ఈ సినిమా తెలుగు చిత్రాల గమనాన్ని మార్చింది. జంధ్యాల గారిని హాస్య వినోద కుటుంబ కథల దర్శకేంద్రునిగా నిలిపింది. జానకమ్మ శృంగార గీతాలకు మహారాణిగా శాశ్వతకీర్తిని తెచ్చిపెట్టింది. ఇదిగో ఆ ప్రేమలేఖ, వీడియో.
https://www.youtube.com/watch?v=I7-aGw7rBmo
1. పుట్టుకతో వచ్చింది పాట అనేది. మాడ్యులేషన్‌తో సహా అన్ని మెలకువలు మూడేళ్ళ చిన్నవయసులోనే జానకమ్మకు అబ్బాయి.
2. పదేళ్ల వయసులో తల్లి ప్రోద్బలంతో అక్కలతో పాటు రాజమండ్రిలో అయిష్టంగానే పైడిస్వామి గారి వద్ద ఒక ఏడాది పాటు సంగీతం నేర్చుకున్నారు. నీకు నేను కొత్తగా సరిగమలు నేర్పక్కర్లేదు అని నగుమోము గనలేని కీర్తనను ఆయన నేర్పించారు.
3. చిన్నతనంలో సినిమా పాటలు పాడాలన్న అభిలాష తప్ప శాస్త్రీయ సంగీతం మీద ఏ మాత్రం ఇష్టం ఉండేది కాదు.
4. తెలుగులో నీ లీల పాడెద దేవా అనే పాట మురిపించే మువ్వలు చిత్రంలోది. ఇది డబ్ చేయబడిన చిత్రం. తమిళంలో నాదస్వరానికి జోడీగా పాడటానికి ఎందరో గాయనీమణులను వెదికినా సుబ్బయ్యనాడు గారికి తృప్తి కలగలేదు. చివరకు లీల గారు స్వరాల స్థాయికి పాడగలిగేది ఒక్క జానకి మాత్రమే అని ఆవిడ పేరు సూచించారు.
5. తెలుగులో సిరిమల్లె పూవా అనే పాట పదహారేళ్ల వయసు చిత్రంలోనిది. ఈ ట్యూన్ తమిళంలో పదినారు వయదినిలె అనే చిత్రంలో సెందూర పూవే అనే పాట. ఈ పాటకు జానకమ్మ గారికి జాతీయ స్థాయిలో ఉత్తమ గాయని అవార్డు వచ్చింది.
6. తెలుగులో జయప్రద తొలిచిత్రం అంతులేని కథ. అందులో కళ్లలో ఉన్నదేదో కన్నులకే తెలుసు అన్న పాట తమిళ మూలం అవళ్ ఒరు తోడర్ కథై అన్న తమిళ చిత్రంలో కన్నిలే ఎన్న ఉందు అన్న పాట. రెండు చిత్రాలకు సంగీతం ఎం ఎస్ విశ్వనాథన్ గారే. రెండూ కూడా అద్భుతమైన విజయాలు సాధించాయి.
7. 24 ఏళ్ల వయసు నుండే దుమ్ము ఎలర్జీ వల్ల విపరీతమైన ఆయాసం ఉన్నా శివదీక్షాపరురాలనురా వంటి ఎన్నో గీతాలను జానకమ్మ పాడారు. అలాగే, శంకరాభరణంలో సామజవరగమన పాడే సమయంలో ఒక మందు వల్ల ఎలర్జీ వచ్చినా గుండె బిగబట్టి బాలు గారితో రిహర్సల్ చేసి పాడారు.
8. వాయిస్ మాడ్యులేషన్ ఆవిడ ప్రత్యేకత. చాలా సార్లు పురుష కళాకారులకు వాయిసోవర్ ఇచ్చారు.
9. జానకి గారి గొంతులో సన్నాయి మోగుతుంది, సామవేదం పలుకుతుంది, పండు ముసలి వణుకుతుంది, పసిపాప పలవరిస్తుంది అన్నారు కళాతపస్వి విశ్వనాథ్ గారు. గోవులు తెల్లన, చిన్నారి పొన్నారి కిట్టయ్యా...ఈ ప్రతిభకు ఉదాహరణలు.
10. అభిలాష చిత్రంలో సందెపొద్దుల కాడ, బంతీ చామంతీ సూపర్ డూపర్ హిట్ పాటలు. ఇళయరాజా గారి సంగీతం పతాక స్థాయికి వెళ్లటానికి ఉన్న కారణాల్లో జానకి గారి వాయిస్ మాడ్యులేషన్, సృజనాత్మకత ముఖ్యమైనవి. అలాగే, రాక్షసుడు చిత్రంలో నీ మీద నాకు ఇదయ్యో అనే పాటలో జానకమ్మ గారి మాడ్యులేషన్ న భూతో న భవిష్యతి.
11. జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రంలో ప్రతి ఒక్క పాట కూడా జానకమ్మ పతాక స్థాయి ప్రతిభకు ఉదాహరణలే. అందాలలో అహో మహోదయం, ప్రియతమా నను పలకరించు ప్రణయమా, యమహో నీ యమా యమా అందం..ఇళయరాజా గారి సంగీతాన్ని అజరామరం చేశారు జానకమ్మ, బాలు గారు.
12. ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన తొలి చిత్రం అన్నక్కిళి (తమిళం). అందులో అన్నక్కిళి ఉణ్ణై అనే పాట పెద్ద హిట్ అయ్యింది, అదే ట్యూన్‌లో తెలుగులో రామచిలుక చిత్రంలో సత్యం గారు రామచిలుక పెళ్ళికొడుకెవరే అనే పాటను జానకి గారి చేత పాడించారు. తెలుగులో కూడా అంతే హిట్ అయ్యింది పాట.
13. కొంజుం సాలంగై చిత్రంలోని సింగార వేలనే దేవా అనే పాట విని జానకి గారి గాత్రం నచ్చి మేటి దర్శకులు బీ ఎన్ రెడ్డి గారు పూజాఫలం చిత్రంలో పట్టుబట్టి మూడు పాటలు పాడించుకున్నారు - పగలే వెన్నెల, శివదీక్షాపరురాలనురా, మదనా మనసాయెరా అనే పాటలు.
14. ఆమె గొంతు స్వరకర్తలకు కల్పవృక్షం లాంటిది, ఆవిడ ఉచ్చారణ కానీ, భావం కానీ కవి ఎలా రాశాడో అలాగ యథాతథంగా పాడగల ప్రతిభ అని నమ్మి కళాతపస్వి విశ్వనాథ్ గారు తన చిత్రాలలో జానకమ్మ గారి చేత ఎన్నో పాటలు పాడించారు - ఓంకార నాదాను సంధానమౌ గానమే, సారిగరీగపదాపా, సామజవరగమన, సప్తపది చిత్రంలో నెమలికి నేర్పిన నడకలివి, భామనే సత్యభామనే, గోవులు తెల్లన, సాగరసంగమంలో ఓం నమశ్శివాయ, మౌనమేలనోయి వంటి ఎన్నో పాటలను పాడించుకున్నారు.
14. ఒకమ్మాయి ఒకబ్బాయిని వలలో వేసుకోవాలంటే మరి పాట సాహిత్యం అలా ఉన్నప్పుడు సాహిత్యానికి తగిన ధ్వనులు చేయాలి అన్నది ఆవిడ నమ్మకం. అందుకే ఆవిడ అప్పట్లో బూతు పాటలు అనుకున్న కొన్ని శృంగారగీతాలను పాడారు, అవి హిట్ అయ్యాయి. వృత్తి రీత్యా వీరు ఆనాటి ఆంధ్రప్రదేశ్‌లో అనేక ప్రాంతాలలో పని చేశారు, కొన్నాళ్లు రాజమండ్రిలో కొన్నాళ్లు సిరిసిల్లలో ఉన్నారు.
15. జానకి గారి తండ్రి శిష్ట్లా శ్రీరామమూర్తి గారు. ఆయన ఆయుర్వేదం డాక్టర్. వీరు ప్రస్తుతం బాపట్ల జిల్లా రేపల్లె దగ్గరలోని పల్లపట్ల గ్రామంలో జానకి గారు 1938వ సంవత్సరం ఏప్రిల్ 23న జన్మించారు.
16. హైదరాబాదులో ఉన్నప్పుడు మోనో యాక్టర్‌గా జానకమ్మ మామయ్య గారు అనేక పాత్రలను ధరించే వారు, మధ్యలో లతా మంగేష్కర్ పాటలు జానకమ్మ చేత పాడించుకునే వారు. ఆయన పాత్రలను మార్చుకునే సమయంలో ఆయన జేబులో నుండి రాంప్రసాద్ గారి ఫోటో కిందపడగా, దాన్ని దాచుకుని ఆయనపై ప్రేమలో పడ్డారు. వీళ్ల ప్రేమాయణం కొన్నళ్లు సాగింది. 1959లో వీరి వివాహం జరిగింది. రాంప్రసాద్ గారి ప్రోద్బలంతోనే ఆయన తండ్రి జానకి గారిని ఏవీఎం స్టూడియో అధినేతకు సిఫారసు చేశారు. ఆ తరువాతే ఆవిడకు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అలాగ, జానకి గారిది ప్రేమ వివాహం. తాను మరణించేంత వరకు జానకి గారి పరిపూర్ణమైన సహకారం, ప్రోత్సాహం అందించారు రాం ప్రసాద్ గారు. వీరికి ఒక అబ్బాయి మురళీకృష్ణ. కోడలు ఉమ కూచిపూడి మరియు భరత నాట్య కళాకారిణి. చెన్నైలో నాట్యశిక్షణా సంస్థను నడుపుతున్నారు. వీరి కుమార్తే వైద్యుల అప్సర బెంగళూరులో యోగా టీచర్. మురళీకృష్ణ గారు 2026లో మరణించారు.
17. ప్రముఖ సంగీత విద్వాంసులు, అన్నమాచార్యుల వారి కీర్తనలను ప్రచారం చేసిన వారిలో ప్రముఖులైన గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ గారు జానకమ్మ గారి అక్కయ్య కొడుకు. అలాగే అలనాటి గాయకులు మాధవపెద్ది సత్యం గారి తల్లి శిష్ట్లా వారి ఆడపడుచు. ఆ విధంగా వీరిద్దరికి బంధుత్వం ఉంది.
18. 1997లో రాంప్రసాద్ గారి మరణం జానకి గారికి తీరని లోటుగా నిలిచింది. అయినా పాడటం మనలేదు,తరువాతి తరం కళాకారులను తల్లిలా ప్రోత్సహించారు.
19. భారతదేశంలోని 17 భాషలలో (హిందీతో సహా) జానకమ్మ గారు 48 వేలకు పైగా పాటలు పాడారు. హిందీలో యార్ బినా చైన్ కహారే (సాహెబ్), హోజా రంగీలా రే (రంగీలా) వంటి ఎన్నో హిందీ పాటలు ప్రజాదరణ పొందాయి. చెన్నై-ముంబై మధ్య తిరుగుతూ పాడిన రోజులు ఉన్నాయి.
20. జానకమ్మకు ఉత్తమ గాయనిగా 4 మార్లు జాతీయ అవార్డులు, 10 మార్లు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారి నంది అవార్డు, 6 మార్లు తమిళనాడు రాష్ట్ర అవార్డు, 11 మార్లు కేరళ రాష్ట్ర అవార్డు, ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం, 30కు పైగా ఇతర ప్రతిష్ఠాత్మక అవార్డులు పొందారు.
ఈ గీతం ఎస్. జానకి గారి ప్రారంభ దశలోనే ఆమెను అగ్రశ్రేణి మెలోడీ గాయనిగా నిలబెట్టిన అపూర్వ రత్నం. సాలూరి రాజేశ్వరరావు అద్భుత స్వరరచనకు జానకిగారి నిర్మలమైన, మృదుమధురమైన గాత్రం ప్రాణం పోసింది. ప్రతి స్వరం వెన్నెల కిరణంలా హృదయాన్ని స్పృశిస్తూ, భావం మరియు రాగ మాధుర్యాన్ని సమపాళ్లలో ఆస్వాదింపజేస్తుంది. ఎక్కడా ఆర్భాటం లేకుండా, అత్యంత సహజమైన భావవ్యక్తీకరణతో శ్రోతను ఒక ప్రశాంతమైన సంగీత ప్రపంచంలోకి తీసుకెళ్లడం ఈ గీతం ప్రత్యేకత. గాత్ర నియంత్రణ, స్వచ్ఛమైన ఉచ్చారణ, సూక్ష్మమైన గమకాల వినియోగం ఈ పాటను తెలుగు సినీ సంగీతంలోని శాశ్వత మెలోడీలలో ఒకటిగా నిలబెట్టాయి.
భారతదేశంలో ఉన్న శాస్త్రీయ సంగీతంలో ప్రధానంగా రెండు రకాలు, హిందూస్తానీ శాస్త్రీయ, కర్నాటక శాస్త్రీయ సంగీతం. రెండిటిలోనూ కర్నాటక సంగీతానికి ఒక ప్రత్యేకత ఉంది. శాస్త్రం (ఆంగ్లంలో సైన్స్), భావం కలిపి మేళవించే సంగీత సమ్మేళనం మరింత ఉన్నతంగా ఉంటుంది.
దీనికి ప్రధాన కారణం సంగీతత్రయమైన త్యాగరాజస్వామి, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రుల వారి సాహిత్యంలోని ఔన్నత్యం. ఇవి వ్యక్తిపూజను పూర్తిగా వర్జించి మన ధర్మంలోని దేవతామూర్తుల వైభవాన్ని కళ్లకు కట్టినట్లు ఛందోబద్ధంగా వర్ణించి, సముచితమైన రాగంలో స్వరపరచబడటం వల్ల శాస్త్రం, ధర్మం ఏకమై దివ్యమైన సంగీతంగా కర్నాటక శాస్త్రీయ సంగీతం పరిణమించింది, కాలపరీక్షను తట్టుకుని దృఢంగా నిలిచింది. సంగీతత్రయానికి పూర్వం వారి స్థాయిలో సాహిత్యానికి విలువనిచ్చిన అన్నమాచార్యుల వారు, పురందరదాసుల వారు ఈ త్రయం కన్నా దాదాపు 250 ఏళ్లు ముందు జీవించిన వారు. అనగా ఒక 10 తరాల పాటు సమాజంలో అనేక రకాల మార్పులు వచ్చాయి. వాటిలో ముస్లిం పాలకులు, తెల్లవారి పాలన ప్రధానమైనవి. కాబట్టే శాస్త్రీయ సంగీతం ధర్మంతో నిరంతరం మేళవించబడి పరిఢవిల్లటానికి అప్పటి పరిస్థితులు అనుకూలంగా లేవు. రామదాసు గారు చాలా సంకీర్తనలు రాసినా, ఆయన శాస్త్రీయత కన్నా భజన సాంప్రదాయానికి ప్రాధాన్యతనిచ్చారు అని చెప్పుకోవచ్చు.
అందుకే, కర్నాటక శాస్త్రీయ సంగీతానికి ప్రధానమైన వృద్ధియుగం సంగీతత్రయం ఉన్న కాలమే అని చెప్పుకోవచ్చు. వీరు వచ్చాకే భావానికి పెద్దపీట వేసి శాస్త్రీయత మేళవించి అద్భుతమైన సాహిత్య సంగీత సుగంధాలు అలదబడ్డాయి. త్యాగరాజస్వామి నిధి చాలా సుఖమా, జగదానందకారకా, దీక్షితులవారి రంగపుర విహార, వాతాపి గణపతిం భజే, శ్యామశాస్త్రుల వారి హిమాచలతనయ వంటి వేల కృతులు శాస్త్రీయ సంగీతాన్ని ఉపాసనాపూర్వకంగా పొందిన ఆధ్యాత్మికశక్తితో వెలువడిన సాహిత్యంతో జతపరచినవి. క్షేత్రాలు, దేవతామూర్తులు, నిత్యోపాసన వీరు మనకు అందించిన అద్భుతమైన వారసత్వంలో మూలస్తంభాలు. వర్ణన అన్నది అనుభూతి చెందితేనే సఫలమవుతుంది. ఆ అనుభూతి ఉపాసనతోనే సాధ్యం. త్యాగరాజస్వామి రాముణ్ణి నిరంతరం ఉపాసన చేస్తే దీక్షితుల వారు శ్రీవిద్యోపాసనలో తపోసంపన్నులై నిలిచారు, శ్యామశాస్త్రుల వారు బంగారు కామాక్షి అమ్మను ఒక బిడ్డలా నిత్యం కొలిచారు. కాబట్టే వారి సాహిత్యం మిగిలిన వారి కన్నా మిన్నగా నిలిచిపోయాయి.
అంతే కాదు, సమకాలీన రాచరికాలు, సంస్థానాలు సంగీతత్రయ సాహిత్యానికి తగిన ప్రోత్సాహాన్నిచ్చాయి. త్యాగరాజస్వామి రాచరికాన్ని పూర్తిగా వర్జించినా వారి సాహిత్యాన్ని అప్పటి, తరువాతి రాచరికాలు ముందుకు తీసుకు వెళ్లాయి. అందుకే ఆయన శిష్య పరంపర సాహిత్యాన్ని కాపాడగలిగింది.
ముగ్గురిలో దీక్షితుల వారు దేశాటన ఎక్కువగా చేసి మరింత విస్తారమైన సాహిత్యాన్ని రచించారని చెప్పుకోవచ్చు. త్యాగరాజస్వామి కూడా తాను నివసించిన తిరువయ్యారుకు 500 కిలోమీటర్ల పరిధిలో పర్యటించారు. శ్యామశాస్త్రి గారు బంగారు కామాక్షి దేవాలయంలోని విధుల వలన వీరిద్దరి కన్నా కాస్త తక్కువగా పర్యటించారు. అయితే, ముగ్గురూ కూడా ఉపాసనలో సిద్ధి పొందే రససిద్ధిని కూడా సాధించారు.
నిజం చెప్పాలంటే, వారి జీవితాలలో ఆధ్యాత్మిక సాధనల వల్లనే వారి సాహిత్యాలు శాశ్వత స్థానాన్ని పొందాయి. శాస్త్రీయ సంగీతం అటువంటి ఉన్నతమైన సాహిత్యానికి చక్కని అలంకరణగా, ఒక సముచితమైన వేదికగా, ఆ దైవిక శక్తితో వేగంగా అనుసంధానం చేసే స్వరారోహణంగా నిలుస్తుంది. అందుకే సాహిత్యాన్ని రమించి సంగీతంలో మేళవించే కళాకారులు చరిత్రలో నిలిచిపోతారు. కేవలం శాస్త్రీయతకే ప్రాధాన్యతనిచ్చి భావం యొక్క విరాట్స్వరూపాన్ని అవగతం చేసుకోలేని వారు కనుమరుగవుతారు. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి ఈ రహస్యాన్ని చక్కగా ఆకళింపు చేసుకుని నిరంతరం పాటించారు కాబట్టే భారతరత్న అయ్యారు. అలాగే మరెందరో గొప్పకళాకారులు. ఈ మేళవింపును గ్రహించని ఎందరో విద్వాంసులు సంగీతసాధన ద్వారా పరమపదసోపానాన్ని అధిరోహించలేకపోయారు.
కర్నాటక శాస్త్రీయ సంగీత రాగాలలోని స్వరాలతో చేసే గమకాలు అందాన్ని, సొగసును ఇస్తే, భావం వాటి మీద లయవిన్యాసం చేసి సార్థకతను పొందింది. భావరాగతాళ సమన్వితమైనది కాబట్టే సంగీతత్రయ సంపద దివ్యత్వాన్ని పొందగలిగింది.
లక్ష్మీ రావే మా ఇంటికి పరలక్ష్మీ రావే మా ఇంటికి
|క్షీరాబ్ధి పుత్రి పరలక్ష్మీ రావే మా ఇంటికి ॥॥
https://youtu.be/HVju0y2UIFw?t=1833
పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ - అసలు పేరు భరతం సుబ్రహ్మణ్య అయ్యర్. వీరు త్యాగరాజస్వామి వారి శిష్యులైన మానాంబుచావడి వేంకటసుబ్బయ్యర్ గారి శిష్యులు.
తిరువయ్యారులో 1845వ సంవత్సరంలో జన్మించిన వీరి తండ్రి భరతం వైద్యనాథ అయ్యర్. తాత పంచనదశాస్త్రి గారు తంజావూరు శరభోజి మహారాజు వారి ఆస్థానంలో విద్వాంసులు. సుబ్రహ్మణ్య అయ్యర్ గారు మేనమామ మేలత్తూరు గణపతిశాస్త్రి గారి వద్ద సంగీతం నేచుకుని తరువాత మానాంబుచావడి వారి వద్ద శిష్యరికం చేశారు. త్యాగరాజస్వామి వారి కృతులను నేర్చుకోవటం కోసం తెలుగు భాషను క్షుణ్ణంగా అధ్యయనం చేసి నూరుకు పైగా సంస్కృత, తెలుగు కృతులను, వర్ణాలను, జావళీలను, తిల్లానాలను రచించారు. ఆయన ముద్ర వేంకటేశ. బేగడ రాగాన్ని విస్తరించి పాడటంలో ఆయన నైపుణ్యం అమోఘం. అందుకే ఆయనకు బేగడ సుబ్రహ్మణ్య అయ్యర్ అని పేరు కూడా వచ్చింది. ఒకసారి మైసూరు మహారాజ వారి ఆస్థానంలో ఈ రాగాన్ని ఆయన మూడు రోజుల పాటు ఆలపించారు. మొదటి రాగాలాపన, రెండవరోజు తానం, మూడవరోజు రామనమమే జీవనము ఓ మనసా అన్న కృతి పల్లవి, స్వరకల్పనలు. ఈ అద్భుతమైన కళానైపుణ్యానికి మహారాజవారు ఆయనకు స్వర్ణకంకణాలను బహుకరించారు. అలాగే ఆయనకు విజయనగరం, ట్రావెంకోర్ ఆస్థానలలో మన్ననలను పొందారు. ఆయన లయజ్ఞానం అసమానమైనది. కదనకుతూహలం రాగంలో ఆయన రచించిన రఘువంశసుధాంబుధిచంద్ర అన్న కృతి జగద్విఖ్యాతమయ్యింది.
ఆయన గొప్ప గురువు కూడా. మైసూరు వాసుదేవాచార్యుల వారు, టైగర్ వరదాచార్యుల వారు మొదలైన ప్రఖ్యాత విద్వాంసులెందరో ఆయన శిష్యులు. మైసూరు వాసుదేవాచార్య తన స్మృతుల్లో గురువు పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ గురించి ఎంతో గౌరవంగా రాశారు. గురుకులంలో చేరిన వెంటనే కొత్త కృతులు నేర్పకుండా, మూడు నెలల పాటు కేవలం బేగడ రాగంలోని ఒకే వర్ణాన్ని పాడిస్తూ సాధన చేయించారని ఆయన పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా ఒక రాగంలోని ప్రతి సూక్ష్మభావాన్ని పూర్తిగా గ్రహించిన తరువాతే తదుపరి పాఠానికి వెళ్లాలనే ఆయన బోధనా తత్వం తెలుస్తుంది. వాసుదేవాచార్య తరువాత కాలంలో భారతదేశంలోని మహానుభావ సంగీతకారులలో ఒకరిగా ఎదగడంలో ఈ శిక్షణ కీలక పాత్ర పోషించింది.సేలం మీనాక్షి గారి కుమార్తెలైన పాప, రాధలకు శిక్షణ కోసం ఆయన చెన్నై(చెన్నపట్టణం) వచ్చి అక్కడే స్థిరపడ్డారు. అందుకు ఆయనకు పట్నం సుబ్రహ్మణ్య అయ్యరు అన్న పేరు స్థిరమయ్యింది. త్యాగరాజస్వామి ప్రభావంతోనే ఆయన కృతులను సద్గురువుల శైలిలో రచించి జూనియర్ త్యాగరాజ అన్న పేరు తెచ్చుకున్నారు. 1902వ సంవత్సరంలో ఆయన పరమపదించారు.
జూలై 3న ఎం. ఎస్. రామారావు గారి 105వ జయంతి. ఆయన జీవిత విశేషాలు:
మోపర్తి సీతారామారావు, తెలుగు ప్రజలకు ఎం. ఎస్. రామారావుగా చిరపరిచితులు, తెలుగు భక్తి సంగీత చరిత్రలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించిన గాయకుడు, స్వరకర్త, రచయిత. ఆయన 1921 జూలై 3న గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని మోపర్రు గ్రామంలో జన్మించారు. తండ్రి మోపర్తి రంగయ్య, తల్లి మంగమ్మ. చిన్ననాటి నుంచే సంగీతంపై సహజమైన ఆసక్తిని పెంపొందించుకున్న ఆయన విద్యాభ్యాసాన్ని గుంటూరులోని హిందూ కళాశాలలో కొనసాగించారు. విద్యార్థి దశలోనే సంగీత పోటీల్లో ప్రతిభ కనబరిచి ప్రముఖ సాహితీవేత్త అడవి బాపిరాజు వంటి మహనీయుల ప్రశంసలు అందుకున్నారు. వారి ప్రోత్సాహం ఆయనను చలనచిత్ర సంగీత ప్రపంచం వైపు నడిపించింది.
1944లో ఆయన తెలుగు చలనచిత్ర రంగంలో నేపథ్య గాయకునిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. తెలుగు సినీ సంగీత రంగంలో తొలి తరం నేపథ్య గాయకులలో ఒకరిగా గుర్తింపు పొందిన ఆయన రెండు దశాబ్దాలకు పైగా అనేక చిత్రాలకు గాత్రదానం చేశారు. ఘంటసాల, పెండ్యాల నాగేశ్వరరావు, టి. వి. రాజు, పి. ఆదినారాయణరావు వంటి ప్రముఖ సంగీత దర్శకులతో కలిసి పనిచేశారు. తెలుగు మాత్రమే కాకుండా తమిళం, కన్నడ చిత్రాలలో కూడా ఆయన గానం వినిపించింది. ఆయన స్వరంలో ఉన్న గంభీరత, మాధుర్యం, పదస్పష్టత కారణంగా భక్తిగీతాలు మాత్రమే కాకుండా జానపద, దేశభక్తి, సినీగీతాలు కూడా ప్రజాదరణ పొందాయి.
సినీగాయకుడిగా మంచి పేరు సంపాదించినప్పటికీ ఆయన జీవితంలో ఒక కీలక మలుపు 1960ల చివరలో వచ్చింది. సినీరంగంలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఆయన సినీ అవకాశాలు తగ్గాయి. అనంతరం రాజమహేంద్రవరంలోని నవభారత గురుకులంలో గ్రంథపాలకుడిగా పనిచేస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడిపారు. ఈ కాలంలో ఆయన ఆధ్యాత్మిక చింతన మరింతగా పెరిగింది. భక్తి సంగీతమే తన జీవితానికి నిజమైన మార్గమని ఆయన విశ్వసించడం ఈ దశలోనే ప్రారంభమైంది.
ఎం. ఎస్. రామారావు జీవితాన్ని పూర్తిగా మార్చివేసిన సంఘటన 1971 భారత–పాకిస్తాన్ యుద్ధం. ఆయన పెద్ద కుమారుడు బాబూరావు భారత వైమానిక దళంలో పైలట్‌గా దేశసేవలో పాల్గొన్నారు. యుద్ధ సమయంలో కుమారుడి క్షేమంపై తీవ్ర ఆందోళనకు గురైన ఆయన ఆంజనేయస్వామిని శరణు వేడుతూ భక్తిపూర్వకంగా ప్రార్థనలు చేశారు. ఆ సమయంలో తులసీదాసు రచించిన హనుమాన్ చాలీసాను సరళమైన, మధురమైన తెలుగులో భావానువదించి, స్వయంగా స్వరపరచి ఆలపించారు. అనంతరం ఆయన కుమారుడు క్షేమంగా తిరిగి రావడం ఆయన భక్తిని మరింత దృఢపరిచింది. ఈ సంఘటన ఆయనను సినీ గాయకుని నుండి భక్తి గాయకునిగా మార్చిన జీవిత మలుపుగా నిలిచింది.
తెలుగు హనుమాన్ చాలీసా అపూర్వమైన ఆదరణ పొందిన తరువాత ఆయన వాల్మీకి రామాయణంలోని సుందరకాండను గేయరూపంలో ప్రజలకు అందించారు. సంస్కృత గ్రంథంలోని భావగాంభీర్యాన్ని ఏమాత్రం తగ్గించకుండా, అదే సమయంలో సాధారణ భక్తుడు కూడా సులభంగా అర్థం చేసుకునే విధంగా మధురమైన రాగాలలో ఆలపించడం ఆయన అసాధారణ ప్రతిభకు నిదర్శనం. అనంతరం బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధాకాండ వంటి భాగాలను కూడా గేయరూపంలో అందించారు. ఆయన ఆలపించిన ఈ గేయాలు ఆకాశవాణి, దూరదర్శన్ ప్రసారాల ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి చేరాయి. గ్రామోఫోన్ రికార్డులు, ఆడియో క్యాసెట్ల రూపంలో ఆయన గానం దాదాపు ప్రతి తెలుగు ఇంటిలో నిత్య పారాయణంలో భాగమైంది.
ఎం. ఎస్. రామారావు గానంలోని అత్యంత విశిష్టత పదస్పష్టత. ప్రతి పదం, ప్రతి అక్షరం శ్రోతకు స్పష్టంగా వినిపించేలా ఆయన ఆలాపన ఉండేది. శాస్త్రీయ సంగీతంలో దృఢమైన పునాది ఉన్నప్పటికీ క్లిష్టమైన అలంకారాల కంటే భావవ్యక్తీకరణకు ఆయన అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అందువల్ల సంగీత పరిజ్ఞానం లేని వారికీ ఆయన గానం హృదయాన్ని తాకేది. ఆయన స్వరంలో భక్తి, వినయం, ఆత్మీయత సహజంగా మిళితమై ఉండేవి. ముఖ్యంగా సుందరకాండను ఆయన ఆలపించిన తీరు లక్షలాది మంది భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. తెలుగు భక్తి సంగీత చరిత్రలో సుందరకాండ గానానికి ఆయన ఒక ప్రత్యేకమైన ప్రమాణాన్ని నెలకొల్పారు.
1975లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన గానం విశేష ఆదరణ పొందింది. భక్తి సంగీత ప్రచారంలో ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా 1977లో ఆయనకు “సుందరదాసు” అనే బిరుదు లభించింది. ఆ తరువాత ఆయన పేరు చెప్పగానే తెలుగు హనుమాన్ చాలీసా, సుందరకాండ గానం గుర్తుకు వచ్చేంతగా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
1992 ఏప్రిల్ 20న హైదరాబాద్‌లో ఎం. ఎస్. రామారావు పరమపదించారు. అయితే ఆయన గానం, ఆయన భక్తి సందేశం నేటికీ సజీవంగానే ఉన్నాయి. అనేక దేవాలయాలలో, గృహాలలో, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఆయన ఆలపించిన తెలుగు హనుమాన్ చాలీసా, సుందరకాండ నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి. భక్తిని సంగీతంతో మేళవించి సామాన్య ప్రజల హృదయాలకు చేరవేసిన మహోన్నత గాయకుడిగా ఆయన తెలుగు సంస్కృతిలో చిరస్థాయిగా నిలిచారు.
ఎం. ఎస్. రామారావు గారి ఆధ్యాత్మిక వారసత్వం నేటికీ ఆయన కుటుంబ సభ్యుల ద్వారా సజీవంగా కొనసాగుతోంది. ముఖ్యంగా ఆయన మనవడు పోలాప్రగడ శ్రీనివాస్ తన తాతగారి భక్తి సంపదను పరిరక్షించడం, ప్రచారం చేయడం తన జీవిత ధ్యేయంగా స్వీకరించారు. తెలుగు హనుమాన్ చాలీసా, సుందరకాండ గాన పారాయణాన్ని భారతదేశంతో పాటు విదేశాలలోని తెలుగు భక్తులకు చేరవేస్తూ అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆయన గాత్రంలో తాతగారి గానశైలి, పదస్పష్టత, భక్తిభావం ప్రతిఫలించేలా సుందరకాండ పారాయణాలను నిర్వహిస్తూ యువతరానికి ఈ అమూల్యమైన ఆధ్యాత్మిక వారసత్వాన్ని పరిచయం చేస్తున్నారు. శ్రీ ఎం. ఎస్. రామారావు స్మారక కార్యక్రమాలు, సుందరకాండ ప్రచార యజ్ఞాలు, ఆయన ధ్వని రికార్డుల పరిరక్షణ వంటి కార్యక్రమాల ద్వారా ఈ గొప్ప సంపదను భావితరాలకు అందించేందుకు కృషి చేస్తున్నారు. ఈ విధంగా ఎం. ఎస్. రామారావు గారి స్వరం నిశ్శబ్దమైనప్పటికీ, ఆయన భక్తి సందేశం, శ్రీరామనామ ప్రచారం, ఆంజనేయ భక్తి పోలాప్రగడ శ్రీనివాస్ సేవల ద్వారా నిరంతరం ప్రజల్లో ప్రతిధ్వనిస్తూ తరతరాలకు ఆధ్యాత్మిక స్ఫూర్తిని అందిస్తున్నాయి.
తిరుమలగిరిరాయ దేవరాహుత్తరాయ సురతిబిన్నాణరాయ సుగుణకోనేటిరాయ సిరులసింగారరాయ చెలువపు తిమ్మరాయ సరసవైభవరాయ సకలవినోదరాయ వరవసంతములరాయ వనితలవిటరాయ గ...