17, జులై 2020, శుక్రవారం

ఇంతకన్నానందమేమి - త్యాగరాజస్వామి


ఇంతకన్నానందమేమి! ఓ రామ రామ!

సంతజనులకెల్ల సమ్మతి యుంటే గాని

ఆడుచు నాదమున పాడుచు ఎదుట రా
వేడుచు మనసున గూడియుండేది చాలు

శ్రీహరి కీర్తనచే దేహాది ఇంద్రియ స
మూహముల మరచి సోహమైనదే చాలు

నీ జపముల వేళనీ జగములు నీపై
రాజిల్లునయ్యా త్యాగరాజనుత చరిత్ర!

ఓ రామయ్యా! ఎల్లప్పుడూ హరికీర్తన చేయు హరిదాసులకిష్టమై యుండుటకన్నా ఆనందమేమున్నది? నాదానందముతో ఆడుచు పాడుచు నిను రమ్మని వేడుకొనుచు వానిపైనే మనసు నిలిపి యుంచుట కన్నా ఆనందమేమి? శ్రీహరివైన నీ నామ సంకీర్తనతో దేహము, ఇంద్రియములను మరచి వానికి తనకు అభేదమైన "సోహం" అనే ఆనందము కలుగును. అంతకన్నా ఆనందమేమున్నది? నిన్ను జపించేవేళ లోకాలన్నీ నీలోనే ప్రకాశించును. శివునిచే నుతించబడిన చరిత్రగల రామా! ఇంతకన్నా ఆనందమేమున్నది?

- సద్గురువులు త్యాగరాజస్వామి

త్యాగరాజస్వామి సజ్జన సాంగత్యములో హరిసంకీర్తనను మించిన ఆనందమేమున్నదన్న అద్భుతమైన భావనను మనకు ఈ కీర్తన ద్వారా వ్యక్తపరచారు. నిరంతర నామస్మరణతో చక్కగా రాగయుక్తంగా ఆడుతూ పాడుతూ మనలను మనం మరచి ఆ హరివైభవాన్ని నుతించి అందులోనే రమించటమనేది ఒక సుకృతం. దానివలన దేహభావనలు తొలగి, మనలోని మలినాలు కఱగి, ఆ పరమాత్మ మనయందే యున్నాడన్న అద్వైత భావము ఎఱిగి సచ్చిదానందము కలుగుతుంది. అంతకన్నా కావలసినదేముంది? ఈ కీర్తనలో భక్తి, యోగము, సత్సంగము, నామ స్మరణ అనే కలియుగంలోని అద్భుత మోక్ష సాధనాలను ఉట్టకించారు త్యాగయ్య. సగుణోపాసనలో ఇవి అత్యంత కీలకమైనవి. బిలహరి రాగంలో అద్భుతమైన శక్తి ఉందని త్యాగరాజస్వామి చరిత్ర మనకు తెలుపుతుంది. మరణశయ్యపైనున్న వానిని బ్రతికించే శక్తి గలిగిన స్వరాలు ఈ రాగంలో ఉంది. ఆరోగ్యాన్ని కలిగించటానికి, మనసును ఉత్తేజపరచటానికి, ఆత్మోద్ధరణకు ఈ రాగం బహుప్రయోజనకరమని పరిశోధనలో తేలింది. సాహిత్యంలోని భావానికి తగిన రాగంలో స్వరపరచారు కాబట్టే త్యాగయ్య మహావాగ్గేయకారునిగా, నాదయోగిగా శాశ్వతంగా నిలిచిపోయారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి