23, జులై 2020, గురువారం

గురు పరంపర ఎందుకు ముఖ్యం?


హిందుత్వం పేరుతో నేడు జరుగుతున్న కొన్ని అరాచకాలకు, అమలులో ఉన్న విపరీత సాంప్రదాయాలకు, వామాచారాలకు కారణం వాటిని ప్రచారం చేసే గురువులకు సరైన గురు పరంపర లేకపోవటం. ఉన్నట్టుండి ఒక వ్యక్తి బాబాగా మారి, తనను తానే గురువుగా ప్రకటించుకొని ఓ సంస్థ ఏర్పాటు చేసేసుకుంటున్న ఉదంతాలు గత 10-15 ఏళ్లలో చాలా ఎక్కువయ్యాయి. బలహీనతల వల్లో, లేక వారి అవసరాలను బట్టో ప్రజలు వీరి బారిన పడి తీవ్రంగా నష్టపోతున్నారు. ఇలాంటి వారి వల్ల హైందవానికి తీవ్ర అప్రతిష్ఠ కలిగి, ఈ ధర్మం గురించి ఘోరమైన దుష్ప్రచారం జరుగుతోంది. ఈ సమస్యను అరికట్టడానికి మనం గురు పరంపరను పరిశీలించటం చాలా ముఖ్యం. ఒకరు తనను తాను గురువుగా చెప్పుకుంటూ మనకు తారసపడితే మన విచక్షణ ఉపయోగించి, వారి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకున్న తరువాతే వారిని విశ్వసించాలి. ఎందుకు ఈ గురు పరంపర ముఖ్యం?

1. అర్హత
------------

గురువుగా, ఒక సంస్థ (అనగా పీఠం లేదా మఠం) అధిపతిగా స్వయం ప్రకటితం చేసుకోవటం అనేది ఎప్పుడూ సరైన పద్ధతి కాదు. ఒక గురువు శిష్యుని వెదుక్కుంటూ వచ్చి, శిష్యునికి కావలసిన లక్షణాలను మరింత నిశితంగా పరిశీలించి, ఉత్తరాధికారం ఇవ్వటమే సరైన పద్ధతి. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలో ఇలా జరగకపోయినా, బహుళ జనామోద యోగ్యమైన వారే గురువులుగా రాణించగలరు. ఇలా జరిగినప్పుడు వారిని అనుసరించే వారు ఆ గురువుల అర్హతలను మరింత దగ్గరగా గమనించి తీరాలి.

2. సిద్ధాంతాలకు మూలాలు
------------------------------------

ఒక మంచి పరంపర కలిగిన గురుతత్త్వంలో బలమైన సిద్ధాంతాలుంటాయి. ఆ సిద్ధాంతాలు కాలపరీక్షను తట్టుకుని ఒక తరం నుండి మరొక తరానికి బదిలీ చేయబడతాయి. దీనివల్ల ఆ సిద్ధాంతాలకు బలం చేకూరుతుంది. ఏ సిద్ధాంతమైనా ఒక రెండు తరాలన్నా నిలిచి లక్షలాది ప్రజల జీవితాలను మంచి వైపు నడిపిస్తేనే సఫలమైనట్లు. లేకపోతే అది గాలివాటం సిద్ధాంతమనే అనుకోవచ్చు. ఒక తరంలో గురువు కొత్త సిద్ధాంతాలు లేదా మార్గాలను ప్రతిపాదిస్తే, వాటిని గురు పరంపరలో చర్చించి, ఆమోదింపజేసుకుని కార్యాచరణ చేస్తారు కాబట్టి వికృతము, ఆగమ విరుద్ధము, ధర్మ విరుద్ధము, సమాజ విరుద్ధము, చట్ట విరుద్ధమైన సిద్ధాంతాలు పుట్టుకు వచ్చే అవకాశం ఉండదు.

3. అభ్యాసం
---------------

ఒక గురువు వద్ద శిష్యుడు శిక్షణ పొందేవి అనేకాలు - 1. అనాదిగా చెప్పబడిన శ్రుతి స్మృతి శాస్త్ర పురాణాలు 2. గురువుల అనుభవాలు, జీవిత విశేషాలు 3. ఆ సంస్థ యొక్క నియమావళి 4. ఆ సంస్థకు సంబంధించిన దేవతా స్వరూపం యొక్క అర్చనా విధులు 5. ఆ సంస్థ ద్వారా ఆధ్యాత్మిక ప్రచారం జరిపే వ్యవస్థ వివరాలు. ఇవే కాక, మరెన్నో. ఈ అభ్యాసం వల్ల ఆ శిష్యుని వ్యక్తిత్వం కావలసిన మార్పులు చేర్పులు జరిగి వ్యక్తిత్వ వికాసం పొంది, ఉత్తరాధికారానికి సిద్ధుడవుతాడు.

4. సమాజం అమోదం
---------------------------

సమాజం (అనగా పాలకులు, ప్రజల సమూహం) మతంలోని సంస్థలను, వ్యక్తులను, వాటి అధిపతులను చాలా నిశితంగా పరిశీలిస్తుంది. అనగా, మంచి, చెడు, వారి వైశిష్ట్యం, నిబద్ధత, మహత్తు, మార్గంలో విలక్షణత మరియు ఇతర సంస్థాగత విషయాలను సమాజం పరిశీలించి, విమర్శించి, పరీక్షిస్తుంది. ఈ పరీక్షలో నెగ్గిన సంస్థ/గురు పరంపరలే నాలుగు కాలాలపాటు ఆధ్యాత్మికగా మార్గదర్శకులు కాగలరు.

5. ఆరోగ్యకరమైన అభివృద్ధి
------------------------------------

ఒక గురు పరంపరలో వచ్చిన వ్యక్తుల ద్వారా ఏర్పడిన సంస్థలు కాలపరీక్ష తట్టుకుని, ప్రజల ఆమోదం పొంది, అనేకుల జీవితాలను ప్రభావితం చేయటానికి ఒక జీవితకాలం పడుతుంది. అప్పుడే అది ఆరోగ్యకరమైన పురోగతి అవుతుంది. రాత్రికి రాత్రి వెలసి, కొద్ది కాలంలోనే బాగా విస్తరించి, డబ్బు, ఆస్తులను కూడబెట్టింది అంటే దాని వెనుక అధార్మికమైన చర్యలు తప్పకుండా ఉండి తీరుతాయి. ఇటువంటి అభివృద్ధి సంస్థకు, సమాజానికి మంచిది కాదు. సహజ పరిణామంలో ఎదిగితేనే ఆ సంస్థ, గురుబోధలు కలకాలం నిలిచేది.

6. త్యాగాలు
---------------

ఒక పరంపరలో ఉన్నారంటే ఆ గురువులు అనేక త్యాగాలు చేసి, నిజమైన సన్న్యాసాశ్రమ ధర్మాన్ని నిర్వర్తించాలి. అప్పుడే ఆ పరంపరలో నిలదొక్కుగొనగలరు. సాంసారిక బంధనాలు, బంధుప్రీతి, రాగద్వేషాలు, కామక్రోధాది అరిషడ్వర్గాలు జయించటానికి గురు పరంపర, దాని నియమావళి ఎంతో దోహదపడతాయి. శమదమాది గుణములు, వైరాగ్యం, ఆత్మావలోకనం, ధర్మాధర్మ విచక్షణ ఈ త్యాగాల వల్ల కలుగుతాయి.

ఇవే కాక వేరెన్నో పరంపరలో అబ్బుతాయి. అందుకే మనం గురువులను ఎన్నుకునేటప్పుడు ప్రప్రథమ పరిశీలనాంశంగా పరంపరను తెలుసుకోవాలి. ఆధ్యాత్మికతలో నాయకత్వం అనగా గురుస్థానం కూడా దేశం లేదా మన వృత్తిలోని నాయకత్వం లాగానే కఠోరమైన పరిశ్రమ ద్వారానే సాధ్యమవుతుంది. అందుకే మనం నేటి వికృతాలను పోరాడటానికి ఈ దిశగా మరింత దృష్టి పెట్టాలి. గ్రుడ్డిగా నమ్మి మోసపోతున్న కొద్దీ ఈ దొంగ బాబాలు పుట్టగొడుగుల్లా పుడుతూనే ఉంటారు.

శ్రీగురుభ్యోనమః.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి