రామచంద్రులు నాపై చలము చేసినారు సీతమ్మ చెప్పవమ్మా
కటకట వినడేమిసేయుదు కఠినచిత్తుని మనసు కరుగదు
కర్మములు యెటులుండునో కదా ధర్మమే నీకుండునమ్మా
దినదినము నీ చుట్టు దీనతతో తిరుగ దిక్కెవ్వరిక ఓయమ్మా
దీనపోషకుడనుచు వేడితి దిక్కులన్నియు ప్రకటమాయెను ఒక్క మాటైనను వినడు ఎక్కువేమని తలతునమ్మా
దశరథాత్మజుడెంతో దయశాలియనుకొంటి ధర్మహీనుడే ఓ యమ్మ
దాసజనులకు దాతయతడట వాసిగ భద్రగిరీశుడట
రామదాసుని యేల రాడట రవికులాంబుధిసోముడితడట
ఓ సీతమ్మా! రామచంద్రుడు నాపై పంతం పట్టినట్లున్నాడు, నా బాధను ఆయనకు చెప్పి నాపై దయ చూపేలా చేయవమ్మా. అయ్యో! నేను ఎంత మొరపెట్టుకున్నా ఆయన వినడేమిటమ్మా! నేనింకేమి చేయను? ఆ కఠినచిత్తుని మనసు కరగడం లేదు. నా కర్మలు ఎట్లా ఉన్నాయో ఏమో గాని, నీవైనా ధర్మంగా నన్ను ఆదుకోవాలమ్మా. ప్రతిరోజూ దీనుడనై నీ చుట్టూ తిరుగుతున్నాను. నీవు తప్ప నాకు దిక్కెవరున్నారమ్మా? దీనులను పోషించేవాడని రాముణ్ణి వేడుకున్నాను, కానీ ఇప్పుడు నాకు అన్ని దిక్కులూ మూసుకుపోయినట్లయ్యాయి. నేను ఎంత మొరపెట్టుకున్నా ఒక్క మాటైనా వినడం లేదు, దీనికి కారణమేమిటని అనుకోవాలమ్మా! దశరథుని కుమారుడు ఎంతో దయగలవాడని అనుకున్నాను, కానీ నాపట్ల ఇలా ప్రవర్తిస్తుంటే ధర్మం లేనివాడేనా అని బాధ కలుగుతోందమ్మా. దాసజనులకు వరాలిచ్చే దాత అతడంటారు, ఎంతో ప్రసిద్ధిగాంచిన భద్రగిరీశుడట, సూర్యవంశమనే సముద్రానికి చంద్రుడివంటివాడట. ఇన్ని గొప్పతనాలు కలిగిన ఆ రాముడు ఈ రామదాసుని ఆదుకోవడానికి మాత్రం ఎందుకు రావడం లేదో చెప్పవమ్మా.
అసావేరి రాగంలో స్వరపరచబడిన ఈ భద్రాచల రామదాసు కృతిని మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు ఆలపించారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి