30, ఆగస్టు 2020, ఆదివారం

సారసముఖి సకల భాగ్యదే - ముత్తయ్య భాగవతార్ కృతి

సారసముఖి సకల భాగ్యదే! శ్రీ చాముండేశ్వరి!

మారజనక సోదరి! మహిషాసుర మర్దిని!

హసిత వదనే! ఆర్ద్ర హృదయే! హరికేశ నిరతే సదయే!
రసికజన సమ్మోద రుచిరే! రాజేశ్వరి రక్షిసౌ!

కలువ వంటి ముఖము కలిగిన ఓ చాముండేశ్వరి! మాకు సమస్త భాగ్యములను ప్రసాదించుము! మన్మథుని తండ్రియైన శ్రీహరి సోదరీ! మహిషాసురుని సంహరించిన తల్లీ! మాకు సమస్త భాగ్యములను ప్రసాదించుము! చిరునవ్వు మోము, కరుణా హృదయము కలిగి, హరికేశుడైన పరమశివుని అర్థాంగివై దయ చూపే అమ్మవు! రసికుల హృదయాలకు ఆనందము కలిగించే రాజరాజేశ్వరివి. మమ్ములను రక్షింపుము.

ఇది క్షేత్ర కృతి. మైసూరు చాముండేశ్వరిని నుతిస్తూ వాగ్గేయకారులు ముత్తయ్య భాగవతార్ గారు రచించి గౌడ మల్హర్ రాగంలో స్వరపరచారు.

మైసూరు చాముండేశ్వరి వివరాలు:

క్రౌంచపురిగా పేరుగాంచిన మైసూరు ప్రాంతంలో చాముండి పర్వతశ్రేణిపై వెలసిన దుర్గ చాముండేశ్వరి. మహిషాసురుని ఈ కొండపై సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. 12వ శతాబ్దంలో హోయసళ రాజులు ఈ దేవాలయాన్ని నిర్మించగా తరువాత శతాబ్దంలో విజయనగర రాజులు దీనికి గోపురాన్ని కట్టించారు. 3000 అడుగుల ఎత్తున ఉన్న ఈ కొండపైకి 17వ శతాబ్దంలో వడయారు రాజులు మెట్ల మార్గాన్ని నిర్మించారు. 800వ మెట్టు వద్ద 16 అడుగుల ఎత్తైన నల్లరాతి నంది ఈ క్షేత్రానికి ఆకర్షణ. ఈ విగ్రహాన్ని మైసూరు మహారాజా దొడ్డదేవరాజ వడయార్ బహుకరించారు. అష్టాదశ శక్తిపీఠాలలో క్రౌంచ పీఠంగా పేరుగాంచిన ఈ క్షేత్రంలోని అమ్మవారిని మైసూరు వడయార్ పాలకులు కొలిచారు. ఇక్కడ దేవతామూర్తులు చాముండేశ్వరి, మహాబలేశ్వరుడు. ఈ చాముండి క్షేత్రాన్ని మహాబలాద్రిగా కూడా చరిత్రలో చెప్పబడింది. చతురస్రాకారంలో ద్రావిడ శైలిలో నిర్మించినబడిన ఈ దేవాలయంలో నవరంగ మంటపం, అంతరాళ మంటపం, గర్భగుడి ఉన్నాయి. అద్భుతమైన శిల్ప సంపదతో ఏడంచెల గోపురం ఈ గుడి ప్రత్యేకత. గణపతి, భైరవుడు మొదలైన దేవతామూర్తులు కూడా ఈ దేవాలయంలో ఉన్నాయి. గర్భగుడిలొ అష్టభుజములు కలిగిన మహిషాసుర మర్దిని రూపములో చాముండేశ్వరి అమ్మవారు దర్శనమిస్తారు. ఇక్కడ వడయార్ రాజుల విగ్రహాలు, అమ్మ వారి సింహవాహనం కూడా చూడవచ్చు. శరన్నవరాత్రులలో వేద పఠనంతో పాటు అమ్మకు వైభవంగా పూజలు చేస్తారు. ఆశ్వయుజ పౌర్ణమి నాడు అమ్మకు రథోత్సవం, తెప్పోత్సవం కన్నుల పండువగా జరుగుతాయి.

సారసముఖి సకల భాగ్యదేహి అనే కృతిని రంజని గాయత్రి సోదరీమణులు పాడారు.

వల్లీనాయక నీవే గతియని - ముత్తయ్య భాగవతార్ కృతి

వల్లీనాయక నీవే గతియని మనసారగ నమ్మినాను బ్రోవుము

తల్లి తండ్రి గురు దైవము నీవని తలచి నిన్ను సంతతము మ్రొక్కితి

సారమైన నీ మహిమలను పొగడు వారి కార్యము వహియింతువని నీ
చరణాబ్జంబుల చక్కగ బట్టితి షణ్ముఖ హరికేశపుర నివాస

ఓ వల్లీనాయకా! నీవే నాకు గతియని మనసారా నమ్మినాను నన్ను రక్షింపుము. నీవే తల్లి తండ్రి గురువు దైవమని తలచి నీకు నిత్యము మ్రొక్కినాను నన్ను రక్షింపుము. ఓ షణ్ముఖా! హరికేశపుర నివాసా!శ్రేష్ఠమైన నీ మహిమలను పొగడే వారి కార్యములను నిర్వర్తించెదవని నీ చరణ కమలములను చక్కగా శరణంటిని నన్ను రక్షింపుము.

షణ్ముఖప్రియ రాగంలో కూర్చబడిన కృతిని మల్లాది సోదరులు ఆలపించారు.

హిమగిరి తనయేహేమలతే - ముత్తయ్య భాగవతార్ కృతి


హిమగిరి తనయే! హేమలతే! అంబ! ఈశ్వరి! శ్రిలలితే! మామవ

రమా వాణి సంసేవిత సకలే! రాజరాజేశ్వరి! రామ సహోదరి!

పాశాంకుశేక్షుదండకరే! అంబ! పరాత్పరే! నిజ భక్త పరే!
ఆశాంబర హరికేశ విలాసే! ఆనంద రూపే! అమిత ప్రతాపే!

బంగారు తీగవలె ఉన్న ఓ పర్వతరాజ పుత్రీ! అంబా! ఈశ్వరీ! శ్రీలలితా! నన్ను రక్షింపుము. లక్ష్మీ సరస్వతులచే పూజించబడిన పరదేవతవు! రాజరాజేశ్వరివి! నారాయణుని సోదరివి! నన్ను రక్షింపుము. పాశము, అంకుశము,చెఱకు గడ ధరించిన అంబా! శ్రేష్ఠమైన వానిలో శ్రేష్ఠురాలవు! నిజ భక్తులకు ఆనందము కలిగించే దానవు! దిక్కులే అంబరములుగా గల పరమశివుని పత్నివి! సచ్చిదానంద స్వరూపవు! అమిత పరాక్రమవంతురాలవు! నన్ను రక్షింపుము.

శుద్ధ ధన్యాసి రాగంలో కూర్చబడిన ఈ కృతిని మాంబళం సోదరీమణులు ఆలపించారు.

శరవణ భవ! సమయమిదిరా - ముత్తయ్య భాగవతార్ కృతి


 

శరవణ భవ! సమయమిదిరా! సరగున నన్ను బ్రోవరా!

పరమ పురుష! పశుపతి ప్రియ! సుర సేవిత! సుకుమారా!

చిరునాడ నీ చింతన తోడను మరి మరి నీ మహిమ బల్కు నాదు
తరము దీర్ప తరుణమిదిరా హరికేశపుర ఆది నాయక!

రెల్లుగడ్డిలో జన్మించిన ఓ కుమారా! నన్ను బ్రోచుటకిది సమయము. శివునకు ప్రియకుమారుడవైన,దేవతలచే సేవించబడిన, సుకుమారుడవైన ఓ పరమ పురుషా! నన్ను బ్రోవుము. ఓ హరికేశపురమునకు అధినాయకుడవైన కుమారా! చిన్ననాటి నుండి నిన్నే స్మరించుచున్న వాడను. మరల మరల నీ మహిమలనే పలుకుచున్నాను. నన్ను ఈ సాగరాన్ని దాటించుకుటకు ఇది సమయము. వచ్చి బ్రోవుము.

కర్ణాటక సంగీత త్రయమైన త్యాగయ్య, దీక్షితులు, శ్యామశాస్త్రి తరువాత వాగ్గేయకారునిగా పేరొందిన వారిలో ముత్తయ్య భాగవతార్ గారు అగ్రగణ్యులు. 1877వ సంవత్సరంలో తమిళనాడులోని తిరునల్వేలిలో జన్మించిన వీరు పట్నం సుబ్రహ్మణ్య అయ్యరు గారి ప్రభావంతో సంగీత సాధనలో ముందుకు వెళ్లారు. సంస్కృతము, తెలుగు, తమిళము, కన్నడ భాషలలో ప్రావీణ్యులు వీరు. మదురై, మైసూరు, ట్రావెన్‌కోర్‌లలో జీవించిన వీరు సంగీతంలో అసమాన ప్రతిభ కలవారు. 1927 ప్రాంతంలో మైసూరు మహారాజ జయచామరాజ వడయార్ వారి ఆస్థానంలో విద్వాంసునిగా ఎంతో పేరొందారు. 1938లో ట్రావెన్‌కోర్ వెళ్లి స్వాతి తిరునాళ్ సంగీత అకాడెమీకి తొలి ప్రధాన అధ్యాపకునిగా పని చేశారు. మహారాజా స్వాతి తిరునాళ్ వారి కీర్తనలను స్వరపరచి ప్రచారంలోకి తీసుకు వచ్చారు. ఎన్నో కీర్తనలను రచించి 1945లో పరమపదించారు. వీరి ముద్ర ఇంటి పేరైన హరికేశనల్లూరులోని "హరికేశ". వీరి రచనలలో హిమగిరి తనయే హేమలతే, సుధామయి సుధానిధి, అంబ వాణి నన్నాదరించవే, గం గణపతే మొదలైనవి. వీరు కూడా ముత్తుస్వామి దీక్షితుల వారివలెనే సుబ్రహ్మణ్య స్వామిని ఉపాసన చేసిన వారు.

పశుపతిప్రియ రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని రంజని-గాయత్రి సోదరీమణులు గానం చేశారు.

జయ మహిషాసురమర్దిని - ముత్తయ్య భాగవతార్ కృతి


 

జయ మహిషాసురమర్దిని! శ్రితజన పాలిని!

జయజయేంద్ర పూజితే! జయ జయ జయ జగన్మాతే!

జయ జయ మధురిపు సోదరి జయ జయ శ్రీ శాతోదరి
జయ గణేశ గుహ జనని జయ జయ హరికేశ భామిని

ఆశ్రితులను రక్షించే తల్లి, మహిషాసుని సంహరించిన ఆదిపరాశక్తికి జయము జయము. ఇంద్రునిచే పూజించబడిన జగన్మాతకు జయము జయము. శ్రీహరి సోదరి, సన్నని కటిప్రదేశము కలది, గణపతి సుబ్రహ్మణ్యులకు జనని, పరమశివునికి రాణియైన జగన్మాతకు జయము జయము.

హంసధ్వని రాగంలో కూర్చబడిన ఈ కృతిని సులోచనా పట్టాభిరామన్ గారు ఆలపించారు

రామనామమత్యద్భుతం - భద్రాచల రామదాసు కీర్తన

అబ్బబ్బ రామనామమత్యద్భుతం
గొబ్బున యే భాగ్యశాలికబ్బునో శ్రీరామ నామం

సారహీన సంసార సాగరమీదే నామం
పారద్రోలు మున్నూటరువది పాప జాలం
చేరి పంచేంద్రియములన్ని చేరక పోద్రోలు నామం
ఘోరమైన యమదూతలను కొట్టెడు నామం రామ నామం

దిన దినమును జిహ్వకింపై తియ్యగనుండే నామం
ధన కనక వస్తువులు దయసేయు నామం
అనలు కొనలు నెక్కను శమాభివృద్ధి సేయు నామం
తనువును రెండనుచు మదిని తలపించు నామం

ముక్కంటి సతికి శాశ్వత ముక్తినిచ్చే రామ నామం
ఎక్కువైన వాల్మీకికి యెప్పుడనుష్థానం
ఒక్కసారి రామాయంటే ఓం భూ స్వాహా పాపములన్ని
మ్రొక్కి రెండుమారులంటే మోక్షమిచ్చే రామ నామం

దబ్బరాడు మన్మథుని దౌలనుంచు నామం
గొబ్బున మోహపాశముల కోసేటి నామం
మబ్బుదూది కొండవంటి మైబుట్టిన పాపములన్ని
అబ్బ మిణుగురువలె గాల్చునా రామ నామం

కామక్రోధలోభమోహ గర్వమడచే నామం
స్వామి భద్రాద్రీశుని తోడి సద్గతి నామం
నీమముతో పలికితేను నిత్యమోక్షపదవి నామం
రామదాసునేలినట్టి నామం శ్రీరామ నామం

అబ్బా! రామనామెంత అద్భుతమైనది! శీఘ్రముగ ఈ నామము అబ్బినవారు భాగ్యశాలురు. సారము లేని సంసార సాగరాన్ని దాటించేది, మూడువందల అరవై రకాల పాపములను పారద్రోలేది, పంచేంద్రియములకు అంటిన పాపములను పోగోట్టేది, భయానకమైన మృత్యుదూతలను తరిమి కొట్టేది ఈ రామ నామం. రోజురోజుకూ నాలుకకు మరింత తీయగా రుచించేది, సంపదలు, బంగారము, వస్తువులనొసగేది, కొండల శిఖరము వరకు ఎక్కేంతటి ఓర్పునిచ్చేది, దేహాన్ని మనసును పరమాత్మతో అనుసంధానం చేసేది రామ నామం. పార్వతీదేవికి శాశ్వతానందాన్నిచ్చేది, మహాత్ముడైన వాల్మీకికి నిత్యానుష్ఠానమైనది, ఒక్కసారి పలికితే పాపములన్నిటినీ దహించేది, నమస్కరించి రెండు మార్లు పలికితే మోక్షమిచ్చేది రామ నామం. మాయావి అయిన మన్మథుని ప్రభావాన్ని దూరం చేసేది (అనగా కామాన్ని అదుపులో ఉంచేది), వేగంగా మోహములు, భవబంధములనుండి ముక్తిని కలిగించేది, దూదికొండల వంటి శరీరములో పుట్టిన పాపములను మిణుగురు పురుగులా కనిపించేలా కాల్చేది రామనామం.కామక్రోధాధి అరిషడ్వర్గములను, గర్వమును అణచేది, భద్రాద్రీశ్వరుడైన రామునితో కూడి ఉండి సద్గతినొసగేది, నియమముతో పలికితే నిత్యము మోక్షపదవినిచ్చేది, భద్రాచల రామదాసును కాపాడినది శ్రీరామ నామం.

ధన్యాసి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని ఉన్నికృష్ణన్ గారు ఆలపించారు

కంటి నేడు మా రాముల - భద్రాచల రామదాసు కీర్తన

కంటి నేడు మా రాముల కనుగొంటి నేడు మా రాముల

కంటి నేడు భక్త గణముల బ్రోచు మా
ఇంటి వేలుపు భద్రగిరినున్న వాని

చెలువొప్పుచున్నట్టి సీతాసమేతుడై
కొలువు తీరిన మా కోదండరాముని

తరణికుల తిలకుని ఘననీలగాత్రుని
కరుణారసము గురియు కనుదోయి గలవాని

హురుముంజి ముత్యాల సరములు మెరయగ
మురిపెంపు చిరునవ్వు మోము గల్గినవాని

కరకు బంగారు చేల కాంతి జగములు గప్ప
శర చాపములు కేల ధరియించు స్వామిని

ధరణిపై శ్రీరామదాసునేలెడి వాని
పరమపురుషుడైన భద్రగిరి స్వామిని

మా రాముని నేడు కనుగొని కాంచినాను. భక్త సమూహములను బ్రోచే మా యిలవేలుపైన వాని, భద్రగిరిపైన వెలసిన శ్రీరాముని నేడు కాంచినాను. సీతాసమేతుడై ఎంతో అందముగా కొలువైయున్న కోదండరాముని నేడి కాంచినాను. సూర్యవంశతిలకుడు, నీలమేఘశ్యాముడు, కరుణారసమును కురిపించే కన్నులు కల శ్రీరాముని నేడు కాంచినాను. ఎర్రని కాంతి గల మేలైన ముత్యాల హారములతో మెరయుచు, మురిపించే చిరునవ్వు ముఖము కల శ్రీరాముని నేడు కాంచినాను. కరుకైన బంగారు వస్త్రముల కాంతి లోకాలను కప్పగా, ధనుర్బాణములు చేత ధరించిన స్వామిని నేడు కాంచినాను. ఈ భూమిపై రామదాసును బ్రోచేవాడు, పరమపురుషుడైన భద్రాద్రి రాముని నేడు కాంచినాను.

బౌళి రాగంలో కూర్చబడిన ఈ కృతిని శేషులత బృందం ఆలపించారు

ఇతడేనా ఈ లోకములో- భద్రాచల రామదాసు కృతి


 ఇతడేనా ఈ లోకములో గల పతితులనెల్లను పావనము చేయువాడు

పరిపూర్ణ కరుణచే బ్రహ్మాదుల గాచిన నరసింహుడైనట్టి నళినదళేక్షణుడు

ఇల లంకాపురమున అవనిజను బ్రోవ బలుడైన రావణుని పరిమార్చిన వాడు

అలనాడు ద్రౌపదికి అక్షయ వలువలు వలనొప్ప వొసగిన వైకుంఠ వాసుడు

ఈవేళ మునివరులు ఇతర చింతలు మాని కేవలము మది నుంచి కొలువుగాచెడి వాడు

ప్రేమను దయతోనాపన్నుల బ్రోచుచు రామదాసునేలు రామచంద్ర విభుడు

ఈ లోకములో ఉన్న పాపాత్ములను పావనము చేసేవాడు ఇతడేనా! పరిపూర్ణమైన కరుణతో బ్రహ్మాది దేవతలను కాపాడుటకు నరసింహావతారమునెత్తిన కలువల వంటి కన్నులు కలవాడు ఇతడే. ఈ భువిపై లంకానగరములో భూమిజయైన సీతను కాపాడుటకు బలవంతుడైన రావణుని సంహరించినవాడు ఇతదే. ఆనాడు ద్రౌపది మానరక్షణకై అక్షయముగా చీరలు ఎంతో ఒప్పుగా ఒసగిన వైకుంఠవాసుడితడే. ఈనాడు మునిశ్రేష్ఠులు ఇతర ఆలోచనలు మాని మనసులో నిలుపుకుని కొలిచెడి వాడు ఇతడే. ప్రేమతో దయతో ఆపన్నులను బ్రోచుచు రామదాసును కాపాడే రామచంద్ర ప్రభువు ఇతడే.

శ్రీరామ నామమే జిహ్వకు స్థిరమై యున్నది - భద్రాచల రామదాసు కృతి



శ్రీరామ నామమే జిహ్వకు స్థిరమై యున్నది
శ్రీరాముల కరుణయే లక్ష్మీకరమై యున్నది

ఘోరమైన పాతకములు గొట్టేనన్నది మమ్ము
జేరకుండ ఆపదలను చెండేనన్నది

దారి తెలియని యమదూతల తరిమేనన్నది శ్రీమ
న్నారాయణ దాసులకు చెలువై యున్నది

మాయావాదుల పొందు మానుమన్నది యీ
కాయమస్థిరమని తలపోయుచున్నది

వదలని దుర్విషయ వాంఛ వదలమన్నది నా
మదిలో హరి భజన సంపత్కరమై యున్నది

ముక్తి మార్గమునకిది మూలమన్నది వి
రక్తుడు భద్రాచల రామదాసుడన్నది

శ్రీరాముని నామమే నా నాలిక యందు స్థిరమైయున్నది. శ్రీరాముని కరుణయే నాకు సమస్త శుభకరమై యున్నది. ఆ రామనామమే ఘోరమైన పాపములను హరించేది, ఆపదలను దరి చేరనీయకుండా పారద్రోలేది, దారి తెలియకుండా ఉన్న యమదూతలను దరికి రానీయకుండా చేసేది, శ్రీహరి దాసులకు మహత్వమై యున్నది, మాయలలో మునిగితేలే వారి సాంగత్యము మానమని చెప్పేది, ఈ దేహము అస్థిరమని తెలియజేసేది, మనలను వదలని చెడు విషయాల పట్ల కోరికను వదలమని చెప్పేది, నా మనసులో హరిభజన రూపములో శ్రేయస్కరమై యున్నది, మోక్షమార్గానికి ఇది మూలమైనది, భద్రాచల రామదాసు అనురాగము లేని వాడని తెలిపేది.

అఠాణా రాగంలో కూర్చబడిన ఈ కృతిని మల్లాది సోదరులు మరియు బృందం ఆలపించారు.

దశావతార కృతులు - భద్రాచల రామదాసు కీర్తన

యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారతా
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే

ఎప్పుడెప్పుడైతే ధర్మానికి గ్లాని కలిగి అధర్మం పేత్రేగుతుందో, అప్పుడు నేను అవతరిస్తాను. దుష్టులను నాశనం చేసి సాధువులను రక్షించటం ద్వారా ధర్మ సంస్థాపన చేయుటకు ప్రతి యుగములోనూ నేను అవతరిస్తాను.

- శ్రీకృష్ణ భగవానుడు భగవ్దగీత నాలుగవ అధ్యాయం జ్ఞానయోగంలో.

ఈ కర్మభూమిపై జన్మించిన వాగ్గేయకారులు కొంతమంది శ్రీహరి దశావతారాలను ఆవిష్కరించే కృతులను రచించారు. వారిలో అన్నమాచార్యులు ప్రముఖులు. మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రామ బలరామ కృష్ణ కల్కి అవతారములను ఎన్నో కీర్తనలలో ఆయన నుతించారు. అదే విధంగా ఇతర దీక్షితుల వారు, భద్రాచల రామదాసు, స్వాతి తిరునాళ్ మొదలైన వారు ఇటువంటి సాహిత్యాన్ని మనకు అందించారు. కంచెర్ల గోపన్నగా జన్మించిన వాగ్గేయకారులు రామదాసు గారు రచించిన అటువంటిదే తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు అనే కృతి. రామదాసు కృతుల ప్రత్యేకత భజన సాంప్రదాయంలో ఉండటం. పల్లెలలో, వీథులలో, భజన బృందాలలో, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చక్కగా అందరూ పాడుకునే విధంగా ఉంటాయి. తక్కువేమి మనకు అనే కీర్తన ఆ కోవకు చెందినదే. భద్రాచల రామదాసు కీర్తనలను బాలమురళీకృష్ణ గారు, నేదునూరి కృష్ణమూర్తి గారు, మల్లాది సోదరులు మొదలైన సంగీత కళాకారులు ప్రచారంలోకి తీసుకు వచ్చారు. బాలమురళీకృష్ణ గారు ఓ నాలుగు దశాబ్దాల క్రితం పాడిన భద్రాచల రామదాసు కీర్తనలు అనే ఆల్బం ద్వారా ఈ కృతి తెలుగునాట బహుళ ప్రాచుర్యం పొందింది. అవతారాలను ప్రస్తావిస్తూ ఆ పరమాత్మ మన ప్రక్కనే యుండగా మనకింకేమి తక్కువ అన్న భావాన్ని రామదాసు ఈ కీర్తన ద్వారా అద్భుతంగా వ్యక్త పరచారు. మనకు కావలసినది ఆ శ్రీమనారాయణుని పట్ల పరిపూర్ణమైన విశ్వాసము, సర్వస్య శరణాగతితో కూడిన భక్తి. మిగిలినవన్నీ ఆయనే చూసుకుంటాడు అన్నది రామదాసు అంతరార్థం. బాలమురళి గారు అన్ని చరణాలను పాడలేదు, అయినా వారు ఆలపించినదే మధురంగా ఉంటుంది. విని ఆనందించండి.

తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు

ప్రక్క తోడుగా భగవంతుడు తన చక్రధారియై చెంతనె యుండగ

మ్రుచ్చు సోమకుని మును జంపిన యా
మత్స్యమూర్తి మన పక్షమునుండగ

సురల కొరకు మందరగిరి మోసిన
కూర్మావతారుని కృప మనకుండగ

దురాత్ముడా హిరణ్యాక్షు ద్రుంచిన
వరాహమూర్తి మనవాడై యుండగ

హిరణ్యకశిపుని ఇరుచెక్కలుగా
పరచిన నరహరి పక్కనె యుండగ

భూమి స్వర్గమును పొందుగ గొలిచిన
వామనుండు మనవాడై యుండగ

ధరలో క్షత్రియులను దండించిన
పరశురాముడు మన పాలిటనుండగ

దశగ్రీవు మును దండించిన యా
దశరథరాముని దయ మనకుండగ

ఇలలో యదుకుల మందుదయించిన
బలరాముడు మన బలమై యుండగ

దుష్ట కంసుని ద్రుంచినట్టి
శ్రీకృష్ణుడు మనపై కృపతో యుండగ

కలియుగాంతమున కలిగెడి దైవము
కలికి మనలను కావగనుండగ

రామదాసుని గాచెడి
శ్రీమన్నారాయణు నెరనమ్మి యుండగ

శ్రీ సరస్వతి నమోస్తుతే - ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి


శ్రీ సరస్వతి నమోస్తుతే వరదే పరదేవతే

శ్రీపతి గౌరీపతి గురుగుహ వినుతే విధి యువతే

వాసనాత్రయ వివర్జిత వర ముని భావిత మూర్తే
వాసవాద్యఖిల నిర్జర వర వితరణ బహు కీర్తే దర
హాసయుత ముఖాంబురుహే అద్భుత చరణాంబురుహే
సంసార భీత్యాపహే సకల మంత్రాక్షర గుహే

ఓ సరస్వతీ దేవీ! వరములనొసగే పరదేవతవు, విష్ణువు, శివుడు, సుబ్రహ్మణ్యునిచే నుతించబడేవు, బ్రహ్మకు పత్నివి, నీకు నమస్సులు. లోకవాసన, దేహవాసన, శాస్త్ర వాసనలను వర్జించిన మునిశ్రేష్ఠులచే భావించబడిన రూపానివి, ఇంద్రాది దేవతలచే ఉదారముగా వరములొసగే దేవతగా అనేక విధాల కీర్తించబడినావు, చిరునవ్వుతో కూడిన ముఖకమలము, అద్భుతమైన చరణకమలములు కలిగినదానవు, సంసార భీతులను తొలగించే తల్లివి, సకల మంత్రాక్షరముల రహస్యము నీవు, నీకు నమస్సులు.

ఆరభి రాగంలో కూర్చబడిన ఈ కృతిని సుధా రఘునాథన్ గారు ఆలపించారు


పరదేవతే భక్త పూజితే - ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి

పరదేవతే భక్త పూజితే భద్రం దేహి ఆశు మాం పాహి

చిరతర సంపత్ప్రద శ్రీ విద్యే చిదగ్ని కుండోదయ శుభ నిత్యే
హరిహయాది నుత గురుగుహ విదితే హిరణ్య మణిమయ మందిర స్థితే

పరదేవతగా భక్తులచే పూజించబడే ఓ పార్వతీదేవీ! నాకు రక్షణనొసగి శీఘ్రముగా కాపాడుము. శాశ్వత సంపదలనొసగే శ్రీవిద్యవు నీవు, చిదగ్ని కుండము నుండి ఉద్భవించి నిత్యము శుభములు కలిగించే తల్లివి, విష్ణువు, ఇంద్రాదులచే నుతించబడి సుబ్రహ్మణ్యునిచే గ్రహించబడినావు, రత్నములచే అలంకరించబడిన బంగారు మంటపములో స్థితమై యున్నావు, నాకు రక్షణనొసగి శీఘ్రముగా కాపాడుము.

రామచంద్రం భావయామి - ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి

 రామచంద్రం భావయామి రఘుకుల తిలకం ఉపేంద్రం

భూమిజా నాయకం భుక్తి ముక్తి దాయకం
నామ కీర్తన తారకం నరవరం గత మాయికం

సాకేత నగరే నివసంతం సామ్రాజ్య ప్రద హనుమంతం
రాకేందు వదనం భగవంతం రమణీయ కళ్యాణ గుణవంతం
కాకుథ్సం ధీమంతం కమలాక్షం శ్రీమంతం
నాకేశ నుతమనంతం నర గురు గుహ విహరంతం

రఘుకుల తిలకుడు, శ్రీహరి అయిన శ్రీరామచంద్రుని ధ్యానిస్తున్నాను. భూమిజయైన సీతాదేవి నాయకుడు, భుక్తిని ముక్తిని ప్రసాదించేవాడు, నామకీర్తనతో తరింపజేసేవాడు, నరవరుడు, మాయాతీతుడు అయిన శ్రీరామచంద్రుని ధ్యానించుచున్నాను. సాకేత నగరంలో నివసించేవాడు, హనుమంతునికి భక్తి సామ్రాజ్యాన్ని ఒసగిన వాడు, పూర్ణచంద్రుని వంటి ముఖము కలవాడు, భగవంతుడు, మనోజ్ఞమైన రూపము కలవాడు, శుభకరమైన గుణములు కలవాడు, కాకుథ్స కులమునందు జన్మించిన వాడు, కలువలవంటి కన్నులు కలవాడు, శ్రీమంతుడు, ఇంద్రునిచే నుంతించబడిన అనంతుడు, నరరూపములో గురుగుహుని మనసులో విహరించే వాడు అయిన శ్రీరామచంద్రుని ధ్యానించుచున్నాను.

వసంత రాగంలో కూర్చబడిన ఈ కృతిని గాయత్రి వెంకటరాఘవన్ గారు ఆలపించారు

మహాలక్ష్మి కరుణారస లహరి - ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి



మహాలక్ష్మి కరుణారస లహరి మామవ మాధవ మనోహరి శ్రీ

మహావిష్ణు వక్షస్థల వాసిని మహదేవ గురుగుహ విశ్వాసిని
మహాపాప ప్రశమని మనోన్మని మారజనని మంగళ ప్రదాయిని

క్షీరసాగర సుతే వేదనుతే క్షితీశాది మహితే సురహితే
భారతీ రతీ శచీ పూజితే భక్తి యుక్త మానస విరాజితే
వారిజాసనాద్యమర వందితే నారదాది ముని బృందానందితే
నీరజాసనస్థే సుమనస్థే సారస హస్తే సదా నమస్తే

శ్రీహరి మనోహరివైన ఓ మహాలక్ష్మీ! నాపై కరుణారసమును ప్రవహింపజేయుము. శ్రీమహావిష్ణు వక్షస్థలమున నివసించెదవు, శివుడు, కుమారస్వామి విశ్వసించే అమ్మవు, ఘోరపాపములను తొలిగించెదవు, నీ మనసు నిరంతరం పరమాత్మ భావనలో ఉంచెదవు, మన్మథునికి తల్లివి, సమస్త శుభములనొసగెదవు, నాపై కరుణారసమును ప్రవహింపజేయుము. సముద్రుని కుమార్తెవు, వేదములచే నుతించబడినావు, మహారాజులచే నుతించబడినావు, దేవతలకు హితురాలవు, సరస్వతి, రతీదేవి, శచీదేవిలచే పూజించబడినావు, భక్తుల మనసులలో నిలిచి ప్రకాశించెదవు, బ్రహ్మాది దేవతలకు పూజనీయురాలవు, నారదాది ముని సమూహమునకు ఆనందము కలిగించెదవు, కమలమున స్థిరమై యున్నావు, సహృదయములలో నిలచి యుండెదవు, కమలమును కరములో కలదానవు, ఎల్లప్పుడూ నీకు నమస్కరించెదను, నాపై కరుణారసమును ప్రవహింపజేయుము.

మాధవమనోహరి రాగంలో కూర్చబడిన ఈ కృతిని రంజని గాయత్రి సోదరీమణులు ఆలపించారు

నీరజాక్షి కామాక్షి - ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి


నీరజాక్షి కామాక్షి నీరద చికురే త్రిపురే

శారద రమా నయనే సారస చంద్రాననే
వారిజ పాదే వరదే తారయ మాం తత్వ పదే

గౌరీ హిందోళ ద్యుతి హీర మణిమయాభరణే
శౌరి విరించి వినుత శివశక్తిమయ నవావరణే
నారీమణ్యాద్యర్చిత నవనాథాంతఃకరణే
సూరి జన సంసేవిత సుందర గురుగుహ కరణే

ఓ కామాక్షీ! నీవు కలువల వంటి కన్నులు గల దానవు, నల్లని మేఘములు కురులు కల త్రిపురసుందరివి! లక్ష్మీ సరస్వతులను కన్నులుగ గలదానవు, శరదృతువులో చంద్రుని వంటి ముఖము కలదానవు, కమలముల వంటి పదములు కలిగి వరములనొసంగే తల్లివి, జ్ఞానమునొసగి నన్ను తరింపజేసెదవు! హిందోళ రాగములో నుతించబడే గౌరివి! వజ్రములు, మణులుతో పొదగబడిన ఆభరణములు ధరించినదానవు, విష్ణువు, బ్రహ్మలఏ నుతించబడినావు, శివశక్తిమయమై నవావరణములు కలిగిన శ్రీచక్రములో భాసిల్లుచున్నావు, నారీమణులచే అర్చించబడే తల్లివి, నవనాథుల అంతఃకరణములో నివసించేదానవు, పండితులచే పూజించబడేదానవు, సుందరుడైన సుబ్రహ్మణ్యునికి జననివి!

హిందోళ రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని రంజని గాయత్రి సోదరీమణులు ఆలపించారు.

పార్వతీ కుమారం భావయే - ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి

ముత్తుస్వామి దీక్షితుల వారు తిరుత్తణి సుబ్రహ్మణ్యుని ఉపాసనలో సిద్ధిపొందిన నాదయోగి. వారు ఇక్కడ వల్లీ దేవసేనా సమేత శక్తిధరుని అనుగ్రహం పొంది తన నాదోపసనలో అద్భుతమైన పురోగతిని పొందారు. దీక్షితుల వారు తిరుత్తణి క్షేత్రాన్ని సందర్శించినప్పుడు సుబ్రహ్మణ్యుడు వృద్ధుని రూపంలో మెట్లు దిగి వచ్చి తన చేతితో దీక్షితుల వారి నాలికపై ప్రసాదాన్ని తాకించి అదృశ్యమవుతాడు. ఆ అనుభవానికి ఆశ్చర్యపోయి, స్వామి అనుగ్రహాన్ని గ్రహించి దీక్షితుల వారు ఆ స్వామిపై ఎనిమిది కృతులను రచించారు. అవే తిరుత్తణి కృతులుగా పేరొందాయి. ఈ కృతుల పల్లవులన్నీ కూడా గురుగుహ పదంతో అలంకరించబడినవే. తిరుత్తణి కృతులనే కాదు, దీక్షితుల వారు మరెన్నో కృతులను కూడా సుబ్రహ్మణ్యస్వామి వైభవాన్ని తెలిపే విధంగా రచించారు. గురుగుహ అన్న పదాన్ని తన కృతులలో ముద్రగా ఉపయోగించారు. అంతటి సుబ్రహ్మణ్య ఉపాసకులు వారు. గురుగుహ అని స్వామిని సంబోధించటంలో దీక్షితుల వారి అంతరార్థం తనకు గురువుగా భావించటమే. ఆయన రచించిన సుబ్రహ్మణ్య కృతులలో ఒకటి పార్వతీ కుమారం భావయే. వివరాలు:

సాహిత్యం
=======

పార్వతీ కుమారం భావయే సతతం శరవణభవ గురుగుహ శ్రీ

మార్గసహాయ ప్రియసుతం మాధవాద్యమర సేవితం
మాణిక్య మకుట శోభిత మానిత గుణ వైభవం

భావం
=====

గురుగుహుడు, శరవణభవుడు (రెల్లుగడ్డిలో జన్మించిన వాడు), పార్వతీపుత్రుడైన కుమారస్వామిని ఎల్లప్పుడూ ధ్యానించెదను. విరించిపురంలో వెలసిన మార్గబంధీశ్వరుని ప్రియకుమారుడు, శ్రీహరి మొదలైన దేవతలచే సేవించబడిన వాడు, మాణిక్యములతో పొదిగిన కిరీటముతో శోభిల్లేవాడు, పొగడబడిన గుణవైభవములు కలవాడు అయిన కుమారస్వామిని ఎల్లప్పుడూ ధ్యానించెదను.

శ్రవణం
=======

నాటకురంజి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని బాలాజీ శంకర్ గారు  ఆలపించారు

ఆనందామృతాకర్షిణి - ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి


ఉపాసనా బలం ఎంత గొప్పదో తెలుసుకోవటానికి ఈ కర్మభూమిపై జన్మించిన అనేక మహనీయుల అద్భుత గాథలు చదవాలి. ఈ పుణ్యభూమిలో లోక కల్యాణార్థం తమ తపోశక్తిని ధారపోసిన సత్పురుషులలో వాగ్గేయకారులు కూడా ఉన్నారు. వారిలో ముత్తుస్వామి దీక్షితుల వారు ఒకరు. సుబ్రహ్మణ్య మరియు శ్రీవిద్యోపాసనలో భారతదేశంలోనే అగ్రగణ్యులుగా పేరొందిన దీక్షితుల వారు తమ సాధనలో భాగంగా అనేక క్షేత్రాలను సందర్శించి అక్కడ కొన్ని రోజులు గడుపుతూ తీవ్రమైన సాధన చేశారు. అలా ఒకసారి ఆయన తిరునల్వేలి వెళ్లి అక్కడ సాధన చేసుకోదలచారు. తిరునల్వేలిలో నెల్లియప్పార్ దేవాలయం చాలా సనాతనమైనది, సుప్రసిద్ధమైనది. అక్కడ పార్వతీదేవి రూపమైన కాంతిమతి అమ్మవారిని దీక్షితుల వారు అంతకు మునుపే ఉపాసన చేసి మంత్రసిద్ధి పొందారు. ఆయన మరల తిరునల్వేలి వెళ్లినప్పుడు అక్కడ కరువు వలన తామ్రపర్ణి నది ఎండిపోయి, ప్రజలు తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆయన నిత్యానుష్ఠానానికి కూడా ప్రవహించే నీరు దొరకని పరిస్థితి. ఆ కరువు యొక్క తీవ్రత చూసి చలించిన దీక్షితుల వారు కాంతిమతి అమ్మవారిని ఆర్తితో వర్షం కురిపించమని కృతి ద్వారా ప్రార్థించారు. అమృతవర్షిణి రాగంలో కూర్చబడిన ఈ కృతి సార్థకత పొంది, వెంటనే అమ్మవారు కరుణించి మూడు రోజుల పాటు తిరునల్వేలిలో సువృష్టి కురిపించిందట. సద్య సువృష్టి హేతవే త్వాం సంతతం చింతయే సలిలం వర్షయ వర్షయ వర్షయ అని దీక్షితుల వారు కాంతిమతి అమ్మవారిని నుతిస్తున్నప్పుడు ఆయనలోని ఆర్తి చూసినవారు నిశ్చేష్టులైపోయారట. ఎక్కడ లేని మబ్బులు రావటం, ఒకటి కాదు, రెండు కాదు, మూడు రోజులు ఏకధాటిన అమ్మ వర్షం కురిపించి అక్కడి ప్రజలను కరుణించటం దీక్షితుల వారి ఆధ్యాత్మిక యానంలో ఓ మహత్తరమైన ఘట్టం.

ఆనందామృతాకర్షిణి! అమృతవర్షిణి!
హరాది పూజితే! శివే! భవాని!

శ్రీనందనాది సంరక్షిణి!
శ్రీ గురుగుహ జనని! చిద్రూపిణి!
సానంద హృదయ నిలయే సదయే!
సద్య సువృష్టి హేతవే!
త్వాం సంతతం చింతయే అమృతేశ్వరి!
సలిలం వర్షయ! వర్షయ! వర్షయ!

భవుని అర్థాంగి అయిన ఓ పార్వతీ! నీవు అమృతమనే వర్షాన్ని కురిపించే తల్లివి, ఆనందమనే అమృతానికి కారణానివి, శివాది దేవతలచే పూజించబడిన అమ్మవు! లక్ష్మీ దేవి పుత్రుడైన మన్మథుని కాపాడిన తల్లివి, కుమారస్వామి జననివి, జ్ఞాన స్వరూపిణివి. సచ్చిదానందములో తన్మయులైన వారి హృదయములో నివసించే దేవతవు. నిశ్చయముగా నీవు మంచి వర్షములకు కారణానివి. అమృతేశ్వరివైన నిన్ను నేను ఎల్లప్పుడూ ధ్యానిస్తాను. మంచి వర్షాలు కురిపించు తల్లీ!

అమృతవర్షిణి రాగంలో కూర్చబడిన ఈ కృతిని అరుణా సాయిరాం గారు ఆలపించారు

మీనాక్షి మే ముదం దేహి - ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి


 

మీనాక్షి మే ముదం దేహి మేచకాంగీ రాజమాతంగీ

మానమాతృమేయే మాయే మరకతచ్ఛాయే శివజాయే
మీనలోచనీ పాశమోచనీ మానినీ కదంబవన వాసినీ

మధురాపురి నిలయే మణివలయే మలయధ్వజ పాండ్యరాజ తనయే
విధు విడంబన వదనే విజయే వీణాగాన దశగమక క్రియే
మధు మద మోదిత హృదయే మహాదేవ సుందరేశ ప్రియే
మధు ముర రిపు సోదరి శాతోదరి విధి గురు గుహ వశంకరి శంకరి

నల్లని శరీరము కలిగి, దశమహావిద్యలలో రాజమాతంగి రూపమైన ఓ మధుర మీనాక్షీ! నాకు ఆనందమును ప్రసాదించుము. నీవు చిత్స్వరూపిణివి, జ్ఞానమునకు మూలము, మాయాస్వరూపిణివి, పూజనీయురాలవు, మరకతము వలె ఆకు పచ్చని ఛాయకల దానవు, శివుని అర్థాంగివి, చేపలవంటి కన్నులు కలిగిన దానవు, భవబంధముల నుండి విముక్తి కలిగించే తల్లివి, మాన్యురాలవు, కదంబవనములో నివసించే అమ్మవు, నాకు ఆనందము కలిగించుము. మధురై నగరమును నివాసముగా కలిగిన దానవు, మణులతో పొదిగిన గాజులు ధరించిన దానవు, పాండ్యరాజైన మలయధ్వజుని కుమార్తెవు, చంద్రుని పోలిన ముఖము కలిగిన గౌరివి, వీణావాదనములో పది గమకముల ప్రక్రియను సృష్టించినదానవు, తేనెయొక్క తీయదనంతో ఆనందించే హృదయము కలదానవు, మహాదేవుని రూపమైన సుందరేశ్వరునికి ప్రియురాలవు, మధు మరియు మురాసురుల శత్రువైన శ్రీహరి సోదరివి, సన్నని నడుము కలదానవు, బ్రహ్మ మరియు కుమారస్వామికి అధిదేవతవు, సమస్త శుభములు కలిగించే తల్లివి, నాకు ఆనందమును కలిగించుము.

పూర్వీకల్యాణి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు ఆలపించారు

ఏకామ్రేశ నాయికే శివే - ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి


ఏకామ్రేశ నాయికే శివే శ్రీ కామాక్షి పాహి మాం

ఏకామ్రేశ గృహేశ్వరి శంకరి శాతోదరి సద్భక్త వశంకరి

కామహరణ మోహిత పూర్ణ ఫలే కామకలే విమలే కరకమలే
పామర జన పాలిని గురుగుహ జనని శుద్ధ సావేరీ నుత నందిని

కాంచీక్షేత్రంలో ఏకామ్రేశ్వరుని నాయిక, శివాని అయిన శ్రీ కామాక్షీ! నన్ను రక్షింపుము. ఏకామ్రేశ్వరుని పత్ని, శంకరి, కృశించిన ఉదర భాగం కల, సద్భక్తుల వశమై యుండెడి శ్రీ కామాక్షీ నన్ను రక్షింపుము. మన్మథుని హరించిన శివునిచే మోహింపబడిన, పూర్ణ ఫలములనొసగే, కామకళారూపిణియైన, నిర్మలమైన, చేతిలో కలువ కలిగిన, పామర జనులను పాలిచే, కుమారునికి జననియైన, శుద్ధ సావేరి రాగంలో నుతించబడిన, హైమవతిగా పేరొందిన శ్రీకామాక్షీ నన్ను రక్షింపుము.

శుద్ధ సావేరి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని నిత్యశ్రీ మహదేవన్ గారు ఆలపించారు.

శ్రీరాజరాజేశ్వరి త్రిపురసుందరి - ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి


 

శ్రీరాజరాజేశ్వరి త్రిపురసుందరి శివే పాహి మాం వరదే

నీరజాసనాది పూజితపరే నిఖిల సంశయ హరణ నిపుణతరే

శౌరి విరించ్యాది వినుత సకలే శంకర ప్రాణ వల్లభే కమలే
నిరతిశయ సుఖ ప్రదే నిష్కళే పూర్ణ చంద్రికా శీతలే విమలే
పరమాద్వైత బోధితే లలితే ప్రపంచాతీత గురుగుహ మహితే
సురుచిర నవరత్న పీఠస్థే సుఖతర ప్రవృత్తే సుమనస్థే

ఓ రాజరాజేశ్వరీ! త్రిపురసుందరీ! పరమశివుని అర్థాంగీ! వరములనొసగే తల్లీ! నన్ను కాపాడుము. బ్రహ్మాది దేవతలచే పూజించబడే పరదేవతవు, సమస్త సంశయములను నాశనము చేసే నైపుణ్యము కలదానవు నీవు. విష్ణువు, బ్రహ్మ మొదలైన వారిచే నుతించబడి అంతటా ఉన్నావు, కలువ వలె మనోహరముగా ఉన్న శంకరునికి ప్రియసతివి నీవు. నిరుపమానమైన సుఖమునొసగే నిష్కళంకవు, పూర్ణచంద్రుని వలె చల్లదనమునిచ్చే విమలవు నీవు. పరమోన్నతమైన అద్వైతాన్ని బోధించే లలితవు, ప్రపంచాతీతమైన మహిమ కలదానవని సుబ్రహ్మణ్యునిచే నుతించబడినావు నీవు. రమణీయమైన నవరత్న పీఠముపై స్థితమై సచ్చిదానందము కలిగిస్తున్నావు, నిర్మలమైన మనసులలో నివసిస్తున్నావు నీవు. నన్ను కాపాడుము.

పూర్ణచంద్రిక రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని అభిషేక్ రఘురాం గారు ఆలపించారు.


సౌందరరాజమాశ్రయే - ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి


సంగీతత్రయంలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితుల వారి క్షేత్ర కృతులలో సౌందరరాజమాశ్రయే అని బృందావన సారంగ రాగంలో కూర్చబడిన కృతి ఒకటి. ఇది తమిళనాడులోని నాగపట్టణంలో సౌందరవల్లీ సమేతుడై వెలసిన సౌందరరాజస్వామిపై రచించినది. ఈ క్షేత్రం వైష్ణవ సాంప్రదాయంలోని 108 దివ్యదేశములలో ఒకటి. 8వ శతాబ్దంలో చోళులు నిర్మించిన ఈ దేవాలయాన్ని పల్లవులు, తంజావూరు నాయకులు పోషించి మరల మరల పునరుద్ధరించారు. 90 అడుగుల రాజగోపురంతో, అద్భుతమైన శిల్పసంపద కలిగిన దేవస్థానం ఇది. ఇక్కడ వైఖానస సాంప్రదాయంలో లక్ష్మీనారాయణుల రూపంగా మూలవిరాట్టులను పూజిస్తారు. ఈ దేవస్థానం ప్రత్యేకత ఇక్కడ ప్రహ్లాదవరదుడైన నారసింహుడు అష్టభుజములతో అభయముద్రలో వెలసి ఉండటం. తంజావూరు నాయకులు ఈ దేవస్థానంలో అద్భుతమైన మంటపాలు నిర్మించారు.

సౌందరరాజమాశ్రయే గజ బృందావన సారంగ వరదరాజం

నంద నందన రాజం నాగపట్టణ రాజం
సుందరి రమా రాజం సురవినుత మహి రాజం
మందస్మిత ముఖాంబుజం మందరధర కరాంబుజం
నందకర నయనాంబుజం సుందరతర పదాంబుజం

శంబర వైరి జనకం సన్నుత శుక శౌనకం
అంబరీషాది వినుతం అనాది గురుగుహ ముదితం
అంబుజాసనాది నుతం అమరేశాది సన్నుతం
అంబుధి గర్వ నిగ్రహమనృత జడ దుఖాపహం
కంబు విడంబమాన కంఠం ఖండీకృత దశకంఠం
తుంబురు నుత శ్రీకంఠం దురితాపహ వైకుంఠం

గజారణ్యములో గజేంద్రుని రక్షించిన సౌందరరాజస్వామి నేను ఆశ్రయించియున్నాను. నందుని కుమారుడు, నాగపట్టణంలో వెలసిన ప్రభువు, సౌందర్యవతి అయిన లక్ష్మీదేవికి నాథుడు, దేవతలచే పొగడబడిన భూనాథుడు, చక్కని చిరునవ్వుతో పద్మము వంటి ముఖము కలవాడు, తన కరపద్మములతో మందరపర్వతాన్ని ఎత్తిన వాడు, కలువలవంటి కన్నులతో ఆనందం కలిగించేవాడు, సుందరమైన కలువల వంటి పాదములు కలవాడు అయిన సౌందరరాజస్వామి నేను ఆశ్రయిస్తున్నాను. శంబరుని వైరి అయిన మన్మంథునికి జనకుడు, శుకశౌనకాదులు, అంబరీషునిచే నుతించబడినవాడు, పుట్టుకలేని వాడు, కుమారస్వామికి ఆనందం కలిగించినవాడు,బ్రహ్మ, ఇంద్రాది దేవతలచే నుతించబడినవాడు, రామావతారంలో సముద్రుని గర్వాన్ని అణచినవాడు, అసత్యాన్ని, జడత్వాన్ని ఛేదించి దుఃఖాలను తొలగించేవాడు, శంఖమును మించిన సొగసున్న కంఠము కలవాడు, దశకంఠుని సంహరించినవాడు, తుంబురుడు నుతించిన శుభకరమైన కంఠము కలవాడు, పాపములను నాశనము చేసే వైకుంఠ స్వరూపుడైన సౌందరరాజస్వామిని నేను ఆశ్రయిస్తున్నాను.

కృతి విశేషాలు:

అద్భుతమైన యతిప్రాసలతో, పరిపూర్ణమైన భక్తి భావంతో అనుపమ సుందరరూపమైన సుందరరాజస్వామిని వర్ణించే కృతి ఇది. పల్లవిలో ద్వితీయాక్షర ఆది ప్రాసతో ఈ కృతి మొదలవుతుంది. రంగపుర విహార అని శ్రీరాముని వర్ణించిన దీక్షితుల వారు అదే రీతిలో, అదే రాగంలో ఈ కృతిని రచించారు. ఈ కృతి వింటుంటే అడుగడుగునా రంగపుర విహార సాహిత్యంతో సారూప్యం అవగతమవుతుంది. అద్భుతమైన ఉత్ప్రేక్షాలంకరములు, ద్వితీయాక్షర ప్రాసలు, రాజం, అంబుజం, కంఠం అన్న పదాలతో అంత్యప్రాసలు ఈ కృతికి ప్రత్యేక ఆకర్షణ. అటువంటి పదప్రయోగం వలన ఈ కృతి కర్ణోపేయమై ప్రకాశిస్తుంది. ప్రముఖ సంగీత శాస్త్రజ్ఞురాలు డాక్టర్ టీఎస్ సత్యవతి గారు కృతిని అద్భుతంగా వివరించారు. వీడీయో చూసి ఆనందించండి.

సిద్ధివినాయకం అనిశం - దీక్షితుల వారి కృతి


కర్నాటక సంగీత వాగ్గేయకారులు ముత్తుస్వామి దీక్షితుల వారి గొప్పతనం ఎంత చెప్పినా తక్కువే. ఆయన మన పండుగలు, వ్రతాల ప్రస్తావన తన కృతులలో చేశారు. అటువంటి కృతులలో ఒకటి సిద్ధి వినాయకం అనిశం అన్నది. షణ్ముఖప్రియ రాగంలో కూర్చబడిన ఈ కృతిలో వినాయక చతుర్థి ప్రస్తావన ఉంది. దీక్షితులవారి కృతులలో ప్రత్యేకతలు - రాగ ప్రస్తావన, ఆయా దేవతల తంత్రము, స్వరూపమును ప్రస్తావించటం. ఈ కృతిలో చామర అన్న పదంలో రాగ ప్రస్తావన చేశారు. షణ్ముఖప్రియ రాగానికి చామరం అని కూడా పేరుంది. అలాగే, మూలపంకజ మధ్యస్థం అని అనుపల్లవిలో ప్రస్తావించి మూలాధార చక్రములో నివసించే గణపతి రహస్యాన్ని తెలిపారు. మోదక హస్తం, పాశాంకుశ ధరం, చతుర్భుజం అన్న పదాల ద్వారా గణపతి స్వరూపాన్ని ఆవిష్కరించారు. అలాగే, వినాయకచవితి ప్రస్తావన, అద్రిరాజ సుతాత్మజం అని గణపతి ఆవిర్భావం, రౌహిణేయనుజార్చితం అన్న పదం ద్వారా శ్రీకృష్ణునిచే పూజించబడిన వాడని శమంతకోపాఖ్యానం గురించి ప్రస్తావించారు. ఈ విధంగా మొత్తం గణపతి తత్త్వాన్ని దీక్షితుల వారు ఈ కృతి ద్వారా మనకు అద్భుతంగా తెలియజేశారు. వినాయకచవితి సందర్భంగా ఈ కృతి సాహిత్యం, భావం.

సిద్ధి వినాయకం అనిశం చింతయామ్యహం ప్రసిద్ధ గణనాయకం విశిష్టార్ధ దాయకం వరం

సిద్ధ యక్ష కిన్నెరాది సేవితమఖిల జగత్ప్రసిద్ధ మూల పంకజ మధ్యస్థం మోదక హస్తం

భాద్రపద మాస చతుర్ధ్యాం బ్రాహ్మణాది పూజితం పాశాంకుశ ధరం ఛత్ర చామర పరివీజితం
రౌద్రభావ రహితం దాస జనహృదయ విరాజితం రౌహిణేయానుజార్చితం ఈషణ వర్జితం
అద్రిరాజ సుతాత్మజం అనంత గురుగుహాగ్రజం భద్రప్రద పదాంబుజం భాసమాన చతుర్భుజం

గణాధిపతిగా ప్రసిద్ధుడై విశిష్టమైన ఫలములనొసగే సిద్ధి వినాయకుని నేను ఎల్లప్పుడూ ధ్యానించుచున్నాను. సిద్ధులు, యక్షులు, కిన్నెరులు మొదలైన వారిచే పూజించబడేవాడు, జగత్ప్రసిద్ధుడైనవాడు, మూలాధార చక్రములో నాలుగు దళముల పద్మములో స్థితుడైనవాడు, చేతిలో మోదకము కలిగిన సిద్ధి వినాయకుని నేను ఎల్లప్పుడూ ధ్యానించుచున్నాను. భాద్రపద శుద్ధ చతుర్థి నాడు బ్రాహ్మణులచే పూజించబడేవాడు, పాశము, అంకుశము ధరించినవాడు, ఛత్ర చామరములచే వీచబడేవాడు, రౌద్ర భావము లేనివాడు, భక్తుల హృదయములలో వెలసి ఉండేవాడు, బలరాముని సోదరుడైన కృష్ణునిచే పూజించబడినవాడు, రాగమును త్యజించినవాడు, హిమవంతుని కుమార్తె అయిన పార్వతి పుత్రుడు, నాశనము లేనివాడు, సుబ్రహ్మణ్యుని అగ్రజుడు, రక్షణనొసగే పాదపద్మములు కలిగినవాడు, నాలుగు హస్తములతో ప్రకాశించే సిద్ధివినాయకుని నేను ఎల్లపుడూ ధ్యానించుచున్నాను.

షణ్ముఖప్రియ రాగంలో కూర్చబడిన ఈ కృతిని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు ఆలపించారు

శ్రీ దుం దుర్గే శివ సంసర్గే - ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి

ప్రముఖ వాగ్గేయకారులలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితుల వారు దుర్గాదేవిని శ్రీరంజని రాగంలో తిరువారూరు సమీపంలోని కధిరమంగళం వనదుర్గామాతను కొనియాడుతూ ఓ అద్భుతమైన కృతిని రచించారు. ఈ కృతి దుర్గాదేవి మూల మంత్రం యొక్క బీజాక్షరాలతో ఆరంభమవుతుంది. ముత్తుస్వామి దీక్షితుల వారు సిద్ధపురుషులు. మంత్రసాధన చేసి, అమ్మను దర్శించి ఎన్నో కృతులను రచించారు. ఇది కూడా అటువంటిదే. దాని వివరాలు:

శ్రీ దుం దుర్గే శివ సంసర్గే చిద్రస వర్గే స్థిరే ఆపవర్గే శ్రీ వనదుర్గే

దుందుభి వాద్య భేద నాద వినోదిని
మోదిని వీణా వాదిని సంవేదిని అభేదిని
సుందరి శ్రీరంజని నిరంజని జయ జనని

కరుణారసాలయే కలికల్మష విలయే
కర విధ్రుత కువలయే కానన నిలయే
చరణ కిసలయే చామీకర వలయే
స్వర సంగీత లయే సురుచిర మలయే
గురుగుహోదయే సదయే విజయే అభయే
సరసమయే షట్సమయే సమయే కలయే

ఓ వనదుర్గా మాతా! శివుని సహచారిణీ! సచ్చిదానంద స్వరూపిణీ! శాశ్వతమైన సుఖాలను ప్రసాదించే తల్లీ! వివిధరకములైన వాద్యముల నాదములతో ఆనందించే తల్లీ! వీణావాదనము చేసే తల్లీ! నీవు సర్వాంతర్యామివి! భేదింప శక్యము కావు! మనోజ్ఞమైన రూపము కలదానవు! శ్రీమహాలక్ష్మిని అలరించే తల్లీ! దోషరహితవు! అమ్మా! నీకు జయము! కరుణకు నిలయము నీవు, ఈ కలిదోషాలను హరించే తల్లివి, చేతిలో వికసించిన కమలము కలదానవు, అడవులలో నివసించే తల్లివి! చిగురులవలె మృదువైన పాదములు కల తల్లివి! స్వర్ణకంకణములు ధరించిన మాతవు! కార్తికేయుని తల్లివి! దయామూర్తివి, విజయవు, మాకు అభయమునిచ్చే తల్లివి! మృదువైన స్వభావము కల అమ్మవు! ఆరు మతములకు మూలము మరియు కాలానివి నీవు! అంతటా ఉన్న అమ్మవు!

దీక్షితుల వారి సాహిత్యంలో ఉండే దేవతా వైభవం మహోన్నతమైనది. పూర్తిగా దేవతానుగ్రహం పొంది, ఆ దేవతా స్వరూపంతో అనుసంధానమై ఆయన సంకీర్తనలను రచించారు. అందుకే ఆయన రచనలలో పరిపూర్ణత్వం కనబడుతుంది. ప్రస్తుత కాలంలో వనదుర్గ ఆలలయాలు దక్షిణ భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తాయి. కానీ, మన సనాతన వాఙ్మయం ఈ వనదుర్గ మన కర్మభూమిలో అంతటా కొలువబడినదని చెబుతున్నాయి. తమిళనాడులోని కధిరమంగళం, తెలంగాణాలోని ఏడుపాయల, కర్ణాటకలోని దేంతడ్క, కేరళలోని పోయిల్కవే మొదలైన ప్రాంతాలలో వనదుర్గ వైభవంగా కొలువబడుతోంది. ఈ క్షేత్రాలు మహిమాన్వితమైనవి.

ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి | తన్నో దుర్గిః ప్రచోదయాత్ ||

కాత్యాయనీ దేవిని తెలుసుకుందాము. దాని కోసం ఆ కన్యకుమారి యైన దుర్గాదేవిని ధ్యానిద్దాం. ఆ దుర్గాదేవి మనకు ప్రేరణ నిచ్చుగాక! శ్రీరంజని రాగంలో కూర్చబడిన ఈ కృతిని బాలమురళీకృష్ణ గారు ఆలపించారు

ముత్తుస్వామి దీక్షితుల వారు - గురువులు చిదంబరనాథ యోగీంద్రులు



సంగీతత్రయంలో ఒక్కరైన ముత్తుస్వామి దీక్షితుల వారి తండ్రి గారి పేరు రామస్వామి దీక్షితులు. వీరు సంగీతకారులుగా, శాస్త్రజ్ఞులుగా ఎంతో పేరు పొంది తంజావూర్ మహారాజా వారి ఆదరం పొందారు. తంజావూరు సమీపంలోని తిరువారూరు (సద్గురువులు త్యాగరాజస్వామి వారి జన్మస్థలం) త్యాగరాజస్వామి వారి దేవస్థానంలో నాదస్వర కచేరీలు చేయటానికి రామస్వామి దీక్షితుల వారిని నియమించారు. కర్ణాటక సంగీతంలో ప్రఖ్యాతమైన రాగం హంసధ్వనిని కనిపెట్టింది రామస్వామి దీక్షితుల వారే. ఈ రామస్వామి దీక్షితుల వారు చిదంబరనాథస్వామి అనే సన్న్యాసి వద్ద శ్రీవిద్యా ఉపదేశమును పొందారు. ఎన్నో ఏళ్లు రామస్వామి-సుబ్బలక్ష్మి అమ్మాళ్ దంపతులకు సంతానం కలుగకపోవడంతో వారి వైదీశ్వరన్ కోయిల్ వెళ్లి అక్కడ బాలాంబికాదేవికి ఆగమోక్తంగా నవావరణ పూజలు, భజనలు చేస్తూ మండల దీక్ష చేశారు. 40వ దినమున రాత్రి రామస్వామి దీక్షితుల వారికి స్వప్నములో అమ్మవారు స్వప్నసాక్షాత్కారమిచ్చి ముత్యాలహారాన్ని ప్రసాదించింది. ఎంతో సంతోషించి ఆ దంపతులు తిరిగి తిరువారూరుకు వచ్చారు. 1776వ సంవత్సరం మార్చి 24న కృత్తికా నక్షత్రములో తిరువారూరు త్యాగరాజస్వామి వారికి వసంతోత్సవములు జరుగుతుండగా ఆ దంపతులకు పుత్రసంతానం కలిగింది. బాలాంబిక అనుగ్రహంతో కృత్తికా నక్షత్రములో జన్మించాడు కాబట్టి ఆ బాలునికి కార్తికేయుని నామంగా వారు ముత్తుకుమారస్వామి దీక్షితులు అని నామకరణం చేశారు.


ఆ తరువాత కొంతకాలానికి రామస్వామి దీక్షితుల వారు చెన్నై సమీపంలోని మణలి సంస్థానం వారి వద్ద సంగీత విద్వాంసులుగా పనిచేయటానికి తరలి వెళ్లారు. అక్కడికి ఒకసారి వారి శ్రీవిద్యా గురువైన చిదంబరనాథ యోగీంద్రులు వచ్చారు. వారికి రామస్వామి దీక్షితుల వారు, ఆయన కుమారులు నిరంతర శుశ్రూష చేశారు. యోగీంద్రులు రామస్వామి దీక్షితులతో తన కామ్యమొకటి తీర్చమని కోరారు. ఏమిటో తెలుపమని రామస్వామి దీక్షితుల వారు అభ్యర్థించగా "నీ కుమారుడైన ముత్తుస్వామిని నాతో కాశీయాత్రకు పంపండి" అని వారు కోరారు. దానికి రామస్వామి వారు కొంత జంకగా మణలి జమీందారు వెంకటకృష్ణ మొదలియార్ గారు వారికి రామాయణంలో దశరథుడు-విశ్వామిత్రుడు-రామలక్ష్మణుల వృత్తాంతాన్ని గుర్తుచేసి యోగుల వెంట కుమారుడిని పంపమని చెప్పగా రామస్వామి దీక్షితుల వారు అంగీకరించి పంపారు.

ఆ చిదంబరనాథ యోగీంద్రులు అప్పట్లో ఎంతో ప్రసిద్ధులు. దేశమంతటా ఆయనకు శిష్యులుండేవారు. కాశీలో యోగీంద్రులు ముత్తుస్వామి దీక్షితుల వారికి శ్రీవిద్యోపదేశం చేశారు. అలాగే యోగాభ్యాసము కూడా నేర్పించారు. శంకరభగవత్పాదుల అద్వైత సిద్ధాంత గ్రంథాలను శ్రవణము చేయించారు. కాశీలో దీక్షితుల వారి దినచర్య చాలా కఠినతరంగా జరిగింది. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి గంగాస్నానం చేసి, యోగాభ్యాసము, అనంతరం శ్రీవిద్యార్చన చేసి యోగీంద్రుల వద్ద వేదాంత శ్రవణం చేశారు. తరువాత కాశీ విశ్వేశ్వరుడు, విశాలాక్షి, అన్నపూర్ణ దేవాలయాలకు వెళ్లి దర్శనం చేసుకునే వారు. అప్పుడు యోగీంద్రుల వారు శ్రీచక్రార్చన చేస్తున్నప్పుడు వేదం పఠించటం, శాస్త్రీయ సంగీత జ్ఞానం చేయటం, వీణావాదనం చేయటం నిత్యవిధి. సాయంత్రం మరల దేవాలయ దర్శనం, వేద సంగీతాభ్యాసం, భజనలు. ఈ విధంగా కొన్నేళ్లు గడిచాయి.


ఒకరోజు చిదంబరనాథ యోగీంద్రులు దీక్షితుల వారిని అన్నపూర్ణాంబిక దేవాలయానికి తోడ్కొనివెళ్లి ఆదేవికి దీక్షితులవారిపై పరిపూర్ణమైన అనుగ్రహం కలిగినదని, ఆ తల్లి ఆతని కాపాడి తుదకు మోక్షము కూడా ఇస్తుందని, ఆమెను జీవితాంతం పూజించమని చెప్పారు. మరునాడు ప్రాతఃకాలమున దీక్షితులవారు గంగాస్నానం చేయుటకు వెళ్లే సమయంలో యోగీంద్రులు వారితో "మనం విడిపోయే సమయమాసన్నమైంది. నీవు స్వస్థలానికి వెళ్ళి తల్లిదండ్రులను, సోదరులను కలుసుకో" అని చెప్పి "గంగానదిలో దిగినప్పుడు నాలుగైదు అడుగులు వేసి అక్కడ నీకాలికేమి తగిలితే దానిని తీసుకుని రా" అని ఆజ్ఞ ఇచ్చారు. దీక్షితుల వారికి గంగానదిలో వీణ దొరికింది. దానిపై దేవనాగరిలో "రామ" అని రాసి ఉంది. దానిని తీసుకువచ్చి దీక్షితుల వారు యోగీంద్రులకిచ్చారు. యోగీంద్రులు ఆ వీణను తన ఆశీస్సులతో మరల దీక్షితులవారికిచ్చి "ఇది గంగాదేవి అనుగ్రహ ప్రసాదము. నువ్వు చాలా గొప్ప వైణికుడవు కాగలవు" అని ఆశీర్వదించారు. అవే ఆయన చివరి మాటలు. యోగీంద్రులు గంగానదిలో మునిగి ప్రాణత్యాగం చేశారు. ఆయన దేహాన్ని దీక్షితులవారు హనుమాన్ ఘాట్‌లో సమాధిచేశారు. అక్కడ దీక్షితుల వారు స్థాపించిన లింగం ఇప్పటికీ ఉంది. గంగానదీ జలాలలో లభించిన వీణ నేటికీ దీక్షితుల వారి వంశీకుల వద్ద ఉంది.

ఇదీ ముత్తుస్వామి దీక్షితుల వారు-చిదంబరనాథ యోగీంద్రుల అద్భుత వృత్తాంతం.

(చిత్రాలు దీక్షితుల వారికి గంగానదిలో లభించిన వీణ, కాశీలోని చిదంబరనాథ యోగి సమాధి)

సరసిజనాభ సోదరి - ముత్తుస్వామి దీక్షితుల వారు

సరసిజనాభ సోదరి! శంకరి! పాహిమాం!

వరదాభయ కరకమలే! శరణాగత వత్సలే!

పరంధామ ప్రకీర్తితే! పశుపాశ విమోచితే!
పన్నగాభరణయుతే! నాగగాంధారీ పూజితాబ్జపదే!
సదానందితే! సంపదే! వర గురుగుహ జనని! మదశమని!
మహిషాసురమర్దిని! మందగమని! మంగళవరప్రదాయిని!

కమలము నాభియందు గల విష్ణు సోదరియైన శంకరి! నీవే నాకు శరణు. వరద, అభయ ముద్రలతో కలువల వంటి కరములు కలిగి శరణు కోరిన వారి పాలిట వాత్సల్యము కలిగిన శంకరి! నీవే నాకు శరణు. శ్రీహరిచే నుతించబడి, జీవులకు బంధనాల నుండి విముక్తి కలిగించే, నాగాభరణుడైన శివునితో యుండే, నాగగాంధారి రాగంలో నుతించబడిన చరణకమలములు కలిగిన, ఎల్లప్పుడూ ఆనందములో నుండి సంపదలకు రూపమైన, గురుగుహుడైన సుబ్రహ్మణ్యునికి జననియైన, దుష్టుల మదమును అణచివేసే, మహిషాసురుని సంహరించిన, నిదానముగా నడచే, శుభకరమైన వరములను ప్రసాదించే శంకరి! నీవే నాకు శరణు.

నాగగాంధారి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని నిషా రాజగోపాలన్ గారి ఆలపించారు.

సూర్యమూర్తే నమోస్తుతే - ముత్తుస్వామి దీక్షితుల వారు

సూర్యమూర్తే నమోస్తుతే సుందర ఛాయాధిపతే

కార్య కారణాత్మక జగత్ప్రకాశ సింహ రాశ్యాధిపతే
ఆర్య వినుత తేజః స్ఫూర్తే ఆరోగ్యాది ఫలద కీర్తే

సారస మిత్ర మిత్ర భానో సహస్ర కిరణ కర్ణ సూనో
క్రూర పాపహర కృశానో గురుగుహ మోదిత స్వభానో
సూరిజనేడిత సుదినమణే సోమాదిగ్రహ శిఖామణే
ధీరార్చిత కర్మ సాక్షిణే దివ్యతర సప్తాశ్వ రధినే
సౌరాష్ట్రార్ణ మంత్రాత్మనే సౌవర్ణ స్వరూపాత్మనే
భారతీశ హరిహరాత్మనే భక్తి ముక్తి వితరణాత్మనే

సుందరుడు, ఛాయాదేవి పతి అయిన సూర్యమూర్తికి నమస్సులు. కార్యము, కారణము అయినవాడు, జగత్తును ప్రకాశింపజేశేవాడు, సింహరాశికి అధిపతి, ఆర్యులచే నుతించబడిన వాడు, తేజో స్ఫూర్తి అయిన వాడు, ఆరోగ్యము మరియు ఇతర శుభఫలములు ప్రసాదించే వాడు, కీర్తిమంతుడు అయిన సూర్యమూర్తికి నమస్సులు. కమలానికి మిత్రుడు, మిత్ర నామధేయుడు, సహస్ర కిరణములు కర్ణములుగా కల భానుమూర్తి, క్రూరమైన పాపములను హరించే వాడు, అగ్నిరూపుడు, స్వప్రకాశుడైనవాడు, సుబ్రహ్మణ్యునికి ఆనందం కలిగించే వాడు అయిన సూర్యమూర్తికి నమస్సులు. జ్ఞానులచే నుతించబడిన వాడు, రోజునకు మణి వంటి వాడు, చంద్రుడు మొదలైన గ్రహములలో శ్రేష్ఠుడు, ధీరులచే అర్చించబడిన వాడు, కర్మలకు సాక్షియైన వాడు, దివ్యమైన సప్తాశ్వములతో కూడిన రధమును అధిరోహించినవాడు అయిన సూర్యునికి నమస్సులు. సౌర అష్ట వర్ణ మంత్ర స్వరూపుడు, బంగారు కాంతి కలవాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఆత్మ అయిన వాడు, భక్తిని, ముక్తిని ప్రసాదించే వాడు అయిన సూర్యమూర్తికి నమస్సులు.

సౌరాష్ట్ర రాగంలో కూర్చబడిన ఈ కృతిని బాంబే జయశ్రీ రామనాథ్ మరియు శిష్యులు ఆలపించారు

బాగాయనయ్యా నీ మాయలెంతో - సద్గురువులు త్యాగరాజస్వామి


 

బాగాయనయ్యా నీ మాయలెంతో బ్రహ్మకైన కొనియాడ తరమా?

ఈ గారడములనొనరించుచును నే గాదనుచు బల్కేదియును

అలనాడు కౌరవులనణచమన అలరి దోసమనే నరుని జూచి పాప
ఫలము నీకు తనకు లేదని చక్కగ పాలనము సేయలేదా త్యాగరాజనుత!

ఓ శ్రీకృష్ణా! బ్రహ్మకు కూడా పొగడుటకు తరము కాని నీ మాయలెంతో బాగున్నవయ్యా! ఈ మాయలన్నీ నీవే చేస్తూ నేను కాదని పలికేవు. ఆ నాడు కురుక్షేత్రములో కౌరవులను నాశనం చేయమని చెప్పగా ఆ అర్జునుడు అది దోషమని దుఃఖించగా, తనకు పాపము కలుగదు కర్మఫలము నాది అని చక్కగా కర్తవ్యబోధ చేయలేదా! ఇటువంటి నీ మాయలు బ్రహ్మకు కూడా కొనియాడ శక్యము కానివి.

చంద్రజ్యోతి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని బాలమురళీకృష్ణ గారు ఆలపించారు.

మాకేలరా విచారము - సద్గురువులు త్యాగరాజస్వామి


మాకేలరా విచారము? మరు గన్న శ్రీ రామచంద్ర!

సాకేత రాజ కుమార! సద్భక్త మందార! శ్రీకర!

జత కూర్చి నాటక సూత్రమును జగమెల్ల మెచ్చగ కరము నిడి
గతి తప్పకనాడించేవు సుమ్మీ! నత త్యాగరాజ! గిరీశ వినుత!

మదనుని జనకుడవైన శ్రీరామా! నీవుండగా మాకు విచారమేల? సాకేతపురానికి రాజకుమారుడవైన శ్రీరామా! నీవు సద్భక్తుల పాలిట కల్పవృక్షానివి! సమస్త శుభములు కల్గించేవాడవు, నీవుండగా మాకు విచారమేల? ఈ జగన్నాటకము యొక్క సూత్రములను కూర్చి చేత ధరించి లయ తప్పకుండా ఆడించెదవు సుమా! త్యాగరాజునిచే, పరమశివునిచే నుతించబడిన శ్రీరామా! నీవుండగా మాకు విచారమేల?

రవిచంద్రిక రాగంలోని ఈ కృతిని బాంబే జయశ్రీ రామనాథ్ గారు గానం చేశారు.

బాలమురళీకృష్ణ గారు - త్యాగరాజ శిష్యపరంపర


ఏవండీ బాలమురళి గారు త్యాగరాజ శిష్యపరంపర వారెలా అయ్యారు? ఆ రహస్యం ఆయనే చెప్పారు.

త్యాగరాజస్వామి (1767-1847) వారి బంధువు, వారి శిష్యుడు ఆకుమడుగుల (మానాంబుచావడి) వేంకట సుబ్బయ్య గారు (1803-1862) త్యాగయ్యతో ఎన్నో ఏళ్లు కలిసి తిరువాయూరులో జీవించారు. వీరు త్యాగరాజస్వామి ఆలపించిన కృతులను స్వరాలతో అప్పటికప్పుడు వ్రాశారు. వీరి సంగతి తెలుసుకున్న సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి గారు (1860-1917, సినిమా సుసర్ల దక్షిణామూర్తి గారు కాదు). ఆంధ్ర నుండి తిరువాయూరు వెళ్లి వారి ఆశీర్వాదం కోరారు. వారి శ్రీమతికి తన కోరికను విన్నవించారు. దాదాపు ఎనిమిది నెలల తరువాత వేంకటసుబ్బయ్య గారు దక్షిణామూర్తి గారిని అనుగ్రహించి ఆశీర్వదించారు. "నేను ఇంకొన్నాళ్లలో మరణిస్తాను, తరువాత వచ్చి నా భార్యను అడిగి కృతుల సాహిత్యం తీసుకు వెళ్లు" అని తెలిపారు. అలా త్యాగరాజస్వామి వారి సాహిత్యం ఆంధ్ర దేశానికి వచ్చింది. ఆ దక్షిణామూర్తి గారి శిష్యులు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారు (1883-1951). వారి శిష్యులు బాలమురళీకృష్ణ గారు (1930-2016). ఆ విధంగా 750 త్యాగయ్య కృతులు మనకు వారి ద్వారా అందాయి.

కాబట్టి, బాలమురళి గారు ఆలపించే రీతి, ఆయన గానం చేసిన త్యాగయ్య కృతుల సాహిత్యం సద్గురువుల వారి మూలాలను ప్రతిబింబిస్తాయి అన్నది మనం గ్రహించాలి. వీలైనంత దానిని అనుసరిస్తే త్యాగయ్య సాహిత్యాన్ని, స్వరాలను కాపడినట్లే. 

తెలిసి రామ చింతనతో - సద్గురువులు త్యాగరాజస్వామి



తెలిసి రామ చింతనతో నామము సేయవే ఓ మనసా!

తలపులన్ని నిలిపి నిమిషమైన తారకరూపుని నిజతత్త్వములను

రామా యన చపలాక్షుల పేరు కామాదులకోరువారు వీరు
రామా యన బ్రహ్మమునకు పేరు ఆ మానవ జననార్తులు దీరు

అర్కమనుచు జిల్లెడు తరు పేరు మర్కట బుద్ధులెట్లానేరు
అర్కుడనుచు భాస్కరునకు పేరు కుతర్కమనే అంధకారము తీరు

అజమనుచును మేషమునకు పేరు నిజకోరికలేలాగీడేరు
అజుడని వాగీశ్వరునకు పేరు విజయము గల్గును త్యాగరాజనుతుని

భావము:

ఓ మనసా! శ్రీరాముని స్మరించే ముందుగా రామ అనే పదానికి అర్థం తెలుసుకొని, ఆ తరువాత భావం, అంతరార్థం, రాముని తత్త్వము, రాముని మహిమ, రామాయణము, రాముని అవతారము మొదలైనవన్నిటిని తెలిసి అప్పుడు రామచింత ప్రారంభించు అప్పుడే నీకు ముక్తికి అర్హత కలుగుతుంది. రామ మంత్రాన్ని స్మరించే ముందు నీ ఆలోచనలన్నీ ఒక్క నిమిషమైనా నిలిపి శ్రీరాముని ధ్యానించి జపాన్ని చేయి. రామా అనే పదానికి స్త్రీ అని అర్థం ఉంది. ఆ అర్థాన్ని భావించే వారు కాముకులు. భక్తులు కారు. రామ అనగా పరబ్రహ్మకు పేరు. ఇది తెలిసి స్మరించే వారు వేదాంతులు. అర్కము అనగా సూర్యుని పేరు. జిల్లేడు మొక్కకు కూడా అర్కము అని పేరు. సూర్యుని ఆరాధించే వారు జిల్లేడు మొక్క అర్థాన్ని ఆలోచించరు. అట్లా ఆలోచిస్తే అది కోతి బుద్ధి అవుతుంది. అలాగే, అజ అనే శబ్దానికి బ్రహ్మ అనే అర్థంతో పాటు మేక అనే అర్థం కూడా ఉంది. బుద్ధిమంతుడు, జ్ఞాని అయిన వాడు సరైన మార్గంలోనే పయనిస్తాడు. పదముల భావార్థాలు తెలిసి వ్యవహరిస్తాడు.

రాముని నామంలో ఉన్న అఖండమైన మహిమను తెలుసుకొని చింతన చేయమని మనోజ్ఞంగా బోధించారు త్యాగరాజులవారు. భవతారకము, మోక్షప్రదాయకము, సకలక్లేశ హరణము అయిన తారక నామము రామ నామము. ఈ సృష్టి అనంత ప్రవాహంలో అనంతకోటి భక్తులను తరించిన దుఃఖభంజనము రామ నామము. తెలిసితే మోక్షము.

సంకీర్తన ద్వారా మోక్ష మార్గాన్ని విశదపరిచే వారు సద్గురువులు. సన్మార్గానికి భావము ఎంత ప్రాధాన్యమో ఈ సంకీర్తన ద్వారా తెలిపారు త్యాగరాజుల వారు. భావ విహీనమైన జీవనము ఎందుకూ పనికి రానిది. భావాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకొని స్మరణ చేస్తే అది మహా యజ్ఞమవుతుంది. సాఫల్యమవుతుంది. భావమే జీవము. భావమే జీవనము. భావమే భక్తికి మూలాధారము. 

పూర్ణచంద్రిక రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని నేదునూరి కృష్ణమూర్తి గారు ఆలపించారు

ఎందరో మహానుభావులు - షడ్కాల గోవింద మారర్



త్యాగరాజస్వామి వారి ఘనరాగ పంచరత్న కీర్తనలలో అత్యంత ప్రజాదరణ పొందింది శ్రీ రాగం లోని ఎందరో మహానుభావులు. ఈ కృతి ఆయన ఎప్పుడు, ఎలా ఆలపించారు అన్న విషయంలో ఒక్కొక్క చరిత్ర ఒక్కొక్క రకంగా చెబుతున్నాయి. కానీ, 1927లో ఆంగ్లంలో ఎం.ఎస్. రామస్వామి అయ్యరు గారు రచించిన "Thiagaraja, a great musician saint" అన్న పుస్తకంలో ఉన్న సందర్భమే చాలా సముచితం అనిపించింది. ఆ వివరాలు.

కేరళలోని రామమంగళంలో 1798లో జన్మించి అతిపిన్న వయసులోనే సంగీతం నేర్చుకుని మహావిద్వాంసులైన వారు గోవింద మారర్ గారు. ఆయన శాస్త్రీయ సంగీతాన్ని ఆరు కాలాలలో పాడి ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఆరుకాలాలలో ఆలపించటమంటే స్వరాలపై ఎంతటి పట్టుండాలో ఊహించండి. ఇప్పటి వారు మూడు కాలాలకే ఇబ్బంది పడతారు. అందుకే ఆయనకు షడ్కాల గోవింద మారర్ అని పేరు వచ్చింది. వీరు కీళ్లవాతంతో అంగవైకల్యం పొందినా, ఒక చేత తంబుర మరొక చేత కంజీర మీటుతూ ఆలపించిన ఘనులు. వీరు త్యాగరాజస్వామి వారి సమకాలీకులు. త్యాగయ్య సంగీత వైభవం గురించి విన్న ఆయన వారి గాత్రాన్ని ప్రత్యక్షంగా విని ఆనందించాలని కోరుకున్నారు. తిరువనంతపురం రాజాస్థానంలో పనిచేసే నల్లతంబి ముదలియార్ అనే ఆయన ఓపికగా మారర్ గారిని 1838వ సంవత్సరంలో తిరువాయూరు తీసుకువెళ్లారు. ప్రతిరోజూ లాగనే త్యాగరాజస్వామి వారు రాత్రి ఎనిమిది గంటల సమయంలో శిష్యులను పిలిచి ఆలపించమన్నారు. శిష్యులు సాధన మొదలు పెట్టారు. ఆ ఊరి ప్రజలంతా అక్కడకు చేరుకున్నారు. గోవింద మారర్, నల్లతంబి ముదలియారులను వడివేలు అనే వ్యక్తి త్యాగరాజస్వామి వారి నివాసానికి తీసుకు వెళ్లారు. వారు త్యాగరాజస్వామి వారికి నమస్కరించి అక్కడ కూర్చున్నారు. శిష్యులు గానం ఆపేశారు. కొన్ని నిమిషాల మౌనం.

త్యాగరాజస్వామి వారు ఒకరు పాడమంటే పాడేవారు కాదు. తన అంతరాత్మ చెబితేనే ఆలపించేవారు. అందుకే ఆయనను శిష్యులు ఎప్పుడూ ఆలపించమనే సాహసం చేసేవారు కాదు. కానీ, ఆరోజు, గోవింద మారర్ గారు ఆయనను ఆలపించమని కోరారు. అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. త్యాగరాజస్వామి వారు కూడా ఆశ్చర్యపోయి "నన్ను పాడమని అడుగుతున్న వీరెవరు? అందులోనూ 79ఏళ్ల వృద్దుడనైన నన్ను ఆలపించమని అడిగే ధైర్యం ఈయనకు ఎక్కడిది" అని స్వరం పెంచి అన్నారు. వడివేలు అప్పుడు "మీకు ఆసక్తి లేకపోతే, మారర్ గారిని ఆలపించమంటాను" అన్నారు. "ఈ వాతరోగంతో బాధపడుతున్న వ్యక్తి ఏమి ఆలపించగలడు" అని ప్రశ్నించారు త్యాగయ్య. "కొద్దిగా" అని సమాధానం చెప్పారు వడివేలు. "సరే" అని తల ఊపారు త్యాగయ్య. అప్పుడు గోవింద మారర్ గారు ఆలాపన మొదలు పెట్టారు.

వ్రేళ్లు వంగిపోయిన మారర్ తన ప్రత్యేకమైన తంబురను తీసి శృతి చేశారు. ఆ తంబుర త్యాగయ్యను ఆకర్షించింది. మారర్ రాగమాలిక ఆలాపన చేశారు - తొలుత తోడి, తరువాత అసావేరి, కీరవాణి రాగాలలో తన మనోభావనలను, అక్కడున్న వారి మానసిక స్థితికి అనుగుణంగా ఆరు కాలాలలో అద్భుతంగా ఆలపించారు. తరువాత ఆయన అద్భుతమైన సంగతులతో పంతువరాళి రాగంలో ఆలపించారు. తరువాత జయదేవుని అష్టపది "చందన చర్చిత నీల కళేబర" అని షడ్కాలములలో అత్యంత తక్కువ గతిలో పాడటం మొదలు పెట్టి నెమ్మదిగా గతిని పెంచి అక్కడున్నవారిని మంత్రముగ్ధులను చేశారు, వారి కంట ఆనందభాష్పాలు అసంకల్పితంగా వెలువడ్డాయి. త్యాగరాజస్వామి వారు ధ్యానస్థితికి వెళ్లిపోయారు.

మారర్ గారి గానం ముగియగానే, త్యాగయ్య అద్భుతం, సుందరం, మధురం అని ఎన్నో విధాలా ఆయన గాత్రాన్ని ప్రశంసించారు. మీ సంగీతం వెండితీగలాగా మా రామునివలె మనోహరమైనది, వైభవమైనది అని ఆయనను కొనియాడారు. వడివేలు మీరు కొద్దిగా పాడతారు అని చెప్పి తప్పు చేశారు, మరి సంగీత గురువులు, సిద్ధులు. మీరు ఇకనుండి గోవింద మారర్ కాదు, గోవిందస్వామి అని అందరికి వినబడేలా పెద్దగా పలికారు. మారర్ గారు వినయంగా "నాకు గోవిందస్వామి కన్నా గోవిందదాసునిగా మిగలటమే ఇష్టం" అని చెప్పి త్యాగరాజస్వామికి నమస్కరించారు.

త్యాగరాజస్వామి వారిలో తొణికిన కించిత్ అహంకారం గోవింద మారర్ గానామృతంతో పటాపంచలైంది. ఆయన గళంలో "ఎందరో మహానుభావులు అందరికీ వందనములు" అన్న అద్భుత భక్తి సుమం శ్రీరామచంద్రుని పాదాల వద్ద వ్రాలింది. "సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము చేయువారెందరో మహానుభావులు" అని త్యాగయ్య తన కళ్లతో శిష్యులను గోవింద మారర్ వైపు చూపి వారికి చేతులెత్తి నమస్కరించారు. ఆనాడు ఇద్దరు నాదయోగుల సత్సంగములో తిరువాయూరు తరించింది.

తరువాత, త్యాగయ్య గోవింద మారర్ గారి వర్ణాల స్ఫూర్తితోనే మిగిలిన నాలుగు పంచరత్న కీర్తనలు రచించారని చరిత్ర చెబుతోంది. గొవింద మారర్ తరువాతి కాలంలో గోవిందస్వామిగా, ఆయన వర్ణాలు గోవిందస్వామి వర్ణాలుగా ఎంతో పేరొందాయి. గోవింద మారర్ తన జీవిత చరమాంకంలో పండరిపూర్ వెళ్ళి అక్కడి విఠలుని సేవలో తరించి గోవిందదాసునిగా పేరు మార్చుకుని 1843వ సంవత్సరంలో ముక్తిని పొందారు. తరువాత నాలుగేళ్లకు త్యాగయ్య రామునిలో ఐక్యమైనారు.

29, ఆగస్టు 2020, శనివారం

కదలేవాడు గాడే రాముడు - త్యాగరాజస్వామి కృతి


 

వాగ్గేయకారుల గొప్పతనం వారి అనుభూతులను అద్భుతమైన వర్ణనలుగా ఆవిష్కరిస్తూనే మూలతత్త్వాన్ని పరిపూర్ణంగా తెలియజేయటంలో కూడా ఉంది. గురుకృప వలన నాకు ఉదయమే త్యాగరాజస్వామి వారి కీర్తనల పుస్తకం తీసి ఆ పేజీలో ఉన్న కీర్తనను అర్థం చేసుకునే అలవాటు కొన్నేళ్లుగా ఉంది. ఈరోజు పరబ్రహ్మమైన రాముని ఆయన అద్భుతంగా సులభమైన పదాలలో వర్ణించిన కృతి కనబడింది. మానవజన్మ ఎత్తి ధర్మాచరణ చేసి ధర్మాన్ని స్థాపించిన రాముడు మనకు తెలుసు. ఆ స్థాయిని దాటి రాముని పరబ్రహ్మ తత్త్వంగా దర్శించి తరించిన త్యాగయ్య ఆ వైభవాన్ని మనతో కూడా పంచుకున్న కృతి ఇది. మానసగోచరమైతే తప్ప ఇటువంటి కృతులను రచించలేరు. అటువంటి రామసాక్షాత్కారం పొంది నిరంతరం రామామృతపానం చేస్తూ తరించిన త్యాగరాజస్వామి మన కర్మభూమిపై మన భాషలో కృతులను రచించటం మన అదృష్టం.

కదలేవాడు గాడే రాముడు కథలెన్నో గలవాడే

మొదలే తానైనాడే తుదమొదలే లేనివాడైనాడే

కల్పనలెన్నడు లేడు సంకల్పములే కలవాడు శేష
తల్పశయనుడే వాడు శ్రీత్యాగరాజ నుతుడైనాడే

శ్రీరాముడు చరాచర స్వరూపుడు. స్థావరరూపుడైనను, జంగమ రూపములతో వేదవేదాంత పురాణేతిహాసములలో అనేక కథలు గలవాడు. సనాతనుడు, శాశ్వతుడు, మొదలు తుది లేనివాడు, సత్యమైనవాడు, మాయాతీతుడు, అనంతమైన సృష్ట్యద్భుతాలనే సంకల్పముగా గలవాడు, నారాయణునిగా ఆదిశేషునిపై శయనించుచున్నవాడు, శంకరునిచే నుతింబడుచున్నాడు శ్రీరామచంద్రుడు. 

నారాయణగౌళ రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని మల్లాది సోదరులు ఆలపించారు.

రామా నీపై తనకు ప్రేమ బోదు - త్యాగరాజస్వామి కృతి



 త్యాగరాజస్వామి ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని, ఆయన నిశ్చలమైన రామభక్తిని సూచించే కృతులు ఎన్నో ఉన్నాయి. వాటిలో కేదార రాగంలో కూర్చిన "రామా నీపై తనకు" అనే కృతి ఒకటి. తనకు రామునిపై కలిగే భావనలు, ఉన్న ధ్యాస అంతా రాముని కరుణే అని, భోగభాగ్యలలో కూడా రామునిపైనే మనసు నిలిచి యుండి పరమానందము పొందుచున్నానని, స్వామిపై తన ప్రేమ అచంచలమైనదని సహస్రార కమలము వికసించిన యోగి లక్షణాలను ప్రస్ఫుటంగా కనబరచారు. నిరంతర రామ నామ సంకీర్తనతో అన్నిటా రామునే దర్శిస్తూ, అన్నీ రాముని వల్లనే అని తన అవ్యాజమైన భక్తిని ప్రకటించారు.

రామా! నీపై తనకు ప్రేమ బోదు! సీతా

తామరస నయన! నీదేమో మాయ గాని

మనసు నీ పదములనే జేర కనులు నీ రూపమునే కోర
విను నీ పేరులకే నోరూర తన పై ఇది నీ కరుణేరా!

జననీజనకాప్తులన్యులు ధన కనక గురు వేల్పులు
దినము నీవేయని మాటలు అనగా ఇవి నా భూషణములు!

భోగానుభవములందు బాగుగ బుద్ధి నీయందు
త్యాగరాజుని హృదయమందు వాగీశానందమందు!

ఓ సీతారామా! నీపై నా ప్రేమ ఎన్నటికీ తరగదు. కలువలవంటి కన్నులు గల రామా! నీది ఏమి మాయో కానీ నీపై ప్రేమ ఎన్నటికీ తరగదు. ఓ రామా! నీ పదములనే చేరుకోవాలని నా మనసు, నీ రూపమునే చూడాలని నా కన్నులు కోరుతున్నాయి, నీ నామముల ఉచ్చరించుటకే నా నోరూరుతున్నది, ఇది అంతా నీ కరుణే, నీపై నా ప్రేమ ఎన్నటికీ తరగదు. ఓ రామా! తల్లి, తండ్రి, బంధువులు, ఇతరులు, ధనము, బంగారము, గురువు, దైవము నిత్యమూ నీవే అనే మాటలు నా ఆభరణములు,నీపై నా ప్రేమ ఎన్నటికీ తరగదు. భోగములు అనుభవించుటలో కూడా బుద్ధి నీపైనే నిలిచియున్నది, నా హృదయమునందు బ్రహ్మానందము కలిగించుచున్నది, నీపై నా ప్రేమ ఎన్నటికీ తరగదు.

కేదార రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని నిత్యశ్రీ మహదేవన్ గారు ఆలపించారు.

వినరాదా నా మనవి - త్యాగరాజస్వామి వారి క్షేత్ర కృతి


వినరాదా నా మనవి!

కనకాంగ! కావేటి రంగ! శ్రీకాంత! కాంతలెల్ల కామించి పిలచితే!

తేజినెక్కి బాగ తెరువున రాగ! రాజసతులు చూచి రమ్మని పిలచితే!

భాగధేయ వైభోగ రంగ! శ్రీత్యాగరాజనుత! తరుణులు పిలచితే!

ఓ శ్రీరంగనాథా! నా మనవి వినరాదా! బంగారు మేని ఛాయగల కావేటి రంగా! లక్ష్మీపతీ! కాంతలందరూ నిన్ను కోరి పిలీచితే వినరాదా! అశ్వమునెక్కి చక్కని రాజమార్గమున రాగా, రాజసతులు నిన్ను జూచి రమ్మని పిలచితే వినరాదా! భాగ్యవంతుడవై ఎన్నో వైభోగములు కలిగిన, శివునిచే నుతించబడిన ఓ శ్రీరంగనాథా! స్త్రీలందరు నిన్ను పిలుచుతున్నారు, వినరాదా!

త్యాగరాజస్వామి కావేరీ తీరంలో ఉన్న తిరువాయూరులో నివసించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయన కూడా దీక్షితులవారి లాగానే అనేక క్షేత్రాలను దర్శించారు. అందులో కావేటి రంగనాథుని అనేక మార్లు దర్శించుకుని నుతించారు. ఆ సందర్భంగా ఆయన రచించిన ఒక క్షేత్ర కృతి దేవగాంధారి రాగంలో కూర్చబడిన ఈ వినరాద నా మనవి. దేవగాంధారి రాగం శరణాగతికి, భక్తికి, విన్నవించుకునే భావానికి ప్రతీక. త్యాగరాజస్వామి ఈ కృతిలో రంగనాథుని మధురభక్తిలో ఓలలాడుతున్న స్త్రీల మనోభావనలను ఆవిష్కరించారు. గోదా స్వామి మధురభక్తిలో తరించి ఆ స్వామిలో జీవైక్యం చెందిన సంగతి తిరుప్పావై మొదలైన గ్రంథముల ద్వారా మనకు తెలిసిందే. ఆ మార్గంలోనే ఎందరో స్త్రీలు కావేటి రంగనాథుని కొలిచి ముక్తిని పొందారు. ఈ కీర్తనలో వర్ణించినట్లుగానే శ్రీరంగంలోని రంగనాథుని వైభవం ఉంటుంది. ఆ స్వామి ఊరేగింపులు, సేవలు, భోగములు, అక్కడి వాతావరణం మధురభక్తికి అనుక్షణం అద్దం పడతాయి. త్యాగరాజస్వామి రచనలలో ఆయన ఆధ్యాత్మిక సోపానం, జీవితంలో వేర్వేరు దశలలోని ఆయన మానసిక పరిస్థితిని ఆవిష్కరిస్తాయి. ఈ కీర్తన ఆయన మధురభక్తిని ఆస్వాదించి అనుభూతి చెంది రచించిన ఆయన యుక్త వయసును సూచిస్తుంది. తరువాత ఆయన త్యాగం, శరణాగతి, భక్తి భావనలతో అంతర్ముఖులై మరింత విశిష్టమైన కృతులను రచించారు. ఈ కృతిని ప్రియా సోదరీమణులు గానం చేశారు.

భజన సేయ రాద - త్యాగరాజస్వామి కృతి

సగుణోపాసనలో తరించిన వాగ్గేయకారులలో త్యాగరాజస్వామి అగ్రగణ్యులు. సహస్రశీర్షుడైన పరమాత్మ విరాట్ స్వరూపాన్ని మన ఇంద్రియములు గ్రహించి ఆనందించగలిగిన రూపంలో చూసి తన్మయులై తరించారు త్యాగయ్య. ఆ స్థితిలో ఆయన నోట వెలువడిన కృతులు కొన్ని వేలు. అటువంటిదే సామాన్యులకు కూడా అర్థమయ్యే ఈ భజన సేయరాదా అన్న కృతి. కనకమయ చేలములు ధరించి మోహనరూపుడైన రాముని ఆకృతిని తలచుచు అన్నీ మరచి భజన చేయుము అని మనసుకు, మనకు బోధించారు త్యాగయ్య.

భజన సేయ రాద! రామ భజన సేయ రాద!

అజ రుద్రాదులకు సతతమాత్మ మంత్రమైన రామ

కరుకు బంగారు వల్వ కటినెంతో మెరయగ
చిరునవ్వులు గల మొగమును చింతించి చింతించి

అరుణాభాధరమును సురుచిర దంతావళీని
మెరయు కపోల యుగమును నిరతమునను దలచి దలచి

బాగుగ మానస భవసాగరమునను తరింప
త్యాగరాజు మనవిని విని తారకమగు రామ నామ

ఓ మనసా! రాముని భజన సేయ రాదా! బ్రహ్మ రుద్రాదుల ఆత్మలకు నిరంతరము మననమైన రామ భజన చేయరాదా! కరుకైన బంగారు వస్త్రము నడుమున మెరుస్తూ ఉండే రాముని భజన చేయరాదా! చిరునవ్వులు గల ఆ స్వామి మోమును సదా ధ్యానించుచు, సూర్యుని వలె ప్రకాశించే ఎర్రని పెదవులు, అందమైన పలువరస, మెరిసే బుగ్గలు కలిగిన రాముని నిరంతరము తలచుచు భజన చేయరాదా! త్యాగరాజు మనవిని విని భవసాగరములను దాటేందుకు అద్భుత సాధనమైన రామ నామ భజన చేయరాదా!

అఠానా రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని బాలమురళీకృష్ణ గారు ఆలపించారు

త్యాగరాజస్వామి జీవిత విశేషాలు



పుష్య బహుళ పంచమి (1847 సంవత్సరం) కాకర్ల త్యాగరాజస్వామి వారు సిద్ధి పొందిన రోజు. తిరువాయూరులో కావేరీ తీరాన శిష్యులందరూ చూస్తుండగా విదేహముక్తి పొందిన వారు త్యాగయ్య. వారి చరిత్రను ప్రధానంగా రచించిన వారు ఆయన శిష్యులు వాలాఝీపేట వేంకటరమణ భాగవతార్ గారు, కృష్ణస్వామి భాగవతార్ గారు. విశేషమేమిటంటే వీరిద్దరు తండ్రీ కొడుకులు. తండ్రి త్యాగయ్య జీవితంలోని మొదటి భాగం విశేషాలు వ్రాయగా, కృష్ణస్వామి భాగవతార్ గారు రెండవ భాగం విశేషాలు రచించారు. వీరు తాళపత్రాలలో, నోటుబుక్కుల రూపంలో ఉన్న త్యాగయ్య సాహిత్యాన్ని మదురైలోని సౌరాష్ట్ర సభలో పదిల పరచారు. అక్కడే త్యాగయ్య ఉపయోగించిన తంబుర మొదలైన అపురూపమైన వస్తువులు కూడా ఉన్నాయి. ఈ తండ్రీ కొడుకులిద్దరూ కూడా త్యాగరాజస్వామి వరి చరిత్రను తెలుగులోనే రచించారు. ప్రముఖ సంగీత పరిశోధకులు పీ. సాంబమూర్తి గారు కృష్ణస్వామి గారిని స్వయంగా కలిసి, వారి జీవితశైలిని గమనించి కొన్ని సంభాషణలకు పుస్తక రూపం కూడా ఇచ్చారు. ఆ తండ్రీ కొడుకుల జీవితంపై త్యాగయ్య సాహిత్య ప్రభావం పరిపూర్ణంగా ఉందని సాంబమూర్తి గారి గమనిక.

త్యాగరాజస్వామి వారి సాహిత్యాన్ని తెలుగులో పుస్తక రూపంలో మొట్ట మొదట ప్రచురించిన ప్రముఖులు నరసింహ భాగవతార్ గారు, కల్లూరి వీరభద్ర శాస్త్రి గారు. నరసింహ భాగవతార్ గారు 1908లో సద్గురు త్యాగరాజస్వామి కీర్తనలు అన్న పుస్తకాన్ని రచించగా, వీరభద్రశాస్త్రి గారు 1948లో త్యాగరాజ కీర్తనలు - సవ్యాఖ్యానం అన్న పుసక్తం రచించారు. రెండూ, తరువాతి వారికి ప్రామాణికమైనాయి. ఈ రెండు పుస్తకాలలోని కీర్తనల సాహిత్యం, స్వరాలు కూడా వేంకటరమణ భాగవతార్/కృష్ణస్వామి భాగవతార్ గార్లు సౌరాష్ట్ర సభలో ఉంచిన తాళపాత్ర సాహిత్యంతో పూర్తిగా సారూప్యం కలిగి ఉన్నాయి.

తరతరాలుగా తంజావూరు ప్రాంతంలో తెలుగు వారే ఎక్కువ ఉండే వారు - ముఖ్యంగా రాజపోషణకు, ధనధాన్య సమృద్ధికి. అందుకే తెలుగు ప్రధాన భాషగా ఉండేది. త్యాగయ్య సాహిత్యం మొత్తం (కొన్ని సంస్కృత కీర్తనలు తప్ప) అచ్చ తెలుగులోనే. అద్భుతమైన రససిద్ధికి తెలుగు భాష పరిపూర్ణంగా తొడైంది. అప్పటి దేశకాల పరిస్థితులను కూడా ఆ సాహిత్యం తెలుగులో చక్కగా ప్రతిబింబించింది. తంజావూరు ప్రాంతం బ్రాహ్మణ ప్రవృత్తికి అనువైన ప్రాంతం కావటంతోనే అక్కడ కావేరీ తీరాన వారు స్థిర పడ్డారు. అదే సాంప్రదాయానికి చెందిన వారు త్యాగయ్య.

త్యాగరాజస్వామి వారి కుటుంబం పరమేశ్వరాజ్ఞతో తిరువాయూరు ఎలా వచ్చిందో నిన్న తెలుసుకున్నాము. అక్కడే త్యాగయ్య సంస్కృత పాఠశాలలో విద్యనభ్యసించారు. తండ్రి వద్ద రామతారక మంత్రోపదేశాన్ని పొందారు. చిన్ననాటి నుండే తండ్రి ప్రోద్బలంతో రామోపాసనలో నిమగ్నులైనారు. రామకృష్ణానందస్వామి అనే సన్యాసి వద్ద రామ షడక్షరీ మంత్రోపదేశం పొంది తీవ్రమైన సాధన చేశారు. త్యాగయ్య చిన్నతనంలోనే సాహిత్యాన్ని రచించారు. ఆ సంగీత సాహిత్యాభిలాషను చూసి తండ్రి ఆయనను తంజావూరు రాజాస్థానంలో విద్వాంసులైన శొంఠి వేంకటరమణయ్య గారి వద్ద కర్నాటక శాస్త్రీయ సంగీత విద్యను నేర్చుకోవటానికి చేర్చారు. విద్యతో పాటు నారద భక్తి ఆయనలో పెంపొందింది. తన తాతగారు గిరిరాజ కవి రచించిన కృతులను ఆయన ఆలపిస్తూ భక్తి పారవశ్యంలో ఉండేవారు. స్వయంగా నారదుడే త్యాగయ్యలోని భక్తికి మెచ్చి ప్రత్యక్షమై "స్వరార్ణవము" అనే పుస్తకాన్ని అందించారు. దాదాపుగా 20 ఏళ్ల పాటు త్యాగయ్య రామ తారక మంత్రాన్ని జప సాధన చేశారు. ఆ విధంగా రామకోటి పూర్తైన తరుణంలో శ్రీరామచంద్రుడు త్యాగరాజస్వామికి ప్రత్యక్షమై అనుగ్రహించాడు. అప్పుడు ఆయన నోట "బాలకనకమయ చేల" అన్న కృతి వెలువడినట్లు ఆయన సమకాలీకులు తెలిపారు. ఇక అప్పటి నుండి త్యాగయ్య సాహిత్యం గంగా ప్రవాహమే. అతి త్వరలోనే త్యాగయ్య గురువు గారి నుండి బంగారు పతకం, రాజు గారి ప్రశంస పొందారు.ఆ పతకాన్ని తిరిగి గురువు గారి కుమార్తెకు వివాహంలో బహుమతిగా ఇచ్చారు త్యాగయ్య. రాజుగారి కానుకలను, ఆశ్రయాన్ని తిరస్కరించారు.

తంజావూరు రాజా వారి అల్లుడైన మోతీరావు గారు తరచూ త్యాగరాజస్వామి వారింటికి వచ్చి వారి సంగీతాన్ని విని ఎంతో ఆనందించేవారు. మద్రాసులో గొప్ప ధనవంతులైన కోవూరు సుందర మొదలియార్ త్యాగయ్యను వారి ఇంటికి రావలసిందిగా ఆహ్వానించారు. కానీ నరస్తుతికి విముఖులైన త్యాగయ్య దానిని తిరస్కరించారు. అప్పుడు మొదలియార్ వారు కాంచీపురంలో స్థితులైన గొప్ప యతీంద్రులు ఉపనిషద్బ్రహ్మం గారి ద్వారా తన మనవిని విన్నవించారు. ఉపనిషద్బ్రహం గారు 108 ఉపనిషత్తులపై భాష్యాలు, రామ తరంగిణి, రామ అష్టపది, అనేక గ్రంథాలు రచించారు. వీరు తొలుత తంజావూరులో నివసించినప్పుడు 12 ఏళ్ల బాలుడైన త్యాగయ్య వీరి రామభక్తికి ఎంతో తన్మయుడైనాడు. వారి రామ అష్టపది ఆలపనలు త్యాగయ్యను ఎంతో ప్రభావితం చేశాయి. ఉపనిషద్బ్రహ్మం గారు త్యాగయ్యకు తీర్థయాత్ర చేస్తూ దారిలో తమను కలవవలసిందిగా కోరతారు. ఆయన కోరిక మన్నించి త్యాగయ్య తిరుమల తీర్థయాత్ర వెళుతూ దారిలో కాంచీపురంలో ఉపనిషద్బ్రహ్మం గారి అగస్త్యాశ్రమానికి వెళ్లి అక్కడి సీతారాములను, యంత్రోద్ధారక హనుమంతుని అర్చిస్తారు. తిరుమల యాత్ర మార్గమధ్యంలో అనేక క్షేత్రాలు దర్శించి కృతులను రచించారు త్యాగయ్య.

తన జీవిత చరమాంకంలో త్యాగయ్య సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు. పుష్య బహుళ పంచమి నాడు బ్రాహ్మణులకు పేదలకు అన్నసంతర్పణ చేసి కావేరీ తీరాన భజనలు ఆలపించబడుచుండగా రామునిలో ఐక్యమైనారు. అక్కడ ఆయన శిష్యులు కట్టిన సమాధి కొంతకాలానికే శిథిలమైపోగా బెంగళూరు నాగరత్నమ్మ గారు తన స్వంత ద్రవ్యాన్ని వినియోగించి నేడున్న సమాధి మందిరం నిర్మించారు. అంతకు ముందు రెండుగా చీలి విడి విడిగా జరుగుతున్న త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలను ఏకం చేసి భవ్యంగా ఆ ఉత్సవాలను తిరువైయారులో నిర్వహించే ఏర్పాట్లను చేశారు. నేడు జరుగుతున్న త్యాగరాజ ఆరాధనోత్సవాలు ఆ పరంపరవే.

వ్యాసో నిగమ చర్చయా మృదుగిరా వల్మీక జన్మామునిః
వైరాగ్యేశుక ఏవ భక్తి విషయే ప్రహ్లాద ఏవస్వయం
బ్రహ్మా నారద ఏవచా ప్రతియ యోః సాహిత్యా సంగీతయోః
యో రామామృత పాన నిర్జిత శివః తం త్యాగరాజం భజే

సద్గురువు త్యాగరాజ స్వామి వారు వేదములను విప్పి చెప్పుట యందు వ్యాసుని వంటివారు, మధురమైన వాక్యములు రాయుటలో వాల్మీకి కవి వంటి వారు, వైరాగ్యములో శుకుని వంటి వారు, భక్తిలో ప్రహ్లాదుని వంటి వారు, సాహిత్యములో బ్రహ్మ వంటి వారు, సంగీతములో నారదుని వంటి వారు, రామ నామమనే అమృతమును గ్రోలుటలో పరమశివునికి సమానులు. అటువంటి సద్గురువులను భజిస్తున్నాను - అని ఆయన ప్రియ శిష్యుడు శ్రీ వాలాఝీపేట వేంకటరమణయ్య భాగవతార్ గారు పై శ్లోక రూపంలో నుతించారు

సుజన జీవనా - త్యాగరాజస్వామి కృతి

సుజన జీవనా! రామ! సుగుణ భూషణా! రామా!

భుజగభూషణార్చిత! బుధజనావనా!
అజవందిత! శ్రితచందన! దశతురంగ! మామవ!

చారునేత్ర! శ్రీకళత్ర! శ్రీరమ్యగాత్ర!
తారకనామ! శుభచరిత్ర! దశరథపుత్ర!
తారకాధిపానన! ధర్మపాలక!
తారయ రఘువర! నిర్మల! త్యాగరాజ సన్నుత!

 సజ్జన జీవితం గడిపిన వాడు, సుగుణాలన్నీ కలవాడు ఎవరైనా ఉన్నారంటే అది శ్రీరామచంద్రుడే. అవతార పురుషుడైనా రావణ వధ జరిగి బ్రహ్మేంద్రాదులు తెలిపేంత వరకూ మానవునిలానే జీవించిన రాముడు పార్వతీ పరమేశ్వరులచే కొలువబడిన వాడు, సజ్జనులను కాపాడిన వాడు, భక్తుల పాలిట చందనము వంటి వాడు, మంచి చరిత్ర కలవాడు, ధర్మపాలకుడు, నిర్మలుడు. గుణాలెంత గొప్పవో రూపము అంతకన్నా రమ్యమైనదిగా యున్నవాడు - చారు నేత్రుడు, రమ్యగాత్రుడు, తారలకధిపతియైన చంద్రుని వంటి ముఖము కలవాడు, దశరథ మహారాజు కుమారుడు, రఘువంశశ్రేష్ఠుడు...

నిజంగా ఈ కర్మభూమిలో జనించిన వాగ్గేయకారులు కొన్ని లక్షల కృతులు శ్రీరామునిపై రచించి ఉంటారు...వారందరిలోనూ శ్రేష్టునిగా నిలిచిన త్యాగరాజస్వామి ఎంత ధన్యజీవి! రాముని ఉపాసన చేసి, మంత్ర సిద్ధి పొంది, ఆ రాముని దర్శించి, అద్భుతంగా వర్ణించి, రామవైభవానికి అక్షర రూపమిచ్చి, సమస్త భోగాలను రామభక్తి అనే భోగం కోసం త్యాగం చేసి నాదయోగంలో తరించాడు. భక్తిబిచ్చమెత్తి రామమంత్ర భిక్షాపాత్రుడు కావడమే కాదు, భవతారకమైన ఆ రామపరబ్రహ్మ తత్త్వాన్ని తనివితీరా అనుభవించాడు. ఆయన సాహిత్యంలో పదాలు ఆయన ఆధ్యాత్మిక సోపానానికి సూచికలు. రాముడు భక్తుల పాలిట చందనమెలా అయ్యాడు అన్న ఒక్క విషయం ఆలోచిస్తే త్యాగయ్య హృదయం అర్థమవుతుంది - ఆధ్యాత్మిక, ఆధిభౌతిక తాపాలకు రామనామమే చందనంలా ఉపశమనం కలిగించేది అన్నది ఆయన జీవితంలో అడుగడుగునా మనకు సుస్పష్టంగా నిరూపించబడింది. అందుకే త్యాగయ్య రాముని భక్తచందన, శ్రితచందన అని అభివర్ణించారు.

ఖమాస్ రాగంలోని సుజన జీవనా అన్న కృతిని బాలమురళీకృష్ణ గారు ఆలపించారు

త్యాగరాజస్వామి ప్రహ్లాద భక్తి విజయం కీర్తన ఎన్నగ మనసుకు రాని - పోతన గారి పద్యాల మధ్య సారూప్యత

సద్గురువులు త్యాగరాజస్వామి అనేక వేల కీర్తనలతో పాటు ప్రహ్లాద భక్తి విజయం అనే యక్షగానం కూడా రచించారు. కీర్తనలు, పద్యాల ద్వారా ప్రహ్లాదుని ద్వారా శ్రీహరి వైభవాన్ని, భాగవత మాధుర్యాన్ని మనకు అందించారు. పోతన గారు రచించిన ఆంధ్ర మహాభాగవతం ప్రభావం త్యాగరాజస్వామిపై చాలా ఉంది అన్నది ఈ ప్రహ్లాద భక్తి విజయం పఠిస్తే అర్థమవుతుంది. పోతన భాగవతంలోని సప్తమ స్కంధం ప్రహ్లాదచరితంలోని ఈ రెండు పద్యాలకు సారూప్యమైన భావంతో త్యాగరాజస్వామి కొన్ని కీర్తనలను ప్రహ్లాద భక్తి విజయంలో పొందుపరచారు. వాటిలో ఒకటి ఎన్నగ మనసుకు రాని. పోతన పద్యాలను, త్యాగయ్య కీర్తనను పరిశీలిద్దాం,



కంజాక్షునకు గాని కాయంబు కాయమే? పవన గుంభిత చర్మ భస్త్రి గాక
వైకుంఠు బొగడని వక్త్రంబు వక్త్రమే? ఢమ ఢమ ధ్వని తోడి ఢక్క గాక
హరి పూజనము లేని హస్తంబు హస్తమే? తరు శాఖ నిర్మిత దర్వి గాక
కమలేశు జూడని కన్నులు కన్నులే? తను కుడ్య జాల రంధ్రములు గాక

చక్రి చింతన లేని జన్మంబు జన్మమే?
తరళ సలిల బుద్బుదంబు గాక
విష్ణు భక్తి లేని విబుధుండు విబుధుడే?
పాదయుగము తోడి పశువు గాక

తండ్రీ! శ్రీహరిని సేవింపని శరీరము కూడా ఒక శరీరమేనా? అది గాలితో నిండిన ఒక చర్మపు సంచి మాత్రమే. వైకుంఠవాసుని పొగడని నోరు కూడా ఒక నోరేనా? అది ఢమ ఢమ ధ్వని చేసే డప్పు మాత్రమే. హరి పూజ చేయని చేతులు కూడా చేతులేనా? అవి చెట్టుకొమ్మలతో చేయబడిన తెడ్లు మాత్రమే. కమలేశుని చూడని కన్నులు కన్నులే? అవి దేహమనే గోడలో ఉన్న రంధ్రములు మాత్రమే. చక్రధారి అయిన ఆ నారాయణుని ధ్యానించని జన్మ కూడా ఒక జన్మయేనా? అది కదులుచున్న నీటి బుడగ మాత్రమే. విష్ణుభక్తిలేని పండితుడు కూడా ఒక పండితుడా? అతడు రెండు కాళ్లున్న పశువు మాత్రమే.

హరి భక్తిలేని జీవి, దేహము ఎంత వ్యర్థమో పోతన నిష్కర్షగా ప్రహ్లాదుని నోట చెప్పించారు. అదే భావనను త్యాగరాజస్వామి తన సంకీర్తనలో ఆవిష్కరించారు.



ఎన్నగ మనసుకు రాని పన్నగ శాయి సొగసు
పన్నుగ గనుగొనని కన్ను లేలే? కంటి మిన్ను లేలే?

మోహముతో నీలవారివాహ కాంతిని గేరిన
శ్రీహరిని గట్టుకొనని దేహమేలే? ఈ గేహ మేలే?

సరసిజ మల్లె తులసి విరజాజి పారిజాత
విరులచే పూజించని కరము లేలే? ఈ కాపురము లేలే?

మాలిమితో త్యాగరాజునేలిన త్యాగరాజ మూర్తిని
లాలించి పొగడని నాలికేలే? సూత్ర మాలికేలే?

మనసు ఎంచలేని శేషసాయి సొగసును కనుగొనలేని కన్నులెందుకు? కంటిరెప్పలెందుకు? తన్మయత్వంతో నీలమేఘ కాంతిని కలిగిన శ్రీహరి రూపమును తన యందు స్థిరము చేసుకోలేని ఈ దేహమెందుకు? ఈ గృహమెందుకు? కలువలు, మల్లెలు, తులసి, పారిజాత పుష్పములచే ఆ రాముని పూజించలేని చేతులెందుకు? గృహస్థాశ్రమమెందుకు? మక్కువతో త్యాగరాజును ఏలిన ఆ స్వామిని లాలించి పొగడని నాలుకెందుకు? హారములెందుకు?

భక్తి సామ్రాజ్యంలో భాగవతోత్తముల భావనలలో ఎంత సారూప్యముంటుందో మనకు పై పద్యాలు, కీర్తన ద్వారా సుస్పష్టం. పరమాత్మకే జీవితాన్ని అంకితం చేసి దేహమనే అద్భుతమైన సాధన ద్వారా పరమాత్మ ఉపాసన చేయటం అత్యుత్తమమైన కర్మ అని ఈ భాగవతోత్తముల భావన. ఆ శ్రీహరి చింతన లేని మనసు, శ్రీహరి సేవకై ఉపయోగించబడని దేహము పూర్తిగా నిరర్థకమని ఇంతకన్నా స్పష్టంగా ఎవ్వరూ చెప్పలేరు.

సరగున పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము సేయు వారెందరో మహానుభావులు!

త్యాగరాజస్వామి వారి భక్తి సామ్రాజ్యం

త్యాగరాజస్వామి వారి భక్తి సామ్రాజ్యం అనంతమైన ఆయామం గల క్షీరసాగరం వంటిది. అందులో తోడిన కొద్దీ రామామృతము, తరచి తరచి చూసిన కొద్దీ మహాద్భుతమైన భావసంపద. అనుక్షణం అత్యంత కఠినమైన పరీక్షలను దాటుతూ రామభక్తిలో రమించి తరించిన యోగి త్యాగయ్య. ఒక పక్క పేదరికం మరొక పక్క విద్యకు గుర్తింపుగా వచ్చే సంపదలు..ఈ రెండూ కూడా ఆయన శీలాన్ని ఎంతో పరీక్షించినవే. అయినా, అకుంఠిత రామభక్తితో వాటిని జయించగలిగారు. కడుపు కాలుతున్నప్పుడు భక్తిలో తాదాత్య్మం చెందాలంటే ఎంతటి నిగ్రహశక్తి ఉండాలో ఊహించండి. రామయ్యే వచ్చి త్యాగయ్యను పట్టుకు ముందుకు నడిపించాడు. కానీ, ఆ ఆలంబన ఆయనకు సులభంగా లభించలేదు. జ్ఞానంలో మొదటి మెట్టుగా రాముని కీర్తించటం, వర్ణించటం, తరువాత నిందించటం, ఆ తరువాత వేడుకొనటం, చివరకు పరబ్రహ్మగా దర్శించి తరించి దాటిపోయారు త్యాగయ్య. ఆయన జీవిత ప్రయాణంలోని ప్రతి ఒక్క అనుభూతి కూడా ఆయన కీర్తనలో మనకు ప్రత్యక్షంగా అక్షర రూపం పొందినవే. అవును కదా, మనకు కూడా ఇటువంటి భావనలు కలిగాయి కదా అనిపించేలా ఆయన కృతులు ఉంటాయి. మన హృదయ స్పందనలు, మన బుద్ధి చాంచల్యాలు, మన మనోవికారాలు, శాంతాశంత వైనాలు ఆధ్యాత్మిక సాధనలో శుద్ధి చేయబడి విద్యుల్లేఖయై భాస్వరించే ఆత్మజ్యోతి యొక్క వెలుగు రేఖలు ఆయన కృతులు. నిరాకార అక్షర పరబ్రహ్మానికి సాకార ప్రతిమలు ఆయన కృతులు.

క్షీర సాగర విహార అపరిమిత ఘోర పాతక విదార
క్రూరజన గణ విదూర నిగమ సంచార సుందర శరీర!

క్షీర సాగరంలో విహరించే స్వామి అపరిమితమైన ఘోరమైన పాతకాలు నాశనము చేసేవాడు, క్రూరజన సమూహానికి దూరంగా ఉండేవాడు, వేదాలలో సంచరించేవాడు, సుందరమైన శరీరము కలవాడు ఆ రముడు అని త్యాగయ్య తన కృతిలో పలికారు. పరబ్రహ్మ తత్త్వము పాతకాలను ఎలా దూరం చేస్తుంది? నామంలో ఉంది అసలైన కీలకం. శరీరంలోని అణువణువును శుద్ధి చేసి గ్రంథులను చేతనం చేసి, పాపసంచయాల నుండి ఆత్మకు ముక్తిని కలిగించేది నామము. ఆ రాముని నామాన్ని అనేక విధాల తలచిన వారిని ఎలా తరింపజేశాడో అన్నది రామాయణంలో అడుగడుగునా మనకు తెలుస్తుంది. ఆ సారమంతా నాలుగు పదాలలో క్రోడీకరించారు త్యాగయ్య. ఆ తరువాత నిగమ సంచారుడు అన్నారు. వేదాలలో సంచరించమేమిటి? దైవిక శక్తి మంత్రద్రష్టల నోట శబ్ద రూపంగా వెలువడటమే వేదరూపం. అనగా విశ్వవ్యాప్తమైన శక్తి అవసరాన్ని బట్టి ఋషి యొక్క సాధనను బట్టి వారి జన్మకారణాన్ని బట్టి, వారి పదవిని బట్టి అపౌరుషేయంగా వెలువడినవి. ఆ శక్తే సత్యం. ఆ సత్యమే పరబ్రహ్మము. ఆ శబ్ద ప్రవాహంలో సంచరించే పరమాత్మ తత్త్వమే రాముడు అని త్యాగరాజస్వామి వేదవేదాంతాల సారాన్ని మనకు తెలియజేశాడు. వెంటనే, సుందర శరీర అన్నారు. అంతటా ఉన్న పరబ్రహ్మము అద్భుతమైన రూపాన్ని పొంది భక్తి సామ్రాజ్యములోని ఆత్మానురక్తులను అలరించాడు. దీనిని అనుభవించి రాశారు కాబట్టే త్యాగయ్య భవసాగర తారణంలో సఫలమైనాడు, ముముక్షువుగా నిలిచారు.

నిరంతరం సంగీత సాధనలో రాముని గురించి పాడుతూ, ఆ కంపనల ద్వారా పాపసంచయాలను తొలగించుకొంటూ, మహదానందాన్ని పొంది జీవాత్మను పరమాత్మతో ఏకం చేసి మానవ జన్మను సార్థకం చేసుకున్న భక్తాగ్రేసరులు త్యాగరాజస్వామి.

నెనరుంచినాను - సద్గురువులు త్యాగరాజస్వామి


నెనరుంచినాను అన్నిటికి నీ దాసుడని నేను నీదుపై

ఘనాఘ జీమూతాశుగ జలధి గంభీర నీ పాదములపై

కలిలో మాటలు నేర్చుకొని కాంతలను తనయులను బ్రోచుటకు
శిలాత్ముడై పలుకనేరనుర శ్రీత్యాగరాజాప్త నీ యెడ

ఓ రామా! అన్ని విషయములలో నీదాసుడనన్న భావముతో నీపై విశ్వాసం కలిగియున్నాను. గొప్ప పాపములనే మేఘములను చెల్లాచెదరు చేసే వాయువు వంటి వాడవు, సముద్రమంతటి గాంభీర్యము కలవాడవు అని తలచి నీ పాదములపై విశ్వాసము కలిగి యున్నాను. కలికాలములో ఇతరులవలె నేను కూడా మాటలు బాగా నేర్చి భార్యాబిడ్డలను పోషించటానికి పాషాణహృదయముతో అసత్యములను పలుకజాలను, పరమశివునికి ఆప్తుడవైన శ్రీరామా! నీపై విశ్వాసముంచినాను.

మాళవి రాగంలో కూర్చబడిన ఈ కృతిని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు అద్భుతంగా ఆలపించారు