ప్రయాగ రంగదాసు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ప్రయాగ రంగదాసు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

10, అక్టోబర్ 2026, శనివారం

బాలాత్రిపురసుందరీ గైకొనుమా హారతి - ప్రయాగ రంగదాసు గారి కృతి



బాలాత్రిపురసుందరీ గైకొనుమా హారతి
గానలోల జాలమేల దారి చూపుమా 

సుందరాంగి అందరూ నీ సాటి రారుగా
సందేహమును అందముగా తీర్పుమంటిని 

వాసికెక్కియున్నదానవనుచు నమ్మితి
రాశిగా సిరిసంపదలిచ్చి బ్రోవుమంటిని 

ఓం హ్రీం శ్రీం యనుచు మదిని తలచుచుంటిని
ఆపదలెడబాపవమ్మా అతివ సుందరి 

స్థిరముగా శ్రీకడలి యందు వెలసితివమ్మా
ధరణిలో శ్రీరంగదాసుని దయను చూడుమా

ఓ బాలాత్రిపురసుందరీ దేవీ! భక్తితో నీకు సమర్పిస్తున్న హారతిని స్వీకరించుము తల్లీ! సంగీతమంటే ఎంతో ప్రీతిగల అమ్మా! ఇక ఆలస్యం చేయకుండా నాకు సరైన మార్గాన్ని చూపించుము. సుందరమైన రూపము కలిగిన తల్లీ! ఈ లోకంలో అందచందాలలో నీకు సాటివచ్చేవారు ఎవరూ లేరు. నా మనసులోని సందేహాలన్నింటినీ చక్కగా నివృత్తి చేయమని నిన్ను వేడుకుంటున్నాను. గొప్ప కీర్తిప్రతిష్ఠలు కలిగిన దేవతవని నిన్ను నమ్మి శరణు కోరుతున్నాను. నాకు సమృద్ధిగా సిరిసంపదలను ప్రసాదించి రక్షించుమని ప్రార్థిస్తున్నాను. ఓం, హ్రీం, శ్రీం అనే పవిత్ర బీజాక్షరాలతో నిన్ను నిరంతరం నా మనసులో స్మరిస్తున్నాను. ఓ అతిలోకసుందరీ! నా ఆపదలన్నింటినీ తొలగించి నన్ను కాపాడుము. శ్రీకడలి క్షేత్రంలో స్థిరంగా వెలసి భక్తులను అనుగ్రహిస్తున్న తల్లీ! ఈ భూమిపై నివసిస్తున్న నీ భక్తుడైన రంగదాసునిపై దయచూపి, అతని ప్రార్థనలను ఆలకించి, కరుణతో రక్షించుమని వేడుకుంటున్నాను.

ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు సమీపంలోని కడలి గ్రామంలో వెలసిన శ్రీ కపోతేశ్వరస్వామి ఆలయం ఒక ప్రసిద్ధ శైవక్షేత్రం. ఈ క్షేత్రంలో పరమశివుడు కపోతేశ్వరస్వామిగా, పార్వతీదేవి బాలాత్రిపురసుందరిగా భక్తుల పూజలందుకుంటున్నారు. స్థలపురాణం ప్రకారం, రెండు కపోతాలు (పావురాలు), ఒక బోయవాని త్యాగానికి సంబంధించిన కథ ఈ క్షేత్రానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యాన్ని కల్పించింది. ఆలయ ప్రాంగణంలో శ్రీచక్ర సహిత బాలాత్రిపురసుందరీ దేవి ప్రత్యేక సన్నిధిలో కొలువై ఉంది. ఆదిశంకరాచార్యులు ఇక్కడ శ్రీచక్రాన్ని, అమ్మవారిని ప్రతిష్ఠించారని స్థానిక సంప్రదాయం చెబుతోంది. అయితే ఈ ప్రతిష్ఠకు సంబంధించిన చారిత్రక ఆధారాలు స్పష్టంగా లభించడం లేదు. బాలాత్రిపురసుందరిని విద్యకు, జ్ఞానానికి, నిర్మలమైన భక్తికి, శ్రేయస్సుకు అధిదేవతగా ఆరాధిస్తారు. ఆలయ ప్రాంగణంలో వినాయకుడు, వీరభద్రస్వామి, సుబ్రహ్మణ్యస్వామి, కనకదుర్గాదేవి, కాలభైరవుడు, నవగ్రహాలు, సత్యనారాయణస్వామి తదితర దేవతల సన్నిధులు కూడా ఉన్నాయి. ఈ క్షేత్రానికి సంబంధించిన తీర్థం, స్థానిక విశ్వాసాలు, పూజా సంప్రదాయాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తాయి. వాగ్గేయకారులు ప్రయాగ రంగదాసు తన బాలాత్రిపురసుందరీ కీర్తనలో ‘స్థిరముగా శ్రీకడలి యందు వెలసితివమ్మా’ అని అమ్మవారిని స్తుతించడం ఈ క్షేత్రంతో ఆయనకున్న భక్తిసంబంధాన్ని తెలియజేస్తుంది. శివశక్తుల ఆరాధనకు, శ్రీచక్ర ఉపాసనకు, బాలాత్రిపురసుందరీ దేవి అనుగ్రహాన్ని కోరే భక్తులకు శ్రీకడలి ఒక విశిష్టమైన పుణ్యక్షేత్రంగా నిలుస్తోంది. 

ఖరహరప్రియ రాగంలో స్వరపరచబడిన ఈ ప్రయాగ రంగదాసు గారి కృతిని వారి దౌహిత్రులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఆలపించారు. 

25, సెప్టెంబర్ 2026, శుక్రవారం

కృష్ణమ్మా గోపాల బాలకృష్ణమ్మా - ప్రయాగ రంగదాసు కృతి


కృష్ణమ్మా గోపాల బాలకృష్ణమ్మా గోవింద బాల కృష్ణమ్మా గోపాల బాల కృష్ణమ్మా

నందకుమారా కృష్ణమా గోపాల బాలకృష్ణమ్మా నవనీతచోర కృష్ణమ్మా గోపాల బాలకృష్ణమ్మా
మందరధీర కృష్ణమ్మా మణిమాలహార కృష్ణమ్మా గోపాల బాలకృష్ణమ్మా గోపాల బాలకృష్ణమ్మా

లాలపోసెద చిన్నిబాలుడ నిన్ను ఉయ్యాలలోననుంచి జోలపాడెద రారా కృష్ణమ్మా
కృష్ణమ్మా గోపాల బాలకృష్ణమ్మా గోవింద బాల కృష్ణమ్మా గోపాల బాల కృష్ణమ్మా

తిరుమణశ్రీచూర్ణము ఆరువుగ దిద్ది పెరుగేసి చద్దిబువ్వ త్వరగా పెట్టెద రారా కృష్ణమ్మా
కృష్ణమ్మా గోపాల బాలకృష్ణమ్మా గోవింద బాల కృష్ణమ్మా గోపాల బాల కృష్ణమ్మా

పట్టుపుట్టముగట్టి పట్టంచుకండువగట్టి పట్టుదట్టి నడుముకు గట్టిగ కట్టెద రారా కృష్ణమ్మా
కృష్ణమ్మా గోపాల బాలకృష్ణమ్మా గోవింద బాల కృష్ణమ్మా గోపాల బాల కృష్ణమ్మా

పప్పు బెల్లము తియ్య అప్పాలు చెఱుకు నీకు ఇపుడే పెట్టెద మాయప్పా ఒప్పులకుప్ప కృష్ణమ్మా
కృష్ణమ్మా గోపాల బాలకృష్ణమ్మా గోవింద బాల కృష్ణమ్మా గోపాల బాల కృష్ణమ్మా

పానకము వడపప్పు పంచదారయు తేనె తిన మిఠాయి నీకు చానా పెట్టెద రారా కృష్ణమ్మా
కృష్ణమ్మా గోపాల బాలకృష్ణమ్మా గోవింద బాల కృష్ణమ్మా గోపాల బాల కృష్ణమ్మా

వెన్నపెట్టెద పైడిచిన్నిగిన్నెలో మీగడ ఉన్నాది తిందువు రారా చిన్ని ముద్దుల బాల కృష్ణమ్మా
కృష్ణమ్మా గోపాల బాలకృష్ణమ్మా గోవింద బాల కృష్ణమ్మా గోపాల బాల కృష్ణమ్మా

మామిడి పెద్ద పెద్ద జామి నేరేడి జీడిమామిడి పండు నీకు జాముసేపాయె తెచ్చి కృష్ణమ్మా
కృష్ణమ్మా గోపాల బాలకృష్ణమ్మా గోవింద బాల కృష్ణమ్మా గోపాల బాల కృష్ణమ్మా

కదళీ కర్పూర నారికేళ పనస ద్రాక్ష ఖండ శర్కర నీకు కలిపి పెట్టెద రారా కృష్ణమ్మా
కృష్ణమ్మా గోపాల బాలకృష్ణమ్మా గోవింద బాల కృష్ణమ్మా గోపాల బాల కృష్ణమ్మా

మురళీ గొలుసులు కంటె ముంజేతిమురుగులు పెట్టుదు పరుగుపరుగున రారా బాజాబందీలు కట్టెద కృష్ణమ్మా
కృష్ణమ్మా గోపాల బాలకృష్ణమ్మా గోవింద బాల కృష్ణమ్మా గోపాల బాల కృష్ణమ్మా

వేణునాదము చేత ఆడుకొందువు మృదువాణి జపమావర్తి వేణుగోపాల బాల కృష్ణమ్మా
కృష్ణమ్మా గోపాల బాలకృష్ణమ్మా గోవింద బాల కృష్ణమ్మా గోపాల బాల కృష్ణమ్మా

పుడమిలో గుడిమెళ్లంకపురవాసుడైన వరరంగదాసునికిపుడు వరములిచ్చిన తండ్రి కృష్ణమ్మా
కృష్ణమ్మా గోపాల బాలకృష్ణమ్మా గోవింద బాల కృష్ణమ్మా గోపాల బాల కృష్ణమ్మా

ఓ కృష్ణమ్మా! గోపాల బాలకృష్ణా! గోవిందా! నందకుమారా! వెన్నను దొంగిలించే నవనీతచోరా! మందర పర్వతాన్ని ధరించిన ధీరుడా! మణిమాలలు ధరించిన సుందర కృష్ణా! నిన్ను చిన్నిబాలుడిగా ఉయ్యాలలో ఉంచి లాలపోస్తూ జోలపాడెదను, రారా కృష్ణా. నీకు తిరుమణి శ్రీచూర్ణము చక్కగా దిద్ది, పెరుగుతో చద్దిబువ్వ కలిపి త్వరగా తినిపించెదను. పట్టుబట్టలు తొడిగి, పట్టంచు కండువా వేసి, నడుముకు వస్త్రమును గట్టిగా కట్టెదను. పప్పు, బెల్లము, తియ్యని అప్పాలు, చెరకు నీకు పెట్టెదను; నా తండ్రీ, అందాలరాశివైన కృష్ణా రారా. పానకము, వడపప్పు, పంచదార, తేనె, మిఠాయిలు సమృద్ధిగా పెట్టెదను. చిన్న బంగారు గిన్నెలో వెన్నను, మీగడను పెట్టి తినిపించెదను, నా చిన్ని ముద్దుల బాలకృష్ణా రారా. పెద్ద పెద్ద మామిడిపండ్లు, జామపండ్లు, నేరేడుపండ్లు, జీడిమామిడిపండ్లు తెచ్చి నీకు పెట్టెదను; అరటిపండ్లు, కర్పూరం, కొబ్బరి, పనస, ద్రాక్ష, ఖండశర్కర అన్నీ కలిపి సమర్పించెదను. నీకు మురళి, గొలుసులు, చేతులకు మురుగులు అలంకరించి, బాజాబందీలు కట్టెదను; పరుగుపరుగున రారా కృష్ణా. మధురమైన మాటలు పలికే వేణుగోపాలా! వేణునాదము చేస్తూ ఆనందంగా ఆడుకొందువు గాక. ఈ భూమిపై గుడిమెళ్లంకపురంలో నివసించే వరరంగదాసునికి వరములు ప్రసాదించిన తండ్రివి నీవే కృష్ణా!

ప్రయాగ రంగదాసు గారు మన ఆంధ్రప్రదేశ్ లో పుట్టిన ఒక వాగ్గేయకారులు. మంగళంపల్లి బాలమురళీకృష్ణగారి మాతామహులు వీరు. ఈయన ఎన్నో మంచి కీర్తనలు శ్రీరాముని మీద, కృష్ణుని మీద, అమ్మ వారి మీద రచించారు. రంగదాసు గారు శ్రీమద్వాల్మీకి రామాయణంలోని బాలకాండం ప్రేరణతో రాముడుద్భవించినాడు అనే కీర్తన రాశారు. కోనసీమలోని గుడిమెళ్లంకపురం వీరి స్వగ్రామం. రంగదాసు గారు తన ముద్రగా తన స్వగ్రామాన్ని వాడటం ఆయన వ్యక్తిత్వాన్ని చూపుతుంది. వీరు గుడిమెళ్లంక నుండి వెళ్లి ప్రయాగలో స్థిరపడ్డారని, కొన్ని వందల కృతులను రచించి, స్వరపరచి ఎందరికో నేర్పించారని నోటిమాట ద్వారా బాలమురళీకృష్ణ గారు శిష్యులకు చెప్పారు. వారు రచించిన ఓ అద్భుతమైన కృతి, అచ్చతేనెతెలుగులో. ఈ కృతిని ప్రిన్స్ రామవర్మ గారు ఆలపించారు.

28, మార్చి 2015, శనివారం

సీతారామ వైభవం-2 - రాముని జననం


జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం
జనన మరణ ఖేద క్లేశ విచ్ఛేద మంత్రం
సకల నిగమ మంత్రం సర్వ శాస్త్రైక మంత్రం
రఘుపతి నిజ మంత్రం రామ రామేతి మంత్రం

అగ్ని బీజమై సమస్త పాపఖండన చేసేది రామనామము. తరించేది కాబట్టి తారకమంత్రమైనది. హనుమ మొదలు ఎందరిని తరింపజేసింది? జన్మకు సాఫల్యాన్ని కలిగించే మంత్రం...జననమరణాల దుఃఖాన్ని, కష్టాలను నాశనం చేసే మంత్రం, వేద సారమైన మంత్రం, అన్ని శాస్త్రములు ఏకమై ఘోషించే మంత్రం, రాముని నిజ మంత్రం రామ రామ అనే మంత్రం...అని శ్రీరామ కర్ణామృతమ్ మనకు బోధిస్తుంది. మరి ఆ రాముని అవతారం ఎలా జరిగింది?

శ్రీరాముని జననానికి రావణ సంహారం కారణమైతే దానికి వేదికి అయోధ్యానగరం. రఘువంశ కులజుడైన దశరథునికి సంతానం లేకపొవడంతో అశ్వమేథ యాగం తలపెడతాడు. ఆ యాగానికి ఋష్యశృంగ మహర్షిని దశరథుని మంత్రియైన సుమంతుడు పిలిపిస్తాడు. ఋష్యశృంగుడు అయోధ్యకు వచ్చి దశరథునిచే అశ్వమేథం చేయిస్తాడు. అటు తరువాత దశరథుడు పుత్రప్రాప్తికై క్రతువును చేయించమని ఆయనను అభ్యర్థిస్తాడు. అప్పుడా ఋష్యశృంగుడు అథర్వ శీర్షంలో ఉన్న పుత్రకామేష్టి క్రతువు చేస్తానని చెబుతాడు. ఋష్యశ్రంగుని వంటి తపోసంపన్నుడు క్రతువు ఏర్పాట్లు మొదలుబెడతాడు. ఆయన పవిత్రతకు బ్రహ్మాది దేవతలు తమ హవిర్భాగం గ్రహించటానికి యాగశాలలో ప్రత్యక్షమవుతారు. దేవతలందరూ అక్కడ బ్రహ్మదేవుని రావణుని హింసలనుండి విముక్తి కలిగించవలసిందిగా వేడుకుంటారు. బ్రహ్మ ఆతను మానవులచేత మాత్రమే సంహరించబడతాడు అని అంటాడు. అంతలో శ్రీమహావిష్ణువు యాగశాలలో ప్రత్యక్షమవుతాడు. దేవతలందరూ ఆయనను ప్రార్థిర్స్తారు. అప్పుడు ఆ పరమాత్మ పూర్ణాంశతో రామునిగా, అర్థాంశతో భరత లక్ష్మణ శతృఘ్నులుగా జన్మిస్తానని చెబుతాడు. ఋష్యశృంగుడు పుత్రకామేష్టి విజయవంతంగా పూర్తి చేస్తాడు. శ్రీమహావిష్ణువు దశరథుని కుమారులుగ జన్మించాలని సంకల్పిస్తాడు. యజ్ఞపురుషుడు పాయస పాత్రను దశరథునికిచ్చి ఆ పాయసాన్ని భార్యలకు పంచమని చెబుతాడు. దశరథుడు ఆ పాయసంలో సగభాగాన్ని పెద్ద భార్య కౌసల్యకు, 1/4 భాగం సుమిత్రకు, 1/8 భాగము చిన్న భార్య కైకేయికి, మిగిలిన 1/8 భాగము సుమిత్రకు ఇస్తాడు. కొంతకాలానికే ఆ రాణులు గర్భవతులవుతారు. దాదాపు పన్నెండు నెలల తరువాత కౌసల్యకు రాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శతృఘ్నులు జన్మిస్తారు. 

రాముని జననం గురించి వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణం బాలకాండలోని 18వ సర్గలో ఇలా తెలిపారు...
తతో యజ్ఞే సమాప్తే తు ఋతూనాం షట్ సమత్యయుః
తతశ్చ ద్వాదశే మాససే చైత్రే నావమికే తిథౌ

నక్షత్రేదితి దైవత్యే స్వోచ్చసంస్థేషు పంచసు
గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతావిందునా సహ

ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం
కౌసల్యా జనయద్రామం సర్వలక్షణ సమ్యుతం

విష్ణోరర్థం మహాభాగం పుత్త్రం ఐక్ష్వాకు వర్ధనం
కౌసల్యా శుశుభే తేన పుత్త్రేణామితతేజసా
యథా వరేణ దేవానాం అదితిర్వజ్రపాణినా

పుత్రకామేష్టి యాగం ముగిసిన సంవత్సర కాలం తరువాత చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నాలుగవ పాదమున కర్కాటక లగ్నమున కౌసల్యాదేవియందు శ్రీరామచంద్రుడు జన్మించాడు . ఆ సమయములో సూర్యుడు, అంగారకుడు, గురుడు, శుక్రుడు, శని అను ఐదు గ్రహములు తమ ఉచ్చ స్థానములందు అనగా క్రమముగా మేష, మకర, కర్కాటక, మీన తులారాశులయందు ఉండిరి. కర్కాటక రాశియందు గురు చంద్రులు కలిసి ఉండిరి. బుధుడు, రవి మేషమునందుండిరి. జగన్నాథుడు, అన్ని లోకములవారిచే నమస్కరింపబడువాడు, సకల శుభ లక్షణ సంపన్నుడు, గొప్ప భాగ్యశాలి, ,విష్ణువు అంశతో పుట్టినవాడు,  ఇక్ష్వాకు వంశ తిలకుడు  అయిన శ్రీరాముని కన్నఆ  కౌసల్య ఎంత ధన్యురాలు? కౌసల్యా దేవి తన తపఃఫలముగా అర చేతిలో  వజ్రరేఖలు కలవాడు, అమితమైన తేజస్సు కలిగినవాడు  అయిన శ్రీరాముని పుత్రునిగా పొందింది. దేవతలలో ఉత్తముడు, వజ్రాయుధాన్ని ధరించే ఇంద్రుని పుత్రునిగా పొందిన అదితిలా  ఆ కౌసల్య మాట అలరారింది . రాముని జనన సమయంలో ఐదు గ్రహాలు ఉచ్చ స్థానంలో ఉండటం  వలన,జ్యోతిష్య శాస్త్ర ప్రమాణం ప్రకారం "పంచోచ్చే లోకనాయకః" . అందుకే రాముడు లోకానికి ప్రభువైనాడు.

ఆ తరువాత విష్ణువు అర్థాంశగా భరతుడు చైత్ర శుద్ధ దశమి పుష్యమీ నక్షత్ర సమయంలో కైకేయికి, లక్ష్మణ శతృఘ్నులు చైత్ర శుద్ధ దశమి ఆశ్లేష నక్షత్ర సమయములో సుమిత్రకు జన్మించారు. ఈ నలుగురు అన్నమ్దన్న్ములు జన్మించ సమయంలో గంధర్వులు మధుర గానం చేశారు, అప్సరసలు హృద్యంగా నాట్యం చేశారు. దేవదున్ధుబులు మ్రోగగా దేవతలు పూల వానలు కురిపించారు.

దశరథ మహారాజు తన ఉత్తములకు, తన వందిమాగదులకు బహుమానాలిచ్చాడు.బ్రాహ్మణులకు గోవులు ధన కనక వస్తు వాహనాలను దానం చేశాడు. ప్రజలు ఆనందోత్సాహాలతో ఆడిపాడారు. రాజవీదులన్నీ గాయకుల పాటలతో, నృత్యాలతో, ఉత్సవాలతో నిండిపోయాయి.  దశరథ మహారాజు అయోధ్యాపుర వాసులకు మృష్టాన్న భోజనాలు పెట్టి సంతృప్తి  పరచాడు . 
ఈ రామ జననాన్ని మన తెలుగు గడ్డపై పుట్టిన ప్రయాగ రంగదాసు గారు అద్భుతంగా వర్ణించారు. ఆ కీర్తన వివరాలు:


కళ్యాణ రామునికి కౌసల్య లాలి
రాముడుద్భవించినాడు రఘు కులంబున    

తామసులను దునిమి దివిజ స్థోమంబున
క్షేమముకై కోమలి కౌసల్యకు శ్రీరాముడుద్భవించినాడు

తనరు చైత్ర శుద్ధ నవమి పునర్వసంబున
సరస కర్కాటక లగ్నమరయగ సురవరులెలమిని కురియింప విరుల వాన 

దశరధుండు భూసురులకు ధనమొసంగగా  
విసరె మలయ మారుతము దిశలెల్లను విశదములై వసుమతి దుర్భరము బాప

ధరను గుడిమెళ్ళంక పురమునరసి బ్రోవగా
కరుణతో శ్రీ రంగదాసు మొరలిడగను కరుణించియు వరమివ్వను స్థిరుడై శ్రీ 


దీని సారాంశము:

దశరథుడు బ్రాహ్మణులకు దానాలు చేయగా, అన్ని దిశలా మలయ మారుతాలు వీచగా, భూదేవి బాధను తగ్గించటానికి, చైత్రమాసమున, శుద్ధ నవమి నాడు, పునర్వసు నక్షత్రమున, కర్కాటక లగ్నమందు మెరుపులు మెరుస్తుండగా, దేవతలు పూలవానలు కురిపిస్తుండగా, దేవతల క్షేమము కొరకు, రాక్షసులను చంపటానికి శ్రీరాముడు కౌసల్యా గర్భమున జన్మించాడు.  


మనకు శ్రీకృష్ణుని జననం గురించి ఎన్నో వర్ణనలు వచ్చాయి. ఇక్కడ ప్రయాగ రంగదాసు గారు రాముని జన్మమును ఎన్నుకోవటం విశేషం. .ప్రయాగ రంగదాసు గారు మన ఆంధ్ర ప్రదేశ్ లో పుట్టిన ఒక వాగ్గేయ కారుడు.  మన మంగళంపల్లి బాలమురళీ కృష్ణగారి మాతామహులు వీరు. ఈయన ఎన్నో మంచి కీర్తనలు శ్రీ రాముని మీద రచించారు.  రంగదాసు గారు శ్రీమద్వాల్మీకి రామాయణంలోని బాలకాండం ప్రేరణతో ఈ కీర్తన రాశారు. రంగదాసు గారు తన ముద్రగా తన స్వగ్రామాన్ని వాడటం ఆయన వ్యక్తిత్వాన్ని చూపుతుంది. ప్రయాగ రంగదాసు గారు మరెన్నో అద్భుతమైన కీర్తనలను రచించారు. వాటిలో రామ రామ యనరాదా రఘుపతి రక్షకుడని వినలేదా, ఏమే చిట్టీ, కృష్ణమ్మా గోపాల బాల కృష్ణమ్మ, రామా నిను వినా వంటివి చాలా ప్రాచుర్యం పొందారు. ఆయన 1859వ సంవత్సరంలో మెళ్లంక గ్రామంలో జన్మించారు.  మంచి హరికథకులు. ఆధ్యాత్మ రామాయణ సంకీర్తనలు ఆయన నోటనే ప్రాచుర్యం పొందాయి. అలాగే, అష్టపదులు, నారాయణ తీర్థ తరంగాలను రంగదాసు గారు ప్రచారంలోకి తెచ్చారు. వారి రచన అయిన రాముడుద్భవించినాడు అనే కీర్తనకు అరవైయ్యవ దశకంలోని ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారి శ్రవణం.  



21, సెప్టెంబర్ 2010, మంగళవారం

రామ రామ యనరాద

మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి మాతామహులైన శ్రీ ప్రయాగ రంగదాసు గారి మరొక రచన:


రామ రామ యనరాద రఘుపతి రక్షకుడని వినలేదా
కామజనకుని కథ వినువారికి కైవల్యంబే కాదా

ఆపద్బాంధవుడగు శ్రీరాముని ఆరాధించగ రాదా
పాపంబులు పరిహారమొనర్చెడి పరమాత్ముండే కాదా

సారహీన సంసార భవాంబుధి సరగున దాటగ రాదా
నీరజాక్షుని నిరతము నమ్మిన నిత్యానందమే కాదా

వసుధను గుడిమెళ్లంకను వెలసిన వరగోపలుడె కాదా
పసివాడగు శ్రీ రంగదాసుని పాలించగ వినలేదా
యూట్యూబ్ లంకె.

7, సెప్టెంబర్ 2010, మంగళవారం

శ్రీరామ జననం - ప్రయాగ రంగదాసు గారి రచన

ప్రయాగ రంగదాసు గారు మన ఆంధ్ర ప్రదేశ్ లో పుట్టిన ఒక వాగ్గేయ కారుడు.  మన మంగళంపల్లి బాలమురళీ కృష్ణగారి మాతామహులు వీరు. ఈయన ఎన్నో మంచి కీర్తనలు శ్రీ రాముని మీద రచించారు. వాటిలో ఒకటి శ్రీరాముని జననం గురించి ఈ క్రిందది . రంగదాసు గారు శ్రీమద్వాల్మీకి రామాయణంలోని బాలకాండం ప్రేరణతో ఈ కీర్తన రాశారు. కోనసీమలోని గుడిమెళ్లంకపురం వీరి స్వగ్రామం.

దీని సారాంశము:

దశరథుడు బ్రాహ్మణులకు దానాలు చేయగా, అన్ని దిశలా మలయ మారుతాలు వీచగా, భూదేవి బాధను తగ్గించటానికి,  చైత్రమాసమున, శుద్ధ నవమి నాడు, పునర్వసు నక్షత్రమున, కర్కాటక లగ్నమందు మెరుపులు మెరుస్తుండగా, దేవతలు పూలవానలు కురిపిస్తుండగా, దేవతల క్షేమము కొరకు, రాక్షసులను చంపటానికి శ్రీరాముడు కౌసల్యా గర్భమున జన్మించాడు.  

రంగదాసు గారు తన ముద్రగా తన స్వగ్రామాన్ని వాడటం ఆయన వ్యక్తిత్వాన్ని చూపుతుంది. అరవైయ్యవ దశకంలోని ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రవణం.

కళ్యాణ రామునికి కౌసల్య లాలి

 రాముడుద్భవించినాడు రఘుకులంబున
తామసులను దునిమి దివిజ
సోమంబుల క్షేమముకై
కోమలి కౌసల్యకు |శ్రీ రాముడు|


పలువరుస ఆణిముత్యపు
సిరులోయన కిలకిలమని నవ్వుచు


దశరథుండు భూసురులకు ధనమొసంగగా
విసరె మలయమారుతములు
దిశలెల్లను విశదములై
వసుమతి దుర్భరము బాప |రాముడు|


తనరు చైత్ర శుద్ధ నవమి పునర్వసందున
సరస కర్కాటకలగ్న
మరయగ సురవరులెలమిని
కురిపించిరి విరుల వాన |రాముడు|


ధరను గుడిమెళ్లంకపురము
నరసి బ్రోవగా
కరుణతో శ్రీ రంగదాసు
మొరలిడగను కరుణించియు వరమీయగ హరియై |రాముడు|

అవధూత వెంకయ్యస్వామి జీవిత విశేషాలు

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వెంకటాచలం మండలంలోని గొలగమూడి గ్రామంలో వెలసిన భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి ఆశ్రమం ఒక ప...