10, ఏప్రిల్ 2024, బుధవారం

అనరాదు వినరాదు ఆతని మాయలు నేడు - శ్రీరంగం గోపాలరత్నం ఆలపించిన అన్నమయ్య కృతి

తెలుగు గడ్డ మీద పుట్టిన ఓ అనర్ఘ్యరత్నం శ్రీరంగం గోపాలరత్నం గారు. ఆవిడ దివికేగి మూడు దశాబ్దాలు దాటినా ఈనాటికీ కూడా అటువంటి గాత్రం మళ్లీ తెలుగు గడ్డ మీద పుట్టలేదు. ఆవిడ గాత్ర మాధుర్యం, తెలుగుదనం ఉట్టిపడే ప్రతిభ అనన్యం. దాదాపు నాలుగు దశాబ్దాల సంగీత ప్రస్థానంలో ఆవిడ తెలుగు గడ్డపై శాస్త్రీయ సంగీతానికి మహారాణిగా నిలిచారంటే అతిశయోక్తి కాదు. కవిరాయుని జోగారావు గారు, డాక్టర్ శ్రీపాద పినాకపాణి గారి వద్ద సంగీతాన్ని అభ్యసించారు. అతిపిన్న వయసులోనే హరికథలు ఆలపించారు. 

ఆవిడ ఆలపించిన ఓ అన్నమాచార్యుల వారి కృతి, బాలకృష్ణుని లీలలపై, ఆరభి రాగంలో స్వరపరచబడింది. అన్నమాచార్యుల వారికి ఆ కృష్ణుని లీలలు ఎంత అద్భుతంగా కనబడ్డాయో అంతకు మించి అందంగా ఆయన పదాలలో వెలువడ్డాయి. అన్నమాచార్యుల సాహిత్యమంటేనే తెనుగుదనం ఉట్టీపడే జానపదాలు. గోపాలరత్నం గారు ఈ కృతిని రమ్యాతిరమ్యంగా ఆలపించారు.  

అనరాదు వినరాదు ఆతని మాయలు నేడు
దినదిన క్రొత్తలాయదృష్టమిదే మాకు

ఆడెడి బాలుల హరి అంగిలి చూపుమని
తోడనే వాండ్ల నోర దుమ్ములు చల్లి
యీడ మాతో చెప్పగాను యిందరము గూడిపోయి
చూడబోతే పంచదారై చోద్యమాయెనమ్మా

తీట తీగెలు సొమ్మంటూ దేహము నిండ గట్టె
తీటకుగాక బాలులు తెగి వాపోగా
పాటించి యీ సుద్ది విని పారితెంచి చూచితేను
కోటికోటి సొమ్ములాయ కొత్తలోయమ్మా

కాకి జున్ను జున్నులంట గంపెడేసి తినిపించి
వాకొలిపి బాలులెల్ల వాపోవగా 
ఆకడ శ్రీవేంకటేశుడా బాలుల కంటి నీరు
జోకగ ముత్యాలుసేసె జూడగానమ్మా 

ఓ యశోదమ్మా! ఈ చిన్ని కృష్ణుని మాయలు అంతా ఇంతా అని చెప్పలేము, ప్రతి రోజు కొత్త కొత్తగా ఉన్న ఈ మాయలను చూడటం మా అదృష్టం. తనతో ఆడే బాలురి అంగిలి చూపమని చెప్పి వారు నోరు తెరవగానే దుమ్ము చల్లాడుట. ఆ మాట పిల్లలు మాకు చెప్పగా మేమందరము వెళ్లి చూస్తే ఆ దుమ్మంతా పంచదారయ్యింది, ఇదేమి వింతో! దురదలు పుట్టించే తీగెలు ఆభరణాలంటూ తోటి బాలుర దేహముపై కృష్ణుడు కట్టాడుట, ఆ దురదలు భరించలేక బాలులు మా వద్ద వాపోగా, మేమంతా వెళ్లి చూస్తే ఆ తీగెలు అమూల్యమైన కొత్త ఆభరాణాలయినాయమ్మా! చిన్న చిన్న జున్ను ముద్దలు  గంపల కొద్దీ తోటి బాలురకు తినిపించాడుట, వారు ఆ వికారాన్ని భరించలేక మా వద్ద వాపోయారు. మేమంతా వెళ్ళి చూడగా శ్రీనివాసుడా బాలుల కంటి నీరును అద్భుతంగా ముత్యాలుగా మార్చేసాడమ్మా!