30, డిసెంబర్ 2010, గురువారం

లక్ష్మణాచార్య కృత నామ రామాయణం - తాత్పర్యము

రామ నామమే జీవనము, రాముని గుణ కీర్తనయే ముక్తి. రామాయణ పారాయణయే జీవిత సోపానము. అట్టి రామ నామ సంకీర్తన ఎన్నో రూపాలలో జరిగింది. అందులో శ్రీ రామ జయ రామ జయ జయ రామ, శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే, శ్రీ రామ రామ రఘునందన రామ రామ ఇలా ఎన్నో మంత్రాలు, స్తోత్రాలు ప్రసిద్ధి చెందాయి. కోట్లాది భక్తులకు తారకమై ముక్తిని ప్రసాదించాయి. భక్తి, భజన, దాస సాంప్రదాయాలలో, హరికథలలో ఆ కోదండ రాముని నుతి పలు విధాలుగా జరిగింది, జరుగుతోంది. అటువంటి ఒక నామ గుణ కీర్తనే ఈ నామ రామాయణం. మొత్తం రామాయణాన్ని ప్రతి వాక్యంలో 'రామ' తారకం తో అంతమయ్యేలా రాసారు రచయిత  లక్ష్మణాచార్యులు. ఈయన గురించి వేరే వివరాలు అందుబాటులో కనిపించలేదు. కానీ, ఆయన చేసిన రచన మన అందరి మనస్సులో నిలిచిపోయింది. తేలిక పదాలతో పిల్లలు సైతము పాడుకునేలా రాసారు కవీంద్రులు. 108 నామములుగా మొత్తం రామాయణాన్ని వర్ణించి ధన్యులు అయినారు కవి వర్యులు.

దశాబ్దాల క్రితం ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు దీన్ని దివ్యగానం చేశారు. ఆమె గళంలో ఇది ఒక అమృత ధారలా, రామ రస ప్రవాహంలా సుందరంగా, సుమధురంగా సాగుతుంది. రాగమాలికలో భక్తి ప్రపత్తులతో, నివేదనా భావనతో సాగుతుంది ఈ స్తుతి.

నామ రామాయణం, తాత్పర్యము, శ్రవణం ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి గళంలో.




బాల కాండ

శుద్ధబ్రహ్మపరాత్పర రామ
కాలాత్మకపరమేశ్వర రామ
శేషతల్పసుఖనిద్రిత రామ
బ్రహ్మాద్యమరప్రార్థిత రామ
చండకిరణకులమండన రామ
శ్రీమద్దశరథనందన రామ
కౌసల్యాసుఖవర్ధన రామ
విశ్వామిత్రప్రియధన రామ
ఘోరతాటకాఘాతక రామ
మారీచాదినిపాతక రామ
కౌశికమఖసంరక్షక రామ
శ్రీమదహల్యోద్ధారక రామ
గౌతమమునిసంపూజిత రామ
సురమునివరగణసంస్తుత రామ
నావికధావికమృదుపద రామ
మిథిలాపురజనమోహక రామ
విదేహమానసరంజక రామ
త్ర్యంబకకార్ముఖభంజక రామ
సీతార్పితవరమాలిక రామ
కృతవైవాహికకౌతుక రామ
భార్గవదర్పవినాశక రామ
శ్రీమదయోధ్యాపాలక రామ

రామరామ జయరాజా రామ
రామరామ జయసీతా రామ

అయోధ్యాకాండ

అగణితగుణగణభూషిత రామ
అవనీతనయాకామిత రామ
రాకాచంద్రసమానన రామ
పితృవాక్యాశ్రితకానన రామ
ప్రియగుహవినివేదితపద రామ
తత్క్షాళితనిజమృదుపద రామ
భరద్వాజముఖానందక రామ
చిత్రకూటాద్రినికేతన రామ
దశరథసంతతచింతిత రామ
కైకేయీతనయార్పిత రామ
విరచితనిజపితృకర్మక రామ
భరతార్పితనిజపాదుక రామ

రామరామ జయరాజా రామ
రామరామ జయసీతా రామ

అరణ్యకాండ

దండకావనజనపావన రామ
దుష్టవిరాధవినాశన రామ
శరభంగసుతీక్ష్ణార్చిత రామ
అగస్త్యానుగ్రహవర్ధిత రామ
గృధ్రాధిపసంసేవిత రామ
పంచవటీతటసుస్థిత రామ
శూర్పణఖార్తివిధాయక రామ
ఖరదూషణముఖసూదక రామ
సీతాప్రియహరిణానుగ రామ
మారీచార్తికృతాశుగ రామ
వినష్టసీతాన్వేషక రామ
గృధ్రాధిపగతిదాయక రామ
శబరీదత్తఫలాశన రామ
కబంధబాహుచ్ఛేదన రామ

రామరామ జయరాజా రామ
రామరామ జయసీతా రామ

కిష్కింధాకాండ

హనుమత్సేవితనిజపద రామ
నతసుగ్రీవాభీష్టద రామ
గర్వితవాలిసంహారక రామ
వానరదూతప్రేషక రామ
హితకరలక్ష్మణసంయుత రామ

రామరామ జయరాజా రామ
రామరామ జయసీతా రామ

సుందరకాండ

కపివరసంతతసంస్మృత రామ
తద్గతివిఘ్నధ్వంసక రామ
సీతాప్రాణాధారక రామ
దుష్టదశాననదూషిత రామ
శిష్టహనూమద్భూషిత రామ
సీతావేదితకాకావన రామ
కృతచూడామణిదర్శన రామ
కపివరవచనాశ్వాసిత రామ

రామరామ జయరాజా రామ
రామరామ జయసీతా రామ

యుద్ధకాండ

రావణనిధనప్రస్థిత రామ
వానరసైన్యసమావృత రామ
శోషితశరదీశార్తిత రామ
విభీష్ణాభయదాయక రామ
పర్వతసేతునిబంధక రామ
కుమ్భకర్ణశిరచ్ఛేదన రామ
రాక్షససంఘవిమర్ధక రామ
అహిమహిరావణచారణ రామ
సంహృతదశముఖరావణ రామ
విధిభవముఖసురసంస్తుత రామ
ఖఃస్థితదశరథవీక్షిత రామ
సీతాదర్శనమోదిత రామ
అభిషిక్తవిభీషణనుత రామ
పుష్పకయానారోహణ రామ
భరద్వాజాదినిషేవణ రామ
భరతప్రాణప్రియకర రామ
సాకేతపురీభూషణ రామ
సకలస్వీయసమానస రామ
రత్నలసత్పీఠాస్థిత రామ
పట్టాభిషేకాలంకృత రామ
పార్థివకులసమ్మానిత రామ
విభీషణార్పితరంగక రామ
కీశకులానుగ్రహకర రామ
సకలజీవసంరక్షక రామ
సమస్తలోకోద్ధారక రామ

రామరామ జయరాజా రామ
రామరామ జయసీతా రామ

ఉత్తరకాండ

ఆగత మునిగణ సంస్తుత రామ
విశ్రుతదశకంఠోద్భవ రామ
సీతాలింగననిర్వృత రామ
నీతిసురక్షితజనపద రామ
విపినత్యాజితజనకజ రామ
కారితలవణాసురవధ రామ
స్వర్గతచంబుక సంస్తుత రామ
స్వతనయకుశలవనందిత రామ
అశ్వమేధక్రతుదిక్షిత రామ
కాలావేదితసురపద రామ
ఆయోధ్యకజనముక్తిత రామ
విధిముఖవిభుదానందక రామ
తేజోమయనిజరూపక రామ
సంసృతిబంధవిమోచక రామ
ధర్మస్థాపనతత్పర రామ
భక్తిపరాయణముక్తిద రామ
సర్వచరాచరపాలక రామ
సర్వభవామయవారక రామ
వైకుంఠాలయసంస్థిత రామ
నిత్యానందపదస్థిత రామ

రామరామ జయరాజా రామ
రామరామ జయసీతా రామ


తాత్పర్యము:

బాల కాండ:

శ్రీరామా! - నీవు దైవ తత్త్వమైన పరబ్రహ్మవు  ,  కాలానికి ఆత్మ యైన పరమేశ్వరుడవు, శేషతల్పముపై నిద్రించే వాడవు, బ్రహ్మ మొదలగు దేవతలచే ప్రార్ధించ బడిన వాడవు, సూర్య వంశ యశస్సును ఇనుమడింప చేసిన వాడవు, దశరథుని ప్రియ పుత్రుడవు, కౌసల్య సుఖాన్ని పెంపొందించిన వాడవు, విశ్వామిత్రునికి ఇష్టుడవు, తాటకిని సంహరించిన వాడవు మారీచుని పారద్రోలిన వాడవు, విశ్వామిత్రుని యాగాన్ని కాపాడి ఆయన గౌరవాన్ని నిలబెట్టిన వాడవు, అహల్యను ఉద్ధరించి తిరిగి రూపాన్ని ఇచ్చిన వాడవు, గౌతమ మునిచే పూజించ బడిన వాడవు, దేవతలచే, మునులచే వరములు పొందిన వాడవు నావికుని చే మృదువైన పాదములు కడుగ బడిన వాడవు, మిథిలాపుర జనులను సమ్మోహ పరచి, జనకుని మనసుని రంజిల్ల చేసిన వాడవు, శివుని విల్లు విరచి, సీతచే వరమాలను పొంది వివాహమాడిన వాడవు, పరశురాముని గర్వము నాశనము చేసినవాడవు, అయోధ్యను పాలించిన వాడవు.

సీతారామునకు, రాజా రామునకు జయము జయము.

అయోధ్య కాండ:

ఓ శ్రీరామా! నీవు ఎన్నలేని సుగుణముల సమూహముతో శోభిల్లే వాడవు, భూమి పుత్రిక అయిన సీతచే ప్రేమించ బడిన వాడవు, చంద్రునివంటి ముఖము కలవాడవు, . పితృవాక్య పరిపాలనకి అడవులకు వెళ్లినా వాడవు, గుహునిచే ఆహ్వానించ బడి, పాదముల కడిగి పూజించబడిన వాడవు, భరద్వాజ మునికి ఆనందము కలిగించిన వాడవు, చిత్రకూటముపై నివసించిన వాడవు, దశరథునిచే ఎల్లప్పుడూ తలచబడిన వాడవు, భరతునిచే రాజ్యము సమర్పించబడిన వాడవు, దశరథునికి పితృ కర్మలు చేసిన వాడవు, భరతునికి పాదుకలు ఇచ్చిన వాడవు.

సీతారామునకు, రాజా రామునకు జయము జయము.

అరణ్యకాండ:

ఓ శ్రీరామా! నీవు దండకారణ్యంలోని జనులను పావనము చేసిన వాడవు, దుష్టుడైన విరాధుని చంపిన వాడవు, శరభంగుడు, సుతీక్ష్ణులచే పూజించ బడినవాడవు, అగస్త్యుని అనుగ్రహముతో వర్ధిల్లిన వాడవు, జటాయువుచే సేవించ బడినవాడవు, పంచవటీ తీరమున నివసించిన వాడవు, శూర్ఫణకకు దుఃఖము కలిగించిన వాడవు, ఖరఆ దూషణులను సంహరించిన వాడవు, సీత కోరిన మాయలేడిని అనుసరించిన వాడవు, మారీచుని సంహరించిన వాడవు, సీతను వెదకుతూ వెళ్ళిన వాడవు, జటాయువుకు మోక్షము కలిగించిన వాడవు, శబరి ఇచ్చిన ఫలములు తిన్న వాడవు, కబంధుని బాహువులు నరికిన వాడవు.

సీతారామునకు, రాజా రామునకు జయము జయము.

కిష్కింధకాండ:

ఓ శ్రీరామ! నీవు - హనుమంతునిచే పాదసేవ పొందిన వాడవు, సుగ్రీవుని కోరిక తీర్చిన వాడవు, గర్వి అయిన వాలిన సంహరించిన వాడవు, వానరులను దూతగా పంపిన వాడవు, హితుడైన లక్ష్మణునితో కూడి యున్నవాడవు.

సీతారామునకు, రాజా రామునకు జయము జయము.

సుందరకాండ:

ఓ శ్రీరామా! నీవు హనుమంతునిచే ఎల్లప్పుడూ తలచబడిన వాడవు, ఆతని మార్గమున అవరోధములను విధ్వంసము చేసిన వాడవు,  లంకలో ఉన్న సీత ప్రాణమునకు ఆధారమైన వాడవు, రావణునిచే దూషించ బడినవాడవు, సుజనుడైన హనుమంతునిచే భూషితుడవు,
సీతాదేవిచే హనుమంతునితో తనను కాకాసురుని బారినుండి కాపాడిన వానిగా పేర్కొనబడ్డావు, హనుమంతుని ద్వారా చూడామణిని చూపబడ్డావు, ఉత్తముడైన హనుమంతుని సందేశముతో, మాటలతో ఊరట చెందావు.

సీతారామునకు, రాజా రామునకు జయము జయము.

యుద్ధ కాండ: 

ఓ శ్రీరామా!  నీవు వానర సైన్యముతో కూడి రావణుని సంహరించ బయలుదేరితివి.  నీ క్రోధముతో ఎండిపోయిన సముద్రుని కాపాడినావు, విభీషణునికి అభయమిచ్చినావు, రాళ్ళతో వానరుల సహాయముతో సేతువును నిర్మించినావు. కుంభకర్ణుని సంహరించినావు. వేలాది రాక్షసులను అంతము చేసావు. అహిరావణ, మైరావణులచే పాతాళమునకు కొనిపోబడినావు, పదితలల రావణుని సంహరించినావు. బ్రహ్మ, శివులచే నుతించబడిన వాడవు,  ఆకాశమునుండి తండ్రియైన దశరథునిచే చూడబడిన వాడవు, సీత సంయోగముతో ఆనందించిన వాడవు, నీ చేత లంకాభిషిక్తుడైన విభీషణునిచే పొగడబడిన వాడవు, పుష్పకమును అధిరోహించిన వాడవు. భరద్వాజుడు మొదలగు వారిచే పూజించబడిన వాడవు, భరతునికి ప్రాణము వంటి వాడవు, అయోధ్యకు ఆభరణము వంటి వాడవు, అందరిచే గౌరవించబడిన వాడవు, రత్నములచే అలంకరించబడిన పీఠాన్ని అధిరోహించిన వాడవు, పట్టాభిషిక్తుడవై శోభిల్లినావు, సామంతరాజులచే గౌరవించ బడినవాడవు, విభీషణునిచే పూజించబడిన వాడవు (ఎరుపు వర్ణపు లేపనముతో), వానర సమూహాన్ని అనుగ్రహించిన వాడవు, అన్ని జీవులను కాపాడే వాడవు, అందరిని రక్షించే వాడవు.

సీతారామునకు, రాజా రామునకు జయము జయము.

ఉత్తరకాండము:

ఓ రామా!  నీవు చూడవచ్చిన మునులచే స్తుతించబడిన వాడవు, వారి నోట రావణుని కథ విన్న వాడవు. సీతాలింగనముతో ఆనందము పొందిన వాడవు, నీతితో జనులను రక్షినచిన వాడవు. ధర్మము పాటించుటకై సీతను అడవులకు పంపించిన వాడవు. లవణాసురుని వధను కూర్చిన వాడవు, స్వర్గగతుడైన శంబూకునిచే నుతించ బడిన వాడవు, సుతులైన లవ కుశులతో ఆనందము పొందిన వాడవు, అశ్వమేధ దీక్ష తీసుకున్న వాడవు. అవతార సమాప్తియైనదని దేవతలచే వర్తమానము పొందిన వాడవు, అయోధ్య ప్రజలకు ముక్తి ప్రసాదించిన వాడవు. బ్రహ్మాది దేవతలకు ఆనందము కలిగించిన వాడవు. తేజోమయ రూపము కలిగిన వాడవు. జనన మరణ బంధముల నుండి విముక్తి కలిగించే వాడవు. ధర్మ స్థాపనే ధ్యేయముగా కలవాడవు. భక్తి పరాయణులకు  మోక్షము కలిగించే వాడవు, సర్వ జీవులకు పాలకుడవు, సర్వ రోగములను పోగొట్టే వాడవు, వైకుంఠంలో నివసించే వాడవు, శాశ్వతమైన ఆనందము కలిగే పదములో ఉన్నవాడవు.

సీతారామునకు, రాజా రామునకు జయము జయము.

29, డిసెంబర్ 2010, బుధవారం

శ్రీమన్నారాయణీయం - చతుర్థ స్కంధము, తాత్పర్యము

శ్రీమన్నారాయణీయం - చతుర్థ స్కంధము




పదునారవ దశకము - నరనారాయణుల అవతారము

దక్షో విరించతనయోఽథ మనోస్తనూజాం
లబ్ధ్వా ప్రసూతిమిహ షోడశ చాప కన్యాః |
ధర్మే త్రయోదశ దదౌ పితృషు స్వధాం చ
స్వాహాం హవిర్భుజి సతీం గిరిశే త్వదంశే || ౧౬-౧||

దక్షుడు మనువుయొక్క పుత్రిక యగు ప్రసూతిని వివాహమాడెను. వారికి పదహారుగురు పుత్రికలు కలిగారు. వారిలో పదమూడు మందిని ధర్మునకు ఇచ్చి వివాహము చేసెను. పితృ దేవతలకు స్వధా అను కూతురును, అగ్నిదేవునకు స్వాహా అను కూతురును ఇచ్చెను. ఇట్లే,  విష్ణువు (నీ) అంశతో జన్మించిన శివునకు సతీదేవిని ఇచ్చి వివాహము చేసెను.

మూర్తిర్హి ధర్మగృహిణీ సుషువే భవంతం
నారాయణం నరసఖం మహితానుభావమ్ |
యజ్జన్మని ప్రముదితాః కృతతుర్యఘోషాః
పుష్పోత్కరాన్ప్రవవృషుర్నునువుః సురౌఘాః || ౧౬-౨||

దక్షప్రజాపతి పుత్రిక, దరమును భార్యయైన "మూర్తి"కి నీవు నారాయణుడు అనే పేరుతో గొప్ప మహిమలు కలవానిగా జన్మించినావు. అట్లే, నీ అంశతో నరుడు అనువాడు జన్మించగా నీరు అన్యోన్య స్నేహముతో పెరిగితిరి. ప్రభూ! నీవు జన్మించు ఆ శుభ సమయమున దేవతలు సంతోషమును పట్టలేక దుందుభి మొదలైన మంగళ వాద్యములను మ్రోగించుచు పుష్పవ్రుష్టిని కురిపించి, నిన్ను స్తుతించిరి.

దైత్యం సహస్రకవచం కవచైః పరీతం
సాహస్రవత్సరతపస్సమరాభిలవ్యైః |
పర్యాయనీర్మితతపస్సమరౌ భవంతౌ
శిష్టైకకంకటమముం న్యహతాం సలీలమ్ || ౧౬-౩||

ఆ కాలమున సహస్ర కవచుడను రాక్షసుడు ఉండెను. అతనికి వేయి కవచములుండెను. అవి ఒక్కొక్కటి వేయి సంవత్సరములు తపస్సు చేసి, వేయి సంవత్సరములు యుద్ధము చేసినందు వలననే ఛేదించుటకు వీలయ్యేవి. మంచి వారిని బాధించుచున్న ఆ రాక్షసుని నర నారాయణులు మీరు ఒకరి తరువాత ఒకరు వేయి సంవత్సరములు తపస్సు, వేయి సంవత్సరములు యుద్ధము చేయుచు అతని కవచములను ఛేదించిరి. అటు పిమ్మట అతని వధించితిరి.

అన్వాచరన్నుపదిశన్నపి మోక్షధర్మం
త్వం భ్రాతృమాన్ బదరికాశ్రమమధ్యవాత్సీః |
శక్రోఽథ తే శమతపోబలనిస్సహాత్మా
దివ్యాంగనాపరివృతం ప్రజిఘాయ మారమ్ || ౧౬-౪||

స్వామీ! నరనారాయణ అవతారముననున్న మీరు బదరికాశ్రమమున ఉండి మోక్ష ధర్మమైన నివృత్తి మార్గమును స్వయంగా పాటించుచు అక్కడ ఉన్న మహర్షులకు దానిని ఉపదేశించుచుంటిరి. అప్పుడు మీ శమము, తపోబలము చూచి ఇంద్రునకు భయము కలిగినది. అందువలన మీ తపస్సునకు విఘ్నము కలిగించ వలెనని అతడు దివ్యాంగనలతో మన్మథుని పంపెను.

కామో వసంతమలయానిలబంధుశాలీ
కాంతాకటాక్షవిశిఖైర్వికసద్విలాసైః |
విధ్యన్ముహుర్ముహురకంపముదీక్ష్య చ త్వాం
భీతస్త్వయాథ జగదే మృదుహాసభాజా || ౧౬-౫||

అప్పుడు వసంతుడు, మలయానిలము వంటి స్నేహితులతో కలసి మన్మథుడు మిక్కిలి విలాసము కల అప్సరస స్త్రీల యొక్క కతాక్షములచే మీ తపస్సును భంగ పరచుటకు ప్రయత్నించెను. అయినా, మీరు స్థిరముగా ఉండుట చూచి మన్మథునకు భయము వేసినది. అప్పుడు మీరు చిరునవ్వుతో ఇట్లు పలికితిరి.

భీత్యాలమంగజవసంతసురాంగనా వో
మన్మానసంత్విహ జుషుధ్వమితి బ్రువాణః |
త్వం విస్మయేన పరితః స్తువతామథైషాం
ప్రాదర్శయః స్వపరిచారకకాతరాక్షీః || ౧౬-౬||

"మన్మథా! వసంతుడా! అప్సరసలారా! మీరు భయ పడవద్దు. నేనిచ్చే అతిథి సత్కారములు స్వీకరించండి" అని అనగా వారు ఆశ్చర్యముతో స్తుతించుచుండిరి. అట్టి మన్మథుడు మొదలైన వారికి మిమ్ము సేవిన్చుచున్న పరిచారికలను మీరు చూపించితిరి.

సమ్మోహనాయ మిలితా మదనాదయస్తే
త్వద్దాసికాపరిమళైః కిల మోహమాపుః |
దత్తాం త్వయా చ జగృహుస్త్రపయైవ సర్వ-
స్వర్వాసిగర్వశమనీం పునరుర్వశీం తామ్ || ౧౬-౭||

మన్మథుడు మొదలైన వారు నీ దాసీ జనము యొక్క సౌందర్యమును చూసి మోహ పరవశులైరి. స్వర్గములో అందరి సుందరీమణుల గర్వమును పోగొట్టు సౌందర్యము కల ఊర్వశిని కానుకగా వారికి ఒసగగా మన్మథుడు మొదలైన వారు ఊర్వశిని చూసి సిగ్గుపడి ఆమెను స్వీకరించిరి.

దృష్ట్వోర్వశీం త్వం కథాం చ నిశమ్య శక్రః
పర్యాకులోఽజని భవన్మహిమావమర్శాత్ |
ఏవం ప్రశాంతరమణీయతరాఽవతారత్
త్వత్తోఽధికో వరద కృష్ణతనుస్త్వమేవ || ౧౬-౮||

మన్మథుడు మొదలైన వారు ఊర్వశిని దేవేంద్రునకు అర్పించి, మీ మహిమను తెలుపగా, తాను చేసిన తప్పుకు అతడు చాలా విచారించెను. వరములనిచ్చు స్వామీ! సౌమ్యము, సుందరమైన ఈ నర నారాయణ అవతారము కంటే మిగుల కృష్ణ స్వరూపము నీదే.

దక్షస్తు ధాతురతిలాలనయా రజోఽంధో
నాత్యాదృతస్త్వయి చ కష్టమశాంతిరాసీత్ |
యేన వ్యరుంధ స భవత్తనుమేవ శర్వం
యజ్ఞో చ వైరపిశునే స్వసుతాం వ్యమానీత్ || ౧౬-౯||

బ్రహ్మ తన పుత్రుడైన దక్షుని మిక్కిలి ప్రేమతో లాలించినందు వలన అతడు గర్వాంధుడయ్యెను. అందువలన అతడు బ్రహ్మ దేవుని మరియు మిమ్ములను గౌరవించకుండెను. దక్షుడు మీ అంశారూపియైన శంకరుని ద్వేషించ సాగెను. అతనితో గల వైరముతో తన యాగమున తన కూతురైన సతీదేవిని కూడా అవమాన పరచెను.

కృద్ధేశమర్దితమఖః స తు కృత్తశీర్షో
దేవప్రసాదితహరాదథ లబ్ధజీవః |
త్వత్పూరితక్రతువరః పునరాప శాంతిం
స త్వం ప్రశాంతికర పాహి మరుత్పురేశ || ౧౬-౧౦||

అందువలన శంకరుడు కోపించి దక్షుని యాగమును ధ్వంసించెను. అతని శిరస్సును కూడా ఖండించెను. అప్పుడు దేవతలు శంకరుని వేడుకొనగా దక్షుడు బ్రతికెను. ఆ యజ్ఞము సంపూర్ణము అయినందు వలన దక్షుడు శాంతించెను.  ఇట్లు శాంతిని కలిగించు గురువాయురప్పా! నీవే నన్ను రక్షించవలెను.

పదునేడవ దశకము - ధృవ చరితము

ఉత్తానపాదనృపతేర్మనునందనస్య
జాయా బభూవ సురుచిర్నితరామభీష్టా |
అన్యా సునీతిరితి భర్తురనాదృతా సా
త్వామేవ నిత్యమగతిః శరణం గతాఽభూత్ || ౧౭-౧||

మనువునకు ఉత్తానపాదుడనే పుత్రుడు ఉండెను. అతనికి సునీతి, సురుచియను భార్యలు. వారిలో చిన్న భార్య యైన సురుచిపై మహారాజుకు అమితమైన ప్రేమ. పెద్ద భార్యను అతడు నిరాదరించ సాగెను. అప్పుడు నిస్సహాయురాలైన ఆమె నిన్నే శరణు పొంది ప్రతిదినము ఆరాధించసాగినది.

అంకే పితుః సురుచిపుత్రకముత్తమం తం
దృష్ట్వా ధ్రువః కిల సునీతిసుతోఽధిరోక్ష్యన్ |
ఆచిక్షిపే కిల శిశుః సుతరాం సురుచ్యా
దుస్సంత్యజా ఖలు భవద్విముఖైరసూయా || ౧౭-౨||

ఒకనాడు సురుచి పుత్రుడైన ఉత్తముడు తండ్రియైన ఉత్తానపాదుని ఒడిలో కూర్చుని ఆడుకొనుచుండెను. అప్పుడు సునీతి కొడుకైన ధ్రువుడు కూడా తండ్రి ఒడిలో కూర్చొన బోయెను. దానిని చూచి సురుచి బాలుడైన ధ్రువుని అధిక్షేపించుచు అతనిని నివారించెను. స్వామీ! నీపై భక్తిలేని వారికి అసూయ ఉండుట సహజము కదా!.

త్వన్మోహితే పితరి పశ్యతి దారవశ్యే
దూరం దురుక్తినిహతః స గతో నిజాంబామ్ |
సాఽపి స్వకర్మగతిసంతరణాయ పుంసాం
త్వత్పాదమేవ శరణం శిశవే శశంస || ౧౭-౩||

ప్రభూ! తండ్రియైన ఉత్తానపాదుడు నీ మాయవల్ల మోహమున పడి చిన్న భార్యయైన సురుచికి ఆధీనుడుగా ఉండెను. అట్టి తన తండ్రి చూస్తుండగానే పినతల్లియైన సురుచి కఠినమైన మాటలు పలుకగా బాలుడైన  ధ్రువుని మనస్సు బాధపడినది. అందువలన అతడు బాధపడుచు తన తల్లి దగ్గరకు పోయెను. ఆమె అప్పుడు కర్మగతిని తప్పించుటకు కారణమైన నీ పాదములనే శరణు పొందుమని అతనికి  బోధించినది.

ఆకర్ణ్య సోఽపి భవదర్చనిశ్చితాత్మా
మానీ నిరేత్య నగరాత్కిల పంచవర్షః |
సందృష్టనారదనివేదితమంత్రమార్గః
త్వామారరాధ తపసా మధుకాననాంతే || ౧౭-౪||

ఆ బాలుడు తల్లిమాటలు విని నీ పాదారవిందములను సేవించవలెను అని నిశ్చయించుకొనెను. ఐదు సంవత్సరముల వయసు గల ఆ బాలుడు పట్టణము వదిలి పెట్టి పోవుచున్నంత నారద మహర్షి కనిపించి భగవంతుని సేవించుటకై ద్వాదశాక్షర మంత్రమును, ధ్యానించు పద్ధతిని బోధించెను. ధ్రువుడు అదే విధముగా మధువనమునకు పోయి కఠినమైన తపస్సుతో నిన్ను ఆరాధించ సాగెను.

తాతే విషణ్ణహృదయే నగరీం గతేన
శ్రీనారదేన పరిసాంత్వితచిత్తవృత్తౌ |
బాలస్త్వదర్పితమనాః క్రమవర్ధితేన
నిన్యే కఠోరతపసా కిల పంచ మాసాన్ || ౧౭-౫||

ధ్రువుడు దూరమగుట వలన ఉత్తానపాదుడు చాలా వ్యథ చెందెను. అప్పుడు నారదుడు వచ్చి ధ్రువునకు కలుగబోవు యోగమును చెప్పి అతని మనస్సును శాంతపరచెను. ఇక ధ్రువుడు పరమాత్మవైన నీ యందు మనస్సు నిలిపి తపస్సును క్రమక్రమముగా పెంచి ఐదు మాసములు గడిపెను.

తావత్తపోబలనిరుచ్ఛ్వసితే దిగంతే
దేవార్థితస్త్వముదయత్కరుణార్ద్రచేతాః |
త్వద్రూపచిద్రసనిలీనమతేః పురస్తా-
దావిర్బభూవిథ విభో గరుడాధిరూఢః || ౧౭-౬||

ధ్రువుని తపస్సుకు లోకములు తల్లడిల్లి పోయెను. అప్పుడు దేవతలందరూ నిను ప్రార్థించగా మిక్కిలి దయతో గరుత్మంతుని అధిరోహించి నీ స్వరూపమను చిదానంద రసమున నిమగ్నుడై యున్న ధ్రువునకు దర్శనమొసగితివి.

త్వద్దర్శనప్రమదభారతరంగితం తం
దృగ్భ్యాం నిమగ్నమివ రూపరసాయనే తే |
తుష్టూషమాణమవగమ్య కపోలదేశే
సంస్పృష్టవానసి దరేణ తథాఽఽదరేణ || ౧౭-౭||

ధ్రువునకు నీ దివ్యరూప దర్శనము కలుగగానే అతని మనస్సు ఆనందములో మునిగిపోయింది. కన్నులు సంతోష బాష్పములతో నిండి పోయినవి. ఆ విధముగా యున్న ధ్రువుడు నిన్ను స్తుతిన్చదలచినను అతనికి తగిన శక్తిలేనందు వలన నీవు ప్రేమతో నీ శంఖముతో అతని కపోలములపై స్ప్రుశించితివి.

తావద్విబోధవిమలం ప్రణువంతమేన-
మాభాషథాస్త్వమవగమ్య తదీయభావమ్ |
రాజ్యం చిరం సమనుభూయ భజస్వ భూయః
సర్వోత్తరం ధ్రువ పదం వినివృత్తిహీనమ్ || ౧౭-౮||

ప్రభూ! నీ శంఖము వేదమయము. అట్టి శంఖ స్పర్శ వలన ధ్రువునకు నిర్మలమైన జ్ఞానము కలిగినది. పరమాత్మవైన నిన్ను స్తుతించు శక్తి కూడా ప్రాప్తించినది. అందువలన ధ్రువుడు నిన్ను స్తుతి చేయుచున్నప్పుడు అతని భావమును ఎరిగి అతనితో 'ధృవా! నీవు చాలా కాలము రాజ్యమును ఏలిన తరువాత పునరావృత్తి రహితమై అత్యున్నతమైన ధ్రువ స్థానమున ఉందువు" అని పలికితివి.

ఇత్యూచిషి త్వయి గతే నృపనందనోఽసౌ-
ఆనందితాఖిలజనో నగరీముపేతః |
రేమే చిరం భవదనుగ్రహపూర్ణకామః
తాతే గతే చ వనమాదృతరాజ్యభారః || ౧౭-౯||

స్వామీ! ఈ విధముగా నీవు ధ్రువుని అనుగ్రహించి నీ లోకమును చేరుకొంటివి. ఈ విషయము తెలిసిన జనము సంతోషముతో ధ్రువుని అభినందించసాగిరి.ధ్రువుడు పట్టణము చేరిన తరువాత కొంత కాలమునకు అతని తండ్రియైన ఉత్తానపాదుడు అడవికి పోయెను. ధ్రువుడు నీ అనుగ్రహము వలన కోరికలు తీరి చాలా కాలము రాజ్యమేలెను.

యక్షేణ దేవ నిహతే పునరుత్తమేఽస్మిన్
యక్షైః స యుద్ధనిరతో విరతో మనూక్త్యా |
శాంత్యా ప్రసన్నహృదయాద్ధనదాదుపేతాత్
త్వద్భక్తిమేవ సుదృఢామవృణోన్మహాత్మా || ౧౭-౧౦||

పరమేశ్వరా! ఉత్తముని ఒక యక్షుడు చంపినందు వలన ధ్రువుడు యక్షులపై యుద్ధము ప్రకటించెను. కాని మనువు వచ్చి చెప్పినందు వలన అతడు యక్షులతో యుద్దమును మానివేసెను. అందువలన యక్షరాజైన కుబేరుడు సంతోషించి వరమీయబోగా నీ యందు దృఢమైన భక్తి మాత్రమే కావలెనని ధ్రువుడు వరమును కోరెను.

అంతే భవత్పురుషనీతవిమానయాతో
మాత్రా సమం ధ్రువపదే ముదితోఽయమాస్తే |
ఏవం స్వభృత్యజనపాలనలోలధీస్త్వం
వాతాలయాధిప నిరుంధి మమామయౌఘాన్ || ౧౭-౧౧||

ధ్రువుడు చాలా కాలము రాజ్యమును పాలించిన తరువాత నీయొక్క సేవకులు అతనిని ద్రువపదమునకు తీసికొని పోవుటకు విమానములో వచ్చిరి. అప్పుడా ధ్రువుడు తల్లితో కలిసి ద్రువపదమునకు పోయెను. ఈ విధముగా తన భక్తులను పరిపాలించు గురువాయుపుర పతీ! నాకున్న సమస్త రోగములను కృపతో దూరము చేయుము.

పదునెనిమిదవ దశకము - పృథు చరితము

జాతస్య ధ్రువకుల ఏవ తుంగకీర్తే-
రంగస్య వ్యజని సుతః స వేననామా |
తద్దోషవ్యథితమతిః స రాజవర్య-
స్త్వత్పాదే విహితమనా వనం గతోఽభూత్ || ౧౮-౧||

ధ్రువుని వంశమున అంగుడను మహారాజు జన్మించెను. అతడు చక్కగా రాజ్య పరిపాలనము చేసినందు వలన గొప్పకీర్తి పొందెను. ఆయనకు వేనుడను పుత్రుడు కలిగెను. దుర్మార్గుడైన తన పుత్రుడు చేయుచున్న అక్రమములను చూచి సహించలేక బాధపడుచు అంగ మహారాజు నిన్ను ధ్యానించుటకై  అడవికి పోయెను.

పాపోఽపి క్షితితలపాలనాయ వేనః
పౌరాద్యైరుపనిహితః కఠోరవీర్యః |
సర్వేభ్యో నిజబలమేవ సంప్రశంసన్
భూచక్రే తవ యజనాన్యయం న్యరౌత్సీత్ || ౧౮-౨||

వేనుడు మిక్కిలి దుర్మార్గుడు. అయినా, అతడు మిక్కిలి బలము కలవాడు అని పుర ప్రముఖులు అతనిని రాజ్యపాలనము చేయుటకు సమ్మతించి రాజ సింహాసనము కట్టబెట్టిరి. అందువలన వేనుడు ఎల్లప్పుడూ తన బలమును పొగడుకొనుచు భూమండలమున ఎవ్వరుకూడా యజ్ఞ యాగాదులు చేయరాదని శాసించెను.

సంప్రాప్తే హితకథనాయ తాపసౌఘే
మత్తోఽన్యో భువనపతిర్న కశ్చనేతి |
త్వన్నిందావచనపరో మునీశ్వరైస్తైః
శాపాగ్నౌ శలభదశామనాయి వేనః || ౧౮-౩||

అతనికి హితవు చెప్పుటకు మహర్షులు కలసి వచ్చిరి. కానీ, మూర్ఖుడైన రాజు 'నన్ను మించిన లోకాధిపతి ఎవరున్నారు' అని జగన్నాథుడవైన నిన్ను నిందింప సాగెను. నీ నిందను సహించ లేని మునీశ్వరులు కోపముతో శాపమీయగా ఆ శాపాగ్నికి వేనుడు శలభము వలె దగ్ధ మయ్యెను.

తన్నాశాత్ఖలజనభీరుకైర్మునీంద్రై-
స్తన్మాత్రా చిరపరిరక్షితే తదంగే |
త్యక్తాఘే పరిమథితాదథోరుదండాత్
దోర్దండే పరిమథితే త్వమావిరాసీః || ౧౮-౪||

వేనుడి మరణము వలన రాజు లేని ఆ దేశమున దుర్మార్గులు విచ్చలవిడిగా ప్రవర్తించుచుండగా మునులు భీతిల్లితిరి. వేనుని మృత శరీరమును ఆతని తల్లి ప్రేమాతిశయముతో రక్షంచ సాగెను. అప్పుడు మహర్షులు తిరిగి వచ్చి అతని ఊరువులను మథించగా అతని పాపము అంతా నశించెను. పిమ్మట అతని బాహువ్ను మథించగా దాని నుండి పరమాత్మవైన నీవు ఆవిర్భవించితివి.

విఖ్యాతః పృథురితి తాపసోపదిష్టైః
సూతాద్యైః పరిణుతభావిభూరివీర్యః |
వేనార్త్యా కబలితసంపదం ధరిత్రీం-
ఆక్రాంతాం నిజధనుషా సమామకార్షీః || ౧౮-౫||

పృథు మహారాజు అను పేరుతో ప్రసిద్ధి పొందిన నీవు మహర్షులు చెప్పినట్లుగా విని రాజ్యపాలన చేయసాగిటివి. అందువలన ప్రజలు, వండి మాగధులు నిన్ను ఘనముగా కీర్తిన్చిరి. వేనుని దుర్మార్గములకు భయపడి సంపదలను తనలో దాచుకొనిన భూమిని నీవు ధనుస్సు ధరించి శాసించి సుసంపన్నము చేసితివి.

భూయస్తాం నిజకులముఖ్యవత్సయుక్తైః
దేవాద్యైః సముచితచారుభాజనేషు |
అన్నాదీన్యభిలషితాని యాని తాని
స్వచ్ఛందం సురభితనూమదూదుహస్త్వమ్ || ౧౮-౬||

అప్పుడు భూమి ఆవుగా మారెను. దేవతలు మొదలైన వారు తమ తమ వర్గములకు చెందిన వారిని దూడలు చేయగా, సముచితమైన పాత్రల యందు అన్నము మొదలైన కోరిన వస్తువులను నీవు ఆ భూగోవునుండి పితికితివి.

ఆత్మానం యహతి మఖైస్త్వయి త్రిధామ-
న్నారబ్ధే శతతమవాజిమేధయాగే |
స్పర్ధాళుః శతమఖ ఏత్య నీచవేషో
హృత్వాఽశ్వం తవ తనయాత్ పరాజితోఽభూత్ || ౧౮-౭||

త్రివిక్రముడగు శ్రీ మహావిష్ణో! పృథువు రూపమున నీవు యజ్ఞములు చేయుచు నీ స్వరూపమునే ఆరాధించుచుంటివి. ఈ విధముగా ఆశ్వమేధములు నూరు చేయ తలపెట్టితివి.నీవు నూరవ అశ్వమేధము చేయుచున్నప్పుడు దేవేంద్రుడు అసూయతో నీచ వేషమున వచ్చి యాగాశ్వమును దొంగిలించెను. అప్పుడు నీ పుత్రుడు దేవేంద్రుని జయించి అశ్వమును తీసికొని వచ్చెను.

దేవేంద్రం ముహురితి వాజినం హరంతం
వహ్నౌ తం మునవరమండలే జుహూషౌ |
రుంధానే కమలభవే క్రతోః సమాప్తౌ
సాక్షాత్త్వం మధురిపుమైక్షథాః స్వయం స్వమ్ || ౧౮-౮||

పృథు మహారాజు యొక్క పుత్రుడు దేవేంద్రుని జయించి యజ్ఞాశ్వమును తీసికొని రాగా దేవేంద్రుడు మరల ఆ యజ్ఞాశ్వమును దొంగిలించుటకై ప్రయత్నించెను. అప్పుడు ఆ యజ్ఞమున రుత్విక్కులుగా ఉన్న భ్రుగు మహర్షి మొదలైన వారు దేవేంద్రుని ఆహుతి చేయుటకు ప్రయత్నించిరి. ఆ సమయములో బ్రహ్మ దేవుడు స్వయముగా వచ్చి రుత్విక్కులను వారించి యజ్ఞమును పూర్తి చేయించెను. మధుసూదనా! అంతట ఆ మహారాజునకు నీవు దర్శన మొసగితివి.

తద్దత్తం వరముపలభ్య భక్తిమేకాం
గంగాంతే విహితపదః కదాపి దేవ |
సత్రస్థం మునినివహం హితాని శంస-
న్నైక్షిష్ఠాః సనకముఖాన్ మునీన్ పురస్తాత్ || ౧౮-౯||

స్వామీ! పృథు మహారాజు నేఎ ద్వారా అనన్య భక్తియను వరమును మాత్రము తీసికొని గంగాతీరమున నివసించు చుండెను. ఒకానొకప్పుడు అక్కడ దీర్ఘకాలిక సమావేశమున పాల్గోనుచున్న మునులకు నీవు ప్రవ్రుత్తి నివృత్తి రూపములైన హిత వచనములను ఉపదేశించితివి. అచట సనకాది మునులను చూచితివి.

విజ్ఞానం సనకముఖోదితం దధానః
స్వాత్మానం స్వయమగమో వనాంతసేవీ |
తత్తాదృక్పృథువపురీశ సత్వరం మే
రోగౌఘం ప్రశమయ వాతగేహవాసిన్ || ౧౮-౧౦||

దేవా! పృథు మహారాజు రూపముననున్న నీవు సనకాది మునులు ఉపదేశించిన బ్రహ్మ జ్ఞానమును చక్కగా స్వీకరించితివి. పిమ్మట నీవు పుత్రులకు రాజ్యమును అప్పగించి వనములకు వెళ్లి తపస్సులో నిమగ్నుడవు అయితివి. తరువాత నీ స్వస్వరూపమును పొందితివి. అట్టి పవన పురాధీశా!  నా రోగములను దయతో రూపుమాపుము.

పందొమ్మిదవ శతకము - ప్రాచేతసుల కథ

పృథోస్తు నప్తా పృథుధర్మకర్మఠః ప్రాచీనబర్హిర్యువతౌ శతదృతౌ |
ప్రచేతసో నామ సుచేతసః సుతానజీజనత్త్వత్కరుణాంకురానివ || ౧౯-౧

ప్రభూ! పృథు మహారాజు యొక్క మునిమనుమడు ప్రాచీన బర్హి. అతడు గొప్పగా యజ్ఞ యాగాదులు నిర్వహించెను. అతని భార్య శతద్రుతి. ఆ దంపతులకు 'ప్రచేతసులు' అను కుమారులు కలిగిరి. వారందరూ జ్ఞాన సంపన్నులు. వారు నీ దయవలన అంకురించిన వారే.

పితుః సిసృక్షానిరతస్య శాసనాద్భవత్తపస్యాభిరతా దశాపి తే |
పయోనిధిం పశ్చిమమేత్య తత్తటే సరోవరం సందదృశుర్మనోహరమ్ || ౧౯-౨

స్వామీ! ఆ పదిమంది ప్రచేతసులును నిన్ను గూర్చి తపస్సు చేయుట యందే నిరతులు. ఐనను వంశాభివృద్ధికై ఆసక్తి చూపుతున్న తండ్రియోక్క ఆజ్ఞను అనుసరించి వారు తపస్సు ద్వారా నీ అనుగ్రహమును పొందుటకై పశ్చిమ సముద్ర తీరమునకు చేరిరి. అచట వారికి మనోహరమైన ఒక సరస్సు కనబడెను.


తదా భవత్తీర్థమిదం సమాగతో భవో భవత్సేవకదర్శనాదృతః |
ప్రకాశమాసాద్య పురః ప్రచేతసాముపాదిశద్భక్తతమస్తవస్తవమ్ || ౧౯-౩

ఒకనాడు నీ భక్తులందు మిక్కిలి ఉత్తముడైన శంకరుడు నీ భక్తులగు ప్రచేతసులను దర్శించుకొనవలెనను కోరికతో ఆ తీర్థమునకు వచ్చెను. ఆ శంకరుడు ప్రచేతసులకు కనిపించి మీ స్తోత్రమునొక దానిని వారికి ఉపదేశించెను.

స్తవం జపంతస్తమమీ జలాంతరే భవంతమాసేవిషతాయుతం సమాః |
భవత్సుఖాస్వాదరసాదమీష్వియాన్బభూవ కలో ధ్రువవన్న శీఘ్రతా || ౧౯-౪

ఆ ప్రాచేతసులందరూ శివుడు ఉపదేశించిన స్తవములను సరస్సులోనే అనేక వేల సంవత్సరములు జపించుచు నిన్ను ధ్యానింప సాగిరి. ఈ విధముగా ప్రచేతసులు బ్రహ్మానంద రసాస్వాదనము నందు మునిగి యుండిరి. ఉపాసనా ఫలితమును గురించి వారును ధ్రువుని వలె ఏ మాత్రమూ తొందర పడలేదు.

తపోభిరేషామతిమాత్రవర్ధిభిః స యజ్ఞహింసానిరతోఽపి పావితః |
పితాఽపి తేషాం గృహయాతనారదప్రదర్శితాత్మా భవదాత్మతాం యయౌ || ౧౯-౫

ప్రచేతసుల తండ్రియైన ప్రాచీనబర్హి అనేక యాగాములను చేసి ఆ యాగాములందు పశుహింస చేసినప్పతికిని తన పుత్రులు చేసిన గొప్ప తపస్సు వలన పవిత్రుడయ్యెను. ఆ ప్రాచీనబర్హి మహారాజు దగ్గరకు నారదుడు ఒకసారి వచ్చి ఆత్మ జ్ఞానమును బోధించెను. అందువలన ఆ మహారాజు సాయుజ్యమను ముక్తిని పొందెను.

కృపాబలేనైవ పురః ప్రచేతసాం ప్రకాశమాగాః పతగేంద్రవాహనః |
విరాజి చక్రాదివరాయుధాంశుభిః భుజాభిరష్టాభిరుదంచితద్యుతిః || ౧౯-౬

స్వామీ! నీవు నీ కృప వలననే ప్రచేతసులకు ప్రత్యక్షమైతివి. అప్పుడు నీ దివ్య స్వరూపమిట్లున్నది. నీవు పక్షీన్ద్రుడైన గరుడుని అధిరోహించి యున్నావు. శంఖము, చక్రము మొదలైన ఎనిమిది దివ్యాయుధములు ఎనిమిది భుజములందు ధరించితివి.

ప్రచేతసాం తావదయాచతామపిః త్వమేవ కారుణ్యభరాద్వారానదాః |
భవద్విచింతాఽపి శివాయదేహినాం భవత్వసౌ రుద్రనుతిశ్చ కామదా || ౧౯-౭

ఆ ప్రచేతసులు నిన్నెట్టి వరములు కొరకున్నను కరుణతో నీవే వారికి వరములనిచ్చితివి. స్వామీ! నీకు సేవ చేయక కేవలము ధ్యానించినను వారికి గొప్ప మేలు కలుగును. అట్లే శంకరుడు చెప్పిన రుద్రగీతికను స్తుతించిన వారికి కూడా కోరికలన్నీ తీరును.

అవాప్య కాంతాం తనయాం మహీరుహాం తయా రమధ్వం దశలక్షవత్సరీమ్ |
సుతోఽస్తు దక్షో నను తత్క్షణాచ్చ మాం ప్రయాస్యథేతి న్యగదో ముదైవ తాన్ || ౧౯-౮

"ప్రచేతసులారా! మీకు వృక్ష పుత్రికయైన 'మారిష' భార్య కాగలదు. ఆమెతో మీరు పది లక్షల సంవత్సరములు సుఖముగా ఉండ గలరు. మీకు దక్షుడను పుత్రుడు కలుగును. పుత్రజనమైన వెంటనే మీరు నా సాన్నిధ్యమును చేరుకుంటారు" -  అని సంతోషముతో వరములను ఇచ్చితివి.

తతశ్చ తే భూతలరోధినస్తరూన్కృధా దహంతో ద్రుహిణేన వారితాః |
ద్రుమైశ్చ దత్తాం తనయామవాప్య తాం త్వదుక్తకాలం సుఖినోఽభిరేమిరే || ౧౯-౯

ప్రచేతసులు నీ వలన దివ్యవరములను పొంది తపస్సు చాలించి సరస్సు నుండి బయటకు వచ్చిరి. అప్పుడు చెట్లు దట్టముగా పెరిగి మానవులు జంతువులూ తిరుగుటకు వీలులేకుండెను. అట్టి వృక్షములను చూచి ప్రచేతసులు కోపముతో తగుల బెట్ట సాగిరి. అప్పుడు బ్రహ్మ దేవుడు వారిని వారించెను. ఇట్లు తమకు మేలు చేసిన ప్రచేతసులకు వృక్షములు తాము పెంచిన మారిష అనే కన్యను ఇచ్చి వివాహము చేయగా వారు చాలా కాలము సుఖముగా నుండిరి.


అవాప్య దక్షం చ సుతం కృతాధ్వరాః ప్రచేతసో నారదలబ్ధయాధియా |
అవాపురానందపదం తథావిధస్త్వమీశ వాతాలయనాథ పాహిమామ్ || ౧౯-౧౦

వారికి దక్షుడను పుత్రుడు జన్మించెను. తరువాత వారు భగవంతుని గూర్చి అనేక యజ్ఞములు చేసిరి. అప్పుడు వారి దగ్గరకు నారద మహర్షి వచ్చి వారికి కూడా ఆధ్యాత్మిక జ్ఞానమును ఉపదేశించెను. ఆ జ్ఞానము వలన ప్రచేతసులందరూ పరమపదము పొందిరి. భక్తుల కోరికలను తీర్చు గురువాయురప్ప! శ్రీ కృష్ణా! నీ భక్తుడనైన నన్ను రక్షింపుము. 

27, డిసెంబర్ 2010, సోమవారం

రాఘవాష్టకం - తాత్పర్యము

తండ్రి మాటకై పదునాలుగేండ్లు వనవాసము చేసి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసిన మానవ అవతారమూర్తి శ్రీ రామ చంద్రుడు. ఏక పత్నీ వ్రతుడు, ధర్మ పరిపాలనా దక్షుడు, సోదర భావన మూర్తీభవించిన మంగళాకారుడు ఆ రామచంద్రుడు. ఈ రాఘవాష్టకం ఆ శ్రీరాముని గుణ కీర్తనలో ఒక మంచి భావ వ్యక్తీ కరణ. రచించిన కవి (ఎవరో తెలీదు) మంచి రసానుభూతి పొంది చేసిన కృతి.

రాఘవాష్టకం, తాత్పర్యము, శ్రవణం. 

(రచనలలో ఉపమానములు, అలంకారములు, విశేషణములు వాడేటప్పుడు మగవారిని సింహము, ఏనుగులతో పోల్చటం పరిపాటి. ఈ రెండు జంతువులూ ఉన్నతమైన లక్షణాలు కలిగి నేత్రుత్వానికి, పరాక్రమానికి ప్రతీకగా నిలిచాయి కాబట్టే ఇలా పోలిక. వెనుదిరుగని ధైర్యము, శౌర్యము సింహానిది అయితే, నాయకత్వము, నిలకడ, ప్రశాంతత, అవసరమైనప్పుడు భీకర పరాక్రమము ఏనుగు లక్షణాలు. సింహము ఒక్క ఏనుగుకు తప్ప దేనికి నిలువదు. అందుకే ఈ స్తోత్రములో కవి రఘు కుంజరం అని రాముని ఏనుగుతో ఉపమానము చేసినట్టున్నాడు).


రాఘవం కరుణాకరం మునిసేవితం సురవందితం
జానకీవదనారవిందదివాకరం గుణభాజనం
వాలిసూనుహితైషిణం హనుమత్ప్రియం కమలేక్షణం
యాతుధానభయంకరం ప్రణమామి రాఘవకుంజరం  ౧

మైథిలీకుచభూషణామలనీలమౌక్తికమీశ్వరం
రావణానుజపాలనం రఘుపుంగవం మమ దైవతం
నాగరీవనితాననాంబుజబోధనీయకలేవరం
సూర్యవంశవివర్ధనం ప్రణమామి రాఘవకుంజరం  ౨

హేమకుండలమండితామలకంఠదేశమరిందమం
శాతకుంభమయూరనేత్రవిభూషణేనవిభూషితం
చారునూపురహారకౌస్తుభకర్ణభూషణభూషితం
భానువంశవివర్ధనం ప్రణమామి రాఘవకుంజరం  ౩

దండకాఖ్యవనే రతామరసిద్ధయోగిగణాశ్రయం
శిష్టపాలనతత్పరం ధృతిశాలిపార్థకృతస్తుతిం
కుంభకర్ణభుజాభుజంగవికర్తనే సువిశారదం
లక్ష్మణానుజవత్సలం ప్రణమామి రాఘవకుంజరం  ౪

కేతకీకరవీరజాతిసుగంధిమాల్యసుశోభితం
శ్రీధరం మిథిలాత్మజాకుచకుంకుమారుణవక్షసం
దేవదేవమశేషభూతమనోహరం జగతాం పతిం
దాసభూతభయాపహం ప్రణమామి రాఘవకుంజరం  ౫

యాగదానసమాధిహోమజపాదికర్మకరైర్ద్విజైః
వేదపారగతైరహర్నిశమాదరేణ సుపూజితం
తాటకావధహేతుమంగతతాతవాలినిషూదనం
పైతృకోదితపాలకం ప్రణమామి రాఘవకుంజరం  ౬

లీలయా ఖరదూషణాదినిశాచరాశువినాశనం
రావణాన్తకమచ్యుతం హరియూథకోటిగణాశ్రయం
నీరజాననమంబుజాంఘ్రియుగం హరిం భువనాశ్రయం
దేవకార్యవివక్షణం ప్రణమామి రాఘవకుంజరం  ౭

కౌశికేన సుశిక్షితాస్త్రకలాపమాయతలోచనం
చారుహాసమనాథబంధుమశేషలోకనివాసినం
వాసవాదిసురారిరావణశాసనం చ పరాంగతిం
నీలమేఘనిభాకృతిం ప్రణమామి రాఘవకుంజరం  ౮

రాఘవాష్టకమిష్టసిద్ధిదమచ్యుతాశ్రయసాధకం
ముక్తిభుక్తిఫలప్రదం ధనధాన్యసిద్ధివివర్ధనం
రామచంద్రకృపాకటాక్షదమాదరేణ సదా జపేత్
రామచంద్రపదాంబుజద్వయసంతతార్పితమానసః  ౯

రామ రామ నమోఽస్తు తే జయ రామభద్ర నమోఽస్తు తే
రామచంద్ర నమోఽస్తు తే జయ రాఘవాయ నమోఽస్తు తే
దేవదేవ నమోఽస్తు తే జయ దేవరాజ నమోఽస్తు తే
వాసుదేవ నమోఽస్తు తే జయ వీరరాజ నమోఽస్తు తే  ౧౦

ఇతి శ్రీరాఘవాష్టకం సంపూర్ణమ్

తాత్పర్యము: 

రఘువంశములో ఉత్తముడు, కరుణాకరుడు, మునులచే,సురులచే  పూజించ బడిన వాడు,  సీత యొక్క కలువ ముఖమునకు సూర్యుని వంటి వాడు, ఎన్నో సుగుణములకు నిలయము, అంగదునికి హితుడు, హనుమంతునికి ప్రియుడు, కమలముల వంటి కన్నులు కలవాడు, రాక్షసుల పాలిట సింహ స్వప్నమైన, ఏనుగు వంటి ఉన్నతమైన లక్షణములు కల రామునికి నమస్కారములు.

సీతాదేవి కుఛములపై శాశ్వతమైన నీలపు ముత్యము వంటి ఈశ్వరుడు, విభీషణునికి రక్షకుడు, రఘువంశములో ఉత్తమ పురుషుడు, నా ఇష్టదైవము, అందమైన కలువ వంటి ముఖము కల నాగరిక స్త్రీ సౌందర్యాన్ని తలదన్నే రూపము కలవాడు, సూర్య వంశ వర్ధనుడు, ఏనుగు వంటి ఉన్నతమైన లక్షణములు కల రామునికి నమస్కారములు.

మెడకిరు వైపులా బంగారపు కర్ణ కుండలములచే అలంకరించ బడిన వాడు, బంగారు నెమలి కన్నుల ఆభరణము ధరించిన వాడు, అందమైన నూపురములు, మెడలో కౌస్తుభ హారము, అందమైన చెవి ఆభరణములు కలిగిన వాడు, సూర్య వంశ వర్ధనుడు, ఏనుగు వంటి ఉన్నతమైన లక్షణములు కల రామునికి నమస్కారములు.

దండకారణ్యములో అమరులైన సిద్ధులకు, యోగులకు ఆశ్రయము ఇచ్చిన వాడు, ధర్మ రక్షణే ఆశయముగా కలవాడు, పార్థునిచే పొగడబడిన వాడు, కుంభకర్ణుని సర్పముల వంటి చేతులను చేదించిన వాడు, లక్ష్మణుడు మొదలగు సోదరుల పట్ల ప్రేమ కలవాడు, ఏనుగు వంటి ఉన్నతమైన లక్షణములు కల రామునికి నమస్కారములు.

కేతకీ, కరవీర, జాతి సుగంధ పుష్పముల మాలతో శోభిల్లే వాడు, లక్ష్మిని కలిగిన వాడు, సీతాదేవి స్తనముల కుంకుమచే ఎరుపెక్కిన హృదయ భాగము (వక్ష స్థలము) కలవాడు, ఉత్తమోత్తముడు, అందరిని ఆకట్టుకునే వాడు, లోకేశ్వరుడు, భక్తుల భయము పోగొట్టే వాడు, ఏనుగు వంటి ఉన్నతమైన లక్షణములు కల రామునికి నమస్కారములు.

అగ్నిహోత్రము, దానము, ధ్యానము, ధూపము, జపము మొదలగు సేవల ద్వారా వేదార్థము తెలిసిన బ్రాహ్మణులచే అనన్యమైన భక్తితో కొలవబడిన వాడు, తాటకిని, వాలిని సంహరించిన వాడు, వారసత్వాన్ని కాపాడిన వాడు, ఏనుగువంటి ఉన్నతమైన లక్షణములు కల రామునికి నమస్కారములు.

ఖర దూషణులను అవలీలగా సంహరించిన వాడు, రావణుని సంహరించిన వాడు, నాశనము లేనివాడు, కోట్లాది వానర సమూహమునకు రక్షకుడు, కలువ వంటి ముఖము, పాద పద్మములు కలవాడు, హరి, లోకమునకు ఆశ్రయము, దేవతల కార్యము నెరవేర్చుటలో నిమగ్నుడు, ఏనుగు వంటి ఉన్నతమైన లక్షణములు కల రామునికి నమస్కారములు.

విశ్వామిత్రునిచే శస్త్రాస్త్రముల విద్య నేర్పబడిన వాడు, విశాలమైన నేత్రములు, అందమైన చిరునవ్వు కలవాడు, దీన బంధు, అన్నిలోకముల నివసించే వాడు, ఇంద్రుని, రావణుని శాసించే వాడు, ముక్తి మార్గము లో చిట్టచివరి గతి యైన వాడు, నీల మేఘ శ్యాముడు, ఏనుగు వంటి ఉన్నతమైన లక్షణములు కల రామునికి నమస్కారములు.

భక్తి, శ్రద్ధలతో, రాముని పాదపద్మముల స్మరణతో ఈ రాఘవాష్టకం పఠించిన వారికి ఇష్టదేవతా సిద్ధి, రాముని ఆశ్రయము, భుక్తి, ముక్తి, ధన ధాన్య సమృద్ధి కలుగును.

రామునికి, రామ భద్రునికి జయము జయము మరియు నమస్కారములు. దేవ దేవునికి, దేవ రాజునకు, వాసుదేవునకు, వీరాధివీరునకు జయము జయము మరియు నమస్కారములు.

శ్రీ శంకరభగవత్పాదకృత లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం - తాత్పర్యము

హఠకేశ్వరం అడవులు శ్రీశైల ప్రాంతంలో ఉన్నాయి. ఇవి కీకారణ్యములు. ఇక్కడ కాపాలికులు నివసించే వారుట. కాపాలికులు శ్మశానాలలో ఉంటూ ఆటవిక జంతు మానవ బలుల ద్వారా దేవతలకు ప్రీతి కలిగించే వారుట.  ఆది శంకరులు ఒకసారి ఇక్కడ తపస్సు చేస్తుండగా ఒక కాపాలికుడు వచ్చి శంకరులను ఆ పరమేశ్వరునికి బలిగా రమ్మని అడిగాడుట. అందుకు శంకరులు సమ్మతించి బలికి సిద్ధమయ్యారు. కాపాలికుడు శంకరుల తల నరుకబోగా విష్ణుమూర్తి నృసింహ రూపంలో ప్రత్యక్షమై కాపాలికుని సంహరించాడుట. ఆ సందర్భముగా ఆది శంకరులు ఆ నరహరిని స్తుతిస్తూ ఈ కరుణారస పూరితమైన, శరణాగతితో నిండిన లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని రచించారు.  (ఇది కంచి కామకోటి పీఠం వారి వెబ్ సైట్ ఆధారంగా చెప్పబడింది)

పిశాచ పీడా నివృత్తికి, భీతిని పోగొట్ట టానికి, మానసిక దౌర్బల్యము నుండి బయట పడటానికి ఈ స్తోత్రము అత్యంత ఫలప్రదమైనది, మహిమాన్విత మైనది. ఇందులో శంకరుల భక్తి, ఆర్తి,  పతాకము స్పష్టముగా గోచరిస్తాయి.  అద్భుతమైన పద ప్రయోగము, నిర్మలమైన భావము, పరమాత్మకు పూర్తి శరణాగతి ఈ స్తోత్ర ప్రాధాన్యము.

శంకరభగవత్పాదకృత లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం, తాత్పర్యము, ప్రతివాద భయంకర శ్రీనివాస్ (పీ.బీ. శ్రీనివాస్) గారు దీన్ని శ్రావ్యంగా ఆలపించారు.


శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే
       భోగీంద్రభోగరమణిరంజిత పుణ్యమూర్తే
యోగీశ శాశ్వత శరణ్యభవాబ్ధిపోత
       లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౧

బ్రహ్మేంద్రరుద్రమరుదర్కకిరీటకోటి
       సంఘట్టితాంఘ్రికమలామలకాంతికాంత
లక్ష్మీలసత్కుచసరోరుహరాజహంస
       లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౨

సంసారఘోరగహనే చరతో మురారే
       మారోగ్రభీకరమృగప్రవరార్దితస్య
ఆర్తస్య మత్సరనిదాఘనిపీడితస్య
        లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౩

సంసారకూపమతిఘోరమగాధమూలం
        సంప్రాప్య దుఃఖశతసర్పసమాకులస్య
దీనస్య దేవ కృపణాపదమాగతస్య
        లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౪

సంసారసాగరవిశాలకరాలకాల
       నక్రగ్రహగ్రసననిగ్రహవిగ్రహస్య
వ్యగ్రస్య రాగరసనోర్మినిపీడితస్య
        లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౫

సంసారవృక్షమఘబీజమనంతకర్మ
       శాఖాశతం కరణపత్రమనంగపుష్పం
ఆరుహా దుఃఖఫలితం పతతో దయాలో
        లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౬

సంసారసర్పఘనవక్త్రభయోగ్రతీవ్ర
        దంష్ట్రాకరాలవిషదగ్ధవినష్టమూర్తేః
నాగారివాహన సుధాబ్ధినివాస శౌరే
         లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౭

సంసారదావదహనావదభీకరోరు
         జ్వాలావలీభిరతిదగ్ధతనూరుహస్య
త్వత్పాదపద్మసరసీశరణాగతస్య
         లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౮

సంసారజాలపతితస్య జగన్నివాస
         సర్వేంద్రియార్థబడిశార్థఝషోపమస్య
ప్రోత్ఖండితప్రచురతాలుకమస్తకస్య
          లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౯

సంసారభీకరకరీంద్రకరాభిగాత
       నిష్పిష్టమర్మవపుషః సకలార్థినాశ
ప్రాణప్రయాణభవభీతిసమాకులస్య
        లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౧౦

అంధస్య మే హృత్వివేకమహాధనస్య
       చోరైః ప్రభో బలిభిరింద్రియనామధేయైః
మోహాంధకూపకుహరే వినిపాతితస్య
        లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౧౧

బద్ధ్వా గలే యమభటా బహుతర్జయంతః
       కర్షంతి యత్ర భవపాశశతైర్యుతం మాం
ఏకాకినం పరవశం చకితం దయాలో
        లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౧౨

లక్ష్మీపతే కమలనాభ సురేశ విష్ణో
       వైకుంఠ కృష్ణ మధుసూదన పుష్కరాక్ష
బ్రహ్మణ్య కేశవ జనార్దన వాసుదేవ
        లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౧౩

ఏకేన చక్రమపరేణ కరేణ శంఖ
       మన్యేన సింధుతనయామవలంబ్య తిష్ఠన్
వామే కరేణ వరదాభయపద్మచిహ్నం
        లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౧౪

సంసారసాగరనిమజ్జనముహ్యమానం
        దీనం విలోకయ విభో కరుణానిధే మాం
ప్రహ్లాదఖేదపరిహారపరావతార
        లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౧౫

ప్రహ్లాదనారదపరాశరపుండరీక
       వ్యాసాది భగవత్పుంగవ హృన్నివాస
భక్తానురక్తపరిపాలనపారిజాత
        లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం  ౧౬

లక్ష్మీనృసింహ చరణాబ్జమధువ్రతేన
       స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణ
యే తత్పఠంతి మనుజా హరిభక్తియుక్తా
      స్తే యాంతి తత్పదసరోజమఖండరూపం  ౧౭

            శ్రీ లక్ష్మీనృసింహార్పణమస్తు
ఇతి శ్రీ శంకరభగవత్పాదకృత లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం సంపూర్ణం

తాత్పర్యము: 

పాలకడలిలో ఆదిశేషునిపై భోగముతో చక్రమును ధరించి, రత్నములతో శోభిల్లే, పుణ్యమూర్తి యైన, యోగులను శాశ్వతముగా కాపాడే, ఈ సంసార సాగరాన్ని దాటించే నావయైన, ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు, సూర్యుడు మొదలగు దేవతల కిరీటములు మోడిన పాదములు కల, మెరిసే పాదములు శోభను ఇనుమడించగా, లక్ష్మీ దేవి స్తన ద్వయము వద్ద రాజహంస యైన, ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

మురహరి! సంసారమనే అంధకారములో నేను పయనిస్తూ, కామము అనే సింహముచే దాడి చేయబడి,  స్పర్ధ అనే వేడిమిచే బాధ పెట్టబడి ఉన్నాను. కావున, ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! సంసారమనే భయంకరమైన, లోతైన బావి అడుగుకు చేరాను. వందలాది దుఖములనే సర్పములచే బాధించబడి, దుఃఖముతో, నిస్సహాయుడనై దీనుడనైతిని.  కావున,  ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! అనంతమైన వెడల్పుగల ఈ సంసారమనే సాగరంలో చిక్కుకున్నాను. ఈ సాగరంలో కాలమనే నల్లని మొసళ్ళ నోట చిక్కి వాటిచే చంప బడుతున్నాను. మోహమనే అలలలో, రుచి మొదలగు వాసనలు వశుడనై ఉన్నాను. కావున,  ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! పాపమనే బీజము మొలిచి, వృక్షమై, పూర్వ జన్మల కర్మ ఫలములనే క్రొమ్మలు కలిగి, నా శరీర భాగములు ఆకులుగా కలిగి, శుక్రుని ఫలితముగా పుష్పములు కలిగి (వీర్యము అని అర్థము), దుఖమనే ఫలములు కలిగి యుండి. కానీ, నేను దాని పై నుండి వేగముగా జారుచున్నాను. కావున,  ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.
 
ఓ ప్రభూ! సర్పముల శత్రువైన గరుత్మంతుని వాహనముగా కల,  అమృత తుల్యమైన పాల కడలిలో నివసించే ఓ దేవా! సంసారమనే విషసర్పము తన భయంకరమైన నోరు తెరచి విషపు కోరలను నాపై చూపి నన్ను నాశనము చేయుచున్నది. కావున,  ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! సంసారమనే దావాగ్ని నా శరీరమును, దానిపై ఉన్న ప్రతి రోమమును దహించుచున్నది. నీ పాద పద్మములను శరణు అంటిని.  కావున,  ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! నేను సంసారమనే వలలో చిక్కుకున్నాను. నా ఇంద్రియములు ఈ వలలో చిక్కుకున్నవి.  ఈ ఇంద్రియములనే కొక్కెము నా తలను నా నుండి నుండి వేరు చేయుచున్నది. కావున, కావున,  ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! మాయ అనే మత్త గజముచే నేను దెబ్బ తిన్నాను. నా ముఖ్య అవయవములు పూర్తిగా దెబ్బ తిన్నవి. నేను ప్రాణ భీతితో వ్యాకులుడనై యున్నాను. కావున,  ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! ఇంద్రియములనే చోరులు నా వివేకమును దొంగిలించుట వలన నేను అంధుడ నైతిని. అంధుడనైన నేను మోహమనే కూపములో పడి కొట్టుకుంటున్నాను. కావున,  ఓ లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! యముని భటులు నన్ను రాగ పాశములచే మెడను బంధించి ముక్కున లాగుతున్నారు. నేను ఏకాకిని, అలసితిని. భీతితో ఉన్నాను. దయాళో!  లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

లక్ష్మీపతీ!  కమలనాభ!సురేశ! విష్ణో!  వైకుంఠ వాసా! కృష్ణ! మధుసూదన! కలువల వంటి కనులు కలవాడా! బ్రహ్మము తెలిసిన వాడ! కేశవా!  జనార్దన! వాసుదేవ! లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఒక చేతిలో చక్రము, రెండవ చేతిలో శంఖము కలిగి, ఇంకొక చేతితో లక్ష్మీ దేవిని పట్టుకొని, మరొక చేతితో అభయము, వరములు ఇచ్చే లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! నేను సంసారమనే సాగరములో మునిగి యున్నాను. ఆర్త రక్షకా! ఈ దీనుడను కాపాడుము. ప్రహ్లాదుని దుఖములు పోగొట్టుటకు అవతారమెత్తిన లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఓ ప్రభూ! ప్రహ్లాదుడు, నారదుడు, పరాశరుడు, పుండరీకుడు, వ్యాసుడు మొదలగు వారి హృదయములలో మెలిగే దేవా! భక్త ప్రియా! భక్తులను కాపాడే కల్ప వృక్షమా!  లక్ష్మీ నృసింహా! నీ కరముల యొక్క శరణును నాకు ప్రసాదించుము.

ఫల శృతి

లక్ష్మీ నృసింహుని చరణార విందముల మధువును గ్రోలిన తేనెటీగ అయిన శంకరులచే రచించ బడిన ఈ స్తోత్రము పఠించిన జనులకు శుభము కలుగును. ఈ స్తోత్రము నుతించిన హరి భక్తులకు ఆ పరబ్రహ్మ పాదపద్మముల కైంకర్యము కలుగును.

25, డిసెంబర్ 2010, శనివారం

శ్రీమచ్ఛంకరభగవతః కృత కృష్ణాష్టకం - తాత్పర్యము

శంకరులు రచించిన కృష్ణుని అష్టక ద్వయంలో రెండోది ఈ కృష్ణాష్టకం.  ఈ ద్వయంలో మొదటి శ్రీకృష్ణాష్టకంతో  పోలిస్తే ఇది వ్యాకరణ పరంగా కఠినమైనది. ఆధ్యాత్మికంగా లోతైనది. ధ్యాన రూపంలో శ్రీ కృష్ణుని స్తుతించేది ఈ అష్టకం. అపార కరుణాంబుధి, ప్రణత ఆర్తి హరుడు, ఆశ్రిత వాత్సల్యైక మహోదధి అయిన శ్రీ కృష్ణుండు నా ఈ భౌతిక చక్షువులకు కనిపించుమని శంకరులు వేడుకునే స్తోత్రము ఇది.  దీనికి పూర్వ పీఠిక శంకరుల తల్లి ఆర్యాంబ మరణము, ముక్తి.  వేదములలో నుతించబడిన లక్షనములన్ని కలిగినవాడు, సనాతనుడు, సర్వ జనులకు ఆత్మ యైన వాడు అయిన విష్ణువు, ఆది శంకరులచే  తన తల్లి ముక్తి కొరకు ఈవిధముగా పొగడబడినప్పుడు, లక్ష్మీ సమేతుడై శంఖము,  చక్రము,  గద తో కూడి ఆ యతి ముంగిట ప్రత్యక్షమై ఆర్యాంబకు ముక్తి ప్రసాదించాడు. 

మాతృ ఆత్మ మోక్ష సిద్ధ్యర్ధం శంకర నుత కృష్ణాష్టకం, తాత్పర్యం, శ్రవణం గోలి ఆంజనేయులు గారి గళంలో


శ్రియాశ్లిష్టో విష్ణుః స్థిరచరగురుర్వేదవిషయో
ధియాం సాక్షీ శుద్ధో హరిరసురహంతాబ్జనయనః
గదీ శంఖీ చక్రీ విమలవనమాలీ స్థిరరుచిః
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః  ౧

యతః సర్వం జాతం వియదనిలముఖ్యం జగదిదం
స్థితౌ నిఃశేషం యోఽవతి నిజసుఖాంశేన మధుహా
లయే సర్వం స్వస్మిన్హరతి కలయా యస్తు స విభుః
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః  ౨

అసూనాయమ్యాదౌ యమనియమముఖ్యైః సుకరణై
ర్ర్నిరుద్ధ్యేదం చిత్తం హృది విలయమానీయ సకలం
యమీడ్యం పశ్యంతి ప్రవరమతయో మాయినమసౌ
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః  ౩

పృథివ్యాం తిష్ఠన్యో యమయతి మహీం వేద న ధరా
యమిత్యాదౌ వేదో వదతి జగతామీశమమలం
నియంతారం ధ్యేయం మునిసురనృణాం మోక్షదమసౌ
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః  ౪

మహేంద్రాదిర్దేవో జయతి దితిజాన్యస్య బలతో
న కస్య స్వాతంత్ర్యం క్వచిదపి కృతౌ యత్కృతిముతే
బలారాతేర్గర్వం పరిహరతి యోఽసౌ విజయినః
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః  ౫

వినా యస్య ధ్యానం వ్రజతి పశుతాం సూకరముఖాం
వినా యస్య జ్ఞానం జనిమృతిభయం యాతి జనతా
వినా యస్య స్మృత్యా కృమిశతజనిం యాతి స విభుః
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః  ౬

నరాతంకోట్టంకః శరణశరణో భ్రాంతిహరణో
ఘనశ్యామో వామో వ్రజశిశువయస్యోఽర్జునసఖః
స్వయంభూర్భూతానాం జనక ఉచితాచారసుఖదః
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః  ౭

యదా ధర్మగ్లానిర్భవతి జగతాం క్షోభకరణీ
తదా లోకస్వామీ ప్రకటితవపుః సేతుధృదజః
సతాం ధాతా స్వచ్ఛో నిగమగణగీతో వ్రజపతిః
శరణ్యో లోకేశో మమ భవతు కృష్ణోఽక్షివిషయః  ౮

ఇతి శ్రీమత్పరమహంసపరివ్రాజకాచార్యస్య శ్రీగోవిందభగవత్పూజ్యపాదశిష్యస్య
శ్రీమచ్ఛంకరభగవతః కృతౌ కృష్ణాష్టకం సంపూర్ణం
 

తాత్పర్యము: 

లక్ష్మీ సమేతుడు, విష్ణువు, స్థిర చరములకు గురువు, వేదముల ముఖ్యాంశము, జ్ఞానమునకు సాక్షి, శుద్ధుడు, హరి, అసురాంతకుడు, కలువల వంటి కళ్ళు కలవాడు, గద, శంఖము, చక్రము ధరించిన వాడు, స్థిరమైన రుచి కలవాడు, వనమాలి, కాపాడే వాడు, లోకేశుడు అయిన శ్రీ కృష్ణుని నా ఈ కన్నులు చూచు గాక!

పంచ భూతములకు మూలము, మధు సూదనుడు, ఆనందముతో లోకాన్ని కాపాడే వాడు, ప్రళయ సమయమున తన శక్తితో సర్వాన్ని తనలో విలీనం చేసే వాడు, కాపాడే వాడు,లోకేశుడు అయిన శ్రీ కృష్ణుని నా ఈ కన్నులు చూచు గాక!

నియమ బద్ధులై విధులను పాటించే, ఆత్మపై నియంత్రణ కలిగిన, లౌకిక విషయముల నుండి దూరముగా ఉండే,  స్థిరమైన మనసు కలిగిన జ్ఞానులచే దర్శించ బడిన వాడు,  కాపాడే వాడు, లోకేశుడు అయిన శ్రీ కృష్ణుని నా ఈ కన్నులు చూచు గాక!

లోకమందు భాగమై దాన్ని శాసించే వాడు, మన బాధలను తొలగించే వాడు, వేదములలో చెప్పబడిన జగదీశుడు, శుద్ధమైన వాడు, శాసకుడు, దేవతల, ఋషుల, మానవుల యొక్క ధ్యాన మూలము అయిన వాడు,   మోక్ష కారకుడు, కాపాడే వాడు, లోకేశుడు అయిన శ్రీ కృష్ణుని నా ఈ కన్నులు చూచు గాక!

ఇంద్రాది దేవతల అసురులపై విజయానికి మూల శక్తి,  ఎవరి ప్రోత్సాహము లేనిదే కర్మల నుండి విముక్తి కలుగదో, పాండిత్యము వలన కలిగిన కవుల గర్వమును పోగొట్టే వాడు,కాపాడే వాడు, లోకేశుడు అయిన అట్టి శ్రీ కృష్ణుని నా ఈ కన్నులు చూచు గాక!

ఎవరిని ధ్యానిన్చకున్డుట వలన జనులు పంది వంటి పశు రూపములో జన్మ ఎత్తుతారో,  ఎవరిని తెలుసుకోక పోవటం వలన జన్మ మృత్యు మొదలగు వాటి భయము కలుగునో, ఎవరిని తలచ కుండుట వలన కీటకముల వలె జన్మింతురో, అట్టి కాపాడే వాడు, లోకేశుడు అయిన శ్రీ కృష్ణుని నా ఈ కన్నులు చూచు గాక!

జనుల దుఃఖమును పోగొట్టేవాడు, శరణు కోరిన వారికి సాయ పడేవాడు, అయోమయాన్ని పోగొట్టే వాడు, నీల మేఘ శ్యాముడు, వ్రజ కులానికి ప్రియ బాలుడు, అర్జునునికి సఖుడు, స్వయంభూ, జీవ కోటిని సృష్టించే వాడు, శిక్షకుడు, రక్షకుడు, లోకేశుడు అయిన శ్రీ కృష్ణుని నా ఈ కన్నులు చూచు గాక!

ధర్మము నశించి భూ భారము పెరిగినప్పుడు, గోకుల నందనుడు, ధర్మ పాలకుడు, జన్మ లేనివాడు, సుజన రక్షకుడు, వేదములచే పొగడ బడిన వాడు అయిన శ్రీకృష్ణుడు ఆవతారము ఎత్తి ధర్మ సంస్థాపన  చేసే వాడు, కాపాడే వాడు, లోకేశుడు అయిన శ్రీ కృష్ణుని నా ఈ కన్నులు చూచు గాక!

24, డిసెంబర్ 2010, శుక్రవారం

ఏలా నీ దయరాదు బాలకనకమయ - త్యాగరాజ హృద్కమలము

సాక్షాత్కార కృతులు ఆయా దైవ స్వరూపం ప్రత్యక్షమైన పిదప వాగ్గేయ కారులు స్తుతించిన కీర్తనలు. ఇటువంటి కీర్తనలకు త్యాగయ్య వారి సాహిత్యం పుట్టినిల్లు. అందులో ఒకటి  అఠాణా రాగంలో కూర్చ బడిన బాల కనకమయ. అఠాణా రాగం మంచి లోతు, గాంభీర్యం, కారుణ్యం మొదలైన భక్తి రస లక్షణాలను నిదర్శింప చేసే శక్తి ఉన్న రాగం. ఈ రాగంలో ఎన్నో అద్భుతమైన కీర్తనలు కట్టబడ్డాయి. అందులో ముఖ్యమైనవి శ్రీ మహాగణపతిం (మైసూర్ మహారాజు జయచామరాజ వడెయార్ రచించినది), త్యాగరాజు వారు రచించిన ఈ బాల కనకమయ.

సందర్భము:
త్యాగరాజ స్వామి వారు రచించిన కీర్తనలన్నిటిలో ఇది మొదటిది అని నానుడి. రామ తారక మంత్రానుష్ఠానమైన పిదప శ్ఱీరాముడు, లక్ష్మణుడు విశ్వామిత్రుని వెంట ఆయన యాగ సంరక్షణార్థమై వెళుతున్న దృశ్యము త్యాగరాజస్వామి వారికి సాక్షాత్కారమవుంతుంది. ఆ పారవశ్యములో బాలకనకమయ చేల అనే బాలరాముని రూపాన్ని వర్ణించారు.


ఈ త్యాగయ్య కృతికి వస్తే, శ్రీ రాముని శుభలక్షణాలు, శౌర్య పరాక్రమాలు,  అలంకారములు, భక్త జన కారుణ్యము పేర్కొని నాపై ఏల దయ చూపించవు అని వేడుకొంటాడు కృతికర్త. అద్భుతమైన తెలుగు సాహిత్యము ఈ కృతిలో గుప్పించారు త్యాగబ్రహ్మ. కీర్తన సాహిత్యము, తాత్పర్య సంగ్రహము,
ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి గళంలో శాస్త్రీయ శ్రవణం,
సాగర సంగమం చిత్రంలో ఎస్. జానకి గారి గళంలో మంజు భార్గవి మరియు కమలహాసన్ గారి నాట్యం.


కృతి: ఏలా నీ దయరాదు  బాలకనకమయ 
రాగం: అఠాణా
తాళం: ఆది

ఏల నీ దయరాదు పరాకు జేసే వేల సమయము గాదు

బాల కనకమయ చేల సుజన పరి
పాల శ్రీ రమాలోల విధృత శర
జాలశుభద కరుణాలవాల ఘన
నీల నవ్య వన మాలికాభరణ (ఏల)

రారా దేవాది దేవ రారా మహానుభావ 
రారా రాజీవనేత్ర రఘువర పుత్రా
సారతర సుధా పూర హృదయ పరి
వార జలధి గంభీర దనుజ సం
హార మదన సుకుమార బుధ జనవి
హార సకల శృతిసార నాదుపై (ఏల)

రాజాధిరాజ ముని పూజితపాద రవి
రాజలోచన శరణ్య అతి లావణ్య
రాజధరనుత విరాజతురగ సుర 
రాజ వందిత పాద  అజ జనక దీన
రాజకోటి సమతేజ దనుజ గజ
రాజ నిచయ మృగరాజ జలజముఖ (ఏల)

యాగరక్షణ పరమ భాగవతార్చిత 
యోగీంద్ర సుహృద్భావిత ఆద్యంత రహిత 
నాగశయన వర నాగవరద పు
న్నాగ సుమధర సదాఘమోచనస
దా గతిజ ధృత పదాగమాంత చర 
రాగరహిత శ్రీ త్యాగరాజనుత (ఏల)

తాత్పర్యము: 

ఓ బాల రామా! బంగారము కూడిన ఆభరణములు, వస్త్రములు ధరించిన వాడా! సుజనులను కాపాడే వాడా!  లక్ష్మీ దేవిని కలిగిన వాడా! శరములు సంధించే వాడా! శుభము కలిగించి కరుణించే వాడా! ఘనుడా! నీల మేఘ శ్యామ! వనమాల ధరించిన వాడా!  నాపై ఏల దయరాదు?

దేవాదిదేవా! రా రా! మహానుభావా రా రా! అందమైన కన్నులు కలవాడా రా రా! రఘువంశములో పుట్టిన వాడా! అమృత హృదయులైన వారి పరివారం కలవాడా! సముద్రము వంటి గాంభీర్యము కలవాడా! అసురులను సంహరించే వాడా! మన్మథునిలా కుమారుడా! జ్ఞానులతో  మెలిగెడి వాడా! అన్ని శ్రుతుల సారమైన వాడా! శ్రీ రామా! నాపై ఏల దయరాదు?

రాజాధిరాజా! మునులచే పూజించ బడిన పాదములు కలవాడా! సూర్య చంద్రులు కన్నులుగా కలవాడా! శరణ్య! అతి సౌందర్య మూర్తి! చంద్రుని ధరించిన శివునిచే నుతించబడిన వాడా!  గరుత్మంతుని అధిరోహించిన ప్రభూ! దేవేంద్రునిచే పూజించబడిన వాడా! బ్రహ్మకు తండ్రీ! కోటి సూర్యుల ప్రకాశము కలవాడా! శత్రువుల పాలిట సింహమా! కమలము వంటి ముఖము కలవాడా! శ్రీ రామా! నాపై ఏల దయ రాదు?

యాగ రక్షకా! ఉత్తములచే నుతించ బడిన వాడా! యోగులచే ధ్యానించ బడిన వాడా! ఆద్యన్తములు లేని వాడా! శేష శయన! గజేంద్రుని రక్షించిన వాడా! పున్నాగ పూలు ధరించిన వాడా! ఎల్లప్పుడూ పాపములను నాశనము చేసే వాడా! ఎల్లప్పుడూ వాయుపుత్రుడైన హనుమంతునిచే సేవించబడే పాదములు కలవాడా! ఆగమముల అంశమా! కోరికలు లేని వాడా! త్యాగరాజునిచే నుతించబడిన రామా! నాపై ఏల దయరాదు?. పరాకు చేసేందుకు సమయము కాదు రామా!

గమనిక - ప్రాస కోసం చరణాలలోని పదాలను విడదీయవలసి వచ్చింది. సాహిత్యాన్ని కలిపి చదివి, పాడవలసినదిగా మనవి. 

శ్రీమచ్ఛంకరాచార్యకృత శ్రీకృష్ణాష్టకం - తాత్పర్యము

శ్రీ కృష్ణుడు - ఈ జగదేక మోహన సుందర మూర్తిని వర్ణించటానికి ఆ పరమశివుడే దిగి వస్తే?  అప్పుడు పదాలు, భక్తి, వర్ణన అన్ని తమంతట తామే వచ్చి నిలబడతాయి. అందుకనే ఆది శంకరులు రచించినది ఏదైనా ఇన్ని వందల ఏళ్ళు నిలిచింది. సచ్చిదానంద అనుభూతిలో ఆ అపర శివుడు రచించిన ఈ శ్రీ కృష్ణాష్టకం ఆ నంద నందనుని అశేష గుణ గణములను, అద్వితీయమైన మహిమలను భక్తి రస మాలగా అందిస్తుంది. భక్తి నిండితే ఛందము, ప్రాస అవే పరుగిడుతూ ముత్యాల పేరలో చేరుతాయి అనటానికి ఈ స్తోత్రము ఒక గొప్ప నిదర్శనము.


యశోదా కృష్ణ

ఒక్కసారి ఇందులో పదాలు గమనించండి -

మండనం, ఖండనం, రంజనం, నందనం, మస్తకం, హస్తకం, సాగరం, నాగరం, మోచనం, లోచనం, శోచనం, భూధరం, సుందరం, దారణం, వారణం, కుండలం, మండలం, దుర్లభం, వల్లభం, దాయకం, సాయకం, గాయకం, నాయకం, పంకజం, నిజం, మాలకం, బాలకాం, శోషణం, పోషణం, మానసం, లాలసం, తారకం, దారకం, కిశోరకం, చోరకం, భంగినం, సంగినం, నవం, సంభవం, కందనం, నందనం, లంపటం, లసత్పటం, పాయినం, శాయినం, రంజితం, శోభితం, కారిణం, విహారిణం 

- ఇలా ఆ నీల మేఘ శ్యాముని గుణ వర్ణన అందమైన జడ కుప్పెలలా, చిరు గజ్జెలలోని మువ్వలలా, హారంలో పొదిగిన రత్నాలలా, మల్లె మాలలోని పూలలా, పసి పిల్లల సమూహంలా శుద్ధంగా, చిదానందంగా పొదగబడ్డాయి ఈ స్తోత్రంలో. అది ఆదిశంకరుల శంకరత్వము. అందుకే ఆయన భగవత్పాదులు, జగద్గురువులు, లోక పూజ్యులు అయ్యారు.

కృష్ణాష్టకం, తాత్పర్యము, శ్రవణం.

భజే వ్రజైకమండనం సమస్తపాపఖండనం
స్వభక్తచిత్తరంజనం సదైవ నందనందనం
సుపిచ్ఛగుచ్ఛమస్తకం సునాదవేణుహస్తకం
అనంగరంగసాగరం నమామి కృష్ణనాగరం

మనోజగర్వమోచనం విశాలలోలలోచనం
విధూతగోపశోచనం నమామి పద్మలోచనం
కరారవిందభూధరం స్మితావలోకసుందరం
మహేంద్రమానదారణం నమామి కృష్ణవారణం

కదంబసూనకుండలం సుచారుగండమండలం
వ్రజాంగనైకవల్లభం నమామి కృష్ణదుర్లభం
యశోదయా సమోదయా సగోపయా సనందయా
యుతం సుఖైకదాయకం నమామి గోపనాయకం

సదైవ పాదపంకజం మదీయ మానసే నిజం
దధానముక్తమాలకం నమామి నందబాలకం
సమస్తదోషశోషణం సమస్తలోకపోషణం
సమస్తగోపమానసం నమామి నందలాలసం

భువో భరావతారకం భవాబ్ధికర్ణధారకం
యశోమతీకిశోరకం నమామి చిత్తచోరకం
దృగంతకాంతభంగినం సదా సదాలసంగినం
దినే దినే నవం నవం నమామి నందసంభవం

గుణాకరం సుఖాకరం కృపాకరం కృపాపరం
సురద్విషన్నికందనం నమామి గోపనందనం
నవీనగోపనాగరం నవీనకేళిలంపటం
నమామి మేఘసుందరం తడిత్ప్రభాలసత్పటం

సమస్తగోపనందనం హృదంబుజైకమోదనం
నమామి కుంజమధ్యగం ప్రసన్నభానుశోభనం
నికామకామదాయకం దృగంతచారుసాయకం
రసాలవేణుగాయకం నమామి కుంజనాయకం

విదగ్ధగోపికామనోమనోజ్ఞతల్పశాయినం
నమామి కుంజకాననే ప్రవ్రద్ధవహ్నిపాయినం
కిశోరకాంతిరంజితం దృగంజనం సుశోభితం
గజేంద్రమోక్షకారిణం నమామి శ్రీవిహారిణం

యదా తదా యథా తథా తథైవ కృష్ణసత్కథా
మయా సదైవ గీయతాం తథా కృపా విధీయతాం
ప్రమాణికాష్టకద్వయం జపత్యధీత్య యః పుమాన
భవేత్స నందనందనే భవే భవే సుభక్తిమాన

ఇతి శ్రీమచ్ఛంకరాచార్యకృతం శ్రీకృష్ణాష్టకం సంపూర్ణం ..
            శ్రీ కృష్ణార్పణమస్తు ..

గోవర్ధన గిరిధారి

తాత్పర్యము:

వ్రజ కులైక భూషణుడు, సర్వ పాప హరుడు, భక్తుల మనస్సులను రంజింప చేసే వాడు, నందుని ఆనంద దాయకుడు, నెమలి పింఛం మస్తకముపై కలవాడు, తీయని గానము వినిపించే వేణువు చేతిలో కలవాడు, ప్రేమ సాగరుడు అయిన కొంటె కృష్ణుని  భజిస్తున్నాను.

కామదేవుని గర్వము అణచిన వాడు, అందమైన, విశాలమైన కన్నులు కలవాడు, గోపకుల శోకాన్ని పోగొట్టే వాడు, పద్మ లోచనుడు, గోవర్ధన పర్వతమును ఎత్తిన వాడు, చక్కని చిరునవ్వు, చూపులు కలవాడు, ఇంద్రుని గర్వము అణచిన వాడు, గజ రాజు వంటి వాడు అయిన శ్రీ కృష్ణునికి వందనములు.

కదంబ పుష్పముల కర్ణ కుండలములు ధరించిన వాడు, అందమైన కపోలములు (బుగ్గలు) కలవాడు, వ్రజ గోపికల ఏకైక వల్లభుడు, (భక్తి తప్ప ఇతర మార్గముల ద్వార) దుర్లభుడు, గోపికలు, నందుడు, అమితమైన ఆనందములో ఉండే యశోద తన దగ్గర కలవాడు, భక్తులకు ఆనందాన్ని ఇచ్చే వాడు, గోప కుల నాయకుడు అయిన శ్రీ కృష్ణునికి నమస్కారములు.

నందుని కుమారుడు, తన పాదపద్మములను నా హృదయమందు ఉంచిన వాడు, చక్కని కేశములు కలవాడు, సర్వ దోషములను హరించే వాడు, లోకాన్ని పోషించే వాడు, గోప కులము మనసులో ఉండేవాడు, నందునిచే లాలించబడిన వాడు అయిన శ్రీ కృష్ణునికి వందనములు.

దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ద్వారా భూ భారాన్ని తగ్గించే వాడు, భవ సాగరాన్ని దాటించే వాడు, యశోద తనయుడు, అందరి మనసులను దోచుకునే వాడు, నందుని కుమారుడు, అందమైన కళ్ళు కలవాడు, ఎప్పుడూ సత్పురుషుల సాంగత్యములో ఉండేవాడు, ప్రతి రోజు కొత్త కొత్తగా కనిపించే వాడు అయిన శ్రీ కృష్ణునికి నా నమస్కారములు.

సర్వ శుభలక్షణములు కలవాడు, సుఖము, కృప ఇచ్చే వాడు, అనంతమైన కృప కలవాడు, రాక్షసులను సంహరించే వాడు, గోపులకు ఆనందాన్ని ఇచ్చే వాడు, గోపాలకుడు, కొత్త కొత్త ఆటలయందు ఆసక్తి చూపించే వాడు, నల్లని మేఘము వంటి శరీరము కలవాడు, మెరుపు వలె మెరిసే పీతాంబరము ధరించే వాడు అయిన శ్రీ కృష్ణునికి నా నమస్కారములు.

గోపకుల జనులను ఆనంద పరచి వారి మధ్య కుంజములో (పొదలలో) ఉండే వాడు, సూర్యుని వలె వెలిగి భక్త జన హృదయమనే కమలములను వికసింప చేసే వాడు, భక్త జన కామ్యములను తీర్చె వాడు, బాణముల వంటి చూపులు కలవాడు, మంచి నాదముతో వేణువును వాయించే వాడు, కుంజ (పొదలకు) నాయకుడు, అయిన శ్రీ కృష్ణునికి నా నమస్కారములు.

ఎల్లప్పుడూ తన గురించి ఆలోచించే మనోజ్ఞమైన గోపికల మనసులు అనే తల్పముపై శయనించే వాడు, గోపకులాన్ని కాపాడుటకు అడవి దావాగ్నిని మ్రింగిన వాడు, నల్లని అంజనముతో, లేత ప్రాయముతో శోభిల్లే కళ్ళు కలవాడు, గజేంద్రునికి మోక్షము కలిగించిన వాడు, లక్ష్మీ పతి అయిన శ్రీ కృష్ణునికి నా నమస్కారములు.

ఫల శృతి:

ఓ శ్రీ కృష్ణా! నీ గుణ, కథ కీర్తన నేను చేసేలా నన్ను అనుగ్రహించుము. ఈ అష్టక ద్వయం (ఇది మరియు కృష్ణాష్టకం) పఠించే వారికి ప్రతి జన్మలోను శ్రీ కృష్ణుని భక్తి కలుగును.

బ్రోచే వారెవరే రఘుపతే - త్యాగరాజస్వామి కృతి

బ్రోచే వారెవరే రఘుపతే! నిను వినా బ్రోచే వారెవరే! శ్రీరామ నెనరున బ్రోచే వారెవరే! సకల లోక నాయక! బ్రోచేవారెవరే! నరవర! నీ సరి బ్రోచేవారెవరే! మున...