14, ఆగస్టు 2011, ఆదివారం

జయ జయ జయ ప్రియ భారత


జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. కన్నతల్లి కన్నా మిన్నయైన మాతృభూమి మనకు వారసత్వాన్ని, ఉనికిని వెలలేని సంపదగా ప్రసాదిస్తున్నది. దాస్యమంటే మన వివేకము, వివేచనము ఉపయోగించకుండా, పరధర్మానికి మోకరిల్లటం. స్వధర్మమనగా మనకు పూర్వీకులనుండి వచ్చిన జీవనశైలి, వృత్తి. ఈ అసమాన వైశిష్ట్యం కలిగిన స్వధర్మాన్ని వదలి కడుపు నింపుకోటానికి చెప్పలేని పరధర్మాలను ఆశ్రయిస్తూ, అందులో భాగంగా స్వధర్మాన్ని అపహాస్యం, అవహేళన చేస్తూ, కించ పరుస్తూ నా అంత తెలివికలవాడు లేడని కాలరు ఎగరేసుకుంటున్నాము. కానీ, ఈ పరధర్మ మార్గంలో వెళ్లటం ద్వారా ఏమి కోల్పోతున్నామో తెలుసా? - కాలానికి నిలిచిన ఒక బలీయమైన సంస్కృతి అనే హారంలో ఒక ముత్యంలా ఉండే అవకాశం, తద్వారా వచ్చే అనన్యమైన దైవసంపదను పొందే అవకాశం. పరధర్మమంటే విదేశాలకు వెళ్లటమని నా ఉద్దేశం కాదు. మన తల్లిదండ్రులు, తాతలు, అమ్మమ్మలు, బామ్మలు పాటించిన ధర్మాలు, నిర్వర్తించిన బాధ్యతలు విస్మరించి కేవలం నేను, నా కుటుంబం అనుకునే అవకాశవాదం పరధర్మం యొక్క ముఖ్య లక్షణం. పది వస్తే ఒకటిని ఇతరులతో పంచుకోవటం, లేనివానికి చేయి అందించి పైకి లేవదీయటం, తల్లిదండ్రులను అనాథ ఆశ్రమాలకు నెట్టకుండా వారిని ఆదరించి గౌరవించటం, మానవుని శక్తిని మించినది పారలౌకికమైనది, అపారమైన కరుణ కలది ఒక దైవిక శక్తి ఉన్నది అని నమ్మి దానికి శరణనటం, ఐదు వేళ్లు కలిస్తేనే చేయి, అలాగే, అందరూ కలిస్తేనే పటిష్టమైన సమాజం - ఇవి స్వధర్మం లక్షణాలు. వీటిని పాటించటం కష్టమేమీ కాదు. మీ అత్యాశలను తగ్గించుకొని చూడండి, మీ అవసరాలకు పరిమితిని పెట్టి చూడండి. అప్పుడు తప్పకుండా పక్కవారి గురించి ఆలోచించే వివేచనము, అవకాశము కలుగుతాయి.

స్వతంత్రమనగా స్వేచ్ఛగా జీవించటమొకటే కాదు, ఆ స్వేచ్ఛను గౌరవించటం, సమానత్వానికి పాటుపడటం. 15 లక్షలు సంవత్సరానికి సంపాదించే వ్యక్తి సంవత్సరానికి ఒక పేద విద్యార్థి చదువుకు సహాయపడలేడా? సంవత్సరానికి పది జతలు కొనుక్కునే సంపన్నులు ఒక జతను ఒక పేదరాలికి ఇవ్వలేరా? లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పార్టీలు జరుపుకునే వారు తల్లిదండ్రులకు కనీస సదుపాయాలు కలిగించలేరా? కారులో వెళ్లే ఉద్యోగి ఒక క్షతగాత్రుడికి సాయపడలేడా? 25 ఏళ్ల కుర్రాడు క్యూలో నిలుచుని నిదానంగా తనవంతు కొరకు వేచి ఉండలేడా? ఇదే స్వధర్మమంటే. ఒక్కదాన్ని పాటించి చూడండి. మీకే ఆత్మ సంతృప్తి కలుగుతుంది. నిజమైన స్వాతంత్య్రము ఏమిటో అర్థమవుతుంది.

స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా, భరతమాత బిడ్డగా జన్మించినందుకు గర్వంతో తల ఎత్తుకుని జై హింద్ అంటున్నాను. ఈ సందర్భంగా కొన్ని దేశభక్తి గీతాలు.


1 . జయ జయ జయ ప్రియ భారత 

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్యధాత్రి
జయ జయ జయ శత సహస్ర నరనారీ హృదయనేత్రి


జయ జయ సశ్యామల సుశ్యామచలచేలాంచల
జయ వసంత కుసుమలతా చలిత లలిత చూర్ణ కుంతల
జయమదీయ హృదయాశయ లాక్షారుణ పదయుగళ |జయ జయ|


జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ
జయ గాయక వైతాళిక గళ విశాల పథ విహరణ
జయ మదీయ మధురగేయ చుంబిత సుందర చరణ |జయ జయ|



2 . జయ జయ జయ జన్మభూమి

జయ జయ జయ జన్మభూమి 
జయ జయోస్తు మాతృభూమి


గంగా గౌతమి కృష్ణల కన్నతల్లి భారతి
కనకవర్షమొలికించే స్వర్గసీమ భారతి
తల్లికి నీరాజనమిడ తరలిరండి రండీ రండీ రండీ రండీ |జయ జయ|


ఆది ఋషుల జన్మభూమి ఈ పవిత్రభూమి
ఈ పవిత్రభూమిని రక్షించుట మన ధర్మం
ఇది భారత జనావళికి అశిధారా వ్రతము
ఇది భారత ప్రజావళికి పరీక్షా సమయము |జయ జయ|

3 . స్వతంత్ర భారత జనని

స్వతంత్ర భారత జనని నీకిదె నితాంత నవ నీరాజనము
అశేష పూజా శిరీషములతో అగణిత నరనారీ జనము

వదలెను చిరదాస్య శృంఖలమ్ములు చెదరెను దైన్యతమహ్పటలమ్ములు

ఆ సేతు హిమనగమ్మొక పొంగై అలముకొన్నదానంద తరంగం |స్వతంత్ర|

త్యాగమూర్తియౌ మహాత్ముడొసగిన శాంత్యహింసలే సదాశయమ్ముగ

సకల వసుంధరనేకము సేయగ అకళంకులమై ప్రతినలు సేతుము  |స్వతంత్ర|

 4 .  తేనెల తేటల మాటలతో

తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా
భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవన యానం చేయుదమా


సాగర మేఖల చుట్టుకొని సుర గంగ చీరగా మలచుకొని 
గీతా గానం పాడుకొని, మన దేవికి ఇవ్వాలి హారతులు |తేనెల తేటల|

గాంగ జటాధర భావనతో హిమశైల శిఖరమే నిలబడగా

గల గల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే |తేనెల తేటల|

ఎందరు వీరుల త్యాగఫలం మన నేటి స్వే
చ్ఛకే మూలబలం
వారందరినీ తలచుకొని మన మానస వీధిన నిలుపుకొని |తేనెల తేటల|