28, జూన్ 2026, ఆదివారం

బహుముఖప్రజ్ఞాశాలి పసుపులేటి కన్నాంబ




 తెలుగు సినీ చరిత్రలో భాష, నవరసాలు మేళవించిన నటనాకౌశలం కలిగిన నటీమణులలో సావిత్రి కన్నా ముందు తరం వారిలో అగ్రగణ్యురాలు పసుపులేటి కన్నాంబ గారు. ఆరోజుల్లో ఏడువారాల నగలు వేసుకునే ధనవంతురాలైన మహిళగా పేరోందారు. బాగా సంపాదిస్తున్న రోజుల్లో ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ దాచుకునేవారట. నిండైనా విగ్రహం, అనన్యసమానమైన వాక్పటిమ, సంభాషణల్లో స్పష్టత. పల్నాటి నాగమ్మగా, ద్రౌపదిగా, కౌసల్యగా, జోథాబాయిగా, చంద్రమతిగా, చండికగా, పార్వతిగా, కణ్ణగిగా ఎన్నో పౌరాణిక చారిత్రాత్మక మరియు సాంఘిక పాత్రలను 170కు పైగా చిత్రాలలో అద్భుతంగా పోషించిన నటనారాణి కన్నాంబ గారు. అంతే కాదు సావిత్రి, అనసూయ, అన్నపూర్ణ వంటి స్త్రీపాత్రలే కాదు, ఎన్నో మగపాత్రలు కూడా నాటకాలలో వేశారు కన్నాంబగారు. ఆవిడ పద్యాలు పాడితే వన్స్ మోర్ అని ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ కోరేవారట. 

పసుపులేటి కన్నాంబ జన్మతేదీ గురించి ఖచ్చితమైన సమాచారం లేదు. వివిధ వేదికల్లో ఆమె జనన సంవత్సరం 1910, 1912, 1913గా పేర్కొనబడింది. అయితే, 1949 అక్టోబరులో పేసుం పడం పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కన్నాంబ తన జన్మతేదీ 1911 అక్టోబర్ 5 అని పేర్కొన్నారు. 

కన్నాంబ కడపలో లోకాంబ, వెంకటనరసయ్య దంపతులకు జన్మించారు. ఆమె తండ్రి ప్రభుత్వ కాంట్రాక్టర్. ఏకైక సంతానమైన కన్నాంబ, ఏలూరులోని తన మాతామహుల వద్ద పెరిగింది. ఆమె తాత నాథముని నాయుడు గ్రామ వైద్యుడు కాగా, అమ్మమ్మ గ్రామ నర్సుగా సేవలందించేది. చిన్నప్పటి నుంచే ఆమెకు సంగీతంపై మంచి పట్టు ఉండేది. కర్ణాటక సంగీతంలో శిక్షణ పొందింది. సాహిత్యం, కవిత్వం అంటే అమితమైన అభిరుచి ఉన్న ఆమె తాత, ఆమె విద్యాభ్యాసాన్ని స్వయంగా పర్యవేక్షించారు. 

రంగస్థల ప్రవేశం

1927లో, పదహారేళ్ల వయసులో, ఏలూరులో నారాల నాటక సమాజం ప్రదర్శించిన హరిశ్చంద్ర నాటకాన్ని కన్నాంబ వీక్షించింది. ఆ నాటకంలో చంద్రమతి పాత్రధారి ఎంతో భావోద్వేగంతో పాట పాడుతూ ఏడ్చినా, ప్రేక్షకులు నవ్వారు. అది చూసిన కన్నాంబ, "ఇంకా బాగా నటించాలి" అని గట్టిగా వ్యాఖ్యానించింది. దీంతో మనస్తాపానికి గురైన ఆ నటుడు, "నటన అంత సులభం కాదు, నువ్వే వచ్చి చేసి చూపు" అని సవాలు విసిరాడట. కన్నాంబ వెంటనే వేదికపైకి ఎక్కి పాట పాడి, నటించి, కాసేపటి క్రితం నవ్విన అదే ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించింది. ఆమె అసాధారణ నటనా ప్రస్థానానికి అదే నాంది అయింది. మరుసటి రోజే ఆమె ఆ నాటక సంస్థలో ప్రధాన నటిగా చేరి, అనసూయ, సావిత్రి, యశోద వంటి పాత్రలను పోషించి విశేష ప్రశంసలు అందుకుంది.

ఈ నాటక సమాజ నిర్వాహకుల్లో ఒకరైన కడారు నాగభూషణం కన్నాంబను ప్రేమించి 1934 ఏప్రిల్‌లో వివాహం చేసుకున్నారు. అది ఆయన రెండో వివాహం. నాగభూషణం గారు నాటక ప్రయోక్త, దర్శక నిర్మాతలు. అదే సంవత్సరం ఈ దంపతులు శ్రీరాజరాజేశ్వరి నాట్య మండలి అనే తమ స్వంత నాటక సంస్థను స్థాపించి, మద్రాస్ ప్రెసిడెన్సీతో పాటు నిజాం ప్రాంతాల్లోనూ నాటకాలు ప్రదర్శించారు. తదుపరి అడుగు సహజంగానే సినీరంగమే అయింది. స్టార్ కంబైన్స్ సంస్థకు చెందిన ఎ. రామయ్య, కొల్హాపూర్‌లోని శాలిని సినీటోన్ స్టూడియోలో రూపొందిన హరిశ్చంద్ర చిత్రంలో చంద్రమతి పాత్ర కోసం ఆమెను ఆహ్వానించారు. ఆమె అంగీకరించడంతో సినీ జీవితం ప్రారంభమైంది.

ఆ తర్వాత బెజవాడకు చెందిన సరస్వతి టాకీస్ సంస్థ ద్రౌపది వస్త్రాపహరణం (1936) చిత్రంలో ద్రౌపది పాత్రను ఆమెకు అప్పగించింది. ఈ చిత్రం కూడా కొల్హాపూర్‌లోనే తెరకెక్కింది. వెల్ పిక్చర్స్ నిర్మించిన కనకధార చిత్రంలో ఆమె విషాదభరిత నటనకు అపారమైన ప్రశంసలు లభించాయి. అలా ఆమె స్టార్‌గా ఎదగడం ప్రారంభమైంది. అనంతరం హెచ్.ఎం.రెడ్డి, బి.ఎన్.రెడ్డిలతో కలిసి గృహలక్ష్మి(1938) చిత్రంలో నటించారు. తరువాత జయా ఫిలిమ్స్ నిర్మించిన కాళిదాసు చిత్రంలో నటించింది. ఈ సంస్థే తర్వాత శోభనాచల స్టూడియోస్, అనంతరం వీనస్ స్టూడియోస్‌గా రూపాంతరం చెందింది. సరస్వతి టాకీస్ భాగస్వామ్యంతో రూపొందిన చండిక చిత్రంలో ఆమె ప్రధాన పాత్ర పోషించింది. ఆ చిత్రంలో కోపం, ద్వేషం, ప్రేమ వంటి విభిన్న భావోద్వేగాలను అద్భుతంగా ఆవిష్కరించి, అప్పటివరకు విషాద నాయికగా ఉన్న తన ఇమేజ్‌కు భిన్నమైన కోణాన్ని చూపించింది.

తమిళ చిత్రరంగంలో అడుగులు

రాజగోపాల్ పిక్చర్స్, మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (తరువాతి జెమినీ స్టూడియో)లో కృష్ణ తూతు చిత్రాన్ని నిర్మించాలనుకున్నప్పుడు, దర్శకుడు రఘుపతి ప్రకాశ్ ఆమెను తన తొలి తమిళ చిత్రానికి ఎంపిక చేశారు.అయితే తమిళ సంభాషణల ఉచ్చారణలో తడబాటు, బలమైన తెలుగు యాస కారణంగా ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. కానీ, ఎం.కె.త్యాగరాజ భాగవతార్ నటించిన క్లాసిక్ చిత్రం అశోక్ కుమార్ నిర్మాతలు ఆమెపై విశ్వాసం ఉంచారు. ఆ చిత్రంలో రచయిత ఎలంగోవన్ రాసిన తమిళ సంభాషణలను ఆమె ఎంతో చక్కగా పలకడంతో, 1941లో రూపొందిన కణ్ణగి చిత్రంలో ప్రధాన పాత్రకు ఆమెనే సహజ ఎంపికగా మారింది.

ఇప్పటికే ఆమె, భర్త నాగభూషణంతో కలిసి శ్రీరాజరాజేశ్వరి ఫిల్మ్ కంపెనీని స్థాపించారు. త్యాగరాజ భాగవతార్ పాటలకు అనుగుణంగా నృత్యం చేయడానికి ఆమె ప్రత్యేకంగా భరతనాట్యం నేర్చుకుంది. ఆయన పాడితే ఆమె నర్తించడం అనే తరహా దృశ్యాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించి, తర్వాతి చిత్రాలకు మార్గదర్శకంగా నిలిచాయి.

అమరమైన నటన

జూపిటర్ ఫిలిమ్స్ నిర్మించిన కణ్ణగి చిత్రానికి ఆర్.ఎస్.మణి దర్శకత్వం వహించగా, ఎలంగోవన్ కథ, సంభాషణలు రాశారు. సాహిత్య గంభీరతతో కూడిన కవితాత్మక తమిళాన్ని భావోద్వేగం, స్పష్టమైన ఉచ్చారణ, సరైన లయతో ఆమె పలికిన తీరు చిరస్మరణీయంగా నిలిచింది. ఆ చిత్రంలో ఆమె నటన ఈ రోజుకీ ఆదర్శప్రాయంగా భావించబడుతుంది. కన్నాంబ పేరు "కణ్ణగి" పాత్రకు పర్యాయపదంగా మారిపోయింది. ఆ చిత్రంలో ఆమె, యు.ఆర్.జీవరత్నం మధ్య సాగిన ప్రశ్నోత్తర గీతం తర్వాతి కాలంలో అనేక చిత్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఈ చిత్ర సంగీత దర్శకుడు ఎస్. వి. వెంకట్రామన్‌కు  ఈ అవకాశం రావడానికి కారణం, అప్పటికే కన్నాంబ నిర్మించిన తల్లి ప్రేమ చిత్రానికి ఆయన సంగీతం సమకూర్చడం. అనంతరం ఆయన మీరా వంటి చిరస్మరణీయ చిత్రాలకు సంగీతం అందించారు.

కన్నాంబగారు కేవలం నటి మాత్రమే కాదు, గాయని కూడా. సినిమాల్లో నటించడమే కాకుండా అనేక చిత్రాల్లో తన పాటలను తానే ఆలపించారు. ఆ కాలంలో ప్లేబ్యాక్ విధానం పూర్తిగా స్థిరపడకముందు నటీనటులే పాటలు పాడేవారు. గృహలక్ష్మి, తల్లిప్రేమ, చండిక, మాయా మచ్చీంద్ర, పల్నాటి యుద్ధం వంటి చిత్రాల్లో ఆమె గానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. కన్నాంబ గారు నవరసాలను సమానంగా పోషించిన అరుదైన నటి. చాలామంది "ట్రాజెడీ క్వీన్"గా గుర్తించినప్పటికీ, ఆమె విషాద పాత్రలకే పరిమితం కాలేదు. పౌరాణిక, చారిత్రాత్మక, జానపద, సాంఘిక చిత్రాల్లో కోపం, వీరత్వం, కరుణ, హాస్యం, భక్తి వంటి అన్ని రసాలను సమర్థంగా ప్రదర్శించి నవరస నటిగా పేరు తెచ్చుకున్నారు. 

ఆమె భర్త కడారు నాగభూషణంతో కలిసి స్థాపించిన శ్రీ రాజరాజేశ్వరి ఫిల్మ్ కంపెనీ దక్షిణ భారత చిత్రసీమలో అత్యంత క్రమశిక్షణ కలిగిన నిర్మాణ సంస్థలలో ఒకటిగా పేరుపొందింది. వీరు సిబ్బందికి జీతాలు నెలాఖరుకే ముందుగానే చెల్లించేవారు. సెట్లో పనిచేసే ప్రతి ఒక్కరికీ భోజన సదుపాయం కల్పించేవారు.కళాకారులు, సాంకేతిక నిపుణులను కుటుంబ సభ్యుల్లా చూసుకునేవారు. 

కన్నాంబ దంపతులు అవసరంలో ఉన్నవారికి డబ్బులు అప్పుగా ఇవ్వడం, చాలామందికి హామీదారులుగా సంతకాలు చేయడం వల్ల భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కొన్నారు. నిర్మించిన కొన్ని సినిమాలు కూడా నష్టపోవడంతో జీవితాంతంలో ఆర్థిక పరిస్థితి బలహీనపడింది. ఆవిడ స్థాపించిన నిర్మాణ సంస్థ తెలుగు, తమిళ భాషలతో పాటు కొన్ని చిత్రాలను కన్నడలో కూడా నిర్మించింది. ఆ కాలంలో బహుభాషా నిర్మాణాలను చేపట్టిన తొలి మహిళా నిర్మాతల్లో ఆమె ఒకరు. దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు దక్షిణ భారత సినీరంగంలో అగ్రనటిగా కొనసాగారు. ఆవిడ నిర్మించిన నవజీవనం (1949) చిత్రం అప్పటి ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి ఉత్తమ చిత్రంగా గుర్తింపు పొందింది. ఇది ఆమె నిర్మాతగా సాధించిన ముఖ్య విజయాల్లో ఒకటి. 1940–50 దశకాల్లో ఆమెకు ఉన్న ప్రజాదరణ ఎంతగానో ఉండేది. అప్పట్లో మార్కెట్లో కన్నాంబ లోలాకులు అనే పేరుతో ఆభరణాలు కూడా అమ్ముడయ్యేవని సినీ రచయిత రావికొండలరావు తన రచనల్లో పేర్కొన్నారు. 

ఆమె చివరి చిత్రాలు

ఆమె జీవితం చివరిదశలో కూడా నటన కొనసాగించారు. "ఆత్మబలం", "రామదాసు", "పరువు ప్రతిష్ఠ", "లవకుశ", "ఆప్తమిత్రులు", "ఆత్మబంధువు" వంటి చిత్రాల్లో ముఖ్యమైన పాత్రలు పోషించారు. 

మరణానంతరం చోటుచేసుకున్న విషాద సంఘటన

కొన్ని జీవితచరిత్రలు, కుటుంబ సభ్యుల కథనాల ప్రకారం, కన్నాంబను సంప్రదాయం ప్రకారం నగలతో సమాధి చేయగా, అనంతరం ఆమె సమాధిని దొంగలు తవ్వి నగలు అపహరించారని, ఆమె భౌతికకాయం కూడా కనిపించకుండా పోయిందని ప్రచారంలో ఉంది. దీనిపై పలు కథనాలు ఉన్నప్పటికీ, ఖచ్చితమైన చారిత్రక ఆధారాలు పరిమితంగానే ఉన్నాయి. 

మహిళా నిర్మాతలకు మార్గదర్శి

1930–40 దశకాల్లో మహిళలు నటించడం కూడా అరుదైన కాలంలో, కన్నాంబ నటి మాత్రమే కాకుండా నిర్మాణ సంస్థను విజయవంతంగా నడిపిన తొలి తెలుగు మహిళా నిర్మాతల్లో ఒకరిగా నిలిచారు. ఆమె తర్వాత భానుమతి, సావిత్రి వంటి నటీమణులు నిర్మాణ రంగంలోకి రావడానికి ఆమె ఆదర్శంగా నిలిచారు. 

వ్యక్తిత్వం, కుటుంబం, వారసత్వం

కన్నాంబ అత్యంత భక్తిశ్రద్ధలు కలిగిన వ్యక్తి. ప్రతి రోజు సినిమా షూటింగ్‌కు బయలుదేరే ముందు పూజ చేసేది. ఆమెకు సంతానం లేకపోవడంతో ఒక కుమారుడిని, ఒక కుమార్తెను దత్తత తీసుకున్నారు. కుమార్తె రాజరాజేశ్వరి, దర్శకుడు సి. పుల్లయ్య కుమారుడు, దర్శకుడు సి. ఎస్. రావును వివాహం చేసుకుంది. దత్తపుత్రుడు తబలా విద్వాంసుడు. 170కుపైగా చిత్రాల్లో నటిగా, 25కుపైగా చిత్రాలకు నిర్మాతగా సేవలందించిన ఆమె కెరీర్‌లో మనోహర చిత్రంలో రాజమాత పాత్ర మరో మైలురాయిగా నిలిచింది.

ప్రముఖ నటి అంజలీదేవి కన్నాంబ గురించి ఇలా గుర్తుచేసుకున్నారు - తమిళంలో సంభాషణలు ఎలా చెప్పాలో, పెద్దలకు నమస్కారం ఎలా చేయాలో వంటి చిన్నచిన్న విషయాలనూ ఆమె మాకు నేర్పేవారు. తమిళ సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనేక తెలుగు నటీనటులకు ఆమె స్ఫూర్తిగా నిలిచారు.

1964 మే 7న కన్నాంబ కన్నుమూశారు. ఏ భాషలోనైనా రాణించాలంటే ఆ భాషను నేర్చుకోవాలనే సంకల్పం ఉంటే చాలని కన్నాంబ తన జీవితంతో నిరూపించారు. నేటి తరానికి కూడా అది ఒక గొప్ప పాఠమే. 

శ్రీరంగపట్నం సమీపంలోని శ్రీ నిమిషాంబాదేవి ఆలయం




కర్ణాటక రాష్ట్రంలోని మండ్య జిల్లాలో, చారిత్రక ప్రాధాన్యం కలిగిన శ్రీరంగపట్నం పట్టణానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో, కావేరీ నది ఒడ్డున గంజాం గ్రామంలో వెలసిన శ్రీనిమిషాంబాదేవి ఆలయం దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ శక్తి పీఠాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ ఆలయం ప్రకృతి సౌందర్యం, ఆధ్యాత్మిక శక్తి, చారిత్రక నేపథ్యం మరియు స్థానిక ప్రజల విశ్వాసాల సమ్మేళనంగా నిలిచింది. నిమిషాంబ అనే పేరే ఈ ఆలయ ప్రత్యేకతను తెలియజేస్తుంది. సంస్కృతంలో నిమిష అంటే ఒక క్షణం లేదా కన్నుమూసేంత సమయం, అంబ అంటే పార్వతీదేవి. భక్తులు కోరుకున్న కోరికలను అమ్మవారు అత్యంత త్వరగా నెరవేర్చుతారని ఉన్న విశ్వాసం వల్ల ఆమెకు "నిమిషాంబ" అనే నామం వచ్చింది. 

నిమిషాంబాదేవి ఎవరు?

నిమిషాంబా దేవిని పార్వతీదేవి యొక్క ఉగ్ర-కరుణామయ స్వరూపంగా ఆరాధిస్తారు. శక్తి, రక్షణ, దుష్ట సంహారం, భక్తులకు తక్షణ అనుగ్రహం ప్రసాదించడం వంటి లక్షణాలతో ఈ దేవి ప్రసిద్ధి చెందింది. ఆలయంలో ప్రధాన విగ్రహం ముందు శ్రీచక్రం ప్రతిష్ఠించబడటం ఈ క్షేత్రానికి మరింత తాంత్రిక, శ్రీవిద్యా సంప్రదాయ ప్రాముఖ్యతను ఇస్తుంది. నిత్యం శ్రీచక్రానికి కుంకుమార్చన నిర్వహించడం ఆలయ విశిష్ట ఆచారాలలో ఒకటి. 

స్థలపురాణం – నిమిషంలో ప్రత్యక్షమైన తల్లి

ఈ ఆలయంతో ముడిపడిన అత్యంత ప్రసిద్ధ కథ ముక్తరాజు ముక్తరాస) గురించినది. స్థలపురాణం ప్రకారం, సోమవంశ ఆర్యక్షత్రియ వంశానికి చెందిన రాజు ముక్తరాజు తీవ్ర తపస్సు చేసి పార్వతీదేవిని ఆరాధించాడు. అదే సమయంలో అతని రాజ్యంపై శుభాహు, ఘటోధరుడు వంటి రాక్షసులు దాడి చేసి ప్రజలను బాధించారు. రాజు ఎంతో భక్తితో దేవిని ప్రార్థించగా, అమ్మవారు ప్రత్యక్షమై "నీకు ఎప్పుడైనా ఆపద వచ్చినా నేను ఒక నిమిషంలో వచ్చి నిన్ను రక్షిస్తాను" అని వరమిచ్చిందని కథ చెబుతుంది.

ఆ తర్వాత జరిగిన యుద్ధంలో రాజు దేవిని స్మరించగానే అమ్మవారు క్షణాల్లో ప్రత్యక్షమై రాక్షసులను సంహరించిందని విశ్వాసం. అందుకే ఆమెకు నిమిషాంబ అనే పేరు ఏర్పడిందని స్థానిక సంప్రదాయం చెబుతుంది. ఈ కథలో చారిత్రక ఆధారాల కంటే భక్తి సంప్రదాయం మరియు స్థానిక స్థలపురాణం ప్రధానమైనవి. చరిత్రకారులు దీనిని శాసనాధారాలతో నిర్ధారించలేకపోయినప్పటికీ, అనేక శతాబ్దాలుగా ఈ కథ భక్తుల విశ్వాసంలో జీవిస్తోంది.

ఆలయ నిర్మాణ చరిత్ర

ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయం సుమారు 400 సంవత్సరాల క్రితం మైసూరు రాజా మొదటి వడయార్ పాలనలో నిర్మించబడినదిగా భావించబడుతోంది. కొన్ని సంప్రదాయాలు దీనిని ముమ్మడి కృష్ణరాజ వడయార్ కాలానికి చెందినదిగా పేర్కొంటాయి. అయితే దీనికి సంబంధించిన ఖచ్చితమైన శాసన ఆధారాలు పరిమితంగానే ఉన్నాయి. ఆలయం చిన్నదైనా ద్రావిడ శైలిలో నిర్మించబడింది.

ఆలయ ముఖ్య విశేషాలు:

* ఏడు అంతస్తుల రాజగోపురం
* తూర్పు ముఖంగా ఉన్న గర్భగుడి
* దేవి ఎదుట ప్రతిష్ఠించిన శ్రీచక్రం
* శివుని ముక్తేశ్వర/అక్షీశ్వర లింగం
* లక్ష్మీనారాయణ స్వామి ఆలయం
* కావేరీ నదికి దిగే రాతి మెట్లు

ఈ మూడు దేవాలయాలు ఒకే ప్రాంగణంలో ఉండటం శైవ, శాక్తేయ, వైష్ణవ సంప్రదాయాల సమన్వయాన్ని సూచిస్తుంది. 

కాకులకు నైవేద్యం – ప్రత్యేక సంప్రదాయం

ఈ ఆలయంలో ప్రసిద్ధి చెందిన ఒక విశిష్ట ఆచారం ఉంది. పూజారి మొదట బలిపీఠంపై నైవేద్యాన్ని ఉంచి పెద్ద ఇత్తడి గంటను మోగిస్తారు. గంట శబ్దం వినగానే సమీపంలోని కాకులు వచ్చి నైవేద్యాన్ని స్వీకరిస్తాయని స్థానిక సంప్రదాయం చెబుతుంది. భక్తులు దీనిని దేవి కృపకు సంకేతంగా భావిస్తారు. ఇది ఆలయానికి ప్రత్యేక గుర్తింపుగా మారింది. 

"నిమిషంలో కోరిక నెరవేరుతుంది" అనే విశ్వాసం

ఈ ఆలయం అత్యంత ప్రసిద్ధి పొందడానికి ప్రధాన కారణం భక్తులలో ఉన్న విశ్వాసం. భక్తులు ముఖ్యంగా ఈ కోరికలతో అమ్మవారిని దర్శిస్తారు:

* వివాహం త్వరగా జరగడం
* సంతాన ప్రాప్తి
* కోర్టు వ్యవహారాల్లో విజయం
* ఉద్యోగం
* వ్యాపారాభివృద్ధి
* కుటుంబ సమస్యల పరిష్కారం
* మానసిక ప్రశాంతత

ఒక్కసారి నిజమైన భక్తితో ప్రార్థిస్తే అమ్మవారు నిమిషాల్లో స్పందిస్తుంది అనే నమ్మకం శతాబ్దాలుగా కొనసాగుతోంది. 

శ్రీచక్ర మహిమ

నిమిషాంబాలయంలో ప్రత్యేకమైనది శ్రీచక్రం. శ్రీవిద్యా సంప్రదాయంలో శ్రీచక్రాన్ని సాక్షాత్ ఆదిపరాశక్తి స్వరూపంగా భావిస్తారు. అందువల్ల ఇక్కడ కుంకుమార్చనలు, చండీహోమాలు, దుర్గాహోమాలు, నవరాత్రి విశేష పూజలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. 

మొదటి రాజా వడయార్‌కు దేవి కలలో దర్శనం (స్థలపురాణం)

మైసూరు రాజు మొదటి రాజా వడేయార్ ఒకసారి కలలో నిమిషాంబాదేవిని దర్శించాడు. కావేరీ నది ఒడ్డున తన ఆలయాన్ని నిర్మించాలని అమ్మవారు ఆజ్ఞాపించారని, ఆ తర్వాత రాజ్యంలో శాంతి, ఐశ్వర్యం పెరిగాయని చెబుతారు. అయితే దీనికి చారిత్రక పత్రాధారాలు లేవు.చారిత్రకంగా విశ్వసనీయమైన విషయం ఏమిటంటే, వడేయార్ రాజులు ఈ ఆలయానికి ప్రోత్సాహం అందించారు. వారు నిత్య పూజలు నిర్వహించేలా దానాలు చేశారు. శ్రీచక్ర ఆరాధనను ప్రోత్సహించారు, పండుగలు నిర్వహించేందుకు సహాయం చేశారు, కావేరీ ఘాట్‌లను అభివృద్ధి చేశారు.

స్థానిక కథనాల ప్రకారం, వడయార్ రాజుల సైనికులు యుద్ధానికి వెళ్లే ముందు నిమిషాంబా దేవిని దర్శించి ఆశీర్వాదం తీసుకునేవారు. యుద్ధం ముగిసిన తర్వాత క్షేమంగా తిరిగి వచ్చిన వారు ఆలయానికి కానుకలు సమర్పించేవారని చెబుతారు.

26, జూన్ 2026, శుక్రవారం

శ్రీరామకృష్ణ పరమహంస – త్రైలింగస్వామి మహాసంగమం




క్రీ.శ. 1868 ప్రాంతంలో శ్రీరామకృష్ణ పరమహంస కాశీ యాత్రకు వచ్చారు. ఈ యాత్రను మథుర్‌బాబు ఏర్పాటు చేశారు. ఆయనతో పాటు హృదయ్‌ (హృదయరామ్) సహా సుమారు 125 మంది యాత్రికులు వచ్చారు.

ఆ సమయంలో మణికర్ణికా ఘాట్ వద్ద త్రైలింగస్వామి నివసించేవారు. త్రైలింగస్వామి కాళీ ఉపాసకులు కూడా. మణికర్ణికా ఘాట్‌లో అప్పట్లో నిరంతర శవదహనం వల్ల మెట్లన్నీ కాలిపోయేంత వేడిగా ఉండేవి, ఆయన ఆ వేడిని లెఖ్ఖపెట్టకుండా ఆ రాళ్ల మీదే కూర్చునేవాడు, ఆయన శరీరానికి ఎటువంటి హానీ కలగలేదు కూడా.  సాధారణంగా ఆయన ఎవ్వరితోనూ మాట్లాడరు; తన దగ్గరకు వచ్చిన వారిని కూడా ప్రోత్సహించరు. కానీ శ్రీరామకృష్ణులను చూసిన వెంటనే వారికి ప్రత్యేకమైన ఆదరణ చూపారు. సంజ్ఞల ద్వారా తన దగ్గరకు రమ్మని పిలిచి, తన పక్కనే కూర్చోబెట్టారు. అనంతరం తన నస్యపు (స్నఫ్) పెట్టెను వారికి అందించారు.

అప్పుడు శ్రీరామకృష్ణులు ఒక గంభీరమైన ప్రశ్న అడిగారు:

“భగవంతుడు ఒక్కడేనా? లేక అనేక రూపాలలో ఉన్నాడా?”

త్రైలింగస్వామి మాటలతో కాకుండా సంజ్ఞల ద్వారా ఇలా సమాధానం ఇచ్చారు:

“నువ్వు సమాధి స్థితిలో ఉన్నప్పుడు భగవంతుడు ఒక్కడే. ప్రపంచ చైతన్యంలో ఉన్నప్పుడు ఆయనే అనేక రూపాలుగా కనిపిస్తాడు.”

ఈ సమాధానం విని శ్రీరామకృష్ణులు ఎంతో సంతోషించి, త్రైలింగస్వామిని పరమహంస స్థితిని పొందిన మహాయోగిగా అభివర్ణించారు.

కాశీలో ఉన్న సమయంలో శ్రీరామకృష్ణులు త్రైలింగస్వామిని అనేకసార్లు దర్శించారు. తరువాత శ్రీరామకృష్ణుల ఆహ్వానంపై త్రైలింగస్వామి మథుర్‌బాబు నివాసానికి కూడా విచ్చేశారు. అక్కడ శ్రీరామకృష్ణులు స్వయంగా పాయసం వండి, అపారమైన భక్తి ప్రేమలతో త్రైలింగస్వామికి తమ చేతులతోనే భోజనం పెట్టారు.

ఈ మహాసంగమం భారత ఆధ్యాత్మిక చరిత్రలో ఇద్దరు మహాజ్ఞానుల పరస్పర గౌరవం, ఆత్మైక్యానుభూతి, మరియు అద్వైత సత్యానికి అద్భుత సాక్ష్యంగా నిలిచింది.

దక్షిణేశ్వర్ తిరిగి వెళ్లిన తరువాత రామకృష్ణ పరమహంస తన శిష్యులతో త్రైలింగస్వామి గురించి ఎంతో గొప్పగా చెప్పారు. ఆయనను సాక్షాత్ పరమశివుని రూపంగా వర్ణించారు.  ఇదంతా రామకృష్ణుల వారి శిష్యులు శారదానంద తమ  శ్రీశ్రీరామకృష్ణ లీలాప్రసంగ అనే బెంగాలీ పుస్తకంలో ప్రస్తావించారు, దానిలోని కొంత భాగాన్ని తరువాత రామకృష్ణ ది గ్రేట్ మాస్టర్ అని ఆంగ్లంలోకి స్వామి జగదానంద అనువదించారు. 

బంకిమ్ చంద్ర చటోపాధ్యాయ జీవిత చరిత్ర


బంకిమ్ చంద్ర చటోపాధ్యాయ, ఆంగ్లీకరించిన రూపంలో బంకిమ్ చంద్ర ఛటర్జీ, వంగభూమిలో జన్మించిన గొప్ప నవలా రచయిత, కవి, వ్యాసకర్త, పాత్రికేయుడు మరియు ప్రభుత్వ అధికారి. ఆధునిక బెంగాలీ సాహిత్యానికి పునాది వేసిన మహానుభావుడిగా ఆయనను "సాహిత్య సామ్రాట్" అని గౌరవిస్తారు. భారత జాతీయ గీతం "వందే మాతరం" రచయితగా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆయన రచనలు భారత స్వాతంత్ర్యోద్యమానికి స్ఫూర్తినిచ్చి దేశభక్తి భావాలను ప్రజల్లో మేల్కొల్పాయి.

బాల్యం, విద్యాభ్యాసం మరియు వృత్తి:

బంకిమ్ చంద్ర చటోపాధ్యాయ 1838 జూన్ 26న బ్రిటిష్ భారతదేశంలోని బెంగాల్ ప్రెసిడెన్సీలోని నైహటి (కాంతల్పారా) గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి యాదవ చంద్ర చటోపాధ్యాయ బ్రిటిష్ ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేశారు. తల్లి దుర్గాదేవి. చిన్ననాటి నుంచే బంకిమ్ చంద్రకు చదువుపై, సాహిత్యంపై ఆసక్తి ఉండేది. ఆయనకు ఇద్దరు అన్నలు సంజీవ్‌చంద్ర మరియు విష్ణుచంద్ర. ఆయన హూగ్లీ మోహ్సిన్ కళాశాలలో చదివి, తరువాత కలకత్తా ప్రెసిడెన్సీ కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించారు. 1859లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి బీఏ పట్టభద్రులైన తొలి విద్యార్థులలో ఒకరిగా గుర్తింపు పొందారు.ఆ తరువాత లా కూడా చదివారు.

చదువు పూర్తయిన తరువాత బ్రిటిష్ ప్రభుత్వంలో డిప్యూటీ మేజిస్ట్రేట్ మరియు డిప్యూటీ కలెక్టర్్‌గా సుమారు మూడు దశాబ్దాల పాటు సేవలందించారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నప్పటికీ, భారతీయ సంస్కృతి, భాష, సమాజం మరియు జాతీయ చైతన్యం గురించి రచనలు చేస్తూ ప్రజల్లో ఆత్మగౌరవాన్ని పెంపొందించారు.

సాహిత్య ప్రస్థానం:

మొదట ఆంగ్లంలో "Rajmohan's Wife" అనే నవలను రచించారు. తరువాత బెంగాలీ భాషలో రచనలు ప్రారం భించి ఆధునిక బెంగాలీ నవలకు కొత్త దిశను చూపారు. ఆయన ప్రసిద్ధ రచనలు:

దుర్గేశ్‌నందిని (1865) – ఆధునిక బెంగాలీ చారిత్రక నవలకు శ్రీకారం.
కపాలకుండలా (1866) – అత్యంత ప్రజాదరణ పొందిన నవల.
విషవృక్ష (1873) – సామాజిక సమస్యలను ప్రతిబింబించిన రచన.
కృష్ణకాంతుని వీలునామా ((Krishnakanter Will)).
ఆనందమఠ్ (1882) – దేశభక్తిని రగిలించిన అమర రచన.
దేవీ చౌధురాణి (1884) – మహిళా శక్తిని ప్రతిబింబించిన నవల.
సీతారామ్ (1887).
కృష్ణచరిత్ర – శ్రీకృష్ణునిపై తాత్విక విశ్లేషణ.

1872లో ఆయన "బంగదర్శన్" అనే సాహిత్య పత్రికను ప్రారంభించి అనేక రచయితలకు వేదిక కల్పించారు.

బంకిమ్ చంద్ర చటోపాధ్యాయ రచించిన "రాజసింహ" (1881) మరియు "ఆనందమఠ్" (1882) చారిత్రక, రాజకీయ నేపథ్యంతో కూడిన ప్రముఖ నవలలు. 1872లో బంకిమ్ స్థాపించిన "బంగదర్శన్" పత్రికలో ఈ నవల మొదట ధారావాహికగా ప్రచురితమైంది. అదనంగా, ఆయన భగవద్గీతపై వ్యాఖ్యానం రచించడంతో పాటు సాంఖ్య తత్వశాస్త్రంపై లోతైన విశ్లేషణ చేశారు. భారతీయ తాత్విక సంప్రదాయాలపై ఆయనకు ఉన్న పాండిత్యం, సాహిత్యంతో పాటు తత్వచింతనలోనూ ఆయన విశిష్ట స్థానాన్ని చాటిచెప్పింది. రామకృష్ణ పరమహంసతో ముఖ్యమైన అనుయాయులుగా బంకించంద్ర పేరొందారు. 

"వందే మాతరం" – భారత జాతీయ గీతం:

బంకిమ్ చంద్ర చటోపాధ్యాయ రచించిన "వందే మాతరం" మొదట ఆయన ఆనందమఠ్ నవలలో ప్రచురితమైంది. ఈ గీతం భారతమాతను తల్లిగా భావించి ఆమెకు వందనం చేస్తుంది. భారత స్వాతంత్ర్యోద్యమంలో ఈ గీతం లక్షలాది మంది దేశభక్తులకు స్ఫూర్తినిచ్చింది. సభలు, ఉద్యమాలు, నిరసన కార్యక్రమాలలో "వందే మాతరం" నినాదం స్వాతంత్ర్య సమరయోధులకు ధైర్యాన్ని ఇచ్చింది. తరువాత దీనికి భారతదేశ జాతీయ గీతం (National Song) హోదా లభించింది. 

దేశసేవ:

బంకిమ్ చంద్ర చటోపాధ్యాయ కేవలం రచయిత మాత్రమే కాదు; తన కలం ద్వారా జాతీయ చైతన్యాన్ని పెంపొందించిన మహనీయుడు. ఆధునిక బెంగాలీ నవలకు బలమైన పునాది వేశారు. భారతీయ సంస్కృతి, చరిత్ర, ఆధ్యాత్మికతను సాహిత్యంలో ప్రతిష్ఠించారు. "వందే మాతరం" ద్వారా దేశభక్తి భావాలను ప్రజల్లో నాటారు. స్వాతంత్ర్యోద్యమ నాయకులకు, యువతకు స్ఫూర్తినిచ్చారు. బెంగాల్ పునరుజ్జీవన (Bengal Renaissance) ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించారు. భారతీయ భాషల్లో సాహిత్య రచనలకు కొత్త ప్రమాణాలను నెలకొల్పారు.

చివరి రోజులు, వారసత్వం:

జీవితాంతం సాహిత్య సేవలో నిమగ్నమైన బంకిమ్ చంద్ర చటోపాధ్యాయ 1894 ఏప్రిల్ 8న కలకత్తాలో మధుమేహం వల్ల వచ్చిన సమస్యలతో కన్నుమూశారు. ఆయన మరణించినప్పటికీ ఆయన రచనలు, ఆలోచనలు భారతీయులలో దేశభక్తిని, సాంస్కృతిక గౌరవాన్ని నేటికీ ప్రేరేపిస్తున్నాయి. 

బంకిమ్ చంద్ర చటోపాధ్యాయ భారతదేశ సాహిత్య చరిత్రలో చిరస్మరణీయ వ్యక్తి. ఆయన రచించిన "వందే మాతరం" స్వాతంత్ర్య సమరంలో కోట్లాది భారతీయులకు స్ఫూర్తిగా నిలిచింది. ఆధునిక భారతీయ సాహిత్య వికాసంలో ఆయన చేసిన కృషి అపూర్వమైనది. బెంగాలీ భాషను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. దేశభక్తి, సాహిత్యం, సంస్కృతి అనే మూడు రంగాలలో ఆయన  చూపిన ప్రభావం నేటికీ కొనసాగుతోంది. 

11, జూన్ 2026, గురువారం

భారపు పగ్గాలు - కథ (11/06/2018)


"ఇంకా ఎన్నాళ్లు మావయ్యా ఇలా మాటల్లేకుండా? ఎప్పుడో ముప్ఫై ఏళ్ల క్రితం, పూర్తిగా భిన్నమైన పరిస్థితులలో, అపోహలు, అపార్థాల వల్ల దూరమైన బంధుత్వాలు ఇప్పటికైనా ఒకటి కావాలి. మాకు మాత్రం ఎవరున్నారు చెప్పు? అమ్మ, నాన్నలు కూడా పెద్దవారయ్యారు. మీరు మాట్లాడుకోవటం లేదనే కానీ మీరంటే అమ్మకు చాలా అభిమానం మావయ్యా. ఆలోచించండి..." అన్నాడు విశ్వం. ఆలోచనలో పడ్డాడు 58 ఏళ్ల సత్యం. విశ్వం సత్యం చెల్లెలు గౌరి కొడుకు. తనకూ చెల్లెలిని చూడాలని, మాట్లాడాలనే ఉంది, కానీ పెద్దవాడినన్న అహంకారం ఇంకా ముందడుగు వేయనీయట్లేదు. ఆలోచనలు ముప్ఫై ఏళ్లు వెనక్కి వెళ్లాయి. 

"గౌరీ! చదువు పూర్తైంది, మంచి బ్యాంక్ ఉద్యోగంలో చేరావు. ఇక పెళ్లి చేసుకుంటే మంచిది కదమ్మా! మీ వదిన వాళ్ల దూరపు బంధువు ఒక అబ్బాయి ఉన్నాడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబేషనరీ ఆఫీసర్. నీ ఉద్యోగానికి, చదువుకు అనువైన సంబంధం. వాళ్లు నిన్ను మా పెళ్లిలో చూశారుట. మీ వదినను రెండు మూడు సార్లు అడిగారు...ఏమంటావ్?" అన్నాడు సత్యం. "ఒరేయ్ సత్యం! మనమ్మాయి అదృష్టవంతురాలు, దాన్ని అడిగేదేముంది, వెంటనే వాళ్లను పెళ్లి చూపులకు రమ్మని చెప్పు" అంది సత్యం, గౌరిల తల్లి సావిత్రమ్మ. భర్త చిన్న వయసులోనే మరణిస్తే కష్టపడి పిల్లలను చదివించి పెద్ద చేసింది. సత్యం పెళ్లి ఓ రెండేళ్ల క్రితమే అయ్యింది. సత్యం భార్య రమ గవర్నమెంట్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్. సత్యం ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంటులో మంచి ఉద్యోగస్థుడు. సత్యం, రమలకు గౌరి అంటే చాలా ఇష్టం. ముగ్గురూ స్నేహితుల్లా ఉంటారు. 

"సూర్యం! అమ్మ, అన్నయ్య నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తున్నారు. మన ప్రేమ సంగతి ఎవ్వరికీ తెలియదు. అందరూ ఈ సంబంధం నాకు కుదిరినట్లే అన్నట్లు మాట్లాడుకుంటున్నారు. నాకు ఏమీ తోచటం లేదు...మీ ఇంట్లో పరిస్థితులు మెరుగు పడ్డాక మా ఇంట్లో మన ప్రేమ గురించి చెబుదామని ఆగాను" అంది. "గౌరీ! ఇప్పుడున్న పరిస్థితులలో మన వివాహం వెంటనే జరగటం అసంభవం, నాన్న గారు మంచంలో ఉన్నారు, పెళ్లి ప్రస్తావన తెచ్చే పరిస్థితులు మా ఇంట్లో లేవు..." అన్నాడు. సూర్యం పరిస్థితి తెలిసిన గౌరికి ఏమి చేయాలో అర్థం కావట్లేదు. పెళ్లి చూపుల రోజు దగ్గర పడుతోంది. సూర్యాన్ని వదులుకొని ఈ పెళ్లికి తలవంచే మనస్తత్వం గౌరికి లేదు. ఇప్పటికే మనసా వాచా సూర్యమే తన భర్త అని భావించింది. 

"అన్నయ్యా, వదినా! నేను ఈ పెళ్లి చూపులకు సిద్ధంగా లేను. నేను ఇప్పటికే మా బ్యాంకులో సహోద్యోగి సూర్యాన్ని ప్రేమిస్తున్నాను. అతనే నా భర్త కావాలని నా సంకల్పం. నన్ను క్షమించండి. మీకు ఈ విషయం చెప్పలేకపోయాను. సూర్యం ఇంట్లో పరిస్థితుల వలన ఇంకొన్నాళ్లు ఆగి చెబుదామనుకున్నాను" అని ధైర్యం తెచ్చుకుని చెప్పేసింది గౌరి. సత్యం మొహం ఎర్రబడింది. తను అంతగా ప్రేమించే చెల్లెలు తనతో జీవితంలో అతి ముఖ్యమైన విషయం పంచుకోలేదన్న ఆవేదన, రమ బంధువుల వద్ద తన మాటపోయిందన్న ఆక్రోశం అతని మనసును పాషాణం చేశాయి. రమ కూడా తను గౌరితో అంత చనువుగా ఉంటుంది, ఏ ఒక్కరోజు కూడా మనసులోని మాట చెప్పలేదని నొచ్చుకుంది. అంతే, ఆ రోజు నుండి ఆ భార్య భర్తలు గౌరితో మాట్లాడటం మానేశారు. గౌరి ఎంత ప్రయత్నించినా, సావిత్రమ్మ ఎంత చెప్పినా సత్యం మనసు కరగలేదు, ,గౌరి కూడా వెనుకడుగు వేయలేదు. గౌరి ఇంట్లో నుంచి బయటకు వెళ్లి స్నేహితురాలితో కలిసి ఉండటం మొదలు పెట్టింది. బిడ్డల మధ్య ఈ మనస్పర్థలతో సావిత్రమ్మ నలిగిపోయింది. నిస్సహాయతతో మౌనంగా ఉండిపోయింది. ఓ నాలుగు నెలలకు సూర్యం తండ్రి ఆరోగ్యం కుదుటపడింది. సూర్యం, గౌరి వివాహం చేసుకున్నారు. తన వైపు వారెవ్వరూ రాలేదన్న విషయం గౌరిని బాధించినా తన జీవితం సూర్యంతోనే అనుకుని వైవాహిక జీవితం ఆరంభించింది. గౌరికి పిల్లలు పుట్టారని తెలిసినా, సత్యం వెళ్లలేదు. ఎవరి సంసారాలు వాళ్లవి. తీరని అగాథం ఆ అన్నాచెల్లెళ్ల మధ్య ఏర్పడింది. "ఒరేయ్ సత్యం, అమ్మా రమా! మీ అందరి పంతాలు, పట్టింపులు ఎలా ఉన్నా, నా కన్న ప్రేమను నేను చంపుకోలేను. గౌరి కాన్పులకు కూడా పెద్దగా సాయం చేయలేకపోయాను. ఇక నావల్ల కాదు. నేను మాత్రం అప్పుడప్పుడు గౌరి వాళ్లింటికి వెళ్లి వస్తూ ఉంటాను. మీరు అడ్డు చెప్పవద్దు" అని గట్టిగానే కొడుకుకు, కోడలికి తన మనసులోని మాట చెప్పింది. పరిస్థితి అర్థమై వారు ఏమీ మాట్లాడలేదు. 

శుభకార్యాలలో కలుసుకున్నా, సత్యం-గౌరి ఒకరినొకరు పలకరించుకోకపోవటం, నచ్చజెప్పే పెద్దలను విసుక్కోవటం...ఇద్దరికీ పిల్లలు, స్కూళ్లు బాధ్యతలు. అలా ఓ 15 ఏళ్లు గడిచిపోయాయి. గౌరికి ఇద్దరు అబ్బాయిలు. పెద్దవాడు విశ్వనాథ్, చిన్నవాడు ఈశ్వర్. బంధాల మధ్య దూరాలు వచ్చినా రక్తసంబంధపు వాసనలు ఎక్కడకు పోతాయ్? విశ్వం అచ్చం మేనమామ సత్యం పోలికే. రెండు తరాలు ఆ కుటుంబాన్ని చూసినవారు విశ్వాన్ని చూసి సత్యం పోలికలని ఇట్టే గుర్తు పట్టేంత ప్రస్ఫుటం. అందరూ నువ్వు మీ మావయ్య పోలికే అని చెబుతూ ఉంటే మావయ్యను కలుసుకోవాలని, మాట్లాడాలన్న కుతూహలం విశ్వానికి కలిగింది. అమ్మమ్మ సావిత్రమ్మతో తన మాన్సులోని మాటను బయట పెట్టాడు. కొడుకు ఆగ్రహం తెలిసిన సావిత్రమ్మ చాలా సార్లు ఆ ప్రస్తావనను వినీ వినననట్టు ఊరుకున్నా, విశ్వం మొండి పట్టు పట్టాడు. "అమ్మమ్మా! నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నేను మావయ్యను కలవాల్సిందే" అన్నాడు. 

"సత్యం! గౌరి కొడుకు విశ్వం....." అనబోయింది సావిత్రమ్మ. "ఆ విశ్వం?" అని తీక్షణంగా ప్రశ్నించాడు. కూతురు పేరెత్తితేనే కొడుకు రౌద్ర రూపం దాలుస్తున్నాడని భయపడింది. ధైర్యం చేసి "విశ్వం అని గౌరి పెద్ద కొడుకు. వాడు నిన్ను కలవాలనుకుంటున్నాడు..." అంది. "నాతో ఏం పని? వాళ్లమ్మ చేసిన ఘన కార్యానికి వివరణ ఇచ్చుకుంటాడా?" అని తిరిగి ప్రశ్నించాడు సత్యం. "లేదురా, ఒక్కసారి నిన్ను కలుద్దామని అనుకున్నాడు. వాడివి అన్నీ నీ పోలికలే" అని సావిత్రమ్మ. కోపంగా, కుతుహూలంగా అమ్మవైపు చూసి మౌనంగా సరే అన్నాడు. విశ్వం లోపలకి వచ్చాడు. అందరూ అతన్ని చూసి ఆశ్చర్యపోయారు. చిన్ననాటి సత్యం ఎదుట నిలిచాడా అన్నట్లున్నాడు. తనను పరిచయం చేసుకుని కాసేపు ఉండి వెళ్లిపోయాడు విశ్వం. అతని మాటలు, నడవడిక అంతా సత్యం లాగనే ఉండటంతో అతనిపై అందరికీ వాత్సల్యం వెంటనే కలిగింది. అలా చిగురించటం మొదలైంది విశ్వంతో బంధం. 

ఆలోచనల పరంపర నుండి వర్తమానంలోకి వచ్చాడు సత్యం. విశ్వం అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పవచ్చు. కానీ, వెంటనే చెప్పలేదు. ఓ పది నిమిషాల తరువాత - "విశ్వం! వాళ్లు మా మాట కాదని పెళ్లి చేసుకున్నారు అన్న దాని కన్నా ఈ ఇల్లు వదిలి వెళ్లి ముప్ఫై ఏళ్లైంది, తిరిగి వచ్చి నాతో, మీ అత్తయ్యతో మాట్లాడాలని ఎప్పుడూ మీ అమ్మ, నాన్నలకు అనిపించలేదు అన్న విషయం నన్ను చాలా బాధిస్తుంది. సాటి స్నేహితుల్లా ఉండే వాళ్లం, మాతో ఉన్న అనుబంధానికి పెళ్లైన తరువాత వచ్చి మాట్లాడవలసిన బాధ్యత తనది కదా?" అని ప్రశ్నించాడు సత్యం. "మావయ్యా! మీ మాట కాదని వెళ్లినందుకు అపరాధ భావంతోనే అమ్మ తిరిగి రాలేదు. తన ప్రస్తావన వచ్చినప్పుడల్లా మీరు ఎంత కోపం ప్రదర్శించేవారు అమ్మమ్మ ద్వారా తెలుసుకుని ఇక్కడికి రావటానికి మరింత భయపడ్డానని అమ్మ చెప్పింది" అన్నాడు. 

ఇదే సమయం అనుకుని సావిత్రమ్మ కొడుకుతో - "నాన్నా సత్యం! నేను పెద్ద దాన్ని అయ్యాను. ఎన్నాళ్లుంటానో తెలియదు. మీరు ఉన్నది ఇద్దరు, మీరు కలిసి మెలిసి ఉండకపోవటం అనేది నా జీవితంలో ఓ పెద్ద వెలితి. ఈ రెండు కుటుంబాలు ఒకటి కావాలి. ఆడపిల్ల ఇంటికి వస్తూ పోతూ ఉంటేనే మనకు కూడా శుభం. ఇన్నాళ్లు ఎలానూ లేదు, ఇకనైనా ప్రయత్నిస్తే బాగుంటుంది" అంది. రమ కూడా "అత్తయ్యగారు చెప్పింది నిజమే, తోబుట్టువులతో ఉన్న ఆనందం ఎక్కడా దొరకదండీ. తప్పొప్పులు పక్కకు పెడదాం. మనం కూడా రిటైర్మెంట్ దగ్గర పడుతున్నాం. మనస్పర్థలు మరచిపోయి ఆనందంగా ఉండవలసిన సమయం. పిల్లలకు కూడా ఈ బంధాలు ఎంతో అవసరం..." అంది. ఆలోచనలో పడ్డాడు సత్యం. సమాధానం చెప్పకుండా అక్కడి నుండి వెళ్లిపోయాడు.

ఆదివారం మధ్యాహ్నం. బెల్ మోగింది. తలుపు తెరిచిన గౌరి ఎదుట అన్నయ్య సత్యాన్ని చూసి నోటమాట రాలేదు. "అమ్మా, ఎవరు వచ్చారో చూడు" అని మావయ్య వెనక నుండి పక్కకు వచ్చి హత్తుకుంటూ చెప్పాడు విశ్వం. సావిత్రమ్మ, రమ గౌరికి చెరో పక్క నిలుచుని అన్నాచెల్లెళ్లు మళ్లీ కలుసుకునే అపురూపమైన ఘట్టాన్ని ఆస్వాదించారు. 

"అన్నయ్యా, వదినా - నన్ను క్షమించండి. ఆనాడు యుక్తవయస్సులో ఉన్న ఆత్మాభిమానంతో, మీరంటే ఉన్న భయంతో, నేను ముందడుగు వేయలేకపోయాను. పిల్లలు పెద్దై, వయసు మళ్లుతున్న సమయంలో నా వాళ్లు కావాలి అన్నది మరింత తెలిసి లోలోపల కుమిలిపోతున్నాను. విశ్వం పుణ్యమా అని మీరు నా ఇంటికి వచ్చారు. నా పట్ల మీరు చూపించిన వాత్సల్యానికి, సాన్నిహిత్యానికి బదులుగా సూర్యంతో నా ప్రేమను సరైన సమయంలో మీకు తెలుపలేకపోయాను...ఇప్పుడు ఆలోచిస్తే ఎంత చిన్న విషయం అనిపిస్తోంది. నన్ను ఆయన ఎంత బాగా చూసుకున్నా, నా వాళ్లు నా ఆనంద జీవితంలో భాగంగా లేరు అన్నది చాలా పెద్ద లోటుగా ఉండేది. అహంకారం, భయం నన్ను ఆ ఇంట మళ్లీ అడుగుపెట్టనీయకుండా చేశాయి" అని కన్నీళ్లు రాలుస్తూ అన్నా వదినలకు నమస్కరించంది. "గౌరీ! మీ వదిన నీకిష్టమని జీడిపప్పు పాకం తీసుకువచ్చింది" అని నవ్వుతూ చెల్లెలెని దగ్గరకు తీసుకున్నాడు సత్యం. సూర్యం కూడా విశ్వాన్ని  అభినందించాడు. ఆ జంటలు మళ్లీ కొత్త జీవితాన్ని ఆరంభించాయి. సావిత్రమ్మ గుండె బరువు తగ్గింది. ఎన్నో ఏళ్ల తరువాత నిజమైన సంక్రాంతి పండుగ వచ్చింది అని పిల్లలను ఆశీర్వదించింది. 

7, జూన్ 2026, ఆదివారం

నర్తనశాల చిత్రంలో ఎన్టీఆర్ బృహన్నల పాత్ర

అభినయంలో నవరసాలను, స్త్రీపురుష హావభావాలను ఏకకాలంలో ఎలా కనబరచాలో అన్నదానికి పాఠ్యాంశంగా చెప్పుకునే సన్నివేశం 1963లో విడుదలైన రాజ్యం పిక్చర్స్ వారి నర్తనశాల చిత్రంలో బృహన్నల-ఉత్తర మధ్య చిత్రీకరించబడిన సలలితరాగసుధారససారం అన్న గీతం. 

ఎన్టీఆర్ మేటి హీరోగా ఉన్నప్పుడు బృహన్నల లాంటి విభిన్నమైన, క్లిష్టమైన పాత్ర ఒప్పుకునే సాహసం చేశారు చూడండి, దానికి ఆయనకు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ అన్నది బిరుదు పూర్తిగా సముచితం. అనన్యపరాక్రమశూరుడు, పౌరుషానికి మారుపేరైన వీరాధివీరుడు అర్జునుని పాత్ర నుండి పేడి బృహన్నల పాత్రలోకి నందమూర్తి తారకరామారావు గారు ఎలా రూపాంతరం చెంది పాత్రలో పరకాయప్రవేశం చేశారో ఈ పాట, చిత్రంలో మిగిలిన సన్నివేశాలలో కూడా బృహన్నలగా ఆయన నటన చూస్తే అర్థమవుతుంది. కాటుక పెట్టుకుని, స్త్రీలు ధరించే కొన్ని ఆభరణాలు ధరించే, వీరత్వానికి సూచికగా ఉండే చంద్రవంకను తిలకంగా ధరించి, వస్త్రధారణ స్త్రీపురుషుల ఆహార్యానికి అనువుగా ఎంచుకోవటం ఒక వైపు, నడకలో, కంటిచూపులోని భావనల్లో వీర శృంగార రసాలు, నాట్యశాస్త్రంలోని మెలకువలు ఒకపక్క గొప్ప శాస్త్రీయ నృత్య విదుషీమణి అయిన ఎల్ విజయలక్ష్మి గారి పక్కన పూర్తిగా దీటుగా, సముచితంగా నటించగలగటం...నందమూరి వారి పట్టుదలకు, కౌశలానికి చుక్కాని. ఇంతే కాదు సముద్రాల వారి సాహిత్యం, సుసర్ల దక్షిణామూర్తి గారి సంగీతం, మంగళంపల్లి వారి గాత్రం...ఇవన్నీ కూడా మేళవించబడిన పాట ఇది, దానికి పూర్తి న్యాయం చేయాలంటే ఎన్టీఆర్ ఎంతటి సాధన చేసుంటారో ఊహించండి. 

ఈరోజు హీరోలకు కండలు పెంచి, బూతులు మాట్లాడుతూ, ఒక వందమందిని చితకతన్ని, స్కార్పియోలను, ఫార్చూనర్లను గాల్లోకి ఎగిరేసే సూడోవీరలక్షణాల మీద దృష్టి. బృహన్నల లాంటి పాత్రలు వేయగలిగితే నటనలోని నిజమైన క్లిష్టత అర్థమవుతుంది. నటన అంటే పాత్రకు, సన్నివేశానికి తగినట్లుగా పరకాయప్రవేశం చేయగలగటం. నిజంగా అది తపస్సే. నేటి నటుల్లో ప్రతిభకు కొదవలేదు, వైవిధ్యమైన పాత్రలను ఎంచుకోగలగటం, వాటిని ప్రజలు ఆదరించేలా నటించటం, ఆటుపోట్లను తట్టుకోవటం...ఇవి పెద్దగా లేవు. అందుకే ఇప్పటికీ హీరోలుగా నటనకు ఎన్టీఅర్, ఏఎన్నార్ ఉత్తమ ఉదాహరణలుగా నిలిచి ఉన్నారు.  

శ్రీ అవధూతేంద్ర సరస్వతి స్వామి


శ్రీ అవధూతేంద్ర సరస్వతి స్వామివారు ఆధునిక యుగంలో నామసంకీర్తన మహిమను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసిన మహనీయ సద్గురువులలో అగ్రగణ్యులు. 1914 నవంబర్ 28వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి గ్రామంలో శ్రీ పెమ్మరాజు హనుమంతరావుగారు, శ్రీమతి పల్లాలమ్మగార్ల దంపతులకు జన్మించిన ఆయన, బాల్యం నుంచే భగవద్భక్తి, సంగీతాభిరుచి, ఆధ్యాత్మిక చింతనలతో విశిష్టతను ప్రదర్శించారు.

యౌవనంలో భక్తి నాటకాలలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వంటి దైవపాత్రలను ధరించి భక్తజనులను ఆకట్టుకున్న ఆయన, క్రమంగా భగవన్నామ మహిమను గ్రహించి సంపూర్ణంగా ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించారు. అనంతరం “శ్రీ సియా రఘువరదాసు” అనే నామాన్ని స్వీకరించి, శ్రీరామనామ జపం, భజన, రామాయణ పారాయణం మరియు సత్సంగ ప్రచారాన్ని తన జీవిత ధ్యేయంగా చేసుకున్నారు. భక్తి, వైరాగ్య, జ్ఞాన సంపత్తులతో అలంకృతులై “శ్రీ అవధూతేంద్ర సరస్వతి” అనే గౌరవనామంతో భక్తులచే ఆరాధింపబడ్డారు.

స్వామివారి జీవితమంతా భగవన్నామ ప్రచారానికే అంకితమైంది. ముఖ్యంగా “హరే రామ హరే రామ, రామ రామ హరే హరే; హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే” మహామంత్రాన్ని గ్రామగ్రామాన ప్రచారం చేసి, వేలాది మందిని నామసంకీర్తన మార్గంలో నడిపించారు. ఆయన నిర్వహించిన ఏకాహాలు, సప్తాహాలు, అఖండ నామసంకీర్తన యజ్ఞాలు అనేక ప్రాంతాలలో భక్తి జ్యోతిని వెలిగించాయి. సామాన్యులు సైతం సులభంగా ఆచరించగల ఆధ్యాత్మిక సాధనగా నామస్మరణను ఆయన ప్రతిపాదించారు.

హనుమాన్ చాలీసా పారాయణ ప్రచారంలో కూడా స్వామివారి పాత్ర విశేషమైనది. శ్రీ ఆంజనేయస్వామి అనుగ్రహమే కలియుగంలో భక్తులకు రక్షణ కవచమని బోధిస్తూ, హనుమాన్ చాలీసా పారాయణాన్ని ప్రతి ఇంటికీ చేర్చారు. ఆయన ఉపదేశం వలన అనేక కుటుంబాలు భక్తి, ధర్మ, సత్సంగ మార్గాలలో స్థిరపడ్డాయి.

స్వామివారి ఆధ్యాత్మిక మహత్తు కేవలం ఉపన్యాసాలలోనే కాదు, ఆయన జీవన విధానంలోనూ ప్రతిఫలించింది. నిరాడంబర జీవనం, అహంకార రాహిత్యం, సర్వజీవ దయ, గురుభక్తి, నిరంతర రామనామ స్మరణ ఆయన వ్యక్తిత్వానికి మూల స్తంభాలు. ఆయన సమీపంలో ఉన్నవారు ఒక అపూర్వమైన శాంతి, ఆనందం, దైవసాన్నిధ్యాన్ని అనుభవించేవారని భక్తుల అనుభవాలు తెలుపుతున్నాయి.

స్వామివారు తన జీవితంలో విశేష కాలాన్ని నామసంకీర్తన ప్రచారానికే అంకితం చేశారు. ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర భారతంలోని అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించి రామనామ ప్రచారం చేశారు.

ప్రత్యేకంగా, బృందావనంలో కొంతకాలం నివసించి భగవన్నామ రసానుభూతిలో మునిగిపోయారని భక్తుల వర్ణనలు చెబుతాయి. అరుణాచలం (తిరువణ్ణామలై) సందర్శించి అక్కడి మహనీయులతో సత్సంగం చేసినట్లు శిష్యపరంపరలో ప్రస్తావన ఉంది. కాశీ, అయోధ్య, రామేశ్వరం, తిరుపతి, భద్రాచలం వంటి క్షేత్రాలలో నామసంకీర్తన కార్యక్రమాలు నిర్వహించినట్లు భక్తులు పేర్కొంటారు. గ్రామీణ ప్రాంతాలలో కూడా విస్తృతంగా పర్యటించి, భక్తిని ప్రజల జీవితంలో భాగం చేయడానికి అఖండ నామయజ్ఞాలను ప్రోత్సహించారు.

మహానుభావులతో సత్సంగం స్వామివారి జీవితంలో ఒక విశేషాంశం, ఆయన అనేక ఆధ్యాత్మిక మహనీయులతో కలసి ఉండటం.  భక్తుల స్మృతుల ప్రకారం ఆయనకు రమణమహర్షి పట్ల అత్యంత గౌరవభావం ఉండేది. జిల్లెళ్లమూడి అమ్మ, ఆనందమయి మా వంటి మహాత్ముల ప్రభావం ఆయనపై ఉన్నట్లు కొన్ని వృత్తాంతాలు సూచిస్తాయి.

దక్షిణ భారతంలోని అనేక వైష్ణవ, శైవ, అద్వైత సంప్రదాయ సన్యాసులతో సత్సంగాలు జరిగాయని భక్తులు చెబుతారు. నామసంకీర్తన సంప్రదాయాన్ని విస్తరించిన అనేక భజన మండలి నాయకులకు ఆయన ప్రత్యక్ష ప్రేరణగా నిలిచారు.

1975 జూన్ 11వ తేదీన స్వామివారు మహాసమాధి పొందినప్పటికీ, ఆయన వెలిగించిన నామసంకీర్తన జ్యోతి నేటికీ లక్షలాది భక్తుల హృదయాలలో ప్రకాశిస్తోంది. ఆయన స్థాపించిన భక్తి సంప్రదాయం, ఆయన గానం చేసిన భజనలు, ఆయన ప్రేరణతో కొనసాగుతున్న నామయజ్ఞాలు ఆయన మహోన్నత ఆధ్యాత్మిక వారసత్వానికి నిదర్శనాలు.

శ్రీ అవధూతేంద్ర సరస్వతి స్వామివారు కలియుగంలో “నామమే పరమౌషధం, నామమే పరమపథం” అనే సత్యాన్ని తన జీవితంతో ఆచరించి చూపిన మహాభాగవతులు. భగవన్నామాన్ని శ్వాసగా, భక్తిని స్వభావంగా, లోకక్షేమాన్ని లక్ష్యంగా చేసుకున్న ఈ మహాత్ముడు భక్తి మార్గంలో నిత్య ప్రేరణాస్వరూపుడిగా చిరస్మరణీయులు.

“రామనామమే ఆయన ప్రాణం; భక్తుల ఉద్ధరణమే ఆయన జీవన ధ్యేయం.” 

6, జూన్ 2026, శనివారం

జిల్లెళ్లమూడి అమ్మ దేవీ స్తవం - పన్నాల రాధాకృష్ణశర్మ


 జిల్లెళ్లమూడి అమ్మ అనసూయమాతపై సంస్కృతాంధ్ర పండితులు, అమ్మ భక్తులు పన్నాల రాధాకృష్ణశర్మ గారు రచించిన అంబికా స్తవకదంబమ్‌ (సంధ్యావందనం) అనే పుస్తకం నుండి అద్భుతమైన దేవీ స్తవం, దాని అర్థం:  

మాయావిలాసధృతకాయా మహర్షిచయగేయాతివేలసుగుణ
ధ్యేయాభిరామమహిమాయామశోభితపదా యా విరాజతి సదా!
సాఽయావహాఽతి మహనీయార్థ విస్ఫురితవైయాత్యభావ్యవచనా
పాయాదిమంసుతమపాయాబ్ధి మగ్నమనసూయాభిదా భగవతీ॥

హాస్యామలాంశుమధురాస్యా హృదీశవరివస్యాపరోల్లసతి యా
శాస్యామరప్రకరశస్యాను సేవననిజాస్యాదృతార్కనగరి!
యస్యాఃపదాబ్జయుగదాస్యామృతం ప్రమదసస్యాభివర్ధనచణం
తస్యా మనోస్స్మరణ మాస్యాంతరే మమ సదా స్యాత్త్రదాదరబలాత్‌॥

నాగేశ్వరాఖ్యసుమనోగేహినీ పరమయోగేశ్వరాత్మనిలయా
యాగేశ్వరాదిసురపూగేడితా భుజగభోగేన మండితగళా!
రాగే స్థితాప్యచలయోగే రతా శమనుయోగేన లాలితజనా
ద్రాగేవ మే వదనభాగే పదాంబుజపరాగేన యచ్ఛతు గిరమ్‌॥

రంభోర్వశీప్రముఖరంభోరుసంభరితదంభోళిపాణిభవనా
రంభోత్సవోల్లసదదంభోపలబ్ధిచరణాంభోజపూతనిలయే!
రంభోపమోక్తిమణిలంభోజ్జ్వలే! పితృకులాంభోనిధే శ్శశికళే!
త్వం భోజనైకమతికుంభోదరానుజ మిమం భో భవాని! భర మామ్‌॥

నీలాభిరామమృదుచేలాన్వితా కనకలీలాంచితాంగలతికా
కాలాభ్రచారుతరమాలామిరమ్మద విభాలాసికాంహసతి యా।
బాలారుణాభవదనా లాలితప్రసవమాలామనోజ్ఞచికురా
హాలాహలాత్మఖలజాలావనప్రవణశీలా శివా భరతు సా॥

చక్రాధిశక్తివలయాక్రామణైకరతవక్రాతిశక్తిమహితా
విక్రాంతభీమరిపుచక్రాద్రిభేదిపటుశక్రాయుధాయితవదా!
నక్రాలయాభభవచక్రాతిపీడనభయాక్రాంత మేన మబలం
చక్రాయుధా భగవతీ క్రాంతిమార్గసుపరిక్రాంత మావహతు మామ్‌॥

వందారులోకశుభసందాయినీం విబుధవందాభివందితపదాం
మందాకినీసరిదమందాచ్ఛకాంతిభరసందానయోగ్యచరణామ్‌
కుందావదాతరుచితుందాభిరామరదనాం దాసపోషణరతాం
వందామహే భగవతీం దారుణాఘవనసందాహపావకశిఖామ్‌॥

సాక్షాద్రమా భువనరక్షాపరిష్కరణదక్షా నితాంతవిలస
ద్వీక్షాకృపామృతఝరీక్షాళితాఽఽశ్రితజనాక్షాంతకల్మషభరా
పక్షాయితా విగతపక్షావళేః పృథుతరక్షాంతినినిర్జితధరా
ద్రాక్షారసాత్కవనదీక్షాం దదాత్వభయభిక్షాంచ మే భగవతీ॥

అమ్మా! భగవతీ! శ్రీ అనసూయాదేవీ! నీవు లీలామానుష విగ్రహవు, మహర్షుల చేత కీర్తింపబడిన గుణపుంజమవు. ధ్యానింపదగిన మహిమాన్వితమైన పాదపద్మయుగములతో ప్రకాశించుదానవు. సంధ్యాగోష్ఠులలో సులభమైన, సరళమైన శైలిలో మహార్థములను స్ఫురింపచేయుదానవు. ఈ నీ బిడ్డలను సర్వాపదల నుండి రక్షించు. 

అమ్మా! నీవు మందహాస వదనారవిందవు. దేవతానీకముచే సేవింపబడుదానవు. నీ పాదసేవా భాగ్యము చేత మా జీవితములో ఆనందమనే పంటను అనుభవింపచేయ సమర్థురాలవు. నా నోటితో నిన్ను నిరంతరము స్తోత్రము చేస్తూ, మనస్సునందు ధ్యానిస్తూ ఉండునట్లు అనుగ్రహించు. 

అమ్మా! నీవు శ్రీ నాగేశ్వరుని ధర్మపత్నివి. యోగీశ్వరుల హృదయములే నిలయముగా కలదానవు. దేవతలచే స్తుతింపబడే భుజంగభూషణవు. సంసారములో ఉన్నా సహజసమాధి నిష్ఠయందే ఉండుదానవు. శమదమాదిసంపన్నవు. నిన్ను స్తోత్రము చేయదగిన మంగళవాక్కులను నాకు ప్రసాదించు. 

అమ్మా! భవానీ! నీ ఇల్లు “అందరిల్లు” అయి, నిత్యకళ్యాణము పచ్చతోరణముతో ఇంద్రభవనముగ పోలియున్నది. నీ మాటలు అరటిపండువలె తియ్యనైనవి. నీవు వంశమునకు చంద్రకళవు . అత్యంత అన్నాసక్తుడనైన నాకు మృష్టాన్నములను ప్రసాదించు.

అమ్మా! భవానీ! నీవు నీలవస్త్రాభిరామవు, కనకాభరణభూషితవు, మెరుపు తీగ వెనక మేఘము వలె ప్రకాశించుదానవు. బాలారుణ తేజస్సుతో పుష్పమాలాలంకృత కేశపాశములతో దర్శనీయగా ఉండుదానవు. దుష్టశిక్షణమాత్రమేగాక వారిలో సత్ప్రవర్తన కలిగించు స్వభావము కలదానవు. నన్ను అనుగ్రహించు.

అమ్మా! వైష్ణవీ! చక్రాయుధము యొక్క పరాక్రమమునుఅతిక్రమించే మహిమ కలదానవు. నీ పాదములు శత్రు సముదాయములు అనే పర్వతములను ఛేదించగల వజ్రశక్తి కలిగి యున్నవి. సంసారసాగరముచే పీడింపబడుతూ అశక్తుడనైన నన్ను చక్రహస్తురాలవైన నీవు జ్ఞానపథమున నడిపించి రక్షించు.

అమ్మా! శ్రీ అనసూయా మాతా! నమస్కరించు వారిని రక్షించుదానవు. విబుధవంద్యవు. స్వచ్ఛగంగానదివలె పవిత్రమైన పాదపద్మములు కలదానవు. మల్లెపూలవలె తెల్లనైన దంతశోభ కలదానవు. దాసపోషిణివి. నన్ను సర్వపాపముల నుండి రక్షించు.

ఓ అమ్మా! రమాదేవివలె ఆశ్రితుల రక్షణ కొరకు దీక్షాకంకణము ధరించిన నీవు నా పాపపంకమును నీ కటాక్షదృష్టిచే నివారించు. సహనశీలవు. నాకు అమృతోపమానమైన వాగ్రూపశక్తిని ఇచ్చిఅభయప్రదానము అనుగ్రహించు.

https://www.youtube.com/watch?v=fqN6Un3ASmg

మహా చతుష్షష్టి కోటి యోగినీ గణ సేవితా - భాస్కరరాయల అనుభవం

 


17/18వ శతాబ్దాలకు చెందిన భాస్కరరాయల వారి సౌభాగ్య భాస్కర భాష్యం (లలితా సహస్రనామంపై) జగత్ప్రసిద్ధమైనది. ఆయన 1690లో హైదరాబాదులో జన్మించి తరువాత తంజావూరు శెర్ఫోజీ మహారాజు ఆహ్వానంపై ద్రావిడ దేశంలో స్థిరపడ్డారు. ఆయన మహా శ్రీవిద్యోపాసకులు.  40కి పైగా అద్భుత ఆధ్యాత్మిక రచనలను చేశారు. వాటిలో ముఖ్యమైనవి త్రిపురోపనిషత్తు, భావనోపనిషత్తు, దుర్గాసప్తశతిపై గుప్తవతీ భాష్యం, శ్రీవిద్యోపాసనపై వరివస్య రహస్య భాష్యం, త్రిపురసుందరీ తాంత్రిక ఉపాసనపై సేతుబంధ భాష్యం వంటివి ఎన్నో రచించారు. సౌభాగ్య భాస్కర భాష్యం 1728వ సంవత్సరంలో పూర్తి చేశారు. శాక్తేయ వాఙ్మయానికి జవసత్వాలు పోసిన వారు భాస్కరరాయల వారు.  

ఒకసారి శ్రీలలితా సహస్రనామానికి భాష్యం రాసి, అమ్మవారి అనుగ్రహం పొందిన శ్రీ భాస్కరరాయలు కాశీ రాజుకు సహస్రనామాల అర్థం చెబుతున్నారు. అప్పుడు “మహా చతుష్షష్టి కోటి యోగినీ గణ సేవితా” అనే నామాన్ని వివరిస్తూ, అమ్మవారిని చుట్టుముట్టి ఉన్న 64 కోట్ల యోగినిలు ఎల్లప్పుడూ ఆమెను సేవిస్తూ, ఆరాధిస్తూ ఉంటారని చెప్పారు.

అది విన్న రాజసభలోని కొందరు పండితులు గట్టిగా నవ్వారు. వారికి భాస్కరరాయలపై అసూయ ఉండేది. వెంటనే వారు, “ఆ 64 కోట్ల యోగినిల గురించి మీకు నిజంగానే తెలుసా? అయితే వారి వివరాలన్నీ చెప్పండి” అని సవాలు చేశారు.

అప్పుడు భాస్కరరాయలు ఒక్కొక్క యోగిని పేరు, ఆమె వర్ణం, చేతిలో ఉన్న ఆయుధాలు, వస్త్రాల రంగు, ఆభరణాలు ఇలా వివరంగా చెప్పడం ప్రారంభించారు. ఆ పండితులు ఆయన ఎక్కడో ఆగిపోతారని అనుకొని, ఆయన చెప్పిన విషయాలన్నీ రాసుకోవడం మొదలుపెట్టారు. కానీ వారు పదివేల యోగినిల వివరాలు కూడా పూర్తిగా రాసుకోలేకపోయారు. అయితే భాస్కరరాయలు మాత్రం ఆగకుండా ప్రవాహంలా చెబుతూనే ఉన్నారు.

చివరికి తమ అహంకారం కరిగిపోయి, ఆ పండితులు భాస్కరరాయల పాదాల వద్దకు వచ్చి, “స్వామీ! మీకు ఈ 64 కోట్ల యోగినిల గురించి ఇంత వివరంగా ఎలా తెలుసు?” అని అడిగారు.

అప్పుడు భాస్కరరాయలు చిరునవ్వుతో ఇలా అన్నారు:

“ఇవన్నీ నేను చెప్పడం లేదు. అమ్మవారే ఒక పవిత్రమైన చిలుక రూపంలో నా భుజంపై కూర్చొని, నా కుడి చెవిలో ఈ విషయాలన్నీ చెబుతోంది. నేను ఆమె చెప్పిన మాటలనే మీకు చెబుతున్నాను.”

ఇదే అమ్మవారి కరుణ మహిమ.

ఈ లోకంలో చిలుక మనం నేర్పిన మాటలనే మళ్లీ చెబుతుంది. కానీ భక్తులు మాత్రం ‘శ్రీమాత’ అనే దివ్య చిలుక చెప్పే మాటలను అనుసరించాలి. అందుకే శ్రీ అభిరామి భట్టార్ అమ్మవారిని చిలుకతో పోల్చారు. అంతేకాదు, ఉన్నత స్థితికి చేరుకున్న సాధకుని మనసులో వెలిగే జ్ఞానదీపంగా కూడా ఆమెను వర్ణించారు.

సాధకుని హృదయంలో ఆమె స్వయంగా నివాసం ఏర్పరచుకుంటుంది. ఈ విశ్వమంతా ఆమె స్వరూపమే. సృష్టిలో ఉన్న పంచభూతాలన్నీ ఆమె రూపాలే. అటువంటి జగన్మాత తన భక్తులను అనుగ్రహించడానికి విగ్రహాల్లో, చిత్రాల్లో, పవిత్ర రూపాల్లో ప్రత్యక్షమవుతుంది.

ఈ శ్లోకం చెప్పే సందేశం ఏమిటి?

సర్వవ్యాపకురాలు, సర్వశక్తిమంతురాలు, సర్వజ్ఞురాలు అయిన అమ్మవారిని ఒక సాధకుడు నిరంతరం ధ్యానిస్తే, ఆమె స్వయంగా అతని అంతరంగంలో జ్ఞానదీపాన్ని వెలిగిస్తుంది. అతనిలోని అజ్ఞానాన్ని తొలగిస్తుంది. ఒక చిలుకలా దివ్యజ్ఞానాన్ని ఉపదేశించి, అతన్ని జ్యోతిస్స్వరూపుడిగా మారుస్తుంది. అప్పుడు అతడు మనసులోని భారాలన్నిటినీ విడిచిపెట్టి, ఆనందంగా, ప్రశాంతంగా జీవించగలుగుతాడు. 

మదురై మీనాక్షి అమ్మవారి కుడిభుజంపై ఉండే చిలుకకు అర్థం కూడా ఇటువంటి గూఢమైనదే, మనం చేసే ప్రార్థనలను శ్రద్ధగా విని మధురంగా అమ్మవారి చెవిలో వేస్తుందట. మరి ఇక అమ్మ మన కామ్యములను తీర్చవలసిందే కదా! 

1, జూన్ 2026, సోమవారం

కురై ఒన్రుం ఇల్లై మరైమూర్తి కణ్ణా




 కురై ఒన్రుం ఇల్లై మరైమూర్తి కణ్ణా కురై ఒన్రుం ఇల్లై కణ్ణా కురై ఒన్రుం ఇల్లై గోవిందా

కణ్ణుక్కు తెరియామల్ నిర్క్కిన్రాయ్ కణ్ణా కణ్ణుక్కు తెరియామల్ నిన్రాలూం ఎనక్కు

కురై ఒన్రుం ఇల్లై మరైమూర్తి కణ్ణా


వేండియదై తందిడ వేంకటేశన్ ఎన్రిరుక్క వేండియదు వేరిల్లై మరైమూర్తి కణ్ణా

మణివణ్ణా మలయప్పా గోవిందా గోవిందా

తిరైయిన్ పిన్ నిర్కిన్రాయ్ కణ్ణా ఉన్నై మరై ఓదుం జ్ఞానియర్ మట్టుమే కాణ్ పార్ ఎన్రాలుం కురై ఒన్రుం ఎనక్కిల్లై కణ్ణా ఎన్రాలుం కురై ఒన్రుం ఎనక్కిల్లై


కున్రిన్ మేల్ కల్లాగి నిర్క్కిన్ర వరదా కురై ఒన్రుం ఇల్లై మరైమూర్తి కణ్ణా

కురై ఒన్రుం ఇల్లై మరై మూర్తి కణ్ణా మణివణ్ణా మలయప్పా గోవిందా గోవిందా


కలినాళుక్కిరంగి కల్లిలే ఇరంగి నిలైయాగ కోయిలిల్ నిర్కిన్రాయ్ కేశవా

కురై ఒన్రుం ఇల్లై మరై మూర్తి కణ్ణా 

యాదుం మరుక్కాద మలయప్పా ఉన్ మార్బిల్ ఏదుం తర నిర్కుం కరుణై కడలన్నై

ఎన్రుం ఇరుందిడ ఏదు కురై ఎనక్కు ఒన్రుం కురై ఇల్లై మరైమూర్తి కణ్ణా

మణివణ్ణా మలయప్పా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా

నాకు ఒక్క ఫిర్యాదూ లేదు ఓ కన్నా! వేదాలు స్తుతించే పరమాత్మా! నాకు ఏ కష్టమూ లేదు కన్నా! నాకు ఎలాంటి లోటూ లేదు ఓ గోవిందా!

నీవు కనిపించకపోయినా ఓ కన్నా, అదిగో కనిపించకుండా దాగి ఉన్నా కూడా నాకు ఎలాంటి బాధ లేదు కన్నా! కోరికలన్నీ తీర్చే వెంకటేశ్వరుడు ఉండగా మాకు ఇంకేమి కావాలి కన్నా! నీలమణిలా ప్రకాశించే! తిరుమలగిరి దేవరా! గోవిందా!

నీవు తెర వెనుక నిలబడి ఉన్నావు కన్నా! వేదజ్ఞులు, జ్ఞానులు మాత్రమే నిన్ను దర్శించగలరు. అయినా నేను నిన్ను చూడలేకపోయాననినాకు ఎలాంటి ఫిర్యాదు లేదు.

ఆ కొండ శిఖరంపై నీవు శిలవలె నిలబడి ఉన్నావు. అయినా నాకు ఎలాంటి బాధ లేదు. ఈ కలియుగాన్ని దృష్టిలో ఉంచుకుని నీవు ఈ శిలారూపాన్ని ధరించావు. ఈ ఆలయంలో శాశ్వతంగా నిలిచిపోయావు.

భక్తుల కోరికలను నీవెప్పుడూ తిరస్కరించవు. అపార కరుణామయి మహాలక్ష్మి నీ హృదయంలో నివసిస్తోంది. అలాంటి పరిస్థితిలో నాకు ఏ లోటు ఉండగలదు?

నాకు ఎలాంటి ఫిర్యాదు లేదు కన్నా! నీలమణిలా ప్రకాశించే! తిరుమలగిరి దేవరా! గోవిందా!

- చక్రవర్తి రాజగోపాలాచారి గారు