అంతా రామమయం ఈ జగమంతా రామమయం
అంతరంగమున ఆత్మారాముడనంత రూపముల వింతలు సలుపగ
సోమసూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీజంబులు
అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగ
నదులు వనంబులు నానా మృగములు విదిత కర్మములు వేద శాస్త్రములు
అష్టదిక్కులను ఆదిశేషుడును అష్టవసువులను అరిషడ్వర్గము
ధీరుడు భద్రాచల రామదాసుని కోరికలొసగెడు తారక నామము
ఈ జగమంతా రామమయం. మన అంతరంగంలో ఆత్మారాముడై వెలసే శ్రీరాముడు అనంతమైన రూపాలలో వింతలను ప్రదర్శిస్తున్నాడు. చంద్రుడు, సూర్యుడు, దేవతలు, నక్షత్రాలు, మహాసముద్రాలు, భూమి మొదలైన సమస్త సృష్టి ఆయనతోనే నిండి ఉంది. అండపిండబ్రహ్మాండములు, బ్రహ్మ మొదలైన సృష్టికారకులు, నదులు, అడవులు, అనేక జంతుజాలాలు, విధిగా చేయవలసిన కర్మలు, వేదశాస్త్రాలు అన్నీ కూడా రామమయమే. ఎనిమిది దిక్కులు, ఆదిశేషుడు, అష్టవసువులు (ఆపుడు, ధ్రువుడు, సోముడు, అధ్వరుడు, అనిలుడు, ప్రత్యూషుడు, అనలుడు, ప్రభాసుడు), మనిషిని బంధించే అరిషడ్వర్గములు (కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు) కూడా రాముని వ్యాప్తికి వెలుపల కావు. ధీరుడైన భద్రాచల రామదాసుని కోరికలను నెరవేర్చే మోక్షప్రదమైన రామతారకనామమే ఈ సమస్తానికి ఆధారము.
వరాళి రాగంలో స్వరపరచబడిన ఈ భద్రాచల రామదాసు కృతిని మల్లాది సోదరులు ఆలపించారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి