శ్రీవల్మీకలింగం చింతయే శివార్ధాంగం చింతయే
శ్రీవరదాయకం శ్రీపురనాయకం దేవతాది వినుత దివ్యవిధీవిటంకం
శ్రీవల్మీకలింగేశ్వరుని నేను నిరంతరము ధ్యానించుచున్నాను. పార్వతీదేవిని తన శరీరములో అర్ధభాగముగా ధరించిన అర్ధనారీశ్వరుని నేను భక్తితో చింతించుచున్నాను. శ్రేష్ఠమైన వరములను ప్రసాదించేవాడును, శ్రీపురమునకు అధిపతియైనవాడును, దేవతలు మొదలైనవారిచే స్తుతింపబడేవాడును, బ్రహ్మచే నిర్మించబడిన దివ్యమైన గృహములో నివసించేవాడు అయిన పరమేశ్వరుని నేను ధ్యానించుచున్నాను. కురుక్షేత్రమున బ్రహ్మదేవుడు నిర్వహించిన యజ్ఞమునుండి ఆవిర్భవించినవాడును, విల్లును ధరించినవాడును, మురాసురుని శత్రువైన శ్రీమహావిష్ణువుచే ఆరాధింపబడినవాడును, ఇంద్రుడు మొదలైన సమస్త దేవతల భయములను, ఆపదలను తొలగించుటలో అత్యంత సమర్థుడును, సర్వమంగళకరుడైన శంకరుడును, సోమకులాంబిక అనే పద్మమునకు తుమ్మెదవంటివాడును, గురుగుహుడైన సుబ్రహ్మణ్యస్వామికి తండ్రియైనవాడును, తనకు నమస్కరించే భక్తులకు తండ్రివలె రక్షణ కల్పించేవాడును, కుబేరునికి మిత్రుడును, చర్మమును వస్త్రముగా ధరించినవాడును, తన సుందరమైన శిరస్సుపై చంద్రకళను ధరించినవాడును, ఇతర ప్రకాశములపై ఆధారపడక స్వయముగా వెలుగొందే పరంజ్యోతి స్వరూపుడును, సంసారసాగరమునుండి జీవులను తరింపజేసి మోక్షమును ప్రసాదించేవాడును అయిన ఆ శ్రీ వల్మీకలింగేశ్వరుని నేను భక్తిశ్రద్ధలతో ధ్యానించుచున్నాను.
కాంభోజి రాగంలో స్వరపరచబడిన ఈ ముత్తుస్వామి దీక్షితుల వారి తిరువారూర్ పంచలింగ కృతిని సీతా నారాయణన్ గారు ఆలపించారు.

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి