RightClickBlocker

27, డిసెంబర్ 2010, సోమవారం

శ్రీ శంకరభగవత్పాదకృత లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం - తాత్పర్యము

హఠకేశ్వరం అడవులు శ్రీశైల ప్రాంతంలో ఉన్నాయి. ఇవి కీకారణ్యములు. ఇక్కడ కాపాలికులు నివసించే వారుట. కాపాలికులు శ్మశానాలలో ఉంటూ ఆటవిక జంతు మానవ బలుల ద్వారా దేవతలకు ప్రీతి కలిగించే వారుట.  ఆది శంకరులు ఒకసారి ఇక్కడ తపస్సు చేస్తుండగా ఒక కాపాలికుడు వచ్చి శంకరులను ఆ పరమేశ్వరునికి బలిగా రమ్మని అడిగాడుట. అందుకు శంకరులు సమ్మతించి బలికి సిద్ధమయ్యారు. కాపాలికుడు శంకరుల తల నరుకబోగా విష్ణుమూర్తి నృసింహ రూపంలో ప్రత్యక్షమై కాపాలికుని సంహరించాడుట. ఆ సందర్భముగా ఆది శంకరులు ఆ నరహరిని స్తుతిస్తూ ఈ కరుణారస పూరితమైన, శరణాగతితో నిండిన లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని రచించారు.  (ఇది కంచి కామకోటి పీఠం వారి వెబ్ సైట్ ఆధారంగా చెప్పబడింది)

పిశాచ పీడా నివృత్తికి, భీతిని పోగొట్ట టానికి, మానసిక దౌర్బల్యము నుండి బయట పడటానికి ఈ స్తోత్రము అత్యంత ఫలప్రదమైనది, మహిమాన్విత మైనది. ఇందులో శంకరుల భక్తి, ఆర్తి,  పతాకము స్పష్టముగా గోచరిస్తాయి.  అద్భుతమైన పద ప్రయోగము, నిర్మలమైన భావము, పరమాత్మకు పూర్తి శరణాగతి ఈ స్తోత్ర ప్రాధాన్యము.

శంకరభగవత్పాదకృత లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం, తాత్పర్యము, ప్రతివాద భయంకర శ్రీనివాస్ (పీ.బీ. శ్రీనివాస్) గారు దీన్ని శ్రావ్యంగా ఆలపించారు.


శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే
       భోగీంద్రభోగరమణిరంజిత పుణ్యమూర్తే
యోగీశ శాశ్వత శరణ్యభవాబ్ధిపోత
       లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౧

బ్రహ్మేంద్రరుద్రమరుదర్కకిరీటకోటి
       సంఘట్టితాంఘ్రికమలామలకాంతికాంత
లక్ష్మీలసత్కుచసరోరుహరాజహంస
       లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౨

సంసారఘోరగహనే చరతో మురారే
       మారోగ్రభీకరమృగప్రవరార్దితస్య
ఆర్తస్య మత్సరనిదాఘనిపీడితస్య
        లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౩

సంసారకూపమతిఘోరమగాధమూలం
        సంప్రాప్య దుఃఖశతసర్పసమాకులస్య
దీనస్య దేవ కృపణాపదమాగతస్య
        లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౪

సంసారసాగరవిశాలకరాలకాల
       నక్రగ్రహగ్రసననిగ్రహవిగ్రహస్య
వ్యగ్రస్య రాగరసనోర్మినిపీడితస్య
        లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౫

సంసారవృక్షమఘబీజమనంతకర్మ
       శాఖాశతం కరణపత్రమనంగపుష్పం
ఆరుహా దుఃఖఫలితం పతతో దయాలో
        లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౬

సంసారసర్పఘనవక్త్రభయోగ్రతీవ్ర
        దంష్ట్రాకరాలవిషదగ్ధవినష్టమూర్తేః
నాగారివాహన సుధాబ్ధినివాస శౌరే
         లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౭

సంసారదావదహనావదభీకరోరు
         జ్వాలావలీభిరతిదగ్ధతనూరుహస్య
త్వత్పాదపద్మసరసీశరణాగతస్య
         లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౮

సంసారజాలపతితస్య జగన్నివాస
         సర్వేంద్రియార్థబడిశార్థఝషోపమస్య
ప్రోత్ఖండితప్రచురతాలుకమస్తకస్య
          లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౯

సంసారభీకరకరీంద్రకరాభిగాత
       నిష్పిష్టమర్మవపుషః సకలార్థినాశ
ప్రాణప్రయాణభవభీతిసమాకులస్య
        లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౧౦

అంధస్య మే హృత్వివేకమహాధనస్య
       చోరైః ప్రభో బలిభిరింద్రియనామధేయైః
మోహాంధకూపకుహరే వినిపాతితస్య
        లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౧౧

బద్ధ్వా గలే యమభటా బహుతర్జయంతః
       కర్షంతి యత్ర భవపాశశతైర్యుతం మాం
ఏకాకినం పరవశం చకితం దయాలో
        లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౧౨

లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణో
       వైకుంఠ కృష్ణ మధుసూదన పుష్కరాక్ష
బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ
        లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౧౩

ఏకేన చక్రమపరేణ కరేణ శంఖ
       మన్యేన సింధుతనయామవలంబ్య తిష్ఠన్
వామే కరేణ వరదాభయపద్మచిహ్నం
        లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౧౪

సంసారసాగరనిమజ్జనముహ్యమానం
        దీనం విలోకయ విభో కరుణానిధే మాం
ప్రహ్లాదఖేదపరిహారపరావతార
        లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౧౫

ప్రహ్లాదనారదపరాశరపుండరీక
       వ్యాసాది భగవత్పుంగవ హృన్నివాస
భక్తానురక్తపరిపాలనపారిజాత
        లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౧౬

లక్ష్మీనృసింహ చరణాబ్జమధువ్రతేన
       స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణ
యే తత్పఠంతి మనుజా హరిభక్తియుక్తా
      స్తే యాంతి తత్పదసరోజమఖండరూపం  ౧౭

            శ్రీ లక్ష్మీనృసింహార్పణమస్తు
ఇతి శ్రీ శంకరభగవత్పాదకృత లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం సంపూర్ణం

తాత్పర్యము: 

పాలకడలిలో ఆదిశేషునిపై భోగముతో చక్రమును ధరించి, రత్నములతో శోభిల్లే, పుణ్యమూర్తి యైన, యోగులను శాశ్వతముగా కాపాడే, ఈ సంసార సాగరాన్ని దాటించే నావయైన, ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు, సూర్యుడు మొదలగు దేవతల కిరీటములు మోడిన పాదములు కల, మెరిసే పాదములు శోభను ఇనుమడించగా, లక్ష్మీ దేవి స్తన ద్వయము వద్ద రాజహంస యైన, ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

మురహరి! సంసారమనే అంధకారములో నేను పయనిస్తూ, కామము అనే సింహముచే దాడి చేయబడి,  స్పర్ధ అనే వేడిమిచే బాధ పెట్టబడి ఉన్నాను. కావున, ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! సంసారమనే భయంకరమైన, లోతైన బావి అడుగుకు చేరాను. వందలాది దుఖములనే సర్పములచే బాధించబడి, దుఃఖముతో, నిస్సహాయుడనై దీనుడనైతిని.  కావున,  ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! అనంతమైన వెడల్పుగల ఈ సంసారమనే సాగరంలో చిక్కుకున్నాను. ఈ సాగరంలో కాలమనే నల్లని మొసళ్ళ నోట చిక్కి వాటిచే చంప బడుతున్నాను. మోహమనే అలలలో, రుచి మొదలగు వాసనలు వశుడనై ఉన్నాను. కావున,  ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! పాపమనే బీజము మొలిచి, వృక్షమై, పూర్వ జన్మల కర్మ ఫలములనే క్రొమ్మలు కలిగి, నా శరీర భాగములు ఆకులుగా కలిగి, శుక్రుని ఫలితముగా పుష్పములు కలిగి (వీర్యము అని అర్థము), దుఖమనే ఫలములు కలిగి యుండి. కానీ, నేను దాని పై నుండి వేగముగా జారుచున్నాను. కావున,  ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.
 
ఓ ప్రభూ! సర్పముల శత్రువైన గరుత్మంతుని వాహనముగా కల,  అమృత తుల్యమైన పాల కడలిలో నివసించే ఓ దేవా! సంసారమనే విషసర్పము తన భయంకరమైన నోరు తెరచి విషపు కోరలను నాపై చూపి నన్ను నాశనము చేయుచున్నది. కావున,  ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! సంసారమనే దావాగ్ని నా శరీరమును, దానిపై ఉన్న ప్రతి రోమమును దహించుచున్నది. నీ పాద పద్మములను శరణు అంటిని.  కావున,  ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! నేను సంసారమనే వలలో చిక్కుకున్నాను. నా ఇంద్రియములు ఈ వలలో చిక్కుకున్నవి.  ఈ ఇంద్రియములనే కొక్కెము నా తలను నా నుండి నుండి వేరు చేయుచున్నది. కావున, కావున,  ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! మాయ అనే మత్త గజముచే నేను దెబ్బ తిన్నాను. నా ముఖ్య అవయవములు పూర్తిగా దెబ్బ తిన్నవి. నేను ప్రాణ భీతితో వ్యాకులుడనై యున్నాను. కావున,  ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! ఇంద్రియములనే చోరులు నా వివేకమును దొంగిలించుట వలన నేను అంధుడ నైతిని. అంధుడనైన నేను మోహమనే కూపములో పడి కొట్టుకుంటున్నాను. కావున,  ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! యముని భటులు నన్ను రాగ పాశములచే మెడను బంధించి ముక్కున లాగుతున్నారు. నేను ఏకాకిని, అలసితిని. భీతితో ఉన్నాను. దయాళో!  లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

లక్ష్మీపతీ!  కమలనాభ!సురేశ! విష్ణో!  వైకుంఠ వాసా! కృష్ణ! మధుసూదన! కలువల వంటి కనులు కలవాడా! బ్రహ్మము తెలిసిన వాడ! కేశవా!  జనార్దన! వాసుదేవ! లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఒక చేతిలో చక్రము, రెండవ చేతిలో శంఖము కలిగి, ఇంకొక చేతితో లక్ష్మీ దేవిని పట్టుకొని, మరొక చేతితో అభయము, వరములు ఇచ్చే లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! నేను సంసారమనే సాగరములో మునిగి యున్నాను. ఆర్త రక్షకా! ఈ దీనుడను కాపాడుము. ప్రహ్లాదుని దుఖములు పోగొట్టుటకు అవతారమెత్తిన లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! ప్రహ్లాదుడు, నారదుడు, పరాశరుడు, పుండరీకుడు, వ్యాసుడు మొదలగు వారి హృదయములలో మెలిగే దేవా! భక్త ప్రియా! భక్తులను కాపాడే కల్ప వృక్షమా!  లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఫల శృతి

లక్ష్మీ నృసింహుని చరణార విందముల మధువును గ్రోలిన తేనెటీగ అయిన శంకరులచే రచించ బడిన ఈ స్తోత్రము పఠించిన జనులకు శుభము కలుగును. ఈ స్తోత్రము నుతించిన హరి భక్తులకు ఆ పరబ్రహ్మ పాదపద్మముల కైంకర్యము కలుగును.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి