RightClickBlocker

7, ఫిబ్రవరి 2016, ఆదివారం

కృష్ణ భక్తి - మొదటి సంచిక

కృష్ణ భక్తి - మొదటి సంచిక


కృష్ణుని గురించి ఎంతమంది చెప్పినా తనివి తీరదు. అది సంపూర్ణం కాదు. పోతన మొదలు నేటి కవుల వరకు చాల మంది తెలుగుభాషలో స్వామి రూపగుణవైభవాన్ని వివరించే ప్రయత్నం చేశారు. అందులో వేటూరి సుందరరామమూర్తిగారు కూడా ఉన్నారు. "మోహనాల వేణువూదే మోహనాంగుడితడే.." అని ఒక పంక్తిలో పొగిడితే ఇంకొక పంక్తిలో "నీలమై నిఖిలమై కాలమై నిలిచాడే" అని సాగర సంగమం చిత్రంలోని వేవేల గోపెమ్మల మువ్వగోపాలుడే ముద్దు గోవిందుడే అన్న గీతంలో వేటూరి వారు అన్నారు. ఆ సమ్మోహననుని  వేణువు వింటే గోకులం అంతా "నేను" అన్న భావన మరచి ఆ పరమాత్మతో అనుసంధానమై తన్మయత్వంలో మునిగేవారుట. ఆతని రూపము వర్ణించనలవి కానిది.

"కస్తూరీతిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవ మౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠేచ ముక్తావళీం గోప స్త్రీ పరివేష్టితోం విజయతే గోపాల చూడామణిం" అని బిల్వమంగళుడు ఆ ముకుంది మోహన రూపాన్ని శ్రీకృష్ణకర్ణామృతంలో వర్ణించే యత్నం చేశాడు. విశాలమైన నుదుటన కస్తూరి తిలకం, వక్షస్థలమున కౌస్తుభ మణి, ముక్కు చివరన కొత్త ముత్యం, చేతిలో వేణువు, చేతులకు కంకణాలు, తనువంతా శ్రీచందనం, కంఠములో ముత్యాలహారం, చుట్టూ గోపికలతో ప్రకాశిస్తున్నాడు ఆ గోపాల చూడమణి.

మరి ఆ కృష్ణుడు ఆకాశం రంగుతో నిఖిలమైనాడు. అంతటా ఆయనే ఉన్నాడు. సృష్టికి పరిణామాలకు లీలావినోదంతో చూస్తూ సాక్షీ భూతుడైనాడు. అందుకే వేటూరి వారు ఆయనను కాలమై నిలిచాడు అన్నాడు. ఇంకొక అడుగు ముందుకు వేసి "గీతార్థ సారమిచ్చి గీతలెన్నో మార్చేనే" అన్నారు. కర్మ చేయటం వరకే నీ వంతు, ఫలాన్ని నాకు వదులు అని చెప్పి మన విదిని మార్చుకునే మార్గం చెప్పాడు ఆ పరమాత్మ. కృష్ణావతారానికి ఒక విశేషమైన, విలక్షణమైన లక్షణముంది. ఆయన అంతటా ఉన్నట్లు అనిపించినా, ఎవ్వరికీ దేనికీ చెందని వాడు. కన్న తల్లికే చెందలేదు, ప్రేమించిన రాధకూ చెందలేదు, పూజించిన బావకూ చెందలేదు. ధర్మం వైపు నిలిచాడు. భక్తికి తలవంచాడు. అందుకే సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఔరా అమ్మక చెల్లా అనే గీతంలో "బాలుడా! గోపాలుడా! లోకాల పాలుడా! తెలిసేది ఎలా ఎలా ఛాంగు భళా" అన్నారు. "అయినవాడే అందరికీ అయినా అందడు ఎవ్వరికీ" అని కృష్ణుని తత్వాన్ని వీలైనంత సులభంగా తెలియజేసే ప్రయత్నం చేశారు.

కృష్ణభక్తికి మూలం ఇదే. మనలను మనం సంపూర్ణంగా స్వామికి సమర్పించుకోవటం. అన్నీ భావనలూ ఆయనవే అని "నేను", "నాది" అన్న భావనలకు దూరమై జీవాత్మను పరమాత్మను ఏకం చేయటం. ఎప్పుడైనా శరణాగతితో ఉన్న కృష్ణభక్తులను చూస్తే ఈ విషయం అవగతమవుతుంది - బాహ్యప్రపంచం పట్టదు, స్వామిని దర్శిస్తూ అనేకునితో ఏకమై రమిస్తూ ఉంటారు..

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి