29, డిసెంబర్ 2015, మంగళవారం

కైలాసగిరి నుండి కాశికై - దేవులపల్లి వారి శివ భక్తి గీతం


కైలాసగిరి నుండి కాశికై
కాశికాపురి నుండి దాసికై
దాసికై ఈ దక్షవాటికై దయచేసినావయా 
హర హర హర హర హర హర హర హర హర హర హర హర హర హర హర హర

విరిసె జాబిలి మల్లెరేఖగా కురిసె తేనియల మువ్వాకగా
దరిసి నీ దయ నిండు గోదావరీ నది ఝరులాయెరా 
హర హర హర హర హర హర హర హర హర హర హర హర హర హర హర హర

ముక్కోటి దేవతల నేతరా ముల్లోకముల కిష్టదాతరా
వెలిబూది పూతరా నలవిసపు మేతరా 
హర హర హర హర హర హర హర హర హర హర హర హర హర హర హర హర

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి మరో శివ భక్తి గీతం ఇది. ద్రాక్షారామంలోని భీమేశ్వరుడిపై రాసినట్లుగా చెబుతారు.ద్రాక్షారామ క్షేత్రం దక్షవాటిక అని పురాణాలలో చెప్పబడింది. పంచారమాలలో ప్రముఖమైనది ద్రాక్షారామం. వేల ఏళ్ల క్రితం నిర్మించబడిన ఈ క్షేత్రం దక్ష వాటిక అని నమ్మకం. భీమేశ్వరుడు మాణిక్యాంబతో కూడి వెలసిన క్షేత్రం ఇది. కాకినాడకు సమీపంలో ఉంటుంది ఈ క్షేత్రం. దేవులపల్లివారి స్వస్థలమక్కడి దగ్గరలోని పిఠాపురం.

దేవులపల్లివారి సాహిత్యంలో లాలిత్యంతో పాటు తెలుగుదనం నిండి విలక్షణంగా ఉంటుంది. తెలియని వారు ఆయన రాసిన గీతలాను వినగానే ఇది దేవులపల్లివారిదా అని అడుగుతారు. దానికి కారణం ఆయన గీతంలో కనబరచే భక్తితో పాటు ప్రత్యేకమైన పదప్రయోగం. దేవులపల్లి వారి శివ రచనలలో తప్పకుండా శివుని శిరసున ఉన్న చంద్రుని, ఒంటిన విభూతి, కంఠంలో గరళము మొదలైన భౌతిక లక్షణాలలో ఒక్కటైనా తప్పకుండా ప్రస్తావన చేస్తారు. శివుడు దయాసముద్రుడు. ప్రార్థన చేసినంతనే కరగిపోయే భక్తవశంకరుడు.

గౌతమముని ప్రార్థనతో శిరసునున్న గంగమ్మను గోదావరిగా శివుడు భువిపైకి పంపాడని శివపురాణం చెబుతుంది. ఆ పరమశివుని దయారూపమైన గోదావరి నది పరవళ్లను పాపికొండల వద్ద చూడవచ్చు. అందుకే గోదావరి నది ఒడ్డున, సమీపాన అనేక శైవ క్షేత్రాలు వెలిసాయి. కృష్ణశాస్త్రి గారి ఇతర భక్తి గీతాలలో లాగనే ఇందులో కూడా తెలుగుదనం ఉట్టిపడే పదప్రయోగం చేశారు.వెలిబూది, నలవిసం వంటి అరుదైన తెలుగు పదాలతో ఈ పాటకు ప్రాణం పోశారు దేవులపల్లి వారు. 1970వ దశకంతో ఆకాశవాణి హైదరాబాద్ మరియు విజయవాడ కేంద్రాల ద్వారా భక్తిరంజని కార్యక్రమంలో దేవులపల్లి వారి గీతాలు ప్రసారమయ్యేవి. అందులో ఈ కైలాసగిరి నుండి ఒకటి. పాలగుమ్మి విశ్వనాథం గారి సంగీతంలో వెలువడిన ఈ గీతం ఎంతో ప్రాచుర్యం పొందింది.

(పైన ఇచ్చిన లింకులో మూడవ నిమిషం వద్ద ఈ పాట మొదలవుతుంది)

24, డిసెంబర్ 2015, గురువారం

వేణు గానమ్ము వినిపించెనే - ఆచార్య ఆత్రేయ గీతం


వేణు గానమ్ము వినిపించెనే చిన్ని కృష్ణయ్య కనిపించడే

దోర వయసున్న కన్నియల హృదయాలను 
దోచుకున్నాడని విన్నాను చాడీలను
అంత మొనగాడటే వట్టి  కథలేనటే ఏది కనబడితే నిలవేసి అడగాలి వానినే

మన్ను తిన్నావని యశోదమ్మ అడిగిందటా
లేదు లేదనుచు లోకాలు చూపాడట
అంత మొనగాడటే వింత కథలేనటే ఏది కనబడితే కనులారా చూడాలి వానినే

దుడుకు కృష్ణయ్య మడుగులోన దూకాడట
జడిసి రేపల్లె ప్రజలంతా మూగారట
ఘల్లు ఘల్ఘల్లన ఒళ్లు ఝల్ఝల్లన తాను ఫణిరాజు పడగపై తారంగమాడేనట

కృష్ణునిపై రాయబడిన ప్రతిపాటలోనూ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే, ఆయన చూపిన లీలలను ఆయా విధముగా అనుభూతి చెంది రాసిన విలక్షణమైన ఆవిష్కరణలు అవి. హే కృష్ణా ముకుందా మురారీ అని సముద్రాల రాఘవాచార్యులు వారి రాస్తే అందులో లీలలను భక్తితో వర్ణించారు. అలాగే హే కృష్ణా యదుభూషణా అని  కొసరాజు గారి రాస్తే అది ఒక బ్రాహ్మణునికి కృష్ణునిపై గల సర్వస్య శరణాగతితో కూడిన భక్తికి ప్రతీకగా నిలిచింది. ఎన్నాళ్లని నా కన్నులు కాయగ ఎదురు చూతురా గోపాలా అని శాంతకుమారి పాడిన ఆత్రేయ గారి గీతం శ్రీనివాసునికై ఎదురు చూసే వకుళమాత అనన్యమైన కృష్ణుని భక్తిని సూచిస్తుంది. అలాగే, తెలవార వచ్చే తెలియక నా సామి అని మల్లాది రామకృష్ణ శాస్త్రిగారి రాసిన గీతం బాలకృష్ణుని నిద్దురలేపే తల్లి యశోదమ్మ ప్రేమకు ప్రతీకగా శాశ్వతమైంది. ఇలా ఎన్నో సినీ గీతాలు కృష్ణ భక్తి సామ్రాజ్యంలో ప్రకాశిస్తునే ఉన్నాయి. కృష్ణభక్తిలో సింహ భాగం రాధ-గోపికలదే. ఎందుకంటే వారందరూ నేను అన్న భావనను మరచి స్వామిని ఆరాధించి తరించిన వారు. వారు సామాన్యమైన స్త్రీపురుష సంబంధాలకు అతీతమైన వారు. పరమపురుషుని హృదయాన నిలుపుకొని రమించి ముక్తులైన వారు. అందుకే వారితో స్వామి రాసలీలాడినా,చీరలు దోచినా, వెన్న దొంగిలించి తిన్నా,అన్ని పవిత్రమైన లీలలగానే నిలిచాయి.

అటువంటి ముగ్గురు గోపికల మనసును ప్రతింబించేదే ఈ వేణుగానమ్ము వినిపించెనే అన్న గీతం. ముగ్గురు అక్కచెల్లెళ్ల మీద చిత్రీకరించిన ఈ గీతాన్ని సిరిసంపదలు అన్న చిత్రానికి ఆచార్య ఆత్రేయ గారు రచించారు. శ్రీకృష్ణుని లీలలను చిలిపిగా వర్ణించి ప్రశ్నించే ఈ గీతంలో సోదరీమణులుగా సావిత్రి, వాసంతి, గిరిజ నటించారు. అద్భుతమైన అభినయ కౌశలాన్ని ప్రదర్శించారు. సావిత్రి గారి సినీ జీవితంలో ఈ చిత్రం ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. నాయకునిగా ఏఎన్నార్, ప్రధాన నాయికగా సావిత్రి నాటి సామాజిక పరిస్థితులను, విద్యావంతుల ఆలోచనలకు అద్దం పట్టారు.

ఇక గీతానికి వస్తే, మధురమైన వేణుగానం కృష్ణ ప్రేమకు ప్రతిబింబం. ఆ గానం వినిపిస్తోంది కానీ కృష్ణుడు కనిపించటం లేదు అని గోపికలు ప్రశ్నించే సందర్భాన్ని గుర్తు చేసుకుంటున్నారు నాయికలు. కృష్ణుడి జీవితంలో లీలలు ఎనలేనన్ని అయినా, ఆత్రేయ గారు గోపికల మనసులు దోచుకోవటం, మన్ను తిన్న నోట విశ్వాన్ని తల్లికి చూపించటం, కాళీయ మర్దనం అనే మూడు ఘట్టాలను తీసుకున్నారు. వీటికి భాగవతంలో కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. దేహము వలననే మనకు నేను అన్న భావనతో మాయలో చిక్కుకుంటాము. గోపికలు ఈ భావనను తొలగించటానికే వారి వస్త్రాలను దొంగిలించి తిరిగి యిచ్చాడు కృష్ణుడు. నా బిడ్డ అన్న మాయలో గారాబంగా పెంచుతున్న యశోదకు విశ్వాన్ని చూపించి మాయను తొలగించాడు. లోకరక్షణకై కాళీయుని పొగరణచటానికి అతని తలపై ఎక్కి నాట్యం చేశాడు.ఇవన్నీ అద్భుతమైన లీలలు. ఈ విధంగా కృష్ణుని లీలావినోదంలో గోపకులమంతా మాయనుండి దూరం చేసి తనతో అనుసంధానం చేశాడు. ఈ లీలలను ఆత్రేయ గారు అద్భుతమైన పదజాలంతో వర్ణించారు. చిలిపిగా కృష్ణుని లీలలను ప్రశ్నించే రీతిలో సాగుతుంది ఈ గీతం. ఇన్ని చేష్టలు నిజంగా చేశాడా లేక ఉట్టి కథలేనా అని నాయికలు ప్రశ్నిస్తున్నట్లుగా అనిపించినా వారి హృదయాలలో ఆరాధనా భావం ఉందని అభినయంలో కనబరచారు. ముఖ్యంగా సావిత్రిగారి నటన ఈ పాటల ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆవిడ మహానటి అని ఎందుకన్నారో ఈ పాటలో ఓ గోపిక భావంతో ఆమె నటించి తీరు చూస్తే అర్థమవుతుంది.


ఈ పాటలోని కొన్ని అచ్చతెలుగు పదాలను గమనించండి - దోర వయసు,చాడీలు,తారంగం, ఘల్లు ఘల్లు, ఝల్లు ఝల్లు. ఈ పదాలే పాటకు ఆయువు పట్టు. కృష్ణుని చేష్టలకు గోపికలు యశోదమ్మకు చేసిన ఫిర్యాదులు ఎన్నో, చెప్పుకున్న చాడీలు ఎన్నో. వాటన్నిటిలో కన్నె మనసుల హృదయాలను దోచుకోవటం గురించి చెప్పటం గోకులం యొక్క వైభవాన్ని చాటుతుంది. తారంగమనేది చేతులతో చేసే విన్యాసం. కాళింది మడుగులో విషం చిమ్ముతున్న కాళీయుని పడగలపై నాట్యం చేస్తూ చేతులు తిప్పే కృష్ణుని లీలను తారంగమంటారు. దీనిని చిన్నపిల్లలకు తల్లులు చేసి వారిని ఆడించే సాప్రదాయం దక్షిణ భారత దేశంలో, ముఖ్యంగా తెలుగుజాతిలో ఉంది. కృష్ణుడు వేసే పద విన్యాసానికి తెలుగు భాష ఇచ్చిన అందమైన జంట పదం ఘల్లు ఘల్లు. అలాగే ఆనందంలో ఒళ్లు పులకరించటానికి ఝల్లు-ఝల్లున అనే జంట పదం. భాషకు ఆయువు పట్టు భావంతో పాటు, శబ్దము. కృష్ణుని తారంగం ఘల్లు-ఘల్లున చేస్తున్నాడు అనగానే ఆ బాలకృష్ణుని రూపము, ఆయన వేసే వ్యత్యస్త పాదములు, కాళ్లకు గజ్జలు కళ్ల ముందు నిలుస్తాయి. ఆత్రేయగారు వీటిని ఉపయోగించి గీతాన్ని శాశ్వతం చేశారు. కృష్ణ భక్తిలో నేనుకు తావిలేదు. అందుకే కృష్ణప్రాప్తి కలిగిన వారికి వేరేమీ అక్కరలేదు. ఎన్ని ఉన్నా అన్నిటికీ దూరమే. ప్రభువొక్కడే కావలసింది.

ఈ గీతానికి ఇంకో విశేషమేమిటంటే ముగ్గురు మేటి గాయనీమణులు కలిసిన పాడిన గీతం ఇది. సావిత్రి గారికి సుశీలమ్మ, వాసంతి గారికి జానకమ్మ, గిరిజ గారికి జిక్కి కృష్ణవేణి గారు మాధుర్య భరితమైన, విలక్షణమైన గానాన్ని అందించారు. మాష్టరు వేణు గారు మధుర్య ప్రధానమైన సంగీతానికి మరోపేరు. ఆయన ఇచ్చిన సంగీతం, ముగ్గురమ్మల గాత్రం, ముగ్గురు నటీమణుల నటనా చాతుర్యం ఈ గీతానికి ప్రత్యేకతనిచ్చాయి. ఇన్నేళ్లైన, ఎన్నిమార్లు విన్నా ఈ పాట వింటే అబ్బ ఎంత బాగుంది అనిపిస్తుంది.

ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. 

11, డిసెంబర్ 2015, శుక్రవారం

ఎందుకయా సాంబశివా - దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి శివభక్తి గీతం


ఎందుకయా సాంబశివా ఎవరు నీకు చెప్పేరయ

ఈ అల్లరి చేతలు ఈ బూడిత పూతలు ఎందుకయా సాంబశివా ఎవరు నీకు చెప్పేరయ సాంబశివా సాంబశివా సాంబశివా

అలలతోటి గంగ పట్టి తలపాగా చుట్టి
నెలవంకను మల్లెపూవు కలికి తురాయిగ పెట్టి
ఎందుకయా సాంబశివా ఎవరు నీకు చెప్పేరయ సాంబశివా సాంబశివా సాంబశివా

తోలు గట్టి పటకాగా కాలాగ్నిని కుట్టి
కేల త్రిశూలము పట్టి ఫాలమందు కీల పెట్టి
ఎందుకయా సాంబశివా ఎవరు నీకు చెప్పేరయ సాంబశివా సాంబశివా సాంబశివా

రుద్రుడవో కారుణ్య సముద్రుడవో హర హర హర
ఎందుకయా ఈ దాసునికందవయా దయామయా
ఎందుకయా సాంబశివా ఎవరు నీకు చెప్పేరయ సాంబశివా సాంబశివా సాంబశివా



లలితమైన భక్తి గీతాల ప్రపంచంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిది అగ్రస్థానమని చెప్పుకోవాలి. ఎందుకంటే, తెలుగు భాషలో ఆయన ఉపయోగించిన పదాలు, కనబరచిన భావ సౌందర్యం ఎవ్వరికీ అందనంత స్థాయిలో ఉంటాయి. ఆయన భక్తి గీతాలలో కనుమరుగవుతున్న పదాలు చెక్కుచెదరకుండా ప్రకాశిస్తుంటాయి. పదములె చాలు రామా అని ఆయన రాస్తే అది రాముని పాదాలను తాకిన ఒక సువర్ణ పుష్పంలా సాఫల్యాన్ని పొందింది. ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు అని రాస్తే అది ఆ శ్రీహరి మెడలోని తులసి మాలలా రాజిల్లింది. ఏమి రామకథ శబరి శబరి అని రాస్తే, రామకథా సుధ యొక్క మాధుర్యాన్ని ఇప్పటికీ మనకు అందిస్తూనే ఉంది. అలాగే, కొలువైతివా రంగశాయి అని రచించితే ఆ శ్రీరంగ శాయి వైభవాన్ని మన కళ్లముందుంచుతుంది.

అలాగే, శివునిపై ఆయన ఎన్నో భక్తి గీతాలు రచించారు. ఆయన భక్తి సాహిత్య సంపదంతా ఆకాశవాణి ద్వారా, తెలుగు చలనచిత్రాల ద్వారా మనకు అందాయి. ఆ శివభక్తి గీతాలలో ఒకటి ఎందుకయా సాంబశివా.

శివతత్త్వం గమనిస్తే మొదట నిజంగానే అల్లరి చేష్టల లాగా అనిపిస్తుంది. కానీ, లయకారునికి కావలసిన లక్షణాలలో అదొకటి. మంచిని చెడును వైవిధ్యంగా కనబరుస్తూనే ప్రళయకాలంలో వాటి అతీతంగా ఉండటం, బూడిద పూతలు, నృత్యాలు, వేషభూషలు శివతత్త్వాన్ని కొంత సంశ్లిష్టంగా చేసినట్లు అనిపించినా శివుడు బోళాశంకరుడు. భక్తితో చెంబెడు నీళ్లు పోసినా, ఒక్క మారేడు దళం వేసినా, కాస్త విభూది పూసినా, ఎలుగెత్తి పాడినా, నర్తించినా అనుగ్రహిస్తాడు. ఏమీ లేకున్నా ఓం నమశ్శివాయ అని తలచితే చాలు పలుకుతాడు. ఆ పరమశివునితో సంభాషణలాంటి ఈ గీతంలో ఆయన రూపగుణ వైభవాలను నుతిస్తూనే తనకు ఎందుకు కనిపించటం లేదని ప్రశ్నిస్తున్నారు కృష్ణశాస్త్రి గారు. సాంబశివ అనే పదానికి విశేషమైన అర్థముంది. స+అంబ = సాంబ...అంబతో కూడిన శివుడు. అంటే సాంబశివుడు అవిభాజ్యమైన అర్థనారీశ్వర తత్త్వాన్ని సూచిస్తుంది. శివుని నుతిస్తే అమ్మను నుతించినట్లే అని సాంబశివ నామం చెబుతుంది.

ఓ సాంబశివా! ఈ బూడిదలు పూసుకోవటం, ఈ అల్లరి చేష్టలు చేయటం ఎందుకు. ఎవరు నీకు చెప్పేది? అలలతో ఉరకలేసి పరుగెడుతున్న గంగను పట్టి తలపాగాలా ఉన్న నీ జటాఝూటాలలో చుట్టావు. చంద్రవంకను తెల్లని కలికితురాయిగా పెట్టావు. కరి మరియు పులి చర్మాన్ని ధరించి, దానికి నడుము కట్టుగా కాలాగ్నిని చుట్టి, చేతిలో త్రిశూలము పట్టుకొని, నుదుటన అగ్నిని మూడో కన్నుగా పెట్టావు. ఓ శివా! నువ్వు ప్రళయాన్ని కలిగించే రుద్రుడవో, కరుణాసముద్రుడవో! ఓ దయామయా! ఈ దాసునికి ఎందుకు కనిపించవు?

ఈ గీతంలో శివుని విలక్షణమైన లక్షణాలను ఎన్నో ప్రస్తావించారు దేవులపల్లి వారు. గంగావతరణంలో భగీరథుడు తన పూర్వీకులకు ముక్తిని కలిగించటానికి బ్రహ్మకై తపస్సు చేయగా, బ్రహ్మ ప్రత్యక్షమై సురగంగను భువికి తీసుకు రావాలంటే ఆ గంగ ఉధృతిని లోకాలు తట్టుకోలేవు, కాబట్టి శంకరుని ప్రార్థించమంటాడు. శంకరుడు భగీరథుని తపస్సుకు మెచ్చి తన శిరస్సులో గంగను ధరించటానికి అంగీకరిస్తాడు. తరువాత భువి మీదకు ప్రవహింప జేస్తాడు. అలా ఆ గంగమ్మ ఈ కర్మభూమిలో ప్రవేశించి సగర పుత్రులతో పాటు ఇప్పటికీ మనందరికీ ముక్తిని కలిగిస్తూనే ఉంది. గంగను ధరించాడు కాబట్టి గంగను కూడా శివుని భార్యగానే భావిస్తారు. అదీ ఈ జటాఝూటాలలోని గంగమ్మ గాథ.

ఇక తరువాత సిగపై నెలవంక...దీనికి కూడా వివరణ ఉంది. దక్షప్రజాపతి 27 మంది కూతుళ్లను చంద్రుడు వివాహమాడుతాడు. కానీ, అతనికి ఒక్క రోహిణి అంటేనే ఎక్కువ మక్కువ. అందుకు మిగిలిన వారు కోపగించి తండ్రికి చెప్పగా, దక్షుడు చంద్రునికి హితవు పలుకుతాడు. అయినా చంద్రుడు మార్చుకోడు. అప్పుడు దక్షుడు చంద్రుని ఆతని ప్రకాశం క్షీణించేలా శపిస్తాడు. ఏమి చేయాలో తోచక చంద్రుడు బ్రహ్మదేవుని ప్రార్థించగా బ్రహ్మ చంద్రుని శివుని ప్రార్థించమంటాడు. చంద్రుడు ప్రభాస తీర్థం వెళ్లి సరస్వతీ నది తీర్థం వద్ద శివలింగం చేసి శివుని పూజిస్తాడు. అతని ప్రార్థనకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై దక్షుని శాపానికి పూర్తి నివృత్తి లేదు కానీ పక్షం రోజులు క్షీణ దశ, పక్షం రోజులు వృద్ధిగా ఉంటుంది అని వరమిస్తాడు. కానీ కృష్ణ పక్షంలో చంద్రుడు తన క్షీణతను చూసి సిగ్గు పడి తండ్రి అయిన సముద్రుని గర్భంలో దాగుంటాడు. చంద్రుడు లేకపోవడంతో లోకంలో చంద్రకాంతి అవసరమైన ఔషధ మొక్కలు ఔషధ గుణాలను కోల్పోతాయి. అంతే కాకుండా, చంద్రుడు లేనందువలన లోకంలో ఎన్నో అనర్థాలు కలుగుతాయి. అప్పుడు దేవతలు చంద్రుడిని మళ్లీ శివుని ప్రార్థించమంటారు. శివుడు చంద్రుని ప్రార్థనను మెచ్చి తన శిరసుపై ధరించి చంద్రుని క్షీణతను, వృద్ధిని నియంత్రిస్తూ,  చంద్రునికి ప్రాభవమిచ్చి లోక కళ్యాణానికి తోడ్పడ్డాడు.

శివుడు కరి చర్మాన్ని ధరిస్తాడు కాబట్టి తోలు కట్టి అన్నారు కృష్ణ శాస్త్రి గారు. దానికి కూడా గాథ ఉంది, గజాసురుని సంహారం తరువాత ఆతనికిచ్చిన వరం మేరకు అతని చర్మాన్ని ధరిస్తాడు. ఇక కాలాగ్నిని నడుం కట్టుగా ధరిస్తాడు అన్నదానికి పటకాగా కాలాగ్నిని చుట్టి అన్నారు కవి. ప్రళయకాలంలో కాలాగ్నిని శివుడు ప్రత్యక్షం చేసి దానితో విలయ తాండవం చేస్తాడు. మిగిలిన సమయమంతా ఆ కాలాగ్నిని తన నడుముకు చుట్టుకొని ఉంటాడు. అనగా కాలాన్ని శాసించే వాడు శివుడు.  శివుని త్రిశూలానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. త్రిమూర్తులకు, త్రిగుణాలకు, త్రిశక్తులు (ఇచ్ఛా, క్రియా, జ్ఞానములు), త్రినాడులకు (ఇడ, పింగళ,సుషుమ్న) , త్రికాలములకు (భూత, వర్తమాన, భవిష్యత్) ప్రతీకగా నిలిచింది. జ్ఞానానికి, బుద్ధికి, చేతనకు ప్రతీకగా మూడవ నేత్రము చెప్పబడింది. అందుకనే అక్కడ అగ్నిని నిలిపాడు శివుడు.

కృష్ణశాస్త్రి గారి గీతాలలో ఈ శైలి చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది పైకి ఆకృతి వర్ణనగా అనిపించినా పదప్రయోగాన్ని పరిశీలిస్తే ఎంతో లోతైన భావం దాగి ఉంటుంది. శివుని ఆయుధాలు, రూపము వెనుక నిగూఢార్థములు తెలిసిన యోగి కృష్ణశాస్త్రిగారు. పాలగుమ్మి విశ్వనాథం గారు ఈ గీతానికి సంగీతం కూర్చగా దీనిని ఆకాశవాణి భక్తిరంజని కార్యక్రమంలో ప్రసారం చేయబడింది. కేబీకే మోహన్‌రాజు గారు బృందంతో కలిసి ఈ గీతాన్ని పాడారు. దశాబ్దాలు గడిచిపోయినా ఇప్పటికీ పాట తనకున్న ప్రత్యేక స్థానాన్ని కోల్పోలేదు. 

8, డిసెంబర్ 2015, మంగళవారం

హిమగిరి సొగసులు మురిపించును మనసులు - సముద్రాల వారి ఆణిముత్యం



హిమగిరి సొగసులు మురిపించును మనసులు
చిగురించునేవో ఏవో ఊహలు 
హిమగిరి సొగసులు మురిపించును మనసులు

యోగులైనా మహాభోగులైనా మనసుపడే మనోజ్ఞ సీమ
సురవరులు సరాగాల చెలుల కలసి సొలసే అనురాగసీమ
హిమగిరి సొగసులు మురిపించును మనసులు

ఈ దివిని ఉమాదేవి హరుని సేవించి తరించెనేమో
సుమశరుడు రతీదేవి జేరి కేళి తేలి లాలించెలేమా
హిమగిరి సొగసులు మురిపించును మనసులు


కవి హృదయం సన్నివేశానికి సరిపడా ఎలా భావాన్ని ఆవిష్కరించాలో బాగా ఎరిగి ఉండాలి అన్నదానికి చక్కని ఉదాహరణ ఈ గీతం. పాండవుల వనవాసంలో భీముడు, ద్రౌపది పాత్రలపై చిత్రీకరించబడిన ఈ శృంగార యుగళ గీతం హిమాలయాలు ప్రకృతీపురుషుల తత్త్వాన్ని ఎలా ఆవిష్కరించిందో చూడండి.

హిమాలయాలు సమస్త దేవతా సమూహానికి నివాసలు. కైలసగిరిలో ప్రమథగణాలతో శివపార్వతులు కొలువుంటే, శ్రీమహావిష్ణువు, సమస్త నదీనదాలు, ఆది పరాశక్తితో సహా ఎందరో దేవతలు ఈ పుణ్యభూమిని ఆలవాలం చేసుకున్నారు. అటువంటి భూమిలో ప్రకృతి కూడా పులకరించి పరిపూర్ణమైన దివ్యత్వంతో నిండి ఉంటుంది.

ఈ ప్రాతిపదికను పునాదిగా చేసుకొని సముద్రాల రాఘవాచార్యుల వారు పాండవ వనవాసం చిత్రానికి హిమగిరి సొగసులో అనే గీతాన్ని రాశారు. భీమసేనునిగా నవరసనటనా సార్వభౌముడు అన్న ఎన్‌టీ్ఆర్, ద్రౌపదిగా మహానటి సావిత్రి ఈ యుగళగీతానికి తమ నటనతో ప్రాణం పోశారు. స్త్రీపురుషుల మధ్య వలపులు రేపటానికి ప్రకృతి అతి ముఖ్యమైన కారణం. అందులో హిమాలయాలంటే? మంచు, కొండలు, ఎత్తైన చెట్లు, లోయలు, రమణీయమైన పుష్పాలు, అరుదైన ఫలాలు...అన్నీ అక్కడే. ఇక్కడే యోగులు, సిద్ధులు తపస్సు చేసేది. యక్ష, కిన్నెర, గంధర్వులు విహరించేది. ఇలా, హిమాలయాలలో అణువణువు దివ్యత్వం నిండి ఉంటుంది. ప్రకృతి సౌందర్యానికి స్త్రీ పురుషుల మనసులలో ఊహలు చిగురిస్తాయి. యోగులైనా, భోగులైనా మనసు పడే అందాల సీమ అని కవి వర్ణించటానికి కారణం అక్కడి ప్రకృతిలోని దివ్యత్వమే. దేవతలు సరస సల్లాపములాడే భూమి ఇది. హిమవంతుని పుత్రిక అయిన పార్వతి శివుని కోరి తపస్సు చేసింది కూడా ఇక్కడే. ఆ ఉమాదేవి శంకరుని సేవించి తరించిన ప్రదేశం ఈ హిమాలయాలు. రతీమన్మథుల కేలి జరిగింది కూడా ఇక్కడే. అంతటి మహత్తరమైన హిమగిరి సొగసులు చూసి మోహావేశులు కానివారెవ్వరు?

సముద్రాల రాఘవాచార్యుల వారు తెలుగు సినీ జగత్తులు ఒక రెండు దశాబ్దాల పాటు సాహిత్య ప్రపంచాన్ని ఏలారు. ఆయన రామాయణాన్ని ఒకటి కాదు రెండు కాదు పదికిపైగా పాటలలో సంక్షిప్తంగా వర్ణించారు. పాటలే కాదు, సంభాషణలు కూడా అంతే మనోజ్ఞంగా అందించారు. అటువంటివాటిలో ఒక్కటి ఈ హిమగిరి సొగసులు పాండవ వనవాసం చిత్రంలోనిది. ఘంటసాల మాష్టారు స్వీయ సంగీత దర్శకత్వంలో, సుశీలమ్మతో కలిసి పాడిన యుగళ గీతం ఇది. మంచి స్వరాలతో, రాగయుక్తంగా, భావయుక్తంగా పాడిన ఈ గీతం తెలుగు  సినీ స్వర్ణయుగపు పాటల ఆణిముత్యాలలో ఒకటిగా నిలిచిపోయింది.


6, డిసెంబర్ 2015, ఆదివారం

బేబీ కార్న్-గోబీ మంచూరియన్, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్

బేబీ కార్న్-గోబీ మంచూరియన్


బయటకు వెళితే చాలా మంది ఆర్డర్ చేసే ఐటం మంచూరియన్. కొంతమంది గోబీ ఇష్టపడితే, కొంతమంది బేబీ కార్న్ ఇష్టపడతారు. నేను బేబీ  కార్న్, గోబీ కలిపి చేశాను. అసలు మంచురియన్ అంటే ముందుగా ముక్కలను నూనెలో వేయించాలి, తరువాత మళ్లీ మిగిలిన పదార్థాలు వేసి స్టిర్ ఫ్రై చేయాలి. నేను అలా చేయలేదు. స్టీం కుక్ చేసి తరువాత నూనెలో స్టిర్ ఫ్రై చేశాను. కాబట్టి నూనె తక్కువే పట్టింది.

కావలసిన పదార్థాలు:


  • ఒక అంగుళం పరిమాణంలో కోయబడిన బేబీ కార్న్
  • ఒక అంగుళం పరిమాణంలో కింద కాండం కాస్త ఉండేలా కోయబడిన కాలీఫ్లవర్
  • సన్నగా కోయబడిన అల్లం, వెల్లుల్లి
  • సన్నగా కోయబడిన ఉల్లికాడలు
  • సోయా సాస్
  • టబిస్కో సాస్
  • తగినంత నూనె
  • తగినంత రెడ్ చిల్లీ సాస్
  • తగినంత టమాటో కెచప్
  • మిరియాల పొడి
  • ఉప్పు
  • నూనె
  • కార్న్ ఫ్లోర్


తయారు చేసే పద్ధతి:

ముందుగా కాలీఫ్లవర్ ముక్కలను, బేబీకార్న్ ముక్కలను 5 నిమిషాల పాటు స్టీం చేసుకోవాలి. దీని ఉద్దేశం ముక్కలు లోపల పచ్చి పోవటానికి. నూనెలో ఫ్రై చేయకూడదు అనుకుంటేనే ఇలా చేయాలి. లేకపోతే నూనెలో ముక్కలను డీప్ఫ్రై చేయాలి. స్టీం పద్ధతిలో ముక్కలు బాగా ఆవిరిపట్టి పచ్చి పోయిన తరువాత కాసేపు చల్లార్చుకోవాలి. నాన్-స్టిక్ ప్యాన్‌లో మరింత నూనె వేసి, వేడి అయిన తరువాత అందులో తరిగిన అల్లం, వెల్లుల్లి, ఉల్లికాడల ముక్కలను వేసి బాగా వేయించాలి. ఒక 5 నిమిషాలు వేగి రంగు మారిన తరువాత బేబీ కార్న్, కాలీ ఫ్లవర్ ముక్కలను వేసి కాసేపు స్టిర్ ఫ్రై చేయాలి. తరువాత సోయా సాస్, టబిస్కో సాస్, చిల్లీ సాస్, టమాటో కెచప్, ఉప్పు, మిరియాల పొడి వేసి మరింత సేపు స్టిర్ ఫ్రై చేయాలి. ముక్కలు అన్ని సాస్‌లను, కెచప్‌ను పీల్చుకొని రంగు మారుతున్న తరువాత, 3-4 స్పూన్స్ కార్న్ ఫ్లోర్‌ను కాస్త నీటిలో బాగా కలిపి బాణలిలో ముక్కలపై వేయాలి. దీనివలన అన్ని మిశ్రమాలు దగ్గరకు అయ్యి కొద్దిగా గ్రేవీలా వస్తుంది. దీనిని పాత్రలోకి మార్చుకొని వేడి వేడిగా తినాలి.

గమనిక: ఈ వంటకంలో అల్లం, వెల్లుల్లి బాగా పడతాయి.

వెజిటబుల్ ఫ్రైడ్ రైస్




కావలసిన పదార్థాలు:


  • బాస్మతీ బియ్యం
  • చిన్న ముక్కలుగా తరిగిన క్యారెట్, సన్నగా కోయబడిన ఫ్రెంచ్ బీన్స్, బంగాళ దుంప (ఇంకా కూరగాయలు కావాలనుకుంటే తురిమిన క్యాబేజీ, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా కోయబడిన క్యాప్సికం, సన్నగా తరిగిన ఉల్లికాడలు కూడా వేసుకోవచ్చు)
  • తగినన్ని ఫ్రోజెన్ బఠాణీలు
  • ఆలివ్ ఆయిల్
  • జీలకర్ర
  • మిరియాల పొడి
  • సోయా సాస్


తయారు చేసే పద్ధతి:

బాస్మతి బియ్యాని ముందుగానే ఉడికించుకోవాలి. దీనికి బియ్యాన్ని ఒక అరగంటసేపు నీళ్లల్లో నానపెట్టుకోవాలి. తరువాత బియ్యాన్ని ప్రెషర్ కుక్కర్లో కానీ, రైస్ కుక్కర్లో కానీ వేసి, తగినంత నీరు పోసి, కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసి ఉడికించాలి. ఉడికిన తరువాత మూత తీసి మరి కాస్త ఆలివ్ ఆయిల్ వేసి పొడి పొడిగా ఉండేలా చేసుకోవాలి. ఎక్కు సేపు మూత ఉంచితే అన్నం మెత్తబడిపోతుంది. ఫ్రైడ్ రైస్ బాగుండదు.

ఒక బాణలిలో నూనె వేసి తరిగిన కూరగాయ ముక్కలన్నీ వేయాలి. కాస్త జీల కర్ర, తగినంత ఉప్పు వేసుకోవాలి. చైనీస్ వంటకాలకు ముఖ్యం బాగా వేడి మీద స్టిర్ ఫ్రై చేయటం. అంటే బాణలిని అటు ఇటూ తిప్పుతూ ఉండాలి. ఇలా ఒక 4-5 నిమిషాలు స్టిర్ ఫ్రై చేసిన తరువాత ఉడికించిన బాస్మతీ బియ్యం, సోయా సాస్, మిరియాల పొడి వేసి, మొత్త రైస్‌కు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే మరింత వేసుకోవాలి. దీనిని 3-4 నిమిషాల పాటు మళ్లీ స్టిర్ ఫ్రై చేయాలి.  అంతే, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ. వేడి వేడిగా తింటేనే బాగుంటుంది. పైన చేసిన బేబీకార్న్-గోబీ మంచురీన్ తో కలిపి తింటే చాలా బాగుంటుంది. వెజిటబుల్స్ ఉన్నాయి కాబట్టి వేరే సైడ్ డిష్ ఏమీ లేకున్నా కూడా బానే ఉంటుంది.

గమనిక: పై రెండు వంటకాలలోనూ సోయా సాస్ మరియు ఇతర సాస్‌లలో ఉప్పు, కారం ఎక్కువే ఉంటాయి కాబట్టి మీ అభిరుచులను బట్టి జాగ్రత్తగా వేసుకోండి. లేకపోతే వంటలు బాగా కారంగా, ఉప్పగా వచ్చే అవకాశం ఉంది. 

5, డిసెంబర్ 2015, శనివారం

మతం-మానవత్వం


"కౌసల్యా సుప్రజారామా పూర్వా సంధ్యా ప్రవర్తతే"...ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి మధురమైన గళంలో శ్రీవేంకటేశ్వర సుప్రభాతం ఎఫ్ఎం రేడియోలో వస్తోంది. ప్రాతః సంధ్యావందనం చేసుకున్నాడు చంద్రశేఖరన్ అయ్యర్. భార్య గౌరి కాలేజీకి వెళ్లాల్సిన పిల్లలను నిద్రలేపే ప్రయత్నంలో కేకలు వేస్తోంది. ఎనభై ఏళ్ల సీతారామన్ అయ్యర్, భార్య జానకమ్మాళ్ వృద్ధాప్యపు భారంతో కాలకృత్యాలలో ఉన్నారు. చంద్రశేఖరన్ సెక్రెటేరియట్లో సెక్షన్ ఆఫీసరు.

పక్క ఫ్లాట్లో రైతుబజార్లో కూరగాయలు, పూలమ్ముకునే సయ్యద్ మిర్జా మార్కెట్టుకు వెళ్లటానికి సిద్ధమవుతున్నాడు. క్రిందటి వారం వానలకు చాలా నష్టపోయిన మిర్జా దానిని ఎలా పూడ్చాలి, పిల్లవాడి స్కూలు ఫీజులు ఎలా కట్టాలి అన్న దిగులుతో భారంగా బయలుదేరాడు. భార్య సల్మా నిండు గర్భిణి. అతి కష్టం మీద వాకిలి దాక వచ్చి భర్తకు ధైర్యం చెప్పి సాగనంపింది. సయ్యద్ తండ్రి షేక్ మిర్జా భార్య పోయి ఒంటరిగా ఉన్నాడు. ఉదయం నమాజ్‌కు సిద్ధమవుతున్నాడు. తాము చేసే ప్రార్థనలు తమ కుటుంబానికి ఏమి సహాయం చేస్తున్నాయని సల్మా ఆలోచన. కానీ బయట పడదు.

వీళ్లకు రెండు ఫ్లాట్ల అవతల శామ్యూల్, నీలం దంపతులు ఉంటారు. శామ్యూల్ కేరళ వాడు, నీలం ముంబై నుండి వచ్చి చెన్నైలో ఉద్యోగం చేస్తోంది. కొత్తగా పెళ్లయ్యింది. మతాంతర ప్రేమ వివాహం. ఇరువైపులా తల్లిదండ్రులు వీరి నిర్ణయంతో పిల్లలను దూరం చేసుకున్నారు. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు.  శామ్యూల్ ఛాందసం కల క్రైస్తవుడు. హిందువుల ప్రసాదాలు ఇస్తే తినడు. విగ్రహారాధనను ఘోరంగా దూషిస్తాడు. సమయం దొరికినప్పుడల్లా ఆ దంపతులిద్దరూ అక్కడి దగ్గర లోని క్రైస్తవ వృద్ధాశ్రమంలో తమ సేవను అందిస్తూ ఉంటారు. వృద్ధాశ్రమంలో వృద్ధులకు కావలసిన వస్తువులను ముందే సేకరించిన విరాళలతో కొనిపెట్టుకొని వారం వారం వెళ్లి ఇచ్చి వస్తారు.

సాయంత్రమైంది. చెన్నైలోని అన్నానగర్‌లోని ఈ అపార్టుమెంటు కాంప్లెక్సులో ప్రజలంతా కాసేపు మిగితావారితో గడుపుదామని తమ ఇళ్లలోనుండి బయటకు వచ్చారు. "అయ్యరు గారూ! మా వాడు మంచి మంచి పూలు తెస్తాడు మార్కెట్లో. మీ శేఖరన్ పూజకు తీసుకుంటారా? అలాగే, వాడు మంచి కూరలు తెస్తాడు తీసుకోండి" అని అడిగాడు షేక్ మిర్జా సీతారామన్ మరియు జానకమ్మాళ్ దంపతులను. "అబ్బే వద్దండీ" అని చెప్పి ముందుకు కదిలారు వారు. "ఏవిటండీ! వాడు మనలను పూలు తీసుకోమంటాడు. మహాపాపం కదా..." అంది జానకమ్మాళ్. "నిజమేనే. వదిలేసేయ్" అని వాకింగ్ చిన్నగా సాగించారు.

షేక్ మిర్జాకు నీలం ఎదురు పడింది. "అంకుల్! ఆదాబ్ అర్జ్ హై! రేపు శనివారం మన కాంప్లెక్సులో వృద్ధులకు ఉచిత రక్త పరీక్షలు, తరువాత ఫలహారం ఉంది. మీరు కూడా తప్పక రండి..." అని చెప్పింది. "పర్లేదు. మేము ఈ మధ్యనే పరీక్షలు చేయించుకున్నాము. అయినా అల్లా దయతో నాకేమీ కాదు" అని సందేహ పూర్వకంగా ముందుకు సాగాడు మిర్జా. మిర్జాకు మతాంతర వివాహాలంటే మహా ద్వేషం.

రాత్రి అయ్యే సరికి ఉరుములు మెరుపులతో వాన మొదలైంది. సల్మాకు మళ్లీ దిగులు, భర్త సయ్యద్ పూలన్నీ పాడైపోతాయి. ఎలాగా అని ఆలోచనలో పడింది. ఈ వారం కూడా డబ్బులు రాకపోతే పస్తులే అనుకుంది. సయ్యద్ ఇంటికి రాలేదు. రాత్రి పది దాటింది. వాన కాస్తా కుంభవృష్టిగా మారింది. సల్మాకు దిగులు మొదలైంది. వస్తాడులేమ్మా అని షేక్ సర్ది చెప్పినా ఆయనకు కూడా లోపల గుబులు మొదలయ్యింది. దాదాపు పదకొండు గంటలకు సయ్యద్ తడిసిన పూల మూటలతో ఇంటికి చేరాడు. "రోడ్ల మీద మూడడుగుల నీళ్లున్నాయి. వాటిలో ఈ పూలను మోసుకుంటూ మధ్య మధ్యలో ఆగటం వలన ఆలస్యమైంది" అని చెప్పాడు.  

"శేఖరన్ గారూ! ఉన్నారా! నీలం ఇంకా ఇంటికి రాలేదు. నేను తొందరగా వచ్చేశాను. బస్సు ఎక్కి రెండు గంటలైందిట. ఫోన్ స్విచాఫ్ వస్తోంది. పన్నెండున్నర అయ్యింది. ఏమి చెయ్యాలో తోచట్లేదు. కాస్త మీ సెక్రటేరియట్ కాంటాక్ట్స్ ద్వారా పోలీసులకు ఫోన్ చేయించండి"...శేఖరన్  ఫోన్ తీసుకోబోయాడు. జానకమ్మాళ్ లోపలనుండి పిలిచి ఆ "శామ్యూల్ మనింట్లోకి ఎందుకు వచ్చాడు. పంపించేసెయ్.." శామ్యూల్‌కు వినబడి వెనుదిరిగి వెళ్లిపోయాడు. శేఖరన్ తలదించుకున్నాడు.

రాత్రంతా కుంభవృష్టి కురుస్తూనే ఉంది. మధ్యలో కరెంటు పోయింది. వానకు సెల్లార్ నిండిపోయింది. ఈ అపర్టుమెంటు ఎత్తు మీద ఉన్నా నీళ్లు బాగా ప్రవహిస్తూ పైకి వస్తున్నాయి. సెల్ ఫోన్లు పనిచేయటం లేదు.

సీతారామన్ గారికి ఎడతెరపి లేని వానలకు ఆయాసం మొదలయ్యింది. గుండె చిక్కబట్టినట్లుగా ఉంది. గౌరి, జానకమ్మాళ్ గృహవైద్యం చిట్కాలన్నీ ప్రయత్నం చేస్తున్నారు. ఊపిరి అందటం లేదు ముసలాయనకు. భర్త పరిస్థితి చూసి జానకమ్మాళ్ స్పృహతప్పి పడిపోయింది. "ఏవండీ! మన పక్కింటి శామ్యూల్ దగ్గర వృద్ధులకు కావలసిన మందులు, అత్యవసర వస్తువులు ఉంటాయని మన సొసైటీ మీటింగులో చెప్పారు. మామయ్యగారి కోసం మందులు అడగండీ"...కాసేపటి క్రింద తాను శామ్యూల్‌కు చేసిన అవమానం శేఖరన్‌కు గుర్తుకు వచ్చింది. అడుగు బయటకు లోపలకు పడుతోంది. తప్పు చేశానన్న భావన ఒకవైపు, తండ్రి ప్రాణం మరో వైపు...ఆలోచనలలో గడప దగ్గర ఆగిపోయాడు.

సల్మాకు నొప్పులు మొదలయ్యాయి. క్రిందకు వెళ్లి దాక్టర్ దగ్గరకు వెళ్ళే పరిస్థితి లేదు. సయ్యద్‌ను దగ్గరకు పిలిచింది. "సునో మియా! మన పక్కింటి గౌరి నర్స్ ట్రైనింగ్ తీసుకున్నానని ఇది వరకు ఎప్పుడో చెప్పింది. కొంచెం పిలవండి." అని చెప్పింది. "బేటా! తుం రుకో. వో లోగొన్ సే హం మదత్ నహీ లేంగే. అల్లా సల్మా కా దేఖ్‌బాల్ కరేగా" అని ఉరిమాడు. సయ్యద్ తన అపార్టుమెంటు ద్వారం దగ్గర ఆగిపోయాడు.

రాత్రంతా నీలం ఇంటికి రాలేదు. సల్మా నొప్పులతో బాధ పడుతునే ఉంది. సీతారామన్ గారిది వచ్చే ప్రాణం పోయే ప్రాణంలా ఉంది. ఎవరి మతాలు వారి మానవత్వానికి అడ్డుగోడలు వేశాయి. తెల్లవారే సరికి సీతారామన్ గారి ప్రాణాలు అనంతవాయువులో కలిసిపోయాయి. ఇంట్లో రోదన. శేఖరన్ మదిలో నిర్వేదం. బయట కుంభ వృష్టి, ఫోన్లు పనిచేయటం లేదు. విద్యుత్తు లేదు. ఇంట్లో తాగటానికి నీళ్లు అంతంత మాత్రం ఉన్నాయి. రోజూ బయట తింటారు కాబట్టి శామ్యూల్-నీలంల ఇంట్లో ఆహారం కూడా ఏమీ లెదు. శామ్యూల్ నీరసంతో గడప దగ్గర కూలబడి ఏడుస్తున్నాడు. కొద్ది దూరంలో సల్మా పురిటి నొప్పులు భరించలేక ఏడుపు.

జానకమ్మాళ్ భర్త శవం పక్కన రోదిస్తున్నా బయట నుండి సల్మా నొప్పులతో ఆర్తనాదాలు బిగ్గరగా వినబడుతున్నాయి. భారమైన హృదయంతో గడపదాకా వెళ్లింది. అక్కడ సల్మా కింద పడుకొని అటు ఇటూ దొర్లటం చూసింది. మతం పేరుతో మూసుకుపోయిన మానవత్వం కళ్లు భర్త మరణంతో తెరుచుకున్నాయి. "గౌరీ! వెంటనే వెళ్లు. పక్కింటి అమ్మాయికి సాయం చేయి. మనం అజ్ఞానంతో పోగొట్టుకున్నది చాలు" అని చెప్పింది. పక్కనే గడప దగ్గర కూలబడి ఉన్న శామ్యూల్ వైపు చూసింది. తిండి తినలేదని అర్థమయ్యింది. ఆ సాయంత్రం చేసిన నివేదన చేసి పాలు, కొబ్బరి ముక్కలు ఉన్నాయి అన్నది గుర్తుకు వచ్చింది. వెంటనే పరుగు పరుగున వెళ్లి వాటిని తెచ్చి శామ్యూల్‌కు పెట్టింది. హిందువుల ప్రసాదం తినరాదన్న తన అజ్ఞానానికి ఏడ్చి ప్రభువే జానకమ్మాళ్ రూపంలో వచ్చినట్లుగా భావించి అవి తిన్నాడు.

వాన కురుస్తునే ఉంది. మనిషి రావటానికి పోవటానికి లేదు. సల్మాకు  కానుపు దగ్గర పడింది. గౌరి సాయంతో ఇంట్లోనే ఆమె ఆడబిడ్డను కన్నది. సయ్యద్ ఊపిరి పీల్చుకున్నాడు. గౌరి ఇంట్లోకి వచ్చింది. పురిటి మైల లేదు మామగారు మరణించిన మైల లేదు..మానవత్వ పరిమళంతో ఆమె ముఖం ప్రశాంతంగా ఉంది. సీతారామన్ మరణించి నాలుగు గంటలయ్యింది. ఇంట్లోనుంచి బయటకు తెసుకు వెళ్లే పరిస్థితి లేదు. ఇంట్లో కూరలు లేవు. తన మత మౌఢ్యానికి చింతించిన షేక్ అడుగులు వేస్తూ సయ్యద్ దగ్గరకు వచ్చి "బేటా! బాజూ వాలే కే ఘర్ మే సబ్జీ నహి హై దిఖ్తా హై. జాకే యే సబ్జీ దో...." తండ్రి మాటలకు ఎంతో సంతోషించాడు సయ్యద్. పరుగు పరుగున శేఖరన్ ఇంటికి వెళ్లి కూరగాయలు ఇచ్చాడు. అతను వాటిని భార్యకు అందించాడు. గౌరిని తమ కుటుంబంతో పాటు సయ్యద్ కుటుంబానికి, శామ్యూల్‌కు వంట చేయమని చెప్పాడు.ఉన్న మంచి నీళ్లను జాగ్రత్తగా ఆ పది మంది ఎలా తాగాలో ఆలోచన చేసి అందరికీ తెలిపాడు.

వాన తగ్గట్లేదు. బయట ప్రపంచంతో మాట్లాడటానికి లేదు. తండ్రి శవం ఇంక పాడయ్యే సమయం వస్తోంది. ఆలోచనలో ఉన్న శేఖరన్ దగ్గరకు శామ్యూల్ వచ్చాడు. "సార్, దురదృష్టమో అదృష్టమో మా ఇంట్లో ఒక చెక్క పెట్టె ఉంది. అందులో నాన్న గారి శరీరాన్ని పెట్టి నా కారుపై పెట్టే ప్రయత్నం చేద్దాము." రెండో ఆలోచన లేకుండా శేఖరన్ అమ్మను అడిగాడు. ఆవిడ సరే అంది. కుటుంబమంతా ఆయన దేహానికి నమస్కారం చేసి అవే అంత్యక్రియలుగా భావించారు. శామ్యూల్ తన ఫ్లాట్ నుండి పెట్టెను తీసుకువచ్చాడు. దైవలీల ఎలా ఉంటుందో చూడండి. సీతారామన్ గారి శరీరం అందులో సరిగ్గా పట్టింది. దానిపై ఆయన వస్త్రాలను కప్పారు. సయ్యద్ తన వద్ద ఉన్న పూలన్నీ తీసుకు వచ్చి ఆయన శరీరంపై కప్పాడు. పెట్టెను మూసి సయ్యద్ ఒక పక్క, షేక్ ఒక పక్క, శేఖరన్ ఒక పక్క, శామ్యూల్ ఒక పక్క సీతారామన్ గారి శవం మోశారు.

జానకమ్మాళ్‌కు అక్కడ నలుగురు కుమారులు కనిపించారు. పైకి చూసి నమస్కారం చేసింది. అల్లా, రాముడు, జీసస్ అనుగ్రహించినట్లుగా అనిపించింది. నలుగురు మగవాళ్లు కలిసి పెట్టెను శామ్యూల్ బండిపై పెట్టి జోరువానలో తాడు వేసి కట్టారు. శామ్యూల్, శేఖరన్ బండిలో కూర్చుని స్టార్ట్ చేశారు. వాన నీటికి మునిగిన రోడ్లపై కారు తేలుతున్నట్లుగా ఉంది. ఒక కిలోమీటర్ దూరం పోగానే బండి ఆగిపోయింది గుంతలో ఇరుక్కుంది. శేఖరన్, శామ్యూల్ బండి దిగారు. గుండెలవరకు నీరు, పైన కుంభవృష్టి. నీటి ఉద్ధృతికి పెట్టె కొట్టుకుపోయింది. శామ్యూల్, శేఖరన్ ఏమీ చేయలేకపోయారు. అలా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన పెట్టె ఒక ఎత్తైన ప్రదేశం దగ్గర ఆగింది. అక్కడ ఒక బస్ షెల్టర్ కింద వంద మంది ఉన్నారు. వారిలో నీలం కళ్లు మూసుకొని కూలబడి ఉంది. పెట్టె పెట్టె అని ఉన్నవారంతా అరిచారు. నీలం కళ్లు తెరిచింది. పెట్టెను అందరూ షెల్టర్ కిందికి చేర్చారు. తెరిచారు. నీలం సీతారామన్ గారి దేహాన్ని గుర్తు పట్టింది. నోటమాటరాలేదు. పెట్టెను కూడా గుర్తు పట్టింది. దానిని కాపాడాలని నిర్ణయించుకొని పక్కవారికి చెప్పింది. వరదల్లో గంటల తరబడి నిలబడి మానవత్వం అంటే ఏమిటో అప్పటికే బాగా అర్థమైన వారందరూ అంగీకరించారు.

దాదాపు ఏడు గంటల తరువాత వాన వెలిసింది. నీలం షెల్టర్ కింద ఉన్నవారి సాయంతో ఆ పెట్టెను స్మశానానికి తీసుకువెళ్లి అక్కడ కాపరికి చెప్పింది. శామ్యూల్, శేఖరన్లకు వార్త తెలిసి అక్కడికి రావటానికి చాలా సమయం పట్టింది. చివరకు వచ్చి శేఖరన్ తండ్రికి అంత్యక్రియలు చేశాడు.

ఇంటికి వచ్చిన శేఖరానికి తల్లి, భార్య ఎదురయ్యారు. శేఖరన్ అంతా వివరించాడు. మూడు కుటుంబాలు ఒక చోట చేరాయి.

"అమ్మా! ఆ రోజు వారి జీవనోపాధి కోసం నాన్నను పూలు కూరగాయలు తీసుకోమని చెప్పిన షేక్ గారిని మీరు తిరస్కరించారు. ఇంటికి సాయం కోరి వచ్చిన శామ్యూల్‌ను నేను అవమానించి, అతని దగ్గర వైద్య సదుపాయం ఉన్నా అహంకారంతో వెళ్లలేకపోయాను. చివరికి ఆ సయ్యద్ గారి పూలే నాన్నకు మాలలయ్యాయి. ఆ శామ్యూల్ ఇంటి పెట్టే నాన్న అంతిమ యాత్రకు తోడైంది....ఆ శామ్యూల్ గారి భార్యే నాన్న శరీరం నీళ్లపాలు కాకుండా నా ధర్మం నిర్వర్తించేలా చేసింది. మనం ఏమి నేర్చుకున్నాము, ఏమి పాటించాము ఆలోచించు"...

"శేఖరన్ గారు! నా అజ్ఞానంతో సయ్యద్‌ను మిమ్మల్ని సహాయం అడగవద్దని చెప్పాను. గౌరి గారు లేకపోతే మా కోడలు, మనవరాలు ఏమయ్యేవారు? మత దురహంకారం నా కళ్లను కప్పేసింది. అందుకే నీలంగారు నా మంచికోరి చెబితే వినలేదు. మీ అందరిలోని దైవత్వాన్ని గుర్తించ లేకపోయాను" అన్నారు షేక్.

"శేఖరన్ గారు! అందరమూ తప్పు చేశాము. ఇన్నాళ్లూ హిందూ మతంపై ద్వేషంతో మీరు దేవతలకు సమర్పించే నివేదనను నేను ఎన్నో మార్లు తిరస్కరించాను. కానీ, చివరకు అదే నా ప్రాణాలను కాపాడింది..మీకు తెలియదు. నాకు చిన్నతనంలోనే చక్కెర వ్యాధి వచ్చింది. ఇంకాసేపు ఏమీ తినకుండా ఉంటే నా పరిస్థితేమిటో ఊహించలేను. మీ అమ్మగారు నాకు ఇచ్చిన ఆహారం నా పాలిట అమృతం..." అన్నాడు శామ్యూల్.

"మామగారి ప్రార్థనలు ఎందుకు ఉపయోగం అని తిట్టుకునే దాన్ని. ఇంతటి వానలో నాకు అవసరానికి దేవతలా వచ్చి పురుడు పోసిన గౌరి గారు మామయ్య చేసిన ప్రార్థనలకు పరమాత్మ స్పందన..."  మియాజీ! మామా గారు! మీరు అంగీకరిస్తే నా బిడ్డకు గౌరి ఇన్సానియత్ మిర్జా అని పేరు పెడతాను" అని సల్మా కన్నీళ్లతో గద్గద స్వరంతో చెప్పింది. సయ్యద్, షేక్ వెంటనే అంగీకరించారు. అందరూ వారి వారి పరమాత్మ స్వరూపాలకు నమస్కరించారు. అందరూ ఒకే భోజనం చేశారు.

అక్కడే మరణం, అక్కడే జననం, అక్కడే మతమనే గోడలు మానవత్వం ముందు విరిగి నేలకు ఒరిగాయి. అక్కడ శౌచము లేదు, శుచి లేదు, అక్కడ ఇతర విశ్వాసాల పట్ల ద్వేషం లేదు. అక్కడ పక్కవాడు నా శత్రువన్న అభద్రతా భావం లేదు. అక్కడ హింస లేదు. అక్కడ అశాంతి లేదు. అక్కడ బేలతనం లేదు. అక్కడ అబలలు లేరు. అందరిలోనూ పరమాత్మ తత్త్వం ప్రజ్జ్వలిస్తోంది. అక్కడే మనిషి జన్మకు సార్థకత ఏమిటో తెలిసింది. అక్కడే నవశకానికి నాంది పలికింది.

ఈ కథ చెన్నైలో గత నాలుగు రోజులుగా అత్యంత దయనీయమైన, కఠినమైన పరిస్థితులలో ప్రాణాలొడ్డి మానవత్వాన్ని పరిమళిస్తున్న వాలంటీర్లకు, మానవతా మూర్తులకు, భారతీయ సైన్యానికి అంకితం. జై హింద్.



తులసీ దయాపూర్ణకలశీ - తులసి పూజ, దళచయనం



కార్తీక మాసం కదా? తులసి పూజ, తులసి వివాహం ఈ నెలలో వచ్చిన విశేషమైన పూజలు. తులశమ్మ విశేషాలు కొన్ని తెలుసుకుందాం.

తులసి - స్వయంగా శ్రీమహాలక్ష్మి స్వరూపం. అందుకే శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. తులాభారంలో సత్యభామ సమర్పించిన సకలసంపదలకు లొంగక, రుక్మిణి సమర్పించిన ఒక్క తులసి దళానికి బద్ధుడైనాడు శ్రీకృష్ణుడు. తులసిని ఎన్నో విధాలుగా నుతించారు మన సనాతన ధర్మంలో. తులసిలేని ఇల్లు కళావిహీనమని చెప్పారు. మరి తులసి ఇంట్లో ఉన్నప్పుడు ఆ తులసి వద్ద నిత్యం దీపం పెట్టటం మన కనీస ధర్మం. అలాగే తులసి ఎన్నో ఔషధ గుణాలు కలది. మన ఆయుర్వేద శాస్త్ర ప్రకారం తులసి పత్రాలు అమృతముతో సమానము.

అనన్యదర్శనాః ప్రాతః మే పశ్యంతి తపోధన
జగత్త్రితయ తీర్థాని తైర్దృష్టాని న సంశయః

ఉదయము నిద్రనుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూసినచో ముల్లోకములలోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలము లభించును అని బ్రహ్మపురాణం చెప్పింది.

తులసిచెట్టు మనుషులను, ఇంటిని, వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది. పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. శారీరిక, మానసిక ఆరోగ్యమునిస్తుంది.

తులసి పూజ ఎలా చేయాలి? 


తులసికోటను, చెట్టును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి. నీళ్లు పోయాలి, ప్రదక్షిణము చేయాలి, నమస్కరించాలి. దీనివలన అశుభాలన్నీ తొలగి శుభాలు కలుగుతాయి. సర్వ పాపప్రక్షాళన జరుగుతుంది. మనోభీష్టాలు నెరవేరుతాయి. తులసి వనమున్న గృహము పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం. ఉదయము, సాయంత్రము తులసి కోట వద్ద దీపారాధన చేయటం అత్యంత శుభకరం. తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్టశక్తులు పనిచేయవు.

ఒక చెంబుతో నీళ్లు, పసుపు, కుంకుమలు తీసుకొని తులసి చెట్టు వద్ద నిలుచొని ఈ విధంగా ప్రార్థించి పూజించాలి.

నమస్తులసి కళ్యాణీ! నమో విష్ణుప్రియే! శుభే!
నమో మోక్షప్రదే దేవి! నమస్తే మంగళప్రదే!
బృందా బృందావనీ విశ్వపూజితా విశ్వపావనీ!
పుష్పసారా నందినీ చ తులసీ కృష్ణజీవనీ!

ఏతన్నామాష్టకం చైవ స్తోత్రం నామార్థసంయుతం
యః పఠేత్తం చ సంపూజ్య సోశ్వమేధ ఫలం లభేత్

అని తులసిని ప్రార్థించి, అచ్యుతానంతగోవింద అనే మంత్రాన్ని పఠిస్తూ పూజించాలి. తరువాత క్రింది శ్లోకాన్ని ప్రార్థనా పూర్వకంగా పఠించాలి.

యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః
యదగ్రే సర్వవేదాశ్చ తులసీం త్వాం నమామ్యహం

అని చెంబులోని నీళ్లను తులసిచెట్టు మొదట్లో పోసి నమస్కరించాలి.

తులసి శ్రీసఖి శుభే పాపహారిణి పుణ్యదే
నమస్తే నారదనుతే నారాయణ మనఃప్రియే

అని తులసికోట లేదా చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయాలి. దీనివలన కర్మదోషాలన్నీ తొలగుతాయి.

పూజ కోసం తులసీ పత్రాలను ఎలా కోయాలి అన్నదానికి సనాతన ధర్మం ఒక పద్ధతిని తెలియజేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం.



తులసీం యే విచిన్వంతి ధన్యాస్తే కరపల్లవాః - పూజ చేయటం కోసం తులసి దళాలను త్రెంపిన చేతులు ఎంతో ధన్యములు అని స్కాందపురణం చెప్పింది.

తులసి చెట్టునుండి దళాలను మంగళ, శుక్ర, ఆది వారములలో, ద్వాదశి, అమావాస్య, పూర్ణిమ తిథులలో, సంక్రాంతి, జనన మరణ శౌచములలో, వైధృతి వ్యతీపాత యోగములలో త్రెంప కూడదు. ఇది నిర్ణయసింధులో, విష్ణుధర్మోత్తర పురాణంలో తెలియజేయబడినది. తులసి లేకుండా భగవంతుని పూజ సంపూర్ణం అయినట్లు కాదు. ఇది వరాహ పురాణంలో చెప్పబడింది. కాబట్టి నిషిద్ధమైన రోజులలో, తిథులలో తులసి చెట్టు కింద స్వయంగా రాలి పడిన ఆకులతో, దళములతో పూజ చేయాలి. ఒకవేళ అలా కుదరకపోతే ముందు రోజే తులసి దళములను త్రెంపి దాచుకొని మరుసటి రోజు ఉపయోగించాలి. సాలగ్రామ పూజకు మాత్రం ఈ నిషేధము వర్తించదు. సాలగ్రామమున్నవారు అన్ని తిథివారములయందు తులసి దళములను త్రెంపవచ్చు. ఎందుకంటే సాలగ్రామం స్వయంగా విష్ణు స్వరూపం. శ్రీమహావిష్ణువు మందిరంలో వచ్చి ఉన్నప్పుడు ఏ దోషాలూ వర్తించవు. ఇది ఆహ్నిక సూత్రావళిలో చెప్పబడింది. స్నానము చేయకుండా మరియు పాద రక్షలు ధరించి తులసి చెట్టను తాకరాదు, దళములను త్రెంపకూడదు. ఇది పద్మపురాణంలో చెప్పబడింది.

తులసి దళాలను ఎలా త్రెంపాలి?

తులసి ఆకులను ఒక్కొక్కటిగా త్రెంపకూడదు. రెండేసి ఆకులు కలిగిన దళముతో కూడిన కొసలను త్రెంపాలి. అన్ని పుష్పాల కన్నా తులసీ మంజరులు (అంతే తులసికి వచ్చే పుష్పాలు) అత్యంత శ్రేష్ఠమని, ఈ మంజరులను కోసేటప్పుడు వాటితోపాటు ఆకులు తప్పనిసరిగా ఉండాలని బ్రహ్మపురాణం చెప్పింది.



తులసిమొక్కకు ఎదురుగా నిలబడి, రెండు చేతులు జోడించి, కింది మత్రాన్ని చదువుతూ పూజా భావంతో మొక్కను కదిలించకుండా తులసి దళాలను త్రెంపాలి. దీనివలన పూజాఫలం లక్షరెట్లు అధికంగా లభిస్తుంది అని పద్మపురాణం చెప్పింది.

మాతస్తులసి గోవింద హృదయానందకారిణి
నారాయణస్య పూజార్థం చినోమి త్వాం నమోస్తుతే 

తులస్యమృతజన్మాసి సదా త్వం కేశవప్రియా
చినోమి కేశ్వస్యార్థే వరదా భవ శోభనే

త్వదంగసంభవైః పత్రై పూజయమి యథా హరిం
తథా కురు కురు పవిత్రాంగి! కలౌ మలవినాశిని!

(ఆహ్నిక సూత్రావళి)

శ్రెహరికి ఆనందాన్ని కలిగించే తులసీ మాతా! నారాయణుని పూజ కొరకు నీ దళములను కోస్తున్నాను. నీకు నా నమస్కారములు. అమృతమునుండి జన్మించిన, ఎల్లప్పుడు శ్రీహరికి ప్రియమైన తులసీమాతా! ఆ కేశవుని పూజ కొరకు నీ దళాలను త్రెంపుతున్నాను. నాకు అభయమునివ్వు శుభకరీ! నీ శరీరమునుండి జన్మించిన పత్రములతో ఆ శ్రీహరిని పూజిస్తాను. కలియుగంలో సమస్త దోషములు తొలగించే పవిత్రమైన శరీరము కల తల్లీ! నేను తలపెట్టిన హరిపూజను సాఫల్యము చేయుము.

పూజ చేసిన తరువాత ఒక తులసీదళాన్ని "అచ్యుతానంతగోవింద" అని స్మరిస్తూ నోట్లో వేసుకొని తినాలి. ప్రతిరోజు భక్తిభావంతో ఒక తులసిదళాన్ని సేవించటం వలన సకల రోగాలు నశిస్తాయి, రాబోయే రోగాలు నిరోధించబడుతాయి.

దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు తులసీ దయాపూర్ణకలశీ అన్నారు ఒక గీతంలో. తులసి అంతటి వైభవము, దయ కల మాత. నిత్యం పూజిద్దాం, దళాన్ని సేవిద్దాం. సకల శుభాలను,ఆరోగ్యాన్ని పొందుదాం.