29, మే 2015, శుక్రవారం

శ్రీ నీలోత్పలనాయికే


శ్రీ నీలోత్పల నాయికే జగదంబికే శ్రినగర నాయికే మామవ వర దాయికే 

 దీన జనార్తి ప్రభంజన రీతి గౌరవే 
దేశిక ప్రదర్శిత చిద్రూపిణి నత భైరవే 
ఆనందాత్మానుభవే అద్రిరాజ సముద్భవే 
సూన శరారి వైభవే జ్ఞాన సుధార్ణవే శివే 

సంకల్ప వికల్పాత్మక చిత్తవృత్తి జాలే 
 సాధు జనారాధిత సద్గురు కటాక్ష మూలే 
 సంకట హర ధురీణతర గురు గుహానుకూలే 
 సమస్త విశ్వోత్పత్తి స్థితి లయాది కాలే 
 విటంక త్యాగరాజ మోహిత విచిత్ర లీలే 
 శంకరి కృపాల వాలే హాటక మయ చేలే 
 పంకజ నయన విశాలే పద్మరాగ మణిమాలే 
 శంకర సన్నుత బాలే శారద గాన లోలే

నీలి కలువపై స్థిరమైయున్న ఓ జగదంబా! శ్రీనగర శారదా పీఠానికి నాయికా! నాకు వరములిచ్చే తల్లీ! దీన జనుల ఆర్తిని తీర్చే నీ రీతి వలన అద్భుతమైన కీర్తి కలిగిన తల్లీ! పండితులచే సర్వోన్నతమైన చైతన్యరూపముగా పొగడబడి, భైరవునిచే నుతించబడిన తల్లీ! నిరంతరం ఆనందాన్ని అనుభవిస్తూ ఉండే తల్లీ! హిమవంతుని కుమార్తెవైన నీవు మన్మథుని వైరి అయిన శివునికి వైభవాన్ని కలిగిస్తున్నావు!  జ్ఞానసాగరానివి నీవు శివానీ!
సంకల్పము, దానికి వికల్పము కూడా నీ చిత్తము ద్వారా అమలుచేస్తావు. సాధువులచే ఆరాధించబడినావు! సద్గురువుల కటాక్షానికి మూలము నీవు! మా కష్టాలను తొలగించే నిపుణురాలవు నీవు! గురుగుహునికి ఎల్లప్పుడూ అనుకూలంగా ఉన్నావు!  ఈ విశ్వము యొక్క సృష్టి, స్థితి, లయములకు కారణము నీవే! నీ ఆశ్చర్యకరమైన లీలలతో శివుని సమ్మోహనుని చేసినావు! శంకరీ! నీవు కృపకు నిలయానివి! బంగారు వస్త్రాలను ధరించిన తల్లివి! కలువల వంటి విశాలమైన కన్నులు కలిగి, కెంపులతో కూడిన హారములను ధరించినావు! శంకరునిచే నుతించబడిన బాలా త్రిపురసుందరివి! గానములో లీనమయ్యే శారదవు నీవు! 

ముత్తుస్వామి దీక్షితులవారు కర్ణాటక సంగీత త్రయంలో ఒకరు. ఈ కృతిలో ఆయన అమ్మవారిని రీతిగౌళ రాగంలో నుతించారు. అమ్మ అపారమైన కరుణకు, దయకు, మహిమలకు నిలయం. ఆ తల్లిని ఉపాసన చేసిన దీక్షితులవారు మంత్ర సమానమైన పదాలతో కొలిచారు. చిద్రూపిణి అన్న పదానికి ఎంతో నిగూఢమైన అర్థముంది. లలితా సహస్రనామావళిలో, ఇతర దేవి స్తోత్త్రములలో అమ్మ చిద్రూపిణిగా వర్ణించబడింది. పరిపూర్ణమైన చైతన్య స్వరూపిణి అమ్మ. ఆ చైతన్యమే చిత్. అలాగే, సంకల్పము, వికల్పము రెండూ కూడా తన చిత్తముతో అమలు చేసేది అమ్మ. ఇటువంటి భావనలు అనుభూతి చెందితే తప్ప కలుగవు. దీక్షితుల వారు అమ్మను కమలాంబ నవావర్ణ కృతులను ఎంతో మనోజ్ఞంగా రచించారు. అమ్మ సృష్టి స్థితి లయములకు కారణమని పలికారు. దేవీ ఉపాసనలో అమ్మను సర్వశక్త్యాత్మికగా ముగురమ్మలకు మూలంగా, త్రిమూర్తుల శక్తి సమన్వితగా వైభవంగా నుతించబడినది. అదే తరహాలో దీక్షితుల వారు ఈ కీర్తనలో అమ్మ లీలలను, రూపాన్ని ప్రస్తుతించారు. చిదంబరంలో శివకామి అమ్మవారికి బంగారు చీర అలంకరిస్తారు. అదే రీతిని దీక్షితుల వారు ఈ శాంకరిని హాటకమయ చేలే గా అభివర్ణించారు. 

డాక్టర్ బాలమురళీకృష్ణగారి గళంలో ప్రసిద్ధి పొందిన ఈ కృతిని వినండి

28, మే 2015, గురువారం

జటాయువు,సంపాతి - స్వామి కార్యం

జటాయువు,సంపాతి - స్వామి కార్యం



గృధ్రాధిప గతి దాయక రాం!!

స్వామి కార్యం అనేసరికి ప్రతి ప్రాణి తన శక్తి మేర కృషి సల్పిన గాథలను అద్భుతంగా వర్ణించిన మహా కావ్యము శ్రీమద్రామాయణము. ఉడుత వారధి కోసం, సంపాతి లంకకు మార్గం కోసం, అతని సోదరుడు జటాయువు సీతమ్మ ఆనవాల కోసం, వానరసైన్యం రావణుని వధించి ధర్మస్థాపన కోసం....ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో జీవరాశులు ప్రభువుకు తోడ్పాటుగా నిలిచారు. అందులో ఒక ఉదాత్తమైన ప్రాణి జటాయువు. దశరథుని మిత్రుడైన జటాయువు ఒక గ్రద్ద. వృద్ధాప్యంతో శరీరం సహకరించక పోయినా సీతను అపహరించుకుపోతున్న రావణుని ఎదిరించి కొనప్రాణమున్నంత వరకు పోరాడిన వీరుడు. సీతమ్మను వెదుకుతూ వచ్చిన రామలక్ష్మణులకు అమ్మ జాడ తెలిపి రామకార్య సాఫల్యానికి తోడ్పడిన గొప్ప జీవి. జటాయువు, సంపాతి ఇద్దరు అన్నదమ్ములు.

సీతా రామలక్ష్మణులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు మొట్టమొదటి సారి పంచవటి సమీపంలో జటాయువు రాముని కలుస్తాడు. తాను దశరథుని మిత్రుడని తెలిపి సృష్టిలో జంతు జాతి ఏ విధంగా ఆవిర్భవించిందో విపులంగా తెలుపుతాడు. కర్దమ ప్రజాపతినుండి గరుత్మంతుడు (శ్రీమహావిష్ణువు యొక్క వాహనము), అరుణుడు (సూర్యుని రథసారథి) గ్రద్ద సంతతిగా ఎలా జన్మించారో వివరిస్తాడు. అదే వారసత్వానికి తాను, సంపాతి చెందినట్లు తెలుపుతాడు. అరుణుని సంతతే జటాయువు, సంపాతి. దశరథుని స్నేహానికి గౌరవంగా ఈ భీకరమైన దండకారణ్యములో సీత రక్షణకు తాను రామునికి తోడుగా ఉండగలనని పలుకుతాడు.

సీతాపహరణం తరువాత రావణుని చేతిలో రెక్కలు తెగి, రక్తసిక్తమై అసువులు బాయటానికి సిద్ధంగా ఉన్న జటాయువును చూసి రాముడు జటాయువే సీతను చంపి ఉంటాడని అనుమానించి అతనిని చంపబోతాడు. అప్పుడు జటాయువు తనకు రావణునికి మధ్య జరిగిన యుద్ధాన్ని వివరించి సీత జాడ తెలుపుతాడు. రావణుని చరిత్రను, అతని శక్తి పరాక్రమాలను, ఏ విధంగా సీతను అపహరించింది వివరించి రాముని చేతిలో ప్రాణాలు వదులుతాడు. తన కోసం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన ఆ వీరుని కొరకు రాముడు దుఃఖించి, అతనికి స్వయంగా ఉత్తరక్రియలు జరుపుతాడు. ఈ విధంగా జటాయువు ఉత్తమలోకాలను పొందుతాడు.



గృధ్రాధిప సంసేవిత రాం!!!
దక్షిణభాగాన చివరకు చేరుకున్న వానరమూకకు రావణుని మరియు లంక జాడను తెలిపిన వాడు ఈ సంపాతి.

సీతమ్మకోసం వెదకి వెదకి అలసిన వానరులు ప్రాయోపవేశానికి సిద్ధులై తమ మాటల మధ్యలో జటాయువు ప్రస్తావన తీసుకువస్తారు. అప్పుడు వారి మాటలను విన్న సంపాతి వింధ్యమహాపర్వతపు గుహనుండి బయటకు వచ్చి "ఓ వానరులారా! నేను రెక్కలు విరిగిన పక్షిని, శక్తి హీనుడను. నాకు చేతనైనంత  శ్రీరాముని కార్యానికై మాట సాయం చేయగలను. ప్రాణశక్తి క్షీణించినను శ్రీరాముని కార్యమునకు తోడ్పడుటయే నా ప్రథమ కర్తవ్యము.

చక్కని రూప సంపద కలిగి, వివిధ ఆభరణములు ధరించియున్న ఒక స్త్రీని దుర్మార్గుడైన రాక్షసుడు అపహరించుకొని పోవుచుండగా నేను చూసాను. ఆ స్త్రీ రామా! రామా! లక్ష్మణా! అని విలపిస్తుండెను. ఆమె తన ఆభరణములన్నీ తీసువేయుచుండెను. పదే పదే శ్రీరాముని నామము స్మరించుచున్నందున ఆమె సీతయే అని నేను అనుకొనుచున్నాను,

ఆ రాక్షసుడు లంకాధిపతియైన రావణుడు. ఇక్కడికి వంద యోజనముల దూరములో సముద్రము నడుమ ద్వీపములో విశ్వకర్మ లంకానగరమును నిర్మించెను. ఆ నగరము చాలా రమ్యమైనది. సీతాదేవి ఆ లంకానగరమున రావణుని అంతఃపురమున బంధింపబడియున్నది.  దీనురాలైన ఆ సీతామాతను రాక్షస స్త్రీలు కాపలాకాస్తున్నారు. సముద్రము మీద నూరు యోజనముల దూరము ప్రయాణించిన పిమ్మట దాని దక్షిణ తీరమున గల లంకలో రావణుని చూడగలరు. కావున వానర వీరులారా! వెంటనే మీ పరాక్రమము చూపి సముద్రమును లంఘించుటకు త్వరపడండి. మీరు అక్కడ అవశ్యము సీతాదేవిని దర్శించి క్షేమముగా తిరిగి రాగలరు. నా దివ్యదృష్టితో చూసి పలుకుతున్న మాటలివి.

నేను, జటాయువు గరుత్మంతుని వంశము వారమే. కనుక ఇక్కడినుండే రావణుని, సీతను స్పష్టముగా చూచుచున్నాను. ఓ వానరులారా! మేము మా ఆహారబలము చేతను, సహజమైన దివ్య శక్తివలనను శతయోజనములే గాక అంతకన్నా దూరము కూడా అనుక్షణము చూడగలము. నా తమ్ముని చంపిన రావణుని పగ తీర్చుకోవాలి. మీరే ఆ కార్యానికి సమర్థులు" అని పలికి సీతమ్మ జాడ తెలుపుతాడు సంపాతి. ఈ విధంగా పక్షి సోదరులైన జటాయువు-సంపాతి రామకార్యానికి ఎంతో ఉపకరిస్తారు.

రామకార్యానికి వానరులు, పక్షి సోదరులు...ఇలా ఎన్నో రకాల జంతు సమూహం తోడ్పడి తమ జన్మకు సార్థకతను తెచ్చుకొని రాముని అనుగ్రహంతో మోక్షాన్ని పొందాయి. అంతటి మహత్తరమైనది రామకార్యము. మానవునిగా జన్మించి, తనతో పాటు జన్మించి తనతో నడచిన ప్రతి ప్రాణినీ అనుగ్రహించిన ధర్మమూర్తి రామచంద్రుడు.

శ్రీరామ జయరామ జయ జయ రామ!

27, మే 2015, బుధవారం

ఎవ్వరని నిర్ణయించిరిరా


ఎవ్వరని నిర్ణయించిరిరా నిన్నెట్లారాధించిరిరా నరవరు

శివుడనో మాధవుడనో కమలభవుడనో పరబ్రహ్మమనో

శివ మంత్రమునకు 'మ' జీవము మా
ధవ మంత్రమునకు 'రా' జీవము ఈ
వివరము తెలిసిన ఘనులకు మ్రొక్కెద
వితరణ గుణ త్యాగరాజ వినుత

"మునులు, మానవ శ్రేష్ఠులు నిన్ను ఎవరని నిర్ణయించారు? ఏ విధంగా కొలిచారు? శివుడనా? విష్ణువుగానా? బ్రహ్మగానా? లేక పరబ్రహ్మగానా?  శివమంత్రము 'నమశ్శివాయ' లో "మ"కారము, విష్ణు మంత్రమగు 'నారాయణాయ'లో 'రా" అక్షరము కలిసి రామనామమేర్పడినది. ఈ వివరాన్ని తెలిపిన గొప్పవారికి మ్రొక్కెదను ఓ ఔదార్యగుణము గల రామా!"
- సద్గురువులు త్యాగరాజస్వామి వారు

శివకేశవుల మూలమంత్రములనుండి అక్షరాలను కలిపి ఏర్పడిన మహత్తరమైన మంత్రము రామ నామము. కాబట్టీ రామ తత్త్వము హరిహరాద్వైతము ప్రతిపాధిస్తూ పరబ్రహ్మాన్ని బోధిస్తున్నదని ఈ కీర్తన సారాంశం. 

పరమాత్మ ఏ రూపంలో అవతరించినా, ఏ రూపంలో కొలువబడినా, ఆయన ఒక్కడే. ఒకే చైతన్యం విశ్వమంతా వ్యాపించియుంది. కాబట్టి ఏ రూపంలో కొలిచినా ఒక్కటే. కావలసింది మనలో నిర్మలత్వం ఆ రూపం/భావం పట్ల అచంచలమైన విశ్వాసం మరియు శరణాగతి.  ఒక రూపం గొప్ప ఇంకో రూపం తక్కువ అన్నది కేవలం మానవుల అభిప్రాయం మాత్రమే. ఎద్దును, సింహాన్ని కొలిచి దివ్యత్వాన్ని పొందిన మహనీయులకు ఈ కర్మభూమి జన్మనిచ్చింది. రామావతారాన్ని ఈ విధంగా పరబ్రహ్మతత్త్వముగా భావించి, కొలిచి, తరించిన మహనీయులు సద్గురువులు త్యాగరాజస్వామి వారు. రామాయణం చూస్తే రాముడు శివుని కొలిచినట్లుగా స్పష్టంగా తెలియజేయటమైనది. 

శివపార్వతుల సంభాషణలో పార్వతి శివునితో ఈ విధంగా అడుగుతుంది:

కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం
పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో

"ఓ ప్రభో! ఏ విధముతో  పండితులు నిత్యము విష్ణు సహస్రనామములు చదివిన ఫలము సులభముగా కలుగునో చెప్పవల్సినది. నాకు వినాలను కోరికగా ఉన్నది"

దీనికి సమాధానంగా శంకరుడు పార్వతితో:

శ్రీరామరామరామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే!

"ఓ సుందరమైన ముఖము కల పార్వతీ! శ్రీరామ రామ రామ అని మూడు మార్లు రామ నామాన్ని పఠిస్తే సహస్రనామములు పఠించినంత ఫలము. ఈ చెవులకు ఇంపుగా ఉండే రామ నామమును నేను మనసులో రమించి చిదానందంగా ఉంటాను! "

ఈ విధంగా శివుడు నిరంతరము రమించే మహాద్భుత మంత్రము రామ నామము. భవతారకమని ఎందరో మహానుభావులు మనకు ఎంతో వివరంగా సంకీర్తనలలో తెలిపారు. వారి జీవితాలే దీనికి తార్కాణాలు. శివుడు తలచే రామనామము కన్నా మించినది ఏముంటుంది? అందుకే రామనామమే పరబ్రహ్మ తత్త్వమని తెలియజేసిన వారికి నా నమస్కారాలు అని త్యాగరాజుల వారు ఈ అద్భుతమైన కృతిలో మనకు వివరిస్తున్నారు. మనకు నిరంతరం వచ్చే ప్రశ్నకు సమాధానం ఉంది ఈ కీర్తనలో. 

శ్రీకరమౌ శ్రీరామ నామం శ్రితజన మందారం
పావనమే రఘురామ నామం భవతారక మంత్రం

సుధా రఘునాథన్ గారి గళంలో ఎవరని నిర్ణయించిరిరా వినండి.

26, మే 2015, మంగళవారం

అన్నమయ్య ఒక దిశానిర్దేశకుడు ఎలా అయ్యాడు?


అన్నమయ్య ఒక దిశానిర్దేశకుడు ఎలా అయ్యాడు?



"వదలక వేదవ్యాసులు నుడివిన విదిత పావనము విష్ణుకథ
సదనంబైనది సంకీర్తనయై వెదకిన చోటనే విష్ణుకథ"

కృష్ణద్వైపాయన వ్యాస భగవానుడు మనకు అందించిన అమృతము శ్రీమద్భాగవతము. ఆ విశ్వాత్మకుని లీలలను, మహిమలను, అద్భుత గాథలను మనకు పవిత్రంగా భాగవతం ద్వారా తెలియజేశాడు వ్యాసుడు. ఒక్కొక్క అవతారాన్ని కనులకు కట్టినట్లుగా విశదీకరించి భక్తి భావాన్ని మనలో ఇనుమడింపజేసే రసామృతము ఈ భాగవతము. ధర్మ రక్షణకై ఆయా కాలములో తదనుగుణంగా అవతారాన్ని ఎత్తి కర్తవ్యపాలన చేసి ధర్మ స్థాపన చేశాడు శ్రీహరి. భక్తి జీవితానికి మూలం. భక్తి-ముక్తి పథములను సోదాహరణముగా మానవ జీవిత సారూప్యములతో వివరించారు వ్యాసుల వారు. భగవద్భక్తుల గాథలను, భగవంతుని లీలలను మనకు గంగాప్రవాహంలా అందించిన విష్ణురూపుడు వ్యాసమహర్షి. అందుకే దీనిని విదిత పావనము అన్నారు అన్నమాచార్యుల వారు. రెండే రెండు పదాలతో వ్యాస భగవానుని భాగవత వైశిష్ట్యాన్ని తెలిపిన మహనీయుడు అన్నమయ్య.


ఇక సంకీర్తనలంటే ఏమిటి? అవి విష్ణు నివాసము. వర్ణించిన నుతులే విష్ణు నివాసములు అనటానికి అవి ఎటువంటి భవరోగములనైనా జయించగలవు అన్ని నిరూపిత భావనే ఆధారం. సంకీర్తనల ద్వారా ఎంతో మందికి మానసిక సాంత్వనతో శారీరిక స్వాస్థత కలిగించిన ఉదంతాలు ఉన్నాయి. సంకీర్తనామృతముతో మరణ శయ్యపై నుండి కూడా బతికి బయటపడి మృత్యుంజయులైన వారెందరో ఉన్నారు. చెప్పరాని ఆవేదనను చిటికెలో తొలగించే సంజీవని సంకీర్తన. ఏ మందు ద్వారా నయం కాని మానసిక దౌర్బల్యాన్ని తొలగించే అమృతము సంకీర్తన. పరమపురుషుని నామమును, మహిమను ఛందోబద్ధంగా తెలుపబడిన వేద సమానమైనది సంకీర్తన.

"ఇది ఒకటి హరినామమింతైన చాలదా చెదరకీ జన్మముల చెరలు విడిపించ మదినొకటి హరినామ మంత్రమది చాలదా పదివేలు నరక కూపముల వెడలించ" - శ్రీహరి తత్త్వమును తెలిపే ప్రతి సంకీర్తన జన్మమృత్యు వలయమునుండి తప్పించే వజ్రాయుధమే. ప్రతి శ్రీహరి నామము కూడా మనకు నరక బాధలనుండి తొలగించే అద్భుత సాధనములు. ఎలా? భగవత్తత్త్వమును తెలిపే నామ మహిమను, వైశిష్ట్యాన్ని తెలుసుకోవాలంటే మనలోని దివ్యత్వమును ఆ పరమాత్మతో అనుసంధానము చేసుకోవాలి. దీనికి మనసులోని మాలిన్యాలను తొలగించుకొని పరిపూర్ణమైన ప్రేమ భావనను అలవరచుకోవాలి. దానిని జీవనశైలిలో పాటించాలి. నిత్యమూ ఆనందాన్ని అనుభూతి చెందాలి. అప్పుడే నామ మహిమ మనకు త్రికరణ శుద్ధిగా అందుతుంది. అటు పిమ్మట దుఃఖానికి స్థానమే లేదు. ఏ బాధ కూడా బాధించదు. ఏ విషయ వాంఛ కూడా మనలను చలించదు. తామరాకుపై నీటిబొట్టులా మనిషి అలా అలా హంసలా నడచి దైవత్వముతో సంపూర్ణంగా అనుసంధానమై పోతాడు. ఇక వాని ఆత్మకు జన్మమృత్యు జరావ్యాధి బాధలే ఉండవు. ఇంతటి మహత్తు కలది నామ సంకీర్తన.

బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అని పాడి కులమత భేదాలలో కొట్టుమిట్టాడుతున్న ప్రజలను మేల్కొల్పి ఏకం చేసే అద్భుతమైన ప్రయత్నం చేశారు. ఈ సందేశాన్ని జానపద ఒరవడిలో రచించి అందరికీ అందేలా చేశాడు. నిద్ర రాజుదైతే నేమి, బంటుదైతే నేమి, బ్రాహ్మణునిదైతే నేమి, చండాలునిదైతే నేమి ఒకటే కదా, ఏనుగు మీద, కుక్క మీద ప్రసరించే ఎండ ఒకటే అయినట్లు పుణ్యులను పాపులను ముక్తిమార్గము వైపు నడిపించేది శ్రీహరినామమొక్కటే అని తెలిపాడు. అలాగే మనం ఎలా భావిస్తే అలాంటివాడు పరమాత్మ అని ఎంతమాత్రమున సంకీర్తనలో తెలిపి శైవం, వైష్ణవం, శాక్తేయం అన్నిటికీ లక్ష్యం ఒక్కటే - ఆ పరమాత్మను తెలుసుకోవటం. మేము గొప్ప అంటే మేము గొప్ప అని ఆధ్యాత్మిక పురోగతిలోఆగిపోయిన వేర్వేరు మార్గాలు అనుసరించేవారికి కనువిప్పు కలిగించాడు.

శ్రీకృష్ణుడు  సాంఖ్యయోగంలో తెలిపిన సందేశాన్ని వాడల వాడల వెంట వాడెవోవాడేవో అనే సంకీర్తన ద్వారా మనకు అందజేశారు. ఆ లక్ష్మీ దేవి మాయగా తానూ సాక్షీభూతునిగా ఆ పరమాత్మ మనచేత ఎలా కర్మలను చేయిస్తాడో వివరించాడు. మధురభక్తిలో తానే నాయికయై స్వామిని అలరించాడు. తన భావనలన్నీ స్వామికి అర్పించి పునీతుడయ్యాడు.  దాహమిచ్చి దప్పితీర్చే కాలమేఘమా అని నుతించి పరమాత్మ వైభవాన్ని చాటాడు .

ఇటువంటి 32 వేల సంకీర్తనలను మనకు అందించాడంటే అన్నమయ్య ఏ దైవసంకల్పముతో ఏ దైవాంశతో జన్మించాడో ఊహించండి. ఒక్కొక్క సంకీర్తన ఒక్కొక్క సందేశ సుగుణ దీపిక. ఒక్కొక్క సంకీర్తన ఒక్కొక్క అమృత గుళిక. ప్రతి సంకీర్తన దేవ దేవుని నామ మహిమా నిధి. ప్రతి సంకీర్తన మానవునికి భవసాగర తారణ వారధి.

అందుకే అన్నమయ్య ఒక అవతారమూర్తి. ఒక సద్గురువు.  ఒక పరిపూర్ణ చైతన్యమూర్తి.


25, మే 2015, సోమవారం

అంతర్యామి అలసితి సొలసితి



అన్నమయ్య రచించిన ఒక అద్భుతమైన, భాగగర్భితమైన సంకీర్తనను ఈ వ్యాసంలో పొందుపరస్తున్నాను. చలన చిత్రం ద్వారా బాగా ప్రాచుర్యం పొందిన ఈ సంకీర్తన మానవ జన్మకు ఒక దిశానిర్దేశం చేస్తుంది. అంతర్యామి అలసితి సొలసితి అనే కీర్తన యొక్క పరిశీలన.

అంతర్యామి అలసితి సొలసితి
ఇంతట నీ శరణిదె జొచ్చితిని

కోరిన కోర్కెలు కోయని కట్లు
తీరవు నీవవి తెంచక
భారపు పగ్గాలు పాప పుణ్యములు
నేరుపుల పోనీవు నీవు వద్దనక

జనుల సంగముల జక్క రోగములు
నిను విడువవు నీవు విడిపించక
వినయపు దైన్యము విడువని కర్మము
చనదది నీవిటు శాంతపరచక

మదిలో చింతలు మైలలు మణుగులు
వదలవు నీవవి వద్దనక
యెదుటనే శ్రీ వేంకటేశ్వర నీవదె
అదన గాచితివి అట్టిట్టనక

కర్మలు, పాప పుణ్యాలు, మోక్షము వీటి గురించి ఈ సంకీర్తనలో పొందుపరచారు అన్నమాచార్యుల వారు. మానవ జన్మ ఎత్తినందుకు మనం చేయవలసినది ఏమిటి?

కోరికలు అనే అనంతమైన కోయని కట్లను మనం తెంచితే తప్ప అవి తెగవు. పాప పుణ్యాలు రెండూ భారములే. ఎందుకంటే అవి పునర్జన్మకు దారితీస్తాయి. పుణ్యం చేసుకుంటే  సుఖములతో కూడిన దేవ జన్మ కానీ,  మరింత ఉత్కృష్టమైన, సుఖ దుఃఖములతో కూడిన మానవ జన్మ కానీ, పాపము చేసుకుంటే మరిన్ని దుఃఖములతో కూడిన తిర్యక్ జన్మ గానీ తప్పవు. ఈ విధంగా ఎన్నాళ్లు జీవునకు శాశ్వతానందమైన, శాంతికారకమైన పరబ్రహ్మైక్యమునుండి దూరము? అందుకే పాపపుణ్యముల రెండింటినీ ఛేదించవలసినదే.

మన సాగంత్యాలే మన వాసనలు. మన వాసనలే మన దేహానికి రోగములు. చెడు సాంగత్యాలను వద్దనుకుంటే తప్ప మన వాసన ప్రేరిత రోగములు తొలగవు. దైన్యము, కర్మ ఫలములు మన ప్రయత్న పూర్వకముగా శాంతపరిస్తే తప్ప దూరం కావు. దీనికి సత్సాంగత్యము వజ్రాయుధం.

మనసులోని ఆలోచనలు, మాలిన్యాలు ఎంతో బరువైనవి. మనం ప్రయత్నం చేస్తే తప్ప అవి వదలవు. కలియుగంలో మన పాప సంచయాన్ని ముడుపు రూపంలో, అహంకారాన్ని శిరోముండనం రూపంలో, భావ కాలుష్యాన్ని నామ సంకీర్తన ద్వారా తొలగించుకోవటానికి పరమాత్మ వడ్డీ కాసులవాడుగా అవతరించి మన ఎదుట నిలిచాడు. తన అశేష గుణ విభవముల చాటే సంకీర్తనలను జనావళికి అందజేయమని తన నందకాన్ని అన్నమయ్య రూపంలో పంపించాడు.

వేల సంకీర్తనల ద్వారా వేవేల అవకాశాలు మానవుడికి తనను తాను ఉద్ధరించుకోవటానికి...ఒక్క దానిని గట్టిగా పట్టుకొని సద్వినియోగం చేసుకుంటే చాలు ఈ జన్మకు సార్థకత. ఇది ఒకటి హరినామమింతైన చాలదా చెదరకీ జన్మముల చెరలు విడిపించ! మదినొకటి హరినామ మంత్రమది చాలదా పదివేల నరకకూపముల వెడలించ! అన్నీ ఆయనకే వదిలేసి ఒక్కసారి హరీ అని పలికి చూడండి! మీలో మీకు వేయి ఏనుగుల బలం వస్తుంది! కానీ, అలా అనగలగాలంటే చిత్తశుద్ధి అవసరం. చిత్తశుద్ధికి కర్తవ్యపాలన, భగవంతుని పట్ల శరణాగతి తప్పనిసరి.

అన్నమయ్య కీర్తనలు ఎన్నో జీవిత లక్ష్యాన్ని, గమ్యాన్ని, పరమావధిని సుస్పష్టంగా, మన భాషలో తెలిపాయి. అందులో ఈ అంతర్యామి అలసితి ఒకటి. భావము అర్థం చేసుకొని మన అభ్యున్నతికి సద్వినియోగం చెసుకుంటే ఒక్కొక్క కీర్తన పరమ పదము వైపు ఒక సోపానము. ఈ సంకీర్తన అన్నమయ్య చలనచిత్రం నుండి.

ఓం నమో వేంకటేశాయ!


24, మే 2015, ఆదివారం

జిల్లెళ్లమూడి. మాతృశ్రీ అనసూయమాత

జయహో మాత శ్రీఅనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి!!


ఒక్కొక్క యోగికి, అవతారమూర్తికి ఒక్కొక్క ప్రత్యేకమైన లక్షణముంటుంది. నాలుగేళ్లనాడు మేము గుంటూరు జిల్లా పొన్నూరు ఆంజనేయస్వామిని, భావనారాయణస్వామిని, బాపట్ల భావనారాయణస్వామిని, స్వామి బ్రహ్మానందతీర్థుల వారి శంకర విద్యాలయమనే వేదపాఠశాలను, అక్కడి రామకృష్ణ సమాజ వ్యవస్థాపకులు స్వామి అనుభవానంద ఆశ్రమాన్ని సందర్శించి, అక్కడినుండి గుంటూరు తిరుగు ప్రయాణం మొదలు పెట్టాము. మధ్యాహ్న సమయము, ఆకలి. ఎక్కడ భోజనము చెయ్యాలా అని ఆలోచిస్తూంటే పచ్చని వరి పొలాలు వేల ఎకరాలలో, అద్భుతమైన మబ్బులు పట్టిన వాతావరణంలో జిల్లెళ్లమూడి అనే గ్రామం పేరు కనిపించింది. అప్పటికే చిన్ననాటి విషయ సాంగత్యం వలన ఆ వూరి పేరు స్మృతిలో ఉంది కాబట్టి 'జిల్లెళ్లమూడి అమ్మ' ఆశ్రమానికి వెళదాం అని నిర్ణయించుకొని ఆ దారి పట్టాము.



కారు ఆశ్రమం వైపు వెళుతూ ఉంటే మన అమ్మ భోజనానికి రండి అని ఎంత ప్రేమగా అన్నపూర్ణలా పిలుస్తుందో అలా ఆ జిల్లెళ్లమూడి అమ్మ పిలిచినట్లు అనిపించింది. ఆశ్రమంలోకి అడుగు పెట్టగానే సువాసినులతో కళకళలాడుతూ కోటి లలిత పారాయణ జరుగుతున్నది. ధర్మకర్తలు 'ముందు దర్శనం చేసుకొని భోజనం చేయండి' అని అప్యాయంగా పరి పరి విధాల చెప్పారు. అనసూయేశ్వరి మందిరాన్ని, హైమ మందిరాన్ని, అక్కడి విశాలమైన సభా ప్రాంగణాన్ని చూసి అలౌకికమైన అనుభూతిని పొందాము. తరువాత అక్కడ అన్నపూర్ణాలయంలో వారి అన్నదాన కార్యక్రమంలో భోజనం చేశాము. ఆ ఏర్పాట్లు అద్భుతం ఆ అనుభూతి చెప్పలేనిది. ప్రేమగా అమ్మ చేతితో అన్నం పెడితే ఎలా అనిపిస్తుందో అలాంటిదే చవిచూసాము. అక్కడి భోజనం తయారు చేసే వసతులు, అమ్మ భక్తుల భక్తి తత్పరత, సేవా నిరతి అమోఘం. అనుక్షణం దివ్యత్వాన్ని, అనురాగాన్ని అనుభూతి చెందాము.



తరువాత ఇంటికి వచ్చి అమ్మ గురించి కొంత పరిశోధన చేశాను. ఆధ్యాత్మికంగా అమ్మ ఎంతటి మహిమాన్విత ప్రకాశినో, ఎంతటి తేజోవిలాసినో, ఎంతటి కరుణామయో, ఎంతటి ప్రేమమూర్తో, యోగినో అర్థమయ్యింది. ఏ వసతులూ లేని రోజుల్లో లక్షలాది మందికి ఒకే మారు అన్నదానం చేసిన అన్నపూర్ణ ఈ అనసూయమాత. మహామహులైన యోగులు పూర్ణానంద స్వామి, కుర్తాళం పీఠాధిపతులు సిద్ధేశ్వరానంద భారతీ స్వాములు మొదలైన వారికి గురుతుల్యులు అమ్మ.

అమ్మ మాతృశ్రీ విద్యా పరిషత్ అనే అద్బుతమైన విద్యా సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా సంస్కృత భాషకు ఎనలేని సేవను అందిచే ఏర్పాట్లు చేశారు. విశ్వజననీ పరిషత్తు ద్వారా పేదలకు చుట్టుపక్క గ్రామ వాసులకు, వైద్య, విద్య మరియు ఇతర సామాజిక సేవలను అందిస్తున్నారు.

అమ్మ మహిమలు అనంతం. అమ్మ ప్రేమ అనిర్వచనీయం. అమ్మ కరుణ అసమానం. అమ్మ వాత్సల్యం అమృతతుల్యం. అమ్మ భక్తులకు ఆమె సర్వస్వం. ఎందరో మహానుభావులకు ఆమె ఆధ్యాత్మిక దర్శని. ఇప్పటికీ యోగులతో దివ్యదేహంతో అమ్మ మాట్లాడుతునే ఉంది.

అమ్మ ఎక్కడ ఉందో అక్కడ పాడిపంటలు సస్యశ్యామలము. ఆ ప్రాంతం శాంతికి నిలయం. అమ్మ వాక్కులు మార్గనిర్దేశకాలు. నిత్యం అశాంతి, స్పర్థలలో మునిగి తేలేవారికి ఈ అనసూయామాత మందిరం మరియు ఆ ఆశ్రమ పరిసరాలు సాంత్వననిచ్చే దివ్యౌషధము. అమ్మ 20వ శతాబ్దంలో ఆంధ్రప్రదేశ్ లో అవతరించిన అమ్మలగన్న అమ్మ. ఆ రాజరాజేశ్వరి రూపమే అమ్మ. ఆమె కరుణారసమే అమ్మ చూపులు.



నిత్యానందకరీ వరాభయకరీ అని మనం కొలిచే అన్నపూర్ణ స్వరూపిణి అయిన ఆ ఆదిపరాశక్తే ఈ అనసూయమాతగా జిల్లెళ్లమూడిలో వెలసింది. మహావైభవంగా సాగిన ఆమె భౌతిక అవతారం 1985 సంవత్సరంలో ముగిసినా, ఇప్పటికీ అమ్మ భక్తుల ద్వారా అమ్మ ఆధ్యాత్మిక సౌరభాలను, అదే ప్రేమ, వాత్సల్యం, కరుణలను అందిస్తూనే ఉంది. అమ్మ గురించి తెలుసుకోదలచిన వారు విశ్వజనని ట్రస్టు ముద్రించిన 'అమ్మ జీవిత మహోదధి' అనే గ్రంథాన్ని చదువవచ్చు. అంతర్జాలంలో కూడా చాలా వివరంగా అమ్మ గురించిన విషయాలను భక్తులు పొందుపరచారు.

ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న ప్రతి సాధకుడు తప్పక చూడవలసిన క్షేత్రం జిల్లెళ్లమూడి. రైలులో వెళితే బాపట్ల స్టేషనులో దిగి వెళ్లవచ్చు. బాపట్ల నుండి జిల్లెళ్లమూడి 15 కిలోమీట్లర్ల దూరం. గుంటూరు నుండి 52 కి.మీ, విజయవాడ నుండి 87 కి.మీ.  మాతృశ్రీ అనసూయమాత అనుగ్రహ ప్రాప్తిరస్తు!!

http://www.jillellamudiamma.org/svjp/
http://www.jillellamudiamma.org/svjp/images/mdc_book_annapurnalayam.pdf
www.viswajanani.org
www.motherofall.org


జయహో మాత శ్రీఅనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి!

23, మే 2015, శనివారం

రామ-వాలి సంవాదం.

రామ-వాలి సంవాదం




తదేతత్ కారణమ్ పశ్య యదర్థం త్వం మయా హతః
భ్రాతుర్ వర్తసి భార్యాయామ్ న్యక్త్వా ధర్మమ్ సనాతనమ్

అస్య త్వం ధరమాణస్య సుగ్రీవస్య మహాత్మనః
రుమాయామ్ వర్తసే కామాత్ స్నుషాయాం పాప కర్మకృత్

న హి ధర్మ విరుద్ధస్య లోక వృత్తాత్ అపేయుషః
దండాత్ అన్యత్ర పశ్యామి నిగ్రహమ్ హరి యూథప

ఔరసీం భగినీం వాపి భార్యాం వాప్యనుజస్య యః
ప్రచరేర నరః కామాత్ తస్య ధండో వధః స్మృతః

యాంతి రాజర్షయశ్చాత్ర మృగయాం ధర్మకోవిదాః
తస్మాత్ త్వం నిహతో యుద్ధే మయా బాణేన వానరా
ఆయుధ్యన్ ప్రతియుధ్యన్ వా యస్మాచ్ఛాఖామృగో హ్యసి


"నిన్ను నేను హతము చేయుటకు కారణము గ్రహించు - నీవు సోదరుని పత్నితో అధర్మంగా వ్యవహరించావు.

సుగ్రీవుడు బ్రతికి యుండగా, నీ నీచమైన ఆలోచనలతో, కామంతో నువ్వు నీకు కోడలి సమానమైన సుగ్రీవ పత్నియైన రుమ పట్ల అనుచితంగా వ్యవహరించావు.

సమాజ విరుద్ధంగా, ఆచారాలను కాలరాసి ప్రవర్తించే వ్యక్తులపట్ల నేను ఎటువంటి నిగ్రహమూ చూపను. వారికి శిక్ష తప్పదు.

కూతురు, సోదరి, సోదరుని భార్య - వీరియెడ కామాతురుడై ప్రవర్తించిన వానిని వధించుటయే తగిన శిక్ష అని ధర్మ శాస్త్రము పేర్కొనుచున్నది.

వానరా! బాగుగా ధర్మము తెలిసిన మహరాజులు కూడా వేటాడుచుందురు. కనుక నిన్ను యుద్ధమున బాణము వేసి వధించితిని. నీవు నాకు ఎదురుగా నిలిచి యుద్ధము చేసినను, చేయకున్నను చాటున వధించుటలో తప్పు లేదు. ఏలననగా నీవు శాఖామృగానివి (కొమ్మలపై, చాటున ఉండే జంతువు). "

- వాల్మీకి విరచిత శ్రీమద్రామాయణాంతర్గత కిష్కింధ కాండలో రామ-వాలి సంవాదం.

వాలి అతి బలసంపన్నుడు. రావణబ్రహ్మనే ఓడించిన మహాబలశాలి. అన్నివిద్యలు నేర్చిన పండితుడు. వానరమూకకు రాజు. కానీ, కామాంధుడై సోదరుని పత్ని పట్ల అనుచితంగా వ్యవహరించటం, దానిని సరిదిద్దుకొనక తామసంతో వ్యవహరించటం వలన ధర్మమూర్తియైన రామచంద్రుని చేత చెట్టుచాటు నుండి చంపబడ్డాడు. ఇక్కడ రాముడు ఒక ముఖ్యమైన విషయాన్ని వాలికి చెబుతాడు.

మానవునికి ముగ్గురు పితృసమానులు - తండ్రి, అన్న మరియు గురువు. ఈ విధంగా పుత్రసమానుడైన సుగ్రీవునికి అన్యాయం చేసిన వాలి శిక్షార్హుడు అన్న విషయాన్ని కుండలు బద్దలు కొట్టి చెప్పాడు రాముడు. అధర్మాన్ని సహించేది లేదని తేల్చి చెప్పాడు. అన్నీ చెప్పి, నీవంటే నాకు ద్వేషము లేదు అని మరల హితవాక్యములు పలుకుతాడు. అతను చేసిన పాపములు ఈ విధముగా శిక్షను అనుభవించుట ద్వారా పాపరహితుడైనాడని తెలుపుతాడు, తార, అంగదుల గురించి దిగులు పడిన వాలికి వారి భవిష్యత్తును గురించి సాంత్వన కలిగిస్తాడు, వాలి తన అజ్ఞానాన్ని తెలుసుకొని పశ్చాత్తాప పడి రాముని మన్నింపమని వేడుకుంటాడు. రాముడు అతనిని అనుగ్రహించి, అతనికి ఉత్తమ గతులు కలిగేలా చేస్తాడు.

రామో విగ్రహవాన్ ధర్మః. అధర్మాన్ని ఎట్టి పరిస్థితులలోనూ ఆచరించడు. వాలిని అన్యాయంగా చెట్టు చాటునుండి రాముడు చంపాడు అనే అజ్ఞానులకు ఈ పై శ్లోకాలను, అర్థాన్ని వివరించండి. రామాయణాన్ని చదువకుండా అందులోని ధర్మమూర్తులను నిందించి, మన సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించే వారి అహంకారపు మాటలను ఎదుర్కోండి.

సోదరుల పట్ల, వారి కుటుంబ సభ్యుల పట్ల అనుచితంగా వ్యవహరించే దుష్టులందరికీ ఇదే గతి తప్పదు.

22, మే 2015, శుక్రవారం

రామ నీల మేఘ శ్యామ కోదండరామ


రామ నీల మేఘ శ్యామ కోదండరామ


జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం
జనన మరణ భేద క్లేశ విచ్ఛేద మంత్రం
సకల నిగమ మంత్రం సర్వ శాస్త్రైక మంత్రం
రఘుపతి నిజమంత్రం రామ రామేతి మంత్రం
-  శ్రీరామకర్ణామృతం

రామ నీల మేఘ శ్యామ కోదండరామ
రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘ శ్యామ
రఘురాం రాం రాం రఘురాం జయరాం రాం రాం జయరాం

తల్లితండ్రి గురువు నీవే తోడు నీడ నీవే
ధరణినెల్ల పాలన చేసే పరంజ్యోతివే
జాగు ఇక చాలును రామయ్య దాసులను బ్రోవగ రావయ్య
తెలియ తరమా పలుక వశమా నీదు మహిమ రాఘవా

రామ నీల మేఘ శ్యామ కోదండరామ
రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘ శ్యామ
రఘురాం రాం రాం రఘురాం జయరాం రాం రాం జయరాం

రాతినైన నాతిని జేసే నీ దివ్య పాదము
కోతినైన జ్ఞానిని చేసే నీ నామము
నీదు సరి దైవము లేరయ్యా నిన్ను నే నమ్మితి రామయ్యా
నీదు చరణం పాప హరణం మాకు శరణం రాఘవా

రామ నీల మేఘ శ్యామ కోదండరామ
రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘ శ్యామ
రఘురాం రాం రాం రఘురాం జయరాం రాం రాం జయరాం

- శ్రీ గబ్బి వేంకటరావు గారు (రామాంజనేయ యుద్ధం చలన చిత్రానికి రాసిన పాట)


రాముని నుతి హనుమ నోట వస్తే అది భక్తి పూరితమై, శరణాగతిని పరిపూర్ణంగా కలిగిన అర్చనగా నిలుస్తుంది. రామభక్తికి సామ్రాజ్యానికి దొర హనుమంతుడు అని పాలగుమ్మి విశ్వనాథం గారు హనుమంతుని వైశిష్ట్యాన్ని మనకు నాలుగు పదాలలో చెప్పారు. ఆ హనుమంతుని నోట రామస్తుతి ఈ రామాంజనేయ చిత్రంలోని పాట. గబ్బిట వేంకటరావు గారు రచించిన ఈ గీతాన్ని కొత్త రఘురామయ్య గారు ఎంతో భక్తితో పాడారు.

పాట ముందు రామ మంత్ర మహిమను శ్లోకం ద్వారా మనకు తెలియ జేశారు. ఈ శ్లోకం  శ్రీరామకర్ణామృతం  లోనిది.

అర్థం:

జన్మకు సాఫల్యాన్ని ఇచ్చే మంత్రము, జనన మరణాల వలన కలిగే దుఃఖము, కష్టములను నాశనం చేసే మంత్రం, సమస్త వేద వాజ్ఞమయము మరియు శాస్త్రముల సారమైన ఏకైక మంత్రం రఘుపతి నిజమంత్రమైన రామ రామ అనే మంత్రం.దానికి జయము జయము.

గీతం యొక్క భావం:

రామా! నల్లని మేఘములు వంటి శరీర ఛాయ కలిగి, కోదండమును ధరించిన రామా ! రఘుకులమనే సాగరానికి చంద్రుని వంటి రామా ! పరమాత్మా! సార్వభౌమా!

రఘురామా! రామా! రామా! రఘురామా! జయరామా! రామా! రామా! జయరామా!

తల్లి, తండ్రి, గురువు నీవే! తోడు నీడ నీవే! ఈ భూమినంతిటినీ పాలించే సర్వేశ్వరుడివే! ఇంక ఆలస్యము చాలు రామయ్య! దాసులను బ్రోవటానికి రావయ్యా! నీ మహిమ పరిపూర్ణంగా తెలియుట ఎవరికి తరము? పలుకుటకు ఎవరికి వశము? ఓ రాఘవా!

చలనరహితమై రాయిగా మారిన అహల్యను చైతన్యపూరితం చేసింది నీ పవిత్రమైన పాదము. చంచలత్వం కలిగిన కోతిని కూడా జ్ఞాని చేసింది నీ తీయని నామము. నీకు సాటి దైవము లేరయ్యా! నిన్ను నేను నమ్మినాను రామయ్యా! నీ పాదాలే మా పాపములను హరిస్తాయి, అవే మాకు శరణం రాఘవా!

ఈ మంత్ర సారం, మహిమ హనుమంతుని కన్నా ఎవరికి తెలుస్తుంది? మహా జ్ఞాని, అతి బలవంతుడు, మాటల నేర్పరి, మహా భక్తుడు, వినయ సంపన్నుడు, సమయస్ఫూర్తి కలవాడు, రాజుకు నమ్మిన బంటు, ప్రభువుకు ఉత్తమ సేవకుడు...ఇలా ఎన్నో సుగుణాలు హనుమకు రామ నామము వలన కలిగాయి. హనుమంతుని నుండి నేటి సద్గురువుల వరకు తారక రామ మంత్రముతో తరించిన వారే.

యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకానజలిం
బాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం

ఎక్కడెక్కడైతే రాముని నామ సంకీర్తనం జరుగుతుందో అక్కడ శిరసువంచి అంజలి ఘటించి, ఆనంద బాష్పాలు నిండిన కనులతో నిలిచి ఉండే రాక్షాసంతకుడైన మారుతిని ధ్యానిస్తున్నాను.

ఈ శ్లోకం హనుమ ప్రగాఢమైన రామభక్తిని చక్కగా సూచిస్తుంది. రాముని నామం పలుకబడే ప్రతిచోటా హనుమ ఉంటాడట. ఆ నామస్మరణలో తనను తాను మరిచే నిజభక్తుడు హనుమ. అటువంటి హనుమ రాముని గురించి పాడితే ఎలా ఉండాలో అలాంటి గీతమే అందించారు గబ్బిత వేంకటరావు గారు.

కవి హనుమ హృదయంలోని భావనను ఎంత హృద్యంగా, వీనులకు విందుగా సర్వస్యశరణాగతితో వ్యక్తపరచారు. పరమాత్మ పాదాలు శరణు అని పరిపూర్ణంగా  భావించేవాడు  నిత్యం వచ్చే సమస్యలతో పాటు జనన మరణాలకు సంబంధించ బాధలను కూడా అవలీలగా దాటగలడు అన్నది సారాంశం. తల్లి తండ్రి గురువు నీవే అని భావించాలంటే పరమాత్మను అన్నిటా దర్శించగలిగే స్థాయికి ఎదగాలి. దానికి కఠోరమైన సాధనతో పాటు జన్మనిచ్చిన తల్లిదండ్రుల విలువ, గురువల ప్రాధాన్యత తెలిసి ఉండాలి. దీనికి తదనుగుణమైన పెంపకం ఎంతో అవసరం. పరమాత్మ సర్వేశ్వరుడని భావించటానికి అన్నిటి పట్ల సమభావం కలగాలి. అజ్ఞానాన్ని తొలగించే గురువులు కావాలి. అన్నిటికీ నీవే దిక్కు అన్న భావనతో కొలిచే భక్తునికి ఆయన మహిమలు అనంతముగా, నిరంతరముగా ప్రవహిస్తాయి. అదే ఇక్కడ హనుమకు కలిగిన భావన.

భర్త శాపవశాత్తు శిలయైన అహల్య నిర్దోషి. కానీ, ఇంద్రుడు గౌతముని తపమునకు భంగము కలిగించే సంకల్పంలో అహల్య ఒక పాత్రధారియై వేల ఏళ్ల పాటు శిలగా నిలుస్తుంది. అటువంటి అహల్యను తిరిగి చైతన్యవంతమైన ఋషిపత్నిగా చేసింది రామ పాదం. అలాగే వానర సమూహంలో తన శక్తిని తెలియక ఉన్న హనుమను, ఇతర వానరములను జ్ఞానులుగా చేసింది రామ నామం. అజ్ఞాన తిమిరాంధకారములనుండి జ్ఞానసుధారసం వైపు తీసుకు వెళ్లింది ఈ రామ నామం. ఈ భావనను ఎంతో చక్కగా ప్రస్తావించారు కవి. హనుమ హృదయాన్ని మన ముందు ఆవిష్కరించారు. అందుకే ఈ గీతం అజరామరమైంది. బీ. గోపాలం గారు అదే రీతిలో సంగీతం అందించగా కొత్త రఘురామయ్య గారు శ్రావ్యంగా పాడారు. రంగస్థల కళాకారులైన వీరు తమ గొంతులోని మాధుర్యాన్ని భక్తి భావంలో మేళవించి గీతానికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు.

ఇక్కడ ఆర్జా జనార్దనరావు గారి గురించి చెప్పుకోవాలి. తెలుగు చలన చిత్రాలలో హనుమ అంటే ఆయనే అనేలా ఎన్నో చిత్రాలలో ఆంజనేయుడిగా నటించారు. దేహ సౌష్ఠవం కలిగిన ఆయన లవ కుశ, శ్రీకృష్ణావతారం, రామాంజనేయ యుద్ధం, వీరాంజనేయ, ఆంజనేయ చరిత్ర, సంపూర్ణ రామాయణం, త్యాగయ్య వంటి ఎన్నో చిత్రాలలో హనుమంతునిగా నటించాడు. ఆయన కనులలో భక్తి, వానర లక్షణాలు, నటనలో బుద్ధిర్బల యశోధైర్యాలు అద్భుతంగా పండించేవారు. ఆయనను చూస్తే హనుమ రూపం కళ్లకు కనబడినట్లే. ఈ గీతంలో ఆర్జా జనార్దన రావు గారు భక్తిపూరితమైన నటన అనుపమానం. అందుకే ఈ గీతం పరిపూర్ణతను పొందింది.

కొత్త రఘురామయ్య గారి గళంలో ఈ పాట వినండి.



21, మే 2015, గురువారం

హనుమత్ సేవిత నిజ పద రాం!

హనుమత్ సేవిత నిజ పద రాం!



పరిపూర్ణమైన స్వామి భక్తి, శరణాగతి మరియు ప్రభువు పట్ల ప్రగాఢ విశ్వాసమున్న హనుమంతుని వంటి భక్తుడు కలిగిన రాముడు, సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపమైన రాముని వంటి దైవము యొక్క అనుగ్రహము కలిగిన హనుమంతుడు...ఈ ఇరువురి సంబంధం అనిర్వచనీయం, అపూర్వం. రోమ రోమమున రామ నామము ఆ భక్తుని లక్షణమైతే ఈ బంటు భక్తులను వెన్నంటి కాచే ప్రభుత ఆ స్వామిది....సుందరమైన ఈ బాంధవ్యం భక్తి-కరుణలకు ప్రామాణికం, తలమానికం. దాసోహం కోసలేంద్రస్య అని ఆ భక్తుడు తలచితే హనుమంతుని వంటి భక్తుడు మరొకడు లేడు అని ఆ ప్రభువు పొగడాడు. లక్ష్మణుడి ప్రాణాల కోసం సంజీవనిని తెచ్చినా, సీతమ్మ కోసం భీకరమైన లంకను దహనం చేసినా, రామ కార్యం కోసం శతయోజనాలు దాటినా, అన్నీ ప్రభు భక్తి కోసమే. రామ కార్యమే జీవనోపాధి, పరమావధి. అమ్మ సీతమ్మకు హనుమను చూస్తే అవ్యాజమైన మాతృప్రేమ. రామునికి కూడా హనుమ అంటే అమితమైన కరుణ వాత్సల్యము. అందుకే ఏకంగా ఆ భక్తుని హృదయంలో నివసించాడు.

సీతాన్వేషణ మొదలు రామపట్టాభిషేకము వరకూ హనుమంతుడు చేసిన ప్రతికార్యమూ రామనామ స్మరణతోనే. లంకలో వెదకి వెదకి అమ్మ జాడ దొరకక నిస్పృహకు గురై హనుమ విపరీతమైన ఆలోచనలోకి వెళుతుంటే రామనామ స్మరణతో  ఎక్కడ లేని మనో ధైర్యము, కార్యసిద్ధిపై ఉత్సుకత, విశ్వాసం కలిగాయి. హనుమంతునికి శుభశకునాలు కనిపించాయి. సంకల్పం గట్టిదై నోటినుండి అద్భుతమైన మంత్రాలు వెలువడ్డాయి.

నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యేచ తస్యై జనకాత్మజాయై
నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః

"రామునికి, లక్ష్మణునికి, సీతమ్మకు, శివునికి, ఇంద్రునకు, యమునికి, వాయుదేవునకు, సూర్యచంద్రులకు, మరుత్ గణాలకు నమస్కారము". అంతే! ఆయనకు ఆశోకవనము, సీతమ్మ జాడ తెలుస్తాయి. ఇక హనుమంతునికి ఎదురులేదు. అమ్మను కలిసి రాముని గుణగణములను, తాను వచ్చిన కార్యమును వివరించి, అమ్మకు సాంత్వన కలిగిస్తాడు. ఉత్సాహంతో ప్రమదావనాన్ని నాశనం చేసి రావణునికి హెచ్చరిక చేస్తాడు.


జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః

దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్ట కర్మణః
హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః

న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః

అర్థయిత్వాం పురీం లంకాం అభివాద్య చ మైథిలీం
సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వ రక్షసాం


"అతిబలుడైన రామునికి, మహాబలుడైన లక్ష్మణునికి, రామునిచే కాపాడబడిన సుగ్రీవునికి జయము జయము. వేయిమంది రావణులు వచ్చినా వారిని శిలలతోను, వృక్షములతోను ఎదుర్కొంటాను. రాక్షసులందరూ నిస్సహాయులై చూస్తుండగా, లంకను జయించి, సీతమ్మకు అభివాదం చేసిన తరువాతే ఇక్కడినుండి వెళతాను."

ఇదీ హనుమంతునికి రామునిపై గల విశ్వాసము, భక్తి, నమ్మకము. దాని ఫలితమే అతని కార్యసిద్ధి. యుధ్దంలోనూ, సంజీవని తీసుకురావటం లోనూ, రామనామమే అతనికి తారకము. రాముని పాదముల వద్ద నిలిచి, సేవించి, మనసులో ధ్యానించి, లోకవంద్యుడైనాడు హనుమ. రామభక్తి అతనిని భవిష్యత్ బ్రహ్మను చేసింది.
సీతమ్మ జాడను తీసుకొని రాముని వద్దకు వెళ్లి అమ్మ క్షేమంగా ఉన్నది అన్న వార్త తెలుపగానే రాముడు "హనుమంతుడు సీతాన్వేషణలో సాధించిన కార్యములు లోకములోనే అత్యద్భుతమైనవి, ఊహకు అందనివి, అనితర సాధ్యమైనవి. గరుత్మంతుడు, వాయుదేవుడు, హనుమంతుడు తప్ప వేరేవ్వరూ ఈ సాగరాన్ని దాటలేరు. హనుమంతునితో సమానమైన తేజోబలసంపన్నుడు లేడు. మహావీరుడైన సుగ్రీవునికి నిజమైన సేవకునిగా ఆ ప్రభుకార్యము సఫలమొనర్చెను. ఈ సంతోష సమయమున ఈ మహాత్మునికి గాఢాలింగన సౌఖ్యమును మాత్రమే ఇవ్వగలను. ఇది అతనికి పరమసుఖానుభవమును కలిగిస్తుంది. ప్రస్తుతము నేను ఈయగల సర్వస్వము ఇదే." అని తన ఆనందాన్ని తెలిపి హనుమకు అనుపమానమైన ఆలింగనమనే బహుమతిని ఇస్తాడు.

రామపట్టాభిషేక సమయంలో సీత హనుమంతునికి దివ్యమైన వస్త్రములను, ఆభరణములను కానుకగా ఇస్తుంది. తన మెడలోని కంఠాభరణము తీసి అక్కడ ఉన్న వానర సమూహాన్ని పదే పదే చూస్తుండగా రాముడు ఆమె అంతరంగాన్ని గ్రహించి "ఓ సీతా! అసమానమైన పౌరుషము, పరాక్రమము, ప్రతిభ మొదలగు లక్షణములు కలిగి నీ ఆదరమునకు పాత్రుడైన ఉత్తమునకు ఈ హారమును బహుకరింపుము" అని పలుకుతాడు. అప్పుడు సీత ఆ హారమును హనుమంతునికి కానుకగా ఇస్తుంది.

యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం
బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం

ఎక్కడ రాముని నామ కీర్తనం జరుగుతుందో అక్కడ మారుతి తలవంచి ఆనందబాష్పములతో నిండిన కన్నులతో రాక్షసనాశకుడైన రామునికి నమస్కరించి నిలుస్తాడు. రాత్రి పగలు రామధ్యానమే ఆయనకు. శ్రీరాముడు కూడా హనుమద్భక్తులపై అత్యంత కరుణతో దృష్టి కలిగి వారిని అనుగ్రహిస్తాడు. రామభక్తులకు హనుమ బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, నిర్భయత్వము, రోగనివారణ, ఉత్సాహం, వాక్పటిమ కలిగించి వారికి తోడుగా నిలుస్తాడు. హనుమను కొలిస్తే రాముడు సంతుష్టుడు, రామభక్తులకు హనుమ అసమానమైన అండ.

రామ-హనుమల మధ్య అనిర్వచనీయమైన బంధం ఇప్పటికీ ఎప్పటికీ ఆదర్శప్రాయం.

సియావర్ రామచంద్ర కీ జై !!!
పవన సుత హనుమాన్ కీ జై!!!

20, మే 2015, బుధవారం

శ్రీరమణ భవహరణ రామ తారకనామ శ్రీరామ - దేవులపల్లి వారి రామభక్తి

శ్రీరమణ భవహరణ రామ తారకనామ శ్రీరామ - దేవులపల్లి వారి రామభక్తి


రామచరణమె త్రోవయని నామభజనమె నావయని
స్వామిని మౌని మనోహరుని కనులారగని మది పదిలపరచుకొని
అనరాదా శ్రీరామయని మనరాదా హరిగాథ విని
శ్రీరమణ భవహరణ రామ తారకనామ శ్రీరామ!

తాళలేని హృదయాలదహించే తాపకీల చల్లారాలంటే
నీలమేఘ మోహనుడే కరిగి జాలివాన కురిపించాలంటే
అనరాదా శ్రీరామయని మనరాదా హరిగాథ విని
శ్రీరమణ భవహరణ రామ తారకనామ శ్రీరామ!

రానై యున్నాడు శ్రీహరి రానై యున్నాడు
తానే వైకుంఠం భూమికి తేనై యున్నాడు
పిలిచే దరి హరి పదముల మదిలో మానక నిలిపి ధ్యానము సలిపి
అనరాదా శ్రీరామయని మనరాదా హరిగాథ విని
శ్రీరమణ భవహరణ రామ తారకనామ శ్రీరామ

రామయని గుణధామయని రాముని తీయని గాథ విని
అనరాదా శ్రీరామయని మనరాదా హరిగాథ విని
శ్రీరమణ భవహరణ రామ తారకనామ శ్రీరామ

బ్రతుకుల వేసారి శ్రీహరి పదముల కడ చేరి
పరమ దయానిధి శౌరి భవ హారి యని ఒకసారి
అనరాదా శ్రీరామయని మనరాదా హరిగాథ విని
శ్రీరమణ భవహరణ రామ తారకనామ శ్రీరామ

- దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు 'భక్త శబరి' చలన చిత్రానికి, పెండ్యాల వారి సంగీతం.

రాముని చరణాలే దారి, ఆ రాముని నామాన్ని భజించటమే మనకు నావ. ఆ స్వామిని, మునుల మనసు గెలిచిన వానిని, కనులారా చూచి, మనసులో పదిలపరచుకొని, అనరాదా శ్రీరామయని! జీవించరాదా ఈ శ్రీహరి కథ విని!

లక్ష్మీదేవి రమణుడా! పాపములను హరించే రామా! తారక నామా! శ్రీరామా!

కోరికల వలన కలిగే తాపమనే అగ్నిని తాళలేక బాధ పడుతున్న హృదయాల బాధలు చల్లారాలంటే, నీలి మేఘాలవంటి శరీరఛాయ కలిగిన మోహనాకారుడు రాముడే కరిగి మనపై కరుణావృష్టిని కురిపించాలంటే, అనరాదా శ్రీరామయని! జీవించరాదా ఈ శ్రీహరి కథ విని!

లక్ష్మీదేవి రమణుడా! పాపములను హరించే రామా! తారక నామా! శ్రీరామా!

శ్రీహరి రాబోతున్నాడు! తానే వైకుంఠాన్ని భూమికి తేనున్నాడు! మనలను పిలుస్తున్న హరి పాదములను మనసులో ఎల్లప్పుడూ నిలిపి ధ్యానము చేసి, అనరాదా శ్రీరామయని! జీవించరాదా ఈ శ్రీహరి కథ విని!

లక్ష్మీదేవి రమణుడా! పాపములను హరించే రామా! తారక నామా! శ్రీరామా!

రామా అని, గుణములకు నివాసమా అని, రాముని తీయనైన కథను విని, అనరాదా శ్రీరామయని! జీవించరాదా ఈ శ్రీహరి కథ విని!

లక్ష్మీదేవి రమణుడా! పాపములను హరించే రామా! తారక నామా! శ్రీరామా!

జీవితంలో విసిగి పోయి, శ్రీహరి పాదముల వద్దకు చేరి, పరమ దయకు నిధి, మహావీరుడు, పాపములను హరించే వాడు అని, ఒకసారి అనరాదా శ్రీరామయని! జీవించరాదా ఈ శ్రీహరి కథ విని!

లక్ష్మీదేవి రమణుడా! పాపములను హరించే రామా! తారక నామా! శ్రీరామా!

ఎంత అద్భుతమైన సాహిత్యం! చరణాలు త్రోవగా, నామమె నావగా అభివర్ణించారు ఈ కవిశ్రేష్ఠులు. తెలుగుదనం, భక్తి, యతి ప్రాసలు సంపూర్ణంగా ఉట్టిపడే ఇటువంటి సాహిత్యం ఒకప్పుడు సినీజగత్తులో ప్రకాశించేది. ఈ పాట దేవులపల్లి వారి రామభక్తికి మరో ఉదాహరణ. రాముని భక్తిసాగరంలో మునిగితే కానీ ఇటువంటి సాహిత్యం కలంలో పండదు. రామభక్తి సామ్రాజ్యంలో ఒకరైతే ఇటువంటి గీతాలు మనసులో జనిస్తాయి. కవి హృదయంలో కలిగే భావనలకు ఆ దైవానుగ్రహం తోడైతే, భక్తి సోపానంలో ఆ ఆత్మ పరమాత్మతో అనుసంధానమైతే ఇటువంటి మధుర రస భావ సుమాలు వికసిస్తాయి. రాముని నామ మహిమ ఒకసారి రుచి చూస్తే ఇక వేరే ఏదీ రుచించదు.

రాముని అడుగులే మనకు త్రోవ అని కవి విశ్వాసం. ఎందుకు? రామో విగ్రహవాన్ ధర్మః. ఆయన పలికిన ప్రతి మాట, వేసిన ప్రతి అడుగు ధర్మం కోసం. ఆయన చేసిన ప్రతి పని ధర్మాన్ని కాపాడటం కోసం. అన్నీ త్యాగం చేసి ధర్మాన్ని నిలబెట్టాడు ఆ మానవావతారుడు. సమస్త గుణములలో ఉత్తముడు రాముడు. సామాన్య మానవుడు దైవంగా ఎలా మారగలడో అన్నదానికి రామావతారం మనకు అత్యుత్తమమైన ఉదాహరణ. అందుకే ఆయన నడిచే అడుగులు మనకు దారి. ఆయన నామ స్మరణ మనకు పాపహారి, తాపహారి, భవతారకము. బంధనాలతో కూడిన మానవజన్మలోని ప్రతి రోజూ ఎన్నో సమస్యలు, ఎన్నో సంక్లిష్ట పరిస్థితులు. మన బుద్ధి ప్రతి సారీ సరైన నిర్ణయం తీసుకునే పరిస్థితిలో ఉండదు. అందుకే పెద్దలు రామాయణ, భారత భాగవతాలను మనకు సరైన మార్గదర్శకాలుగా నిర్ధారించారు.

కవిగా ఉదయించి, మునిగా తపము చేసి, యోగిగా పరమపదించారు కృష్ణశాస్త్రిగారు. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు!

పీబీ శ్రీనివాస్ గారు ఎంత మధురంగా పాడారో! రాముని ఎదుట నిలిపినట్లుగా ఉంటుంది ఆయన గళంలో ఈ పాట. 

19, మే 2015, మంగళవారం

శ్రీరామకర్ణామృతం - ప్రథమాశ్వాసము

శ్రీరామకర్ణామృతం - ప్రథమాశ్వాసము 


పేరులోనే ఉంది అర్థమంతా. చెవులకు అమృతంగా అనిపించే రామస్తుతి ఇది. లీలాశుకుడు శ్రీకృష్ణకర్ణామృతం రచిస్తే ఈ రామకర్ణామృతం ఎవరు రచించారో తెలియటం లేదు. సిద్ధకవి ఈ సంస్కృత శ్లోకాలను తెలుగులోకి అనువదించారు. ఛందోబద్ధంగా సాగే ఈ ధార రాముని రూప గుణ మహిమల వర్ణనను మనకు ఎంతో మనోజ్ఞంగా అందిస్తుంది. రాముడంటేనే పరిపూర్ణ సులక్షణ సంపన్నుడు. ఆ ధర్మమూర్తి వైభవాన్ని ఎంత పొగిడినా, ఎందరు నుతించినా తనివితీరదు. 

రామకర్ణామృతంలోని కొన్ని ముఖ్యమైన శ్లోకాలు, తాత్పర్యము: 

వామాంక స్థిత జానకీ పరిలసత్కోదండ దండం కరే
చక్రం చోర్ధ్వకరేణ బాహు యుగళే శంఖం శరం దక్షిణే
బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధ్నిం స్థితం
కేయూరాది విభూషితం రఘుపతిం రామం భజే శ్యామలం 

ఎడమతొడపై కూర్చున్న సీత సేవించుచుండగా, శోభించుచున్న ధనువునొక చేతిలో, పైచేతిలో చక్రము, కుడిచేతులలో శంఖము మరియు బాణములను ధరించియున్న, కలువరేకులవంటి కన్నులు కలిగిన, భద్రాచల శిఖరమందు వెలసిన, భుజకీర్తులు మొదలైన ఆభరణములతో అలంకరించబడిన, నల్లనైన రఘురాముని భజిస్తున్నాను.

వామే భూమిసుతా పురస్తు హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః
శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోర్వాయ్వాది కోణేష్వపి
సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్
మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం

ఎడమవైపున సీత, ఎదుట హనుమంతుడు, వెనుక లక్ష్మణుడు, పక్కన భరతశత్రుఘ్నులు, వాయువ్యము మొదలైన దిక్కులందు సుగ్రీవుడు, విభీషణుడు, అంగదుడు, జాంబవంతుడు యుండగా మధ్యనందు నల్లని కలువవలె సుందరమైన కాంతి కలిగిన రాముని భజించుచున్నాను. 

వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే
మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సంస్థితం
అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్త్వం మునిభ్యః పరం
వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం

కల్పవృక్షము క్రింద, బంగారుమంటపమందు, పుష్పకము నడుమ మాణిక్య పీఠమందు, సీతతో కూడి వీరాసనమందున్నట్టి, ఎదుట ఆంజనేయుడు పలుకుచుండగా, పరతత్త్వమును మునులకు చెప్పుచు, భరతుడు మొదలగువారిచే ఆచరించబడిన, నల్లని రాముని భజిస్తున్నాను.

జానక్యాః కమాలంజలిపుటే యాః పద్మరాగాయితా
న్యస్తా రాఘవ మస్తకే తు విలసత్కుంద ప్రసూనాయితాః
స్రస్తాః శ్యామల కాయకాంతి కలితా యా ఇంద్రనీలాయితాః
ముక్తా స్తా శ్శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికా

ఏ ముత్యములు సీతమ్మ పద్మమువంటి నిర్మలమైన దోసిలియందు పద్మరాగ మణులవలెనున్నవో (ఆమె దోసిలు ఎరుపు గనుక ఎర్రగా యున్నవి అనుట), రాముని శిరముననుంచబడుచు మల్లెపూవువలె నున్నవో (దోసిలికి తలకు మధ్య పలువరుస వలె తెలుపుగా యుండుట), జారుచు రాముని నల్లని దేహకాంతితో కూడినవై ఇంద్రనీలము వలె నున్నవో (నల్లని దేహకాంతిచే నల్లగా నున్నవి యనుట), అట్టి రామ వివాహమందలి తలంబ్రాల ముత్యములు మనకు శుభము కలిగించు గాక!

రామయ్య నీలమేఘ శరీర చాయ, ధనుర్బాణాలు, పక్కన సీతమ్మ. వామభాగమున ఆ తల్లి, వెనుక మరియు ప్రక్కల సోదరులు, ఇతర హితులు, ముందర హనుమంతుడు. ఇదీ రామ పట్టాభిషేక సన్నివేశం. సోదరులు, హితులు, సేవకులు, దాసుల మధ్య రామయ్య సీతమ్మతో ప్రకాశించే చిత్రాన్ని మొదటి మూడు శ్లోకాలు వర్ణిస్తున్నాయి. శ్రీరామచంద్రుని కొలువుతీరిన రీతి చాలా సుందరంగా వర్ణించారు కర్త. మొదటి శ్లోకంలో భద్రాద్రి రాముని గురించి ప్రస్తావించారు. కాబట్టి ఈ రామకర్ణామృతం రచయిత భద్రాద్రి రాముని సేవించిన వారై ఉండాలి.

ఇక నాలుగవ శ్లోకం మనకు ప్రతి పెండి పిలుపుపై కనిపించేది. సీతారాముల ఆదర్శ దాంపత్యం మన భారతీయ జీవనశైలిపై ఎంత ప్రభావాన్ని చూపిందో! వివాహమనగానే సీతారాముల కళ్యాణమే గుర్తుకు వచ్చేలా మనకు పెద్దలు రామాయణాన్ని జీవితంలో పొందుపరచారు. సీతారాముల దేహకాంతులను బట్టి ముత్యాల తలంబ్రాలు ఏ విధంగా అగుపిస్తున్నాయో కవి తెలిపారు మనకు. ఈ తలంబ్రాల సాంప్రదాయం దక్షిణాది వారిదే కాబట్టి రచయిత ఇక్కడి వాడని నా అభిమతం. భాషను, శైలిని, నేపథ్యాన్ని బట్టి చూస్తే సీతారాముల కళ్యాణము మరియు పట్టాభిషేకము వంటి వేడుకల కళ్లారా కాంచి ఈ శ్లోకాలు రచించబడ్డాయి అని అర్థమవుతోంది. కవి ఎవరో కానీ, మనకు ఎప్పటికీ వివాహమహోత్సవాలలో, రాములవారి వేడుకలలో ఎప్పటికీ నిలిచిపోయే సాహిత్య వైభవాన్ని మనకు సంపదగా ఇచ్చారు. మరిన్ని శోకాలతో ముందు భాగాలలో

18, మే 2015, సోమవారం

బాలమురళీ రవం - శ్రీ సకల గణాధిప పాలయ మాం అనిశం

బాలమురళీ రవం -  శ్రీ సకల గణాధిప పాలయ మాం అనిశం



శ్రీ సకల గణాధిప పాలయ మాం అనిశం
వరసిద్ధి వినాయక భక్త జనాళి పోష వర చంద్రమౌళి సుత

దాసార్చిత పాద భాసురాంగ కరుణాసముద్ర వర వాయుపుత్ర హనుమంత వరప్రద
శ్రీ సకల శివంకర మారుతి మామవతు
వర రామ సునామ సుధారస పాన దీన నిజ భక్త భయాపహ
శ్రి సకల శివంకర మారుతి మామవతు

నంద నందన వందనమస్తు తే కుంద రదన ముకుంద మురహర
మందరోద్ధర వందిత బుధజన బృంద హృదయ నివాస సుందర
మందహసిత వదనారవింద మకరంద పాన సంగీత సుధాకర

శ్రి సకల కళా పరిపూర్ణ దయాశరధే
వరదాభయదాయక మామవ మంగళాంగ మురళీరవ మోహన

శ్రీ సకలకళా పరిపూర్ణ దయాశరధే
శ్రి సకల శివంకర మారుతి మామవతు
శ్రి సకల గణాధిప పాలయమాం అనిశం

ఓ సకల గణములకు అధిపతియైన విఘ్నేశా! నన్ను ఎల్లప్పుడూ కాపాడుము. నీవు కామ్యములను తీర్చి భక్తులను కాపాడే వాడవు! చంద్రుని ధరించే శివుని కుమారుడవు!

దాసులచే అర్చించబడిన పాదములు కలిగి, ప్రకాసించే దేహంగములు కలిగి వాయుపుత్రుడవైన ఓ హనుమంతా! వరాలను ప్రసాదించే వాడా! సకల శుభములను కలిగించే మారుతీ! నన్ను అనుగ్రహించుము! వరములిచ్చే రాముని దివ్య నామ రసామృత పానం చేసిన, దీనులైన నిజ భక్తుల భయాలను తొలగించే, సకల శుభాలను కలిగించే మారుతీ! నన్ను అనుగ్రహించుము!

నందుని కుమారా! నీకు వందనములు! మల్లెమొగ్గలవంటి పలువరుస కలవాడా! ముర అనే రాక్షసుని సంహరించిన వాడా! మందర పర్వతాన్ని మోసిన వాడా! నీకు నమస్కరించిన పండితుల హృదయాలలో నివసించే వాడా! అందగాడా! చిరునవ్వు చిలికిస్తూ తేనె వంటి సంగీతాన్ని పలికించే ఓ శ్రీకృష్ణా! ఓ సకల కళాపరిపూర్ణా! దయాసాగరా! మురళీరవముతో విశ్వాన్ని సమ్మోహనం చేసే కృష్ణా! నాకు వరములు, అభయము ఇమ్ము!

ఓ సకల కళాపరిపూర్ణా! దయాసాగరా!
సకల శుభములను కలిగించే మారుతీ! నన్ను అనుగ్రహించుము!
ఓ సకల గణములకు అధిపతియైన విఘ్నేశా! నన్ను ఎల్లప్పుడూ కాపాడుము!

బాలమురళీకృష్ణగారి మరో ఆణిముత్యం ఈ ఆరభి రాగంలోని శ్రీ సకలగణాధిప...ఇందులో ముగ్గురు దేవతలను నుతిస్తున్నారు కృతికర్త - మొదట గణపతిని, తరువాత హనుమంతుడిని, చివర శ్రీకృష్ణుడిని. సంస్కృత భాషలో ఈ కృతి రచన జరిగింది. దైవముల గుణగణ వర్ణనకు ఆరభి రాగం సముచితమైనది అని మనకు సాధించెనే ఓ మనసా అనే త్యాగరాజస్వామి వారి పంచరత్న కీర్తన ద్వారా అర్థమవుతుంది. ఘనమైన ఈరాగంలో ఈ సంకీర్తనను కట్టడం బాలమురళి గారి సంగీత మేధో సంపత్తికి సరస్వతీ కటాక్షానికి నిదర్శనం.

ఏ అర్చనలోనైనా తొలుత గణపతి పూజ తప్పనిసరి. అందుకే వాగ్గేయకారులు తొలుత ఆ విఘ్నవినాశకుడు, వరప్రదుడు, శివపుత్రుడైన గణపతిని మధురమైన పదాలలో కొలుస్తున్నారు. వాగ్గేయకారుల ప్రధాన లక్షణం దైవానికి దాసులవ్వటం. అందుకే ఆయన దాసులలో అగ్రగణ్యుడైన హనుమంతుని నుతిస్తున్నారు.  చివర అయన ముద్రకు మూలదైవమైన శ్రీకృష్ణుని నాలుగు ఎక్కువ పదాలతో నుతిస్తున్నారు. కృష్ణుడు అనగానే పదాలు, అందము, మురళీ గాన మాధుర్యము గుర్తుకు వచ్చేలా బాలమురళి గారు ఈ చరణాన్ని సాహిత్యంతో అలంకరించారు.

సకల కళా పరిపూర్ణ దయాశరథే అని పొగడటంలో ఆంతర్యం తెలుసుకుందాము. శ్రీకృష్ణుడు గురువుల వద్ద అన్ని విద్యలను నేర్వటంతో పాటు బాలునిగా ఉన్నప్పుడు ఎన్నో చిలిపి చేష్టలను చేసి గోకులాన్ని మురిపించాడు. అటు తరువాత ప్రేమకు నిర్వచన కృష్ణ భక్తిగా నిర్వచనం కలిగించాడు. ప్రేమకు సంగీతము, నృత్యము ఉచ్చ్వాస నిశ్శ్వాసల వంటివి. వెదురుపొదలలో ఒదిగి ఆయన వేణువును పలికిస్తే గోపకులమంతా తమను తాము మరచి ఆయనతో ఏకమయ్యింది. అలాగే కురు పాండవ సంగ్రామంలో ఆయన ప్రదర్శించిన రాజనీతి, ఉపాయములు ఆయనను సకల కళా పరిపూర్ణతకు మచ్చుతునకలు. అందుకే ఈ చరణం ఈ కృతికి పతాకస్థాయినిచ్చింది.

పదప్రయోగం, రాగ-భావ సమ్మేళనం, భక్తి అన్నీ సమపాళ్లలో కలిసి ఈ కృతిని బాలమురళి గారి రచనలలో అగ్రగణ్యగా చేశాయి. ముందు తరాలవారికి బాలమురళిగారి కృతులు తప్పక మార్గదర్శకాలు.

ఈ కీర్తనను బాలమురళి గారి గళంలో వినండి.

17, మే 2015, ఆదివారం

పాండవులు అజ్ఞాత వాసం - ధౌమ్యుని ఉపదేశం


మహారాజులైన పాండవులు జూదంలో ఓడి 12 ఏళ్ల వనవాసం ముగించుకొని 13వ ఏట అజ్ఞాతవాసం విరాటరాజు కొలువులో మారు పేరుతో వివిధ వృత్తులలో ఉండాలని నిర్ణయించుకుంటారు. అప్పుడు వారి ఇంటి పురోహితుడైన ధౌమ్యుడు ఇలా ఉపదేశిస్తాడు:

"పాండవులారా! మీకు విషయాలు తెలిసినా హితులు చెప్పటం వారి ధర్మం. మీరు రాజ మందిరంలో నివసించవలసిన తీరును గురించి చెబుతాను.

అగౌరవం జరిగినా, గౌరవం కలిగినా, అజ్ఞాతంలో ఈ సంవత్సరం గడిపి పదునాలుగో సంవత్సరంలో సుఖంగా జీవించండి.

1. రాజు గారిని చూడటానికి ముందు ద్వారపాలకుని అనుమతి పొందాలి. రాజ సంపదల మీద మక్కువ పడరాదు. ఇతరులు ఆశించని ఆసనాన్నే కోరుకోవాలి
2. నేను రాజు ఇష్టుడను కదా అని రాజుగారి వాహనం కాని, శయ్య కాని, పీఠం కాని, ఏనుగు కాని, రథం కాని అధిరోహించరాదు. అలా ఉన్న నిపుణుడే రాజు దగ్గర నివసించ గలుగుతాడు
3. రాజు అడుగకుండా ఎప్పుడూ ఆయనకు కర్తవ్యం బోధించకూడదు. మౌనంగానే సేవించాలి, సమయం తెలిసికొని ప్రశంసించాలి
4. అసత్యం పలికే వారిని రాజులు దోషులుగా చూస్తారు. వాడు మంత్రి అయినా అవమానిస్తారు.
5. రాజు గారి భార్యలతో ఎన్నడూ సాంగత్యం చేయకూడదు. అలా అంతఃపురంలో తిరిగే వారితోనూ, రాజుగారిని ద్వేషించేవారితోనూ, ఆయన శత్రువులతోనూ స్నేహం ఉండకూడదు
6. ఎంత చిన్న పని అయినా రాజుగారికి చెప్పిన తరువాతే చెయ్యాలి. ఇలా ఉండేవాని ఎప్పుడూ హాని కలుగదు
7. కూర్చోటానికి ఉత్తమ ఆసనం లభించినా రాజు ఆజ్ఞాపించేంతవరకూ రాజ మర్యాదను పాటిస్తూ, రాజాజ్ఞకై ఎదురు చూడాలి. మర్యాద మీరి ప్రవర్తించేవారు పుత్రులైనా, సోదరులైనా సరే శత్రుసంహారకులైన రాజులు గౌరవించరు.
8. రాజును అగ్నివలె (దేవుని వలె) శ్రద్ధతో సేవించాలి. ఈ సేవలో ఏ మాత్రం కల్మషము ఉన్నా రాజు అతనిని చంపి తీరుతాడు. అందులో సందేహం లేదు
9. రాజు నియోగించిన పనినే సేవకుడు చేయాలి. సేవలో ఏమరుపాటు, గర్వం, కోపం ఏ మాత్రం ఉండరాదు.
10. ఇది కార్యము, అది అకార్యము అని నిశ్చయించవలసినపుడు సేవకుడు రాజుకు హితము, ప్రియమైనదే చెప్పాలి. రెండూ కలిపి కుదరక పోతే ప్రియాన్ని విడచి హితమే చెప్పాలి
11. నేను రాజుకు హితుడనే అని పండితుడు స్వేచ్ఛగా ప్రవర్తించరాదు.
12. తెలివి గల పండితుడు రాజుకు కుడివైపు కానీ, ఎడమ వైపు కానీ కూర్చోవాలి. ఎదుట కూర్చొన కూడదు. రాజు గారు చూస్తుండగా సేవకుడు ఏ చిన్న పురస్కారమూ స్వీకరించ కూడదు.
13. రాజు యొక్క అసత్య భాషణను ఎక్కడా బయటపెట్టకూడదు.
14. రాజు దగ్గర పెదవులు కొరక రాదు, చేతులు, కాళ్లను చాచరాదు. సాగదీసి కూర్చొన రాదు. ఆవులింత, అపానవాయువు విసర్జన కాని, ఉమ్మివేయటం కాని ఇతరులకు తెలియకుండా మెల్లగా చేయాలి.
15. ఇతరులెవరైనా నవ్వులపాలు అవుతున్నప్పుడు సంతోషించరాదు, నవ్వరాదు. అతిధైర్యంతో ప్రవర్తించరాదు.
16. లాభం కలిగితే పొంగిపోకుండా, అవమానం కలిగితే కుంగిపోకుండా, నిత్యం ఏకాగ్రతతో ఉండేవాడు రాజుగారి కొలువులో ఎక్కువకాలం ఉండగలడు.
17. ఎప్పుడైనా, తన శ్రేయస్సుకు భంగం కలిగే పక్షంలో రాజుతో ఇతరులను కలువనీయ కూడదు. సంవాదం చేయనీయరాదు.
18. రాజు ఎవరినైనా ఎక్కడికైనా పంపాలనుకొన్నప్పుడు తానే ముందుకు వచ్చి 'నేనేమి చేయగలను ' అని రాజుకు ఉత్సాహంగా తెల్పిన వాడు రాజు ఆస్థానంలో చిరకాలం ఉంటాడు.
19. సర్వకాల సర్వావస్థలయందు చలించకుండా, సంశయము లేకుండా వర్తించేవాడు రాజుగారి ఆస్థానంలో చిరకాలం ఉండగలడు
20. సేవకుడు రాచకార్యం మీద ఇతర ప్రదేశాలకు వెళ్లినప్పుడు భార్య బిడ్డలను, భోగాలను స్మరించరాదు.
21. రాజుతో సమానంగా ఆభరణాలు, వేషభూషణలు ధరించరాదు.
22. రాజుగారి ద్రవ్యం ఎట్టిపరిస్థితులలోనూ తాకరాదు.
23. రాజు గారు ఇచ్చిన కానుకలను ధరిస్తే రాజు సంతోషిస్తాడు

పాండు కుమారులారా! ఈ విధంగా మీ మనస్సులను చిక్కబట్టుకొని ఈ సంవత్సరం ప్రవర్తించండి."

అని ధౌమ్యుడు హితవులు పలుకుతాడు. పాండవులు గురువుగారి మంచిమాటలకు గౌరవ వాక్యాలు పలికి, కార్యసిద్ధికై హోమం చేసి, బ్రాహ్మణులకు, తాపసులకు దానం చేసి ముందుకు పయనమవుతారు.

విలువలు, ధర్మాచరణకు రామాయణం దర్పణమైతే నిత్యజీవితంలో ఎదురయ్యే వివిధ రకాలైన వ్యక్తిత్వాలను, మంచి-చెడులతో కూడిన సందర్భాలలో మనిషి ఎలా మెలగాలో, తన కర్తవ్యాన్ని ఎలా నిర్వర్తించాలో, ఏయే వ్యక్తులు ఎలా మెలగి ఏమి ఫలితాన్ని పొందారో తెలిపేది మహాభారతం. పాండవులు పరిస్థితులకు అనుగుణంగా తమ క్షత్రియ లక్షణాలను మరచి, మారువేషంలో సేవకులుగా ఉండాలంటే ఎంతో మానసిక శిక్షణ, సంయమనం కలిగి తమ జ్ఞానంతో, కార్య కౌశలంతో రాజుగారి ఆస్థానంలో మెలిగారు. అన్నదమ్ములు, ద్రౌపది విలక్షణమైన లక్షణాలు, ప్రావీణ్యాలు, వ్యక్తిత్వాలు కలిగిన వారు. తదనుగుణంగా వృత్తులను ఎన్నుకున్నారు. ఎంతో సమర్థవంతంగా, ఒక పక్కా ప్రణాలికతో ఏడాది కాలాన్ని గడిపారు. కురు సార్వభౌముడు ఎంతటి పరాక్రమ సంపన్నుడైనా, తమ ఉనికిని తెలుసుకోనీకుండా అజ్ఞాతవాసాన్ని గడిపారు. ఈ కష్టకాలంలో ధర్మరాజు మేధస్సు, గురువుల బోధలు, అన్నదమ్ముల మధ్య సఖ్యత, శ్రీకృష్ణుని ఆశీస్సులు వారికి అండగా నిలిచాయి.  రచరికపు వైభవంలో మెలగిన క్షత్రియులు ఇంకొకరి ఇంట సేవకులుగా ఉన్నారంటే అది వారి వ్యక్తిత్వాలకు ప్రతిబింబం. అన్ని విషయాలు తెలిసినా గురువుగా తన ధర్మాన్ని నిర్వర్తించి పాండవుల అజ్ఞాతవాస విజయానికి ధౌమ్యులు తోడ్పడ్డారు. 

16, మే 2015, శనివారం

రామలక్ష్మణ-హనుమత్సమాగమం - మనస్తత్వ శాస్త్ర గని


రాముని భక్తులలో హనుమంతుడు శ్రేష్ఠుడు. మరి వారు ఈ రామావతారంలో మొట్టమొదట ఎప్పుడు ఎలా కలిశారు? ఈ ఘట్టాన్ని వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణంలోని కిష్కింధ కాండ రెండవ సర్గంలో వివరించారు.

వారులకు ప్రభువైన సుగ్రీవుడు బలశాలి ఐన సోదరుడు వాలికి భయపడి ఋష్యమూక పర్వత సమీపంలో తిరుగుతూ అద్భుత రూపవైభవం గల రామలక్ష్మణులను చూస్తాడు. వారిద్దరూ వాలి పంపగా వచ్చిన వారేమో అని చాలా భయపడి, వణికి విచారగ్రస్తుడౌతాడు. ఆ ప్రాంతం మతంగాశ్రమ ప్రదేశం. చాలా పవిత్రమైనది, సుఖప్రదమైనది.వాలి ఆ మతంగ ముని శాపగ్రస్తుడు. వాలికి భయపడిన సుగ్రీవాది వానర సమూహం మతంగాశ్రమాన్ని ఆశ్రయించి ఉంటారు. రామలక్ష్మణులను చూచి ఆ వానరులంతా ఆశ్రమంలోకి పరుగిడుతారు. వారిని వాలి మనుషులుగా భావించి సుగ్రీవుడు ఒకచోట నిలువలేక అటు ఇటు తిరుగుతూ ఉంటాడు.  తన మంత్రులతో "సహచరులారా! ఈ దట్టమైన అడవిలో నారబట్టలు ధరించిన వీరెవరో వాలి పంపగా వచ్చిన గూఢచారులే" అని అంటాడు. వానర సమూహమంతా రక్షణ కోసం అక్కడ ఒక కొండ నుండి ఇంకొక కొండకు పరుగులు తీస్తూ, వృక్ష సంపదను ధ్వంసం చేస్తూ ఋష్యమూక పర్వతముపై ఉన్న సుగ్రీవుని చూట్టూ చేరుతారు. సుగ్రీవుని మంత్రులు అతని చుట్టూ అంజలి ఘటించి నిలబడతారు.

అప్పుడు మాటనేర్పరి (వాక్యకోవిదుడని వాల్మీకి మహర్షి పదం) అయిన హనుమంతుడు సుగ్రీవునితో ఇలా అంటాడు "ఓ వానరశ్రేష్ఠుడా! వాలి భయంతో నీవు ఆందోళనలో ఉన్నావు. కానీ, ముని శాపకారణంగా వాలి ఈ ప్రాంతానికి రాలేడు. నీ అన్న నీ భార్యను అపహరించిన దుష్టుడు. ఆ దుష్టాత్మునకు నీవు భయపడుతున్నావు. కానీ, ఇది నీకు సురక్షిత ప్రదేశము. ఇక్కడ నీకు వాలి వలన ఎటువంటి ఆపదా కలుగదు. వానరులకు ప్రభువువై ఉండి నీవు చంచలత్వమును ప్రకటించటం ఆశ్చర్యకరముగా ఉంది. నీ భయము వలన బాగా ఆలోచించవలసిన విషయముపై కూడా నీ బుద్ధి స్థిరముగా నిలుపుట లేదు. నీ బుద్ధిని ఇంగితమును ఉపయోగించి ఇతరుల వ్యవహారమును బట్టి వారి స్వభావమును గుర్తించి సముచితమేదో దాని ఆచరింపుము. బుద్ధికి పని చెప్పని రాజు ప్రజలను పరిపాలించలేడు".

ఇది విన్న సుగ్రీవుడు "వారిరువురు ధనుర్బాణములు ధరించి, ఖడ్గమును ధరించిన ఆజానుబాహువులు. ఇంద్రునిలా పరాక్రమవంతులుగా కనిపిస్తున్నారు. అట్టి వారిని చూసిన ఎవరికి భయము కలుగదు? వీరిద్దరూ వాలి పంపగా వచ్చిన వారే అని నా అభిప్రాయం. రాజుకు రకరకాల మిత్రులు ఉంటారు. ఈ విషయంలో వారిరువురినీ నమ్మరాదు. శత్రువులు మారువేషంలో వచ్చినప్పుడు వారిని గురించి లోతుగా విచారించవలెను. వారు నమ్మిన వారి బలహీనతలను తెలిసికొని దెబ్బతీస్తారు. వాలి ఇట్టి కార్యములలో సమర్థుడు. సామాన్యుల రూపంలో వచ్చిన వారి గురించి లోతుగా తెలుసుకోవలెను. కాబట్టి, నీవు కూడా సామాన్య రూపములో వారి వద్దకు వెళ్లి, ఇంగితమును ఉపయోగించి వారి మంచి-చెడు లక్షణములను తెలుసుకో. వారు మనకు అనుకూలురుగా కనిపిస్తే వారిని ప్రశంసలతో ముంచెత్తి, చేష్టలతో తృప్తి పరచి వారి విశ్వాసమును చూరగొని వారి నిజమైన అంతర్యమును కనుగొనుము. ఇక్కడకు ధనుర్ధారులై వచ్చుటకు కారణము కనుగొనుము. వారి మాటల పద్ధతిని బట్టి, ముఖ కవళికలను బట్టి వారు సజ్జనులా కాదా అని తెలుసుకొనుము" అని ఆదేశిస్తాడు. ఎదురులేని వాడు, రాజనీతి కుశలుడు అయిన హనుమ సరే అని రామలక్ష్మణుల వద్దకు బయలుదేరుతాడు. ఒక్క గెంతులో ఋష్యమూక పర్వతము నుండి రామలక్ష్మణులున్న ప్రాతానికి చేరుకుంటాడు.

వాయుసుతుడైన హనుమంతుడు వారికి తన పట్ల నమ్మకం ఏర్పడటానికి వానర రూపాన్ని త్యజించి భిక్షువు రూపం ధరిస్తాడు. వారి మనస్సులను ఆకట్టుకొనునట్లుగా మధుర వచనాలను పలుకుతూ వారి వద్దకు చేరతాడు. వారికి ప్రణమిల్లి, భక్తి ప్రపత్తులతో కొనియాడుతూ తగిన విధంగా సంభాషితాడు.

"ఓ స్ఫురద్రూపులారా! మీరిద్దరూ రాజర్షులవలె, దేవతల వలె కనబడుతున్నారు. తీవ్రమైన వ్రతదీక్షను చేపట్టిన తాపసుల వలె ఉన్నారు. ఈ పంపాతీర ప్రాంతమునకు ఎందుకు వచ్చినారు? ఓ సజ్జనులారా! మీరు నారబట్టలను ధరించి తాపసులవలె ఉన్నారు. బంగారు వన్నె గల మీ రాక వలన మధురజలములు గల పంపా తీత్రం ఎంతో శోభిల్లుచున్నది. మీరెవరు? బలపరాక్రమ సంపన్నులు, బాహుబలురు అయిన మీ చూపులకు ఇక్కడి ప్రాణులన్నీ భయపడుతున్నవి. ఇంద్రధనుస్సు వంటి చాపములను ధరించిన మీరు శత్రువులను సంహరించుటలో దక్షులు. అతిలోక సుందరులైన మీ కాంతులు అపూర్వము. శ్రేష్ఠమైన వృషభమువలె మీరు గంభీరముగా యున్నారు. ఏనుగు తొండము వంటి భుజములు కలిగిన మీ తేజస్సు వలన ఈ మహాపర్వతము దివ్యకాంతిమంతమై ప్రకాశిస్తున్నది.

దేవతల వలె పరాక్రమవంతులు, తామర రేకుల వంటి కన్నులు కలవారు, జటావల్కములు ధరించి యున్నను మీరు మహావీరులు. శౌర్యపరాక్రమములలో మీకు సాటి లేరు. దేవలోకము నుండి దిగి వచ్చినట్లున్నారు. విశాల వక్షః స్థలము, సింహము వలె చూపులు, ఉత్తమ రాజలక్షణములు కలిగిన మీరు రాజ్య భోగములను త్యజించి నారబట్టలను ధరించి ఈ దుర్గమమైన అరణ్య ప్రాంతమునకు వచ్చుటకు గల కారణమేమిటి? మీ ఆయుధములు అపూర్వము, ఆశ్చర్యకరముగా ఉన్నవి. మీ తూణీరములు చూడముచ్చటగా పదునైన బాణములు కలిగి ఉన్నాయి.  పొడవైన మీ ఖడ్గములు మేలిమి బంగారముతో అలంకృతమై ఉన్నాయి. అవి కుబుసము విడిచిన పామువలె వెలుగుతున్నాయి.

ఓ సత్పురుషులారా! నేను ఇంతగా మాట్లాడుచున్నను మీరు పెదవి విప్పరేల? వానరులకు ప్రభువైన సుగ్రీవుడు ధర్మాత్ముడు మహావీరుడు బుద్ధిశాలి. అతడు తన అన్నయగు వాలిచే వంచించ బడి దుఃఖించుచు ఈ ప్రాంతమంతా తిరుగుతున్నాడు. అతడు పంపగా నేను మీ వద్దకు వచ్చాను. నేను హనుమంతుడు అను పేరు గల వానరుడను, వాయుసుతుడను. సుగ్రీవుని మంత్రిని, కామరూపుడను. కోరిన చోటికి వెళ్లి రాగలను. సుగ్రీవునికి ప్రీతి కలిగించుటకై సన్యాసి రూపంలో ఋష్యమూకపర్వతము నుండి ఇక్కడకు వచ్చాను" అని పలికి వారి సమాధానం కోసం వేచియుంటాడు.

అప్పుడు రాముడు లక్ష్మణునితో "లక్ష్మణా! ఇతడు సుగ్రీవుని మంత్రి. మనం ఆ సుగ్రీవుని కలియుటకు కోరుకొనుచుండగా అతడే మన వద్దకు తన మంత్రిని పంపించాడు. ఈతడు మాటలలో కుశలుడు. నాయందు, సుగ్రీవుని యందు ప్రీతి కలవాడు. కనుక తగు విధముగా మాట్లాడుము. ఋక్సామయజుర్వేదములలో సుశిక్షితుడైన వాడు మాత్రమే ఇలా మాట్లాడగలడు. ఇతటు చాలా విషయాలు మాట్లాడాడు. కానీ, అపశబ్దము ఒక్కటి కూడాలేదు. కనుక ఇతడు సమస్త వ్యాకరణములను కూలంక్షముగా నేర్చినవాడు. ఇతడు మాట్లాడినప్పుడు ముఖములో, కనులలో, ఫాలభాగమునందు, ఇతర అవయవములందు ఎట్టి వికారమూ కనబడలేదు. ఇతడు సంక్షిప్తంగా, సందిగ్ధతకు తావు లేకుండా మాట్లాడాడు. ఆగుచు గాని, అర్థరహితమైన పదములను కానీ ఉపయోగించలేదు. తొందరపాటు లేకుండా, ఆత్మవిశ్వాసముతో మాట్లాడినాడు. మనసులోని మాటను స్పష్టముగా తెలిపినాడు. మరీ బిగ్గరగా కాకుండా, మరీ సన్నగా కాకుండా మధ్యమ స్వరముతో ఉచ్చరించాడు.

ఇతడు పలికిన మాటలు వ్యాకరణ సమ్మతములు. స్పష్టముగా, క్రమమును అనుసరించి యున్నవి. లోకసహజమైన వేగము కలవి. శుభదాయకములు. ఆకర్షణీయములు. ఈ మారుతి వచనములు భావములను స్పష్టముగా ప్రకటించుటకు అనుగుణమైన స్వరస్థానములో ఉండటం నాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఈతని మధుర వచనాలు కత్తి దూసి పైకి వచ్చే శత్రువునైనా చల్ల బరచుతాయి. ఇట్టి బుద్ధి కుశలుడు, కార్య సాధకుడు దూతగా కలిగియున్న రాజు అదృష్టవంతుడు. ఇటువంటి వారి వలన రాజు కార్యములన్నీ సిద్ధించును" అని పలుకుతాడు.

లక్ష్మణుడు అన్న మాటలు విని హనుమంతునితో "ఓ విద్వాంసుడా! (విద్వన్ అన్నది వాల్మీకి మహర్షి ఉపయోగించిన పదము). కబంధుని ద్వారా సుగ్రీవుని గుణగణాలు విన్నాము. అతని కొరకు వెదుకుతూ ఇక్కడకు చేరాము. సత్పురుషుడవైన ఓ మారుతీ!  సుగ్రీవుని ఆదేశము మేరకు నీవు పలికిన మాటలు మాకు సమ్మతము. మేము మీ సూచనలను పాటించెదము" అని పలుకుతాడు.

హనుమంతుడు లక్ష్మణుని సమయోచితమైన పలుకులకు సంతోషపడి సుగ్రీవ కార్యము సఫలమైనది అని  నమ్మి సుగ్రీవునికి రామలక్ష్మణులకు మైత్రిని ఏర్పరచుటకు నిశ్చయించుకొనెను. అప్పుడు హనుమంతుడు లక్ష్మణుని ద్వారా సీతాపహరణ వృత్తాంతము తెలిసుకుని వారికి సుగ్రీవుని సాయాన్ని ఆశ్వాసిస్తాడు. సన్యాసి రూపం త్యజించి, తన వానర రూపాన్ని వారికి చూపి, సీతమ్మను వెదకి కనుగొనుటలో సుగ్రీవుని సాయం కోరవచ్చిన రామలక్ష్మణులకు, సోదర బాధితుడైన సుగ్రీవునికి మైత్రీ బంధం ఏర్పరచుటకు వారివురిని తన భుజములపై తీసుకొని సుగ్రీవుడున్న ఋష్యమూక పర్వతానికి చేరుకుంటాడు.
ఈ ఘట్టంలో ఎంతో రాజనీతి, బుద్ధి కుశలత, మనస్తత్వశాస్త్రము మనకు కనబడుతుంది.

1. సోదరుడి వంచనకు గురైన సుగ్రీవుడు పరాక్రమవంతులైన ఇద్దరిని చూసి శత్రువులుగా భావించటం - ఇది మనలో ఎందరికో నిత్యం జరుగుతునే ఉంటుంది. పరిస్థితుల ప్రభావానికి లోనై విచక్షణను కోల్పోయే స్థితి ఇది. భయం మనిషి ఆలోచనను వ్యతిరేక దృక్పథం వైపు నెడుతుంది. మరి అప్పుడు ఏమి జరగాలి? మంత్రి అన్న వాడు బాధ్యత రాజును హెచ్చరించి, ఆ మతంగాశ్రమానికి వాలి రాడు అని సాంత్వనను కలిగించి, అతనిని కార్యోన్ముఖుడిని చేయటం. సుగ్రీవుని హితుడైన హనుమంతుడు తన మాటలలో రాజు లోపాన్ని అతనిని నొప్పించకుండా తెలియజేసి ఆలోచింపజేస్తాడు.

2. శత్రువులను ఏ రూపంలో వచ్చినా నమ్మరాదు. వారిని కూలంకషంగా పరిశీలించి అడుగు ముందుకు వేయాలి అన్న సుగ్రీవుని ఆదేశం - మంత్రి హనుమంతుని ఆశ్వాసనతో కార్యోన్ముఖుడైన రాజు తిరిగి తన విచక్షణను ఉపయోగించి కొత్త వారితో ఎలా మెసలి వారి ఉద్దేశాలను కనుక్కోవాలో హనుమంతునికి ఆదేశిస్తాడు. ఇక్కద మనకందరికీ ఒక పాఠం ఉంది. మన అసలు రూపం తెలియకుండా, మధుర వచనాలు పలికితే ఎదుటు వాని ఉద్దేశం బయటపడుతుంది. వారి గురించి తెలుసుకున్న తరువాత మైత్రిని పెంపొందించుకోవాలి అన్నది.

3. రామలక్ష్మణులతో హనుమంతుని పలుకులు - వారి నిజలక్షణాలను వివరంగా, వైభవంగా పొగడి హనుమ వారిని సంతుష్టులను చేస్తాడు. తాను దర్శించిన రూపలక్షణాలను, ధైర్య పరాక్రమాలను వివరంగా, స్పష్టతతో పలికి వారి రాకకు గల కారణాన్ని అడుగుతాడు. శుభలక్షణాల వలన అక్కడ కలిగిన మార్పులను తన అనుభూతిగా పలికి వారి మనసులను చూరగొంటాడు. ఇది దూత లక్షణం. బుద్ధి కుశలతకు తార్కాణం. హనుమంతుని జ్ఞానం ఒక ఎత్తైతే అతని సమయస్ఫూర్తి, బుద్ధి కౌశలము మరో ఎత్తు.

4. హనుమంతునిపై రాముని విశ్లేషణ - ఈ సందర్భంలో రాముని సంభాషణలు మనస్తత్వశాస్త్రానికి ప్రమాణాలు. మనం మాట్లాడేటప్పుడు ఉచ్చారణ, ధ్వని హెచ్చు తగ్గులు, వ్యాకరణము, పలుకులకు గల జ్ఞాన నేపథ్యము - ఇవన్నీ రాముని మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. మాట్లాడేటప్పుడు మన ముఖ కవళికలు, అవయవాలలో ప్రతిక్రియలు, కంటి సంజ్ఞలు ఇవన్నీ మన అంతరార్థాన్ని తెలియజేస్తాయి. పొగడ్తలలోని అంతర్యాన్ని కూడా ఇవి తెలియజేస్తాయి. పూర్తిగా అర్థవంతంగా, సంధిగ్ధత లేకుండా మాట్లాడతం ఒక పెద్ద శుభలక్షణం. దీనిని రాముడు లక్ష్మణునికి వివరిస్తాడు. హనుమనుంతుని ప్రతి పలుకూ కూలంకషంగా గమనించి, విశ్లేషించిన తరువాతే రాముడు అతనిని నమ్మవచ్చు అని లక్ష్మణునికి తెలియజేస్తాడు. హనుమంతుని వంటి జ్ఞాని, కుశలునితో ఎలా సంభాషించాలో కూడా చెబుతాడు.

5. దూతగా హనుమంతుని కార్యసిద్ధిపై ఏకాగ్రత - మొత్తం సంభాషణలలోనూ హనుమంతుని లక్ష్యం ఒక్కటే. సుగ్రీవుని కార్యం నెరవేర్చటం. అణువణువులోనూ దానిపై దృష్టి, శ్రద్ధ. ఆ లక్ష్యం గుర్తు పెట్టుకునే ప్రతి పలుకూ, ప్రతి అడుగూ. ఇది దౌత్య కార్యాలయాలలో పని చేసే వారికి, ప్రభుత్వ ఉన్నత అధికారులకు, రాయబారులకు పెద్ద నిఘంటువు.

ఈ సర్గలలో వాల్మీకి మనకు రెండు ముఖ్యమైన కార్యములు పరస్పర అవగాహనతో, సహకారంతో ఎలా సాధించుకోవచ్చో, దానికొరకు ఎలా ప్రణాళిక వేసుకోవాలో అద్భుతంగా వివరించారు. భయాందోళనలో ఉన్న వానరులకు, వారి ప్రభువుకు హనుమంతుడు తన బుద్ధి కుశలతతో ఊరట కలిగిస్తాడు. సుగ్రీవుడు తన విచక్షణను తిరిగి పొంది కర్తవ్యం గురించి ఆలోచిస్తాడు. రామ లక్ష్మణులు తమ కార్యసిద్ధికై హనుమంతుడు, సుగ్రీవుని సహాయం తప్పని సరి అని గ్రహించి ముందుకు అడుగు వేస్తారు. మొత్తం మీద ఈ రామలక్ష్మణ-హనుమత్ సంవాదం నిరంతరం కొత్త మనుషులతో, కొత్త వ్యక్తిత్వాలతో వ్యవహరించే వారికి ఒక గొప్ప మనస్తత్వ శాస్త్ర గని. కార్యసిద్ధి కలిగించే సాధనం. అందుకే రామాయణం మానవ జన్మ సాఫల్యతకు గొప్ప ఆయుధం.

శ్రీరామశ్శరణం మమ! జై హనుమాన్! వందే వాల్మీకి కోకిలం! 

15, మే 2015, శుక్రవారం

రససిద్ధి - భక్తి



రససిద్ధి - ఆ రసాన్ని పూర్తిగా అనుభూతి చెంది దానిలో రమించటం. ఇదీ కళాకారుడి సాధనకు పతాక స్థాయి. రససిద్ధి పొందిన కళాకారుడికి తరువాత వేరే ఏదీ రుచించదు. అమృతత్వమంటే ఇదే. ఒక గాయకుడికి ఇది భావములో జీవించటం, దానిలో లయించి స్వరాలు పలికించటం. ఒక చిత్రకారుడికి గీయవలసిన బొమ్మలోని భావములో జీవించటం, దానికి జీవమివ్వటం రససిద్ధి. ఆస్వాదించగానే కళ్లు చెమర్చటం ఆ రససిద్ధికి సాఫల్యత. ఒక కవికి భావాన్ని పదప్రయోగంతో, శబ్ద శక్తితో, వ్యాకరణ శుద్ధితో రంగరించి ఒలికించటం రససిద్ధి. ఒక నాట్యకళాకరుడికి భావం ఆంగికంలో, ముఖ కవళికలలో, ముద్రలలో ప్రదర్శించి రసాస్వాదనలో ఎల్లలు లేకుండా నర్తించటం రససిద్ధి.

ఇలా ప్రతి కళకూ రససిద్ధి అత్యున్నతమైన లక్ష్యం. భక్తి ప్రాధాన్యమైన కళలలో రససిద్ధి ఎందుకు సులభం?

1. పరిపూర్ణమైన, నిర్వచించలేని, సర్వోన్నతమైన దివ్యత్వాన్ని ఒక కళ ద్వారా వ్యక్త పరచటం కాబట్టి. అన్ని భావనలలోని 'నేను' అన్న అహంకారాన్ని పక్కకు పెట్టి ఇంకొక పాత్రలో పరకాయ ప్రవేశం చేసి సమస్త రసాలను పండించగలిగే అవకాశం కాబట్టి
2. యుగ యుగాలుగా రససిద్ధి పొందిన వారి అనంతమైన దివ్య శక్తి ఆయా ఉపకరణాలలో ఒదిగి ఉంటుంది కాబట్టి
3. అనంతమైన దివ్యత్వాన్ని సూక్ష్మ రూపంలో ఒక కళ ద్వారా సేవించటం కాబట్టి. దైవానికి మానవ రూపమిచ్చి, మనలో ఒకనిగా భావించి, మన భావనలను సమర్పించి, తనలో ఏకమయ్యే సదవకాశం కాబట్టి.

భగవంతుని కోసం కాని కళ అసంపూర్ణమే. కొంత యాంత్రికంగానే గోచరిస్తుంది. పోతనగారు దీనిని చాలా అద్భుతంగా వివరించారు.

కంజాక్షునకుగాని కాయంబు కాయమే? పవనగుంభిత చర్మ భస్త్రి గాక;
వైకుంఠు బొగడని వక్త్రంబు వక్త్రమే? ఢమఢమధ్వనితోడి ఢక్కగాక;
హరిపూజనము లేని హస్తంబు హస్తమే? తరుశాఖ నిర్మిత దర్విగాక;
కమలేశు జూడని కన్నులు కన్నులే? తనుకుడ్యజాల రంధ్రములు గాక;
చక్రి చింత లేనిజన్మంబు జన్మమే? తరళసలిల బుద్బుదంబు గాక;
విష్ణుభక్తి లేని విబుధుండు, విబుధుడే? పాదయుగముతోడి పశువు గాక...

"భగవంతుని కోసం కాని శరీరము గాలితో నింపబడిన చర్మపు సంచీ మాత్రమే. శ్రీహరిని పొగడని కంఠం ఢమ ఢమ శబ్దములు చేసే డప్పు మాత్రమే. నారాయణుని పూజించని చేతులు ఆకులతో కూడిన కొమ్మలు మాత్రమే. లక్ష్మీపతిని చూడని కన్నులు గోడలోని రంధ్రాలు మాత్రమే. చక్రధారిని స్మరించని జన్మ కేవలం నీటి బుడగ మాత్రమే. విష్ణుభక్తి లెని పండితుడు రెండు కాళ్లున్న పశువు మాత్రమే."

కళను పరమాత్మకు సమర్పించి రససిద్ధి పొందిన నాదయోగులు ఎందరో. వాగ్గేయకారుల దగ్గరినుండి మహాకళాకారిణి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి వరకు ఈ కళ ద్వారా పరమాత్ముని సేవ కొనసాగుతునే ఉంది.

అధరం మధురం అని సుబ్బులక్ష్మి గారు ఆ శ్రీకృష్ణుని నుతిస్తూ మధురాష్టకం పాడితే ఎదురుగా ఆ పరమాత్మ దివ్యమంగళ స్వరూపం ముందు నిలిచిందా అనిపిస్తుంది. భావయామి గోపాల బాలం అని పాడితే ఆ చిన్ని కృష్ణుడు ముద్దుగా ఎదుట నిలిచినట్లే. ఇలా ఎన్నో. కారణం ఆమెకు ఆ సంకీర్తనలోని భావం మనసులో నిలిచి ఆ దేవతా స్వరూపం కళ్లముందున్నంత విశ్వాసం. తాదాత్య్మత కలిగిన కళాకారిణి ఆమె. ఇలా రససిద్ధి పొందిన వారే కాలగమనంలో శాశ్వతమైన స్థానం పొంద గలిగారు. రససిద్ధికి భాష, దానిలోని మాధుర్యం, శబ్దాలలోని శక్తి, విశాలమైన హృదయము, భావ ప్రాధాన్యత, స్పష్టమైన వ్యక్తీకరణ, త్యాగశీలత, నిరాడంబరత ఎంతో ముఖ్యం.

ఇటీవలి కాలంలో శాస్త్రీయ సంగీత కళాకారులలో ఈ రససిద్ధి లోపించింది. అందుకే నేటి కళాకారుల గళాలలో ఆ సంగీతం మాధుర్యం లేక ఢమ ఢమల్లాగానే ఉంటోంది. శాస్త్రీయత పేరిట భావాన్ని ఖూనీ చేసి శబ్ద కాలుష్యంగా చేస్తున్నారు మన ప్రాచీన సంగీతాన్ని. భావయుక్తంగా, సాహిత్యోచితంగా పాడితే సంకీర్తనకు సంగీతం ప్రాణ వాయువులా నిలిచి పరమాత్మ మెడలో హారమవుతుంది. కళాకారులు ఈ రససిద్ధికి ప్రయత్నించకపోతే శాస్త్రీయ సంగీతాన్ని ప్రజలు ఆస్వాదించలేరు. దానికి గల పవిత్రత, ప్రాభవం తగ్గుతుంది. నేటి కళాకారులు దీనిని గమనించి సరిదిద్దుకుంటారని ఆశిద్దాం

సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము సేయు వారెందరో మహానుభావులు అన్నారు త్యాగరాజుల వారు. స్వాంతము ఒక సరోజమని గ్రహించటానికి, దర్శించటానికి ఎంతో సాధన కావాలి. గాత్ర సేవ ద్వారా రససిద్ధి పొందిన మహా కళాకారిణి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు..

ఎందరో మహానుభావులు! అందరికీ వందనములు!!

14, మే 2015, గురువారం

గీతామృతము -సాంఖ్య యోగము




ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే
సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే

క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః
స్మృతిభ్రంశాద్బుద్ధినాశో బుద్ధి నాశాత్ ప్రణశ్యతి

యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి
తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస చ శ్రుతస్య చ

రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్
ఆత్మ వశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్ఛతి

విషయ చింతన చేయు పురుషునికి ఆ విషయములందు ఆసక్తి ఏర్పడును. ఆసక్తి వలన ఆ విషయములను పొందుటకై కోరికలు కలుగును. ఆ కోరికలు తీరనప్పుడు క్రోధము ఏర్పడును.

అట్టి క్రోధము వలన వ్యామోహము కలుగును. దాని ప్రభావమున స్మృతి ఛిన్నాభిన్నమగును. స్మృతిభ్రష్టమైనందున బుద్ధి అనగా జ్ఞానశక్తి నశించును. బుద్ధి నాశనము వలన మనుష్యుడు తన స్థితినుండి పతనమగును.

ఎప్పుడు నీ బుద్ధి మోహమనే మాలిన్యమును దాటగలదో అప్పుడు విన్న, వినబోవు ఇహము, పరమునకు సంబంధించిన భోగములనుండి వైరాగ్యమును పొందగలవు.

ఇంద్రియములను వశములో ఉంచుకొనిన సాధకుడు రాగద్వేషాలు లేకుండా, ఇంద్రియముల ద్వారా విషయాలను గ్రహించుచున్ననూ ప్రశాంతతను పొందుచున్నాడు. 

శ్రీకృష్ణభగవానుడు అర్జునునితో శ్రీమద్భగవద్గీత సాంఖ్య యోగమునందు (2-62, 2-63,2-52,2-64 శ్లోకములు)

కలి నరులకు మహిమలు దెలిపేమి ఫలమన లేదా



కలి నరులకు మహిమలు దెలిపేమి ఫలమన లేదా

ఇలను వెలయు వర వృషరాజులకటుకుల రుచి తెలియు చందముగానే

దారసుతులకై ధనములకై ఊరుపేరులకై బహు పెద్దతనముకై
సారెకు భక్త వేసము గొనువారికి తారక నామ శ్రి త్యాగరాజార్చిత 

కలియుగంలో స్వార్థపు ప్రయోజనాల కోసం భక్తులుగా చలామణీ అయ్యే మానవుని స్వభావాన్ని ఈ కృతి ద్వారా త్యాగరాజ స్వామి నిందిస్తున్నారు.

కలియుగంలో మానవులకు నీ నామ మహిమలు తెలిపి ఏమి ఫలమని నీవనలేదా? ఈ భూమిపై ధనికులనే పెద్దలకు అటుకుల రుచి తెలియని విధముగా ఈ మానవులకు తారక నామ మహిమ ఏ విధంగా తెలుస్తుంది? భార్యా బిడ్డల కోసం, ధనము కోసం, భూమి, పేరు కోసం, పెద్దరికం కోసం, కానుకల కోసం భక్తుని వేషం వేసే మానవులకు నీ నామ మహిమలు తెలిపేమి ఫలము? ఓ శివునిచే పూజించబడ్డ తారక నామ!

ఈ సంకీర్తనలో వర వృష రాజునకు అన్న పదానికి ఎద్దు అన్న అర్థం ఉన్నా, శ్రీమంతుడు అన్న అర్థమే సందర్భానికి సముచితమనిపించింది.

చాలా మంది మానవులు భక్తి తన అవసరాల కోసం, స్వార్థం కోసం నటిస్తారన్నది ఈ కీర్తన భావం. ఈ విధంగా జీవించే వారికి నామ మహిమ తెలిపినా ఉపయోగం లేదు. ఎందరో మహానుభావులను తరించిన నామం రామ నామం.   దాని గూఢము, మహిమ తెలియాలంటే భౌతికమైన విషయాలకు అతీతంగా ఆలోచించ గలగాలి. మన జీవన శైలి, జీవిత తత్త్వము ఈ నామ మహిమానుభూతికి ఎంతో తోడ్పడతాయి. కలియుగ లక్షణం అనేక మూలాంశాలలో అసంతులన వలన వచ్చే భావ కాలుష్యము. దీని వలన బుద్ధి ప్రకోపించి మనిషిని చెడు వైపు నెడుతుంది. తద్వారా, మానవుడు దైవ సంబంధమైన విషయాలను కూడా తన స్వార్థానికి వాడుకొని అసలు విషయాన్ని మరస్తాడు. అధోగతికి ఇది మొదటి మెట్టు. రామనామ మహిమలో రమించే వానికి వేరే ఏవీ పట్టవు. రామనామననేది ఒక రసాయనం (కలి మల హరణము) అని వాగ్గేయకారులు త్యాగయ్య, రామదాసు, అన్నమాచార్యుల వారు నొక్కి వక్కాణించారు. దానికి వారికి కలిగిన అనుభూతులు, దార్శనికాలు ప్రమాణం. అందుకే వారి సంకీర్తనలు చిరకాలం ప్రచారం పొందుతాయి. తారక నామ మంత్రామృతాన్ని పానం చేసిన ఈ వాగ్గేయకారులు దాని మహిమను అదే పవిత్రతో సంకీర్తనలలో వర్ణించి, తమ నాద శక్తిని దానికి ప్రాణంగా ధార పోశారు. అందుకే అవి కూడా మంత్ర సమానమై ఈ కలికాలంలో మనకు సన్మార్గాన్ని చూపుతున్నాయి.

కుంతలవరాళి రాగంలో ఈ కృతి కూర్చబడింది. బాలమురళీకృష్ణ గారి గాత్రంలో వినండి.

13, మే 2015, బుధవారం

ఓంకార రూపిణీ క్లీంకార వాసినీ


ఓంకార రూపిణీ క్లీంకార వాసినీ
జగదేక మోహినీ ప్రకృతి స్వరూపిణీ

శర్వార్థ దేహినీ సకలార్థ వాహినీ
భక్తాఘ దాహినీ దహరాబ్జ గేహినీ

మృగరాజ వాహన నటరాజు నందన
అర్థేందు భూషణ అఖిలార్తి శోషణ
కాంచికా కామాక్షీ మాధురి మీనాక్షీ
మముబ్రోవవే తల్లీ అనురాగ శ్రీవల్లీ

బేతవోలు రామబ్రహ్మం గారి మరో అద్భుతమైన రచన ఈ భక్తి గీతం. అమ్మవారిపై రాసిన ఈ గీతంలో ఆయన క్లీం అన్న బీజాక్షరం కూడా ఉపయోగించారు. క్లీం బీజాక్షరాలలో చాలా శక్తివంతమైనది. సరిగ్గా దీనిని శ్వాసతో అనుసంధానం చేసి ఉచ్ఛరిస్తే ప్రాణ శక్తితో బంధం ఏర్పడి కామ్యములను తీరుస్తుంది. కర్మవిముక్తులను చేస్తుంది. రామబ్రహ్మం గారు దేవీ భక్తులు. అమ్మపై ఆయనకు గల నమ్మకం ఈ కృతిలో అర్థమవుతుంది. అ ఉ మ అనే అక్షరాల కలయిక ప్రణవం. ఈ ఓంకారం పరబ్రహ్మ చైతన్యానికి రూపం. ఓం మరియు క్లీం అనేవి దేవీ ఉపాసనలో ఎంతో ప్రాధాన్యత కల బీజాక్షరాలు. గీత రచయిత ఈ విధంగా వేడుకుంటున్నారు -

అమ్మా! నువ్వు ఆ ప్రణవ స్వరూపిణివి, శక్తివంతమైన క్లీం అనే బీజాక్షరం నీకు నివాసం. ఈ విశ్వంలో కెల్లా సౌందర్యవంతమైన స్త్రీవి నువ్వే అమ్మా! నీవు ప్రకృతి స్వరూపిణివి. శివునికి అర్థ భాగంగా ఉన్నావు! సమస్త అర్థములను తీర్చేటి అమ్మవు నీవు. భక్తుల పాపములను దహించే తల్లీ! నీవు శివుని ఇల్లాలువు. సింహవాహినివి! శివునికి ఆనందం కలిగించెడిదానవు. నెలవంక శిరసుపై ధరించి, సమస్త కష్టములను తొలగిస్తున్నవు. కంచిలో కామాక్షీ! మదురైలో మీనాక్షి! మమ్ములను కాపాడుము ఓ అనురాగరూపిణీ!

సుశీల గారు చాల ఆర్తితో పాడారు ఈ గీతాన్ని. వినండి.

12, మే 2015, మంగళవారం

అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా


అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మా నా మనవి ఆలించి నను బ్రోవుమమ్మా
విశ్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట

నా తనువు ఓ తల్లి నీ సేవ కొరకు అర్పింతునోయమ్మ పై జన్మ వరకు
నా ఒడలి అచలాంశ నీ పురము జేరి నీ పాదముద్రతో నెగడాలి తల్లి

నా ఒడలి ఉదకాంశ నీ వీడు చేరి నీ పాదపద్మాలు కడగాలి తల్లి
నా తనువు తేజోంశ నీ గుడికి చేరి నీ ముందు దివ్వెగా నిలవాలి తల్లి

నా తనువు మరుదంశ నీ గుడికి చేరి వీచోపు కొసలలో విసరాలి తల్లి
నా తనువు గగనాంశ నీ మనికి చేరి నీ నామగానాలు మోయాలి తల్లి

అన్నపూర్ణాదేవిని స్తుతిస్తూ రచయిత బేతవోలు రామబ్రహ్మం గారు ఎంత భావగర్భితమైన గీతాన్ని రాశారో!

మానవ జన్మకు సంబంధించిన అంశాలన్నిటినీ ఆ తల్లి సేవకు ఎలా సమర్పించదలచుకున్నాడో రచయిత ఈ గీతంలో వివరిస్తున్నారు.

ఓ తల్లీ! అన్నపూర్ణాదేవి! నిన్ను అర్చిస్తున్నాను! నా మనవిని ఆలకించి నన్ను కాపాడు! విశ్వనాథుడే వచ్చి నీ ఇంటి వాకిట భిక్ష కోసం నించుంటాడట! ఓ తల్లీ! నా శరీరం మళ్లీ జన్మ వరకు నీ సేవకు అర్పిస్తున్నాను. నా శరీరములోని పృథివీ తత్త్వము నీవు నివసించే పురం చేరి నీ పాదముద్రతో కలిసి వర్ధిల్లాలి. నా శరీరంలోని జల తత్త్వము నీవు ఉండే ఇల్లు చేరి నీ పదకమలాలను కడగాలి. నా శరీరములోని తేజో తత్త్వము నీ గుడి ముంగిట దీపంలా వెలగాలి. నాలోని వాయు తత్త్వము నీ గుడికి చేరి వింజామరల కోసలలో నిలిచి నీకు గాలి విసరాలి. నా శరీరంలోని ఆకాశ తత్త్వము నీ నివాసానికి చేరి నీ నామాలను నుతించే గానాలను మోయాలి తల్లీ!

దేహానికి సంబందించిన ఐదు తత్త్వాలను - పృథివ్యాపస్తేజోవాయురాకాశాలను - తల్లి సేవకు సమర్పించటం ఈ భక్తుని పరిపూర్ణమైన మనోవికాసానికి, జన్మ కారణ జ్ఞాన వికాసానికి ప్రతీక. ఈ అంశాలను దుర్వినియోగం చేయకుండా దేహాన్ని దేవాలయం చేయటం ఈ గీత లక్షణ సంపద. జగన్మాత కరుణానిధి. ఆ తల్లి తనను శరణన్న వారిని కరుణించి కన్నబిడ్డలలా కాపాడుతుంది. మానవ జన్మకు ఇంతకు మించి సేవ ఏమున్నది? మనలోని ప్రతి అంశాన్నీ ఆ దివ్యత్వానికి సమర్పిస్తే ఇక మాయకు, తద్సంభూతమైన అహంకారాది వికారములకు స్థానమే లేదు.

ఇటువంటి గీతాన్ని రచించాలంటే పదకారుడు ఎంతటి ఆధ్యాత్మిక వికాసాన్ని పొంది ఉంటాడో ఊహిస్తేనే తనువు పులకరిస్తుంది. ఆయా అంశాలను మన తల్లికి అర్చనా విధులలో వినియోగించటం జీవాత్మ పరమాత్మల మధ్య భేదాన్ని ఛేదించి అద్వైతము వైపు వడి వడిగా అడుగులు వేయటాన్ని సూచిస్తోంది. భక్తి, భావం ఒకటైతే పదాలు అవే కలిసొస్తాయి. వీడు అన్నది తమిళ పదం. అలాగే మని అన్నది సంస్కృతనుండి జనించి కన్నడ భాషలో నివాసానికి వాడే పదం. ఇలా ఈ గీతంలో భావానికి వేర్వేరు భాషల పదాలు ఎంతో అందంగా ఒదిగిపోయాయి. అన్నపూర్ణమ్మకు హారంగా పొదిగి ప్రకాశిస్తున్నాయి. అంశలకు సంబంధించిన పదాలను పరిశీలిస్తే కృతికర్త భాషా పటిమ మనకు అర్థమవుతుంది. అచలాంశ అన్న పదం ఆయనకు దేహం గురించిన లోతైన జ్ఞానాన్ని తెలియజేస్తుంది. అలాగే ఉదకాంశ, మరుదంశ, తేజోంశ మరియు గగనాంశ. ఆలోచించండి! శరీరం ఎంతటి అద్భుతమైన పంచ భూతముల కలయికో? మరి ఆది పరాశక్తి ప్రకృతి రూపిణి కదా? ఆమెకు ఈ పాంచభౌతిక మూలాలను సమర్పిస్తే మనలను మనం పూర్తిగా అర్పించినట్లేగా? ఈ విశ్వైకజనని అనబడే అనంత శక్తితో ఈ చిరు శక్తి అనుసంధానమై ఉజ్జ్వల తేజో తరంగంగా భాసిల్లినట్లేగా? అనంతమైన విశ్వంలో అశాశ్వతమైన శరీరానికి ఇంతకన్నా సార్థకత ఏముంది. నా మనసుకు హత్తుకొని సాహిత్యం చదువుతుంటే కళ్లలో నీళ్లు తెప్పించిన ఈ గీత రచయిత మనోవికాసానికి నా జోహార్లు.

సుశీలమ్మ గళంలో ఈ పాట వినండి.

11, మే 2015, సోమవారం

శీతాద్రి శిఖరాన - మంగళ హారతి



శీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లి లత్తుకకు నీరాజనం
కెంపైన నీరాజనం భక్తి పెంపైన నీరాజనం

యోగీంద్ర హృదయాల మ్రోగేటి మా తల్లి బాగైన అందెలకు నీరాజనం
బంగారు నీరాజనం భక్తి పొంగారు నీరాజనం

నెలకొల్పు డెందాన వలపు వీణలు మీటు మా తల్లి గాజులకు నీరాజనం
రాగాల నీరాజనం భక్తి తాళాల నీరాజనం

మనుజాళి హృదయాల తిమిరాలు తొలగించు మా తల్లి నవ్వులకు నీరాజనం
ముత్యాల నీరాజనం భక్తి నృత్యాల నీరాజనం

చెక్కిళ్ల కాంతితో క్రిక్కిరిసి అలరారు మా తల్లి ముంగెరకు నీరాజనం
రతనాల నీరాజనం భక్తి జతనాల నీరాజనం

పసిబిడ్డలను చేసి ప్రజలెల్ల పాలించు మాతల్లి చూపులకు నీరాజనం
అనురాగ నీరాజనం భక్తి కనరాగ నీరాజనం

పగడాల మరిపించు ఇనబింబమనిపించు మాతల్లి కుంకుమకు నీరాజనం
నిండైన నీరాజనం భక్తి మెండైన నీరాజనం

తేటిపిల్లలవోలె గాలికల్లలలలాడు మా తల్లి కురులకు నీరాజనం
నీరాల నీరాజనం భక్తి భావాల నీరాజనం

జగదేక మోహినీ సర్వేశు గేహిని మాతల్లి రూపునకు
భక్తి నిలువెత్తు నీరాజనం భక్తి నిలువెత్తు నీరాజనం

బేతవోలు రామబ్రహ్మం గారు తెలుగు భాషలో ప్రావీణ్యం పొంది ఆచార్యులుగా కూడా ఎన్నో ఏళ్లు పని చేశారు. భాషపై పట్టుతో పాటు ఆధ్యాత్మికోన్నతి కూడా వారికి భగవంతుని అనుగ్రహంగా వచ్చింది. తెలుగు మరియు సంస్కృత భాషలలో ఉభయ భాషా ప్రవీణులు వీరు. దేవీభాగవతంపై వీరు విస్తృత పరిశోధన చేశారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరబాద్ లో తెలుగు విభాగంలో ఎన్నో ఏళ్లు ఆచార్యునిగా భాషాసేవ చేశారు.

వీరి రచన ఈ శీతాద్రి శిఖరాన భక్తి గీతం.

లోకమాతకు ఇలా నీరాజనం ఇస్తున్నాడు కవి.

హిమవత్పర్వత శిఖరంపై పగడాలతో తాపినట్లుగా ఉన్న మా తల్లి కాళ్ల పారాణికి కెంపువంటి ఎరుపైన, భక్తితో నిండిన నీరాజనం. యోగుల హృదయాలలో చక్కగా మ్రోగే తల్లి అందెలకు బంగారు, భక్తి రంగరించిన నీరాజనం. హృదయంలో నిలిపిన వారికి ప్రేమ వీణలు మ్రోగించే తల్లి గాజులకు రాగాలతో, భక్తి భావములతో నీరాజనం. మానవాళి హృదయాలలోని అంధకారాన్ని తొలగించే తల్లి నవ్వులకు ముత్యాల మరియు భక్తితో కూడిన నృత్యాల నీరజనం. బుగ్గలపై గల వెలుగుతో క్రిక్కిరిసి అలరారే తల్లి ముక్కు పోగుకు రతనాల, భక్తి ప్రయత్నాలతో కూడిన నీరాజనం. ప్రజలందరినీ పసిబిడ్డలను చేసి పాలించే తల్లి చూపులకు అనురాగంతో, భక్తి కనబరుస్తూ నీరాజనం. పగడాలను మరపించేలా, సూర్యబింబంవలె అనిపించే తల్లి కుంకుమకు నిండైన, భక్తి మెండుగా గల నీరాజనం. తేనేటీగ పిల్లల వలే గాలికి అటు ఇటూ ఊగే తల్లి కురులకు నీటితో మరియు భక్తి భావములతో నీరాజనం. జగములోకెల్ల అతి సౌందర్యవతి, సర్వేశ్వరుని పత్ని అయిన తల్లి రూపమునకు భక్తితో నిలువెత్తు నీరాజనం.

కేవలం ప్రాస కోసం పదాలు కాకుండా మంచి భావ సంపద కూడా ఈ గీతంలో ఉన్నాయి. భక్తి విశ్వాసాలతో కూడిన నీరాజనాలు అమ్మ తప్పకుండా స్వీకరించి అనుగ్రహిస్తుంది.

వేదవతీ ప్రభాకర్ గారు ఈ మంగళహారతిని ఆలపించారు

10, మే 2015, ఆదివారం

ముందు తెలిసెనా ప్రభూ ఈ మందిరమిటులుంచేనా



ముందు తెలిసెనా ప్రభూ ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు మధుర క్షణమేదో.. కాస్త ముందు తెలిసెనా ప్రభూ..

అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే
సుందర మందార కుంద సుమదళములు పరువనా
దారి పొడుగునా తడిసిన పారిజాతములపై
నీ అడుగుల గురుతులే నిలిచినా చాలును
ముందు తెలిసెనా ప్రభూ
ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు
మధుర క్షణమేదో.. కాస్త ముందు తెలిసెనా ప్రభూ..

బ్రతుకంతా ఎదురుచూతు పట్టున రానే రావు
ఎదుర రయని వేళ వచ్చి ఇట్టే మాయమౌతావు
కదలనీక నిముషము నను వదలిపోక నిలుపగ
నీ పదముల బంధింపలేను హృదయము సంకెల చేసి
ముందు తెలిసెనా ప్రభూ ఈ మందిరమిటులుంచేనా
మందమతిని నీవు వచ్చు మధుర క్షణమేదో.. కాస్త ముందు తెలిసెనా ప్రభూ..


శ్రీకృష్ణుని కోసం వేచి ఉన్న గోపిక భావనను దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు తమ కవితాఝరిగా ఇలా ఆవిష్కరించారు.

ప్రభూ! నీవు వచ్చే వేళ ముందే తెలిస్తే ఈ మందిరాన్ని ఈ మందమతి ఇలా ఉంచేనా! నీవు వచ్చే మధుర క్షణమేదో ముందు తెలిస్తే బాగుండు!

నీ  కనులకు విందుగా ఇంటి ముంగిట అందమైన మందార పూవుల రేకులతో పరచి అలంకరించనా? నీ అడుగు జాడలు నిలిచినా చాలు ప్రభూ! నీవు వచ్చే వేళ ముందే తెలిస్తే ఈ మందిరాన్ని ఈ మందమతి ఇలా ఉంచేనా! నీవు వచ్చే మధుర క్షణమేదో ముందు తెలిస్తే బాగుండు!

జీవితమంతా ఎదురుచూస్తునే ఉన్నాను ఒక పట్టున రానే రావు! ఎదురు చూడని సాయం వేళ వచ్చి చిటికెలో మాయమవుతావు! నా హృదయముతో నీ పాదాలను బంధించి, నన్ను వదిలి వెళ్లకుండా, కదలకుండా ఒక్క నిమిషం కూడా నిన్నుంచలేను ప్రభూ! నీవు వచ్చే వేళ ముందే తెలిస్తే ఈ మందిరాన్ని ఈ మందమతి ఇలా ఉంచేనా! నీవు వచ్చే మధుర క్షణమేదో ముందు తెలిస్తే బాగుండు!

కృష్ణశాస్త్రి కవితలా అని దేవులపల్లి వారి సాహితీసంపదను ఒక కొలబద్దగా సాహిత్యకారులు గౌరవించారు. దానికి కారణం లలితమైన, భావయుక్తమైన, హృదయాన్ని తాకే సాహిత్యాన్ని ఆయన తన రచనలలో గుప్పించారు. హృదయం ఎంత సున్నితంగా ఉండగలదో ఆయన సాహిత్యం మనకు నిరూపిస్తుంది. ఈ గీతంలో నాయిక స్వామికోసం పరితపించి, వేచి వేసారి, ఆయన వచ్చి క్షణంలో మటుమాయమైపోతే కలిగే భావనను ఒక సుందరసుమంలా నిలిపారు. పదధూళి, అడుగుల గురుతులు వంటి పదాలు ఆయన సాహిత్యంలో కోకొల్లలు.  తాను స్వామి వేరు అన్న భావనలో ఉన్న నాయిక నవరసాలను ఒలికిస్తుంది. రానంత కాలము విరహము, రాగానే కలహము, వెళ్లిపోగానే దిగులు...ఇలా ఎన్ని మధుర భావనలో ఆ నాయికలో. ఈ గీతంలో స్వామి తన వద్ద ఉన్న కొద్ది సమయం చాలక నిరాశ, ఆయన వచ్చే విషయం ముందే తెలిస్తే కలయికను మరింత మధురంగా చేద్దామనే తపన..అమితమైన ప్రేమ మరియు భక్తి....హృదయంతో పాదాలకు సంకెలలు వేయలేను అన్న సున్నితమైన సందేశం...దేవులపల్లివారికే చెల్లు.

భాషకు భావం ప్రాణం. భావానికి కవి హృదయంలోని నిర్మలత్వం పునాది. నిర్మలత్వానికి భక్తి, తదనుగుణ జనిత పారవశ్యానుభూతులు ఉచ్ఛ్వాస నిశ్వాసలు. వీటన్నిటికీ పరిపూర్ణమైన ప్రతిబింబం దేవులపల్లి వారి సాహిత్యం. అందుకే ఆయన ఆధునిక తెలుగు కవులలో అగ్రగణ్యుడు. మరే కవికీ అందనంత దూరంలో నిలించిన ధృవతార.

ఈ గీతాన్ని మేఘసందేశం చిత్రంలో ఒక అద్భుతమైన సన్నివేశంలో నాయికా-నాయకులపై చిత్రీకరించారు. గోదావరి ఒడ్డు, నాయిక కుటీరం, నాయకుని పడవ ప్రయాణం, తదుపరి భావావేశం, నాయిక నృత్య స్పందన...ఇదీ ఆ మధుర చిత్రంలోని ఈ గీతానికి గల ఘట్టం. సుశీలమ్మ గొంతులో తెలుగుదనం తేనెతో కలిసి రంగరించి పోసినట్లుగా జాలువారింది ఈ గీతం. రమేష్ నాయుడు గారి సంగీతం అజరామరం.

ఎంతెంత దయ నీది ఓ సాయీ



ఎంతెంత దయ నీది ఓ సాయీ నిను ఏమని పొగడను సర్వాంతర్యామీ

తొలగించినావు వ్యాధులు ఊదితో వెలిగించినావు దివ్వెలు నీటితో
నుడులకు అందవు నుతులకు పొంగవు పాపాలు కడిగేసే పావన గంగవు

భక్త కబీరే నీ మతమన్నావు భగవానుడే నీ కులమన్నావు
అణువున నిండిన బ్రహ్మాండంలా అందరిలో కొలువున్నావు

ప్రభవించినావు మానవ మూర్తివై ప్రసరించినావు ఆరని జ్యోతివై
మారుతి నీవే గణపతి నీవే సర్వ దేవతల నవ్యాకృతి నీవే

బాబా సాయిబాబా! బాబా మా సాయిబాబా! బాబా షిర్డి సాయిబాబా! బాబా షిర్డి బాబా!

- డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారు

ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్న శ్రీకృష్ణుని పలుకుల ఫలితంగా 19వ శతాబ్దపు చివర హిందూ-ముస్లిం ఘర్షణలతో ఆశాంతికి గురవుతున్న మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ ప్రాంతంలో గోదావరీ నదీ తీరాన షిర్డీ సాయి అవతరించాడు. దత్తావతారునిగా కొలువబడ్డాడు. మతాలకు అతీతంగా మనుషులను ఏకం చేశాడు సాయి. డబ్బుకు అతీతంగా, బైరాగిగా జీవించి ఈనాడు కోట్లాది భక్తులకు సమర్థ సద్గురువుగా, దైవంగా నిలిచాడు. శ్రద్ధ మరియు సబురీ అన్న రెండు సిద్ధాంతాలతో నమ్మిన వారికి ఎన్నెన్నో మహిమలను చూపించాడు. అంధకారంలో ఉన్నవారి కన్నులు తెరిపించాడు. ఆయన జీవితంలో ప్రతి రోజూ ఒక అద్భుతమే. ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన అంత మాత్రమే నీవు అని చెప్పిన అన్నమయ్య మాటను అక్షరాలా నిజం చేశాడు. మహళ్సా మరియు శ్యామాకు మారుతిగాను, కొందరికి పాండురంగనిగా, కొందరికి శివునిగా, కొందరికి రామునిగా, కొందరికి గణపతిగా, ఎందరికో దత్తాత్రేయునిగా ఏ విధమున కొలిస్తే ఆ రూపంలో కనిపించి కరుణించాడు. యద్భావం తద్భవతని దర్శనమిచ్చాడు ధన్యుల జేశాడు. 

అహంకారం వీడి శరణన్న వారిని అనుగ్రహించాడు. చూపులేని వారికి చూపు ఇచ్చి, క్షయ కలిగిన వానికి క్షయరహితునిగా చేసి, పాము కాటుకు గురైన వారికి క్రోధంతో ఉపశమనం, పొయ్యిలో పడుతున్న బిడ్డను సిద్ధ శక్తులతో తన చేయి కాల్చుకొని రక్షిచాడు. ఊదీతో నిండు చూలాలి ప్రాణాలు కాపాడాడు, ఎన్నో రోగాలనుండి ఉపశమనం కలిగించాడు. ఇలా అగణితం సాయి మహిమలు. దురాశతో దీపాలకు నూనెను ఇవ్వను అని చెప్పిన వ్యాపారి కళ్లు తెరిపించటానికి నీటితో దీపాలు వెలిగిస్తాడు సాయి. సబ్ కా మాలిక్ ఏక్ హై అని పైకి చూపేవాడు. తాను దైవమని ఎన్నడూ చెప్పలేదు. కానీ, తన పాదాల వద్ద గంగాయమునల ధారలను సృష్టించాడు. 

సాయి పొగడ్తలకు లొంగలేదు, మాటలకు అందలేదు. భక్తుల పాపాలను కడిగే పావన గంగలా అవతరించాడు. ఇస్లాం మతస్థుడైనా కబీరు రామభక్తుడు. ఆతని సిద్ధాంతమే తన మతంగా, ఫకీరుగానే ఉంటూ రామనవమి ఉత్సవాలను నిర్వహించాడు సాయి. జ్ఞాన చక్షువులు తెరచి చూస్తే అందరిలోను తానే ఉండి బ్రహ్మాండమంతా నిండి ఉన్న పరమాత్మే సాయి. 

ఈ భావాన్ని డాక్టర్ సి. నారాయణ రెడ్డి గారు ఈ గీతంలో ఎంతో రమ్యంగా, భక్తిపూరితమైన పదాలతో పొందుపరచారు. సాయి భక్తులకు నియమ నిష్ఠలకన్నా భక్తి విశ్వాసాలు ఆయుధాలు. ఆచారాల కన్నా శ్రద్ధ, ఓర్పు మార్గాలు. అదే భావాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని, సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని నారాయణ రెడ్డి గారు ఈ గీతంలో సంపూర్ణంగా వ్యక్తపరచారు. 

ఎస్. జానకి గారి గళంలో ఈ గీతం వినండి