23, జులై 2020, గురువారం

గురు పరంపర ఎందుకు ముఖ్యం?


హిందుత్వం పేరుతో నేడు జరుగుతున్న కొన్ని అరాచకాలకు, అమలులో ఉన్న విపరీత సాంప్రదాయాలకు, వామాచారాలకు కారణం వాటిని ప్రచారం చేసే గురువులకు సరైన గురు పరంపర లేకపోవటం. ఉన్నట్టుండి ఒక వ్యక్తి బాబాగా మారి, తనను తానే గురువుగా ప్రకటించుకొని ఓ సంస్థ ఏర్పాటు చేసేసుకుంటున్న ఉదంతాలు గత 10-15 ఏళ్లలో చాలా ఎక్కువయ్యాయి. బలహీనతల వల్లో, లేక వారి అవసరాలను బట్టో ప్రజలు వీరి బారిన పడి తీవ్రంగా నష్టపోతున్నారు. ఇలాంటి వారి వల్ల హైందవానికి తీవ్ర అప్రతిష్ఠ కలిగి, ఈ ధర్మం గురించి ఘోరమైన దుష్ప్రచారం జరుగుతోంది. ఈ సమస్యను అరికట్టడానికి మనం గురు పరంపరను పరిశీలించటం చాలా ముఖ్యం. ఒకరు తనను తాను గురువుగా చెప్పుకుంటూ మనకు తారసపడితే మన విచక్షణ ఉపయోగించి, వారి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకున్న తరువాతే వారిని విశ్వసించాలి. ఎందుకు ఈ గురు పరంపర ముఖ్యం?

1. అర్హత
------------

గురువుగా, ఒక సంస్థ (అనగా పీఠం లేదా మఠం) అధిపతిగా స్వయం ప్రకటితం చేసుకోవటం అనేది ఎప్పుడూ సరైన పద్ధతి కాదు. ఒక గురువు శిష్యుని వెదుక్కుంటూ వచ్చి, శిష్యునికి కావలసిన లక్షణాలను మరింత నిశితంగా పరిశీలించి, ఉత్తరాధికారం ఇవ్వటమే సరైన పద్ధతి. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలో ఇలా జరగకపోయినా, బహుళ జనామోద యోగ్యమైన వారే గురువులుగా రాణించగలరు. ఇలా జరిగినప్పుడు వారిని అనుసరించే వారు ఆ గురువుల అర్హతలను మరింత దగ్గరగా గమనించి తీరాలి.

2. సిద్ధాంతాలకు మూలాలు
------------------------------------

ఒక మంచి పరంపర కలిగిన గురుతత్త్వంలో బలమైన సిద్ధాంతాలుంటాయి. ఆ సిద్ధాంతాలు కాలపరీక్షను తట్టుకుని ఒక తరం నుండి మరొక తరానికి బదిలీ చేయబడతాయి. దీనివల్ల ఆ సిద్ధాంతాలకు బలం చేకూరుతుంది. ఏ సిద్ధాంతమైనా ఒక రెండు తరాలన్నా నిలిచి లక్షలాది ప్రజల జీవితాలను మంచి వైపు నడిపిస్తేనే సఫలమైనట్లు. లేకపోతే అది గాలివాటం సిద్ధాంతమనే అనుకోవచ్చు. ఒక తరంలో గురువు కొత్త సిద్ధాంతాలు లేదా మార్గాలను ప్రతిపాదిస్తే, వాటిని గురు పరంపరలో చర్చించి, ఆమోదింపజేసుకుని కార్యాచరణ చేస్తారు కాబట్టి వికృతము, ఆగమ విరుద్ధము, ధర్మ విరుద్ధము, సమాజ విరుద్ధము, చట్ట విరుద్ధమైన సిద్ధాంతాలు పుట్టుకు వచ్చే అవకాశం ఉండదు.

3. అభ్యాసం
---------------

ఒక గురువు వద్ద శిష్యుడు శిక్షణ పొందేవి అనేకాలు - 1. అనాదిగా చెప్పబడిన శ్రుతి స్మృతి శాస్త్ర పురాణాలు 2. గురువుల అనుభవాలు, జీవిత విశేషాలు 3. ఆ సంస్థ యొక్క నియమావళి 4. ఆ సంస్థకు సంబంధించిన దేవతా స్వరూపం యొక్క అర్చనా విధులు 5. ఆ సంస్థ ద్వారా ఆధ్యాత్మిక ప్రచారం జరిపే వ్యవస్థ వివరాలు. ఇవే కాక, మరెన్నో. ఈ అభ్యాసం వల్ల ఆ శిష్యుని వ్యక్తిత్వం కావలసిన మార్పులు చేర్పులు జరిగి వ్యక్తిత్వ వికాసం పొంది, ఉత్తరాధికారానికి సిద్ధుడవుతాడు.

4. సమాజం అమోదం
---------------------------

సమాజం (అనగా పాలకులు, ప్రజల సమూహం) మతంలోని సంస్థలను, వ్యక్తులను, వాటి అధిపతులను చాలా నిశితంగా పరిశీలిస్తుంది. అనగా, మంచి, చెడు, వారి వైశిష్ట్యం, నిబద్ధత, మహత్తు, మార్గంలో విలక్షణత మరియు ఇతర సంస్థాగత విషయాలను సమాజం పరిశీలించి, విమర్శించి, పరీక్షిస్తుంది. ఈ పరీక్షలో నెగ్గిన సంస్థ/గురు పరంపరలే నాలుగు కాలాలపాటు ఆధ్యాత్మికగా మార్గదర్శకులు కాగలరు.

5. ఆరోగ్యకరమైన అభివృద్ధి
------------------------------------

ఒక గురు పరంపరలో వచ్చిన వ్యక్తుల ద్వారా ఏర్పడిన సంస్థలు కాలపరీక్ష తట్టుకుని, ప్రజల ఆమోదం పొంది, అనేకుల జీవితాలను ప్రభావితం చేయటానికి ఒక జీవితకాలం పడుతుంది. అప్పుడే అది ఆరోగ్యకరమైన పురోగతి అవుతుంది. రాత్రికి రాత్రి వెలసి, కొద్ది కాలంలోనే బాగా విస్తరించి, డబ్బు, ఆస్తులను కూడబెట్టింది అంటే దాని వెనుక అధార్మికమైన చర్యలు తప్పకుండా ఉండి తీరుతాయి. ఇటువంటి అభివృద్ధి సంస్థకు, సమాజానికి మంచిది కాదు. సహజ పరిణామంలో ఎదిగితేనే ఆ సంస్థ, గురుబోధలు కలకాలం నిలిచేది.

6. త్యాగాలు
---------------

ఒక పరంపరలో ఉన్నారంటే ఆ గురువులు అనేక త్యాగాలు చేసి, నిజమైన సన్న్యాసాశ్రమ ధర్మాన్ని నిర్వర్తించాలి. అప్పుడే ఆ పరంపరలో నిలదొక్కుగొనగలరు. సాంసారిక బంధనాలు, బంధుప్రీతి, రాగద్వేషాలు, కామక్రోధాది అరిషడ్వర్గాలు జయించటానికి గురు పరంపర, దాని నియమావళి ఎంతో దోహదపడతాయి. శమదమాది గుణములు, వైరాగ్యం, ఆత్మావలోకనం, ధర్మాధర్మ విచక్షణ ఈ త్యాగాల వల్ల కలుగుతాయి.

ఇవే కాక వేరెన్నో పరంపరలో అబ్బుతాయి. అందుకే మనం గురువులను ఎన్నుకునేటప్పుడు ప్రప్రథమ పరిశీలనాంశంగా పరంపరను తెలుసుకోవాలి. ఆధ్యాత్మికతలో నాయకత్వం అనగా గురుస్థానం కూడా దేశం లేదా మన వృత్తిలోని నాయకత్వం లాగానే కఠోరమైన పరిశ్రమ ద్వారానే సాధ్యమవుతుంది. అందుకే మనం నేటి వికృతాలను పోరాడటానికి ఈ దిశగా మరింత దృష్టి పెట్టాలి. గ్రుడ్డిగా నమ్మి మోసపోతున్న కొద్దీ ఈ దొంగ బాబాలు పుట్టగొడుగుల్లా పుడుతూనే ఉంటారు.

శ్రీగురుభ్యోనమః.

కృతజ్ఞత ఎందుకు?


విశ్వమంతా (శాస్త్రము మరియు అధ్యాత్మికము రెండిటి ప్రకారము కూడా) శక్తి బదిలీ మీద నడుస్తుంది. ఈ శరీరము, విశ్వము మొత్తం సానుకూల ప్రతికూల శక్తుల మధ్య జరిగే సంతులన సంగ్రామమే. ఒక సంకల్పం నెరవేరాలంటే ఎంతో కొంత శక్తిని వెచ్చించాలి. ఆ సంకల్పం నెరవేరినప్పుడు మనం మనకు ఆ శక్తిని ఇచ్చిన మూలాన్ని(ఇతరులలో ఉన్న దైవత్వం లేదా స్వయంగా దైవానుగ్రహము) గుర్తించి, దానికి మనకు మధ్య గల సంబంధాన్ని గ్రహించి, ఆ సంబంధం వలన మనకు కలిగిన మేలును స్మరించుకొని ఆ దైవత్వాన్ని కొనియాడటం. ఒక్కసారి దీని గురించి కొంచెం లోతుగా ఆలోచించండి. కృతజ్ఞతా భావన వలన మనలోని దైవత్వాన్ని ఇతరుల లేదా స్వయంగా భగవంతునితో అనుసంధానం చేసి దానిని కొనియాడుతున్నాము. అంటే, మనలను మనము తెలుసుకొంటూ, దైవికతతో ఒక శాశ్వత సంబంధం ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది లేకపోతే?

కృతఘ్నత ఏమిటి?
--------------------------
రాక్షసులకు వరాలిచ్చేది దేవుడే. వారు చేసిన తపస్సు వలన (కఠోరమైన ధ్యానము చేసి ఒక దైవాన్ని ప్రార్థిస్తే ప్రపంచాలను గడగడలాడించే శక్తి విశ్వమునుండి తాపసి శరీరానికి బదిలీ అవుతుంది) ఆ దైవముతో ఒక అద్భుతమైన సంధానము కలిగి, ఆ దైవము ప్రకటితమవుతుంది. అనాదిగా వరములు పొంది రాక్షసులు చేసింది ఏమిటి? తాను పొందిన వరాలు తన శక్తి వలనే అని విర్రవీగి,వరములిచ్చిన దేవుని అపహాస్యము చేసి, దేవతలపై దాడి చేసి, సాత్వికులను హింసించి వికృత రూపం దాల్చి శాంతికి భంగం కలిగించటం. దైవత్వానికి ఆహారమైన యజ్ఞయాగాదులకు విఘ్నం కలిగించటం. కాబట్టి కృతఘ్నత లోకములో అశాంతికి మూల కారణం. మానవ లోకములో దీనికి స్వార్థము, అహంకారము అనే రెండు ముఖాలు లేదా ప్రధాన లక్షణాలున్నాయి.

ఈ రాక్షస లక్షణం కలియుగంలోని మానవులలో చాలా ఎక్కువగా కనిపిస్తోంది. కన్న తల్లిదంద్రులనే మరచి వారిని హింసించి అగౌరవపరచి అనాథలను చేస్తున్న పిల్లలు ఎందరో! విద్యను చెప్పే గురువును అవమానించి అవహేళన చేసి వారి భుజాలపై ఎక్కి గుండెలపై తన్నే చందంలో ప్రవర్తిస్తున్న శిష్యులెందరో! సాయం చేసిన వాడి సాయాన్ని, ఆ మనిషిని మరచి, అంతా నా వల్లే అని విర్రవీగుతున్న వారెందరో! మొక్కులు మొక్కి వాటిని మరచే స్వార్థపరులెందరో! మానవాతీతమైన శక్తిని అపహాస్యం చేస్తున్న నాస్తికులెందరో! దైవ దూషణ చేస్తున్న పాపులెందరో! తల్లి వంటి భూదేవిని మలినపరచే ప్రబుద్ధులెందరో! సస్యశ్యామలమైన ప్రకృతిని దుర్వినియోగం చేసి తల్లిని రొమ్ములపై తన్నే నీచులు ఎందరో! ఇవన్నీ కృతఘ్నతా లక్షణాలే.

మరి కృతజ్ఞత యొక్క విశేషము ఏమిటి?
--------------------------------------------------

సానుకూల శక్తిని ప్రసరింప జేసే అద్భుతమైన సాధనం కృతజ్ఞత. మనం కృతజ్ఞతతో గడిపే ప్రతిక్షణము కూడా ఒక విద్యుత్తరంగమై దైవముతో ఒక సంబంధాన్ని ఏర్పరుస్తుంది. మనలను దైవత్వము వైపు అంత వేగంగా ముందుకు తీసుకు వెళుతుంది.

ఎవరి పట్ల కృతజ్ఞులమై ఉండాలి?
-------------------------------------------

తల్లి, తండ్రి, గురువు, దైవము,పెద్దలు, మనకు తోడ్పడిన వారు, మనకు తోడుగా నిలబడిన వారు, తోటి మానవులందరూ, పెంపుడు జంతువులు, ప్రకృతి ,పర్యావరణం... ఇంకా చెప్పాలంటే మొత్తం విశ్వం పట్ల.

ఏమిటి సాధనాలు కృతజ్ఞతకు?
----------------------------------------

ఉదయం లేవగానే మనకు కారణమైన మూలానికి నమస్కారము, అర్హత ఉన్నవారు సంధ్యావందనము (మీరు ఈ ప్రక్రియలో వదిలే అర్ఘ్యాలు, తర్పణాలు కృతజ్ఞత తెలుపుటకే), స్తోత్త్రము, సంకీర్తన, ప్రతిఫలాపేక్ష లేకుండా సహాయం చేయటం, ఉపకారం పొందిన మూలాన్ని ప్రస్తుతించటం, తాను సాధించిన విజయాలకు అందుకు తోడ్పడిన వారి పట్ల గౌరవభావంతో ఉండటం. సనాతన ధర్మంలోని వాఙ్మయమంతా కూడా కృతజ్ఞతను నిరంతరం మనకు గుర్తు చేసేవే. పరమాత్మ యొక్క అనంత అద్భుత అనుగ్రహము, గురువుల అనుగ్రహము వల్ల మానవునికి కలుగుతున్న ఆనందానికి ప్రతీకగా కృతజ్ఞతలు తెలుపుతూ ఋషిప్రోక్తమైన అనేక సూక్తాలు వెలువడ్డాయి, అలాగే శంకరుల వంటి అవతారమూర్తుల నోట అనేకమైన స్తుతులు వచ్చి మనకు ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తూ మనలను సరైన దిశలో నడిపిస్తున్నాయి.

కృతజ్ఞత లేకపోతే?
--------------------------

ఈ భావం లేకుండా మనం చేసే ఎటువంటి కర్మ అయినా సాఫల్యం పొందదు. అంతే కాకుండా, అశాంతి, అరిషడ్వర్గాలు పేట్రేగుతాయి. ఎక్కడో ఒక చోట అది సంతులనను తీసుకు రావటం కోసం మనిషికి గుణపాఠం చెప్పే పరిస్థితులను సృష్టిస్తుంది. దేవభూమిగా చెప్పబడిన ఉత్తరాఖండ్‌లో, దేవుని స్వభూమిగా చెప్పబడే కేరళలో మానవుడు చేసిన పర్యావారణ వినష్టానికి, అక్కడ దివ్యత్వానికి కలిగించిన విఘాతానికి ప్రకృతి కన్నెర్ర చేసి వేలాది మందిని పొట్టనబెట్టుకుంది మనలోని కృతఘ్నత వల్ల కలిగే నష్టాలను గుర్తు చేసేందుకే. రాక్షసత్వం మితిమీరితే, పరమాత్మ కఠిన చర్యలకు మనం గురి కాక తప్పదు.

సారాంశం
------------

కృతఘ్నతకు మూలకారణం విశ్వంలో సర్వాతీతమైన శక్తి ఒకటి ఉందని నమ్మక పోవటం, మనమే అత్యంత శక్తివంతులమని, వచ్చే ఫలితాలన్నీ మన గొప్పతనమేనని. ఒక్క వాక్యంలో చెప్పాలంటే - అహంకారం కమ్ముకొని దైవము యొక్క ఉనికినే ప్రశ్నించటం. కాబట్టి అహంకారం తొలగటానికి మొదటిమెట్టు కృతజ్ఞతతో కూడిన కార్యములు (పైన పేర్కొనబడినవి). ఈ నేను, నావల్లే అన్న అహంకారం తొలగితే మానవుడే దైవము. దేహమే దేవాలయము. విశ్వంలో శాంతికి, సౌభ్రాతృత్వానికి, మానవత పరిఢవిల్లటానికి కృతజ్ఞత అద్భుతమైన సాధనం. పైసా ఖర్చుపెట్టవలసిన పనిలేదు, మన పురోగతికి కారకాలైన వారి పట్ల కృతజ్ఞులమై ఉంటే చాలు, మానవాళి సర్వతోముఖాభివృద్ధికి మనం ఎంతో తోడ్పడిన వారమవుతాము.

శ్రీగురుభ్యోనమః.

21, జులై 2020, మంగళవారం

ఆంజనేయం సదా భావయామి - ముత్తుస్వామి దీక్షితులు


ఆంజనేయం సదా భావయామి అప్రమేయం ముదా చింతయామి

అంజనా నందనం వారణేశం వరం పంచవక్త్రం సురేశాది వంద్యం
గురుగుహ హితం సంతతం సదా సేవిత శ్రీరామ పాద పంకజం
సంజీవి పర్వత కరం ముఖాబ్జం సదా రామచంద్ర దూతం భజే

ఆంజనేయుని నేను ఎల్లప్పుడూ భావించెదను. లెక్కించుటకు శక్యము కాని వాని సంతోషముతో ధ్యానించెదను. అంజనాదేవి పుత్రుడు, వానరులకు అధిపతి, శ్రేష్ఠుడు, పంచముఖములు కలవాడు, ఇంద్రాదులచే పూజించబడేవాడు, కుమారస్వామికి హితుడు, నిరంతరం శ్రీరాముని పద కమలములను సేవించేవాడు, సంజీవి పర్వతమును చేతిలో కలవాడు, వికసించిన కలువవంటి ముఖము కలవాడు అయిన శ్రీరామదూతను ఎల్లప్పుడూ భజించెదను.

- ముత్తుస్వామి దీక్షితులు

20, జులై 2020, సోమవారం

సరస్వతీ నమోస్తుతే - జీఎన్ బాలసుబ్రమణ్యం


సరస్వతీ నమోస్తుతే శారదే విద్యాప్రదే

కరధృత వీణా పుస్తక
వర మణిమాలాలంకృత

నరహరి సుత విధి లాలిత నవమణి యుత కంబుగళే
సుర సేవిత పద యుగళే సుధాకర సమధవళే

వీణ, పుస్తకములు చేతులలో ధరించి, శ్రేష్ఠమైన మణుల హారములచే అలంకరించబడిన ఓ సరస్వతీదేవి! నీకు వందనములు. శ్రీహరి సుతుడైన బ్రహ్మదేవునిచే లాలించబడి, నవరత్నములచే శోభిల్లే అందమైన కంఠము కలిగి, దేవతలచే సేవించబడే పదములు కలిగి, చంద్రునితో సమానమైన ధవళకాంతితో యున్న నీకు వందనములు!

- జీఎన్ బాలసుబ్రమణ్యం (ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసులు, వాగ్గేయకారులు)

తమిళనాట పుట్టినా అప్పుడు అంతా తెలుగుభాష మాట్లాడే వారు, ద్రావిడ ఉద్యమం రాక మునుపు రోజులవి. ప్రతి ఒక్క సంగీత కళాకారుడు కూడా త్యాగరాజు మొదలు ఇతర తెలుగు, కన్నడ వాగ్గేయకారుల కీర్తనలే పాడేవారు. జీఎన్‌బీ కూడా ఆ కోవకే చెందిన వారు. మద్రాసు రాష్ట్రంలో పుట్టినా, తాను రచించిన 250 కీర్తనలలో 90%కు పైగా తెలుగులో రాసినవే. వాటితో పాటు కొన్ని సంస్కృతంలో కూడా రచించారు. వాటిలో ఒకటి ఈ సరస్వతీ నమోస్తుతే. జీ్ఎన్‌బీ ఆనాడు ఓ ఒరవడి సృష్టించిన గాయకులు, నటులు మరియు వాగ్గేయకారులు. ఎమ్మెల్ వసంతకుమారి, రాధ-జయలక్ష్మి వంటి కళాకారులు ఆయన వద్ద శిక్షణ పొందారు. చిన్నవయసులోనే అనారోగ్యం చేయటంతో ఆయన 55 ఏళ్ల వయసులోనే మరణించారు. సరస్వతి రాగంలో ఆయన ఈ సరస్వతీ నమోస్తుతే అనే కృతిని కూర్చారు.

https://www.youtube.com/watch?v=vgnFuoEzGQ8

వేణుగానలోలుని గన వేయి కనులు కావలెనే - త్యాగరాజస్వామి


వేణుగానలోలుని గన వేయి కనులు కావలెనే

అలివేణులెల్ల దృష్టి చుట్టి వేయుచు మ్రొక్కుచు రాగ

వికసిత పంకజ వదనలు వివిధ గతుల నాడగ
ఒకరికొకరు కరమున నిడి యోర కనుల జూడగ
శుక రవములు గల తరుణులు సొగసు గాను బాడగ
సకల సురులు త్యాగరాజ సఖుని వేడగ వచ్చే

వేణుగానములో తన్మయుడై యున్న శ్రీకృష్ణుని చూచుటకు వేయి కన్నులు కావలెను. ఒత్తైన కురులు కలిగిన స్త్రీలు తమ దృష్టంతా ఆ కృష్ణునిపైనే యుంచి ఆయనకు నమస్కరిస్తూ వచ్చే వైభవాన్ని చూచుటకు వేయికన్నులు కావలెను. వికసించిన కలువల వంటి ముఖము కలిగిన స్త్రీలు అనేక గతులలో ఆడగా, ఒకరికొకరు చేతులు పట్టుకుని ఓర కన్నులతో కృష్ణుని చూడగా, చిలుకు పలుకులు కలిగిన స్త్రీలు సొగసుగా పాడగా సమస్త దేవతలు పరమశివుని సఖుడైన శ్రీకృష్ణుని వేడుకొనగా వచ్చే వైభవమును చూచుటకు వేయి కన్నులు కావలెను

(చిత్రం రాజా రవివర్మ)

17, జులై 2020, శుక్రవారం

మారకోటి సుందరి - జీ.ఎన్.బాలసుబ్రహ్మణ్యం


మారకోటి సుందరి మానిని మామవ సదా జగన్మోహిని

శారదా విదుసమవదనే నీరజదళ సులోచనీ

నారదాది పూజిత పావని తారక రిపు శుభ జనని
ఘోర పాప సంతాప శమని పారమార్థిక ఫలదాయిని

కోటిమన్మథుల సౌందర్యము గలిగి, జగన్మోహినివయిన ఓ పార్వతీదేవీ! నన్ను ఎల్లప్పుడూ రక్షించుము. శారదా స్వరూపిణివి, ఏనుగు కుంభస్థల మధ్యము వంటి అందమైన ముఖము, కలువరేకుల వంటి అందమైన కన్నుల గల తల్లీ! నన్ను ఎల్లప్పుడూ రక్షించుము. నారదాదులచే పూజించబడిన పావనీ! తారకాసురుని శత్రువైన సుబ్రహ్మణ్యుని జననీ! ఘోర పాపముల వల్ల కలిగే సంతాపములను తొలగించి పారలౌకిక ఫలములనొసగే తల్లీ! నన్ను ఎల్లప్పుడూ రక్షించుము.

- జీ.ఎన్.బాలసుబ్రహ్మణ్యం

ఇంతకన్నానందమేమి - త్యాగరాజస్వామి


ఇంతకన్నానందమేమి! ఓ రామ రామ!

సంతజనులకెల్ల సమ్మతి యుంటే గాని

ఆడుచు నాదమున పాడుచు ఎదుట రా
వేడుచు మనసున గూడియుండేది చాలు

శ్రీహరి కీర్తనచే దేహాది ఇంద్రియ స
మూహముల మరచి సోహమైనదే చాలు

నీ జపముల వేళనీ జగములు నీపై
రాజిల్లునయ్యా త్యాగరాజనుత చరిత్ర!

ఓ రామయ్యా! ఎల్లప్పుడూ హరికీర్తన చేయు హరిదాసులకిష్టమై యుండుటకన్నా ఆనందమేమున్నది? నాదానందముతో ఆడుచు పాడుచు నిను రమ్మని వేడుకొనుచు వానిపైనే మనసు నిలిపి యుంచుట కన్నా ఆనందమేమి? శ్రీహరివైన నీ నామ సంకీర్తనతో దేహము, ఇంద్రియములను మరచి వానికి తనకు అభేదమైన "సోహం" అనే ఆనందము కలుగును. అంతకన్నా ఆనందమేమున్నది? నిన్ను జపించేవేళ లోకాలన్నీ నీలోనే ప్రకాశించును. శివునిచే నుతించబడిన చరిత్రగల రామా! ఇంతకన్నా ఆనందమేమున్నది?

- సద్గురువులు త్యాగరాజస్వామి

త్యాగరాజస్వామి సజ్జన సాంగత్యములో హరిసంకీర్తనను మించిన ఆనందమేమున్నదన్న అద్భుతమైన భావనను మనకు ఈ కీర్తన ద్వారా వ్యక్తపరచారు. నిరంతర నామస్మరణతో చక్కగా రాగయుక్తంగా ఆడుతూ పాడుతూ మనలను మనం మరచి ఆ హరివైభవాన్ని నుతించి అందులోనే రమించటమనేది ఒక సుకృతం. దానివలన దేహభావనలు తొలగి, మనలోని మలినాలు కఱగి, ఆ పరమాత్మ మనయందే యున్నాడన్న అద్వైత భావము ఎఱిగి సచ్చిదానందము కలుగుతుంది. అంతకన్నా కావలసినదేముంది? ఈ కీర్తనలో భక్తి, యోగము, సత్సంగము, నామ స్మరణ అనే కలియుగంలోని అద్భుత మోక్ష సాధనాలను ఉట్టకించారు త్యాగయ్య. సగుణోపాసనలో ఇవి అత్యంత కీలకమైనవి. బిలహరి రాగంలో అద్భుతమైన శక్తి ఉందని త్యాగరాజస్వామి చరిత్ర మనకు తెలుపుతుంది. మరణశయ్యపైనున్న వానిని బ్రతికించే శక్తి గలిగిన స్వరాలు ఈ రాగంలో ఉంది. ఆరోగ్యాన్ని కలిగించటానికి, మనసును ఉత్తేజపరచటానికి, ఆత్మోద్ధరణకు ఈ రాగం బహుప్రయోజనకరమని పరిశోధనలో తేలింది. సాహిత్యంలోని భావానికి తగిన రాగంలో స్వరపరచారు కాబట్టే త్యాగయ్య మహావాగ్గేయకారునిగా, నాదయోగిగా శాశ్వతంగా నిలిచిపోయారు.

వినాయకుని వలెను బ్రోవవే - త్యాగరాజస్వామి కృతి

  వినాయకుని వలెను బ్రోవవే నిను వినా వేల్పులెవరమ్మా అనాథరక్షకి శ్రీకామాక్షి సుజనాఘమోచని శంకరి జనని నరాధములకును వరాలొసగనుండరాములై భూసురాది దేవ...