల్లంటివి డబ్బు, కార్లు, హోదా వగైరా లాంటి సుఖాలు. ఒక ఆకు పొతే ఇంకో ఆకు వస్తుంది, కాని కాండమే లేకపొతే?. ఆలోచించండి. మీ పిల్లల్ని ఎలా పెంచాలో, వారికి ఏది ముఖ్యమని చెప్పాలో?.

    స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. స్వధర్మమనేది మనం ఆచరించి, మన పిల్లలకు నేర్పితే కదా వాళ్లు దాన్ని పాటించేది?.  మీరు పాటిస్తున్న ధర్మం తప్పు అనుకుంటే దాన్ని పాటించకండి. మేము పడిన కష్టాలు మీరు పడ కూడదు అని మనం నేర్పాల్సిన విషయాలు నేర్పని తప్పు చేసేది మనమే. మరి వాటి ఫలితాలు కూడా అనుభవించాలి కదా?. జిల్లేడు చెట్టు నాటి పనస పళ్ళు కాయాలంటే ఎలాగండి?. మీరు మీ అమ్మాయికి వంట నేర్పించరు, కానీ మీ కోడలు మీకు బాగా వండి పెట్టాలి. మీరు అవతలావాళ్ళ దగ్గరనుంచి ఏమి ఆశిస్తున్నారో, దాన్ని మీరు పాటిస్తున్నారా?. ఆలోచించండి.....ఏమంటారు?.

    ప్రాధాన్యతలు, ప్రాముఖ్యాలు: ఇవి చాలా స్వంతమైన విషయాలు. చదువు, ఉద్యోగం, డబ్బు, హోదా - వీటికి దేశం/రాష్ట్రం/పట్టణంతో మనం అనుకున్నంత సంబంధం లేదు. పల్లెటూరులో ఉండి కూడా ఇవన్ని సాధించి తమ ప్రతిభను చూపిన వాళ్లు చాలా మంది ఉన్నారు. మనకు తేలికగా ఇవి కావాలి అంటే కుదరదు. 16,000 వేల మైళ్ళు వెళుతున్నాము అంటే -  దానికి చాలా ఆలోచించి, అది మన జీవన శైలిని, విధానాన్ని మారుస్తుందని తెలుసుకొని, దాని వల్ల వచ్చే ఆటు, పోటులను తట్టుకునే శక్తి మనకు ఉండాలని, అక్కడ ఇక్కడ పరిస్థితులు సృష్టించలేమని - మనకు వెళ్ళేటప్పుడు ఇవన్ని కూలంకషంగా అర్థం అయ్యే పరిస్థితి ఉండదు. ఒకటి రెండు అంశాలు/ప్రాధాన్యతలు  (విద్య, డబ్బు) ఆధారంగా నిర్ణయం తీసుకొన్న నిర్ణయం అన్ని అంశాల్లో కరెక్ట్ అవ్వలేదు. కానీ, మీ ఆ ఒకటి, రెండు అంశాలు/ప్రాధాన్యతలు చాలా ముఖ్యమైనవి అయితే, మీకు దువిధ అనేది చాలా తగ్గుతుంది.

    ఇంకొక విషయం - మనం ఎక్కడున్నా, ఆ క్షణాన్ని, అక్కడ ఉన్న మంచి విషయాన్ని గ్రహించి, ఆనందించి, ఆస్వాదించకపోతే - మనం ఎక్కడున్నా ఈ రంధ్రాన్వేషణ తప్పదు. ఆత్రేయ గారు రాసిన ఈ పాట ఈ వ్యాసాంశానికి మంచి కొసమెరుపు.

    మౌనమె నీ భాష ఓ మూగమనసా
    తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు
    కల్లలు కాగానె కన్నీరవుతావు

    చీకటి గుహ నీవు చింతల చెలి నీవు
    నాటక రంగానివే మనసా తెగిన పతంగానివే
    ఎందుకు వలచేవో ఎందుకు వగచేవో
    ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో

    కోర్కెల చెల నీవు కూరిమి వల నీవు
    ఊహల ఉయ్యాలవే మనసా మాయల గయ్యాళివే
    లేనిది కోరేవు ఉన్నది వదిలేవు
    ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు

    20, జులై 2010, మంగళవారం

    తిరుమలేశునికి విన్నపం

    ఎంకన్న సామీ,

    దండాలయ్య!. నీకేమి సామీ హాయిగా ఏడు కొండలెక్కి కూసుంటివి. కింద మా మడుసులు సేసే మోసాలు నీకు తెలియవా సామి?.  ఎప్పుడో రాయల పెబువు నీకోసం పేమతో నగలు నటరా సేయిచ్చి కొండలెక్కి నీకోసం తెచ్చినాడు కదా, మరి అయ్యాటిని కాపాడుకునే బాధ్యత నీ మీద లేదా దొర?. నిన్న మొన్న దాక ఆడున్నాయి ఈడున్నాయి అని సెప్పిన పెబుత్వం ఇప్పుడు ఆ అవి ఎప్పుడో కరగ బెట్టినం అంటోంది. ఇదేందన్న?. ఏదో ఒకటి అర కాదు కదయ్యా!. కొన్ని వందల కోట్లు సేసే నగలయ్య.  పాపం రాయలయ్య గీ మడుసులు ఇంత మోసం సేస్తారంటే సేయించే వాడు కాదేమో?. ఎట్లా సామీ ఈ అన్యాయాన్ని అడ్డుకునేది?. నువ్వే ఏదో సేయాలయ్య.

    మరి నువ్వేమో శానా పెసిద్ధి పొందితివి. బక్తులు విపరీతంగా నీ కాడికి వస్తుంటిరి. కష్టాలు పెరిగానాయి కదయ్యా మాకు?. రాకుండా ఎట్టా ఉంటామయ్య?. వస్తే మరి మూడు నాల్గు దినాలు నీ చూపు దక్కక పాయె. దక్కిన 5 సెకండ్లు.  ఇంతల గాడ నిడుచున్న పోరలు నూకి నూకి పడేస్తున్నరు. గింతలో యాడో అంబాని అని వస్తే ఆళ్ళ కోసం మమ్మల్ని 2 -3 గంటలు ఆపుతున్నారే .  బ్రేక్ దర్శనం అంటే నరకమే అన్న మాకు. క్యూలో నిలబడి నిలబడి మాకు కాలు సెయ్యి నొప్పి, నిన్ను సూసేకే ఓపిక లేకుండా పోతున్నామన్న.

    ఈడ ఓ బోర్డు మొత్తం నాశనం సేసేస్తుందయ్యా. ఒకడేమో మందు వ్యాపారం సేసే దుర్మార్గుడయ్య. ఇంకొకడు రాజకీయ నాయకుడి శిష్యుడు, ఇంకోడు పని పాటలేని పోరంబోకు ఎదవ, ఇంకోడు పూర్తి నాస్తికుడు. ఇంకో భక్తి ఉన్న మడిసి ఏమి సేయ్యలేని పరిస్థితి అయ్యా. సామీ! నీకు ఇంత డబ్బు ఉంది కదా?. ఇంకా ఎందుకయ్యా నీ గుడికి బంగారం పుయ్యటం?. దాని పేరు పెట్టి ఈ నా ద్రోహులు బంగారం మింగేస్తున్నరే. ఏమి సెయ్యాలే సామి?. అంత మందు సాములు, రాజకీయ నాయకుల సుట్టాలు, పరమతస్తులు తప్ప నిజంగా నువ్వంటే ప్రేమ, బక్తి, నిజాయతి ఉన్నోడే లేదన్న. మరి నువ్వు ఇవన్ని సూస్తు ఎట్టా ఊరక ఉంటుండావు?. నీ సేవ మానేసి నీ పేరు పెట్టి నీ నగలు, నీ డబ్బు, మా డబ్బు దోచుకోటం ఏంటి అన్న?.

    ఇంకా మాకు  ఇసుగు వచ్చేసిందే అన్న. ఈ నా కొడుకులు ఏసే ఏసాలు సూసి. సేసే మోసాలు విని, సూసి. ఏడు కొండల్ని నువ్వే కాపాడుకోవాలన్న. నీ డబ్బు, నీ భూమి, నీ గుళ్ళు, నీ పాత్రలు, నీ కొండలు, నీ సెట్లు - అన్నే నువ్వే సూసుకోవాల.

    దండాలన్న.

    అంతర్వేది


    ఎక్కడ, ఎలా?

    తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలలో అంతర్వేది ఒకటి. అంతర్వేది సఖినేటి పల్లి మండలంలో ఉంది. ఇక్కడికి చేరుకోవాలంటే నరసాపురం వెళ్లి అక్కడ పడవ ఎక్కి సఖినేటి పల్లిలో దిగి ఆటో, బస్సులో వెళ్ళవచ్చు. ఈ మార్గంలో అంతర్వేది నరసాపురం నుంచి 7 కిలోమీటర్లు దూరం.  లేదా, చించినాడ బ్రిడ్జి మీదుగా రోడ్ మార్గంలో వెళ్లి దిండి, కేశవదాసుపాలెం మీదుగా అంతర్వేది చేరవచ్చు. ఈ మార్గంలో నరసాపురం నుంచి అంతర్వేది 20 కిలో మీటర్లు ఉంటుంది.  హైదరాబాద్ నుంచి నరసాపురంకి ప్రతిరోజూ రైలు ఉంది. నరసాపూర్ ఎక్ష్ప్రెస్స్ రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్ లో ఎక్కి ఉదయం 9 గంటలకు నరసాపురంలో దిగ వచ్చు.

    విశేషాలు: 



    వశిష్ఠ గోదావరి నది బంగాళాఖాతంలో కలిసే సంగమ స్థానంలో ఈ నారసింహ క్షేత్రం ఉంది. ఈ  సాగర సంగమం లో నది, సముద్రము నీటి మధ్య తేడ స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని అన్నా చెల్లెళ్ళ గట్టు అని అంటారు. సాగర కెరటాలు, నదిలో వరదలు లేనప్పుడు ఇక్కడ సంగమ స్నానం చేస్తే చాలా పుణ్యం. క్షీర సాగర మథనం, కూర్మావతారం, దేవ దానవుల మధ్య అమృతం కోసం పోరాటం ఈ ప్రాంతాల్లో జరిగింది అని పురాణాలు చెప్తున్నాయి. కొన్ని వందల ఏళ్ళ చరిత్ర ఉన్న క్షేత్రంలో నరసింహస్వామి రాజ్యలక్ష్మీ సమేతుడై ఉన్నాడు.



    అంతర్వేది చాలా చిన్న ఊరు. మొత్తం కలిపి వంద ఇళ్ళు కూడా ఉండవు. ఊరిలో ప్రవేశించగానే ఒక పురాతన శిథిలావస్థలో ఉన్న మంటపం కనిపిస్తుంది. దాన్ని దాటి ముందుకు వెళితే దేవస్థానం విశాలమైన ప్రాంగణంలో ఉంది. పచ్చని చెట్లు, గాలి గోపురం, శిలా శాసనం కనిపిస్తాయి. ఈ ఆలయానికి ఈశాన్య దిశలో క్షేత్రపాలకుడైన నీలకంఠేశ్వరుడి ఆలయం ఉంది. సాగర మథనంలో వచ్చిన హాలాహలాన్ని కంఠంలో నిలిపిన ఈశ్వరుడికోసం నిర్మించిన దేవస్థానం. నరసింహస్వామి దేవస్థానానికి తూర్పు ఆగ్నేయ దిశలో రేవు ఉంది. ఇక్కడ గోదావరి నదీ స్నానం చెయ్యవచ్చు. నౌక విహారం చెయ్యటానికి చిన్న, పెద్ద పడవలు ఉన్నాయి. ఇక్కడ గోదావరి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంతర్వేదిలో గుడికి 2 కిలోమీటర్ల దూరంలో బీచ్, లైట్ హౌస్, ఓ. ఎన్. జీ. సి వారి డ్రిల్లింగ్ స్టేషన్ ఉన్నాయి.

    పూజలు, సేవలు, వసతులు:

    దేవస్థానం కార్యాలయంలో అర్చన, అభిషేకం కోసం టికెట్స్ పొందవచ్చు. ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు ఇక్కడ అభిషేకం జరుగుతుంది. వచ్చే అక్టోబర్ నుంచి నిత్యం సుదర్శన హోమం జరిపే కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు ఆలయ అధికారులు. పురాతన ప్రాకారాలు, స్థంభాలు, విశాలమైన ప్రాంగణం ఈ క్షేత్రం యొక్క విశిష్టత.  మొగల్తూరు రాజాలు, జమీందార్లు చక్కగా నిర్వహించినట్లుగా కనిపిస్తుంది ఈ క్షేత్రం. ఇక్కడ వైష్ణవ ఆగమ సాంప్రదాయంలో స్వామి వారికి సేవలు, పూజలు జరుగుతాయి.

    గర్భగుడిలో మనోహరమైన లక్ష్మీ నరసింహుడి దివ్య మంగళ విగ్రహము శోభాయమానంగా ఉంటుంది. అభిషేకం సమయంలో స్వామి వారి నిజరూప సందర్సనం చేసుకోవచు. మూల విరాట్టే కాక ఉత్సవ విగ్రహ రూపంలో లక్ష్మి, నృసింహులు,  సుదర్శనుడు గర్భగుడిలో కనిపిస్తారు. తులసి, రకరకాల సుగంధ పుష్పాలతో ఇక్కడ స్వామి వారికి అలంకారం.  స్థల పురాణం, క్షేత్ర మహిమ తెలిపే పుస్తకాలు దేవస్థానం వాళ్లు విక్రయిస్తున్నారు.  ఇక్కడ నిత్యాన్నదాన పథకం ఉంది. శుభ్రమైన పరిసరాల్లో శుచి, రుచి కలిగిన ఆహారాన్ని గర్భగుడి వెనకగల భోజన శాలలో 12 నుంచి 2 గంటల వరకు ఉచిత భోజన వసతిని దేవస్థానం వాళ్లు భక్తి, శ్రద్ధలతో ఏర్పాటు చేస్తున్నారు. దర్శన సమయంలో భోజనానికి టికెట్ తీసుకొని హాయిగా స్వామి వారి ప్రసాదంగా భోజనం చెయ్య వచ్చు.

    అన్నాచెల్లెలు గట్టు:

    వశిష్ఠ  గోదావరి బంగాళాఖాతంలో కలిసే స్థానాన్ని సప్తసాగర సంగమ ప్రదేశం  అంటారు. ఇది అన్నాచెల్లెలు గట్టుగా  పేరొందింది. ఇక్కడి నీరు తీయగా ఉండటం విశేషం.

    ఇతర ఆకర్షణలు:



    దేవస్థానానికి తూర్పు దిక్కుగా ఒక రాజు గారు ఈ మధ్య వశిష్ఠ మహర్షి పేరిట దేవాలయం కట్టారు. ఈ ఆలయం చాలా బాగుంది. ఆ ఆలయం వృత్తాకారంలో ఉంది. ఆలయం చుట్టూ ఒక నీటి వలయం ఉంది. ఆలయంలో పై అంతస్తులో సప్తర్షుల విగ్రహాలు ప్రతిష్ఠించారు రాజు గారు. ఈ ఆలయ ప్రాంతంలో వశిష్ఠ, వ్యాస మహా మునులు తిరిగినట్లుగా రాజు గారికి నిదర్శనం కలిగి ఆయన ఈ ఆలయాన్ని నిర్మించినట్టు అక్కడ రాసి ఉంది. కింది అంతస్తులో కూర్మ (తాబేలు) ప్రతిష్ఠ ఉంది. చుట్టూ దశావతారాలు కూడా ఉన్నాయి. చుట్టూ పచ్చగా చెట్లు, ఒక పక్క గోదావరి, మరొక పక్క దూరంగా సముద్రము - ఈ ఆలయానికి చాలా శోభను ఇస్తున్నాయి. ఈ ఆలయానికి ముందే ఒక పెద్ద గోశాల రాజుగారు నడుపుతున్నారు. గోపూజ, వాటికి జీవనానికి కావలసిన అన్ని ఏర్పాట్లు రాజు గారు చాలా బాగా చేశారు. ఇక్కడ గోవులు, ఎద్దులు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి.  అంతర్వేదికి ఈ వశిష్ఠ ఆలయం, గోశాల ఒక పెద్ద ఆకర్షణ.

    సంప్రదించటం ఎలా?

    అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ప్రధాన అర్చకులు బుచ్చి బాబు గారు (ఆయన పేరు శేషాచార్యులు). వారిని ముందుగా సంప్రదించి స్వామి వారికి కళ్యాణం చేయించుకోవచ్చు. అంతర్వేదిలో నివాసానికి ఆలయానికి దగ్గరలోనే (నీలకంఠేశ్వరుడి ఆలయం సమీపంలో) తిరుమల తిరుపతి దేవస్థానం వారి రెండంతస్తుల వసతి సముదాయం ఉంది. అక్కడ రూం బుక్ చేసుకొని ఉండవచ్చు. ఇది కాక అక్కడ వేరే హోటల్స్ లాంటివి ఏమీ ఉండవు. కాబట్టి అంతర్వేదిలోనే ఉండాలి అనుకుంటే తితిదే వాళ్ల భవనం ఒక్కటే మనకున్న ఆమ్నాయం. ఈ భవనంలో గదులు, శౌచాలయాలు అంత పరిశుభ్రంగా లేవు. కొన్ని మౌలిక వసతులు, సుఖాలు కావాలి అనుకునే వాళ్లకు దిండి రిసార్ట్స్ (దిండి గ్రామంలో గోదావరి నది ఒడ్డున రిసార్ట్ కట్టారు) కానీ, నరసాపురం/రాజోలు లో కానీ ఉండవచ్చు.

    ఇక్కడ శాశ్వత నిత్యాన్నదాన పథకం ఉంది. దాతలు రూ. 1,116 /- మొదలుకొని ఆపైన ఎంతైనా ఈ అన్నదాన పథకానికి విరాళం ఇవ్వవచ్చు. భోజనశాలలో ఈ విరాళం ఇచ్చి రసీదు పొందండి. చెక్, డీడీ కూడా పంపవచ్చు. ఇంటర్నెట్ ద్వారా ఆంధ్ర బ్యాంకు, కేశవదాసుపాలెం, ట్రస్ట్ ఎకౌంటు నెంబర్ 100310011008148 ద్వారా కూడా చెల్లించవచ్చు.

    దేవస్థానం చిరునామా:

    కార్య నిర్వహణాధికారి,
    శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం,
    అంతర్వేది, సఖినేటిపల్లి మండలం,
    తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్.
    పిన్ కోడ్: 533252 .

    ఫోన్ నంబర్లు:

    • ఎక్జిక్యూటివ్ ఆఫీసర్:  9440219241
    • దేవస్థానం మెయిన్ నెంబర్: 08862 -259313 (వసతికి, సేవలకు ఈ నెంబర్ కు చెయ్యండి).
    • ప్రధాన అర్చకులు వి.బి. వి.కే. ఎస్. శేషాచార్యులు (బుచ్చిబాబు) - 08862 -259333 , 9010126977 .

    19, జులై 2010, సోమవారం

    బాబ్లీ ప్రాజెక్టు - రాజకీయం - మొదటి అంకం

    చంద్రన్నకు ఒక బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. ఒకే దెబ్బకు రెండు పిట్టలను ఇరకాటంలో పెడదాం అని ఆ చాణక్యుడి బుర్ర అనుకుంది. వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లిలో "అక్రమంగా" కడుతున్న ప్రాజెక్ట్ పట్ల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం చేతులకు గాజులు తొడుక్కొని కూర్చుందని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో ఘోరంగా విఫలమయ్యిందని అసెంబ్లీలో అగ్గి రగిల్చారు. ఇన్నాళ్ళు మౌనంగా ఉండి ఇప్పుడే ఎందుకు ఈ ఆందోళన టీడీపీ నుంచి?.
    1. తెలంగాణలో ఉపఎన్నికలు 26వ తేదీ జరుగనున్నాయి. గత ఏడాదిగా తెలంగాణా సెంటిమెంట్ ఉధృతమైన నేపథ్యంలో ఆయనకు తెలంగాణలో ప్రవేశించి ప్రచారం చేసే పరిస్థితులు లేవు. కాబట్టి ప్రచారానికి వెళ్ళటానికి జంకిన చంద్రన్న ఈ అంశం లేవనెత్తారు. బాబ్లి వల్ల తెలంగాణా జిల్లాలకు తీరని నష్టం అని, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎండిపోతుందని, లక్షలాది ఎకరాలు బీడు పోతాయని ఈ ఆందోళన సారాంశం. ఈ సాకు చూపించి తెలంగాణా లో సానుభూతి పొంది బాబ్లి యాత్ర పేరుతొ ప్రచారం, పేరు సంపాదిన్చుకుందామని చంద్రన్న కుతంత్రం. మొత్తానికి ఇంతమటుకు బాబ్లి సందర్శన యాత్ర పేరుతొ కొంతమంది ఎమ్మెల్యేలను కూడబెట్టుకుని బస్సులో బయల్దేరారు బాబు గారు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి అగ్నికి ఆజ్యం పోసినట్టు అరెస్ట్ చేసింది ఆ బృందాన్ని. నిజంగా బాబ్లిలో మోసం లేకపొతే సందర్శన ఎందుకు ఆపాలన్నది బాబు వాదన. అది సరైనదేనేమో?.
    2. తెలంగాణా ఉపఎన్నికల్లో టీఆరెస్ , కాంగ్రెస్, టీడీపీ మధ్య త్రిముఖ పోటీలో మూడో స్థానం టీడీపీది అని మనకు బానే తెలుసు. ఈ పరిస్థితి మార్చి టీడీపీకి వోట్లు తేవాలి అంటే తెలంగాణా రాష్ట్రం గురించి మాట్లాడలేని దుస్థితిలో బాబు ఉన్నారు. అందుకని టీఆరెస్, కాంగ్రెస్ లను బాబ్లి అంశం మీద ఎండగట్టి వారికి నిజంగా తెలంగాణా అభివృద్ధి, ప్రయోజనాల మీద చిత్తశుద్ధి లేదు అని చాటటానికి ఈ యత్నం. వింత ఏంటంటే - ఊదరగొట్టి, అదరగొట్టి మాట్లాడే మన కేసీఆర్ ఈ విషయంపై మౌనమేలనో?. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం వారే పోగొట్టుకున్నారు. మరి ముందుగానే చొరవ తీసుకొని బాబ్లి విషయాన్ని టీఆరెస్ ప్రయోజనానికి ఎందుకు వాడుకోలేదు?. కాంగ్రెస్ తో ఏమైనా లోపాయకారి ఒప్పందం ఉందా?.
    3. మహా జాగ్రత్తగా ఉండే కాంగ్రెస్ అధినాయకత్వం ఈ విషయం ముందే ఊహించి ప్రధానమంత్రితో ఒక మీటింగ్ పెట్టించి నిప్పు రాజుకోక  ముందే మీద నీళ్ళు ఎందుకు పోయలేదు?. చంద్రన్న ఇచ్చిన ఈ ఝలక్ కి తెలంగాణా కాంగ్రెస్ నేతలకు దిమ్మి తిరిగి, కళ్ళు బైర్లు కమ్మి తలా ఒక మాట మాట్లాడుతున్నారు. కొందరేమో బాబు తెలంగాణాలో తిరిగే దమ్ము లేక బాబు ఈ నాటకమాడుతున్నారని, కొందరేమో ఇది ఉపఎన్నికల్లో లబ్ధికి టీడీపీ నాటకమని, ఇక ముఖ్యమంత్రిగారైతే నేను పీ.ఎం. తో మాట్లాడాను, ఆయన అఖిలపక్షాన్ని కలవటానికి అంగీకరించారు, శాంతి భద్రతల దృష్ట్యా మనం సామరస్యంగా ఈ సమస్యను పరిష్కరిద్దాము అని ఢిల్లీ మాట వినిపించారు. ఎందుకు అంత నిర్లిప్తత కాంగ్రెస్ పార్టీలో?. ఒక పక్క జగన్ ప్రజాదరణలో ముందుకు దూసుకు వెళ్తున్నాడు,  మరొక పక్క చంద్రన్న బాబ్లి అంశంతో రాజకీయ లబ్ది పొంది తన మనుగడకు జీవం పోయాలని ప్రయత్నిస్తున్నాడు. రాష్ట్ర విషయాలను, రాజకీయాలను క్షుణ్ణంగా అర్థం చేసుకుని నివేదికలు పంపే నరసింహన్ లాంటి మేధావి మన గవర్నర్. రాజకీయాల్లో ఎదుటివాళ్ళను తన నోటితో అణగదొక్కే దూకుడు మనస్తత్వం మన రోశయ్య గారిది.అయినా ఎందుకింత అలసత్వ, నిర్లక్ష్య ధోరణి?.
    మరి ఏమవుతుందో ఈ బాబ్లి అంశం?. ఇది ఇంకొక అంతర్రాష్ట్ర  ప్రజల మధ్య మనోభావాల అంశంగా మారి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుందా?. ఉపఎన్నికల ఫలితాలను ఎలా ప్రభావితం చెయ్యబోతోంది?. తెలంగాణలో టీడీపీకి జీవం పోస్తుందా?. వేచి చూడాల్సిందే మరి...

    శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం - పిఠాపురం

    దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా


    పవిత్రమైన గోదావరీ పరీవాహక ప్రాంతంలో పిఠాపురం పూర్వం ఋషులచే, యోగులచే సవితృ కాఠక చయనం వంటి ఎన్నో గొప్ప యాగాలకు, పవిత్రమైన కార్యాలకు సాక్షి. పీఠికాపురంగా చరిత్రలో చెప్పబడిన ఈ పిఠాపురం రాజుల కళాపోషణకు, సాహితీకారులకు ఆలవాలం. పచ్చని పొలాలు, రమణీయ దృశ్యాలకు నెలవైన ఈ పిఠాపురం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన పురుహూతికా, కుక్కుటేశ్వరుల దేవస్థానానికి నిలయం. ఇక్కడే దత్తావతారులైన శ్రీపాదశ్రీవల్లభులు జన్మించారు.

    శ్రీపాద శ్రీవల్లభులు:

    శ్రీపాద శ్రీవల్లభులు కలియుగంలో దత్తాత్రేయుని ప్రథమ అవతారం. ఘండికోట అప్పల లక్ష్మీనరసింహరాజ శర్మ, సుమతి దంపతులకు 14వ శతాబ్దములో దైవసంకల్పముతో శ్రీపాదశ్రీవల్లభులు పిఠాపురంలో జన్మించారు. విద్యాధరి, రాధ, సురేఖ అనే ముగ్గురు సోదరీమణులు, శ్రీధరరాజ శర్మ, రామరాజ శర్మ అనే ఇద్దరు సోదరులు.  ఆ దత్తావతారునికి.  మాతామహులు మల్లాది బాపనార్యులు-రాజమాంబ దంపతులు. పూర్ణ దత్తావతారులైన శ్రీపాద వల్లభులు చిత్తా నక్షత్రమున వినాయక చవితి నాడు అవతరించారు. 

    పిఠాపురంలో ఎన్నో మహిమలు చూపించి పదహారేళ్ల ప్రాయంలో కురువరపురంలో (ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ సమీపంలో కృష్ణా నది ఒడ్డున గల దత్తక్షేత్రం) వెళ్లి అక్కడ తన అవతార మహిమలను పరిపూర్ణంగా, విశేషంగా చూపించారు.

    శ్రీపాద శ్రీవల్లభుల మాతామహులైన మల్లాది బాపనర్యుల వంశంలో జన్మించిన మల్లాది గోవింద దీక్షితులు గారు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అనే పుస్తకాన్ని శ్రీపాదుల ఆజ్ఞ మేరకు తెలుగులోకి అనువదించారు. సంసృత మూలం శంకర భట్టు అనే ఆయన రచించినది. శ్రీపాదుల తదుపరి దత్తావతారం గాణుగాపురంలో నివసించిన నృసింహ సరస్వతి. వాసుదేవానంద సరస్వతి (టెంబే స్వామి) రచించిన శ్రీ గురు చరిత్ర మొదటి అధ్యాయాల్లో శ్రీపాదుల గురించి వివరంగా ఉంది.

    చరితామృతం:

    శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం గ్రంథంలో శ్రీపాద శ్రీవల్లభుల జీవిత విశేషాలతో పాటు మనకు తెలియని, ఆశ్చర్యపరిచే కొన్ని ఆధ్యాత్మిక విశేషాలు, సంబంధాలు ఉన్నాయి. ఈ పుస్తకం సంస్థానంలో కానీ, పోస్ట్ ద్వారా గానీ, హైదరాబాదులో టాగోర్ బుక్ హౌస్ లో కానీ పొందవచ్చు. ఈ గ్రంథ పారాయణ మహాత్మ్యం, ఇందులో ఉన్న వివరం, విశిష్టత చదివితేనే అర్థం అవుతుంది.  తప్పక వెంటనే పారాయణం చేయండి. 



    క్షేత్రం:

    పీఠికాపురంగా  అప్పట్లో పిలవబడిన ఈ పిఠాపురం తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడకు 18  కిలోమీటర్ల దూరంలో ఉంది. దక్షిణ మధ్య రైల్వే లోని చెన్నై-హౌరా మార్గంలో పిఠాపురం స్టేషన్ ఉంది. ఈ ఊళ్ళో  శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వేణుగోపాల స్వామి గుడి వీధిలో ఉంది. కుక్కుటేశ్వర స్వామి గుడి ముందుగా వెళ్లి అక్కడ వేణుగోపాలస్వామి గుడి వీధి అంటే ఎవరైనా చెప్తారు. ఇక్కడ ప్రస్తుతం పీఠాధిపతి శ్రీ సజ్జనగడ రామస్వామి గారు. వీరు సమర్థ రామదాసు శిష్యులైన కర్ణాటకలోని వరదహళ్లిలో సిద్ధి పొందిన భగవాన్ శ్రీధర స్వామి శిష్యులు. రామస్వామిగారు చాలా సమర్థవంతంగా ఈ పీఠాన్ని నడిపిస్తున్నారు. వారి ఆశీస్సులు, ఆధ్వర్యంలో ఈ పీఠం బాగా వృద్ధి చెంది శ్రీపాద శ్రీ వల్లభుల మహత్మ్యం, సందేశం మనకు అందేలా కృషి జరుగుతోంది. ఇక్కడ ఉండటానికి ఉచిత వసతి, ఉచిత భోజన వసతి ఉన్నాయి. సంస్థానం కార్యాలయానికి ముందుగా ఫోన్ చేసి రూం బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్నపూర్ణ భోజనశాలలో మధ్యాహ్నం 12 నుంచి  2   వరకు భోజనము, రాత్రి 8:30 నుంచి 9:00 వరకు అల్పాహారము ఉంటుంది.  రుచి, శుచి ఉన్న ఆహారాన్ని ఉచితంగా భక్తులకు అందిస్తున్నారు సంస్థానం వారు.

    ఈ పీఠంలో అడుగు పెట్టగానే ఎడమ వైపు కార్యాలయము, దానిపైన వసతికి గదులు ఉన్నాయి. కొంచెం ముందుకు వెళితే  కుడివైపు ఔదుంబరం (మేడి చెట్టు), పాదుకలు, ఆవులు కనిపిస్తాయి. వీటికి ఎదురుగా తూర్పు ముఖంగా గర్భగుడి. ఈ గర్భగుడిలో పాలరాతి విగ్రహ రూపంలో దత్తాత్రేయుడు, వారికి కుడివైపు శ్రీపాద శ్రీవల్లభులు, ఎడమవైపు నృసింహ సరస్వతి ప్రతిష్ఠించబడి ఉన్నారు.  గర్భగుడికి ఎడమవైపు  పాదుకలు,మేడి చెట్టు, దాని పక్కనే దత్తాత్రేయుల పురాతన విగ్రహం ఉంటాయి. గర్భ గుడి వెనుక ధ్యాన మందిరం ఉంది కానీ వాడుకలో లేదు.

    ఈ పీఠంలో మూర్తులకు నిత్యం అభిషేకం (పాదుకలకు), పల్లకి సేవ, అర్చన చేయించుకోవచ్చు. ప్రతి మాసం చిత్త నక్షత్రం రోజున, చైత్ర శుద్ధ పాడ్యమి మొదలు వసంత నవరాత్రులు, శ్రీరామ నవమి, ఆషాఢ పౌర్ణమి (గురు పౌర్ణిమ), శ్రావణ బహుళ పంచమి (వాసుదేవానంద సరస్వతి జయంతి) , శ్రీపాద శ్రీవల్లభుల జయంతి సప్తాహం (శ్రావణ బహుళ త్రయోదశి నుండి  భాద్రపద శుద్ధ చవితి వరకు), గురు ద్వాదశి (శ్రీపాద శ్రీవల్లభుల అవతార సమాప్తి - ఆశ్వయుజ బహుళ ద్వాదశి), గురు ప్రతిపాద (నృసింహ సరస్వతి అవతార సమాప్తి - మాఘ బహుళ పాడ్యమి), నృసింహ సరస్వతి జయంతి (పుష్య శుద్ధ తదియ), ప్రతి నెల బహుళ ద్వాదశి రోజులలో సంస్థానంలో విశేష పూజలు జరుగుతాయి.   భక్తులు అధిక సంఖ్యలో వస్తారు ఈ రోజుల్లో.

    సంస్థానం వాళ్ల బుక్ స్టాల్ ఇక్కడ ఉంది. ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం తెలుగు, మరాఠీ, ఇంగ్లీష్ భాషల్లో దొరుకుతుంది. అలాగే శ్రీ గురుచరిత్ర తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో దొరుకుతుంది -  వాసుదేవానంద సరస్వతి మరాఠీ మూలాన్ని తెలుగులోకి పన్నాల భట్ట శర్మ గారు అనువదించారు. ఇంకా గురు గీత, దత్తాత్రేయ పూజా విధానము, ఫోటోలు, పోస్టర్లు, సీడీలు, సంక్షిప్త గురుచరిత్ర, శ్రీపాద శ్రీవల్లభుల సిద్ధ మంగళ స్త్రోత్రం, దత్త మంత్ర కరుణార్ణవం లాంటి పుస్తకాలు చాలా సంస్థానం వాళ్లు ప్రచురించి ఇక్కడ విక్రయిస్తున్నారు.

    సిద్ధ మంగళ స్తోత్రము:

    వారి మాతామహులైన బాపనార్యులు స్తుతించిన సిద్ధ మంగళ స్తోత్రం అత్యంత మహిమాన్వితమైనది. మీకోసం ఆ స్తోత్రం:
    1. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా!
      జయ విజయీభవ, దిగ్విజయీభవ, శ్రీమదఖండ శ్రీ విజయీభవ!!
    2. శ్రీ విద్యాధరి రాధా సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదా!
      జయ విజయీభవ, దిగ్విజయీభవ, శ్రీమదఖండ శ్రీ విజయీభవ!!
    3. మాతా సుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాదా!
      జయ విజయీభవ, దిగ్విజయీభవ, శ్రీమదఖండ శ్రీ విజయీభవ!!
    4. సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీ చరణా!
      జయ విజయీభవ, దిగ్విజయీభవ, శ్రీమదఖండ శ్రీ విజయీభవ!!
    5. సవిత్రకాఠక చయన పుణ్యఫల భరద్వాజ ఋషిగోత్ర సంభవా!
      జయ విజయీభవ, దిగ్విజయీభవ, శ్రీమదఖండ శ్రీ విజయీభవ!!
    6. దో చౌపాతీ దేవ్ లక్ష్మీ ఘనసంఖ్యా బోధిత శ్రీ చరణా!
      జయ విజయీభవ, దిగ్విజయీభవ, శ్రీమదఖండ శ్రీ విజయీభవ!!
    7. పుణ్యరూపిణీ రాజమాంబసుత గర్భపుణ్యఫల సంజాతా!
      జయ విజయీభవ, దిగ్విజయీభవ, శ్రీమదఖండ శ్రీ విజయీభవ!!
    8. సుమతీనందన, నరహరినందన దత్తదేవప్రభు శ్రీపాదా!
      జయ విజయీభవ, దిగ్విజయీభవ, శ్రీమదఖండ శ్రీ విజయీభవ!!
    9. పీఠికాపుర నిత్యవిహారా, మధుమతి దత్తా, మంగళరూపా!
      జయ విజయీభవ, దిగ్విజయీభవ, శ్రీమదఖండ శ్రీ విజయీభవ!!

    పిఠాపురం చేరటం ఎలా?
    • విమానంలో వచ్చేవాళ్ళు రాజమండ్రి కానీ, విశాఖపట్నంలో కానీ దిగి రావచ్చు. రాజమండ్రి నుంచి 70 కిలోమీటర్లు,  విశాఖనుంచి 180 కిలోమీటర్లు.
    • ట్రైన్లో: సామర్లకోట పిఠాపురం నుంచి 10 కిలోమీటర్లు. ఇది జంక్షన్. ఇక్కడ ఆగే రైళ్లు: ఫలక్నుమ, కోణార్క్, నిజాముద్దీన్ లింక్, ఒఖ లింక్, నవజీవన్, ప్రశాంతి, యశ్వంతపూర్, శేషాద్రి, షిర్డీ ఎక్స్ ప్రెస్లు. సామర్లకోట స్టేషన్ నుంచి బస్సు, ఆటో, కార్ వసతి చాలా బాగా ఉన్నాయి. సామర్ల కోట గుండా వెళ్లే రైళ్ళ రాకపోకల లైవ్ వివరాలు.
    • మెయిన్ లైన్లో వెళ్లే పిఠాపురంలో ఆగే రైళ్లు:  గోదావరి, ఈస్ట్ కాస్ట్, బొకారో ఎక్స్ ప్రెస్లు. పిఠాపురం గుండా వెళ్లే రైళ్ళ రాకపోకల లైవ్ వివరాలు.
    • కాకినాడకు గౌతమి ఎక్ష్ప్రెస్స్ లో/బస్సులో వెళ్లి అక్కడనుంచి కూడా రావచ్చు. కాకినాడ పిఠాపురం మధ్య దూరం 18 కిలోమీటర్లు.

    సంస్థానం అడ్రస్, ఫోన్ నెంబర్:

    శ్రీపాద  శ్రీవల్లభ మహా సంస్థానం,  వేణుగోపాలస్వామి గుడి వీధి,
    పిఠాపురం  - 533450,
    తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. 
    కార్యాలయం పని వేళలు : ఉదయం 9 నుంచి 12 వరకు, సాయంత్రం 4 నుంచి 8 వరకు.
    ఫోన్  - (08869) 250300
    ఫ్యాక్స్ - (08869) 250900
    ఇమెయిల్ : info@sripadasrivallabha.org
    వెబ్ సైటు: http://www.sripadasrivallabha.org  http://sreepadasreevallabhapithapuram.org/home1.html

    పిఠాపురంలో ఇంకా చూడాల్సిన ప్రదేశాలు:
    1. పాదగయా క్షేత్రమైన కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో శివుడు,  ఈ ఆలయంలోనే అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి పురుహూతిక అమ్మ వారి గుడి, దత్తాత్రేయుల గుడి (గురు స్థానం, శ్రీపాద శ్రీవల్లభుల మూర్తి, ఔదుంబరం), షిర్డీ సాయి గుడి, ఇంకా చాలా విగ్రహాలున్నాయి (వినాయకుడు, దుర్గ, నవగ్రహాలు, సీతారాములు వగైరా). ఇక్కడ లింగం అష్ట దిగ్బంధనం చేసి ఉంది.
    2. కుంతీమాధవస్వామి, రాజ్యలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం - చాలా పురతానమైన దేవస్థానం. ఇక్కడ విగ్రహాలు అపురూపంగా ఉన్నాయి.
    3. గణపతి సచిదనంద స్వామి దత్తపీఠం వారి శ్రీపాద శ్రీవల్లభ అనఘాలక్ష్మి దత్తాత్రేయ క్షేత్రం ఎంతో ప్రశాంతంగా, మనోజ్ఞంగా ఉంటుంది.
    4. కాకినాడ పిఠాపురం రోడ్లో పరిపూర్ణానంద సరస్వతి వారి శ్రీపీఠం (ఐశ్వర్యాంబిక ఇక్కడ ప్రధాన దేవత)
    5. కాకినాడ పిఠాపురం రోడ్లో సర్పవరం భావనారాయణ స్వామి - చాలా పురాతనమైన వైష్ణవ సాంప్రదాయ దేవస్థానం. ఇక్కడ అందమైన కలువల కొలను ఉంది.
    6. ఉప్పాడ బీచ్ ఇక్కడికి 15 కిలో మీటర్లు. 
     దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా

      16, జులై 2010, శుక్రవారం

      క్యాన్సర్ - ఎక్కువగా చెప్పుకునే కారణాలు

      కాన్సర్ (రాచపుండు) రావటానికి ఫలానాది అని కారణం చెప్పలేకపోతోంది మన వైద్య రంగం. కానీ కొన్ని అయ్యి ఉండచ్చు అని పరిశోధన వ్యాసాల్లో రాస్తున్నారు.
      1. మనం తినే ఆహారంలో జన్యు మార్పిడి
      2. మనం పీల్చే గాలి, తాగే నీరులో రసాయనాలు (కాలుష్యం ద్వారా)
      3. తినే తిండిలో కొవ్వు, చక్కెర
      4. మానసిక ఒత్తిడి, నిద్రలేమి, ఎసిడిటీ/గ్యాస్ 
      5. శరీరంలో కణాలకు ఆక్సిజన్ సరైనంత అందకపోవటం - వ్యాయామం లేక 
       వీటిలో 1 ,3 ,4 ,5  చాలా మటుకు మనం నియంత్రించి, అధిగమించవచ్చు. ఆలోచించండి.
      1. సహజంగా ఉండే ఆహారం కాకుండా ప్రాసెస్ చేయబడిన ఆహరం, నిల్వ ఉంచటానికి ఆహారంలో కలిపే పదార్థాల వల్ల, తీయటం వల్ల ఆహారంలో ఉండే కణాలు తమ సహజ లక్షణం కోల్పోయి విపరీతమైన పరిణామాలు చూపిస్తున్నాయి. ఒకటే గుర్తు పెట్టుకోండి - బాగా రుచి ఉంది అంటే ఆహారం అది చాలా మార్పులకు లోని తన సహజత్వాన్ని కోల్పోయినట్టే - పిజ్జా, బర్గర్, చీజ్, బట్టర్, నూడిల్స్, కుర్కురే, ఇలా చాలా ఈ కోవకు చెందుతాయి.
      2. ఆంధ్రులకు పొట్టు తీసి సన్నగా నున్నగా ఉండే బియ్యమంటే మక్కువ. ఇలాంటి బియ్యము, పిండి తినటం వల్ల మన రక్తంలో చక్కెర ప్రమాణం పెరిగి పోతోంది. కాన్సర్ కి ప్రథమ మిత్రుడు చక్కెర. చక్కేరకి పరమ మిత్రుడు ఉప్పు. కాబట్టి మీరు తినే తిండిలో ఉప్పు, చక్కెర తగ్గించండి. అలాగే, పొట్టు ఉన్న ధాన్యం, పప్పులు తినండి - ఇవి సగం రుగ్మతలను నియంత్రిస్తాయి.
      3. మనకు చిరు తిళ్లు, పచ్చళ్లు, స్వీట్లు, వేపుళ్ళు బాగా అలవాటు అయ్యాయి గత 25 ఏళ్లలో. వాటిలో ఉన్న కొవ్వు, చక్కెర మన ఒంట్లో పేరుకొని శరీర బాధలకు కారణాలయ్యాయి. కణాల ఉత్పత్తి, పరిణామం మనకు తెలియని, శరీరానికి పనికిరాని దారిలో వెళుతున్నాయి వీటివల్ల. ముఖ్యంగా ఎక్కువ వేడి, ఎక్కువ పీడనం, ఎక్కువ చల్లదనంతో కూడిన ఆహారాల్లో తెలియని మార్పు మన మూల కణాల మీద అణు విస్ఫోటనం లా పనిచేస్తున్నాయి. పాలు, పండ్లు, మొలకలు, పొట్టు ఉన్న ఆహరం, కూరగాయలు బాగా తినండి.
      4. డబ్బు వెంట పడి పరిగెత్తి, మన స్వధర్మాన్ని, మతాన్ని వదిలి పరధర్మాల వెంట పడి మన మానసిక సంతులన కోల్పోయి, ఒత్తిడి గురవుతున్నాము. అలాగే వృత్తి పరంగా వ్యాయామం లేక, ఒత్తిడికి లోనై ఊబకాయులమై, మానసికంగా దెబ్బతిని - దాని ప్రభావం మన శరీర భాగాల మీద పడుతోంది. మీ శరీరం కోసం రోజుకు ఒక అరగంట కేటాయిస్తే ఊహించలేని మంచి మార్పులు మీ దేహం, మనస్సు, ఆలోచనల్లో కనిపిస్తాయి. 
      5. అలాగే ఈ ప్రపంచాన్ని నడిపించేది మానవుడు కాదు, మనకు అతీతంగా ఒక మహోన్నతమైన శక్తి  ఉందని నమ్మి,  దానికి దాసోహం అని జీవితంలో విర్రవీగకుండా, వేలం వెర్రిలా పరిగెత్తకుండా ఒక నిబద్ధమైన ధార్మిక జీవనం అలవర్చుకోండి. 

      ఇది నా స్వానుభవమున చెప్తున్న మాట.ఇవన్ని మార్చుకుని, అధిగమించిన తర్వాత - పీల్చే గాలి, తాగే నీరులో ఎంత కాలుష్యం ఉందో, వాటి వల్ల ఏ జబ్బులు వస్తాయో/వచ్చాయో ఆలోచించండి.  వాటిని కూడా కొంత వరకు నియంత్రించి అధిగమించవచ్చు.
      శరీరంలో వ్యాధినిరోధక శక్తి తగ్గింది అంటే కాన్సర్ కణాలకు ప్రాణం పోసినట్లే. ఒక్కసారి మన శరీరంలో కాన్సర్ బయట పడిందంటే చాలా దృఢ నిశ్చయముంటే తప్ప ఆ జబ్బును శాశ్వతంగా దాటలేము. ఒక రకంగా వన్ వే టికెట్ లాంటిది ఈ జబ్బు. ఇది పూర్తిగా కణాలకు సంబంధించిన జబ్బు కాబట్టి కణాలు ఆరోగ్యంగా ఉండే సాధనాలను వెతికి, పాటించి ఈ రాచ పుండును దగ్గరకు రానివ్వకండి. నా జీవితంలో 40 ఏళ్ళు ఈ విషయం తెలుసుకోకుండా అజ్ఞానంలో బతికాను. ఇప్పుడు అమ్మ ఈ వ్యాధితో పడే బాధను చూస్తూ పాఠాలు కఠిన మార్గంలో నేర్చుకుంటున్నాను.

      యోగక్షేమం వహామ్యహం.

      అసమాన మహిళ - పాలువాయి భానుమతి


      ఆమె నవరస నటన ఉత్తుంగ తరంగమై పొంగే సహజ గంగ ప్రవాహం. ఆమె గానం భక్తి, శాస్త్రాల మేళవంతో సాగే సప్త  స్వర ఝరీ  జలపాతం. ఆమె భాష అలకనందా జలంలా నిర్మలం, చిదానందం. ఆమె నృత్యం చూపరులకు ఆహ్లాదం. ఆమె రూపం మూర్తీభవించిన ఆరణాల తెలుగుదనం. ఆమె సాహిత్యం అచ్చ తెలుగు సీమ మిరపకాయ. ఆమె జీవన శైలి, ధోరణి స్వాభిమానంతో నిండుకున్న సింహలక్షణం. ఆమె మనసు 'పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును' చందం. ఆమె విమర్శ వజ్రాయుధమంత పదునైనది. వెరసి ముచ్చటగా ఈ లక్షణాలు ఉన్న వనితా రత్నం మన పాలువాయి భానుమతి రామకృష్ణ గారు.

      ఒంగోలు జిల్లాలో బొమ్మరాజు వారింట పుట్టి తెలుగు చలన చిత్ర జగత్తులో రామారావు, నాగేశ్వరరావుల కన్నా ఉన్నత స్థానాన్ని అధిరోహించి తన సహజ నటనా ప్రావీణ్యంతో ఆరేడు దశాబ్దాలు ఏలిన మకుటమున్న మహారాణి భానుమతి.  తనకన్నా వయసులో చాలా పెద్ద అయిన రామకృష్ణగారిని వివాహమాడి, భరణి సంస్థను స్థాపించి, ఆ పతాకం మీద అద్భుతమైన కళాఖండాలను మనకు అందించారు. 'నేను మిస్సమ్మలో మేరీ పాత్రను వదులుకోకపోతే దక్షిణాది  చలన చిత్ర సామ్రాజ్యానికి సావిత్రి లాంటి మహానటి వచ్చేది కాదేమో' అని అనటంలో ఆమె ధైర్యానికి, ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. సావిత్రి, జమున, అంజలి కన్నా ముందే దక్షిణాదిన అగ్రతారగా గుర్తింపబడింది భానుమతి.

      ఎటువంటి పాత్ర అయిన సరే - వెండి తెర ఆమె ఉంటే అదిరి పోవాల్సిందే.  సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రాత్మక చిత్రాలలో నాయిక, ప్రతినాయిక, క్యారెక్టర్ పాత్రలకు ఆమె జీవం పోసి వన్నె తెచ్చారు. ఆమె తన పాత్రలకు తానే నేపథ్యగానం. కొన్ని చిత్రాలకు సంగీత దర్శకత్వం కూడా చేశారు. మల్లీశ్వరి వంటి చిత్రం ఇంకా రాలేదు, రాబోదు అంటే అతిశయోక్తి కాదు. శాస్త్రీయ సంగీతంపై తనకున్న మక్కువను ప్రతిచిత్రంలో ఏదో ఒక కీర్తన రూపంలో చూపించారు. నగుమోము గనలేని, సావిరహే తవ దీనా రాధా, పక్కల నిలబడీ, తెర తీయగా రాదా ఇలా ఎన్నో...



      ఇక పాత్రలకొస్తే,

      మల్లీశ్వరిలో రామారావుగారికి సమానంగా తెరను డామినేటు చేశారు.'మనసున మల్లెల మాలలూగెనే', 'పిలచిన బిగువటరా' లాంటి పాటలు ఇంకెవ్వరు పాడలేరు.  'పరుగులు తీయాలి' అనే పాటలో ఘంటసాలతో పోటీపడి అద్భుతమైన యుగళగీతం పాడారు. 'బాటసారి'లో ఆమె నటన అనుపమానం. శరత్ నవల ఆధారంగా తీయబడిన ఈ చిత్రంలో ఆమె ప్రేమ, కట్టుబాటు మధ్య నలిగిపోయే పాత్రలో మనకు కళ్ళలో నీళ్ళు తెప్పిస్తారు. 'ఓ బాటసారి నను మరువకోయీ' అనే పాట ఈ చిత్రాన్ని తెలుగు చిత్రాల్లో ఒక ఆణిముత్యంలా నిలిపింది.  విప్రనారాయణలో శృంగారమొలికించే నాయిక పాత్రలో నాగేశ్వరరావు గారికి పోటీ ఇచ్చి ఆ చిత్రానికి ఘన విజయం సంపాదించారు. ఆ చిత్రంలో సావిరహే తవ దీనా రాధ' అనే జయదేవుని అష్టపదిని సున్నితంగా, లలితంగా పాడి ఇప్పటికీ ఆ పాట గాయకుల నోట వినిపించేలా చేశారు ఆమె.

      ఇక పౌరాణిక/చారిత్రిక పాత్రలకొస్తే, తెనాలి రామకృష్ణలో వేగు పాత్ర, పల్నాటి యుద్ధంలో నాయకురాలు నాగమ్మగా ఆమె ప్రతినాయిక పాత్ర అంటే ఇలా ఉండాలి అన్నంత కసిగా నటించారు. నాగమ్మ అంటే భానుమతే. ఆ చిత్రంలో బ్రహ్మన్న పాత్రలో ఎన్టీ రామారావు గారికి దీటుగా నటించి శహభాష్ అనిపించుకున్నారు. అలానే బొబ్బిలి యుద్ధం చిత్రం కూడా. మల్లమ్మ పాత్రలో 'శ్రీకర కరుణాల వాల' అనే పాట చాలా హిట్.  అంతస్తులు చిత్రంలో గొప్పింట పుట్టి పేదరికంలో పెరిగి రాటు దేలిన మహిళగా ఆమె నటన అద్భుతం. ఆ పాత్రలో 'దులపర బుల్లోడో దుమ్ము దులపర బుల్లోడో' అనే పాట ఆదరణ పొందింది. ఇలా చెప్పుకుంటూ పొతే ప్రతి పాత్ర ఒక మాణిక్యమే. - చండీ రాణి, సారంగధర, చింతామణి, వివాహబంధం, మట్టిలో మాణిక్యం - లాంటి పాత్రకు ప్రాధాన్యమున్న పాత్రలు ఎన్నో.  80 - 90 దశకాల్లో తల్లి, నాయనమ్మ, అమ్మమ్మ పాత్రల్లో ఉత్సాహంగా ఉరకలు వేసి మనల్ని ఉబ్బి తబ్బిబ్బు చేశారు. మంగమ్మ గారి మనవడు చిత్రంలో మంగమ్మ పాత్ర మరిచిపోలేనిది. 'శ్రీ సూర్య నారాయణా మేలుకో' అనే పాట వీనుల విందు. అలాగే బామ్మ మాట బంగారు బాట, పెద్దరికం, సామ్రాట్ అశోక లాంటి చిత్రాలెన్నో తన శైలిలో నటించి సుదీర్ఘమైన చలన చిత్ర వృత్తిని సార్థకం చేసుకున్నారు.

      అంతే కాదు, భరణి పతాకంపై వచ్చిన కొన్ని చిత్రాలకు దర్సకత్వం కూడా వహించారు.  చెన్నైలో సంగీత కళాశాల ప్రధాన అధ్యాపకురాలుగా సమర్థవంతంగా నిర్వహించారు.సాంఘిక సేవ కార్యక్రమాలలో పాల్గొని తన వంతు సేవ చేశారు.
      చిత్రాల్లో నటిస్తూనే ఆమె సాహిత్యాభిరుచిని కూడా తీర్చుకున్నారు. ఆమె భాష, రచనా శైలి ఆమె ఆలోచనా పద్ధతిని పూర్తిగా ప్రతిబింబిస్తుంది. స్వచ్చమైన భాష, చదువరులను కట్టి పడేసే హాస్యంతో అత్తగారి కథలు రాసారు ఆమె. నాలో నేను అనే ఆత్మకథలో ఆమె తన జీవితాన్ని మనకు వివరించారు సహజమైన శైలిలో. ఆమె రచనలకు సాహిత్య అకాడెమి పురస్కారం కూడా లభించింది.

      భారత ప్రభుత్వంచే పద్మ భూషణ్, మూడు సారులు జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డు, ఆంధ్ర, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం వారిచే గౌరవ డాక్టరేట్, ఎన్టీఆర్, రఘుపతి వెంకయ్య, కలైమామణి అవార్డు - ఇలా ఎన్నో. నటి, గాయని, రచయిత, దర్శకురాలు, నిర్మాత, అధ్యాపకురాలు - ఇలా వివిధ పాత్రలలో తన సత్తా చాటి, తనకంటూ ఒక ప్రత్యెక స్థానాన్ని ఏర్పరుచుకున్న బహుముఖ ప్రజ్ఞాశీలి డాక్టర్ భానుమతి.  ఆవిడ తెలుగుజాతిలో మరోమారు కళాకారిణిగా జన్మించాలని నా కోరిక. ఆవిడ పాడిన పాటల్లో నాకిష్టమైనది చక్రపాణి చిత్రం నుండి మెల్లమెల్లగా అనే ఈ గీతం. చూడండి.