29, జనవరి 2016, శుక్రవారం

గుళ్లో రామాయణాలు - 6

 గుళ్లో రామాయణాలు - 6



సాయినగర్‌లోని షిర్డీ సాయి గుడి ఆ కాలనీ వాసుల మంచి నిర్వహణతో బాగా పేరొందింది. నిజాయితీతో కమిటీ మెంబర్లు సాయినాథునికి రోజూ పూజలు, భక్తులకు సంతృప్తికరంగా చేయిస్తున్నారు. కమిటీలో దైవభక్తి కలిగిన రిటైర్డ్ ఉద్యోగులతో పాటు ఓర్పు,సామర్థ్యం కలిగిన మహిళలు కూడా ఉన్నారు. రెండేళ్లలో గుడి ఆదాయం బాగా పెరిగింది. ఆ గుడిపై అక్కడి స్థానిక రాజకీయ గూండాల కళ్లు పడ్డాయి. కమిటీ మెంబర్లను పిలిచారు.

"ఈ గుడి కమిటీకి మా పార్టీవోళ్లు ప్రెసిడెంటుగా ఉండాల. మేము దీన్ని మస్తు డెవలప్ చేస్తం. మా భిక్షపతన్న ఐతే మంచిగుంటది...." అని మాజీ కార్పొరేటర్ భిక్షపతిని ప్రెసిడెంటుగా చేయాలని ఒత్తిడి. ఎదిరించిన కమిటీ సభ్యులను బెదిరించటం, గుడి తాళాలు పగల గొట్టటం, హుండీలో డబ్బులు దోచుకోవటానికి ప్రయత్నాలు...

ఎవరా భిక్షపతి? పచ్చి గూండా. తాగుబోతు, భార్యను హింసించేవాడు, తల్లిదండ్రులను కాళ్లతో తన్నేవాడు. లేని అలవాటు లేదు. అధికార పార్టీలో సభ్యుడు.

కమిటీ సభ్యులు రాజకీయ ఒత్తిడికి తలవంచక తప్పలేదు. మొదలైంది గుళ్లో అధర్మం.

"మా బిడ్డ పుట్టినరోజు రేపు సండే. పొద్దుగాల అభిషేకం మేము జేస్తం, దర్శనం బంద్ చేయండి..." - పూజారికి బెదిరింపులు. భయంతో పూజారి తలవంచక తప్పలేదు. ఆరోజు ఉదయం దర్శనం బంద్. భక్తులకు అశాంతి.

"దసరారోజు సాయిబాబా సమాధి. దానికి పిల్లల చేత సాయి చరిత్ర నృత్య నాటిక ప్రదర్శిద్దాము..." అని పాపం ఒక కమిటీ సభ్యురాలు ప్రతిపాదన...

"గవన్నీ ఎందుకు. సినిమాపాటలు బెట్టి హుషారుగ డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టిపిద్దం..."

ప్రతియేడాది సాయి సమాధి ఉత్సవాలు ఎంతో పవిత్రంగా జరిగేవి. ఎవరికీ ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉండేది. ఈ యేడాది మైకులు, లౌడు స్పీకర్లలో రణగొణ ధ్వనులు...ప్రజలలో అసహనం పెరిగిపోతోంది. గుడి అంటే గౌరవం తగ్గిపోతోంది.దశమి నాడు ఒక వంద కార్లతో ఆ భిక్షపతి పార్టీ నాయకులు వచ్చారు. రెండు గంటల పాటు ట్రాఫిక్ జాం, మైకులో స్పీచులు. భగవంతుడు గురించి కాదు...వాళ్ల వాళ్ల స్వోత్కర్షలు...

గుడికి అన్నివైపులా తోరణాలు, పూమాలలు, లైట్లు మాత్రమే ఉండేవి. ఈ యేడాది, వీటన్నిటినీ కనుమరుగు చేసి భిక్షపతి, అనుచరుల ఫ్లెక్సీలు, సాయినాథునితో నించున్నట్లు, సాయినాథుడు ఆశీర్వదిస్తున్నట్లు, రకరకాల భంగిమలలో...వికారం పుట్టించేలా.

అన్నీ సాయినాథుడు గమనిస్తూనే ఉన్నాడు. 

28, జనవరి 2016, గురువారం

గుళ్లో రామాయణాలు - 5

గుళ్లో రామాయణాలు - 5


రామాపురం గ్రామం పురాతనమైన రామాలయం. కృష్ణదేవరాయల కాలంలో కట్టిందిట. ఆ స్థంబాలు, ఆకృతులు, మూర్తులు చూస్తే అర్థమవుతుంది. కానీ, గుడిలో దీపం పెట్టే దిక్కు లేదు, నైవేద్యానికి అంతకన్నా దిక్కు లేదు. పూజారి వారానికొకసారి పక్క ఊరినుండి తన ఇష్టం ఉంటే వస్తాడు. లేకపోతే లేదు. ఆయన ఐదు ఊళ్ల పూజారి.

ఊళ్లో పెద్దయ్య ఉండబట్టలేక కలెక్టరు దగ్గరకు వెళ్లాడు:

"అయ్యా! మన రామాపురంలో రామాలయం, వారానికి ఒక సారి కూడా తెరిచి ఉంచట్లేదు. మా పెద్దలు ఈ ఆలయం ఎంతో మహిమాన్వితమైనదని చెప్పేవారు..."

"అదేంటండీ! పూజారి రోజూ పూజలు, నివేదనలు చేస్తున్నట్లు వీఆర్వో రికార్డులు ఉన్నాయి. చూడండి...ఊరకే నా సమయాన్ని వృథా చేయకండీ" అని రికార్డులు పెద్దయ్య ముందుంచాడు.

నిర్ఘాంతపోయాడు పెద్దయ్య. అందులో, రామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించినట్లు, దానికి లక్ష రూపాయలు ఖర్చు పెట్టినట్లు, లెక్కలు బిల్లులతో సహా ఉన్నాయి. నోట మాట రాక తిరిగి వచ్చాడు.

పూజారి, వీఆర్వోల అవినీతి ఆ రాముడు గమనిస్తూనే ఉన్నాడు.

తిమ్మాపురం గ్రామం:

"మంత్రి గారు! మన లలితా పరమేశ్వరి గుడిని పునరుద్ధరించాలి. అమ్మ ఈ గ్రామాన్ని కాపాడే దేవత. దానికి నిధులు విడుదలయ్యేలా కలెక్టరు గారికి చెప్పండీ!"...

"ఆ గుడి ప్రభుత్వం ఆధీనంలో లేదయ్యా. అయినా, మీ మీరు వాళ్లు నా పార్టీకి ఓటు వెయ్యలేదు. నేనెందుకు సాయం చేయాలి? ఊళ్లో ఉత్సవాలకు మమ్మల్ని పిలవరు, మా నాయకులను సత్కరించరు, డబ్బులకు మాత్రం మా దగ్గరికి వస్తారు. పోయి మీరు వోటేసిన ఆ ప్రతిపక్ష ఎమ్మెల్యేను అడగండి..." అని కసురుకున్నాడు.

దేవుడికి పార్టీలా? అంతా చూస్తూనే ఉంది ఆ పరమేశ్వరి.

హైదరాబాదులో ఒక కాలనీలో గుడి ప్రయత్నాలు:

అసోసియేషన్ ప్రతినిధులు కార్పొరేటర్ గారితో - "అయ్యా, మన ఎమ్మెల్యే గారిని కలిసి ఈ కాలనీ ప్రజలు కోరుతున్నట్లు ఈ సీతారాముల గుడిని కట్టించటానికి సాయం చేయండి.."

"సీతారాములతో పాటు, సాయిబాబా విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠిస్తేనే ఎమ్మెల్యే గారు నిధులు విడుదల చేయిస్తాడట. అయినా, సీతారాముల గుళ్లెందుకయ్యా! ఎవ్వరూ చిల్లి గవ్వ కూడా హుండీలో వేయరు! అదే సాయి బాబా గుడి అయితే నెలకు కొన్ని లక్షలు వస్తాయి...ఆలోచించండి..."

వెంటనే కాలనీ అసోసియేషన్‌లో రాజకీయాలు: అవును షిర్డీ సాయి విగ్రహం కూడా ఉండాలని కొందరు, లేదు ముందు తలచినట్లుగానే సీతారాముల గుడి అని ఇంకొందరు. నెలలపాటు ప్రతిష్ఠంబన, చివరకు ఆదాయం కోసం భయపడి షిర్డీ సాయిదే ప్రధాన విగ్రహం, పక్కన చిన్న రాముల వారి విగ్రహం.

సాయిబాబా...సీతారాముల మధ్య కూడా రాజకీయాలా? ఆదాయం కోసం గుళ్లా...అంతా ఆ పైవాడు గమనిస్తూనే ఉన్నాడు.

27, జనవరి 2016, బుధవారం

వందేమాతరం విశేషాలు

వందేమాతరం విశేషాలు

వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్ర జ్యోత్స్నా పులకిత యామినీం ఫుల్ల కుసుమిత ద్రుమ దళ శోభినీం సుహాసినీం సుమధుర భాషిణీం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం
తెల్లగా ప్రకాశించే వెన్నెలతో పులకించే రాత్రివై, వికసించిన పూలతో కూడిన దళములతో శోభిల్లే, చక్కని చిరునవ్వుతో, మధురమైన పలుకులతో సుఖాన్ని, వరములను ఇచ్చే తల్లీ! నీకు వందనం! నిర్మలమైన జలములతో, చక్కని పండ్లతోటలతో, చల్లని గాలులతో, సస్యశ్యామలమైన మాతా! నీకు వందనం!
విన్న వెంటనే గగుర్పాటు కలిగించే మన జాతీయ ఆలాపనలో ఎంత చక్కని పదాలను ఉపయోగించారో బంకిం చంద్ర చటర్జీ గారు. అసలు వందే మాతరంలో ఐదు చరణాలు ఉన్నాయి (మొత్తం సాహిత్యం చివరన). దీనిని మొట్టమొదటి సారిగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1896లో ఆలపించారు. 1950లో భారత్ గణతంత్రమైన తరువాత భారత ప్రభుత్వం మొదటి రెండు చరణాలతో ఈ పాటను జాతీయ ఆలాపనగా గుర్తించింది. ఈ గీతం బంకించంద్ర గారి ఆనందమఠ్ అనే నవలలోది. 1876వ సంవత్సరంలో ఆయన ఆనందమఠాన్ని రచించగా 1882వ సంవత్సరంలో అది ప్రచురితమైంది. సంస్కృతం, బెంగాలీ శబ్దాలు కలిగిన ఈ జాతీయ గీతాన్ని స్వరపరచిన వారు జాదూనాథ్ బెనర్జీ గారు.
తొలుత దీనిని జాతీయ గీతంగా గుర్తించాలని ప్రతిపాదన వచ్చినా ముస్లింల వ్యతిరేకతతో జనగణమన జాతీయ గీతం అయ్యింది. వందేమాతరం జాతీయ గీతంగా కావటాన్ని వ్యతిరేకించిన వారిలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఒకరు. వందేమాతరంలో భరతమాతను దుర్గాదేవిగా ఆవిష్కరించటం ఆనాటి బెంగాలు మరియు ఇతర ప్రాంతాల ముస్లింలు తీవ్రంగా వ్యతిరేకించారు. తదుపరి బాబూ రాజేంద్రప్రసాద్ గారు రాజ్యాంగ అసెంబ్లీలో తీర్మానంతో జాతీయ ఆలాపన అయిన వందేమాతరాన్ని జాతీయ గీతమైన జనగణమనతో సమానమైనదిగా గుర్తింపజేశారు. జనగణమన కన్నా దాదాపు ముప్ఫైఏళ్ల ముందు రాయబడిన వందేమాతరం భారత స్వాతంత్య్రోద్యమంలో ప్రత్యేకమైన పాత్ర పోషించింది. 

వందేమాతరం పూర్తి సాహిత్యం:
వందేమాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం
సస్య శ్యామలాం మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామినీం పుల్లకుసుమిత ద్రుమదల శోభినీం సుహాసినీం సుమధుర భాషిణీం సుఖదాం వరదాం మాతరం కోటికోటి కంఠ కలకల నినాదకరాలే కోటి కోటి భుజైర్ ధృత కర కరవాలే అబలా కేయనో మా ఏతో బలే బహుబల ధారిణీం నమామి తారిణీం రిపుదలవారిణీం మాతరం తుమి విద్యా తుమి ధర్మ తుమి హృది తుమి మర్మ త్వం హి ప్రాణాః శరీరే బాహుతే తుమి మా శక్తి హృదయే తుమి మా భక్తి తో మారయి ప్రతిమా గడి మందిరే మందిరే త్వం హి దుర్గా దశ ప్రహరణ ధారిణీ కమలా కమలదళ విహారిణీ వాణీ విద్యాదాయినీ నమామి త్వాం నమామి కమలాం అమలాం అతులాం సుజలాం సుఫలాం మాతరం శ్యామలాం సరలాం సుస్మితాం భూషితాం ధరణీం భరణీం మాతరం
మొత్తం వందేమాతరం ఆడియో: https://www.youtube.com/watch?v=_2-GTLcy65M

26, జనవరి 2016, మంగళవారం

గుళ్లో రామాయణాలు - 4

గుళ్లో రామాయణాలు - 4
=================


దేవుడి పేరుతో అవినీతి?

పూజారి: "సార్ - ప్రసాదానికి బియ్యం, పప్పు ఇతర వంట సామాను కావాలి. దాదాపు 5 వేల దాకా అవుతుంది..."

ధర్మాధికారి: "అదేమిటండీ! పదిహేను రోజులు కూడా కాలేదు నేను తెప్పించి...ఇంతలో?"

పూజారి: "అయ్యా ధనుర్మాసం కదా! నివేదనలు ప్రత్యేకంగా, ఎక్కువగా..."

ధర్మాధికారి:  "సరే..."

పూజారి భార్య: "ఏవండీ - ఇంట్లో నెలవారీ ఉప్పులు పప్పులు తేవాలి. డబ్బులు ఇవ్వండీ..."

పూజారి: "క్రితం నెల గుడి సరుకుల్లో కొన్ని తీసి పక్కన పెట్టాను చూడు. లోపల ఉన్నాయి..."

దేవుడి పేరుతో మోసమా?

ధర్మాధికారి: "మేనేజర్ గారూ - క్రితం నెలలో వచ్చిన హుండీ వసూలు వివరాలు లెక్కలు రాసారా? సేవలు చేయించుకున్నవారికి రసీదులు ఇచ్చారా?

మేనేజర్: "సార్! లెక్కలన్నీ ఉన్నాయి. సోమవారం చూపిస్తాను. రసీదులన్నీ ఇచ్చాను".

సోమవారం దాటింది. మేనేజర్ లేడు. సేవకు భక్తులు ఇచ్చిన రుసుములో 25వేల రూపాయల తేడా. రసీదులు ఇవ్వలేదు. హుండీ ఆదాయం గత నెలకన్నా 70 శాతం తక్కువ ఉంది. మానేసిన మేనేజర్ కారు కొన్నాడు.

సాక్షీభూతుడైన స్వామి లెక్కలు వేస్తున్నాడు.

డబ్బున్న వారికో ధర్మం, లేనివారికో ధర్మమా?

ధర్మాధికారి: "పూజారి గారూ! గర్భగుడిలోకి మీరు తప్ప ఎవ్వరూ రాకూడదు. విగ్రహాలను ఎవ్వరినీ తాకనివ్వద్దు. ఖచ్చితంగా పాటించండి..."

పూజారి: "అలాగే సార్"

ఒక వారం తరువాత, ఆలయానికి ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, ధర్మాధికారికి బంధువు సతీ సమేతంగా వచ్చారు.

ధర్మాధికారి: "పూజారి గారు! వీరు మనకు బాగా కావలసిన వారు, లోపలకు తీసుకువెళ్లి పాదాలను తాకించి శేషవస్త్రాన్ని కప్పించండి.

పూజారి ప్రశ్నార్థకంగా, సందేహంతో: "అలాగే సార్..."

అన్నీ చూస్తూనే ఉన్నాడు ఆ పరమాత్మ. 

25, జనవరి 2016, సోమవారం

గుళ్లో రామాయణాలు - 3

గుళ్లో రామాయణాలు - 3
===============



దేవుడి ముందు ఎక్కువ-తక్కువా?

బాగా చదువుకుని, దేశదేశాలు తిరిగి, ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో ఉన్నతమైన పదవులలో పని చేసి, నాలుగు చేతులా సంపాదించాడు ఓ పెద్దన్నయ్య. జీవితమంతా భోగలాలసుడే. రిటైర్మెంట్ తరువాతే దేవుడి మీద ధ్యాస మళ్లింది. అప్పటివరకు తన ఊరు అన్న విషయం మరచిపోయిన మనిషి అప్పుడు ఊళ్లో మంచిపేరు తెచ్చుకోవాలనుకున్నాడు. . "శివుడు కలలోకి వచ్చాడురా. మన ఊళ్లో గుడి కట్టించమన్నాడు. నా దగ్గర ఉన్న డబ్బుతో కట్టిస్తాను. ధర్మకర్తలుగా మీరందరూ ఉండండి..." పెద్దన్నయ్య తన తమ్ముళ్లతో, చెల్లెళ్లతో అన్నాడు. ట్రస్టులో ఆయనతో పాటు కుటుంబమంతా చేరింది.

మాఘ మాసంలో గుడి ప్రతిష్ఠలు అయ్యాయి. ఏడాది తిరిగి వార్షికోత్సవం అయ్యింది. గుడికి ప్రజలు వస్తూ పోతూ ఉంటారు. వార్షికోత్సవాలనంతరం శివపార్వతుల కళ్యాణం. శ్రీశైలంలో లాగా విగ్రహాలను ఏర్పరచారు, తోరణాలు కట్టారు, పూమాలలతో అలంకరించారు, లైట్లు పెట్టారు, మేళం, తాళం, అభిషేకాలు, పెద్ద ఎత్తున అన్నదానం ఏర్పాట్లు...

కళ్యాణానికి ఎవరు కూర్చోవాలి? 1116/- రుసుము పెట్టి కళ్యాణానికి కూర్చోవచ్చు అని బోర్డులో రాశారు. చాలా మంది సంబరపడి రుసుము కట్టారు. కళ్యాణం సమయం ఆసన్నమైంది. గర్భగుడిలో దంపతులు కూర్చోవటానికి రమ్మన్నారు. ఉత్సాహంగా ఆ ఊరికి చెందిన దంపతులు వచ్చి కూర్చున్నారు. మొదటి వరుస నిండిపోయింది. ఇంతలో అక్కడికి ఆ ధర్మకర్తల కుటుంబం వచ్చింది - అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు, వాళ్ల జీవిత భాగస్వాములు...పెద్దన్నయ్య వచ్చి ముందు వరుసలో కూర్చున్నవారిపై "మిమ్మల్ని ఇక్కడ ఎవరు కూర్చోమన్నారు? ఈ స్థానం ధర్మ కర్తలది, లేవండి, ఆ వెనక్కు కూర్చోండి" అని దాదాపు 10 మంది మొదటి వరుస దంపతులను కసిరి లేపాడు. ఎదురుగా శివుడు కళ్యాణం చేసుకుందామనుకున్న తన భక్తులను ఇలా ధర్మకర్త లేవగొట్టటం చూశాడు.  అన్నీ గమనిస్తూనే ఉన్నాడు. ఆ పెద్దన్నయ్య ప్రవర్తన చూసి ముందు వరుసలో కూర్చున్న దంపతులు నిర్ఘాంతపోయారు. అవమానంగా భావించారు. కానీ, కళ్యాణం కదా అని దిగమ్రింగుకొని వెనుక వరుసలో కూర్చున్నారు.

ముందు వరుసలో ఆ ధర్మకర్త కుటుంబ సభ్యులు గుడిలో విగ్రహాలు, కళ్యాణం చేసే ఉత్సవ విగ్రహాలు వెనుక వారికి కనిపించకూడా అడ్డంగ కూర్చున్నారు. ఇక ఇకలు, పక పకలు...వెనుక వారికి ఏమీ తోచటం లేదు. స్వామి కళ్యాణ వైభోగం వారి కళ్లబడలేదు. అసంతృప్తితో కళ్యాణం ముగిసింది. తీర్థ ప్రసాదాలు కూడా మొదట ఆ కుటుంబానికే. స్వామి వారికి అలంకరించిన పూ మాలలు, శేష వస్త్రాలు, మారేడు దళాలు కూడా ఆ కుటుంబానికే.

దేవుడినే మోసమా?

గర్భగుడి ముందు ఫోటోలు, వీడియోలు తీయటం నిషిద్ధం అని పెద్ద అక్షరాలలో రాసి బోర్డు పెట్టి ఉంది. చూడకుండా ఎవరో భక్తుడు వచ్చి సెల్ ఫోన్లో ఫోటోలు తీయబోయాదు. ధర్మాధికారి పెద్దగా అరచి అతన్ని బయటకు పంపించేశాడు. అహా! నిజంగా మూల మూర్తులను ఫోటో తీయకూడదు అన్నది ఎంత చక్కగా పాటిస్తున్నారో అనుకున్నారు భక్తులు. దర్శనాలు అయిపోతున్నాయి. గుడి మూసే సమయమైంది. ధర్మాధికారి వచ్చి - "పూజారి గారూ! మా మనవడు వచ్చి స్వామి వారు, అమ్మ వార్ల ఫోటోలు తీసుకుంటాడు, ప్రింట్ ఇచ్చి నా తోబుట్టువులందరికీ ఫ్రేం కట్టించి ఇవ్వాలి. మా వాడు ఫేస్‌బుక్లో పెట్టాలి....మనవడు వచ్చాడు, ఫోటోలు తీసుకున్నాడు..అన్నీ గమనిస్తూనే ఉన్నాడు స్వామి.

మరుసటి ఏడుకి ధర్మకర్త కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు వచ్చాయి, కొంతమందికి రావటం కుదరలేదు. ఊరిలో భక్తులకే కళ్యాణంలో అగ్రతాంబూలం. ఫోటోలు తీసుకుందామనుకున్న వ్యక్తి కెమెరా హఠాత్తుగా పనిచేయాలేదు, వేరే ఏ విధంగా ఫోటోలు తీయాలనుకున్నా కుదరలేదు.

గుళ్లో రామాయణాలు - 2:

గుళ్లో రామాయణాలు - 2
==================


భార్య - "ఏవండీ! తిరుమల వెళదాము ఏదాది పైన అయిపోయింది. పైగా మొక్కుంది. మొన్న పిల్లవాడు పదో తరగతి పాసైతే వస్తానని మొక్కుకున్నాను."

భర్త - "తిరుమల అంటే ఏమన్నా పక్క వీధిలోని గుడి అనుకున్నావా? దర్శనం, ఉండటానికి ఏర్పాట్లు, రైలు టికెట్లు..."

భార్య - "మన పక్కింటి అన్నయ్యగారి స్నేహితుడు తిరుమలలో ఎక్జిక్యూటివ్ ఆఫీసరు కింద పని చేస్తారుట. అడుగుదామా?"

భర్త - "అలాగే! వివరాలన్నీ కనుక్కో, నేను రైలు టికెట్ల సంగతి చూస్తాను"

పక్కింటాయన ద్వారా సిఫారసు లెటరు తీసుకొని తిరుమల చేరుకున్నారు. ఎలా దర్శనం టికెట్లు సంపాదించాలన్నదే ధ్యాస. పరుగు పరుగున పద్మావతీ గెస్ట్ హౌజ్ వద్ద ఉన్న కార్యాలయానికి వెళ్లాడు.

"ఈ సిఫారసులు నడవవండీ. ఈ మధ్యనే యాజమాన్యం ఈ కోటాను రద్దు చేసింది..."...

ఎంత సేపు ప్రయత్నించినా ఆ ఉద్యోగి ఒప్పుకోలేదు. వెంటనే భర్త మదిలో లంచం అనే అస్త్రం మెరిసింది.

"అయ్యా! మేము హైదరాబాదునుండి వచ్చాము. పిల్లాడి పరీక్ష పాసైన మొక్కు ఉంది. మళ్లీ రావటం కష్టం. ఈ వెయ్యి రూపాయలు..."

"ఇదిగో! నేనెల కనబడుతున్నాను? ఆ వేంకటేశ్వరుడు కోపగిస్తే ఇంకేమైనా ఉందా?"

నిరాశతో వెనుదిరిగి కార్యాలయం గుమ్మం దాటబోతున్నాడు. వెనుకనుండి తితిదే ఉద్యోగి పిలుపు..

పక్కకు పిలిచి "ఇంకో వెయ్యి ఇస్తే నీ పనవుతుంది..."...ఎగిరి గంతేశాడు ఆ వ్యక్తి. జేబులోంచి రెండు వేలు తీసి ఆ ఉద్యోగి చేతులో పెట్టాడు. బ్రేక్ దర్శనం టికెట్లు, పద్మావతీ గెస్ట్ హౌజ్‌లో బస సంపాదించాడు.

బ్రేక్ దర్శనం క్యూలో భార్యా భర్తలు పిల్లలు...తమతో వచ్చిన వాళ్ల కన్నా ముందు దర్శనం, ప్రత్యేక దర్శనం అవుతుందన్న ఆనందం..ఆ ధ్యాసలో భగవంతుడి ఊసే లేదు.

భార్య - "ఏవండీ! మన అదృష్టం కదా! పోతే పోనీ రెండు వేలు. ఎంచక్కా గంటన్నరలో బయట పడతాము. లడ్లు కూడా ఎక్కువ వస్తాయి.  తోపుడుండదు"

"అవునే! అందుకే ఒక్క నిమిషం అని కూడా ఆలోచించకుండా రెండు వేలకు ఒప్పుకున్నా. ఆ 300 రూపాయల టికెట్టు క్యూ అయితే 4-5 గంటల పని. ఆకళ్లు, కాళ్లనొప్పులు, తోపులాట..."...గర్వంగా పలికాడు భర్త.

వాళ్ల అమ్మాయి 8వ క్లాసు..

"నాన్నా! లంచం ఇవ్వటం నేరం కదా! మరి మనం చేసింది ఆ భగవంతుడు ఎలా ఒప్పుకుంటాడు?"...ప్రశ్నార్థకంగా, సందేహంతో, అపరాధం చేశామన్న భావనతో అడిగింది.

"నువ్వు నోరు ముయ్యవే! పక్కన వాళ్లు వింటారు. ఏదో మీ నాన్న తెలివితో టికెట్లు తీసుకుంటే పాపం, పుణ్యం అనే నీ గోల ఏంటి?"

కొడుకు 10వ క్లాసు...

"నాన్నా! మీరు జుట్టు ఇస్తామని మొక్కుకున్నారు కదా! అలాగే అమ్మ మెట్లు ఎక్కి వెళదాం అని చెప్పింది. మర్చిపోయారా?"....

"అన్నీ గుర్తున్నాయి రా. టికెట్లు తీసుకుందామన్న ధ్యాసలో ఈ మొక్కులు మర్చిపోయాను. తలనీలాలు దర్శనం అయిన తరువాత ఇద్దాములే. మెట్లు ఈ మారు వచ్చినప్పుడు ఎక్కుతాననని మొక్కుకున్నానులే...." - తల్లిదండ్రుల సవరణ.

క్యూ అంతా భార్యాభర్తలకు తాము చేసిన ఘనకార్యం గురించి ఆలోచనలే తప్ప శ్రీనివాసుడి గురించి లేదు. పక్కవాళ్లతో సంభాషణలు కూడా ఇవే. గర్భగుడిలో స్వామి ముందున్న 5 సెకండ్ల సమయం కళ్లుమూసుకొని ఏవేవో కోర్కెలు కోరేశారు...బయటకు వచ్చి ప్రసాదం తీసుకునే క్యూలో ఉన్నారు.

భార్య - "ఏవండీ! ఆ పక్కనే పొంగలి, దద్ధ్యోజనం ప్రసాదం ఉంది. ఆ పూజారి చేతిలో ఒక వంద పెట్టి చెరో పొట్లం తీసుకోండి..."

పిల్ల - "అమ్మా అది ఇప్పుడిస్తున్న లడ్డూ ప్రసాదం అయిపోతే ఇచ్చేందుకు పెట్టారు. ప్రసాదంలో కూడా కక్కుర్తి ఏమిటి?"....

తల్లి - "నీకు తెలియదు ఊరుకోవే. మన పక్కింటావిడ మొన్న వచ్చినప్పుడు వాళ్లకు బ్రేక్ దర్శనంలో బోలెడంత ప్రసాదాలు ఇలాగే ఇచ్చారుట. వాటి రుచి గురించి కథలు కథలుగా చెప్పింది. నేను కూడ చెప్పద్దూ? "...

పిల్ల నిర్ఘాంతపోయింది. తల్లికి కోపం వస్తుందని తన భావనలను లోపలే దాచుకుంది.

వందరూపాయలు పూజారి చేతిలో పెట్టబోగా అతను అసహ్యం నటిస్తూ తిరిగి ఇచ్చి "నేను నిన్ను అడిగానా? దేనికి ఈ డబ్బులు?"...

"అయ్యా! పొంగలి, దద్ధ్యోజనం ప్రసాదం..."

"ఆ పక్కన నిలబడు. కాసేపు ఆగి ఇస్తాను"... అని వంద రూపాయలో పంచెలో దోపుకున్నాడు. సీసీటీవీ కెమేరాలున్నాయి. అయినా ఇద్దరికీ భయం లేదు.

దర్శనం తరువాత తలనీలాలు, భోజనాలు, విహార యాత్ర, షాపింగ్...క్రిందకు బస్సులో దిగుతున్నారు. వేగంగా బస్సు ఘాటు అంచులను గుద్దుకుంది. భార్యా భర్తలకు బాగా గాయాలు. పిల్లలకు ఏమీ కాలేదు. చావు తప్పి కన్నులొట్ట పోయి క్రిందకు దిగారు. ప్రాణాలు పోకుండా రక్షించినందుకు మళ్లీ కాలినడకన వస్తామని మొక్కు....

అన్నీ చూస్తునే ఉన్నాడు శ్రీనివాసుడు. ఆయన లెక్కలు ఆయన వేస్తూనే ఉన్నాడు. వీళ్ల మొక్కులు వీళ్లు మొక్కుతునే ఉన్నారు...

గుళ్లో రామాయణాలు - 1:

గుళ్లో రామాయణాలు - 1:
=================

అందంగా, పట్టు చీర కట్టుకొని, నగలు అలకరించుకొని, మేకప్ వేసుకొని, సిగలో పూలు కొప్పుకు అలంకరించుకొని వయ్యారంగా నడుచుకుంటూ వస్తోంది ఒక 30 ఏళ్ల స్త్రీ.
అప్పటివరకు విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుతున్న స్త్రీల దృష్టి ఆవిడపై పడింది. అంతే ఇక విష్ణువు లేడు, సహస్రమూ లేదు, నామాలూ లేవూ. అంతా ఆ స్త్రీ వేషభూషణాలకు అర్పణం. స్తోత్రాలు పఠిస్తున్న పురుషుల దృష్టి కూడా మరల భగవంతునిపై ధ్యాస చెదరింది.
మొదటి స్త్రీ: "ఇదేమి కలికాలమో? గుళ్లోకి వస్తూ ఈ అలంకరణలేమిటో? కాస్తైనా ఇంగిత జ్ఞానం ఉండక్కర్లేదా వదినా?"
రెండవ స్త్రీ: "అవును వదినా. నాక్కాంగ నగలు ఉన్నాయని దిగేసుకొచ్చింది. అయినా ఇదేమైనా పెళ్లా పేరంటమా? పవిత్రమైన శ్రీనివాస కళ్యాణానికి వస్తూ ఏమిటి ఈ చోద్యం?"
మూడవ స్త్రీ: "మనం ఆ వయసులో ఉన్నప్పుడు ఎలా ఉండే వాళ్లం? గుడికి అనగానే పట్టుచీర కట్టుకునే వాళ్లమే, కానీ ఇలా ఉన్న నగలన్నీ దిగేసి, మేకప్ వేసుకొని, అసహ్యం పుట్టేలానా? "
నాలుగవ స్త్రీ: "అసలు గుడికి స్త్రీలు పూలు పెట్టుకోకూడదని ఇటీవలే ప్రవచనాలలో విన్నాను. ఇది పాపం కదూ?"
అందరు స్త్రీలూ వంత పాడారు...అందరికీ మానసిక ప్రశాంతత చెదిరింది. భగవంతుడు సాక్షీభూతుడై మౌనంగా ఈ నాటకాన్ని చూస్తున్నాడు. నవ్వుకుంటున్నాడు.
ఇక రెండోవైపు పురుషులు:
మొదటి పురుషుడు: "ఏవిటండోయ్..ఈ రోజు గుడి మామూలు కన్నా కళకళలాడిపోతోంది..ఎవరీ అందాల భామ..మేకప్ చూస్తే కాస్త ఓవర్ అయినట్లు లేదూ...ఇది వరకెప్పుడూ చూడలేదే ఈ ప్రత్యేక పాత్రను? "
రెండవ పురుషుడు: "ఎవరైతే మనకెందుకండీ? అందాన్ని ఆస్వాదించండి. వీలైతే వివరాలు కనుక్కోండీ..."
మూడవ పురుషుడు: "ఈవిడను ఎక్కడో చూశానండీ. ఆ గుర్తుకొచ్చింది. ఓ సినిమా సభలో ఓ నటుడి పక్కన చూశా! ఓసి దీని అఘాయిత్యం కూల. ఆ వేషం గుళ్లో కూడానా?"
పూజారి (మనసులో): "అపచారం, అపచారం, దేవుడి ముందు ఏమిటీ లేకి వేషాలు? భగవంతుడు క్షమించడు..."
ఇంకేముంది, అప్పటి వరకు ఎవరి పనుల్లో వారు భగవంతుని ధ్యాసలో ఉన్న సమూహం అంతా ఈ చర్చలో మునిగిపోయింది. కలకలం మొదలయ్యింది. మనసులు చెదిరాయి. దేవుడినుండి స్త్రీపైకి మళ్లింది మొత్తం దృష్టి. త్రికరణములలో దేనిలోనూ శుద్ధి లేకుండా పోయింది. ఇంకెక్కడి భగవంతుడు? అప్పటివరకు అక్కడ నిలచి వారి భక్తిని గమనిస్తున్న ఆయన మళ్లీ స్థాణువైపోయాడు.

ఇంతలో ఆ ఆలయ ధర్మాధికారి ఆ అమ్మాయిని పిలిచాడు. "అమ్మా జాహ్నవీ! షోడశోపచారములలో నృత్య సేవ అందించు తల్లీ!" అని గర్భగుడి ముంగిటకు పిలిచాడు.
జాహ్నవి చిరునవ్వుతో కాళ్లకు గజ్జెలు కట్టింది. అలంకరణ అంతా సవరించుకుంది. మనసులో స్వామికి ఈ సేవ అంకితం అనుకుంది. పద్మావతీ శ్రీనివాసుల వైభవాన్ని నుతించే "ఏమొకొ చిగురుటధరమున" అనే అన్నమాచార్యుల వారి కీర్తనను క్యాసెట్టులో శోభారాజు గారు పాడుతుండగా, అద్భుతంగా తానే శ్రీనివాసుడై, తానే పద్మావతియై, తానే పరిచారికయై, తానే అన్నమాచార్యులై అభినయించింది.స్వామి మరల శిలనుండి వచ్చి గర్భగుడిలో అంతటా నిలిచాడు. ఆమె సేవను అంగీకరించాడు.
భౌతికమైన ఆమె వేషభూషణలను చూసి దారితప్పిన మనసులతో ఉన్న 'భక్తులు ' సిగ్గుతో తలవంచుకున్నారు. తాము కోల్పోయిన అమూల్యమైన సమయాన్ని గుర్తించారు...ఏమీ పట్టకుండా ఆ కళాకారిణి స్వామి ప్రసాదం స్వీకరించి పూర్ణాత్మయై అక్కడి నుండి కదిలింది.

19, జనవరి 2016, మంగళవారం

సంక్రాంతి అరిసెలు

సంక్రాంతి అరిసెల ప్రహసనం గురించి ఈ చిన్ని కథ....

"అమ్మాయ్ సరస్వతీ! బియ్యం నానబోసావుటే? సరిగ్గా నానకపోతే నా చేతులు పడిపోయేలా దంచినా అవి నలగవే. పాకం బెల్లం తెప్పించావా? నీదేం పోయింది? నా దుంప తెగుతుందే" - తిరుమలమ్మ గారు మంచం మీది నుంచి కేకలు వేస్తోంది.

"ఇదిగో అత్తయ్యగారూ! నేను ఇక్కడ పెద్ద ముగ్గు పెట్టుకున్నా. క్షణానికోసారి మీరు అరిసెల గురించి కేకలు పెడితే నాకు చుక్కలు లెక్క తప్పుతున్నాయి. ఇప్పటికిది పదోసారి చుక్కలు మొదలు పెట్టటం..మీదేం పోయింది...ఓ అచ్చటా ముచ్చటా ఎప్పుడూ తిండి యావే.."

"ఓసి నీ జిమ్మడా! సంక్రాంతికి అరిసెలు నా చిన్నప్పటినుంచీ ఆనవాయితే...ఇదిగో నీ ధర్మాన బతుకున్న తరువాత మంచి అరిసె తినే భాగ్యం పోయింది. అయినా నిన్నని ఏమి ఉపయోగంలే. పోయిన ఆ పెద్ద మనిషిని అనాలి. నన్ను నీ పాలిట వదిలేసి ఆయన ఎంచక్కా ముందు వెళ్లిపోయారు. అంతా నా ప్రారబ్ధం".

"ఈవిడ అఘాయిత్యం కూల. ప్రతియేడూ గంపెడు అరిసెలు చేస్తూనే ఉంటా. కనుమునాటికి ఒక్కటి మిగిలితే ఒట్టు. అది నోరా, చెత్త కుండీనా. నా ఖర్మ, ఎర్రగా బుర్రగా ఉంటాడని మేన బావను చేసుకున్నా చూడు. అదీ నేను చేసిన తప్పు. మేనత్తైనా ఇసుమంత ప్రేమ కూడా లేదు..." అని మనసులో ఉక్రోషపడింది సరస్వతి.

గబగబా లేచి వెళ్లి క్రితం రోజు నానబోసిన రెండు కిలోల బియ్యం చూసింది. అమ్మో! చేయాల్సిన పని గుర్తుకు వచ్చేసరికి గుండె జారింది. పిండి కొట్టాలి, పాకం కుదరాలి, చలిమిడి చేయలి, వేయించాలి, అరిసెలను వత్తాలి...దీని దుంప తెగ. ఇది అవసరమా...అమ్మో! చేయకపోతే ఈవిడ నా బుర్ర తినేస్తుందే....అని విసుగ్గా లేచి వెళ్లి ముగ్గులో మగ్నమైంది.

ఉదయం 6 గంటలకు మొదలు పెట్టిన ముగ్గు తీరుగా వేసి రంగులు అద్ది, గొబ్బెమ్మలు పెట్టి, గుమ్మడి పూలు అలంకరించే సరికి ఎనిమిది. "ఓ సరసా! ముగ్గులేనా? కాఫీ ఏమన్నా ఉందా?" సుబ్బారావు కేక. సరస్వతి చేతి ఫిల్టర్ కాఫీ తాగితే కానీ సుబ్బారావు దినచర్య మొదలు కాదు. ఇంతలో తిరుమలమ్మ "సరస్వతీ! గుక్కెడు కాఫీ ఏమన్నా పోస్తావా లేదా? ప్రతిదీ అడగాలటే?"...మొదలు రామాయణం. ఉక్కిరిబిక్కిరి అయ్యేలా ఆర్డర్లు. గబగబా స్నానం చేసి వచ్చి అందరికీ కాఫీలు అందించింది సరస్వతి. ఫలహారాలు అయ్యాయి. "అత్తయ్యా! పిండి కొడదాం రండీ" అని పిలిచింది.

అరిసెల పిండి అనగానే తిరుమలమ్మకు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది.

"సరస్వతీ! ఆ రోలు, రోకలి, కుదురు శుభ్రంగా కడిగి ఆరనివ్వు. లేకపోతే నిన్న నూరిన చింతకాయ పచ్చడి వాసన వస్తుంది బియ్యప్పిండి"...

"అబ్బా అత్తయ్యా! నా పెళ్లై ఇరవై ఏళ్లు. ప్రతి యేడాదీ చేసే పనే. మీరు మొదటి ఏడు చెప్పినట్లు చెప్పక్కర్లేదు..".

"అంతేనే! నిరుడు చూసానుగా! ముందు రోజు రోట్లో నువ్వు రుబ్బిన పండు మిరపకాయ కారం ఘాటు నాకు అరిసెల్లో తగిలి తీపి కారం అప్పాల్లా దేభ్యంగా వచ్చాయి..వాంతులు విరేచనాలు...ఎన్నాళ్లయ్యిందో చక్కటి నేతి అరిసెలు తిని"...తిరుమలమ్మ ఎకసెక్కాలు.

"ఆ! ఎందుకు గుర్తు లేదూ! అర్ధరాత్రి నాకు పండుమిరపకాయం కావాలి అని ఎవరో లేచి వంటిల్లంతా వెదుక్కుంటుంటే పోనీలే పాపం ముసలావిడ జిహ్వ చాపల్యం అని మర్నాడే కాయలు తెచ్చి నూరి పచ్చడి చేశా. కష్టపడి రుబ్బింది కదా, రోలు కడిగి పెడదాం అని ఒక్కరికి ఉండదు ఈ కొంపలో...నేను చెబుతున్నా వినకుండా ఆత్రంతో వెళ్లి మీ చత్వారపు కళ్లతో ఆ రోలును సరిగ్గా శుభ్రం చేయకుండా అరిసెల పిండి నూరింది మీరు...."...సరస్వతి ఉక్రోషం.

"అవునే! అరిసెలు చెడితే నేను కారణం, కుదిరితే నీ గొప్పతనం. ఎంత గడుగ్గాయివే సరస్వతీ! నేను అరిసెలు చేస్తేనా ఊళ్లో వాళ్లందరూ చెప్పుకునే వాళ్లు. నువ్వు చేస్తేనో ఇంట్లో వాళ్ల పళ్ళు ఊడాల్సిందే..." అని నసుగుకుంటూ వాకిట్లోకి వెళ్లింది తిరుమలమ్మ. అక్కడ కోడలు వేసిన ముగ్గు చూసి అవాక్కయ్యింది. "ఏమి పనితనం సరస్వతిది!? ఏడాది మీద ఏడాది దీని ముగ్గులు ఇంకా బాగా వస్తున్నాయి.  అమ్మో నా దిష్టి తగులుతుందేమో" అని గబ గబ లోపలికి వచ్చి "సరస్వతీ! ఆ ముగ్గు..." అని అనబోయింది. "ఆ నేనే వేశాను" అని అత్తగారి కళ్లలోకి చూసి ఆమె మెప్పును గ్రహించి గర్వపడి సమాధానం చెప్పింది.

అత్తా కోడలు పిండి దంచటం మొదలు పెట్టారు. తిరుమలమ్మ వయసులో ఉన్ననాటి రోకళ్లను దాచి కోడలికి ఇచ్చింది. ముందుగా తిరుమలమ్మ రోకటికి పసుపు తాడు కట్టి, నమస్కరించి దరువు మొదలు పెట్టింది. అత్తగారి ఉత్సాహానికి ముచ్చట పడి సరస్వతి కూడా లయబద్ధంగా దంచటం మొదలు పెట్టింది, రోకళ్లు కొట్టుకోకుండా ఒకరి తరువాత ఒకరు దంచటం మొదలు పెట్టారు. ఇంతలో సరస్వతి మదిలో చిలిపితనం విరిసింది. దానికి తిరుమలమ్మ వంత పాడింది

"అత్తలేని కోడలుత్తమురాలు ఓయమ్మా కోడలు లేని అత్త గుణవంతురాలు ఆహుం ఆహుం"


"కోడలా కోడలా కొడుకు పెళ్లామా! పచ్చి పాల మీద మీగడేదమ్మ వేడి పాల లోన వెన్న ఏదమ్మా ఆహుం ఆహుం!"

"అత్తమ్మ నీ  చేత ఆరళ్లే గానీ ఓలెమ్మా పచ్చి పాల మీద మీగడుంటుందా వేడి పాల పైన వెన్న ఉంటుందా ఆహుం ఆహుం!"...

ఇలా ఒక వాయి బియ్యం చక చకా దంచేశారు. తిరుమలమ్మకు ఉత్సాహం రెట్టింపైంది.

"నోమీ నోమల్లాల నోమనన్నలాలో చందమామ చందమామ
 ఆవూరి మారాజు అయిదాణాలు ఇస్తేను ఈవూరి రాజు ముప్పావలిచ్చాడు.."

"రామ లచ్చన్నలాటి రాజులు లేరు సీతమ్మలాటి ఇల్లాలు లేదు
రామనా చందలాలో...."

అని వింజమూరి సోదరీమణులు పాడిన జానపద గీతాలు అందుకుంది. అత్తగారి ప్రతిభకు సరస్వతి ముచ్చటపడి మరింత వేగంగా దరువు వేసింది. ఆడుతూ పాడుతూ అత్తాకోడళ్లు పిండి దంచేశారు. "ఒరేయ్ సుబ్బారావ్! ఇక్కడ ఆడాళ్లం కష్టపడుతుంటే ఆ మడత కుర్చీలో నువ్వు విలాసం చూస్తున్నావా? వచ్చి పిండి జల్లెడ పట్టు"...అని కొడుకును కేక వేసింది. అమ్మ పిలుపుకు భయపడి ఒక్క ఉదుటున వచ్చి పిండి జల్లెడ పట్టాడు. వేళ్లతో పిండిని నులిమితే ఒక్క పలుకు తగిలితే ఒట్టు. అలాంటి జల్లెడ రోలు, రోకలి, కుదురుతో పాటు తిరుమలమ్మకు వారసత్వంగా వచ్చాయి. వాటిని అపురూపంగా చూసుకుంటుంది.

పిండికొట్టి అలిసిపోయిన అత్తాకోడళ్లకు మంచి ఫిల్టర్ కాఫీ ఇచ్చాడు సుబ్బారావు. "ఒరేయ్! ప్రాణం లేచి వచ్చింది రా కాఫీ తాగి. ఈ డెబ్బై ఏళ్ల వయసులో పిండి కొట్టే ఓపిక లేకపోయిన అరిసెలనేసరికి ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది.." అమ్మ, భార్యల పనితనం చూసి నవ్వుకున్నాడు సుబ్బారావు. హిమాలయాలపై మంచులా నున్నగా మెరుస్తోంది అత్తాకోడళ్లు కొట్టిన బియ్యప్పిండి. దాన్ని గిన్నెలోకి ఎత్తి, గట్టిగా ఒత్తి మూత పెట్టింది సరస్వతి. అంతా గమనిస్తూనే ఉంది తిరుమలమ్మ.


"సరస్వతీ! పాకం బెల్లం తెప్పించమన్నాను తెప్పించావా?"...అత్త గారి అరుపు విని "అబ్బా! తెప్పించాను. నేను చూస్తున్నాను కదా?". మూతి తిప్పింది సరస్వతి. "ఆ! త్వరగా రా! అరిసెలలో అసలు పని ఇప్పుడే మొదలు"....నొక్కులు నొక్కింది తిరుమలమ్మ. వంటింట్లో అటకపైన ఉన్న బూందీ బాణలి, చిల్లుల గరిట, తను పెళ్లి సమయంలో అమ్మ ఇచ్చిన అరిసెలు ఒత్తుకునే చెక్కలు తీసింది. పుట్టింటి వాళ్లు గుర్తుకొచ్చి కళ్లలో నీళ్లు తిరిగాయి. సముదాయించుకొని వంటింట్లో అడుగు పెట్టింది.

ఇక మొదలైంది తిరుమలమ్మ రామాయణం "మా చిన్నప్పుడు మా అమ్మ అరిసెలు చేస్తే నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉండేవి. పదా ఇరవయ్యా, రెండొందల అరిసెలు చేసేది. మాలక్షమ్మ గారి అరిసెలంటే ఊరంతా ఎదురు చూసేవాళ్లు. ఎలా వస్తాయో ఏమిటో ఈరోజు...సరస్వతీ! పాకం బెల్లం రుచి చూడవే. ఉప్పు వేసిన బెల్లమైతే అరిసెలు రావే"..."అబ్బా! మనకు ఎప్పుడూ ఇచ్చే కొట్లోనే తెచ్చాను అత్తయ్యా! ఇదిగోండి" అని తురిమిన బెల్లం కాస్త తిరుమలమ్మ చేతిలో పెట్టి రుచి చూడమని సైగ చేసింది. బెల్లం రుచి చూసిన తిరుమలమ్మ నోటికి తాళం పడింది.  సత్తు గిన్నెలో బెల్లం పాకం పడుతూ తిరుమలమ్మ

"శుభములు కలిగించుమా విఘ్న వినాశక
అఘములు తొలగించుమా ముక్తి ప్రదాయక"

అని గణపతిని ప్రార్థించి పాకాన్ని పరీక్షించింది. "సరస్వతీ పాకం అయిపోయిందేవ్! పిండివేస్తాను కలుపుదువు రా" అని పాకంలో కాస్త నెయ్యి, ఏలకులు, పంచదార పొడి వేసింది. కమ్మని వాసన ఇల్లంతా గుబాళించింది.

"ఏవండీ! కాస్త ఆ కుండలో నిన్న కాచి పెట్టిన నెయ్యి ఉంది. తీసుకురండీ! నేతితో చేస్తేనే అరిసెలు..." అని భర్తను ఆదేశించింది సరస్వతి. నెలరోజులనుండి తన ఇంట్లో పిదికిన పాలు కాచి, తోడెసి, చిలికి వెన్న తీసి, కాచిన నెయ్యిని ఎవ్వరికీ కనపడకుండా కుండలో దాచింది సరస్వతి. తనకు నేతి అరిసెలు అంటే ప్రాణం.

అత్తగారి పిలుపుతో సరస్వతి వచ్చి పిండి పాకం గిన్నెలో వేసి కలపటం మొదలు పెట్టింది. గరిటె తిప్పుతూ,

"అందగాడే విష్ణుమూరితి వానికి అందించినాను అరిసెలీరీతి
విందులాయే విష్ణుమూరితి ఏలిక వరములిచ్చేటి వైభవకీర్తి...."

అని అత్తగారు పెళ్లైన కొత్తల్లో నేర్పిన పాటపాడింది. "సరస్వతీ నీ గొంతులో ఈ పాట ఎంత బాగుంటుందే" అని కోడలిని మెచ్చుకుంది తిరుమలమ్మ. అత్తగారు చలివిడిని చక్కగా ఒత్తి కోడలికిస్తే, కోడలు వాటిని కమ్మని నేతిలో వేయించి, అత్తగారికి తిరిగి ఇస్తే అత్తగారు వైనంగా వాటిని ఒత్తి ఆరబెట్టటం. నువ్వులద్ది కొన్ని, కొబ్బరి అరిసెలు కొన్ని, ఇలా రెండు గంటల పాటు అత్తాకోడళ్లు అరిసెల యజ్ఞం చేశారు. గంపెడు అరిసెలు అందంగా పేర్చింది సరస్వతి. అరిసెలు నివేదన చేసి, పెద్దలకు నమస్కరించి, అందరికీ తలా ఒకటి పెట్టింది.

"అబ్బా సరస్వతీ! అరిసెలు ఎంత మధురంగా ఉన్నాయే..." - తిరుమలమ్మ
"సరసా! అరిసెలు నీ అంత తీయగా ఉన్నాయోయ్...." - సుబ్బారావు
"అమ్మా! నీ అరిసెల రుచి ఇంకెక్కడా రాదు..." - పిల్లలు
"చిన్నమ్మగోరూ! మీ అరిసెలు తింటేనే సంకురోత్రి పండగమ్మా!.." - పాలేరు

ఇలా అందరూ పొగిడే సరికి పడ్డ కష్టమంతా మరచి మురిసిపోయింది సరస్వతి. అత్తగారి దగ్గరకు వెళ్లి "అత్తయ్యా! అరిసెలు చేయటం కష్టమైనా, మీరు ఉత్సాహంగా పక్కన ఉన్నారు కాబట్టి హాయిగా శ్రమ తెలియలేదు.." అంది కృతజ్ఞతా పూర్వకంగా.

"సరస్వతీ! పండగంటే నలుగురూ కలిసి చేసుకునే సంబరాలు. ఇందులో ప్రతిదీ కలిసి చేస్తే మరింత పండగ వాతావరణం వస్తుంది. ఆ ముగ్గులు, గొబ్బెమ్మలు, ఈ అరిసెలు, నీ చేతి పొంగలి, జంతికలు...ఇవేనే నాకున్న నిజమైన సంబరాలు. మీ మామయ్య పోయి పదిహేనేళ్లు అయినా ఇంకా బతికి ఉన్నానంటే నీ ప్రేమ అప్యాయతల వల్లనే. అదంతా నువ్వు చేసే పనుల్లో కనిపిస్తుంది. అదే పదివేలు..."

ఇల్లంతా పండగ వాతావరణం నిండిపోయింది. తెలుగులోగిలి వెలిగిపోయింది. 

5, జనవరి 2016, మంగళవారం

మటర్ పన్నీర్


మటర్ పన్నీర్




కావలసిన పదార్థాలు:

ఫ్రోజెన్ బఠాణీలు పావుకిలో
పన్నీర్ పావుకిలో
ఉల్లిపాయలు పెద్దవి మూడు
టమాటోలు పెద్దవి నాలుగు
కాస్త తరిగిన అల్లం
(కావలసిన వారు వెల్లుల్లి ముక్కలు)
ధనియాల పొడి
గరం మసాలా పొడి
తగినంత వంట నూనె, ఉప్పు, పసుపు మరియు కారం


చేసే విధానం:

ముందుగా ఉల్లిపాయలను సన్నగా తరుగుకోవాలి. టమాటో ముక్కలను గ్రైండర్లో వేసి గుజ్జు చేయాలి. బాణలిలో 3-4 చెంచాల నూనె వేసి అందులో ఉల్లిపాయలను, అల్లం తురుమును వేసి (వెల్లుల్లి తినేవారు ఆ ముక్కలను) ఎర్రబడేంత వరకు వేయించుకోవాలి. ఇవి రంగు మారిన తరువాత బాణలిలో టమాటో గుజ్జును వేసి కాసేపు తిప్పుతూ ఉండాలి. అందులో కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, తగినంత ఉప్పు, పసుపు, కారం వేసి ఉడకనివ్వాలి. ఒక ఐదు నిమిషాల తరువాత ఫ్రోజెన్ బఠాణీలను బాగా కడిగి ఆ బాణలిలోని మిశ్రమంలో వేయాలి. బఠాణీలు మెత్తబడేలోపు పన్నీర్‌ను 1/2 అంగుళం పరిమాణంలో క్యూబ్స్‌గా కోసి బాణలిలో వేయాలి. ఒక ఐదు నిమిషాలు ఉడికిన తరువాత దించేయాలి. ఈ కూర వేడి వేడిగా చపాతీలు, పూరీలు లేదా అన్నంతో తింటే బాగుంటుంది.