30, జూన్ 2010, బుధవారం

యక్ష ప్రశ్నలు - మొదటి భాగం

మహాభారతంలో అరణ్యపర్వంలో యక్షుడు యుధిష్ఠిరుని అడిగిన ప్రశ్నలే యక్ష ప్రశ్నలుగా ప్రసిద్ధికెక్కాయి. అవి, వాటి సమాధానాలు:

మొదటి ప్రశ్న:

౧. భూమి కన్నా బరువైనది ఏది? -  తల్లి
౨. ఆకాశం కన్నా ఎత్తైనది ఏది? - తండ్రి
౩. గాలి కన్నా వేగవంతమైనది ఏది? - మనస్సు
౪. గడ్డి కన్నా వేగంగా పెరిగేది ఏది? - ఆలోచనలు

రెండవ ప్రశ్న:

౧. ప్రయాణికుని స్నేహితుడు ఎవరు?  - తోటి ప్రయాణికుడు
౨. గృహస్తునికి స్నేహితుడు ఎవరు?  - భార్య
౩. రోగికి స్నేహితుడు ఎవరు? - వైద్యుడు
౪. మరణం ముందున్న వానికి స్నేహితుడు ఎవరు? - అతడు చేసిన దానధర్మాలు

మూడవ ప్రశ్న:

౧. దేన్ని త్యజిస్తే మనిషి ప్రేమ స్వరూపుడవుతాడు? - అభిమానం/ఈర్ష్య
౨. దేన్ని త్యజిస్తే మనిషి శోకరహితుడవుతాడు? - కోపం
౩. దేన్ని త్యజిస్తే మనిషి ధనవంతుడవుతాడు? - కోరిక
౪. దేన్ని త్యజిస్తే మనిషి సంతుష్టుడవుతాడు? - లోభం

మిగతావి తరువాయి భాగంలో...

ఆవకాయ పర్వం


(నాకు కూడా ఆవకాయంటే మహా ఇష్టమండి. కాసేపు నవ్వుకోవటంకోసం రాసిన భాషణం మాత్రంగా భావించి మీ మీ ఆవకాయ జిహ్వలను నిలుపుకొని భావితరాలకు ఈ ఆమ్ర యాగాన్ని మీ వారసత్వంగా అందించాలని కోరుతున్నాను. గోంగూర, వంకాయ, ఆవకాయ, ముద్దపప్పు తినని బతుకు ఒక తెలుగు బతుకేనా అని అనను కానీ అవి మన జీవితాల్లో ఒక ప్రముఖమైన భాగం అని చెప్పగలను).

మన ఆంధ్రులకి ఉప్పు, కారం, నూనె/నెయ్యి, ఘాటు అంటే మహా ప్రీతి సుమండీ. అందుకే ఎన్ని ఆరోగ్యకరమైన వంటకాలు ఉన్న ఈ ఆవకాయ లేనిది చాలా మందికి ముద్ద దిగదు. అసలు ఈ ఆవకాయ గోల ఎంత అంటే, మే నెల వచ్చిందంటే  చాలు అమ్మలక్కల సంభాషణలో ఇది ప్రథమస్థానంలో ఉంటుంది.

ఉగాదికి పిందెల రూపంలో ఉన్న కాయలు మెల్ల మెల్లగా వసంతఋతువు రెండో భాగము, గ్రీష్మ ఋతువు మొదటి భాగానికి బాగా పెరికి పచ్చగా నిగ నిగ లాడుతూ కోయండి, కోసి నరకండి అని మనల్ని పిలుస్తున్నట్టుగా ఉంటాయి. ఇహ మొదలు ఇంట్లో ఆవకాయ పర్వం. భారతంలో యుద్ధ పర్వాన్ని తలపిస్తూ ఇళ్ళలో ప్రక్రియ మొదలు. "ఏవండి పక్కింటి సీతమ్మ గారు ఆవకాయ పెట్టేసారండీ. మీకు ఏదీ పట్టదు. మంచి కాయలు అన్ని అయిపోతే మళ్ళా నన్ను దెప్పి పొడుస్తూ ఊరగాయ మీద వంకలు పెడతారు మీరంతా" అనే గృహిణులు కొందరయితే "అమ్మో కమలమ్మ గారి ఆవకాయ కన్నా మనదే బాఉండాలి" అనే అత్రుతతో  భర్తలను కాయలు కొనటానికి తరిమే భార్యామణులు కొందరు, "ఆ ఏదో ఇంత ఆవకాయ పెట్టి జాడీలో తగలేస్తే ఓ పని అయిపోతుంది" అనుకునే సత్తెమ్మలు ఇంకొందరు. ఏదయితేనేం, అందరు మగాళ్ళు, మగరాయుళ్ళ లాంటి మహిళామణులు, పిల్లలు పెద్దలు కూరగాయల మార్కెట్ మీద పడటంతో మొదలు ఈ పర్వం.

బాగా గట్టి టెంకె ఉండే కాయలు, పులుపు ఉండే కాయలు కొనటం మొదటి మెట్టు. ఇదేమి సులభం కాదు బాబోయ్. ఏ మాత్రం తేడా వచ్చినా ఆవకాయ, ఇంటికి వచ్చి తిని వ్యంగ్యంగా మాట్లాడే బంధువులు, ఎన్ని పచ్చళ్ళు ఉన్నా ఆవకాయ ఉందా అని అడిగి వేయించుకొని "మీ ముక్క  మెత్తబడింది వదినగారు, ముక్కలో పులుపులేదమ్మ" అని విసుర్లు విసిరితే అప్పుడు ఉంటుంది ఆ ఉక్రోషం - మీ పిల్లడు పదో తరగతి తప్పినా పర్వాలేదు కానీ ఆవకాయ మాత్రం బాగా ఉండాలి. మగమహారాజులకు ఆ కాయల నాణ్యత భాగోతం అస్సలు తెలీదు. అందుకనే సపరివార సమేతంగా వెళ్లే పర్వం ఈ ఆవకాయ పర్వం. మాంచి మండుటెండలో చెమటలు కార్చుకుంటూ ఒక వందసార్లు బేరమాడి చివరకు కాయలు కొని తర్వాతి మెట్టు మీద అడుగు పెడతారు దంపతులు.

ఇప్పుడు ఆవపిండి, కారం కొట్టుకునే పని లేదు కాబట్టి ఇల్లాలికి నచ్చిన బ్రాండ్ లో సమపాళ్ళలో ఆవపిండి, కారం, ఉప్పు పాకెట్లు కొనుక్కోవటం. మా చిన్నప్పుడు మంచి ఎర్రటి మిరపకాయలు తెచ్చి బాగా ఒక వారం ఎండబెట్టి, వాటిని కొట్టి/పట్టించి కళ్ళు చెదిరే ఎర్రటి కారాన్ని తయారుచేవాళ్ళు. ఆ ఘట్టంలో కళ్ళలో నీళ్ళు, ముక్కుల్లో ప్రవాహం, చిరపరలు, తిట్లు, శాపనార్థాలు, అబ్బో అది వర్ణించనలవి కాదు. అలాగే ఆ ఆవాలు రోట్లో వేసి కొడుతుంటే ఇల్లంతా ఘాటు వ్యాపించేది.

ఇప్పుడయితే మార్కెట్లోనే కాయలు కడిగి, తుడుచుకొని, కొట్టించి తీసుకొని వచ్చే సాధనాలు వచ్చాయి. మా చిన్నప్పుడు ప్రతి ఇంట్లో మామిడికాయలు ఎనిమిది పక్షాలుగా నరికి సరైన ప్రమాణంలో ముక్కలు ఉండేలా చూడటం ఒక కళ. ప్రతి ముక్కలో టెంకె ఉండాలి. తడి ఉండకూడదు. కాయ పండకూడదు. చేతిలో ఒక 3-4 ముక్కలు పట్టాలి. ఇలా ఈ ముక్కల ప్రహసనంలో చాలా మెళకువలు, ఏకాగ్రతతో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయాలండి. లేకపొతే ఇంటి ఇల్లాలి రుసరుసలు, గరిటె బాదుళ్ళు తప్పవు.

తరవారి ఘట్టం జీడి తీయ్యటం. చేతి కాస్త నూనె రాసుకుని జీళ్ళు తీయాలి. మాకు తెలుసు లెండి అనే మగరాయుడికి చేతులు కాలక తప్పదు. తగినంత నూనె తర్వాతి అంశం. నూనె విషయానికొస్తే పప్పు నూనె కొందరు, నువ్వుల నూనె కొందరు (వాళ్ళు ఏది కొంటే అదే గొప్ప మిగతావి పనికిరానివి అన్న భావనలో మునిగి తేలుతుంటారు గృహిణులు).  నూనె ధర, తూకంలో బాగా బేరమాడటం, కొట్టు వాడితో దెబ్బలాడటం ఇందులో భాగం. ఇప్పుడయితే హాయిగా ప్యాకెట్స్ కాబట్టి ఇబ్బంది లేదు.

ఇక అసలు ముఖ్య, పతాక సన్నివేశం. ఆవకాయ కలపటం. ఒక పెద్ద ప్లాస్టిక్ టబ్లో కానీ, స్టీలు పాత్రలో కానీ ముక్కలు వేసి, అన్ని కాయలకు అంత ఉప్పు, అంతే కారం, కొంత ఎక్కువ ఆవపిండి వేసి చెయ్యి పెట్టి కలిపి, నూనె పోసి మరోసారి కలియపెట్టటం. ముక్క చెదరకుండా, ఉప్పు, కారం, నూనె అన్ని కలిసి ఎర్రగా ముక్కలు కనిపించే దృశ్యం రమణీయం. ఇష్టాలు, సాంప్రదాయాలను బట్టి కొందరు వేరు వేరు పదార్థాలు కూడా వేస్తారు. ఇలా కలిపిన ఆవకాయను గుండ్రటి పింగాణీ జాడీలో వేసి గుడ్డతో మూతకట్టి ఒక మూలకు పెడతారు. అప్పుడు కలిపిన పాత్రలో మిగిలిన ఆవకాయలో కొంచెం వేడి వేడి అన్నం, అంత నెయ్యి వేసి కలిపి తింటే ఉంటుందండి రుచి. అబ్బో ఆహా ఓహో - ఆవ ఘాటు, కారం, ముక్క పులుపు దేని రుచి దానికే ఉండి స్వర్గం కనిపిస్తుంది.
ఆ ఆవకాయ అన్నం తిని నోట, ముక్కుట నీరు కార్చుకుంటూ, అమ్మను పొగుడుతూ ఆవకాయ రసాస్వాదనలో మునిగి తేలి తబ్బిబ్బవుతారు మన ఆంధ్రప్రజానీకం.

మూడో రోజు జాడీ మూత తీసి, ఉప్పు, కరం, ఆవఘాటు ఏది తగ్గినా దాన్ని సరి చేసుకొని, ముక్కలు మునిగేంత నూనె పోసి (ప్రాంతం, సాంప్రదాయమును బట్టి శనగలు, మెంతులు, వెల్లుల్లి వేస్తారు) బాగా కలిపి జాడీలో భద్రపరిస్తే అప్పుడు ఆవకాయ పర్వం పూర్తి. పక్కింటి పిన్ని గారికి, అద్దెకున్న వాళ్లకు, ఇంటికి వచ్చే అతిథులకు దాని రుచి చూపించే దాక నిద్రపట్టదు మహిళలకు.

కొత్త మోజులో  ఎక్కువ తిన్నారనుకోండి, ఇక  బాత్రూం లోంచి బయటికి రారు. ఆవపిండి వేడి. అలానే కొత్త కారం పొట్టలో ప్రేగుల్ని కడిగేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా తింటే మంచిది. మా స్నేహితుడి  అమ్మగారు  - 'ఏవండి ఆవకాయ యాంటిబయోటిక్ లాగ పనిచేస్తుందండి' అనేవారు.  అందులో ఎంత నిజముందో తెలీదు కానీ కొత్త ఆవకాయ రుచంటే కొత్త పెళ్ళాం/మొగుడు అంత సరదా.

ఆవకాయలు రకరకాలు - బెల్లం ఆవకాయ, నీళ్లావకాయ వగైరా వగైరా. మామిడికాయ కాకుండా  - ఉసిరి, కాకర, పెసర, దోస ఇలా చాలా కూరగాయలతో కూడా చేస్తుంటారు.

ఆవకాయ మహారాజ్ కీ జై.

స్వామి సమర్థ రామదాసు

భారతదేశం మహమ్మదీయుల దాడికి గురై, ఆ చక్రవర్తులు హిందూ మతాన్ని, హిందువులను హింసించి, చంపి మతవిద్వేషాలను రేపుతున్న సమయంలో ప్రస్తుతపు మహారాష్ట్రలో అవతరించారు స్వామి సమర్థ రామదాసు. ఛత్రపతి శివాజీకి మార్గోపదేశం చేసి ధర్మమార్గంలో నడిపించిన అపర ఆంజనేయావతారం ఆ సమర్థులు. స్వామి సమర్థ రామదాసు హిందూ మత పరిరక్షణ కొరకు ఎన్నో వేల దేవాలయాలు కట్టించారు. మహారాష్ట్ర, ఆంధ్ర, కన్నడ రాష్ట్రాలలో ఉన్న చాలామటుకు హనుమాన్ దేవాలయాలు ఆయన ప్రతిష్ఠించి/పునరుద్ధరించినవే. ఆ మహనీయుడు కొన్నేళ్ల పాటు దేశాటన చేసి హిందూ మతంయొక్క విశిష్టతను ప్రజలమధ్యకు మళ్లీ తీసుకెళ్లి రాజు, ప్రజ ఇరువురికీ మార్గదర్శకుడైనారు. ఆ సమర్థ సద్గురువు సమకాలీకులు మన భద్రాచల రామదాసు. వీరిరువురి కలయిక అనిర్వచనీయమట. దాసబోధ, మనాచీ శ్లోకములు, రామాయణము ఇలా ఎన్నో రచనలు చేసి ఒక కొత్త ఒరవడిని మొదలు పెట్టారు. మహారాష్ట్రలో ఆయన చిత్రపటం లేని ఇల్లు, వ్యాపారము ఉండదు అంటే అతిశయోక్తి కాదు. ఆ సద్గురువులకు నా నమస్సుమాంజలి. జయ జయ రఘువీర సమర్థ.

పంచ భూత లింగాలు

పంచభూతలింగాలు - (పృథివిః + ఆపః + తేజః + వాయుః + ఆకాశః ) పృథివ్యాపస్తేజోవాయురాకాశాత్మకాలైన ఐదు లింగాలు దక్షినాదిన తమిళాంధ్ర సీమల్లో వెలసియున్నాయి:

౧. పృథివీలింగం - కంచిలో కామాక్షితో కొలువైయున్న ఏకామ్రేశ్వరుడు. (ఈ కాంచీపురంలో ఇంకా చూడవలసినవి ఎన్నో - వైష్ణవ క్షేత్రమైన వరదరాజ పెరుమాళ్ ఆలయము, కంచిపీఠం మొదలైనవి).  ఏకామ్రేశ్వరుని హృదయేశ్వరియై మూక కావిని అనుగ్రహించి అతనిచే మూక పంచశతి కావ్యాన్ని రచింపజేసిన ఆ శక్తి పీఠ వాసిని కామాక్షమ్మ తల్లి. కంజదళాయతాక్షి కామాక్షి కమలామనోహరి త్రిపురసుందరి అని ముత్తుస్వామి దీక్షితులు స్తుతించిన ఆ తల్లి ఈ క్షేత్రంలో విరాజిల్లుతోంది.
౨. జలలింగం - జంబుకేశ్వరంలో (తిరుచిరాపల్లి) అఖిలాండేశ్వరితో అలరారుతున్న జంబుకేశ్వరుడు. (విష్ణు భక్తులకు అత్యంత పవిత్రమైన శ్రీరంగం ఇక్కడికి చాలా దగ్గర).
౩. తేజోలింగం - అరుణాచలంలో (తిరువణ్ణామలై) ఉణ్ణమలైదేవితో కలిసి ఊయలలూగే అరుణాచలేశ్వరుడు. (ఇక్కడ గిరి పరిక్రమణ, భగవాన్ రమణమహర్షి ఆశ్రమం - చాలా సమయం గడపొచ్చు).
౪. వాయులింగం - శ్రీకాళహస్తిలో ఙ్ఞానప్రసూనాంబతో వేంచేసియున్న శ్రీకాళహస్తీశ్వరుడు. (మన ఏడుకొండలవాడికి కేక వేసేంత దూరంలో ఉన్నాడీ పరమశివుడు).
౫. ఆకాశలింగం - చిదంబరంలో శివకామసుందరితో నాట్యం చేస్తున్న నటరాజస్వామి. (చిదంబరం, వైదీశ్వరన్ కోయిల్, కుంభకోణం, తంజావూరు - ఇవన్నీ ఒక ౭౦-౮౦ కిలోమీటర్ల పరివృతంలో కొన్ని వందల పురాతాన దివ్య శైవ, వైష్ణవ, నవగ్రహ, సుబ్రహ్మణ్య క్షేత్రాలున్నాయి).

ఈ ఐదు క్షేత్రాలు అత్యంత మహిమాన్వితమైనవి. అత్యద్భుత శిల్పకళాసౌందర్యంతో విశాలమైన గోపురాలు, ప్రాంగణాలు - అబ్బో చెప్పనలవి కాని చారిత్రక కట్టడాలు, ఆధ్యాత్మిక పుణ్యధామాలు. మీకు సమయమున్నప్పుడు తప్పకుండా చూడవలసిన దివ్య క్షేత్రాలు.

29, జూన్ 2010, మంగళవారం

అన్నమయ్య దశావతార వర్ణన

అన్నమయ్య దశావతారాల్ని వర్ణిస్తూ రాసిన ఒక కీర్తన:

ఇందరికి అభయంబులిచ్చు చేయి
కందువగు మంచి బంగారు చేయి॥౨

వెలలేని వేదములు వెదకి తెచ్చినచేయి
చిలుకు గుబ్బలి కింద చేర్చు చేయి
కలికి యగు భూకాంత కౌగిలించినచేయి
వలనైన కొనగోళ్ళ వాది చేయి
తనివోక బలిచేత దానమడిగిన చేయి
ఒనరంగ భూదాన మొసగు చేయి
మొనసి జలనిధి యమ్ముమొనకు దెచ్చిన చేయి
ఎనయ నాగేలు ధరియించు చేయి

పురసతుల మానములు పొల్లసేసినచేయి
తురగంబు బరపెడి దొడ్డచేయి
తిరువేంకటాచలాదీశుడై మోక్షంబు
తెరువు ప్రాణుల కెల్ల తెలిపెడి చేయి

సారాంశం:
 వేదాలను కాపాడటానికి మత్స్యావతారం, అమృత మథనంలో మందరపర్వతాన్ని వాసుకి చిలుకుతుండగా ఆ బరువుని మోసిన కూర్మావతారం, భూదేవి ప్రార్థన విని వరాహావతారంలో భూమిని ఎత్తి, వాడి గోళ్ళతో హిరణ్యకశిపుని చంపిన నరసింహావతారం,  బలిచక్రవర్తిని మూడు అడుగులు దానమడిగి విశ్వవ్యాప్తమై అతన్ని పాతాళానికి పంపించిన వామనావతారం,  క్షత్రియ నాశనం చేసి భూమిని బ్రాహ్మణులకు దానం చేసిన పరశురామావతారం,  తన బాణంతో సముద్రుడిని గడగడలాడించి వానరసేనకు లంకదారి చూపిన రామావతారం, 
 నాగలి ధరించి శత్రునాశనం చేసిన బలరామావతారం, గోపికల చీరలు దోచి వారి అహంకారాన్ని అణచిన కృష్ణావతారం,  అశ్వం ఎక్కి దుష్టసంహారం చేసే కల్కి అవతారం - ఏ అవతారమైనా భక్తులకు మోక్షమిచ్చే ఆ పరమాత్మ మన తిరుమలకొండలపై వెలసిఉన్న ఆ శ్రీవేంకటపతి.