30, సెప్టెంబర్ 2010, గురువారం

ఉమామహేశ్వర స్తోత్రము

అర్థనారీశ్వర స్తోత్రం లాగనే శంకర భగవత్పాదులు శివపార్వతుల అభేద్యమైన ఏకత్వంలో వారి వారి విభిన్నమైన లక్షణాలను ఉమామహేశ్వర స్తోత్రంలో కూడా వర్ణించారు. శివపార్వతులు అనగానే అభేద్యమైన ప్రకృతీపురుషుల రూపము, విలక్షణమైన అలంకారాలు, వాహనాలు, అనుగ్రహ లక్షణాలు, అదే సమయంలో ఒకరికొకరు పరిపూరకమై, అనుషంగికమైన తత్త్వము గోచరిస్తాయి. దీనిని ఆదిశంకరులు వివరించినట్లు మరెవ్వరూ చేయలేదు. నమశ్శివాభ్యాం నవయౌవనాభ్యాం అనే ఈ ఉమామహేశ్వర స్తోత్రం, తాత్పర్యం. శంకరులు ఈ స్తోత్రంలో ఆది దంపతుల మహిమను, వైభవాన్ని అద్భుతంగా వర్ణించారు.

జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ
నమః శివాభ్యాం నవయౌవనాభ్యం
పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం
నాగేంద్రకన్యా వృషకేతనాభ్యాం
నమో నమః శంకర పార్వతీభ్యాం

తాత్పర్యము : ఎల్లప్పుడూ యవ్వనంగా, అర్థనారీశ్వర రూపంలో ఒకటై, పర్వతరాజ పుత్రికగా ఒకరు, వృషభము సంకేతముగా ఇంకొకరు ఉన్న శివ పార్వతులకు నమస్కారములు.



నమః శివాభ్యాం సరసోత్సవాభ్యాం
నమస్కృతాభీష్ట వరప్రదాభ్యాం
నారాయణేనార్చిత పాదుకాభ్యాం
నమో నమః శంకర పార్వతీభ్యాం
 
తాత్పర్యము : వారి సరసము ఒక ఉత్సవముగ ఉన్న, నమస్కరించేవారికి వరాలు ప్రసాదించే, నారాయణుని చేత పూజింపబడిన పాదములు కలిగిన శివ పార్వతులకు నమస్కారములు.

నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం
విరించివిష్ణ్వింద్ర సుపూజితాభ్యాం
విభూతిపాటీరవిలేపనాభ్యాం
నమో నమః శంకర పార్వతీభ్యాం
 
తాత్పర్యము : నందిని అధిరోహించి, బ్రహ్మ, విష్ణు, ఇంద్రుల చేత పూజించబడిన, విభూతి మరియు గంధములతో విలేపనము చేసిన శరీరములు కలిగిన శివ పార్వతులకు నమస్కారములు.

నమః శివాభ్యాం జగదీశ్వరాభ్యాం
జగత్పతిభ్యాం జయవిగ్రహాభ్యాం
జంభారిముఖ్యైరభివందితాభ్యాం
నమో నమః శంకర పార్వతీభ్యాం
 
తాత్పర్యము : ఈ జగత్తుకే అధినాయిక, అధిపతి అయిన, ఎల్లప్పుడూ జయం కలిగే వారికి, ఇంద్రాది ప్రముఖులచే వందితమైన శివ పార్వతులకు నా నమస్కారములు.

నమః శివాభ్యాం పరమౌషదాభ్యాం
పంచాక్షరీ పఙ్జర రంజితాభ్యాం
ప్రపంచసృష్టిస్థితి సంహృతాభ్యాం
నమో నమః శంకర పార్వతీభ్యాం
 
తాత్పర్యము : పరమౌషధమైన వారికి, పంచాక్షరీ పఠనం మరల మరల చేయుటతో సంతోషించే, ప్రపంచ సృష్టి, వినాశనం చేసే శివపార్వతులకు నమస్కారములు.

నమః శివాభ్యామతిసుందరాభ్యాం
అత్యంతమాసక్తహృదాంబుజాభ్యాం
అశేష లోకైకహితంకరాభ్యాం
నమో నమః శంకర పార్వతీభ్యాం
 
తాత్పర్యము : అత్యంత సుందరమైన రూపముతో, భక్తుల హృదయ పద్మములందు ఆసక్తి కలిగిన, ఈ లోకాని అత్యంత హితము కలుగ చేసే శివ పార్వతులకు నా నమస్కారములు.

నమః శివాభ్యాం కలినాశనాభ్యాం
కఙ్కాళకళ్యాణ వపుర్ధరాభ్యాం
కైలాసశైలస్థిత దేవతాభ్యాం
నమో నమః శంకర పార్వతీభ్యాం

తాత్పర్యము : కలి యొక్క ప్రభావాన్ని నాశనము చేసే, ఒక పక్క కపాలాది భయానక అలంకారము, ఇంకొక పక్క శుభకరమైన రూపము కలిగిన, కైలాస పర్వతము మీద నివసించి ఉన్న శివ పార్వతులకు నమస్కారములు.

నమః శివాభ్యాం అశుభాపహాభ్యాం
అశేషలోకైక విశేషితాభ్యాం
అకుంఠితాభ్యాం స్మృతిసంభృతాభ్యాం
నమో నమః శంకర పార్వతీభ్యాం
 
తాత్పర్యము : ఆశుభాలను, పాపాలను నాశనము చేసే, లోకములోకెల్లా విశేషమైన వారి, అమోఘమైన జ్ఞానము, కుశలత కలిగి, అమోఘమైన జ్ఞాపక శక్తి కలిగిన శివ పార్వతులకు నా నమస్కారములు.

నమః శివాభ్యాం రచితాభయాభ్యాం
రవీందు వైశ్వానర లోచనాభ్యాం
రాకాశశాంకాభముఖాంబుజాభ్యాం
నమో నమః శంకర పార్వతీభ్యాం
 
తాత్పర్యము : ఆశ్రితులకు అభయమిచ్చే, సూర్యుడు, చంద్రుడు, అగ్ని త్రినేత్రములుగా కలిగి, పూర్నచంద్రుని వలె ముఖ కమలములు ఉన్న శివ పార్వతులకు నమస్కారములు.  (ఈ శ్లోకం ఇంకొక ప్రచురణలో మొదటి వాక్యం 'రథవాహనాభ్యాం' అని ఉంది. ఏది సరైనదో తెలియదు).

నమః శివాభ్యాం జటిలంధరభ్యాం
జరామృతిభ్యాం చ వివర్జితాభ్యాం
జనార్దనాబ్జోద్భవ పూజితాభ్యాం
నమో నమః శంకర పార్వతీభ్యాం
 
తాత్పర్యము : జటా ఝూటములు ధరించి, వృద్ధాప్యము, మరణము లేని వారి, విష్ణు, బ్రహ్మల చే పూజించబడే శివపార్వతులకు నమస్కారములు.

నమః శివాభ్యాం విషమేక్షణాభ్యాం
బిల్వచ్ఛదామల్లికదామభృద్భ్యాం
శోభావతీ శాంతవతీశ్వరాభ్యాం
నమో నమః శంకర పార్వతీభ్యాం
 
తాత్పర్యము : కష్టకాలములో మనకు వారి చల్లని చూపులతో రక్షణ కలిగించే, మారేడు, మల్లెలతోకూడిన మాలలు ధరించి, శాంతితో శోభితమైన  శివపార్వతులకు నా నమస్కారములు.

నమః శివాభ్యాం పశుపాలకాభ్యాం
జగత్రయీ రక్షణ బద్ధహృద్భ్యాం
సమస్త దేవాసురపూజితాభ్యాం
నమో నమః శంకర పార్వతీభ్యాం
 
తాత్పర్యము : పశుపతి యైన, మూడు లోకాలను కాపాడే బాధ్యతను స్వీకరించిన, దేవతలు, అసురులచే పూజించ బడిన శివ పార్వతులకు నమస్కారములు.

ఫలశృతి:
స్తోత్రం త్రిసంధ్యం శివపార్వతీభ్యాం
భక్త్యా పఠేద్ ద్వాదశకం నరో యః
స సర్వ సౌభాగ్య ఫలాని భుంక్తే
శతాయురాంతే శివలోకమేతి

తాత్పర్యము : ఈ పన్నెండు శ్లోకాలు కలిగిన స్తోత్రాన్ని మూడు కాలాలలో పఠనం చేసిన వారికి అన్ని శుభ ఫలాలు కలిగి, దీర్ఘాయుష్షు తర్వాత శివలోక ప్రాప్తి కలుగును.

యూట్యూబ్ లంకె
ఇతి ఉమామహేశ్వర స్తోత్రం సంపూర్ణం

ప్రాతః స్మరణం

ఆది శంకరుల మరొక రచన ప్రాతః స్మరణ స్తోత్రం.  ఇందులో ఆయన అద్వైతామృత సారాన్ని పంచారు.

ప్రాతః స్మరణం

ప్రాతః స్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం
సచ్చిత్సుఖం పరమహంస గతిం తురీయమ్
యత్ స్వప్న జాగర సుషుప్తిమవైతి నిత్యం
తత్ బ్రహ్మ నిష్కల మహం న చ భూత సఙ్ఘః

తాత్పర్యము: సచ్చిదానంద స్వరూపమగు, పరమహంసలకు కూడా ఆశ్రయమైనట్టి, తురీయము (జాగ్రత్, స్వప్న సుషుప్తావస్తలు కాని నాలుగవ స్థితి) అయినట్టి, హృదయములో ప్రకాశించే ఆత్మ తత్వమును ప్రాతః కాలమున స్మరించుచున్నాను. ఈ మూడు అవస్థలను ఎరుగనిది, నిత్యము, నిష్కలము (లక్షణాలు లేనిది) అయిన బ్రహ్మను నేను. పంచ భూతములతో నిర్మితమైన శరీరమును నేను గాను.

ప్రాతర్భజామి మనసాం వచసామగమ్యం
వాచో విభాన్తి నిఖిలా యదనుగ్రహేణ
యన్నేతి నేతి వచనైర్నిగమా అవోచం
స్తం దేవ దేవ మజమచ్యుతమాహురగ్ర్యమ్

తాత్పర్యము: మనస్సు, వాక్కులకు కనిపించుచు, వాటిని ప్రకాశింపచేయుచు, వేదములచే "నేతి" "నేతి" (ఇది కాదు ఇది కాదు) అని వర్ణింపబడుచు, పర దేవతయై, "అజ" (జన్మము లేని) , "అచ్యుత" (నాశనము లేని), "ఆదిపురుష" (అత్యున్నతమైన)  శబ్దములచే వర్ణింపబడు పరబ్రహ్మమును ప్రాతః కాలమున భజించుచున్నాను.

ప్రాతర్నమామి తమసః పరమర్క వర్ణం
పూర్ణం సనాతనవదం పురుషోత్తమాఖ్యమ్
యస్మిన్నిదమ్ జగదశేషమశేషమూర్తౌ
రజ్జ్వాం భుజఙ్గమ ఇవ ప్రతిభాసితం వై


తాత్పర్యము: అజ్ఞానానికి అతీతమైంది, సూర్యుని తేజస్సుకు సమానమైనది, పూర్ణము, సనాతనమైన పురుషోత్తముడైన పరబ్రహమును ప్రాతః కాలమున నమస్కరించుచున్నాను. సర్వ మూర్తి స్వరూపుడగు ఈ అశేష మూర్తి యందె జగత్తంతయు రజ్జువున (తాడున) సర్పము వలె ప్రకాశించుచున్నది.

ఫలశ్రుతి:

శ్లోకత్రయమిదం పుణ్యం లోకత్రయవిభూషణమ్
ప్రాతః కాలే పఠేద్ యస్తు స గచ్ఛేత్ పరమం పదమ్ 

తాత్పర్యము: మూడులోకాలకు అలంకారమగు ఈ మూడు శ్లోకాలను పఠించే వారికి ముక్తి కలుగును.

29, సెప్టెంబర్ 2010, బుధవారం

గురు గీత

గురుగీత స్కాందపురాణంలో, బ్రహ్మ సంహితలో  శివపార్వతుల సంవాదములో  చెప్పబడింది. వ్యాస భగవానులు గురువు యొక్క విశిష్టతను చాలా గొప్పగా, సరళమైన సంస్కృతంలో చెప్పారు. ఇందులో ఇరవై ఏడు శ్లోకాలు ఉన్నాయి. దత్త సంప్రదాయంలో గురుగీతను చాలా ముఖ్యమైన భాగంగా పరిగణిస్తారు.  పిఠాపురంలోని శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వారు చక్కని ప్రింట్ లో చాలా తక్కువ ధరకు దీన్ని ప్రచురించారు. గురుగీత శ్లోకాలు, తాత్పర్యము మీకోసము.

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరం బ్రహ్మా తస్మై శ్రీ గురవే  నమః


 తాత్పర్యము: గురువు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. ఆయనే ఆ పరబ్రహ్మము. ఆయనకు నా నమస్కారములు. 
 అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే  నమః


 తాత్పర్యము: అజ్ఞానమనే అంధకారాన్ని జ్ఞానమనే అంజనముతో తొలగించిన (కంటిలో ఉన్న నలుసును తొలగించినట్లు) ఆ గురువునకు నా నమస్కారములు. 

అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం
తత్పదం దర్శితేన తస్మై శ్రీ గురవే  నమః


 తాత్పర్యము: అనంతమైన, అఖండమైన, సృష్టిలోని కదిలే కదలని ప్రతి ప్రాణి/వస్తువు లో ఉండే బ్రహ్మ యొక్క నిజాన్ని తెలిపే ఆ గురువుకు నా నమస్కారములు. 

స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్సచరాచరం
త్వం పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే  నమః

తాత్పర్యము: సృష్టిలో, కదిలే కదలని ప్రతి వస్తువులో ఉండే జీవాత్మ నిజాన్ని తెలిపే ఆ గురువుకు నా నమస్కారములు. 

చిన్మయం వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం
అసిత్వం దర్శితం యేన తస్మై శ్రీ గురవే  నమః

 తాత్పర్యము: చరాచారాలతో కూడిన మూడులోకాలను వ్యాపించి ఉన్న శుద్ధ చైతన్య స్వరూపమైన బ్రహ్మ గురించి తెలిపే అసి శబ్దాన్ని వివరించే గురువుకు నా నమస్కారములు.  

నిమిషార్ధార్ధపాదాద్వా యద్వాక్యాద్వై విలోక్యతే
స్వాత్మానం స్థిరమాధత్తే తస్మై శ్రీ గురవే  నమః


 తాత్పర్యము: ఆత్మజ్ఞానమనేది ఎవరి ద్వారా అయితే ఒకనిమిషములోని అత్యంత అల్పమైన భాగము లో కలుగుతుందో ఆ గురువునకు నా నమస్కారములు.

యస్య దేవే పరాభక్తిర్యథా దేవే తథా గురౌ
తస్యైతే కథితాహ్యర్థా ప్రకాశంతే మహాత్మనః


 తాత్పర్యము: దైవము, గురువు పట్ల అత్యంత ఉన్నతమైన భక్తి కలిగిన వానికే శాస్త్రాలు తమ నిగూఢ అర్థాన్ని పూర్తిగా తెలుపుతాయి.

త్వం పితా త్వం చ మే మాతా త్వం బంధుస్త్వం చ దేవతా
సంసారభీతిభంగాయ తస్మై శ్రీ గురవే  నమః


 తాత్పర్యము: నీవే నా తండ్రివి, తల్లివి, హితుడవు, దేవుడవు. సంసార భయాన్ని పోగొట్టే గురువైన నీకు నా నమస్కారములు.

గుకారశ్చంధకారస్తు రుకారస్తన్నిరోధకృత్
అంధకారవినాశిత్వాద్గురురిత్యభిదీయతే


 తాత్పర్యము: గు అనే అక్షరము అంధకారాన్ని, రు అనే అక్షరము తొలగించడానికి ప్రతీక. అందుకనే గురు అనే పదము అంధకారాన్ని తొలగించేదిగా పిలవబడింది. 

కర్మణా మనసా వాచా సర్వదారాధయేత్గురుం
దీర్ఘ దండం నమస్కృత్య నిర్లజ్జో గురుసన్నిధౌ


 తాత్పర్యము: కర్మలు, మనసు, వాక్కు - మూడింటి ద్వారా గురువును ఆరాధించాలి. గురువుకు పూర్తి సాష్టాంగ నమస్కారము చేయుటకు వెనుకాడ కూడదు. 

సాష్టాంగ ప్రణిపాతేన తతో నిత్యం గురుం భజేత్
భజనాత్స్థైర్యమాప్నేతి స్వస్వరూపమయోభవేత్


 తాత్పర్యము: గురువుకు ప్రతి నిత్యం సాష్టాంగ నమస్కారము చేసి పూజించవలెను. అలా చేయటం వలన స్థైర్యము, ఆత్మ జ్ఞానము (తాను ఎవరు అని తెలిపేది) కలుగుతాయి.

దోర్భ్యాం పద్భ్యాం చ జానుభ్యామురసా శిరసా దృశా
మనసా ఉచసా చేతి ప్రణామోష్టాంగ ఉచ్యతే


 తాత్పర్యము: సాష్టాంగము లో ఉన్న ఎనిమిది అంగాలు - చేతులు, కాళ్లు, మోకాళ్ళు, వక్షస్థలము, తల, కళ్ళు, మనసు, వాక్కు. 

యత్సత్వేన జగత్సత్యం యత్ ప్రకాశేన భాతి యత్
యదానందేన నందంతి తస్మై శ్రీ గురవే  నమః


 తాత్పర్యము: ఎవరి వలన ప్రపంచము సత్యముగా, ప్రకాశముగా, ఆనందముగా కనిపించి, తెలుస్తుందో ఆ గురువునకు నా నమస్కారములు. 

యేన చేతయతా హీదం చిత్తం చేతయతే నరః
జాగ్రత్స్వప్నసుషుప్త్యాది తస్మై శ్రీ గురవే  నమః


 తాత్పర్యము: మూడు అవస్థలు (జాగృతము, స్వప్నము, సుషుప్త) - వీటి యందు చేతనను, చైతన్యమును కలిగినే ఆ గురువునకు నా నమస్కారములు. 

జ్ఞానశక్తిసమారూఢ తత్వమాలావిభూషిణే
భుక్తిముక్తి ప్రదాత్రేచ తస్మై శ్రీ గురవే  నమః


 తాత్పర్యము: జ్ఞానమనే శక్తిని అధిరోహించి, తత్వము (నిజము) అనే మాలతో అలంకరించబడి, నాకు భుక్తిని, ముక్తిని ప్రసాదించే ఆ గురువునకు నా నమస్కారములు.

అనేకజన్మ సంప్రాప్త కర్మబంధవిదాహినే
జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవే  నమః


 తాత్పర్యము: జ్ఞానమనే అగ్ని ద్వారా అనేక జన్మల నుంచి సంప్రాప్తించిన కర్మ అనే బంధములను దహించే ఆ గురువునకు నా నమస్కారములు. 

శోషనం భవసింధోశ్చ దీపనం క్షరసంపదాం
గురోః పాదోదకం యస్య తస్మై శ్రీ గురవే  నమః


 తాత్పర్యము: ఎవరి పాదములు కడిగిన నీరు ఈ సంసారమనే సాగరాన్ని దాటించి, అసత్యాన్ని నాశనం చేస్తుందో ఆ గురువునకు నా నమస్కారములు.

న గురోరధికం తత్వం న గురోరధికం తపః
న గురోరధికం జ్ఞానం తస్మై శ్రీ గురవే  నమః


 తాత్పర్యము: గురువును మించిన తత్వము (నిజము), తపస్సు, జ్ఞానము లేదు. ఆ గురువునకు నా నమస్కారములు. 

మన్నాథః శ్రీజగన్నాథః మద్గురుః శ్రీజగద్గురుః
మమాత్మా సర్వ భూతాత్మా తస్మై శ్రీ గురవే  నమః


 తాత్పర్యము: నా నాథుడు ఈ జగత్తుకే నాథుడు, నా గురువు ఈ జగత్తుకే గురువు. నా లో ఉన్న ఆత్మ అన్నిట ఉంది. నా గురువులకు నమస్కారములు. 

గురురాదిరనాదిశ్చ గురుః పరమదైవతం
గురమంత్రసమోనాస్తి తస్మై శ్రీ గురవే  నమః


 తాత్పర్యము: గురువే కారణము, ఆది (మొదలు). కానీ ఆయనకు అవి లేవు. గురువు ఉత్తమమైన దైవము. గురు మంత్రాన్ని మించిన మంత్రము లేదు. ఆ గురువునకు నా నమస్కారములు.

ఏక ఏవ పరో బంధుః వివేకే సముపస్థితే
గురుః సకలధర్మాత్మా తస్మై శ్రీ గురవే  నమః


 తాత్పర్యము: నిజమైన వివేకము జాగృతమైనప్పుడు గురువే అత్యంత హితుడని తెలుస్తుంది. అన్ని ధర్మములకు మూలము గురువే. ఆ గురువునకు నా నమస్కారములు. 

గురుమధ్యే స్థితం విశ్వం విశ్వ మధ్యే స్థితో గురుః
గురుర్విశ్వం నమస్తేస్తు తస్మై శ్రీ గురవే  నమః


 తాత్పర్యము: విశ్వము గురువు యందు స్థితమైయున్నది. గురువు విశ్వవ్యాప్తమై యున్నాడు. ఆ గురువునకు నా నమస్కారములు.

భవార్ణ్య ప్రవిష్టస్య దిజ్ఞ్మోహ భ్రాంతి చేతసః
యేన సందర్శితః పంథాః తస్మై శ్రీ గురవే  నమః


 తాత్పర్యము: సంసారమనే అడవిలో చిక్కుకున్న వారికి, భ్రాంతిలో జీవించే వారికి ముక్తిని కలిగినే ఆ గురువునకు నా నమస్కారములు.

తాపత్రయాగ్నితప్తానం అశాంతప్రాణినాం ఉమే
గురురేవ పరా గంగా తస్మై శ్రీ గురవే  నమః

 తాత్పర్యము: మూడు రకాల తాపముల(శరీరము, ప్రాణులు,దైవికము) అగ్ని నుంచి  ఉపశమనము కలిగించే గంగా నది వంటి ఆ గురువునకు నా నమస్కారములు. 

అజ్ఞానేనాహినాగ్రస్తాః ప్రాణినస్తాన్ చికిత్సకః
విద్యాస్వరూపో భగవాన్ తస్మై శ్రీ గురవే  నమః
 తాత్పర్యము: అజ్ఞానమనే సర్పముచే కాటు వేయబడిన మనకు జ్ఞానమనే వైద్యము చేసి ఉద్ధరించే ఆ గురువునకు నా నమస్కారములు. 

హేతవే జగతామేవం సంసారార్ణవసేతవే
ప్రభవే సర్వ విద్యానం శంభవే గురవే నమః


 తాత్పర్యము: సాక్షాత్తు శివుడే అయిన గురువు ఈ జగత్తులో మనకు ఏకైక హితుడు. సర్వ విద్యలకు ప్రభువు ఆయన.  సంసారమనే సాగరాన్ని దాటించే ఆ గురువులకు నా నమస్కారములు.

ధ్యానమూలం గురోర్మూర్తిః పూజా మూలం గురోః పదం
మంత్రమూలం గురోర్వాక్యం ముక్తిమూలం గురోః కృపాః


 తాత్పర్యము: ధ్యానానికి మూలము గురువు యొక్క రూపము, పూజకు మూలము గురువు యొక్క పాదములు, గురువు యొక్క పలుకులు మంత్రానికి మూలము. గురువు యొక్క కృప ముక్తికి మూలము.

తస్మై శ్రీ గురవే నమః

28, సెప్టెంబర్ 2010, మంగళవారం

నిర్వాణ షట్కము

జగద్గురువులు ఆదిశంకరులు

ఆదిశంకరుల రచనలు మూడు రకాలుగా విభజించవచ్చు. మొదటిది ఆధ్యాత్మికంగా బాగా ముందడుగు వేసిన వారికి - ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత మీద రాసిన భాష్యాలు. రెండవది వీటి సారాన్ని ప్రకరణలుగా రాసినవి. మూడవది దేవతా స్తోత్రాలు. నిర్వాణ షట్కము ప్రకరణగా భావించ వచ్చు. (ప్రకరణ అంటే - శాస్త్రాలలో ఇచ్చిన వివరణలో వచ్చిన సందేహాలను నివృత్తి చేసేవి అని). ఆత్మ అంటే ఏమిటి అనే దాన్ని ఏవేవి కాదో, ఏవేవి అంటవో, పట్టవో చెప్పి తర్వాత ఏమిటో అద్భుతంగా చెప్తుంది ఈ నిర్వాణ షట్కముశ్లోకాలు, తాత్పర్యం మీకోసము. యూట్యూబ్ లంకె 

మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం
న చ శ్రోత్రజిహ్వే న చ ఘ్రాణనేత్రే
న చ వ్యోమభూమిర్న తేజో న వాయుః
చిదానంద రూపః శివోహం శివోహం

నేను (ఆత్మను) - మనసును కాను; బుద్ధిని కాను; అహంకారాన్ని కాను; చిత్తం (మెదడు లోని విషయాన్ని దాచే ప్రాంతం - మతి)  కాను; చెవులు కాను; నాలుక కాను; ముక్కు కాను; కళ్ళు కాను; ఆకాశాన్ని కాను; భూమిని కాను; అగ్నిని కాను; వాయువును కాను. నేను సత్యమై, నిత్యమై ఉన్న ఆనంద స్వరూపాన్ని; నేనే శుభాన్ని.

న చ ప్రాణసంజ్ఞో న వై పంచవాయుః
న వా సప్తధాతుర్న వా పంచకోశః
న వాక్పాణిపాదౌ న చోపస్థపాయూ
చిదానంద రూపః శివోహం శివోహం


నేను (ఆత్మను) - ఊపిరిని, ఉచ్ఛ్వాస/నిశ్వాసను కాను; పంచప్రాణాలు కాను;  ఏడు ధాతువులను (రస, రక్త, మాంస, మేధస్, ఆస్తి, మజ్జ, శుక్ర) కాను, పంచ కోశములు (అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ) కాను ; వాక్కును కాను, చేతులు కాను, పాదములు కాను; పురుషాంగము/యోని కాను; విసర్జన చేసే అంగమును కాను; నేను సత్యమై, నిత్యమై ఉన్న ఆనంద స్వరూపాన్ని; నేనే శుభాన్ని.

న మే ద్వేషరాగౌ న మే లోభమోహౌ
మదో నైవ మే నైవ మాత్సర్యభావః
న ధర్మో న చార్థో న కామో న మోక్షః
చిదానంద రూపః శివోహం శివోహం


నాకు రాగద్వేషాలు, లోభమోహాలు లేవు; నాకు మద మాత్సర్యాలు లేవు; నేను ధర్మార్థకామమోక్షాల వెంట పడను ; నేను సత్యమై, నిత్యమై ఉన్న ఆనంద స్వరూపాన్ని; నేనే శుభాన్ని.

న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం
న మంత్రో న తీర్థం న వేదా న యజ్ఞాః
అహం భోజనైవ న భోజ్యం న భోక్తాః
చిదానంద రూపః శివోహం శివోహం

 
నాకు పాప పుణ్యములు, సుఖ దుఃఖాలు లేవు; నాకు మంత్రము, తీర్థము, వేదము, యజ్ఞములతో పని లేదు; నాకు ప్రియమైనది, ప్రీతిని కలిగించేది, నా చే ప్రీతి పొందబడేది లేదు; నేను సత్యమై, నిత్యమై ఉన్న ఆనంద స్వరూపాన్ని; నేనే శుభాన్ని.

న మే మృత్యుశంకా న మే జాతిభేదః
పితా నైవ మే నైవ మాతా న జన్మ
న బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః
చిదానంద రూపః శివోహం శివోహం


నాకు మృత్యు భయము, జాతిభేదము, తల్లి, తండ్రి, జననము లేవు; నాకు బంధువులు, మిత్రులు, గురువులు, శిష్యులు లేరు; నేను సత్యమై, నిత్యమై ఉన్న ఆనంద స్వరూపాన్ని; నేనే శుభాన్ని.

అహం నిర్వికల్పో నిరాకారరూపో
విభుర్వ్యాప్య సర్వత్ర సర్వేంద్రియాణి
సదా మే సమత్వం న ముక్తిర్నబంధః
చిదానంద రూపః శివోహం శివోహం

నేను అన్ని గుణాలకు అతీతుడను (ఎటువంటి షరతులు లేని వాడిని); నేను నిరాకారుడను, అంతటా వ్యాపించి ఉన్నాను; నాకు ఇంద్రియాలు లేవు; నేను ఎల్లప్పుడూ ఒక్కలాగే ఉంటాను; నాకు బంధనాలు, విడుపు లేవు. నేను సత్యమై, నిత్యమై ఉన్న ఆనంద స్వరూపాన్ని; నేనే శుభాన్ని.

27, సెప్టెంబర్ 2010, సోమవారం

విశ్వనాథాష్టకం - తాత్పర్యం

ఆది శంకరులు నుతించిన కాశీ విశ్వనాథుని అష్టకం

గంగాధరుడు 

గంగా తరంగ రమణీయ జటా కలాపం,
గౌరీ నిరంతర విభూషిత వామ భాగం
నారాయణ ప్రియ మనంగ మదాపహారం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాథం
తాత్పర్యం: గంగా నదీ అలలను తన జటాఝూటంలో అందంగా కలిగిన, తన ఎడమ వైపు పార్వతీ దేవి ఎల్లప్పుడూ శోభించే, శ్రీహరికి ప్రియుడైన, మన్మథుని గర్వము అణచిన, వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము.

వామే శక్తి ధరం వందే వకారాయ నమో నమః

వాచామగోచరమనేక గుణ స్వరూపం
వాగీశ విష్ణు సుర సేవిత పాద పీఠం
వామేన విగ్రహ వరేణ కళత్రవంతం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాథం


తాత్పర్యం:  పదములకు, వర్ణనకు అందని అనేక గుణాలు కలిగిన స్వరూపంతో ఉన్న, బ్రహ్మ విష్ణు మరియు ఇతర దేవతలచే సేవించబడిన పాదములు కలిగిన, తన ఎడమ వైపు శుభములు కలిగించే పార్వతిని కలిగి ఉన్న, వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము.
పులిచర్మము ధరించిన శశిధరుడు

భూతాధిపం భుజగ భూషణ భూషితాంగం
వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం
పాశాంకుశాభయ వర ప్రద శూల పాణిం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాథం


తాత్పర్యం:  సమస్త భూతములకు అధిపతియైన, సర్పములను ఆభరణంగా కలిగిన, పులిచర్మం వస్త్రంగా ధరించిన, జడలు కట్టిన కేశములు కలిగిన, పాశము (తాడు), అంకుశము, త్రిశూలము ధరించిన, అభయము, వరాలను ప్రసాదించే, వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము.
నెలవంక సిగపూవు నవ్వగా 

శీతాంశు శోభిత కిరీట విరాజమానం
ఫాలేక్షణానల విశోషిత పంచ బాణం
నాగాధిపారచిత భాసుర కర్మ పూరం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాథం


తాత్పర్యం: చల్లదనాన్ని ఇచ్చే చంద్రుని కిరీటముగా కలిగి భాసిల్లుతున్న, తన ఉగ్రనేత్రముతో మన్మథుని దగ్ధము చేసిన, నాగేంద్రుని కర్ణములకు అలంకారముగా ధరించిన, వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము.
రౌద్రమున, ఆనందమున తాండవము

పంచాననం దురిత మత్త మతంగజానాం
నాగాంతకం దనుజ పుంగవ పన్నగానాం
దావానలం మరణ శోక జరాటవీనాం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాథం

తాత్పర్యం: మదించిన ఏనుగులపాలిటి సింహంలా ఉన్న, అసురులపాలిటి గరుత్మంతుని వలె ఉన్న,  మరణాన్ని, శోకాన్ని, వృద్ధాప్యాన్ని నాశనం చేసే అగ్నిలా ఉన్న, వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము.
నిరంజనుడు, నిర్గుణుడు

తేజోమయం సుగుణ నిర్గుణమద్వితీయం
ఆనందకందమపరాజితమప్రమేయం
నాగాత్మకం సకల నిష్కలమాత్మ రూపం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాథం


తాత్పర్యం:  తేజస్సు కలిగి, సుగుణములు కలిగి, గుణములు లేని, వేరే సాటిలేని, ఆనందకారకుడైన, ఓటమి ఎరుగని, తర్కానికి అందని, సర్పములకు ఆత్మయై, అన్ని శుద్ధ స్వరూపములు తానేయై, ఆత్మ స్వరూపుడైన, వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము.
సచ్చిదానందుడు

ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందా
పాపే రతిం చ సునివార్య మనః సమాధౌ
ఆదాయ హృత్ కమల మధ్య గతం పరేశం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాథం


తాత్పర్యం:  ఏ కోరికలూ లేనివాడైన, దోషములు ఎంచని, నింద చేయని, పాపములకు దూరముగా ఉండి సమాధి స్థితిలో ఉన్న హృదయకమలము మధ్యలో నివసించి ఉన్న, వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము.
గరళ కంఠుడు

రాగాది దోష రహితం స్వజనానురాగం,
వైరాగ్య శాంతి నిలయం గిరిజా సహయం,
మాధుర్య ధైర్య శుభగం గరళాభిరామం
వారాణసీ పుర పతిం భజ విశ్వనాథం

తాత్పర్యం:  రాగద్వేషాది దోషములు ఎరుగని, తన భక్తులను ప్రేమతో చూసే, వైరాగ్యము, శాంతికి నిలయమై, హిమవంతుని పుత్రిక సహాయం పొందుతూ, మాధుర్యము, ధైర్యము కలిగి విషాన్ని ధరించిన, వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని భజన చేద్దాము

ఫలశ్రుతి:
వారాణసీ పురపతే స్తవనం శివస్య
వ్యాఖ్యాతమష్టకమిదం పఠతే మనుష్యః
విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంతకీర్తిం
సంప్రాప్య దేహ విలయే లభతే చ మోక్షం


తాత్పర్యం: వారణాసి పురంలో వెలసిన ఆ విశ్వనాథుని అష్టకాన్ని పఠనం చేసే మనుష్యులకు దేహమున్నప్పుడు విద్య, మంచి, ఎనలేని సుఖము, అనంతమైన కీర్తి, అటు తర్వాత మోక్షము లభించును. 

విశ్వనాథాష్టకమిదం యః పఠేచ్ఛివ సన్నిధౌ
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే

తాత్పర్యం: ఈ విశ్వనాథ అష్టకం శివుని సన్నిధిలో చదివిన వారికి శివలోకము, ఆ పరమశివుని ఆశీస్సులు పొందుదురు.

26, సెప్టెంబర్ 2010, ఆదివారం

శివ మానస పూజ



ఆది శంకరుల మహత్తు గురించి మాట్లాడేంత అర్హత నాకు లేదు. కానీ, కొన్ని మాటలు చెపితే నాకు తృప్తి కలుగుతుంది. మొదట,  ఆ పరమశివ రూపమైన జగద్గురువులకు నా మానసిక సాష్టాంగ నమస్కారములు.  ఆయన ఎటువంటి మానసిక స్థితిలో ఈ ఐదు శ్లోకాలు రాసారో వాటి అర్థం చూస్తే మనకు కొంత అవగతమవుతుంది.  నాలుగవ శ్లోకంలో వేదాంత సారమంతా ఇమిడి ఉంది గమనించండి. ఆత్మ, శరీరం, ఇంద్రియాలు, ప్రాణము, కర్మలు, నిద్ర - అన్ని ఆ భగవంతుని కొరకే  అన్న భావన ఎంత అందంగా, భక్తితో, శుద్ధ అంతఃకరణంతో భావించారో శంకరులు. ఇంతకన్నా విడమరచి చెప్పేది ఏముంది చెప్పండి సృష్టిలో?.

దేహమే దేవాలయము, జీవుడే సనాతన దైవము అని మనకు ఒక కవి శంకరుల సందేశాన్ని చెప్పారు కూడా. మానసిక సంకల్పము, మానసిక శుద్ధి ఉంటే చాలండి. దాని కోసమే కదా ఈ బాహ్య శుద్ధి (ఆచారము, నియమము, ఉపచారములు, నిష్ఠ లాంటివి)?. మనము తప్పు చేస్తున్నామో లేదా సరైన మార్గంలో ఉన్నామో మన మనస్సుకు తప్పకుండా తెలుస్తుంది. దానిని మీరు బయటికి చెప్పకర్లేదు. మీ పనులలో చూపిస్తే చాలు. చరాచరమైన ప్రతి వస్తువు, ప్రాణిలో ఆ పరమాత్మ ఉన్నాడు. అద్వైత సిద్ధాంత సారమిదే. 'స్థావర జంగమ రూప' అని వాగ్గేయకారులు ఆ రాముని స్తుతించినా, 'ఆత్మా త్వం' అని శంకరులు కింది విధిన శివుని పూజించినా అన్ని ఆ నిరాకర, నిరామయ, నిరంజనునికే. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్ఛతి సాగరం సర్వ దేవ  నమస్కారః కేశవః ప్రతి గచ్ఛతి - ఆకాశాన్నుంచి కింద పడిన ప్రతి నీటి బిందువు వాగు, వంక, సెలయేరు, నది ద్వారా సాగరంలో కలుస్తుంది. అలాగే ప్రతి దేవతకు చేసే నమస్కారము ఆ కేశవునికే.


రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం
నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం
జాతీచంపకబిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా
దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం దృశ్యతాం

తాత్పర్యం: ఓ దయానిధి! పశుపతి! రత్నాలతో కూడిన ఆసనం, చల్లని నీటితో స్నానం, దివ్యమైన వస్త్రాలు, ఎన్నో రకాల రత్నాలతో అలంకరించి, చందనం పూసి, సుగంధ జాజి, చంపక పుష్పాలు, బిల్వపత్రాల మాలతో అలంకరించి, ధూపం, దీపం అన్ని మానసికం గా సమర్పించాను, స్వీకరించు.

సౌవర్ణే నవరత్నఖండరచితే పాత్రే ఘృతం పాయసం
భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభా ఫలం పానకం
శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్వలం
తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురూ

తాత్పర్యం: ఓ ప్రభూ! నవరత్నాలతో అలంకరిచిన బంగారు పాత్రలో నెయ్యి వేసిన తీయని పాయసం, భక్ష్యాది ఐదు రకాల వంటకాలతో, పాలు, పెరుగు, అరటి పండు, పానకము, ఫల రసాలు, వండిన కూరగాయలు, పచ్చ కర్పూరం కలిపిన తీయని నీరు, తాంబూలం - ఇవన్ని మానసికంగా భక్తితో సమర్పిస్తున్నాను, స్వీకరించు.

ఛత్రాచామరయోర్యుగం వ్యజనకం చా దర్శకం నిర్మలం
వీణాభేరి మృదంగకాహలకలా గీతం చ నృత్యం తథా
సాష్టాంగం ప్రణతిః స్తుతిర్బహువిధాః ఏతత్సమస్తం మయా
సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో

తాత్పర్యం: ఓ ప్రభూ! ఛత్రము (గొడుగు), రెండు చామరాలు, చల్లనిగాలికోసం వింజామర, శుద్ధమైన అద్దం, వీణా వాదన, మృదంగాది ఇతర వాద్య ఘోషలు,  పాట, నృత్యం మరియు సాష్టాంగ నమస్కారముతో కూడిన ఎన్నో రకాల స్తుతులు - ఇవన్ని సంకల్పము ద్వారా మానసికంగా సమర్పిస్తున్నాను స్వీకరించు.

ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం
పూజా తే విషయోపభోగ రచనా నిద్రాసమాధి స్థితిః
సంచారః పదయోః ప్రదక్షిణ విధిః స్తోత్రాణి సర్వా గిరో
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం

తాత్పర్యం: ఓ శంభో! నా ఆత్మయే నీవు;  పార్వతి దేవియే నా బుద్ధి; నీ సహచరులు నా ప్రాణాలు; నా దేహమే నీ దేవాలయం; ప్రాపంచిక సుఖాలు, భోగాలు అన్నీ నీ పూజలు; నా నిద్రే సమాధి స్థితి; నా కదలికలు అన్నీ నీకు ప్రదక్షిణాలు; నా మాటలన్నీ నీ స్తోత్రాలు; నేను చేసే కర్మలన్నీ నీ ఆరాధనయే. 

కరచరణ కృతం వాక్కాయజం కర్మజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధం
విహితమవిహితం వా సర్వమేతత్క్షమస్వ
జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో

తాత్పర్యం: ఓ మహాదేవ! శంబో! కరుణానిధీ! నా చేతులు, పాదములు, మాటలు, కర్మలు, చెవులు, కళ్లు, మనసు ద్వారా తెలిసీ, తెలియక చేసిన అపరాధాలు అన్ని క్షమించు. నీకు జయము జయము.

శ్రీరాముని రూపంలో రంగనాథుని వర్ణన - రంగపుర విహార

కర్ణాటక సంగీత త్రయంలో ఒకరు ముత్తుస్వామి దీక్షితులు (మన కాకర్ల త్యాగరాజు, శ్యామశాస్త్రి మిగిలిన ఇద్దరు). వీరు  1775 వ సంవత్సరంలో తమిళనాడులోని తంజావూర్ జిల్లాలోని తిరువారూర్ లో రామస్వామి, సుబ్బమ్మ అనే తమిళ అయ్యరు దంపతులకు జన్మించారు.   వీణావాదనలో ఆరితేరిన వీరు గురుగుహుని (సుబ్రహ్మణ్యస్వామి) కృప వలన అద్భుతమైన కీర్తనలను రచించారు. నవగ్రహ కృతులు, కమలాంబ నవావరణ కీర్తనలు, పంచలింగ కీర్తనలు లాంటివి ఎన్నో రచించారు. సుప్రసిద్ధమైన వాతాపి గణపతిం భజే ఆయన రచనే.  ఆయన కృతులలో ముద్రగా 'గురుగుహ' వాడారు.

తపాల శాఖ వారు విడుదల చేసిన ముత్తుస్వామి దీక్షితార్ స్మారక బిళ్ళ 
ఆయన రచించిన రంగ పుర  విహార అనే కీర్తన బృందావన సారంగా రాగంలో పాడబడింది. భక్తి రస పూరితమై, ఆ రాముని వర్ణన రమ్యంగా చేసిన ఈ కృతి చాలా ప్రజాదరణ పొందింది. దక్షిణాదిన అన్ని వైష్ణవ క్షేత్రాలలో దీనిని ప్రతిదినము వినిపిస్తూనే ఉంటారు. దాని సాహిత్యం, తాత్పర్యం  కింద మీకోసం. దీనిని భారత రత్న ఎమ్మెస్ సుబ్బులక్ష్మి చాలా ఏళ్ల క్రితం పాడారు. ఇటీవలి కళాకారులు పాడిన యూట్యూబ్ లంకె.

శ్రీ రంగనాథుడు

రంగపుర విహార జయ కోదండ రామావతార రఘువీర |శ్రీ రంగ|

అంగజ జనక దేవ బృందావన సారంగేంద్ర వరద రమాంతరంగ
శ్యామలాంగ విహంగ తురంగ సదయాపంగ సత్సంగ | రంగపుర|

పంకజాప్త కుల జలనిధి సోమ
వర పంకజ ముఖ పట్టాభిరామ
పదపంకజ జితకామ రఘురామ
వామాంక గత సీత వర వేష
శేషాంక శయన భక్త సంతోష
ఏణాంక రవి నయన మృదుతర భాష
అకళంక దర్పణ కపోల విశేష
ముని సంకట హరణ గోవింద
వేంకట రమణ ముకుంద
సంకర్షణ మూలకంద
శంకర గురుగుహానంద

తాత్పర్యం:

శ్రీరంగంలో వెలసిన రంగనాథ!  కోదండం ధరించి రామునిగా అవతరించిన రఘువీర!

మన్మథుని జనకుడైన వాడ! దేవతలను, గజేంద్రుడిని రక్షించి, పాలించే లక్ష్మీ అంతరంగంలో ఉన్న దేవ!  నీలమేఘ శరీరము కలవాడ! గరుత్మంతుని వాహనముగా కలిగి, ఎల్లప్పుడూ కరుణ, దయ గలిగిన చూపులతో సత్సాంగత్యములో ఉండే ఓ రంగనాథ!.

సూర్య వంశమనే సాగరానికి చంద్రుని వంటి వాడ! శుభకరమైన కలువ వంటి ముఖం కలవాడ!  కలువల వంటి తన పాదములతో కామాన్ని జయించిన వాడ! రఘురామ!  ఎడమ తొడపై సీతను గలిగి సుందరముగా కనిపించే రామ!  ఆదిశేషునిపై పరుండి భక్తులను సంతోషింప జేసే దేవ దేవ! సూర్య చంద్రులను కన్నులుగా కలిగి, సున్నితమైన మాటలతో అద్దమువలె ఎటువంటి కళంకం లేని చెంపలు కలిగి, ఋషుల బాధలు తొలగించే ఓ వెంకటరమణ! గోవింద!  ముకుంద! సర్వ శుభములు కలిగించే, అన్నిటికి మూలమైన వాడ! గురుగుహునికి ప్రియమైన వాడ!

24, సెప్టెంబర్ 2010, శుక్రవారం

వర్షరుతు వీడ్కోలు - శరదృతు ఆగమనం

 
గర్జించిన రుతు కాలమేఘం కురిపించింది నిత్య నిర్ఝరవర్షిణి
సుజలమైన సస్య ఆంధ్రమాత వినిపించింది సత్యసుధాతరంగిణి

నిండినాయి మా జలధారలు కుదిరినాయి రైతన్నల గుండెలు
అదిరినాయి నాళ్లతో పంటలోగిళ్లు చెదరినాయి కరవు పీడకలలు

నోచినారు సతులు వరలక్ష్మీ వ్రతం పలికినారు పతులు గణనాథునికి మంగళం
వీచినారు శ్రీనివాసుని  బ్రహ్మోత్సవం సమర్పిస్తున్నారు పితరులకు తర్పణం

విరిసింది పెరట్లో పచ్చని ముద్దబంతి మురిసింది ప్రతియింట ప్రౌఢ యువతి
వికసించింది తోటలో తెల్లని చేమంతి వేసింది శరదృతు శోభలకు నాంది

వస్తున్నవి ఆ సర్వమంగళ నవరాత్రులు తెస్తున్నవి మాయిళ్ల భక్తిసుధలు
వీస్తున్నవి శరచ్చంద్రుని చల్లని వెన్నెలలు ఇస్తున్నవి మాకు సకల శుభాలు


21, సెప్టెంబర్ 2010, మంగళవారం

నగుమోము గలవాని

ఉత్సవ సాంప్రదాయ కీర్తన - నగుమోము గలవాని - మధ్యమావతి రాగం




నగుమోము గలవాని నా మనోహరుని
జగమేలు శూరుని జానకీ వరుని

దేవాది దేవుని దివ్య సుందరుని
శ్రీ వాసుదేవుని సీతారాఘవుని

సుజ్ఞాన నిధిని సోమ సూర్యలోచనుని
అజ్ఞానతమము అణచు భాస్కరుని

నిర్మలాకారుని నిఖిలాఘ హరుని
ధర్మాది మోక్షమ్ము దయచేయు ఘనుని

బోధతో పలుమారు పూజించి
నేనారాధింతు శ్రీ త్యాగరాజ సన్నుతుని

క్షీర సాగర విహారా - ఉత్సవ సాంప్రదాయ కీర్తన

పరమ రామభక్తుడు త్యాగరాజు రచించిన ఉత్సవ సాంప్రదాయ కీర్తన ఒకటి ఆనంద భైరవి రాగంలో. బాలమురళిగారు మనల్ని భక్తి పారవశ్యంలో ముంచేస్తారు ఈ కీర్తన గానంలో:


క్షీర సాగర విహారా అపరిమిత ఘోర పాతక విదారా
కౄరజనగణ విదూరా నిగమ సంచార సుందర శరీరా

శత మఘాహిత విభంగా శ్రీ రామ శమన రిపు సన్నుతాంగా
శ్రిత మానవాంతరంగా  జనకజా శృంగార జలజ భృంగా

రాజాధి రాజ వేషా శ్రీ రామ రమణీయ కర సుభూషా
రాజనుత లలిత భాషా శ్రీ త్యాగరాజది భక్త పోషా

యూట్యూబ్ లంకె

రామ రామ యనరాద

మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి మాతామహులైన శ్రీ ప్రయాగ రంగదాసు గారి మరొక రచన:


రామ రామ యనరాద రఘుపతి రక్షకుడని వినలేదా
కామజనకుని కథ వినువారికి కైవల్యంబే కాదా

ఆపద్బాంధవుడగు శ్రీరాముని ఆరాధించగ రాదా
పాపంబులు పరిహారమొనర్చెడి పరమాత్ముండే కాదా

సారహీన సంసార భవాంబుధి సరగున దాటగ రాదా
నీరజాక్షుని నిరతము నమ్మిన నిత్యానందమే కాదా

వసుధను గుడిమెళ్లంకను వెలసిన వరగోపలుడె కాదా
పసివాడగు శ్రీ రంగదాసుని పాలించగ వినలేదా
యూట్యూబ్ లంకె.

శ్రీ కృష్ణాయను నామ మంత్ర రుచి

కర్ణాటకలోని కోలారు ప్రాంతంలో నివసించిన కైవార అమర నారేయన అనే వాగ్గేయకారుడు రాసిన మంచి సందేశమున్న గీతం. యూట్యూబ్ లంకె.

కైవార అమరనారాయణ గుడి

శ్రీ కృష్ణాయను నామ మంత్ర రుచి సిద్ధించుట నాకెన్నటికో
శ్రీ గురుపాదాబ్జంబులు మదిలో స్థిరముగ నిలిచేదెన్నటికో

మరవక మాధవు మహిమలు పొగడే మర్మము తెలిసేదెన్నటికో
హరి హరి హరి హరి హరి నామామృత పానము చేసేదెన్నటికో

కమలాక్షుని నా కన్నులు చల్లగ గని సేవించేదెన్నటికో
లక్షణముగ శ్రీ లక్ష్మీ రమణుని దాసుడనయ్యేదెన్నటికో

పంచాక్షరీ మంత్రము మదిలో పఠియించుట ఇంకెన్నటికో
ఆదిమూర్తి శ్రీ అమరనారేయన భక్తుడనయ్యేదెన్నటికో

17, సెప్టెంబర్ 2010, శుక్రవారం

సగ్గుబియ్యం-ఖర్జూరాలు పాయసం

చక్కెర, బెల్లం లేకుండా పాయసం చెయ్యాలి అనుకుంటున్నారా?. అయితే ఈ కింద వంటకం ప్రయత్నించండి.


కావలసిన పదార్థాలు: 
సగ్గుబియ్యం ఒక చిన్న గ్లాస్ నిండా, పచ్చి ఖర్జూరాలు(లయన్ డేట్సు లాంటివి) పది మెత్తగా రుబ్బి(నీళ్ళు లేకుండా), ఏలకుల పొడి.

పధ్ధతి:
పాత్రలో రెండు గ్లాసులు నీళ్ళు పోసి, అందులో సగ్గుబియ్యం వేసి పూర్తిగా తెల్లదనం పొయ్యేంత వరకు ఉడికించాలి. అడుగు అంటకుండా తిప్పుతూ ఉండాలి. అప్పుడు దీనిలో, గ్రైండ్ చేసిన పచ్చి ఖర్జూరాల పేస్టు వేసి అది పూర్తిగా కరిగేంత వరకు కలియబెట్టుటు ఉండాలి. కావలసినంత ఏలకుల పొడి వేసి కలియబెట్టాలి. ఖర్జూరాల పేస్టు కరిగి, సగ్గుబియ్యం పూర్తిగా ఉడికిన తర్వాత పొయ్యి మీదినుంచి దించేసి పెట్టుకోండి. కాచి, కొద్దిగా చల్లార్చిన పాలు మీగడ లేకుండా ఆ ఉడికిన మిశ్రమం కొంత చల్ల బడిన తర్వాత కావలసినన్ని కలుపుకోవాలి.  కాస్త పలచగా పాయసం రావాలి అంటే పైన చెప్పిన పాళ్ళకు ఒక గ్లాసున్నర పాలు పడతాయి.

అలంకరణ మరియు రుచి ఇష్టపడేవాళ్ళు -  జీడిపప్పు, కిస్మిస్ వగైరా ఊరికే బాణలిలో కాస్త దోరగా వేయించుకొని కలుపుకోవచ్చు (నెయ్యి/నూనెలో వేయించాల్సిన పనిలేదు). పూర్తిగా సగ్గుబియ్యం కాకుండా సగం సగ్గుబియ్యం సగం సేమియా వేసి లేక పూర్తిగా సేమియా వేసి చేసుకోవచ్చు.  చిత్రంలో ఉన్న పాయసం రెండు సగంసగం వేసి చేసినది. సేమియా వేయదలచుకుంటే దాన్ని వేయించుకుని పెట్టుకోండి (నెయ్యి/నూనె అక్కరలేదు).

13, సెప్టెంబర్ 2010, సోమవారం

మొలకలు - పొద్దున ఫలహారం రకాలు

ఈ మధ్య మొలకలు అందరు ఏదో ఒక రూపంలో వినటమో, తినటమో చేస్తూనే ఉన్నారు. ఆరోగ్యానికి మంచిదని మంతెన వారు తమ ప్రకృతి చికిత్స కార్యక్రమం ద్వారా మొలకలను బాగా ప్రాచుర్యంలోకి తెచ్చారు. రోజు మొలకలు తినాలి అనుకునే వాళ్లకి మరి దాంట్లో కాస్త రుచి కోసం మీకు ఈ కింది రకాలు.

1 . మొలకలు,  టమాటో, క్యారెట్, కీర సలాడ్:

కావలసిన పదార్థాలు: టమాటో (ఒకటి), కీర దోసకాయలు (చిన్నది ఒకటి), ఒక పచ్చి మిరపకాయ, రెండు క్యారెట్లు, ఒక నిమ్మకాయ దబ్బ, ఉప్పు, తేనె, కొత్తిమీర.


చేసే పధ్ధతి:

కీర దోసకాయని చెక్కుతీసి సన్నగా ముక్కలు చేసుకోండి 3 మి.మి సైజులో. అలాగే  టమాటో, పచ్చి మిరపకాయను బాగా కడిగి సన్నని ముక్కలు చేసుకోండి. క్యారెట్లను తొక్కు తీసి తురుముకోండి. ఇవన్ని కలిపి, వాటిలో రెండు-మూడు గుప్పెళ్ళ పెసర మొలకలు వేసి కలిపి, కొంచెం నిమ్మకాయ పిండండి. ఒక్క 2 -3 చుక్కల తేనె, ఉప్పుకావాల్సిన వాళ్లు ఉప్పు వేసి బాగా కలియబెట్టి కొత్తిమీరను సన్నగా తరిగి అలంకరించండి. అప్పటికప్పుడు తింటే నీరు ఊరకుండ భలే రుచిగా ఉంటుంది.

పులుపు రుచి మార్పు కావాలి అనుకునే వాళ్ళకి, నిమ్మ రసం బదులు కొంచెం పచ్చి మామిడి తురుము వేసుకోవాచు. అలాగే, క్యారెట్ బదులు లేత పచ్చికొబ్బరి, బీట్ రూట్, ముల్లంగి, బూడిద గుమ్మడి, సొరకాయ, బీర కాయ, పొట్ల కాయ తురుములలో ఏదైనా వేసుకోవచ్చు. వేసే తురుమును బట్టి కొంచెం ఉప్పు వేసుకోవచ్చు.

2 . మొలకలు-వేరుశనగ పొడి, ఖర్జూరం పొడి

కావలసిన పదార్థాలు: వేరు శనగలు గుప్పెడు, 3 - 4 ఎండుర్జూరాలు












చేసే పధ్ధతి:

వేరు శనగలు (పల్లీలు) వేయించి, పొట్టు తీసి, ఎండు ఖర్జూరంతో కలిపి పొడి చేసుకుని మొలకలతో కలిపి తింటే మంచి రుచి, ఆరోగ్యానికి కూడా అన్ని అందుతాయి. దీనిలో మార్పుగా - పల్లీల బదులు నువ్వులు కానీ, వేరే ఏ డ్రై ఫ్రూట్ అయినా వేసుకోవచ్చు (బాదం, జీడి పప్పు మొదలైనవి - ఇవి వాడినప్పుడు కొంచెం తక్కువ మోతాదులో వేసుకోవాలి). అలాగే, ఖర్జూరాల బదులు బెల్లం తక్కువ మోతాదులో వేసుకోవచ్చు. కొవ్వు, బరువు సమస్య లేని వాళ్లు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేసుకోచ్చు. డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. నువ్వులలో చాలా ఎక్కువ క్యాల్షియం ఉంటుంది కాబట్టి చాలా మంచిది ఆరోగ్యానికి.

3 . మొలకలు-పండ్ల సలాడ్

కావలసిన పదార్థాలు: పండీ పండని అరటి పండు, ఆపిల్, దానిమ్మ పండు (సగం చెక్క), కొంచెం నిమ్మ రసం, ఒక అర చెంచా తేనె



చేసే పధ్ధతి:

ముందుగా దానిమ్మ పండు ఒలిచి గింజలు తయారుగా పెట్టుకోండి. అలాగే ఆపిల్ కడిగి సన్నని ముక్కలు తరిగి పెట్టుకోండి. వెంటనే అరటిపండు చిన్న ముక్కలుగా చేసుకోండి. ఈ ముక్కలన్నితిని పెసల మొలకలతో కలిపి కొంచెం నిమ్మరసం, తేనె వేసి కలయపెట్టండి. ఎన్ని ఎక్కువ ఆపిల్ ముక్కలు ఉంటే అంత బాగుంటుంది. అరటి పండు, ఆపిల్ వెంటనే రంగు మారి పాడు అయి పోతాయి కాబట్టి చేసిన వెంటనే తినాలి దీన్ని. ఒక గ్లాస్ పాలతో ఇది తీసుకుంటే మీకు ఫలహారం చాలు.

9, సెప్టెంబర్ 2010, గురువారం

పితృ పక్షాలు

పితృ తర్పణాలు నదీ క్షేత్రాల్లో చేస్తే చాలా మంచిది

భాద్రపద మాసం వచ్చేసింది. పౌర్ణమి తర్వాతి పాడ్యమి నుండి అమావాస్య వరకు మహాలయ పక్షాలు. శుభ కార్యాలు ఏమీ ఉండవు. దేశమంతటా పితృపక్షాలుగా పాటిస్తారు. (తల్లిదండ్రులు లేని వారికి మాత్రమే) - పితృ కార్యాల మీద నమ్మకము ఉన్నవారికి - ఎవరైన ప్రతి సంవత్సరం పితరులకు శ్రాద్ధ కర్మ సరిగ్గా చేయని వారుంటే వారిని గుర్తు చేసుకొని వారు మరణించిన తిథినాడు (ఈ పదిహేను రోజుల్లో) వారికి తర్పణాలు, క్రియలు చేయవచ్చు. తిథి నాడు కుదరకపోతే, చివరిరోజైన అమావాస్య నాడు చెయ్యండి. దీనిని మహాలయ అమావాస్య అంటారు. అత్యంత పవిత్రమైన దినం మన పితరులను తలచుకొని వారికి మన గౌరవాన్ని తెలపటానికి. ఇది చేసే వెసులుబాటు లేకపోతే, సద్బ్రాహ్మణునికి మీకు తోచింది దానం చెయ్యండి. చిన్నగా చేసినా, పెద్దగా చేసినా - క్రియా విధానం కన్నా మనసులో శ్రద్ధ, విశ్వాసం ముఖ్యం.

మనవి: తెలిసి తెలిసి అపాత్ర దానం (అయోగ్యుడైన వానికి దానం) మాత్రం  చెయ్యకండి. దీనివల్ల పుణ్యం కాకుండా పాపం వస్తుంది. ఏమీ కుదరకపోతే, శ్రద్ధతో ఒక నమస్కారం పెట్టి వదిలెయ్యండి చాలు. 

ఈ పితృ పక్షాలు అవ్వగానే, శరన్నవరాత్రులు. వాటి ప్రాధాన్యత గురించి ఈ నెలాఖరుకి.

విఘ్నేశ స్తుతి - గణేశ పంచరత్నం

భాద్రపద శుద్ధ చవితి వచ్చేసింది. గణ నాయకుని వ్రతం అందరు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారారని ఆశిస్తూ, ఆది శంకరుల నోట వెలువడిన గణేష పంచరత్నం స్తోత్రం (యూ ట్యూబ్ లంకె), దాని అర్థం మీకోసం.

శ్రీ విఘ్న రాజం భజే

ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం
కళాధరావతంసకం విలాసిలోక రక్షకం
అనాయకైక నాయకం వినాశితే భదైత్యకం
నతాశుభాశు నాశకం నమామి తం వినాయకం

నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరం
నమస్సురారి నిర్జనం నతాధికా పదుద్ధరం
సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం
మహేశ్వరం సమాశ్రయే పరాత్పరం నిరంతరం

సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరం
దరేదరోదరం వరం వరే భవక్త్ర మక్షరం
కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం
మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం

అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనం
పురారి పూర్వ నందనం సురారి గర్వ చర్వణం
ప్రపంచ నాశ భీషనం ధనంజయాది భూషణం
కపోల దాన వారణం భజే పురాణ వారణం

నితాంతికాంత దంతకాంతిమంతకాంతకాత్మజం
అచింత్య రూప మంతహీనమంతరాయకృంతనం
హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినం
తమేకదంతమేవతం విచింతయామి సంతతం


తాత్పర్యం:
  1. మోదకములు చేతిలో ఆనందంగా ఉంచుకుని, ఎల్లప్పుడూ మోక్షాన్ని ప్రసాదించే, శిరస్సున చంద్రుని ధరించిన, లోకాన్ని కాపాడే, నాయకులకే నాయకుడైన, అసురులను, అన్ని ఆశుభాలను నశింప జేసే ఆ విఘ్నేశునికి నా నమస్కారములు. 
  2. భక్తుల శత్రువులకు భయం కలిగించే వానికి, అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని వలె ప్రకాశిస్తున్న వానికి, దేవతలు, అసురులచే నుతింపబడేవాడికి , భక్తుల విఘ్నాలను తొలగించే వానికి, దేవతలకే దేవునికి, సర్వ సంపదలకు అధిపతి అయిన వానికి, గజరాజుకు, దేవతల గణాలకు అధిపతి అయిన వానికి ఎల్లప్పుడూ నా నమస్కారములు. 
  3. సమస్త లోకాలకు శుభం కలిగించే వానికి, లోకాన్ని గజాసురుని బారినుండి కాపాడిన వానికి, పెద్ద ఉదరముతో, గజముఖముతో జనులను ఆశీర్వదించే వానికి, కరుణను కురిపించే వానికి, తప్పులను క్షమించి, శుభము, యశస్సు కలిగించే వానికి, తనకు నమస్కరించే వానికి సర్వ శుభాలు కలుగ జేసే విఘ్నరాజునికి నా నమస్కారములు.
  4. కోరికలను తీర్చి, బాధలను నశింప  జేసే వానికి, అనాదిగా పూజింపబడిన వానికి, ప్రళయ కారకుడైన శివుని పెద్ద కుమారునికి, అసురుల గర్వాన్ని అణచే వానికి, ప్రళయ కాలంలో భీషణంగా ఉండే వానికి, సర్పము ఆభరణంగా ఉన్నవానికి, మద గజము వలె ఉత్సాహముగా ఉన్నవానికి, పురాతనమైన వానికి నా భజనలు. 
  5. ఎంతో శోభతో ఉన్న దంతము కలవానికి (ఏకదంతునికి), మృత్యుంజయ కారకుడైన శివుని కుమారునికి, వర్ణనకు, ఊహకు అందని ఆకారము కలవానికి, అంతము లేని వానికి, విఘ్నాలు, ఆపదలు తొలగించే వానికి, వసంత రుతువులాగా యోగుల మనస్సులో నిలిచే వానికి ఎల్లప్పుడూ నా స్మరణ.

7, సెప్టెంబర్ 2010, మంగళవారం

శ్రీరామ జననం - ప్రయాగ రంగదాసు గారి రచన

ప్రయాగ రంగదాసు గారు మన ఆంధ్ర ప్రదేశ్ లో పుట్టిన ఒక వాగ్గేయ కారుడు.  మన మంగళంపల్లి బాలమురళీ కృష్ణగారి మాతామహులు వీరు. ఈయన ఎన్నో మంచి కీర్తనలు శ్రీ రాముని మీద రచించారు. వాటిలో ఒకటి శ్రీరాముని జననం గురించి ఈ క్రిందది . రంగదాసు గారు శ్రీమద్వాల్మీకి రామాయణంలోని బాలకాండం ప్రేరణతో ఈ కీర్తన రాశారు. కోనసీమలోని గుడిమెళ్లంకపురం వీరి స్వగ్రామం.

దీని సారాంశము:

దశరథుడు బ్రాహ్మణులకు దానాలు చేయగా, అన్ని దిశలా మలయ మారుతాలు వీచగా, భూదేవి బాధను తగ్గించటానికి,  చైత్రమాసమున, శుద్ధ నవమి నాడు, పునర్వసు నక్షత్రమున, కర్కాటక లగ్నమందు మెరుపులు మెరుస్తుండగా, దేవతలు పూలవానలు కురిపిస్తుండగా, దేవతల క్షేమము కొరకు, రాక్షసులను చంపటానికి శ్రీరాముడు కౌసల్యా గర్భమున జన్మించాడు.  

రంగదాసు గారు తన ముద్రగా తన స్వగ్రామాన్ని వాడటం ఆయన వ్యక్తిత్వాన్ని చూపుతుంది. అరవైయ్యవ దశకంలోని ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రవణం.

కళ్యాణ రామునికి కౌసల్య లాలి

 రాముడుద్భవించినాడు రఘుకులంబున
తామసులను దునిమి దివిజ
సోమంబుల క్షేమముకై
కోమలి కౌసల్యకు |శ్రీ రాముడు|


పలువరుస ఆణిముత్యపు
సిరులోయన కిలకిలమని నవ్వుచు


దశరథుండు భూసురులకు ధనమొసంగగా
విసరె మలయమారుతములు
దిశలెల్లను విశదములై
వసుమతి దుర్భరము బాప |రాముడు|


తనరు చైత్ర శుద్ధ నవమి పునర్వసందున
సరస కర్కాటకలగ్న
మరయగ సురవరులెలమిని
కురిపించిరి విరుల వాన |రాముడు|


ధరను గుడిమెళ్లంకపురము
నరసి బ్రోవగా
కరుణతో శ్రీ రంగదాసు
మొరలిడగను కరుణించియు వరమీయగ హరియై |రాముడు|

మెడనొప్పి - వ్యాయామాలు

గమనిక: యోగాలో శిక్షణ పొందిన గురువు వద్ద ఈ ఆసనాలు నేర్చుకుంటే సరైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి, గురువును సంప్రదించి మాత్రమే ఈ ఆసనాలు వెయ్యండి. 

కంప్యూటర్ ముందు కూర్చుని ఎక్కువసేపు పని చేసే ఎవ్వరికైనా మెడకు, నడుముకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మెడ నొప్పి (స్పాన్దిలైటిస్) ఇందులో అతి సాధారణం. దీనికి కారణం సరైన కూర్చునే విధానము, కంప్యూటర్ని చూసే విధానము లేక. ఆ విధానాల గురించి మీ ఎర్గానమిస్ట్ ను సంప్రదించండి. ఇక, మెడ నొప్పి ఉన్నవాళ్లకు, ఆ నొప్పి మరియు దానికి సంబంధించిన ఇతర దుష్ప్రభావాలను పూర్తిగా అరికట్టటానికి ఈ ఆసనాలు 100 % పని చేస్తాయి. దీనికి ఉదాహరణ నేనే. రెండు నెలల క్రితం విపరీతమైన మెడనొప్పి, తలనొప్పితో బాధపడ్డాను. అప్పుడు మంతెన సత్యనారాయణ గారి రోగాలు-ఆసనాలు పుస్తకం చదివి ఈ ఆసనాలు నేర్చుకున్నాను. ఈరోజు నాకు పూర్తిగా ఆ మెడనొప్పి చాయలు లేవు.  వీటిని ఇదే వరసలో, గురువు దగ్గర నేర్చుకొని మీ మెడ నొప్పిని  పోగొట్టుకోండి.
  1. మత్స్యాసనం
  2. ఉష్ట్రాసనం
  3. సర్పాసనం
  4. భుజంగాసనం
  5. ధనురాసనం
 గూగుల్ లో ఈ ఆసనాలు ఎలా చెయ్యాలో కొన్ని వందల సైట్లు అందమైన చిత్రాలతో ఉన్నాయి.  ఆసనాలు వేసి, మీ మెడను ఆరోగ్యవంతము చెయ్యండి.

మత్స్యాసనం
ఉష్ట్రాసనం
సర్పాసనం
భుజంగాసనం
ధనురాసనం