జంబూపతే మాం పాహి నిజానందామృత బోధం దేహి
అంబుజాసనాది సకల దేవ నమన
తుంబురు నుత హృదయ తాపోపశమన
అంబుధి గంగా కావేరీ యమునా
కంబుకంఠ్యఖిలాండేశ్వరీ రమణ
పర్వతజ ప్రార్థితాపలింగ విభో పంచబూతమయ ప్రపంచ ప్రభో
సర్వ జీవ దయాకర శంభో సామజాటవి నిలయ స్వయంభో
సర్వ కరుణా సుధా సింధో శరణాగత వత్సలార్థ బంధో
అనిర్వచనీయ నాద బిందో నిత్య మౌళి విధ్రుత గంగేందో
నిర్వికల్పక సమాధి నిష్ఠ శివ కల్పతరో
నిర్విశేష చైతన్య నిరంజన గురుగుహ గురో
ఓ జంబుకేశ్వరా! నన్ను కాపాడుము. నాకు అమృతతుల్యమైన సచ్చిదానందమును బోధించి అనుగ్రహింపుము. కమలాసనుడైన బ్రహ్మ, ఇతర దేవతలకు పూజ్యుడవు, తుంబురునిచే నుతించబడిన వాడవు, అందరి హృదయములలోని తాపమునకు ఉపశమనము కలిగించే వాడవు. సముద్రములు, గంగా కావేరీ యమునా నదులలో యున్న వాడవు. శంఖమువలె అందమైన కంఠము గల అఖిలాండేశ్వరి అమ్మకు పతివి. పార్వతీదేవి తపస్సు చేయగా జలలింగరూపంలో వెలసిన ప్రభూ! పంచభూతములతో నిండిన ప్రపంచానికి ఈశ్వరుడవు నీవు. సమస్త జీవరాశులపై కరుణను కురిపించే శంభుడవు నీవు. గజములు తిరిగే ఈ అటవీ ప్రాంతంలో స్వయంభూగా వెలసి నివసించే వాడవు, కరుణాసముద్రుడవు. శరణాగతులకు రక్షకుడవు, వారి అర్థములను తీర్చే బంధువువు. అనిర్వచనీయమైన ఓంకారనాదానికి మూలము నీవు. ఎల్లప్పుడూ శిరసులో గంగ మరియు చంద్రులతో ప్రకాశించే వాడవు. నిర్వికల్ప సమాధిలో ఉండే నిష్ఠాపరుడవు. భక్తుల కామ్యములను తీర్చే కల్పతరువువు. వర్ణించలేని చైతన్య స్వరూపుడవు, మచ్చలేని వాడవు, కుమారస్వామికి గురువువు నీవు. నన్ను రక్షించి అమృతతుల్యమైన సచ్చిదానందమును బోధించి అనుగ్రహింపుము.
ముత్తుస్వామి దీక్షితులవారు పంచభూతలింగములపై కృతులు రచించారు. వాటిలో జంబుకేశ్వరంలో జలలింగ రూపమైన శివుని నుతిస్తూ రచించిన ఈ కృతి యమన్ కళ్యాణి రాగంలో బాంబే జయశ్రీ గారు ఆలపించగా వినండి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి