30, మార్చి 2015, సోమవారం

మానవత్వమొకటే నీ మతమవ్వాలి

ఎన్నాళ్లు రంగులు పులుముకున్న హృదయంతో సంభాషిస్తావు?
అసలు అంతరంగాన్ని శుద్ధి చేసి ఎప్పుడు ఆవిష్కరిస్తావు?

రంగు రంగుల మాయా ప్రలోభాలతో గారడీలెన్నాళ్లు చేస్తావు?
నిష్క్రమణమున రంగులు వివర్ణమవుతాయని ఎందుకు మరుస్తావు?

నీ నైజం నుంచి దూరంగా ఎన్నాళ్లు పారిపోతావు? 
నీవెవరో తెలుసుకునేందుకు ఎందుకు సందేహిస్తావు?

దుర్లభమైన మానవునిగా జన్మించి అజ్ఞానముతో రాక్షసునిగా ప్రవర్తించి
కర్మ ఫలమున నిస్సహాయునిగా అనుభవించి మరణించి నీవు సాధించేదేమిటి

జన్మ జన్మలు పాపపుణ్యముల నడుమ కొట్టుమిట్టాడితే నీకు ఒరిగేదేమిటి
లెక్కలకతీతమైతే ఎల్లలులేని ఆనందం లెక్కలలో మునిగితే పుట్టెడు దుఖమే మిగులు

ఎప్పటికీ నిలిచేది నీ అంతరంగ సౌందర్యం యొక్క గుబాళింపులు
ఎన్నటికీ వాడనిది నీ హృదయ కమలం యొక్క పరిమళాలు

మానవత్వమొకటే నీ మతమవ్వాలి నలుగురి శ్రేయస్సే నీ కులమవ్వాలి

28, మార్చి 2015, శనివారం

సీతారామ వైభవం-2 - రాముని జననం


జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం
జనన మరణ ఖేద క్లేశ విచ్ఛేద మంత్రం
సకల నిగమ మంత్రం సర్వ శాస్త్రైక మంత్రం
రఘుపతి నిజ మంత్రం రామ రామేతి మంత్రం

అగ్ని బీజమై సమస్త పాపఖండన చేసేది రామనామము. తరించేది కాబట్టి తారకమంత్రమైనది. హనుమ మొదలు ఎందరిని తరింపజేసింది? జన్మకు సాఫల్యాన్ని కలిగించే మంత్రం...జననమరణాల దుఃఖాన్ని, కష్టాలను నాశనం చేసే మంత్రం, వేద సారమైన మంత్రం, అన్ని శాస్త్రములు ఏకమై ఘోషించే మంత్రం, రాముని నిజ మంత్రం రామ రామ అనే మంత్రం...అని శ్రీరామ కర్ణామృతమ్ మనకు బోధిస్తుంది. మరి ఆ రాముని అవతారం ఎలా జరిగింది?

శ్రీరాముని జననానికి రావణ సంహారం కారణమైతే దానికి వేదికి అయోధ్యానగరం. రఘువంశ కులజుడైన దశరథునికి సంతానం లేకపొవడంతో అశ్వమేథ యాగం తలపెడతాడు. ఆ యాగానికి ఋష్యశృంగ మహర్షిని దశరథుని మంత్రియైన సుమంతుడు పిలిపిస్తాడు. ఋష్యశృంగుడు అయోధ్యకు వచ్చి దశరథునిచే అశ్వమేథం చేయిస్తాడు. అటు తరువాత దశరథుడు పుత్రప్రాప్తికై క్రతువును చేయించమని ఆయనను అభ్యర్థిస్తాడు. అప్పుడా ఋష్యశృంగుడు అథర్వ శీర్షంలో ఉన్న పుత్రకామేష్టి క్రతువు చేస్తానని చెబుతాడు. ష్యశ్రంగుని వంటి తపోసంపన్నుడు క్రతువు ఏర్పాట్లు మొదలుబెడతాడు. ఆయన పవిత్రతకు బ్రహ్మాది దేవతలు తమ హవిర్భాగం గ్రహించటానికి యాగశాలలో ప్రత్యక్షమవుతారు. దేవతలందరూ అక్కడ బ్రహ్మదేవుని రావణుని హింసలనుండి విముక్తి కలిగించవలసిందిగా వేడుకుంటారు. బ్రహ్మ ఆతను మానవులచేత మాత్రమే సంహరించబడతాడు అని అంటాడు. అంతలో శ్రీమహావిష్ణువు యాగశాలలో ప్రత్యక్షమవుతాడు. దేవతలందరూ ఆయనను ప్రార్థిర్స్తారు. అప్పుడు ఆ పరమాత్మ పూర్ణాంశతో రామునిగా, అర్థాంశతో భరత లక్ష్మణ శతృఘ్నులుగా జన్మిస్తానని చెబుతాడు. ఋష్యశృంగుడు పుత్రకామేష్టి విజయవంతంగా పూర్తి చేస్తాడు. శ్రీమహావిష్ణువు దశరథుని కుమారులుగ జన్మించాలని సంకల్పిస్తాడు. యజ్ఞపురుషుడు పాయస పాత్రను దశరథునికిచ్చి ఆ పాయసాన్ని భార్యలకు పంచమని చెబుతాడు. దశరథుడు ఆ పాయసంలో సగభాగాన్ని పెద్ద భార్య కౌసల్యకు, 1/4 భాగం సుమిత్రకు, 1/8 భాగము చిన్న భార్య కైకేయికి, మిగిలిన 1/8 భాగము సుమిత్రకు ఇస్తాడు. కొంతకాలానికే ఆ రాణులు గర్భవతులవుతారు. దాదాపు పన్నెండు నెలల తరువాత కౌసల్యకు రాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శతృఘ్నులు జన్మిస్తారు. 

రాముని జననం గురించి వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణం బాలకాండలోని 18వ సర్గలో ఇలా తెలిపారు...
తతో యజ్ఞే సమాప్తే తు ఋతూనాం షట్ సమత్యయుః
తతశ్చ ద్వాదశే మాససే చైత్రే నావమికే తిథౌ

నక్షత్రేదితి దైవత్యే స్వోచ్చసంస్థేషు పంచసు
గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతావిందునా సహ

ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం
కౌసల్యా జనయద్రామం సర్వలక్షణ సమ్యుతం

విష్ణోరర్థం మహాభాగం పుత్త్రం ఐక్ష్వాకు వర్ధనం
కౌసల్యా శుశుభే తేన పుత్త్రేణామితతేజసా
యథా వరేణ దేవానాం అదితిర్వజ్రపాణినా

పుత్రకామేష్టి యాగం ముగిసిన సంవత్సర కాలం తరువాత చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నాలుగవ పాదమున కర్కాటక లగ్నమున కౌసల్యాదేవియందు శ్రీరామచంద్రుడు జన్మించాడు . ఆ సమయములో సూర్యుడు, అంగారకుడు, గురుడు, శుక్రుడు, శని అను ఐదు గ్రహములు తమ ఉచ్చ స్థానములందు అనగా క్రమముగా మేష, మకర, కర్కాటక, మీన తులారాశులయందు ఉండిరి. కర్కాటక రాశియందు గురు చంద్రులు కలిసి ఉండిరి. బుధుడు, రవి మేషమునందుండిరి. జగన్నాథుడు, అన్ని లోకములవారిచే నమస్కరింపబడువాడు, సకల శుభ లక్షణ సంపన్నుడు, గొప్ప భాగ్యశాలి, ,విష్ణువు అంశతో పుట్టినవాడు,  ఇక్ష్వాకు వంశ తిలకుడు  అయిన శ్రీరాముని కన్నఆ  కౌసల్య ఎంత ధన్యురాలు? కౌసల్యా దేవి తన తపఃఫలముగా అర చేతిలో  వజ్రరేఖలు కలవాడు, అమితమైన తేజస్సు కలిగినవాడు  అయిన శ్రీరాముని పుత్రునిగా పొందింది. దేవతలలో ఉత్తముడు, వజ్రాయుధాన్ని ధరించే ఇంద్రుని పుత్రునిగా పొందిన అదితిలా  ఆ కౌసల్య మాట అలరారింది . రాముని జనన సమయంలో ఐదు గ్రహాలు ఉచ్చ స్థానంలో ఉండటం  వలన,జ్యోతిష్య శాస్త్ర ప్రమాణం ప్రకారం "పంచోచ్చే లోకనాయకః" . అందుకే రాముడు లోకానికి ప్రభువైనాడు.

ఆ తరువాత విష్ణువు అర్థాంశగా భరతుడు చైత్ర శుద్ధ దశమి పుష్యమీ నక్షత్ర సమయంలో కైకేయికి, లక్ష్మణ శతృఘ్నులు చైత్ర శుద్ధ దశమి ఆశ్లేష నక్షత్ర సమయములో సుమిత్రకు జన్మించారు. ఈ నలుగురు అన్నమ్దన్న్ములు జన్మించ సమయంలో గంధర్వులు మధుర గానం చేశారు, అప్సరసలు హృద్యంగా నాట్యం చేశారు. దేవదున్ధుబులు మ్రోగగా దేవతలు పూల వానలు కురిపించారు.

దశరథ మహారాజు తన ఉత్తములకు, తన వందిమాగదులకు బహుమానాలిచ్చాడు.బ్రాహ్మణులకు గోవులు ధన కనక వస్తు వాహనాలను దానం చేశాడు. ప్రజలు ఆనందోత్సాహాలతో ఆడిపాడారు. రాజవీదులన్నీ గాయకుల పాటలతో, నృత్యాలతో, ఉత్సవాలతో నిండిపోయాయి.  దశరథ మహారాజు అయోధ్యాపుర వాసులకు మృష్టాన్న భోజనాలు పెట్టి సంతృప్తి  పరచాడు . 
ఈ రామ జననాన్ని మన తెలుగు గడ్డపై పుట్టిన ప్రయాగ రంగదాసు గారు అద్భుతంగా వర్ణించారు. ఆ కీర్తన వివరాలు:


కళ్యాణ రామునికి కౌసల్య లాలి
రాముడుద్భవించినాడు రఘు కులంబున    

తామసులను దునిమి దివిజ స్థోమంబున
క్షేమముకై కోమలి కౌసల్యకు శ్రీరాముడుద్భవించినాడు

తనరు చైత్ర శుద్ధ నవమి పునర్వసంబున
సరస కర్కాటక లగ్నమరయగ సురవరులెలమిని కురియింప విరుల వాన 

దశరధుండు భూసురులకు ధనమొసంగగా  
విసరె మలయ మారుతము దిశలెల్లను విశదములై వసుమతి దుర్భరము బాప

ధరను గుడిమెళ్ళంక పురమునరసి బ్రోవగా
కరుణతో శ్రీ రంగదాసు మొరలిడగను కరుణించియు వరమివ్వను స్థిరుడై శ్రీ 


దీని సారాంశము:

దశరథుడు బ్రాహ్మణులకు దానాలు చేయగా, అన్ని దిశలా మలయ మారుతాలు వీచగా, భూదేవి బాధను తగ్గించటానికి, చైత్రమాసమున, శుద్ధ నవమి నాడు, పునర్వసు నక్షత్రమున, కర్కాటక లగ్నమందు మెరుపులు మెరుస్తుండగా, దేవతలు పూలవానలు కురిపిస్తుండగా, దేవతల క్షేమము కొరకు, రాక్షసులను చంపటానికి శ్రీరాముడు కౌసల్యా గర్భమున జన్మించాడు.  


మనకు శ్రీకృష్ణుని జననం గురించి ఎన్నో వర్ణనలు వచ్చాయి. ఇక్కడ ప్రయాగ రంగదాసు గారు రాముని జన్మమును ఎన్నుకోవటం విశేషం. .ప్రయాగ రంగదాసు గారు మన ఆంధ్ర ప్రదేశ్ లో పుట్టిన ఒక వాగ్గేయ కారుడు.  మన మంగళంపల్లి బాలమురళీ కృష్ణగారి మాతామహులు వీరు. ఈయన ఎన్నో మంచి కీర్తనలు శ్రీ రాముని మీద రచించారు.  రంగదాసు గారు శ్రీమద్వాల్మీకి రామాయణంలోని బాలకాండం ప్రేరణతో ఈ కీర్తన రాశారు. రంగదాసు గారు తన ముద్రగా తన స్వగ్రామాన్ని వాడటం ఆయన వ్యక్తిత్వాన్ని చూపుతుంది. ప్రయాగ రంగదాసు గారు మరెన్నో అద్భుతమైన కీర్తనలను రచించారు. వాటిలో రామ రామ యనరాదా రఘుపతి రక్షకుడని వినలేదా, ఏమే చిట్టీ, కృష్ణమ్మా గోపాల బాల కృష్ణమ్మ, రామా నిను వినా వంటివి చాలా ప్రాచుర్యం పొందారు. ఆయన 1859వ సంవత్సరంలో మెళ్లంక గ్రామంలో జన్మించారు.  మంచి హరికథకులు. ఆధ్యాత్మ రామాయణ సంకీర్తనలు ఆయన నోటనే ప్రాచుర్యం పొందాయి. అలాగే, అష్టపదులు, నారాయణ తీర్థ తరంగాలను రంగదాసు గారు ప్రచారంలోకి తెచ్చారు. వారి రచన అయిన రాముడుద్భవించినాడు అనే కీర్తనకు అరవైయ్యవ దశకంలోని ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారి శ్రవణం.  



23, మార్చి 2015, సోమవారం

జపవిధానము



జకారో జన్మవిచ్ఛేదః పకారః పాపనాశనః
జన్మచ్ఛేదకరో యస్మాత్ జపమిత్యభిదీయతే

జ అంతే జన్మరాహిత్యము, ప అతే పాపనాశనము. జపము అనగా పాపమును నశింపజేసి జన్మరాహిత్యమును అనుగ్రహించునది. కావున జపమును చేయునప్పుడు మంత్రమునందు మనస్సు నిల్పి, తద్భావమును మధ్య మధ్యలో ధ్యానించుట వలన భావపుష్టితో జపపుష్టి కలిగి తద్ద్వారా మంత్రసిద్ధి కలిగి సంపూర్ణ ఫలితము లభించును. 

మననాత్ త్రాయతే ఇతి మంత్రః. మననము చేస్తే తరింపజేసేది మంత్రము. అటువంటి శక్తిపూరితమైన మంత్రాన్ని జప ప్రక్రియలో సాధన చేయటానికి కొన్ని ముఖ్యమైన విషయాలున్నాయి:

1. జపము మూడు విధాలుగా ఉండును - 1. వాచికము 2. ఉపాంశువు 3. మానసికము. బయటకు వినిపించునట్లుగా చెప్పుచూ చేయునది వాచికము. ఇతరులకు వినిపించకుండా పెదవులు కదులుతూ నాలుకతో జపించుటను ఉపాంశువు అంటారు. నాలుక, పెదవులు కదలకుండా లోలోపల చేసే జపమును మానసికము అందురు. వాచికము కంటే ఉపాంశువు శ్రేష్ఠము, దానికన్నా మానసికము మరింత శ్రేష్ఠము.

2. ప్రాతఃకాలములో చేతులు పైకెత్తి, మధ్యాహ్న కాలమో చక్కగా ఉంచి, సాయంకాలం క్రిందకు ఉంచి జపము చేయవలెను.

3. చందనముతో, అక్షతలతో, పుష్పములతో, ధాన్యముతో, చేతివ్రేళ్ల గణుపులతో లేదా మట్టితో జపాన్ని లెక్కించకూడదు. జపమాలతో, మిరియాలతో లెక్కించవచ్చు. శ్రేష్టమైనది లక్క, దర్భ, సింధూరము, ఎండిన ఆవుపేడ మిశ్రమంతో గోళీలు తయారు చేసి లెక్కించుట.

4. జపము చేయునప్పుడు జపమాలను బయటకు కనిపించకుండా అరచేతి చాటున లేదా ఒక వస్త్రముతోనైనా తప్పనిసరిగా కప్పి ఉంచవలెను. ఆ వస్త్రము తడిగా ఉండరాదు.

5. జపమాలను అనామిక (ఉంగరపు) వ్రేలిపైన ఉంచి బొటన వ్రేలితో స్పర్శించుచు మధ్య వ్రేలితో పూసలను తిప్పవలెను. చూపుడు వ్రేలును ఉపయోగించకూడదు.

6. జపము చేయునప్పుడు కదలుట, మెదలుట, మాట్లాడుట నిషిద్ధము. తప్పనిసరిగా మాట్లాడవలసినచో భగవంతుని క్షమాపణ భావంతో స్మరించి తిరిగి జపించవలెను.

7. అజాగ్రత్తవలన జపమాల కింద పడినచో నూట ఎనిమిది మార్లు ప్రత్యేకముగా జపించవలెను. కాలికి తగిలిన యెడల జలముతో కడిగి రెట్టింపు సంఖ్యతో (రెండు మాలలు) అదనముగా జపము చేయవలెను.

8. ఒకవేళ చేతి వ్రేళ్లతో జపము చేయవలసి వస్తే ఉంగరపు వ్రేలు మధ్య గణుపు మీద మొదలు పెట్టి, క్రింది గణుపు, తరువాత చిటికెన వ్రేలు మీద గణుపు, చిటికెన వ్రేలు, ఉంగరపు వ్రేలు, మధ్య వ్రేలు, చూపుడు వ్రేలు యొక్క మేరువులను తాకుతూ చూపుడు వ్రేలు గణుపులతో ముగించవలెను. ఈ మర్గాన్ని విలోమములో చేసి (చూపుడు వ్రేలు చివరి గణుపుతో మొదలు పెట్టి అప్రదక్షిణముగా ఉంగరపు వ్రేలి మధ్య గణుపులో) ముగించవలెను. చివరి ఎనిమిదికి ఉంగరపు వ్రేలు చివరి గణుపుతో మొదలుపెట్టి చూపుడు వ్రేలు మధ్య గణుపుతో ముగించవలెను. దీనిని కరమాల అందురు.(రెండవ చిత్రాన్ని చూడండి)

9. సంధ్యోపాసనలో చేసే గాయత్రీ మంత్ర జపానికి కరమాల శ్రేష్ఠం. ఇతర మంత్ర జపానికి రుద్రాక్షమాల శ్రేష్ఠం.

10. జపమును ముగించిన పిమ్మట కూర్చున్న ప్రదేశమునందు మట్టిని తీసికొని నుదుటిపై తిలకమును ధరించవలెను. లేనిచో జపఫలితమును మహేంద్రుడు గ్రహించును.

- "నిత్యకర్మ - పూజా ప్రకాశిక" (మదునూరి వెంకటరామశర్మ, గీతాప్రెస్)

పూర్వజన్మకు ఈజన్మకు ఉన్న సంబంధము



శరీరం యదవాప్నోతి యచ్చప్యుత్క్రామతీస్వరః
గృహీత్వైతాని సమ్యాతి వాయుర్గంధానివాశయాత్

వాయువు వాసనలను ఒకచోటి నుండి మరొక చోటికి తీసుకొని పోయినట్లుగా జీవాత్మ ఒక శరీరమును త్యజించునప్పుడు మనస్సును ఇంద్రియములను గ్రహించి వాటితో కూడ మరొక శరీరాన్ని పొందును. 

భగవద్గీత 15వ అధ్యాయము, 8వ శ్లోకము.

ఇదీ పూర్వజన్మకు ఈజన్మకు ఉన్న సంబంధము. ఈ అనంతమైన వలయాన్ని ఛేదించుటే మోక్షము. దానికి శరీరము సాధనము. జీవితం లక్ష్య సాధనకు సోపానము.

ఉగాది

లేత మామిడి ముక్కకు శ్వేత వేపపువ్వుకు
గట్టి బెల్లపు ముక్కకు పుల్ల చింతపండుకు
పచ్చి మిరప ముక్కకు ఉప్పు మేళవించిన

తీపి చేదుల అనుభవములు
మధుర క్షార అనుభూతులు
కష్ట సుఖముల జంటనడకలు
కలిమి లేముల పొద్దుపొడుపులు

శాశ్వత సత్యమును తెలిపేది ఉగాది
వసంత ఋతువున విరిసేది ఉగాది

21, మార్చి 2015, శనివారం

పాలించు కామాక్షి పావని పాప శమని




పాలించు కామాక్షి పావని పాప శమని

చాలా బహు విధముగా నిన్ను సదా వేడుకొన్న నా యందేల
ఈ లాగు జేసేవు వెత హరియించి వేవేగమే నన్ను

స్వాంతంబులోన నిన్నే తలచిన సుజనులకెల్లను ఈ వేళ
సంతోషములొసగేవని నీవు మనోరథ ఫలదాయినివని
కాంతమగు పేరు పొందితివి కారుణ్యమూర్తివై జగము
కాపాడిన తల్లి కదా నేడు నీదు బిడ్డను లాలించి

కనకగిరి సదన లలిత నిను భజన సంతతము సేయ నిజముగను
వినుము నిఖిల భువన జననీ ఇపుడు మా దురితము దీర్చి వరాలిచ్చి

ఎందుకో అమ్మ బాగా గుర్తుకు వచ్చింది. అమ్మకు అమ్మవారి కీర్తనలు అంటే చాలా ఇష్టం. వెంటనే యూట్యూబ్ లోకి వెళ్లి కొన్ని సంకీర్తనలు విందామని పాలించు కామాక్షి విన్నాను. కళ్లలో నీళ్లు తిరిగాయి. పాపశమనీ అన్నచోట మధ్యమావతి రాగంలోని మార్దవం, కరుణ పొంగి పొరలినట్లనిపించింది. అమ్మ అనగానే వాత్సల్యము, దయ, లాలన, కరుణ, సంతోషము వంటి మంచి భావనలెన్నో కలుగుతాయి. ఈ కృతి వింటే అవన్నీ కలుగుతాయి నాకు. దివ్యరూపంలో ఉన్న మా అమ్మ కూడా నాకు ఎప్పటికీ వెన్నంటి ఉంటుందని సాంత్వన కలిగింది. అభీష్టాలను ముందు నిలబడి నడిపించే ఫలదాయనిగా అమ్మ నాతోనే ఉంటుంది అనిపించింది. ఆ కామాక్షి తల్లి అమ్మను గుర్తు చేసి తనను తలచుకునేలా చేసింది. దిక్కుతోచక పరిగెడుతున్నానా అనిపించిన సమయంలో కామాక్షీ తల్లి స్తుతి దృఢత్వాన్నిచ్చింది. జగమును కాపాడే కారుణ్యమూర్తివి కదా తల్లి? ఈ వాక్యం వినగానే దుష్టశిక్షణ చేసే జగన్మాత రూపం మదిలో కదలాడింది. సంకీర్తనల గొప్పతనమిదేనేమో? విశ్వాన్ని నిరంతరం కాపాడే ఆదిపరాశక్తికి ప్రతి రూపం కన్నతల్లి. తంజావూరులోని బంగారు కామాక్షిని ఎంతో నిష్ఠగా కృతుల ద్వారా ఉపాసన చేసిన శ్యామశాస్త్రుల వారు ఎంత ధన్యులో? వారికి పాదాభివందనాలు.

భక్తిలో శరణాగతి చాల ముఖ్యమైన భాగం. ఆ శరణు భావన కలిగితే తప్ప భక్తి ఫలించదు. సనాతన ధర్మ సాంప్రదాయంలో వాగ్గేయకారులు తమ మనోభావనలను సంకీర్తనల ద్వారా మనకు తెలిసేలా శాశ్వతం చేశారు. సంగీత త్రయంలో ఒకరైన శ్యామశాస్త్రి వారి మనోగతాన్ని తెలిపే ఒక కృతి పాలించు కామాక్షి పావని అనే మధ్యమావతి రాగంలో కూర్చబడిన సాహితీసౌరభం. శరణాగతి అనేది ఆ దేవతా స్వరూపంపై అచంచలమైన విశ్వాసముంటే తప్ప కలుగదు. శాక్తేయంలో ఉన్న గొప్పతనమేమిటంటే అమ్మ యొక్క సాత్విక స్వరూపాన్ని కన్న తల్లిలా భావించి ఆ అమ్మతో సంభాషించే తత్త్వం.

https://www.youtube.com/watch?v=RYTyeq05GHo

తాళ్లపాక అన్నమాచార్యుల వారి 512వ వర్ధంతి












తాళ్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తనలు పరిపూర్ణమైన తత్త్వ సంపదలు. మధుర భక్తితో రచించిన శృంగార సంకీర్తనలు ఒక ఎత్తైతే , అపూర్వమైన సామాజిక సందేశము, ఆధ్యాత్మికత కూడిన సంకీర్తనలు మరింత ఎత్తు. మానవ జన్మ లక్ష్యము, సమకాలీన సమస్యలకు పరిష్కారము, భగవద్గీతా సారాంశము - సామాన్యుని భాషలో, మంత్ర సమానమైన పదములుగా రచించారు సద్గురువులు. మనలను సరైన మార్గంలో అత్యంత ప్రభావవంతంగా నడిపించే వారే సద్గురువులు. అనేకరకములైన మానసిక పరిస్థితులకు సముచితమైన సందేశముతో సాంత్వననిచ్చి మానవ జన్మకు సార్థకతను కూర్చే శక్తి అయన రచనలలో ఉంది. కాబట్టే దాదాపు ఆరువందల సంవత్సరాలైనా ఆయన సాహితీ సంపద మనకు మార్గదర్శకంగానే నిలుస్తోంది.
ఎప్పుడు మనం ఆయనిచ్చిన ఈ అపూర్వమైన సంపదను సద్వినియోగం చేసుకున్నట్లు?
1. అందరిలోనూ ఉన్నది ఒకటే అన్న సందేశాన్ని సరిగా అర్థం చేసుకొని ఆచరించినపుడు. సాటి మనిషిని మనిషిగా గుర్తించి, గౌరవించి సోదర భావంతో మెలగినపుడు.
2. మనం ఏవిధంగా తలస్తే ఆ రూపంలో దర్శనమిచ్చే మహత్తరమైన దివ్యశక్తి పరమాత్మ. ఎన్ని భగవద్స్వరూపాలైనా, అన్నీ ఆయన దార్శనికాలే. కాబట్టి దేవతా స్వరూపాలను తారతమ్యం లేకుండా చూడగలిగినపుడు, వివిధ తత్త్వాలను, మార్గాలను గౌరవించినపుడు.
3. మనలోని తెరలను, పొరలను, మాలిన్యాలను తొలగించుకొని, ఈ దేహమనే అద్భుతమైన సాధనాన్ని ఉపయోగించుకుని జనన మరణాలను దాటిన మోక్ష స్థితిని చేరుకోగలిగినపుడు.
4. సర్వస్యశరణాగతితో పరమాత్మకు మనలను మనం సమర్పించుకుని ఈ దుర్లభమైన మానవ దేహంతో అద్భుతమైన ఫలితాలను సాధించుకోగలిగినపుడు.
5. అనంతమైన కష్టాలను ఈ సంకీర్తనల సాయంతో అవలీలగా దాటగలిగినపుడు, సంయమనం, స్థితప్రజ్ఞత చూపగలిగినపుడు.
అన్నమాచార్యులను మించిన సంఘసంస్కర్త లేడు. ఆయన సంకీర్తనలు మించిన ఒలిచిన అరటిపండులా సులువైన సాధనం లేదు. మానవతకు నిఘంటువు, మానవ జన్మ లక్ష్యానికి నిర్వచనం ఆయన సాహిత్యం. తెలిసితే మోక్షమే.
ఆ సద్గురువుల 512వ వర్ధంతి సందర్భంగా వారి పాదాలకు శతసహస్ర వందనాలు.


మన్మథ నామ సంవత్సర శుభాకాంక్షలు


సోదర సోదరీమణులకు, పిల్లలకు, పెద్దలకు, అందరికీ మన్మథ నామ సంవత్సర శుభాకాంక్షలు. షడ్రుచుల పచ్చడి జీవితంలో అన్నీ సమపాళ్లలో ఉంటాయి అని చాటటానికి సూచిక. వసంత ఋతువు ఆగమనం అంటు రోగాలకు కూడా దారి తీస్తుంది కాబట్టి రోగ నిరోధక శక్తి కలిగిన ఆరు ప్రకృతి సిద్ధమైన ధాతువులను మనకు పచ్చడి రూపంలో ఇచ్చారు పెద్దలు. శరీర ఆయురారోగ్యాల కోసం ఈ పండుగ...సృష్టి ఆరంభానికి ప్రతీక ఉగాది. అన్ని ఋతువుల గమనం ఒక వృత్తం పూర్తి కావటానికి ప్రతీక ఉగాది.
ఉగాది, గుడి పడ్వ, చెట్టీ చాంద్...ఏ పేరైతేనేమి? భారత దేశంలో ఎందరికో కొత్త సంవత్సరం ఇది. కాలధర్మం, ఋతువుల మార్పుతో కూడినది కాబట్టి ఇదే నిజమైన కొత్త సంవత్సరం. దీనిలో అర్థం తెలుసుకుంటే సంబరానికి సార్థకత.
తెలుగుజాతిలో జన్మించినందుకు కొంతైనా తెలుగుదనానికి గౌరవం చూపించి తెలుగువారి సహజ సిద్ధమైన సాంప్రదాయాలతో, గడపలకు మావిడాకులు, పూలమాలలు కట్టి, తలంటుకొని, పరమేశ్వరుని ప్రార్థించి, పచ్చడిని నైవేద్యంగా అర్పించి,సేవించి, నూతన వస్త్రాలు ధరించి, పంచాంగ శ్రవణం చేసి, నలుగురిని ఆత్మీయంగా పలకరించి తెలుగుదనంతో జరుపుకుందాం.
కాలే వర్షతు పరజన్యః పృథివీ సస్యశాలినీ
దేశోయం క్షోభ రహితః బ్రాహ్మాణాస్సంతు నిర్భయాః
సమయానికి వర్షాలు కురియు గాక. భూమి సస్యశ్యామలమగుగాక. దేశము కరవు కాటకాలు, క్షోభ రహితమగు గాక. బ్రహ్మజ్ఞానులు నిర్భయులగు గాక!
చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు
నాలుగు సాగరాల మేర గోవులకు, బ్రహ్మ జ్ఞానులకు శుభం కలుగు గాక!