15, ఫిబ్రవరి 2016, సోమవారం

జంధ్యాల హాస్య గుళికలు - మొదటి సంచిక


జంధ్యాల హాస్య గుళికలు - మొదటి సంచిక


జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తెలుగు సినీ చరిత్రలో హాస్యాన్ని కొత్త స్థాయికి తీసుకు వెళ్లిన మహానుభావులు. ఎటువంటి వెకిలి, ద్వంద్వార్థాలు లేకుండా తెలుగు పదాలతో అద్భుతమైన హాస్యరసాన్ని తన చిత్రాలలో పండించారు. ఆ మహానుభావుడి వల్ల ఎనభై, తొంభయ్యవ దశకాలలో తెలుగు చలన చిత్రాలలో సుత్తి వీరభద్రరావు, వేలు, బ్రహ్మానందం, శ్రీలక్ష్మి వంటి గొప్ప హాస్య కళాకారులు వెలుగొందారు. జంధ్యాల గారికి నివాళిగా ఈ హాస్య గుళికలు శీర్షికన వ్యాసాలు మీకు అందిస్తున్నాను. మొదటి సంచికలో ఆనందభైరవి చిత్రంలో ప్రాసలు మాట్లాడే వీరభద్రరావు, ఈలలు వేసే శ్రీలక్ష్మి, వీరిద్దరి బాధితునిగా సుత్తి వేలు మధ్య పొట్టలు చెక్కలయ్యే సన్నివేశం ఇది.

వీరభద్రరావు పేషెంటుతో: "మింగినట్టున్నావు కొత్త ఆవకాయతో కొండంత వాయ"

పేషెంటు: "చిత్తం. ఆహా! చేయి చూడగానే ఎలా చెప్పగలిగారో మహానుభావులు"

వీరభద్రరావు: "ఆవకాయలో వేడుంటుంది. ఆ వేడి నాలాంటి వాడి గల వైద్యుడికి నాడిలో తెలుస్తుంది రా బోడి..."

వీరభద్రరావు కొడుకుతో: "జంటగా వెళ్లి ఒంటిగా తగలడ్డావేం"..."కోడలేదిరా...కోడలేది అంటే గోడలకేసి నీడల కేసి చూస్తావేంటి రా గూడల జుట్టు వెధవ. ఏ అమ్మేశావా?"

కొడుకు వేలు: "నా ఖర్మ! సినిమాకి వెళ్లామా! అందులో ఓ మాంచి ఫైటింగ్ సీన్ వచ్చింది. హీరో రౌడీలను బాదుతున్నాడు. అది చూసి నీ కోడలు నీ కోడలు కయ్య్ అని అమెరికాకి వినిపించేంత గట్టిగా ఓ ఈల కొట్టింది. దాంతో దీని ముందు సీట్లో కూర్చున్న ఒకావిడ గుండె జబ్బు వచ్చి పడిపోయింది..."

వీరభద్రరావు దిమ్మతిరిగి పడిపోతాడు...

వేలు: "నాన్నా! నాన్నా! నీకు కూడా...నాకంత అదృష్టం కూడానా"..."ఆ ఈల విని ఆపరేటర్ అదిరిపడి సినిమా ఆపేసి లైట్లేశాడు. జనమంతా మాకేసి చూస్తుంటే సిగ్గేసి నేను పారిపోయొచ్చాను. అది మాత్రం కుర్చీ ఎక్కి నిలబడి మిగితా సినిమా కూడా చూపించమంటూ ఈలేసి గోల చేస్తోందక్కడ...."

వీరభద్రరావు: "అబ్బా! మనకా ఈలల గోల ఏల? ఈ ఈలన్నది ఇలలో కలలో మన ఇంటావంటా లేని విద్యే? "

వేలు: "అబ్బా! దాని ఈలతోనే చస్తుంటే మధ్యలో నీ కవిత్వం గోలేమిటి నాన్నా తలవాచిపోతోంది..."

వేలు శ్రీలక్ష్మితో: "ఆగు! ఏమిటే? ఊ! ఏమిటి ఇందాక నువ్వక్కడ చేసిన పని?"

శ్రీలక్ష్మి: "కోప్పడకండీ! అంత శబ్దం వస్తుందని అనుకోలేదు..."

వేలు: "నిన్ను...నిన్ను ఇక జన్మలో బయటికి తీసుకెళితే నా చెవిలో ఈలేసి చంపెయ్యవే"
శ్రీలక్ష్మి: "అంత మాటనకండీ. ఈల వెయ్యటం నాకు మాత్రం ఇష్టమేనా? ఏం చేయను ఎక్కువ సంతోషం కానీ బాధ కానీ కలిగినప్పుడు వేళ్లు వాటంతట అవే దగ్గరవుతాయి, నోటి దగ్గరికి వెళ్లిపోతాయి, లోపలనుంచి గాలి వస్తుంది, బయటకి శబ్దమొస్తుంది. ఇవన్నీ నాకు తెలియకుండానే జరిగిపోతాయండీ..."

వేలు: "నా వల్ల కాదే! ఈలేసే పెళ్లాన్ని ఏలుకోలేను. ఇవాళ్లో రేపో వకీలు గారిని కలిసి నీకు విడాకులిచ్చేస్తాను"

శ్రీలక్ష్మి: "అంటే ఏంటండీ"

వేలు: "కోర్టు వారు ఇక నీకు నాకు ఏ సంబంధం లేదని కాయితం ఇస్తారు..అది.."

దుఃఖంతో శ్రీలక్ష్మి కయ్య్ అని ఈల వస్తుంది

శ్రీలక్ష్మి: "క్షమించండి ఇది బాధ ఈల"

వీరభద్రరావు: "ఓసి నీ బాధ తగలెయ్య.  అమ్మ అమ్మ...గుండిగి కింద పడ్డ అప్పడంలా గుండె చితికిపోయింది కదమ్మా. ఒరేయ్ కుంకాక్షీ. ఇకనుంచి క్షమించమని అదీ మీ ఆవిడనడక్కు. ఆ సంబరంలో మళ్లీ ఈల కొట్టిందంటే ఈ గుండెకి ఆ ఈల జోలవుతుంది. స్వస్తి..పో అవతలకి పో"

వేలు:"నాన్న..నాన్న గుండాడుతోందా?"

వీరభద్రరావు - "ఆ ఆ"

వేలు: "అమ్మబాబోయ్...పదవే లోపలకి పద"

13, ఫిబ్రవరి 2016, శనివారం

కృష్ణభక్తి - నాలుగవ సంచిక

కృష్ణభక్తి - నాలుగవ సంచిక


కృష్ణభక్తిలో మరో ప్రత్యేకత నృత్య హేల. బృందావనంలో గోపికలతో రాసహేలలో, వసంతోత్సవంలో ఆడి పాడే కృష్ణుని వర్ణిస్తూ ఎందరో భక్తులు స్వామి వైభవాన్ని మనకు ఆవిష్కరించారు. వారిలో ప్రముఖులు నారాయణ తీర్థుల వారు. ఆంధ్రనాట తల్లావఝ్ఝుల గోవింద  శాస్త్రిగా జన్మించి తమిళనాట స్థిరపడి నారాయణ తీర్థులుగా పేరుపొందిన ఈ యోగి కృష్ణునిపై భక్తితో అనుపమానమైన, అపురూపమైన కృష్ణలీలా తరంగిణిని రచించారు. నవ రసాలను ఒలికిస్తూ సంస్కృతంలో శ్రీకృష్ణుని లీలావినోదాలను నాట్యశాస్త్రానికి అనువుగా రచించారు. కృష్ణలీలా తరంగిణిలో బాలకృష్ణుని లీలలు మొదలు రుక్మిణీకళ్యాణం చివర.

నారాయణతీర్థులవారి కృష్ణలీలా తరంగిణిలో ఒక ప్రత్యేకమైన లక్షణం బాలకృష్ణుని లీలలను వర్ణనలలో కృష్ణుని ఆకృతిని, వేషభూషలను విశేషంగా ఉట్టంకించటం. బాల గోపాల కృష్ణ పాహి పాహి అనే తరంగంలో ఆ కృష్ణుని మనోజ్ఞంగా వర్ణించారు. ఆ తరంగం విశేషాలు:


బాల గోపాల కృష్ణ పాహి పాహి 

నీల మేఘ శరీరా నిత్యానందం దేహి

కలభ సుందర గమన కస్తూరి శోభితానన 
నళిన దళాయత నయన నంద నందన 
మిళిత గోప వధూజన మీనాంక కోటి మోహన 
దళిత సంసార బంధన దారుణ వైరి నాశన 

యజ్ఞ యజ్ఞ సంరక్షణ యాదవ వంశాభరణ 
యజ్ఞ ఫల వితరణ యతి జన తరణ 
అజ్ఞాన ఘన సమీరణ అఖిల లోక కారణ 
విజ్ఞాన దళితావరణ వేదంత వాక్య ప్రమాణ

వ్యత్యస్త పాదారవింద విశ్వ వందిత ముకుంద 
సత్యాఖండ బోధానంద సద్గుణ బృంద 
ప్రత్యస్తామిత భేద కంద పాలిత నంద సునంద 
నిత్యద నారాయణ తీర్థ నిర్మలానంద గోవింద



బాలుడైన కృష్ణుని పాహి పాహి అని నుతిస్తూ మొదలయ్యే ఈ గీతంలో నీలిమేఘాల రంగుతో శరీరం కలిగిన ఆ బలుని శాశ్వతానందం ప్రసాదించమని వేడుకుంటున్నారు.

ఏనుగులా అందంగా నడిచే, కస్తూరితో శోభించే ముఖము కల, కలువ రేకుల వంటి కన్నులు గలవాడు ఆ నందకుమారుడు. గోపవధువులతో కలిసి ఆడి పాడేవాడు, కోటి మన్మథులకు సమానమైన మోహనాకారుడు అయిన ఆ కృష్ణుడు అతిభయంకరమైన శత్రువులను జయించిన వాడు, భక్తులను సంసార బంధములనుండి విడిపించే వాడు.

లోకకళ్యాణార్థమై ఋషులు చేసే యజ్ఞాలను కాపాడే వాడు, యాదవ వంశమునకు ఆభరణమైన వాడు ఆ కన్నయ్య. యజ్ఞఫలమును స్వీకరించే వాడు, యతులను తరింపజేసేవాడు వీడే. అజ్ఞాన మేఘములను తొలగించేవాడు, సమస్త లోకములకు కారణమైన వాడు ఈ బాలుడు. విజ్ఞానమును చాటే వాడు, వేదవేదాంతములకు ప్రమాణమైన వాడు ఈ బాలకృష్ణుడు.
 
వ్యత్యస్తమైన అడుగులతో (ఒక కాలు మరో కాలును దాటుతూ వేసే అడుగులు) అందమైన పాదములు కలవాడు, అఖండమైన సత్యమును బోధిస్తూ ఆనందించేవాడు, సద్గుణముల రాశి అయినవాడు ఆ బాలకృష్ణుడు. ఎవరిలో అయితే జీవరాశులలో ఉన్న భేదములన్నీ లీనమై మటుమాయమైపోతాయో,ఆతడే ఈ నంద సునందాదులను పాలించే బాలకృష్ణుడు. ఆ గోవిందుడు నారాయణ తీర్థులకు నిత్యము నిర్మలమైన ఆనందాన్ని ప్రసాదించే వాడు.

నారాయణ తీర్థుల వారి భక్తి మార్గము ఈ తరంగంలో ప్రస్ఫుటంగా కనబడుతుంది. లీలావేష్టితమైన శ్రీకృష్ణుని బాల్యము చిలిపి చేష్టలా అనిపించినా, అందులో ఆ బాలుడు వేసిన ప్రతి అడుగూ మానవజాతి ఉద్ధరణకే. మమకారం విహీనమై, పరిపూర్ణమైన ప్రేమ తత్త్వముతో మానవాళికి భేదభావములను మరపింపజేసి, మోహపాశములనుండి విడిపించి శాశ్వతానందాన్ని ప్రసాదించినవాదు కృష్ణుడు. ఈ మార్గంలో మానవునకు శత్రువులైన అరిషడ్వర్గముల నాశనం చేసి వారిని ఉద్ధరించినవాడు. కంసాది దానవుల సంహారం దీనికి సూచిక. ధర్మ సంస్థాపనకు ఈ లీలలు ముందడుగులు. యజ్ఞములు అనగా మనము కామ్యముతో చేసే నిత్యకర్మల యొక్క ఫలాన్ని స్వీకరించి మనలను సోపానములో ముందుకు నడిపించే వాడు ఈ సారథి. సమస్త వేదముల సారము, మూలము ఈ పరమాత్మ పరిపూర్ణ స్వారూపము. అజ్ఞానమును తొలగిస్తూ జ్ఞానాన్ని పంచే జగద్గురువు ఈ కృష్ణుడు. ఈ సందేశాన్ని పరిపూర్ణంగా ఈ తరంగంలో నారాయణ తీర్థుల వారు మనకు అందించారు.

కూచిపూడి నాట్యపద్ధతిలో నారాయణ తీర్థుల ఈ తరంగానికి చాలా ముఖ్యమైన స్థానముంది. ఈ తరంగ నాట్యము లేకుండా ఏ రంగప్రవేశమూ ఉండదు, ఎంత గొప్ప కళాకారులైనా ఈ తరంగాన్ని తమ నాట్యప్రదర్శనలలో ప్రదర్శించకుండా ఉండరు. మోహనరాగంలో కూర్చబడిన ఈ తరంగంలో కళాకారులు భక్తి జ్ఞాన కర్మ యోగములకు ప్రతీకగా పళ్లెము, చెంబుతో నర్తించటం ఆనవాయితీ. సంతులన, లయజ్ఞానం, పారవశ్యం అన్నీ మేళవించి కృష్ణ భక్తిని ఆవిష్కరించే అద్భుతమైన పుష్పం ఈ నారాయణ తీర్థుల వారి తరంగం.

10, ఫిబ్రవరి 2016, బుధవారం

కృష్ణ భక్తి - మూడవ సంచిక

కృష్ణ భక్తి - మూడవ సంచిక



కృష్ణ భక్తిలో ఉన్న ప్రత్యేకత బాలునిగా లాలించి, చేష్టలను దర్శించి, అంతలోనే పరమాత్మగా అనుభూతి చెందటం. దీనినే మధుర భక్తిగా ప్రస్తుతించారు భాగవతులు. రాధ, గోపికలు మొదలు ఎందరో కృష్ణ భక్తులు తమ మధురభక్తితో తరించారు. వారికి స్వామి తప్ప ఇంక వేరే ఏమీ ఉండదు. మనలో కలిగే అన్ని భావనలూ స్వామితోనే పంచుకోవటం మధుర భక్తిలో ఒక లక్షణం. దీనివలన ఎన్ని కష్టాలైనా అవలీలగా దాటారు ఆ భక్తులు. అలాంటి వారిలో అన్నమాచార్యుల వారు అగ్రగణ్యులు. ఆ శ్రీకృష్ణుని బాలుడైన పరమాత్మునిగా భావించారు, అంతలోనే యశోదమ్మగా లాలించారు, గోపెమ్మగా ప్రేమించారు, భక్తునిగా సేవించారు, మణిమాణిక్యములతో పోల్చారు. ఆ మధురభక్తిలో ఎన్నలేని భావనలు, చివరకు శరణాగతితో స్వామికి సమర్పణము.

"భావయామి గోపాల బాలం" అనే సంకీర్తనలో ఎంత మనోజ్ఞంగా వర్ణించారో? ఆ బాల కృష్ణుడు నడుముకు కట్టుకున్న మేఖలము, అలంకరించ బడిన మణి ఘంటిక, మృదువైన శబ్దాలు చేస్తూ విలసిస్తున్నాయిట. కొంటె పదములు వేస్తూ, పెన వేసుకుంటూ, దూరమవుతూ, అద్భుతమైన నటన చేస్తూ ఉన్నాడుట. చిన్ని కృష్ణుని లీలలను ఎదురుగా దర్శించకుండా ఇలా రాయటం అసంభవం.

ఇంతలో ఆ బాలుని నవరత్నాలలో అద్భుతంగా పోల్చారు అన్నమాచార్యుల వారు. యశోద ముంగిట ముద్దులొలికే ముత్యంగా పోల్చారు..అంతటితో ఆగారా? తిద్దరాని మహిమల దేవకీ సుతుడు అన్నారు. ఆయన మహిమలను వర్ణించలేము అని బాలుడైన పరమాత్మ వైభవాన్ని చాటారు. గోపకుల స్త్రీ చేతుల మాణిక్యము, కంసుని పాలి వజ్రము, మూడులోకాలలో కాంతులను విరజిమ్మే పచ్చ, రతికేళిలో రుక్మిణికి పగడము, గోవర్ధన పర్వతానికి గోమేధికము, శంఖ చక్రాల సందులలో వైఢూర్యము, కాళీయుని పడగలపై పుష్యరాగము, శ్రీవేంకటాద్రిలో ఇంద్రనీలము, పాలసముద్రంలో దివ్యరత్నము...ఇవన్నీ ఆ శ్రీకృష్ణుడే. మరి ఆయన మన చెంతనే ఉన్న చిన్ని కృష్ణుడట, మనకు గతిగా నిలిచి కాపాడే కమలాక్షుడట, బాలుని రూపములో తిరిగే పద్మనాభుడట...ఇదీ ముద్దుగారే యశోద అనే సంకీర్తనలో అన్నమాచార్యుల వారు అనుభూతి చెంది కురిపించిన భావామృతవర్షిణి.

మరి ఆ చిన్ని కృష్ణునికి లాలి పాడాలి కదా? ఆయనే యశోదగా, గోపెమ్మలుగా భావించి అద్భుతంగా "లాలనుచునూచేరు లలనలిరుగడలా బాలగండవర గోపాల నిను చాలా" అని లాలించారు. "లలనాజనాపాంగ లలిత సుమచాప జలజలోచన దేవ సద్గుణ కలాప తలపులోపల మెలగు తత్త్వ ప్రదీపా..." అని బాలునికి లాలిపాడారు. అందులో ఒక బాలునిగా భావించారా? ఆ కలువకన్నులు కల వాడు సద్గుణాల రాశిగా, మన తలపులలో మెలిగే తత్త్వ ప్రదీపకునిగా దర్శించి నుతించారు. భక్తిలో జీవాత్మ-పర్మాత్మ తత్త్వములను ఎరిగి దాని నుండి అద్వైత భావనకు చేరుకునేలా మనకు ఇటువంటి సంకీర్తనలను అందించారు.

అందుకే కృష్ణ భక్తి సామ్రాజ్యంలో బాలుడి నుండి జగద్గురువు దాకా శతకోటి రూపానుభూతులకు ప్రత్యేక స్థానాలున్నాయి, అవి అన్నీ కలిపితే మధురమైన భక్తి రస సామ్రాజ్యంగా ప్రకాశిస్తుంది.

గోవింద కృష్ణజై గోపాల కృష్ణ జై!

8, ఫిబ్రవరి 2016, సోమవారం

కృష్ణ భక్తి - రెండవ సంచిక



లీలల ద్వారా మాయాప్రేరితమైన లక్షణాలను తొలగించినవాడు కృష్ణుడు. మన్ను తింటున్నాడని చూచి బాలుడైన తమ్మునిపై ప్రేమతో అన్న బలరాముడు తల్లికి ఫిర్యాదు చేస్తే, ఆ తల్లి కలవరపడి ఏదీ నోరు తెరువు అని అడగగా మొత్తం విశ్వాన్ని నోట చూపించాడు. అంతటితో యశోదకు తాను ఆ బాలుని తల్లి అన్న మాయ నశించి అతనిలో పరమాత్మను దర్శిస్తుంది. ఆ ఘట్టాన్ని సముద్రాల రాఘావాచార్యుల వారు పాండురంగ మహాత్యం చిత్రంలో జయ కృష్ణా ముకుందా మురారీ అనే గీతంలో ఇలా అందంగా వర్ణించారు.

అమ్మా! తమ్ముడు మన్ను తినేనూ.. చూడమ్మా! అని రామన్న తెలుపగా
అన్నా! అని చెవి నులిమి యశోద ఏదన్నా! నీ నోరు చూపుమనగా
చూపితివట నీ నోటను, బాపురే! పదునాల్గు భువన భాండమ్ముల
ఆ రూపము గనిన యశోదకు తాపము నశియించి జన్మ ధన్యత గాన్చెన్

అలాగే,  కాళింది మడుగును అహంకారంతో విషపూరితం చేస్తున్న కాళీయునికి గుణపాఠం చెప్పటానికి ఆ మడుగులో దూకుతాడు. అమ్మో పిల్లవాడు నీట దూకాడు, ఆ సర్పము ఏమి చేస్తుందో అని నందయశోదలు, గోకులమంతా భయపడుతుంది. వారి భయమే కానీ, పరమాత్మ లీలకు ఆటంకమా? ఆ మహాసర్పము మదాన్ని అణచటానికి ఆతని తోక ఒక చేత పట్టుకొని, పడగలపై నాట్యం చేశాడు. విజయుడై అలాగే నీటినుండి బయటకు వచ్చాడు. ఆతని చూసి ఆ నందయశోదలకు కనువిప్పు కలిగింది. తమ బిడ్డ సామాన్యుడు కాదని అర్థమైంది. ఆ ఘట్టాన్ని సముద్రాల వారు ఇలా వర్ణించారు:

కాళీయ ఫణి ఫణ జాలాన ఝణ ఝణ కేళీ ఘటించిన గోపకిశోరా
కంసాది దానవ గర్వాపహార హింసా విదూర పాప విదార

దీనిని మరింత సులువుగా వేటూరి సుందరరామమూర్తిగారు సప్తపది చిత్రంలో ఇలా వివరించారు:

కాళింది మడుగున కాళీయుని పడగల
ఆబాలగోపాలమా బాల గోపాలుని
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నుల జూడ
తాండవమాడిన సరళి గుండెల నూదిన మురళి ఇదేనా ఆ మురళి

ఇలా ఒకటా రెండా? అవతారం మొత్తం అనుక్షణం ఆ కృష్ణుని లీలలే. ప్రతి ఒక్క లీలకూ ఒక పరమార్థముంది. దానిని అనుభూతి చెందిన నందవ్రజమంతా ఆయన భక్తులైనారు. ఒక్కసారి ఆ స్వామి భక్తి సామ్రాజ్యంలో ఆయనకు దాసులైతే ఇక వేరే ప్రపంచం అక్కరలేదు. అన్నీ ఆయనే, అన్నిటా ఆయనే. రాసలీలలో తన్మయులైన రాధాది గోపికలు ఆయన భక్తులలో అగ్రగణ్యులు. పెంచిపెద్ద చేసిన తల్లిదండ్రులూ ఆయన భక్తులే. ఆడుకున్న సఖులూ ఆయన భక్తులే. అందుకే లీలావినోదభరితమైన కృష్ణభక్తి సామ్రాజ్యం విలక్షణమైనది, అనుపమానమైనది. 

7, ఫిబ్రవరి 2016, ఆదివారం

కృష్ణ భక్తి - మొదటి సంచిక

కృష్ణ భక్తి - మొదటి సంచిక


కృష్ణుని గురించి ఎంతమంది చెప్పినా తనివి తీరదు. అది సంపూర్ణం కాదు. పోతన మొదలు నేటి కవుల వరకు చాల మంది తెలుగుభాషలో స్వామి రూపగుణవైభవాన్ని వివరించే ప్రయత్నం చేశారు. అందులో వేటూరి సుందరరామమూర్తిగారు కూడా ఉన్నారు. "మోహనాల వేణువూదే మోహనాంగుడితడే.." అని ఒక పంక్తిలో పొగిడితే ఇంకొక పంక్తిలో "నీలమై నిఖిలమై కాలమై నిలిచాడే" అని సాగర సంగమం చిత్రంలోని వేవేల గోపెమ్మల మువ్వగోపాలుడే ముద్దు గోవిందుడే అన్న గీతంలో వేటూరి వారు అన్నారు. ఆ సమ్మోహననుని  వేణువు వింటే గోకులం అంతా "నేను" అన్న భావన మరచి ఆ పరమాత్మతో అనుసంధానమై తన్మయత్వంలో మునిగేవారుట. ఆతని రూపము వర్ణించనలవి కానిది.

"కస్తూరీతిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవ మౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠేచ ముక్తావళీం గోప స్త్రీ పరివేష్టితోం విజయతే గోపాల చూడామణిం" అని బిల్వమంగళుడు ఆ ముకుంది మోహన రూపాన్ని శ్రీకృష్ణకర్ణామృతంలో వర్ణించే యత్నం చేశాడు. విశాలమైన నుదుటన కస్తూరి తిలకం, వక్షస్థలమున కౌస్తుభ మణి, ముక్కు చివరన కొత్త ముత్యం, చేతిలో వేణువు, చేతులకు కంకణాలు, తనువంతా శ్రీచందనం, కంఠములో ముత్యాలహారం, చుట్టూ గోపికలతో ప్రకాశిస్తున్నాడు ఆ గోపాల చూడమణి.

మరి ఆ కృష్ణుడు ఆకాశం రంగుతో నిఖిలమైనాడు. అంతటా ఆయనే ఉన్నాడు. సృష్టికి పరిణామాలకు లీలావినోదంతో చూస్తూ సాక్షీ భూతుడైనాడు. అందుకే వేటూరి వారు ఆయనను కాలమై నిలిచాడు అన్నాడు. ఇంకొక అడుగు ముందుకు వేసి "గీతార్థ సారమిచ్చి గీతలెన్నో మార్చేనే" అన్నారు. కర్మ చేయటం వరకే నీ వంతు, ఫలాన్ని నాకు వదులు అని చెప్పి మన విదిని మార్చుకునే మార్గం చెప్పాడు ఆ పరమాత్మ. కృష్ణావతారానికి ఒక విశేషమైన, విలక్షణమైన లక్షణముంది. ఆయన అంతటా ఉన్నట్లు అనిపించినా, ఎవ్వరికీ దేనికీ చెందని వాడు. కన్న తల్లికే చెందలేదు, ప్రేమించిన రాధకూ చెందలేదు, పూజించిన బావకూ చెందలేదు. ధర్మం వైపు నిలిచాడు. భక్తికి తలవంచాడు. అందుకే సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఔరా అమ్మక చెల్లా అనే గీతంలో "బాలుడా! గోపాలుడా! లోకాల పాలుడా! తెలిసేది ఎలా ఎలా ఛాంగు భళా" అన్నారు. "అయినవాడే అందరికీ అయినా అందడు ఎవ్వరికీ" అని కృష్ణుని తత్వాన్ని వీలైనంత సులభంగా తెలియజేసే ప్రయత్నం చేశారు.

కృష్ణభక్తికి మూలం ఇదే. మనలను మనం సంపూర్ణంగా స్వామికి సమర్పించుకోవటం. అన్నీ భావనలూ ఆయనవే అని "నేను", "నాది" అన్న భావనలకు దూరమై జీవాత్మను పరమాత్మను ఏకం చేయటం. ఎప్పుడైనా శరణాగతితో ఉన్న కృష్ణభక్తులను చూస్తే ఈ విషయం అవగతమవుతుంది - బాహ్యప్రపంచం పట్టదు, స్వామిని దర్శిస్తూ అనేకునితో ఏకమై రమిస్తూ ఉంటారు..

6, ఫిబ్రవరి 2016, శనివారం

పనీర్‌ గులాబ్ జామూన్



నిన్న ఇంట్లో పాలు విరిగాయి. వెంటనే శ్రీమతి విరిగిన పాలను మూటగట్టించి పనీర్ చేసింది. ఎప్పుడూ పనీర్‌తో కూరేనా? స్వీట్ చేస్తే ఎలా ఉంటుంది అనిపించింది. పనీర్‌తో గులాబ్ జామూన్ బాగుంటుంది అని తను రెసిపీ చెప్పింది. వెంటనే ఆ పనిలో పడ్డాను.

కావలసిన పదార్థాలు:

పనీర్ అరకిలో
మైదాపిండి 50గ్రాములు
కండెన్సుడ్ మిల్క్ (నెస్లె డబ్బా చిన్నది)
బేకింగ్ పౌడర్
కొద్దిగా నెయ్యి
పంచదార అరకిలో
ఏలకులపొడి

తయారు చేసే పద్ధతి:

ముందుగా పనీరును (విరిగిన పాలను మూట కడితే వచ్చే పాల ఉత్పత్తి) గ్రైండరులో వేసి మెత్తగా చేసుకోవాలి.  దానిలో 50 గ్రాముల మైదాపిండి, అరకప్పు కండెన్సుడ్ మిల్క్, బేకింగ్ పౌడర్, కాస్త నెయ్యి వేసి మళ్లీ గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక అరగంటసేపు పాత్రలో మూత పెట్టి ఉంచాలి. తరువాత చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఒక గిన్నలో అరకిలో చక్కెరలో అరలీటరు నీళ్లుపోసి వేడి చేస్తూ తీగ పాకం చేసుకోవాలి. పాకం సిద్ధమైంది అనటానికి సూచన గరిటతో పైకి తీస్తే తీగలా సాగాలి. పాకంలో ఏలకులపొడిని వేసి కలపాలి.




స్టవ్‌పై నూనె పెట్టి నూనె వెడెక్కిన తరువాత ఉండలను ఒక్కొక్కసారి 4-5 చొప్పున సన్న సెగలో వేయించాలి. ఎక్కువ సెగలో వేయిస్తే లోపల ఉడకదు, పైన మాడిపోయి పాకాన్ని పీల్చదు. ఎర్రగా వేగిన తరువాత వాటిని ఐదు నిమిషాలు చల్లారనివ్వాలి. అప్పుడు ఆ ఉండలను పాకంలో వేయాలి. ఒక అరగంటకు ఉండలు పాకాన్ని పీల్చి పెద్దగా, సాఫ్ట్‌గా అవుతాయి. అంతే! పనీర్ గులాబ్ జామూన్ రెడీ!! 

5, ఫిబ్రవరి 2016, శుక్రవారం

తరాల మార్పులు - జీవితాల్లో పెను మార్పులు


కాలాలు మారాయి, అవసరాలు పెరిగాయి, ఉద్యోగాలలో పని గంటలు పెరిగాయి, మనుషుల్లో ధర్మం మారింది. వీటన్నిటితో పని చేసే వారి జీవితాలు ఒత్తిడితో ఉన్నాయి. దీన్ని వృద్ధ తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి.

కొడుకు/అల్లుడి గురించి -

"మేము ఉద్యోగాలు చేసినప్పుడు ఆరు గంటలకల్లా ఇంట్లో ఉండేవాళ్లమురా! ఈ ఉద్యోగాలేంటో? రాత్రింబవళ్లూ పని, పిల్లల చదువుల గురించి పట్టించుకునే సమయం లేదు. ఎందో, వీళ్లకు డబ్బుంది కానీ సుఖం లేదు..."

కోడలు/కూతురు గురించి -

"మా తరంలో ఆడవాళ్లు ఇంటి పట్టున ఉండి పిల్లలను చూసుకునే వాళ్లు. నా కోడలు, కూతురు ఉద్యోగం పొద్దున పోతే రాత్రి దాకా చేస్తూనే ఉంటారు. రాత్రిళ్లు పొద్దు పోయిన తరువాత కూడా కాల్స్...ఇక ఆ పిల్లల తిండి పట్టించుకునే వాళ్లు ఎవరు?...ఎందుకీ ఆడాళ్లకు ఉద్యోగాలు? మొగుళ్లు బోలెడు సంపాదిస్తున్నారు, హాయిగా మానేసి పిల్లల చదువులు, తిండి చూసుకోవచ్చు కాద?"

మనవలు/మనవరాళ్ల గురించి -

"వీళ్లకి బయటికి వెళ్లి ఆడుకునే బుద్ధి లేదు. ఇరవై నాలుగు గంటలూ టీవీ, సెల్ ఫోన్, ఐ ప్యాడ్...పసితనంలో సోడాబుడ్డీల కళ్లజోళ్లు..."

కోడలు గురించి -

"మా కోడలకి పిల్లలను అరిస్తే ఇష్టముండదు. మేము ఇలా పెంచలేదమ్మా. పిల్లలకు డిసిప్లీన్ లేకపోతే ఎలా? భయం భక్తి లేదు. ఎదురు ప్రశ్నిస్తారు, ఇంకా ముదిరితే అరుస్తారు..ఏవిటో ఈ పెంపకం..ఎందుకీ డబ్బు?..."

ఎదిగిన మనవడు/మనవరాలి గురించి:

"ఏం పిల్లలో, కాస్త కూడా ఒత్తిడి తట్టుకోలేరు, ఒక్క పని చాతకాదు, పొద్దున పోయి రాత్రికి వస్తారు కాలేజీనుంచి. వీళ్ల శరీరాల్లో శక్తి ఉండదు, ఏదైనా చెబితే కోపం..."

కొడుకు గురించి తండ్రి -

"మా వాడికి అప్పుడే స్పాండిలోసిస్ వచ్చింది. మెదలో, నడుములో డిస్క్ ప్రాబ్లం. ముప్ఫై కూడా లేవు. ఐదు కిలోల బరువు కూడ మోయలేడు. నేను ఆ వయసులో ఎంత బరువైన ఎత్తేవాడిని, ఎంత దూరమైనా నడిచి వెళ్లే వాడిని"

- ఇదీ చాలా మంది రిటైర్ అయిన తల్లిదండ్రులు తమ పిల్లల కుటుంబాల గురించి తమ సాటి వయస్కులతో, అక్క చెల్లెళ్లతో చెప్పేవి.

నిజమే. కానీ, ఈ సమస్యలకు కారణం ఏమిటి అని కూడా ఆలోచించాలి కదా?

1. ఇది వరకు చాలా మంధి చిన్న/మధ్య తరగతి ఊర్లలో, పట్టణాలలో ఉద్యోగాలు చేసుకునే వారు. కాబట్టి, తక్కువ డబ్బుతో అయినా సంసారం నడిచేది. ఇప్పుడు ఉద్యోగాలన్నీ పెద్ద పట్టణాలలోనే ఉంటున్నాయి. అక్కడ వస్తువుల ధరలతో పాటు, నెల ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ఒక సంపాదనతో కుటుంబం గడవటం కష్టమే. స్త్రీలు ఉద్యోగం చేయటం అనేది స్త్రీ స్వేచ్ఛ కోసం కన్నా ఆర్థిక వెసులుబాటు కోసమే ఎక్కువగా తప్పనిసరి అయ్యింది. ఇది ఈ తరం వాళ్లు కోరి తెచ్చుకున్నది కాదే?

2. ఇదివరకు చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాలలో చేసే వారు, పబ్లిక్ సెక్టార్ (బ్యాంకులు వగైరా) జాబుల్లో చేసేవారు. కాబట్టి వారికి పని గంటలు పరిమితం. ఇప్పుడు అలా కాదు, ప్రైవేట్ ఉద్యోగాలు, పని విపరీతం, కంపెనీల మధ్య పోటీ, తక్కువ సమయంలో ఎక్కువ పని చేయిస్తే తప్ప లాభాలు రావు. అది కూడా కాకుండా, బీపీవో వంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల వలన రాత్రిళ్లు పని చేయాల్సిన అవసరం. వేర్వేరు భౌగోళిక ప్రాంతాలలో ఉన్నవారితో కలిసి పని చేయాలి, అక్కడి కస్టమర్సును సపోర్ట్ చేయాలి. అలాగే, బ్యాకుల నుండి కస్టమర్లు ఎక్కువ పని వేళలు, ఎక్కువ సర్వీసులు ఆశిస్తున్నరు. ప్రభుత్వం కూడా దీనిపైనే దృష్టి పెట్టింది. ఇది వరకు 5:30 కల్లా ఇంటికి వచ్చే బ్యాంకు ఉద్యోగులు ఇప్పుడు రాత్రి పొద్దుపోయాక వస్తున్నారు. దీనితో పని వేళలలో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. ఇవేవీ, ఈ తరం వాళ్లు కొని తెచ్చుకున్నవి కాదే?

3. ఇది వరకు సమాజంలో భద్రత ఉండేది, పిల్లలు రోడ్లపైకి వెళ్లి ఆడుకునేందుకు వీలుగా ట్రాఫిక్ తక్కువ ఉండేది, ఆడపిల్లలపై అత్యాచారాలు తక్కువగా ఉండేవి. అందుకని, హాయిగా పిల్లలు రోడ్ల మీద ఆడుకునే వాళ్లు. ఇప్పుడు జనాభా పెరిగింది, రోడ్లు పెరగలేదు, ఆట స్థలాలు ఆక్రమించబడ్డాయి. పిల్లల భద్రత కోసం వారిని తల్లిదండ్రులు బయటికి పంపించటం లేదు. ఇది నేటి తరం కొని తెచ్చుకున్నది కాదే?

4. ఇది వరకు ఒక్క దూరదర్శన్ మాత్రమే ఉండేది, సెల్ ఫోన్లు లేవు, ఇంటర్నెట్ లేదు, ఇన్ని రకాల పరికరాలు లేవు. కాబట్టి పిల్లలకు ఆటలు, ఇతరులతో కలిసే అవకాశం ఉండేది. ఇప్పుడో? వందల చానెళ్లు, వందల పరికరాలు, దానిలో పిల్లల సమయాన్ని హరించే లక్షల ఆటలు, పాటలు. దీనిలో నేటి తల్లిదండ్రులకు పాత్ర ఉంది. వారు నియంత్రణలో పెట్టవచ్చు, కానీ చేయటం లేదు.

5. ఒక తరం క్రితం, పిల్లలకు చదువులు -> ఉద్యోగాలు -> ఆర్థిక భద్రత అనే దాని మీదికి విపరీతమైన ఫోకస్ వచ్చి వ్యక్తిత్వ వికాసాన్ని వదిలేశారు. అంటే, మాకు డబ్బు లేదు, మా పిల్లలు చదువుకొని సంపాదించాలి అని ఆ తరం తల్లిదండ్రులు పిల్లలను చదువుల్లోనే ఉంచి,మిగితావి పక్కన పెట్టారు. దానితో ఎదిగే పిల్లల వ్యక్తిత్వ వికాసం జరగలేదు. కేవలం మార్కుల్లో మాత్రమే వారి ప్రతిభ. ఈ జాడ్యం నేడు, వికృతమై నారాయణ/చైతన్య వంటి కమర్షియల్ విద్యాసంస్థలకు జన్మనిచ్చింది. ఇక పిల్లలకు వ్యక్తిత్వ వికాసమే లేదు. దీనికి క్రిందటి తరం తల్లిదండ్రులే బాధ్యులు. నేటి తరం తల్లిదండ్రులు కళ్లు తెరిచి సరిదిద్దాలి.

6. ఇది వరకు అన్ని ఉద్యోగాలూ ఫైళ్లు చూడటం, రాయటం. అలాగే కార్మిక వర్గంలో ఎక్కువగా లేచి తిరిగి శరీరానికి పని పెట్టే ఉద్యోగాలు ఉండేవి. ఇప్పుడు అలా కాదు. అన్ని ఉద్యోగాలూ కంప్యూటర్ మీద చేసేలా మారాయి. కంప్యూటర్ ఉద్యోగాలు పెరిగాయి. ఇవి సిట్టింగ్ జాబ్స్ కావటం, సరైన పద్ధతిలో కూర్చోకపోవటం వలన వెన్నెముక్ సమస్యలు, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. వీటికి ఉద్యోగులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో వాళ్లు కూడ తోడ్పడి ప్రోత్సహించాలి.

మొత్తం మీద, క్రిందటి తరం తల్లిదండ్రులు పరిస్థితులను కాస్త అర్థం చేసుకోవాలి. తమ పిల్లలు ఎందుకు ఈ స్థితిలో ఉన్నారో గ్రహించి దానికి కారణాలను కనుక్కొని వీలైనంత సహాయకరంగా ఉండాలి. ఊరికే పక్కవారితో ఆడిపోసుకుంటే వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. మారిన తరంతో పాటు మారిన పరిస్థితులు. అంతే. ఇది తెలుసుకుంటే తరాల మధ్య అంతరాలు రావు.

చేతః శ్రీ బాలకృష్ణం భజరే - ముత్తుస్వామి దీక్షితుల కృతి

చేతః శ్రీ బాలకృష్ణం భజరే రే చింతితార్ధ ప్రద చరణారవిందం ముకుందం నూతన నీరద సదృశ శరీరం నంద కిశోరం పీత వసన ధరం కంబు కంధరం గిరిధరం పూతనాది సంహారం...