22, సెప్టెంబర్ 2020, మంగళవారం

చూడగల్గెను రాముని సుందర రూపము - తూము లక్ష్మీనరసింహదాసు కృతి


తూము లక్ష్మీనరసింహదాసు గారు - భద్రాద్రి శ్రీరాముని తన ఇష్టదైవంగా జీవితాంతం సేవించి తరించిన భక్త శిఖామణి. భద్రాచల రామదాసు కర్మలేశం అనుభవించడానికి ఇలా మరలా జన్మించాడని కొందరి భావన. తూము నరసింహదాసుది గుంటూరు ప్రాంతం. వీరి తండ్రి అప్పయ్య, తాత వెంకటకృష్ణయ్యలు శిష్టాచారపరులుగా ప్రసిద్ధులు. వీరు 1790లో అప్పయ్య, వెంకమాంబ దంపతులకు మొదటి సంతానంగా జన్మించారు. ఇరవై సంవత్సరాల వయసులో తండ్రి పరమపదించడంతో కుటుంబ భారం దాసుపై పడినది. అందుకోసం పొన్నూరులో పేష్కారుగా పనిచేశారు. వంశానుగతంగా దాసుకు లభించిన వరం రామభక్తి. తన ఇంటిలోనే రామ మందిరం నిర్మించి, అడ్డుగా ఉన్న ఉద్యోగాన్ని వదులుకున్నారు.

దాసు భారతదేశం అంతా సంచరించి తాను దర్శించిన దేవతలను పద్య కుసుమాలతో పూజించారు. కాలినడకన దాసు కాశీ, పూరీ, కుంభకోణం, తిరువయ్యూరు దర్శించారు. మహాభక్తుడైన త్యాగరాజు దాసుని కలిసి కీర్తనలు గానం చేస్తూ స్వాగతం చెప్పారు. తరువాత కాంచీపురం, తిరుపతి, అయోధ్య, హరిద్వారం కూడా దర్శించారు. అక్కడ నుండి భద్రగిరి చేరిన దాసుకు, శ్రీరామునికి జరుగవలసిన పూజాదికాలు కుంటుపడటం, బాధ కలిగించింది. రామచంద్రుడు ఒకనాటి రాత్రి కలలో కనిపించి హైదరాబాదులో మంత్రిగా ఉన్న చందూలాల్ అనే తన భక్తుని దర్శించమని అజ్ఞాపిస్తాడు. కలిసిన నరసింహదాసును ఆ మంత్రి భద్రాచలం, పాల్వంచ పరగణాలకు పాలకునిగా నియమించాడు. నాటి నుండి భక్త నరసింహదాసు రాజా నరసింహదాసుగా ప్రసిద్ధిచెందారు. ఆ రోజులలో నరసింహదాసు, అతని శిష్యుడు వరద రామదాసు తమ ఐశ్వర్యాన్ని భద్రాద్రి రాముని కైంకర్యానికే వినియోగించారు. భద్రాచలం కలియుగ వైకుంఠంతో తులతూగినది. నారద తుంబురులే, నరసింహ మరియు వరద రామదాసులుగా దివి నుండి భువికి దిగివచ్చారని భక్తులు భావించారు.

నిరంతరం రామనామ స్మరణ చేసుకునే దాసు విజయ సంవత్సరం (1833-34) బాధ్రపద చతుర్థి నాడు రామునిలో లీనమయ్యారు. అతని భౌతిక కాయాన్ని గోదావరి నదిలో నిమజ్జనం చేయడానికి వెళ్ళిన భక్తుల బృందంతో సహా దేహత్యాగం చేశారు. 

(పై సమాచారం వికిపిడియా నుండి)

ఆయన రచించిన కృతిని ఆలపించిన వారు డాక్టర్ కల్లూరి మురళీకృష్ణ గారు.

చూడగల్గెను రాముని సుందర రూపము
వేడుకలర శ్రీభద్రద్రి విభుని రాఘవ ప్రభుని నేడు

కరకు బంగారు మకుటము మెఱయు కస్తూరి తిలకము
సరసమైన బొమలు కరుణ కురియు కందోయు గలుగు స్వామిని

నీల నీరద దేహము మేలి పసిడి చేలము
చాల భక్తుల బ్రోవ జాలు పదములు గలుగు స్వామిని

ఇందువదనమందు మందహాసము మెఱయగ
అందమైన వెడద యురమునందు ముత్యపు సరులు గలవాని

రత్నమంటపమందు సీతారమణి వామాంకమందు
యత్నముగా మెఱయు మమ్మేలు ఇనకులాంబుధి సోమును రాముని

ఇరుగడల చామరములిడగ వరుస ముత్యాల గొడుగులమర
నరసింహదాసుడెదుట జేయు నాట్యమవధరించు స్వామిని 

ఒక పిలుపులో పిలిచితే పలుకుతావటా - శ్రీరంగం గోపాలరత్నం గారి ఆలాపన


శ్రీరంగం గోపాలరత్నం ఆంధ్రుల అనర్ఘ రత్నం అని ఊరికే అనలేదు. ఆవిడ ప్రతిభ అసమానం. అసలు తెలుగు భక్తి మరియు శాస్త్రీయ సంగీత ప్రపంచంలో ఆవిడ వంటి గాన మాధుర్యం కలవారు, గాత్రకౌశలం కలవారు, ఆవిడలాంటి సంపన్నమైన అనుభవం కలవారు మళ్లీ రాలేదు అంటే అతిశయోక్తి లేదు. విధి బలీయమై ఆవిడ చిన్న వయసులోనే రాలిపోయారు. లేకపోతే ఖచ్చితంగా మరో ఎమ్మెల్ వసంతకుమారి లేదా డీకే పట్టమ్మాళ్ అయ్యేవారు. లలిత భక్తి గీతాలైనా, యక్షగానాలైనా, అన్నమాచార్య కీర్తనలైనా, నారాయణ తీర్థుల తరంగాలైనా ఆవిడ గాత్రంలో యమునా తరంగాలలా జాలువారాయి. భావగర్భితమైన భక్తి ఆవిడ ప్రత్యేకత. ఆర్తి ఆవిడ గాత్రానికి సహజ లక్షణం. ఆవిడ ఆలపిస్తే ఆ పరమాత్మ ఎదుట నిలిచి అనుగ్రహించవలసిందే. అది ఏ రకమైన భక్తైనా కావచ్చు. పరిపూర్ణమైన కళాకారిణి గోపాలరత్నం గారు. ఆవిడ ఆలపించిన గీతాల్లో నన్ను కరగించినది ఏడిద కామేశ్వరరావు గారి ఒక పిలుపులో పిలిచితే. ఆవిడ ఆర్తి, భక్తి కళ్లు మూసుకుని అనుభూతి చెందితే, ఏడుకొండలస్వామి దిగివచ్చి తీరాలి అన్న భావన కలుగుతుంది. ఆపద మ్రొక్కుల సామీ అని గోపాలరత్నం గారు స్వామిని వేడితే ఆ స్వామి హృదయం కరిగి కరుణించవలసిందే అనిపిస్తుంది. విని మీరు కూడా ఆస్వాదించండి. ఆ మహా విదుషీమణికి వేవేల నమోవాకములు. 

ఒక పిలుపులో పిలిచితే పలుకుతావటా నా పలుకులో కులుకుతావటా
ఆపద మ్రొక్కుల సామీ! నీ సన్నిధె నా పెన్నిధీ!

కొండంత దేవుడవని కొండంత ఆశతో 
నీ కొండ చేర వచ్చితిని అండ జేసి కాపాడరా

అభయహస్తమున్నదట అభయమూర్తివీవేయట
అభయదానమిచ్చి నాకు భవతరణ పథమ్ము జూపు

వడ్డికాసువాడవట వడ్డీ వడ్డీ గుంజుదువట
అసలు లేని వారమయ్యా వెతలు బాపి కావుమయ్యా

కొలువుదీరెనే రాముడు - వాసుదాసస్వామి గారి కృతి

వాసుదాసస్వామిగా పేరొందిన వావిలికొలను సుబ్బారావు గారి పరిచయం వనం జ్వాలా నరసింహారావు గారి మాటల్లో. ఆ తరువాత వారు ఒంటిమిట్ట రాములవారిపై రచించిన ఒక కృతి. శ్రవణం ఆకాశవాణి విజయవాడ వారి సౌజన్యంతో.

వాల్మీకి రామాయణాన్ని యథావాల్మీకంగా, పూర్వకాండలతో సహా ఉత్తరకాండను కూడా కలిపి తెనిగించిన ఏకైక మహాకవి కీర్తి శేషులు వావిలికొలను సుబ్బారావు (వాసుదాసు) గారు. ఆ మహానుభావుడి ఆంధ్ర వాల్మీకి రామాయణం మందరాలన్నీ, తెలుగు నేల నాలుగు చెరగులా విశేష ప్రాచుర్యాన్ని ఏనాడో సంతరించుకున్నాయి. కానీ, కాలక్రమంలో అవన్నీ మరుగున పడిపోతున్నాయి. వాల్మీకి రామాయణ క్షీరసాగర మథనాన్ని చేసి "మందర" మకరందాలనూ, రమా రామ పారమ్య పీయూషాలనూ, నాలుగు చెరగులా పంచి, ఆ మథనంలో ఆవిర్భవించిన శ్రీ సీతారాముల తత్వాన్ని, వేద వేదాంగేతిహాస స్మృతి శ్రుతి శుభంగా అన్వయించి, ఆంధ్రుల హృదయ కేదారాలను ప్రపుల్లం చేసిన పరమ భాగవతోత్తములు "ఆంధ్ర వాల్మీకి" వాసుదాస స్వామి వారు.

వాసుదాసు గారి కీర్తికి ఆలవాలమైంది ఆంధ్ర వాల్మీకి రామాయణం. ఆంధ్ర భాషలో అంతకుముందు రామాయణానికి యథామూలాలు లేవని, అర్థ పూర్తి కలిగి, కావ్య-ఇతిహాస గౌరవ పాత్రమై, సర్వజన పఠనీయమై, ప్రామాణికమై, మూలానుసరమైన రామాయణం తెలుగులో వుండడం లోకోపకారంగా భావించి రచించారీ గ్రంథాన్ని వాసుదాసు గారు. ఎనిమిదేళ్లలో రామాయణాన్ని తొలుత నిర్వచనంగా ఆంధ్రీకరించి, అలనాటి కడప మండలంలోని ఒంటిమిట్ట కోదండ రామస్వామికి అంకితం చేశారు. తర్వాత, శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం "మందరం" పేరుతో గొప్ప వ్యాఖ్యానం వ్రాశారు వాసుదాసు గారు. వాస్తవానికి అదొక గొప్ప ఉద్గ్రంథం. సరికొత్త విజ్ఞాన సర్వస్వం. తను రచించిన నిర్వచన రామాయణంలో సంస్కృత రామాయణంలో వున్న ప్రతి శ్లోకానికొక పద్యం వంతున రాసారు వాసు దాసుగారు. మందరంలో తను రాసిన ప్రతి పద్యానికి, ప్రతి పదార్థతాత్పర్యం సమకూర్చారు. ఒక్కో పదానికున్న వివిదార్థాలను విశదీకరించారు. భావాన్ని వివరణాత్మకంగా విపులీకరించారు. ఆయన మందరాలలోని శ్రీరామాయణ వ్యాఖ్యానంలో "జ్ఞాన పిపాసి"కి విజ్ఞాన సర్వస్వం దర్శనమిస్తుంది.

ఆంధ్ర వాల్మీకి రామాయణం వ్రాయడానికి ప్రేరణ-స్ఫూర్తి, భాగవత గ్రంథకర్త బమ్మెర పోతన సంకల్పం ద్వారానే తనకు లభించిందంటారు వాసుదాసుగారు. వావిలికొలను సుబ్బారావుగారు, కడప జిల్లా జమ్మలమడుగులో 1863లో జన్మించి 1939లో పరమపదించారు. ఎఫ్‌.ఎ చదువు పూర్తిచేసి, పొద్దుటూరు తాలూకా కార్యాలయంలో చిరుద్యోగిగా చేరి, రెవెన్యూ ఇనస్పెక్టర్‌ హోదాకెదిగారు. ఆ విధంగా 1893-1904 మధ్య కాలంలో పదకొండేళ్లు రెవెన్యూ శాఖలో ఉద్యోగం మొదట్లో చేశారు. కందుకూరి వీరేశలింగం పంతులు గారి తర్వాత, మద్రాస్‌ (నేటి చెన్నై) ప్రెసిడెన్సీ కళాశాలలో ఆంధ్ర పండితులుగా 1904-1920 మధ్య కాలంలో పనిచేశారు. వాసు దాసుగారి తర్వాత ఆ పదవిని అలంకరించింది అక్కిరాజు ఉమాకాంతం గారు. కళాశాలలో చేరక ముందే, పినతండ్రి మీద తనకున్న కృతజ్ఞతకు గుర్తుగా, "శ్రీ కుమారాభ్యుదయం" అనే ప్రబంధ గ్రంథాన్ని రచించి, ఆయనకు అంకితమిచ్చి శాశ్వత స్వర్గ సుఖాన్ని ఆయనకు కలిగించారు. ఆంధ్ర పండితుడిగా పనిచేస్తున్న రోజుల్లోనే, భార్యావియోగం కలగడంతో, వాసు దాసుగారు భక్తి-యోగ మార్గం పట్టారు. జీర్ణ దశలో వున్న ఒంటిమిట్ట రామాలయాన్ని సముద్ధరించాలన్న సంకల్పంతో, బిక్షాటనచేసి లభించిన ధనంతో ఆలయాన్ని అభివృద్ధి చేసారు. ఆంధ్ర వాల్మీకి రచనాకాలం 1900-1908 మధ్య. గాయత్రీ మంత్రం, రామ షడక్షర మంత్రం మూలంలో వున్నట్లే, అనువాదంలో కూడా నిక్షిప్తం చేశారాయన. వాల్మీకంలో వున్న బీజాక్షరాలన్నీ, ఇందులోనూ యథాస్థానంలో చేర్చబడ్డాయి. విడిగా వాసు దాసుగారు, గాయత్రీ రామాయణం, శ్రీరామనుతి కూడా రాసారు. ఆంధ్ర వాల్మీకం అనువాదమైనా, స్వంత రచన-స్వతంత్ర రచన అనిపించుకుంది.

వావిలికొలను సుబ్బారావుగారు పండిత పదవీ విరమణ చేసిన అనంతరం, తన జీవితమంతా, భక్తి మార్గంలోనే గడిపారు. వాసు దాసుగారు కౌసల్యా పరిణయం అనే ప్రబంధం, సుభద్రా విజయం అనే నాటకంతో పాటు, హిత చర్యలు, ఆధునిక వచనరచనా విమర్శనం, పోతన నికేతన చర్చ, పోతరాజు విజయం, రామాశ్వమేథం, ఆంధ్రవిజయం కూడా వ్రాశారు. ఆర్యకథానిధులు అన్న పేరుతో ఆయన వ్రాసిన సులభ వచన గ్రంథాలు తెలుగువారందరికి అత్యంత ఆదరణీయమైనాయి. సులభ వ్యాకరణం తెలుగు వ్యాకరణాన్ని నిజంగానే సులభం చేసింది. ఆయన రచించిన కృష్ణావతార తత్వం ప్రశస్త కృతి పాండిత్యంతో, ఆధ్యాత్మికభావనతో, పాఠకులలో ఆంధ్ర భాషాభిమానాన్ని ఉద్దీపించ చేసి-తాను తరించి, ఇతరులను తరింపచేసిన ధన్యాత్ముడు.

వాసుదాసుగారు ఆంధ్ర వాల్మీకిగా లబ్ద ప్రతిష్టులయ్యారు. రామాయణ క్షీర సాగరాన్ని మందరం మథించి, మనకందరికీ ఆప్యాయంగా అందించింది. భాష, శైలి, అర్థం, తాత్పర్యం కాలక్రమంలో పరిణామం చెందుతున్నాయి. వాసు దాసుగారు మారిపోతున్న తరాలకు గుర్తురావడం కూడా కష్టమైపోతున్నది. వారి ఆర్యకథానిధులతోనూ, హితచర్యల పరంపరలతోనూ, పరవశించిపోయిన తెలుగు పాఠక మహనీయులు క్రమంగా తెరమరుగవుతున్నారు. మళ్లీ-మళ్లీ జ్ఞాపకం చేసుకోవాల్సిన, మరువలేని మహనీయుడు, ప్రాతఃస్మరణీయుడు వాసుదాసస్వామి.

కొలువుదీరెనే రాముడు కొలువుదీరెను

కొలువుదీరెను నేడు కోసలాధీశుడు
జలజాతలోచన జానకితో గూడి

కనకసింహపీఠి కమలాక్షులందరు
మనసార వింజామరములు వీవగా

హరిహయ హరముఖ సురవరులెల్లరు
కరములు జోదించి కరము భక్తి గొలువ

నృపముఖ్యులెల్లరు కపివరులతోడుత
చపలత లేకుండ సన్నిధి నిలుచుండ

వాసుదాసుడు తన పాటలు పాడగను
ఆశతోడ నిలుచు హర్షమునొందుచును

17, సెప్టెంబర్ 2020, గురువారం

సద్గురు శివానంద సరస్వతి బోధలు


సాధకుల ప్రశ్నలకు హృషీకేష్ దివ్య జీవన సంఘం వ్యవస్థాపకులు స్వామి సద్గురు శివానంద సరస్వతి గారి సమాధానాలు:

ప్రశ్న: మరణమనేది ఎప్పటికైనా రావలసినదే, అది జీర్ణించిన వస్త్రాలను త్యజించి కొత్తవి ధరించినట్లు ఆత్మ ఒక దేహాన్ని వీడటమనే ప్రక్రియ అయినప్పుడు, ఆత్మహత్య మరియు జంతుబలి ఎలా పాపం?

సమాధానం: ఆత్మహత్య మరియు జంతుబలి మహాపాపాలు అని ఎందుకు అన్నారు అంటే అవి ఆ జీవుని యొక్క జీవ పరిణామాన్ని అర్థాంతరంగా ఆపివేస్తాయి కాబట్టి. అంతే కాకుండా, దేహాన్ని అర్థాంతరంగా ముగించటం వల్ల ఆ జీవుని యాతనలను ఏ మాత్రం తగ్గించకపోగా మరింత పెంచుతున్నాము. ఆ జీవునికి పూర్వజన్మ కర్మఫలముల వలన కలిగే సుఖదుఃఖాలను అటువంటి హత్యల వలన మనం ఏ మాత్రం తగ్గించటం లేదు. ఆ ఫలాలు పూర్తిగా ఎప్పటికైనా, ఎన్ని జన్మలెత్తైనా సరే అనుభవించి తీరవలసిందే.

అంతే కాకుండా, ఆత్మహత్య వలన జీవుడు మరిన్ని క్లేశాలను కొని తెచ్చుకుంటాడు. ఎందుకంటే అటువంటి దశలో దేహాన్ని వీడిని జీవునకు తన కర్మఫలాలను అనుభవించటానికి మరొక దేహం పొందటానికి సహజ మరణం కన్నా ఎంతో ఎక్కువ సమయం పడుతుంది. ఈ దేహప్రాప్తి కోసం వేచియుండటంలో జీవుడు ప్రేతాత్మగా సంచరించవలసి రావచ్చు. ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకున్నా ఇటువంటి జీవహింస వల్ల కలిగే దోషాలను, జీవుని దుస్థితుల నుండి త్వరగా ముక్తి కలుగక పోవచ్చు. సహజ జీవన పరిణామంలో జీవికి కలిగే మార్పులు అత్యంత సహేతుకమైనవి, వెలకట్టలేనివి.

మహామృత్యుంజయ మంత్రం ఏమని చెప్పింది? ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ అని. అంటే, దోసపండులా తీగనుండి ఎటువంటి నొప్పి లేకుండా, అత్యంత తేలికగా విడిపోవాలని పరమశివుని ప్రార్థిస్తాం. దోస తీగ పూవు పూచి, కాయ ఏర్పడి, ఆ కాయ తగినంత పరిణామానికి చేరి, పండటం మొదలు పెట్టి, పూర్తిగా పరిపక్వత సాధించిన తరువాత తీగనుండి వీడటానికి సిద్ధంగా ఉంటుంది. అప్పుడు కోస్తే తీగకు, పండుకు అతి తక్కువ క్లేశం ఉంటుంది. ఆత్మ కూడా అంతే. అర్థాంతరంగా ఆ దేహాన్ని బలవంతంగా విడిపోయేట్లు చేస్తే ఎంతటి క్షోభ అది? ఆలోచించండి.

జీవన క్రమంలో ఏ ఆశ్రమ ధర్మం పాటించినా, జీవికి విషయ వాంఛల నుండి, బంధనాల నుండి ముక్తి కలగటమే సహజమైన ప్రక్రియ. ఈ విధంగానే కర్మఫలానుభూతి పరిపూర్ణమయ్యేది. ఇది బలవన్మరణంలో కలుగదు. అది మానవ జన్మైనా, మరే ఇతర జంతు జన్మైనా సరే. సారాంశం - ఆత్మహత్య లేదా జంతుబలి అన్నది ఆధ్యాత్మిక ప్రగతికి పూర్తిగా విరుద్ధమైన కర్మ. ఆధ్యాత్మిక పురోగతే కదా సమాజ పురోగతికి ప్రధాన హేతువు? అందుకే, చట్టరీత్యా అవి నేరాలు అయ్యాయి.

ప్రశ్న: సాధకులు మాంసాన్ని తినటం ఏ ప్రాతిపదిక మీద మీరు నిషేధిస్తున్నారు?

సమాధానం: వైద్యపరంగా, మనస్తత్వశాస్త్రపరంగా, నైతికపరంగా, ఆధ్యాత్మికపరంగా. మనసు అనేది మనం తినే ఆహారం యొక్క సారాన్ని బట్టే ఉంటుంది. తామసమైన ఆహారం తామసమైన మనస్సును కలిగిస్తుంది. మాంసం తామసమైనది కాబట్టే దాన్ని వర్జించాలి.

ఒక జంతువును వధించినప్పుడు దాని నాడీమండలం భయంతో కుంచించుకుపోతుంది. మీరు గమనించి ఉండవచ్చు మనకు భయం కలిగినప్పుడు మన కడుపులో వికారాలు కలుగుతాయి. దీనికి కారణం కాలేయం నుండి కొన్ని విషపదార్థాలు వెలువడటం వలన. అలాగే, జంతువులలలో కూడా. ఈ విషపదార్థాలు పేరుకుపోయి, ఆ జంతు మాంసాన్ని ఉడికించినా, వండినా, ఏమి చేసినా అలాగే ఉండిపోతాయి. కాబట్టే మాంసం తినటం విషపూరితము మరియు తినే వారి దేహానికి దీర్ఘకాలంలో ప్రమాదకరం.

ఆత్మ దేహంలో నివసిస్తుంది అన్న ప్రాతిపదికన మనిషికి జంతువుకు తేడా లేదు. ఎలాగైతే మనకు పూర్తికాలం జీవించే హక్కుందో, అదే జీవ సిద్ధాంతం ప్రకారం జంతువులకు కూడా ఆయుః ప్రమాణమున్నంత వరకు జీవించి దేహాన్ని అనుభవించే హక్కుంది. కాబట్టి నైతికంగా జంతువులను చంపటానికి మనకు హక్కు లేదు.

చేతనము అనేక రకాల చరాచరములుగా ఆవిర్భవించింది. ఆ చేతనమే మనలను ఇతర జంతుజాలాలలో, చరాచరములలో ఒకరిని చేసేది. మనలో ఉన్నదే ఆ జంతువులలో కూడా ఉంది. ఇది మన ధర్మం యొక్క మూల సిద్ధాంతం. ఇది తెలిసి కూడా జంతువులను ఎలా హింసించగలము? ఎలా చంపి తినగలము? ఈ ఆత్మ యొక్క ఏకత్వము వల్లనే మనము మరల మరల ఈ ప్రపంచంలో వేర్వేరు జన్మలెత్తుతున్నామనే కదా మన ధర్మం చెప్పింది? ఇదే కదా మనం సాధనలో తెలుసుకునేది? మనం ఇతర జీవులను హింసించకుండా, ప్రేమతో చూసి, కరుణ కలిగి ఉంటేనే కదా ఈ ఏకత్వ భావాన్ని అనుభూతి చెందేది? అప్పుడే కదా మన ఆత్మ, వాటి ఆత్మ ఒకటే అని అర్థమయ్యేది? పరబ్రహ్మమే సమస్త చరాచరములలోని ఆత్మ, ఆయన సృష్టి క్రమంలోనే ఆ ఆత్మ వేర్వేరు దేహాలను ధరిస్తుంది. కాబట్టి మనం చేసే జీవహింస ఆ చేతనము పట్ల పూర్తి అగౌరవభావాన్ని, మన యొక్క తీవ్రమైన అజ్ఞానాన్ని సూచిస్తుంది.

కాబట్టే, జంతువులను చంపకుండా, హింసించకుండా వాటి పట్ల ప్రేమగా ఉండి నిజమైన ఏకత్వాన్ని చాటుదాం.

ప్రశ్న: ఉన్నదానితో తృప్తి చెందటం శాంతిని కలుగజేస్తోంది. కానీ నాదొక సందేహం. నేను సంతృప్తుడనైతే నా జీవిత ఆశయాలు చచ్చిపోతాయి, నేను బద్ధకస్తుడినిగా మారి అలసత్వం పాలవుతాను. అనేక ఆకాంక్షల వల్ల నేను వాటిని సాధించే తపనలో శ్రమపడి మరింత శక్తిమంతుడవుతాను. తృప్తి అనేది మానవ ప్రగతికి అవరోధంలాగా అనిపిస్తోంది. దీనిని నివృత్తి చేయగలరు.

సమాధానం: తృప్తి అనేది ఎన్నటికీ మనిషిని అలసత్వం, బద్ధకం వైపు నడిపించదు. ఇది ఒక ముఖ్యమైన సాత్త్విక ప్రవృత్తి. దాని వలన మనిషి భగవంతుని అన్వేషించే మార్గంలో నడుస్తాడు. అది మానసిక శక్తిని, శాంతిని కలుగజేస్తుంది. అనవసరమైన, స్వార్థపరమైన ఒత్తిళ్ళను పక్కకు పెట్టగలదు. మనిషి యొక్క అంతర్నేత్రాన్ని తెరచి మనసును దేవునివైపు దృష్టి పెట్టేలా చేస్తుంది. అతని శక్తిని అంతర్ముఖం చేస్తుంది. అత్యాశ రూపంలో స్థూలమై ఉన్న శక్తిని ఓజస్సుగా మారేలా చేస్తుంది. తృప్తితో ఉన్న మనిషి సత్త్వముతో పరిపూర్ణుడవుతాడు. అతని శక్తి మరింత పెరుగుతుంది, అంతర్ముఖుడై ఆత్మదృష్టి కలిగి ఉంటాడు. శాంతముతో, ఏకాగ్రతతో మరింత పనిని చేయగలుగుతాడు. చిత్తము యొక్క చెదరగొట్టబడిన కిరణాలు ఏకమై తేజోమయుడవుతాడు.

ఈ సంతృప్తి అన్న బలంతోనే సాధువులు, సన్యాసులు, భిక్షువులు స్వేచ్ఛగా దేశాటన చేయగలిగారు. సంతృప్తి వల్లనే మనిషికి అంతశ్శక్తి కలిగి ఆత్మజ్ఞానం కలిగే మార్గంలో నడుస్తాడు. ముళ్లమయమైన, కఠినతరమైన ఆధ్యాత్మిక ప్రయాణంలో అతను భయాతీతుడై ముందుకు సాగుతాడు.

ప్రశ్న: పరమాత్మ అంతటి దయాళువైతే మరి మంచి వానిని పూర్వ జన్మ కర్మ ఫలాలను అనుభవించే పరిస్థితి నుండి తప్పించి శాశ్వత సుఖాన్ని ప్రసాదించవచ్చు కదా? మంచి వాళ్లకు ఈ దుర్భరమైన కర్మఫలానుభవాలెందుకు?

సమాధానం: ఇక్కడే మనం పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోవటంలో తప్పటడుగు వేసేది. కర్మఫలమనేది తిరిగే చక్రం లాంటిది. దానిని తిప్పే శక్తి ఖర్చు అయ్యేంత వరకూ అది తిరుగుతూ ఉండవలసిందే. కర్మ-ఫలములు అనేవి గొలుసుగా ముడిపడినవి. వేటగాడు బాణాన్ని ఒకసారి సంధించిన తరువాత, తన గురి లక్ష్యాన్ని తప్పిందని తెలిసినా దానిని ఉపసంహరించలేనట్లు, పూర్వజన్మలలో చేసుకున్న కర్మలు, అనగా ప్రారబ్ధ కర్మల యొక్క ఫలాలను అనుభవించి తీరాల్సిందే. వాటిని ఉపసంహరించలేము.

మరి పరమాత్మ ఎలా సహాయం చేస్తాడు? భక్తునికి ఈ ప్రారబ్ధ కర్మల ఫలానుభవాలను తట్టుకునే ఓర్పును, చిరునవ్వుతో అనుభవించగలిగే సంకల్పాన్ని బలపరుస్తాడు. పూర్తిగా ప్రారబ్ధ కర్మల పాలిట వదిలి వేయకుండా, తన అనుగ్రహమనే రక్షణ కవచంతో భక్తుని కప్పుతాడు. భీకరమైన వృష్టిలో, శీతలంలో మనం మన గృహంలో వెచ్చని వస్త్రాలలో రక్షణగా ఉన్నట్లు మనం పరమాత్మ అనుగ్రహంతో ఈ బాధలను సంతోషంగా ఓర్చుకుంటూ ఆ సాగరాన్ని దాటతాము. భగవద్భక్తి యొక్క మహత్తు ఇది.

ప్రశ్న: నేను "మహారాజును" అనుకుంటే మహారాజును కాను, అలాగే "అహం బ్రహ్మాస్మి" అనుకుంటే పరబ్రహ్మమును కాను కదా?

నేను మహారాజును అని అనుకోవటంతో పాటు ఆ మహారాజత్వానికి నిన్ను నువ్వు సిద్ధం చేసుకోవాలి. ఎందరినో కూడగట్టాలి, ఆయుధాలను, శక్తియుక్తులను చేపట్టాలి, ఎన్నో విద్యలు నేర్వాలి, పోరాడాలి, విజయం పొందాలి, కోటానుకోట్ల ప్రజల గౌరవం పొందాలి. అలాగే, అహం బ్రహ్మాసి అని భావించటానికి మనసును శుద్ధి చేసుకోవాలి, దానికి నిన్ను నువ్వు సిద్ధం చేసుకోవాలి. వివేక వైరాగ్య, షడ్ సంపదలు, ముముక్షత్వమనే నాలుగు ప్రాతిపదికలను పొందాలి, సనాతన వాఙ్మయాన్ని శ్రవణం, మననం చేయాలి, నిరంతర కఠోర ధ్యానం చేయాలి. అప్పుడే ఆత్మసాక్షాత్కారానికి అర్హుడవై బ్రహ్మానుభూతిని పొందగలవు.

నేను చక్కెర చక్కెర చక్కెర అనుకుంటే చక్కెర లభించదు, అలాతే, రామ రామ రామ అనుకుంటే రాముడు లభించడు కదా?

చక్కెర కావాలంటే దానికి సరిపడ డబ్బు సంపాదించాలి, కొట్టుకు వెళ్లాలి, కొనుక్కోవాలి. అలాగే, రాముని దర్శించాలంటే, కామ క్రోధాది అరిషడ్వర్గాలను కోల్పోవాలి, పరిపూర్ణమైన శరణాగతితో, సద్భావముతో, తదేక భక్తితో రాముని స్మరించాలి, అప్పుడు తప్పక రాముడు గోచరిస్తాడు. కానీ, చక్కెర నీ దేహానికి బయట ఉన్న వస్తువు. రాముడు నీలోనే ఉన్నాడు, కాబట్టి నీ హృదయాన్ని సంపూర్ణంగా సమర్పిస్తే రాముడు తప్పక లభిస్తాడు.

ప్రశ్న: స్వామీ! భారతదేశంలో ఉన్న సాంప్రదాయం గురువును ఆరాధించటం. అది ఎంతవరకూ సబబు? అది బానిసత్వం కాదా?

సమాధానం: నీకు సహాయం చేసిన వ్యక్తికి నీవు ఏదో ఒక విధంగా కృతజ్ఞత కనబరుస్తావు కదా? ప్రాపంచిక విషయాలలో సహాయం చేసిన వాని పట్ల కనబరచిన కృతజ్ఞత మన జీవిత పరమావధి అయిన పరమాత్మను కనుగొనే మార్గాన్ని నీకు అందించే గురువు పట్ల ఎందుకు చూపకూడదు? గురువు నీకు కొత్త జీవితాన్ని, శాశ్వతానందాన్ని, పరమ జ్ఞానాన్ని అందించే వాడు. ఆయనకు కృతజ్ఞత చూపించటమే గురువును ఆరాధించటంలో పరమార్థం. భారతీయ సాంప్రదాయంలో ఆరాధన అంటే ఉత్కృష్టమైన కృతజ్ఞతా భావం. నీకు సాయం చేసిన వానికి ఏదైనా సమర్పించుకుని కృతజ్ఞత తెలిపినట్లు నీకు అత్యంత విలువైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందజేసిన గురువుకు నిన్ను నీవు సమర్పించుకోవటమనేదే సముచితమైన కృతజ్ఞత.

ఇది బానిసత్వం ముమ్మాటికీ కాదు. నిజమైన సద్గురువు ఎన్నటికీ బానిసత్వం కోరుకోడు. ముమ్మాటికీ శిష్యుని ఆత్మకు స్వేచ్ఛనే కోరుకుంటాడు. గురువుకు శిష్యుని పట్ల అత్యున్నతమైన ప్రేమ వాత్సల్యాలు ఉంటాయి. శిష్యుని హృదయాన్ని గెలుచుకుని ఆ హృదయంలో ఎప్పటికీ నిలిచి ఉంటాడు గురువు. ఆ విధంగా రెండు వేర్వేరు దేహాలైనా వారు ఏకమైన వారు. 

ప్రశ్న: నేను బ్రహ్మసాక్షాత్కారం పొందిన ఒక గురువు కోసం తీవ్రంగా వెదుకుతున్నాను. అటువంటి గురువు జాడలు తెలుపగలరా? మీరు బ్రహ్మ సాక్షాత్కారం పొందారా?

సమాధానం:ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించే ఎందరికో వచ్చే చాలా సామాన్యమైన ప్రశ్నలివి. సరే, నేను ఫలానా గురువు బ్రహ్మజ్ఞానం పొందినవాడు అని చెప్పానే అనుకో. దానిని నీవు ఎలా నిరూపించగలవు? అతని వలన నీవు ఎంత ప్రయోజనం పొందగలవు?

బ్రహ్మజ్ఞానం పొందిన గురువులు అరుదేమీ కాదు. అజ్ఞానంలో కొట్టుమిట్టాడే మానవులు వారిని అంత త్వరగా గుర్తించలేరు. శుద్ధ అంతఃకరణం వంటి అనేక సుగుణాలు కలిగిన వారు అటువంటి జ్ఞానులను గుర్తించగలరు, వారి ద్వారా ప్రయోజనం కూడా పొందగలరు. బ్రహ్మజ్ఞానులైన గురువులు కోసం ఆ మూల ఈ మూల పరుగెత్తి వెదుకనవసరం లేదు. స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మే నీతో ఉన్నా, నీవు ఆయనను గ్రహించేందుకు అర్హుడవైతే తప్ప ఆయన నీకు ఏమీ చేయడు. ఈ విషయం గ్రహించి, నిష్కామ కర్మయోగ సాధనతో నిన్ను నీవు శుద్ధి చేసుకో. దాన గుణము కలిగి, ఏకాగ్రతతో బ్రహ్మచర్యము, జపము, ధ్యానము ద్వారా ఇంద్రియ నిగ్రహాన్ని పొందు. సద్గురువు అనుగ్రహం అదే కలుగుతుంది.

ఒక గురువును పరీక్షించటం చాలా కష్టం. నీ మేధస్సును దానిపై వినియోగించకు. విశ్వాసము కలిగి ఉండు. నిజమైన సాధకుడు ఇటువంటి ప్రశ్నలకు, సంశయాలకు దూరంగా ఉంటాడు. నా మాటలు నమ్మితే నువ్వు అద్భుతమైన ప్రయోజనాలు పొందగలవు.

దేవ దేవం భజే దివ్య ప్రభావం - సద్గురువులు తాళ్లపాక అన్నమాచార్యులు

దేవ దేవం భజే దివ్య ప్రభావం
రావణాసుర వైరి రణ పుంగవం రామం

రాజ వర శేఖరం రవి కుల సుధాకరం
ఆజానుబాహుం నీలాభ్ర కాయం
రాజారి కోదండ రాజ దీక్షా గురుం
రాజీవ లోచనం రామచంద్రం

పంకజాసన వినుత పరమ నారాయణం
శంకరార్జిత జనక చాప దళనం
లంకా విశోషణం లాలిత విభీషణం
వేంకటేశం సాధు విబుధ వినుతం

దేవదేవుడు, దివ్యమైన మహిమలు కలవాడు, రావణాసురుని శత్రువు, యుద్ధములో శ్రేష్ఠుడు అయిన రాముని భజింపుము. రాజాధిరాజు, సూర్యవంశానికి చంద్రునివంటి వాడు, ఆజానుబాహువు, నీలమేఘ శరీరుడు, క్షత్రియుల శత్రువైన పరశురాముని కోదండమును ధర్హించిన ఘనుడు, కలువలవంటి కన్నులు కలవాడు అయిన రామచంద్రుని భజింపుము. బ్రహ్మచే నుతించినబడిన శ్రీహరి, జనకుని వద్ద ఉన్న శివుని విల్లును ఎక్కుపెట్టి విరిచిన వాడు, లంకను జయించినవాడు, విభీషణుని అనుగ్రహించిన వాడు, సాధువులు, జ్ఞానులచే నుతించబడిన వేంకటేశ్వరుని భజింపుము.

హిందోళ రాగంలో ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు పాడగా వినండి.

పితృపక్షాలు

రౌరవే అపుణ్య నిలయే పద్మార్బుద నివాసినాం
అర్థీనాం ఉదకం దత్తం అక్షయ్యం ఉపతిష్ఠతు

నరకంలో అపుణ్యలోకాలలో పద్మార్బుదములో నివసించే, ఈ నీటి బిందువులను అర్థిస్తూ ఉన్న ఆత్మలకు ఉదకాన్ని సమర్పిస్తున్నాను. అవి అక్షయమగుగాక, వారు శాంతులగుదురు గాక.

ఒక్క శ్రాద్ధం రోజే కాకుండా ప్రతి నిత్యమూ పితృదేవతలను తలచుకోవలసిన విధి మానవునిది. పై మంత్రం అందుకే నిత్యం భోజనానంతరం నీటిని విడిచే విధిలో చెప్పబడింది. ఇవి పితృదేవతల ద్వారా మన పెద్దలకు చేరాలన్నది సారం.

మహాలయ పక్షాలు - మానవాళి అభివృద్ధికి, వంశాభివృద్ధికి, సృష్టి క్రమంలో సహజ పరిణామంగా వచ్చే మరణ బాధ నుండి ఆత్మలకు విముక్తి కలిగి ఉన్నతస్థానం లభించటానికి ఈ పక్షంలో చేసే కర్మలు ఎంతో తోడ్పడతాయి. కర్మ ఫలాలను బట్టి, వాటిని అనుభవించేందుకు అనువైనా పరిస్థితులు దొరికేంత వరకు ఆత్మలు పునర్జన్మ పొందవు. కర్మఫలాలు మంచివైతే ఉన్నత స్థానం, లేకపోతే నీచస్థానంలో వేర్వేరు జీవరాశులుగా జన్మనెత్తుతుంది ఆత్మ. అది మనిషి మరణించిన ఏడాదికి కావచ్చు, ఎన్నో ఏళ్లకు కావచ్చు, దశాబ్దాలకు కావచ్చు. సంవత్సరీకముల వరకు ఉన్న ఏడాది ప్రస్థానం ముగిసిన పిమ్మట ఆ ఆత్మ తిరిగి దేహాన్ని వెంటనే ధరించ గలిగినా, శ్రాద్ధ కర్మ, తర్పణాలు, పిండ ప్రదానాలు ఆ ఆత్మోద్ధరణకు తోడ్పడతాయి. దానిని వెసులుబాటు చేసే వారు పితృ దేవతలు. ఇది పూర్తిగా శాస్త్రీయమైనది.

సృష్టి క్రమంలోని జనన మరణాలనే చక్రంలో చిక్కుకున్న ప్రతి ఆత్మకూ ఉన్నతిని కలిగించేవి మనం సముపార్జించుకున్న పుణ్యఫాములతో పాటు, ఆ ఆత్మలను పితృదేవతలు ఏ విధంగా నడిపిస్తారు అన్నది కూడా. కాబట్టి పితృదేవతలు ఆత్మోద్ధరణకు గేట్‌కీపర్లు. మరి వారు సంతుష్టులైతే కదా ఆత్మోద్ధరణ జరిగేది. ఉద్ధరించబడని ఆత్మ అనేక అసంతులనలకు గురవుతూ ఉంటుంది. కొన్ని మార్లు ప్రేతరూపంలో, ఇతర రూపాలలో సంచరిస్తుంది. అన్నిటికీ కర్మఫలాలే ముఖ్య ప్రాతిపదిక. ఆ ఆత్మకు ఎక్కడో ఒక చోట ఊతం అందాలి కదా? అది మనకు నిర్దేశించబడిన అనేక విధి విధానాల ద్వారా జరుగుతుంది. ఒకటి పైన చెప్పబడిన భోజనకాల ఉదకదానం. అలాగే, నిత్యానుష్ఠానంలో మరెన్నో. వీటిలో మరొక ముఖ్యమైనది మహాలయ పక్షం.

ఈ మహాలయ పక్షంలో పితృదేవతలని సంతృప్తి పరచటానికి అత్యంత అనువైన కాలం. సృష్టిలో ఉత్తరాయణ దక్షిణాయనాలకు వాటి వాటి ప్రాధాన్యతలున్నాయి. దక్షిణాయన కాలంలో సృష్టిక్రమాన్ని సూచించే వర్షఋతువు ముగిసే సమయంలో, అనగా పొలాలు దున్నబడి, తొలకరి వానలు కురిసి, గింజలు నాటబడి, మరల వానల వలన అవి మొలిచి మనకు ఆహారం అందించటానికి పంటలు వేగంగా పెరుగుతాయి. ఈ సమయంలో వచ్చే ఋతువు మార్పునకు కూడా సంకేతం మహాలయపక్షం. వర్షములు ఆగే సమయం, శరదృతువు ఆగమనమునకు ముందు రెండు వారాలు ఈ పక్షం. మానవుని శరీరానికి సంబంధించి చైత్ర మాసం మొదలయ్యే సమయం, అలాగే ఆశ్వయుజం మొదలయ్యే సమయం మధ్య ఉన్న ఆరునెలల సమయమనేది కాలగమనంలో ఓ పెద్ద మైలు రాయి. అలాగే సృష్టిక్రమంలో కూడా మైలురాయి. అందుకే ఈ శరదృతువు ఆరంభానికి మునుపు వచ్చే పక్షాన్ని ఆత్మగమనాన్ని నిర్దేశించే పితృదేవతలకు సంబంధించినదిగా శాస్త్రం నిర్ణయించింది.

మరి ఈ సమయంలో ఏం చేయాలి?

సృష్టి క్రమాన్ని గౌరవిస్తూ, జనన మరణ చక్రంలో చిక్కుకుని క్లేశాల బారిన పడుతున్న ఆత్మలను ఉద్ధరించేందుకు దేహధారణ చేసి ఆ అత్మలతో ముడిపడి ఉన్న మనం మనవంతు ప్రయత్నం చేయాలి. ఇక్కడ అత్యంత ముఖ్యమైన అంశం - జననమనేది కర్మఫలాలను బట్టి అన్నది. అనగా ఒకేరకమైన కర్మఫలాలను అనుభవించవలసిన ఆత్మలు ఒకే రకమైన పరిస్థితులలో దేహాన్ని ధరిస్తాయి. అనగా ఒక కుటుంబంలో, ఒక వంశంలో, ఒక సామాజిక పరిస్థితులలో. అందుకే మనవాళ్లు భార్య బిడ్డలు, మనతో ఉండే పశువులు ఋణానికి రూపాలు అంటారు -

ఋణానుబంధ రూపేణ పశు పత్నీ సుతాలయా రుణక్షయే క్షయయంతి తత్ర పరివేదనా

పశువులు, భార్య, పిల్లలు, ఇల్లు అన్నవి పూర్వజన్మ ఋణములకు రూపములు. ఈ రుణములు తీర్చుకున్న తరువాత ఆత్మకున్న క్లేశములు నశిస్తాయి.

వీటన్నిటినీ పరిశీలించే శ్రాద్ధ కర్మ, పితృపక్షాలు, తర్పణాలు, పిండప్రదానాలు, దానాలు నిర్వచించబడ్డాయి. ఆత్మోద్ధరణకు ఆ దేహానుబంధమైన వారందరూ ఋణాలను తీర్చుకుని, ఆ ఆత్మలను ఉద్ధరించే పితృదేవతలకు కృతజ్ఞత తెలుపుతూ ప్రాణశక్తికి సంకేతమైన అన్న, ఉదక, తిలములను వినియోగించి ఈ మహత్కార్యానికి తోడ్పడతాం.

సారాంశం: మరణానంతరం కర్మఫలాల ద్వారా బాధలు పడుతూ మరు జన్మ కోసం వేచి ఉన్న, జన్మ పొందిన ఆత్మల ఉద్ధరణకు పితృదేవతలను ప్రీతి పరచి వారి ద్వారా సృష్టి క్రమంలో ఓ ముందడుగు పడేందుకు మనవంతు ప్రయత్నం పితృకార్యాలు. దానికి అత్యంత అనువైన సమయం కాలగమనంలో అతి ముఖ్యమైన మైలురాయైన పితృపక్షం. కావలసింది నమ్మకం, శ్రద్ధ, కృతజ్ఞత. పూర్వీకులు లేనిదే మనం లేము, మన జన్మకు కారణమైన వారి ఆత్మలను ఉద్ధరించేందుకు మనవంతు ప్రయత్నం చేయటం మన ధర్మం.

అక్షయ్యముపతిష్ఠతు!

13, సెప్టెంబర్ 2020, ఆదివారం

సుగుణములే చెప్పుకొంటి - త్యాగరాజస్వామి కృతి

సుగుణములే చెప్పుకొంటి సుందర రఘురామా!

వగలెరుంగలేక ఇటు వత్తువనుచు దురాశచే

స్నానాది సుకర్మంబులు దానాధ్యయనంబులెరుగ
శ్రీనాయక క్షమియించుము శ్రీత్యాగరాజవినుత

సుందర స్వరూపుడవైన ఓ రఘురామా! నీవు నాపై కరుణించి దర్శనమిచ్చెదవను ఆశతో నీ మాయలను తెలుసుకోలేక నీ సుగుణములనే చెప్పుకొనుచున్నాను. పుణ్యతీర్థములలో స్నానములు మొదలైన మంచి కర్మలు, దానములు, వేదాధ్యయనములను నేను ఎరుగను. సీతాదేవికి నాయకుడవు, పరమశివునిచే నుతించబడిన శ్రీరామా! నీవే నన్ను క్షమించి దర్శనమిచ్చి కాపాడుము. 

చక్రవాకం రాగంలో కూర్చబడిన ఈ కృతిని బాలమురళీకృష్ణ గారు ఆలపించారు


11, సెప్టెంబర్ 2020, శుక్రవారం

ఏమయ్య రామ - -భద్రాచల రామదాసు కృతి

ఏమయ్య రామ బ్రహ్మేంద్రాదులకునైన నీ మాయ తెలియ వశమా

కామారి వినుత గుణ ధామ కువలయదళ శ్యామ నను గన్న తండ్రీ! శ్రీరామా!

సుతుడనుచు దశరథుడు హితుడనుచు సుగ్రీవుడు అతిబలుడనుచు కపులు 
క్షితినాథుడనుచు భూపతులు కొలిచిరి గాని పతితపావనుడనుచు మతి తెలియలేరైరి

నరుడనుచు నరులు తమ దొర వనుచు యాదవులు వరుడనుచు గోప సతులు 
కరి వరద భద్రాద్రి పుర నిలయ రామ దాస పరమాత్ముడని నిన్ను భావింపలేరైరి

ఓ రామ్మా! నీ మాయ బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలకైన తెలియ వశము కాదు. శ్రీరామా! మన్మథుని శత్రువైన పరమశివునిచే నుతించబడినవాడవు, సకల గుణములకు నిలయమైన వాడవు, కలువరేకుల వంటి కన్నులు కలిగిన నీలమేఘ శరీరుడవు, నీవే కదా నా కన్న తండ్రివి! నీవు తన కుమారుడవని దశరథుడు, శ్రేయోభిలాషివని సుగ్రీవుడు, మహావీరుడవని వానరులు, చక్రవర్తివని రాజులు కొలిచారు, కానీ, నీవు పాపాత్ములను పావనము చేసే వాడవని గ్రహించలేకపోయారు. మానవులు నీవు వారితోటి మానవుడవని, యాదవులు తమ దొరవని, గోపస్త్రీలు తమ వరుడవని భావించారు. గజేంద్రుని రక్షించి భద్రాద్రి యందు వెలసిన రామా! నీవు దాసుల పాలిట పరమాత్ముడవని వారు భావించలేకపోయారు. 

కాంభోజి రాగంలో కూర్చబడిన ఈ కృతిని నేదునూరి కృష్ణమూర్తి గారు ఆలపించారు

ఏ తావునరా నిలకడ నీకు - త్యాగరాజస్వామి కృతి

ఏ తావునరా నిలకడ నీకు? ఎంచి చూడనగపడవు

సీతా గౌరి వాగీశ్వరియను స్త్రీ రూపములందా గోవిందా

భూకమలార్కానిలనభమందా లోకకోటులందా
శ్రీకరుడగు త్యాగరాజ కరార్చిత శివ మాధవ బ్రహ్మాదులయందా

శ్రీరామా! నీవు ఎక్కడ నిలకడగా ఉండెదవు? ఎంత తరచి చూచినా కనబడనివాడవు. సీత, పార్వతి, సరస్వతి అనే స్త్రీ రూపములలోనా? శ్రీకృష్ణుని రూపములోనా? భూమి, నీరు, సూర్యుడు, వాయువు, ఆకాశములయందా? కోట్లాది లోకములయందా? త్యాగరాజు అర్చించిన శుభములను కలిగించే బ్రహ్మ విష్ణు శివులయందా? నీవు ఎక్కడ నిలకడగా ఉండెదవు? 

కల్యాణి రాగంలో కూర్చబడిన ఈ కృతిని రంజని గాయత్రి సోదరీమణులు ఆలపించారు

6, సెప్టెంబర్ 2020, ఆదివారం

దుర్గా పఞ్చరత్నమ్ - కంచి పరమాచార్యుల వారు

కామాక్షీ పరదేవత స్వరూపమైన కంచి పరమాచార్యుల వారు గురు ఆరాధన రోజున ముల్లైవాసల్ కృష్ణమూర్తిశాస్త్రి గారికి ఆశువుగా చెప్పినవి దుర్గాపంచరత్న శ్లోకాలు. అమ్మవారు గీత ఎలా ఉపదేశించింది అన్న మీమాంసలో ఉన్న ఆ శిష్యునికి వెంటనే గీతాభాస్యం పుస్తకాలు తెప్పించి, భగవద్గీత 14వ అధ్యాయం 27వ శ్లోకం వినిపించి అర్థం చెప్పి పరబ్రహ్మ తత్త్వానికి మాయా స్వరూపిణి ప్రతిష్ఠ - అనగా అనేకానేక లోకములుగా వ్యాపించేది, అనగా కామాక్షీ పరదేవత పరబ్రహ్మశక్తి అన్న సత్యాన్ని పలికి ఆ శిష్యుని సందేహ నివృత్తి చేశారు. ఆ తరువాత శిష్యుని చేత ఛందోబద్ధంగా ఐదు శ్లోకాలను పూర్తి చేయించి దానిని దుర్గాపంచరత్నం అని మనకు అందించారు. ఈ పంచరత్నం స్వామి వారి ఆధ్యాత్మిక శక్తిని, జ్ఞానాన్ని, ఔన్నత్యాన్ని మనకు పరిపూర్ణంగా ఆవిష్కరిస్తుంది. దీనిని అత్యంత మహిమాన్వితమైన స్తోత్రంగా నిరంతరం పఠించిన శిష్యకోటి చెప్పుకుంటారు. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు దీనిని రాగయుక్తంగా గానం చేశారు.

తే ధ్యానయోగానుగతా అపశ్యన్
త్వామేవ దేవీం స్వగుణైర్నిగూఢామ్
త్వమేవ శక్తిః పరమేశ్వరస్య
మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి

దేవాత్మశక్తిః శ్రుతివాక్యగీతా
మహర్షిలోకస్య పురః ప్రసన్నా
గుహాపరం వ్యోమ సతః ప్రతిష్ఠా
మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి

పరాస్య శక్తిః వివిధైవ శ్రూయసే
శ్వేతాశ్వవాక్యోదితదేవి దుర్గే
స్వాభావికీ జ్ఞానబలక్రియా తే
మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి

దేవాత్మశబ్దేన శివాత్మభూతా
యత్కూర్మవాయవ్యవచోవివృత్యా
త్వం పాశవిచ్ఛేదకరీ ప్రసిద్ధా
మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి

త్వం బ్రహ్మపుచ్ఛా వివిధా మయూరీ
బ్రహ్మప్రతిష్ఠాస్యుపదిష్టగీతా
జ్ఞానస్వరూపాత్మతయాఖిలానాం
మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి

మోక్ష ప్రదాత్రివైన సర్వేశ్వరీ! త్రిగుణాతీతమైన స్వగుణములో నిగూఢమైన నీ రూపమును యోగులు ధ్యానములో దర్శించుచున్నారు. పరమేశ్వరుని యొక్క శక్తివి నీవే. నన్ను కాపాడుము.

మోక్ష ప్రదాత్రివైన సర్వేశ్వరీ! నీవు దివ్యమైన ఆత్మశక్తివి, వేదవాక్యములలో నుతించబడినావు. ఋషిలోకమును అనుగ్రహించినావు. అత్యంత రహస్యమైన సంచారము నీది. సత్ అనే పదార్థములో నీవు ప్రతిష్ఠమై ఉన్నావు. నన్ను కాపాడుము.

మోక్ష ప్రదాత్రివైన సర్వేశ్వరీ! శ్వేతాశ్వతరోపనిషత్తులో చెప్పబడిన పరాశక్తివి నీవు, అనేకులచే అనేక విధములుగా చెప్పబడి అనేక రూపములలో దర్శించబడుతున్నావు. జ్ఞాన బల సంబంధమగు క్రియారూపములోని శక్తి నీకు స్వాభావికమైనది. నన్ను కాపాడుము.

దేవాత్మ శబ్దముచే చెప్పబడిన నీవు కూర్మ వాయు పురాణముల వాక్య వివరణములతో శివాత్మవైనావు. ఈ భవపాశ బంధములను నాశనము చేసే శక్తిగా ప్రసిద్ధి పొందినావు. నన్ను కాపాడుము.

మోక్ష ప్రదాత్రివైన సర్వేశ్వరీ! నీవు బ్రహ్మమే పుచ్ఛముగా వివిధ రూపములలో నుండు మయూరానివి. అనేక గీతలనుపదేశించుచు బ్రహ్మమునందు ప్రతిష్ఠమై యున్నావు. అందరిలోని జ్ఞానస్వరూపానివి, దయాస్వరూపానివి నీవే. నన్ను కాపాడుము.

- కాంచి పరమాచార్యులు శ్రీశ్రీశ్రీ చన్ద్రశేఖరేన్ద్ర సరస్వతీస్వామి వారు

గురువర దీజో చరణ తుమ్హారే - కంచి పరమాచార్యుల వారిపై గీతం

గురువర దీజో చరణ తుమ్హారే! సద్గురు దీజో చరణ తుమ్హారే!
కాంచీ నగరీ కామ పీఠ వాసీ! తుమ్ హీ హమారే సబ్ కుఛ్ స్వామీ!
మన్ మందిర్ మే బసో హమారే! బందీ బనే హమ్ సబ్ తుమ్హారే!
దూర్ కరో తుమ్ మన్శా మన్ సే! పార్ కరో ఇస్ భవ సాగర్ సే!

ఓ సద్గురు దేవా! మాకు నీ చరణముల వద్ద ఆశ్రయాన్ని ప్రసాదించు. కాంచీ నగరంలోని కామకోటి పీఠవాసివైన స్వామీ! మా సర్వస్వం నీవే! మా మనసులనే మందిరములలో నీవు నివసించుము, మేము నీకు బద్ధులమై ఉంటాము. మా మనసుల నుండి కోరికలను తొలగించుము, ఈ సంసార సాగరాన్ని దాటించుము.

- కే వేంకట్రామన్ గారు

5, సెప్టెంబర్ 2020, శనివారం

ఆరుపడై వీడు - ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలు

శ్రీగాంగేయం వహ్నిగర్భం శరవణజనితం జ్ఞానశక్తిం కుమారం
బ్రహ్మణ్యం స్కందదేవం గుహమమలగుణం రుద్రతేజస్వరూపం
సేనాన్యం తారకఘ్నం గురుమచలమతిం కార్తికేయం షడాస్యం
సుబ్రహ్మణ్యం మయూరధ్వజ రథసహితం దేవదేవం నమామి

గంగాపుత్రుడు, అగ్నిగర్భుడు,రెల్లుగడ్డిపై జన్మించిన వాడు, జ్ఞానశక్తి కలిగిన కుమారుడు, పరబ్రహ్మ స్వరూపుడు, స్కందుడు, గుహ్యమైన తత్త్వముతో నిర్మలమైన గుణములు కలవాడు, రుద్రతేజస్వరూపుడు, సేనాపతి, తారకాసురుని సంహరించినవాడు, గురువు, అచంచలమైన బుద్ధి కలవాడు, కార్తికేయుడు, షణ్ముఖుడు, సుబ్రహ్మణ్యుడూ, మయూరవాహనుడు, రథసహితుడైన దేవదేవునికి నమస్కారములు.

గత వారంలో సుబ్రహ్మణ్య తత్త్వం గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు స్వామి ముఖ్యమైన క్షేత్రాల వివరాలు. సుబ్రహ్మణ్యుడు ఆరుముఖములతో, పన్నెండు చేతులతో కొలువబడుతున్నాడు. ఆరుపడైవీడు అని పేరొందిన ఆరు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. ఇవి తిరుప్పరన్‌కుండ్రం, తిరుచెండూరు, పళని, స్వామిమలై, తిరుత్తణి, పళముదిర్చోళై.

1. తిరుప్పరన్‌కుండ్రం

ఇది మదురైకి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపై ఉంది. శూరపద్ముడు హతుడైన తరువాత స్కందుడు దేవతాసమూహంతో కలిసి తిరుచెండూరునుండి తిరుప్పరన్‌కుండ్రం వెళ్లాడు. ఇక్కడ ఇంద్రుని కోరికపై దేవసేనను వివాహమాడాడు. ఈ ప్రదేశంలోని పరాశరుని కుమారులు స్కందుని అనుగ్రహంతో విముక్తి పొందారు. పాండ్యరాజులు ఈ దేవాలయాన్ని 6వ శతాబ్దంలో కట్టించారు. ఈ దేవాలయంలో సుబ్రహ్మణ్యునితో పాటు శివుడు, విష్ణువు, దుర్గ, గణపతి ప్రధాన దేవతలు.

2. తిరుచెండూరు

తిరునెల్వేలికి 50 కిలోమీటర్ల దూరంలో తమిళనాడు తూరుపు తీరాన ఉంది తిరుచెండూరు. స్కాందపురాణం ప్రకారం స్కందుడు, దేవతా సేనలతో ఈ ప్రదేశాన్ని తన స్థావరంగా చేసుకున్నాడు. ఇక్కడినుండే వీరభద్రుని తన దూతగా శూరపద్ముని వద్దకు పంపాడు. శూరపద్ముని సంహరించిన తరువాత ఇక్కడే నివసించాడు. స్కందషష్టి ఇక్కడి ప్రధాన ఉత్సవం. ఆ ఆరురోజుల సమయంలో భక్తులు ఇక్కడే ఉండి స్వామిని కొలుస్తారు. శూరపద్ముని సంహరించిన తరువాత స్కందుడు తన తండ్రిని కొలువాలని అభిలషించగా మయుడు ఇక్కడి దేవాలయం కట్టించాడని పురాణం చెబుతోంది. ఈ క్షేత్రానికి ఓ ప్రత్యేకత కూడా ఉంది డచ్ దొంగలు 17వ శతాబ్దంలో ఇక్కడి సుబ్రహ్మణ్యుని, నటరాజుని విగ్రహాలు బంగారంతో చేయబడినవని తలచి వాటిని దొంగిలించి కరిగించ ప్రయత్నం చేయగా అవి కరుగలేదు. వారు ఆ విగ్రహాలను సముద్రంలో తీసుకు వెళుతుండగా సముద్రం అల్లకల్లోలమవుతుంది. అప్పుడు ఆ నావికులు ఆ విగ్రహాలను సముద్రంలో పడవేస్తారు. విగ్రహాలు అపహరించబడ్డాయని అక్కడి ప్రాంతీయ పాలనాధికారి వడమలయప్ప పిళ్లయన్ తిరిగి కొత్తగా పంచలోహ విగ్రహాలు సిద్ధం చేయిస్తాడు. ఒకరోజు రాత్రి ఆయనకు కలలో స్వామి కనిపించి సముద్రంలో ఎక్కడైతే నిమ్మకాయ తేలుతూ కనబడుతుందో, గరుడుని ధ్వజము ఎగురుతూ ఉంటుందో అక్కడ వెదకమని చెబుతాడు. పిళ్లయన్ అక్కడ వెద్కించగా విగ్రహాలు దొరుకుతాయి. ఆనందంతో అతడు విగ్రహాలను పునః ప్రతిష్ఠ చేయిస్తాడు. తిర్చెండూరు అత్యంత మహిమాన్విత క్షేత్రంగా భాసిల్లుతోంది.

3. పళని

దిండిగల్ నుండి 30 కిలోమీటర్ల దూరంలో కొండపై వెలసిన సుబ్రహ్మణ్య క్షేత్రం పళని. దండాయుధపాణిగా ఇక్కడ స్వామి కొలువబడుతున్నాడు. నవపాషాణాములచే ప్రత్యేకముగా చేయించబడిన విగ్రహం స్వామిది. ఒకసారి నారదుడు కైలాస పర్వతముపై ఉన్న పరమశివుని వద్దకు జ్ఞానఫలాన్ని తీసుకు వెళతాడు. పరమశివుడు తన కుమారులతో మూడు మార్లు ఎవరు ముందర ముల్లోకాలను చుట్టి వస్తారో వారికి ఆ ఫలాన్ని ఇస్తానని చెబుతాడు. వాయువేగంతో సుబ్రహ్మణ్యుడు తన నెమలి వాహనంపై మూడు సార్లు లోకాలను చుట్టి వస్తాడు. అప్పటికే గణపతి ఆ కార్యం పూర్తిచేశాడని తండ్రి చెప్పగా స్థూలకాయుడైన గణపతి అది ఎలా సాధ్యమైందని అని సుబ్రహ్మణ్యుడు ప్రశ్నిస్తాడు. తల్లిదండ్రుల ప్రదక్షిణ ద్వారా గణపతి దానిని సాధించాడు అని చెప్పి శివుడు ఆ ఫలాన్ని గణపతికి ఇస్తాడు. దీనితో సుబ్రహ్మణ్యుడు తన అహంకారానికి చింతించి తన వేషభూషలు వదిలి కౌపీనము, కర్రతో పళని కొండపై కఠోరమైన తపస్సు చేస్తాడు. గౌరీశంకరులు అతని తప్పసుకు మెచ్చి పళని ఓ భవ్యమైన క్షేత్రంగా అభివృద్ధి చెందుతుందని సుబ్రహ్మణ్యుని అనుగ్రహిస్తారు. అప్పుడు సుబ్రహ్మణ్యుడు కైలాసానికి తిరిగి వస్తాడు.

4. స్వామిమలై

కుంబకోణం సమీపంలో ఉన్న కొండ పేరు స్వామిమలై. భృగు మహర్షి శాపాన పరమశివుడు తన జ్ఞానశక్తిని కోల్పోగా సుబ్రహ్మణ్యుడు తండ్రికి గురువై శివగురునాథునిగా పేరొంది ప్రణవ మంత్రార్థాన్ని ఉపదేశించాడని, దానికి ప్రతీకగా చోళ రాజులు ఈ దేవాలయాన్ని 2వ శతాబ్దంలో నిర్మించాడు. 18వ శతాబ్దంలో ఆంగ్లో-ఫ్రెంచ్ యుద్ధంలో ఈ దేవాలయం హైదర్ ఆలీ చేత పూర్తిగా ధ్వంసం కాగా తరువాత దానిని పునర్నిర్మించారు. ఇక్కడ సుబ్రహ్మణ్యుడు స్వామినాథునిగా కొలువబడుతున్నాడు.

5. తిరుత్తణి

వల్లీదేవసేనా సమేత సుబ్రహ్మణ్యుడు చెన్నైకి 80 కిలోమీటర్ల దూరంలో తిరుత్తణి క్షేత్రం ఉంది. ఇంతకు ముందు వ్యాసంలో చెప్పబడిన వల్లీసుబ్రహ్మణ్యుల గాథ జరిగింది ఇక్కడి సమీపంలోని వల్లిమలై కొండపైనే. వల్లితో వివాహం తరువాత దేవసేనతో కలిసి స్వామి ఇక్కడ తణిగై కొండపై నివసించాడు. ఈ క్షేత్రం సనాతనమైనది. విజయనగర రాజులు ఈ దేవాలయాన్ని పోషించారు. కర్ణాటక సంగీతత్రయంలో ఒకరైన ముత్తుస్వామి దీక్షితుల వారికి సుబ్రహ్మణ్యుడు ఓ ముసలివాని రూపంలో వచ్చి ఇక్కడి క్షేత్ర ప్రసాదాని తింపించాడుట. ఆ జ్ఞానశక్తితోనే దీక్షితులవారు గురుగుహ అన్న పదాన్ని తన ముద్రగా చేసుకున్నారు. ఇక్కడి స్వామిపైనే "శ్రీనాథాది గురుగుహో జయతి జయతి అని కృతిని రచించారు. ఇక్కడి బంగారు గోపురం ఎంతో ప్రసిద్ధి.

6. పళముదిర్చోళై

మదురైకి 20కిలోమీటర్ల దూరంలో ఉన్న విష్ణు క్షేత్రం అళగర్ కోయిల్. అక్కడి సమీపంలో దట్టమైన అడవుల మధ్య కొండపై సుబ్రహ్మణ్యుడు వల్లీదేవసేనా సమేతుడై వెలసిన క్షేత్రం ఇది. వల్లీ దేవితో వివాహానికి పూర్వం జరిగిన గాథలో కొంతభాగం పళముదిర్చోళైలో కూడా జరిగింది. ఈ క్షేత్రానికి శోలమలై అని కూడా పేరు. ఇక్కడ స్వామిని కురింజి నిళక్కిళవన్ అంటారు. ఇక్కడే స్వామి ప్రఖ్యాత యోగి అవ్వయ్యార్‌కు జ్ఞానబోధ చేశాడు. ఈ కొండకు వృషభాద్రి అని పేరు. తొలుత ఇక్కడ ఉన్న స్వామిని అళగర్ కోయిల్‌లోనే అర్చించి తరువాత పళముదిర్‌చోళైలో ప్రతిష్ఠించారు.

మొత్తం ఆరు క్షేత్రాలు కూడా కొండలపై పచ్చని ప్రకృతి మధ్య నిర్మించబడినవే. జ్ఞానసముపార్జనకు ఇటువంటి భౌగోళిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయన్నది ఆరుపడై వీడు క్షేత్రాల దర్శనం ద్వారా భక్తులు పొందిన అనుభూతులు, అనుభవాలు చెబుతున్నాయి. సంతాన ప్రాప్తికై, జ్ఞానప్రాప్తికి, ఆటంకాలు తొలగటానికి ఈ క్షేత్రాలలోని స్వామి ప్రసిద్ధి.

ఓం శరవణభవ!!

రుక్మిణీ కల్యాణం చదివితే పెళ్లవుతుందా? తప్పక

రుక్మిణీ కల్యాణం చదివితే పెళ్లవుతుందా? ఈకాలంలో కూడానా? ఏం మాట్లాడుతున్నారండీ! ఇలాంటివి చేస్తే పెళ్ళిళ్లు అయితే ఇంకేముందండీ, అందరు కన్యలకు కృష్ణ పరమాత్మలాంటి భర్త లభించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సంసారాలు సాగిస్తారు కదా? నేటి ప్రపంచంలో ఇలాగ మన పురాణేతిహాసాలను అపహాస్యం చేయటం ఓ ఆనవాయితీ అయ్యింది. ఆ భాగవత గాథల మహత్తు నిజమే. ముమ్మాటికీ నిజమే. అదే భాగవతంలో ఉన్న గొప్పతనం. శ్రధాసక్తులతో, భక్తితో భాగవత గాథలను చదివితే ఈ అద్భుతాలు నిజమని నమ్మకం కలుగుతుంది. పోతన భాగవతం మామూలు కథల సంపుటి కాదు. పరమ భాగవతోత్తములవి. వారిలో రుక్మిణి కూడా ఒక ఉత్తమ భక్తురాలు. శ్రీమదాంధ్ర మహాభాగవతంలోని దశమ స్కంధములో ఈ రుక్మిణీ కల్యాణ గాథ మనోజ్ఞంగా వివరించబడింది.

యుక్త వయసులో ఉన్న స్త్రీకి భర్త గురించి దృఢమైన అభిప్రాయాలుంటాయి. అలానే, రుక్మిణికి కూడా. విదర్భదేశంలో కుండిన నగరానికి భీష్మకుడు ప్రభువు. అతను వీరుడు, గొప్ప రాజు. అతనికి ఐదుగురు కుమారులు - రుక్మి, రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మనేత్రులనే వారు. వీరి తరువాత ఒక కుమార్తె జన్మించింది. ఆమే రుక్మిణి. ఆ శ్రీకృష్ణుని కోసమే జన్మించింది.

యుక్త వయసులో ఆ స్వామిని వివాహమాడవలెనన్న కోరిక ఆమెలో ఎంత బలంగా ఉందంటే - "సన్నగా కొనసాగినట్లు ఆమె దేహము కూడా కోమలమైన తీగవలె వృద్ధి చెందింది. ఆ గోవింది హృదయ కమలము విప్పారేలా ఆమె ముఖపద్మము కాంతితో వికసించింది. ఆ శౌరి మనసు ఆమెపైనే ఉండే విధంగా ఆమె నడుము సన్నని ఆకృతిని పొందింది. ఆ గోవిందునిలో ప్రణయ భావనలు స్థిరమయ్యేలా ఆమె ఫాల భాగం విశాలమైంది. ఆ స్వామికై ఆమె యవ్వనము వికసించింది" - అని పోతన వర్ణించారు.

మరి ఆ రుక్మిణికి శ్రీకృష్ణుని గుణగణాలు ఎలా తెలిశాయి? తండ్రి యింటికి వచ్చే అతిథుల నోట ఆ స్వామి గొప్పతనం, సౌందర్యం, శౌర్యం విని ఆతడే నా ప్రభువు అని గట్టిగా నిర్ణయించుకుంది. అదే విధంగా శ్రీకృష్ణుడు కూడా బంధువులు, స్నేహితుల ద్వారా ఆమె శుభలక్షణాలు, సత్ప్రవర్తన, రూపము, వివేకము గురించి విని ఆమెనే వివాహము కోవాలని నిర్ణయించుకున్నాడు. వీరి మనోరథము తెలుసుకున్న బంధుజనం కూడా ఈ వివాహము జరగాలని ఆశించారు. కానీ మూఢుడైన రుక్మి మాత్రం తన చెల్లెలిని చేది రాజైన శిశుపాలునకిచ్చి వివాహం చేయాలని సంకల్పించాడు. ఈ విషయం తెలుసుకున్న రుక్మిణి బాధపడి అగ్నిద్యోతుడనే బ్రాహ్మణుని ద్వారా శ్రీకృష్ణునికి సందేశం పంపించింది. బ్రాహ్మణోత్తముడైన అగ్నిద్యోతుని ఎన్నుకోవటంలో రుక్మిణి మనోరథం, ఆమె వివేకము మనకు తేటతెల్లమవుతాయి. ఆ అగ్నిద్యోతుడు శ్రీకృష్ణుని వద్దకు వెళ్లి మనసారా "పెండ్లికొడుకువు కమ్మని" ఆశీర్వదిస్తాడు. మీరు సద్బ్రాహ్మణులు మీ వాక్యము సత్యమగును అని శ్రీకృష్ణుడు సమాధానం చెబుతాడు. అప్పుడు అగ్నిద్యోతుడు రుక్మిణి సందేశాన్ని తెలుపుతాడు:

"ఓ మంగళమూర్తీ! పురుషులలో సింహము వంటి వాడవు నీవు. నీ చరణ సరోజములను స్మరించే నన్ను మదోన్మత్తుడైన శిశుపాలుడు వివాహము చేసుకును అపహరించుటకు ప్రయత్నము చేయుచున్నాడు. అతడు నీ పరాక్రమము ఎఱుగడు. నేను పూర్వజన్మలో వ్రతములు, గురుసేవ, దానధర్మములు చేసితినేని వసుదేవ కుమారుడవైన నీవే నాకు ప్రాణేశ్వరుడవుతావు, శిశుపాలాదులు యుద్ధములో పరాజితులవుతారు. ఇక్కడ నీ పరాక్రమమునకు అడ్డులేదు, రేపే రథ గజ తురగ పదాతులనే చతురంగబలాలతో వచ్చి శిశుపాల జరాసంధులను ఉగ్రరణములో ఓడించి. రాక్షస వివాహపద్ధతిలో నన్ను తీసుకుని వెళ్లు. నేను నీ వెంట వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను."

అని అంటుంది రుక్మిణి. అంతటితో ఆగదు. "నేను అంతఃపురములో ఉంటాను కాబట్టి ఎలా తీసుకు వెళ్లటం అని ఆలోచించకు. పెళ్లికి ముందు మా ఇలవేల్పు మంగళగౌరిని కొలిచేందుకు మా వారు నన్ను పంపుతారు. నేను ఊరి వెలుపల ఉన్న దుర్గగుడికి మొక్కు చెల్లించడానికై బయలుదేరుతాను, ఆ సమయంలో నన్ను నిరాటంకముగా నీ వెంట తోడ్కొని పొమ్ము" అంటుంది. అంతటితో ఆగిందా? "నాథా! ఏ పరమపురుషుని పాదపద్మాలలో ప్రభవించిన గంగాజలాలో ఓలలాడాలని మహాత్ములు తపిస్తారో అట్టి తీర్థపాదుడవైన నీ అనుగ్రహానికి నేను అర్హురాలను కాకపోతే బ్రహ్మచర్య వ్రతదీక్ష వహించి నూరుజన్మలకైనా నీవే నా పతివి కావాలని నిన్నే ధ్యానిస్తూ నా ప్రాణాలు నీకే అర్పిస్తాను. అది నా మనోనిశ్చయం" అని పలుకుతుంది.

ఈ సందేశం వినిపించిన తరువాత అగ్నిద్యోతుడు రుక్మిణి గుణగణాలను, రూపలావణ్యాలను, ఆమె ఆరాధనను మనోజ్ఞంగా వర్ణించి "ఓ కృష్ణా! మీరిద్దరూ ఈడూ జోడుగా ఉంటారు, మీకు వివాహం తప్పక జరుగుతుంది. ఆలస్యము వలదు, వెంటనే బయలుదేరి లోకకల్యాణమొనరించు" అంటాడు.

అప్పుడు కృష్ణుడు అగ్నిద్యోతునితో "ఓ పండితోత్తమా! నాకు కూడా రుక్మిణిపై గాఢమైన ప్రేమ కలదు. ఆమె నన్ను కోరుకుంటున్న విషయము కూడా తెలుసు. మీ సందేశము ద్వారా దానిని నిశ్చయం చేసుకున్నాను గాన ఇప్పుడు ఆమె కోసమై వచ్చి, విరోధులను ఓడించి ఆమెను స్వీకరించెందను" అని పలుకుతాడు.

రుక్మి, భీష్మకుడు వివాహానికి ఏర్పాట్లు ఘనంగా చేశారు. శిశుపాల జరాసంధులు బంధుమిత్ర సమేతంగా కుండిన నగరానికి చేరుకున్నారు. బలరాముడు సోదరుడొక్కడే వెళుతున్నాడని గ్రహించి ఆతనికి దన్నుగా తన సైన్యంతో విచ్చేశాడు.

ముహూర్తం దగ్గర పడుతున్న కొద్దీ రుక్మిణి మనసులో ఆందోళన పెరిగింది. ఆ బ్రాహ్మణుడు ద్వారకకు వెళ్లాడో లేదో? నందనందనుడు నా సందేశాన్ని తప్పుగా భావించిలేదు కదా? పరమేశ్వరుడు ఈ కార్యానికి అనుకూలిస్తాడో లేదో? ఆ పార్వతి నన్ను కాపడుతుందో లేదో? ఇలా పరి పరి విధాల ఆలోచించసాగింది. తల్లికి కూడా తన మనోభావనలు తెలుపలేదు. ఆమె దుఃఖించుచుండగా, అగ్నిద్యోతుడు వస్తాడు. అతని ముఖలక్షణాలు గమైంచి చిరునవ్వుతో అతనిని వివరాలు అడిగింది. శ్రీకృష్ణుని మనోభీష్టాన్ని ఎరిగి సంతోషపడి, ఆ బ్రాహ్మణునికి నమస్కరిస్తుంది. శ్రీకృష్ణుడు కూడా రుక్మిణి స్వయంవరానికై విదర్భకు చేరుకున్నాడు. ప్రజలంతా ఆ గోవిందుడే రుక్మిణికి భర్త కావాలని పలికి దృఢంగా ఆకాంక్షించారు.

రుక్మిణి గౌరీపూజకై పరమేశ్వరి సన్నిధికి చేరుకొని:

నమ్మితి నా మనంబున సనాతనులైన యుమామహేశులన్మి
మ్ము బురాణ దంపతుల మేలు భజింతు గదమ్మ! మేటి పె
ద్దమ్మ దయాంబురాశివి గదమ్మ! హరిం బతి సేయుమమ్మ నిన్న
మ్మినవారి కెన్నడును నాశము లేదు గదమ్మ యీశ్వరీ!

అని ప్రార్థించింది. దుర్గకు నమస్కరించి భర్తృసమేతలైన బ్రాహ్మణ పత్నులకు తాంబూలములు, మంగళ సూత్రములు, చెరకుగడలు మొదలైనచి ఇచ్చి పూజించింది. ఆ ముత్తైదువలు ఉత్సాహంతో దీవెనలిచ్చి రుక్మిణి తలపై అక్షతలుంచారు. తిరిగి రాజప్రాసాదానికి వస్తున్నప్పుడు ఆమె అందచందాలు చూసి అందరూ ముగ్ధులైనారు. వీరుల మనసులు చలించాయి, వారు ఆయుధాలు వీడి సమ్మోహితులైనారు. అప్పుడామె శ్రీకృష్ణుని చూసింది:

కనియెన్ రుక్మిణి చంద్రమండలముఖుం గంఠీరవేంద్రావల
గ్నునవాంభోజదళాక్షు జారుతరవక్షున్ మేఘసంకాశ దే
హునగారాతి గజేంద్ర హస్తనిభబాహుం జక్రి బీతాంబరున్ఘ
నభూషాన్వితు గంబుకంఠు విజయోత్కంఠున్ జగన్మోహనున్

చంద్రబింబము వంటి మోము, సింగము వంటి నడుము, క్రొత్త తామరలవంటి కన్నులు, అత్యంత రమణీయమైన వక్షము, నీలమేఘము వంటి మేను, ఐరావత గజతుండము వంటి బాహువులు, పీతాంబరము ధరించి చక్రాయుధము కలవాడు, వీజయమునందు ఆసక్తి గలవాడు, జగత్తును మోహింపజేసే వాడు అయిన శ్రీకృష్ణుని దర్శించింది.

అప్పుడు కృష్ణుడు ఆమె మనోభీష్టం నెరవేర్చటానికి అక్కడి వీరులపై యుద్ధం చేసి ఆమెను తీసుకొని పోవుచుండగా రుక్మి తన చెల్లెలిని అపహరించినందుకు శ్రీకృష్ణుని తూలనాడుతాడు. అతనిని నిరాయుధుడిని చేసి సంహరించబోగా రుక్మిణి అనన్ను చంపవద్దని అతనిని క్షమించమని వారిస్తుంది. బలరాముడు కూడా ఆమె మాటకు సమ్మతించి కృష్ణునితో రుక్మిని సంహరించవద్దని పలుకుతాడు. బంధుజనులు కొనియాడగా శ్రీకృష్ణుదు రుక్మిణిని ద్వారకకు తీసుకు వచ్చి వివాహం చేసుకుంటాడు.

అంతరార్థం:

దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏమిటి? రుక్మిణి మనోభీష్టము, అది నెరవేరాలన్న సంకల్పము, దానిని వ్యక్తపరచి సాధించుకునే యత్నము, దానికై దైవప్రార్థన. ఇవే ఆ వివాహానికి కారణాలు. ఆమె భావనలు స్వయంగా తెలుసుకున్న తరువాత, ఆమె కోరిక మేరకే శ్రీకృష్ణుడు ఆమెను రాక్షస పద్ధతిలో కొనిపోయి వివాహము చేసుకుంటాడు. తాను స్వయంగా చేసినది కాదు.

మరి ఈ రుక్మిణీ కల్యాణం చదివితే యువతులకు వివాహమెందుకు అవుతుంది అని మన పెద్దలు నిర్ణయించారు?

1. యువతి మనోభీష్టం ముఖ్యం. ఆమె కామ్యము ఎంత గట్టిదైతే అంత త్వరగా సఫలమవుతుంది. తాను ఆ శ్రీకృష్ణుని తప్ప వేరెవరినీ చేసుకోనన్న నిర్ణయాన్ని స్వయంగా పలికింది.

2. తన సంకల్పానికై దైవాన్ని ప్రార్థించింది. తన కులదైవమైన గౌరిని పూజించి, మంగళప్రదమైన ఫలితాలు కలిగించే కర్మలను నిర్వర్తించింది.

3. తన సంకల్పం నెరవేరటానికి ఆమె వివేకాన్ని, ప్రదర్శించింది. ఉత్తముడు, వచనుడు అయిన అగ్నిద్యోతుని దూతగా ఎన్నుకోవటం దీనికి సూచిక. ఇతరుల శుభము కోరుకుని, లోకకల్యాణార్థమైన కార్యములను సఫలం చేయటానికి తమ బుద్ధిని, శక్తిని వినియోగించేవారు బ్రాహ్మణులు. అదే అగ్నిద్యోతుడు చేశాడు.

4. తన సంకల్ప సిద్ధికై సమయస్ఫూర్తితో వ్యవహరించి శ్రీకృష్ణునికి ఉపాయాన్ని కూడా సూచించింది రుక్మిణి.

5. తన మనోభీష్టాన్ని మొదటి సారి అగ్నిద్యోతుని ద్వారా కాదు, అంతకు మునుపే హితుల ద్వారా శ్రీకృష్ణునికి చేరేలా పలికింది.

అన్నిటినీ మించి, తన నడవడిక, తన వ్యక్తిత్వం, తన గుణగణాలు జగద్విదితమై శ్రీకృష్ణుని మనసు దోచుకునేలా జీవించింది. చివరకు అన్నను సంహరించకుండా సోదరి ధర్మాన్ని కూడా నిర్వర్తించింది. ఇక అటు తరువాత కృష్ణ పరమాత్మ పట్టపురాణిగా రుక్మిణి ఎంత పేరొందిందో మనకు తెలిసిందే.

ఆమె కనబరచిన సంకల్పబలం, వివేకం, దైవభక్తి, శ్రీకృష్ణునిపై అవ్యాజమైన ప్రేమ..ఆమె అభీష్టాన్ని నెరవేర్చి ఆమెకు సరైన నాథుడైనాడు కృష్ణుడు. ఇవీ రుక్మిణీ కల్యాణ గాథ ద్వారా అవివాహితులైన యువతులకు పాఠాలు. అవి అర్థమై, వారు తగిన విధంగా నడచుకుంటే వివాహం తప్పక జరిగి తీరుతుంది.

దూతగా హనుమాన్ - రెండవ భాగం

సరే, సీత కనిపించింది. మరి వెంటనే బయలుదేరి వెళ్లి రామునికి చెప్పవచ్చు. కానీ, అలా చేయలేదు. ఎందుకంటే, అప్పుడు సీత ఉన్న పరిస్థితి చూసి అలా చేయడం సరి కాదు అన్నది అతని నిర్ణయం. భర్తకు దూరమై, భయముతో, దుఃఖముతో, జీవన్మరణ పరిస్థితులలో ఉంది సీత. ఆమెను పలకరించి ఓదార్చి రాముని మాట చెప్పాలి అని నిర్ణయించుకున్నాడు. కానీ, తానేమో వానరం, ఆమెతో బిగ్గరగా మాట్లాడితే ఆమె భయపడి అరచితే రాక్షసులు మేల్కొంటారు, సీతను హింసిస్తారు, రావణుడు నాపై యుద్ధానికి రాక్షసులను పంపుతాదు. నేను తిరిగి వెళ్ళటం కష్టతరమవుతుంది దాని వల్ల అరిష్టం అని గ్రహించి రామ గుణ కీర్తన ఆరంభిస్తాడు హనుమాన్. సీత సందేహిస్తుంది. తన వాఙ్నైపుణ్యంతో ఆమెకు విశ్వాసం కలిగిస్తాడు. ఆమె హనుమను గుర్తిస్తుంది. మనసు కుదుటపడుతుంది. సరే, ఇంతటితోనైనా తన కార్యం పూర్తి అనుకోలేదు హనుమ.

రాక్షసుల బలం, ఆ లంకా నగర నిర్మాణ విధానం తెలుసుకోవాలి. తామసులైన రాక్షసులకు సామదానభేదదండోపాయాలలో దండోపాయమే సరైన మార్గము. రావణుని హృదయము, రాక్షస బలము తెలుసుకోవాలంటే యుద్ధం చేయాలి. అశోకవన విధ్వంసం ద్వారా అది సిద్ధిస్తుంది. కొందరు రాక్షసులను చంపితే వారు భయపడతారు. వారి బలాబలాలు తెలుసుకోవచ్చు. ఇదే అసలు పరమార్థం.

సరే, తాను అనుకున్నట్లు యుద్ధం జరిగింది, లంక భయభ్రాంతమైంది, హనుమ బ్రహ్మాస్త్రానికి కట్టుబడ్డాడు. రావణుడు అడిగితే - నేను వానరుడను, నీ దర్శనం కోసం వనధ్వంసం చేశాను, ఆత్మ రక్షణకై రాక్షసులను ఎదుర్కొన్నాను, నేనొక రాచకార్యంపై వచ్చాను, రాముని దూతగా, నీ హితవు కోరి వచ్చాను అని ప్రియమైన మాటలు పలుకుతాడు. కోపోద్రిక్తుడైన రావణుడు హనుమను వధించమని ఆజ్ఞాపిస్తాడు. విభీషణుని మాటలతో శాంతించి లాంగూల దహనానికి ఆజ్ఞాపిస్తాడు. రాముని కోసం ఆ రాక్షస అకృత్యాన్ని సహిస్తాడు. సీతమ్మ తల్లి అనుగ్రహంతో చల్లదనాన్ని, పరిమళాలను పొంది ప్రకాశించాడు. అగ్నిదేవునికి సంతృప్తి కలిగించటానికి, రాక్షసులకు సంతాపం కలుగజేయటానికి లంకాదహనమే సరైనది అని నిశ్చయించుకుని తగులబెట్టాడు. తన రజోగుణం వల్ల కలిగిన ఆగ్రహానికి సీతమ్మ ఉన్న అశోకవనం కూడా దగ్ధమైందో, దాని వల్ల ఎంత అరిష్టం అని పరి పరి విధాలా చింతించి, కొన్ని శుభ శకునాల వల్ల సీత సుఖంగా ఉందని భావించి, ఆమెని చూసి సంతోషముగా లంకకు తిరిగి వచ్చి సీతావృత్తాంతాన్ని అందరికీ వివరిస్తాడు. రాముని గాఢ పరిష్వంగన గౌరవాన్ని పొందుతాడు. సామాన్యంగా భుజశాలి బుద్ధిశాలి కావటం అరుదు. హనుమ దానికి అపవాదం. హనుమ విషయంలో సద్యోవికసితమైన బుద్ధి ఔచిత్యం నిబద్ధంగా కార్యసానుకూల సాధనమవుతుంది.

హనుమలో పౌరుష, పరాక్రమ, బుద్ధికుశలత లక్షణాల సమగ్రత ఉంది. అందుకే జగద్వంద్యుడైనాడు. సాధారణంగా సందేశహరులు మాత్రమే దూతలు. అంతకు మించి వారి ప్రమేయముండదు. కానీ, హనుమ పరిపూర్ణమైన కార్యసాధకుడు. అందుకే దౌత్యానికి హనుమ ఆదర్శం.

జయహనుమాన్ జ్ఞానగుణసాగర!
జయకపీశ తిహు లోక ఉజాగర!

- శ్రీభాష్యం అప్పలాచార్యుల వారి సుందరమారుతి పుస్తకం నుండి.

దూతగా హనుమాన్ - మొదటి భాగం

హనుమంతునికి అనేక నామాలు ఉన్నా, ఆయనను రామదూత అని వ్యవహరించటం ఆయనకు ఎంతో మోదాన్ని కలిగించింది. తానే స్వయంగా దూతోహం, దాసోహం అని చెప్పుకున్నాడు కదా.

దౌత్యం అనేది చాలా కష్టతరమైన విద్య. లోకవ్యవహారములలో వ్యక్తుల మధ్య సంధానకర్తలుగా వ్యవహరించి వారి జీవితాలను అతికించే సామర్థ్యము కలవాడే దౌత్యములో నేర్పరి. ముఖ్యంగా దూత వినయము కలవాడు, జితేంద్రియుడు కావలెను. హనుమ జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం అని పేరుపొందాడు కదా? వాగ్మి అనగా మంచి వాక్కు కలిగిన వాడు కావలెను. దీనికి జన్మ సహజమైన సంస్కారముతో పాటు, చక్కని పాండిత్యము కూడా తోడుండవలెను. "దూతంచైవ ప్రకుర్వీత సర్వశాస్త్ర విశారదాం" అని సమస్త శాస్త్రములు తెలిసినవానినే దూతగా నియమించాలి. మరి వానరం దూత ఎలా అయినాడు? అత్యంత విజ్ఞతతో, విచక్షణతో వ్యవహరించిన వాడు హనుమ. రామునికి మొట్టమొదటి సందర్శనంలోనే హనుమలో ఒక మంచి దూత లక్షణాలు కనిపించాయి. అతని మాటలలో వాక్శుద్ధి, ప్రజ్ఞ గోచరించాయి. అందుకే రాముడు లక్ష్మణునితో హనమంతుని పాండిత్యాన్ని ప్రశంసించాడు. అది పైపై పొగడ్త కాదు. సత్యం. హనుమ యొక్క వైదుష్యాన్ని, బుద్ధి కౌశలాన్ని ప్రశంసించి అటువంటి వ్యక్తి ఒక రాజుకు ఏ విధంగా సహాయకారో తెలియజేస్తాడు.

ఎవరైనా కొత్తగా వ్యక్తులు కలిసినప్పుడు వారి ముఖం మీదే మీరెవరు, మీ పేరేమిటి, ఎందుకు వచ్చారు అని అడగటం అమర్యాదే. రామలక్ష్మణులను తొలిసారి కలిసినప్పుడు హనుమ ఇలా నేరుగా ప్రశ్నించకుండానే ఆ ప్రశ్నలకు సమాధానం రాబడతాడు. ప్రశంసా సంభాషణలలో వారి గోత్రనామధేయాలు బయటపడతాయి. ఇదీ వాక్చాతుర్యము. ఇక్కడ కేవలం మాట పొందికే కాదు, మాట్లాడిన తీరు కూడా అద్భుతం. హనుమంతుని వాకులో శ్రీరామునికి అంతర్వాణి గోచరించించి. ఇవన్నీ గమనించే రాముడు కిష్కింధకాండలోని ఈ సందర్భంలో:

ఏవం విధోయస్య దూతో నభవేత్ పార్థివస్యతు
సిద్ధ్యంతి హి కథం తస్య కార్యాణాంగతయోనఘ

ఏవం గుణగణైర్యుక్తా యస్యస్యుః కార్యసాధకాః
తస్య సిద్ధ్యంతి సర్వార్థా దూతవాక్య ప్రాచోదితాః

ఇటువంటి గుణగుణములు కలిగిన దూత ఉంటే ఆ రాజుకు ఎటువంటి కార్యమైనా సిద్ధిస్తుంది అని స్పష్టంగా పలికాడు రాముడు. ఇక హనుమ ఎటువంటి వాడు?

సమస్తశాస్త్ర విశారదుడు, నవవ్యాకరణ పండితుడు, అవతలివ్యక్తి మనసులో ఉన్నమాటను చెప్పకుండానే తెలుసుకొనగల నేర్పరి. ఇది మనకు సుగ్రీవ రామకార్య నిర్వహణలో సుస్పష్టమవుతుంది. ఇక శుచిత్వం గురించి చెప్పేదేముంది? రావణాంతఃపురంలో స్త్రీల మధ్య సీతాన్వేషణైక చిత్తంతో సంచరిస్తూ సీత జాడ తెలియక ఇతర స్త్రీలను పరికించి చూడవలసి వచ్చినందుకు పరితాపాన్ని ప్రకటిస్తాడు.

తానొక్కడు, పరదేశం, అనంతమైన శత్రుసైన్యం, రాక్షసులు. అయినా కూడా భీతిలేకుండా వెదకటానికి కానీ, తలపడటానికి కానీ, రావణ సభలో తర్కించి దూతను చంపని తర్జనభర్జనలు చేసినప్పుడు గానీ చలించని ధైర్యశాలి. సముద్రం ఎలా దాటాలో, దానిలో ఉన్న కష్టనష్టాలేమిటో, ఎంతదూరం వెళ్లాలో, ఎలా ప్రవేశించాలో ఏమీ తెలియకపోయినా సముద్రతారణ, లంకాభిగమన, సీతాన్వేషణ కార్యాలు అత్యంతావాశ్యకమని సిద్ధపడిన ధీశాలి. ఇది దూతకు మరో ముఖ్యమైన లక్షణం.

దేశకాలాన్ని ఎరిగి మాట్లాడటం - అత్యంత ముఖ్యమైన లక్షణం ఇది. ఎప్పుడు ఎవరి ముందు ఎలా మాట్లాడలో, అనగా సందర్భోచితంగా మాట్లాడటం తెలిసిన వాడే వాగ్మి. ఇది హనుమకు తెలిసినంత మరెవరికీ తెలియదు కాబట్టే సుగ్రీవుడు ఎవరో ఇద్దరు మానవులు వచ్చారు అని అనుమానంతో హనుమంతుని పంపుతాడు. అప్పుడు హనుమ కనబరచిన సందర్భోచిత వాక్పటిమ రాముని ప్రశంసలందుకుంది. ఎంతో సంయమనం కనబరచి మాట్లాడతాడు హనుమ.

హనుమంతుడు రాక్షసీగణ మధ్యంలో సీతను కలుసుకునే ముందు అంతఃపురంలో బాగా శోధిస్తాడు. ప్రతి స్త్రీని ఓపికతో పరిశీలించి, లక్షణాలను బట్టి వివేచించి ఔనా కాదా అని నిశ్చయించుకోవలసి వస్తుంది. దానికి కారణం సీతను తానెరుగకపోవటం. అందువల్ల స్త్రీగణాలను తాను నిశితంగా పరిశీలించాలి. దీనికి జాగరూకత, సంయమనం కావాలి. క్షణకాలం పొరబడే తొలుత మండోదరిని సీత అనుకున్నా, జాగరూకతతో, విశ్లేషణాత్మక ధోరణితో వివేచన చేయగలిగాడు. ఇక్కడ హనుమ కనబరచిన నిగ్రహం శ్లాఘనీయం. స్త్రీగణ మధ్యంలో సంచరిస్తూ ఉన్నా తన బ్రహ్మచర్యవ్రతానికి భంగం కలుగకుండా వ్యవహరించాడు.

ఇక మరో ముఖ్యమైన లక్షణం - నష్టపోయినవి వెదకటానికి ఆ వస్తు జాతిలోనే వెదకాలి అన్న సూత్రం పాటించాడు కాబట్టే స్త్రీగణాలలో నిశితంగా వెదకాడు. ఇది హనుమ శాస్త్ర పారంగతను తెలియజేస్తుంది. అటుతరువాత లంకాదహనానికి కారణం పుచ్చాన్ని కాలచటం, దానికి కారణం వనభంజనం, దానికి కారణం రావణుని చూడాలన్న ఇచ్ఛ, దానికి కారణం కార్యసుగమం. ఆ కార్యమేమిటి? రాముని సీతాన్వేషణ. ఆమె కోసం రాముడు వాలివధ, కబంధ నిపాతనం, విరాధవధ, ఖరత్రిశిరసుల వధ, దూషణ వధ. అన్నీ సీతమ్మ కోసమే కదా? కాబట్టి ఆమెను చూసి రక్షించటం కోసం ప్రపంచాన్ని తల్లక్రిందులు చేసినా సరే అన్న ధైర్యం, తెగింపు హనుమలో. అందుకే కార్యసిద్ధి హనుమాన్‌గా పేరొందాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని మార్లు, ఎన్ని చోట్ల వెదకవలసి వచ్చినా వెనకంజ వేయను అన్న పట్టుదల హనుమది. ఇది సమతుల ఆలోచన. పని సానుకూలం కానప్పుడు ఉద్రేకంతో పనిని పాడు చేయటం మానవసహజం, కానీ హనుమంతుడు తితీక్షతో కార్యాన్ని సానుకూల పరచుకొని తన వివేకాన్ని ప్రదర్శించాదు. మళ్లీ మళ్లీ వదకుతాడు. సాధిస్తాడు.

సీత కనిపించింది. సరే. తరువాత హనుమ కనబరచిన విజ్ఞత ఏమిటి? తదుపరి వ్యాసంలో.

(శ్రీభాష్యం అప్పలాచార్యుల వారి సుందర మారుతి పుస్తకం నుండి)

రామాయణం - అరణ్యకాండ విశేషాలు - శూర్పణఖ రహస్యం

అగస్త్య మహాముని ఆశీస్సులు పొంది వారి అనుమతితో సీతారామలక్ష్మణులు గోదావరీతీరంలో పంచవటీ క్షేత్రంలో ఒక పర్ణశాల నిర్మించి హాయిగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఉదయం నదీ స్నానం, మధ్యాహ్నం తత్త్వ జిజ్ఞాస, సాయంకాలం వనవిహారం - ఇలా రోజులు, వారాలు, నెలలు, ఋతువులు సాగిపోతుంటాయి. ఉన్నట్టుండి ఆ హాయికి అంతరాయం కలుగుతుంది. రావణ సహోదరి శూర్పణఖ ఆ పరిసరాల్లో పచార్లు చేస్తూ ఒకనాడు హేమంత ఋతువులో రామలక్ష్మణులను పర్ణశాలలో చూస్తుంది. కామదూరుడైన రాముణ్ణి కామిస్తుంది. సీతను చూసి అసూయ పడుతుంది. రాముడు కాదంటే లక్ష్మణుడైనా సరేనని ఇదరిలో ఎవరినో ఒకరిని తనవానిగా చేసుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తుంది. రామలక్ష్మణుల పరిహాసాన్ని అర్థం చేసుకోలేని చుప్పనాతికి తగిన శాస్త్రి జరుగుతుంది. రాముని కనుసన్నలను గమనించిన లక్ష్మణుడు ఆమె ముక్కును, చెవులను కోసి అసలే అనాకారి అయిన ఆమెను మరీ వికారి చేసి పంపుతాడు. దీనితో శూర్పణఖకు అండదండగా సోదరులు ఖరదూషణాదులు రామలక్ష్మణులపై కత్తిదూస్తారు. రాముడు ఒంటరిగా పద్నాలుగు వేల రాక్షసులను సంహరిస్తాడు. శూర్పణఖకు జరిగిన పరాభవం రాముని దాకా వెళుతుంది. సీత అందాన్ని విని రావణుడు చలిస్తాడు. మారీచుని సాయంతో సీతను అపహరిస్తాడు. రామలక్ష్మణులు జటాయువు వల్ల జరిగిన వృత్తాంతం తెలుసుకుంటారు. సీతాపహరణం కంటే జటాయు మరణం రాముణ్ణి ఎక్కువగా బాధిస్తుంది. జటాయువుకు అంత్యక్రియలు చేసి సీతాన్వేషణకై బయలుదేరుతారు రామలక్ష్మణులు.

శూర్పణఖ వచ్చింది రాముని కోసం. కానీ. పర్యవసానం సీతాపహరణం. ఒక విధంగా శూర్పణఖ కోరింది కూడా సీతావియోగమే. రావణుడు సాధించింది కూడా రామవిరహమే. సీతారాములు కలిసి ఉన్నంతవరకు సోదరసోదరీమణుల కోరిక నెరవేరదు. చెల్లెలు రామునిపై చాటలవంటి గోళ్లతో మొరటుగా పర్ణశాలపై విరుచుకు పడుతుంది. అన్న సీతమ్మను అపహరించేందుకు దొంగ పన్నాగంతో సాధువేషంలో వచ్చి ఒంటరిగా ఉన్న సాధ్విని బలవంతంగా తీసుకొనిపోతాడు. శూర్పణఖ వ్యక్తిత్వం ఆమె నఖాల్లో (గోళ్లలో) ప్రతిబింబితమైతే రావణుని దంభం అతని శిరసులో కుంభించి ఉంటుంది. పరమాత్ముని కాలిగోళ్లు పరంజ్యోతిని ప్రసరింపజేస్తాయని ప్రతీతి. శూర్పణఖ చేతిగోళ్లు విషయవాసనలను విరజిమ్మాయి. గోళ్లు వాసనకు, ఉపాసనకు కూడా పనికి వస్తాయి. జీవలక్షణాలు గల నిర్జీవ పదార్థాలలో గోళ్లు కూడా పరిగణించబడతాయి. కండూతికి, పాండితికి రెండిటికీ గోళ్లు వాటంగా, ఘాటంగా ఉపకరిస్తాయి. అలాంటి గోళ్లతో శూర్పణఖ రామచంద్రుని సమీపిస్తుంది. చూడటానికి చక్కగా ఉన్న రాముని చూసి నేను నీకు తగిన దానను అని సిగ్గు లేకుండా చెప్పుకుంటుంది. సీతాసమేతుడైన రామచంద్రుడెక్కడ? కొండల్లో కోనల్లో మానం వదలుకొని మైమరచి విహరించే శూర్పణఖ ఎక్కడ? ఇద్దరి రూపవైరుధ్యాన్ని నిరూపిస్తూ వాల్మీకి అంటాడు:

సుముఖం దుర్ముఖీ రామం వృత్తమధ్యం మహోదరీ
విశాలాక్షం విరూపాక్షీ సుకేశం తామ్ర మూర్ధజా
ప్రియరూపం విరూపా సా సుస్వరం భైరవస్వనా
తరుణం దారుణా వృద్ధా దక్షిణం వామభాషిణీ
న్యాయవృత్తం సుదుర్వృత్తా ప్రియమప్రియదర్శనా
శరీరజ సమావిష్టా రాక్షసీ రామమబ్రవీత్

శూర్పణఖ రాక్షసి, రాముడు పురుషోత్తముడు. రాక్షసీ రాముల రూప వైషమ్యం గమనించదగినది. ఆమె దుర్ముఖి, అతడు సుముఖుడు, ఆమె మహోదరి, అతడు సన్నని నడుము గల సుకుమారుడు. ఆమె విరూపాక్షి, అతడు విశాలమైన కన్నులు గలవాడు. ఆమెది ఎర్రని రాగి జుట్టు, అతనిది నల్లని జుట్టు. ఆమె వికృతాకారంతో విపరీతంగా పెరిగిన వయోవృద్ధ. అతడు పిన్నవయసులో వెన్నలా కన్నులవిందుగా కనిపించే కమనీయ స్ఫురద్రూపి. ఆమెది కఠోరమైన కంఠం, అతనిది మృదుమధురమైన స్వరం. కట్టె విరిచినట్లు మాట్లాడే గడుసుదనం ఆమెలో కొట్టవచ్చినట్లు కనిపిస్తుంది. అతడు అన్నివిధాలా అందరికీ అనుకూలంగా అణకువతో మాట్లాడే ప్రియంవదుడు. ఆమె కామాంధురాలైన కామిని, అతడు న్యాయసమ్మతంగా వ్యవహరించే ప్రియదర్శనుడు.

ఇలాగే, రామ రావణులకు మధ్యగల వ్యత్యాసాన్ని కూడా సీతాదేవి రావణునికి సుస్ఫష్టంగా చెబుతుంది. సింహం ముందు నక్కలా రావణుడు రాముని ఎదుట నిలబడేందుకు కూడా పనికిరాడని ఆమె చెబుతుంది. మురికి కాలువకు మున్నీటికి, ఇనుముకు బంగారానికి, బురదకు గంధానికి. కాకికి గరుత్మంతునికి ఎంత భేదముందో అంత వ్యత్యాసం వారి మధ్య ఉందని ఆమె తనను అపహరించేందుకు వచ్చిన రావణునితో నిర్భయంగా చెబుతుంది. తపస్సు, వర్చస్సు, ఓజస్సు - ఎన్ని ఉన్నా ఒక్క ధర్మం లోపించటం వల్ల కామమోహితుడైన రావణుడు లోకరావణుడవుతాడు. సత్య ధర్మ పరాయణుడైన రామచంద్రునికి దూరమవుతాడు. శూర్పణఖది సుఖప్రధానమైన వ్యక్తిత్వమైతే రావణుడు శిరఃప్రధానుడు. ఒకటికి పది తలలు గల పెద్ద మనిషి. మంచికి చెడుకు కూడా శిరస్సే ఆధారం. మంచి మంచి ఆలోచనలతో మంచి తలపెట్టి ప్రపంచంలో మంచిని పంచగలిగేది తలపులకు నిలయమైన తలయే. ఆ తలకాయలోనే ప్రపంచాన్ని ముంచి వేసే దురాలోచనలు కూడా బయలుదేరవచ్చు. శూర్పణఖ గోళ్లవలె రావణాసురుని తలలు కూడా మంచిని అణచి వేసి చెడును చేరదీస్తాయి. పర్యవసానం రావణ సంహారం, శ్రీరామజయం, సీతావిముక్తి. ఈ శుభాంతానికి బీజం శూర్పణఖ పరాభవం, సీతాపహరణం. శూర్పణఖ లేకుంటే ఆ తరువాతి కథే లేదు, రామాయణ పరమార్థం నెరవేరదు. కాబట్టి శూర్పణఖ వృత్తాంతం రామాయణ కథలో కీలకమైన నాభి స్థానాన్ని పొందుతుంది. కైక వరంతో రామాయణంలోని బ్రహ్మగ్రంథి విచ్ఛిన్నమైతే శూర్పణఖ పరాభవంతో విష్ణుగ్రంథి విడిపోతుంది. ఇక రుద్రగ్రంథి వైపు రామాయణం పయనిస్తుంది.

రాముడు-సీత-రావణుడు: పరమాత్మ-జీవాత్మ-మనసు



మన ఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః

మనస్సే బంధములో పడుటకు, బంధము నుండి విడుటకు కూడా కారణము. ఆ మనస్సే రావణుడు. రావయతి అసత్ప్రలాపాన్ కారయతి ఇతి రావణః. చెడు పలుకులను పలికించువాడు రావణుడు మనస్సే చెడు పలుకులను పలికించునది. అవి రెండు - 1. అహం 2. మమ. నేను-నాది అనేవి.

అనాత్మన్యాత్మబుద్ధిర్యా అస్వేస్వమితి యా మతిః
అవిద్యా తరుసంభూతి బీజమేతద్ద్విధా స్థితం

తాను కాని శరీరమును తానని అహంకరించుట, పరమాత్మదే అయి తనది కాని వస్తుజాతమును తనది యనుకొనుట అను ఈ రెండే అజ్ఞానమను వృక్షమునకు మూలమగు విత్తనము. ఈ మనస్సు అను రావణునికి కూడా రావణుని వలె పది ముఖములు కలవు. మనస్సు వెలుపలికి ప్రసరించు మార్గములే ఇంద్రియములు. అవి పది - ఐదు జ్ఞానేంద్రియములు (చర్మము, నేత్రము, చెవి, నాలుక, ముక్కు), ఐదు కర్మేంద్రియములు (వాక్కు, చేయి, పాదము, మలద్వారము, మూత్రద్వారము). ఈ పది మనస్సుకు ముఖములు. అందుచేత మనస్సు కూడా దశముఖుడే. అతడు పరిపాలించునది లంక, మనసు పరిపాలించునది శరీరము. శరీరము సంసారమనే సముద్రముచే చుట్టబడి యుండును, లంక నూరుయోజనముల సముద్రముచే చుట్టబడియున్నది. రాజస తామస సాత్విక చిత్త్రవృత్తులే రావణ కుంభకర్ణ విభీషణులు. రాజసవృత్తి గల రావణుడు లంకను పాలించునప్పుడు రాముని భార్యయైన సీత లంకయందు బంధించబడును. రాజసవృత్తి ప్రధానముగానున్నప్పుడు అవివేక పూర్ణమైన మనస్సు రామునికే శేషభూతమైనదియు, రామునిచేతనే రక్షించబడదగినదియు, రామునిచే అనుభూతి చెందబడదగినదియునగు ఆత్మను, అనగా సీతమ్మను, లంకలో బంధించును.

పరమాత్మయే రాముడు, ఆనందము కలవాడు, ఆనందమునిచ్చువాడు. ఆనంద స్వరూపుడగు పరమాత్మయే రామునిగా అవతరించును. రామశబ్దమునకు అర్థమదే. పరమాత్మ వసించు స్థానము, పరమపదము, వైకుంఠము. దానికే అయోధ్య - అపరాజిత అని పేర్లు కూడా కలవు. దేవానాం పూ రయోధ్యా అని వేదము చెప్పుచున్నది. ఆ రామునకు, జనకుని యజ్ఞ క్షేత్రములో దొరకిన సీత భార్యయగును. సీత జీవ స్వరూపమును నటించును. జన్మింపదు, దొరకును. న జాయతే మ్రియతే వా కదాచిత్ అని ఉపనిషత్తు చెప్పుచున్నది. జనకుని యజ్ఞ క్షేత్రము కర్మక్షేత్రమగు శరీరము. ఆ శరీరములో అన్వేషించిన లభించునది ఆత్మ. ఆ అత్మ భగవానునికే చెందినదై భగవానునికి భార్యయై ఉండు. భార్యకు భర్తతో గల సంబంధం జీవాత్మకు పరమాత్మతో గల సంబంధము సమానము. ఈ సంబంధము ఆరు విధాలుగా నుండును.

1. అనన్యార్హ శేషత్వము - వానికే తప్ప ఇతరులకు చెందనిదై యుండుట
2. అనన్య శరణత్వము - వాడే తప్ప వేరొకడు రక్షకుడుగా లేకుండుట
3. అనన్య భోగ్యత్వము - వానిచేతనే తప్ప ఇతరులచేత అనుభవింపరానిదయి యుండుట
4. తత్ సంశ్లేషైక సుఖిత్వము - వానితో కూడి యుండుటే సుఖముగా నుండుట
5. తద్విశ్లేషైక దుఃఖిత్వము - వాని యెడబాటే దుఃఖముగా నుండుట
6. తదేకనిర్వాహ్యత్వము - వాని చేతనే నడిపింపబడుట

ఈ ఆరు లక్షణములు గల భార్యగా సీత రామునితో చేరినది.

ఈ విధంగా పరమాత్మతో నున్న జీవుడు వలె సీతమ్మ రామునితో యున్నది.

అనన్యా రాఘవేణాహం భాస్కరేణ ప్రభా యథా! - నేను రామునితో వేరైనదానను కాదు. సూర్యునితో కాంతివలె కలసియే యుందును అని సీతమ్మ సుందరకాండ 21వ సర్గలో పలుకుతుంది.

ఇదే సీతారాముల తత్త్వం, మానవ జీవన రహస్యాన్ని తెలిపేది సీతారాముల చరిత.

(మహామహోపాధ్యాయ, ప్రవచన శిరోమణి శ్రీభాష్యం అప్పలాచార్యుల వారి సుందరకాండము - తత్త్వదీపిక నుండి)

రామాయణంలోని ఆసక్తికరమైన విషయాలు



ఏ ఘట్టం కూడా ఒక ప్రాతిపదిక లేకుండా జరగలేదు. ప్రతి ఒక్క సర్గకూ, ప్రతి ఒక్క కాండకూ, ముందస్తుగా రంగం, పాత్రలు, ఆ పాత్రల ప్రతిస్పందనలు నిర్ణయాత్మకం. అదే వాల్మీకి మహర్షి గొప్పతనం. అటువంటి కొన్ని విషయాలను తెలుసుకుందాం.

నేపథ్యం:

సుందరకాండలో హనుమంతుడు సీతమ్మ జాడ తెలుసుకొని, ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రానికి బద్ధుడై రావణుని ఎదుట నిలిచి రాముని ప్రతాపం గురించి పలికి, లంకను దహనం చేసి తిరిగి వచ్చి రామునికి సీతమ్మ ఆనవాలు ఇచ్చి రామునికి ఆనందం కలిగిస్తాడు. ఇక్కడ హనుమంతునికి రామకార్యమొక్కటే కాదు, రామదూతగా శత్రువునకు రాముని పక్షం యొక్క బల పరాక్రమాల రుచి చూపించి భయం కలిగించటం, రావణునికి మరొక అవకాశం కలిగించటం. ఆ కార్యంలో హనుమ పూర్తిగా సఫలమై తిరిగి వచ్చాక యుద్ధం అనివార్యమని అందరికీ తెలుసు. కానీ, ఎవరి ప్రవృత్తులను బట్టి వారు ప్రవర్తించారు.

ఎలా?

1. విభీషణుడు అన్నకు రామబాణం యొక్క శక్తిని తెలిపి అతనికి నచ్చచెప్ప జూచి అది ఫలించక రాముని పక్షాన చేరి శరణు కోరటం. అనగా, మంచి వైపు చేరే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అన్న రాక్షస ప్రవృత్తిని ఇక ఏ మాత్రం సమర్థించను అన్న నిర్ణయానికి రావటం. మరి రాముడేం చేశాడు? వైరి తమ్ముడు వచ్చి తన శరణు కోరాడు కాబట్టి అతనిని స్వాగతించాడు. అది సత్పురుషుల లక్షణం. ఈ రామ-విభీషణ సమాగమం విభీషణుని రామభక్తునిగా, తద్వారా రామానుగ్రహంతో లంకానగరానికి పాలకునిగా మరియు చిరంజీవిని చేసింది.

2. వానరసైన్యం సహాయంతో రాముడు తనపై యుద్ధానికి వచ్చాడు అన్న సంగతి తెలిసినా, రావణుడు తన కుతంత్రాన్ని వీడలేదు. 10 యోజనముల మేర వానరసైన్యమున్నదన్న శార్దూలుని మాటలకు కలవరపడి మిత్రభేధం కలిగించాలని ప్రయత్నం చేశాడు. రామసుగ్రీవ మైత్రికి విఘాతం కలిగించటానికి శుకుడనే వానిని పక్షిరూపంలో వెళ్లి సుగ్రీవునికి మాయమాటలు చెప్పమని ఆజ్ఞాపిస్తాడు. శుకునికి సుగ్రీవునితో ఇలా చెప్పమని పలుకుతాడు " ఓ సుగ్రీవా, నీవు మహావీరుడవు, గొప్పవాడవు, ఈ యుద్ధం వలన నీకు ఒరిగేదేమీ లేదు, నీవు నాకు సోదరుని వంటి వాడవు, నేను సీతను అపహరిస్తే నీకెందుకు? కాబట్టి కిష్కింధకు తిరిగి వెళ్లిపో". ఆ మాటలు విన్న వానరసైన్యమంతా ఆ పక్షిరూపంలో ఉన్న శుకుని రెక్కలు తెంచి అతని చంపబోతాయి.

3. ఆ శుకుడు భయంతో రామునితో దూతను చంపటం న్యాయం కాదు అని పలుకుతాడు. అంతా విన్న సుగ్రీవుడేమన్నాడు? అతను కూడ మిత్రధర్మాన్ని నిర్వర్తించాడు. రావణుని మాయమాటలకు లొంగకుండా - "ఓ రావణా! నీకు నాకు భ్రాతృ బంధం లేదు, రాముని శత్రువైన నీవు అధర్మానికొడిగట్టిన వాలిలా రాముని చేత హతుడవవుతావు, నీవు జటాజటాయువును చంపి, సీతమ్మను అపహరించి అధర్మానికొడిగట్టావు, నీకు మరణం తప్పదు" అని శుకుని ద్వారా సందేశం పంపి రావణుని హెచ్చరిస్తాడు.

4. మరి రాముడేం చేశాడు? భయంతో తనను చంపవద్దు దాని వల్ల రామునికే పాతకమన్న శుకుని మాటలు విని అతనిని విడిచిపెట్టమని వానరులను ఆజ్ఞాపించాడు. ఇక్కడ మనం గమనించవలసింది హనుమ లంకకు వెళితే రావణుడు అతనిని చంపమని ఆజ్ఞాపించి, తిరిగి విభీషణుని సలహా మేరకు దూతను చంపకుండా అతనికి శక్తికి సంకేతమైన లాంగూలానికి నిప్పంటించమని ఆజ్ఞాపిస్తాడు, దాని వల్ల నష్టం ఎవరికి జరిగింది? లంకకే! మరి రాముడేం చేశాడు? శుకుని చంపకుండా వదిలేస్తాడు. దీని వల్ల లాభమేమిటి? రాముని గొప్పతనం, రామసుగ్రీవుల మైత్రీబంధం రావణునికి వివరంగా తెలుస్తాయి. ఇక అతనికి మరణం తథ్యం. కానీ, రామయ్య వెంటనే ఆ పని చేయలేదు. మరిన్ని వివరాలు రేపు.

అడుగడుగునా రామయ్య ధర్మాన్ని పాటించాడు, పరిస్థితిని ధర్మ విజయానికి అనుకూలంగా తీర్చిదిద్దాడు. రావణుడో? ప్రతి అడుగూ, తన వినాశనానికే దారి తీసేలా చేసుకున్నాడు.

శ్రీరామ జయం

సనాతన ధర్మం

"స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శం నో అస్తు ద్విపదే శం చతుష్పదే"

- మానవులందరికీ మేలు కలుగుగాక, చెట్లు చేమలు పైకి పెరుగు గాక, రెండు, నాలుగు కాళ్లున్న ప్రాణులకు శుభము కలుగుగాక.


"భద్రం కర్ణేభి శృణు యామ దేవాః భద్రం పశ్యే మాక్షభిర్యజత్రాః"

- మా చెవులతో శుభం కలిగించేవి మాత్రమే వినెదము గాక, మా కళ్లతో శుభమునే చూచెదము గాక.


"ఆ నో భద్రా క్రతవో యన్తు విశ్వతః"

- విశ్వములోని అన్ని దిక్కుల నుండి ఉన్నతమైన ఆలోచనలు మాకు వచ్చు గాక.


"ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి"

- నీవే యదార్థము, నీవే సత్యము అని పలికెదను.


"ఋతం వచ్మి సత్యం వచ్మి"

యదార్థమును, సత్యమునే పలికెదను


"శరీరం మే విచర్షణం జిహ్వా మే మధుమత్తమా కర్ణాభ్యాం భూరివిశ్రువం"

- నా శరీరం ఆరోగ్యంగా ఉండనీ, నా నాలుక మధురమైన మాటలనే పలుకనీ, నా చెవుల ద్వారా అనేక మంచి విషయాలనే ఆలకించనీ.


"ఓం సహ నావవతు సహ నౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మావిద్వాషావహై"

మనలను భగవంతుడు రక్షించు గాక, పోషించు గాక, ఇద్దరమూ ఉత్తేజితులమై పరిశ్రమించెదము గాక, మన ఏకాగ్రత ఫలవంతమగు గాక, మనమిద్దరమూ ఒకరినొకరు ద్వేషించకుండా ఉండెదము గాక.


"స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీశాం గోబ్రాహ్మణేభ్యశ్శుభమస్తు నిత్యం లోకాస్సమస్తా సుఖినో భవంతు"

- ప్రజలకు శుభం కలుగుగాక, రాజులు న్యాయమార్గములో ఈ భూమిని పరిపాలింతురు గాక, గోవులకు, బ్రాహ్మణులకు శుభం కలుగు గాక, సమస్త లోకములకు సుఖము కలుగు గాక.


"మధువాతా ఋతాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీర్నస్సంత్వౌషదీ మధు నక్తంతోషసి మధుమత్పితార్థివగ్‌ం అస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః"

- సత్కార్యం చేయదలచిన మనకు గాలి తీయగా వీచుగాక, నదులు తీయని నీటితో ప్రవహించు గాక, చెట్టు చేమలు పరిపుష్టమై ఉండు గాక, భూమి మాధుర్యాన్ని అందించు గాక, మన తండ్రియైన ఆకాశము తియ్యదనాన్ని వర్షించు గాక, చెట్టుచేమల అధిపతియైన చంద్రుడు తీయగానుండు గాక, గోవులు అధికంగా పాలనిచ్చుగాక.

ఇలా ప్రతి అడుగులోనూ మంచినే వినాలని, మాట్లాడాలని, చూడాలని, ఆచరించాలని చెప్పింది వేదరూపమైన సనాతన ధర్మం. సమస్త జీవరాశి మంచి కోరుకుని వాటికి పుష్టి, తుష్టి శాంతి కలగాలని, దానిని నమ్మి నిరంతరం పలుకమని వేదాలు ఘోషించాయి. త్రికరణములు కూడా మంచిపైనే ధ్యాస కలిగి మంచినే ఆచరించాలని సహస్రాధికంగా పలికాయి. విశాలమైన భావనలతో అందరినీ ఆహ్వానించాయి, అందరికీ శుభం కలగలాని అడుగడుగునా నినందించాయి. అదీ ఈ ధర్మం యొక్క గొప్పతనం. ప్రతి అడుగులోనూ, సూక్తం లోనూ శాంతి మంత్రంతో శాంతికాముకతను పునరుద్ఘాటించాయి.

మరి మిగిలినవో? - వాళ్లు అది చేస్తున్నారు, అది సహేతుకం కాదు, అది మూఢం, అది అనాగరికం, రాళ్లు రప్పలను పూజించటమేమిటి అని దూషించి, దుష్ప్రచారం చేసేవారొకరైతే మరొకరు బలవంతం చేసైనా సరే వారు వారి ధర్మాన్ని వీడేటట్లు చేయండి, వారి దేవాలయాలను నాశనం చేయండి, వారి సంస్కృతి సాంప్రదాయాలను నామరూపాల్లేకుండా చేయండి, వారి ఆడవారిని చెరపట్టండి అని ధర్మపరాయణులను హింసించి మతమార్పిడులు, అత్యాచారాలు చేశారు, శతాబ్దాలపాటు దేశాన్ని రక్తసిక్తం చేసి మహోన్నతమైన సంస్కృతిని కాలరాశారు.

ఎవరిది అసహనం? ఎవరిది సర్వమానవ సౌభ్రాతృత్వం? మరొక మతానికి చెందిన వారిని చంపి రక్తసిక్తం చేసేవారు శాంతికాముకులా? దారుణంగా ఆడవారిని చెరబట్టి మానభంగం చేసి చంపి మారణహోమం సృష్టిస్తున్నవారు శాంతి కాముకులా?

లేక,

సన్యాసం ముసుగులో రాసలీలు సాగిస్తూ, అన్యమత ప్రచారం కోసం ఇతరుల ఆరాధనా ప్రదేశాలను అపవిత్రం చేస్తూ, సరైన అస్తిత్వం లేక దొడ్డిదారి తొక్కి చాపకింద నీరులా ప్రజలను డబ్బుతో ప్రలోభ పెట్టి తప్పుడు మాటలతో పక్కదోవ పట్టించే వారా?

లేక

నిరంతరం యజ్ఞ యాగాదులతో, పశు సమృద్ధి, ధాన్య సమృద్ధిని కాక్షించి, పవిత్రమైన అనుష్ఠానంతో, మంచిని పలికి మంచిని పంచిన వారా? శబ్ద ప్రకంపనలతో లోకంలో సకారాత్మకతను నింపుతున్న సనాతన ధర్మ పరాణయులను అతివాదులుగా చిత్రీకరిస్తుంటే, ఆ ధర్మాన్ని దారుణంగా అపహాస్యం చేస్తుంటే కనీసం స్పందించలేని పరిస్థితులను సృష్టిస్తుంటే మనం కళ్లు మూసుకుని కూర్చోవాలా?

సత్యం సుస్పష్టం, కానీ దాని వైపు నిలబడేందుకు ధైర్యం కావాలి, నిబద్ధత కావాలి, ధర్మం యొక్క గొప్పతనం అవగతం కావాలి. సనాతనధర్మమంటేనే శాంతి, సౌభ్రాతృత్వం, సమభావం. ఇక్కడ హింసకు తావులేదు, వివక్షకు అవకాశం లేదు. వక్రీకరించే వారిని ఎదిరించవలసిన సమయం.

ఉత్తిష్ఠత జాగ్రత ప్రాప్యవరాన్నిబోధత!
క్షురస్య ధారా నిశితా దురత్యయా పథస్తత్కవయో వదంతి!!

లేవండి, మేల్కోనండి, జ్ఞానులను ఆశ్రయించి కర్తవ్యాన్ని తెలుసుకోండి. పదునైన కత్తివలె ఇది చాలా దుర్గమమైన మార్గము అని సత్కవులు చెబుతున్నారు. అయినా వెనుకడుగు వేయకండి.

- కఠోపనిషత్తు.

శ్రీగురుభ్యోనమ

4, సెప్టెంబర్ 2020, శుక్రవారం

గాయత్య్రష్టకం

విశ్వామిత్ర తపఃఫలాం ప్రియతరాం విప్రాలిసంసేవితాం
నిత్యానిత్య వివేకదాం స్మితముఖీం ఖండేందు భూషోజ్జ్వలాం
తాంబూలారుణ భాసమాన వదనాం మార్తాండమధ్యస్థితాం
గాయత్రీం హరివల్లభాం త్రినయనాం ధ్యాయామి పంచాననాం

జాతీపంకజకేతకీకువలయైః సంపూజితాంఘ్రిద్వయా
తత్వార్థాత్మికవర్ణపంకిసహితా తత్వార్థబుద్ధిప్రదాం
ప్రాణాయామపరాయణైర్బుధజనైః సంసేవ్యమానాం శివాం
గాయత్రీం హరివల్లభాం త్రినయనాం ధ్యాయామి పంచాననాం

మంజీరధ్వనిభిః సమస్తజగతాం మంజుత్వసంవర్ధనీం
విప్రప్రేంఖితవారివారితమహారక్షోగణాం మృణ్మయీం
జప్తుః పాపహరాం జపాకుసుమనిభాం హంసేన సంశోభితాం
గాయత్రీం హరివల్లభాం త్రినయనాం ధ్యాయామి పంచాననాం

కాంచీచేల విభూషితాం శివమయీం మాలార్ధమాలాదికాన్బి
భ్రాణాం పరమేశ్వరీం శరణదాం మోహాంధబుద్ధిచ్ఛిదాం
భూరాదిత్రిపురాం త్రిలోకజననీమధ్యాత్మశాఖానుతాం
గాయత్రీం హరివల్లభాం త్రినయనాం ధ్యాయామి పంచాననాం

ధ్యాతుర్గర్భకృశానుతాపహరణాం సామాత్మికాం సామగాం
సాయంకాల సుసేవితాం స్వరమాయీం దూర్వాదళశ్యామలాం
మాతుర్దాస్యవిలోచనైకమతిమత్ఖేటీంద్రసంరాజితాం
గాయత్రీం హరివల్లభాం త్రినయనాం ధ్యాయామి పంచాననాం

సంధ్యారాగవిచిత్రవస్త్రవిలసద్విప్రోత్తమైః సేవితాం
తారాహీరసుమాలికాం సువిలసద్రత్నేందుకుంభాంతరాం
రాకాచంద్రముఖీం రమాపతినుతాం శంఖాదిభాస్వత్కరాం
గాయత్రీం హరివల్లభాం త్రినయనాం ధ్యాయామి పంచాననాం

వేణీభూషితమాలకధ్వనికరైర్భృంగైః సదాశోభితాం
తత్వజ్ఞానరసాయనజ్ఞరసనాసౌధద్భ్రమద్భ్రామరీం
నాసాలంకృతమౌక్తికేందుకిరణైః సాయంతమశ్ఛేదినీం
గాయత్రీం హరివల్లభాం త్రినయనాం ధ్యాయామి పంచాననాం

పాదాబ్జాంతరరేణుకుంకుమలసత్ఫాలధ్యురామావృతాం
రంభానాట్యవిలోకనైకరసికాం వేదాంతబుద్ధిప్రదాం
వీణావేణుమృదంగకాహలరవాన్ దేవైః కృతాంఛృణ్వతీం
గాయత్రీం హరివల్లభాం త్రినయనాం ధ్యాయామి పంచాననాం

ఫలశ్రుతిః

హత్యాపానసువర్ణతస్కరగుర్వంగనాసంగమాన్దో
షాన్ఛైలసమాన్ పురందరసమాః సంచ్ఛింధ్య సూర్యోపమాః
గాయత్రీ శృతిమాతురేకమనసా సంధ్యాసు యే భూసురా
జప్త్వా యాంతి పరాం గతిం మునిమిమం దేవ్యాః పరం వైదికాః

ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్య శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం గాయత్య్రష్టకం సంపూర్ణం

తాత్పర్యం:

విశ్వామిత్రుని తపఃఫలముగా వచ్చి, బ్రాహ్మణులు, ఋషులచే పూజించబడి, అనంతమైన, నిత్యమైన వివేకాన్ని ఇచ్చే, నెలవంకను ఆభరణముగా కలిగి శోభిల్లుతున్న, ఎర్రని వదనముతో భాసిల్లుతున్న, సూర్యుని మధ్యలో నివసిస్తున్న, శ్రీహరికి ప్రియమైన, మూడు నేత్రములు, ఐదు ముఖములతోనున్న గాయత్రీదేవిని ధ్యానిస్తున్నాను.

మల్లెలు, కలువలు, మొగలి పూలమాలలతో శోభిల్లు పాదములు కలిగిన, తత్వార్థజ్ఞానాన్ని సంకేతించే బీజాక్షరాలు కలిగిన, ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించే, ప్రాణాయామములో నిష్ణాతులైన పండితులచే పూజించబడే, ఎల్లప్పుడు శుభాన్ని కలిగించే, శ్రీహరికి ప్రియమైన, మూడు నేత్రములు, ఐదు ముఖములతోనున్న గాయత్రీదేవిని ధ్యానిస్తున్నాను.

కాలియందెల మృదువైన ధ్వనితో సమస్త జగత్తులో మృదుత్వాన్ని పెంచే, బ్రాహ్మణుల అర్పించిన అర్ఘ్యాలు,తర్పణాలతో రాక్షసులను అణచే, జపం చేసే వారి పాపాలను తొలగించే, ఎర్రని శరీర ఛాయ కలిగి, హంసవాహినియై, శ్రీహరికి ప్రియమైన, మూడు నేత్రములు, ఐదు ముఖములతోనున్న గాయత్రీదేవిని ధ్యానిస్తున్నాను.

పట్టువస్త్రములు ధరించి, పూల మాలలతో అలంకరించబడిన, అనంతమైన శుభాన్ని కలిగించే, శరణును ప్రసాదించే, బుద్ధినుంచి మోహాన్ని విడగొట్టే, భూర్భువస్సువయై (కింద వివరణ చూడండి), మూడులోకాలకు మాతయై, ఆధ్యాత్మికశాఖలచే నుతింపబడే, శ్రీహరికి ప్రియమైనది యైన, మూడు నేత్రములు, ఐదు ముఖములతోనున్న గాయత్రీదేవిని ధ్యానిస్తున్నాను.

తనను ధ్యానము చేసేవారి తాపాగ్ని నాశనము చేసే, ఎల్లప్పుడు సంయమనము కలిగి, శాంతమూర్తియై, సుస్వరయై, దూరముగా ఉన్న దర్భ (గడ్డిపోచ) వలె నల్లని ఛాయకలదై, శ్రీహరికి ప్రియమైన, మూడు నేత్రములు, ఐదు ముఖములతోనున్న గాయత్రీదేవిని ధ్యానిస్తున్నాను.

సాయంకాల సమయంలో కాషాయవస్త్రధారిణియై బ్రాహ్మణులచే పూజింబడి, నక్షత్రాలవలె మెరుస్తున్న వజ్రహారములు ధరించిన, స్తనముల మధ్య చంద్రునివలె ప్రకాశించుచున్న రత్నాభరణములు కలిగిన, పూర్ణచంద్రునివలె ప్రకాశిస్తున్న ముఖము కలదై, రామునిచే పూజింపబడి, శంఖము మొదలగు హస్తాలంకారములతో, శ్రీహరికి ప్రియమైన, మూడు నేత్రములు, ఐదు ముఖములతోనున్న గాయత్రీదేవిని ధ్యానిస్తున్నాను.

చుట్టూ భ్రమరములు తిరుగుతు ఉన్న పూలమాలలు కేశములలో అలంకరించబడిన, భ్రమరము వలె ధ్వని చేయుచు, నాలుకయందు తత్వజ్ఞానమనే రసము కలిగి, నాసికాభరణమునుండి వెలువడే ప్రకాశముతో చీకటిని ఛేదించే, శ్రీహరికి ప్రియమైన, మూడు నేత్రములు, ఐదు ముఖములతోనున్న గాయత్రీదేవిని ధ్యానిస్తున్నాను.

పదకమలములయందు ఉన్న కుంకుమ, పుప్పొడి రేణువులనుండి వెలువడే కిరణాలతో ప్రకాశిస్తున్న, రంభ నృత్యాన్ని తిలకిస్తూ ఆనందించే, వేదాంతజ్ఞానాన్ని ప్రసాదిస్తూ, వీణ, వేణువు, మృదంగాది వాద్యముల నాదమును వింటూ, శ్రీహరికి ప్రియమైన, మూడు నేత్రములు, ఐదు ముఖములతోనున్న గాయత్రీదేవిని ధ్యానిస్తున్నాను.

ఫలశ్రుతి:

హత్య, మధిరాపానము, బంగారం దొంగిలించటం, గురుపత్నిని మోహించటం వంటి మహాపాపాలను నాశనం చేసే, ఇంద్రుడు, సూర్యులకు సమమైన మంత్రమును సంధ్యా సమయంలో బ్రాహ్మణులు జపించుటవలన వారి ఆత్మలకు అత్యుత్తమైన వైదిక గతి కలుగుతుంది.

గాయత్రి మంత్రంలో ఉన్న మూడు భాగాలు:

1. మొదటి భాగం ప్రణవ మంత్రమైన ఓం.

2. రెండవ భాగం ప్రణవ మంత్రాన్ని విప్పి చెప్పే భూః, భువః, సువః అనే మూడు వ్యాహృతాలు. ఇవి స్థూల స్థితిలో భూమి, పితృలోకం, దేవలోకాన్ని సూచిస్తాయి. సూక్ష్మ స్థితిలో మన చేతన యొక్క మూడు స్థితులు - మనసు, శరీరం, ప్రాణం అనే మూడు స్థితులలోను పనిచేసి మన జీవితాన్ని పరిపోషణ గావిస్తాయి.

3. ఇక మూడో భాగం తత్...ప్రచోదయాత్ అనేది సావిత్రీ మంత్రంగా చెప్పబడింది.

మొత్తం మీద, ప్రణవం, వ్యాహృతి, సావిత్రి - ఈ మూడు కలిసిందే గాయత్రి. గాయాతం త్రాయతే ఇతి గాయత్రి - అంటే, జపించేవారిని తరింపజేస్తుంది కాబట్టి ఇది గాయత్రీ అని పేరు పొందింది. ఋగ్వేదంలో చెప్పబడింది.

గాయత్రీ ఆవాహన మరియు వినియోగ మంత్రాలు

ఓజోऽసి సహోऽసి బలమసి భ్రాజోऽసి దేవానాం ధామ నామాసి విశ్వమసి విశ్వాయుః సర్వమసి సర్వాయురభిభూరోం గాయాత్రీమావాహయామి సావిత్రీమావాహయామి సరస్వతీమావాహయామి ఛన్దర్‌షీనావాహయామి శ్రియమావాహయామి

గాయత్రియా గాయత్రీ ఛందో విశ్వామిత్ర ఋషిః సవితా దేవతాః

అగ్నిర్ముఖం బ్రహ్మా శిరో విష్ణుర్ హృదయగ్‌ం రుద్రశ్శిఖా పృథివీ యోనిః ప్రాణాపానవ్యానోదానసమానా సప్రాణా శ్వేతవర్ణా సాంఖ్యానసగోత్రా గాయత్రీ చతుర్విగ్ంశత్యక్షరా త్రిపదా షట్కుక్షిః పఞ్చశీర్‌షోపనయనే వినియోగః

ఓ దేవీ! నీవు మా యింద్రియముల యొక్క శక్తివై యున్నావు, శత్రువులను తిరస్కరించే శక్తివి, శరీరమునకు బలమగుచున్నావు, తేజస్సువగుచున్నావు. అగ్నీంద్రాది దేవతల నివాసము నీవు, వారి నామములు కలదానవు (అనగా ఆయాదేవతలు నీవే), సర్వజగద్రూపవు, సంపూర్ణ ఆయుస్స్వరూపవు, నిఖిల చేతన సమూహము నీవే, జీవరాశి ఆయుష్యము నీవే, సకల పాపములను తిరస్కరించెడి తల్లివి నీవు, ప్రణవ ప్రతిపాదితమైన పరమాత్మ స్వరూపవు నీవు. ఇటువంటి అమ్మను గాయత్రిగా సావిత్రిగా సరస్వతిగా త్రికాలములందు నా మనసునందు ఉపాసన చేయుటకు ఆయాదేవతాస్వరూపముగా ఆవాహన చేయుచున్నాను.

ఈ గాయత్రికి గాయత్రి అనే ఛందస్సు, విశ్వామిత్రుడు ఋషి, సూర్యుడు దేవత, ముఖమగ్ని, శిరస్సు బ్రహ్మ, విష్ణువు హృదయము, శిఖ రుద్రుడు, యోని భూమి, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనే పంచప్రాణాత్మికయైనది, దేవదత్త కూర్మ ధనంజయ నాగ కృకరములనెడి ఉపప్రాణములతో కూడినది, శ్వేతవర్ణము కలది, సాంఖ్యాయనుడను ఋషితో సమానమైన గోత్రము కలది, ఇరువది నాలుగు అక్షరములు కలది, ఋగ్యజుస్సామవేదములనెడి మూడు పాదములు కలది, తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము, ఊర్ధ్వ దిశ, అధో దిశ అనే ఆరు దిక్కులు ఉదరముగా కలది, శిక్ష, వ్యాకరణము, కల్పము, నిరుక్త్మము, జ్యోతిషము అనేవి శిరస్సులుగ కలది అగు గాయత్రిని వేదాధ్యయనము కొరకు గురువు వద్ద వినియోగించుచున్నాను.

శ్రీగురుభ్యోనమః

గాయత్రీ వైశిష్ట్యం

యావేదాదిషు గాయత్రీ సర్వవ్యాపీ మహేశ్వరీ
ఋగ్యజుస్సామాధర్వైశ్చ తన్మేమనశ్శివ సంకల్పమస్తు

అన్ని వేదములలో ప్రతిపాదించబడిన గాయత్రి సర్వ మానవుల బుద్ధులయందు మంగళకరములైన సంకల్పములను కలిగించును
(మహన్యాసము)

గాయత్రీం చింతయేద్యస్తు హృత్పద్మే సముపస్థితాం
ధర్మాధర్మ వినిర్ముక్తస్సయాతి పరమాంగతిమ్

గాయత్రిని హృదయములో ఉపాసన చేయువాడు ధర్మాధర్మ విచికిత్స చేత బంధింపబడకుండా మోక్షమును పొందుతాడు
(వేదవ్యాసుడు)

గాయత్రీ వేదజననీ గాయత్రీ లోకపావనీ
న గాయత్య్రాః పరం జప్యం ఏతద్విజ్ఞానముచ్యతే

గాయత్రియే వేదమాత, ముల్లోకవాసులకు జ్ఞానమును ప్రసాదించు పావని. గాయత్రీమంత్ర జపమును మించినది మరొకటి లేదు.
(కూర్మపురాణం)

గాయత్రీంచైవ వేదాంశ్చ తులయో సమతోలయన్వే
దా ఏకత్ర సాంగాస్తు గాయత్రీచైకత స్థితా

నాలుగు వేదములను, ఆరు వేదాంగములను త్రాసు యొక్క ఒక పళ్లెమునందు, గాయత్రీ మంత్రమును రెండవ పళ్లెమునందు ఉంచి తూచినచో గాయత్రి వైపే త్రాసు మొగ్గు చూపును
(యాజ్ఞవల్క్యుడు)

న గాయత్య్రాః పరమ్ మంతం న మాతుః పరదైవతమ్

తల్లిని మించిన దైవము, గాయత్రిని మించిన మంత్రము లేవు
(ఆర్షసూక్తి)

చత్వారో వేదాస్సంగాऽస్యోపనిషదస్సేతిహాసాః సర్వే గాయత్య్రాః ప్రవర్తంతే

వేదము, వేదాంగములు, ఉపనిషత్తులు, ఇతిహాసములు అన్నియు గాయత్రి వలననే ప్రవర్తించును
(గాయత్రీ ఉపనిషత్తు)

గాయత్రీ మాత్రనిష్ఠస్తు కృతకృత్యో భవేద్విజః

ఒక్క గాయత్రీ మంత్రమును ఉపాసించుటచే ఇతర మంత్రముల ప్రమేయము లేకనే ద్విజుడు కృతార్థుడగును.
(గాయత్రీ రహస్యం)

సర్వాత్మనాహి యా దేవీ సర్వభూతేషు సంస్థితా
గాయత్రీ మోక్షహేతుర్వై మోక్షస్థానక లక్షణమ్

సమస్తభూతముల యందు అంతర్యామినియై వర్తించు గాయత్రియే మోక్షస్వరూపము, మోక్షప్రసాదిని అయి ఉన్నది.
(ఋష్యశృంగుడు)

మంత్రము - అర్థము - గురువు - మంత్ర చైతన్యము

మంత్రము శబ్ద విశేషము. దేనిని మననము చేయుటచే పరిత్రాణము కలుగునో అదే మంత్రము. మంత్రములో ప్రతిపాదించబడిన శ్రేష్ఠమైన అర్థమే గురువు. ఈ అర్థము వల్ల కలుగు అనుభవమే చైతన్యము. అదే ఇష్ట దేవత. ఈ విధముగా మంత్రము, గురువు, ఇష్ట దేవతను మూడిటిని ఏకము చేయుటచే మంత్రచైతన్యమగును. చిన్న ఉదాహరణలు రెండు:

చింతపండు అని ఒక మాట ఉంది. ఇదే మంత్రము అనుకుందాం. ఆ పదానికి అర్థం తెలియనంత వరకూ, చింతపండేమిటో మనకు తెలియదు. కాబట్టి అది మృతశబ్దంగానే పరిగణించబడుతుంది. నోటితో లక్షల మార్లు చింతపండు అని పఠించినా దాని గురించి అవగాహన రాదు. తరువాత ఎవరైనా (గురువు) వచ్చి చింతపండు రూపము, రుచి, ఉపయోగాలు మొదలైనవి చక్కగా తెలియజేసినప్పుడు "చింతపండు" అనే దాని అర్థజ్ఞానము మనకు కలుగుతుంది. ఈ అర్థము పేరే గురువు. తరువాత "చింతపండు" అన్నమాట ఉచ్చరించగానే దాని రూపము, దాని పులుపు రసము మొదలైనవి జ్ఞానము మనలో పెల్లుబుకుతుంది. ఇంకెప్పుడైనా సరే చింతపండు అనగానే, దానిని చూడగానే, దాని రుచి మొదలైన వాని జ్ఞానము అనుభవపూర్వకమై వికసించి మన నోరూరుతుంది. అదే చైతన్యము. ఇదే విధముగా అంతటా.

"అమ్మ దయామయి" అన్న పదములు పరిశీలిద్దాం. ఈ పదములు పలుకగానే దయానుభవముతో మన హృదయము నిండిపోయినప్పుడు ఆ దయామయి అన్న పదము యదార్థముగా పలుకబడినదని గ్రహించాలి. మనము అమ్మ అనుచున్నాము కానీ అమ్మ ఎవరో తెలియకున్నాము ఎందుకంటే అమ్మ అనే మాటకు అర్థము తెలియదు. ఈ బాల్యావస్థలో అమ్మ అనునది ఒకరకంగా మృతశబ్దమే. వేరే వ్యక్తి, అనగా గురువు, అమ్మ అనగా పరిపూర్ణ స్నేహమునకు ఆధారమైన జగద్వ్యాపి చైతన్యము, ఆమెయే ఆత్మ అని చెప్పగానే, ఆ గురు కృపచేత అమ్మ అన్న శబ్దం ఉచ్చరించగానే స్నేహఘనమును, చైతన్యమయమైన ఆత్మానుభవము మనలో ఏనాడు పెల్లుబుకుతుందో ఆనాడే మనకు ఆ మాతృ మంత్రము (అమ్మా అని మనము ఉచ్చరించేది) చైతన్యమయమైనదని తెలుసుకుంటాము.

అర్థముననుసరించి అనగా గురువుననుసరించి రసముతోను, భావముతోను మనము రసికులము, భావుకులము అవుతాము. మంత్ర స్తుతిని స్వయంగా, యాంత్రికంగా ఉచ్చరించటం వలన మనకు యథార్థ ఫలము లభించదు. పైన చెప్పబడిన మంత్ర చైతన్యమనెడి వస్తువు లేకపోవటం చేతనే సాధన మార్గము దుర్గమము, అంధకార బంధురముగా తోచును. కాబట్టి ఏ స్తోత్రమైనా, విశిష్ట మంత్ర జపమైనా, నామ సంకీర్తనైనా చేయు వేళ మనము ఆధ్యాత్మిక ప్రగతికి సాయపడే సదర్థము (అనగా గురువును) ఎఱిగి అర్థానురూప భావముతో స్వయం సంవేదితులమగుటకు ప్రయత్నించాలి.

శ్రీగురుభ్యోనమః.

శర్మ-శాస్త్రి-వేదలక్షణాలు-వేదాధ్యయనం

బ్రాహ్మణంలోని పురుషులను సంబోధించేవి శర్మ, శాస్త్రి. పేరు చివరన వీటిని కలిగిన వారు సాధారణంగా బ్రాహ్మణులుగా పరిగణించబడతారు. ఏమిటి వీటికి తేడా?

శర్మ - ఉపనయన సమయంలో కృష్ణాజినం ధరించటం ద్వారా వటువు శర్మ అవుతాడు. కృష్ణాజినానికి మామూలు అర్థం జింకచర్మం అయినప్పటికీ, దానిలో గూడార్థం ఉంది. అది త్రయీ విద్యాస్వరూపమని విశ్వాసం. త్రయీవిద్యా అనగా మూడు వేదములను అభ్యసించటం. జింక చర్మం ధరించినవారు ఈ వేదవిద్యలో ప్రతిష్ఠులై, చిత్తశుద్ధి కలిగి క్రమంగా శర్మ అవుతారు. అనగా శాశ్వతానంద అనుభూతికి యోగ్యులవుతారు. వేదవిద్యలు గురుముఖత నేర్చుకోవలసినవి. ప్రవర, సంకల్పం చెప్పే సమయంలో ఈ శర్మను పేరు చివర జోడించటంలో పరమార్థం ఆ అనందానికే సమస్త కర్మలు, అధ్యయనాలు అని సూచించటానికి, నిరంతరం సాధకులకు గుర్తు చేయటానికి. ఈ వేద విద్యల అధ్యయనం, సంధ్యావందనం మొదలైనవి చేయని వారికి శర్మ అని చెప్పుకునే అర్హత లేదు.

శాస్త్రి - శాస్త్రములు తెలిసినవారు వారు శాస్త్రిగా పిలువబడతారు. ఏమిటా శాస్త్రాలు? ఇవి ఆరు. శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిష్యం, కల్పం. ఈ శాస్త్రాలు కూడా గురుముఖత నేర్చుకోవలసినవి. ఈ శాస్త్రాల అధ్యయానికి ఉపనయనము జరిగి కొంత క్రమశిక్షణ ఏర్పడి, సంధ్యావందనాది నిత్యానుష్ఠానములు చేసే వారు అర్హులు. ఆ ఆరు శాస్త్రాలను షడంగాలు/వేదాంగాలు అంటారు.

ఈ విధంగా శర్మ, శాస్త్రి అన్న సంబోధనలు వచ్చాయి. ఇవి రెండూ కూడా జన్మతో ఆపాదించేవి కాదు, సంస్కారముల తరువాత సాధనతో, అధ్యయనంతో సంపాదించుకోవలసినవి.

వేదాల యొక్క లక్షణాలు ఏమిటి?

మంత్రాల ఓజస్సును, శక్తిని కాపడేవి ఈ లక్షణాలు. వర్ణక్రమం అనే ఓ గొప్ప సాంప్రదాయం ఈ మంత్రాలను సురక్షితం చేశాయి. వేదమంత్రోచ్ఛారణలో ధ్వని, స్థాన,కరణ, ప్రయత్న, మంత్ర, స్వర, దేవతా జాతులనే ఎనిమిది లక్షణాలను సాధకులు పాటించవలసి ఉంటుంది. ఎలా పడితే అలా నేర్చేసుకుని పఠించటం సరైన పద్ధతి కాదు.

అసలు వేదాధ్యయనానికి ఎంత సమయం పడుతుంది?

వేదంలో ఎన్నో శాఖలు. ఒక్కొక్క వేదం నేర్చుకోవటానికి దాదాపుగా 12 సంవత్సరాలు పడుతుంది. అంటే, నాలుగు వేదాలు సరైన పద్ధతిలో నేర్చుకోవాలంటే 48 ఏళ్లు లేదా అంతకు పైగా సమయం పడుతుంది. కాబట్టి వేదాల శాఖలను అధ్యయనం చేసే సాంప్రదాయం వచ్చింది. గతంలో ఈ వేదాధ్యయన సమయంలో శిష్యులు గురుకులంలోనే నివసించేవారు. చాలా మార్లు వంశానుక్రమంగా ఏ శాఖలనైతే అధ్యయనం చేశారో వానినే శిష్యులు ముందుకు కొనసాగించటం ఓ పద్ధతి. శిష్యుని యొక్క సామర్థ్యం, శ్రద్ధాసక్తులను బట్టి వేదాధ్యయన సమయం, ఉత్తీర్ణత అనేవి నిర్ణయించబడతాయి. వాక్శుద్ధి, శుద్ధ అంతఃకరణం కలిగి, పైన చేప్పిన వేదలక్షణాలను పాటించే గురువులవద్దే అధ్యయనం చేయాలి.

ఈ సృష్టిలో బ్రాహ్మణత్వం ఎందుకు వర్ధిల్లాలి?

మానవ జన్మ యొక్క ప్రధాన లక్ష్యం సత్యాన్ని తెలుసుకోవటం, అనగా ఈ విశ్వంలో అణువణువునా నిండి ఉన్న విశ్వజనీన శక్తిలో మనమూ ఒక అణుభాగమని ఎఱిగి దానితో అనుసంధానం చేసుకోవటం. అది తెలిసిన వాడే బ్రాహ్మణుడు. అనితర నిత్య సత్యాన్వేషణ బ్రాహ్మణునికి ఉపాధి, జీవితము, పరమార్థమూను. ఈ సత్యాన్వేషణకే విద్య, ఆధ్యాత్మికత, స్థితప్రజ్ఞత, ఫలాపేక్షలేని జీవన విధానం. మరి సత్యం ఎందుకు కావాలి? మా జీవితమే మాకు సత్యం అని మిగిలిన మూడు వర్ణాల వారు, నాస్తికులు, వితండవాదులు ప్రశ్నించవచ్చు. స్వానుభవంలో విలువైన సమయం గడిచిపోతుంది, మనస్సాక్షి మనలను చాలా సందర్భాలలో తప్పుదారి పట్టిస్తుంది. కారణం? సత్యం కానిది ప్రపంచం. అనాదిగా ఋషిప్రోక్తమైన వేదవాఙ్మయం,అనేక దార్శనికుల అనుభూతుల ద్వారా రచించబడిన పురాణేతిహాసాలు, పెద్దల నడవడిక మనకు అత్యంత సులభమైన మార్గాలను తెలియజేశాయి. ఇవి కాలపరీక్షను తట్టుకున్నవి. ప్రతి ఒక్కరికీ వీటిని తెలుసుకునే సమయం, అవకాశాలు, పరిస్థితులు ఉండటం అసంభవం, ఉన్నా సఫలం కాకపోవచ్చు కూడా. ఎందుకంటే సత్యాన్వేషణకు ఒకరకమైన జీవనశైలి కావాలి, ఎంతో త్యాగం చేయాలి. ప్రతి అడుగులోనూ సత్యాన్ని ఆచరించగలిగే సంకల్పం ఉండాలి. ఇవి బ్రాహ్మణత్వానికి కావలసిన అర్హతలు, నియమావళిలో, శాస్త్రాలలో స్పష్టంగా చెప్పబడ్డాయి. ఒక్కసారి వాటిని గుర్తు చేసుకుందాం:

1. పూర్తిగా సాత్వికమైన ఆహారం
2. ఉపనయన సంస్కారం, త్రికాల సంధ్య
3. వేదాధ్యయనం
4. నిరాడంబరమైన గృహస్థ జీవితం, సంయమనం
5. ఫలాపేక్ష లేని కర్మానుష్ఠానం

పైవి ఎందుకు అన్నవి అనేకమార్లు చెప్పుకున్నాం. ఐదూ కూడా ఒకదానితో మరొకటి ముడిపడి ఉన్నవే. ధర్మానికి మూలము, వెన్నెముక అయిన సత్యాన్ని నిరంతరం తెలుసుకునే ప్రయత్నంలో ఉండే బ్రాహ్మణుని మించిన సమాజ శ్రేయోభిలాషి మరొకడుండడు. అందరు బ్రాహ్మణులు ఇలానే ఉంటారా అని ప్రశ్నించే వారికి సమాధానం ఉండేవాడే, ఆ ప్రయత్నం చేసేవాడే బ్రాహ్మణుడు. సత్యాన్వేషణ ద్వారా ధర్మాచరణ అనేది ప్రతి ఒక్క ఉపాధిలోనూ చాలా ముఖ్యం. అది కొంతైనా పాటించబడుతుంటేనే ఈ మానవ ప్రపంచంలో శాంతి మిగిలేది. లేకపోతే ప్రతిక్షణము అల్లకల్లోలమే. సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించుకునే ధీరత, జ్ఞానం, ప్రశాంతమైన వ్యక్తిత్వం బ్రాహ్మణత్వం ద్వారా సమాజంలో పెంపొందించబడుతుంది, తద్వారా పాలకులకు, ప్రజలకు మార్గదర్శకమవుతుంది.

ఎలాగైతే, ఒక బిడ్డకు తల్లి తండ్రి ఇద్దరి ఆలంబన కావాలో, ఎలాగైతే ఒక చెట్టుకు ఎండ గాలి నీరు కావాలో, ఎలాగైతే ప్రకృతిలో పంచభూతాలు సృష్టి క్రమానికి అవసరమో, అలాగే సమాజంలో సత్యాన్వేషకుడు, ధర్మపరాయణుడు, సత్యబోధకుడు అయిన బ్రాహ్మణుడు ముమ్మాటికీ కావాలి. అందుకే బ్రాహ్మణత్వం వర్ధిల్లాలి.

సాంగోపాంగ సంధ్యావందనం - ఎందుకు?


ఉద్యంతమస్తంయంతమాదిత్యమభిధ్యాయన్ కుర్వణ్ బ్రాహ్మణో విద్వాన్ సకల భద్రమశ్నుతేऽసావాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవసన్ బ్రహ్మాప్యేతి య ఏవం వేద

ప్రొద్దున సూర్యుడుదయించుటకు ముందు, సాయంకాలము సూర్యుడస్తమించుటకు ముందు, సూర్యమండలమందు బ్రహ్మరుద్రవిష్ణు రూపములతో వెలయుచున్న పరబ్రహ్మచైతన్య స్వరూపిణి యగు సంధ్యాదేవతను ద్విజుడు అసావాదిత్యో బ్రహ్మ+సాऽహమస్మి అనే మంత్రములతో సంధ్యాదేవతను నేనే అనుకొనుచు ధ్యానింపవలెను. దానికి ముందు ఆ మంత్రముల యొక్క అర్థము చక్కగా తెలిసికొని, ఆ అర్థమును ఆ ధ్యానములో భావింపవలెను. ఈ విధముగా సంధ్యాదేవతను ధ్యానము చేసినచో బ్రాహ్మణుడు బ్రహ్మ జ్ఞానమును పొందును.

ఎలా?

బ్రహ్మైవసన్ బ్రహ్మాప్యేతి అన్న మంత్రములో దీనికి సమాధానం ఉంది. మానవుడు వాస్తవములో తాను పరబ్రహ్మయే అయియున్నను మాయచేత (అజ్ఞానమే మాయ) తాను జీవుడని దృఢమైన భ్రాంతిలో యుంటాడు. కానీ, సంధ్యాధ్యాన మంత్రము యొక్క అర్థము చక్కగా తెలుసుకొన్నచో ఆ అజ్ఞానము సగము తొలగి పోవును. ధ్యానము చేయగా చేయగా ఆ అజ్ఞానము పోయి, తాను పరబ్రహ్మ స్వరూపుడనే దృఢమైన జ్ఞానం కలిగి, తద్వారా మరింత తీవ్రముగా ధ్యానము చేయగా పరిపూర్ణ శుద్ధ అంతఃకరణముతో ఏదో ఒకనాడు పూర్వపుణ్యపరిపక్వము చేత హఠాత్తుగా బ్రహ్మసాక్షాత్కారము కలుగును. అదే జీవబ్రహ్మైక్యము అనగా మరుజన్మ లేని మోక్షం.

అసావాదిత్యో బ్రహ్మ సాऽహమస్మి అన్న మంత్రములో అసౌ+ఆదిత్యః, బ్రహ్మ, సా+అహం+అస్మి అన్న ఆరు పదముల యొక్క అర్థం తెలుసుకున్నందువలన తప్పక అజ్ఞానము తొలగి పోవును. మన అంతఃకరణము అనేకానేక పూర్వజన్మలలో చేసిన పాపములతో నిండియుంది కాబట్టి ధ్యానములో ఏకాగ్రత, మంత్ర భావము గోచరించుట కష్టం. అందుకే అంతఃకరణములోని పాపాలు పోవుటకు సంధ్యాదేవత ఉపాసనలో ధ్యానమునకు ముందు తరువాత ఆంగిక కర్మలను ప్రతిపాదించారు. దీనినే సాంగోపాంగ సంధ్యావందనమంటారు. దీని ప్రధాన ఉద్దేశం మన పాపములను తొలగించుకొని అంతఃకరణమును శుద్ధి చేసుకొనుట, తద్వారా సంధ్యాదేవత ధ్యానమును సాఫల్యము చేసుకొనుట, జీవబ్రహ్మైక్యము సాధించుట.

ఈ సాంగోపాంగములు రెండు రకాలు 1. పూర్వాంగములు 2. ఉత్తరాంగములు.

పూర్వాంగములు ఐదు 1. ప్రథమ మార్జనము 2. అబ్భక్షణము 3. పునర్మార్జనము 4. పాపపురుషదహనము 5. అర్ఘ్య ప్రక్షేపము.

పూర్వాంగ  కర్మల వివరాలు
-----------------------------------

సంధ్యావందనములో సంధ్యాదేవత ఉపాసన ముందు వెనుకల చేయబడే కర్మలను అంగములంటారు. ముందు చేయబడేవి పూర్వాంగములు, తరువాత చేయబడేవి ఉత్తరాంగములు. పూర్వాంగములు అయిదు 1. ప్రథ మార్జనము 2. అబ్భక్షణము (మంత్రాచమనము) 3. పునర్మార్జనము 4. పాపపురుష దహనము 5. అర్ఘ్య ప్రక్షేపము

1. ప్రథమ మార్జనము - ఓం ఆపో హి ష్ఠా మయో భువః తా న ఊర్జే దధాతన మొదలైన మంత్రములు చెప్పుచు తలమీద నీళ్లు చల్లుకొనుట. దీని వలన రజస్తమోగుణములచేత చేసిన పాపములము చాలామటుకు తొలగి పోవును.

2. అబ్భక్షణము (మంత్రాచమనము) - సూర్యశ్చ మామన్యుశ్చ మొదలైన మంత్రములచేత అభిమంత్రించిన జలమును త్రాగుట వలన లోపల సూక్ష్మ శరీరము చేత చేసిన పాపములు నాశనమగును.

3. ద్వితీయ మార్జనము - ఈ రెండవసారి చేయు మార్జనము చేత వెలుపలి శరీరము పూర్తిగా శుద్ధమగును.

4. పాపపురుష దహనము - లోపలి సూక్ష్మ శరీరములోని పాపములను ఒక పురుషాకృతితో వెలుపలకు తెచ్చి ఆ పాపపురుషుని దహించి వేయుట ఈ కర్మ. దీనిచేత లోని పాపములు నశించిపోవును.

5. అర్ఘ్య ప్రక్షేపము - ఈ విధముగా, లోపల మరియు బయట శుద్ధుడై మందేహ రాక్షసులతో సూర్యునకు కలిగిన యుద్ధోపద్రవమును పోగొట్టుటకు మూడు మార్లు అర్ఘ్యములు విడువవలెను. గాయత్రీ మంత్రము చేత అభిమంత్రించుట వలన బ్రహ్మాస్త్రముతో సమానమైన అర్ఘ్యములు ఆ రాక్షస నాశనము చేయగా సూర్యుని ఉపద్రవము తీరి సూర్యుడు స్వస్థ్యుడగును.

(మందేహారుణులు బ్రహ్మనుగూర్చి తపము ఆచరించి సూర్యునితో పోరాడునట్లు వరము పొందినవారు. వీరి సంహారార్థము త్రిసంధ్యలయందును బ్రాహ్మణులు గాయత్రిచే అభిమంత్రించిన అస్త్రములను అర్ఘ్యమూలముగా విడుతురు. వారు ఆయస్త్రములచేత సంహరింపబడినా వరదానమహిమచే పునర్జీవితులు అగుదురు)

తరువాత ప్రదక్షిణాచమనములు చేసి ఆ విధముగా స్వస్థమైన సూర్యమండలము లోపల హంసవాహన బ్రహ్మరూపముతోను, మధ్యాహ్న సమయమున వృషభవాహన రుద్రరూపముతోను, సాయంకాల సమయమున గరుడవాహన విష్ణు రూపముతోను, స్త్రీయాకారముతో వెలసే బ్రహ్మచైతన్య స్వరూపిణి యగు సంధ్యాదేవతను "అసావాదిత్యో బ్రహ్మ సऽహమస్మి" అనే మంత్రములతో మంత్రార్థమును బాగా భావన చేసుకొనుచు, ధ్యానించవలెను. ఈ ధ్యానమునే ఉపాసన అందురు. సంధ్యాదేవత పరబ్రహ్మస్వరూపిణి కనుక ఈ ధ్యానము బ్రహ్మ ధ్యానమగును. ఇది బ్రహ్మ ధ్యానము కాబట్టే ఈ ధ్యానము వలన బ్రహ్మజ్ఞానము కలిగి పరబ్రహ్మ సాక్షాత్కారమగును.

ఇక్కడ విశేషమేమిటంటే, ప్రతి కర్మలోని మంత్రానికి ఒక ఋషి, దేవత, ఛందస్సు, ఆ కర్మ యొక్క వివరములు కలిగిన వినియోగమును ముందు పఠించటం.

తొలుత మార్జన మంత్రానికి "ఆపోహిష్ఠేతి త్యచస్సాంబరీషః సింధుద్వీపఋషిః ఆపోదేవతా గాయత్రీ ఛందః మార్జనే వినియోగః: అన్నది,

తరువాత మంత్రాచనమునకు "సూర్యశ్చేతస్య మంత్రస్య యాజ్ఞవల్క్య ఉపనిషద్ ఋషిః సూర్యమన్యు మన్యుపతిరాత్రయో దేవతాః ప్రకృతిశ్ఛందః మంత్రాచమనే వినియోగః" అన్నది,

తరువాత పునర్మార్జనమునకు "ఆపోహిష్ఠేతి నవర్చస్య సూక్తస్య సింధుద్వీపో అంబరీషో వా ఋషిః ఆపో దేవతా గాయత్రీ ఛందః ద్వనుష్ఠుబంతం పంచమీ వర్ధమానా సప్తమీ ప్రతిష్ఠా అంతే ద్వే అనుష్టుభౌ మార్జనే వినియోగః" అన్నది,

తరువాత పాపపురుష దహనమునకు "ఋతంచ సత్యంచేత్యస్య మంత్రస్య అఘమర్షణ ఋషిః భావవృత్తో దేవతా అనుష్టుప్ ఛందః మమ పాపపురుష జల విసర్జనే వినియోగః" అన్నది,

తదుపరి అర్ఘ్యప్రదానానికి "ఓం తత్సవితురిత్యస్య మంత్రస్య గాధిపుత్రో విశ్వామిత్ర ఋషిః సవితా దేవతా గాయత్రీ ఛందః ప్రాతః సంధ్యార్ఘ్య ప్రదానే వినియోగః"

అని వినియోగాలు ఋషులు, దేవతలు కర్మలతో స్పష్టంగా నిర్వచించబడ్డాయి. ఈ ఋషులు, మంత్రాలు ఆయా వేద శాఖలను బట్టి, ప్రాతః, మధ్యాహ్న, సాయం సంధ్యా కర్మ సమయమును బట్టి మారతాయి. ఉదాహరణకు నేను మాది ఋగ్వేదం కాబట్టి ఋగ్వేద మంత్రాలను ప్రస్తావించాను.

వీటి అర్థం ఏమిటి? నిత్యము - ఋషిప్రోక్తమైన మంత్రములను ఆయా దేవతలను తలచుకుంటూ, మనలను మనం శుద్ధి చేసుకుని ఉపాసనకు సిద్ధం చేసుకోవటమే. ఈ విధంగా, సంధ్యోపాసనలో మంత్రార్థము గ్రహించి, సాంగోపాసనలోని పూర్వభాగ కర్మలను శుచిగా అనుష్ఠించటం వలన మనలోని అంతర్బహి పాపములను తొలగించుకొని, సూర్యమండలమున సంధ్యాదేవతను ఉపాసన చేయటంతో బ్రహ్మజ్ఞాన ప్రాప్తి, పరబ్రహ్మ సాక్షాత్కారమునకు అర్హత కలుగుతుంది.

ఉత్తరాంగ కర్మల వివరాలు
----------------------------------

సంధ్యాదేవి ధ్యానము తరువాత పాపనివృత్తి కొరకు, దేవతల అనుగ్రహము కొరకు ఉత్తరాంగములను ఆచరించవలెను. ఇవి ఐదు.

1. గాయత్రీ జపము 2. సూర్యోపస్థానము 3. దిగ్దేవతా నమస్కారము 4. భూమ్యాకాశ వందనము 5. అభివాదనము.

1. గాయత్రీ మంత్ర జపము
====================

గాయత్రీ మంత్రమంతటి గొప్ప మంత్రం ఇంకొకటి లేదు అని అనేక శ్రుతి స్మృతి పురాణములు చెప్పుచున్నవి. ఈ గాయత్రీ మంత్ర జపంచేత పంచమహా పాతకములు కూడా పోతాయని శాస్త్రములు చెప్పుచున్నాయి. పగటి పాపములను పగలే, రాత్రి పాపములు రాత్రియే పోతాయని గాయత్రీ హృదయమే చెప్పుచున్నది. గాయత్రీ మాత సంధ్యాదేవతకు ప్రధానమంత్రిణి వంటిది. గాయత్రీదేవి ప్రసన్నురాలైనచో సంధ్యాదేవత శీఘ్రముగా ప్రసన్నురాలగును. బ్రహ్మవిష్ణు శివాత్మాత్మకమైన గాయత్రీ ధ్యానము అత్యంత శ్రేష్ఠము, సమస్త పాపహరణము.

ఈ గాయత్రీమంత్ర జపం అంగన్యాస కరన్యాసములతో 24 అక్షరాలకు 24 ముద్రలతో అనుస్ఠానం చేసే అద్భుతమైన ఆధ్యాత్మిక సంపత్తిగా మనకు ఋషులు అందించారు. న్యాసము చేసేటప్పుడు బ్రహ్మాది దేవతలను తలచుకొనుచు మన దేహములో ఆ శక్తిని ఆయ స్థానములలో ఉంచి జపం చేస్తే వచ్చే ఫలితాలు అనుభవైకవేద్యం. బ్రహ్మచేత గ్రహింపబడిన ఋగ్యజుస్సామవేదములనే మూడు వేదములను మూడు పాదములుగా జేచి త్రిపాద గాయత్రీ మంత్రము కూర్చబడింది. అందుకే గాయత్రీ మంత్రము మూడు వేదముల సారము, గాయత్రీ మాత వేదమాతగా శ్రుతులు చెబుతున్నాయి.

గాయత్రీ మంత్రార్థమేమిటి? ఏ సూర్యుడైతే మా బుద్ధులను ప్రచోదనము చేయునో, ప్రకాశించేవాడైన ఆ సూయుని యొక్క శ్రేష్ఠమైన తేజస్సును ధ్యానము చేసెదము.అనగా, ప్రత్యక్ష దైవమైన సూర్యుని మన బుద్ధిని ప్రేరేపించుటకు ధ్యానించి మనలను సరైన మార్గమును అనుసరించేలా కోరుకోవటం.

2. సూర్యోపస్థానం
=============

మిత్రస్య చర్షణీ (ప్రాతః సంధ్యలో) అన్న మంత్రములతో కూడినది సూర్యోపస్థానము.

ఇది సూర్యదేవుని స్తుతి. ఇందులో సూర్యుని మహిమ అపారముగా వర్ణించబడింది. సూర్యమండలములో సంధ్యాదేవతను ఉపాసించుచున్నాము కాబట్టి సూర్యుని అనుగ్రహము వలన సంధ్యాదేవత అనుగ్రహము కలుగును. సూర్యుడు ప్రత్యక్ష దైవము, కర్మసాక్షి. ఈ ఉపస్థానము వలన ఆరోగ్యము, ఆయుష్యము, పాపనాశనము, అంతఃకరణశుద్ధి మొదలైన ఉత్తమ ఫలములు కలుగును.

3. దిగ్దేవతా నమస్కారము
===================

ఓ నమః ప్రాచ్యై దిశే యాశ్చ దేవతా ఏతస్యాం ప్రతివసంత్యే తాభ్యశ్చ నమో నమః అని తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తర,ఊర్ధ్వ, అధో దిక్కులలో ఉన్న దేవతలకు, గంగ, యమున నదుల మధ్య నుండే నిర్మలమైన మనస్సు గలవారికి, మునులకు, సావిత్రికి, గాయత్రికి, సరస్వతికి, సకల దేవతలకు ఋషులకు, మునులకు, గురువులకు, పితృదేవతలకు నమస్కారములు సమర్పించి మన ఆయుష్షును పెంచేవారికి కృతజ్ఞత తెలుపుకోవటం ఈ దిగ్దేవతా నమస్కారములు.

దిగ్దేవతలకు, దిక్పతులకు భక్తి శ్రద్ధలతో నమస్కరించటం వలన సాధకుడు వారి అనుగ్రహానికి పాత్రుడవుతాడు. ఇంద్రుడు, యముడు, వరుణుడు మొదలగు దిక్పతులు గొప్ప బ్రహ్మవేత్తలు. వీరి అనుగ్రహము వలన అంతఃకరణము శుద్ధమై శీఘ్రముగా బ్రహ్మజ్ఞానము కలుగును.

4. భూమ్యాకాశవందనము
===================

ఇదం ద్యావా పృథివీ సత్యమస్తు అనే మంత్రముతో పితృమాతృ వందనం చేస్తాము. సమస్త ప్రాణులకు భూమ్యాకాశములు తల్లిదండ్రులు. వీరి అనుగ్రహము వలన సుఖజీవనము కలుగును. సుఖమయమైన జీవితముంటేనే కదా సంధ్యోపాసనాది కర్మలను శాంతమైన మనసుతో చేయగలిగేది. అందుకే ఆ జనని పృథివికి, జనకుడు ఆకాశునికి మన కృత్జతలు తెలియజేసుకుంటాము.

5. అభివాదనము
=============

చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవంతు అనే వాక్యములు అభివాదనము. దీనిలో తొలుత సమస్తమైన వారియొక్క క్షేమమును కోరుకుంటాము. సర్వేజనాస్సుఖినోభవంతు అన్నది మన భారతీయ సత్సాంప్రదాయం. ఆ విధంగా అభివాదములో మన గోత్రమును స్థాపించిన మహర్షులను, మన వేదమును, వేదశాఖను, మన సూత్రకర్తయగు మహర్షిని భక్తిశ్రద్ధలతో తలచుకుంటాము. ఇలా చేయటం వలన మన మహోన్నతమైన పరంపర జ్ఞాపకమునకు వచ్చి మనకు ఉత్సాహము కలుగును. ఆ తరువాతా ఆ బ్రహ్మలోకాదాశేషాత్ అనే శ్లోకాన్ని పఠిస్తాము. పదునాలుగు లోకములలోనున్న దేవతలకు, బ్రాహ్మణులకు నమస్కరిస్తాము.

ఈ విధంగా పూర్వాంగ ఉత్తరాంగ కర్మలతో కూడిన సంధ్యోపాసన ద్వారా వేద సారమును గ్రహించే అర్హతను పొంది, నిరంతర గాయత్రీ మంత్రానుష్ఠానము ద్వారా సంధ్యాదేవత అనుగ్రహము పొంది, సమస్త దేవతల అనుగ్రహము పొంది బ్రహ్మజ్ఞాన ప్రాప్తి కలుగుతుంది. అందుకే సంధ్యోపాసన అత్యంత ఆవశ్యకమైనది.

శ్రీగురుభ్యోనమః

(తైత్తరీయ బ్రాహ్మణము, ఇతర మూలాల నుండి సారం)