వినాయకుడు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వినాయకుడు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, సెప్టెంబర్ 2026, ఆదివారం

శ్రీగణనాథం భజామ్యహం - త్యాగరాజస్వామి కృతి



శ్రీగణనాథం భజామ్యహం
శ్రీకరం చింతితార్థ ఫలదం

శ్రీగురుగుహాగ్రజం అగ్రపూజ్యం
శ్రీకంఠాత్మజం శ్రిత సామ్రాజ్యం 

రంజిత నాటకరంగతోషణం
శింజిత వర మణిమయ భూషణం
ఆంజనేయావతారం సుభాషణం
కుంజరముఖం త్యాగరాజ పోషణం  

శుభములను ప్రసాదించే వాడవు, మనసులో కోరుకున్న కోరికలకు తగిన ఫలములను అనుగ్రహించే వాడవు అయిన గణనాథా! నిన్ను నేను భజిస్తున్నాను. సుబ్రహ్మణ్యునికి అన్నవైన నీవు, అన్ని పూజలలోనూ ముందుగా పూజింపదగిన అగ్రపూజ్యుడవు.  పరమశివుని కుమారుడవు, నిన్ను ఆశ్రయించిన వారికి సామ్రాజ్య వైభవాన్ని ప్రసాదించేవాడవు,నిన్ను నేను భజిస్తున్నాను.  నాటకరంగానికి సంతోషమును ప్రసాదించేవాడవు, కదులుతున్నప్పుడు మధురంగా మ్రోగే శ్రేష్ఠమైన రత్నమయ ఆభరణాలను ధరించినవాడవుం ఆంజనేయుని అవతారంగా వెలసినవాడవు, మంగళకరమైన, మంచి మాటలు పలికేవాడవు, ఏనుగు ముఖాన్ని కలిగిన వాడవు, త్యాగరాజును ఆదరించి, రక్షించి, పోషించేవాడవు. అటువంటి గణనాథుడవైన నిన్ను నేను భక్తితో భజిస్తున్నాను.

ఈ కృతిలోని ఆంజనేయావతారం అనే ప్రయోగం ప్రత్యేకంగా గమనించదగినది. ఇక్కడ త్యాగరాజస్వామి గణపతినే హనుమంతుని అవతారంగా పేర్కొంటున్నట్లు సాహిత్యం నేరుగా కనిపిస్తుంది. దీనికి ఒక సంప్రదాయ వివరణ ఏమిటంటే, గణపతి మరియు హనుమంతుడు ఇద్దరూ విఘ్నాలను తొలగించే శక్తి, అపారమైన బలం, బుద్ధి, కార్యసిద్ధి, భక్తుల రక్షణ వంటి లక్షణాలకు ప్రతీకలు. అందువల్ల ఆంజనేయుని తత్త్వమే గణపతిలో కూడా వ్యక్తమైందనే భావంతో ఈ ప్రయోగాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే గణపతి నిజంగా ఆంజనేయునిగా అవతరించాడనే కథ వాల్మీకి రామాయణం లేదా ప్రసిద్ధ పురాణాలలో ప్రత్యేకంగా చెప్పబడలేదు.  

కనకాంగి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని రంజని గాయత్రి సోదరీమణులు ఆలపించారు

19, సెప్టెంబర్ 2026, శనివారం

వామాంక స్థితయా - ముత్తుస్వామి దీక్షితుల కృతి



వామాంక స్థితయా వల్లభయాऽऽశ్లిష్టం
వారణ వదనం దేవం వందేऽహం

వామన స్వరూపం వరదం సచాపం
చామర కర్ణం శశి శేఖర తనయం
నామరూప ధరం అభినవ గురుగుహ హృదయం

అష్టాంగయోగ వర హఠాణవాది జయ వశిష్ఠాది తపోధన సేవిత గణనాథం
సృష్ట్యాది కారణం శ్రితపాలనం హేతు దృష్టాంత వర్జితం దేవతా పూజితం
దుష్టవిఘ్నహరణం శిష్టభక్తభరణం ఇష్టఫలదచరణం శిష్టహృద్విహరణం

ఎడమ తొడపై ఆసీనురాలైన వల్లభాదేవి ఆలింగనం చేసుకొని ఉన్న, గజముఖుడైన గణపతిని నేను పూజిస్తున్నాను. పొట్టివాడు, వ ప్రదాత, విల్లు ధరించినవాడు, చామరములవంటి విశాల కర్ణాలు కలవాడు, చంద్రశేఖరుడైన శివుని కుమారుడు, అనేక నామరూపాలను ధరించి, బాలస్వరూపుడైన సుబ్రహ్మణ్యుని హృదయంలో నివసించేవాడు అయిన గణపతిని పూజిస్తున్నాను. అష్టాంగయోగంలో శ్రేష్ఠుడు, హఠము, అహంకారము మొదలైన వాటిని జయించినవాడు, వశిష్ఠుడు మొదలైన తపోధనులచే సేవింపబడే గణనాథుడు, సృష్టి మొదలైన జగద్వ్యాపారాలకు కారణుడు, శరణు వచ్చినవారిని పాలించేవాడు, కారణమూ దృష్టాంతమూ లేని అనుపమ స్వరూపుడు, దేవతలచే పూజింపబడేవాడు, దుష్టశక్తులవల్ల కలిగే విఘ్నాలను తొలగించేవాడు, శిష్టభక్తులను పోషించేవాడు, తన పాదముల ద్వారా ఇష్టఫలాలను ఇచ్చేవాడు, సజ్జనుల మరియు పండితుల హృదయాలలో విహరించేవాడైన ఆ గణపతిని భక్తితో స్తుతిస్తున్నాను.

ఇది ముత్తుస్వామి దీక్షితుల వారి అఠాణా రాగం, ఖండ ఏకతాళంలో ఉన్న గణపతి కృతి. వల్లభాదేవి తన వామాంకంలో ఉండి గణపతిని ఆలింగనం చేసిన సౌమ్యమైన వల్లభగణపతి భావాన్ని ఈ కృతి చిత్రిస్తుంది. అదే సమయంలో ఆయనను విశ్వకారకుడిగా, యోగీశ్వరుడిగా, భక్తరక్షకుడిగా ప్రతిష్ఠిస్తుంది. హఠ–ఆణవాది జయ అనే పదబంధంలో అఠాణా రాగముద్ర సున్నితంగా నిక్షిప్తమై ఉంది. ఈ కృతి ద్వితీయావిభక్తిలో సాగుతుంది.

ఈ కృతిని టీఎస్ సత్యవతి గారు ఆలపించారు.  

శ్రీ మూలాధార చక్ర వినాయక - ముత్తుస్వామి దీక్షితుల కృతి



శ్రీ మూలాధార చక్ర వినాయక
అముల్యవర ప్రదాయిక 

మూలాజ్ఞాన శోక వినాశక
మూలకంద ముక్తి ప్రదాయక

సకళీకృత దేవాదిదేవ శబళీకృత సర్వజ్ణ స్వభావ
ప్రకటీకృత వైఖరి స్వభావ పరాభవ ప్రసిద్ధ గజగ్రీవ
వికట షట్శత శ్వాసాధికార విచిత్రాకార భక్తోపకార
అకళంక విభాస్వర విఘ్నేశ వర గురుగుహ సోదర లంబోదర 

శ్రీమూలాధారచక్రంలో విరాజిల్లే వినాయకా, అమూల్యమైన వరాలను ప్రసాదించేవాడా, మూలమైన అజ్ఞానం వల్ల కలిగే శోకాన్ని నాశనం చేసేవాడా, సృష్టికి మూలకారణుడవై ముక్తిని అనుగ్రహించేవాడా! దేవతలకే ఆదిదేవుడవై సాకారరూపాన్ని ధరించినవాడవు,  నీ సర్వజ్ఞస్వభావాన్ని సమస్త జీవులలో వివిధరీతులుగా విస్తరింపజేసినవాడవు, వినిపించే వాక్కైన వైఖరీరూప స్వభావాన్ని ప్రత్యక్షపరచినవాడవు, నీకంటే ఉన్నతుడు ఎవరూ లేడని ప్రసిద్ధుడవు, గజముఖుడవు, వికటస్వరూపుడవు, ఆరువందల శ్వాసలపై అధికారం కలిగిన యోగస్వరూపుడవు, అనేక విచిత్రరూపాలు ధరించి భక్తులకు ఉపకారం చేసేవాడవు, కళంకరహితమైన ప్రకాశస్వరూపుడవు, విఘ్నాలకు ఈశ్వరుడవు మరియు వరాలను ప్రసాదించేవాడవు. హరునికి గురువైన సుబ్రహ్మణ్యుని సోదరుడవు, లంబోదరుడవైన నిన్ను నేను భక్తితో స్మరిస్తున్నాను.

ఇది ముత్తుస్వామి దీక్షితుల వారి తిరువారూరు క్షేత్ర సంబంధ గణపతి కృతి. శ్రీరాగంలో ఆదితాళంలో రచించబడింది. గణపతిని మూలాధారచక్రాధిపతిగా ధ్యానించే యోగతత్త్వాన్ని ఇది కేంద్రీకరిస్తుంది. మూలాధారం ఆధ్యాత్మిక ప్రయాణానికి ప్రథమాధారమని సూచిస్తూ, అజ్ఞాననాశనం మరియు ముక్తిప్రదానం అనే అంతర్ముఖసాధనను కృతి ప్రతిపాదిస్తుంది. పరా, పశ్యంతీ, మధ్యమా, వైఖరీ అనే నాలుగు వాక్స్థితులలో బాహ్యంగా వినిపించే వైఖరీ వాక్కును గణపతి స్వరూపంగా చెప్పడం దీని విశిష్టత. షట్‌శత శ్వాసాధికారమనే ప్రయోగం ప్రాణశక్తి, శ్వాసనియంత్రణ, యోగాధికార భావాలను సూచిస్తుంది. 

ఈ కృతిని ఎం ఎస్ సుబ్బులక్ష్మి గారు ఆలపించారు.    

హస్తి వదనాయ నమస్తుభ్యం - ముత్తుస్వామి దీక్షితుల కృతి


హస్తి వదనాయ నమస్తుభ్యం
హాటకమయ మంటపే సింహాసన స్థితాయ

హస్తి కృత్తి వసన ధరార్చిత మహా గణపాయ తత్వ స్వరూపాయ
సమస్త భక్తానుగ్రహాయ మాయాలింగిత విగ్రహాయ


కమలోత్పల పాశ శంఖ చక్రేక్షు కార్ముక వ్రీహ్యాగ్ర గదా నిజ విషాణ
మాతులంగ రత్న కలశ ధరణ కరాంబుజాయ పద పంకజాయ విమలాయ
విశ్వోత్పత్తి స్థితి విలయాయ కరుణాలయాయ
హిమాద్రితనయానన పంకజ హిరణ్య గర్భాయ సుమనసే
ఉమారమణ కుమార గురుగుహ సమాన వరౌజసే మహసే

గజముఖుడవైన మహాగణపతీ! నీకు నా నమస్సులు. బంగారుమయమైన మండపంలో సింహాసనంపై కొలువై ఉన్నవాడవు నీవు. ఏనుగు చర్మాన్ని వస్త్రముగా ధరించిన పరమశివునిచే పూజింపబడే మహాగణపతీ! పరమతత్త్వస్వరూపుడవు, సమస్త భక్తులపై అనుగ్రహం కురిపించేవాడవు, మాయాశక్తి ఆలింగనం చేసిన దివ్యవిగ్రహుడవు. కమలం, కలువ, పాశం, శంఖం, చక్రం, చెరకువిల్లు, వరికంకులు, గద, స్వదంతం, మాదీఫలము, రత్నకలశం ధరించిన కమలసదృశ హస్తాలు కలవాడవు, కమలాలవంటి పాదములు గల నిర్మలుడవు, జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయలకు కారణభూతుడై కరుణకు నిలయమైనవాడవు, హిమవంతుని కుమార్తె పార్వతీదేవి ముఖకమలాన్ని వికసింపజేసే సూర్యునివంటి హిరణ్యగర్భస్వరూపుడవు, సదాశయుడవు. ఉమారమణుడైన శివుని కుమారుడయిన సుబ్రహ్మణ్యునితో సమానమైన శ్రేష్ఠ పరాక్రమం, తేజస్సు, ప్రకాశస్వరూపుడవయిన నిన్ను భక్తితో స్తుతిస్తున్నాను. 

నవరోజు రాగంలో మిశ్రచాపు తాళంలో స్వరపరచబడిన ఈ కృతి తిరువారూరు క్షేత్ర సంబంధితమైనది. గణపతిని కేవలం విఘ్నేశ్వరునిగా కాక, మాయాశక్తితో ఏకమైన పరతత్త్వంగా, విశ్వసృష్టి–స్థితి–లయకర్తగా, అనేక దివ్యచిహ్నాలు చేతబూనిన మహావిగ్రహంగా దీక్షితులు ఇందులో దర్శింపజేస్తారు. గురుగుహునితో సమానమైన తేజఃపరాక్రమం అనే పదబంధంలోనే నవరోజు రాగముద్రను కూడా సున్నితంగా నిక్షిప్తం చేశారు.

ఈ ముత్తుస్వామి దీక్షితుల కృతిని విఘ్నేశ్ ఈశ్వర్ ఆలపించారు


మహాగణపతిం మనసా స్మరామి - ముత్తుస్వామి దీక్షితుల కృతి


మహాగణపతిం మనసా స్మరామి వశిష్ఠ వామదేవాది వందిత

మహాదేవ సుతం గురుగుహ నుతం మారకోటి ప్రకాశం శాంతం
మహాకావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం 

వశిష్ఠుడు, వామదేవుడు మొదలైన మహర్షులచే పూజించబడే మహాగణపతిని నేను నా మనస్సులో నిరంతరం స్మరిస్తున్నాను. ఆయన మహాదేవుడైన పరమశివుని కుమారుడు, గురుగుహుడైన కుమారస్వామిచే స్తుతింపబడేవాడు, కోటి మన్మథుల సౌందర్యప్రకాశాన్ని మించిన తేజస్సు కలిగినా పరమశాంతస్వరూపుడు. మహాకావ్యాలు, నాటకాలు మొదలైన కళలను ప్రీతితో ఆదరించేవాడు, మూషికాన్ని వాహనంగా కలిగినవాడు, మోదకాలను ఎంతో ఇష్టపడే ఆ మహాగణపతిని మనసారా ధ్యానిస్తున్నాను.

మహాకావ్య నాటకాది ప్రియం అన్నారు దీక్షితుల వారు. దీనిని రెండు విశేషాలుగా చెప్పుకోవచ్చు. 

1. దీక్షితుల వారి ప్రత్యేకత రాగం యొక్క పేరును చాలా కృతులలో సాహిత్యానికి సముచితంగా ప్రస్తావించటం. ఇక్కడ నాట రాగ నామాన్ని నాటక అనే పదంలో పొందుపరచారు. 

2. గణపతి వ్యాసభగవానుడి నోట వెలువడ్డ మహాకావ్యమైన భారతాన్ని వ్రాయటానికి ఒప్పుకోవటానికి ఉన్న నేపథ్యం. శబ్దభావతాళాలతో ముడిపడి ఉన్న కళలన్నిటినీ ఆస్వాదించేవాడు గణపతి, బుద్ధిప్రదాత కాబట్టి.  

నాట రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని మహారాజపురం సంతానం గారు ఆలపించారు.

వినాయక విఘ్ననాశక - ముత్తుస్వామి దీక్షితుల కృతి


వినాయక విఘ్ననాశక మాం తారయ దయానిధే

అనాథ రక్షక ఆరూఢ మూషిక శివ గురుగుహ విధి పూజిత 

ఆశ్రితజన పరిపాలక దేవరాజపుర తోషిత వేగవాహినీ వర్ధిత
రవిశశివహ్నినేత్ర రతిపతి సన్నుత శుభగాత్ర పవనాత్మజానందకర రామ మిత్ర వర పవిత్ర

దయాసముద్రుడవు, విఘ్నములను నాశనము చేసే వినాయకా, సంసారసాగరము నుండి నన్ను దాటించుము. అనాథులకు రక్షకుడవై, మూషికాన్ని వాహనంగా అధిరోహించినవాడవు నీవు. శివుడు, గురుగుహుడైన కుమారస్వామి, బ్రహ్మదేవుడు పూజించే వాడవు, శరణు వచ్చిన జనులను పరిపాలించేవాడవు. దేవరాజపురమనే కాంచీపురంలో ఆనందంగా కొలువై, వేగవాహినీ నదిచే మహిమ వర్ధిల్లినవాడవు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనే దివ్య నేత్రములు కలవాడవు, రతీపతియైన మన్మథునిచే కూడా స్తుతింపబడే శుభమంగళ స్వరూపుడవు, వాయుపుత్రుడైన హనుమంతునికి ఆనందాన్ని కలిగించేవాడవు, రామునికి మిత్రుడవు, సమస్త పావనకరులలో శ్రేష్ఠుడవైన వినాయకా, సంసారసాగరము నుండి నన్ను దాటించుము. 

వేగవాహిని రాగంలో స్వరపరచబడిన ముత్తుస్వామి దీక్షితుల కృతిని ప్రియా సోదరీమణులు ఆలపించారు


గణేశకుమార పాహి మాం - ముత్తుస్వామి దీక్షితుల కృతి


గణేశకుమార పాహి మాం గజముఖ

మనోరథ సిద్ధి దాయకా
ఆగమపదాదినుత భవ శ్రీ గురుగుహనుత గజముఖ 

గజముఖుడవు, బాలస్వరూపుడవైన గణేశా! నన్ను కాపాడుము. నా మనోరథాలను సిద్ధింపజేసే వాడవు నీవు. ఆగమశాస్త్రాలలోని పవిత్రమైన పదములచే మొదటినుండి స్తుతింపబడేవాడవు, భవుడైన పరమశివునిచే వందింపబడేవాడవు, శ్రీ గురుగుహుడైన కుమారస్వామిచే కూడా నుతింపబడేవాడవు. నన్ను కాపాడుము.

ఝంఝూటి రాగంలో స్వరపరచబడిన ఈ ముత్తుస్వామి దీక్షితుల వారి కృతిని స్కందశ్రీ శివప్రసాద్ గారు ఆలపించారు

ప్రణమామ్యహం శ్రీ గౌరీసుతం - మైసూరు వాసుదేవాచార్యుల కృతి



ప్రణమామ్యహం శ్రీ గౌరీసుతం
ఫణితల్ప వాసుదేవ భక్తం సతతం

గణనాథమమర బృంద సేవితం
ఫణిహార భూషితం ముని వర వందితమ్

ధృత చారు మోదకం గజ ముఖం
సితకరామిత గర్వ భంజకం
నతలోక సంతోష దాయకం
శ్రితభక్త పాలకం సిద్ధి వినాయకం 

గౌరీదేవి కుమారుడు, ఆదిశేషుని శయ్యగా కలిగిన వాసుదేవుడైన శ్రీమన్నారాయణుని ఎల్లప్పుడూ భక్తితో సేవించేవాడు అయిన శ్రీగణపతికి నేను ప్రణమిల్లుతున్నాను. గణములందరికీ నాయకుడు, దేవతాసమూహముచే సేవింపబడేవాడు, సర్పములను హారముగా ఆభరణంగా ధరించినవాడు, శ్రేష్ఠ మునులచే పూజించబడేవాడు, సుందరమైన మోదకాన్ని చేతబూని ఉన్న గజముఖుడు, చంద్రుని అపరిమిత గర్వాన్ని అణచినవాడు, నమస్కరించి శరణు వచ్చిన లోకజనులకు సంతోషాన్ని ప్రసాదించేవాడు, ఆశ్రయించిన భక్తులను కాపాడేవాడు, సకల సిద్ధులను అనుగ్రహించు సిద్ధివినాయకుడు అయిన గణపతిని నేను భక్తిపూర్వకంగా ప్రణమిల్లుతున్నాను.

గౌళ రాగంలో స్వరపరచబడిన ఈ మైసూరు వాసుదేవాచార్యుల కృతిని ఎం ఎల్ వసంతకుమారి గారు ఆలపించారు.  


గణనాయకం భజేహం భజే - ముత్తుస్వామి దీక్షితుల కృతి


గణనాయకం భజేహం భజే
కమలేశనుతం కామరిపుసుతం

అణిమాది సిద్ధి దాయకం సుముఖం

వాణీ రమణానందం వరదం
వదనేద్విరదం వరబాలగురుగుహం

గణములకు నాయకుడు, విష్ణువుచే నుతించబడినవాడు, మన్మథుని శత్రువైన పరమశివుని కుమారుడు అయిన గణపతిని భజిస్తున్నాను. అణిమాది అష్ట సిద్ధులను ప్రసాదించేవాడు, ప్రసన్నమైన ముఖము కలవాడు అయిన గణపతిని భజిస్తున్నాను. సరస్వతీదేవి పతి అయిన బ్రహ్మకు ఆనందం కలిగించేవాడు, వరములనొసగేవాడు, గజముఖము కలిగినవాడు, బాలుడైన కుమారస్వామిని అనుగ్రహించినవాడు అయిన గణపతిని భజిస్తున్నాను.

(అణిమ,మహిమ,గరిమ,లఘిమ,ప్రాప్తి,ప్రాకామ్యము, ఈశత్వము,వశిత్వము అనేవి అష్ట సిద్ధులు. రెండు దంతములు కలిగినది ఏనుగు అందుకే దానిని ద్విరదము అన్నారు) . రుద్రప్రియ రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని ఎం ఎల్ వసంతకుమారి గారు ఆలపించారు. 

రక్తగణపతిం భజేహం - ముత్తుస్వామి దీక్షితుల కృతి



రక్తగణపతిం భజేహం
రత్న సింహాసన పతిం సురపతిం

రక్తాంబరధరం రాగ ద్వేషాది హరం
పార్వతీ ప్రియకరం మోహన కరం

పరశురామ క్షేత్ర ప్రభావం
పాయసాన్న హోమాది విభావం
పంచకృత్యాతీత స్వభావం
భక్తజనాది సమూహ వైభవం

సకల కార్యార్థ సిద్ధిదం స్థిరం
వామదేవాది పూజితం వరం
వారిజభవ వందిత వల్లభేశం
గురుగుహనుతం పరమశివ సుతం

రత్నసింహాసనానికి అధిపతియై దేవతలకు ప్రభువుగా విరాజిల్లే రక్తవరణములో ఉండే గణపతిని నేను భజిస్తున్నాను. ఎర్రని వస్త్రాలు ధరించి, రాగము, ద్వేషము మొదలైన అంతఃశత్రువులను తొలగించేవాడు, తన తల్లి పార్వతీదేవికి ప్రియమైనవాడు, మోహనమైన రూపం కలవాడు, పరశురామక్షేత్రమునందు ప్రత్యేక మహిమతో వెలసినవాడు; పాయసాన్నహోమము మొదలైన హోమారాధనలచే వైభవంగా పూజింపబడేవాడు, సృష్టి, స్థితి, సంహారము, తిరోభావము, అనుగ్రహము అనే పంచకృత్యాలకు అతీతమైన స్వభావం కలవాడు, భక్తజన సమూహాలచే చుట్టుముట్టబడి మహిమతో వెలిగేవాడు, సమస్త కార్యాల ఆశయాలను స్థిరంగా సిద్ధింపజేసే వరప్రదుడు, వామదేవుడు మొదలైనవారిచే పూజింపబడే శ్రేష్ఠుడు, కమలమున పుట్టిన బ్రహ్మచే పూజించబదే వల్లభేశుడు, సుబ్రహ్మణ్యునిచే స్తుతింపబడే పరమశివుని కుమారుడైన  రక్తగణపతిని నేను భక్తితో భజిస్తున్నాను.

ఇక్కడ పరశురామ క్షేత్రం అనగా పరశురాముడు సముద్రం నుండి తిరిగి పొందిన భూమిగా పురాణ సంప్రదాయంలో భావించే పశ్చిమతీర పవిత్ర ప్రాంతం — ప్రధానంగా కేరళ–కొంకణ తీరప్రాంతం. ఆ ప్రాంతంలో గణపతి ఆరాధన, హోమసంప్రదాయం విశేషంగా ఉండటాన్ని ఈ కృతి సూచిస్తుంది, అయితే కృతి స్వయంగా ఒక నిర్దిష్ట ఆలయనామాన్ని చెప్పదు.  

మోహన రాగంలో స్వరపరచబడిన ఈ ముత్తుస్వామి దీక్షితుల కృతిని మహారాజపురం సంతానం గారు ఆలపించారు

ఏకదంతం భజేహం - ముత్తుస్వామి దీక్షితుల కృతి


ఏకదంతం భజేహం ఏకానేక ఫల ప్రదం

పాకశాసనారాధితం పామర పండితాది నుత పదం 

కైలాసనాథ కుమారం కార్తికేయ మనోహరం
హాలాస్య క్షేత్ర వేగవతీ తట విహారం హరం
కోలాహల గురుగుహ సహితం కోటి మార లావణ్య హితం
మాలా కంకణాది ధరణం మాషా వల్లభాంబా రమణం 

ఏకదంతుడైన శ్రీగణపతిని నేను భజిస్తున్నాను. ఆయన పరమఫలమైన మోక్షాన్ని, అనేకమైన ఐహిక కోర్కెల ఫలాలను అనుగ్రహించేవాడు.

పాకాసురుణ్ణి సంహరించిన ఇంద్రునిచే ఆరాధింపబడేవాడు, పామరుల నుండి పండితుల వరకు అందరిచే నుతించబడే పాదములు కలవాడు, కైలాసనాథుడైన శివుని కుమారుడు, కార్తికేయునికి ఆనందము కలిగించే వాడూ అయిన ఏకదంతుడిని నేను భజిస్తున్నాను. హాలాస్యక్షేత్రమైన మదురైలో వేగవతి నది తీరాన విహరించేవాడు, భక్తుల దుఃఖాలు, విఘ్నాలు తొలగించేవాడు. ఉత్సవకోలాహలంలో గురుగుహుడైన సుబ్రహ్మణ్యునితో కలిసి ఉండేవాడు. కోటి మన్మథుల అందాన్ని మించే లావణ్యం కలిగి, లోకహితాన్ని చేసేవాడు. పూలమాలలు, కంకణాలు మొదలైన ఆభరణాలు ధరించినవాడు. నల్లని రూపము కలిగి, మాయాశక్తి స్వరూపిణియైన వల్లభాంబాదేవికి పతియైన గణపతిని నేను భక్తితో భజిస్తున్నాను.

మధురకు హాలాస్యక్షేత్రం అనే పేరు రావడం స్థలపురాణ సంబంధమైనది.

పారంపర్య కథనం ప్రకారం, మదురై నగర నిర్మాణానికి శివుడు ఒక సర్పాన్ని పంపాడు. ఆ సర్పం నగరానికి సరిహద్దులుగా చుట్టుకొని తన తల–తోకలను మధ్యభాగంలోని శివాలయ దిశగా ఉంచింది. ఆ సర్పానికే హాలాస్యమని పేరు. అందువల్ల ఆ పవిత్ర నగరం హాలాస్యం, తమిళంలో తిరువాలవాయ్, అని ప్రసిద్ధి చెందింది. అక్కడ వెలసిన శివుడు సోమసుందరేశ్వరుడు/హాలాస్యనాథుడు. అందుకే కృతిలో హాలాస్య క్షేత్రం అని ముత్తుస్వామి దీక్షితుల వారు ప్రస్తావించారు. 

బిలహరి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని సిక్కిల్ గురుచరణ్ గారు ఆలపించారు.

శక్తి సహిత గణపతిం - ముత్తుస్వామి దీక్షితుల కృతి

శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం
విరక్త సకల మునివర సురరాజ వినుత గురుగుహం

భక్తాళి పోషకం భవసుతం వినాయకం
భుక్తిముక్తిప్రదం భూషితాంగం రక్తపదాంబుజం భావయామి

శంకరుడు మొదలైన దేవతలచే సేవింపబడేవాడు, వైరాగ్యాన్ని ఆచరించిన మునిశ్రేష్ఠులచే, దేవరాజైన ఇంద్రునిచే, గురుగుహుడైన సుబ్రహ్మణ్యునిచే స్తుతింపబడేవాడు, పార్వతీదేవితో కూడి ఉన్న గణపతిని నేను ధ్యానిస్తున్నాను. భక్తసమూహాన్ని పోషించి రక్షించేవాడు, భవుడైన శివుని కుమారుడు, విఘ్నాలను తొలగించే వినాయకుడు, భుక్తి అనగా లోకంలో లభించే సుఖసంపదలను, ముక్తి అనగా జననమరణ బంధవిముక్తిని ప్రసాదించేవాడుం దివ్యాభరణాలతో అలంకరింపబడిన దేహం, ఎర్రని కమలాలవంటి పాదాలు కలిగిన పార్వతీ సహిత గణపతిని నేను నా మనస్సులో ధ్యానిస్తున్నాను.

శంకరాభరణం రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని నొట్టుస్వరాలను నేర్పించటానికి వినియోగిస్తారు. దీనిని జొన్నలగడ్డ శ్రీరాం మరియు కల్యాణ్ వసంత్ ఆలపించారు

18, సెప్టెంబర్ 2026, శుక్రవారం

గజాననయుతం గణేశ్వరం - ముత్తుస్వామి దీక్షితుల కృతి


గజాననయుతం గణేశ్వరం భజామి సతతం సురేశ్వరం

అజేంద్ర పూజిత విఘ్నేశ్వరం గణాది సన్నుత పదపద్మకరం
కుంజర భంజన చతురతర కరం గురుగుహాగ్రజం ప్రణవాకారం

గజముఖము కలిగిన గణేశ్వరుడిని, దేవతలకు అధిపతియైన ఆ గణపతిని నేను ఎల్లప్పుడూ భజిస్తున్నాను. బ్రహ్మ, ఇంద్రుడు మొదలైనవారిచే పూజింపబడే వాడు, గణములు మొదలైనవారు స్తుతించే  కమలముల వంటి పాదాలు, హస్తాలు కలిగినవాడు,  కుంజరుడనే రాక్షసుడిని సంహరించడంలో అత్యంత సమర్థతను చూపినవాడు, సుబ్రహ్మణ్యస్వామికి అగ్రజుడు, ఓంకారస్వరూపుడు అయిన ఆయనను నేను నిరంతరం ఆరాధిస్తున్నాను.

ముత్తుస్వామి దీక్షితుల వారు చక్రవాకం రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని మహారాజపురం సంతానం గారు ఆలపించారు

హేరంబాయ నమస్తే - ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి


హేరంబాయ నమస్తే హేరంబాయ నమస్తే
హరి బ్రహ్మేంద్రాది సేవిత శివకుమారాయ 

వీర గణాది ముదితాయ వీరాది వర ప్రదాయ

సూరిజనోపాసితాయ సుర గురుగుహ సేవితాయ
పరమేశ్వర కుమారాయ పంచ హస్తాయ పాశాంకుశ-
ధరాయ ప్రసిద్ధ గణ నాధాయ వినాయకాయ 

శొర్యముచే అతిశయించు గణపతికి నా నమస్సులు. హరి, బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలచే సేవింపబడే, శివుని కుమారుడైన గణపతికి నమస్సులు. వీరగణములు మొదలైనవారితో ఆనందించేవాడు, భక్తులకు వీరత్వము మొదలైన వరాలను ప్రసాదించేవాడు, జ్ఞానులచే ఉపాసింపబడేవాడు, దేవతలచేను తన సోదరుడైన సుబ్రహ్మణ్యుడి చేతను సేవింపబడేవాడు, పరమేశ్వరుని కుమారుడు, ఐదు హస్తములు కలవాడు, పాశమును, అంకుశమును ధరించినవాడు, సర్వగణాలకు ప్రసిద్ధుడైన అధిపతి, ఎవరికీ అధీనుడు కాని వినాయకుడు అయిన ఆ హేరంబ గణపతికి నేను నమస్కరిస్తున్నాను.  

అఠానా రాగంలో స్వరపరచబడిన ఈ ముత్తుస్వామి దీక్షితుల వారి కృతిని సౌమ్యా పరశురామన్ ఆలపించారు

వల్లభ నాయకస్య - ముత్తుస్వామి దీక్షితుల కృతి


వల్లభ నాయకస్య భక్తో భవామి

వాంచితార్థదాయకస్య వరమూషిక వాహనస్య

పల్లవపద మృదుతరస్య పాశాంకుశాది ధరస్య
మల్లికాజాతి చంపక హారస్య మణిమాలస్య
వల్లీ వివాహ కారణస్య గురుగుహ పూజితస్య
కాళీ కళామాలినీ కమలాక్షి సన్నుతస్య   

భావం:

గణముల అధిపతి అయిన గణపతికి నేను భక్తుడనై ఉన్నాను. ఆయన కోరిన కోర్కెలను నెరవేర్చువాడు,  శ్రేష్ఠమైన మూషికాన్ని వాహనంగా కలిగినవాడు. ఆయన పాదాలు లేత చిగురులకన్నా మృదువైనవి. పాశము, అంకుశము మొదలైన ఆయుధాలను ధరించినవాడు; మల్లిక, జాజి, సంపెంగ పుష్పహారాలతోను మణిమాలలతోను అలంకరింపబడినవాడు. తన సోదరుడైన సుబ్రహ్మణ్యుడు వల్లితో వివాహం చేసుకొనుటకు కారణమైనవాడు, సుబ్రహ్మణ్యునిచే పూజింపబడినవాడు. కాళీదేవి, కళామాలినియైన సరస్వతీదేవి, కమలాక్షియైన లక్ష్మీదేవి చేత స్తుతింపబడినవాడు అయిన గణపతికి నేను భక్తుడనై ఉన్నాను.  

గణపతి వల్లీ-సుబ్రహ్మణ్యుల వివాహానికి కారణమైనాడు అని దీక్షితుల వారు ఈ కృతిలో ప్రస్తావించారు. దీని వెనుక ఉన్న గాథ ఏమిటి? 

సుబ్రహ్మణ్యుడు వల్లి ప్రేమను పరీక్షించటానికి వృద్ధుని వేషంలో ఆమె వద్దకు వెళతాడు. వల్లి ఆయనను గుర్తించదు. కొంత సంకోచంతో ఉంటుంది. అప్పుడు సుబ్రహ్మణ్యుని అభ్యర్థనపై గణపతి ఏనుగు రూపం ధరించి వల్లిని భయపెడతాడు. భయపడిన వల్లి, తనను రక్షించమని ఆ వృద్ధుని రూపంలో ఉన్న సుబ్రహ్మణ్యుడిని ఆశ్రయిస్తుంది.

సుబ్రహ్మణ్యుడు, “నన్ను వివాహం చేసుకుంటానని ఒప్పుకుంటే ఈ ఏనుగును వెళ్లగొడతాను” అని అంటాడు. వల్లి అంగీకరించగానే గణపతి ఏనుగు రూపాన్ని విడిచి వెళ్తాడు. తరువాత సుబ్రహ్మణ్యుడు తన దివ్యస్వరూపాన్ని చూపుతాడు. వల్లి ఆయనను వివాహం చేసుకుంటుంది.

అందుకే దీక్షితుల వారు కృతిలో “వల్లీ వివాహ కారణస్య” అన్నారు.    

బేగడ రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని మహారాజపురం సంతానం గారు అద్భుతంగా ఆలపించారు

గణరాజేన రక్షితోహం - ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి

గణరాజేన రక్షితోహం
గుణిజన నుత పల్లవ పదేన 

అణిమాద్యష్ట సిద్ధి ప్రదేన
మాణిక్య మకుటాది ధరేణ
మంత్రిణీ పూజిత సుముఖేన
మానిత గురుగుహ వందితేన
దినకర కోటి ప్రకాశేన
వినతాశ్రిత మందారేణ
మను పూజిత పాశాంకుశేన
కానన స్థిత బ్రహ్మచర్యేణ 

భావం:

సజ్జనులు స్తుతించే మృదువైన పాదములు గల గణాధిపతి నన్ను రక్షించుచున్నాడు. అణిమ, గరిమ మొదలైన అష్టసిద్ధులను అనుగ్రహించేవాడు, మణులు పొదిగిన కిరీటమును ధరించినవాడు, మంత్రిణీ దేవి ఆయిన రాజశ్యామలచే పూజించిన సుముఖుడు, సుబ్రహ్మణ్యునిచే పూజించబడే గణపతి నన్ను రక్షించుచున్నాడు. కోటి సూర్యుల వలె తేజోవంతుడు,  నమస్కరించి శరణు వచ్చినవారికి కల్పవృక్షము వంటి వాడు. మనువుచే పూజించబడిన పాశము మరియు అనుకుశము ధరించినబాడు, అరణ్యమునందు నివసించేవాడు, బ్రహ్మచారిరూపుడైన గణపతి నన్ను రక్షించుచున్నాడు. 

ఆరభి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని ఆర్ వేదవల్లి గారు ఆలపించారు.

శ్రీ గణపతిని సేవింపరారే - త్యాగరాజస్వామి కృతి

శ్రీ గణపతిని సేవింపరారే శ్రిత మానవులారా

వాగధిపతి సుపూజల జేకొని బాగా నటింపుచును వెడలిన 

పనస నారికేళాది జంబూ ఫలముల నారగించి
ఘన తరంబుగను మహిపై పదములు ఘల్లు ఘల్లు మననించి
అనయము హరి చరణ యుగములను హృదయాంబుజమున నుంచి
వినయమునను త్యాగరాజ వినుతుడు వివిధ గతుల ధిత్తళాంగుమని వెడలిన  

శరణు కోరిన మానవులారా, శ్రీ గణపతిని సేవించటనికి విచ్చేయండి. వాక్కుకు అధిపతియైన బ్రహ్మదేవునిచే ఉత్తమమైన పూజలందుకొని లీలగా నటింపుచు వెళుతున్న గణపతిని సేవించటానికి విచ్చేయండి. పనస, కొబ్బరి, నేరేడు మొదలైన ఫలములను ఆరగించి, భూమిపై తన గంభీరమైన పాదములను “ఘల్లు ఘల్లు” మను శబ్దముతో మోపుచు, ఎల్లప్పుడూ తన హృదయకమలమున శ్రీహరి చరణయుగములను నిలుపుకొనినవాడు,  వినయముగా త్యాగరాజునిచే నుతించబడిన వాడు, వివిధ నడకలతో ధిత్తళాంగుమనే లయనాదమును పలికించుచు వెడలిన గణపతిని సేవించటానికి విచ్చేయండి.   

త్యాగరాజస్వామి ప్రహ్లాద భక్తి విజయము అనే యక్షగానాన్ని రచించారు. అందులో ప్రహ్లాదుని జననము నుండి నరసింహావతారం వరకు కృతి-గద్య రూపంలో అద్భుతమైన సాహిత్యాన్ని ఐదు భాగాలుగా విభజించారు. మొత్తం 48 దాకా కృతులు ఈ యక్షగానంలో ఉన్నాయి. అందులో మొదటిది ఈ గణపతిని కొలిచే సందర్భంగా కృతి.సౌరాష్ట్ర రాగంలో స్వరపరచబడిన ఈ కృతి సాధారణంగా త్యాగరాజ ఆరాధనోత్సవాలలో పంచరత్న కృతుల బృందగానం ముందు ఆలపిస్తారు. 

ఈ కృతిని మహారాజపురం సంతానం గారు ఆలపించారు

గిరిరాజ సుతా తనయా! సదయా! - త్యాగరాజస్వామి కృతి


గిరిరాజ సుతా తనయా! సదయా!

సురనాథ ముఖార్చిత పాదయుగ!
పరిపాలయ మాం ఇభరాజముఖ!

గణనాథ! పరాత్పర! శంకరాగమ వారినిధీ రజనీకర!
ఫణిరాజ కంకణ! విఘ్న నివారణ! శాంభవ! శ్రీ త్యాగరాజ నుత!

హిమవంతుని పుత్రికయైన పార్వతి కుమారుడు, దయానిధివైన ఓ గణపతీ! దేవతలకు అధిపతియైన ఇంద్రునిచే అర్చించబడిన పాదములు కలిగిన ఓ గజముఖా! మమ్ములను రక్షింపుము. పరబ్రహ్మ స్వరూపుడవైన ఓ గణనాథా! సమస్త శుభములను కలిగిస్తూ, సమస్త విద్యలనే సముద్రమునకు చంద్రుని వంటి వాడా! సర్పములు కంకణములుగా కలిగి విఘ్నములను నివారించే ఓ శంభుతనయా! త్యాగరాజునిచే నుతించబడిన గణపతీ! మమ్ములను రక్షించుము.  

ఈ కృతిని బట్టి కొందరు పల్లవిలో గిరిరాజసుత తనయా అన్నది ఆయన మాతామహులైన గిరిరాజకవి గురించి ప్రస్తావించారని భాష్యం చెప్పారు. కానీ, సంగీతజ్ఞులు, సంగీత నిపుణుల పరిశోధనలో తేలిన విషయం ఆయన మాతామహులు వీణ కాళహస్తయ్య గారు అని, ఆయన పితామహులు కాకర్ల గిరిరాజబ్రహ్మం గారు అని. కాబట్టి ఈ కృతిలోని పల్లవిలో గిరిరాజసుతా తనయా ప్రస్తావన పూర్తిగా గణపతి గురించే అని చాలామంది అంగీకరించారు. 

బంగాళా రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని రఘురాం మణికంఠన్ ఆలపించారు

13, సెప్టెంబర్ 2026, ఆదివారం

వినాయక వ్రతకల్పం — ఆధ్యాత్మిక అంతరార్థం


వినాయక వ్రతకల్పం మనసును శుద్ధి చేసి, వివేకంతో జీవించమని నేర్పే ఆధ్యాత్మిక సాధన. ఏ పూజలోనైనా ఆచమనం శరీర–మనస్సుల శుద్ధికి సంకేతం. ప్రాణాయామం చంచలమైన ఆలోచనలకు విరామం ఇచ్చి అంతర్ముఖతను పెంచుతుంది. సంకల్పంలో కాలం, స్థలం, మన గోత్ర నామాలు, ఉద్దేశం పలకడం అంటే మన జీవితం ధర్మబద్ధంగా సాగాలని మనకే మనం ఇచ్చుకునే మాట. కలశపూజలోని నీరు సృష్టి అంతటా ప్రవహించే జీవచైతన్యానికి రూపం. దీపారాధన అజ్ఞానాంధకారంలో జ్ఞానదీపాన్ని వెలిగించడమే. ఇది వినాయక వ్రతకల్పానికి కూడా అంతే వర్తిస్తుంది.

మట్టితో చేసిన వినాయకుడిని ఆవాహన చేసి ప్రాణప్రతిష్ఠ చేయడం ద్వారా దైవత్వం విగ్రహంలో మాత్రమే కాక, భక్తి–శ్రద్ధ–సత్సంకల్పాలతో నిండిన మన హృదయంలోనూ మేల్కొంటుందని భావిస్తాం. షోడశోపచారాలలో ఆసనం, పాద్యం, స్నానం, వస్త్రం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం వంటి సేవలు అతిథిసత్కారం మాత్రమే కాదు; అహంకారాన్ని తగ్గించి, మన వద్ద ఉన్న ఉత్తమమైన దాన్ని సమర్పించే సాధన. “శుక్లాంబరధరం”, “వక్రతుండ మహాకాయ” వంటి స్తోత్రాలు ప్రశాంతత, విశాలదృష్టి, విఘ్నాలను ఎదుర్కొనే ధైర్యం కోసం చేసే ప్రార్థనలు.

దూర్వ పూజలో సమర్పించే గరిక సున్నితమైనదైనా మళ్లీ మళ్లీ మొలిచే జీవశక్తికి ప్రతీక. దూర్వను అర్పించడం అంటే కోపం, ఆవేశం, అంతరాగ్ని వంటి వేడిని శాంతింపజేయమని గణపతిని ప్రార్థించడం. ఇరవై ఒక్క పత్రాల పూజ ప్రకృతిలోని వైవిధ్యాన్ని దైవస్వరూపంగా గౌరవించే భావనను పెంచుతుంది. ఉపయోగపడే మొక్కలే కాదు, సృష్టిలోని ప్రతి జీవరూపానికీ తనదైన స్థానముందని ఈ పూజ గుర్తుచేస్తుంది.

పార్వతీదేవి తన శరీరానికి అంటిన పసుపు నలుగు నుంచి బాలగణపతిని సృష్టించి, ద్వారపాలకునిగా నియమించిన కథలో స్వీయగౌరవం, విధినిష్ఠ కనిపిస్తాయి. తల్లి ఆజ్ఞను నిలబెట్టడానికి గణేశుడు శివుడినీ అడ్డుకోవడం, ధర్మబద్ధమైన బాధ్యత ముందు భయపడకూడదనే సందేశం. శివుడు ఆయన శిరస్సును ఖండించిన ఘట్టాన్ని క్రోధంగా మాత్రమే చూడకూడదు. పరిమితమైన అహం తొలగితేనే ఉన్నతమైన జ్ఞానానికి చోటు కలుగుతుందనే అంతరార్థం అందులో ఉంది. గజాసుర సంహారానికి సంబంధించిన పరంపరాగత ఘట్టం కూడా క్రూరత్వం, పశుత్వం, అహంకారం జ్ఞానశక్తిగా పరివర్తనం చెందడాన్ని సూచిస్తుంది. గజముఖాన్ని అమర్చి గణేశుడికి తిరిగి ప్రాణం పోయడం అంటే శక్తి, శివతత్త్వం, కరుణ కలిసి కొత్త చైతన్యాన్ని ప్రసాదించడమే.

తరువాత గణాధిపత్యం కోసం కుమారస్వామి–గణేశుల మధ్య జరిగిన పోటీ జ్ఞానబలానికి గొప్ప ఉదాహరణ. లోకప్రదక్షిణ చేసి ముందుగా వచ్చేవారికి గణాధిపత్యం అని నిర్ణయమైనప్పుడు, కుమారస్వామి మయూరవాహనంపై జగత్తు చుట్టేందుకు బయలుదేరాడు. అప్పుడు శివుడు గణేశుడికి నారాయణ మంత్రాన్ని ఉపదేశించి, ఆ మంత్రాన్ని జపిస్తూ తనను, పార్వతీదేవిని ప్రదక్షిణం చేయమని చెప్పాడు. తల్లిదండ్రులే సమస్త జగత్తుకు మూలమని గ్రహించిన గణేశుడు భక్తితో వారిని ప్రదక్షిణం చేశాడు. నారాయణ మంత్రజపంతో చేసిన ఆ ప్రదక్షిణం సమస్త లోకప్రదక్షిణ ఫలాన్నిస్తుందని భావించి, గణేశుడే గణాధిపత్యాన్ని పొందాడు. ఈ ఘట్టం మంత్రజపం, గురువాక్యంపై విశ్వాసం, తల్లిదండ్రుల పట్ల భక్తి, తత్త్వజ్ఞానం కలిసినప్పుడే నిజమైన విజయం సిద్ధిస్తుందని బోధిస్తుంది.

చంద్రుడు గణపతిని పరిహసించిన కథలోనూ, ఋషిపత్నులపై నింద పడినట్టుగా కొన్ని వ్రతకథా సంప్రదాయాల్లో వచ్చే ఘట్టాల్లోనూ ఒకే పాఠం ఉంది: కనిపించిన దృశ్యాన్ని బట్టి తొందరగా తీర్పు ఇవ్వకూడదు. పరిహాసం అవమానంగా, అనుమానం అపవాదుగా మారవచ్చు. చవితినాడు చంద్రదర్శన నియమాన్ని భయంగా కాకుండా, ఇతరుల లోపాలు చూసి నవ్వకూడదు, నిర్ధారణ లేకుండా నిందించకూడదనే నైతిక జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి.

శ్యమంతకోపాఖ్యానం ఈ సందేశాన్ని మరింత బలపరుస్తుంది. శ్రీకృష్ణునిపై శ్యమంతకమణిని అపహరించాడనే అపవాదు వచ్చినప్పుడు, ఆయన ఆగ్రహంతో స్పందించలేదు, సత్యాన్వేషణతో ముందుకు వెళ్లాడు. ప్రసేనుడు, సింహం, జాంబవంతుడు అనే సంఘటనల క్రమాన్ని అనుసరించి నిజాన్ని వెలికి తీశాడు. ఈ కథ అపవాదు ఎదురైనప్పుడు సహనం కోల్పోకుండా, ఆధారాలతో సత్యాన్ని నిరూపించుకోవాలని నేర్పుతుంది. వ్రతకథను వినడం అంటే పురాణాన్ని వినడం మాత్రమే కాదు, మన మాట, మన అనుమానం మరొకరికి అన్యాయమైన నిందగా మారకుండా చూసుకోవాలని ప్రతిజ్ఞ చేయడం.

మోదకాలు, కుడుములు, ఉండ్రాళ్లు తయారు చేయడం కుటుంబంలో పంచుకునే సంతోషానికి రూపం. బయటకు సాధారణంగా కనిపించే బియ్యపు పిండి పొరలో, లోపల తీపి పూర్ణం ఉండటం జీవితం యొక్క అంతరసారాన్ని గుర్తుచేస్తుంది: సరళతలోనే మాధుర్యం ఉంటుంది. ఆవిరితో ఉడికే కుడుము తపస్సు, ఓర్పుతో పరిపక్వమయ్యే మనస్సుకు ప్రతీక. నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా పంచుకోవడం, మనకు వచ్చిన ఆనందాన్ని ఒంటరిగా ఉంచుకోకుండా ప్రేమగా పంచుకోవాలని నేర్పుతుంది.

మంగళహారతి మనలోని జ్ఞానజ్యోతిని గుర్తించడం. ప్రదక్షిణం, నమస్కారం “నేను కాదు, ధర్మమే ప్రధానం” అనే వినయానికి గుర్తులు. ఉద్వాసన, నిమజ్జనం రూపం తాత్కాలికమైనా తత్త్వం నిత్యమని చెబుతాయి. పూజ ముగిసిన తర్వాత కూడా గణపతి వివేకం, వినయం, సత్యనిష్ఠ, కరుణ మన ఆలోచనల్లోనూ పనుల్లోనూ కొనసాగినప్పుడే వినాయక వ్రతకల్పం సంపూర్ణమవుతుంది.  

మూలాధార చక్రముతో గణపతి అనుబంధం


యోగ పరంపరలో మన దేహాన్ని కేవలం మాంసం, ఎముకల సముదాయంగా మాత్రమే చూడరు. శరీరం, శ్వాస, మనసు, చైతన్యం పరస్పరం కలిసిన ఒక జీవనవ్యవస్థగా చూస్తారు. ఈ దృష్టిలో వెన్నెముక అడుగుభాగానికి సంబంధించిన సూక్ష్మ కేంద్రాన్ని మూలాధార చక్రం అంటారు. ‘మూలం’ అంటే వేరు లేదా పునాది; ‘ఆధారం’ అంటే నిలబెట్టేది. మన స్థిరత్వం, భద్రతాభావం, క్రమశిక్షణ, రోజువారీ జీవనానికి పునాది వంటి భావాలను ఈ చక్రం సూచిస్తుంది.

గణపతి ఉపనిషత్తు గణపతిని “నిత్యం మూలాధారంలో స్థితుడవు” అని పేర్కొంటుంది. అదే ఉపనిషత్తు ఆయనను భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం అనే పంచభూతాలతోనూ అనుసంధానిస్తుంది. కాంచీ పరంపరలోని వివరణలో గణపతి మూలాధార చక్రానికి అధిదేవతగా, భూమి తత్త్వానికి ప్రతీకగా చెప్పబడతాడు. ఇది శరీర నిర్మాణశాస్త్రానికి చెందిన మాట కాదు. యోగం ఉపయోగించే అంతర్ముఖ పటం. దాని ఉద్దేశం మనలోని అనుభవాలను అర్థం చేసుకొని జీవనాన్ని సమతుల్యంగా మలచుకోవడం.

గణపతి మూలాధారంలో నివసిస్తాడని ఎందుకు భావిస్తారంటే, ఆయన ఆరంభానికి, స్థిరత్వానికి, విఘ్నాలను దాటే శక్తికి ప్రతీక. చెట్టు వేర్లు నేలలో బలంగా ఉన్నప్పుడే అది పైకి పెరుగుతుంది. అలాగే మనిషిలో జీవితం నిలకడగా ఉండాలంటే ముందుగా భయాన్ని తగ్గించే ధైర్యం, బాధ్యత, ఆత్మవిశ్వాసం కావాలి. మూలాధారం ఈ పునాది భావాన్ని సూచిస్తుంది. గణపతి ఆ పునాదికి దేవతగా ఉండటం వల్ల, జీవితంలో ఏ కొత్త అడుగు వేయక ముందు మనసును స్థిరపరచి సత్సంకల్పంతో ప్రారంభించమని ఈ సంప్రదాయం బోధిస్తుంది.

ఈ అనుబంధం వెనుక ఉన్న తర్కం చాలా సహజమైనది. ఏ ఇల్లు నిలవాలన్నా బలమైన పునాది కావాలి. అలాగే చదువు, ఉద్యోగం, కుటుంబం, సాధన — ఏ ప్రయత్నమైనా ముందుగా మనసులో స్థిరత్వం కావాలి. భయం, తొందర, అయోమయం, అలవాట్లకు బానిసత్వం ఉన్నప్పుడు చిన్న పని కూడా పెద్ద విఘ్నంగా అనిపిస్తుంది. గణపతి ‘విఘ్నేశ్వరుడు’ కావడం ఈ స్థాయిలో అర్థవంతమవుతుంది. ఆయనను స్మరించడం అంటే ముందుగా మన పునాదిని సరిచేసుకోవాలని గుర్తుచేసుకోవడం.

గజాననుని రూపం కూడా ఇదే పాఠాన్ని సులభంగా చెబుతుంది. పెద్ద తల విశాలంగా ఆలోచించమని, పెద్ద చెవులు శ్రద్ధగా వినమని, చిన్న కళ్ళు ఒకే లక్ష్యంపై దృష్టి పెట్టమని సూచిస్తాయి. బలమైన దేహం ఓర్పును సూచిస్తుంది. చిన్న మూషికవాహనం చంచలమైన కోరికలు, ఆలోచనలను సూచిస్తుంది. దానిపై గణపతి కూర్చోవడం వల్ల మనసు మనకు సేవకుడిగా ఉండాలి గానీ మనల్ని నడిపించే యజమానిగా మారకూడదని అర్థమవుతుంది.

మూలాధారంతో గణపతి సంబంధాన్ని నమ్మేవారికీ, దానిని ప్రతీకగా చూసేవారికీ ఒకే ఉపయోగకరమైన సందేశం ఉంది: గొప్ప లక్ష్యాలకు ముందు ప్రాథమిక విషయాలను దృఢం చేసుకోవాలి. సక్రమమైన నిద్ర, ఆరోగ్యం, బాధ్యత, ఆర్థిక క్రమశిక్షణ, కుటుంబంతో నమ్మకమైన బంధం, పనిలో ఏకాగ్రత — ఇవే మన జీవితపు ‘మూలాలు’. ఈ పునాది బలపడితే పైకి ఎదగడం సులభమవుతుంది.

కాబట్టి గణపతి పూజ కేవలం కోరికలు నెరవేర్చుకోవడానికి చేసే ఆచారం కాదు. అది మనలో ధైర్యం, వివేకం, వినయం, ప్రారంభించే శక్తి పెంచుకునే ఒక స్మరణ. కొత్త పని మొదలుపెట్టే ముందు “ఓం గం గణపతయే నమః” అని పలకడం, ఒక్క క్షణం ఆగి మన మనసును స్థిరపరచుకోవడం — ఈ రెండూ కలిసినప్పుడు గణపతి తత్త్వం జీవితంలో ఆచరణగా మారుతుంది. మూలం దృఢమైతే మార్గం స్పష్టమవుతుంది. అదే మూలాధార గణపతి సందేశం.

అంతా రామమయం - భద్రాచల రామదాసు కృతి

అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతరంగమున ఆత్మారాముడనంత రూపముల వింతలు సలుపగ సోమసూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీజంబులు అండాండంబులు పిండ...