దేహి తవ పద భక్తిం! వైదేహి! పతిత పావని మే సదా!
ఐహికాముష్మిక ఫల దే! కమలాసనాన్యజ వర జనని!
పతితులను పావనం చేసే సీతమ్మా! నీ పదముల యందు భక్తి అనే వరాన్ని నాకు ఎల్లప్పుడూ ప్రసాదించుము. ఇహము నందు, పరము నందు ఫలములనొసగే దానవు, బ్రహ్మదేవునికి, మన్మథునికి కన్నతల్లివైన సీతమ్మా! నీ పదముల యందు భక్తి అనే వరాన్ని నాకు ఎల్లప్పుడూ ప్రసాదించుము. క్షీరసాగరమథనంలో జన్మించిన లక్ష్మీదేవివి నీవు, బంగారు ఆభరణములతో ప్రకాశించే తల్లివి, కుంభసంభవుడైన అగస్త్యుని నుతులతో సంతోషించిన తల్లివి, కాకుత్థ్స వంశములో జన్మించిన శ్రీరామునితో కూడి యున్నావు, నీ పదముల యందు భక్తి అనే వరాన్ని నాకు ఎల్లప్పుడూ ప్రసాదించుము. విశ్వరూపిణివి, తుమ్మెదల సమూహం వంటి కురులు కలదానవు, విశ్వామిత్రుని యాగసంరక్షణ చేసిన శ్రీరాముని పత్నివి, నాకు భాగ్యాన్ని ప్రసాదించే తల్లివి, నీ పదముల యందు భక్తి అనే వరాన్ని నాకు ఎల్లప్పుడూ ప్రసాదించుము. శరణు కోరిన వారిని పాలించే దానవు, రావణుని మదమణచిన తల్లివి, ఎర్రని తామర రేకుల వంటి కన్నులు కల దానవు, పరమశివుని హృదయములో నివసించిన అమ్మవు, నీ పదముల యందు భక్తి అనే వరాన్ని నాకు ఎల్లప్పుడూ ప్రసాదించుము.
వాగ్గేయకారులు ఈ కృతిని సంస్కృత భాషలో రచించి లోకపావనిని, జగన్మాతను అద్భుతంగా స్తుతించారు. శహానా రాగంలో ఈ కృతి స్వరపరచబడింది. ఈ రాగం భక్తిలో శరణాగతికి చాలా సముచితమైనది. ఈ కృతిని బొంబాయి సోదరీమణులు సరోజ-లలిత ఆలపించారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి