RightClickBlocker

8, ఫిబ్రవరి 2016, సోమవారం

కృష్ణ భక్తి - రెండవ సంచికలీలల ద్వారా మాయాప్రేరితమైన లక్షణాలను తొలగించినవాడు కృష్ణుడు. మన్ను తింటున్నాడని చూచి బాలుడైన తమ్మునిపై ప్రేమతో అన్న బలరాముడు తల్లికి ఫిర్యాదు చేస్తే, ఆ తల్లి కలవరపడి ఏదీ నోరు తెరువు అని అడగగా మొత్తం విశ్వాన్ని నోట చూపించాడు. అంతటితో యశోదకు తాను ఆ బాలుని తల్లి అన్న మాయ నశించి అతనిలో పరమాత్మను దర్శిస్తుంది. ఆ ఘట్టాన్ని సముద్రాల రాఘావాచార్యుల వారు పాండురంగ మహాత్యం చిత్రంలో జయ కృష్ణా ముకుందా మురారీ అనే గీతంలో ఇలా అందంగా వర్ణించారు.

అమ్మా! తమ్ముడు మన్ను తినేనూ.. చూడమ్మా! అని రామన్న తెలుపగా
అన్నా! అని చెవి నులిమి యశోద ఏదన్నా! నీ నోరు చూపుమనగా
చూపితివట నీ నోటను, బాపురే! పదునాల్గు భువన భాండమ్ముల
ఆ రూపము గనిన యశోదకు తాపము నశియించి జన్మ ధన్యత గాన్చెన్

అలాగే,  కాళింది మడుగును అహంకారంతో విషపూరితం చేస్తున్న కాళీయునికి గుణపాఠం చెప్పటానికి ఆ మడుగులో దూకుతాడు. అమ్మో పిల్లవాడు నీట దూకాడు, ఆ సర్పము ఏమి చేస్తుందో అని నందయశోదలు, గోకులమంతా భయపడుతుంది. వారి భయమే కానీ, పరమాత్మ లీలకు ఆటంకమా? ఆ మహాసర్పము మదాన్ని అణచటానికి ఆతని తోక ఒక చేత పట్టుకొని, పడగలపై నాట్యం చేశాడు. విజయుడై అలాగే నీటినుండి బయటకు వచ్చాడు. ఆతని చూసి ఆ నందయశోదలకు కనువిప్పు కలిగింది. తమ బిడ్డ సామాన్యుడు కాదని అర్థమైంది. ఆ ఘట్టాన్ని సముద్రాల వారు ఇలా వర్ణించారు:

కాళీయ ఫణి ఫణ జాలాన ఝణ ఝణ కేళీ ఘటించిన గోపకిశోరా
కంసాది దానవ గర్వాపహార హింసా విదూర పాప విదార

దీనిని మరింత సులువుగా వేటూరి సుందరరామమూర్తిగారు సప్తపది చిత్రంలో ఇలా వివరించారు:

కాళింది మడుగున కాళీయుని పడగల
ఆబాలగోపాలమా బాల గోపాలుని
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నుల జూడ
తాండవమాడిన సరళి గుండెల నూదిన మురళి ఇదేనా ఆ మురళి

ఇలా ఒకటా రెండా? అవతారం మొత్తం అనుక్షణం ఆ కృష్ణుని లీలలే. ప్రతి ఒక్క లీలకూ ఒక పరమార్థముంది. దానిని అనుభూతి చెందిన నందవ్రజమంతా ఆయన భక్తులైనారు. ఒక్కసారి ఆ స్వామి భక్తి సామ్రాజ్యంలో ఆయనకు దాసులైతే ఇక వేరే ప్రపంచం అక్కరలేదు. అన్నీ ఆయనే, అన్నిటా ఆయనే. రాసలీలలో తన్మయులైన రాధాది గోపికలు ఆయన భక్తులలో అగ్రగణ్యులు. పెంచిపెద్ద చేసిన తల్లిదండ్రులూ ఆయన భక్తులే. ఆడుకున్న సఖులూ ఆయన భక్తులే. అందుకే లీలావినోదభరితమైన కృష్ణభక్తి సామ్రాజ్యం విలక్షణమైనది, అనుపమానమైనది. 

1 వ్యాఖ్య: