23, జులై 2020, గురువారం

కృతజ్ఞత ఎందుకు?


విశ్వమంతా (శాస్త్రము మరియు అధ్యాత్మికము రెండిటి ప్రకారము కూడా) శక్తి బదిలీ మీద నడుస్తుంది. ఈ శరీరము, విశ్వము మొత్తం సానుకూల ప్రతికూల శక్తుల మధ్య జరిగే సంతులన సంగ్రామమే. ఒక సంకల్పం నెరవేరాలంటే ఎంతో కొంత శక్తిని వెచ్చించాలి. ఆ సంకల్పం నెరవేరినప్పుడు మనం మనకు ఆ శక్తిని ఇచ్చిన మూలాన్ని(ఇతరులలో ఉన్న దైవత్వం లేదా స్వయంగా దైవానుగ్రహము) గుర్తించి, దానికి మనకు మధ్య గల సంబంధాన్ని గ్రహించి, ఆ సంబంధం వలన మనకు కలిగిన మేలును స్మరించుకొని ఆ దైవత్వాన్ని కొనియాడటం. ఒక్కసారి దీని గురించి కొంచెం లోతుగా ఆలోచించండి. కృతజ్ఞతా భావన వలన మనలోని దైవత్వాన్ని ఇతరుల లేదా స్వయంగా భగవంతునితో అనుసంధానం చేసి దానిని కొనియాడుతున్నాము. అంటే, మనలను మనము తెలుసుకొంటూ, దైవికతతో ఒక శాశ్వత సంబంధం ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది లేకపోతే?

కృతఘ్నత ఏమిటి?
--------------------------
రాక్షసులకు వరాలిచ్చేది దేవుడే. వారు చేసిన తపస్సు వలన (కఠోరమైన ధ్యానము చేసి ఒక దైవాన్ని ప్రార్థిస్తే ప్రపంచాలను గడగడలాడించే శక్తి విశ్వమునుండి తాపసి శరీరానికి బదిలీ అవుతుంది) ఆ దైవముతో ఒక అద్భుతమైన సంధానము కలిగి, ఆ దైవము ప్రకటితమవుతుంది. అనాదిగా వరములు పొంది రాక్షసులు చేసింది ఏమిటి? తాను పొందిన వరాలు తన శక్తి వలనే అని విర్రవీగి,వరములిచ్చిన దేవుని అపహాస్యము చేసి, దేవతలపై దాడి చేసి, సాత్వికులను హింసించి వికృత రూపం దాల్చి శాంతికి భంగం కలిగించటం. దైవత్వానికి ఆహారమైన యజ్ఞయాగాదులకు విఘ్నం కలిగించటం. కాబట్టి కృతఘ్నత లోకములో అశాంతికి మూల కారణం. మానవ లోకములో దీనికి స్వార్థము, అహంకారము అనే రెండు ముఖాలు లేదా ప్రధాన లక్షణాలున్నాయి.

ఈ రాక్షస లక్షణం కలియుగంలోని మానవులలో చాలా ఎక్కువగా కనిపిస్తోంది. కన్న తల్లిదంద్రులనే మరచి వారిని హింసించి అగౌరవపరచి అనాథలను చేస్తున్న పిల్లలు ఎందరో! విద్యను చెప్పే గురువును అవమానించి అవహేళన చేసి వారి భుజాలపై ఎక్కి గుండెలపై తన్నే చందంలో ప్రవర్తిస్తున్న శిష్యులెందరో! సాయం చేసిన వాడి సాయాన్ని, ఆ మనిషిని మరచి, అంతా నా వల్లే అని విర్రవీగుతున్న వారెందరో! మొక్కులు మొక్కి వాటిని మరచే స్వార్థపరులెందరో! మానవాతీతమైన శక్తిని అపహాస్యం చేస్తున్న నాస్తికులెందరో! దైవ దూషణ చేస్తున్న పాపులెందరో! తల్లి వంటి భూదేవిని మలినపరచే ప్రబుద్ధులెందరో! సస్యశ్యామలమైన ప్రకృతిని దుర్వినియోగం చేసి తల్లిని రొమ్ములపై తన్నే నీచులు ఎందరో! ఇవన్నీ కృతఘ్నతా లక్షణాలే.

మరి కృతజ్ఞత యొక్క విశేషము ఏమిటి?
--------------------------------------------------

సానుకూల శక్తిని ప్రసరింప జేసే అద్భుతమైన సాధనం కృతజ్ఞత. మనం కృతజ్ఞతతో గడిపే ప్రతిక్షణము కూడా ఒక విద్యుత్తరంగమై దైవముతో ఒక సంబంధాన్ని ఏర్పరుస్తుంది. మనలను దైవత్వము వైపు అంత వేగంగా ముందుకు తీసుకు వెళుతుంది.

ఎవరి పట్ల కృతజ్ఞులమై ఉండాలి?
-------------------------------------------

తల్లి, తండ్రి, గురువు, దైవము,పెద్దలు, మనకు తోడ్పడిన వారు, మనకు తోడుగా నిలబడిన వారు, తోటి మానవులందరూ, పెంపుడు జంతువులు, ప్రకృతి ,పర్యావరణం... ఇంకా చెప్పాలంటే మొత్తం విశ్వం పట్ల.

ఏమిటి సాధనాలు కృతజ్ఞతకు?
----------------------------------------

ఉదయం లేవగానే మనకు కారణమైన మూలానికి నమస్కారము, అర్హత ఉన్నవారు సంధ్యావందనము (మీరు ఈ ప్రక్రియలో వదిలే అర్ఘ్యాలు, తర్పణాలు కృతజ్ఞత తెలుపుటకే), స్తోత్త్రము, సంకీర్తన, ప్రతిఫలాపేక్ష లేకుండా సహాయం చేయటం, ఉపకారం పొందిన మూలాన్ని ప్రస్తుతించటం, తాను సాధించిన విజయాలకు అందుకు తోడ్పడిన వారి పట్ల గౌరవభావంతో ఉండటం. సనాతన ధర్మంలోని వాఙ్మయమంతా కూడా కృతజ్ఞతను నిరంతరం మనకు గుర్తు చేసేవే. పరమాత్మ యొక్క అనంత అద్భుత అనుగ్రహము, గురువుల అనుగ్రహము వల్ల మానవునికి కలుగుతున్న ఆనందానికి ప్రతీకగా కృతజ్ఞతలు తెలుపుతూ ఋషిప్రోక్తమైన అనేక సూక్తాలు వెలువడ్డాయి, అలాగే శంకరుల వంటి అవతారమూర్తుల నోట అనేకమైన స్తుతులు వచ్చి మనకు ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తూ మనలను సరైన దిశలో నడిపిస్తున్నాయి.

కృతజ్ఞత లేకపోతే?
--------------------------

ఈ భావం లేకుండా మనం చేసే ఎటువంటి కర్మ అయినా సాఫల్యం పొందదు. అంతే కాకుండా, అశాంతి, అరిషడ్వర్గాలు పేట్రేగుతాయి. ఎక్కడో ఒక చోట అది సంతులనను తీసుకు రావటం కోసం మనిషికి గుణపాఠం చెప్పే పరిస్థితులను సృష్టిస్తుంది. దేవభూమిగా చెప్పబడిన ఉత్తరాఖండ్‌లో, దేవుని స్వభూమిగా చెప్పబడే కేరళలో మానవుడు చేసిన పర్యావారణ వినష్టానికి, అక్కడ దివ్యత్వానికి కలిగించిన విఘాతానికి ప్రకృతి కన్నెర్ర చేసి వేలాది మందిని పొట్టనబెట్టుకుంది మనలోని కృతఘ్నత వల్ల కలిగే నష్టాలను గుర్తు చేసేందుకే. రాక్షసత్వం మితిమీరితే, పరమాత్మ కఠిన చర్యలకు మనం గురి కాక తప్పదు.

సారాంశం
------------

కృతఘ్నతకు మూలకారణం విశ్వంలో సర్వాతీతమైన శక్తి ఒకటి ఉందని నమ్మక పోవటం, మనమే అత్యంత శక్తివంతులమని, వచ్చే ఫలితాలన్నీ మన గొప్పతనమేనని. ఒక్క వాక్యంలో చెప్పాలంటే - అహంకారం కమ్ముకొని దైవము యొక్క ఉనికినే ప్రశ్నించటం. కాబట్టి అహంకారం తొలగటానికి మొదటిమెట్టు కృతజ్ఞతతో కూడిన కార్యములు (పైన పేర్కొనబడినవి). ఈ నేను, నావల్లే అన్న అహంకారం తొలగితే మానవుడే దైవము. దేహమే దేవాలయము. విశ్వంలో శాంతికి, సౌభ్రాతృత్వానికి, మానవత పరిఢవిల్లటానికి కృతజ్ఞత అద్భుతమైన సాధనం. పైసా ఖర్చుపెట్టవలసిన పనిలేదు, మన పురోగతికి కారకాలైన వారి పట్ల కృతజ్ఞులమై ఉంటే చాలు, మానవాళి సర్వతోముఖాభివృద్ధికి మనం ఎంతో తోడ్పడిన వారమవుతాము.

శ్రీగురుభ్యోనమః.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి